ఎంతో దూరము పోవనేమిటికి నే డింటింటికిం బ్రాకి యా
శాంతవ్యాప్తముగా రహించెడు స్వరాజ్యస్వర్ణసూత్రంబు చౌ
దంతి స్తంభన మాచరించెగద యేతద్దివ్యసూత్రంబు మో
కంతై నిక్కిన కట్టివేయగలదా యస్పృశ్యతా వ్యాఘ్రమున్
చాటింపించి మదీయజాతికి నభీష్టంబుల్ ప్రసాదింపగా
పూటా పడ్డది కొంతభారమది రేపో మాపొ రావచ్చు నీ
నాటంగాదని కొంతభారతము పంతంబొప్ప వాదించు నీ
వోటెవ్వారికొసంగితో తెలిపి నన్నోదార్చవే నెచ్చెలీ
ప్రియములు గాని సత్యములు పెక్కులు నేను వచించుచుంటి నీ
దయకెడవై తపింతునొ యదార్థపిపాసువులైన వారి య
వ్యయ కరుణావిశేష రుచిరాత్త మనస్కుడనై సుఖింతునో
భయపడనేల నా పలుకు పల్కులు బాష్పకణాభిరామముల్
ఏకవి పిచ్చిగా నడుచు పృధ్వికి లోబడి కీర్తి కోసము
ద్రేకము సంహరించుకొని దేశము వోయిన త్రోవబోవునో
ఆకవి పేడుమూతి మగ డంబుజగర్భుని రాణిగారికిన్
సాకుడు బిడ్డ డాస్తిగల సామికి బేరసిక ప్రదాతకున్
పుట్టంగావలె సత్కవీశ్వరుడు నీ పుణ్యాన మావంశపుం
బుట్టం జీలిచికొంచు సంచితకళాపూర్ణ ప్రభారాశియై
పుట్టంగూడదు పుట్టినం గలుగ వెప్డున్ నిండుసన్మానముల్
కట్టా యుచ్చత నీచతాయుత వితర్కభ్రష్ట దేశంబునన్
పిడికెండన్నము బెట్టలేదెపుడు మా వేమన్న జీవించి న
ప్పుడు ముద్దుల్ గురిపించు మేలికవనంపుం బుగ్గలుప్పొంగి కా
ఱడవుల్ మొద్దులు మోసులెత్తినపు డౌరా నేడు గోరీపయిన్
నడచుం బూజలు పుణ్యకార్యములు వింతల్ మా దయాధర్మముల్
బ్రతికియున్న సాయిబాబెన్నడును గాడు
చావకున్న వట్టి సాయిబయ్య
తిరుమలేశుడైన తెలియడీ యర్థంబు
చావు బ్రతుకులోన సారమిదియ
సమతలు సఖ్యముల్ పెదవిజారినమాటలు కట్టుబాట్లు చ
ట్టములు బటుత్వమూడిన గుటారపుదూముడి బందనాలు ధ
ర్మములు దయారసాల్ మొసలిరాలుచు నశ్రుకణాలు చిత్రచి
త్రములు మతస్వభావములురామరగా వివరింప గల్గితిన్
ఇప్పుడు గుండురాతి వలె నీశ్వరుడై ముడుపుల్ గ్రహించు కో
టప్ప యొకానొకప్పుడు గృహస్థుడు మానవమాత్రులైన రాల్
రప్పలు వేల్పులై సకలరాసులు మ్రింగక మిన్నకుండునే
యప్ప పులుంగురాణి యిక నాసలులేవు క్షుధార్తజాతికిన్
మరణము వార్ధకంబను ప్రమాద మెరుంగని కైతలల్లు న
బ్బురపు కవీంద్రు రెడ్డికులముఖ్యుని వేమన చాకచక్యమున్
మరచి పురాణకావ్యరస మత్తుడు వీరుడు సంఘసంస్కృతి
స్థిరుడు రచించె నాంధ్ర కవిజీవితముల్ బొరబాటు చేయుచున్
దొడ్డరాళ్ళగుండ్లు దొరలించి పఠితల
బెదురుబెట్టు కవిత విస్తరించి
పండితులకు దక్క పరుల కందకపోయె
దేవతలకు కామధేనువట్లు
కవిత చచ్చుదయ్యు కథ పేరుగలదైన
కవికి కొంత కీర్తి కలుగవచ్చు
నెలలు తక్కువైన బలమైన తిండిచే
నుసురునిల్పుకొన్న నిసుగువోలె
వ్యాకరణ శాస్త్రకారులు
క్షాకు గకారంబు వింతి కన్పడదని చీ
కాకు పరతు రంతెకానీ
పాకము రసమింపు సొంపు పరికించెదరే
వ్యవహారంబున భ్రష్టమయ్యు రసభావస్ఫూర్తి గల్పించి మా
ర్దవముల్ శబ్దములెన్నియో కలుగు శాస్త్రజ్ఞానమాత్రుల్ పురా
కవితోన్మత్తు లెరుంగజాలుదురె కుగ్రామీణ భాషాబ్ధిలో
చవులూరించు తెలుంగుపల్కుల జగాస్వారస్య రాహస్యమున్
కనుగొన్నావుగదమ్మ కృష్ణవిభుడక్కాలాన భాషావనం
బున సాగించిన యష్టదిగ్గజరథంబున్ శారదావాహమున్
తెనుగుందేశము విస్మరించినది తద్దిగ్దంతి దంతావళ
ధ్వని యధ్వాన్నపు టద్రిగర్భముల నిద్రంబోవు నాంధ్రత్వమున్
తెల్గుతేజం బెల్లదిక్కుల కెగబ్రాకి
పగవాని బెదరించి వచ్చునపుడు
తెలుగుశిల్పుల సుత్తెదెబ్బ ఖంగునమ్రోసి
చీనాకు పయనంబు సేయునపుడు
తెలుగుకవిత్వంబు దిగ్దంతుల ముఖాన
బృంహితధ్వనులు గావించునపుడు
తెలుగుజెండా శక్తి నలుదెసల్ ప్రసరించి
విద్యానగరవీధి వెలుగునపుడు
రామలింగని హాస్యకార్యములు దలచి
నాల్గుదిక్కులు కడుపుబ్బ నవ్వునపుడు
నాట్యమాడిన యానందనవ్యలక్ష్మి
కానుపించెనె శిధిలదుర్గముల యందు