గబ్బిలము

అసుశక్తిం బనిసేయుచున్‌ మసలు దేహాపూర్వయంత్రంబులో
బిసలెన్నో కల వేనెరుంగనివి నా విజ్‌ నాన భాండారపుం
బిసలెల్లం బనిసేయ విందలి మరల్‌ పాడైనచో యెవ్వడీ
బిసగా డెందుల కీ రహస్యములకున్‌ బీగంబు బంధించెనో

అచ్చెరువున్‌ ఘటింపగల యంత్రములం గనుగొన్న జ్ఞానులుం
జచ్చిరి చావుపుట్టువుల జాడ లెరుంగ కెరింగి దేవతల్‌
జచ్చిరి మృత్యువుం గెలుచు శక్తు లొసంగని చుప్పనాతి వే
ల్పెచ్చట డాగినా డతని కెందుల కీ తెరచాటు మోసముల్‌

మును మేనూడ్చిన వారి యెమ్ము లెరువై భూదేవి పండించి నిం
చిన నానా ఫలవృక్షరాజముల కిచ్చెన్‌ దివ్యమాధుర్యమున్‌
తనురక్తంబును మేఘమై కురిసి యానందంబు గల్పించు చ
చ్చునదేదీ ప్రతిజీవియుం దిరిగివచ్చుం భిన్నరూపంబులన్‌

మరణితులైన వారి తనుమాంసము కొన్నియుగాలు భూమిపై
మురిగి రసాయన ప్లుతుల పూర్ణపరీక్షల నిగ్గుదేలి యా
ఖరుకు శిశూత్కరాదులకు కాయముగా విలసిల్లకున్న నీ
సురుచిర దివ్యకాంతులు నిసుంగుల మేన రహింపనేటికిన్‌

ఆజన్మంబు తపంబులం బెరిగి దేవావాస వాస్తవ్యవై
పూజాపద్ధతులెల్ల నేర్చితివి నీ ముత్తాతలుం దాతలున్‌
జేజెమ్మల్‌ కులసంఘ బాహ్యులయి కస్తిం గుందుచో దేవతల్‌
రాజీ పెట్టిరె పేదవారి మొర కర్ణక్లేశ మెవ్వారికిన్‌

మాతృభాషల కర్హ మర్యాద లొనరించు
        సర్వకళాశాల సాగుచోటు
ప్రజల నాహారించు బహుమత దేవతా
        దైనందిన గ్లాని లేనిచోటు
నవనీతనిభమైన కవుల కమ్మనివాక్కు
        వెఱవు లే కావిర్భవించుచోటు
సంతానమునకు వైషమ్యంబు నేర్పని
        తల్లిదండ్రులు విరాజిల్లుచోటు

విసపునవ్వుల లాహిరీవేషగాండ్ర
పాదచిహ్నల మరక లేర్పడనిచోటు
తోడునీడయు లేనట్టి దుర్బలులకు
గబ్బిలపుచాన వానయోగ్యంబు గాదె

జాతీయ పౌరుష జ్వలన మాబాల్యంబు
        సవరించు కావ్యరాజ్యములు లేక
విక్రమక్రమ శిక్ష వెన్నతోనిడు జిజా
        సతి వంటి మాతృదేవతలు లేక
నొకజుట్టు నొకబొట్టు నొకకట్టుబడి నేర్పి
        పాలింపజాలు దేవతలు లేక
కులమెల్ల చెదరి తెంపులు తెంపులగుచుండ
        వారించి కాపాడు ప్రభువు లేక

బుద్బుదంబుల కెనయైన మూడునాళ్ళ
పదవులకు ప్రతిష్టలకునై ప్రాకులాడి
నరుల నమ్మించుకొనలేక నమ్మలేక
చిదికియున్నవి మాజాతి జీవితములు

ఆసల్‌ చెప్పుదు రిప్పుడీ గురులు ముం దాకాశ సింహాసనా
ధ్యాసీనత్వము సంఘటించు నిది సత్యంబంచు రూపింతు రీ
బీసీనాటి పురాణగాధలు రుషావేషంబు తగ్గించి నా
దాసత్వంబు స్థిరీకరించెడు పరంధామంబు నాకేటికిన్‌

పుట్టుకపూర్వమే తలను బుంపిన జాతి మతప్రచండ సం
ఘట్టన చేసి నా సహజకౌశలముల్‌ నశియించిపోయె నీ
కట్టినకట్లు విప్పు నధికారము లేని గురుండెవండొ యీ
యుట్టికి నెక్కలేని నను నూచెడునంట వికుంఠడోలికన్‌

నను సృష్టించిన వాడె నావెనుక జన్మం బెత్తునే నోరెఱుం
గని నన్నీ పదివేల రూపములతో కంగారుగావించునే
కనకంపుం గుడిగోపురాల్తనకు నాకాంక్షించునే కానుకల్‌
గొనునే యిట్టివి మోసగాండ్రయిన భక్తుల్‌ పన్ను పన్నాగముల్‌

అనినమాటను మార్చుకొనలేని శాస్త్రముల్‌
        స్వాభిమానము దక్కి పలుకగలవె
కులముంచుకొని నన్ను కొలుచుకొం డను వేల్పు
        కడగి నా కన్నీరు తుడువగలడె
మానవదాస్యంబు మరగిన లోకంబు
        నెనరూని నాచెల్మి నెరపగలదె
అస్వభావిక కథావ్యాసంగ హతమైన
        పృథివి సత్యంబు నూహింపగలదె

యుడుకురక్త మెన్నడో చచ్చుబడిపోయి
చేతులెత్తి మ్రొక్కు స్వీయజాతి
కరకు వీరసూక్తు లరిగించుకొని వేచి
యెదుట నిలచి పగర నదమగలదె

ధర్మసంస్థాప నార్థంబు ధరణి మీద
నవతరించెద ననె నబ్జభవుని తండ్రి
మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మున్గినది లేదు