గబ్బిలము

అపజయంబులు విజయగేహంబు నిలుచు
స్తంభములు సుమ్ము నీకు విచారమేల
కొద్ది కొద్దిగ నిక్కిన గోడ వోలె
సగము సగములుగా పనుల్‌ ముగిసిపోవు

ఓటమిలేదు నా యతన మూరకపోదు తుఫానువోలె నా
మాట లుమామహేశ్వరుల మానసముం గదిలించితీరు క
న్నీట మునింగి పైకుబుకు నిర్మలసూక్తి ఫలింపకున్న పో
రాటముతో స్వరాజ్యము విరాజిలుటల్‌ కృతకప్రచారముల్‌

పలనాటన్‌ మును బ్రహ్మనాయని కృపాబాహుళ్యనేత్రంబులో
పల నాటంబడి నాయురాలి కృతక వ్యాపార దానంబు లో
పల భస్మంబయి సంఘసంస్కరణ దివ్యద్బీజ మీనాటికిం
ఫలియించెంగద గాంధిచే యతనముల్‌ వ్యర్థంబు గా వెన్నడున్‌

నీకావించిన రాయబారమునకు న్నిత్యాభిషేకంబుగా
నాకన్నీటిని కాన్కగా యొసగుచున్నానో దయాశాలినీ
చేకొమ్మింతకుమించి నావలన నాశింపంగ లేదిట్టి నీ
బాకీ దీర్తు స్వరాజ్య సౌధమున నావాసంబు సిద్ధించినన్‌

ఏజాతి కెంతవచ్చునొ
రాజత్వం బంత నాకు రావచ్చు గదా
నాజాతి యెత్తు కేతన
రాజంబున నీదుమూర్తి వ్రాయింతు చెలీ

పెల్లు తమస్సులోన దురపిల్లెడు మా బ్రతుకుం దమస్వినుల్‌
భల్లున తెల్లవార్చగల బాబులు పెద్ద లనేకులుండగా
తెల్లనివేల్పు భిక్షకుని దిండికి బట్టకులేని కొండరా
యల్లుని నాశ్రయించి యకృతార్థుడనైతిని పిచ్చివాడనై

మరచితి నాదిదేవుని సమానుడు బుద్ధుని యంతవాడు భా
సుర దరహాస చంద్రికల శుభ్రత లోన గలట్టి వాడు య
ద్దొరలకు గాదు వారి చెవిదూరినవారిని లక్ష్యపెట్ట డ
ప్పరమమునిన్‌ సబర్మతి నివాసిని జూచితివే తపస్వినీ

ముల్లొక్కించుక వాలిపోయినను బాపూజీకి దీటైన శ్రీ
వల్లాభాయి పటేలు దర్శనము సంప్రాప్తించెనే నీకు నే
డల్లంతన్‌ గనుపట్టుచుండెడు స్వరాజ్యార్థంబు సర్వస్వమున్‌
గొల్లంబెట్టిన త్యాగి తా నతడెఱుంగున్‌ నా మనఃక్లేశమున్‌

ధిక్కారించెడు రాచగుఱ్ఱముల స్వాధీనంబు గావింపగా
యుక్కుంగళ్ళెము జహ్వరుం డతని విద్యుచ్ఛారదామూర్తి న
ల్దిక్కుల్‌ నిండి నటించుచున్న దనుచున్‌ దేశంబు లగ్గించు మా
చిక్కుల్‌దీర్చుట విస్మరింపడుగదా స్వేచ్ఛాజయాంతంబునన్‌

పసుపుం బచ్చని పూతపూచినది మువ్వన్నెల్‌ పిసాళింప గాం
గ్రెసు మందార మనంత శాఖికలు నిక్కెన్‌ దిగ్దిగంతంబులన్‌
పసలేర్పడ్డవి సర్వవర్ణములకున్‌ తచ్ఛాఖిశాఖాతతిన్‌
వసియింపన్‌ మనకుండదే స్థలము దివ్యన్మౌని పక్షీశ్వరీ!

కల డంబేద్కరు నా సహోదరుడు మాకై యష్టకష్టాలకుం
బలియై సీమకువోయి క్రమ్మరిన విద్వాంసుండు వైస్రాయి మే
ల్కొలువందంగల దొడ్డవాడతడు నీకున్‌ స్వాగతం బిచ్చి పూ
వుల పూజల్‌ వొనరించెనే యతనిమెప్పుల్‌ నీ జయారంభముల్‌

నేను నాకను నహము ఖండింపలేక
పదియు నెనిమిది శాస్త్రాలు పదును లుడిగె
నీవు నేనను సమత సంధింప గలిగె
తీవ్రతరమైన చిన్న మౌనవ్రతంబు

వచ్చినవారు సీమనరపాలుర మంత్రు లభీప్సితార్థముల్‌
దెచ్చిరి ప్రేమతో భరత దేశజులం దనియింపవచ్చి పో
వచ్చు స్వతంత్రభారత సువర్ణకిరీటము నేడుగాక రా
వచ్చు మరొక్కనాడు నెలవాసిన తొయ్యలి తీర్థమాడదే?

గుడిలో దేవుడు చూచిపొమ్మనుచు నాకున్‌ వార్తలంపింపగా
దొడగెన్‌ నల్వురచేత నీవెనుకవత్తున్‌ నన్ను రమ్మందువా
తడవైనన్‌ మరణింతురెందరొ విముక్తాహార దీక్షాపరుల్‌
నడుమన్‌ నేను సహింపజాల నొక యాంధ్రప్రాణి శుష్కించినన్‌

గబ్బిలమవయ్యు శివుని లోకంబునందు
వలయు కదలిక గలిగించి వచ్చినావు
నిశ్చలంబైన కాసారనీరమునను
నలతి శిల చాలదే వలయముల దీర్ప

అర్థించి చనుదెంతు నగ్రహారముకన్న
        సర్వేశ్వరుని యింటి చౌకదనము
అడిగివచ్చెద వీటి నడిబజారునకన్న
        గుడిగోపురముల తక్కువతనంబు
పలికించుకొనివత్తు బంతి బువ్వలకన్న
        తీర్థప్రసాదాల దేబెతనము
ప్రశ్నించివత్తును రాచబావులకన్న
        పాతాళగంగమ్మ పలుచదనము

నిజము దేలిచికొని వత్తు నిన్న నేడు
నన్ను జూచిన నల్లంత నడుచుతనము
గుడికి రమ్మనినంతనే యొడలుమఱచి
పరువులెత్తుట నాకంత పరువుగాదు