ఆగర్భప్రతిభా సముద్రులగు శిల్పాచార్యు లూహింపగా
మూగంబడ్డ శకుంతముల్ పలికి గుంపుల్ కట్టి కీర్తింపగా
వేగుంజామున రంగులద్దు నల శిల్పబ్రహ్మ దే గ్రామమో
భోగట్టా కనివచ్చితే రసమయంబుల్ తత్కళా పద్ధతుల్
బెళుకుంజూపులు గుల్క పోకడలు చూపీ చూప కూరించుచున్
జలదాగారము లందు తోచెదరు కన్యల్ కొంద రీక్షించితే
పులుగుంజేడియ! అబ్ధిగర్భములలో ముత్యాలు పండించి భూ
ముల కర్పించెదరంట మేటి గహనంబుల్ సృష్టివైచిత్రముల్
ఎంత కోయిలపాట వృధ యయ్యెనో కదా
చిక్కు చీకటి వనసీమలందు
ఎన్ని వెన్నెలవాగు లింకిపోయెనొ కదా
కటికికొండల మీద మిటకరించి
ఎన్ని కస్తురిజింక లీడేరెనో కదా
మురికితిన్నెల మీద పరిమళించి
ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా
పండిన వెదురు జొంపముల లోన
ఎంత గంధవహన మెంత తంగెటిజున్ను
యెంత రత్నకాంతి యెంత శాంతి
ప్రకృతిగర్భమందు భగ్నమై పోయెనో
పుట్టరాని చోట పుట్టు కతన
నెలలో నున్నది వృద్ధురాలొకతె గాంధీశిష్యురా ల్నిచ్చలున్
జిలుగున్నూలు తయారుచేసుకొనుచున్ జీవించు జేజెమ్మ కొం
డల యల్లుండు శిరాననుంచుకొని సన్మానించెడిం బండువె
న్నెల పూదోటల విశ్రమించి మన సందేశంబు నాలించెనే
నాచిత్తంబున దక్క తోచదెచట న్నాతల్లి రూపంబు ధా
త్రీచక్రంబున దేహమూడ్చి నరు లుర్వింబాసి వైకుంఠ మం
దో చండీశ్వరుడుండు మండలమునందో యుందురండ్రెల్ల రా
యాచోటం గనివచ్చితే మృతి భవిష్యన్ముగ్ధముల్ విశ్వముల్
చంద్ర చండకరులు సన్మార్గగతులయ్యు
నొకని జూచి యొక్క డోర్వజాల
రెందు కింత వైర మిరువురిలో ద్రావి
డీ డెవండు తెల్గువా డెవండు
పవ లింపారెడు సృష్టి చీకటి శిలాపంకంబునం బుంపి యి
ట్లవమానించెడు కొంటెవాడెవడు ప్రొద్దల్లంత కన్పట్ట వే
కువ నేమోల నణంగియుండు తమ సిగ్గుంజేటు యోజింప రీ
యవివేకుల్ విరమింపరీ దినదిన వ్యర్థ ప్రయత్నంబులన్
శివుడు తాండవించి చేకొన్న సత్కీర్తి
తన ప్రయోజకత్వ మని తలంచి
విఱ్ఱవీగడండ్రు పెక్కురు నటకులు
విఱ్ఱవీగి కవుల విస్మరింత్రు
వెలవాక్రుచ్చగ రాని భావముల నన్వేషించుచున్ సత్కవీం
ద్రుల యూహల్ విహగంబులై తిరుగుచుండున్ ప్రోన్నతాకాశమం
డలమస్తంబున నాకళించితె ప్రయాణశ్రాంతి నమ్మంచు కొం
డలకున్ డిగ్గెడి నీవిశేషము రసజ్ఞజ్ఞేయ మూహింపగన్
వడుకునూలు చేత పగ్గాలు పేనించి
దొడ్డమృగయు డుచ్చు లొడ్డినాడు
తగులుకొనునొ కాక తప్పించుకొను నొక్కొ
స్వీయరాజ్య మనెడు సింహరాజు
నరులన్ ముట్టక నందులం గొలిచి పుణ్యంబెల్ల సాధించు న
ప్పరమంబైన రహస్యమున్ శివునితో ప్రస్తావముం జేసితే
పరమేశుం డివి నిమ్నజాతులకు సంప్రశ్నింపగా రాని వే
ద రహస్యాలని కోపగించుకొని స్వార్థంబుం బ్రదర్శించెనే
బసుమంబు బూసికొని యే
రసికత లేకుండ బ్రతుకు ప్రమదుల నడుమన్
రసికుడగు సుకవి జీవిత
మసిధారావ్రతము వలవ దది శత్రులకున్
ఎవరికి వారై బ్రతుకుచు
నవీనధర్మముల పిచ్చినమ్మకములతో
సవరించి ప్రజల తలలో
ప్రవేశ మొనరించు స్వార్థపరులం గంటే
దిరుసుల్ మార్తురు కొంద రాంధ్రులవురా దేశాంతరంబేగి వ
త్సరముల్ పుచ్చి త్రివిష్టపప్రజలలో సఖ్యంబు గావించి యె
బ్బెరికంబైన విదేశనాగరికతన్ విచ్చేయ కచ్ఛాంధ్ర మం
దర వేసంబు ప్రతిష్ఠ నిల్పితివి సన్మానార్హ వెంతేనియున్
చెప్పక చెప్పుచున్నది విశేషము లేదని నీమొగంబు నే
తప్పొనరించి యింతటి వృధాశ్రమ యిచ్చితి మా యదృష్టముల్
దప్పిన దప్పని మ్మనుగు తమ్ముల శ్రేయము గోరి భర్గునిన్
గుప్పెడు గుండెతో యెదురుకొంటివిదే పదివేలు పక్షిణీ