రావు బాలసరస్వతీదేవి

[లలితసంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీదేవి పుట్టిన రోజు ఆగస్ట్ 28. ఆవిడకిప్పుడు 83 ఏండ్లు. ఈ సందర్భంగా ఈమాట కోసం వారిని కలిసి మాట్లాడి, ఆ వివరాలు అందించిన రోహిణీప్రసాద్‌ గారికి ఈమాట హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది – సం.]



రావు బాలసరస్వతీదేవి
(జింబియో.కాం సౌజన్యంతో)

లతా మంగేశ్కర్‌కు సమవయస్కురాలైన రావు బాలసరస్వతీదేవిగారిని కలుసుకుని ముచ్చటించటం ఈనాడు కనుమరుగైపోయిన ఒక సంస్కారంతో సంపర్కం పెట్టుకోవడమే ననిపిస్తుంది. ఇటీవల సికిందరాబాద్‌లో ఆవిడను స్వగృహంలో కలుసుకోవడం, అదికూడా పరుచూరి శ్రీనివాస్, వాసిరెడ్డి నవీన్‌వంటి మిత్రులతో బాటుగా కూర్చుని మాట్లాడడం ఒక ప్రత్యేకమైన సందర్భంగా అనిపించాయి.

బాలసరస్వతిగారి పాటల గురించి తెలుగు లలితసంగీతాభిమానులకు పరిచయం చెయ్యనవసరం ఉండదు. ఆమె జీవిత విశేషాలను ఆవిడ మాటల్లోనే కంపల్లె రవిచంద్రన్‌గారి జ్ఞాపకాలు అనే పుస్తకంలో చదవవచ్చు. ఆవిడ పాటలను వినేందుకు కనీసం 3 వెబ్‌సైట్లున్నాయి (సురస1, సురస2, సురస3).

జమీందారుతో వివాహానంతరం ఆమె రాచరికపు ‘బందీ’గా మారిపోవడం, పాడే అవకాశాలు కోల్పోవడం వగైరాలన్నీ ఆవిడ స్వయంగా చెప్పిన వివరాలే. ప్రస్తుతం ఎనభయ్యో పడిలో ఉన్నప్పటికీ ఆవిడ గొంతు సవరించుకున్నప్పుడు మనం మెలొడీయే ప్రధానంగా ఉండిన 1940-50 దశకాల్లో విహరిస్తున్నట్టే అనిపిస్తుంది. ఆమె ఇటీవలే విడుదల చేసిన కొన్ని గీతాల సీడీ విన్నా అటువంటి భావనే కలుగుతుంది. ఇందులో గడిచిపోయే ఈ రేయి అనే పాట దేవులపల్లిగారిదట.

గాయనిగా బాలసరస్వతి ఆ రోజుల్లోనే రాణించలేకపోవడం తెలుగు సాంస్కృతికరంగం విఫలం చెందడాన్నే సూచిస్తుంది. ఒక తలత్ మెహ్మూద్‌నిగాని, ఒక బాలసరస్వతినిగాని పైకి రానివ్వని సినీ, కళారంగాలు తమకు తామే హాని కలిగించుకునే పరిస్థితిలోకి వెళ్ళాయనే అనగలం. వ్యాపారసరళి ఏ యుగంలోనైనా పట్టువదలకుండా పనిచేస్తూ ఉన్నదే కాని మంచి అభిరుచికీ, మంచి విలువలకూ ఒకప్పుడున్న పెద్దపీట ఎంత త్వరగా అదృశ్యమయిందో విజ్ఞులు చెప్పగలరు.


రావు బాలసరస్వతీదేవి, కొ. రోహిణీప్రసాద్
వాసిరెడ్డి నవీన్, పరుచూరి శ్రీనివాస్

దక్షిణాది గాయనుల్లో ఎందరివో రికార్డులు విని, బాలసరస్వతిగారిని మాత్రమే ఎంపిక చేసి బొంబాయికి పిలిపించిన నౌషాద్‌వంటి సంగీతదర్శకుడు ఆమెచేత తన ఉడన్ ఖటోలా చిత్రం తమిళ వెర్షన్‌కు పాడించిన తరవాతకూడా లతా పంతం కారణంగా అది రద్దు చెయ్యవలసిరావడం దురదృష్టమేనని బాలసరస్వతి అంటున్నప్పూడు బాధపడడం తప్ప మనమేమీ చెయ్యలేము.

ఆమె పాటను ఎంతగానో అభిమానించిన సి.ఆర్. సుబ్బురామన్ లైలామజ్ఞూ సినిమా కోసం ఆమెచేత ఏల పగాయే అనే పాటకు రిహార్సల్ చేయిస్తున్నప్పుడు నటి, గాయని, నిర్మాత కూడా అయిన భానుమతి వచ్చిందట. ఆమె గది లోపలికి వస్తూ విసురుగా తన చెప్పులను విడిచినప్పుడు అవి తన సమీపానికి వచ్చి పడడంతో అవమానంగా భావించిన బాలసరస్వతి దిగ్గున పాడడం ఆపి వెళిపోయిందట. సుబ్బురామన్‌కూడా అందుకు నొచ్చుకుని మరొకరోజు ఆ పని పూర్తి చేసుకో వలసివచ్చిందట. ఆత్మాభిమానం చంపుకుని అవకాశాలకోసం పాకులాడటం తనకు చేతకాలేదని బాలసరస్వతి చెప్పింది. షావుకారు కోసం ఘంటసాల తనచేత పాడించిన పాటలు విని సుబ్బురామన్ మెచ్చుకున్నాడని చెప్పింది. సుబ్బురామన్ మరణించిన వార్త తాను మరేదో రికార్డింగ్‌లో ఉండగా విని నిశ్చేష్టురాలినయాననీ, అంతకు కొద్దిరోజులముందే ఆయన తనచేత తానే మారెనా (దేవదాసు) అనే పాట పాడించాడనీ ఆమె అన్నది. అటువంటి ప్రతిభావంతుడు అకాలమరణం చెందడం తీరని లోటని ఆమె ఉద్దేశం. ఆయన హత్యకు ఎవరో మహిళతో ఉండిన వివాహేతరసంబంధమే కారణమని శ్రీనివాస్ అన్నారు.

రాజేశ్వరరావు ప్రతిభ అంటే ఆమెకు చాలా అభిమానం. అయితే ఆయన వాలకం కాస్త వింతగా ఉండేదనీ, ఒకప్పుడు తామిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని నలుగురూ అనుకోవడం తనకు నవ్వు తెప్పించేదనీ బాలసరస్వతి చెప్పింది. రావే ప్రేమలతా అనే యుగళగీతం పాడాక ఘంటసాలతో కూడా ఏదో అభిప్రాయభేదం తలెత్తిందనీ, ఆ తరవాత ఆయనతో తాను పాడలేదనీ ఆమె చెప్పింది.

మంచి గాత్రం ఉన్నవారందరిలాగే బాలసరస్వతి కూడా మిమిక్రీ బాగా చెయ్యగలదు. ఎవరో ఒక సంగీతదర్శకుడు తన చేత కొన్ని మీరా భజనలు కాస్త హిందూస్తానీ పద్ధతిలో అభ్యాసం చేయించాడనీ, వాటినే ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి నేర్పినప్పుడు ఆమె పూర్తిగా కర్నాటక పద్ధతిలో ఎలా రుబ్బినట్టుగా పాడిందో చూపి విసుక్కున్నాడనీ ఆమె ఛలోక్తులతో చెప్పింది. ఆమెకు కర్నాటకగాత్రం నేర్పిన ఆలత్తూర్ సుబ్బయ్య ఆమె నాజూకైన పోకడలు నచ్చక విసుక్కునేవాడని అన్నది.

దాశరథి రాసిన నిండుపున్నమి పండువెన్నెల అనే పాటకు బాలమురళీకృష్ణ చేసిన వరస తనకు నచ్చక తానే స్వరపరచి రేడియోకు పాడాననీ, దాన్ని ఏడక్షరాల లయమీద కష్టపడి అమర్చడం జరిగిందనీ బాలసరస్వతి చెప్పింది. సాహిత్యానికి తగిన ట్యూన్ ఇవ్వకపోతే తనకు ఇబ్బందిగా అనిపించేదనీ, తన పేరు వేసినా, వెయ్యకపోయినా మంచి బాణీ తాను కట్టయినా సరే పాడడమే ఇష్టమనీ ఆమె అంటుంది. తాను ఎదగకుండా అడ్డుపడిన ప్రొఫెషనల్ గాయనీగాయకుల పేర్లను బైటపెట్టడానికి మొదట్లో మొహమాటం అనిపించేదనీ, ప్రస్తుతం ఆ దశలన్నీ దాటినట్ట నిపిస్తున్నాయనీ ఆమె ఉద్దేశం.

రావు బాలసరస్వతీదేవి ఆలాపనలు

ఆరుద్ర రాసిన ఈ చల్లని రేయి అనే పాట గురించి చెపుతూ ఆమె వినిపించిన ట్యూన్‌లను ఆడియో ఫైల్‌లో వినవచ్చు. ఆమె గానమాధుర్యం ఏ మాత్రమూ తగ్గలేదనే మనకు అనిపిస్తుంది.

హైదరాబాద్‌లో బాలసరస్వతి వంటి ఉత్తమ గాయనితో ఇష్టాగోష్టులూ, సంగీత సమావేశాలూ ప్రైవేట్‌గానైనా సరే పెట్టుకోవడం చాలా అవసరం. పెద్ద వయసులో వీటివల్ల ఆమెకు ఒనగూడే ప్రయోజనం తక్కువే అయినా అంతరించిపోతున్న ఒక సంగీతపరమైన సంస్కారాన్ని సామూహికంగా గుర్తుచేసుకుని దాన్ని కొనసాగేలా చూడడం సంగీతాభిమానుల కనీస కర్తవ్యం. ఈ విషయంలో ప్రఖ్యాత గజల్ గాయని బేగం అఖ్తర్ (1914-74) గుర్తుకొస్తుంది. ఒకప్పుడు అఖ్తారీబాయీ ఫైజాబాదీగా పేరుపొందిన ఆ ఉత్తమ గాయని వివాహానంతరం భర్త కోరిక మేరకు పబ్లిక్ కచేరీలు మానుకుంది. ఆయన పోయిన తరవాత అభిమానుల ఒత్తిడికి తల ఒగ్గి ఆమె మళ్ళీ రంగప్రవేశం చేసి ఎన్నో మంచి కచేరీలు చేసింది. అటువంటిది బాలసరస్వతిగారి విషయంలో జరగకపోవడం మన దురదృష్టమే కాదు, మనవాళ్ళకు లోపించిన రసదృష్టికి తార్కాణం కూడా.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...