గబ్బిలము

ప్రభువుల పెండ్లిపేరంటాలు వర్ణించి
        కాలంబు పెక్కేండ్లు ఖర్చుపెట్టి
విరహవేదన మేనుమఱచి మూర్ఛలువోవు
        రాణివాసంబును రచ్చకీడ్చి
అంగాంగవర్ణనా వ్యసనంబు రెట్టింప
        యువక జీవిత కోటి కుచ్చులొడ్డి
పదియునెన్మిది మార్లు బాడిన శ్రీరాము
        చరితంబు వగరెక్క తిరుగబాడి

శరణు శరణటంచు బరుగులెత్తుచు వచ్చు
నార్తలోక రుత మనాదరించి
భువనహితము గోరు కవితాకళను నేడు
స్వార్థజడధి నూరవైచినారు

పెద్దల శల్యముల్‌ బలె వివేకమొసంగని గ్రంథరాసులే
విద్దియలైన నింక పదివేలయుగాలల్‌ తలకాయలేని గం
గెద్దులు బుట్టి స్వార్థపరులెత్తిన గంతలు మోసి తీరెడిన్‌
బుద్ధి చిగుర్చునే యరుచి బుట్టు కథల్‌ తలమీదరుద్దినన్‌

ఆడుది లేక యున్న కృతి కందము లేదని నమ్మి యెన్నడో
పాడి రనుత్తమ ప్రణయ బంధుర గీతము లర్థతృష్ణ వె
న్నాడ కవుల్‌ మహీపతి బృహన్నల వర్గము సంతసింప నీ
నాడు రచింతు రిద్ధ కరుణా పరిణద్ధ రసప్రబంధముల్‌

మొన్నటి యుద్ధదేవతకు బుట్టిన కూతురు క్షామదేవి మృ
ష్టాన్నముగా భుజించిన క్షుథార్తుల డొక్కలు శల్యరాశి సం
పన్నుల వీధులందు కనుపట్టెనె? వంగకవీంద్రకోటి చే
కొన్న కలా లెరుంగవనుకొందు దయారస నవ్యకావ్యముల్‌

చలిచీమం బొలియింప నేరని యహింసామానసుల్‌ ఱాలలో
మొలిపించెం బహు బుద్ధవిగ్రహచయంబుం భారతంబంతటన్‌
కలయైపోయెనొ తత్కృపాగుణము బంగాళంబులో ప్రేమ మూ
ర్తులు లేరో భుజియింపరో ద్రవిణవంతుల్‌ మేలి మృష్టాన్నమున్‌

ఎట్టు నశించిపోయె నితరేతర విశ్వసనంబు లెందు కీ
చట్టములం ప్రమాణముల సారమషీరస పత్రలేశముల్‌
కొట్టిన గొట్టుమం చెదరి గుండియలం గరగించు ధర్మముల్‌
బుట్టినగడ్డలో నకట ఫూత్కృతి సల్పు నశాంతి సర్పముల్‌

అనఘుం డశ్రు మషీజలంబున వివేకానంద సన్యాసి వ్రా
సిన వ్రాతల్‌ దడియారలే దిపుడు ప్రాచీనంపు టజ్ఞాన బం
ధన విచ్ఛేదమొనర్చి యే ఘనుడు విద్యాభిక్ష గావించి ప
చ్చని బంగారము వంటి మా భరత సంసారంబు నెగ్గించునో

గాలిందూలెడు శుష్క దేహములతో కాషాయవస్త్రాలతో
శూలంబుల్‌ సొరకాయబుర్రలు జటాజూటంబులుం దాల్చి యా
మూలాగ్రంబుగ భ్రష్టులై తిరుగు బాబుల్‌ దొడ్డగంజాయి భా
యీ లున్నా రెదురైన వారె మునిపక్షీ కుక్షిరక్షాపరుల్‌

జపమో ధ్యానమొ యభ్యసించి యతివేషంబూని క్రీడించు మో
సపు పార్థుల్‌ ప్రతి పల్లెటూర గలరీ సన్యాసవర్గంబు నీ
కుపదేశింపదొ యిష్టసిద్ధికని మాయోపాయ మంత్రంబు భ
క్తి పరత్వం బొక సాధనం బిహ పర స్త్రీ వంచకశ్రేణికిన్‌

పాలుంబండులు కందమూలములు మాభక్ష్యాన్నముల్‌; గోర మే
కాలం బన్యపదార్థముల్‌ రజితమో బంగారమో కొద్దిగా
జాలున్‌ మాకని సేకరించెదరు గోసాయీ లుపాయాలు మో
సాలెన్నేని నిరంతరాయముగ రాజ్యంబేలు నేడెల్లెడన్‌

వృత్తుల్‌ సర్వము త్రుప్పువట్టి చనగా భిక్షాటనంబున్‌ జగా
వృత్తుల్‌ కా పలుజాతులై నిలువ దుర్భిక్షంబు రాకుండునే
యుత్తుంగాశయు లెందరో కలరు దేశోద్ధారకుల్‌ పూనరీ
చిత్తంబేర్చు కళంకమున్‌ దుడిచి సుశ్రీ నేలకుం గూర్పగన్‌

ఎన్ని సుక్షేత్రములు సారమిగిరి పోయి
ముండ్లతుప్పర బంజరభూములయ్యె
దృఢతరంబైన యెంతెంత దేహశక్తి
భిక్షకుల పోషణమ్ములో పృధివి గలిసె

పదవుల పీటలెక్కి యనువారము లంచపు బాడిబర్రెలం
బిదికి గడించి కార్మికుల పేదల చెమ్మట దెచ్చి కాన్కలి
చ్చెదరు పరోపజీవులు విచిత్రపు భక్తులు వేషధార్లు నీ
కెదురయి వచ్చిరే వలదిసీ చెయిచాచకుమమ్మ పక్షిణీ

నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు
ధర్మశీలురున్న ధరణి మీద
కాలుమోపలేక గబ్బిలమొక్కటే
చరణయుగళి దివికి సాచి నడచు

పూజారి భోషాణమును కాపలాకాయు
        చిల్లరవేల్పుల సేవజేసి
గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు
        కరకు సత్తులకు జాతరలు సల్పి
ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు
        కృతకరాముల పల్లకీలు మోసి
నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు
        ఏడుకొండలవాని మేడలెక్కి

అంబుధీశుని కళ్యాణులని తలంచి
ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి
పాతకము వోలె నా వెన్ను వాయకున్న
గోచితో నిల్చియున్నాడ పేచకంబ