గబ్బిలము: తొలిభాగం ( కొత్తది)

విజ్ఞప్తి

సహృదయులారా!

కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నేనీ కావ్యమును రచించితిని. గ్రంథనామము గబ్బిలము. శ్రోతలకిది కటువుగా దోచవచ్చును. కానీ అందలి కథానాయకుడు ప్రణయసందేశము నంపును. ఇతడంపునది తుకతుక నుడుకు నశ్రుసందేశము. అతని శిక్షాకాల పరిమితి యొక సంవత్సరము. ఇతని శిక్ష ఆజన్మాంతము. తరతరములు. దీని కవధి లేదు. అతడు మన్మథాగ్నితప్తుడు. ఇతడు క్షుధాగ్ని పీడితుడు.

“నాదు కన్నీటి కథ సమన్వయము సేయ
నార్ద్రహృదయంబు గూడ కొంతవసరంబు”

అని యితడు వాపోవును. కులీనులగు రాజులకువలె హంసలు, చిలకలు మున్నగు నుత్తమపక్షి దూతలితనికి జిక్కుట అసంభవము. కావున నిట్టిడుల జీర్ణకుటీరములలో నిరంతరము దర్శన మిచ్చు గబ్బిలము నితనికి సందేశహారిగా బరిగ్రహించితిని. రసజ్ఞుల కిందలి యౌచితి సులభగ్రాహ్యము. ఇంట బ్రవేశించి దీపమార్పిన గబ్బిలమును జూచి తన కన్నీటి కథ నీశ్వరునితో చెప్పుమని వీడు ప్రార్థించె గాని నిజమున కతని యుద్దేశ్యము దేశారాధన. కైలాసయానమునకు నాపన్నిన త్రోవ కొంత వక్రతకు గురియైనది. ఇది దోషము కాదనుకొందును. ఈ కృతి రసజ్ఞ లోకాదరణ నందిన నా శ్రమ ఫలోన్ముఖము కాగలదు.

నేనీ గ్రంధమును ముగించు నవసరమున గుంటూరు జిల్లా బోర్డు ప్రెసెడెంటుగారును, దేశభక్తులును, కళాభిమానులునగు శ్రీ కల్లూరి చంద్రమౌళి చౌదరిగారు మా యూరు దయచేసి గ్రంధము నామూలాగ్రముగా విని పతిత్వము వహించుట కంగీకరించుట నా యదృష్టము. వారికి నా నమస్కారములు. వారికి నేను కృతజ్ఞుడను.

గ్రంధకర్త

చిక్కినకాసుచే తనివి చెందు నమాయకు డెల్ల కష్టముల్‌
బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై

పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్‌
ప్రాపకమిచ్చినట్టి రఘునాథనృపాలకు డేలియున్న తం
జాపురి మండలంబునకు చక్కగ దక్షిణభాగ భూములన్‌
కాపురముండె నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై

ముప్పు ఘటించి వీని కులమున్‌ కబళించి (తదీయ) దేహమున్‌
పిప్పియొనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగా
చెప్పులు కుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు; నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్‌

వాని ఱెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వానికి భుక్తిలేదు

వాని తలమీద పులిమిన పంకిలమును
కడిగి కరుణింప లేదయ్యె గగనగంగ
వాని నైవేద్యమున నంటువడిన నాడు
మూడుమూర్తులకు కూడ కూడులేదు

పామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట

వాని నుద్ధరించు భగవంతుడే లేడు
మనుజుడెట్లు వాని కనికరించు
వాడు చేసికొన్న పాపకారణమేమొ
యింతవరకు వాని కెరుక లేదు

ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గుపడగల హైందవ నాగరాజు

కులములేని నేను కొడుకుల పుట్టించి
యీ యఘాతమందె త్రోయవలెనె
భార్య యేల పుట్టుబానిసకని వాడు
జరుపసాగె బ్రహ్మచర్య దీక్ష

ఉదయమాది రక్తమోడ్చి కష్టము జేసి
యినుని సాగనంపి యిల్లు సేరి
ఉన్న గంజి త్రావి యొక్కనాడా పేద
ప్రక్కమీద మేను వాల్చియుండె

భూ నభముల క్రొంజీకటు
లేనుగునకు మదమువోలె యెసక మెసగె సం
ధ్యా నాట్యకేళి మాని మ
హానటుడు శివారవముల నారంభించెన్‌

ముక్కు మొగమున్న చీకటి ముద్ద వోలె
విహరణము సేయసాగె గబ్బిల మొకండు
దాని పక్షానిలంబున వాని చిన్ని
యాముదపు దీప మల్లన నారిపోయె

తిల్లిక నారిపి దయ్యపు
పిల్ల వలెం తిరుగు తబిసిపిట్ట నరయగా
పల్లవితమయ్యె నాతని
యుల్లంబున క్రొత్త క్రొత్త యూహాంకురముల్‌

చెలిమిన్‌ పక్షికి విన్నవించుకొన జొచ్చెన్‌ స్వీయవృత్తాంత ము
మ్మలికన్‌ కందిన నెమ్మనంబున మదోన్మత్త ప్రపంచంబులో
పులుగుం బుట్రలు కాక పేదలకు నాప్తుల్‌ చుట్టపక్కంబులున్‌
కలరే వాని కవోష్ణ బాష్పములు వ్యాఖ్యానించె చక్రాంగనల్‌

ప్రవిముల దేవతాభవన వాసము చేయుచు మమ్మువంటి మా
నవులకు లేని గౌరవమునం దులదూగెడు గబ్బిలాల రా
ణివి గద నీవు స్వాగతము నీకు శుభంబ కదమ్మ నీ తనూ
భవులకు తల్లక్రిందుల తపంబులకున్‌ గుడిగోపురాలకున్‌

గాఢనిద్రావలంబియై కన్ను మూసి
క్ష్మా తలము మేను మరచిన కాళరాత్రి
నా గృహంబున వెదకుచున్నావదేమి
దొరక దిచ్చట నానందకిరణ లవము

నిన్ను బహిష్కరించు నవనీవలయంబిది యంటరానివా
డున్న నిషిద్ధగేహము సహోదరి నీవు సమస్తదేవతా
సన్నిధి నారగింతువు ప్రసాదము లంతటి పుణ్యురాలివై
అన్నములేని పేదల గృహంబులు సొచ్చితివేల బేలవై

హృదయము లేని లోకము సుమీ యిది మాపుల పశ్చిమంబుగా
ఉదయము తూర్పుగా నడచుచుండు సనాతన ధర్మ ధేనువుల్‌
పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలో
పెదవి మెదల్ప జాల రరవిందభవ ప్రముఖామృతాంధసుల్‌

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే

పరమార్ధంబులు బోధసేయుదురు లోభస్వాంతులై నిత్యమున్‌
గురువుల్‌ ముక్కుకు సూటిగా తగులు యుక్తుల్‌ పన్ని కైవల్యపుం
దెరువుల్సూపి మహాపరాధివనుచున్‌ తీర్మానముల్‌ సేయుచుం
దురు వేదాంతరథంబు సాగదనుకొందున్‌ నేను లేకుండినన్‌

ఒగి సంసారము దిద్దుకొంచు కర మత్యుచ్ఛస్థితిం దూగుచుం
పగలెల్లన్‌ మునివృత్తి నుండి యనుకంపన్‌ శర్వరీవేళలన్‌
వగలం దూలు దరిద్రమూర్తుల సమాశ్వాసింప నేతించితే
ఖగసన్యాసిని! యర్హురాల వకలంబైన మర్యాదకున్‌

గిరుల గుండెలు కరిగి నిర్ఝరములట్టు
లుబుకుచున్నవి దిశల నన్నూరడింప
పక్షికళ్యాణి సోదరప్రజల కండ్ల
నిర్గమించెనె యొక్క కన్నీటిచుక్క

చుట్టాలే కద వాలఖిల్యు లినతేజుల్‌ యోగవిద్యానిధుల్‌
పుట్టుందాపసు లార్ద్రచిత్తులు మహాత్ముల్‌ వైనతేయస్తుతిన్‌
చెట్టుంగొమ్మ పరిత్యజించిన పరశ్రేయశ్శుభాకాంక్షు లో
పిట్టా నీకు నమస్కరించెదను నా విజ్ఞప్తి నాలింపవే

ఈ ప్రశాంతరాత్రి యెల్ల లోకంబును
బుజ్జగించి నిద్ర బుచ్చుకొనియె
నౌషధంబు లేని యస్పృశ్యతా జాడ్యు
మందభాగ్యు నన్ను మరచిపోయె

కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దానికీ కక్ష యేమొ
యీశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ

ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ
విన్నపింపుము నాదు జీవితచరిత్ర

ఆ పూజారులు విన్న నీకగును ప్రాయశ్చిత్త మీశానుడున్‌
కోపించున్‌ వివరింప నేమిటికి నీకుం బొమ్ము వార్ధక్యమున్‌
దాపై పెంజెడ తెల్లనైనది నిశీధస్త్రీకి నాఖేటక
వ్యాపారంబు ముగించి నీ పొరుగుగూబల్‌ గూండ్లకున్‌ బోయెడిన్‌

పసమించు నీ గరుత్తుల
విసరి శ్రమం బడపి నన్ను ప్రేమించిన నీ
అసమోపకారమునకుం
పసదన మిడలేక నే ఋణస్థుడ నైతిన్‌

నీ నమస్కారముల నిక్కినిక్కి నడవ
పక్షిణీ నాకు నుద్యోగబలము లేదు
మెచ్చదగు నీ కళాశక్తి మచ్చరింప
ఖగసతీ నాకు కులము యోగ్యతలు లేవు

స్వార్థమున నిన్ను కొరముట్టు వలె గణింప
కడుపునిండిన భాగ్యవంతుడను కాను
దోషములు సూపి నీకు నీతులు వచించి
దొరతనము సేయగా మతస్థుడను కాను

మృగపక్షిత్వ విచిత్రధర్మములు మూర్తిన్‌ దాల్చి యున్నట్టి నీ
మొగముం జూడదు లోక మట్టి శకునంబుల్‌ ప్రాతపట్టింపులున్‌
దగవీ పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో
దిగులుం బాపి పినాకపాణి కొక సందేశంబు నందింతువా

ధర్మమునకు పిరికితన మెన్నడును లేదు
సత్యవాక్యమునకు చావులేదు
వెరవనేల నీకు విశ్వనాథుని మ్రోల
సృష్టికర్త తాను సృష్టి వీవు

నరునకు చేరరాని సదనంబున వాసము సేయు నీశ్వరే
శ్వరునకు నా నమస్కృతు లుపాయనమి మ్మొకవేళ కారణాం
తరముల వెండిపర్వతమునన్‌ నివసించుచునున్న పక్షి సుం
దరి యొకపూట యానమ కదా యిది నీకు పరోపకారిణీ

గౌరీనాథుడు కాశికిం జనెడు మార్గంబందు రామేఘపుం
జారన్‌ చుక్కలతోట నాటుకొని మింటన్నీకు కన్పట్టు నా
దారింబొ మ్మొకవేళ చూచెదవు భూతస్వామినిన్‌ నీకు చ
త్వారం బేర్పడి దారి తప్పెదవు కాదా భానుడేతెంచినన్‌

ఛత్రముల వంటి నీలిపక్షములు విచ్చి
నీవు బ్రహ్మాండమున పయనించు వేళ
చిత్తజల్లుల ముమ్మాయి ముత్తియములు
జలధరస్వామి నీమీద చల్లగలడు

మొలక సంధ్యారాగమున కెంపులెగజిమ్ము
చరమాచలంబున చరణమూది
సెలయేటి నీట నీతలు కొట్టి విహరించు
మరుదంకురముల సన్మానమంది
కొండకొమ్ముల నెదుర్కొని తుత్తునియలైన
తోయదమ్ముల మీద తుంగలించి
కలహంస పొదిగి పిల్లలుసేయు మిన్నేటి
జాంగలంబుల మీద సంచరించి

చిలుక లెంగిలింప చిటిలి తేనియలూరు
స్వాదుఫలము లెలమి నారగించి
కొన్నినాళ్ళపాటు కుటిలసంసారంబు
దిగులు మరచి రమ్ము ఖగవధూటి

స్వాతికాహారిణీ తపశ్చర్య కతన
నీ మనంబున జాలివెన్నెల రహించు
నాదు కన్నీటి కథ సమన్వయము సేయ
నార్ద్రహృదయంబు కూడ కొంతవసరంబు

బిడ్డల గని పాలిచ్చెడు
దొడ్డతనంబున్న పుల్గు దొరసానివి నా
కడ్డపడ దిగిన వేలుపు
గిడ్డివి నా మనవి నాలకించెదవు కదా

నీ యౌదార్యగుణంబు మెచ్చెదరు సందేహంబు లేకుండగా
నాయుష్మంతులు నీ కుమారులు మగం డంగీకృతిం జూపి నీ
వా య్తైతెన నగంబు కొమ్మల విహాయస్కేశు నావాసమం
దూయేలూగి కృతార్ధురాలవయి రమ్మో పుల్గు పుణ్యాంగనా

పక్షిసుందరి నీ చిన్ని కుక్షినిండ
ఇన్ని నీరంబు పలహార మున్న చాలు
ఎన్ని దేశాలు తిరిగిన నేమి నీకు
నీవు నావలె పుట్టుబానిసవు కావు

తడవైనన్‌ గుడిగోపురంబులను సందర్శించుచుం బొమ్ము నీ
కడవుల్‌ కొండలు నడ్డుసేయవు కదమ్మా వ్యోమయానంబునన్‌
సుడిగాల్పు ల్సెలరేగినన్‌ నిలువవచ్చుం ధర్మసత్రాలలో
పిడుగుల్‌ వడ్డ ప్రవేశయోగ్యతలు పాపిన్నాకు లేవచ్చటన్‌

అందందు ఫలవనంబుల
విందుగుడుచు చల్లనల్ల విశ్రామ మణీ
మందిరముల నిద్రించుచు
ముందుకుచన తోచునెన్నొ పుణ్యస్థలముల్‌

కొమరారు తంజనగరము
సమీపమున కలదు తెలుగు సౌరభ్యంబుల్‌
గమగమ వలచిన చోటది
యమరున్‌ రఘునాథరాజు నాస్థానమునన్‌

కృష్ణరాయలవారి యెడబాట్ల చీకట్లు
ముసరి దిక్కులలోన మసలువేళ
భూరి వాఙ్మయలక్ష్మి దారిబత్తెము తోడ
తంజాపురమువంక తరలు వేళ
వేంకటకవి తెల్గు పంకేరుహాక్షికి
శ్లేషోక్తు లలవాటు సేయువేళ
పచ్చపచ్చని ముద్దుపళని ముద్దులకైత
శృంగారరసము వర్షించువేళ

మువ్వగోపాలదేవుని పూజసేయ
ఘనుడు క్షేత్రయ కల మందుకొనిన వేళ
నపరరాయలు రఘునాథ నృపతి విభుడు
కట్టుకొన్నాడు సత్కీర్తి కుట్టిమంబు

తనువుప్పొంగ సరస్వతీమహలు సందర్శించి తంజాపురీ
మనుజాధీశుల యోలగంబును పరామర్శించి పొమ్ముత్తరం
బునకున్‌ ద్రావిడభూములం గడచి పోబో దోచెడిన్‌ వాడువా
రని శౌర్యంబును మించు తెల్గు పొలిమేరల్‌ నేత్రపర్వంబుగన్‌

యతియుం బ్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భా
రత వేదాన పదేనుపర్వముల కాంధ్రత్వంబు నేర్పించి శా
శ్వతుడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్‌
నతులర్పింపుము స్నానమాడు మతిగణ్యంబైన పెన్నానదిన్‌

ఒకపల్కు జాణతనమున
సకియలు నెల్లూరుసీమ సత్కవివరులం
దికమకలు పెట్టగలరని
పుకారు కల దది యబద్ధమో నిక్కువమో

హంపీక్షేత్రము జూచి పోవలయు నమ్మా తెల్గురాజ్యంపు నై
లింపశ్రీల కొకానొకప్పుడది కేళీరంగ మేత ద్రమా
శంపావల్లరు లారిపోయిన ప్రదేశంబందు నీ బందుగుల్‌
కొంపల్గట్టి నివాస ముండెదరు నీకుం గూర్తు రానందమున్‌

పరదాపద్ధతి మాన్పిరో సిరికి కుప్పల్‌ వోసి యంగళ్ళ యం
దురుమాణిక్యము లమ్మినారచట మున్నో పక్షిణీ మూరురా
యరగండండు మహేంద్రవైభవముతో నాంధ్రక్షమామండలిన్‌
పరిపాలించిన నాటి పెంపును తలంపన్‌ మేను కంపించెడిన్‌

పగతు రసూయ చేత కరవాలమునన్‌ తనువెల్ల చెండినన్‌
జిగిరిచియున్న యుగ్రనరసింహుని భీమదృగంచలంబులన్‌
పొగలుడివోవ లేదతని మ్రోల నిమేషము నిల్వజాలనిన్‌
ఖగసతి నిన్ను ధైర్యవతిగా గణియింతురు వీరయోధులున్‌

ఏనికవంటి సానువు గణేశుని నున్నని బొజ్జ మీద కా
లూనగలేదు తుమ్మెద తదుజ్వ్జల శిల్ప మఖండ తుంగభ
ద్రానది కప్పగించుకొని దద్దమలైన తెలుంగువారి వి
ద్యానగరాన చిందుమొక యశ్రుకణంబు నుపాయనంబుగన్‌

సరసుడు కృష్ణభూవిభుడు స్వారి యొనర్చిన పారసీహుమా
దొరల ఖురాగ్రహల్యలను దున్నిన భూములలోన నాంధ్ర సుం
దరు లొకనాడు నాటుకొనినారు దిగంత జయప్రరోహముల్‌
గరిసెల నించినా రురువుగా ఫలియించిన సుప్రతిష్ఠలన్‌

మూరురాయరగండ డూరేగడీనాడు
విద్యానగర రాజవీధులందు
మేలైన పట్టుడేరా లెత్తరీనాడు
పారసీకగురాల బేరగాండ్రు
ఇనుపరోకళ్ళ సాధన సేయవీనాడు
కొమ్మునిక్కిన భద్రకుంజరములు
తెలుగు స్కంధావారముల నిండదీనాడు
మరఫిరంగుల తెల్లదొరల దండు

మణిమయంబైన యాంధ్రసామ్రాజ్యరథము
భువికి గ్రుంగిన పదియునారవ శతాబ్ది
కృష్ణవిభు వీట ప్రొద్దు క్రుంకినది మొదలు
ఋషిఖగాంగన తెల్లవారినది లేదు

కంచర్ల శ్రీకృష్ణ గంధర్వు డేలిన
నగరంబు దున్నించి నారువోసి
వినుకొండ విభుని రాయని భాస్కరుని కోట
బురుజు లూపున నేలకొరగ దన్ని
పల్నాటిదొరల శుంభత్ప్రతాపజ్వాల
సాటికెక్కని నాగులేట కలిపి
వినుతి గాంచిన కొండవీటి సామ్రాజ్యంబు
నుక్కుకత్తుల బావి కొప్పగించి

యుడుకునెత్తుట చేతులు కడిగికొన్న
కాలపురుషుని పెనుదుండగములు తలచి
మనసు నలిగిన గుంటూరు మండలంబు
నరసి పోవమ్మ జన్మ ధన్యత వహింప

ప్రొద్దునకు వన్నె బెట్టిన
యిద్దరు భాస్కరులు పుడమి నేలగ సొగసుల్‌
దిద్దినది మేన వయసున
పెద్దది గుంటూరు సీమ పెరసీమలలో

ఖరుచైపోయె తెలుంగు రక్త మతిలోక స్వచ్ఛశౌర్యంబు సో
దరి! వ్యర్థంబగు కోడిపందెపు తగాదా లందు పల్నాటిలో
నరుదారన్‌ మివిలెన్‌ వినోదముగ కార్యంపూడి తిర్నాళ్ళ త
త్కరవాలంబులు త్రుప్పుపట్టి యిపుడున్‌ కల్పించు నారాటమున్‌

కృతులంది కృతులొసంగిన
వితరణరతులైన కొండవీటి నృపుల యు
న్నతియుం బతనం బిప్పుడు
కృతులై కొండల నలంకరించి జితించెన్‌

విసిగి విరక్తిచే తెలుగు వీధులలో నొక పిచ్చివానిగా
మసలిన రెడ్డిరాజు మునిమాన్యుడు వేమన యాశుధారగా
విసరిన కావ్యముల్‌ శ్రవణపేయముగా ప్రతిశబ్ద మీనెడిన్‌
దెసల నలంతి పోలికల తీయదనంబున భావసంపదన్‌

జలదవ్రాతము తోడుగా నవల కృష్ణాతీర దివ్యస్థలుల్‌
కలయంగ్రుమ్మగ సాగిపొమ్ము కవిలోకబ్రహ్మ నన్నయ్యకున్‌
నిలయంబై తగు రాణ్మహేంద్రపురికిన్‌ విద్వత్సభారంజిత
స్థలికిన్‌ పూర్వచళుక్యభూపతుల రత్నస్థాపితాస్థానికిన్‌

ఎచ్చట జూచినన్‌ ప్రతిపదించు కళం బలె పచ్చపచ్చగా
రచ్చలకెక్కు కన్నడసరస్వతి నారసి మానసంబులో
మచ్చరికించి నన్నకవి మాన్యుడు రాజమహేంద్రు నాన తా
నిచ్చట చేయిచేసికొనియెన్‌ ప్రథమాంధ్ర కవిత్వసృష్టికిన్‌

రెండున్నర పర్వంబులు
పిండిన రసమొలుకునట్టి పెను చెరకుగడన్‌
పాండవుల చరిత నన్నయ
పండించెన్‌ తెలుగులోన ప్రజ్ఞాన్వితుడై

జనవిభుండైన విష్ణువర్ధనుని నాటి
గౌతమీగంగ నీకు స్వాగతమొసంగు
వీరమాగాణముల నుద్భవిల్లునట్టి
గణికపోచయు నాకర్షకము కదమ్మ

తొలి సారంగధరుండు వట్టి యపవాదు న్నెత్తిపై దాల్చి క
త్తుల పాలైన విషాదగాథ వినలేదో నీవు చిత్రాంగి మే
డలలో మూలుగుచున్న విప్పటికి కూడన్‌ పావురాల్‌ నీతికిన్‌
బలియై పోయిన రాజనందనుని దౌర్భాగ్యంబు నూహింపుచున్‌

అజ్జాయింతువొ చుట్టుమార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుం
డుజ్జీలేని దయాస్వభావుడు ప్రభావోల్లాసి ముప్ప్రొద్దులున్‌
గజ్జెంగట్టెడి నాట్యగాడతడు సాక్షాత్కారమున్‌ జెందినన్‌
మజ్జాత్యుద్ధరణంబు కల్గు కలదమ్మా పొమ్ము సేవింపగన్‌

నిద్దంపు లేత కస్తురి
ముద్దవనుచు నిన్నుజూచి ముచ్చటపడి రా
ముద్దియలు ముచ్చటించెద
రొద్దిక శ్రీనాథకవి బహూకరణముగన్‌

అరవింద రత్న మండిత
తరంగరథమెక్కి విభుని దర్శనమునకై
పరువెత్తుచున్న గోదా
వరి తోడుగ బొమ్ము దక్షవాటి నగరికిన్‌

అమృతమ్ము విషము వాక్కున
నమరిన కవిరాక్షసునకు నావాసంబై
కొమరారు నపరకాశిక
సుమి కడు మహిమాఢ్యమైన చోటది పతగీ

అల బుస్సీదొర కొల్లగొట్టిన యనన్యంబైన మా వెల్మ వీ
రుల విఖ్యాత పరాక్రమజ్వలన మూర్పుల్‌ జిమ్ముచున్నట్టి బొ
బ్బిలి కోటం గని దాటిపొమ్ము చటులావేశంబు దేహంబునన్‌
మొలుచున్‌ బొల్చు కవోష్ణ వీర రుధిరంబున్‌ జీవనాళంబులన్‌

నాయెడ జాలిలేక చరణంబున కత్తులుగట్టి ప్రాణముల్‌
తీయదొడంగు రాజవితతిం దెలవార్చితి తెల్లవారునే
నా యులి వాలకింపని యనంత విభావరులంచు కొక్కురో
కో యని కూయుచున్న దదిగో తొలికోడి బడాయి కొట్టుచున్‌

పూసపాటివారి ముఖ్యపట్టణమైన
విజయనగరమందు విశ్రమించి
జగము దద్దరిల్ల సకిలించినది తొల్లి
రాయరావుతుల గుఱాలదండు

కరవాలంబున గొల్చి రాయలు పరిష్కారంబు గావించుచున్‌
సరిహద్దుల్‌ సవరించినాడటు లొరిస్సా దాక నా రాజభా
స్కరు డెత్తించిన బొట్టునూరి విజయస్థంభంబుపై వేలుపుం
దెరవల్‌ నిల్చి పఠింతు రాంధ్రుల విభూతిన్‌ ముక్తకంఠంబులన్‌

నీవు బొబ్బిలి మీదుగా నిర్గమించి
మన్యము తరించి కొన్ని యామడలు నడువ
పలుచబడిపోవు మన జిల్గు తెల్గు శోభ
తావు లెగజిమ్ము నోఢ్ర వాతావరణము

తేటయైన తీపినీట దిక్కులదాక
విస్తరించి రుచులు గుస్తరించి
చిల్కసంద్ర మింపుసేయుచు కన్పట్టు
స్వచ్ఛమైన తెల్గుభాష వోలె

చిట్టి మరుదంకురంబుల
బుట్టిన కెరటాల మొత్తములు తీరములన్‌
కొట్టుకొని మరలిపోవును
గట్టులెగయ జూచు చిలిపి కవనముల వలెన్‌

తగులున్నీకట మార్గమధ్యమున బౌద్ధస్థూప శైథిల్యముల్‌
మగధోర్వీశుల రాణివాసములు లీలాభర్మ హర్మ్యావళుల్‌
జగముల్‌ మెచ్చిన శాక్యసింహుని యహింసాసూక్తి మాధ్వీక ని
మ్నగలం దేలిన పుణ్యభూములు నలందా పాటలీపుత్రముల్‌

ముక్తిదంబులైన పుణ్యస్థలములందు
ప్రథమగణ్యమమ్మ వారణాసి
అన్నపూర్ణ సేయు నాహారభిక్షతో
ముక్తిభిక్ష నీకు ముట్టగలదు

నదుల తోడికోడలు దధీశు పెదభార్య
జాహ్నవీ స్రవంతి జలము దేర
అతిథి పూజ సేయు నన్నపూర్ణాదేవి
వారణారి గూడి వారణాసి

కలరు కళాసముద్రములు గట్టులు రాయగ నీదినట్టి ధీ
విలసితులైన పండితులు పెక్కురు వేదపురాణ శాస్త్రముల్‌
పలికిన సత్కవీశ్వరుడు వ్యాసమునీంద్రుడు శిష్యకోటితో
మెలగె నొకప్పు డుండు నట మేచకకంఠుడు విశ్వనాథుడై

మొగలాయి చక్రవర్తుల
మృగాంకకేతనము నింగి మెరసిన ఢిల్లీ
నగరంబు దృష్టిగోచర
మగు ప్రోన్నత సౌధ చుంబితాంభోధరమై

ఆ ఢిల్లీపురి హస్తినాపురి సమాఖ్యన్‌ ద్వాపరంబందు కొం
డాడం బడ్డది ధర్మజుండచట రాజ్యంబేలి చేయించినా
డీడుం జోడును లేని జన్నముల నెన్నే గన్నులున్నందుకున్‌
చూడందగ్గ పురంబు సుమ్మచట వీచున్‌ భోగసౌరభ్యముల్‌

ముడిచె నిచ్చట కుంతికొడుకు ద్రౌపదికొప్పు
పగవాని రుధిరంబు పరిమళింప
మెరసె నిచ్చోట నాదరుషా కుఠారంబు
నిఖిలభారతము కన్నీరునింప
వెలసె నిచ్చోట పచ్చల బర్హిపీఠంబు
షాజానురాజు నాస్థానవాటి
పెండ్లాడె నిచ్చోట పృధ్విరాజొకరోజు
జయచంద్రు సుతను దోస్సార గరిమ

యుగయుగాల కథల నుదరాన జీర్ణించి
రాజరక్త నిర్ఝరముల దేలి
నవ్వుచున్న ఢిల్లి నగరంబు నందంబు
తరుగలేదు శిరము నెరియలేదు

సులతానీ సులతానులున్‌ మణిగణాంశుల్‌ చుట్టుమిట్టాడు మే
డలలో వాసము జేసినారు నిజరాష్ట్రం బాకటం దూల పే
దల నోరూర భుజించినారిచట ముక్తారత్న పాత్రంబులన్‌
కలమాన్నంబు; సుఖించినా రఖిల భోగశ్రీ మహాడోలలన్‌

కుతుబుద్దీనుడు నిల్పిన
కుతుబుమినా రనెడు గొప్ప గోపురము సము
న్నత మయ్యు చెక్కుచెదరదు
శతాబ్దముల నాటి శిల్ప చకచకితంబై

చామనచాయ కలట్టిది
కామజనకు ననుగుభార్య కాళింది వినీ
లామల కోమల వీచీ
చామరములు వీచి నీకు స్వాగతమిచ్చున్‌

సూనుని ఖాయిలా తనకు చొప్పడు లాగు నమాజు చేసి య
ల్లా నలరించి ఆది మొగలాయి నరేంద్రుడు బేబరుం డుమా
యూనున కాయురున్నతులు సృష్టి యొనర్చిన చిత్రగాథ ఆ
గ్రానగరంబు కర్ణశుభగంబుగ నీకు నుపన్యసించెడిన్‌

షాజాను నశ్రుజలకణ
మీ జగముపురంధ్రి దాల్చు నేడవ నగ ముం
టాజమహలు నిద్రించెడు
తాజమహలు దృశ్య మద్భుతంబు పతంగీ

కుహనా గోపుం డాగమ
రహస్యమగు గీత బాహిరము చేసిన శ్రీ
మహిత కురుక్షేత్రంబున
విహారమొనరించి పొమ్ము విహగవధూటీ

సుజనస్తుత్యుడు బోధిసత్వ ధరణీశుం డర్థరాత్రంబునన్‌
నిజవాసంబు పరిత్యజించి యతిశాంతి స్థాపనేచ్ఛా మనోం
బుజుడై బిచ్చపుగిన్నె దాల్చిన మహాపుణ్యప్రదేశంబులన్‌
మజిలీ సేయుము రెండునాళ్ళు ఖగభామా జన్మసిద్ధించెడిన్‌

లుంబినీవన పరిమళోల్లసిత మగుచు
నేగుదెంచెడు నీ కర్య్ఘమీయగలదు
గౌతముం డాదరించిన కనకహంస
నీరు కలియని మధుర గోక్షీరధార

దర్శింపగలవు గౌతమబుద్ధ దేవుని
ప్రాచీన భరత శిల్పంబునందు
సాధింపగల వహింసా మంత్రరాజంబు
శాక్యసింహుని కాలిజాడలందు
తెలిసికోగలవు బౌద్ధుల సాహితీసేవ
అమరసింహుని కవిత్వమున యందు
వీక్షింపగలవు కపిలవస్తు నగరంబు
నాశనదే వ్యధీనంబు నందు

రెండువేలేండ్ల క్రింద నిద్రించుచున్న
మౌర్యరాజుల విపుల సామ్రాజ్యచరిత
యేకరువు పెట్టు ప్రకృతియం దాకళించి
వెచ్చవెచ్చని కన్నీరు విడువగలవు

అక్కడనుండి యుత్తర దిశాభిముఖంబుగ నిర్గమించు నీ
దృక్కుల నడ్డుచున్‌ హిమగిరీంద్రము దర్శనమిచ్చు దానిపై
నెక్కగనెంచి తెల్లదొర లీలిగిరెందరొ వారి దేహముల్‌
స్రుక్కవు నేటికిం బులుగుసుందరి మంచు మహత్వ్త మెట్టిదో

కరగిన మంచుబండలు ప్రగాఢభరంబున పట్టుదప్పి త
ద్గిరి శిఖరాల నుండి తలక్రిందులుగా దిగజారి లోయలన్‌
దిరిగెడు జీవరాసుల వధించుచు నుండును పేదవారికిన్‌
చెరపె కదా బలాధికుల నేయము సంయమిపక్షి భామినీ

అందు నెవరెష్టు శిఖరాన నధివసించి
వ్రాసికొనవచ్చు భరతవర్షంబు పటము
దాని యున్నతి తారకాధ్వజము మిగులు
సులలితములైన కవుల యూహలకు తరుగు

కలహంసల్‌ సను వాయుమార్గముల రేఖల్‌ పర్వతాగ్రంబునన్‌
కల వాత్రోవల దక్షిణోత్తర దిశాగ్రవ్యాప్తముల్‌ ప్రోన్నతం
బులు నీకున్‌ చనకాదు నిచ్చలు నిలింపుల్‌ గుంపులై రాకపో
కలు గావించెడు వెండికొండ వెరవుల్‌ కన్పట్టు నైమూలగన్‌

విహిత కైలాసయాత్ర గావించు నిన్ను
మంచుకొండలవిభు డాదరించగలడు
అల్లునకు కూతునకు వార్త లంపునేమొ
సమ్మతింపుము నుడులు భారమ్ము కావు

అస్త్రవిద్యాభ్యసన వేళ నద్భుతముగ
కొంచకొండకు రంధ్రంబు కొట్టినాడు
చినతనంబున పార్వతి చిన్నకొడుకు
తారకాగిరి కదియ యుత్తరపు గవిని

గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప
మస్తమున దాల్పు మొక చిన్ని మంచుతునక
విసపుమేతరి కది సిఫారసుగ నుండు
వ్యర్థములు కావు పెద్దల పరిచయములు

మంచుఫలించు నగ్గిరుల మూడుల కారుమొయిళ్ళపై నుడా
యించు గమింపు మవ్వల మహేంద్రునివీడు త్రివిష్టపంబు క
న్పించు డలాయిలామలను వింతనృపుల్‌ పరిపాలనంబు సా
గించెద రిప్పు డచ్చరలు క్రీడ యొనర్పరు నందనంబునన్‌

ఆ లామాలకు పెండ్లిపేరటము లే దాజన్మ సన్యాస దీ
క్షా లగ్నాశయులై ధరింతు రతిదీర్ఘంబైన కుళ్ళాయముల్‌
మౌళిన్‌ వారి యనుజ్ఞ లేక విహరింపం బోల దెవ్వారి కా
నేలన్‌ పక్షివి నీకు పోదగని క్షోణీమండలం బుండునే

ఆ రాజ్యంబును గూబపట్టుకొని బిట్టాడించుచుండున్‌ దురా
చారంబుల్‌ వెడనమ్మకాల కది వాసస్థాన మస్పృశ్యతా
క్రూరవ్యాఘ్రము సంచరించుటకు సంకోచంబు లే దైన బౌ
ద్ధారామంబులు సాగనీయవు కదమ్మా దాని యౌద్ధత్యమున్‌

అసమ రుచిరాంబువైన మానస సరస్సు
కన్న కూతురు బుడుత గంగాభవాని
యెక్కి దిగుచుండు కొండల చక్కదనము
ప్రేక్షణీయంబు సుమ్ము గబ్బిలపుదేవి

బలిసిన మేనులన్‌ జడలబర్రెలు కొమ్ముల వింత సింహముల్‌
బలె విహరించు కొండల యుపత్యకలన్‌ సెలయేటి నీళ్ళ క్రో
ల్పులుల కళేబరా లచటి లోయలలో పొరలాడు వాని య
మ్ముల కెనయైన శృంగముల పోటుల తూటులుబడ్డ పొట్టలన్‌

జడనిధి వంటి మానసము సాటికి రావు సరస్సులెల్ల నం
దుడుగక రేగు పేరలల యూపున గట్టులదాకి ప్రాణముల్‌
విడిచిన గండుచేపలు కుళీరము లెల్లెడ తీరభూములం
దడుగిడరాక చీకి వికలాంగములై పడియుండు గుట్టలై

దమయంతీ నలులకు దౌ
త్యము చేసిన తొంటి పసిడి హంస విభుని చు
ట్టములందు పంకజోద్యా
నములందున నాలపింత్రు నైషధకథలన్‌

నిండిన దోరవెన్నెలల నిక్కిన పచ్చిక మేసి చాందినీ
కొండబయళ్ళలో తిరుగు గోపతి నీ కగుపించు నందు వే
దండవిరోధి దాల్చిన జటాటవి పూచిన పూవు చంద్రమః
ఖండము గోచరించు నెరుకల్గల నీ కెరిగింప నేటికిన్‌

విలు నమ్ముల్‌ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ
ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ
క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం
దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్‌ గప్పి క్రీడించెడిన్‌

అచ్చోట తబిసి రాజులు
నిచ్చలు తపమాచరించు నీ కాతిథ్యం
బిచ్చెదరు పరుల విద్యలు
మెచ్చెద రీ గుణము నేడు మృగ్యంబ కదా

ఇప్పటికి కూడ క్రొంబొగ లెగయుచున్న
త్రిపురముల ప్రాత బూడిద దిబ్బ లచటి
కనతి దూరాన నీకు ప్రత్యక్షమగును
చిత్రముగ పాపమున కెంత చేవ గలదొ

వలరాజు పగవాని కొలిచి ముందుకు సాగు
తొలకరించిన నీలి జలధరంబు
మహిషుని వనిత లుమ్మలికింప గర్జించు
సితికంఠు నిల్లాలి సింహరమణి
కొసరి దిక్కులు మేలుకొలిపి గానము సేయు
కొమరుసాముల వారి కోడిపుంజు
తల మీద రతనాలు మొలిచి ముద్దులు గార
నటియించు సర్పంబు నటకురాలు

కనుల జూచి రమ్ము కైలాసభూముల
వింతలెల్ల తెలుప వేళకాదు
నీకు శుభము కల్గు నిఖిలామరశ్రేణి
సరసుడమ్మ బాలచంద్రధరుడు

రేగిన గందపుం దరు పరీమళముం గని మోసపోయి యం
దాగి పదంబు మోవ వల దచ్చట కొమ్మల నాశ్రయించి మి
న్నాగులు తాండవించు మరణంబును పుక్కిటబట్టి యాపదల్‌
డాగిన తావులే వలపులం దొణికించి మనస్సు నీడ్చెడిన్‌

పుడమి ననంతకాల రథమున్‌ కదలించి మనుష్యకోటిపై
నడిపి నశింపజేయు యతనంబులు నీ బెదరింపు లిచ్చటన్‌
పడవని రుండమాలికలు పండ్లిగిలించి వెడంద నోళ్ళతో
మృడుని గళంబునన్‌ చెనటి మృత్యువుతో వెకసక్కెమాడెడిన్‌

ఒలికిపోయిన పండువెన్నెలల పాలు
క్రోలుచున్నది తపిత చకోరకంబు
ప్రొద్దువోయెను నీ చిన్న భోజనమును
వెదికికొన బొమ్ము తబిసి గబ్బెతల రాణి

వీనులు చిన్నవోవ వినిపించు నదే డబుడుక్కు వాని డ
క్కా నినదంబు తూరుపు ముఖంబుగ హైందవవీధి సభ్యతా
స్థానము గల్గు తాను మన సఖ్య మెరింగిన కంటగించు నో
మౌనిశకుంతమా చను ముమాపతి మేడకు కోడి కూసెడిన్‌

నన్నొకమారు నీ దరిసెనంబున ధన్యుని జేసి భర్గుడే
మన్నది చెప్పిపొమ్ము విబుధాలయవాసిని నాకు లేరు నీ
కన్న శరణ్యు లాప్తులు వికాసితమైనవి తూర్పురేఖలున్‌
కన్నపుదొంగ తోడ సదనంబునకుం జనుమమ్మ పక్షిణీ

ద్వారములు లేని నాదు కుటీరలక్ష్మి
స్వాగతం బిచ్చి నీకు మర్యాదచేయు
నా యనుజ్ఞకు వేచియుండంగ నీకు
వలదు వలదమ్మ రాత్రిం దివమ్ములందు

నిద్దుర మేల్కొని యల్లన
ఖద్దరు రాట్నంబు పౌరకాంత వహించెన్‌
ప్రొద్దు పసివాడు తూరుపు
ముద్దియ పొత్తిళ్ళలోన ముద్దులు గురిసెన్‌

వాని యిష్టార్థములు కూర్చు దానివోలె
విశ్వనాథుని గుడికి గబ్బిలము సనియె
వేయిచేతుల పెనుకాపు వేగిరింప
గచ్చ బిగియించె నప్పేద కార్మికుండు