అక్కట తల్లికోట సమరాంగన యాఖరు తెల్గుపోటుచే
యుక్కిరిబిక్కిరై తురకయోధుల వంకకు వాలునాడు భూ
భుక్కులగండడౌ తెలుగుభోజుని పూజలు చూరగొన్న యా
టక్కరిదేవతల్ తనువుదాచుట నాకు నసహ్యమయ్యెడిన్
తొంబదియెండ్ల వృద్ధు డతిదోర్బల భీముడు రామరాజు డెం
తెం పరగండడౌ నృపమణీ సుతభర్త మహమ్మదీయ ఖ
డ్గంబులకున్ శిరంబొసగి కష్టముదెచ్చిన మాట ఆంధ్ర వ
ర్గంబు సహింపనేరని పరాభవమై భరమై దహించెడిన్
తెలుగు లండను నగరంబు తెలుగుకోట
తెలుగుకవి దిగ్గజంబులు తెలుగుదనము
పొట్టిగుఱ్ఱమునెక్కిన పొగరుబోరు
టళియరాముని కతన ముక్కలయిపోయె
విహరింపనే భీతివిడచి మస్తమునెత్తి
సకల సామ్రాణ్మహా సభలలోన
వాక్రుచ్చనే రాలువగిలి బుగ్గలుజిమ్మ
నతి నిశాత ప్రబంధాదికములు
కల్పింపనే తెల్గు కల్యాణి కొప్పున
సొగసైన కీరితి పొగడదండ
ఎత్తింపనే మేటి హిమవద్గిరుల మీద
శాశ్వత విజయ రాష్ట్ర ధ్వజంబు
సగరగర్భకుహరి స్వారిగావింపనే
యింటిగుట్టు బయటికెక్కకున్న
సమ్మతించి జాతి కుమ్మక్కుకాకున్న
కొండలన్ని పిండికొట్ట నొక్కొ
అది మా రత్నము లారబోసుకొను విద్యాశారదాపీఠ మ
ల్లది మా కత్తుల ఖారుఖాన మది యాంధ్రాదిత్యబింబంబు సం
పద సొంపారిన మాల్యవంతమని డంబం బొప్ప చాటించు స
మ్మద సౌఖ్యం బొక తెల్గువీరునకె సంప్రాప్తించె ముమ్మాటికిన్
కలవెన్నో విషయంబు లాంధ్రుల కళాకౌశల్యముల్ సాటు తా
వులు ప్రత్యర్థుల గుండెలో వెరపునిప్పుల్ సల్లు గాథావళుల్
కల విప్డున్ పలనాటి పౌరుషపు రేఖల్ మా శరీరంబులన్
కలుపుంగోలుతనంబు లేదది కళంకం బండ్రు మా జాతికిన్
ముసలుమానులలోని యసమ సమత్వంబు
లంగోటిగట్టి చెలంగుచుండ
ఘూర్ఖా సిపాయీల కుటిలశౌర్యజ్వాల
నట్టింటి కాపలా నడుపుచుండ
ద్రవిడుల కార్యసాధన ధనార్జన దీక్ష
సాంబారు నోరెత్తి చాటుచుండ
రాష్ట్రాంతరములకు బ్రాకి హిందీభాష
పదుగురి నోళ్ళలో నెదుగుచుండ
అఖిలదేశములకు నవతంసకుసుమంబు
రాజితోగ్ర కదన రక్తతిలక
మానధనికురాలు మా తెల్గుటిల్లాలు
కలత జెందదౌర కాలమహిమ
గౌతమి గంగలోన మృతకాంతులతో నుదయంబుగన్న వి
ఖ్యాత మణీవితానము మహమ్మదురాజుల దండు దెబ్బతో
తాతలనాడ పోయె నిక తాతలుబుట్టిన రావు రత్న దీ
పాతత కాంతులీను గృహమక్కట నూనెకు దేబిరించెనే
రతనాల్దొంగలు దోచుకున్నపుడు, శౌర్యశ్రీలు విద్రోహి భూ
పతు లేవే మృదుకీర్తి చాతురులచే బంధించునాడేని, భా
రత చండీశ్వరి కోటిమస్తముల దర్పంబుం ప్రదర్శింపదో
ధృతిహీనంబగు భిన్న భిన్న మత విద్వేషంబు పాటించెనో
గప్పాల్ గొట్టిన నేమి లాభము ధరా గర్భాన నిద్రించు కృ
ష్ణప్పల్ దాతలు లేచివచ్చెదరె వీరావేశ విభ్రాజితుల్
నిప్పుంబోలు తెలుంగువీరు లిపుడున్ జీవించియున్నార లీ
చప్పంబడ్డ యనుంగుసోదరుల కుత్సాహంబు సంధింపగన్
ఏనాడు మాకావ్య సృష్టికర్తల జిహ్వ
విశ్వసత్యము నాలపింపగలదొ
ఏనాడు మాజాతి దృష్టిమాంద్యము వాసి
చుట్టుప్రక్కల దేరి చూడగలదొ
ఏనాడు మాబుఱ్ఱలీ జుట్టు తలలేని
పుక్కిటి కథలలో జిక్కువడవొ
ఏనాడు మావిద్య లినుపసంఘమునందు
చిలుము పట్టక ప్రకాశింపగలవొ
తనువు దాచక సోమరితనము మాని
యెన్నడీ మఠంబులు బిచ్చమెత్తుకొనవొ
అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలచి
నలిగి వాపోవుచున్నది నా మనస్సు