సీ. చానచెక్కిలిపేరి ◊చంద్రఖండమున భా,స్వత్కరజక్షతి ◊వఱల నీక,
జలజాక్షిగుబ్బగు◊బ్బలుల సద్వజ్రశ,యోన్నతసమ్మర్ద ◊మొంద నీక,
సతిరదనాంశుక◊చ్ఛలసుమాసవమున, నలరుద్విజావళి ◊నాన నీక,
నెలఁతతనూపద్మి◊ని విగాఢదోషాను,బంధనిర్బంధంబుఁ ◊బడయ నీక,
తే. తార్చెఁ బర్వంబు, పక్షపా◊తంబుఁ గూర్చె, నుంచె నామోద, మొసఁగెఁ బ◊ద్మోదయంబు
నంత సుమశస్త్రశాస్త్రర◊హస్యతత్త్వ,మదనభుండు సుచంద్రక్ష◊మావిభుండు. 134
టీక: అంతన్=అటుపిమ్మట; సుమశస్త్రశాస్త్రరహస్యతత్త్వమదనభుండు – సుమశస్త్రశాస్త్ర=కామశాస్త్రముయొక్క, రహస్య= రహస్యముయొక్క, తత్త్వ=యథార్థమునందు, మదనభుండు=మన్మథుని సామర్థ్యమువంటి సామర్థ్యము గల; సుచంద్ర క్షమావిభుండు=సుచంద్రభూపతి; చానచెక్కిలిపేరి చంద్రఖండమునన్=చంద్రికయొక్క గండస్థలమను పేరుగల చంద్రఖండ మందు; భాస్వత్కరజక్షతిన్ – భాస్వత్=సూర్యునియొక్క, కరజ=కిరణములవలనఁ గలుగు, క్షతిన్=ఉపద్రవమును; భాస్వత్ =ప్రకాశించునట్టి, కరజ=నఖములయొక్క, క్షతిన్=ప్రహారముల నని స్వభావార్థము; వఱల నీక=ప్రకాశింప నీయక; సూర్యకిరణప్రసారము గల్గినయెడఁ జంద్రఖండమునకు క్షయము గల్గునని చెక్కిలి యను చంద్రఖండమునకు భాస్వత్కరజక్షతి కలుగనీయఁ డయ్యె నని భావము. జలజాక్షిగుబ్బగుబ్బలులన్=చంద్రిక స్తనము లనెడు పర్వతములయందు; సద్వజ్రశయోన్నతసమ్మర్దము – సత్=శ్రేష్ఠమైన, వజ్రశయ=ఇంద్రునియొక్క, ఉన్నత=ఎచ్చైన,సమ్మర్దము=రాయిడిని; సత్=శ్రేష్ఠమైన, వజ్ర=వజ్రరేఖగల, శయ= హస్తము యొక్క, ఉన్నత=ఎచ్చైన, సమ్మర్దము=రాయిడిని అని స్వభావార్థము; ఒంద నీక=పొందనీయక; పర్వతములకు ఇంద్రుని రాయిడి తగిలినచో నాశము గలుగును గావున గుబ్బగుబ్బలులకు వజ్రశయసమ్మర్దము గలుగనీయఁడయ్యె నని భావము. సతిరదనాంశుక చ్ఛలసుమాసవమునన్ – సతి=చంద్రికయొక్క, రదనాంశుక=అధరమను, ఛల=వ్యాజముగల, సుమాసవ మునన్=పూఁదేనియయందు; అలరుద్విజావళిన్=ఒప్పుచున్న భృంగపంక్తిని, ఒప్పుచున్న దంతపంక్తి నని స్వభావార్థము; ఆన నీక=త్రాగ నీయక, తగుల నీయక యని స్వభావాభిప్రాయము; పూఁదేనియ భృంగము లానినచోఁ దఱిఁగిపోవు నని రదనాంశుక సుమాసవమున ద్విజావళి నాననీయఁడయ్యె నని భావము. నెలఁతతనూపద్మినిన్ =చంద్రికయొక్క దేహ మను పద్మలతను; విగాఢదోషానుబంధనిర్బంధంబున్ – విగాఢ=అధికమగు, దోషా=రాత్రియొక్క, అనుబంధ=సంబంధముచేతఁ గల్గు, నిర్బంధంబున్=కష్టమును; విగాఢ=అధికమగు,దోషా=బాహు వులయొక్క, అనుబంధ=సంబంధముచేఁ గల్గు, నిర్బంధంబున్=కష్టము నని స్వభావార్థము; పడయనీక=పొందనీయక; రాత్రిసంబంధము కల్గినయెడలఁ దామరతీఁగ కాంతిహీన మగునని చంద్రికాశరీరపద్మలతకు దోషానుబంధనిర్బంధము గలి గింపఁడయ్యె నని భావము. ఈసీసము నాల్గుచరణములకును పైగీతమునందలి వాక్యములకును యథాసంఖ్యముగ నన్వయము. పర్వంబు=పున్నమను, ఉత్సవమును; తార్చెన్=కలిగించెను; చెక్కిలిచంద్రఖండము పూర్ణముగాఁ బ్రకాశించునట్లు పున్నమ కల్గించె నని భావము. పక్షపాతంబున్=ఱెక్కలు పడుటను, ప్రీతిని; కూర్చెన్=కలిగించెను. గుబ్బగుబ్బలులకు సుఖముగాఁ బక్షపాతమును కలిగించె నని భావము. చంద్రిక కుత్సవమును గలిగించె నని స్వభావాభిప్రాయము. ఆమోదము=పరిమళమును, సంతోషమును; ఉంచెన్=కలిగించెను; అధరసుమాసవమున కామోదము కలిగించె నని భావము; చంద్రికకు సంతోషమును కలిగించె నని స్వభావాభిప్రాయము.పద్మోదయంబు=కమలములయొక్క యావిర్భావమును, కాంతియొక్క యతిశయమును; ఒసఁగెన్=ఇచ్చెను. చంద్రికా శరీరమునందుఁ బద్మోదయము నిచ్చె ననఁగా, చంద్రికమేని కధికకాంతి కలుగునట్లు గావించె నని స్వభావాభిప్రాయము. సుచంద్రుఁడు సుకుమారాంగియగుచంద్రికకు శ్రమయని తోఁపనీయక, చతురుండు కావునఁ రతులఁ జొక్కించె నని భావము.
తే. అతనుశాస్త్రవిభేదంబు ◊నాదిఁ గాంచి
యంత నద్వయభావనా◊యత్తవృత్తి
నలరి తత్ప్రియసాయుజ్య ◊మంది పొందె
నసదృశానందమయత న◊బ్జాక్షి యపుడు. 135
టీక:అతనుశాస్త్రవిభేదంబు – అతను=మరునియొక్క, శాస్త్ర=శస్త్రసంఘమువలన, విభేదంబు=భేదమును; ఆదిన్=మొదట; కాంచి=చూచి; అతను=అధికమగు, శాస్త్రవిభేదంబు=శాస్త్రములయొక్క సర్వభేదప్రకారము నని యర్థాంతరము దోఁచుచు న్నది; అంతన్=ఆపిమ్మట; అద్వయభావనాయత్తవృత్తిన్ – అద్వయభావనా=అభేదభావనయందు, ఆయత్త=స్వాధీన మగు, వృత్తిన్ = వ్యాపారముచేత; అలరి = సంతసించి; తత్ప్రియసాయుజ్యము – తత్ప్రియ = ఆప్రియుఁడగు సుచంద్రునియొక్క, సాయుజ్యము=సాంగత్యమును; అంది=పొంది; తత్ప్రియ= ఆయద్వితీయబ్రహ్మయొక్క, సాయుజ్యము= ఐక్యమును, అంది=పొంది, యని యర్థాంతరము; ఇచట ‘అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశపఞ్చకమ్, ఆద్యత్రయం బ్రహ్మరూపం మాయారూప మతోద్వయమ్’ అనెడి వార్తికముచేత ప్రియశబ్దవాచ్యము పరబ్రహ్మము; అపుడు=ఆసమయమందు; అబ్జాక్షి= చంద్రిక; అసదృశానందమయతన్ – అసదృశ=సరిలేని, ఆనందమయతన్=సంతోషప్రాచుర్యమును; పొందెన్=పొందెను.
అనఁగ నాచంద్రిక మొదట మదనబాణప్రహారములను పొంది, పిదప నభేదభావనాయత్తవృత్తిచే నాశ్రయించి, పిమ్మట ప్రియసాయుజ్యము నొంది బ్రహ్మానందతుల్యమగు నానందమును పొందె నని భావము. అర్థాంతరమునకు భావము స్పష్టము.
చ. తొలుత దృశావిలాసములు, ◊తోరపుటాననవిభ్రమంబు ల
వ్వల, నటుమీఁద నావయవ◊వైఖరులుం గనుపట్ట నాన యన్
బలుతెర నారతిస్మరులు ◊పట్టి సడల్పఁ, గ్రమంబున న్వధూ
తిలకము రాజమౌళికి మ◊ది న్ముద మూనిచె నర్తకీగతిన్. 136
టీక: తొలుతన్=మొదట; దృశావిలాసములు=దృగ్విలాసములు; అవ్వలన్=ఆమీఁద; తోరపుటాననవిభ్రమంబులు=అధిక మగు ముఖవిలాసములును; అటుమీఁదన్=అటుపైని; ఆవయవవైఖరులున్= అవయవసంబంధిరీతులును, అంగాభినయము లని యర్థాంతరము; కనుపట్టన్=చూపట్టుచుండఁగ; నాన అన్=సిగ్గనెడు; బలుతెరన్=అధికమగు కాండపటమును; ఆ రతి స్మరులు = ఆరతిమన్మథులు; పట్టి సడల్పన్=పట్టి విడువఁగ; క్రమంబునన్=క్రమముగ; వధూతిలకము=చంద్రిక; రాజమౌళి కిన్=సుచంద్రునకు; నర్తకీగతిన్=నటివలె; మదిన్=మనమందు; ముదము=సంతసమును; ఊనిచెన్=ఒనరించెను.
క. కంతుకలాపారగ మగు, స్వాంతమునం దిటులు రాగ◊వల్లిక మెఱయన్
గాంతుఁడు కాంతామౌళికి, నెంతయు సంతసము నూన్చె ◊హితనవరతులన్. 137
టీక: కంతుకలాపారగము – కంతుకలా=మన్మథవిద్యయొక్క, పారగము=అంతము నొందినది; అగు స్వాంతమునందున్ =అగునట్టి మనమునందు; ఇటులు=ఈప్రకారముగ; రాగవల్లిక=అనురాగ మను తీవ; మెఱయన్=ప్రకాశింపఁగ; కాంతుఁడు =సుచంద్రుఁడు; కాంతామౌళికి=స్త్రీరత్న మగు చంద్రికకు; ఎంతయున్=మిక్కిలి; హితనవరతులన్=హితమగు నూతన సుర తములచే; సంతసమున్=కుతూహలమును; ఊన్చెన్=చేసెను.
సీ. మంజులాహీనహ◊ర్మ్యప్రదేశంబున, శుచిగరుత్మల్లీలఁ ◊జూచికొనుచుఁ,
గలధౌతమయశైల◊కందరాస్థలుల మ,హానందిహరిలీల ◊లరసికొనుచు,
సుమనోనివాసభా◊సురనగాగ్రములందు, దివ్యసారంగాభ ◊దెలిసికొనుచుఁ,
బుష్కరవీథులఁ ◊బొలుపొందు నేకచ,క్రరథవిస్ఫూర్తిని ◊గాంచికొనుచుఁ,
తే. గమల దైత్యారి శర్వాణి ◊కమలవైరి,ధారి పౌలోమి యుర్వరా◊ధరవిదారి
ఛాయ హరి యన నలరిరి ◊సకలకాల,సముచితాఖేలనంబుల ◊సతియుఁ బతియు. 138
టీక: మంజులాహీనహర్మ్యప్రదేశంబునన్ – మంజుల=మనోజ్ఞమగు, అహీన=శేషుఁడనెడి, హర్మ్యప్రదేశంబునన్=మేడ యొక్క ప్రదేశమునందు; శుచిగరుత్మల్లీలన్ – శుచి=పరిశుద్ధమగు, గరుత్మత్=గరుడునియొక్క, లీలన్=విలాసమును; మంజుల=మనోజ్ఞమగు, అహీన=అధికమగు, హర్మ్యప్రదేశంబునన్=మేడయొక్క ప్రదేశమునందు,శుచి=శుభ్రమగు, గరు త్మత్=కపోతాదిపక్షులయొక్క, లీల నని ప్రకృతార్థము; చూచికొనుచున్=అవలోకించుచు; కలధౌతమయశైలకందరాస్థలులన్ – కలధౌతమయశైల=కైలాసముయొక్క, ‘కలధౌతం రూప్య హేమ్నోః’ అని యమరుఁడు, కందరాస్థలులన్=గుహలయందు; మహానందిహరిలీలలు –మహానంది=అధికమగు వృషభమనెడి, హరి= ఆశ్వముయొక్క, లీలలు=చేష్టలను; అరసికొనుచున్=విచారించుకొనుచు; కలధౌతమయశైల=బంగరుకొండయొక్క, కందరాస్థలులన్= గుహలయందు, మహానందిహరిలీలలు=మిగులనానందము గల చిలుకలయొక్క విలాసము లని ప్రకృతార్థము; సుమనోనివాసభాసురనగాగ్రములందున్ = దేవతాస్థానమగు ప్రకాశమానమగు మేరువుయొక్క అగ్రములందు; దివ్యసారం గాభ – దివ్యసారంగ=ఐరావతముయొక్క, ఆభ=కాంతిని; తెలిసికొనుచున్=తెలియుచు; పుష్పములకు నివాసమై, భాసుర మైన, పర్వతాగ్రములందు, మనోహరమగు, సారంగాభన్=తుమ్మెదకాంతిని, తెలిసికొనుచు నని ప్రకృతార్థము. పుష్కరవీథులన్=ఆకాశమార్గములయందు; పొలుపొందు ఏకచక్రరథవిస్ఫూర్తిని – పొలుపొందు=ఒప్పుచున్న, ఏకచక్రరథ =ఒంటికంటి రథముయొక్క, విస్ఫూర్తిని=ప్రకాశమును; కాంచికొనుచున్=చూచుచు; పుష్కరవీథులన్= జలమార్గముల యందు; పొలుపొందు ఏకచక్రరథవిస్ఫూర్తిని – పొలుపొందు=ఒప్పుచున్న, ఏక=ముఖ్యమగు, చక్ర=జక్కవలయొక్క,రథ =శరీరములయొక్క, విస్ఫూర్తిని=ప్రకాశమును; కాంచికొనుచున్=చూచుచు, అని ప్రకృతార్థము; కమలదైత్యారి =లక్ష్మీనారాయణుఁడు; శర్వాణికమలవైరిధారి=రుద్రాణీరుద్రుఁడు; పౌలోమి ఉర్వరాధరవిదారి=ఇంద్రాణీ ఇంద్రుఁడు; ఛాయ హరి=ఛాయాదేవి సూర్యుఁడు; అనన్=అనునటులు; సతియున్ పతియున్=చంద్రికయు సుచంద్రుఁడును; సకలకాలసముచితాఖేలనంబులన్ – సకలకాల=సమస్తకాలములకు, సముచిత=అనుకూలమగు, ఆఖేలనంబులన్=విహార ములచేత; అలరిరి=సంతసించిరి.
అనఁగ నీచంద్రికాసుచంద్రులు లక్ష్మీనారాయణులో యనునట్లు అహీనహర్మ్యప్రదేశములయందు గరుత్మల్లీల నవలోకించుచు, రుద్రాణీరుద్రులో యనునట్లు కలధౌతశైలకందరములయందు మహానందిహరిలీలలు చూచుచు, ఇంద్రాణీంద్రులో యనునట్లు సుమనోనివాసభాసురనగాగ్రములయందు సారంగాభలఁ దెలిసికొనుచు, ఛాయాదేవీసూర్యులో యనునట్లు పుష్కరవీథుల యందు ఏకచక్రరథవిస్ఫూర్తిని గాంచికొనుచు, సర్వకాలముల కనుకూలములగు విహారములచే సంతసించి రని భావము.
సీ. ఆధరాధిపు యశో◊హరి జగత్తటి వ్రాల, నుడిగె ఘనఘనా◊భ్యుదయలీల,
లామహీభృతుధామ◊ధామనిధిస్ఫూర్తి, ధరఁ దూలె శార్వర◊పరవిభూతి,
యారాజువితరణ◊భూరిభూరిజలాళిఁ, జనె దుర్గదుర్గతి◊శాదపటిమ,
మారసాపతితర◊వారివారిదరేఖ, నడఁగె శాత్రవహంస◊హంసపాళి,
తే. యాసుచంద్రుఁడు ధర్మంబు ◊నాశ్రయించి, నీతి దయివాఱఁ గాంచి య◊నీతి నొంచి
యరిది జగ మెల్లఁ బాలించు ◊నపుడు సకల, జనులు శుభసమ్మదస్ఫూర్తి ◊మనిరి వేడ్క. 139
టీక: ఆధరాధిపు యశోహరి = ఆసుచంద్రునియొక్క యశస్సనెడు సింగము; జగత్తటిన్=జగమను కొండచఱియందు; వ్రాలన్=పడఁగ; ఘనఘనాభ్యుదయలీల – ఘనాఘన=ఘాతుకులను మత్తగజములయొక్క, ‘ఘనాఘనౌ ఘాతుక మత్త దన్తినౌ’ అని విశ్వము, అభ్యుదయ=అభివృద్ధియొక్క, లీలలు=విలాసములు; ఉడిగెన్=ఉపశమించెను; సుచంద్రునియొక్క యశము జగత్తును గప్పుకొనఁగ దుర్మార్గులు నశించి రని భావము.
ఆమహీభృతుధామధామనిధిస్ఫూర్తిన్ – ఆమహీభృతు=ఆసుచంద్రునియొక్క, ధామ=ప్రతాపమనెడు, ధామనిధి=సూర్యుని యొక్క, స్ఫూర్తిన్=ప్రకాశముచేత;ధరన్=పుడమియందు; శార్వరపరవిభూతి – శార్వర=అంధతమస మనెడు ఘాతుకుల యొక్క, పర=ఉత్కృష్టమగు, విభూతి=సంపద; తూలెన్=పడెను. ‘శార్వరం త్వంధతమసి ఘాతుకేతు పుమానయం’ అని హలాయుధుఁడు. సుచంద్రుని ప్రతాపమనెడు రవిప్రకాశముచేత దుష్టులను చీఁకటులు దూలె నని భావము. ఆరాజు వితరణ భూరి భూరి జలాళిన్ – ఆరాజు=ఆసుచంద్రునియొక్క, వితరణ=త్యాగముయొక్క, భూరి=అధికమగు, భూరి=సువర్ణమనెడు, జల =ఉదకముయొక్క, ఆళిన్= శ్రేణిచేత; దుర్గ దుర్గతి శాద పటిమ ము– దుర్గ=పోనలవిగాని, దుర్గతి = దారిద్ర్య మనెడు, శాద=బురదయొక్క, ‘పంకో స్త్రీ శాద కర్దమౌ’ అని యమరుఁడు, పటిమము=సామర్థ్యము;చనెన్=పోయెను. ఆసుచంద్రుని త్యాగసంబంధియగు సువర్ణమనెడు జలముచేత దారిద్ర్య మనెడు బురద నివర్తిల్లె నని భావము. ఆరసాపతి తరవారి వారిద రేఖన్ – ఆరసాపతి=ఆసుచంద్రునియొక్క, తరవారి=కత్తియనెడు, వారిదరేఖన్=మేఘపంక్తిచేత; శాత్రవహంస హంసపాళి –శాత్రవహంస=శత్రుశ్రేష్ఠులనెడు, హంసపాళి=అంచలగుంపు; అడఁగెన్=ఉపశమించెను. సుచంద్రుని యొక్క కత్తి యనెడు మేఘపంక్తిచే శత్రులను హంస లడంగె నని భావము. ఆసుచంద్రుఁడు; ధర్మంబున్=ధర్మమును; ఆశ్రయించి=పొంది; నీతి=రాజనీతిమొదలగు నీతి; దయివాఱన్=అతిశయించు నటులు; కాంచి=పొంది; అనీతిన్=దుర్నీతిని; నొంచి=పోఁగొట్టి; అరిది=చిత్రముగ; జగ మెల్లన్=లోకమంతయు; పాలించు నపుడు=రక్షించునపుడు; సకలజనులు=సమస్తనరులు; శుభసమ్మదస్ఫూర్తిన్=మంగళప్రయుక్తమగు సంతోషాతిశయము చేత; వేడ్కన్=వేడుకచేత; మనిరి=వర్తించిరి.
సుచంద్రుఁడు ధర్మనిష్ఠుఁడై నీతితో జగంబును పాలించుచుండఁగ శుభసంతోషములతో నెల్లపుడు జనులు వర్తించిరని భావము.
క. అని రోమహర్షణాత్మజుఁ, డనఘ మఖండైకచరిత ◊మంతయుఁ దెలుపన్
విని శౌనకాదిమునిచం ,ద్రనికాయము గాంచె నధిక◊తరహర్షంబున్. 140
టీక: అని=పూర్వోక్తప్రకారముగాను; రోమహర్షణాత్మజుఁడు=సూతుఁడు; అనఘము=పాపరహితమై, అఖండైకచరితము –అఖండ=విచ్ఛిత్తిలేనట్టి, ఏక=ముఖ్యమగు, చరితము=సుచంద్రచరితమును; అంతయున్=పూర్ణముగ; తెలుపన్=తెలియఁ జేయఁగ; శౌనకాదిమునిచంద్రనికాయము=శౌనకాదిమునిశ్రేష్ఠులయొక్క సమూహము; విని=విన్నదై; అధికతరహర్షంబున్ =అధికమగు సంతోషమును; కాంచెన్=పొందెను. అనఁగ సూతుండు శౌనకాదిమునుల కెల్ల సుచంద్రచరితంబు వివరింపఁగ నామునులు విని మిక్కిలి సంతసించి రని భావము.
ఆశ్వాసాంతపద్యములు
మ. పరవిద్రావణ! రావణప్రబలహృ◊త్పత్త్రీశ! పత్త్రీశభా
స్వరయానక్రమ! నక్రమర్దనవిధా◊సచ్చక్ర! సచ్చక్రసం
భరణశ్రీధర! శ్రీధరప్రభుమహా◊పర్యంక! పర్యంకదు
స్తరసాళ్వాదన! వాదనప్రమదవ◊త్సత్యాత్మ! సత్యాత్మకా! 141
టీక: పరవిద్రావణ=శత్రువులను పాఱఁదోలెడివాఁడా! రావణప్రబలహృత్పత్త్రీశ – రావణ=రావణాసురునియొక్క, ప్రబల= సామర్థ్యమును, హృత్=హరించిన, పత్త్రీశ=బాణశ్రేష్ఠములుగలవాఁడా! పత్త్రీశభాస్వరయానక్రమ – పత్త్రీశ=గరుత్మంతుఁడను, భాస్వర=ప్రకాశించుచున్న, యాన=వాహనముచేత, క్రమ=సంచారముగలవాఁడా! నక్రమర్దనవిధాసచ్చక్ర – నక్ర=మొసలి యొక్క, మర్దనవిధా=ఖండనవిధియందు, సత్=శ్రేష్ఠమగు, చక్ర=సుదర్శనమను చక్రము గలవాఁడా! సచ్చక్రసంభరణ శ్రీధర – సచ్చక్ర=సత్పురుషసంఘముయొక్క, సంభరణ=పోషించుటయొక్క, శ్రీ=సిరిని, ధర=ధరించినవాఁడా! శ్రీధరప్రభుమహా పర్యంక – శ్రీధరప్రభు=శేషుఁడె, మహాపర్యంక=గొప్పశయ్యగాఁ గలవాఁడా! పర్యంకదుస్తరసాళ్వాదన – పర్యంక=యుద్ధ మందు, దుస్తర=దుస్తరుఁడగు, సాళ్వ=సాళ్వరాజునకు, అదన=అంతకుఁడగువాఁడా! వాదనప్రమదవత్సత్యాత్మ – వాదన= వచనముచేతఁ గలిగిన, ప్రమదవత్=సంతసముగల, సత్యాత్మ=సత్యభామయొక్కహృదయముగల వాఁడా! సత్యాత్మకా= సత్యస్వరూపుఁడా!
క. గణనాతిగాప్తరక్షణ!
క్షణదాంబుజినీకళత్ర◊సారసవైరీ
క్షణ! వృజినకూటతక్షణ!
క్షణఖండితనిర్జరారి◊ఘనసైన్యగణా! 142
టీక: గణనాతిగాప్తరక్షణ – గణనాతిగ=లెక్కకుమీఱిన, ఆప్త=ఇష్టులను, భక్తుల ననుట, రక్షణ=రక్షించువాఁడా! క్షణదాం బుజినీకళత్రసారసవైరీక్షణ – క్షణద=ఉత్సవము నిచ్చెడి, అంబుజినీకళత్ర=సూర్యుఁడు, సారసవైరి=చంద్రుఁడు, ఈక్షణ= నేత్రములుగాఁ గలవాఁడా! వృజినకూటతక్షణ – వృజినకూట=పాపసమూహములను, తక్షణ=ఖండించువాఁడా! క్షణఖండిత నిర్జరారిఘనసైన్యగణా – క్షణ=క్షణమాత్రమందు, ఖండిత=నఱకఁబడిన, నిర్జరారి=రాక్షసులయొక్క, ఘన=అధికమగు, సైన్యగణా=సైన్యవ్యూహముగలవాఁడా!
మాలిని: శకటదనుజభీమా! ◊క్షాళితాఘౌఘనామా!
వికటబకవిరామా! ◊విశ్వసంపూర్ణధామా!
స్వకపరినుతసోమా! ◊శక్రకోటీరధామా!
వికలచరణసీమా! ◊విద్విషద్ధ్వాంతభామా! 143
టీక: శకటదనుజభీమా=శకటాసురునకు భయంకరుఁడగువాఁడా! క్షాళితాఘౌఘనామా – క్షాళిత=పోఁగొట్టఁబడిన, అఘౌఘ= పాపసంఘములుగల, నామా=పేరుగలవాఁడా! వికటబకవిరామా – వికట=దుష్టుఁడగు, బక=బకాసురుని, విరామా=అంతమునొందించినవాఁడా! విశ్వసంపూర్ణధామా – విశ్వ=ప్రపంచమునందు, సంపూర్ణ=నిండిన, ధామా= తేజస్సుగలవాఁడా! స్వకపరినుతసోమా – స్వక=తనచేత, పరినుత=స్తుతింపఁబడిన, సోమా=శంకరుఁడు గలవాడా, లేదా తన్ను స్తుతించిన శంకరుఁడు గలవాఁడా! శక్ర కోటీర ధామావికల చరణసీమా – శక్ర=ఇంద్రునియొక్క, కోటీర=కిరీటము యొక్క, ధామా=కాంతిచేత, అవికల=ఎడఁబాయని, చరణసీమా=పాదప్రదేశము గలవాఁడా! విద్విష ద్ధ్వాంత భామా – విద్విషత్=శత్రువు లనెడు, ధ్వాంత=చీఁకటులకు, భామా=సూర్యునివంటివాఁడా!
గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందు సర్వంబును షష్ఠాశ్వాసము.
గద్యము. ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలుసంస్థాన ప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయసత్పుత్ర
సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్యవ్యాఖ్యయందు సర్వంబును షష్ఠాశ్వాసము.