గబ్బిలము

కనుబడలేదు దైవతము కాని పదార్థము భారతంబునన్‌
కనుబడలేదు వర్ణనము కన్న పిశాచము భారతంబునన్‌
కనుబడలేదు సత్కులము కన్న మహాకళ భారతంబునన్‌
కనుబడలేదు పంచముని కన్నను నీచపు జంతు వేదియున్‌

హక్కుల్‌ దొంగలు దోచుకొన్నను మనుష్యత్వంబు జంతుత్వమై
చిక్కుల్‌ వెట్టెడు కాలమందును క్షమాసిద్ధాంతముల్‌ నేర్వ నా
పక్కా పౌరుషవవహ్ని నార్పు మతరూప క్రూరసింహంబు నా
ప్రక్కం పండులునూరుచున్నది తలంపన్‌ శల్యసారథ్యమై

జగముల్‌ మెచ్చు బియే లెమేలు బిరుదుల్‌ సాధించినామంచు నీ
లుగు మా మాలలు మాదిగల్‌ కులమహాలోభంబు రెట్టింపగన్‌
తెగలంగట్టి తగాద లెంచెదరు గానీ సంధి గావింపరో
ఖగభామా మతబోధలేల కులకక్ష్యా భ్రష్ట దుర్జాతికిన్‌

అసలే ముక్కిడి దానిమీద పడిసెం బన్నట్లు మాజాతి బా
నిసలౌరా కలహించుచుందు రుభయుల్‌ నీచోచ్చతా నిర్దయ
వ్యసన వ్యగ్రత సిగ్గుచేటగు నయో యస్పృశ్యతాత్రాస మం
త్ర సమేతుండగు గాంధి నేర డివి యంతర్నాటకారాటముల్‌

భీతింగొల్పెడు నస్వభావిక కథావేదాంత శాస్త్రాలకుం
జేతుల్‌ మోడ్చు నమాయక ప్రజలు సంసేవింప భోగాబ్ధిలో
నీతల్‌ గొట్టు కవిప్రకాండముల సాహిత్యప్రపంచంబులో
ప్రాతఃకాంతుల జిమ్మునట్టి కవితాభానుండు జన్మించునే

నటకునివోలి కాలపరిణామ విధేయములై రహించు ను
త్కట మత ధర్మ శాసననికాయము తీరుపు చేసి సంఘ సం
కటముల పాలొనర్చి యధికారముసేయు దరిద్రజాతిపై
కటకట నల్వురాడు నెడ కల్ల యథార్ధము కాకపోవునే

రచ్చలకెక్కనీక సమరంబున బూడ్చిన కర్ణుశక్తి నే
డెచ్చట జూచినం ప్రభవహించి సముజ్వ్జలమై వెలుంగదే
కచ్చ లసూయలుం కళ నొకానొక కాలము డాచియుంచినన్‌
హెచ్చి తురంగలించి ధ్వజ మెత్తకపోదు యుగాంతరంబునన్‌

కవ్వడి పరువున్నిల్పగ
న వ్వసుదేవాత్మజాతు డట్లనె గానీ
కవ్వడి కర్ణుని గెల్చుట
నవ్వులపా టనెడు మాట నల్వు రెరుగరే

వలదన్నన్‌ వెనువెంట నంటి నను నిర్బంధించుచున్నట్టి వే
ల్పుల సిద్ధాంతములెల్ల నా సహజ సంపూర్ణ ప్రతాపంబులో
జిలికెం జిక్కని మచ్చుమందు మునిపక్షీ యింక నీవంటి గ
బ్బిలముల్‌ సేయు హితోపదేశములు వేవే ల్కాలి కాహారముల్‌

అగుపించెనే యసూయా దుర్గుణజ్వాల
        సంహరించెడు శాస్త్రసముదయంబు
పరికించివచ్చితే పరమతసహనంబు
        భాషించు వేదాంతపాఠశాల
వీక్షించితే వర్ణభేదాల వ్యాధిచే
        శాంతిగా రాజ్యంబు సలుపు నెలవు
కనుగొంటివే మనుష్యుని జూచి మనుజుండు
        మిట్టమీనై దాటునట్టి సీమ

నేను చిందులాడి నేను డప్పులుగొట్టి
యలసి సొలసి సత్తికొలువు గొలువ
ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు
నీచమైన భూమి జూచినావె

క్రూరుల్‌ కుత్సితు లస్మదీయములు హక్కుల్‌ దోచుకున్నారు న
న్నూరింబయటకు నెట్టినా రిపుడు నన్నోదార్చుచున్నారు గాం
ధారేయుల్‌ నెలకొల్పినారు మతసంస్థల్‌ లక్కయిండ్లక్కటా
మారుందమ్ములు నమ్మజాలనివి స్వాత్మశ్రీ సమారంభముల్‌

తనురక్తంబు వ్యయించి సత్కవికళా ద్రవ్యంబు వెచ్చించి మ
ల్చిన శిల్పాలు విమర్శకబ్రువుల కల్తీవ్రాతలం ఖ్యాతికె
క్కనివైపోయె నసూయచే బలుకు నాల్కల్‌ సత్యమున్‌ చాటునే
అనుమానింతురు కొంద రీశ్వరుని ధర్మాధర్మ నిర్ణేతృతన్‌

జనులం బీలిచి పిప్పి జేసెడు దురాచారంబులన్‌ కాలమ
ట్టని విద్యాబలమేల విద్యయన మౌఢ్యవ్యాఘ్రి కింపైన భో
జనమా మోసపువ్రాతకోతలకు రక్షాబంధమా యెందుకీ
మనుజత్వంబు నొసంగలేని చదువుల్‌ మైరేయపున్‌ మైకముల్‌

చిరకాలంబును భిన్న జాతిమతముల్‌ జీవించు రాజ్యాన సు
స్థిరమై శాంతి రహించునన్న నుడి సందేహించెదం బక్షిణీ
తురకల్‌ హైందవు లీ స్వరాజ్యరథమున్‌ దొర్లింతురే దక్షిణో
త్తరదిగ్దంతులు రెండునుం గలిసి మేతల్‌ మేయు తావున్నదే

వీరవసంతరాయడను వేల్పొక డుద్భవమంది దుష్ట సం
హారమొనర్చి ధర్మము సహస్రముఖంబులు నాటునంచు నా
జారిన గుండెలో వెఱపు సల్లుదు రీ యనృతప్రచారకుల్‌
కారణమమ్మ పిచ్చితలకాయలకున్‌ వెడ నమ్మకాలకున్‌

పుట్టించెం దయలేనిలోకమున నే పుణ్యాత్ముడో కుక్షిలో
ముట్టించెం బొగలేని యాకటిసొదన్‌ ముప్పూట లీచిక్కులో
నట్టిట్టై తపియించు నా కొదవు నాహారంబు భక్షింపగా
పుట్టంజొచ్చిరి దేవతల్‌ బహుళరూపుల్‌ పుట్టలై చెట్టులై

అట్టు లెడంద నేర్చెడు మహావ్యధ నాతడు వెళ్ళగ్రక్కినన్‌
బిట్టు కదుష్ణబాష్పములు నిండిన కన్నుల సానుభూతి చూ
పెట్టి ప్రదక్షిణించి సురభిక్షకు నింటికి లేచిపోయె క
న్పట్టె స్వతంత్రభారత విభాకర బాలుడు తూర్పుడోలికన్‌

మునిపక్షి రాకపోకల
ఘనసందేశముల కలన ఖర్చయిపోయెన్‌
తనురక్త మా దరిద్రుడు
చనిపోవునొ తత్ఫలంబు చవిజూచెడినో