గుఱ్ఱాలకు ఱెక్కలు గల
వెఱ్ఱియుగాల్ దాటిపోయె విజ్ఞానంబున్
బుఱ్ఱ గల గాంధి యుగమిది
కఱ్ఱలు ఖడ్గంబు లేలగా లేవు ప్రజన్
రాజుగారి గుఱాల రధచక్రముల క్రింద
మరణించు రైతుకు శరణమిచ్చి
నరజాతిలోన నంతరము లుండుట కన్న
నఘము లేదను ధర్మ మాకళించి
బహుమతాచార దుర్భర పదాహతి చేసి
అసురుసురగు వారి కభయమిచ్చి
రాజభాషల కన్న రాష్ట్రభాషలలోన
రసమున్నదను యదార్థత నెఱింగి
యుగయుగాల నాడ యూబిలో దిగబడ్డ
మహితమైన జాతి మత్తగజము
ప్రబల దాస్య నిగళ బంధంబు లగలించి
దెసల మసలుచున్న దినము లివ్వి
కలరే మోసపు దేశభక్తి పరు లక్కైలాస దేశంబునన్
చలికిం ఖద్దరుధారులై యవల స్వేచ్ఛారాజ్యభాగంబు రా
గల దంచున్ విహరించు పెద్దలు పతంగస్వామినీ నిమ్న జా
తులపై వీరు వెలార్చు బాష్పములు చిందున్ తియ్యగా పుల్లగా
మా దౌర్భాగ్యపు జాతిలోన నొకనిం బాధింపకున్నట్టి యీ
యాదివ్యాధికి నగ్గమై కుములు టేలా నాకు పోనిమ్ము నా
చేదస్తం బిది కష్టపెట్టితిని పక్షీ రోషగాడెన్నడున్
ప్రాదుర్భావము నందరాదు పరసేవాభ్రష్ట వంశంబునన్
కలదమ్మా వ్రణ మంటరానితన మాకర్ణింపుమీ యిండియా
పొలమందుం గల మాలమాదిగలకున్ భూతేశుడే కాదు కృ
ష్ణులు కృష్ణున్నిరసించు దైవములు క్రీస్తుల్ మస్తుగా బుట్టినన్
కలుపన్నేరరు రెండుజాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్
చాకిరిజేసితిం దెలుగుజాతికి నేబదివత్సరాలు నా
వాకిలి ద్రొక్కిచూడవు శుభంబులు సౌఖ్యము లెంతకాల మీ
పాకి వయస్సుతో నడుగుబట్టిన యాసలు తెప్పరిల్లునో
లేక నశించునో తెలుపలేడు గదా మదనాగ వైరియున్
శుభశిశువో యదిగాక య
శుభశిశువో తెలియరాదు క్షోణీసతికిన్
ప్రభవించు బిడ్డ యకటా
యభంగుర ప్రసవబాల కగ్గంబయ్యెన్
అరవం గుత్తుకగోసి జంతువుల గర్భాగారముల్ జీల్చి నె
త్తురుటేళ్ళ న్నటియించు మూఢతమ జాతుల్ జాతరల్ సేయ జూ
తురు చూపింతురు ప్రోత్సహింతు రతివాదుల్ శాస్త్రపారంగతుల్
కరుణల్ కమ్మని బోధ లో పులుగుటక్కా ఛీ హుళక్కుల్ గదా
కని గంగార్పణమంచు త్రోసి చనియెం కర్ణున్ పృథాదేవి యా
తని విద్యా కుల రూప సంపదలు వ్యర్థంబై ప్రలాపింపవో
కనియెన్ భారతకుంతి మమ్ముల నసంఖ్యాకంబుగా కర్ణులన్
మునిపక్షీ యమనందనుల్ తెలియరిప్డున్ మాదు భ్రాతృత్వమున్
ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి
శివుమూర్తియై భూమి కవతరించు
ఒక డూర్య్ధపుండ్రంబు లురువుగా దగిలించి
శివలింగమును జూచి చీదరించు
ఒకడు రెండును గాని వికటవేషము దాల్చి
పైవారి మీద సవాలు సేయు
ఒకడు గంజాయి దమ్ముకు దాసుడై పోయి
బూడిదగురవడై పుట్టివచ్చు
మనుజులార మాది ఘనమైన మతమని
ఒకడు తరిమి తరిమి యుగ్గడించు
పెక్కుమతము లిట్లు పేచీలు సాగింప
మార్గమేది యైకమత్యమునకు
మొక్కుబళ్ళ నెపాన చక్కని పసిపాప
లెందరు గంగలో నిమిడిరొక్కొ
సహగమనాచార దహనదేవత లెన్ని
చిగురుగొమ్మల బూది చేసెనొక్కొ
చదువుదాచెడు దురాచారణ మెందరి కళా
భ్యసన చాతురి గొంతు బిసికెనొక్కొ
పొందెరుంగని వేరుబందాలచే బాహు
బలమెంతగా చచ్చువడియెనొక్కొ
చిలిపిరాలకు నగిషీలు చెక్కిచెక్కి
కాలమెంత యగంతాన కలిపిరొక్కొ
చదువ నేర్చిన వెర్రిని జంపగలరె
ఒక్క బుద్ధుడు నొక క్రీస్తు నొక్క గాంధి