చంద్రికాపరిణయము – 8. షష్ఠాశ్వాసము

శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము

షష్ఠాశ్వాసము

క. శ్రీమజ్జటప్రోలుపురీ
ధామ! సుధాధామతిగ్మ◊ధామస్ఫూర్జ
త్కోమలనయనద్వయ! యు
ద్దామగుణాభీల! శ్రీమ◊దనగోపాలా! 1

టీక: శ్రీమజ్జటప్రోలుపురీధామ—శ్రీమత్=సంపద్యుక్తమగు, జటప్రోలుపురీ=జటప్రో లనెడు నగరము, ధామ=నివాసముగాఁ గలవాఁడా! సుధాధామ తిగ్మధామ స్ఫూర్జ త్కోమల నయనద్వయ – సుధాధామ=చంద్రుఁడును, తిగ్మధామ=సూర్యుఁడును, స్ఫూర్జత్=ప్రకాశించుచున్న, కోమల=సుందరమైన, నయనద్వయ=కనుదోయిగాఁ గలవాఁడా!ఉద్దామగుణాభీల – ఉద్దామ= ప్రౌఢమైన, గుణ=శౌర్యాదిగుణములచేత, ఆభీల=భయంకరుఁడైనవాఁడా! శ్రీమదనగోపాలా= లక్ష్మీయుక్తుఁడవగు మదన గోపాలస్వామీ! ఈకృతిపతి సంబోధనమునకు ‘చిత్త గింపు’మను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

తే. చిత్తగింపుము శౌనకా ◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ◊ర్షణతనూజుఁ
డలనృపతి రేయి శుభలగ్న ◊మనువుపఱిచి
పురము గయిసేయ శిల్పికో◊త్కరముఁ బనుప. 2

టీక: చిత్తగింపుము = ఆకర్ణింపుము;శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలగు శ్రేష్ఠులగు మునిసంఘమునకు; రోమ హర్షణతనూజుఁడు=సూతుఁడు; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగా; అనున్= పలికెను; అలనృపతి=ఆక్షణదోదయుఁడు; రేయి =రాత్రియందు; శుభలగ్నము=శుభముహూర్తమును; అనువుపఱిచి=అనుకూలింపఁజేసి;పురము=నగరమును; కయిసేయన్ =అలంకరించుటకు;శిల్పికోత్కరమున్=శిల్పిసంఘమును; పనుపన్=ఆజ్ఞాపింపఁగా; దీని కుత్తరపద్యముతో నన్వయము. అనఁగా క్షణదోదయుఁ డారాత్రియందు శుభలగ్నము నిర్ణయించి, పురము నలంకరింప శిల్పుల కాజ్ఞాపించె నని తాత్పర్యము.

సీ. చంద్రవితానముల్ ◊చక్కఁగాఁ దార్చి రా,స్థానాజిరముల సౌ◊ధవ్రజముల,
రామాకృతిశ్రేణిఁ ◊బ్రబలఁ జిత్రించిరి, కురుఁజుల నవమణి◊కుడ్యతటుల,
హరిణకేతుచయంబు ◊వరుసఁ బొందించిరి, సాలాగ్రముల గృహ◊స్తంభతతులఁ,
దోడ్తో నమేరు ల◊ద్భుతముగా నిల్పిరి, రాజవీథికల ద్వా◊రప్రతతుల,
తే. విలసితచ్ఛదగుచ్ఛమం◊డలముఁ బూన్చి, రంగడులఁ దోరణస్రగ్ల◊తాంతరముల
నప్పురంబున సకలదే◊శాధిరాజ,శేఖరులు మెచ్చ నవ్వేళ ◊శిల్పివరులు. 3

టీక: అప్పురంబునన్=ఆనగరమందు; సకలదేశాధిరాజశేఖరులు=సమస్తదేశముల రాజశ్రేష్ఠులు; మెచ్చన్=మెచ్చునటులు; అవ్వేళన్=ఆసమయమందు; శిల్పివరులు=చిత్తరు వ్రాయువారు; చంద్రవితానముల్ – చంద్ర=కర్పూరముయొక్క, వితాన ముల్=సమూహములను; చంద్ర=బంగరుయొక్క,వితానముల్=మేలుకట్లను; వరుసన్=క్రమముగా; ఆస్థానాజిరములన్ = రాజసభలయొక్క చత్వరములందును; సౌధవ్రజములన్= మేడలగుంపులయందును; చక్కఁగాన్=సుందరముగా; తార్చిరి = పొందించిరి; రామాకృతిశ్రేణిన్ – రామాకృతి=స్త్రీప్రతిమలయొక్క, శ్రేణిన్=బంతిని; రామాకృతి=శ్రీరాముని ప్రతిమలయొక్క, శ్రేణిన్= వరు సను; కురుఁజులన్=దూలములమీఁది గుజ్జులయందును; నవమణికుడ్యతటులన్=నవ్యమగు రతనాలగోడలయందును; ప్రబలన్= అతిశయించునటులు; చిత్రించిరి=వ్రాసిరి; హరిణకేతుచయంబు=చంద్రసమూహమును, తెల్లనిటెక్కెములను;వరుసన్=క్రమముగ;సాలాగ్రములన్ – సాల=ప్రాకార ములయొక్క, అగ్రములన్=అగ్రభాగములందును; గృహస్తంభతతులన్ – గృహ=సదనములయొక్క, స్తంభతతులన్= కంబముల గుంపులయందును; పొందించిరి; తోడ్తోన్=వెంటనె; నమేరులు=సురపొన్నలను; తోడ్తోన మేరువులు అనియు విభాగము, మేరువులు=శిఖరమణులను; రాజ వీథికలన్=రాజమార్గములయందును; ద్వారప్రతతులన్=ద్వారములయొక్క సమూహములందును; అద్భుతముగాన్ = వింతగా; నిల్పిరి=ఉంచిరి; విలసితచ్ఛదగుచ్ఛమండలమున్—విలసిత=ప్రకాశించుచున్న, ఛద=వస్త్రములయొక్క,గుచ్ఛ=గుత్తులయొక్క, మండల మున్=సమూహమును; వరుసన్=క్రమముగా; అంగడులన్=మళిగలయందు; తోరణస్రగ్లతాంతరములన్ – తోరణ= బహి ర్ద్వారముయొక్క, స్రగ్లతా=తీవెలవంటిదండలయొక్క, అంతరములన్=మధ్యప్రదేశములయందు; పూన్చిరి= ఉంచిరి.

అనఁగా నాస్థానాజిరములయందు రంగవల్లీరూపముగా కర్పూరచూర్ణమును, సౌధములయందు బంగరుమేలుకట్లను ఉంచి రనియు, కురుఁజులయందు, కుడ్యములయందు స్త్రీప్రతిమలను, దాశరథిప్రతిమలను క్రమముగ వ్రాసిరనియు, కోటగోడల యందును, కంబములయందును చంద్రబింబములను, తెల్లనిటెక్కెములను క్రమముగ నుంచి రనియు, రాజవీథులయందు సుర పొన్నలను, ద్వారములయందు మేరువులను నుంచి రనియు, మలిగలయందు వస్త్రములను, తోరణములయందు పర్ణగుచ్ఛ ములను గట్టి రనియుఁ, జూపఱులెల్ల మెచ్చునట్లు అలంకరించి రనియు భావము.

మ. అలఘుస్వర్ణసుచేలకాప్తి ఘనము◊క్తాళీసమాసక్తి ను
జ్జ్వలపద్మోద్ధృతి వైజయంత్యభియుతిన్ ◊సంధించి యప్పట్టునన్
బలునేర్పు ల్మన శిల్పిరాజి ఘటియిం◊పం బొల్చె నెంతేఁ గురుం
జులచా లచ్యుతరూపవైభవమునన్ ◊సొంపొంది తద్వీథులన్. 4

టీక: అప్పట్టునన్=ఆకాలమునందు; తద్వీథులన్=ఆనగరవీథులయందు; కురుంజులచాలు=గుజ్జులబంతి; శిల్పిరాజి = చిత్తరువు వ్రాయువారియొక్క శ్రేణి; అలఘుస్వర్ణసుచేలకాప్తిన్ – అలఘు=అధికములగు, స్వర్ణ=బంగరుయొక్క, సుచేలక= సమీచీనమగు వలిపెములయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; పీతాంబరముయొక్క యని విష్ణుపరమైన యర్థము; ఘనముక్తావళీ సమాసక్తిన్ –ఘన= గొప్పవయిన, ముక్తా=ముత్యములయొక్క, ఆళీ=శ్రేణియొక్క, సమాసక్తిన్=సంబంధముచేతను; గొప్పవారలగు ముక్తులయొక్క సమూహముయొక్క సంబంధముచేత నని విష్ణుపరమైన యర్థము; ఉజ్జ్వలపద్మో ద్ధృతిన్ –ఉజ్జ్వలపద్మా=శృంగారలక్ష్మియొక్క, ఉద్ధృతిన్=ధారణముచేతను, ప్రసిద్ధశ్రీదేవీధారణముచేత నని విష్ణుపరమైన యర్థము; వైజయంత్యభియుతిన్ – వైజయంతీ=టెక్కె ములయొక్క, అభియుతిన్= సంబంధముచేతను; వైజయంతీ=వనమాలయొక్క, అభియుతిన్ = సంబంధముచేత నని విష్ణుపర మైన యర్థము; సంధించి=కలిగించి; పలునేర్పుల్ =పలువిధములైన జాణతన ములు; మనన్= అతిశయిల్లునట్లు; ఘటియింపన్= నిర్మింపఁగా; అచ్యుతరూపవైభవమునన్ –అచ్యుత=నాశములేని, రూప= శుక్లాదిరూపములయొక్క, వైభవమునన్=అతిశయము చేత; అచ్యుతరూప= విష్ణుమూర్తిస్వరూపముయొక్క, వైభవముచేత నని యర్థాంతరము; సొంపొంది=చెలువు వహించి; ఎంతేన్= మిక్కిలి; పొల్చెన్= ప్రకాశించెను.

అనఁగా నీకురుఁజులచాలు స్వర్ణసుచేలకాదులచే నచ్యుతునిరూపవైభవము నంది విలసిల్లె నని భావము.

చ. సరససుధాప్లుతంబు లగు ◊చక్కనిగోడల శిల్పిరాజి భా
స్వరకనకద్రవప్రతతి ◊వ్రాసినచిత్రపుబొమ్మ లొప్పెఁ ద
త్పరిణయరీతిఁ గాంచ వడిఁ ◊బాటులఁ జేరి వధూటికాసము
త్కరశుభగీతిఁ జొక్కి సుర◊కాంతలు నైశ్చలి నిల్చిరో యనన్. 5

టీక: శిల్పిరాజి =శిల్పకారసమూహము; సరససుధాప్లుతంబులు – సరస=శ్రేష్ఠమైన, సుధా=సున్నముచేత, ఆప్లుతంబులు = తడుపఁబడినవి; అగు చక్కనిగోడలన్=అయినట్టి సుందరములగు కుడ్యములయందు; భాస్వర కనకద్రవ ప్రతతిన్ – భాస్వర= ప్రకాశించుచున్న,కనకద్రవ=బంగరునీరుయొక్క,ప్రతతిన్=సమూహముచే; వ్రాసినచిత్రపుబొమ్మలు= లిఖించిన విచిత్రములగు బొమ్మలు; తత్పరిణయరీతిన్ – తత్=ఆచంద్రికాసుచంద్రులయొక్క, పరిణయరీతిన్=వివాహభంగిని; కాంచన్=చూచుటకు; వడిన్=వేగముచేత; పాటులన్=శ్రమములచే; చేరి=వచ్చి; వధూటికాసముత్కరశుభగీతిన్ – వధూటికా=స్త్రీలయొక్క, సము త్కర =సమూహముయొక్క, శుభగీతిన్=మంగళకరమగు గానముచేత; చొక్కి= పర వశించి; సురకాంతలు=దేవాంగనలు; నైశ్చలిన్ =నిశ్చలత్వముచేత; నిల్చిరో యనన్=నిలుచుండిరో యనునట్లు; ఒప్పెన్ =ప్రకాశించెను.

అనఁగా సున్నముఁ బూసి యున్నగోడలయందుఁ జిత్తరువు వ్రాయువారు బంగరునీటితో వ్రాసినబొమ్మలు, ఆవివాహ మహోత్సవమును జూచుటకై యతివేగముతోఁ జేరుటచే శ్రమనొంది, అచ్చటి యైదువల మంగళగానముచేఁ బరవశించి చలన రహితులై నిల్చియున్న దేవాంగనలో యన్నటులు ప్రకాశించె నని భావము. చిత్తరువునం దుండుబొమ్మలను సురకాంతలుగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.

మ. తళుకుం బంగరుకుచ్చుడాలు నవసం◊ధ్య న్నీలగుచ్ఛప్రభా
వళి యిర్లన్ సుమదామదీధితి యుడు◊వ్రాతంబుల న్వజ్రకుం
భలసచ్ఛాయ సితాంశుదీప్తి నిగిడిం◊ప న్శిల్పికు ల్దార్చు మే
రులు ధాత్రిం గన నద్భుతంబె క్షణదా◊రూఢి న్విజృంభించుటల్. 6

టీక: శిల్పికులు=శిల్పులు; తార్చుమేరులు –తార్చు=కదియించునట్టి, మేరులు=ద్వారములమీఁద నుండుకలశములు; ధాత్రిన్= భూమియందు; కనన్=చూడఁగా; తళుకుంబంగరుకుచ్చుడాలు=ప్రకాశించుచున్న బంగరుగుత్తులకాంతి; నవ సంధ్యన్ – నవ= నూతనమగు, సంధ్యన్=సంజను; నీల గుచ్ఛ ప్రభావళి – నీల=ఇంద్రనీలమణులయొక్క, గుచ్ఛ= స్తబక ములయొక్క, ప్రభావళి= కాంతిశ్రేణి; ఇర్లన్=చీఁకట్లను; సుమదామదీధితి=పూసరములయొక్క కాంతి; ఉడువ్రాతంబులన్= రిక్కలగుంపులను; వజ్రకుంభ లసచ్ఛాయ – వజ్రకుంభ=రవలకుండలయొక్క,లసచ్ఛాయ=ప్రకాశించుకాంతి; సితాంశుదీప్తిన్ =చంద్రకాంతిని, వెన్నెల ననుట; నిగిడింపన్=విజృంభింపఁజేయఁగా; క్షణదారూఢిన్—క్షణ=ఉత్సవములను, ద= ఇచ్చునట్టి, ఆరూఢిన్= రూఢిచేత; రాత్రి యొక్క రూఢిచేత నని దోఁచుచున్నది; విజృంభించుటల్=అతిశయించుటలు; అద్భుతంబె= ఆశ్చర్యమా? కాదనుట. అనఁగా బంగరుగుచ్ఛములయొక్క ఎఱ్ఱనికాంతి సంధ్యాకాలమును జేయఁగా, ఇంద్రనీలమణికాంతి తిమిరకదంబమును జేయుచుండఁగా, పూదండలకాంతి నక్షత్రపుంజములను జేయుచుండఁగా, వజ్రకుంభకాంతి వెన్నెలను జేయుచుండఁగా, నీ శిల్పులు రచియించిన మేరులు క్షణదారూఢిచే విజృంభించుట చిత్రము గాదని తాత్పర్యము.

చ. కువలయరాజచక్రములకుం ◊బెనువేడుక సంఘటించుకాం
తివితతి మించ శిల్పికులు ◊దీర్చిన నూతనచంద్రసూర్యకో
టి వెలిఁగె ధూపకైతవప◊టిష్ఠతమస్తతి గాంచి యోర్వ మం
చవనికిఁ జేరు నైకవపు◊రాత్తతమీశదినేశులో యనన్. 7

టీక: కువలయరాజచక్రములకున్ – కువలయ=భూవలయమందుండు, రాజచక్రములకున్=నృపసంఘములకు; కువలయ= కలువలకు, రాజ=ఒప్పుచున్న,చక్రములకున్=చక్రవాకములకు; పెనువేడుకన్=మిక్కిలి సంతసమును; సంఘటించు కాంతి వితతిన్ – సంఘటించు=ఘటిల్లఁజేయునట్టి, కాంతివితతిన్=కాంతిపుంజముచేత; మించన్= అతిశయించునట్లు; శిల్పికులు = శిల్పకారులు; తీర్చిన నూతనచంద్రసూర్యకోటి – తీర్చిన=దిద్దిన, నూతన=నవీనమైన, చంద్రసూర్య=చంద్రసూర్యులయొక్క, కోటి=సమూహము; ధూపకైతవపటిష్ఠతమస్తతిన్ – ధూప=అగరుధూపమనెడు, కైతవ =వ్యాజముగల, పటిష్ఠ=అధికమైన, తమస్తతిన్=చీఁకటిగుంపును; కాంచి=చూచి; ఓర్వ మంచున్=సహింప మనుచు; అవనికిన్=భూమికి; చేరు నైకవపు రాత్త తమీశ దినేశులో యనన్ – చేరు=సమీపించిన, నైకవపుః=అనేకశరీరములను, ఇచట నశబ్దముతో సమాసము అని తెలియ వలెను, ఆత్త =పొందిన, తమీశ దినేశులో=చంద్రసూర్యులో యనునట్లు; వెలిఁగెన్ =ప్రకాశించెను.

శిల్పకారులు చిత్తరువందు వ్రాసిన చంద్రసూర్యులు, ఈపురమందు అగరుధూప మనెడి గాంఢాంధకారమును చూచి సహిం పక పుడమిఁ జేరినట్టి ప్రసిద్ధచంద్రసూర్యులో యనునట్లు ప్రకాశించిరని భావము. చిత్రగతచంద్రసూర్యబింబములను ప్రసిద్ధచంద్ర సూర్యులనుగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.

చ. ధరణిజనంబు మెచ్చఁగ ము◊దంబున శిల్పికులంబు చిత్రవై
ఖరిఁ గయిసేయ నప్డలరెఁ ◊గన్గొన నంచితవైజయంతయై
పరిభృతచిత్రరేఖయయి ◊భవ్యమహాసుమనోవితానభా
స్వరయయి దృశ్యరంభయయి ◊చక్కఁగ నప్పురి వేల్పువీఁ డనన్. 8

టీక: ధరణిన్=భూమియందు; జనంబు=లోకము; మెచ్చఁగన్=పొగడునటులు; ముదంబునన్=సంతసముచేత; శిల్పికులంబు = శిల్పకారుల బృందము; చిత్రవైఖరిన్=విచిత్రరీతిగా; కయిసేయన్=అలంకరింపఁగా; అప్డు=ఆసమయమందు; అప్పురి= ఆపత్తనము; అంచిత వైజయంత యై – అంచిత=ఒప్పుచున్న, వైజయంతయై=ఇంద్రునిమేడగలదై; ధ్వజములు గలదై యని స్వభావా ర్థము; పరిభృత చిత్రరేఖ యయి=భరింపఁబడిన చిత్రరేఖ యను దేవాంగన గలదియై, విచిత్రమగు గీఱలు గలదియై యని స్వభావార్థము; భవ్య మహా సుమనోవితాన భాస్వర యయి – భవ్య=మనోజ్ఞమగు, మహత్=అధిక మగు, సుమనో వితాన=దేవసంఘముచేత, భాస్వర యయి =ప్రకాశించినదియై; సుమనోవితాన=పుష్పసమూహముచేతఁ గాని, లేదా, విద్వ ద్బృందముచేతఁ గాని, అని స్వభావార్థము; దృశ్య రంభ యయి – దృశ్య=కనఁబడుచున్న, రంభ యయి = రంభయను దేవాంగన గలదియై, అనటులు గలదై యని స్వభావార్థము; కన్గొనన్=చూడఁగా; చక్కఁగన్= బాగుగా; వేల్పువీఁడనన్= స్వర్గపురియగు నమరావతియో యను నటులు; అలరెన్=ప్రకాశించెను. శిల్పు లలంకరింపఁగా నీపురము వైజయంతరంభా చిత్రరేఖాదులతోఁ గూడి యున్నందున నమరావతి యనునట్లు ప్రకాశించె నని భావము.

మ. ప్రసవస్రక్పరివీతయై పరికన◊త్పాటీరకాశ్మీరగం
ధసముల్లిప్తపయోధరాధ్వయయి నూ◊త్నస్వర్ణచేలాప్తయై
పొసఁగెం దన్నగరీలలామ యపు డొ◊ప్పు ల్మీఱఁ దన్గాంచుమా
త్ర సముత్థాతనుసంభ్రమస్ఫురణ గో◊త్రాలోకము ల్దోపఁగన్. 9

టీక: ప్రసవస్రక్పరివీతయై – ప్రసవస్రక్=పుష్పమాలికలచేత, పరివీతయై=చుట్టఁబడినదియై; పరికన త్పాటీర కాశ్మీర గంధ సముల్లిప్త పయోధ రాధ్వ యయి – పరికనత్=ప్రకాశించుచున్న,పాటీర=చందనముయొక్క, కాశ్మీర=కుంకుమముయొక్క, గంధ=పరిమళముచేత, సముల్లిప్త=పూయఁబడిన,పయోధరాధ్వయయి=ఆకాశముగలదై, స్తనమార్గము గలది యై యని యర్థాంతరము; నూత్న స్వర్ణచే లాప్తయై – నూత్న=నవీనమైన, స్వర్ణచేల=బంగారువస్త్రమును, ఆప్తయై=కూడినదియై; తన్న గరీలలామ=ఆపురవరము, ఇందు స్త్రీత్వనిర్దేశముచేత నొకస్త్రీ యని తోఁచుచున్నది; అపుడు=ఆవేళయందు; ఒప్పుల్మీఱన్ = ఒప్పిదములు మీఱునటులు; తన్గాంచుమాత్రన్=తన్నుఁ జూచినంతమాత్రముననే; సము త్థాతను సంభ్రమ స్ఫురణన్ – సముత్థ= ఉదయించిన, అతను=అధికమైన,సంభ్రమ=సంతోషముయొక్క,స్ఫురణన్=ఆవిర్భావముచేత; అతను=మన్మథునియొక్క, సంభ్రమ=వేగముయొక్క,స్ఫురణన్=ఆవిర్భావముచేత అని తోఁచుచున్నది; గోత్రాలోకముల్=భూమియందలి జనులు; తోపఁగన్=తోఁచుచుండఁగా; పొసఁగెన్=ఒప్పెను. అనఁగా నగరీలలామ హారములచేఁ జుట్టఁబడినదనియు, పాటీరకాశ్మీరాది పరిమళద్రవ్యములయొక్క గంధముచేఁ బూయఁ బడిన గగనమార్గము గలదనియుఁ, దన్నుఁ జూచినమాత్రమున అధికసంభ్రమ మును గలిగించుచున్న దనియు భావము. పటీరాదు లచేఁ బూయఁబడిన స్తనమార్గముగలది యనియు, మన్మథసంభ్రమమును నుత్పాదించుచున్నదనియు స్త్రీపరమైనయర్థమందు భావము.

చ. తొడిఁబడి దిక్ప్రతీరములఁ ◊దూల్చుచు నద్రిబిలాంతరంబులన్
సుడిగొనుచున్ ధరిత్రిఁ గల◊చోటుల ముంచుచు నభ్రపద్ధతిం
దొడరి తరంగితం బగుచు ◊దుస్తరవర్తనమై మెలంగె న
ప్పుడు పురి భద్రవాద్యకుల◊భూరిరవౌఘము చిత్రవైఖరిన్. 10

టీక: అప్పుడు=ఆసమయమందు; పురిన్=నగరమందు; భద్రవాద్యకులభూరిరవౌఘము – భద్రవాద్య=మంగళవాద్యముల యొక్క, కుల=సమూహముయొక్క,భూరి=అధికమగు,రవౌఘము=ధ్వనిప్రవాహము; తొడిఁబడి=తొట్రుబడి; దిక్ప్రతీర ములన్=దిక్తటములను; తూల్చుచున్=తూలఁజేయుచు;అద్రిబిలాంతరంబులన్=పర్వతగుహామధ్యప్రదేశములయందు; సుడిగొనుచున్=తిరుగుడువడుచు; ధరిత్రిఁ గలచోటులన్=భూమియందుఁ గల ప్రదేశములను; ముంచుచున్=మునుఁగఁ జేయుచు; అభ్రపద్ధతిన్=ఆకాశమార్గమునందు;తొడరి=పూని;తరంగితం బగుచున్=సంజాతతరంగములుగలదై; దుస్తర వర్తనమై = దాఁట నలవిగాని వ్యాపారముగలదై; చిత్రవైఖరిన్=విచిత్రరీతిగా; మెలంగెన్=వర్తించెను.

అనఁగా భద్రవాద్యధ్వనులయొక్క సమూహములు దిక్తటములను భేదించుచుఁ, బర్వతగుహామధ్యప్రదేశములయందు సుడివడుచుఁ, బుడమి నెల్లఁ గప్పుకొని మిన్నంటి ప్రకాశించె నని వాద్యధ్వనుల పరమైన భావము. దిగంతములవఱకు విస్త రించి పర్వతగుహలను జలములచే నించుచు నావర్తములను గ్రహించుచు భూప్రదేశముల నించుచు తరంగములు గలదై జలప్రవాహ మొప్పు నని ప్రవాహపరమైన యర్థము. ప్రకృతాప్రకృతముల కౌపమ్యము గమ్యము.

మ. అనఘంబై సుమనోనికాయసముదా◊రామోదసంవర్ధకం
బునునై శోభితనైకరాగయుతమై ◊ప్రోద్యత్సువర్ణాఢ్యమై
ఘనమధ్వభ్యుదయంబు దెల్పు గిరిజా◊కల్యాణ మప్పట్టునన్
వినతాంగీనికరంబు వాడెఁ గలకం◊ఠీకంఠనాదోపమన్. 11

టీక: అనఘంబై=శ్రావ్యమై, రమ్యమై యని ఆమనిపరమైన యర్థము; సుమనోనికాయ సముదా రామోద సంవర్ధకంబునునై – సుమనోనికాయ=విద్వద్బృందముయొక్క, సముదార=ఉత్కృష్టమగు, ఆమోద=సంతసమునకు, సంవర్ధకంబునునై = వృద్ధి కరమైనదై; సుమనోనికాయ=పుష్పసమూహముయొక్క, సముదార=ఉత్కృష్టమగు, ఆమోద=పరిమళమునకు, సంవర్ధ కంబునునై=వృద్ధికరమయి అని ఆమనిపరమైన యర్థము; శోభిత నైక రాగ యుతమై – శోభిత=ప్రకాశింపఁజేయఁబడిన, నైక= అనేకము లగు, ఇచట నశబ్దముతో సమాసమని యెఱుంగునది, రాగ=భైరవి, తోడి మొదలగు రాగములతో, యుతమై= కూడిన దై; శోభిత= ప్రకాశింపఁజేయఁబడిన, నైక=అనేకములగు, రాగ=పల్లవాద్యారుణ్యములతో, యుతమై= కూడినదై, అని ఆమని పరమైన యర్థము; ప్రోద్య త్సువర్ణాఢ్యమై – ప్రోద్యత్=ప్రకాశించుచున్న, సువర్ణ=శ్రేష్ఠములగు తాన వర్ణచౌకవర్ణాదులచే, ఆఢ్యమై=ఒప్పిన దయి; సువర్ణ=సంపెఁగపూవులచేత, ఒప్పిదమై యని యామనిపరమైన యర్థము; ఘన మధ్వభ్యుదయంబు దెల్పు గిరిజా కల్యాణము – ఘన=అధికమగు, మధు=మాధుర్యముయొక్క, అభ్యుదయంబు = సమృద్ధిని, తెల్పు= తెలియఁ జేయుచున్న, గిరిజాకల్యాణము=గౌరీకల్యాణము; ఘన=అధికమగు, మధు=ఆమనియొక్క, అభ్యుదయంబు = సమృద్ధిని, తెల్పు=తెలియఁజేయు చున్న, గిరిజాకల్యాణ మని ఆమనిపరమైన యర్థము; అప్పట్టునన్ = ఆస్థలమందు; వినతాంగీనిక రంబు=స్త్రీకదంబము; కలకంఠీ కంఠనాదోపమన్—కలకంఠీ=కోయిలలయొక్క, కంఠనాద= గళధ్వనితో, ఉపమన్= సామ్యముచేత; పాడెన్=పాడెను. అనఁగా నపస్వరాదిదోషములు లేక విద్వాంసులకు నానందజనకముగ ననేకవిధములగు రాగములతోను, అనేకవర్ణాదులతోనుం గూడి మధురమగు గౌరీకల్యాణమును స్త్రీలు పాడిరని భావము.

ఉ. ఆయెడ గౌరిపంపున సు◊రాంబుజనేత్ర లఖండహార్దధా
రాయతి వెల్లి మీఱఁ దల◊యంటఁగ మజ్జన మాచరింపఁ గై
సేయఁగఁ జంద్రికావనితఁ ◊జేరిరి నవ్యఫలాక్షతాదికం
బాయతహేమపాత్రనిచ◊యంబులఁ బూని రయంబు మీఱఁగన్. 12

టీక: ఆయెడన్=ఆసమయమందు; గౌరిపంపునన్=పార్వతీదేవియొక్క యాజ్ఞచేతను; సురాంబుజనేత్రలు=దేవాంగనలు; అఖండ హార్దధా రాయతి – అఖండ=ఎడతెగని,హార్దధారా=ప్రేమధారయొక్క, ఆయతి=అతిశయము; వెల్లి మీఱన్=మేర మీఱఁగా; తల యంటఁగన్=తలయంటుటకును; మజ్జన మాచరింపన్=స్నానముఁ జేయించుటకును; కైసేయఁగన్=అలంక రించుటకును; ఆయత హేమపాత్ర నిచయంబులన్ – ఆయత=విశాలమగు, హేమపాత్ర=సువర్ణపాత్రలయొక్క, నిచయంబు లన్= సమూహములందు; నవ్యఫలాక్షతాదికంబు – నవ్య=నూతనమగు, ఫల=పండ్లు, అక్షత=అక్షతలు, ఆదికంబు= మొదలుగాఁగలవానిని; పూని= గ్రహించి; రయంబు మీఱఁగన్=వేగిరముగా; చంద్రికావనితన్=చంద్రికను; చేరిరి=పొందిరి.

పార్వతీదేవియానతిచేఁ గొందఱు దేవాంగనలు బంగరుపాత్రలయందు ఫలాక్షత లుంచుకొని తలయంటుటకు, తానము చేయించుటకు,అలంకరించుటకు, చంద్రికను జేరి రని భావము.

శా. ఆనారీమణు లంత శోభనవిత◊ర్ద్యగ్రస్థలిన్ స్యూతర
త్నానీకం బగుపెండ్లిపీఁట నిడి యం◊దాభూపకన్యామణి
న్వ్యానమ్రాననచంద్ర నుంచి శిర సం◊టం జేరి రింపెచ్చ ‘శో
భానేశోభనమే’ యటంచు విబుధా◊బ్జాతాననల్ పాడఁగన్. 13

టీక: అంతన్=అంతట; ఆనారీమణులు=ఆస్త్రీలు; శోభనవితర్ద్యగ్రస్థలిన్ –శోభనవితర్ది=మంగళకరమగు వివాహవేదికయొక్క, అగ్రస్థలిన్= పై భాగమునందు; స్యూతరత్నానీకంబు=చెక్కఁబడిన రత్నసమూహములు గలది; అగుపెండ్లి పీఁటన్ =అయినట్టి పెండ్లిపీఁటను; ఇడి= ఉంచి; అందున్=దానియందు; వ్యానమ్రాననచంద్రన్ – వ్యానమ్ర=వంగిన, ఆననచంద్రన్=చంద్రునివంటి ముఖముగల; ఆభూప కన్యామణిన్=ఆరాజపుత్త్రీరత్నమగు చంద్రికను; ఉంచి=కూర్చుండఁబెట్టి; శోభానేశోభనమే అటంచున్ = శోభానేశోభనమే యనుచు; విబుధాబ్జాతాననల్=దేవాంగనలు; పాడఁగన్=పాడుచుండఁగా; ఇంపెచ్చగన్=సొంపు అతిశ యింపఁగ; శిరసంటన్ = తలయంటుటకు; చేరిరి=పొందిరి.

అనఁగా నామీఁద సురాంగనలు వివాహవేదికయందుఁ బెండ్లిపీఁట నుంచి, దానియందుఁ జంద్రికం గూర్చుండఁబెట్టి, శోభనగీతములు పాడుచుఁ దలయంట నుద్యమించి రని భావము.

సీ. సొగ సెచ్చ నీధరే◊శునిపట్టి తలయంటఁ, దగు నీకళానిధి◊దంట యనుచు,
నీకంజకర కభి◊షేకంబు సవరింప, నీసుమనోదంతి ◊యెఱుఁగు ననుచు,
నలువుగా నీకొమ్మ◊నలుఁగు గావింప నీ,సురభిచరిత్ర నే◊ర్పరి యటంచు,
మహితాళి యివ్వేళ ◊మసలఁగా నేటికే, యీశ్యామ సేవ కీ◊వేగు మనుచు,

తే. సరసముగ నీగతులఁ బర◊స్పరము పలికి,కొనుచు నారార్తికంబు లొ◊య్యన నొసంగి
వీడియం బంజలి ఘటించి ◊వేడ్కమీఱఁ, మదిరలోచన శిర సంటఁ ◊గదిసి రపుడు. 14

టీక: సొగ సెచ్చన్=అందమతిశయించునటులు; ఈధరేశునిపట్టి తలయంటన్ – ఈధరేశునిపట్టి=ఈక్షణదోదయుని కూఁతు రగు చంద్రికయొక్క, తలయంటన్=తలయంటుటకు;ఈకళానిధిదంట=విద్యానిధియగు నీకాంత;తగున్=ఒప్పును; అనుచున్=ఇట్లు పల్కుచు; ఇచట, ఈధరేశునిపట్టి తలయంటన్=ఈపార్వతితల యంటుటకు, ఈకలానిధి= ఈ చంద్రుఁడు దంట యను నర్థము దోఁచుచున్నది;
ఈకంజకరకున్ =పద్మములవంటిచేతులుగల నీచంద్రికకు; అభిషేకంబు=స్నానమును; సవరింపన్=అనుకూలపఱచుటకు; ఈసుమనోదంతి=జాజిమొగ్గలవంటి దంతములుగల యీకాంత; ఎఱుఁగున్=తెలియును; అనుచున్=ఈరీతిగాఁ బల్కుచు; ఇచట, కంజకరకున్=లక్ష్మీదేవికి, అభిషేకంబు సవరింపన్, ఈసుమనోదంతి=ఈదేవగజము, ఎఱుఁగు నను నర్థము దోఁచు చున్నది; నలువుగాన్=ఒప్పిదముగా; ఈకొమ్మ నలుఁగు గావింపన్=ఈచంద్రికకు నలుఁగుఁ బెట్టుటకు; ఈసురభిచరిత్ర=ఈపతివ్రత; నేర్పరి=జాణతనము గలది; అటంచున్=ఈరీతిగాఁ బలుకుచు; ఇచట, ఈకొమ్మ నలుఁగు గావింపన్=ఈశాఖకు నలుఁగుఁ బెట్టుటకు, ఈసురభిచరిత్ర=ఈవసంతచరితము, నేర్పరి యను నర్థము దోఁచుచున్నది; మహితాళి=పూజ్యవగు చెలీ! ఈవు=నీవు; ఇవ్వేళన్=ఈసమయమందు; మసలఁగాన్=తడయఁగా; ఏటికే=ఎందుకే? తడవు సేయనేల యని తాత్పర్యము; ఈశ్యామ సేవకున్=ఈచంద్రికసేవకు; ఏగుము=పొమ్ము; అనుచున్=ఈప్రకారముగాఁ బలు కుచు; ఇచట, మహితాళి=మహితమగు తుమ్మెదా! మసలఁగా నేటికే, ఈవు=నీవు; ఇవ్వేళన్=ఈసమయమందు; ఈశ్యామ సేవకున్= ఈప్రేంకణపుతీవసేవకు; ఏగు మను నర్థము దోఁచుచున్నది; ఈగతులన్=ఈరీతులచే; సరసముగన్=రసయుక్తమగునటులు; పరస్పరము=ఒండొరులనుగూర్చి; పలికికొనుచున్ = సంభాషించుకొనుచు; ఆరార్తికంబులు= ఆరతులను; ఒయ్యనన్=తిన్నగా; ఒసంగి=ఇచ్చి; అంజలిన్=దోసిలియందు; వీడియంబు=తాంబూలమును; ఘటించి=ఉంచి; వేడ్కమీఱన్=వేడుకమించునటులు; మదిరలోచన శిర సంటన్=చంద్రికతల యంటుటకు; అపుడు=ఆసమయమందు; కదిసిరి=దగ్గఱవచ్చిరి.

అనఁగా నీకాంత కలానిధి గాన ధరేశునిపట్టి తలయంటుటకుఁ దగు ననియు, నీచంద్రిక కంజకర గాన నీపెకు నభిషేక మొన రింప సుమనోదంతి తగు ననియు, ఈకొమ్మకు నలుఁగుఁ బెట్టుటకు నీసురభిచరిత్ర తగిన దనియు, మహితాళి గాన నిది శ్యామ యొక్క సేవకు సరియయిన దనియు, నొండొరులు సరసోక్తులాడుకొనుచు హారతు లిచ్చి, యంజలియందు తాంబూలము ఘటించి, చంద్రిక తలయంటఁ బోయి రని భావము.

చ. కురు లర వీడ దివ్యమణి◊కుండలరోచులు గండభాగభా
ఝరముల నోలలాడఁ గుచ◊శైలయుగంబున ఘర్మవాఃకణో
త్కరములు గూడ మధ్యమప◊థం బసియాడ ముదంబుతోడఁ జా
తురిఁ దగు నొక్కప్రోడ యల◊తొయ్యలికిన్ శిర సంటె నూనియన్. 15

టీక: కురులు=ముంగురులు; అర వీడన్=సగము జాఱఁగా; దివ్యమణికుండలరోచులు – దివ్య=మనోజ్ఞమగు, మణికుండల = మణిమయములగు కుండలములయొక్క, రోచులు = కాంతులు; గండభాగ భా ఝరములన్ – గండభాగ=గండస్థలముల యొక్క, భా=కాంతియనెడు,ఝరములన్=ప్రవాహములయందు; ఓలలాడన్=మునుఁగుచుండఁగా; కుచశైల యుగంబునన్ = పర్వతములవంటి పాలిండ్లయొక్క జంటయందు; ఘర్మవాఃకణోత్కరములు =చెమటబిందువుల బృందములు; కూడన్= చేరఁగా; మధ్యమపథంబు=కౌను; అసియాడన్=చలింపఁగా; ముదంబుతోడన్=సంతోషముచేత; చాతురిన్=చాతుర్యముచేత; తగు=ఒప్పునట్టి; ఒక్కప్రోడ=ఒకప్రౌఢాంగన; అలతొయ్యలికిన్=ఆచంద్రికకు; నూనియన్=నూనెచేత;శిరసంటెన్=తల యంటెను.

ఉ. భాసురరక్తిమైఁ గలమ◊పాళికఁ గుందెన నించి కంకణౌ
ఘాసమనిస్వనాళి వెల◊యంగ నయోగ్రము లూని ‘సువ్విసు
వ్వీ సువి సువ్వి లాలి’ యని ◊వింతగఁ బాడుచు దంచి పుణ్యగో
త్రాసురకామినుల్ సతిశి◊రంబున సుంకులు చల్లి రత్తఱిన్. 16

టీక: అత్తఱిన్=ఆసమయమందు; పుణ్యగోత్రాసురకామినుల్ – పుణ్య=పవిత్రలగు, గోత్రాసురకామినుల్=భూసురకాంతలు; భాసురరక్తిమైన్—భాసుర=ప్రకాశించు, రక్తిమైన్=అనురాగముచేత; కుందెనన్=కుందెనయందు; కలమపాళికన్=వడ్లను; నించి=పూరించి; కంకణౌఘాసమనిస్వనాళి – కంకణ=కంకణములయొక్క, ఓఘ=బృందముయొక్క,అసమ=సాటిలేని, నిస్వన=ధ్వనులయొక్క, ఆళి=సమూహము; వెలయంగన్=ప్రకాశింపఁగా; అయోగ్రములు=రోకళ్ళను, ‘అయోగ్రం ముసలో స్త్రీ స్యాత్’ అని యమరుఁడు; ఊని=గ్రహించి; సువ్విసువ్వీ సువి సువ్వి లాలి యని; వింతగన్=చిత్రముగ; పాడుచున్; దంచి; సతిశిరంబునన్=చంద్రికతలయందు; సుంకులు=సుంకువడ్లను; చల్లిరి=ఉంచిరి. అనఁగాఁ జంద్రికను గూర్చుండఁ బెట్టి విప్రస్త్రీలు కుందెనకు వడ్లు నించి, దంచి, చంద్రికయొక్క శిరమందు సుంకులు చెరిగి రని తాత్పర్యము.

క. బాలామణి యపు డొకచెలి, కైలా గొసఁగం దమీశ◊కాంతామయపయ
శ్శాలాంతర మెనసె మరు,త్కాలాహికచాలలామ◊కములు భజింపన్. 17

టీక: అపుడు=ఆసమయమునందు;బాలామణి=చంద్రిక; ఒకచెలి=ఒకసకియ; కైలా గొసఁగన్=హస్తావలంబము నీయఁగా; తమీశకాంతామయ పయశ్శా లాంతరము – తమీశకాంతామయ=చంద్రకాంతశిలామయమగు, పయశ్శాలా=నీళ్ళయింటి యొక్క, అంతరము=మధ్యమును; మరుత్కాలాహికచాలలామకములు=ఉత్తమదేవాంగలు; భజింపన్=సేవించుచుండఁగా; ఎనసెన్=పొందెను;

చ. నెలజిగిభీతి నిర్లు ధర◊ణీధరకందరఁ దజ్జయాప్తికై
బలుతప మూన్చి కైశ్యగతి ◊బాగుగఁ బుట్టఁగ జ్యోత్స్నికాదనా
కలనము నేర్ప వాని లలిఁ ◊గైకొని మేపుపురాతపోరమా
కల యనఁ బెట్టె గంధ మొక◊కాంత వధూటిశిరోజపాళికన్. 18

టీక: ఇర్లు=చీఁకటులు; నెలజిగిభీతిన్ – నెల=చంద్రునియొక్క,జిగి=కాంతివలన, భీతిన్=భయముచేత; ధరణీధరకందరన్ – ధరణీధర=పర్వతముయొక్క, కందరఁన్=గుహయందు; తజ్జయాప్తికై – తత్=ఆచంద్రకాంతియొక్క, జయాప్తికై= జయము యొక్క ప్రాప్తికై; బలుతపము=అధికమగు తపమును; ఊన్చి=చేసి; కైశ్యగతిన్=కేశసమూహరూపముతో; బాగుగన్=ఒప్పి దముతో; పుట్టఁగన్=జన్మింపఁగా; జ్యోత్స్నికాదనాకలనము – జ్యోత్స్నికా=వెన్నెలయొక్క, అదనా= భక్షణమందలి, ఆకల నము=అలవాటును; నేర్పన్=అభ్యసింపఁజేయుటకై; వానిన్=ఆవెన్నెలలను; లలిన్=ప్రేమతో; కైకొని=గ్రహించి; మేపు పురా తపో రమా కలయనన్ – మేపు=భుజింపఁజేయుచున్న, పురాతపోరమా=పూర్వతపోలక్ష్మియొక్క, కలయనన్= కలయను నట్లుగా; ఒకకాంత=ఒకయంగన; వధూటిశిరోజపాళికన్=చంద్రికయొక్క తలవెండ్రుకల సమూహమునందు; గంధము= గంధమును; పెట్టెన్=పెట్టెను.

చీఁకటులు చంద్రకాంతికి భయపడి దాని జయించుటకు పర్వతగుహలయందు తపం బొనరించి కైశ్యరూపమున జన్మిం పఁగా, వాని కా వెన్నెలను తిన నేర్పుటకై యావెన్నెలలను చేతఁబట్టి నోటికిచ్చునట్టి పూర్వజన్మతపోలక్ష్మి నా నొకకాంత చంద్రికవెండ్రుకలయందు గందముఁ బూసె నని భావము.

తే. ఘనపయోధరపదవి న◊క్షత్రమాలి,కారుచులు పర్వ శ్యామ యొ◊క్కర్తు చంద్ర
కలశిఁ బూని నవామృత◊మ్ములఁ జకోర,చపలనయనకు వేలార్చె ◊సమ్మదమున. 19

టీక: శ్యామ యొక్కర్తు – శ్యామ=యౌవనమధ్యస్థయగు, ఒక్కర్తు=ఒకకాంత; చంద్రకలశిఁ బూని =స్వర్ణకలశము దీసికొని; నవామృతమ్ములన్—నవ=నూతనమగు, అమృతమ్ములన్=ఉదకములను; ఘనపయోధరపదవిన్ – ఘన =గొప్పలగు, పయోధరపదవిన్=స్తనప్రదేశమందు; నక్షత్రమాలికారుచులు – నక్షత్రమాలికా=ఇరువదియేడు మౌక్తికములు గల సరము యొక్క, రుచులు=కాంతులు; పర్వన్=వ్యాపింపఁగా; సమ్మదమునన్=సంతోషముతో; చకోరచపలనయనకున్ =చంద్రికకు; వేలార్చెన్ =కుమ్మరించెను; ఇచట, శ్యామ=రాత్రి, ఘనమగు, పయోధరపదవిన్ =ఆకాశమందు, నక్షత్రమాలికారుచులు = ఉడుపంక్తి కాంతులు, పర్వన్=వ్యాపింపఁగా, చంద్రకలశిన్=చంద్రుఁడను కలశమును, పూని=గ్రహించి, నవ మైన, అమృతమ్ము లన్=సుధలను, వేలార్చె నను నర్థము స్ఫురించుచున్నది.

అనఁగా నొకకాంత సువర్ణకలశోదకములతోఁ జంద్రికకు స్నానముఁ జేయించె నని భావము. రాత్రి చంద్రకిరణామృతము లచే చకోరములను తృప్తిపఱిచెనని యర్థాంతరమునకు భావము.

మ. కనకాంగీజన మారతు ల్వొనరుపం ◊గంజద్విషత్కాంత మ
జ్జనశాలాకలశాంబుధి న్వెడలి తే◊జం బెచ్చ నాపద్మపా
ణి నవీనచ్ఛదమండలీవృతి సము◊న్నిద్రాళి గేయాభిపూ
ర్తిని జూపట్టెడు పుష్కరాఖ్యగలవే◊దిం బొల్చె నప్పట్టునన్. 20

టీక: కనకాంగీజనము=స్త్రీజనము; ఆరతుల్=ఆరతులను; పొనరుపన్=ఈయఁగా; కంజద్విషత్కాంత మజ్జనశాలా కల శాంబుధిన్ – కంజద్విషత్కాంతమజ్జనశాలా=చంద్రకాంతమణులుగల స్నానాలయ మనెడి, కలశాంబుధిన్=పాలకడలినుండి; వెడలి = బయలుదేఱి; తేజంబు=కాంతి; ఎచ్చన్=అతిశయింపఁగా; ఆపద్మపాణి=కమలములవంటి హస్తములు గల యా చంద్రిక; నవీన చ్ఛదమండలీవృతిన్ – నవీన=నూతనమగు, ఛద=వస్త్రములయొక్క, మండలీ=సమూహముయొక్క, వృతిన్ = ధారణము చేతను; సమున్నిద్రాళిగేయాభిపూర్తిని – సమున్నిద్ర=విజృంభించుచున్న, ఆళి=చెలియలయొక్క, గేయ= గానముయొక్క, అభి పూర్తిని=పరిపూర్తిచేత; చూపట్టెడు పుష్కరాఖ్యగలవేదిన్ – చూపట్టెడు=కాన్పించుచున్న, పుష్క రాఖ్యగల వేదిన్= పద్మాకృ తులు గల రంగవల్లియొక్క ప్రసిద్ధిగల వివాహవేదికయందు, ‘అలంకృతా స్వస్తిక పద్మశఙ్ఖైః’ యను వసిష్ఠవచనము, రంగవల్లితో పద్మశంఖాకృతులు చేసి వివాహవేదిక నలంకరించుటకుఁ బ్రమాణము; అప్పట్టునన్= ఆసమయమందు; పొల్చెన్= ఒప్పెను. ఇచట, పద్మపాణి=లక్ష్మీదేవి, కలశాంబుధిన్=పాల్కడలినుండి, వెడలి = బయలు దేఱి, నవీన చ్ఛద మండలీ వృతి సమున్ని ద్రాళి గేయాభిపూర్తిని– నవీన=నూతనమగు, ఛద=దళములయొక్క,మండలీ= సమూహముయొక్క, వృతిన్= ఆవరణముచేత, సమున్నిద్ర=జాగరూకములగు, ఆళి=తుమ్మెదలయొక్క, గేయ=గానము యొక్క, అభిపూర్తిని= పరిపూర్తిని; చూపట్టెడు పుష్కరాఖ్యగల వేదిన్=కాన్పించెడు పద్మమను పేరుగల, వేదిన్=తిన్నె యందు; పొల్చెన్= ఒప్పె నను నర్థము దోఁచుచున్నది.

అనఁగా కాంతలు ఆరతు లియ్యఁగా స్నానాలయము వెడలి నూతనవస్త్రముల ధరించి సకులు పాటలు పాడుచుండఁగాఁ జంద్రిక పుష్కరమను పేరుగల వేదికయందుఁ బొల్చె నని భావము.

సీ. కనకదామముఁ జేర్చి ◊వనితకు జడ యల్లె, నళిపాళికలఁ గేర ◊నబల యొకతె,
వరచంద్రరేఖ సుం◊దరినెమ్మొగంబునఁ, దీర్చెఁ దామర నొవ్వఁ ◊దెఱవ యొకతె,
చలువగందంబు తొ◊య్యలిమేన నెనపెఁ జం,పకవల్లిఁ గికురింపఁ ◊బడఁతి యొకతె,
ఘనకంకణమ్ము లం◊గనకరమ్ముల నుంచెఁ, జిగురాకు నెగ్గింపఁ ◊జెలువ యొకతె,

తే. చారుపత్రమ్ము లెడయ కొ◊ప్పార భూరి,వజ్రమాలిక నెలకొల్పె ◊వనిత గబ్బి
గుబ్బకవ గుబ్బలులయుబ్బు ◊కొంచెపఱుప, దంటతన మొప్ప విరిదమ్మి◊కంటి యొకతె. 21

టీక: అబల యొకతె=ఒకకాంత; అళిపాళికలన్=తుమ్మెదబంతులను; కేరన్=పరిహసించుటకై; వనితకున్=చంద్రికకు; కనకదామమున్=సంపెఁగపూసరము; చేర్చి=జతపఱచి; జడ యల్లెన్=జడవేసెను. ఇచట, తుమ్మెదలబంతిని జడ స్వయమే కేరుచుండఁ జంపకసాహాయ్య మేల యను శంక నిరసించుటకై, కనకదామమునకు బంగరుత్రాడు, లేదా జడ బంగరు గాని యర్థము చేయవలయు;
తెఱవ యొకతె=ఒకస్త్రీ; తామర=తామరపువ్వు; నొవ్వన్=నొచ్చునట్టుగా; సుందరినెమ్మొగంబునన్=చంద్రికముఖమందు; వరచంద్రరేఖన్ – వర=శ్రేష్ఠమగు, చంద్రరేఖన్=చందమామబొట్టును; తీర్చెన్=దిద్దెను. ఇచట, చంద్రికముఖము స్వభావముగ తామరపూవును తిరస్కరించుచుండఁగ కమలవైరిసాహాయ్యమును గోరుటయేల యనుశంక నిరసించుటకై, వర చంద్రరేఖన్ – వర=కుంకుమముయొక్క, ‘కాశ్మీరజన్మాగ్నిశిఖం వరమ్’ అని యమరుఁడు, చంద్ర=పచ్చకర్పూరముయొక్క రేఖను దీర్చెనను నర్థ మున్నదని గ్రహింపవలయును; పడఁతి యొకతె=ఒకస్త్రీ; చంపకవల్లిన్=సంపెఁగతీవను; కికురింపన్=వంచించుటకు; చలువగందంబు=చల్లని గంధమును; తొయ్యలిమేనన్=చంద్రికయొక్కశరీరమునందు; ఎనపెన్=కలియఁబూసెను. ఇచట చంద్రికయంగలత తనంతనె చంపకలతను తిరస్కరించుచుండ, చలువగందము సాహాయ్య మేల యను శంక నిరసించుటకై, చలువగందం బనుచోట, చలువన్ =ఉదికిన వస్త్రమును, గందమును నెనపె నను నర్థ మున్నదని గ్రహింపవలయును; చెలువ యొకతె=ఒకకాంత; చిగురాకున్=లేతయాకును; ఎగ్గింపన్=తిరస్కరించుటకు; అంగనకరమ్ములన్=చంద్రికయొక్క హస్తములందు; ఘనకంకణమ్ములు – ఘన=మేఘముయొక్క, కంకణమ్ములు=ఉదకబిందువులు; ఉంచెన్= ఉంచెను. ఇచట, చంద్రికకరములు స్వయమే చిగురుటాకులఁ దిరస్కరించుచుండఁగా, చిగురాకునకు విరోధులగు నుదకకణముల నుంచుట యేల యని శంక నిరసించుటకై, ఘనకంకణమ్ములను చోట, ఘన=గొప్పనైన, కంకణంబులు=వలయముల ననునర్థము దోఁచుచున్నది; విరిదమ్మికంటి యొకతె=వికసించిన కమలములవంటి నేత్రములు గల యొకకాంత; గుబ్బలులయుబ్బు=పర్వతములయొక్క అతిశయమును; కొంచెపఱుపన్=తగ్గించుటకై; దంటతన మొప్పన్=ప్రౌఢత్వ మొప్పునట్లుగా; వనిత గబ్బిగుబ్బకవన్ – వనిత= చంద్రికయొక్క, గబ్బి=ఘనమైన,గుబ్బకవన్=చనుదోయియందు; చారుపత్రమ్ములు – చారు=సుందరమైన, పత్రమ్ములు= ఱెక్కలను; ఎడయక=ఎడఁబాయక; ఒప్పారన్=అతిశయించునట్లుగా; భూరివజ్రమాలికన్ – భూరి= అధికమగు, వజ్రమాలి కన్ =వజ్రాయుధశ్రేణిని; నెలకొల్పెన్=నిలిపెను. ఇచట, పర్వతములను తిరస్కరించుటకై కుచములకు పక్షములను, భూరివజ్ర మాలికలను నెలకొల్పుటవలన నాకుచములకు స్వసామర్థ్యము లేనట్లు దోఁచుచున్నది గాన, పత్ర శబ్దమునకు మకరికాపత్రము లనియు, భూరివజ్రమాలికాశబ్దమునకు, భూరి=సువర్ణమయమగు, వజ్రమాలికన్=రవలసరమును, నెలకొల్పె నను నర్థమున్న దని గ్రహింప వలయును. ఈపద్యమందు భూషణములచేఁ జెలులు చంద్రిక నలంకరించి రని భావము.

మ. లలనామౌళి శివార్పితంబు లగుమే◊ల్కట్టాణిముత్యంపుక
మ్మలు దాల్చె న్భవదాస్యదీప్తిగతి కా◊త్మ న్గుందు రేఱేని ని
స్తులవీక్షామృతధారచే మనుపు మం◊చున్ వేగ తచ్చంద్రమం
డలడింభంబులు భక్తి విన్నపముఁ బూ◊న్పన్ జేరుదారిం దగన్. 22

టీక: లలనామౌళి=చంద్రిక; శివార్పితంబులు=పార్వతీదేవిచే నియ్యఁబడినవి; అగు మేల్కట్టాణిముత్యంపుకమ్మలు – అగు= అయినట్టి, మేల్కట్టు=మంచిబంధనము గల, ఆణిముత్యంపుకమ్మలు=గుండ్రనిముత్యములు గల కర్ణభూషణములను; భవ దాస్యదీప్తిగతికిన్—భవత్=నీయొక్క,ఆస్య=ముఖముయొక్క,దీప్తి=కాంతియొక్క,గతికిన్=రీతికి; ఆత్మన్=మనమునందు; కుందు రేఱేనిన్=వ్యసనపడుచున్నరేరాజును; నిస్తులవీక్షామృతధారచేన్ – సాటిలేని చూపులను నమృతధారలచే; మనుపుము =రక్షింపుము; అంచున్=ఇట్లనుచు; వేగ=శీఘ్రముగా; తచ్చంద్రమండలడింభంబులు = ఆచంద్రమండలమాణవకములు; భక్తి విన్నపమున్=భక్తియుతమగు విజ్ఞాపనమును; పూన్పన్=చేయుటకు; చేరుదారిన్ =సమీపించురీతిగా; తగన్=ఒప్పునట్లు; తాల్చెన్=ధరించెను. చంద్రిక పార్వతీదేవి యొసంగిన ముత్యపుకమ్మలు ధరించుట, నీముఖకాంతికిఁ గుందుచున్న చంద్రుని రక్షింపు మని యతని పిల్లలు విన్నవించుటకై చేరినవో యనునట్లుండె నని భావము. చంద్రికకమ్మలు చంద్రమండలశిశువుల యట్లున్న వని ముఖ్యాశయము.

ఉ. చక్క మఘోని యత్తఱి నొ◊సంగిన సారమసారహారముల్
చక్కెరబొమ్మచన్గవఁ బొ◊సంగె వధూమణి శ్యామ గావునం
జొక్కపుగుత్తు లన్మనముఁ ◊జొన్పఁగ గుబ్బలు నిబ్బరంపు మేల్
మక్కువ నందు వ్రాలునళి◊మాణవకప్రకరంబులో యనన్. 23

టీక: చక్కన్=సుందరముగా; మఘోని=శచీదేవి; అత్తఱిన్=ఆసమయమునందు; ఒసంగిన సారమసారహారముల్ –ఒసంగిన =ఇచ్చినట్టి, సార=శ్రేష్ఠమగు, మసార=ఇంద్రనీలములయొక్క, హారముల్=పేరులను; వధూమణి=చంద్రిక; శ్యామ కావునన్ = శ్యామయగుటవలన,‘శీతకాలే సుఖోష్ణా యా,గ్రీష్మేతు సుఖశీతలా| తప్తకాఞ్చనసంకాశా సా శ్యామేతి చకథ్యతే|’ అని శ్యామాలక్షణము; ప్రేంకణపుతీవ యను నర్థము దోఁచుచున్నది, ‘శ్యామాతు మహిలాహ్వయా’ అని యమరుఁడు; గుబ్బలు= ఉరోజములు; చొక్కపుగుత్తు లన్మనమున్=స్వచ్ఛమైన గుత్తులను భావమును; చొన్పఁగన్=పొందఁజేయఁగా; అందున్=ఆ పూగుత్తులందు; నిబ్బరంపు మేల్మక్కువన్=గాఢమగు ప్రేమతో; వ్రాలు నళిమాణవకప్రకరంబులో అనన్ –వ్రాలు =పడునట్టి, అళిమాణవక=తుమ్మెదపిల్లలయొక్క, ప్రకరంబులో=గుంపులో, అనన్=అనునట్లు; చక్కెరబొమ్మ చన్గవన్=చంద్రికయొక్క స్తనయుగ మందు; పొసంగెన్=ఒప్పెను.

అనఁగా శచీదేవి యొసంగిన యింద్రనీలమణులహారము,లతవలె నున్న చంద్రికయొక్క పాలిండ్లు పూగుత్తులను తలం పున వచ్చి వ్రాలినతుమ్మెదగుంపులో యనునట్లు చంద్రికాకుచయుగమునఁ బ్రకాశించె నని భావము.

ఉ. ఆయరవిందగంధి చర◊ణాంబురుహంబులఁ దాల్పఁ బొల్చె న
గ్నాయి యొసంగినట్టి యభి◊నవ్యవిదూరజనూపురంబు లౌ
రా యని హంసకత్వమున ◊రాజిలుటం బలె నిస్సమస్వర
శ్రీయుతి నొంది డా లెనసి ◊చెల్వముఁ బూనె నటంచు నెంచఁగన్. 24

టీక: అగ్నాయి=స్వాహాదేవి, పృషాకప్యగ్నీతిసూత్రమువలన నైజాదేశఙీప్పులు వచ్చిన వని తెలియవలెను; ఒసంగినట్టి యభి నవ్య విదూరజ నూపురంబులు – ఒసంగినట్టి=ఇచ్చినట్టి, అభినవ్య=క్రొత్తనైన, విదూరజ=వైడూర్యములయొక్క, నూపురం బులు=అందెలు; ఆయరవిందగంధి=పద్మగంధియగు నాచంద్రిక; చరణాంబురుహంబులన్=అడుగుదమ్ములయందు; తాల్పన్=ధరింపఁగా; అవి=ఆయందెలు; హంసకత్వమునన్=పాదకటకభావముచేత, అంచతనముచేత, ‘హంసకః పాద కటకః’ అని యమరుఁడు; రాజిలుటం బలెన్ = ప్రకాశించుటచేతనో యన్నట్లు; నిస్సమ స్వర శ్రీ యుతిన్—నిస్సమ=సాటిలేని, స్వర=ధ్వనియొక్క,శ్రీ=సంపదతో, యుతిన్ = కూడుటను; ఒంది=పొంది; డాలు=కాంతిని; ఎనసి=పొంది; చెల్వమున్= అందమును; పూనెన్=వహించెను; ఔరా=బళీ! అటంచు నెంచఁగన్= అట్లని పొగడఁగా; పొల్చెన్=ఒప్పెను.

స్వాహాదేవి యొసంగిన వైడూర్యనూపురములు చంద్రిక యడుగు దమ్ములయందుఁ దమకుఁగల హంసకత్వము చేతనో యనునట్లు నిస్సమానమగు ధ్వనులతోఁ గూడి ప్రకాశించె నని భావము.

ఉ. అంగన యంతకీపరిస◊మర్పితరోహితకాండపాండుర
త్నాంగదముల్ వహించె శుభ◊హారమసారకదృష్టిడాలు రే
ఖం గన నుజ్జ్వలేందిర వి◊కస్వరపల్లవకోరకాళికా
సంగతిఁ దద్భుజాతిలక◊సాలలతల్ వడిఁ బూనుచాడ్పునన్. 25

టీక: అంగన=చంద్రిక; అంతకీ పరిసమర్పిత రోహితకాండ పాండురత్నాంగదముల్ – అంతకీ=యమభార్యచేత, పరిసమ ర్పిత=ఈయఁబడిన, రోహితకాండ=కెంపులగుంపుయొక్క, పాండురత్న=రవలయొక్క, అంగదముల్=భుజకీర్తులును; ఉజ్జ్వలేందిర=సౌందర్యలక్ష్మి;శుభ హార మసారక దృష్టి డాలు రేఖన్ – శుభ=మంగళకరమైన,హార=కంఠహారమందలి, మసారక= ఇంద్రనీలమణులనెడు, దృష్టి=చూపుయొక్క, డాలు=కాంతులయొక్క,రేఖన్=పంక్తితో; కనన్=చూడఁగా; వికస్వర పల్లవ కోర కాళికా సంగతిన్—వికస్వర=వికసించిన,పల్లవ=చిగుళ్ళయొక్క, కోరక=మొగ్గలయొక్క, ఆళికా=శ్రేణి యొక్క,సంగతిన్ =కూడికను;తద్భుజాతిలకసాలలతల్—తత్=ఆచంద్రికయొక్క, భుజా=భుజములనెడు, తిలకసాల= బొట్టుగుచెట్లయొక్క, లతల్=తీవెలు; వడిన్=వేగముతో; పూనుచాడ్పునన్=ధరించుతెఱంగున; వహించెన్.

అనఁగాఁ జంద్రిక, యమభార్య యొసంగిన కెంపులరవలతోఁ జేరి యున్న యంగదములు సౌందర్యలక్ష్మి హారగతము లగు నింద్రనీలమణులను వీక్షణములచేఁ జూడఁగా నాచంద్రిక భుజములనెడు బొట్టుగుతీవలు ఎఱ్ఱనిలేయాకులును, వెల్లమొగ్గ లును పూనెనో యనునట్లు ధరించె నని భావము. స్త్రీవీక్షణములు బొట్టుగుచెట్లకు దోహద మని వ్రాయఁబడి యున్నది.

చ. సకియ తమీచరాబల యొ◊సంగినచొక్కపుముత్తియంపుబా
సికము ధరింపఁ బొల్చె నది ◊చిక్కనిడాలు నిశాప్తిఁ గాంచి బా
లిక యలికస్థలంబు స్వకు◊లీనత మించఁగఁ గాంచఁ జేరి చం
ద్రకళ ప్రియంబు మించఁ బరి◊రంభముఁ దార్చినదారిఁ బూనుచున్. 26

టీక: సకియ=చంద్రిక; తమీచరాబల=నిరృతిభార్య; ఒసంగిన చొక్కపు ముత్తియంపుబాసికము – ఒసంగిన=ఇచ్చినట్టి, చొక్కపు=స్వచ్ఛమైన, ముత్తియంపుబాసికము=ముత్యములబాసికము, లలామక మనుట; ధరింపన్=తాల్పఁగా; అది=ఆ బాసికము; బాలిక=చంద్రికయొక్క, అలికస్థలంబు=నొసటిప్రదేశము; నిశాప్తిన్ – నిశా=రాత్రియొక్క,పసుపుయొక్క, ఆప్తిన్ =ప్రాప్తిచేత;చిక్కనిడాలు=దట్టమగు కాంతిని; కాంచి=పొంది; స్వకులీనతన్=శ్రేష్ఠమగు తనకులధర్మముతో; మించఁగన్= అతిశయింపఁగా; చంద్రకళ=నెలవంక; కాంచన్ చేరి =చూడడగ్గఱి; ప్రియంబు=ఇంపు; మించన్=అతిశయింపఁగా; పరి రంభమున్=కౌగిలింతను; తార్చినదారిన్=చేయురీతిని; పూనుచున్=వహించుచు; పొల్చెన్=ప్రకాశించెను.

నిరృతిభార్య యొసంగిన ముక్తాలలామకము చంద్రిక ధరింపఁగా, నొసలు నిశాప్తి నెనసి వెలుంగుటయు, స్వీయవక్రత్వ మును బొంది యుండుటయును మొదలగు తనకులధర్మము లుండుట గని ప్రియమొంది, చంద్రకళ డగ్గఱి కౌఁగిలించెనా యను నట్లు ప్రకాశించె నని భావము.

చ. నలిననిభాస్యమౌళి వరు◊ణానివితీర్ణము కెంపురాగమిం
దళతళ మంచు రాజిలు సు◊దర్శన మెంతయు నొప్పెఁ గందర
మ్ములఁ దప మాచరించి తమ◊ముల్ గచలీల జనించి భానుమం
డలి గ్రహియించెఁ జుమ్మనుమ◊నంబు సఖీతతి కొందఁ జేయఁగన్. 27

టీక: వరుణాని వితీర్ణము =వరుణదేవునిభార్యచే నీయఁబడినది; కెంపురాగమిం దళతళమంచు రాజిలు సుదర్శనము = పద్మ రాగమణులగుంపుచేఁ దళతళమని ప్రకాశించు చక్రాకారభూషణము; నలిననిభాస్యమౌళిన్=చంద్రికశిరమునందు; తమముల్ =ఇర్లు; కందరమ్ములన్=గుహలయందు; తపము=తపస్సును; ఆచరించి=చేసి; కచలీలన్=వెండ్రుకలరూపముతో;జనించి = పుట్టి; భానుమండలిన్=సూర్యమండలమును; గ్రహియించెన్=పట్టికొనెను; చుమ్ము=సత్యము; అనుమనంబు=అనునట్టి బుద్ధి; తమములు సూర్యమండలమును గ్రహియించె నను బుద్ధి యనుట; సఖీతతికిన్=చెలులగుంపునకు; ఒందఁజేయఁగన్ = కలుఁగఁ జేయఁగా; ఎంతయున్=మిక్కిలి; ఒప్పెన్=ప్రకాశించెను.

అనఁగా వరుణునిభార్య యొసంగినచక్రాకారమగు భూషణము, అనఁగా రాకిణి, యిర్లు గుహలలోఁ దపం బొనరించి, చంద్రికాకచరూపమున జనించి, సూర్యమండలమును గ్రహించెనా యను సందేహమును చెలులకు గల్గఁజేయుచుఁ జంద్రిక శిరమునందుఁ బ్రకాశించె నని భావము.

మ. తరళాక్షీమణి యప్డు మారుతవధూ◊దత్తంబు ముత్తెంపుముం
గర నాసన్ ధరియించి చెల్వెనసెఁ జ◊క్కన్ వేగుఁజుక్క న్వహిం
చి రసం దోఁచుదినాస్యలక్ష్మి యన న◊క్షీణాంగరాగంబు ని
ర్భరసంధ్యారుచియై సురేంద్రమణిహా◊రచ్ఛాయ లిర్లై తగన్. 28

టీక: తరళాక్షీమణి=స్త్రీరత్నమగు చంద్రిక; అప్డు=ఆసమయమందు; మారుతవధూదత్తంబు=వాయుకాంతచే నీయఁబడిన; ముత్తెంపుముంగర =ముక్తామయమగు నాసాభూషణము; నాసన్=ముక్కునందు;ధరియించి=తాల్చి; అక్షీణాంగరాగంబు =తఱుఁగని మైపూఁత; నిర్భరసంధ్యారుచియై=హెచ్చగుసంజవెలుఁగై; సురేంద్రమణిహారచ్ఛాయలు=ఇంద్రనీలమణిసర కాంతులు; ఇర్లై=చీఁకటులై; తగన్=ఒప్పుచుండఁగా; చక్కన్=సరిగా; వేగుఁజుక్కన్=శుక్రనక్షత్రమును; వహించి=పూని; రసన్ =పుడమియందు; తోఁచుదినాస్యలక్ష్మి యనన్=కనఁబడుచున్న దినముఖలక్ష్మియో యన్నట్లు; చెల్వెనసెన్=ప్రకాశించెను.

అనఁగాఁ దనయంగరాగము సంధ్యారాగమయి, ఇంద్రనీలమణికాంతులు చీఁకటులయి తోఁచుచుండఁగా, చంద్రిక వాయు దేవునిభార్యచే నీయఁబడిన నాసాభూషణమును ధరించి, వేగుజుక్కను వహించి ప్రకాశించునట్టి దినముఖలక్ష్మి యన్నటులు ప్రకాశించె నని భావము.

మ. నవలా యైలబిలీసమర్పితము నా◊నారత్నసంయోజితం
బవు నొడ్డాణము దాల్ప నొప్పె నది తా◊రాధ్వస్థలీరీతిఁ దొ
ల్త విమర్శించితి నిప్డు మధ్యపథలీ◊లం గాంతుఁ బో యంచు మిం
చువడిం జేరు ననేకవర్ణపరిధి◊స్ఫూర్తి న్విజృంభించుచున్. 29

టీక: నవలా=చంద్రిక; ఐలబిలీసమర్పితము=కుబేరునిభార్యచే నీయఁబడినట్టి; నానారత్నసంయోజితంబు=అనేకరత్నఖచి తంబును; అవు నొడ్డాణము=అయినట్టిమేఖలను; తాల్పన్=ధరింపఁగా; అది=ఆయొడ్డాణము;తారాధ్వస్థలీరీతిన్=నక్షత్ర మార్గవిధానంబును; తొల్తన్=మొదట; విమర్శించితిన్=పరికించితిని; ఇప్డు=ఇప్పుడు; మధ్యపథలీలన్=భూలోకముయొక్క విలాసమును, మధ్యభాగమును; కాంతుఁ బో యంచున్=వీక్షింతునని; మించువడిన్=అతిశయించువేగముచే; చేరు ననేక వర్ణ పరిధిస్ఫూర్తిన్ – చేరు=ప్రవేశించుచున్న, అనేకవర్ణ=పెక్కువన్నెలుగల, పరిధి=పరివేషముయొక్క,‘పరివేషస్తు పరిధిః’ అని యమరుఁడు, స్ఫూర్తిన్=ఆకృతితో; విజృంభించుచున్ =అతిశయించుచు; ఒప్పెన్=వెలసెను.అనఁగా మొదట నంతరిక్షపద మును పరీక్షించితి, నిపుడు మధ్యపథలీలను బరికింపవలె నని వన్నెలు గలపరివేషము చేరెనో యనునట్లు కుబేరునిభార్యచే నీయఁబడిన యొడ్డాణము నానారత్నములతోఁ గూడి చంద్రికవలగ్నమందుఁ బ్రకాశించె నని భావము.

మ. అలగోత్రాపతిపుత్రి యిట్లు గిరిక◊న్యాముఖ్యదిగ్దేశరా
ణ్ణలినాస్యాజనతాసమర్పితమహా◊నానామణీభూషణా
వళిశృంగారితగాత్రియై ద్విజసతీ◊వారంబు దీవింపఁ దొ
య్యలు లారాత్రికముల్ ఘటింప నవమో◊దారూఢి మించెం గడున్. 30

టీక: అలగోత్రాపతిపుత్రి=క్షణదోదదయభూపతియొక్క కూఁతురగు నాచంద్రిక; ఇట్లు=పూర్వోక్తప్రకారము; గిరికన్యా ముఖ్య దిగ్దేశరాణ్ణలినాస్యా జనతా సమర్పిత మహా నానా మణీభూష ణావళి శృంగారిత గాత్రియై – గిరికన్యా=పార్వతీదేవి, ముఖ్య= ఆదిగాఁగల, దిగ్దేశరాట్=దిక్పతులయొక్క, నలినాస్యాజనతా=కాంతాజనసమూహముచే, సమర్పిత=ఈయఁబడిన, మహత్=అధికమైన, నానా=అనేకవిధములగు, మణీభూషణ=మణిమయాభరణములయొక్క, ఆవళి=పంక్తిచేత, శృంగా రిత=అలంకరింపఁబడిన, గాత్రియై=శరీరముగలదై; ద్విజసతీవారంబు=బ్రాహ్మణస్త్రీసంఘము; దీవింపన్=ఆశీర్వదింపఁగా; తొయ్యలులు=స్త్రీలు; ఆరాత్రికముల్=హారతులను; ఘటింపన్=ఈయఁగా; నవమోదారూఢిన్—నవ=నూతన మగు, మోద= సంతసముయొక్క, ఆరూఢిన్=ప్రాప్తిచేత; కడున్=మిక్కిలి; మించెన్=అతిశయిల్లెను.

తే. అంతకయ మున్ను బంధువ◊యస్యదండ,నాథముఖ్యులు తత్సుచం◊ద్రక్షితీంద్రుఁ
బెండ్లికొడుకు నొనర్ప ద◊ర్పించువేడ్కఁ, గడఁగి శుభలీల నాళిసం◊ఘములఁ బనుప. 31

టీక: అంతకయ మున్ను=చంద్రికాలంకారమునకన్న పూర్వమందు; బంధు వయస్య దండనాథ ముఖ్యులు – బంధు=చుట్ట ములు, వయస్య=చెలికాండ్రు, దండనాథ=సేనానాయకులు, ముఖ్యులు=మొదలుగాఁగలవారు; తత్సుచంద్రక్షితీంద్రున్ = ఆ సుచంద్రభూపతిని; పెండ్లికొడుకు నొనర్పన్=పెండ్లికుమారునిఁ జేయుటకు; దర్పించువేడ్కన్=మించు నుల్లాసముతో; కడఁగి =పూని; శుభలీలన్=మంగళకరమైన విధానముచేత; ఆళిసంఘములన్=చెలులగుంపులను; పనుపన్=పంపఁగా, దీని కుత్తర పద్యస్థక్రియతో నన్వయము.

చ. తరుణులు చేరి కాంచనవి◊తర్దిక శోభనపీఠిఁ బెట్టి భూ
వరు వసియింపఁ జేసి ద్విజ◊వారిజలోచన లెల్లఁ గోకిల
స్వరమునఁ బాట పాడ నని◊వారితమంగళవాద్యనిస్వనో
త్కరములు చాల బోరుకొన ◊గ్రక్కున నారతు లెత్తి రయ్యెడన్. 32

టీక: తరుణులు=చేడెలు; చేరి=కూడి; కాంచనవితర్దికన్=బంగరువేదికయందు; శోభనపీఠిన్=పెండ్లిపీఁటను; పెట్టి=ఉంచి; భూవరున్=సుచంద్రుని; వసియింపఁ జేసి=కూర్చుండఁబెట్టి; ద్విజవారిజలోచనలు=బ్రాహ్మణస్త్రీలు; ఎల్లన్=అందఱును; కోకిలస్వరమునన్=కోయిలస్వరమువంటి స్వరముతో; పాటపాడన్=పాటఁ బాడఁగా; అనివారిత మంగళవాద్య నిస్వనో త్కరములు – అనివారిత=వారింపఁబడని, మంగళవాద్య=శుభవాద్యములయొక్క, నిస్వనోత్కరములు=ధ్వనికదంబ ములు; చాలన్=మిక్కిలి; బోరుకొనన్=మ్రోఁగఁగా; గ్రక్కునన్=శీఘ్రముగా; ఆరతు లెత్తిరి=హారతు లొసంగిరి; అయ్యెడన్ =ఆసమయమందు, దీని కుత్తర పద్యస్థక్రియతో నన్వయము.

సీ. అఱచందమామపై ◊కుఱుకుచీఁకటిపిల్ల, లన ఫాలతటిఁ గుంత◊లాళిజాఱ,
మదిపేరిమరుమేడఁ ◊బొదలుధూపము పర్వు, పోల్కిఁ గ్రొందావియూ◊ర్పులు జనింప,
నన నూఁగువేడ్కఁ జే◊కొని మ్రోయు తేఁటిచాల్,సరి నీలవలయముల్ ◊చాల మొఱయ,
లవలియాకులఁ గ్రమ్ము◊నవహైమకణముల, గతిఁ జెక్కుల శ్రమాంబు◊కణిక లుబ్బ,

తే. సరులు నటియింప, నునుఁగౌను ◊సంచలింప, గుబ్బకవ రాయిడింప, స◊కు ల్నుతింప,
చూపునెఱమించు మించుమే◊ల్సొగసు నింప, నమ్మహీపాలు శిర సంటెఁ◊గొమ్మయొకతె. 33

టీక: అఱచందమామపైకిన్=అర్ధచంద్రునిమీఁదికి; ఉఱుకుచీఁకటిపిల్లలు అనన్=పరుగెత్తు నంధకారపుబిడ్డలో యన్నట్లు; ఫాలతటిన్=నుదుటిభాగమందు; కుంతలాళి=ముంగురులగుంపు; జాఱన్=ఒరగఁగా;
మదిపేరిమరుమేడన్=మనస్సను పేరుగల మన్మథునిసౌధమందు; పొదలుధూపము=వృద్ధిఁబొందునట్టి పొగ; పర్వు పోల్కిన్ = వ్యాపించువిధమున; క్రొందావియూర్పులు=క్రొత్తవాసనగల నిట్టూర్పువాయువులు; జనింపన్=పుట్టుచుండఁగా; నన నూఁగువేడ్కన్=చిగురాకునం దుయ్యెల లూఁగువేడుకను; చేకొని=గ్రహించి; మ్రోయు=అఱచుచున్న; తేఁటిచాల్ సరి =తుమ్మెదలబంతితో సాటిగా; నీలవలయముల్=ఇంద్రనీలమయములగు కంకణములు; చాలన్=మిక్కిలి; మొఱయన్= మ్రోఁగుచుండఁగా; లవలియాకులన్=ఏలకియాకులయందు; క్రమ్ము నవహైమకణముల గతిన్=చుట్టుకొను క్రొత్తమంచుబిందువులవలె; చెక్కులన్=చెంపలయందు; శ్రమాంబుకణికలు=చెమటనీటిబొట్టులు; ఉబ్బన్=అతిశయింపఁగా; సరులు=దండలు; నటియింపన్=చలింపఁగా; నునుఁగౌను=అల్పమగు నడుము; సంచలింపన్=ఆడఁగా; గుబ్బకవ=చను దోయి; రాయిడింపన్=ఒరయఁగా; సకుల్=చెలులు; నుతింపన్=పొగడఁగా; చూపునెఱమించు=చూపుయొక్కఅధికమైన ప్రకాశము; మించుమేల్సొగసున్=మెఱపుయొక్క మంచియందమును; నింపన్=నిండింపఁగా; అమ్మహీపాలు శిరసు=ఆ రాజుశిరమును; కొమ్మయొకతె = ఒకపడఁతి; అంటెన్=అంటినదాయెను.

బాలచంద్రునిమీఁదికిఁ జిఱుచీఁకటు లుఱికినటులు ఫాలముమీఁద కురులు వ్రాలుచుండఁగా, మనసను పేరుగల మరుని మేడయందు వ్యాపించు పొగపగిది నూర్పులు చెలంగఁగా, చిగురాకునం దుయ్యెల లూఁగు తుమ్మెదచాలుపగిది కరముల నీలమణికంకణములు మొరయఁగా, ఏలకియాకులందుఁ బర్విన మంచుబొట్టులరీతిగ చెక్కిళ్ళయందుఁ జెమటబిందువు లతి శయింపఁగా, దండలు గదలుచుండ, సన్ననినడుము కదలుచుండఁగా, కుచయుగ మొరయుచుండఁగా, సకియలు పొగడు చుండఁగా నొకచెలి సుచంద్రునకుఁ దలయంటె నని భావము.

తే. అంత నప్పురుషోత్తముఁ ◊డంఘ్రియుగళి, నడరుమిన్కులపావాలు ◊దొడిగి కమల
హస్తకర మూని ఘనవేణి◊కాళికాభి,కలితపాథోగృహము మంద◊కలన నెనసి. 34

టీక: అంతన్=అటుపిమ్మట; అప్పురుషోత్తముఁడు=పురుషశ్రేష్ఠుఁడగు నాసుచంద్రుఁడు;అంఘ్రియుగళిన్=అడుగుదోయి యందు; అడరుమిన్కులపావాలు – అడరు=ఒప్పుచున్న, మిన్కులపావాలు=తళుకులుగల పాదుకలను; తొడిగి; కమలహస్తకరము=కమలమువంటి హస్తముగల చెలికేలును; ఊని=వహించి; ఘనవేణికాళికాభికలితపాథోగృహము – ఘనవేణికా =మబ్బువంటిజడగల చేడియలయొక్క, ఆళికా=శ్రేణిచేత, అభికలిత=పొందఁబడిన, పాథోగృహము=మజ్జనగృహమును; మందకలనన్=మెల్లనినడకతో; ఎనసి=పొంది, పైపపద్యముతో నన్వయము; ఇచట, పురుషోత్తముఁడు=నారాయణమూర్తి, అంఘ్రియుగళమందు, మిన్కులపావాలు=వేదమయపాదుకలను, తొడిగి, కమలహస్తకరమూని= లక్ష్మీదేవియొక్కకేలును బట్టుకొని, ఘనవేణికాళికాభికలితపాథోగృహము – ఘనవేణికా=గొప్పనదులయొక్క, ఆళికా=శ్రేణిచేత, అభికలిత=పొందఁ బడిన, పాథోగృహము=సముద్రమును, ఎనసి=పొంది, యను నర్థము దోఁచుచున్నది.

చ. అలినిభవేణి యోర్తు మహి◊పాగ్రణికైశికవీథిఁ జందనా
మలకము వెట్ట నొక్క సుకు◊మారలతాసమగాత్రి కోష్ణవాః
కులముల మజ్జనంబు సమ◊కూర్చె మనోభవరాజ్య మందఁగాఁ
జెలువుగఁ గట్టఁ బట్ట మభి◊షేక మొనర్చినచాయ నయ్యెడన్. 35

టీక: అయ్యెడన్=అప్పుడు; అలినిభవేణి యోర్తు=తుమ్మెదలతో సమానమగు జడగల యొకకాంత; మహిపాగ్రణి కైశిక వీథిన్ – మహిపాగ్రణి=రాజ శ్రేష్ఠుఁడగు సుచంద్రునియొక్క, కైశికవీథిన్= కేశసమూహముయొక్క ప్రదేశమందు; చందనామలకము =చందనమిశ్రితమైన యుసిరికపిండి; పెట్టన్=ఉంపఁగా; ఒక్క సుకుమారలతాసమగాత్రి =మెత్తనిలతతో సమమైన మేనుగల యొకకాంత; చెలువుగన్ = సొంపుగా; మనోభవరాజ్యము=మన్మథుని ప్రభుత్వము; అందఁగాన్=పొందుటకై; పట్టము=ముఖ పట్టమును; కట్టన్=కట్టుటకొఱకు; అభిషేక మొనర్చినచాయన్=స్నానము చేయించిన తెఱంగున; కోష్ణవాః కులములన్= గోరువెచ్చనయిన యుదకపూరముతో; మజ్జనంబు=స్నానమును; సమకూర్చెన్=చేయించెను.

చ. చెలువ యొకర్తు చెందిరిక◊చేల మయిం దడి యొత్తి వైచి ని
స్తులవిశదాంబరం బొసఁగఁ ◊దోడనె దాల్చి సదప్రియంబు మ
త్సులలితరోహితాంశుపటి ◊సుమ్మని దాని సడల్చి వెన్నెలన్
వలనుగఁ బూని తోఁచు రవి◊వైఖరి నప్పతి యొప్పె నంతటన్. 36

టీక: చెలువ యొకర్తు =ఒకచెలియ; చెందిరికచేలన్=చంద్రకావివస్త్రముతో; మయిన్=శరీరమందు; తడి యొత్తి వైచి = తడి దుడిచి; నిస్తులవిశదాంబరంబు – నిస్తుల=సాటిలేని; విశదాంబరంబు=తెల్లనివస్త్రమును; ఒసఁగన్=ఈయఁగా; అప్పతి=ఆ సుచంద్రుఁడు; తోడనె=వెంటనె; తాల్చి=ధరించి; మత్సులలిత రోహితాంశుపటి – మత్=నాయొక్క, సులలిత=మిక్కిలి మనోజ్ఞ మైన,రోహిత=ఎఱ్ఱనగు,అంశు=కిరణము లనెడు, పటి=వస్త్రము; సదప్రియంబు =సజ్జనులకు ఇష్టముకానిది; చుమ్ము=సత్యము; రిక్కలకు నప్రియమని స్వభావార్థము; అని =ఇట్లని; దానిన్=ఆరోహితాంశుపటమును; సడల్చి=విడిచి; వెన్నెలన్=కౌముదిని; వలనుగన్=నేర్పుగా; పూని=ధరించి; తోఁచు రవివైఖరిన్=కనుపట్టు సూర్యునివిధమున; అంతటన్= అప్పుడు; ఒప్పెన్=అలరెను. అనఁగా నొకచెలి శుభ్రవస్త్రము నీయఁగా నారాజు శుభ్రవస్త్రమును ధరించి , సదప్రియంబని రోహి తాంశుపటమును సడల్చి, వెన్నెలను ధరించిన రవిపగిదిఁ బ్రకాశించెనని భావము.

చ. అలజలశాలిక న్వెడలి ◊యాజననాయకుఁ డబ్జరాగవ
ద్వలభివిభాజటాయుతి న◊వారితమౌక్తికకుడ్యదీప్తి ని
ర్మలగగనాపగాప్తిఁ గడు◊రాజిలు పూఁజవికె న్వసించెఁ గ
ల్వలదొర యబ్ధి వెల్వడి శి◊వాపతియౌదలఁ జేరుపోలికన్. 37

టీక: ఆజననాయకుఁడు=ఆసుచంద్రుఁడు; అలజలశాలికన్=ఆస్నానగృహమునుండి; వెడలి=బయలుదేఱి; అబ్జరాగవ ద్వలభివిభాజటా యుతిన్ – అబ్జరాగవత్=పద్మరాగములుగల, వలభివిభా=చూరులకాంతులనెడు, జటా=జడలయొక్క, యుతిన్= కూడికచేత; అవారిత మౌక్తిక కుడ్య దీప్తి నిర్మల గగనాపగాప్తిన్ – అవారిత=నివారింప నలవిగాని, మౌక్తిక= ముక్తామయమైన, కుడ్య=గోడయొక్క, దీప్తి=వెలుంగనెడు, నిర్మల=స్వచ్ఛమైన, గగనాపగా=మిన్నేటియొక్క, ఆప్తిన్= ప్రాప్తిచేతను; కడున్ = మిక్కిలి; రాజిలు పూఁజవికెన్=వెలుఁగుచున్న పువ్వులమండపమందు; కల్వలదొర=చంద్రుఁడు; అబ్ధిన్=సముద్రమునుండి; వెల్వడి=బయలుదేఱి; శివాపతియౌదలన్=పార్వతీవల్లభునితలయందు; చేరుపోలికన్=కూడు తెఱంగున; వసించెన్= నివసిం చెను.

భూపాలుఁడు జలశాల వెడలి పద్మరాగమణిమయమగు చూరుపట్టె లనెడి జటాజూటముతో ముక్తామయకుడ్యకాంతి యనెడు మిన్నేటితోఁ గూడిన శంకరునిశిరముపగిదిఁ గానవచ్చుచున్న పూఁజవికెను, సముద్రమునుండి వెల్వడి చంద్రుఁడు శంక రునిశిరముఁ జేరినరీతిగాఁ జేరెనని భావము.

సీ. తడి యొత్తి నేర్పు గ◊న్పడ నఖాంకురపాళి, నెఱులు చిక్కెడలించె ◊నెలఁత యొకతె,
యింపు రెట్టింపఁ జొ◊క్కంపుసాంబ్రాణిధూ,పపుఁదావిఁ బొందించెఁ◊బడఁతి యొకతె,
తళుకుఁగుంచియఁ బూని ◊కలయ నెఱు ల్దువ్వి, సొగసుగా సిగ వైచె ◊మగువ యొకతె,
మొగలిఱేకులదంట ◊మొనసినబొండుమ,ల్లియపూసరులు చుట్టె ◊లేమ యొకతె,

తే. దివ్యతరరత్నజాలాప్తిఁ ◊దేజరిల్ల, నబ్ధికన్యామనోహరుం ◊డాత్మశక్తి
మహిమ సృజియించి యంచిన◊మంజుమకుటి, నప్పతి కలంకరించెఁ గం◊జాస్య యొకతె. 38

టీక: నెలఁత యొకతె=ఒకచెలియ; తడి యొత్తి=తేమనొత్తి; నేర్పు కన్పడన్=జాణతనము కానవచ్చునట్లు; నఖాంకురపాళిన్ – నఖాంకుర=మొలకలవంటిగోళ్ళయొక్క, పాళిన్=బంతిచేత; నెఱులు=కురులను; చిక్కెడలించెన్=చిక్కుదీసెను; పడఁతి యొకతె =ఒకవనిత; ఇంపు రెట్టింపన్=సొంపు ఇబ్బడింపఁగా; చొక్కంపుసాంబ్రాణిధూపపు తావిన్ – చొక్కంపు= మే లైన, సాంబ్రాణి=గంధద్రవ్యవిశేషముయొక్క, ధూపపుతావిన్=పొగవాసనను; పొందించెన్=అనువుపఱిచెను; మగువ యొకతె=మఱియొకలేమ; తళుకుఁగుంచియన్=మెఱుగైనదువ్వెనను; పూని=చేపట్టి; కలయన్=కలియునట్లు; నెఱుల్ =వెండ్రుకలు; దువ్వి; సొగసుగాన్=అందముగా; సిగ=కొండె; వైచెన్=వేసెను; లేమ యొకతె=ఒకమగువ; మొగలిఱేకులదంటన్=మొగలిపూవులయొక్క జంటతో; మొనసినబొండుమల్లియపూసరులు = కూడిన బొండుమల్లెల పూదండలను; చుట్టెన్=చుట్టెను; కంజాస్య యొకతె =కమలముఖి యొకతె; దివ్యతరరత్నజాలాప్తిన్ – దివ్యతర=మిగుల మేలైనట్టి, రత్నజాల=మణిజాల ములయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; తేజరిల్లన్=వెలయఁగా; అబ్ధికన్యామనోహరుండు=విష్ణుమూర్తి; ఆత్మశక్తిమహిమన్=తన సామర్థ్యముయొక్క మహిమచేత; సృజియించి=పుట్టించి; అంచిన మంజుమకుటిన్=పంపించిన అందమైనకిరీటమును; అప్పతికిన్ = ఆరాజునకు (సుచంద్రునకు); అలంకరించెన్=కైసేసెను.

ఒకకాంత సుచంద్రునకు కురులచిక్కుదీసె ననియు, నొకలేమ సాంబ్రాణిధూప మేసె ననియు, నొకపడఁతి కురులు దువ్వి సిగముడి వేసె ననియు, నొకచాన మొగలిపూఱేకులతోఁ జేరియున్న మల్లెపూసరములు సిగకుఁ జుట్టె ననియు, నొకకంజాస్య విష్ణుమూర్తి తనమహిమచే సృజించి పంపిన కిరీటమును సుచంద్రుని కలంకరించె ననియు భావము.

క. అలనృపమణి కస్తూరీ,తిలకము దాఁ దీర్చె నిరత◊దీప్తికళాసం
కలితమయి మించు మో మను, కలువలదొరయందుఁ జిన్నె◊కరణి వహింపన్. 39

టీక: అలనృపమణి=రాజరత్నమగు నాసుచంద్రుఁడు; నిరతదీప్తికళాసంకలితము – నిరత=సంతతము, దీప్తి=తేజోరూపమగు, కళా=షోడశకళలతోడ, సంకలితము=కూడుకొన్నది; అయి మించు మోము అనుకలువలదొరయందున్ –అయి మించు మోము = అయినదై యతిశయించు ముఖము, అనుకలువలదొరయందున్ =అనునట్టి చంద్రునియందు; చిన్నె కరణిన్ = కలంకవిధమును; వహింపన్=పూనునటులు; కస్తూరీతిలకమున్=కస్తురిబొట్టును; తాన్=తాను; తీర్చెన్= దిద్దెను.

సుచంద్రుఁడు దీప్తిచేఁ బ్రకాశించుచున్న తనముఖ మనుచంద్రునియందుఁ గలంకముకైవడిఁ గస్తురిబొట్టు దీర్చె నని భావము.

క. జనపతివీనుల హరి యం,చిన ముత్తెపుటొంటు లలరెఁ ◊జేరువ లగ్నం
బెనసె విలంబం బిఁక నే, లని దెలుపఁగఁ జేరు కవిసు◊రాచార్యు లనన్. 40

టీక: లగ్నంబు=మూరుతము; చేరువన్=సమీపంబును; ఎనసెన్=పొందెను; విలంబంబు=ఆలస్యము; ఇఁకన్ ఏలని = ఇంక నెందుకని; తెలుపఁగన్=ఎఱింగించుటకై; చేరు కవిసురాచార్యులనన్ – చేరు=డగ్గఱునట్టి, కవిసురాచార్యులు ==శుక్ర బృహ స్పతులు, అనన్=అన్నట్లు; హరి=ఇంద్రుఁడు; అంచిన ముత్తెపుటొంటులు=పంపిన ముత్యాలయంటుజోళ్ళు; జనపతి వీనులన్ = రాజుచెవులందు; అలరెన్=ఒప్పెను. ఇంద్రుఁడు పంపిన ముత్యపుటొంటులు రాజుచెవులందు, లగ్నము సమీపించినది విలంబ మేల యని తెలియఁజేయు గురుశుక్రు లన్నట్లు ప్రకాశించెనని భావము. ఉత్ప్రేక్షాలంకారము.

క. వీవలిచెలి పనిచినము,క్తావళితో విభునివక్ష ◊మలరారెన్ దా
రావిసరప్రతిఫలన, శ్రీవిలసితకనకధరణి◊భృత్తటిపోల్కిన్. 41

టీక: వీవలిచెలి=వాయుసఖుఁడగు నగ్ని; పనిచినముక్తావళితోన్=పంపినట్టి ముత్యములహారముతో; విభునివక్షము=ఱేని ఱొమ్ము; తారా విసర ప్రతిఫలనశ్రీ విలసిత కనకధరణిభృ త్తటిపోల్కిన్ – తారా=చుక్కలయొక్క, విసర=గుంపుయొక్క, ప్రతిఫలనశ్రీ =ప్రతిబింబకాంతిచే, విలసిత=ప్రకాశించుచున్న, కనకధరణిభృత్=మేరుపర్వతముయొక్క, తటి పోల్కిన్ = తటమువలె; అలరారెన్=ప్రకాశించెను. అగ్ని పంపిన ముక్తాహారముతో సుచంద్రునిఱొమ్ము ఆకసమం దున్నచుక్కలు ప్రతిఫలించిన మేరుపర్వతముయొక్కచఱియవలెఁ బ్రకాశించెనని భావము. ఇచట నుపమాలంకారము.

క. జముఁ డంచిన మణిహంసక, మమరెం బతియంఘ్రిఁ ద్వత్ప◊రాళికృతశ్వ
భ్రముఁ బాపుము ధామవిభౌ,ఘముచే నని యడుగునొందు◊కంజాప్తుక్రియన్. 42

టీక. జముఁడు=యమధర్మరాజు; అంచిన మణిహంసకము—అంచిన=పంపిన, మణిహంసకము=మణిమయమగు కాలి యందె; పతియంఘ్రిన్=ఱేనియడుగునందు; త్వత్పరాళికృతశ్వభ్రమున్ – త్వత్=నీయొక్క, పర=శత్రువులయొక్క, ఆళి =శ్రేణిచేత, కృత=చేయఁబడిన, శ్వభ్రమున్=రంధ్రమును; ధామవిభౌఘముచేన్—ధామ=ప్రతాపముయొక్క, విభా=కాంతుల యొక్క, ఓఘముచేన్=గుంపుచేత; పాపుము=పోఁగొట్టుము; అని =ఇట్లని; అడుగునొందుకంజాప్తుక్రియన్ – అడుగునొందు = పాదముల నొందునట్టి, కంజాప్తుక్రియన్=సూర్యునివలె; అమరెన్=ఒప్పారెను.

అనఁగా యమధర్మరాజుచేఁ బంపఁబడిన కాలియందె సుచంద్రునిపాదమందు, నీచే రణమందుఁ గూలిన శూరులు గావిం చిన నామండలముయొక్క రంధ్రమును నీప్రతాపకాంతిపుంజముచేఁ గప్పుమని యడుగులందు వ్రాలిన సూర్యబింబముకైవడిఁ బ్రకాశించె నని భావము. ‘శ్లో. ద్వా విమౌ పురుషౌ లోకే సూర్యమణ్డలభేదినౌ, పరివ్రాడ్యోగయుక్త శ్చ, రణేచాభిముఖో హతః’ అని యెదిరించి రణమందుఁ గూలినవారు సూర్యమండలమును భేదింతు రనుటకుఁ బ్రమాణము.

క. పలభుజుఁ డంచిన రతన,మ్ములపతకము నృపతి దాల్పఁ ◊బొసఁగెం జిత్త
స్థలచంద్రికానురాగా, వలి వెగ్గల మగుచుఁ బైకి ◊వడి వెడలెననన్. 43

టీక. పలభుజుఁడు=నిరృతి; అంచిన రతనమ్ములపతకము=పంపిన రత్నమయమగు పతకము; నృపతి=సుచంద్రుఁడు; తాల్పన్=ధరింపఁగా; చిత్తస్థలచంద్రికానురాగావలి – చిత్తస్థల=హృదయప్రదేశమందున్న, చంద్రికా=చంద్రికావిషయమగు, అనురాగ=అనురక్తియొక్క, ఆవలి=శ్రేణి; వెగ్గల మగుచున్=అతిశయితంబగుచు; పైకిన్=బయటికి;వడిన్=వేగముగా; వెడలెను అనన్ =వచ్చె నన్నట్లుగా; పొసఁగెన్=ఒప్పెను. ఈపద్యమునం దుత్ప్రేక్షాలంకారము.

నిరృతి పంపియున్న రత్నమయమగు పతకము సుచంద్రుఁడు వక్షమున ధరింపఁగా, చంద్రికావిషయమైన యనురాగము హృదయములోనుండి పైకుబికి పర్వె నన్నట్లు భాసిల్లె నని భావము. ఈపద్యమందు మకారపకారములకు యతి చెల్లక యుండి నను, ముకారయతులలో పుఫుబుభులకు మాకొమ్ము చెల్లునని యప్పకవి యంగీకరించినందున ముకారమునకు పొ యను నక్ష రమునకును యతి చేయఁబడియున్నది. ‘క. హెచ్చరికను పుఫుబుభులకు, నచ్చపు మాకొమ్ము లే మ◊హాకవు లాదిన్, మెచ్చు లుగ నిలిపి రచ్చట, నచ్చటను ముకారయతుల◊టంచును గృతులన్’ – అని అప్పకవీయము.

క. శరధీశప్రేషితభా,స్వరమౌక్తికశుభికఁ దాల్చె ◊జనపతి ‘శుభికే
శిర ఆరోహ’ యటంచున్, ధరణీసురపాళి సుస్వ◊నంబునఁ బలుకన్. 44

టీక. జనపతి=సుచంద్రుఁడు; శరధీశప్రేషితభాస్వరమౌక్తికశుభికన్ – శరధీశ=వరుణునిచే, ప్రేషిత=పంపఁబడిన, భాస్వర= వెలుంగుచున్న, మౌక్తిక=ముత్తియములయొక్క,శుభికన్=బాసికమును; ‘శుభికేశిర ఆరోహ’ యటంచున్ – ‘శుభికేశిర ఆరోహ’ అను మంత్రము నుచ్చరించుచు; ధరణీసురపాళి=బ్రాహ్మణశ్రేణి; సుస్వనంబునన్=మేలైనధ్వనితో; పలుకన్ = వచించుచుండఁగా; తాల్చెన్=ధరించెను. అనఁగా వరుణుండు పంపిన ముత్తియంపుబాసికమును బ్రాహ్మణులు మంత్రములు చదువుచుండఁగా సుచంద్రుఁడు ధరించెనని భావము.

క. మరుదర్పితమణిముద్రిక, నరనాథుకరాంగుళికఁ ద◊నర్చెఁ బ్రవాళేం
దిర తనచెల్మికి రా భా,సురభద్రాసనము నిచ్చు◊సొంపు వహింపన్. 45

టీక. మరుదర్పితమణిముద్రిక – మరుత్=వాయువుచే, అర్పిత=ఈయఁబడిన, మణిముద్రిక=కెంపుటుంగరము; నరనాథు కరాంగుళికన్=సుచంద్రునివ్రేలియందు; ప్రవాళేందిర=పగడపుకాంతి యను లక్ష్మి; తనచెల్మికిన్=తననేస్తమునకు, అనఁగా రాజు కేలినేస్తమునకు; రాన్=రాఁగా; భాసురభద్రాసనము నిచ్చుసొంపు =మేలైనసింహాసనము నిచ్చునందమును; వహింపన్ =పూనునట్లు; తనర్చెన్=ఒప్పెను. అనఁగా వాయుదేవుఁడు పంపిన కెంపుటుంగరమును సుచంద్రుఁడు హస్తమున ధరింపఁగా నది ప్రవాళలక్ష్మి సుచంద్రునికేలిచెలిమిఁ గోరి రాఁగా, బహూకరించుటకుఁగా కేలు దాని కిచ్చిన భద్రాసనమురీతిఁ జూపట్టుచు నొప్పె నని భావము.

క. పతి దాల్పఁ బొలిచె ధనదా, ర్పితహీరాంగదము తనధ◊రిత్రీభారో
ద్ధృతి కలరి భుజాభజనా,దృతిఁ గుండలితాహినేత ◊యెనసినపోల్కిన్. 46

టీక. ధనదార్పితహీరాంగదము=కుబేరునిచే నీయఁబడిన రవలబాహుపురి; పతి=సుచంద్రుఁడు; తాల్పన్=ధరింపఁగా; తన ధరిత్రీభారోద్ధృతికిన్=తాను మోయుచున్న భూభారముయొక్కయెత్తుటకు; అలరి=సంతసించి; భుజాభజనాదృతిన్- భుజా =భుజములయొక్క, భజన=కొలుచుటయందు, ఆదృతిన్=ఆదరముచేత; కుండలితాహినేత =వలయితమైన చిలువదొర; ఎనసినపోల్కిన్=పొందినరీతిగా; పొలిచెన్=ప్రకాశించెను.

అనఁగాఁ గుబేరుఁ డిచ్చిన హీరాంగదము సుచంద్రుఁడు భుజములందు ధరియింపఁగా నది తాను మోయు భారమును నీభుజములు మోయుచున్న వని యాదరించుటకయి చేరియున్న యాదిశేషునిపగిదిఁ గానవచ్చె నని భావము.

క. హరుఁడంచిన నవకనకాం,బర మయ్యెడఁ గప్పి నృపతి ◊భాసిల్లెను బం
ధురసాంధ్యరాగవృతుఁడై, ధరణిం గనుపట్టు శిశిర◊ధామునిచాయన్. 47

టీక. అయ్యెడన్=ఆసమయమందు; హరుఁడు=ఈశానుఁడు; అంచిన=పంపిన; నవకనకాంబరము=నూతనమగు బంగరు వస్త్రమును; కప్పి=కప్పుకొని; నృపతి=సుచంద్రుఁడు; బంధురసాంధ్యరాగవృతుఁడై =సొంపగు సంజకెంపువన్నెతోఁ గూడిన వాఁడై; ధరణిన్=భూమియందు; కనుపట్టు శిశిరధామునిచాయన్= కనఁబడు చంద్రునివిధంబుగా; భాసిల్లెను=మెఱసెను.

ఈ సుచంద్రుఁడు, ఈశానుఁడు పంపిన కనకాంబరమును ధరియించి, సంధ్యారాగముతోఁ గూడుకొన్నవాఁడయి పుడమిఁ జేరిన చంద్రునివలెఁ బ్రకాశించె నని భావము.

వ. ఇవ్విధంబున సకలదిగ్రాజనియోజిత నానావిధదివ్యమణివిభూషణభూషితగాత్రుం డగుచు, నాసు చంద్రధరాకళత్రుండు నిశాముఖకృత్యంబులు నిర్వర్తించి మించినముదంబున వేల్పుదొర యంచిన చౌ దంతి నెక్కి యుదయనగవజ్రశృంగాగ్రవిద్యోతమానుండగు నరుణభానుండో యన నఖిలచక్రలోచన సమ్మోదసంపాదకమహాస్ఫురణంబునం బొలుపొందుచు, నభినవ్యశాతకుంభకుంభవారాంచిత పాండు రాతపత్రసహస్రంబు చుట్టు వలగొన నరుణమణిగణ సంస్యూతఫణిరమణ ఫణాదశశతమధ్యస్థితుండగు నృసింహదేవుండునుంబోలె నపరిమితవిబుధమనఃపథ జరీజృభ్యమాణ మహాద్భుతసంవర్ధకవిగ్రహప్రకా శంబునం బొగడొందుచు, నాత్మోత్సవసందర్శనలాలసా నానంద్యమాన పౌరమానవతీజనంబులు చల్లు మల్లికామాఘ్యాదివల్లికాదికోరకవారంబులు చుట్టు నావరింప శీతశైలహిమాధిదేవతావికీర్యమాణమిహికా ఘటికాపటల సంవృతమూర్తి యగుదక్షిణామూర్తి తెఱంగున దిగ్దళనకలనా వరీవృత్యమాన సద్గణకోలా హలంబుల కింపుఁబూనుచుఁ, బార్శ్వద్వయ పరిభ్రాజమాన గజాధిరాజాధిరోహి సామంతమహీకాంత సంవీజ్యమాన ధవళవాలవ్యజనంబు లసమానపవమాన మందయానవైఖరిఁ జాంచల్యమాన నవీనకాశ మాలిక లన్మనంబుఁ బొదలింప మహీతలంబునం దోఁచిన శరద్దినదైవంబు తెఱంగున ననేకరాజహంస సంసేవ్యమానుండయి రాజిల్లుచు, నగణేయతపనీయభంభికాతుత్తుంభికా తమ్మటతమామికాప్రముఖ బహుముఖవాద్యనిస్వానంబుల నలరి తదేకమంగళం బవలోకింపఁ దివుర షడ్ద్వయవిభాకరులు తమతమ ప్రియజనంబుల కరంబుల కొప్పగించి యంచిన నేతెంచి నిలుచు గురుసమాతత తేజోవిలాస లాలస్యమాన తత్కుమారశతశతంబులదారిం దైవాఱు పరిచారిక పాణిభృతగంధతైలధారా దేదీప్యమాన దీపికాసమూ హంబుల వీక్షాలక్ష్యంబులుగా నొనర్చుచు, నిరుగడల నెడయీక యడరునొయ్యారంబున నడచుగణికా గణంబులం గనుంగొని తొంగలించుమోహంబునఁ దదేకతానతం బొలుచు నభోవితర్దికాసీన నిర్జరస్తోమం బులపైఁ గంతుఁడు తత్సమయ సముచిత బహురూపంబు లంగీకరించి ప్రయోగించు నిర్వేలజ్వాలాకుల జాజ్వల్యమాన కలంబకదంబకంబులడంబున యంత్రకారవారంబు లొక్కమొత్తంబుగా ముట్టింపఁ బఱచు నాకాశబాణంబుల నవలోకించుచు, సర్వంసహాజన శ్రవణపర్వంబుగా నిజానవద్య పద్యగద్యంబులు చదు వుచుం బఱతెంచు యాచకకవీశలోకంబుల కాత్మీయ బంధుమిత్రదండనాథపురోహితముఖ్యులు దోయిళ్ళ ముంచి వెదచల్లు నవరత్నసువర్ణజాలంబులతో వైమత్యం బూను కారునికరకరశృంగ సముత్పాత్యమాన చారుధమనికాశిఖి స్ఫులింగికానికాయంబులం గాంచి వేడుకఁ బూనుచు, నుత్తుంగమాతంగచక్రాంగ సం ఘాత సంఘటితజయపతాకాగ్రతట హాటకపటాంచల టేటిక్యమాన పవమానధారా నిర్ధూతంబై స్వాశ్రయ రూపజలదవ్రాతంబు దెసలకుం బాఱి చన నంబరాంతరంబున నిలువ నోపక దివిజరాజరాజధాని కారావ రుద్ధముదిరంబులఁ గదియం బఱచు శంపాలతావితానంబుల మేనులం గురియు తత్ప్రయాణ జంజన్య మాన స్వేదోదబిందు సందోహంబులయందంబున నక్షత్రమార్గాభియాయి నక్షత్రబాణగణ పాపట్యమాన గర్భస్థలీ సనీస్రస్యమాన పాండుజ్వలన గుళికాజాతంబులపైఁ జూపులు నిలుపుచు, నశేషజగజ్జనజేగీయ మాన చిత్రసృజనాపారీణ లోహకారకౌశికవారంబు లపరిమితంబుగా నిజచమత్కారంబునం బుట్టింపఁ బట్టఁ జాలమిం బగులు వేధోండభాండమండలంబువలన బలువడి వెడలి నలుదిక్కులకుఁ బఱచు నుజ్జ్వల జ్జ్యోతిర్జాతంబులతీరున బంభజ్యమాన ఘటబాణపటలంబుల నిర్గమించు నానాళిబాణంబులం గాంచి మెచ్చుచుఁ, గబరికావిన్యస్తచాంపేయప్రసవ చరీచర్యమాణ పరాగపాళికావలయంబులుం గమనీయ ధూమప్రరోహాంతరాంతర బనీభ్రశ్యమాన తనుతరానలకణాలికావలయంబులుం బరస్పరంబు సతీర్థ్య త్వంబునం జూపట్ట నుదారభ్రమణయంత్రంబుల గుండ్రవరుసలు దిరుగు తెఱగంటికంటితో నద్వైతవాదం బులు సేయు ననల్పశిల్పికరయష్టికాగ్ర బంభ్రమ్యమాణ చక్రబాణచక్రంబులఁ జూపున నాక్రమించుచుఁ, దమోరిపుత్రీయ మహామహోనివహంబులు తృణీకరించి నిరర్గళనీరంధ్రపట్టాతపవారణచ్ఛాయా కపటం బునఁ బుడమి నంతయు నాక్రమించు కటికచీఁకటి గని భయంబు పుట్టఁ బాతాళంబుఁ జొరఁబాఱి యనేక దేశాధినాయక చమూసహచరణన్యాసంబున నచ్చట నిలువ లేక యవారితవారవాణ సాహో నినాద పాఫల్యమాన ధరాభాగంబున నొక్క మొత్తంబుగా గ్రక్కునం బైకి వెడలు తైజసత్ర్యణుకపరంపరల పెంపున భ్రాంతి వుట్టింప నిగుడు బిఱుసులమిణుంగురుల వీక్షించుచు, నిరతసురతతి వర్ణ్యమాన వితీర్ణిచాతురీ పో పుష్యమాణంబు లగురారణ్యమాన మానితబిరుదశంఖధ్వానంబులఁ దనశుభంబు దెలిసి యది తిలకింప నేతెంచిన సత్కీర్తిప్రవాహంబు పోలికం బ్రకాశించు నహర్వర్తికామరీచిధట్టంబుల దృగ్ధామంబులం గట్టుచు, నిర్వేలసూర్యజ్యోతిఃప్రభావసద్యోంతర్హితుం డగుట నన్నెలమిన్నం గన్నులఁగానక తాతప్యమానాంతరం బున వియత్తలంబున నంబుజారిబింబసత్వం బైనఁ గనుంగొనుదుము గాక యని చయ్యన నెగసి యగణిత పారలోకసంఘ సంఘర్షణోత్పతద్భుజాంగదమణిచూర్ణపరంపర నిండారఁ గప్పిన నచ్చటం జూడనోపమి సంజాతమూర్ఛామహత్త్వంబున గ్రక్కునం ద్రెళ్ళు నీలోత్పలకులంబుచెలువున వలుఁదకంబంబుల పయి నుండి జల్లున రాలు నీలోత్పలబాణకులంబులం గని యలరుచు, సుకరభ్రమరకప్రకరభాగ్యంబును, సురు చిరకైరవదళలోచనసమ్మదకృత్స్వరూపవైఖర్యంబును, సుందరకింజల్కమాంజుల్యంబును, శోభిల్ల నుల్ల సిల్లు సల్లకీపల్లవాధరామతల్లికల సరసకళాపాళికా రోచమాన కువలయేశసేవామనోరథంబున నేతెంచిన కుముదలతికలంగాఁ దలఁచి నభోంతరవావస్యమాన మరున్మానవతీపాతితసంతానలతాంత జాగళ్యమాన మరందబిందుసందోహకుహనా మహితహిమపృషద్వర్షంబుల కెట్టు లోర్చునని తన్మైత్రీగౌరవంబున నీడఁ జేరిన చంద్రాతపమండలంబు బెడంగునఁ గురంగలోచనామణులపై నెత్తిన యుల్లాభంబుపై దృష్టి వెల్లివిరి యించుచు, నభంగుర మార్దంగిక మృదంగ ధిమిర్ధిమిధ్వానంబులు నతివేలతాళిక తాళ నిస్వానంబులు ననూన వాంశిక వంశికానేకరాగతానంబులు నసమాన గాయక మానంబులు నతిశయిల్ల నాత్మీయ తాం డవవిలాస ప్రతిమాన భావభావనా నరీనృత్యమాన సురమీనలోచనా జనంబుల మీఁదికిం గుప్పించి తిరస్క రించి మరలం జేరు తీరున లాఁగులు వైచుచుం బఱతెంచు బిరుదుపాత్రల నేత్రంబు నానుచు, నసదృశం బును, నవాఙ్మనసగోచరంబును, నత్యద్భుతంబును, నభూతపూర్వంబును, ననితరలభ్యంబును నగు వైభవంబునఁ బాంచాలభూపాలమందిరంబు చేరం జనుసమయంబున. 48

టీక: ఇవ్విధంబునన్=ఇత్తెఱంగున; సకల దిగ్రాజ నియోజిత నానావిధ దివ్యమణివిభూషణ భూషిత గాత్రుండు – సకల= ఎల్ల, దిగ్రాజ=దిక్పాలకులచే, నియోజిత=పంపఁబడిన, నానావిధ=పలుతెఱంగులగు, దివ్యమణివిభూషణ=శ్రేష్ఠమగుమణిభూష ణములచే, భూషిత=అలంకరింపఁబడిన, గాత్రుండు=శరీరముకలవాఁడు; అగుచున్; ఆసుచంద్రధరాకళత్రుండు=ఆ సుచంద్ర భూపతి, ఈపదమునకు ‘చేరంజను సమయంబునన్’ అనువచనాంతముతో నన్వయము; నిశాముఖకృత్యంబులు=సాయం కాలమందుఁ జేయఁదగినవి; నిర్వర్తించి = తీర్చి; మించినముదంబునన్ = హెచ్చిన సంతోషముతో; వేల్పుదొర = ఇంద్రుఁడు ; అంచిన చౌదంతిన్=పంపినయైరావతమును; ఎక్కి= ఆరోహించి; ఉదయనగవజ్రశృంగాగ్రవిద్యోతమానుండు – ఉదయనగ= పొడుపుకొండయొక్క, వజ్రశృంగ=రవలశిఖరముయొక్క, అగ్ర=తుదియందు, విద్యోతమానుండు=వెలుఁగుచున్నవాఁడు; అగు అరుణభానుండోయనన్=అయిన సూర్యుఁడో యనఁగ; అఖిల చక్ర లోచన సమ్మోద సంపాదక మహా స్ఫురణంబునన్ – అఖిల=సమస్తమైన,చక్ర=చతురంగబలములయొక్కయు, జక్కవలయొక్కయు, లోచన=కన్నులకు, సమ్మోద=సంతస మును, సంపాదక=కూర్చుచున్న, మహః=ప్రతాపముయొక్క, తేజస్సుయొక్క, స్ఫురణంబునన్=వ్యాప్తిచే; పొలుపొందు చున్=ఇంపొందుచు; అభినవ్య శాతకుంభ కుంభ వారాంచిత పాండురాతపత్ర సహస్రంబు – అభినవ్య =మిగులక్రొత్తయగు, శాతకుంభ=బంగరుయొక్క, కుంభ=గుబ్బలయొక్క, వార=గుంపుచే, అంచిత=ఒప్పిన, పాండుర=తెల్లని, ఆతపత్ర=గొడు గులయొక్క, సహస్రంబు=వేయి; చుట్టు వలగొనన్=తనచుట్టును జుట్టుకొనియుండఁగా; అరుణమణి గణ సంస్యూత ఫణి రమణ ఫణాదశశత మధ్యస్థితుండు–అరుణమణి=కెంపులయొక్క,గణ=గుంపుచే, సంస్యూత =కూర్పఁబడ్డ, ఫణిరమణ= ఆదిశేషునియొక్క, ఫణా=పడగలయొక్క, దశశత=వేయింటియొక్క, మధ్యస్థితుండు=నడుమ నున్న వాఁడు; అగు నృ సింహదేవుండునుంబోలెన్=అయిన నరసింహస్వామియువలె; అపరిమిత విబుధ మనఃపథ జరీజృభ్యమాణ మహాద్భుత సంవర్ధక విగ్రహ ప్రకాశంబునన్—అపరిమిత=మితిలేని, విబుధ=పండితులయొక్క,దేవతలయొక్క, మనః= చిత్తముల యొక్క, పథ=మార్గమందు, జరీజృభ్యమాణ=మిక్కిలివిజృంభించుచున్న, మహాద్భుత=గొప్పయబ్బురమునకు, సంవ ర్ధక=పోషకమగు, విగ్రహ=యుద్ధముయొక్క, శరీరముయొక్క, ప్రకాశంబునన్=కాంతిచేత; పొగడొందుచున్=మెప్పు వడ యుచు; ఆత్మోత్సవ సందర్శన లాలసా నానంద్యమాన పౌరమానవతీజనంబులు – ఆత్మ=తనయొక్క, ఉత్సవ=వేడుక యొక్క, సందర్శన=దర్శనమందు, లాలసా =ఔత్సుక్యముచేత, నానంద్యమాన=మిక్కిలిహర్షించుచున్న, పౌరమానవతీ జనంబులు=పురస్త్రీలు; చల్లు మల్లికా మాఘ్యాది వల్లికా కోరక వారంబులు –చల్లు=వెదచల్లుచున్న, మల్లికా=మల్లెలు, మాఘ్యా =కుందములు, ఆది=మొదలుగాఁగల, వల్లికా= తీగెలయొక్క, కోరక=మొగ్గలయొక్క, వారంబులు= సమూహములు; చుట్టున్=అంతటను; ఆవరింపన్ = వలగొనఁగా; శీతశైల హిమాధిదేవతా వికీర్యమాణ మిహికా ఘటికా పటల సంవృతమూర్తి యగుదక్షిణామూర్తి తెఱంగునన్ – శీతశైల=హిమవత్పర్వతముయొక్క, హిమ=మంచునకు, అధిదేవతా=అధిష్ఠానదేవత చేత, వికీర్యమాణ=చల్లఁబడిన, మిహికా=మంచుయొక్క, ఘటికా=బలపములయొక్క, పటల= సమూహముచే, సంవృత= ఆవరింపఁబడిన, మూర్తి=శరీరముగల వాఁడు, అగు=అయినట్టి, దక్షిణామూర్తి తెఱంగునన్ = దక్షిణామూర్తిపగిది; దిగ్దళన కలనా వరీవృత్యమాన సద్గణ కోలాహలంబులకున్–దిక్=దెసలయొక్క, దళన=భేదనమను, కలనా =వ్యాపారముచే, వరీ వృత్యమాన=మిక్కిలి వర్తించుచున్న, సద్గణ =విద్వద్గణముయొక్క, ప్రమథగణములయొక్క, కోలాహలంబులకున్= కల కలధ్వనులకు; ఇంపుఁబూనుచున్=సంతసించుచు; పార్శ్వద్వయ పరిభ్రాజమాన గజాధిరాజాధిరోహి సామంతమహీకాంత సంవీజ్యమాన ధవళవాల వ్యజనంబులు – పార్శ్వద్వయ=ఇరుప్రక్కలయందు, పరిభ్రాజమాన =మిక్కిలివెలుఁగుచున్న, గజాధిరాజ=గజరాజములను,అధిరోహి =ఎక్కిన, సామంతమహీకాంత=సమీపదేశాధిపతులచేత, సంవీజ్యమాన=లెస్సగా వీవఁబడిన, ధవళవాల=చామరములయొక్క, వ్యజనంబులు=వీచోపులు; అసమాన పవమానమందయాన వైఖరిన్ – అస మాన=సాటిలేని, పవమాన=వాయువుయొక్క, మందయాన=తిన్ననినడకయొక్క, వైఖరిన్=రీతిచేత; చాంచల్యమాన నవీన కాశమాలికలు – చాంచల్యమాన=కదలుచున్న, నవీన=క్రొత్తలగు, కాశమాలికలు= ఱెల్లుపూవుల దండలు; అన్ మనంబు= అను భావమును; పొదలింపన్=అతిశయింపఁజేయఁగా, మనమునకు కాశమాలిక లని తోఁచునటులు చేయఁగా నని భావము; మహీతలంబునన్=భూతలమందు; తోఁచిన శరద్దినదైవంబు తెఱంగునన్ –తోఁచిన=కనుపడిన, శరద్దినదైవంబు=శరత్కాలాధి దేవతయొక్క, తెఱంగునన్=రీతి గా; అనేకరాజహంస సంసేవ్యమానుండు—అనేక=పెక్కులగు, రాజహంస=రాజశ్రేష్ఠుల చేతను, రాయంచలచేతను, సంసేవ్యమానుండు=కొలువఁబడుచున్నవాఁడు; అయి విరాజిల్లుచు =అగుచు వెలుంగుచు; అగణేయ తపనీయ భంభికా తుత్తుంభికా తమ్మట తమామికా ప్రముఖ బహుముఖ వాద్యనిస్వానంబులన్ – అగణేయ=ఎన్న రాని, తపనీయ=సువర్ణమయమైన, భంభికా=భేరులు, తుత్తుంభికా=తుతారాలు, తమ్మట=తప్పెటలు, తమామికా=డమార ములు, ప్రముఖ= మొదలుగాఁగల, బహుముఖ=అనేకవిధములైన, వాద్య=వాద్యములయొక్క, నిస్వానంబులన్=ధ్వనుల చేత, అలరి=సంతసించి; తదేకమంగళంబు – తత్=ప్రసిద్ధమైన, ఏక=ముఖ్యమైన, మంగళంబు=వివాహరూపమంగళమును; అవలోకింపన్=చూచుటకై; తివురన్=ప్రయత్నింపఁగా; షడ్ద్వయవిభాకరులు=పన్నిద్దఱుసూర్యులు; తమతమప్రియజనం బుల కరంబులకున్=తమతమ యిష్టజనులచేతులకు; ఒప్పగించి=స్వాధీనపఱచి; అంచినన్=పంపఁగా; ఏతెంచి = వచ్చి; నిలుచు గురు సమాతత తేజోవిలాస లాలస్యమాన తత్కుమార శతశతంబుల దారిన్ – నిలుచు=నిలుచుండినట్టియు, గురు =తండ్రులగు నాదిత్యులవలెనే, సమాతత=విశాలమగు, తేజః=కాంతులయొక్క,విలాస=విలాసముచేత, లాలస్యమాన = మిగుల వెలుఁగుచున్న, తత్=ఆద్వాదశాదిత్యులయొక్క,కుమార=పుత్రులయొక్క,శతశతంబులదారిన్=పదివేలవిధంబున; దైవాఱు పరిచారిక పాణి భృత గంధ తైల ధారా దేదీప్యమాన దీపికా సమూహంబులన్ – దైవాఱు=ఒప్పుచున్నట్టియు, పరిచా రిక=కొలువుకాండ్రయొక్క, పాణి =కరములందు, భృత=భరింపఁబడిన, గంధతైల=గందపునూనెయొక్క, ధారా=ఆసార ముచే, దేదీప్యమాన=మిగుల వెల్గుచున్న, దీపికా=దివిటీలయొక్క, సమూహంబులన్=గుంపులను; వీక్షాలక్ష్యంబులుగాన్ = దృగ్గోచరంబులనుగా; ఒనర్చుచున్=చేయుచు; ఇరుగడలన్=ఇరుప్రక్కలయందు; ఎడయీక=ఎడఁబాయక; అడరు= ఒప్పుచున్న; ఒయ్యారంబునన్= విలాసముచేత; నడచు గణికాగణంబులన్=నడచుచున్నట్టి నాగవాసములను; కనుంగొని =చూచి; తొంగలించు మోహంబునన్ =అతిశయించుమోహముచేత; తదేకతానతన్=తదేకాయత్తమైన చిత్తముచేత; పొలుచు నభోవితర్దికాసీన నిర్జరస్తోమంబులపైన్ –పొలుచు=ఒప్పుచున్న, నభోవితర్దికా=ఆకసమనునరుఁగునందు, ఆసీన=కూర్చున్న, నిర్జర=వేల్పులయొక్క, స్తోమంబులపైన్=గుంపులపై; కంతుఁడు=వలరాజు; తత్సమయ సముచిత బహురూపంబులు – తత్స మయ=ఆవేళకు, సముచిత=తగినట్టి, బహురూపంబులు=పలురీతులగు రూపములను; అంగీకరించి=కైకొని; ప్రయోగించు నిర్వేల జ్వాలాకుల జ్వాజ్వల్యమాన కలంబ కదంబకంబుల డంబునన్ – ప్రయోగించు=విడుచునట్టి, నిర్వేల=మేరలేని,జ్వాలా =మంటలయొక్క, కుల=సమూహముచేత, జాజ్వల్యమాన=మండుచున్న, కలంబ=బాణములయొక్క, ‘కలమ్బ మార్గణ శరాః’ అని యమరుఁడు, కదంబకంబుల=సమూహములయొక్క, డంబునన్=రీతిగా; యంత్రకారవారంబులు = బాణ యంత్రములుచేయువారియొక్కసమూహములు; ఒక్కమొత్తంబుగాన్=ఒక్కుమ్మడిగా; ముట్టింపన్=అంటింపఁగా; పఱచు నాకాశబాణంబులన్ – పఱచు=పాఱుచున్న, ఆకాశబాణంబులన్=ఆకాశచివ్వలను; అవలోకించుచున్=చూచుచు; సర్వంసహాజన శ్రవణపర్వంబుగాన్ – సర్వంసహా=ఎల్లపుడమియందుఁగల, జన=నరులయొక్క, శ్రవణపర్వంబుగాన్= వీనులకుపండుగుగా; నిజానవద్య పద్యగద్యంబులు – నిజ=తనసంబంధులైన, అనవద్య= నిర్దుష్టములైన, పద్యగద్యంబులు =పద్యములు గద్యములు; చదువుచున్=పఠించుచు; పఱతెంచు యాచక కవీశ లోకంబులకున్ – పఱతెంచు=వచ్చునట్టి, యాచక=అర్థులకును, కవీశ= కవీశ్వరులయొక్క, లోకంబులకున్=సమూహములకును; ఆత్మీయ బంధు మిత్ర దండనాథ పురోహిత ముఖ్యులు –ఆత్మీయ =తనసంబంధులగు, బంధు=బందుగులును, మిత్ర=స్నేహితులును, దండనాథ= సేనాధిపతు లును, పురోహిత=పురోహితులును, ముఖ్యులు=మున్నగువారు; దోయిళ్ళన్= అంజలులయందు; ముంచి=నించి; వెదచల్లు నవరత్నసువర్ణజాలంబులతోన్ –వెదచల్లు=పాఱఁజల్లుచున్న, నవరత్న=నవరత్నములయొక్క, సువర్ణ=బంగరు నాణ్యె ములయొక్క, జాలంబులతోన్=సమూహములతో; వైమత్యంబు=విరోధమును; ఊను కారు నికర కర శృంగ సముత్పాత్య మాన చారు ధమనికా శిఖి స్ఫులింగికానికాయంబులన్ – ఊను=పొందుచున్న, ఇది స్ఫులింగనికాయములకు విశేషణము, కారు=బాణములను జేయు శిల్పులయొక్క, నికర=సంఘములయొక్క, కర=హస్తమందున్న, శృంగ=కొమ్ములవలన, సముత్పాత్యమాన=ఎగయింపఁబడిన, చారు = సుందరమగు, ధమనికా=గొట్టములయొక్క,శిఖి=అగ్నియొక్క, స్ఫులిం గికా=మిడుఁగుఱులయొక్క,నికాయంబులన్ =సమూహములను; కాంచి=చూచి; వేడుకఁ బూనుచున్=సంతసమును వహించుచు; ఉత్తుంగ మాతంగ చక్రాంగ సంఘాత సంఘటిత జయపతాకాగ్రతట హాటకపటాంచల టేటిక్యమాన పవమాన ధారా నిర్ధూతంబై – ఉత్తుంగ=ఉన్నతమగు, మాతంగ=గజములయొక్క, చక్రాంగ=రథములయొక్క, సంఘాత=సమూహ మందు, సంఘటిత=చేర్పఁబడిన, జయపతాకా=విజయధ్వజములయొక్క, అగ్రతట=అగ్రభాగమందున్న, హాటకపట= బంగరువస్త్రముయొక్క, అంచల=పార్శ్వభాగములను, టేటిక్యమాన=పొందుచున్న, పవమాన=వాయువులయొక్క, ధారా =ఆసారముచేత, నిర్ధూతంబై=ఎగయింపఁబడినది యై; స్వాశ్రయరూపజలదవ్రాతంబు – స్వ=తమకు, ఆశ్రయరూప= ఉనికి పట్టగు, జలదవ్రాతంబు=మబ్బులగుంపు; దెసలకున్= దిక్కులకు; పాఱి=పఱచి; చనన్= పోఁగా; అంబరాంతరంబునన్ = ఆకసమునడుమ; నిలువ నోపక=నిలుచుండలేక; దివిజ రాజ రాజధాని కారావరుద్ధ ముదిరంబులన్ –దివిజరాజ=ఇంద్రుని యొక్క, రాజధాని=రాచవీటియొక్క, కారావరుద్ధ=చెఱయం దుంపఁబడిన, ముదిరంబులన్=మబ్బులను, ‘ఘన జీమూత ముదిరాః’ అని యమరుఁడు; కదియన్=పొందుటకై; పఱచు శంపాలతావితానంబుల మేనులన్ – పఱచు = పాఱుచున్న, శంపాలత=మెఱపుతీవలయొక్క, వితానంబుల=సమూహములయొక్క, మేనులన్= శరీరములయందు; కురియు తత్ప్ర యాణ జంజన్యమాన స్వేదోదబిందు సందోహంబుల యందంబునన్ – కురియు=వర్షించుచున్న, తత్=ఆమెఱపుతీవల యొక్క, ప్రయాణ=ప్రకృష్టగమనమువలన, జంజన్యమాన=మిక్కిలి పుట్టుచున్న, స్వేదోదబిందు= చెమటనీటిబిందుల యొక్క, సందోహంబుల=సమూహములయొక్క, అందంబునన్=సొంపుచేత; నక్షత్రమార్గాభియాయి నక్షత్రబాణగణ పాపట్యమాన గర్భస్థలీ సనీస్రస్యమాన పాండుజ్వలన గుళికాజాతంబులపైన్–నక్షత్రమార్గ=ఆకాశమార్గమును, అభియాయి =పొందుచున్న, నక్షత్రబాణ=నక్షత్రబాణములయొక్క, గణ=సమూహముయొక్క, పాపట్యమాన= పగులుచున్న, గర్భ స్థలీ=కడుపుపట్టులనుండి, సనీస్రస్యమాన=బాగుగా జాఱుచున్న, పాండు=తెల్లనైన, జ్వలనగుళికా= అగ్గియుండలయొక్క, జాతంబులపైన్=సంఘములమీఁద; చూపులు=వీక్షణములను; నిలుపుచున్=ఉంచుచు; అశేష జగ జ్జన జేగీయమాన చిత్ర సృజనా పారీణ లోహకార కౌశికవారంబులు – అశేష=సమస్త మగు, జగత్=లోకములందుండు, జన=నరులచేత, జేగీయ మాన=నుతింపఁబడిన, చిత్రసృజనా=విచిత్రములగు పదార్థముల సృష్టియందు, పారీణ=పారంగతులగు, లోహకార=లోహ కారు లనెడు, కౌశికవారంబులు=విశ్వామిత్రుల సమూహములు; అపరిమితంబుగా=పరిమితి లేనట్లు; నిజచమత్కారంబునన్ —నిజ=స్వకీయమగు, చమత్కారంబునన్=చమత్కృతిచేత; పుట్టింపన్=సృష్టిచేయఁగా; పట్టఁజాలమిన్=ఇముడఁజాల కుండుటవలన; పగులు వేధోండభాండ మండలంబువలనన్ – పగులు=చీలిన, వేధోండభాండ =బ్రహ్మాండభాండముయొక్క, మండలంబువలనన్=మండలాకారములవలన; బలువడిన్; వెడలి=వెలువడి; నలుదిక్కులకున్=నాల్గు దిశలకు; పఱచు నుజ్జ్వల జ్జ్యోతిర్జాతంబులతీరునన్ – పఱచు=పాఱుచున్న, ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న, జ్యోతిర్జాతంబుల = రిక్కలగుంపుల యొక్క, తీరునన్=తెఱఁగున; బంభజ్యమాన ఘటబాణ పటలంబులన్ – బంభజ్యమాన =పగిలిన, ఘటబాణ= కుండబాణ ములయొక్క, పటలంబులన్=సమూహములవలననుండి; నిర్గమించు నానాళిబాణంబులన్ – నిర్గమించు=వెడలుచున్న, నానా=అనేకవిధములగు, అళిబాణంబులన్=తుమ్మెదబాణములను, లేదా, తేలుబాణములను; కాంచి=చూచి; మెచ్చుచున్ =శ్లాఘించుచు; కబరికావిన్యస్త చాంపేయప్రసవ చరీచర్యమాణ పరాగపాళికా వలయంబులున్ – కబరికా=ధమ్మిల్లమందు, విన్యస్త=ఉంచఁబడిన, చాంపేయప్రసవ=సంపెఁగపూలయందు, చరీచర్యమాణ=మిక్కిలి ప్రసరించుచున్న, పరాగపాళికా = పుప్పొడిబంతులయొక్క, వలయంబులున్=కడియములును, అనఁగ సంపెంగపుష్పములయొక్క వలయాకృతిఁ బూనిన పరాగము లని భావము; కమనీయ ధూమ ప్రరో హాంతరాంతర బనీభ్రశ్యమాన తను తరానలకణాలికా వలయంబులున్ – కమ నీయ=మనోహరమగు, ధూమ=పొగయొక్క, ప్రరోహ=అంకురముయొక్క, అంతరాంతర=నడుమనడుమ, బనీభ్రశ్యమాన =పడుచున్న, తనుతర=అతిసూక్ష్మమగు, అనలకణ=అగ్నికణములయొక్క, ఆలికా=శ్రేణులయొక్క, వలయంబులున్= కడియములును; పరస్పరంబు=అన్యోన్యము; సతీర్థ్యత్వంబునన్=ఏకగురుత్వముచేత, అనఁగా సామ్యముచేత ననుట; చూపట్టన్=చూపట్టుచుండఁగా, ఆపరాగపాళికావలయంబులును, అనలకణాలికావలయంబులును నొకటికొకటి సమానమై చూపట్టుచుండఁగ నని భావము;ఉదార భ్రమణయంత్రంబులన్ – ఉదార=ఉత్కృష్ట మగు, భ్రమణయంత్రంబులన్=తిరుగు యంత్రములయందు, మనుష్యులు విలాసార్థముగ నెక్కి గుండ్రముగఁ దిరుగు యంత్రవిశేషములం దనుట; గుండ్రవరుసలు= గుండ్రముగాఁ దిరుగు క్రమములను; తిరుగు తెఱగంటికంటితోన్=తిరుగుచున్న మత్స్యమువంటి నేత్రములుగల దేవాంగనతో; అద్వైతవాదంబులు=అభేదవాదములను; చేయు అనల్ప శిల్పి కర యష్టి కాగ్ర బంభ్రమ్యమాణ చక్రబాణ చక్రంబులన్ – చేయు= తనర్చుచున్న, అనల్ప =అధికమగు, శిల్పి=శిల్పకారులయొక్క,కర=హస్తమందున నుండు, యష్టికా=దండములయొక్క, అగ్ర=కొనలందు, బంభ్రమ్యమాణ=తిరుగుచున్న, చక్రబాణ=చక్రబాణములయొక్క, చక్రంబులన్=సంఘములను; చూపులన్ =దృష్టులచేత; ఆక్రమించుచున్=అలముచు; తమోరి పుత్రీయ మహామహోనివహంబులు – తమః= అంధకారమునకు, అరి= శత్రుఁడగు సూర్యునియొక్క, పుత్రీయ=పుత్రుఁడగు యమునికి సంబంధించిన, లేదా, శనిగ్రహసంబంధియగు, మహత్=అధిక మగు, మహః=కాంతులయొక్క, నివహంబులు=సమూహములను, అనఁగా నల్లనికాంతి సమూహములను; తృణీకరించి = తిరస్కరించి; నిరర్గళ నీరంధ్ర పట్టాతపవారణ చ్ఛాయా కపటంబునన్ – నిరర్గళ =అప్రతిహతమగు, నీరంధ్ర=దట్టమగు, పట్టా తపవారణ=పట్టుగొడుగులయొక్క, ఛాయా=నీడయొక్క,కపటంబునన్ = వ్యాజముచేత; పుడమి నంతయున్=నేలనెల్లను; ఆక్రమించు కటికచీఁకటిన్—ఆక్రమించు=అలముచున్న, కటికచీఁకటిన్= గాఢాంధకారమును; కని=వీక్షించి; భయంబు= వెఱపు; పుట్టన్=తోఁపఁగా; పాతాళంబు=పాతాళలోకమును; చొరఁబాఱి=ప్రవేశించి; అనేక దేశాధినాయక చమూ సహచరణ న్యాసంబునన్ – అనేక=అనేకులగు, దేశాధినాయక=దేశాధిపతులయొక్క, చమూ=సేనలయొక్క, సహచరణన్యాసంబు నన్=యుగపచ్చరణవిన్యాసములచేత; అచ్చటన్=ఆయధోభువనమందు; నిలువ లేక=నిలుచుండ లేక; అవారిత వారవాణ సాహోనినాద పాఫల్యమాన ధరాభాగంబునన్ – అవారిత=నివారించుట కశక్యమగు, వారవాణ= కంచుకులయొక్క, ‘కంచుకో వారవాణో స్త్రీ’ అని యమరుఁడు, సాహోనినాద= ‘పరాక్’ అను ధ్వనులచేతను, పాఫల్యమాన=చీలిన, ధరాభాగం బునన్=భూదేశమందు; ఒక్క మొత్తంబుగాన్=ఒకసమూహముగా; గ్రక్కునన్= శీఘ్రముగ; పైకిన్=మీఁదికి; వెడలు తైజస త్ర్యణుక పరంపరల పెంపునన్ – వెడలు=బయలుదేఱుచున్న, తైజస=తేజస్సంబంధులగు, త్ర్యణుక=త్రసరేణువుల యొక్క, పరంపరల పెంపునన్=పరంపరలయొక్క యతిశయమో యనునట్లు; భ్రాంతి వుట్టింపన్=భ్రమ గలుఁగఁజేయునట్లు; నిగుడు బిఱుసులమిణుంగురులన్ – నిగుడు=వ్యాపించు, బిఱుసుల=బిఱుసులయొక్క, మిణుంగు రులన్ = మిడుఁగుఱులను; వీక్షించుచున్=చూచుచు; నిరత సురతతి వర్ణ్యమాన వితీర్ణి చాతురీ పోపుష్యమాణంబులు – నిరత= ఎల్లపుడు, సురతతి= వేల్పులగమిచేత, వర్ణ్యమాన=పొగడఁబడుచున్న, వితీర్ణి=దానముయొక్క, చాతురీ=చాతుర్యముచేత, పోపుష్యమాణం బులు=మిక్కిలి పోషింపఁబడినవి; అగు రారణ్యమాన మానితబిరుదశంఖధ్వానంబులన్ – అగు =అయిన, రారణ్యమాన= మిగుల మ్రోయుచున్న, మానిత=శ్రేష్ఠమగు, బిరుదశంఖ=సామర్థ్యచిహ్నములయొక్క, ధ్వానంబులన్ = ధ్వనులచేత; తనశుభంబు=తనయొక్కశుభమును; తెలిసి=గుర్తెఱింగి; అది తిలకింపన్=ఆమంగళమును చూచుటకై; ఏతెంచిన సత్కీర్తి ప్రవాహంబు పోలికన్ – ఏతెంచిన=చనుదెంచిన, సత్కీర్తి=మంచికీర్తియొక్క, ప్రవాహంబు పోలికన్= ప్రవాహముయొక్క రీతిచేత; ప్రకాశించు నహర్వర్తికామరీచిధట్టంబులన్ – ప్రకాశించు=వెలుఁగుచున్న, అహర్వర్తికా= పగలువత్తులయొక్క, మరీచి=కాంతులయొక్క, ధట్టంబులన్=సమూహములను; దృగ్ధామంబులన్—దృక్= దృష్టులయొక్క, ధామంబులన్= కాంతులచేత; కట్టుచున్=బంధించుచు; నిర్వేల సూర్యజ్యోతిః ప్రభావ సద్యోంతర్హితుం డగుటన్ – నిర్వేల= అధికమగు, సూర్య జ్యోతిః=బాణవిశేషములయొక్క, ప్రభావ=మహిమచేత, సద్యః=తత్కాలమందు, అంతర్హితుండగుటన్ =మఱుఁగుపడినవాఁ డగుటచేత; అన్నెలమిన్నన్=ఆచంద్రుని; కన్నులంగానక=చూడక; తాతప్యమానాంతరంబునన్ – తాతప్యమాన= పరిత పించుచున్న, అంతరంబునన్=మనస్సుచేత; వియత్తలంబునన్=ఆకసముపట్టున; అంబుజారిబింబ సత్వం బైనన్ – అంబుజారి బింబ=చంద్రబింబముయొక్క, సత్వం బైనన్=సత్తనైనను; కనుంగొనుదుము గాక యని=చూచెద మని; చయ్యనన్=శీఘ్రము గా; ఎగసి=పైకిలేచి; అగణిత పారలోకసంఘ సంఘర్ష ణోత్పత ద్భుజాంగద మణిచూర్ణ పరంపర – అగణిత=లెక్కింపనలవి కాని, పారలోక=పరలోకమందలి నిర్జరాదులయొక్క, సంఘ=బృందముయొక్క, సంఘర్షణ= ఒరయుటచేత, ఉత్పతత్= ఎగయుచున్న, భుజ=బాహువులయొక్క, అంగద=కేయూరములయొక్క, మణి=మణులయొక్క, చూర్ణ=పొడియొక్క, పరంపర=సమూహము; నిండారన్=పరిపూర్ణముగ; కప్పినన్=కప్పఁగా; అచ్చటన్=ఆస్థలమందు; చూడనోపమిన్=కనఁ జాలమివలన; సంజాత మూర్ఛా మహత్త్వంబునన్ – సంజాత =పుట్టినట్టి, మూర్ఛా= మూర్ఛయొక్క, మహత్త్వంబునన్= మహిమచే; గ్రక్కునన్=శీఘ్రముగ; త్రెళ్ళు నీలోత్పలకులంబు చెలువునన్ – త్రెళ్ళు= పడుచున్న, నీలోత్పల=నల్లగల్వలయొక్క, కులంబు చెలువునన్=గుంపుయొక్క అందముచేత; వలుఁద కంబంబుల పయిన్ –వలుఁద=స్థూలమగు, కంబంబులపయిన్= స్తంభములమీఁదనుండి; జల్లున రాలు నీలోత్పల బాణకులంబులన్ – జల్లున రాలు=జల్లుమను శబ్దముతోఁబడుచున్న, నీలో త్పలబాణ=నల్లగలువబాణములయొక్క, కులంబులన్=సమూహములను; కని=చూచి; అలరుచున్=సంతసించుచు; సుకర భ్రమరక ప్రకర భాగ్యంబును – సుకర=సులభమగు, భ్రమరక=ముంగురులయొక్క, తుమ్మెదలయొక్క, ప్రకర=సంఘము యొక్క, భాగ్యంబును =అతిశయమును; సురుచిర కైరవదళలోచన సమ్మదకృ త్స్వరూప వైఖర్యంబును – సురుచిర= మిక్కిలి మనోహరమైన, కైరవదళలోచన=తొవఱేకుల వంటి కన్నులచేత, తొవఱేకులనెడు కన్నులచేత నని కుముదినీ పర మగు నర్థము, సమ్మదకృత్=సంతసమును జేయుచున్న, స్వరూప=అకృతియొక్క, వైఖర్యంబును= రీతియును; సుందర కింజల్క మాంజుల్యంబును – సుందర=మనోజ్ఞమగు, కింజల్క=అకరువుయొక్క, కేసరములయొక్క యని కుముదినీ పర మైన యర్థము, మాంజుల్యంబును=చక్కఁదనమును; శోభిల్లన్=ప్రకాశించునట్లు; ఉల్లసిల్లు సల్లకీపల్లవాధరామతల్లికలన్ – ఉల్లసిల్లు=ప్రకాశించు, సల్లకీపల్లవాధరామతల్లికలన్ = అందుగుచిగురాకువంటి మోవిగల ఉత్తమస్త్రీల యందు; సరస కళా పాళికారోచమాన కువలయేశ సేవా మనోరథంబునన్ – సరస= శ్రేష్ఠమగు, కళా=కాంతులయొక్క, పాళికా=శ్రేణిచేత, రోచ మాన=ప్రకాశించు, కువలయేశ=చంద్రునియొక్క, సేవామనోరథంబునన్=సేవింపవలెనను కోరికచేతను; ఏతెంచిన కుముదలతి కలంగాన్ – ఏతెంచిన=వచ్చిన, కుముదలతికలంగాన్=కలువతీవలనుగా; తలఁచి=భ్రమించి; కుముదలతికలను భ్రాంతిచేత నని భావము; నభోంతర వావస్యమాన మరున్మానవతీ పాతిత సంతానలతాంత జాగళ్యమాన మరందబిందు సందోహ కుహనా మహిత హిమపృష ద్వర్షంబులకున్ – నభోంతర=ఆకాశమధ్యమున, వావస్యమాన= నివసించియున్న, మరున్మానవతీ= దేవాంగనలచేత, పాతిత=పడవైవఁబడిన, సంతానలతాంత=కల్పతరుపుష్పములవలన, జాగళ్యమాన=మిక్కిలి స్రవించు చున్న, మరందబిందు=మకరందపుచినుకులయొక్క, సందోహ=నివహమనెడి, కుహనా= కపటముచే, మహిత=ఒప్పిన, హిమపృషత్=మంచుబొట్లయొక్క, వర్షంబులకున్=వానలకు; ఎట్టు లోర్చునని=ఎట్లు సహించునని; తన్మైత్రీగౌరవంబునన్ – తత్=ఆతొవతీవలయొక్క, మైత్రీ=మిత్రత్వమునందు, గౌరవంబునన్=ఆదరముచేత; నీడగాఁ జేరిన చంద్రాతపమండలంబు బెడంగునన్ – నీడగాన్=ఆచ్ఛాదనగా, చేరిన=పొందిన, చంద్రాతపమండలంబు బెడంగునన్=వెన్నెలమండలంబుపగిది; కురంగలోచనామణులపైన్=స్త్రీలమీఁద; ఎత్తిన యుల్లాభంబులపైన్=ఎత్తిన మేల్కట్ల మీఁద; దృష్టి=చూపు; వెల్లి విరియించుచున్ =ప్రవహింపఁజేయుచు; అభంగుర మార్దంగికమృదంగ ధిమిర్ధిమి ధ్వానంబులును – అభంగుర=అధికములగు, మార్దంగిక= మృదంగవాదకులయొక్క,మృదంగ=మృదంగసంబంధులగు, ధిమిర్ధిమిధ్వానంబులును= ధిమిర్దిమిధ్వనులును; అతివేల తాళిక తాళనిస్వానంబులును – అతివేల=అధికమగు, తాళిక=తాళవాదకులయొక్క, తాళ=తాళములయొక్క, నిస్వానం బులును=ధ్వనులును; అనూన వాంశిక వంశి కానేక రాగతానంబులు – అనూన= అధికమగు, వాంశిక=వేణువును వాయించు వారియొక్క, వంశికా=వేణువుయొక్క,అనేక=పెక్కులగు, రాగ= భైరవ్యాదిరాగములును, తానంబులు=త యను నక్షర మును జేర్చి పాడునట్టి పాటలును; అసమాన గాయక గానంబులును –అసమాన= సరిలేని, గాయక=పాటకులయొక్క, గానంబులును=గీతములును; అతిశయిల్లన్=అతిశయింపఁగా; ఆత్మీయ తాండవ విలాస ప్రతిమానభావ భావనా నరీనృత్య మాన సురమీనలోచనాజనంబుల మీఁదికిన్ – ఆత్మీయ=తమసంబంధి యగు, తాండవ=నాట్యముయొక్క, విలాస=క్రీడతోటి, ప్రతిమానభావ=సాదృశ్యముయొక్క, భావనా=భావనచేత, నరీనృత్యమాన=మిగుల నర్తించుచున్న, సురమీనలోచనా జనం బుల మీఁదికిన్=వేల్పుమచ్చెకంటులమీఁదికి; కుప్పించి =ఎగసి; తిరస్కరించి =తెగడి; మరలం జేరు తీరునన్=మరల వచ్చు పగిది; లాఁగులు వైచుచున్=గంతులువైచుచు; పఱతెంచు బిరుదుపాత్రలన్=ఏతెంచునట్టి సామర్థ్యముగల వేశ్యలను; నేత్రంబు లన్=కన్నులచేత; ఆనుచున్=క్రోలుచు, చూచుచు నని భావము; అసదృశంబును=సరిలేనిదియును; అవాఙ్మనసగోచరంబును =మనోవాక్కులకు గోచరముగానట్టిదియును; అత్యద్భుతంబును=అతివిస్మయకరంబును; అభూతపూర్వంబును= మున్నె న్నఁడును లేనిదియును; అనితరలభ్యంబును =ఒరులకుఁ బొందనలవి గానిదియును; అగు వైభవంబునన్=అయినట్టి విభవము చేత; పాంచాలభూపాలమందిరంబు= క్షణదోదయరాజగృహమును; చేరం జనుసమయంబునన్=చేరఁబోవు నపుడు. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

శా. ఛద్మాన్యాంకురితత్రపాభరయుతే◊క్షారీతి నాలేఖరా
ట్పద్మిం జక్కఁగ నెక్కి వచ్చుధరణీ◊భర్తం గనం దత్పురీ
పద్మాస్యామణు లెల్ల సమ్మదము లొ◊ప్పం జేరి రంచు న్శిర
స్సద్మౌఘంబుల నూపురార్భటిక లో◊జం జాటె వేగస్థితిన్. 49

టీక: ఆలేఖరాట్పద్మిన్=ఆయైరావతమును; చక్కఁగన్=సుందరముగా; ఎక్కి=అధిష్ఠించి; వచ్చుధరణీభర్తన్ = వచ్చుచున్న సుచంద్రుని; ఛద్మాన్యాంకురితత్రపాభరయుతేక్షారీతిన్ – ఛద్మాన్య=అకపటముగా, అంకురిత=పొడమిన, త్రపా=లజ్జయొక్క, భర=అతిశయముతో, యుత=కూడుకొన్న, ఈక్షారీతిన్=వీక్షణములయొక్కభంగిచేత; కనన్=చూచుటకు; తత్పురీపద్మా స్యామణు లెల్లన్ =ఆపురకాంతలెల్లరు; సమ్మదములు=సంతసములు; ఒప్పన్=అతిశయింపఁగా; శిర స్సద్మౌఘంబులన్ –శిరస్సద్మ=మేడలయొక్క, ఓఘంబులన్=సమూహములందు; చేరి రంచున్=వచ్చిరనుచు; నూపురార్భటికలు – నూపుర= అందెలయొక్క, ఆర్భటికలు=కోలాహలములు; ఓజన్=క్రమముగా; వేగస్థితిన్=శీఘ్రముగ; చాటెన్=చాటించెను.

సుచంద్రుఁడు వేల్పుటేనుఁగు నెక్కి పురవీథియందు వచ్చుచుండఁగాఁ దత్పురకాంత లెల్లరు నారాజచంద్రుని సమ్మద మునఁ జూచుటకు మేడలెక్కిరని యాకాంతలనూపురార్భటి యెల్లరికిని దెలియఁజేయుటకై చాటి వినిచె నని భావము.

సీ. పుణ్యవాసన పొంగి◊పొరలె నాఁ జెమట పై,కొనఁ గప్పురపుపూఁత ◊గుమ్మురనఁగఁ,
బరువూనుబుద్ధి వెం◊బడిఁ బర్వురాగంబు, గతిఁ జలన్మణిహార◊కాంతి నిగుడఁ,
ద్వర నేగ దృక్ప్రేషి◊తవయస్య దెల్పుదా, రి వతంసితాబ్జాత◊భృంగి మ్రోయ,
మోమునభఃకాల◊మునఁ గైశ్యఘనసీమ,సౌరుమిం చన హైమ◊సరము వ్రాల,

తే. నలక లరవీడఁ దనుఁ జూచి ◊యలరి వాడ,సకులు గొనియాడ నంఘ్రుల◊జవము గూడఁ,
జొక్కమగుమేడ కేతెంచె ◊నొక్కప్రోడ, యింపు దొలఁకాడ గోత్రామ◊రేంద్రుఁ జూడ. 50

టీక: పుణ్యవాసన—పుణ్య=మనోజ్ఞమైన, వాసన=వలపు; పొంగి=ఉబికి; పొరలె నాన్=పొర్లెనో యనఁగ; చెమట=స్వేదము; పైకొనన్=కలియఁగా; కప్పురపుపూఁత=కర్పూరగంధము; గుమ్మురనఁగన్=గుమ్మని వాసనగొట్టఁగా;
పరువూనుబుద్ధి వెంబడిన్=పరుగెత్తుచున్న మతివెంట; పర్వురాగంబు గతిన్=వ్యాపించునట్టి అనురాగముపగిది; చలన్మణి హారకాంతి=కదలుచున్న మణిసరములయొక్క కాంతి; నిగుడన్=వ్యాపింపఁగా;
త్వరన్=త్వరచేత; ఏగన్= పోవుటకు; దృక్ప్రేషితవయస్య దెల్పుదారిన్=దృష్టిచేత పంపఁబడిన చెలియ దెలుపుపగిది; వతంసితాబ్జాతభృంగి – వతంసిత=అవతంసముగాఁ జేయఁబడిన, అబ్జాత=పద్మమందలి,భృంగి=ఆఁడుతుమ్మెద; మ్రోయన్ =మొరయఁగా; మోమునభఃకాలమునన్=ముఖమను వర్షాకాలమందు; కైశ్యఘనసీమన్=కేశసంఘమను మేఘమందు; సౌరుమించు అనన్ = మనోజ్ఞమగు మెఱపో యనునట్లు; హైమసరము=చంపకసరము; వ్రాలన్=ఒఱగుచుండఁగా; అలకలు=ముంగురులు; అరవీడన్=సగము వీడఁగా; తనున్=తన్ను; చూచి; అలరి=సంతసించి; వాడసకులు=పొరుగు చెలులు; కొనియాడన్=పొగడఁగా; అంఘ్రులన్=అడుగులయందు; జవము గూడన్=వేగము చేరఁగా; ఇంపు=సొంపు; తొలఁకాడన్=అతిశయింపఁగా; గోత్రామరేంద్రుఁ జూడన్=సుచంద్రుఁడను పేరుగల భూలోకదేవేంద్రుని చూచుటకై; ఒక్కప్రోడ = ఒక ప్రౌఢస్త్రీ; చొక్కమగుమేడకున్=చక్కనిసౌధమునకు; ఏతెంచెన్=వచ్చెను.

మంచిపరిమళము పొంగెనా యనఁ జెమట పైకొనఁ గర్పూరగంధపువాసన పరిమళించుచుండఁగా, పరుగెత్తుబుద్ధి వెంబడి ననురాగమువలెనె మణిహారకాంతి వ్యాపించుచుండఁగా (మణికాంతి బుద్ధివెంబడి పోవుచున్న అనురాగ మున్నటు లున్నదని హృదయము), త్వరగాఁ బోవుటకై దృష్టిచే పంపఁబడినచెలియ దెలుపుపగిది అలంకారార్థము ధరియించిన తామరలో నున్న తుమ్మెద రొదసేయుచుండఁగా, ముఖమను వర్షాకాలమందు కైశ్యమను మేఘమందు మెఱపువలెఁ జంపకసరము వ్రేలాడఁగా, ముంగురులు వీడఁగా, పోవుచున్న తన్నుఁ జూచిపొరుగుచెలియ లందరు కొనియాడుచుండఁగా, నొక కాంత సుచంద్రునిఁ జూడ వచ్చె నని భావము.

చ. తిలకము దీర్చి దీర్పక స◊తీమణి యొక్కతె హీరదర్పణం
బలరఁ గరంబునం జనవ◊రాగ్రణిఁ గన్గొన వచ్చె ధామమం
డలి నిను లోకబాంధవు ఖ◊డాఖడి నేఁచినయట్టి చల్లమిం
చులదొరఁ బట్టి తెచ్చితిని ◊జుమ్మని చేరుదినాధిదేవినాన్. 51

టీక: సతీమణి యొక్కతె=స్రీరత్నమగు నొకకాంత; తిలకము దీర్చి దీర్పక=బొట్టు దిద్దిదిద్దకయె; హీరదర్పణంబు=వజ్రమయ మగు నద్దము; కరంబునన్=కేలున; అలరన్=ఒప్పుచుండఁగా; జనవరాగ్రణిన్=రాజశ్రేష్ఠుఁడగు సుచంద్రుని; కన్గొనన్=చూచు టకై; ధామమండలిన్ – ధామ=కాంతియొక్క, మండలిన్=సమూహముచేత, ప్రతాపపుంజముచేత నని దోఁచుచున్నది; లోక బాంధవున్=లోకప్రియుఁడవగు, సూర్యుఁడని తోఁచుచున్నది; నినున్=నిన్ను;ఖడాఖఢి=కఠినముగా; ఏఁచిన యట్టిచల్ల మించులదొరన్ – ఏఁచిన=శ్రమపెట్టిన, అట్టిచల్లమించులదొరన్=అటువంటిచంద్రుని; పట్టి=పట్టికొని; తెచ్చితిని= తీసికొని వచ్చి తిని; చుమ్మని=చూడు మనుచు; చేరుదినాధిదేవినాన్=సమీపించిన దినాధిదేవతయో యనునట్లు; వచ్చెన్= వచ్చెను.

ఒకకాంత రవలయద్దము కేలఁ బూని బొట్టు దిద్దిదిద్దకయె, నిన్నుఁ బూర్వము బాధించిన చంద్రుని బట్టితెచ్చితిని జూడు మని వచ్చు దినాధిదేవతయో యనునటులు, సుచంద్రునిఁ జూచుటకై వచ్చెనని భావము. ఈపద్యమం దుత్ప్రేక్షాలంకారము.

చ. తరుణి యొకర్తి వేగజని◊తశ్రమవాఃపరిపృక్తమానితాం
బరయయి పైఁట జాఱ నెదఁ ◊బాణి ఘటించి మహిస్థలీపురం
దరుఁ గన నేగుదెంచెఁ గడు ◊దక్కితి నీకని నిర్మలాత్మతో
నిరుపమచిత్తవాసగత◊నీరరుహాంబకు ముట్టుపోలికన్. 52

టీక: తరుణియొకర్తి =ఒకయువతి; వేగజనితశ్రమవాఃపరిపృక్తమానితాంబర యయి – వేగ=వేగముచేత, జనిత=పుట్టింపఁ బడిన, శ్రమవాః=స్వేదోదకముచేత, పరిపృక్త=తడుపఁబడిన, మానిత=శ్రేష్ఠమగు, అంబర యయి=వస్త్రముగలదియై; పైఁట = పయ్యెద; జాఱన్=జాఱుచుండఁగా; ఎదన్=ఱొమ్మున; పాణిన్=హస్తమును; ఘటించి=ఉంచి; మహిస్థలీపురందరున్= భూ లోకదేవేంద్రుని; కనన్=చూచుటకై; కడున్=మిక్కిలి; నీకు దక్కితిన్=నీకు స్వాధీయయితిని; అని=ఇట్లనుచు; నిర్మలాత్మ తోన్=నిర్మలమైన అంతఃకరణముతో; నిరుపమచిత్తవాసగతనీరరుహాంబకున్ – నిరుపమ=నిస్సమానమగు, చిత్త= హృదయ మందు, వాస=వసతిని, గత=పొందిన, నీరరుహాంబకున్=కమలాక్షుని, కమలబాణములు గల మన్మథుని నని స్వభావార్థము; ముట్టుపోలికన్=స్పృశించుపగిది; ఏగుదెంచెన్=వచ్చెను.

ఒకకాంత సుచంద్రుని జూచుటకై అతివేగమువలన నైన చెమటచేఁ దడుపఁబడినవస్త్రముగలదై, పైఁటకొంగు వేగిరపాటుచే జాఱఁగా దాని సవరించుటకై ఎదఁ బాణిఁ జేర్చి వచ్చుచుండఁగా, హృదయగతనీరరుహాంబకుని స్పృశించి నిక్కముగ నీకు దక్కితి నని చెప్పినదానివలె నుండె నని భావము. అనఁగా నార్ద్రవస్త్రముతో భగవంతుని ముట్టి ప్రమాణము చేసి నిక్కముగ నీకు దక్కితినని చెప్పుచున్నదానిపగిది వచ్చెనని ముఖ్యాశయము.

మ. కనకాంగీతిలకం బొకర్తు పతి సిం◊గారించుచుం గేల నూ
తనముక్తావళి వ్రేల వచ్చె నలగో◊త్రాకాంతు వీక్షింపఁ జ
క్కనిక్రొమ్మొగ్గలపేరు పూని లలిమైఁ ◊గందర్పసామ్రాజ్యల
క్ష్మి నవేహ న్వరియింపఁ జేరె నని నె◊మ్మిం జూపఱు ల్మెచ్చఁగన్. 53

టీక: కనకాంగీతిలకంబు=నారీతిలకమగు; ఒకర్తు=ఒకకాంత; పతిన్=పెనిమిటిని; సింగారించుచున్=అలంకరించుచు; కేలన్= హస్తమందు; నూతనముక్తావళి=క్రొత్తముత్యపుపేరు; వ్రేలన్=వ్రేలాడుచుండఁగా; అలగోత్రాకాంతున్=ఆసుచంద్రుని; వీక్షింపన్= చూచుటకై; చక్కనిక్రొమ్మొగ్గలపేరు=అందమగు క్రొత్తమొగ్గలసరమును; పూని=గ్రహించి; లలిమైన్=ప్రేమచేత; కందర్ప సామ్రాజ్య లక్ష్మి – కందర్ప=మన్మథునియొక్క, సామ్రాజ్య=సమ్రాట్టుతనముయొక్క,లక్ష్మి=కమల; నవేహన్—నవ= నూతనమైన, ఈహన్=వాంఛచేత; వరియింపన్=కోరుటకు; చేరెన్=వచ్చెను; అని=అనుకొనుచు; నెమ్మిన్=ప్రేమతో; చూపఱుల్=చూచుచుండువారు; మెచ్చఁగన్=పొగడఁగా; వచ్చెన్=ఏతెంచెను. అనఁగా నొకనారీతిలకము తనపతి నలంక రించుచుఁ గరమందు ముక్తాసరమును గైకొని యీసుచంద్రునిఁ జూడ మదనసామ్రాజ్యలక్ష్మి యితనిని వరియించుటకు మొగ్గల దండఁ దీసికొని వచ్చెనని చూపఱులు మెచ్చునట్లు వచ్చెనని భావము.

చ. తరళితపారిజాతసుమ◊దామకవాసన పిక్కటిల్ల వి
స్ఫురదహిశత్రురత్నమయ◊భూషణదీధితి పర్వ నొక్కసుం
దరి నృపుఁ గాంచ వచ్చె వడిఁ ◊దద్విభవంబు సురేంద్రవైభవేం
దిర నెకసక్కెమాడ జగ◊తిం గన నొందు మఘోనితీరునన్. 54

టీక: తరళితపారిజాతసుమదామకవాసన – తరళిత=చలించిన, పారిజాతసుమదామక=పారిజాతపుష్పసరముయొక్క, వాసన =వలపు, వేల్పులమ్రాఁకుపువ్వులసరముయొక్కవలపని శచీపరమగు నర్థము; పిక్కటిల్లన్=అతిశయింపఁగా; విస్ఫుర దహిశత్రురత్నమయ భూషణ దీధితి – విస్ఫురత్=ప్రకాశించుచున్న,అహిశత్రురత్నమయ= గరుడపచ్చల మయమైన, భూషణ=ఆభరణములయొక్క, దీధితి=కాంతి, ఇంద్రనీలమణిమయభూషణకాంతి యని శచీపరమైన యర్థము; పర్వన్= వ్యాపింపఁగా; ఒక్కసుందరి=ఒకకాంత; నృపున్=సుచంద్రుని; కాంచన్=చూచుటకై; వడిన్= వేగముతో; జగతిన్=భూమి యందు; తద్విభవంబు=ఆసుచంద్రునిసంపద; సురేంద్రవైభవేందిరన్=ఇంద్రవిభవలక్ష్మిని; ఎకసక్కె మాడన్=పరిహసించు చుండఁగా; కనన్= చూచుటకై; ఒందు మఘోనితీరునన్=వచ్చుశచీదేవివలె; వచ్చెన్=వచ్చెను.

అనఁగా నొకకాంత పారిజాతసుమసరముయొక్కవాసన పర్వుచుండఁగా, అహిశత్రురత్నమయభూషణములకాంతి అతిశయింపఁగా నీసుచంద్రునిఁ జూచుటకు రాఁగా, నయ్యది బుడమి నింద్రసంపదను హసించు నీసుచంద్రుని సంపదను జూడ వచ్చిన శచీదేవివలె నొప్పె నని భావము.

మ. అనురాగంబునకన్న మున్ను హృదయం ◊బాసన్మనోవీథిక
న్నను ము న్వీక్షణపంక్తి యంతకును ము ◊న్పాదప్రవేగంబు చా
ల నహంపూర్విక నొంద వచ్చె నతిహే◊లావైభవశ్రీయుతిన్
ఘనవేణీతిలకం బొకర్తు ధరణీ◊కాంతాగ్రణిం గన్గొనన్. 55

టీక: ఘనవేణీతిలకంబు=కాంతాతిలకమగు; ఒకర్తు=ఒకస్త్రీ; ధరణీకాంతాగ్రణిన్=భూపతిశ్రేష్ఠుఁడగు సుచంద్రుని; కన్గొనన్ = చూచుటకై; అతిహేలావైభవశ్రీయుతిన్ – అతిహేలా=అతివిలాసముయొక్క, వైభవ=విభవముయొక్క,శ్రీ=కాంతియొక్క, యుతిన్=కూడికచేత; అనురాగంబునకన్నన్=అనురక్తికంటెను; మున్ను=ముందు; హృదయంబు=చిత్తము; ఆసన్మనోవీథి కన్నను=ఆమేలిహృదయప్రదేశమునకన్న; మున్=ముందు; వీక్షణపంక్తి=దృక్ఛ్రేణి;అంతకును మున్=అంతకంటెముందు; పాదప్రవేగంబు=అంఘ్రులజవము; చాలన్=మిక్కిలి; అహంపూర్వికన్=నేను ముందు, నేను ముందనుభావమును; ఒందన్ = పొందఁగా; వచ్చెన్=వచ్చెను.
ఒకకాంత మిక్కిలివిలాసముతో ననురాగహృదయ వీక్షణ పాద వేగములు అహంపూర్విక నొందునట్లు వచ్చెనని భావము.

మ. సకిచా లిట్లు శుభాప్తి వచ్చుపతిఁ గాం◊చం జేరి యవ్వేళ మౌ
క్తికజాలాక్షతపాళిఁ జల్లె నలధా◊త్రీనేతపై మల్లికా
ప్రకరంబు ల్మధుమాసలక్ష్మి వరియిం◊పం బెంపుతో వచ్చుచై
త్రికుమీఁదన్ సుమజాలకేసరము లెం◊తే వైచుచందంబునన్. 56

టీక: సకిచాలు=సకియలయబంతి; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; శుభాప్తిన్=శుభలక్షణప్రాప్తిచేత; వచ్చుపతిన్=వచ్చు చున్నసుచంద్రుని; కాంచన్=చూచుటకై; చేరి=పొంది; అవ్వేళన్=ఆసమయమందు; మౌక్తికజాలాక్షతపాళిన్ – మౌక్తిక జాల=ముత్యములగుంపును, అక్షతపాళిన్=అక్షతశ్రేణిని; అలధాత్రీనేతపైన్=ఆసుచంద్రునిమీఁద; మధుమాసలక్ష్మి=వసంత లక్ష్మి; వరియింపన్=వరించుటకై; పెంపుతో వచ్చుచైత్రికుమీఁదన్=అతిశయముతోవచ్చు వసంతునిమీఁద; మల్లికాప్రకరం బుల్=మల్లికాకుసుమసమూహములను; సుమజాలకేసరములు=పుష్పజాలకింజల్కములను; ఎంతేన్=మిక్కిలి; వైచు చందంబునన్=చల్లువిధముగా; చల్లెన్=చల్లెను.

అనఁగా వసంతలక్ష్మి వరియించుటకై వచ్చుచైత్రునిమీఁద తెల్లనిమల్లికలను, పచ్చని కుసుమకేసరములను చల్లునట్లుగ నీ సుచంద్రునిపై చూడవచ్చినపురకాంతలు మౌక్తికములను,అక్షతలను చల్లి రని భావము.

మ. జలజాప్తాన్వయమౌళి యప్పు డలపాం◊చాలేంద్రచంచన్మణీ
నిలయాభ్యంతికసీమ లేఖవరదం◊తిం డిగ్గి యమ్మేటి యు
త్కలికాసంపదచే నెదుర్కొన లతా◊గాత్రీశిరోరత్నమం
డలి యారాత్రికముల్ ఘటింప బుధసం◊తానంబు దీవింపఁగన్. 57

టీక: జలజాప్తాన్వయమౌళి=సూర్యవంశశ్రేష్ఠుఁడగు సుచంద్రుఁడు; అప్పుడు=ఆసమయమందు; అలపాంచాలేంద్రచంచన్మణీ
నిలయాభ్యంతికసీమన్ – అలపాంచాలేంద్ర=ఆక్షణదోదయునియొక్క, చంచత్=ప్రకాశించుచున్న, మణీనిలయ=మణిమయ గృహముయొక్క, అభ్యంతికసీమన్=సమీపప్రదేశమందు; లేఖవరదంతిన్—లేఖవర=ఇంద్రునియొక్క, దంతిన్= గజమగు నైరావతమును; డిగ్గి=దిగి; అమ్మేటి=ఆక్షణదోదయుఁడు; ఉత్కలికాసంపదచేన్=సంతోషాతిశయముచేత; ఎదుర్కొనన్ = ఎదురుకొనఁగా; లతాగాత్రీశిరోరత్నమండలి=నారీశిరోమణులసమూహము; ఆరాత్రికముల్=ఆరతులను; ఘటింపన్= ఘటిల్లఁజేయఁగా; బుధసంతానంబు=విద్వాంసులయొక్కసమూహము; దీవింపఁగన్=ఆశీర్వదింపఁగా, దీని కుత్తరపద్యస్థ క్రియతో నన్వయము.

చ. లలితసువర్ణవేత్రికకు◊లంబు బరాబరి యూన్పఁ జెంతలం
గలసి నిజాప్తబంధుమహి◊కాంతచయం బరుదేర నొక్కనె
చ్చెలికయిదండఁ జేకొని వ◊చింపఁగరాని యొయారమెచ్చ ని
ర్మలినవివాహరత్నమయ◊మండపరాజముఁ జేరె నయ్యెడన్. 58

టీక: లలితసువర్ణవేత్రికకులంబు – లలిత=మనోజ్ఞమైన,సువర్ణవేత్రిక=బంగరుబెత్తపువారలయొక్క,కులంబు=సమూహము; బరాబరి=హెచ్చరికను; ఊన్పన్=చేయుచుండఁగా; చెంతలన్=ఇరుప్రక్కలయందు;కలసి=కలిసికొని; నిజాప్తబంధుమహి కాంతచయంబు –నిజ = స్వకీయులగు, ఆప్త = మిత్రులును, బంధు = బందుగులు, మహికాంత = రాజలు, చయంబు = వీరి యొక్క సమూహము; అరుదేరన్=వచ్చుచుండఁగా; ఒక్కనెచ్చెలికయిదండన్=ఒకనేస్తకానిహస్తమును; చేకొని=గ్రహించి; వచింపఁగ రాని యొయారము=చెప్పనలవిగానివిలాసము;ఎచ్చన్=అతిశయింపఁగా; నిర్మలినవివాహరత్నమయమండప రాజమున్ – నిర్మలిన = పరిశుద్ధమగు, వివాహ = వివాహమునకైన, రత్నమయ = మణిమయమగు, మండపరాజమున్= మండపశ్రేష్ఠమును; అయ్యెడన్=ఆసమయమందు; చేరెన్=పొందెను. పైపద్యముతో నన్వయము.

క. నరపతి పాంచాలక్షితి,వరుపనుపునఁ గనకపీఠి ◊వసియించి యన
ర్ఘ్యరుచిఁ గనుపట్టెఁ బ్రాఙ్మహి,ధరవీథిం బొలుచు తుహిన◊ ధామునిచాయన్. 59

టీక: నరపతి=సుచంద్రుఁడు; పాంచాలక్షితివరుపనుపునన్=క్షణదోదయునియాజ్ఞచేత; కనకపీఠిన్=బంగరుపీఁటయందు; వసియించి=కూర్చుండి; అనర్ఘ్యరుచిన్ – అనర్ఘ్య=వెలలేని, రుచిన్=కాంతిచేత; ప్రాఙ్మహిధరవీథిన్=పొడుపుకొండపట్టున; పొలుచు తుహినధామునిచాయన్=కానవచ్చుచున్న చందమామపగిది; కనుపట్టెన్=చూపట్టెను. సుచంద్రుఁడు క్షణదోదయుని పంపున బంగరుపీఁటమీఁద గూర్చుండి, ఉదయనగమందుఁ గానవచ్చు చంద్రునివలెఁ జూపట్టె నని భావము. ఉపమాలంకారము.

చ. విమలబుధాంతరంగనవ◊విస్మయదంబు మహాసదృక్షరా
ట్ప్రమదకరంబు నై దనరు◊భవ్యమహంబునఁ బొల్చుపూరుషో
త్తముపద ముల్లసత్ప్రియవి◊ధానముతోఁ గడిగెం బ్రజేశుఁడా
త్మమహిళ నించుదివ్యజల◊ధారలఁ గాంచనపాత్రి నత్తఱిన్. 60

టీక: విమలబుధాంతరంగనవవిస్మయదంబు – విమల=స్వచ్ఛమైన,బుధ=విద్వాంసులయొక్క,అంతరంగ=మనములకు; నవవిస్మయదంబు=నూతనమగు నచ్చెరువు నిచ్చుచున్నదియు; మహాసదృక్షరాట్ప్రమదకరంబు నై – మహత్=అధికు లగు, అసదృక్ష=సరిలేని, రాట్=రాజులకు, ప్రమదకరంబు నై = సంతసము నిచ్చుచున్నదియు నయి; తనరు భవ్య మహం బునన్ – తనరు=ఒప్పుచున్నదియు, భవ్య=మంగళకరమైన, మహంబునన్=తేజస్సుచేత; పొల్చుపూరుషోత్తముపదము= ప్రకాశించుచున్న పురుషోత్తముఁడగు సుచంద్రునిపాదమును; ఉల్లసత్ప్రియవిధానముతోన్—ఉల్లసత్=ప్రకాశించుచున్న, ప్రియ=ప్రియమగు, విధానముతోన్=విధిచే, శాస్త్రచోదితమార్గముచే ననుట; ప్రజేశుఁడు=క్షణదోదయరాజు; ఆత్మమహిళ= తనయొక్కకాంత; నించుదివ్యజలధారలన్ – నించు=పూరించుచున్న, దివ్య=మనోజ్ఞమగు,జలధారలన్=ఉదకధారలచేత; కాంచనపాత్రిన్= సువర్ణపాత్రయందు;కడిగెన్=కడిగెను.(ఇచట, విమలమగు, బుధ=దేవతలయొక్క,యంతరంగమునకు, నవవిస్మయంబును, మహత్=అధికుఁడగు, సత్=శ్రేష్ఠుఁడగు, ఋక్షరాట్=చంద్రునకు, ప్రమదకరంబును,అగు, పూరుషో త్తమపదము=విష్ణుపాదమును, ప్రజేశుఁడు=బ్రహ్మ, ఆత్మమహిళ=సరస్వతీదేవి, నించుజలధారచేతఁ గడిగె నను నర్థాంతరము దోఁచుచున్నది), అత్తఱిన్=ఆసమయమందు, దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

చ. యువతులు పాటఁబాడఁగ న◊వోత్కలికన్ శుభమంత్రజాలకం
బవనిసురాళిక ల్దెలుప ◊నాక్షణదోదయరా జొసంగునిం
పవుమధుపర్క మన్నృపకు◊లాగ్రణి కుత్సవ మూన్చెఁ జంద్రికా
ధవళవిలోచనాధరసు◊ధారస మిట్టిదెయన్న కైవడిన్. 61

టీక: యువతులు=కాంతలు; పాటఁబాడఁగన్=పాటపాడుచుండఁగా; అవనిసురాళికల్=భూసురసంఘములు; నవో త్కలికన్ – నవ=నూతనమగు, ఉత్కలికన్=సంతసముచేత; శుభమంత్రజాలకంబు – శుభ=మంగళకరమగు, మంత్ర= మంత్రముల యొక్క, జాలకంబు=సమూహమును; తెలుపన్=తెలియఁజేయఁగా; ఆక్షణదోదయరాజు; ఒసంగు నింపవు మధుపర్కము – ఒసంగు =ఇచ్చినట్టి, ఇంపవు=మనోహరమగు, మధుపర్కము=పెరుగుతోఁ గలిపిన తేనె మొదలగునవి, వివాహమందు వరు నికి కన్యాదాత మధుపర్కము నొసంగుట ప్రసిద్ధము; అన్నృపకులాగ్రణికిన్=ఆసుచంద్రునకు; ఉత్సవము=వేడుకను; చంద్రికా ధవళవిలోచనాధరసుధారసము – చంద్రికాధవళవిలోనా=చంద్రికయను కాంతయొక్క, అధరసుధారసము=మోవియొక్క యమృతరసము; ఇట్టిదె=దీనికి సమమైనదే; అన్న కైవడిన్=అనినరీతిగా; ఊన్చెన్=చేసెను.

సుచంద్రునకు క్షణదోదయుఁ డొసఁగిన మధుపర్కము చంద్రికయొక్క మోవితేనె యిట్టిదే యని తెలిపినపగిది సంతసము గూర్చె నని భావము.

చ. కనకపుగద్దె నొప్పుమహి◊కాంతునిముంగల నప్డు చక్కఁ దా
ర్చినబలుచెంద్రకావితెర ◊జిష్ణుదిశాధరభాసమానసూ
ర్యనికటశోభిసాంధ్యరుచి◊యందము గైకొనెఁ బద్మినీవిలో
చనకమలానుమోదరస◊జాతము మిక్కిలి హెచ్చఁ జేయుచున్. 62

టీక: అప్డు=ఆసమయమందు;కనకపుగద్దెన్=బంగరుపీఠమందు; ఒప్పుమహికాంతునిముంగలన్=ఒప్పుచున్న సుచంద్రుని యెదుట; చక్కన్=చక్కఁగా; తార్చిన బలుచెంద్రకావితెర=రచియించిన గొప్పచంద్రకావివన్నెగల కాండపటము; పద్మినీ విలోచన కమలానుమోద రస జాతము – పద్మినీ=పద్మినీజాతిస్త్రీలయొక్క, పద్మలతలయొక్క, విలోచనకమల=తామరల వంటి కన్నులకు, కన్నులవంటి తామరలకు, అనుమోదరస = సంతోషరసములయొక్క, జాతము = గుంపును; హెచ్చఁ జేయుచున్=అతిశయింపఁజేయుచు; తార్పన్=రచియింపఁగా; జిష్ణుదిశాధర భాసమాన సూర్య నికట శోభి సాంధ్య రుచి యందము – జిష్ణుదిశాధర=పొడుపుకొండయందు, భాసమాన=వెలుఁగుచున్న, సూర్య=సూర్యునియొక్క, నికట=సమీప మందు, శోభి=ప్రకాశించుచున్న,సాంధ్య=ఉదయసంధ్యాసంబంధియగు,రుచి=కాంతియొక్క, అందము=సౌందర్యమును; మిక్కిలి=అధికముగా; కైకొనెన్=గ్రహించెను. బంగరుపీఠమందుఁ గూర్చున్న సుచంద్రునియెదుటఁ జంద్రకావితెరఁ బట్టి యుండఁగా నయ్యది పొడుపుకొండపైఁ బొలుచు సూర్యునిముందర వెలుంగుచున్న యుదయరాగముపగదిఁ బద్మినీలోచన కమలములకు వికాసమును గల్గఁ జేయుచుఁ బ్రకాశించె నని భావము. ఇచట నుపమాలంకారము.

శా. ఆవేళన్ క్షణదోదయక్షితివరా◊భ్యర్ణస్థలిం జేర నా
ళీవారంబుల కెచ్చరించి బలుహా◊ళిం దత్పురోధుం డుమా
దేవీసన్నిధిఁ బొల్చుభూపసుతఁ దో◊డ్తెచ్చెన్ వరశ్రీ ‘మమా
గ్నేవర్చోవిహవేషు’ యంచు సరసో◊క్తి న్భూసురు ల్పల్కఁగన్. 63

టీక: ఆవేళన్=ఆసమయమందు; క్షణదోదయక్షితివ రాభ్యర్ణస్థలిన్ –క్షణదోదయక్షితివర= క్షణదోదయరాజుయొక్క, అభ్యర్ణస్థలిన్=సమీపప్రదేశమును; చేరన్=పొందుటకు; తత్పురోధుండు=ఆరాజుయొక్క పురోహితుఁడు; ఆళీవారంబులకున్ =వయస్యాసమూహములకు; ఎచ్చరించి=ఎచ్చరికఁజేసి; బలుహాళిన్=అత్యాసక్తిచేత; ఉమాదేవీసన్నిధిన్ =పార్వతీదేవి సన్నిధానమునందు; పొల్చుభూపసుతన్=ఒప్పియున్నచంద్రికను; వరశ్రీన్=శ్రేష్ఠమగు శోభచేత; మమాగ్నేవర్చోవిహవేషు అంచున్= ‘మమాగ్నేవర్చో విహవేషు’ అనుమంత్రరూపమగు; సరసోక్తిన్=ఉత్తమవాక్యమును; భూసురుల్=బ్రాహ్మణులు; పల్కఁగన్=వచింపఁగా; తోడ్తెచ్చెన్=తోడ్కొని వచ్చెను.

సీ. నిఖిలాద్భుతముగ ము◊న్నీటిమన్నీని వె,ల్వడి తోఁచులచ్చినె◊లంత యనఁగఁ,
దళతల మనుచుక్క◊చెలిచాలు వలగొనఁ, గనుపట్టు శీతాంశు◊కళ యనంగ,
నధికయత్నమున నొ◊య్యన నడతెంచు ర,తీశునిపట్టంపు◊టేనుఁ గనఁగ,
భువనైకమోహంబు ◊పొదలాడ నలువయం,తిక మొందుమోహినీ◊దేవి యనఁగ,

తే. చారుకులదేవతానివా◊సమ్ము వెడలి, యజరవనితాళి చుట్టు రా ◊నాళి యత్న
రీతి నొల్లన నడుచుచు ◊నృపులు గాంచి, నిశ్చలత నిల్వ గురుఁ జేరె ◊నెలఁత యపుడు. 64

టీక: నిఖిలాద్భుతముగన్—నిఖిల=సమస్తజనులకు, అద్భుతముగన్=ఆశ్చర్యకరముగా; మున్నీటిమన్నీనిన్=సముద్ర రాజగు పాలకడలిని; వెల్వడి=వెడలి; తోఁచులచ్చినెలంత యనఁగన్=కనఁబడు లక్ష్మీదేవి యన్నట్లుగా;
తళతల మనుచుక్కచెలిచాలు=తళతళయని ప్రకాశించు రిక్కలను కాంతలశ్రేణి; వలగొనన్=చుట్టుకొనఁగా; కనుపట్టు శీతాంశుకళ యనంగన్ = చూపట్టుచున్నచందమామకళ యన్నట్లుగా;
అధికయత్నమునన్=బహుప్రయత్నముచేత; ఒయ్యనన్=తిన్నగా; నడతెంచు రతీశునిపట్టంపుటేనుఁ గనఁగన్ = నడచుచు వచ్చుచున్నట్టి మన్మథుని పట్టఁపుగజమో యనునట్లుగా;భువనైకమోహంబు – భువన=లోకములకు, ఏక=ముఖ్యమగు, మోహంబు=వలపు;పొదలాడన్=వర్ధిల్లునట్లు; నలువ యంతిక మొందు మోహినీదేవి యనఁగన్ – నలువయంతిక మొందు=బ్రహ్మదేవునిసమీపమును పొందుచున్న, మోహినీదేవి యనఁగన్ = మోహినీదేవియో యనునట్లుగా; చారుకులదేవతానివాసమ్ము—చారు=సుందరమైన, కులదేవతా=కులదేవతయొక్క, నివాసమ్ము=ఉనికిపట్టునుండి; వెడలి = బైలుదేఱి; అజరవనితాళి=దేవాంగనాసంఘము; చుట్టు రాన్=చుట్టుకొని రాఁగా; ఆళి యత్నరీతిన్ – ఆళి=సకియలయొక్క, యత్న=ప్రయత్నముయొక్క, రీతిన్=భంగిచేత; ఒల్లనన్=తిన్నగా; నడుచుచున్; నృపులు=రాజులు; కాంచి=అవలోకించి; నిశ్చలతన్=అచంచలతచేత; నిల్వన్=నిలువఁగా; నెలఁత=చంద్రిక; అపుడు; గురున్=తండ్రిని; చేరెన్ = సమీపించెను.

అనఁగా నెల్లరకు నచ్చెరువును గలుఁగఁజేయుచుఁ, బాలకడలినుండి వెడలిన కలిమినెలంతవలె, రిక్కలు వలగొన్న చంద్రకళవలె, నతిప్రయత్నముతో నడతెంచు మరునిపట్టపుటేనుఁగువలె, నలువచేరువకుఁ బోవు మోహినీదేవివలె, నా చంద్రిక కులదేవతాస్థానమును విడిచి తండ్రిచెంతకుఁ జేరె నని భావము.

మ. కనకాంగీమణి యాత్మదృగ్రిపుమహా◊కంజావళి న్మెట్టుతీ
రునఁ జొక్కమ్మగుమెట్టుఁబ్రాల్పుటిక నం◊ఘ్రు ల్దార్చి యవ్వేళ నా
జననాథాగ్రణిముంగల న్నిలువ నో◊జ న్భూసురు ల్మంజుల
ధ్వనిఁ గన్యావరణంబుఁ జెప్పిరి ప్రమో◊దం బూన బంధు ల్మదిన్. 65

టీక: కనకాంగీమణి=కాంతారత్నమగు చంద్రిక; ఆత్మదృగ్రిపుమహాకంజావళిన్ – ఆత్మ=తనయొక్క, దృక్=నేత్రములకు; రిపు=శత్రువగు, మహత్=అధికమగు, కంజావళిన్=తామరపూబంతిని; మెట్టుతీరునన్=త్రొక్కురీతిగ; చొక్కమ్మగుమెట్టుఁ బ్రాల్పుటికన్—చొక్కమ్మగు=శ్రేష్ఠమగు, మెట్టుఁబ్రాల్పుటికన్=తలఁబ్రాలుపుటికయందు; అంఘ్రుల్=అడుగులను; తార్చి =ఉంచి; అవ్వేళన్=ఆసమయమందు ఆజననాథాగ్రణిముంగలన్= ఆసుచంద్రునియెదుట; నిలువన్=నిలుచుండఁగా; ఓజన్ = క్రమముగ; భూసురుల్=బ్రాహ్మణులు; మంజులధ్వనిన్ – మంజుల=మనోజ్ఞమగు, ధ్వనిన్=ధ్వనిచేత; కన్యావరణంబున్ = కన్యావరణమును; బంధుల్=బంధుజనులు; మదిన్=మనమునందు; ప్రమోదంబు=సంతసము; ఊనన్=పూనునట్లుగా; చెప్పిరి=వచించిరి. అనఁగా చంద్రిక తననేత్రములకు శత్రువగు కమలశ్రేణిని పాదములతోఁ ద్రొక్కుచున్నదానివలెఁ, దలఁబ్రాలు పుటికయం దడుగు లిడి సుచంద్రునియెదుట నిలువఁగా బ్రాహ్మణులు కన్యావరణమును జెప్పిరని భావము.

మ. వనజాక్షు ల్ధవళంబుఁ బాడఁగ మహా◊వాదిత్రనాదంబు బో
ర్కొనఁ జారూక్తిఁ బురోహితుండు ‘స హరిః◊కుర్యా త్సదామఙ్గళ’
మ్మని చిత్రంబుగ మంగళాష్టకము నె◊య్యం బొప్పఁగాఁ జెప్పి శో
భనలగ్నం బదె చేరె నంచు వివరిం◊పన్ సంభ్రమౌఘస్థితిన్. 66

టీక: వనజాక్షుల్=స్త్రీలు; ధవళంబున్=ధవళమను పాటను; పాడఁగన్=పాడఁగా, ముహూర్తకాలమునందు స్త్రీలు కొన్నిదేశము లలో ధవళమను పాటను బాడుట ప్రసిద్ధము. ‘పడఁతుల ధవళములు పెండ్లి◊పాటలు చెలఁగెన్’ అని ప్రాచీన గ్రంథములయందుఁ జెప్పఁబడియున్నది; మహావాదిత్రనాదంబు – మహత్=అధికమగు,వాదిత్ర= ఆనద్ధము, ఘనము, తతము, సుషిరము అను నీ వాద్యచతుష్టయముయొక్క, నాదంబు=ధ్వని; బోర్కొనన్=బోరని ధ్వనిచేయఁగా; చారూక్తిన్ –చారు=రమణీయమైన, ఉక్తిన్ =వచనముచేత; పురోహితుండు; స హరిఃకుర్యా త్సదామఙ్గళమ్మని = ‘స హరిఃకుర్యా త్సదామఙ్గళమ్’ అనుచు; చిత్రంబుగన్ = వింతగ; మంగళాష్టకము=మంగళముల నెనిమిదింటిని; నెయ్యంబు=ఇంపు; ఒప్పఁగాన్= ఒప్పునట్లు; చెప్పి=చదివి; శోభన లగ్నంబు=శుభలగ్నము; అదె చేరె నంచున్ = అదె సమీపించె ననుచు; సంభ్రమౌఘస్థితిన్=ప్రవాహమువంటి సంతసమందునికి చేత, అతిసంతోషముచేత ననుట; వివరింపన్=విశదపఱుపఁగా, పైపద్యముతో నన్వయము.

మ. జలజాప్తాన్వయు దైత్యభేదిగఁ దనూ◊జ న్వారిరుక్పాణిగాఁ
గలితైకాత్మఁ దలంచి యత్తఱి ‘నిమాం ◊కన్యాం ప్రదాస్యామి’ యం
చలపాంచాలుఁడు ధారఁబోసెఁ దనక◊న్యం దత్సుచంద్రావనీ
వలజానేతకు లేఖపాళి ప్రసవ◊వ్రాతంబు వర్షింపఁగన్. 67

టీక: జలజాప్తాన్వయున్=సూర్యవంశజుఁడగు సుచంద్రుని; దైత్యభేదిగన్=నారాయణునిఁగాను; తనూజ=కూఁతురయినట్టి చంద్రికను; వారిరుక్పాణిగాన్=లక్ష్మీదేవిగాను; కలితైకాత్మన్=ఒప్పుచున్న ఏకచిత్తముతో; తలంచి=ధ్యానించి; అత్తఱిన్ = ఆ సమయమందు; ఇమాం కన్యాం ప్రదాస్యామి యంచున్ = ‘ఇమాం కన్యాం ప్రదాస్యామి’ అను మంత్రము నుచ్చరించుచు; అల పాంచాలుఁడు=ఆక్షణదోదయరాజు; తనకన్యన్=తనకూఁతురిని; తత్సుచంద్రావనీవలజానేతకు=ఆసుచంద్రుఁడను పేరుగల భూపతికి; లేఖపాళి=సురసంఘము; ప్రసవవ్రాతంబు=పుష్పసంఘమును; వర్షింపఁగన్=కురియఁగా; ధారఁబోసెన్= ఉదక ధారాపూర్వకముగఁ గన్యాదానము చేసెను. అనఁగా సుచంద్రుని నారాయణమూర్తినిగాను, చంద్రికను లక్ష్మీదేవిగాను ఏకచిత్త ముతోఁ దలంచి సుచంద్రునకుఁ జంద్రికను క్షణదోదయుం డుదకధారాపూర్వకముగ దానము చేసె నని భావము.

చ. ధరణిఁ బరస్పరోక్తి జవ◊దాఁటక యుండ ఘటింపఁ గర్త తో
యరుహశరుండు గావునఁ ద◊దాత్మ నన న్సరిగా వధూవరు
ల్శిరముల నుంచి రప్డు గుడ◊జీరకము ల్పతి మున్ను దార్చె సుం
దరి యట మున్నె చేర్చె నని ◊తత్ప్రియబాంధవు లుగ్గడింపఁగన్. 68

టీక: ధరణిన్=పుడమియందు; పరస్పరోక్తిన్ – పరస్పర=ఒండొరులయొక్క, ఉక్తిన్=వచనమును; జవదాఁటక యుండన్ = మీఱకుండునటులు; ఘటింపన్=కలుఁగఁజేయుటకు; తోయరుహశరుండు=పద్మాస్త్రుఁడగు మదనుఁడు; కర్త=స్వతంత్రుఁడు; కావునన్=ఆహేతువుచేత; తదాత్మన్ అనన్= ఆమదనునియత్నముచేతనోయనునట్లు; సరిగాన్=సమానముగా; వధూవరుల్ =చంద్రికాసుచంద్రులు; అప్డు=ఆసమయమందు; గుడజీరకముల్=బెల్లమును జిలకఱ్ఱను; శిరములన్=శిరస్సులందు; పతి = పెనిమిటియగు సుచంద్రుఁడు; మున్ను=పూర్వము; తార్చెన్=ఉంచెను; సుందరి=చంద్రిక; అట మున్నె= అంతకుముందరనే; చేర్చెన్=ఉంచెను; అని=అనుచు; తత్ప్రియబాంధవులు – తత్=ఆవధూవరులయొక్క, ప్రియబాంధవులు=ప్రియులగు బందు గులు; ఉగ్గడింపఁగన్=వచించునట్లు; ఉంచిరి=ఉంచినవారలైరి.

అనఁగా మన్మథుఁడు వధూవరులను ప్రేమాతిశయమున నొండొరులమాట నతిక్రమింపకుండునటులు చేయువాఁడు గాన నామన్మథుని ప్రయత్నముచే నుంచిరా యనునట్లు బెల్లము జిలకఱ్ఱ యేకకాలమందు వధూవరు లొండొరుల శిరము లందుంచి రని భావము. పతి పత్నీశిరమున గుడజీరకములు ముందు చేర్చినఁ బతిమాటకు పత్ని జవదాఁటక యుండు ననియు, పత్ని పతిశిరమున గుడజీరకములు ముందు చేర్చినఁ బత్నిమాటకు పతి జవదాఁటక యుండు ననియు నొక వార్త గలదు గావున వారి ప్రియబాంధవులు పతి మున్ను చేర్చె ననియు పత్ని అంతకు మున్నె చేర్చె ననియు వచించి రని భావము.

క. అలమహిపతి మది సమ్మద,మలరన్ ‘మాంగల్యతంతు◊నానేన’ యటం
చెలమిఁ బురోధుఁడు దెలుపఁగఁ, గలకంఠికిఁ దాళిబొట్టు ◊గట్టెం జక్కన్. 69

టీక: అలమహిపతి=ఆసుచంద్రుఁడు; మదిన్=మనసునందు; సమ్మదము=సంతసము; అలరన్=ఒప్పఁగా; మాంగల్యతంతు నానేన యటంచున్ = ‘మాంగల్యతంతునానేన’ యను మంత్రమును జెప్పుచు; ఎలమిన్=సంతోషముతో; పురోధుఁడు= పురో హితుఁడు; తెలుపఁగన్=తెలియఁజేయఁగా; కలకంఠికిన్=చంద్రికకు; తాళిబొట్టు=మంగళసూత్రమును; చక్కన్=చక్కగా; కట్టెన్=కట్టెను.

మ. సకిపై నానృపమౌళి నింప నలకం◊జాతాక్షి గోత్రాధినా
యకుపై నింపఁగ సేసఁబ్రా ల్దనరె సా◊మ్యస్ఫూర్తి నవ్వేళఁ ద
త్సుకరాలంకృతినాదవాదములు దో◊డ్తో మించ సాహిత్యపో
షకుఁ డబ్జాస్త్రుఁడు దార్చునర్జునమణీ◊జాలాభిషేకం బనన్. 70

టీక: సకిపైన్=చంద్రికమీఁద; ఆనృపమౌళి=ఆసుచంద్రుఁడు; నింపన్=సేసలు నింపగా; అలకంజాతాక్షి=ఆచంద్రిక; గోత్రాధినాయకుపైన్=సుచంద్రునిమీఁద; నింపఁగన్=సేసలు నింపఁగా; సేసఁబ్రాల్=తలఁబ్రాలు; సామ్యస్ఫూర్తిన్=సమానస్ఫూర్తిచేత; అవ్వేళన్=ఆసమయమందు; తత్సుకరాలంకృతినాదవాదములు – తత్=ఆవధూవరులయొక్క, సు=శ్రేష్ఠమగు, కర=హస్త మందలి, అలంకృతి=కంకణాద్యలంకృతులయొక్క, నాద=ధ్వనులనెడు, వాదములు=వాగ్వివాదములు; తోడ్తోన్=వెంటనె; మించన్=అతిశయింపఁగా; సాహిత్యపోషకుఁడు – సాహిత్య=సాంగత్యమునకు, పోషకుఁడు=అభివృద్ధిపఱచునట్టివాఁడు; అబ్జాస్త్రుఁడు=మరుఁడు; ఇచట, తత్సుకరాలంకృతి నాదవాదములు – తత్=ప్రసిద్ధమగు, సుకర=మనోజ్ఞమగు, అలంకృతి =ఉపమాద్యలంకారములు, నాద=ధ్వనులను, వాదములు, సాహిత్యపోషకుఁడు=సాహిత్యవిద్యకుఁ బోషకుఁడను నర్థము దోఁచుచున్నది; తార్చునర్జునమణీజాలాభిషేకంబనన్ – తార్చు=చేయునట్టి, అర్జునమణీ=వజ్రములయొక్క, జాల =సమూ హముయొక్క, అభిషేకంబనన్ = అభిషేకమో యనునట్లు; తనరెన్=ఒప్పెను. చంద్రికాసుచంద్రు లొకరిపై నొకరు నించు సేసఁబ్రాలు సామ్యస్ఫూర్తిచేత నొండొరులకు నానుకూల్యమును పోషించు మన్మథుఁడు సేయు రవలరాశియొక్క యభిషేకమో యనునటు లొప్పె నని భావము. వస్తూత్ప్రేక్షాలంకారము.

మ. కపిలావాచనభద్రవేళఁ దగి రా◊కాంతావిభు ల్సేసము
త్తెపుచా ల్దార్కొనుమెట్టుఁబ్రాల్పుటిక లు◊ద్దీపించు పెన్కాఁడితోఁ
దపనీయాంశుకసూనుసంభృతతులా◊త్మం బూన లావణ్యభా
గ్యపటుశ్రీసమరీతిఁ దెల్ప సరి దూఁ◊గన్నిల్చుచందంబునన్. 71

టీక: కపిలావాచనభద్రవేళన్ – కపిలావాచన=వివాహాంగభూతమగు క్రియావిశేషముయొక్క, భద్రవేళన్=శుభవేళయందు; ఆకాంతావిభుల్=ఆవధూవరులు; సేసముత్తెపుచాల్=సేసముత్యములయొక్క శ్రేణిని; తార్కొనుమెట్టుఁబ్రాల్పుటికలు= కది సిన తలఁబ్రాలుపుటికలు; ఉద్దీపించు=ప్రకాశించు; పెన్కాఁడితోన్=గొప్పకాఁడిమ్రాఁకుతో, యుగముతో ననుట; తపనీయాం శుకసూను సంభృత తులాత్మన్ – తపనీయాంశుకసూను=విష్ణుపుత్త్రుఁడగు మరునిచే, సంభృత=భరియింపఁబడిన, తులా= త్రాసుయొక్క, ఆత్మన్=స్వరూపమును; పూనన్=గ్రహింపఁగా; లావణ్యభాగ్యపటుశ్రీసమరీతిన్ – లావణ్య=చక్కఁదనము యొక్క, భాగ్య=భాగ్యముయొక్క,పటు=సమర్థమగు,శ్రీ=కాంతియొక్క, సమరీతిన్=సామ్యమును; తెల్పన్=తెలుపుట కొఱకు; సరి దూఁగన్=సరిగా తులఁదూఁగుటకు; నిల్చుచందంబునన్=నిలుచురీతిగా; తగిరి=ఒప్పిరి.

అనఁగా చంద్రికాసుచంద్రులు, మెట్టుఁబ్రాల్పుటికలు వధూవరులయొద్ద నుంచు కాఁడిమ్రాఁకుతో చూపఱకు మదనుఁడు దూఁచు త్రాసువలె నొప్పఁగా, అందు తమలావణ్యాదులను దెలుపుటకై సరిగాఁదూఁగినట్లు సమముగ నొప్పిరని భావము.

చ. అలయినసన్మహస్స్ఫురణ ◊నందుచు శ్యామయు నాకలాపినీ
కులతిలకోత్సవాకలనఁ ◊గూడుచు నాహరివంశనాయకుం
డలరి యజస్రము న్వెలయ ◊నయ్యెడ నంచితమంత్రశక్తిఁ ద
త్కలితకరాంబుజస్థలులఁ ◊గట్టిరి కంకణము ల్ధరామరుల్. 72

టీక: అలయినసన్మహస్స్ఫురణన్ – అలయిన=ఆసుచంద్రునియొక్క, సత్=శ్రేష్ఠమగు, మహః=ప్రతాపముయొక్క, స్ఫుర ణన్=ప్రకాశమును; అందుచున్=పొందుచు; శ్యామయున్=చంద్రికయును; ఇచట, అలయిన=ఆసూర్యునియొక్క, సత్= శ్రేష్ఠమగు, మహఃస్ఫురణన్=ప్రకాశాతిశయమును, అందుచున్=పొందుచు, శ్యామయున్=రాత్రియు నను విరోధార్థము దోఁచు చున్నది; ఆకలాపినీకులతిలకోత్సవాకలనన్ – ఆకలాపినీకులతిలక=ఆచంద్రికయొక్క, ఉత్సవ=వేడుకయొక్క, ఆకలనన్= ప్రాప్తిని; కూడుచున్=పొందుచు; ఆహరివంశనాయకుండు=ఆసూర్యవంశనాయకుఁడగు సుచంద్రుఁడు; ఇచట, ఆకలాపినీ కులతిలక=ఆమయూరీశ్రేష్ఠముయొక్క, ఉత్సవ=వేడుకయొక్క,ఆకలనన్= ప్రాప్తిని; కూడుచున్=పొందుచు; ఆహరివంశ నాయకుండు=ఆసర్పశ్రేష్ఠము అను విరోధార్థము దోఁచుచున్నది; అలరి=సంతసించి; అజస్రమున్=ఎల్లపుడు; వెలయన్=ప్రకా శించుటకై; అయ్యెడన్=ఆసమయమందు; అంచితమంత్రశక్తిన్ – అంచిత=ఒప్పుచున్న, మంత్రశక్తిన్=మంత్రసామర్థ్యముచేత; తత్కలితకరాంబుజస్థలులన్ – తత్=ఆవధూవరులయొక్క, కలిత=ఒప్పుచున్న, కరాంబుజస్థలులన్= కేలుదామరలయొక్క ప్రదేశములందు; ధరామరుల్=బ్రాహ్మణులు; కంకణముల్=కంకణములను, ప్రతిసరముల ననుట; కట్టిరి.

అనఁగా సూర్యస్ఫురణచే రాత్రి వెలయునట్లు మయూరీమహోత్సవమును గూడి సర్పశ్రేష్ఠము సంతసించునటులు మంత్ర శక్తిచే బాపలు వధూవరులకరంబులయందుఁ గంకణములు గట్టిరని భావము. సూర్యవంశశ్రేష్ఠుఁడగు సుచంద్రుని ప్రతాపము నకు చంద్రిక సంతసించునటులు చంద్రికామహోత్సవమును గూడి సుచంద్రుఁ డెల్లపుడు సంతసించునటులు కంకణములఁ గట్టి రని స్వభావాభిప్రాయము.

చ. అలిచికురాసువర్ణవస◊నాంచలసంగ్రథితాంశుకాంతుఁడై
యలనరపాలమౌళి విమ◊లాంబుజరాగవివాహపీఠికా
స్థలి వసియించి లాజసము◊దాయమున న్శిఖిహోమ మూన్చె ను
త్కలిక చెలంగ భూసురవి◊తానము మంత్రము లుగ్గడింపఁగన్. 73

టీక: అలనరపాలమౌళి=ఆసుచంద్రుఁడు; అలిచికురాసువర్ణవసనాంచలసంగ్రథితాంశుకాంతుఁడై – అలిచికురా=భృంగముల వంటి కుంతములుగల చంద్రికయొక్క, సువర్ణవసన=బంగరువస్త్రముయొక్క, అంచల=అంచుచేత, సంగ్రథిత=కట్టఁబడిన, అంశుకాంతుఁడై=వస్త్రముయొక్క అగ్రము గలవాడై; విమలాంబుజరాగవివాహపీఠికాస్థలిన్ – విమల=స్వచ్ఛమగు, అంబుజ రాగ= పద్మరాగములయొక్క, వివాహపీఠికా=పెండ్లిపీఁటయొక్క, స్థలిన్=ప్రదేశమందు; వసియించి=కూర్చుండి; లాజ సముదాయమునన్ – లాజ=పేలాలయొక్క, సముదాయమునన్=సమూహముచేతను; శిఖిన్=అగ్నియందు; హోమము =హవనమును; ఉత్కలిక=సంతసము; చెలంగన్=ఒప్పఁగా; భూసురవితానము=బ్రాహ్మణసంఘము; మంత్రములు=మంత్ర ములను; ఉగ్గడింపఁగన్=వచించుచుండఁగా; ఊన్చెన్=ఒనరించెను.

అనఁగా సుచంద్రుఁడు చంద్రికావస్త్రముతోఁ దనవస్త్రమునకు ముడి వేసికొని, పద్మరాగమణిమయపీఠమందు వసించి, బ్రాహ్మణులు మంత్రముల నుగ్గడించుచు నుండఁగ లాజహోమము నగ్నియందుఁ జేసె నని భావము.

మ. సనెకల్ హత్తఁగఁ జేసె నంఘ్రి చెలి చం◊చత్కుడ్యచిత్రాత్మ ని
ల్చినకంతుండు పురాకృతాగము సనం ◊జిత్తంబులో నిల్పి యం
చనరక్తిం దనుఁ బ్రోవు మంచుఁ దదను◊చ్ఛాయోపధిం డాసి వం
దన మూన్పం గని ప్రోతు నం చభయపా◊దం బూన్చు చందంబునన్. 74

టీక: చంచత్కుడ్యచిత్రాత్మన్ – చంచత్=ప్రకాశించుచున్న, కుడ్య=గోడయందు, చిత్రాత్మన్=చిత్తరువురూపముతో; నిల్చిన కంతుండు=నిలుచుండిన మదనుఁడు; పురాకృతాగము=ముందుచేసిన యపరాధము; చనన్=పోవుటకు;చిత్తంబులో నిల్పి = హృదయమందుంచి; అంచనరక్తిన్ – అంచన=ఒప్పుచున్న, రక్తిన్=ప్రేమచేత; తనున్; ప్రోవు మంచున్=పాలింపు మనుచు; తదనుచ్ఛాయోపధిన్ – తత్=ఆసనెకంటియొక్క, అనుచ్ఛాయా=ప్రతిచ్ఛాయయొక్క, ఉపధిన్=వ్యాజముచేత; డాసి= డగ్గఱి; వందనము = నమస్కారమును; ఊన్పన్ = చేయఁగా; కని = చూచి; ప్రోతు నంచున్ = పాలింతు ననుచు; అభయ పాదంబు = అభయము నిచ్చు పాదమును; ఊన్చు చందంబునన్=ఉంచుతెఱంగున; చెలి =చంద్రిక; అంఘ్రి=పాదమును; సనెకల్=సనెకంటిని; హత్తఁగఁ జేసెన్=ఆక్రమించునట్లు చేసెను.

చంద్రిక, సప్తపదియందు నెదుట నుంచిన సనెకంటియందు గోడమీఁద వ్రాసియున్న మరుఁడు ప్రతిఫలించునెపంబునఁ దాను బూర్వమం దొనరించినట్టి యపరాధమును పోనాడుటకై నన్నుఁ జిత్తమం దుంచి రక్షింపు మని నమస్కరింపఁగా గాపాడుదు నని యొప్పుకొన్నదానివలె, పాదముచే సనెకంటిని స్పృశించె నని భావము.

చ. జనపతి మౌళి భూసురు లొ◊సంగుశుభాక్షతపాళిఁ దాల్చి యం
గనలు ఘటించునారతులు ◊గన్గొని యంత వధూకరాత్తహ
స్తనళినుఁడై ముదంబున ల◊సత్కులదేవగృహంబుఁ జేర నొ
య్యనఁ జనియెన్ గలధ్వనుల ◊నైదువు లింపుగఁ బాటఁ బాడఁగన్. 75

టీక: జనపతిమౌళి=రాజశ్రేష్ఠుఁడగు సుచంద్రుఁడు; భూసురులు=బ్రాహ్మణులు; ఒసంగుశుభాక్షతపాళిన్ – ఒసంగు= సమర్పిం చిన, శుభ=మంగళకరమైన, అక్షతపాళిన్=మంత్రాక్షతశ్రేణిని; తాల్చి=ధరించి; అంగనలు=కాంతలు; ఘటించు నారతులు = ఇచ్చునట్టి హారతులను; కన్గొని=చూచి; అంతన్=ఆమీఁద; వధూకరాత్తహస్తనళినుఁడై – వధూకర=చంద్రిక హస్తమును, ఆత్త = పొందిన, హస్తనళినుఁడై=కరకంజముగలవాఁడై; ముదంబునన్=సంతసముచేత; లసత్కులదేవగృహం బున్ – లసత్= ప్రకా శించుచున్న, కులదేవగృహంబున్=కులదేవతామందిరమును; చేరన్=పొందుటకై; ఒయ్యనన్=తిన్నగ; కలధ్వనులన్= అవ్యక్తమధురమగు ధ్వనులచేత; ఐదువులు=సువాసినులు; ఇంపుగన్=సొంపుగ; పాటఁ బాడఁగన్=పాటఁ బాడుచుండఁగా; చనియెన్=పోయెను.

ఉ. మ్రొక్కు ఘటింపఁ బెండ్లికొమ◊రుం డబలాయుతి నేగుదేరఁగా
నక్కులదేవతాజనుల ◊యంచున వే యెదు రేగుదెంచి మేల్
నిక్కఁగ నిల్చి తత్సఖులు ◊నీటున వారల నిల్పి రంగునన్
గ్రక్కునఁ దత్సమాఖ్యలఁ బ◊రస్పరవాణి వినంగ నయ్యెడన్. 76

టీక: పెండ్లికొమరుండు=సుచంద్రుఁడు; అబలాయుతిన్=చంద్రికయొక్క కూడికచేతను; మ్రొక్కు ఘటింపన్= నమస్కరించు టకై; ఏగుదేరఁగాన్=రాఁగా; అక్కులదేవతాజనులయంచునన్=ఆకులదేవతలవిధమున; తత్సఖులు=ఆవధూవరుల సకి యలు; వే = శీఘ్రముగ; ఎదురేగుదెంచి=అభిముఖముగ వచ్చి; మేల్నిక్కఁగన్=శుభ మతిశయింపఁగ; నిల్చి; గ్రక్కునన్ =శీఘ్రముగ; తత్సమాఖ్యలన్=చంద్రికాసుచంద్రులనామములను; పరస్పరవాణిన్=ఒండొరులమాటలచేత; వినంగన్= విను టకై; అయ్యెడన్=ఆసమయమందు; నీటునన్=మురిపెముచేత; వారలన్=ఆచంద్రికాసుచంద్రులను; అంగునన్=అందముగా; నిల్పిరి=నిలువఁ జేసిరి. చంద్రికను గూడి సుచంద్రుఁడు కులదేవతలకు నమస్కరించుటకై బైలుదేఱఁగా, నీవధూవరుల నామ ములు పరస్పరవచనంబుల వినఁ గోరి, తత్కులదేవతలవలె వారిసఖు లడ్డము వచ్చి, చంద్రికాసుచంద్రులను నిల్పి రని భావము.

చ. తెలుపుము చంద్రికాఖ్య జగ◊తీవర యన్న విభుండు నవ్వునం
దెలుపక తెల్ప లో నెఱిఁగి ◊నీరజలోచన యాళు లందఱుం
దెలుపు సుచంద్రనామము స◊తీ యన నెమ్మొగ మెత్తి దానిచేఁ
దెలిపె సకుల్ ధరన్ సహజ◊దీపితకౌశల లౌదురే కదా. 77

టీక: జగతీవర=ఓభూవరా(సుచంద్రుఁడా)! చంద్రికాఖ్యన్=చంద్రికానామమును; తెలుపుము=తెలియఁజేయుము; అన్నన్= అనఁగా; విభుండు=సుచంద్రుఁడు; నవ్వునన్=నగవుచేతనె; తెలుపక తెల్పన్=తెలుపకయే తెలుపఁగా, అనఁగా నానగవె చంద్రిక యని నోటఁజెప్పక నవ్వుచే చంద్రికనామమమును ఎఱింగించె నని భావము, స్మితము చంద్రికారూప మనుట ప్రసిద్ధము; నీరజ లోచన=చంద్రిక; లోన్=అంతరంగమునందు; ఎఱిఁగి=తెలిసికొని, చంద్రికనామమును వచింపుమనఁగా నానగవె చంద్రిక యని యుక్తితోఁ దెలిపిన కౌశల్యమును గుర్తెఱిఁగి యని భావము; ఆళు లందఱున్=చెలులెల్లరు; సుచంద్రనామము= సుచంద్రుని పేరును; సతీ=చంద్రికా! తెలుపు=తెలుపుము; అనన్= అనఁగా; నెమ్మొగము=సుందరమగు ముఖమును; ఎత్తి =ఎత్తినదై; దాని చేన్=ఆ ముఖము నెత్తుటచేతనె; తెలిపెన్=తెలియఁజేసెను, చంద్రునివలె ముఖ ముండుటచే నాముఖమే సుచంద్రుఁ డని యుక్తితోఁ దెల్పె నని భావము; సకుల్=స్త్రీలు; ధరన్=పుడమియందు; సహజదీపితకౌశలలు=స్వభావముచేఁ బ్రకాశించుచున్న జాణ తనము గలవారు; ఔదురే కదా=ఔదురుగదా!

చ. చెలి సుముఖోక్తిఁ దెల్పు నృప◊శేఖరుపే రని డాసి వెండియుం
గలరవ లెల్ల వేఁడ, సుము◊ఖం బని నేర్పునఁ బల్కు, నీవు మున్
దెలిపినఁ దెల్పుఁ గొమ్మ పతి ◊దెల్పవె యీవనితాఖ్య కాంతవా
క్కలన నటన్నఁ, గాంత యనఁ◊గా మది మెచ్చిరి తద్వచోర్థముల్. 78

టీక: కలరవ లెల్లన్=కాంతలందఱు; వెండియున్=మఱియు; డాసి =సమీపించి; చెలి=చంద్రికా! సుముఖోక్తిన్ – సు=సమీచీన మైన, ముఖోక్తిన్=ముఖవచనముచేత; నృపశేఖరుపేరు=సుచంద్రునినామమును; తెల్పు=తెలియఁజేయుము; అనివేఁడన్= ఈ ప్రకారము వేఁడుకొనఁగా; సుముఖంబు=సుముఖము; అని=అనుచు; నేర్పునన్=కౌశల్యముచేత; పల్కున్=పలికెను, సుచం ద్రునినామము సుముఖమని తెల్పె ననఁగా సు అను శబ్దము ముఖమందున్నది గావున సుముఖ మని తాత్పర్యము; పతి =రాజా! నీవు మున్ దెలిపినన్=నీవు మొదట చంద్రికపేరు దెల్పఁగా; కొమ్మ=చంద్రిక; తెల్పున్=తెలుపును; ఈవనితాఖ్యన్ =ఈచంద్రిక నామమును; కాంతవాక్కలనన్—కాంత=మనోహరమైన, వాక్కలనన్=వాక్కుసంబంధముచేత; తెల్పవె అటన్నన్= తెలియఁ జేయుమా యనఁగ; కాంత యనఁగాన్=కాంతయని చెప్పఁగా, అనఁగా చంద్రికనామము కకారాంతమైనదని భావము; తద్వచో ర్థముల్ – తత్=ఆవధూవరులయొక్క, వచః=మాటలయొక్క, అర్థముల్=అర్థములను; మదిన్=మనమందు; మెచ్చిరి= బహూకరించిరి. ఈపద్యమందు శ్లేషచే నర్థాంతరకల్పన యుండుటం జేసి వక్రోక్త్యలంకారము.

ఉ. వెన్నెల కెద్ది పేరు పృథి◊వీవర తెల్పఁ గదే య టన్నచో
నన్నృపమౌళి జ్యోత్స్న యను, ◊నంగన యొప్పగురాజుపే రదే
మన్న సుశీతరశ్మి యను, ◊నబ్రము చంద్రిక యంచు భర్త యా
కన్నె సుచంద్ర యంచుఁ బలు◊క న్మది నాఁగిరి లజ్జపెంపునన్. 79

టీక: పృథివీవర=ఓభూవర (సుచంద్రుఁడా)! వెన్నెలకున్, ఎద్ది పేరు=పేరెయ్యది? తెల్పఁగదే యటన్నచోన్= తెల్పు మనఁ గా; అన్నృపమౌళి=ఆరాజశ్రేష్ఠుఁడు (సుచంద్రుఁడు); జ్యోత్స్న యనున్= జ్యోత్స్న యని చెప్పును; అంగన=ఓయింతీ (చంద్రికా)! ఒప్పగురాజుపేరు = సుందరుండగు చంద్రునిపేరు; అదేమన్నన్=అదియేమనఁగా; సుశీతరశ్మి యనున్= సుశీతరశ్మి యని చెప్పును; అబ్రము=ఆశ్చర్యము! భర్త=సుచంద్రుఁడు; చంద్రిక యంచున్=చంద్రిక యని; ఆకన్నె=ఆచంద్రిక; సుచంద్ర యంచున్ = సుచంద్రుఁడని; పలుకన్=వచించుటకు; మదిన్=చిత్తమునందు; లజ్జపెంపునన్=వ్రీడాతిశయముచే; ఆగిరి=మానిరి. అనఁగా చెలులు సుచంద్రునిఁ జంద్రికపేరు యుక్తిగఁ జెప్పించుటకై వెన్నెలపే రడిగిన, సుచంద్రుఁడు చంద్రిక యనక జ్యోత్స్న యనియు, చంద్రికను ఒప్పిదమగు రాజుపే రడిగిన నాపె సుచంద్రుఁ డనక సుశీతరశ్మి యనియు, చెప్పిరని భావము.

చ. మును హృదయాలయాభివృత◊మోహనిరూఢిఁ బరస్పరాఖ్య లిం
పున ననిశంబుఁ బిల్చునల◊భూపతియున్ సతియున్ బ్రియాళికా
జనములు దెల్పుమన్న నొక◊సారి వచింపఁగ నేర రౌర యే
మనఁ దగుఁ దత్త్రపాజలరు◊హాశుగశాంబరికావిలాసముల్. 80

టీక: మును=పూర్వమందు; హృదయాలయాభివృతమోహనిరూఢిన్ – హృదయాలయ=మనోవీథియందు; అభివృత= ఆవరింపఁబడిన, మోహ=వలపుయొక్క, నిరూఢిన్=రూఢిచేత; పరస్పరాఖ్యలు=ఒండొరులనామములను; ఇంపునన్= ఇష్టము చేత; అనిశంబు=ఎల్లపుడు; పిల్చు అలభూపతియున్ సతియున్ = పిలుచుచున్నట్టి యాసుచంద్రుఁడును చంద్రిక యును; బ్రియాళికాజనములు=సకియలు; తెల్పుమన్నన్=తెల్పుమని యడుగఁగా; ఒకసారి=ఒకమాఱును; వచింపఁగన్= చెప్పుటకు; నేరరు; ఔర=ఆశ్చర్యము! తత్త్రపాజలరుహాశుగశాంబరికావిలాసముల్—తత్త్రపా=ఆలజ్జయను, జలరహాశుగ= మరునియొక్క, శాంబరికా=మాయయొక్క, విలాసముల్=విలాసములను; ఏమనఁ దగున్=ఏమనవచ్చు?

అనఁగా పూర్వము చంద్రికాసుచంద్రులు పరస్పర మొకరినామ మొకరు పలుమఱు బల్కుచునుండియు, నిపుడు చెలులు పలుమఱు వేఁడినను ఒకసారియైన నొండొరులనామముల వచింపరు. ఈలజ్జయను మన్మథమాయ నేమన వచ్చు ననిభావము.

చ. అలతఱి నాళి యత్నగతి ◊నంచితమంధరవాఙ్నిరూఢిఁ బే
రులు వచియించి భక్తి మదిఁ ◊గ్రుమ్మర దేవుల మ్రొక్కి బాసిక
మ్ములు సడలించి బంధువృతి ◊ముద్దుగ బువ్వము లారగించి తొ
య్యలియు విభుండు మించిరి ని◊రర్గళసంభ్రమ వైభవంబులన్. 81

టీక: అలతఱిన్=ఆసమయమందు; ఆళియత్నగతిన్—ఆళి=చెలికత్తెలయొక్క, యత్న=ప్రయత్నముయొక్క,గతిన్=రీతి చేత; అంచితమంధరవాఙ్నిరూఢిన్ – అంచిత=ఒప్పుచున్న, మంధర=మెల్లనగు, వాఙ్నిరూఢిన్=వచనరూఢిచేత; పేరులు= ఒండొరుల నామములను; వచియించి=చెప్పి; భక్తి=దేవతావిషయకమైన ప్రేమ; మదిన్=మనమునందు; క్రుమ్మరన్=తిరు గఁగా; దేవులన్=కులదేవతలను; మ్రొక్కి=నమస్కరించి; బాసికమ్ములు=బాసికములను; సడలించి=విడిచి; బంధువృతిన్ – బంధు= బందుగులయొక్క, వృతిన్=కూడికచేతను; ముద్దుగన్=మనోజ్ఞముగ; బువ్వము=బువ్వపుబంతి భోజనములను; ఆరగించి =భుజించి; తొయ్యలియున్=చంద్రికయు; విభుండున్=సుచంద్రుఁడును; నిరర్గళసంభ్రమ వైభవంబులన్ – నిరర్గళ =అడ్డము లేని, సంభ్రమ వైభవంబులన్=సంతోషవిభవములచేత; మించిరి=అతిశయించిరి.

అనఁగ నీవధూవరులు చెలికత్తెల నిర్బంధము చేత తిన్నగ నొండొరులనామములు చెప్పి, కులదేవతలకు నమస్కరించి, బాసికములు విడిచి, బువ్వపుబంతి భోజనముల నారగించి సంతోషముచే మించి రని భావము.

క. ఈలీల నశేషనిలిం,పాళీనుతతత్కరగ్ర◊హచతుర్ఘస్రీ
వేలాంచితవిభవము హే,రాళంబై వెలయ నాధ◊రాపతి యలరెన్. 82

టీక: ఈలీలన్=ఈరీతిగ; అశేష నిలింపాళీ నుత తత్కరగ్రహ చతుర్ఘస్రీ వేలాంచిత విభవము – అశేష=సమస్తమగు, నిలింపాళీ= సురశ్రేణిచేత, నుత=పొగడఁబడిన, తత్కరగ్రహ=ఆవివాహముయొక్క, చతుర్ఘస్రీ=నాల్గుదినములను, ‘చతుర్ణాం ఘస్రాణాం సమూహ శ్చతుర్ఘస్రీ’ అని విగ్రహము. ఇట, ‘అకారాంతోత్తరపదో ద్విగుస్త్రియా మిష్టః’ అని స్త్రీత్వము వచ్చినదని యెఱుంగు నది, వేలా=మేరచేత, అంచిత=ఒప్పుచున్న, విభవము=ఉత్సవము; హేరాళంబై=అధికమై, వెలయన్= ప్రకాశింపఁగా; ఆధరాపతి = ఆసుచంద్రుఁడు; అలరెన్=సంతసించెను.

ఉ. వేదవిధానముం బుడమి◊వేల్పులు దెల్పఁగ నంత శేషహో
మాదికమంగళాచరణ◊లన్నియుఁ దీర్చి చెలంగునాధరి
త్రీదయితామరేంద్రునకు ◊దివ్యమహర్షికులాగ్రగణ్యు లా
మోదముతో నభీష్టకర◊ము ల్వరము ల్ఘటియించి రందఱున్. 83

టీక: పుడమివేల్పులు=భూసురులు; వేదవిధానమున్=వేదవిధిని; తెల్పఁగన్=తెలియఁజేయఁగా; అంతన్=అటుపిమ్మట; శేషహోమాదిక మంగ ళాచరణలు – శేషహోమాదిక=శేషహోమము మొదలుగాఁగల, మంగళ=శుభకార్యములయొక్క, ఆచరణలు=ఆచరించుటలు; అన్నియున్=అన్నిటిని; తీర్చి=సమాప్తి నొందించి; చెలంగునాధరిత్రీదయితామరేంద్రునకున్ –చెలంగు = ప్రకాశించుచున్న, ఆధరిత్రీదయితామరేంద్రునకున్= ఆభూపతీంద్రుఁడైన సుచంద్రునకు; దివ్య మహర్షికులాగ్రగ ణ్యులు–దివ్య = శ్రేష్ఠులగు, మహర్షికుల=ఋషిసంఘమందు, అగ్రగణ్యులు=పూజ్యులగు మునులు; అందఱున్=ఎల్లరును; ఆమోదముతోన్ =సంతోషముతో; అభీష్టకరముల్=కోరిన కోరికలఁ జేయునట్టి, వరముల్=వరములను; ఘటియించిరి= ఇచ్చిరి.

అనఁగా శేషహోమాది వివాహాంగక్రియలు నిర్వర్తించి మించి యున్న పుడమిఱేనికి నామహర్షిసంఘము లెల్లఁ గోరిన వరముల నిచ్చిరని భావము.

ఉ. వేఁడినకోరికల్ గురియు◊వింతగుమానికము ల్జగంబులం
జో డొకచోట లేని పలు◊సొమ్ములు హెచ్చగు పైఁడివల్వలు
న్వేడుక పొంగ వీడు చది◊వించిరి బంధులు సర్వదేశస
మ్రాడమరేంద్రులున్ హితులు◊మంత్రులు తన్మహినేత కయ్యెడన్. 84

టీక: తన్మహినేతకున్=ఆసుచంద్రునకు; అయ్యెడన్=ఆసమయమందు; బంధులు=చుట్టములు; సర్వదేశసమ్రాడమరేంద్రు లున్—ఎల్లదేశములదొరలు, దేవశ్రేష్ఠులు; హితులు=నేస్తకాండ్రు; మంత్రులు=సచివులు; వేఁడినకోరికల్=అభీష్టవస్తువులను; కురియు వింతగుమానికముల్ – కురియు=వర్షించు; వింతగు=చిత్రమగు, మానికముల్=మణులను; జగంబులన్=లోకము లందు; జోడు=జత; ఒకచోట లేని=ఒకచోటను లేనట్టి, జగదేకమైన యనుట; పలుసొమ్ములు=అనేకమగు ఆభరణములను; హెచ్చగు పైఁడివల్వలున్=అధికమగు బంగరువస్త్రములను; వేడుక=కుతూహలము; పొంగన్=అతిశయింపఁగ; వీడు=కట్న మును; చదివించిరి=ఇచ్చిరి. వివాహాంతమున సుచంద్రునకు బందుగులు, సర్వదేశములరాజులు, హితులు మొదలగువారు మణులు మొదలగు కట్నములను చదివించిరని భావము.

సీ. అహికి లోఁబడనిది◊వ్యగజంబు బృంహితా,ర్భటిఁ గేరు భద్రవా◊రణశతముల,
ననికి వేలుపుతేజి ◊నలరుకైజామోర, యల్లార్పుచేఁ జీరు◊హయకులముల,
వేగంటితేరికా◊విమెఱుంగు పడగవీ,వలిఁ బాయఁ జేయును◊జ్జ్వలరథములఁ,
దెఱగంటితెఱవల◊తీరెల్ల బెళుకుచూ,పులనె పోనాడు పూఁ◊బోఁడిగములఁ,

తే. దులకు జేజేలరతనంబు ◊దొడర సుగుణ,భారగతి నెగఁబట్టు ను◊దారమణుల,
నపుడు పాంచాలుఁ డొసఁగెఁ ద◊ద్విపులవిభవ, జనితహర్షాప్తమతికిఁ ద◊న్మనుజపతికి. 85

టీక: అహికి లోఁబడనిదివ్యగజంబున్ – అహికిన్=వృత్రాసురునకు, లోఁబడని=వశపడని, దివ్యగజంబున్=ఐరావతమును; బృంహితార్భటిన్—బృంహిత=కరిగర్జితములయొక్క, ఆర్భటిన్=మ్రోఁతచేతను; కేరు భద్రవారణశతములన్ – కేరు=పరి హసించు, భద్రవారణశతములన్=భద్రగజములయొక్క నూఱులను, భద్రగజసమూహముల ననుట; ఇంద్రశత్రువగు వృత్రా సురునకు వశముగాని యైరావతమును తమ ధ్వనులచేఁ బరిహసించుచున్న పెక్కుగజములను పాంచాలుఁడు సుచంద్రున కిచ్చె నని భావము; అలరుకైజామోరయల్లార్పుచేన్ – అలరు=ఒప్పుచున్న, కైజా= కళ్ళెమునకుఁ గట్టఁబడిన త్రాటిచే బిగింపఁబడిన; మోర = ముఖముయొక్క,అల్లార్పుచేన్=కదలించుటచేత; వేలుపుతేజిన్=ఉచ్చైశ్రవమును; అనికిన్=యుద్ధమునకు; చీరు హయకుల ములన్=పిలుచుచున్న గుఱ్ఱములగుంపులను; ముఖచలనముచే నింద్రహయములను యుద్ధమునకుఁ బిలుచు నుత్తమాశ్వము లను సమర్పించె నని భావము.వేగంటితేరికావిమెఱుంగున్ – వేగంటితేరి=ఇంద్రునియొక్క రథములగు మేఘములయొక్క, కావిమెఱుంగున్=ఎఱ్ఱని కాంతిని; పడగవీవలిన్=ధ్వజమారుతముచేత; పాయఁజేయునుజ్జ్వలరథములన్=పోఁగొట్టుచున్న ప్రకాశించు తేరులను; తమ సిడెము యొక్క గాలిచేతనె మేఘములమెఱుఁగును బోగొట్టునట్టి రథముల నిచ్చె నని భావము;
తెఱగంటితెఱవలతీరెల్లన్=వేల్పుకన్నెలయొక్క చక్కఁదనము నంతయు; బెళుకుచూపులనె=తళతళమని ప్రకాశించు వీక్షణ ములచేతనె; పోనాడు పూఁబోఁడిగముల=పోఁగొట్టుచున్న స్త్రీబృందములను; దేవాంగనలతీరును తమనేత్రకాంతిచేతనె పోఁ గొట్టు వనితల నిచ్చెనని భావము; తులకున్=త్రాసునకు; జేజేలరతనంబు=చింతామణి; తొడరన్=పూనఁగా; సుగుణభారగతిన్—సుగుణ=మంచిగుణముల యొక్క, భార=బరువుయొక్క, గతిన్=రీతిచేత; ఎగఁబట్టు ఉదారమణుల=ఎగయఁజేయునట్టి ఉత్కృష్టమైన మణులను; చింతామణి తమతోఁ దులదూఁగఁగా తమగుణములచే నట్టి చింతామణిని బరువునందు చులకఁ జేయు మణుల నిచ్చె ననుట;
అపుడు=ఆసమయమందు; పాంచాలుఁడు=క్షణదోదయుఁడు; తద్విపులవిభవజనితహర్షాప్తమతికిన్ – తత్=ఆక్షణదోద యునియొక్క, విపుల=విశాలమగు, విభవ=సంపదచేత, జనిత=పుట్టింపఁబడిన,హర్ష=సంతసముచేత; ఆప్త=పొందఁబడిన, మతికిన్=మనముగల; తన్మనుజపతికిన్=ఆసుచంద్రునకు; ఒసఁగెన్=ఇచ్చెను.

సీ. సన్మణిచాప మొ◊సంగెఁ దన్గను నరి,మండలి కిది యార్తి ◊మన్పు ననుచు,
నాశుగౌఘ మొసంగె ◊నాశువర్తన నిది, పరవాహినుల భంగ◊పఱచు ననుచు,
శాతహేతి నొసంగె ◊సమిదుజ్జ్వలితవీర,తరులను నిది మాయఁ ◊దార్చు ననుచు,
ఘనవల్లి నొసఁగె వే◊గ మహాహితాళుల,కిది సుమనోయోగ ◊మెనపు ననుచు,

తే. మఱియు దివ్యాయుధంబు ల ◊త్తఱి నొసంగె, నవ్యవిజయేందిరానిదా◊నమ్ము లనుచు,
హాళి దళుకొత్త నలకూకు◊దావతంస, మవ్విభున కిట్లు దెలుపుచు ◊నాదరమున. 86

టీక: సన్మణిచాపము—సత్=శ్రేష్ఠమగు, మణిచాపము=మణిమయమగు ధనుస్సును; తన్గను నరిమండలికిన్ – తన్=తన్ను, కను నరిమండిలికిన్=చూచు శత్రుబృందమునకు; ఇది=ఈవిల్లు; ఆర్తిన్=పీడను; మన్పున్=వృద్ధినొందించును; అనుచు = ఇట్లనుచు; ఒసంగెన్=ఇచ్చెను. ఇచట, సన్మణిచాపము=ఇంద్రధనుస్సు, తన్గను నరిమండలికిన్=తన్నుఁ జూచు చక్రవాకగణ ములకు, ఆర్తి మన్పు నను నర్థము దోఁచుచున్నది.
యుద్ధమందు తనుఁ జూచినశత్రుమండలికి నీవిల్లు ఆర్తిని పెంపొందించు నని చెప్పుచు నామణిచాప మొసఁగె నని భావము; ఆశువర్తనన్=అతిశీఘ్రవర్తనచే; ఇది=ఈబాణపుంజము; పరవాహినులన్—పర=శత్రువులయొక్క, వాహినులన్=సేనలను; భంగపఱచున్=భంగము చేయును; అనుచున్=ఇట్లనుచు; అశుగౌఘము=బాణసముదాయమును; ఒసంగెన్=ఇచ్చెను. ఇట, ఆశుగౌఘము=వాయుబృందము, పరవాహినులన్—పర=ఉత్కృష్టమగు, వాహినులన్=నదులను, భంగపఱచున్= అలలు గల వానిగాఁ జేయు నను నర్థము దోఁచుచున్నది; ఈబాణబృందము శత్రువులసేనలను భంగపఱచునట్టి సామర్థ్యము గలదని చెప్పి యిచ్చెనని భావము.
సమిదుజ్జ్వలిత వీరతరులనున్ – సమిత్=యుద్ధమందు, ఉజ్జ్వలిత=మిగుల వెలుఁగుచున్న, వీరతరులనున్=వీరశ్రేష్ఠులను; ఇది = ఈహేతి; మాయన్=నశించునట్లు; తార్చున్=చేయును; అనుచున్=ఇట్లని చెప్పుచు; శాత=వాఁడిగల,హేతిన్= ఖడ్గ మును; ఒసంగెన్=ఇచ్చెను; ఇచట, సమిత్=సమిధలచే, ఉజ్జ్వలిత=మిక్కిలి ప్రకాశించు, వీరతరులన్=ఏఱుమద్దిచెట్లను, మాయన్=నశింపఁగా, తార్చున్=చేయును, అను నర్థము దోఁచుచున్నది. యుద్ధమునందు ప్రతివీరుల మాయఁజేయునట్టి సామర్థ్యము గలదని తెలిపి యొక ఖడ్గము నిచ్చె నని భావము; మహాహితాళులకున్ – మహత్=అధికులగు, అహిత=శత్రువులయొక్క, ఆళులకున్=శ్రేణులకు; ఇది=ఈముద్గరము; వేగ= త్వరగా; సుమనోయోగము – సుమనః=దేవతలయొక్క, యోగము=సంబంధమును; ఎనపున్=పొందించును; అనుచున్ = ఇట్లు చెప్పుచు; ఘనవల్లిన్=తీఁగెవంటి ముద్గరమును; వేగ=వేగముగ; ఒసఁగెన్=ఇచ్చెను. ఇచట, మహాహితాళులకున్ – మహా హిత=మిక్కిలి హితములగు, అళులకున్=తుమ్మెదలకు, ఘనవల్లి=ఘనమగు తీఁగ; సుమనోయోగమును= పుష్పముల యొక్క సంబంధము నను నర్థము దోఁచుచున్నది; ఈముద్గరము యుద్ధమందు శత్రులఁ గూల్చి వారికి దేవత్వము నొసంగు నని చెప్పి యాముద్గరమును సుచంద్రున కిచ్చెనని భావము; నవ్యవిజయేందిరానిదానమ్ములు – నవ్య=నూతనమగు, విజయేందిరా=విజయలక్ష్మికి, నిదానమ్ములు=ఆదికారణములు; అనుచున్=ఇట్లు వచించుచు; మఱియున్=వెండియు(ఇంకను);దివ్యాయుధంబులు—దివ్య=అప్రతిహతమగు, ఆయుధం బులు=ఆయుధములను; అత్తఱిన్=ఆసమయమందు; హాళి దళుకొత్తన్—హాళి=ఆసక్తి; తళుకొత్తన్=మిక్కిలి ప్రకాశింపఁగ; అలకూకుదావతంసము=కన్య నలంకరించి దానముఁజేసినవారిలో శ్రేష్ఠుఁడగు క్షణదోదయుఁడు, ‘సత్కృత్యాలంకృతాం కన్యాం యో దదాతి స కూకుదః’ అని యమరుఁడు; అవ్విభునకున్=ఆసుచంద్రునకు; ఇట్లు దెలుపుచున్=ఈరీతిగా వివరిం చుచు; ఆదరమునన్=ప్రేమచేత; ఒసంగెన్=ఇచ్చెను.

చ. అసమబుధప్రకాండయుతి ◊నాతతనిర్మలపుష్కరాపగా
ప్తి సరసపారిజాతజగ◊తీరుహశోభితసౌధయుక్తి ని
వ్వసుధ మరుత్పురస్ఫురణ ◊పాటిలుభవ్యపురీశతంబులం
బసుపున కిచ్చె నయ్యవని◊పాలుఁడు పుత్త్రికి సమ్మదంబునన్. 87

టీక: అసమబుధప్రకాండయుతిన్ – అసమ=సరిలేని, బుధప్రకాండ=విద్వద్బృందముయొక్క,యుతిన్=కూడికచేతను; అసమ =సరిలేని, బుధ ప్రకాండ=దేవబృందముయొక్క, యుతిన్=కూడికచేతను, అని స్వర్గపరమైన యర్థము; ఆతత నిర్మలపుష్క రాపగాప్తిన్ – ఆతత=విశాలమగు, నిర్మల=స్వచ్ఛమగు, పుష్కర=పద్మములుగల, ఆపగా=నదులయొక్క, ఆప్తిన్=ప్రాప్తి చేతను; ఆతత=విశాలమగు, నిర్మల=స్వచ్ఛమగు, పుష్కరాపగా=స్వర్గంగయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేతను, అని స్వర్గపరమైన యర్థము; సరసపారిజాతజగతీరుహశోభితసౌధయుక్తిన్ – సరస=శ్రేష్ఠమగు, పారిజాతజగతీరుహ= పారిజాతవృక్షములచేత, శోభిత=ప్రకాశించుచున్న, సౌధయుక్తిన్=మేడలయొక్క సంబంధముచేతను; సరస=శ్రేష్ఠమగు, పారిజాతజగతీరుహ= కల్ప వృక్షములచేత, శోభిత=ప్రకాశించుచున్న, సౌధయుక్తిన్=మేడలయొక్క సంబంధముచేతను అని స్వర్గపరమైన యర్థము; ఇవ్వసుధన్=ఈభూమియందు; మరుత్పురస్ఫురణ – మరుత్పుర=స్వర్గముయొక్క, స్ఫురణ=ప్రకాశము; పాటిలు భవ్య పురీ శతంబులన్ – పాటిలు=కలుగుచున్నట్టి, భవ్య=మనోజ్ఞమగు, పురీశతంబులన్= పురశతములను; అయ్యవనిపాలుఁడు =ఆ క్షణదోదయుఁడు; పుత్త్రికిన్=కూఁతురగు చంద్రికకు; పసుపునకున్=పసుపుకుంకుమలకుఁ గాను; సమ్మదంబునన్=సంత సము చేత; ఇచ్చెన్=ఒసంగెను. అనఁగా క్షణదోదయుఁడు తనపుత్రికయగు చంద్రికకు స్వర్గతుల్యములగు పురశతములను పసుపుకుంకుమలకుఁగా నిచ్చె నని భావము.

మ. ధరణిన్ మేల్ రతనాలసొమ్ములును జ◊ల్తార్చీరలుం గ్రొత్తక
స్తురివీణెన్ ఘనసారసాంద్రధమనీ◊స్తోమంబు లవ్వేళ ని
ర్భరచామీకరపేటికోత్కరములం ◊బన్నించి దా వెండియున్
దరుణీమౌళి కొసంగె నయ్యవనికాం◊తాభర్త చిత్రంబుగన్. 88

టీక: ధరణిన్=భూమియందు; మేల్ రతనాలసొమ్ములును=శ్రేష్ఠమగు రత్నమయములైన నగలును; జల్తార్చీరలున్ =సరిగంచుచీరలును; క్రొత్తకస్తురివీణెన్ =నూతనమగు కస్తురివీణెను; ఘనసారసాంద్రధమనీస్తోమంబులు – ఘనసార =పచ్చకర్పూరముచేత, సాంద్ర=నిండిన,ధమనీస్తోమంబులు=క్రోవులగుంపులు; అవ్వేళన్=ఆసమయమందు; నిర్భర చామీకరపేటికోత్కరములన్ – నిర్భర=అధికమగు, చామీకర=బంగరుయొక్క, పేటికా=పెట్టెలయొక్క, ఉత్కరములన్ =సమూహములయందు; పన్నించి=ఉనిచి; తాన్=తాను; వెండియున్=మఱియును; తరుణీమౌళికిన్=చంద్రికకు; అయ్య వనికాంతాభర్త=ఆక్షణదోదయరాజు; చిత్రంబుగన్=వింతగ; ఒసంగెన్=ఇచ్చెను. అనఁగ నాక్షణదోదయుఁడు చంద్రికకు రత్నాభరణములను, సరిగంచువస్త్ర ములను, కస్తురివీణెను, పచ్చకప్పురపుక్రోవులను బంగరుపెట్టెల నించి యిచ్చె నని భావము.

చ. స్థిరతమభక్తి మ్రొక్కి తమ◊చెంగట నిల్చినఁ గ్రొత్తపెండ్లికూఁ
తురు కడు బుజ్జగించి లలి◊తో మునికామిను లెల్ల నాసువ
ర్ణరుచికిఁ జాల నైదువత◊నం బతిదీర్ఘతరాయురున్నతుల్
సరసతనూజలాభము నొ◊సంగిరి తత్పరతాయుతాత్మచేన్. 89

టీక: క్రొత్తపెండ్లికూఁతురు=క్రొత్తగా పెండ్లియయిన చంద్రిక; స్థిరతమభక్తిన్=దృఢతరమగు భక్తిచేత; మ్రొక్కి=నమస్కరించి; తమచెంగట నిల్చినన్ =తమ సమీపమందు నిలుచుండఁగా; కడున్=మిక్కిలి; బుజ్జగించి=లాలనచేసి; లలితోన్=ప్రేమతో; మునికామిను లెల్లన్=మునిపత్నులందఱును; ఆసువర్ణరుచికిన్=బంగరురంగు గల యాచంద్రికకు; చాలన్=మిక్కిలి; ఐదువతనంబు =సువాసినీత్వమును; అతిదీర్ఘతరాయురున్నతుల్=మిక్కిలి యధికమగు ఆయుస్సుయొక్క అతిశయము లను; సరసతనూజలాభమున్–సరస=శ్రేష్ఠుఁడగు, తనూజ=పుత్రునియొక్క, లాభమున్=ప్రాప్తిని; తత్పరతాయుతాత్మచేన్ –తత్పరతా= తత్పరత్వముతో, యుత=కూడుకొన్న, ఆత్మచేన్=బుద్ధిచేత; ఒసంగిరి=ఇచ్చిరి. అనఁగా మునిభామ లెల్లరు చంద్రికకు నాసక్తిచేత నైదువతనంబును, పుత్రప్రాప్తిని, పూర్ణమగు నాయుస్సు నిచ్చిరని భావము.

సీ. అలఘుభోగసమృద్ధి ◊నర్పించెఁ బౌలోమి, యనుపమౌజశ్శ్రీల ◊నెనపె ననలి,
ధర్మైకబుద్ధి నొం◊దఁగఁజేసె యమభామ, యిష్టరమ్యోత్సవం ◊బిచ్చె నసురి,
కమలాభ్యుదయముపొం◊ దమరించెఁ బాశిని, సుస్పర్శనాసక్తిఁ ◊జొన్పెఁ బవని,
రాజపూజ్యోన్నతిఁ ◊బ్రబలించె ధనరాజ్ఞి, ఈశభక్తి ఘటించె ◊మృడవధూటి,

తే. మఱియుఁ దక్కిననిర్జరీ◊మణు లుదార, కలితసౌభాగ్యవిభవము ◊ల్గలుగఁజేసి,
రపుడు పాణౌకరణమంగ◊ళానురచిత,కుతుకయై శ్రీ రహించు నా◊క్షితిపసుతకు. 90

టీక. పౌలోమి=శచీదేవి; అలఘుభోగసమృద్ధిన్ – అలఘు=అధికమైన, భోగ=అష్టభోగములయొక్క, సమృద్ధిన్=సంపదను; అర్పించెన్=ఒసంగెను, శచీదేవి యింద్రునిభార్య గాన తమకున్న భోగముల నిచ్చె నని భావము; అనలి=స్వాహాదేవి; అనుప మౌజశ్శ్రీలన్ – అనుపమ=సాటిలేని, ఔజశ్శ్రీలన్=తేజస్సంపదలను; ఎనపెన్=పొందించెను, అగ్నిభార్య గాన తేజస్సమృద్ధి నిచ్చె నని భావము. యమభామ=యమునిభార్య; ధర్మైకబుద్ధిన్—ధర్మ=పుణ్యమందు; ఏక=ముఖ్యమగు, బుద్ధిన్=మతిని; ఒందఁగన్=పొందు నటులు; చేసెన్=చేసెను. యమభార్య ధర్మబుద్ధి నిచ్చె నని భావము; అసురి=నిరృతిభార్య; ఇష్టరమ్యోత్సవంబు–ఇష్ట=అను కూలమగు, రమ్య=మనోజ్ఞమగు, ఉత్సవంబు=వేడుకను; ఇచ్చెన్=ఒసంగెను. కామరూపముచేత నలభ్యోత్సవములను బొందుచున్న రాక్షసునిభార్య గాన నిష్టరమ్యోత్సవంబుల నిచ్చె నని భావము. పాశిని=వరుణునిభార్య; కమలాభ్యుదయముపొందు – కమలా=సంపదయొక్క, అభ్యుదయము పొందు=ఆవిర్భావము యొక్క పొందికను; అమరించెన్=కలిగించెను. లక్ష్మి తమయింటఁ బుట్టినది గాన సులభముగా నిచ్చె నని భావము. వరుణుఁడు జలాధిష్ఠానదేవతగాన జలజంబుల నిచ్చె నను యర్థము దోఁచుచున్నది; పవని= వాయుదేవునిభార్య; సుస్పర్శనాసక్తిన్ – సు=సమీచీనమగు, స్పర్శన=దానమందు, ఆసక్తిన్=వాంఛను; చొన్పెన్=కల్గిం చెను. స్పర్శగుణము గల వాయుదేవునిభార్య గాన సుఖస్పర్శము నిచ్చె నని దోఁచుచున్నది. వాయుదేవునిభార్య దానమం దాసక్తిని కలిగించె నని భావము. ధనరాజ్ఞి=కుబేరునిభార్య; రాజపూజ్యోన్నతిన్ – రాజ=రాజులచేత,పూజ్య=పూజింపఁదగిన, ఉన్నతిన్=అతిశయమును; ప్రబలించెన్=బలపఱచెను. ఈపె రాజరాజుభార్య గాన రాజపూజ్యోన్నతి నిచ్చె నని భావము; మృడవధూటి =పార్వతీదేవి; ఈశభక్తిన్—ఈశ=భర్తయందు, భక్తిన్=భక్తిని; ఘటించెన్=ఘటిల్లఁజేసెను. పార్వతీదేవి ఈశ్వరునిభార్య గాన స్వపురుషుని యందు భక్తిని ఘటిల్లఁజేసె నని భావము. శంకరునియందు భక్తి గలుగఁజేసె నని తోఁచుచున్నది. మఱియున్=వెండియు; తక్కిననిర్జరీమణులు=తక్కినదేవాంగనలు; ఉదారకలితసౌభాగ్యవిభవముల్–ఉదార=అధికముగ, కలిత=కూడుకొన్న, సౌభాగ్య=సుభగత్వముయొక్క, విభవముల్=అతిశయములను; పాణౌకరణమంగళానురచితకుతుక యై – పాణౌకరణమంగళ =వివాహమంగళముచేత, అనురచిత=పుట్టింపఁబడిన, కుతుకయై=సంతోషముగలది యై; శ్రీన్= శోభచేత; రహించు నాక్షితిపసుతకున్= ఒప్పుచున్న క్షణదోదయునిపుత్రిక యగు నాచంద్రికకు; అపుడు=ఆసమయమందు; కలుగఁజేసిరి= సిద్ధించునటులు చేసిరి.

మ. మనుజాధీశసతుల్ నుతింప ననుకం◊పాలక్ష్మి నవ్వేళఁ గం
ధినిషంగప్రియభామ యాత్మమహిమ ◊న్నిత్యాంగరాగంబు సే
యనిసింగారము వాడనట్టివిరి పా◊య న్లేనితారుణ్యవ
ర్తనము న్వీడనిసొంపుపెంపు కలుగ ◊న్దార్చె న్వరం బింతికిన్. 91

టీక: కంధినిషంగప్రియభామ=జలధి తూణీరముగాఁ గల యీశ్వరునిభార్య యగుపార్వతీదేవి; అవ్వేళన్=ఆసమయమందు; మనుజాధీశసతుల్=రాజపత్నులు; నుతింపన్=పొగడఁగా; ఆత్మమహిమన్–ఆత్మ=తనయొక్క, మహిమన్=సామర్థ్యము చేత; నిత్యాంగరాగంబు = అకృత్రిమమై సార్వకాలీనమగు నంగరాగమును, అనఁగా మైపూఁత ననుట; చేయని సింగారము= అకృత్రిమాలంకారమును; వాడనట్టివిరి=వాడని పుష్పమును; పాయన్లేనితారుణ్యవర్తనమున్=నివర్తింపని యౌవనమును; వీడనిసొంపుపెంపు=నశింపని సౌందర్యాతిశయమును; కలుగన్=కలుగునటులు; అనుకంపాలక్ష్మిన్= దయాసంపదతో; ఇంతికిన్=చంద్రికకు; వరంబు=వరమును; తార్చెన్=ఇచ్చెను. అనఁగాఁ బార్వతీదేవి దయతోఁ జంద్రిక కెల్లపుడు నిత్యాంగ రాగమును, చేయనిసింగారమును, వాడనట్టికుసుమంబు, పాయనితారుణ్యము, వీడనిసొంపునుం గలుగు నటులు వరం బిచ్చె నని భావము.

చ. పలుకులఁ దేనె లుట్టిపడ ◊భావిశుభంబులు దెల్పు నేర్పుమైఁ
బొలయలుక ల్మరల్పి చెలి◊పోలిక నీవిభు నిన్నుఁ గూర్చు ని
చ్చలు భవదిష్ట మంతయుఁ బొ◊సంగఁ దనర్ప నెఱుంగు నంచు ను
త్కలిక వచించి యొక్క చిలు◊కం గిరికన్య యొసంగెఁ గొమ్మకున్. 92

టీక: పలుకులన్=మాటలయందు; తేనెలు=మకరందములు; ఉట్టిపడన్=ఊడిపడునట్లు; భావిశుభంబులు – భావి=కాబోవు నట్టి, శుభంబులు=మంగళములను; నేర్పుమైన్=చాతుర్యముచేత; తెల్పున్=తెలియఁజేయును; పొలయలుకల్= ప్రణయ కలహములను; మరల్పి=త్రిప్పి; చెలిపోలికన్=సకియవలె; నీవిభున్=నీపెనిమిటిని; నిన్నున్=నిన్నును; కూర్చున్=కూడఁ బెట్టును; నిచ్చలు=ఎల్లప్పుడు; భవదిష్టమంతయున్=నీకోరికనంతయు; పొసంగన్=అనుకూలించునట్లు; తనర్పన్=చేయు టకు; ఎఱుంగు నంచున్=తెలియు ననుచు; ఉత్కలికన్=సంతసముచేత; వచించి=చెప్పి; ఒక్కచిలుకన్=ఒకశుకమును; గిరి కన్య=పార్వతీదేవి; కొమ్మకున్=చంద్రికకు; ఒసంగెన్=ఇచ్చెను. భవిష్యచ్ఛుభఫలములను దెలుపునదియు, దంపతులను ప్రణయకలహములు పోఁగొట్టి కూర్చునదియు, కోరినకోర్కుల నెఱవేర్చునదియు నగు నొకశుకంబును పార్వతీదేవి చంద్రిక కొసంగె నని భావము.

మ. సురభి న్బొన్నలతావి మల్లియలతే◊జు న్వేసవిన్ జాతివై
ఖరి వర్షాది శరద్దినాళి నసనౌ◊ఘస్ఫూర్తి సేమంతిడా
ల్వరహేమంతముఖంబున న్శిశిరవే◊ళ న్మొల్లచాల్పెంపు దా
ల్చి రహిం గూర్చు నటంచు నొక్క విరి ని◊చ్చె న్గౌరి యబ్జాక్షిన్ 93

టీక: సురభిన్=ఆమనియందు; పొన్నలతావిన్=పొన్నపూలపరిమళమును; వేసవిన్=గ్రీష్మర్తువునందు; మల్లియలతేజున్ = మల్లికాకుసుమములయొప్పును, అనఁగా వానిపరిమళముననుట; వర్షాదిన్=వర్షాకాలారంభమందు; జాతివైఖరిన్= మాలతీ పుష్పముయొక్కరీతిని, అనఁగా దానిపరిమళముననుట; శరద్దినాళిన్=శరత్కాలదినసమూహమందు; అసనౌఘస్ఫూర్తిన్ = సర్జకపుష్పములయొక్క అతిశయమును; వరహేమంతముఖంబునన్–వర=శ్రేష్ఠమైన, హేమంత=హేమంతర్తువుయొక్క, ముఖంబునన్=ప్రారంభమందు; సేమంతిడాల్=చేమంతిప్రకాశమును, దానిపరిమళము ననుట; శిశిరవేళన్=శిశిరకాలమున; మొల్లచాల్పెంపున్=కుందసుమశ్రేణియొక్క యతిశయమును, దానిపరిమళము ననుట; తాల్చి=ధరించి; రహిన్=ఆనంద మును; కూర్చు నటంచున్=కలుఁగఁజేయు ననుచు; ఒక్కవిరిన్=ఒకపూవును; గౌరి=పార్వతీదేవి; అబ్జాక్షిన్=చంద్రికకు; ఇచ్చెన్=ఒసంగెను. అనఁగా వసంత, గ్రీష్మ, శరద్ధేమంత, శిశిరంబులందు వరుసగాఁ బున్నాగ, మల్లికా, మాలతీ, సర్జక, సేమంతికా, కుంద ప్రసూనంబులపరిమళంబు ధరించునట్టి యొకపుష్పంబును గౌరీదేవి చంద్రిక కిచ్చె నని భావము.

చ. తలచినకోరిక ల్గురియు◊దాని, మెఱుంగుమెఱుంగుమిన్నలం
దళతళమంచు మించుజిగి◊దాని, భరించినమాత్ర దేవకాం
తలఁ గికురించుసొం పెసఁగు◊దాని, నొకానొకరత్నమాలికన్
జలరుహలోచనామణి కొ◊సంగె గిరీంద్రకుమారి యత్తఱిన్. 94

టీక: తలచినకోరికల్=కోరినకోరికలను; కురియుదానిన్=వర్షించునట్టిదానిని, ఒసంగుచున్నదాని నని భావము; మెఱుంగు మెఱుంగుమిన్నలన్ = కాంతిగల శ్రేష్ఠములయిన మెఱపులను; తళతళమంచున్=తళతళమని మెఱయుచు; మించుజిగిదానిన్ =మీఱినకాంతిగలదానిని; భరించినమాత్రన్=ఆ సరమును దాల్చినంతటనె; దేవకాంతలన్=దేవాంగనలను; కికురించు సొంపె సఁగుదానిన్=వంచించు నందముచేత నతిశయించుదానిని; ఒకానొకరత్నమాలికన్= ఒకానొకరత్నహారమును; గిరీంద్ర కుమారి=పార్వతీదేవి; అత్తఱిన్=ఆసమయమందు; జలరుహలోచనామణికిన్=నారీరత్నమగు చంద్రికకు; ఒసంగెన్= ఇచ్చెను. అనఁగా నిష్టార్థముల నిచ్చునదియు, మెఱపుతీవను దిరస్కరించుకాంతితోఁ గూడినదియు, ధరించినంతమాత్రమున దేవాంగనల కన్న నెక్కువయందము గల్గించునదియు నగు నొక రత్నహారమును పార్వతీదేవి చంద్రిక కిచ్చెనని భావము.

చ. మఱియు నమూల్యవాంఛితస◊మాజము లాదృతిచే ఘటించి యా
తెఱవఁ గవుంగిలించి నర◊దేవకుమారిక పోయి వత్తు ని
త్తఱి నని దెల్పి యాగిరిశ◊తన్వి ముదంబున నేగె వేలుపుల్
తఱిగొని వెంట నొంద రజ◊తక్షితిభృన్నిలయంబుఁ జేరఁగన్. 95

టీక: మఱియున్=వెండియు; అమూల్యవాంఛితసమాజములు—అమూల్య=వెలలేని, అనఁగా శ్రేష్ఠములయినట్టి యని భావము, వాంఛిత=ఇష్టార్థములయొక్క, సమాజములు=సమూహములను; ఆదృతిచేన్=ఆదరముతో; ఘటించి=ఇచ్చి; ఆతెఱవన్=ఆచంద్రికను; కవుంగిలించి=కౌఁగిలించి; నరదేవకుమారిక=చంద్రికా! ఇత్తఱిన్=ఇపుడు; పోయి వత్తున్=పోయి వచ్చెదను; అని తెల్పి=ఈప్రకారము తెలియఁజేసి; ఆగిరిశతన్వి=ఆశంభుసతి యగు పార్వతీదేవి; ముదంబునన్=సంత సముచేత; వేలుపుల్=దేవతలు; తఱిగొని=పూని; వెంటన్=వెంబడి; ఒందన్=పొందఁగా, దేవాంగనలు వెంట రాఁగా నని తాత్పర్యము; రజతక్షితిభృన్నిలయంబు=కైలాసగిరి యను గృహమును; చేరఁగన్=పొందుటకు; ఏగెన్=అరిగెను.

అనఁగా పార్వతీదేవి చంద్రికకుఁ గోరినకోరిక లెల్ల నొసంగి, కౌఁగిలించి, పోయివత్తు నని వచించి, దేవతలం గూడి కైలాస నిలయంబుఁజేరె నని తాత్పర్యము.

ఉ. అంత సుచంద్రమానవకు◊లాగ్రణిచే క్షణదోదయక్షమా
కాంతునిచే బహూకృతులు ◊గైకొని తత్సకలాంతరీపరా
ట్సంతతు లెల్ల నైజపుర◊జాతముఁ జేరఁగ నేగె మానసా
భ్యంతరసీమఁ దచ్ఛుభమ◊హావిభవోన్నతి సన్నుతించుచున్. 96

టీక: అంతన్=ఆపిమ్మట; సుచంద్రమానవకులాగ్రణిచేన్=మనువంశశ్రేష్ఠుండగు సుచంద్రునివలన; క్షణదోదయక్షమాకాంతు నిచేన్=క్షణదోదయరాజువలన; బహూకృతులు=బహుమతులను; కైకొని=గ్రహించి; తత్సకలాంతరీపరాట్సంతతు లెల్లన్ – తత్=ప్రసిద్ధులగు, సకల=ఎల్ల, అంతరీపరాట్= ద్వీపాధిపతులయొక్క, సంతతులు=సమూహములు, ఎల్లన్=సమస్తము; మానసాభ్యంతరసీమన్=చిత్తమధ్యప్రదేశమందు; తచ్ఛుభమహావిభవోన్నతిన్=ఆవివాహమహోత్సవముయొక్క యతిశ యమును; సన్నుతించుచున్=పొగడుచు; నైజపురజాతమున్=నిజపత్తనబృందమును; చేరఁగన్ =పొందుటకు; ఏగెన్= చనెను.

అనఁగా వివాహమహోత్సవమునకై చనుదెంచి యున్న సకలదేశరాజులును సుచంద్రునివలన, క్షణదోదయునివలన బహుమతుల నొంది యావివాహమహోత్సవము నెన్నుచు స్వపురంబులను జేరఁబోయి రని భావము.

మ. అలపాంచాలవిభుండు పుత్త్రి కధికాం◊తావాసనూత్నప్రవే
శలసన్మంగళ మూన్పఁగాఁదలఁచి త◊త్సారంగదేశీయకుం
తలఁ దాఁ గౌఁగిటఁ జేర్చి యంకవసతిం ◊దార్కొల్పి నవ్యాశ్రుసం
కులమై కన్గవ దోఁప నచ్చెలువఁ బ◊ల్కుం బ్రీతిచే నత్తఱిన్. 97

టీక: అలపాంచాలవిభుండు=ఆక్షణదోదయుఁడు; పుత్త్రికిన్=చంద్రికకు; అధికాంతావాసనూత్నప్రవేశలసన్మంగళము – అధి కాంతావాస=భర్తృగృహమునకు, నూత్నప్రవేశ=నూతనప్రవేశరూపమగు, లసత్=ప్రకాశించుచున్న, మంగళము=కల్యాణ మును; ఊన్పఁగాన్=చేయుటకు; తలఁచి=మనమునందు యత్నించి; తత్సారంగదేశీయకుంతలన్=అళులవంటి కురులు గల యాచంద్రికను, ఇచట నీషదసమాప్తియందు దేశీయర్ ప్రత్యయము; తాన్=క్షణదోదయుఁడు; కౌఁగిటఁజేర్చి=కౌఁగిలియందుఁ జేర్చుకొని; అంకవసతిన్=ఉత్సంగస్థానమును; తార్కొల్పి =పొందఁజేసి; కన్గవ=కన్దోయి; నవ్యాశ్రుసంకులమై – నవ్య=నూత నమగు, అశ్రు=కన్నీటిచేత, సంకులమై=వ్యాకులమైనదై; తోఁపన్=తోఁచుచుండఁగ; అచ్చెలువన్=ఆచంద్రికతో; అత్తఱిన్= ఆ సమయమందు; ప్రీతిచేన్=ప్రేమతో;పల్కున్=పలికెను.

అనఁగా క్షణదోదయుఁడు చంద్రికకు భర్తృగృహప్రవేశముఁ జేయఁ దలఁచి, యాచంద్రికను దొడపై నిడుకొని కన్నీ రిడుచు చంద్రికతో నిట్లు (వక్ష్యమాణప్రకారముగ) పలికె నని భావము.

క. నిచ్చలు పుట్టినయింటికిఁ
జొచ్చినయింటికి నపూర్వ◊శుభకీర్తితతుల్
హెచ్చ మెలంగవె తల్లి భ
వచ్చరితము భువనపుణ్య◊వైఖరిఁ బొదలన్. 98

టీక: నిచ్చలు=ఎల్లపుడు; పుట్టినయింటికిన్=జనకగృహమునకు; చొచ్చినయింటికిన్=తాను ప్రవేశించిన యింటికి,అనఁగా భర్తృగృహమునకు; అపూర్వశుభకీర్తితతుల్—అపూర్వ=నూతనములగు, శుభ=మంగళకరమగు, కీర్తితతుల్=యశః పుంజములు; హెచ్చన్=అతిశయించునటులు; తల్లి =చంద్రికా! భవచ్చరితము – భవత్=నీయొక్క, చరితము=సచ్చరిత్రము; భువనపుణ్యవైఖరిన్ – భువన=ప్రపంచమందు, పుణ్యవైఖరిన్=పవిత్రమగు రీతిచే; పొదలన్=వృద్ధిఁబొందునటులు; మెలంగవె =వర్తింపుమా. అనఁగా జనకగృహమునకు,భర్తృగృహమునకు కీర్తి యతిశయించునటులు నీచరితము లోకములందు పవిత్ర మని పేర్కొనఁబడునటులు వర్తింపు మని భావము.

సీ. వంశధర్మనిరూఢి ◊వఱలించె నీనారి, మహితశాస్త్రాధిగ◊మంబుకలిమి,
గురుతరులకు వన్నె◊గూరిచె నీశ్యామ, ఘనసుమనోవిక◊సనముచేత,
నిను నుదయంబున ◊నెసఁగు నీపద్మిని, మంజులామోదసా◊మగ్రి మెఱయ,
ద్విజరాజిఁ బోషించి ◊దీపించు నీకొమ్మ, భాసురఫలదాన◊పటిమఁ బూని,

తే. యనుచు జగమెల్ల నుల్లాస ◊మతిశయిల్ల, సంతతము మెచ్చ మను మమ్మ ◊క్షమకు జన్మ
పద మనఁ దనర్చు నంభోజ◊పాణిజీవ,నమ్మ జీవన మని యెంచు◊మమ్మకొమ్మ. 99

టీక: ఈనారి=ఈచంద్రిక; మహితశాస్త్రాధిగమంబుకలిమిన్ – మహిత=అధికమగు, శాస్త్ర=ఆస్తికశాస్త్రము లాఱింటియొక్క, అధిగమంబు=ప్రాప్తియొక్క, కలిమిన్=సంపదచేత; వంశధర్మనిరూఢిన్ – వంశధర్మ=కులాచారధర్మముయొక్క, నిరూ ఢిన్= ప్రసిద్ధిని; వఱలించెన్=ప్రకాశింపఁజేసెను; అనఁగా నీకాంత సమస్తశాస్త్రములు చదివి కులాచారధర్మమునుచక్కగ నభి వృద్ధి చేసె నని తాత్పర్యము; ఇచట, మహిత=అధికమగు, శాస్త్ర = బాణపుంజముయొక్క, అధిగమంబు=ప్రాప్తియొక్క, కలిమిన్=కలుగుటచేత; వంశధర్మనిరూఢిన్—వెదురుధనువుయొక్క నిరూఢిని, వఱలించె నని యర్థాంతరము తోఁచును;
ఈశ్యామ=ఈచంద్రిక; ఘనసుమనోవికసనముచేతన్ – ఘన=గొప్పవారగు, సుమనః=విద్వాంసులయొక్క, వికసనము చేతన్=ఆనందముచేత; గురుతరులకు=తండ్రిమొదలగుపూజ్యులకు; వన్నెన్=అలంకారమును; కూరిచెన్=ఒనరించెను. అనఁగా నీచంద్రిక విద్వాంసులను సంతసింపఁ జేయుటచే తండ్రి మొదలగువారి కందఱికిని మిక్కిలి యలంకారమును గలుగఁ జేసెనని భావము; ఇచట, ఈశ్యామ=ఈప్రేంకణపుతీవ, ఘన=గొప్పవగు,సుమనః=పుష్పములయొక్క, వికసనముచేతన్= వికాసముచేత, గురుతరులకు=గొప్పవృక్షములకు; వన్నెన్=అలంకారమును; కూరిచెన్=ఒనరించెను, అను అర్థాంతరము తోఁచుచున్నది;
ఈపద్మిని=ఈచంద్రిక; ఇను నుదయంబునన్=పతియొక్క యుత్కర్షముచేత; మంజులామోదసామగ్రి—మంజుల=మనోజ్ఞ మగు, ఆమోదసామగ్రి= సంతోషసామగ్రి; మెఱయన్=ప్రకాశించునటులు; ఎసఁగున్=ఒప్పును, లోకమందు పతి సంతోషించి నచో పత్ని సంతోషించుటయు, వ్యసనపడినచో వ్యసనపడుటయు ముఖ్యపతివ్రతాధర్మము. అందుకు ‘ఆర్తార్తే, ముదితే హృష్టా, ప్రోషితే మలినా కృశా’ యని ప్రమాణము; ఇచట, పద్మిని=పద్మలత, ఇను నుదయంబునన్=సూర్యునియొక్క యుదయమునందు; మంజులామోదసామగ్రి—మంజుల=మనోజ్ఞమగు, ఆమోదసామగ్రి= పరిమళసామగ్రి; మెఱయన్= మెఱయునటులు; ఎసఁగున్=ఒప్పును, అను అర్థాంతరము తోఁచుచున్నది; ఈకొమ్మ=ఈచంద్రిక; భాసురఫలదానపటిమన్ – భాసుర=ప్రకాశించుచున్న, ఫల=లాభములయొక్క, దాన=త్యాగము యొక్క, పటిమన్=సామర్థ్యమును; పూని=పొంది; ద్విజరాజిన్=బ్రాహ్మణశ్రేణిని; పోషించి=కాపాడి; దీపించున్=ప్రకాశిం చును. అనఁగ నీచంద్రిక షోడశమహాదానంబు లిచ్చి ద్విజులఁ గాపాడుచు ప్రకాశించుచున్నదని భావము; ఇచట, ఈకొమ్మ= ఈవృక్షశాఖ, భాసురమగు, ఫల=పండ్లయొక్క, దాన= త్యాగముయొక్క,పటిమన్=సామర్థ్యమును, పూని =పొంది, ద్విజ రాజిన్=పక్షిశ్రేణిని; పోషించి=కాపాడి, దీపించున్=ప్రకాశించును, అను అర్థాంతరము తోఁచుచున్నది;
అనుచున్=పూర్వోక్తప్రకారము వచించుచు; జగమెల్లన్=లోకమంతయు; ఉల్లాసము=సంతోషము; అతిశయిల్లన్=హెచ్చఁ గా; సంతతము=ఎల్లపుడు; మెచ్చన్=శ్లాఘించునటులు; మనుమమ్మ=వర్తింపుమమ్మ; క్షమకున్=తాల్మికి; జన్మపదము=పుట్టుక పట్టు; అనన్=అనునట్లు; తనర్చు నంభోజ పాణిజీవనమ్మ – తనర్చు=ఒప్పుచున్న, అంభోజపాణి=స్త్రీయొక్క, జీవనమ్మ= బ్రతుకె; జీవన మని=బ్రతుకని; ఎంచుమమ్మ కొమ్మ=తలంపుమమ్మ చంద్రికా! ఇచట, క్షమకున్=భూమికి; జన్మపదము= జన్మ స్థానము; అనన్=అనునట్లు; తనర్చు అంభోజ పాణిజీవనమ్మ – తనర్చు=ఒప్పుచున్న, అంభోజ=కమలములుగల, పాణి= ముత్యపునీరువంటి, జీవనమ్మ=జలమె; జీవన మని = జలమని, ఎంచుమమ్మ=తలంపుమమ్మ, అను నర్థాంతరము దోఁచు చున్నది. ఈకవి ‘అద్భ్యః పృథివీ’ యన్న శ్రుతి ననుసరించె నని యెఱుంగునది.

క. అట్టియెడ నశ్రు లక్షులఁ
దొట్టఁగ నవనమితవదన◊తోయజ యగు నా
పట్టిఁ దనయంకపాళిం
బట్టి నయం బొప్ప జనని ◊పలికె న్గరుణన్. 100

టీక: అట్టియెడన్=ఆసమయమందు; అక్షులన్=కనులందు; అశ్రులు=కన్నీళ్ళు; తొట్టఁగన్=స్రవింపఁగా; అవనమితవదన తోయజ యగు నాపట్టిన్ –అవనమిత=వంపఁబడిన, వదనతోయజ యగు=ముఖకమలముగల దగు, ఆపట్టిన్=ఆబిడ్డను; తనయంకపాళిన్=తనతొడమీఁద; పట్టి=ఇడుకొని; నయంబు=నీతి; ఒప్పన్=తగునటులు; జనని=తల్లి; కరుణన్=దయతో; పలికెన్=వక్ష్యమాణప్రకారముగాఁ బలికెను.

మ. అలశైలేంద్రతనూజ యంతసతి న◊ర్ధాంగీకృతం జేసె శీ
తలరోచిర్మకుటుండు గానఁ జెలులం ◊దత్తత్తదాత్వోచితో
జ్జ్వలకృత్యంబుల మెచ్చి మెచ్చరు ధరా◊చక్రంబునన్ భర్త లై
న లతాంగీమణి పూతధర్మసరణి ◊న్వర్తింప మే లెంతయున్. 101

టీక: శీతలరోచిర్మకుటుండు=చంద్రమౌళి యగు శంకరుఁడు; అలశైలేంద్రతనూజ యంతసతిన్ = ఆపార్వతీదేవియంత కాంతను, పార్వతీదేవి యంత పతివ్రత నని తోఁచుచున్నది; అర్ధాంగీకృతన్=సగమగునట్టు లంగీకరింపఁబడినదానినిగాను, అర్ధాంగిగాఁ జేయఁబడినదానినిగా నని తోఁచుచున్నది; చేసెన్=చేసెను; కానన్=ఆహేతువుచేత; చెలులన్=భార్యలను; తత్తత్తదాత్వోచితోజ్జ్వలకృత్యంబులన్ – తత్తత్=ఆయా, తదాత్వ=తత్కాలమందు, ‘తత్కాలస్తు తదాత్వం స్యాత్’అని యమ రుఁడు, ఉచిత=యోగ్యమగు, ఉజ్జ్వల=ప్రకాశించు,కృత్యంబులన్=పనులయందు; భర్తలు =పతులు; ధరాచక్రంబునన్= భూమియందు; మెచ్చి మెచ్చరు = శ్లాఘించి శ్లాఘింపరు; ఐనన్=అటులైనను; లతాంగీమణి=స్త్రీరత్నమగు చంద్రికా! పూత ధర్మసరణిన్=పవిత్రమగు కులధర్మమార్గమున; వర్తింపన్=వర్తించుట; ఎంతయున్=మిక్కిలి; మేలు=శుభము. అనఁగ నో చంద్రికా! యీశ్వరుండును, పతివ్రతాశిరోమణి యగుపార్వతీదేవియంతదానిని అర్ధాంగీకృతను జేసె, లోక మందు తఱుచుగ పతులైనవారు తమకాంతలను ఆయాపనులయందు ఆయాసమయముల శ్లాఘింపరు. ఐనను కులకాంతలు ధర్మమార్గమున జరించుట మేలని భావము.

ఉ. కైరవకోటికూటములు ◊గావని చక్ర మవక్రకౌతుకో
దారత మీఱ సద్వరవి◊తానము లెల్ల మహామహంబులన్
భూరివికాసవైఖరులఁ ◊బూనఁగఁ జేయుచు లోకచిత్రగం
భీరచరిత్ర వై జగతిఁ ◊బెంపు వహింపఁ గదమ్మ చంద్రికా! 102

టీక: చంద్రికా=సంబుద్ధి, జ్యోత్స్న యని తోఁచుచున్నది; కైరవకోటికూటములు – కైరవ=పిశునులయొక్క,కోటికూటములు =అనేకబృందములు, ‘కైరవం కుముదేపి స్యా త్కుటిలేతు పుమా నయమ్’ అని యుత్పలము, కలువలయొక్క కోటికూటము లని యర్థాంతరము దోఁచుచున్నది; కావని = సరిగావని, అనఁగా నిరసించి యనుట. ప్రసిద్ధచంద్రిక కైరవకోటులఁ గాపాడునట్టి స్వభావము గలదనియు, నీచంద్రిక తద్వ్యతిరేకముగ కైరవకోటులఁ దిరస్కరించునది యనియు భావము; చక్రము=జక్కవ; అవక్రకౌతుకోదారతన్ – అవక్ర=అకుటిలమగు,కౌతుక=కుతుకముయొక్క, ఉదారతన్= ఔదార్యము చేత; మీఱన్=అతిశ యింపఁగ, అనఁగ ప్రసిద్ధచంద్రిక చక్రములకు కౌతుకమును బోఁగొట్టునదనియు, నీచంద్రిక చక్రము సంతసించునట్లు చేయునది యనియు వ్యతిరేకము, చక్ర మనఁగ రాష్ట్రము సంతోషించునటులు వర్తించునదని నిసర్గతాత్పర్యము; సద్వరవితానములు – సత్=రిక్కలయొక్క, వర=శ్రేష్ఠములగు, వితానములు=సమూహములు; ఎల్లన్= అన్నియు; మహామహంబులన్=అధిక కాంతులచేత; భూరివికాసవైఖరులన్ – భూరి=అధికమగు, వికాస=వికసనముయొక్క, ప్రకాశముయొక్క యనుట, వైఖరు లన్=రీతులను; పూనఁగన్=పొందునట్లు; చేయుచున్=ఒనరించుచు; సద్వరవితానములు=సత్పురుషసంఘములు, మహా మహంబులన్=అధికోత్సవములచేత, భూరి=అధికమగు, వికాస=సంతసముయొక్క, వైఖరులన్=రీతులను, పూనఁగన్= పొందునట్లు, చేయుచున్ అని స్వభావార్థము; ప్రసిద్ధచంద్రిక సద్వరవితానమునకు వికాసము నడఁగఁజేయు ననియు, నీచంద్రిక యాసద్వరవితానమునకు వికాసమును జేయు ననియు వ్యతిరేకము; లోకచిత్రగంభీరచరిత్రవై – లోక=భువనములయందు, చిత్ర= ఆశ్చర్యకరమగు, గంభీర=గభీరమగు, చరిత్రవై=చరిత్రగల దానవై; జగతిన్=భూమియందు; పెంపున్=వృద్ధిని; వహింపఁగదమ్మ=వహింపుమా!

అనఁగ నోచంద్రికా! నీవు ప్రసిద్ధచంద్రికవలెఁ గాక కైరవపుంజముల నిరసించునవియు, చక్రమును సంతసింపఁజేయునవి యును, సద్వితానములఁ బ్రకాశింపఁజేయునవియును నగు విచిత్రగుణములు గలదానవై పుడమి వృద్ధిఁ బొందుమని భావము.

క. ఘనవేణి నిన్ను నీశుఁడు
దనమూర్తిగఁ దలఁచి మిగుల ◊దయచేసినచో
వినయంబ పూని విశ్వభు
వనపూజ్యత మెలఁగవమ్మ ◊వసుమతిలోనన్. 103

టీక: ఘనవేణి=మబ్బువంటి జడగల చంద్రికా! నిన్నున్; ఈశుఁడు=నీభర్త; తనమూర్తిగన్=తనశరీరముగ; తలఁచి=ఎంచి; మిగులన్=అధికముగ; దయచేసినచోన్=అనుగ్రహించినయెడ; వినయంబ=భక్తినే; పూని=గ్రహించి; వసుమతిలోనన్= భూమియందు;విశ్వభువనపూజ్యతన్ –విశ్వ= సమస్తమైన, భువన=లోకములయందు, పూజ్యతన్=పూజ్యత్వముచేత; మెలఁగవమ్మ=వర్తింపుమా. ఇచట, ఘనవేణి=జాహ్నవి, నిన్నున్, ఈశుఁడు=శంకరుఁడు; తనమూర్తిగన్=అష్టమూర్తులలో నొకదానినిగ, తలఁచి=ఎంచి, మిగులన్=అధికముగ, దయచేసినచోన్=అనుగ్రహించిన యెడ; వినయంబ=నమ్రతనే, పూని= గ్రహించి, విశ్వభువనపూజ్యతన్ –విశ్వ= సమస్తమైన, భువన=ఉదకములచేత, పూజ్యతన్=మాన్యతచే, మెలఁగ వమ్మ యను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ నీభర్తమిగులఁ బ్రీతితో నిన్నుఁ దనమూర్తిగఁదలంచినను నీవు మిగుల వినయమునే పూని యెల్ల జగములలో పూజ్యతను వహింపు మని భావము.

సీ. కవఁగూడి సత్పతిఁ ◊గువలయంబు చెలంగ, నలరు శ్యామయె శ్యామ ◊యవని నెంచఁ,
బురుషరత్నముఁ జెంది ◊సురభివృత్తి, సుమనోగుణ మూనుకొమ్మయే ◊కొమ్మ తలఁప,
సర్వమంగళ యధీ◊శ్వరునకు సామేన, యనఁ దగు సతి సతి ◊యగు నుతింప,
నినపాదసేవనం◊బున ఘనామోదంబు, నెనయుపద్మినియె ప◊ద్మిని నుతింప,

తే. సుచిరముగ సుమనోవృత్తి ◊సొబగుఁ బూని, కలదినంబులు ప్రియుమదిఁ ◊గలసి మెలసి
నడచుకామిని కామిని ◊నళిననయన, తెలిసి నీవింకఁ బతిచెంత ◊మెలఁగు మమ్మ. 104

టీక: సత్పతిన్—సత్=సత్పురుషుఁడగు, పతిన్=భర్తను; కవఁగూడి=జతఁగూడి;కువలయంబు=భూవలయము; చెలంగన్= ఒప్పునటులు; అలరు శ్యామయె – అలరు= ఒప్పుచున్న, శ్యామయె=కాంతయె; అవనిన్=పుడమియందు; ఎంచన్= విచారిం పఁగా; శ్యామ=ఉత్తమస్త్రీ; ఇచట, సత్=రిక్కలకు, పతిన్=భర్తయగు చంద్రుని; కవఁగూడి= జతఁగూడి; కువలయంబు= కలువ; చెలంగన్=వికసించునటులు; అలరు శ్యామయె – అలరు= ఒప్పుచున్న, శ్యామయె=రాత్రియె; అవనిన్=పుడమి యందు; ఎంచన్= విచారింపఁగా; శ్యామ=ఉత్తమమగు రాత్రి, అను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ నెట్లు చంద్రసహితమై కలువను వికసింపఁజేయు రాత్రి, ఉత్తమమైన రాత్రి యనఁబడునో యట్ల పతిఁగూడి జగము మెచ్చఁ జెలంగు కాంతయే ఉత్తమ కాంత యనఁబడునని భావము. పురుషరత్నమున్=పురుషశ్రేష్ఠుని; చెంది=పొంది; సురభివృత్తిన్=పరిమళించువ్యాపారముచేత, శ్లాఘ్యసౌశీల్యాదివృత్తిచేత ననుట; సుమనోగుణము – సు=శ్రేష్ఠమగు, మనః= హృదయమందు, గుణము=గుణమును; ఊనుకొమ్మయే=పొందునట్టి కాంతయే; తలఁపన్=విచారింపఁగా; కొమ్మ=ఉత్తమకాంత; ఇచట, పురుషరత్నమున్=పున్నాగవృక్షమును; చెంది=కూడి; సురభివృత్తిన్=వసంతవర్తనచేత; సుమనోగుణము=పుష్పములగుణమును; ఊనుకొమ్మయే=పొందునట్టి శాఖయే; తలఁపన్ =విచారింపఁగా; కొమ్మ= ఉత్తమశాఖ, అను నర్థము తోఁచుచున్నది. అనఁగ నామనియందుఁ బుష్పించి పున్నాగమును జేరిన కొమ్మయె కొమ్మ యనునట్లు పురుషశ్రేష్ఠునిగూడి సౌశీల్యాదిగుణములుగల కాంతయె కాంత యనఁబడు నని భావము. సర్వమంగళ=సమస్తశుభములుగలదై; అధీశ్వరునకున్=తనపతికి; సామేనయనన్=అర్ధశరీరమే యనునటులు; తగుసతి = ఒప్పుచున్నకాంతయె; నుతింపన్=వర్ణింపఁగ; సతి = ఉత్తమకాంత; అగున్=అగును; ఇచట, సర్వమంగళ=సర్వమంగళ యను నామాంతరముగలదై; అధీశ్వరునకున్=శంకరునకు; సామేనయనన్=అర్ధశరీరమే యను నటులు; తగుసతి= ఒప్పు చున్నపార్వతియె; నుతింపన్=వర్ణింపఁగ; సతి = పతివ్రత; అగున్=అగును, అను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ నీశ్వరున కర్ధాంగియైనట్టి పార్వతీదేవిపగిది తనపెనిమిటికి నర్ధాంగివలె నొప్పుచున్న వనితయె వనిత యనంబడు నని భావము. ఇనపాదసేవనంబునన్ – ఇన=పెనిమిటియొక్క, పాదసేవనంబునన్=చరణసేవచేత; ఘనామోదంబున్ – ఘన=అధికమగు, ఆమోదంబున్=కుతూహలమును; ఎనయుపద్మినియె =చెందుచున్న పద్మినీజాతికాంతయె; నుతింపన్=వర్ణింపఁగ; పద్మిని =పద్మినీజాతికాంత. ఇచట, ఇనపాదసేవనంబునన్ – ఇన=సూర్యునియొక్క, పాదసేవనంబునన్= కిరణస్పర్శచేత; ఘనా మోదంబున్ – ఘన=అధికమైన, ఆమోదంబున్=పరిమళమును; ఎనయుపద్మినియె=పొందు పద్మలతయె; నుతింపన్= వర్ణింపఁగ; పద్మిని=పద్మలత, అను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ, సూర్యకిరణస్పర్శముచే తామరతీవ ఘనామో దంబు చెందురీతిఁ దనపతిచరణసేవచే మిక్కిలి సంతసించు కాంతయె కాంత యనఁ బరఁగు నని భావము. సుచిరముగన్=ఎల్లకాలము; సుమనోవృత్తిన్ – సు=సమీచీనమగు, మనోవృత్తిన్=మనోవ్యాపారముచేత; సొబగున్=అంద మును; పూని=గ్రహించి; కలదినంబులు=కలకాలము; ప్రియుమదిన్=పతిమనమును; కలసి మెలసి=కలసి వర్తించి; నడచు కామిని=వర్తించుచున్న కాంతయె; కామిని=కాంత; నళిననయన=చంద్రికా! నీవు; తెలిసి=గుర్తెఱిఁగి; ఇంకన్=ఈమీఁద; పతి చెంతన్=పెనిమిటియొద్ద; మెలఁగు మమ్మ=వర్తింపుమమ్మ.

మ. అని వా రంబుజనేత్ర నంప నటఁ ద◊త్ప్రాణేశ్వరీయుక్తుఁడై
జననాథేంద్రుఁడు కాంచనాంచితమణీ◊జ్వాజ్వల్యమానప్రభా
జనితక్ష్మాచరదైనబింబధిషణా◊సంస్థాన మౌస్యందనం
బున నాత్మీయపురీలలామకము నా◊మోదంబుమైఁ జేరఁగన్. 105

టీక: అని=పూర్వోక్తప్రకారముగఁ జంద్రికకు నీతిఁ గఱపి; వారు=తలిదండ్రులు; అంబుజనేత్రన్=చంద్రికను; అంపన్=పంపఁగా; అటన్=ఆమీఁద; తత్ప్రాణేశ్వరీయుక్తుఁడై = ఆప్రాణేశ్వరి యగుచంద్రికతోఁ గూడినవాఁడై; జననాథేంద్రుఁడు=సుచంద్రుఁడు; కాంచ నాంచిత మణీ జ్వాజ్వల్యమాన ప్రభా జనిత క్ష్మాచర దైనబింబ ధిషణా సంస్థానము – కాంచన=సువర్ణముచేత, అంచిత= ఒప్పుచున్న, మణీ=మణులయొక్క, జ్వాజ్వల్యమాన=మిక్కిలి వెలుంగుచున్న, ప్రభా=కాంతిచేత, జనిత= పుట్టింపఁబడిన, క్ష్మాచరత్=భూమియందు చరించుచున్న, ఐనబింబ=సూర్యబింబముయొక్క, ధిషణా=బుద్ధికి, సంస్థానము=నెలవైనది; ఔ స్యందనంబునన్=అగునట్టిరథముచేత; ఆత్మీయపురీలలామకమున్=తనరాజధానీశ్రేష్ఠమును; ఆమోదంబుమైన్=సంతసము చేత; చేరఁగన్=ప్రవేశింపఁగా, దీనికి పైపద్యముతో నన్వయము.

అనఁగఁ జంద్రికకుఁ దలిదండ్రులు నీతి బోధించి పంపఁగ సుచంద్రుఁడు మణికాంతులచేఁ బుడమిఁ జరించు నినబింబమో యను మతి నొసఁగురథంబునఁ జంద్రికం గూడి నిజపురంబుఁ బ్రవేశింపఁగ నని భావము.

సీ. వరవర్ణసంపత్తి ◊నిరుపమశ్రీఁ బూను, సాంగనానాకళా◊చక్ర మనఁగ,
వసుకలాపవిభూతిఁ ◊బస మీఱుశ్రీవధూ,రమణీయతరతనూ◊రాజి యనఁగ,
స్ఫుటతరతారకా◊పటిమఁ గౌతుక మూన్పు, బహుకీర్తినవవప్ర◊పాళి యనఁగ,
ఘనజఘనోదార◊గరిమ నింపులు నింపు, వివిధభూమ్యవతార◊వితతి యనఁగ,

తే. పౌరవరవర్ణినీకోటి ◊బారు దీరె, భర్మమయహర్మ్యవీథులఁ ◊బార్థివేంద్రుఁ
డసమసుమపేశలాలాభ◊హర్షభార, వారకర్ణేజపానుభా◊వముల రాఁగ. 106

టీక. వరవర్ణసంపత్తిన్—వర=శ్రేష్ఠమగు, వర్ణ=కాంతియొక్క,అక్షరములయొక్క, సంపత్తిన్=సంపదచేత; నిరుపమశ్రీన్ – నిరుపమ=సరిలేని, శ్రీన్= కాంతిని, శ్రీకారమును; పూను సాంగనానాకళాచక్ర మనఁగన్ – పూను=వహించినట్టి, సాంగ= అంగ సహితమగు, నానాకళా=అనేకవిద్యలయొక్క,చక్ర మనఁగన్=సమూహమనునట్లు; అనఁగ శ్లాఘ్యమగువర్ణసంపత్తి గల పురాంగనాబృందము వర్ణసంపత్తితోఁ జేరియున్నకళాబృందమనునట్లు బారు దీరెనని భావము. ఇచట కళాచక్రమునకు, కాంతా బృందమునకును కేవలశబ్దసాధర్మ్య మున్న దని తెలియవలెను. వసుకలాపవిభూతిన్ – వసుకలాప=రత్నభూషణములయొక్క, ధననిచయముయొక్క, విభూతిన్=ఐశ్వర్యముచేత; పసమీఱు శ్రీవధూ రమణీయతర తనూరాజి యనఁగన్ – పసమీఱు=సమృద్ధిచే నతిశయించుచున్న, శ్రీవధూ=లక్ష్మీదేవి యొక్క, రమణీయతర=మిగుల మనోజ్ఞమగు, తనూరాజి యనఁగన్ = శరీరశ్రేణియో యనునట్లు; అనఁగ వసుకలాప విభూతిచేత లక్ష్మీదేవి వహించిన పెక్కుశరీరములా యనునట్లు బారుదీఱి రని భావము. స్ఫుటతరతారకా పటిమన్ – స్ఫుటతరతారకా=స్త్రీలయొక్క, పటిమన్=సామర్థ్యముచేత, స్త్రీలరూపముచేత ననుట; కౌతుకము=సంతసమును; ఊన్పు బహుకీర్తి నవ వప్ర పాళి యనఁగన్ – ఊన్పు=చేయుచున్న, బహుకీర్తి=అధికమగు కీర్తి యొక్క, నవ=నూతనమగు, వప్ర=కోటలయొక్క, పాళి=గుంపు, అనఁగన్ = అనునట్లు; అనఁగా, స్ఫుటతరతారకారూప ముచే నొప్పు కీర్తులయొక్కకోట లనునట్లు పౌరకాంతలు బారు దీరి రని భావము. ఘనజఘ నోదార గరిమన్ – ఘనజఘనా=అధికమగు కటిపురోభాగము గల స్త్రీలయొక్క, ఉదార=ఉత్కృష్టమగు, గరిమన్ =గొప్పతనముచేత, విపులజఘనముగల స్త్రీలరూపముచేత ననుట; ఇంపులు=ఆనందములను; నింపు వివిధ భూమ్యవతార వితతి యనఁగన్ – నింపు=పూరించుచున్న, వివిధ= నానావిధములగు, భూమి=పుడమియొక్క, అవతార =రూపాంతర ములయొక్క, వితతి యనఁగన్=సమూహమనునట్లు,అనఁగా, పుడమి యెత్తిన యనేకస్త్రీరూపములయొక్క సమూహ మను నట్లు పురకాంతలు బారుదీరి రని భావము. పార్థివేంద్రుఁడు=సుచంద్రుఁడు; అసమ సుమపేశలా లాభ హర్ష భార వార కర్ణేజపానుభావములన్ – అసమ=సాటిలేని, సుమ పేశలా=చంద్రికయొక్క, లాభ=ప్రాప్తివలన నైన, హర్ష=సంతసముయొక్క, భార=అతిశయముయొక్క, వార= సమూహము నకు, కర్ణేజప=సూచకములగు, ‘కర్ణేజప స్సూచక స్యాత్పిశునో దుర్జనః ఖలః’ అని యమరుఁడు, అనుభావములన్=కటాక్షా దులచేత; రాఁగన్=వచ్చుచుండఁగా; భర్మమయహర్మ్యవీథులన్ = బంగరుమేడలయొక్క ప్రదేశములందు; పౌరవరవర్ణినీ కోటి=పురకాంతలబృందము; బారు దీరెన్=వరుసదీరెను.

చ. సకలజగన్మనోహరు సు◊చంద్రునిఁ జంద్రికఁ జూడ నిట్లు కౌ
తుకమునఁ జేరి పౌరనవ◊తోయదవేణిక లెల్ల నుల్లస
చ్చకచకతాసమానమణి◊సంకులకంకణరాజి గల్లన
న్వికసితమల్లికావితతి ◊నింపుచు నింపులు పెంపు మీఱఁగన్. 107

టీక: పౌరనవతోయదవేణిక లెల్లన్ = పురకాంతలందఱు; సకలజగన్మనోహరున్ – సకల=సమస్తమగు, జగత్=జగమునకు, మనోహరున్=మనోజ్ఞుఁడగు; సుచంద్రునిన్= సుచంద్రభూపతిని; చంద్రికన్= చంద్రికను; చూడన్=చూచుటకై; ఇట్లు=ఈరీతి; కౌతుకమునన్=సంతసముచేత; చేరి=పొంది; ఉల్లస చ్చకచక తాసమాన మణి సంకుల కంకణ రాజి – ఉల్లసత్=ప్రకాశించు చున్న, చకచకతా=చకచకత్వముచేత, చకచకయని మెఱయుటచేత ననుట, అసమాన=తులలేని, మణి=రత్నములచేత, సంకుల=వ్యాప్తమగు, కంకణ=వలయములయొక్క, రాజి=శ్రేణి; గల్లనన్=గల్లుమని మ్రోయఁగ; వికసితమల్లికావితతిన్ – వికసిత=వికసించిన, మల్లికా=మల్లికాపుష్పములయొక్క, వితతిన్=సమూహమును; నింపుచున్=పూరించుచు; ఇంపులు= ఆనందములు; పెంపు మీఱఁగన్=అతిశయింపఁగ. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము. అనఁగఁ బురకాంతలు సుచంద్ర చంద్రికలను జూచుటకై వచ్చి, వారిపై మణి కంకణములు గల్లుమని మ్రోయుచుండ మల్లికాపుష్పములను నించుచు, నానందము లతిశయించించుచు నుండ, నని భావము.

సీ. చట్టుకూఁతు నొకర్తు ◊సర్వజ్ఞుఁ డగుమహే,శ్వరునితోఁ దార్చిన◊వామరచన,
ఖరపాదు రసవదం◊తర యైనపద్మిని, తోన గూర్చినపవ◊లైన చెయ్వు,
లలకుముద్వతి మనో◊హారి యౌసత్పతి, తో ఘటించిన యాప్ర◊దోషసృష్టి,
చిరపూరుషుని వసు◊స్ఫురితాంగి యగులక్ష్మి,తో నెనయించు న◊తుల్యసర్గ,
తే. మన్నియు జగంబు మఱవ న◊య్యబ్జజన్ముఁ,డతులధీచాకచక్యంబు ◊నసమరూప
మానుకూల్యంబు ననురూప◊యౌవనంబు, నమర నిద్దంపతులఁ జేసె ◊ననఘశక్తి. 108

టీక. చట్టుకూఁతు నొకర్తున్=వివేకశూన్యురాలైన నొకకాంతను; సర్వజ్ఞుఁడు=సర్వమును దెలిసినవాఁడు; అగు మహేశ్వరుని తోన్=అయినట్టిశంకరునితో; తార్చిన=కూర్చిన; వామరచన=వక్రరచన; చట్టుకూఁతు నొకర్తున్= హిమవత్పుత్రి యగు పార్వతీదేవిని; సర్వజ్ఞుఁడు=సర్వమును దెలిసినవాఁడు; అగు మహేశ్వరునితోన్=అయినట్టిశివునితో; తార్చిన=కూర్చిన; వామరచన=వామభాగమందురచన యని స్వభావార్థము.
ఖరపాదున్=గర్దభపాదములుగలవానిని; రసవదంతర – రసవత్=శృంగారరసయుక్తమగు, అంతర=హృదయము గలది; ఐనపద్మినితోన=ఐనట్టి పద్మినీజాతిస్త్రీతోడనే; కూర్చిన పవలైన చెయ్వులు=కూర్చినట్టి విరోధముగల పనులు; ఖరపాదున్= సూర్యుని; రసవదంతర =మకరందము గర్భ మందుఁ గలది; ఐనపద్మినితోన=ఐనట్టి పద్మలతతోడనే; కూర్చిన=జతపఱచిన; పవలు=దినమందు; ఐన చెయ్వులు= అయినట్టిపను లని స్వభావార్థము.
అలకుముద్వతిన్ =అట్టి కుత్సితమగు సంతసముగలదానిని; మనోహారి=మనోహరుఁడు; ఔ సత్పతితోన్=అయినట్టి మంచి నాయకునితో; ఘటించిన =కూర్చిన; ఆప్రదోషసృష్టి =ప్రకృష్టమగు దోషములుగల యా నిర్మాణము; అలకుముద్వతిన్ = ఆకలువతీఁగెను; మనోహారి=మనోహరుఁడు; ఔ సత్పతితోన్=అయినట్టి చంద్రునితో; ఘటించిన =కూర్చిన; ఆప్రదోషసృష్టి =ప్రదోషకాలము నందలి యాసృష్టి, యని స్వభావార్థము.
చిరపూరుషునిన్=ముదుసలివానిని; వసుస్ఫురితాంగి – వసు=సువర్ణమువలె, స్ఫురిత=ప్రకాశించుచున్న, అంగి=శరీరము గలది; అగులక్ష్మితోన్ = అయినట్టి లక్ష్మియనుపేరుగల కాంతతో; ఎనయించు=పొందించు; అతుల్యసర్గము=ఈడు గాని సృష్టి; చిరపూరుషునిన్=పురాణపురుషుఁడగు విష్ణుమూర్తిని; వసుస్ఫురితాంగి – వసు=ధనముతో, స్ఫురిత=ప్రకాశించు చున్న, అంగి=శరీరముగలది, అనఁగా ధనస్వరూపిణి; అగులక్ష్మితోన్ = అయినట్టి లక్ష్మీదేవితో; ఎనయించు=పొందించు; అతుల్యసర్గము=అసమానమైన సృష్టి, యని స్వభావార్థము. జగంబు=లోకము; అన్నియు మఱవన్=పూర్వోక్తవామరచనాదులన్నియు మఱచునట్లు; అయ్యబ్జజన్ముఁడు=ఆనలువ; అతులధీచాకచక్యంబున్ – అతుల=సాటిలేని, ధీచాకచక్యంబున్=బుద్ధిచాతుర్యమును; అసమరూపము=సాటిలేని రూప మును; ఆనుకూల్యంబున్=అనుకూలతయు; అనురూపయౌవనంబున్=అనుగుణమగు యౌవనమును; అమరన్=పొందు నటులు; అనఘశక్తిన్—అనఘ=నిర్దుష్టమగు, శక్తిన్=సామర్థ్యముచేత; ఇద్దంపతులన్=ఈ చంద్రికాసుచంద్రదంపతులను; చేసెన్=సృజించెను. అనఁగ వివేకశూన్యురాలైన దానిని సర్వజ్ఞుఁడగు శంకరునికి ఘటించిన వక్రరచనను, ఖరపాదుని పద్మిని తోఁ గూర్చిన విపరీతసృష్టిని, కుముద్వతిని సత్పతితోఁ దార్చిన ప్రదోషసృష్టిని, వసుస్ఫురితాంగి యగులక్ష్మిని ముదుసలి వానితోఁ గూర్చినట్టి యతుల్యసర్గమును, వీని నన్నింటిని లోకము మఱచునటులు ఈనలువ జాణతనముచేత నసమరూపాది గుణంబులు కలుగునటులు ఈచంద్రికాసుచంద్రుల సృజించె నని భావము.

చ. క్షమ నొకకిన్నరాగ్రసరు◊సఖ్యముఁ బూని మహానటుండు నా
నమరి తపస్విరాజవని◊తాళి వ్రతంబులు దూల్చినట్టి యా
కమలకరున్ వరించుగిరి◊కన్యక నవ్వఁగఁ జాలుఁ జంద్రికా
కమలదళాక్షి సద్గుణని◊కాయపయోధి సుచంద్రుఁ జేరుటన్. 109

టీక: క్షమన్=పుడమియందు; ఒకకిన్నరాగ్రసరుసఖ్యము=ఒకానొక కుత్సితపురుషుని నేస్తమును; పూని=గ్రహించి, కుబే రునిసఖ్యమును బూని యని స్వభావార్థము; మహానటుండు నాన్=దొడ్డనట్టువుండనునట్లు, మహానటుండని యీశ్వరునికి నామాంతరమని స్వభావార్థము; అమరి=ఒప్పి; తపస్వి రాజవనితాళివ్రతంబులు ఔ—తపస్విరాజ=మునిరాజులయొక్క, వనితా=కాంతలయొక్క, ఆళి=శ్రేణియొక్క, వ్రతంబులు=నియమములను, పతివ్రతాధర్మముల ననుట; తూల్చినట్టి= పోఁ గొట్టినట్టి; ఆకమలకరున్=లేడికరమందుఁగల యాశంకరుని, శంకరుఁడు దారుకావనమందు దిగంబరుఁడై చరియించు చుండఁగా మునికాంతలు చూచి మోహించుటయు, నామునులు శంకరునిశేఫము పుడమిం దెగిపడునటులు శపింప నాశేష మట్లె పడఁగా దాని సర్వలోకములు వహింపలేకయున్నంజూచి విష్ణువు యోనిరూపము ధరించి దానిం గైకొనె నని పురాణప్రసి ద్ధము; వరించుగిరికన్యకన్=కోరినట్టి పార్వతీదేవిని; చంద్రికాకమలదళాక్షి =చంద్రిక యను పేరుగల కమలలోచన; సద్గుణ నికాయపయోధిన్=శ్రేష్ఠగుణపుంజమునకు రత్నాకరుఁడగు; సుచంద్రున్ =సుచంద్రుని; చేరుటన్=చేరుటవలన; నవ్వఁగన్ =పరిహసించుటకు; చాలున్=ఓపును.

అనఁగ కిన్నరసఖ్యమును బూని మహానటుండనఁ బరఁగి మునికాంతలకు వ్రతభంగమును జేసిన శివుని వరించియున్న పార్వతీదేవిని, చంద్రిక గుణనిధి యగు సుచంద్రుని వరించుటచే పరిహసింపఁ జాలు నని భావము.

మ. కమలావాప్తి మలీమసాంతరమున ◊న్గన్పట్టు మిన్నందు దు
ర్గమవృత్తిం జరియించుఁ దద్వ్యయమున ◊న్గాంచు న్విరూపంబు మే
ఘము తద్యుక్తిఁ బొసంగె నా కచిరరు◊క్త్వం బంచు నామించు తాఁ
గమలాలోకనయై యుదారగుణవ◊త్కాంతాప్తిఁ బొల్చెన్ ధరన్. 110

టీక: కమలావాప్తిన్=సంపద కల్గుటచేత; మలీమసాంతరమునన్—మలీమస=మలినమగు, అంతరమునన్=హృదయము చేత; ఉదకప్రాప్తిచేత, నల్లని యంతరముచేత నని మేఘపరమగు నర్థము; కన్పట్టు=కానవచ్చును; మిన్నందున్=ఉప్పొం గును, ఆకసమంటునని మేఘపరమైన యర్థము; దుర్గమవృత్తిన్=పొందరాని నడవడిచేతను, గిరిశిఖరాదులయందు వర్త నముచేత నని మేఘపరమైన యర్థము; చరియించున్=నడచును; తద్వ్యయమునన్ – తత్=ఆసంపదయొక్క, ఆజలము యొక్క, వ్యయమునన్=నాశముచేతను; విరూపంబు=వైవర్ణ్యమును, తెల్లఁబోవుటను, మేఘము పుల్లింగసారస్యమువలన నొక పురుషుండని తోఁచుచున్నది; కాంచున్=పొందును; తద్యుక్తిన్–తత్=ఆపురుషునియొక్క, యుక్తిన్=సంబంధముచేత; తత్= ఆమేఘముయొక్క, యుక్తిన్=సంబంధముచేత; నాకున్; అచిరరుక్త్వంబు=నిలువనికాంతి గల్గుట, తటిద్భావము; పొసంగెన్= కల్గెను; అంచున్ = ఈ రీతిగాఁ ననుచు; ఆమించు=ఆమెఱపు; తాన్=తాను; ధరన్=భూమియందు; కమలాలోకనయై=చంద్రిక యై, అనఁగఁ జంద్రికాకృతితోఁ బుట్టి యనుట; ఉదారగుణవత్కాంతాప్తిన్ – ఉదార=ఉత్కృష్టమగు, గుణవత్=మంచిగుణ ములు గల, కాంత=ప్రియునియొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; పొల్చెన్ = ఒప్పెను.

అనఁగా లోకమం దొకపురుషుఁడు సంపద రాఁగానె విఱ్ఱవీఁగుచు నాసంపద నశింప వెలవెలఁబోవుచు, దుర్గమవృత్తిచేఁ జరించునటులు ఈమేఘము జలప్రాప్తి, తదభావములవలన మలీమసత్వమును, తెల్లనగుటయు పొంది దుర్గమవృత్తి గలిగి యుండుటచే దీనిసంబంధమువలన నా కచిరరుక్త్వంబు పొసంగె నని మెఱపుఁదీఁగ భూమియందుఁ జంద్రికారూపముతో జనించి ఉత్కృష్టగుణములు గల సుచంద్రునిఁ జేరి యొప్పె నని భావము.

వ. అను నప్పౌరకామినీ కలాపాలాప ప్రపంచంబున కుదంచితం బగుమనోంచలంబునం దట్టం బగు మోదంబు రెట్టింప, నొకశుభముహూర్తంబున భగవదనంగవిద్య యగునయ్యనవద్యాంగియుం దాను ననేక రంభా సంభ్రమ విజృంభితంబు, నగణ్య మఘవదలంకృతంబు, నపరిమిత సుమనో వితాన విద్యోతి తంబు, నసంఖ్య కవిజన విభ్రాజితంబు, ననుపమ గురుసమాజ సంకులంబు, నకలంక కలానిధి ధురంధ రంబు, నపార శుచిధర్మ పుణ్యజన రసాధీశ మండితంబు, నచంచల సదాగతి ధనద మహేశ్వర రాజి విరాజితంబు నై, యమంద విభవ జిత పురందర మందిరం బగు నాత్మీయ నివేశనంబు ప్రవేశించి, యా సుచంద్ర ధరణీచంద్రుండు, పక్షపాత పరాఙ్ముఖ ప్రచారుండయి, మహనీయ వసు కలాపంబున నభిరూప చక్రంబున కవక్ర ప్రమోదంబు గూర్చుచు, సద్గణంబుల కహీన ద్యుమ్నంబు లొసంగుచుఁ, బద్మినీ సముద యంబున కభ్యుదయంబు ఘటించుచు, నపూర్వ వితరణ పాండితీ ధురంధరుండై, కువలయంబునకుఁ బోలె దుర్వార శార్వర వ్రాతంబున కామోద వర్ధనంబుం జేయుచు, నభంగ మంగళ తరంగితం బగు నొక్క సమయంబున. 111

టీక: అను నప్పౌరకామినీ కలాపాలాప ప్రపంచంబునకున్ – అను =పూర్వోక్తప్రకారముగఁ బల్కుచున్న, అప్పౌరకామినీ కలాప=శ్రేష్ఠలగు నాపురకాంతలయొక్క, ఆలాప=సల్లాపములయొక్క, ప్రపంచంబునకున్=అతిశయమునకు; ఉదంచితంబు =మిక్కిలి యొప్పుచున్నది, అగుమనోంచలంబునన్=అగునట్టి హృదయప్రదేశమందు; దట్టంబు=సాంద్రము; అగు మోదంబు =అగునట్టి సంతసము; రెట్టింపన్=ఇనుమడింపఁగ; ఒకశుభముహూర్తంబునన్=ఒకమంగళముహూర్తమందు; భగవదనంగ విద్య =మహిమ గల మన్మథవిద్య; అగు అయ్యనవద్యాంగియున్=అగునట్టి యాచంద్రికయును; తానును =సుచంద్రుఁడును; అనేక రంభా సంభ్రమ విజృంభితంబును – ఇది మొదలుకొని యచంచలసదాగతి యనువఱకు నీవిశేషణములచే నుపమాన భూతపురందరమందిరంబునకన్న వ్యతిరేకమును జూపుచున్నాఁడు – అనేక=పలువురగు, రంభా =స్వర్వేశ్యలవలన నైన, సంభ్రమ=సంతసముచేత, విజృంభితంబును=ప్రకాశించునదియును, అనేకకదళీవృక్షములచేతఁ బ్రకాశించునది యని స్వభావా ర్థము; అగణ్య మఘవదలంకృతంబును – అగణ్య=లెక్కిడరాని, మఘవత్=ఇంద్రులచేత, ఈమఘవచ్ఛబ్దము మతుబంతము, ‘హవి ర్జక్షతి నిశ్శంకో మఖేషు మఘవా నసౌ, తత్రైకో మఘవా నముత్ర బహవః’ అని ఇట్లు మతుబంతమునకుఁ బెక్కు ప్రామా ణికప్రయోగములు గలవు, అలంకృతంబును=అలంకరింపఁబడినదియును; పెక్కండ్రగు జన్నముచేసినవారిచే నలంకృతమైన దని స్వభావార్థము, స్వర్గమం దొకరంభయు, నొకయింద్రుఁడును నుండ నిచట ననేకు లున్నారని భావము; అపరిమిత సుమనో వితాన విద్యోతితంబును – అపరిమిత=మితిలేని, సుమనోవితాన = దేవసంఘములచేత, విద్యోతితంబును=ప్రకాశించుచున్నది యును, మితిలేని పూఁజప్పరములచేఁ బ్రకాశించుచున్నదని స్వభావార్థము. స్వర్గమందు ముప్పదిమూఁడుకోట్ల సుమస్సులు (దేవతలు) ఉన్నారనియు, నిచట మితిలేని సుమనోబృంద మున్నదనియు భావము; అసంఖ్య కవిజన విభ్రాజితంబును – అసంఖ్య=అనేకులగు, కవిజన =శుక్రులచే, విభ్రా జితంబును =ప్రకాశించుచున్నదియును, అసంఖ్యులగు విద్వజ్జనులచేఁ బ్రకా శించుచున్నదని స్వభావార్థము. స్వర్గమం దొకకవి యున్నాఁ డనియు, నిచట ననేకకవు లున్నారనియు భావము; అనుపమ గురుసమాజ సంకులంబును – అనుపమ =సాటిలేని, గురు=బృహస్పతులయొక్క, సమాజ= గణముచేత, సంకులంబును= వ్యాప్తమైనదియును, గురు=పిత్రాదులగు పెద్దలచేత వ్యాప్తమైనదని స్వభావార్థము. అనఁగ స్వర్గమం దొకగురు వున్నాఁడ నియు, నిచట ననేకగురువు లున్నా రనియు భావము; అకలంక కలానిధి ధురంధరంబును – అకలంక=కలంకరహితులగు, కలానిధి=చంద్రులయొక్క, ధురంధరంబును=భారమును వహించినదియును; అకలంక=కలంకరహితులగు, కలానిధి= విద్యలకు స్థానభూతులగు పండితులయొక్క, ధురంధరంబును=భారమును వహించినదియును అని స్వభావార్థము; అనఁగ స్వర్గమం దొకఁడయ్యును సకలంకుఁడగు కలానిధి యున్నాఁడనియు, నిచట నిష్కలంకులైన బహుకలానిధులు గల రనియు భావము; అపార శుచిధర్మ పుణ్య జన రసాధీశ మండితంబును – అపార=అంతములేని,శుచి=అగ్నులచేతను, ధర్మ=యమ ధర్మరాజులచేతను, పుణ్యజన=నిరృతులచేతను, రసాధీశ=వరుణులచేతను, మండితంబును=అలంకరింపఁబడినదియును; అపార=అధికమగు, శుచి =పరిశుద్ధమగు, ధర్మ=న్యాయముచేత, పుణ్య=మనోజ్ఞులగు, జన=నరులచేతను, రసాధీశ= రాజులచేతను, మండితంబును నని స్వభావార్థము; స్వర్గమం దగ్ని మొదలగువా రొకరొకరే యున్నా రనియు, నిచట ననేకులు గల రని భావము; అచంచల సదాగతి ధనద మహేశ్వర రాజి విరాజితంబు నై – అచంచల=స్థిరుఁలగు, సదాగతి=వాయువుల యొక్క, ధనద=కుబేరులయొక్క, మహేశ్వర=శంకరులయొక్క, రాజి=శ్రేణిచేత, విరాజితంబు నై = ప్రకాశించునదియు నై; అచంచల=చలింపని, సత్=శ్రేష్ఠమగు, ఆగతి=ఆదాయము గల, ధనదమహేశ్వర=వదాన్యశ్రేష్ఠులయొక్క, రాజి=శ్రేణిచేత, విరాజితంబు నయి యని స్వభావార్థము; స్వర్గమందు కుబేరాదు లొకరొకరే యున్నా రనియు, నిచట ననేకు లున్నారనియు భావము; అమంద విభవ జిత పురందర మందిరంబు – అమంద=అధికమగు, విభవ=సంపదచేత, జిత=జయింపఁబడిన, పురం దరమందిరంబు = స్వర్గము గలది; అగు నాత్మీయ నివేశనంబు =అగునట్టి స్వగృహమును; ప్రవేశించి=చొచ్చి; ఆసుచంద్ర ధరణీచంద్రుండు=ఆసుచంద్రమహారాజు; ఇటుపైని కవి ప్రసిద్ధచంద్రునికన్న నీసుచంద్రునియందు గుణోత్కృష్టతను చెప్పు చున్నాఁడు. పక్షపాత పరాఙ్ముఖ ప్రచారుండయి = సుచంద్రుఁడు నిష్పక్షపాతప్రచారము గలవాఁ డనియు, ప్రసిద్ధచంద్రుఁడు శుక్లపక్షమందుఁ బక్షపాతము గలవాఁ డని యర్థము, పక్ష=కృష్ణపక్షమందు, పాత=పడుటచేత, పరాఙ్ముఖ=అభిముఖము గాని, ప్రచారము గలవాఁ డని స్వభావార్థము, చంద్రుఁడు కృష్ణపక్షమందు క్షీణించుటచేఁ బరాఙ్ముఖుఁడని తాత్పర్యము; మహ నీయ వసు కలాపంబునన్ – మహనీయ=ఉత్కృష్టమగు, వసు=కిరణములయొక్క, కలాపంబునన్=సమూహముచేత; అభిరూప చక్రంబునకున్ – అభిరూప=మనోజ్ఞమగు, చక్రంబునకున్=చక్రవాకమునకు; అవక్ర ప్రమోదంబున్ – అవక్ర = అకుటిలమగు, ప్రమోదంబున్=సంతసమును; కూర్చుచున్=చేయుచు; మహనీయ వసు కలాపంబునన్=అధికమగు ధన రాశిచేత; అభిరూప చక్రంబునకున్=విద్వద్బృందమునకు, అవక్ర ప్రమోదమును గూర్చువాఁ డని స్వభావార్థము; ప్రసిద్ధ చంద్రుఁడు వసుకలాపముచేత అభిరూపచక్రమునకుఁ గీడొనరించువాఁ డనియు, నీరాజు వానికి సంతసము జేయువాఁ డనియు భావము; సద్గణంబులకున్=రిక్కలగుంపునకు; అహీన ద్యుమ్నంబులు=ఉత్కృష్టమగు కాంతులను; ఒసంగుచున్ = ఇచ్చుచు; సద్గణంబులకున్=సత్పురుషసంఘమునకు; అహీన ద్యుమ్నంబులు=తక్కువగాని ధనములను, ఒసంగుచు నని స్వభావార్థము, ‘ద్యుమ్న మర్థ రై విభవా అపి’ అని యమరుఁడు; ప్రసిద్ధచంద్రుఁడు సద్గణంబులకు కాంతిని పోగొట్టువాఁ డనియు, నీరాజు అహీనద్యుమ్నంబు లిచ్చువాఁ డనియు తాత్పర్యము; పద్మినీ సముదయంబునకున్ = తామరతీవగుంపు నకు; అభ్యుదయంబున్=అధికమగు వృద్ధిని; ఘటించుచున్=చేయుచు; పద్మినీ సముదయంబునకున్= పద్మినీజాతిస్త్రీసం ఘమునకు, నభ్యుదయమును చేయువాఁడని స్వభావార్థము; ప్రసిద్ధచంద్రుఁడు పద్మినీసముదయంబున కభ్యుదయంబు చేయని వా డనియు, నీరాజు చేయువాఁ డనియు భావము; అపూర్వ వితరణ పాండితీ ధురంధరుండై – అపూర్వ=మున్నెన్నడును లేని, వితరణ=త్యాగముయొక్క, పాండితీ=పాండిత్యముయొక్క, ధురంధరుండై=భారము వహించినవాఁడై; కువలయంబునకున్ పోలెన్=కలువకువలెనె; దుర్వార శార్వర వ్రాతంబునకున్ – దుర్వార=నివారింపరాని, శార్వర=చీఁకటులయొక్క, వ్రాతంబున కున్=సంఘమునకు; కువలయంబునకున్ పోలెన్=భూవలయంబునకువలెనె, దుర్వార=నివారింప రాని, శార్వర= దుష్టుల యొక్క, వ్రాతంబునకున్=సమూహమునకు; ఆమోద=పరిమళమునకు, సంతసమునకు, వర్ధనంబు=అభివృద్ధిని, ఛేదన మును; చేయుచున్=ఒనర్చుచు; అనఁగా ప్రసిద్ధచంద్రుండు కువలయంబునకు నెటు లామోదవర్ధనముఁ జేయునో యారీతి నీసుచంద్రుఁడును కువలయ మనఁగా భూవలయమునకు నామోదవృద్ధి ననఁగా సంతోషాభివృద్ధిని జేయు ననియు, ప్రసిద్ధ చంద్రుఁడు శార్వరవ్రాతంబునకు, అనఁగా చీఁకటులగుంపునకు, ఆమోదవర్ధనమును, సంతోషచ్ఛేదమును జేయునట్లు సుచం ద్రుఁడు శార్వరవ్రాతంబునకు, అనఁగా దుర్మార్గులసమూహమునకు, ఆమోదవర్ధనమును, అనఁగా, సంతోషవిచ్ఛేదమును జేయుచున్నాఁడని భావము; అభంగ మంగళ తరంగితంబు=అప్రతిహతమగు శుభపరంపరతోఁ గూడినది; అగు నొక్క సమ యంబునన్ = అయినట్టి యొకకాలమందు. పైపద్యముతో నన్వయము.

సీ. తెఱగంటిరారాలఁ ◊దీర్చినకంబాల,జతఁ గూడి యున్నవ◊జ్రంపుబోది
యల నంటఁ దార్చినఁ ◊దలుకు లీనెడుజాతి, గుజరాతికెంపురా◊కులుకుతమ్మి
మొగడలలోయంత్ర◊ముల జాఱుపన్నీటి, పలుచనితుంపురుల్◊పడఁగ మీఱు
జాళువాబొమ్మల◊కేల నుండెడువట్టి,వేరులసురటీల◊వీజనంబు

తే. విరళవిరళంబులై దెస◊ల్పరిమళింపఁ,జేయ గారుత్మతగవాక్ష◊సీమసంఘ
టితభరణినాఁ గళద్ధూప◊వితతిచేత, గమ్మనువిహారగేహప్ర◊ఘాణమందు. 112

టీక: తెఱగంటిరారాలన్=ఇంద్రనీలమణులచేత; తీర్చినకంబాలజతన్=చేసిన కంబములజంటయందు; కూడి యున్న వజ్రంపుబోదియలన్=చేరియున్నట్టి రవలబోదెలయందు; అంటన్=తగులునట్లు; తార్చినన్=కదియింపఁగా ననుట; తలుకులు=మిక్కిలి ప్రకాశములను; ఈనెడు జాతి గుజరాతికెంపురా కులుకు తమ్మిమొగడల లోయంత్రములన్ – ఈనెడు =ప్రసవించుచున్న, జాతి=ఉత్తమజాతి గల, గుజరాతి కెంపురా=గుజరాతిదేశమందుఁ బుట్టిన కెంపులయొక్క, గుజరాతిదేశ మున నుత్తమజాతి కెంపులు బుట్టుట ప్రసిద్ధము, ‘గుజరాతి కెంపులు గోమేధికంబులు’ అని ప్రాచీనకవులును ప్రయోగించి యున్నారు, కులుకు= సుందరమగు, తమ్మిమొగడల=తామరమొగ్గలయొక్క, లోయంత్రములన్=లోపలనుండుయంత్ర ములవలననుండి; జాఱుపన్నీటి పలుచని తుంపురుల్ – జాఱు=స్రవించుచున్న, పన్నీటి=పన్నీరుయొక్క, పలుచని తుంపు రుల్=సూక్ష్మశీకరములు; పడఁగన్=పడుచుండఁగా; మీఱు జాళువాబొమ్మలకేలన్ – మీఱు=అతిశయించుచున్న, జాళువా బొమ్మల=బంగరుబొమ్మలయొక్క, కేలన్=కరములందు; ఉండెడు వట్టివేరులసురటీల వీజనంబు – ఉండెడు=ఉన్నట్టి; వట్టి వేరుల=వట్టివేళ్ళయొక్క, సురటీల=విసనకఱ్ఱలయొక్క, వీజనంబు=విసరుట; విరళవిరళంబులై=పలుచనైనవై; దెసల్= దిక్కులు; పరిమళింపన్=పరిమలించునట్లు; చేయన్=చేయఁగా; గారుత్మత గవాక్ష సీమ సంఘటిత భరణినాన్ – గారుత్మత =మరకతమణులయొక్క, ‘గారుత్మతం మరకత మశ్మగర్భో హరిన్మణిః’ అని యమరుఁడు, గవాక్ష సీమ=వాతాయనప్రదేశ ములతో, సంఘటిత=కూడుకొన్న, భరణినాన్=కరండమో యనునట్లు; గళద్ధూపవితతిచేతన్ – గళత్= జాఱుచున్న, ధూప =ధూపముయొక్క, ధూప మనఁగా కేశసంస్కారమునకై పరిమళించునటులు చేయు నగరుమొదలగుదాని పొగ, వితతిచేతన్= సమూహముచేత; గమ్మను విహారగేహ ప్రఘాణమందున్ – గమ్మను=పరిమళించుచున్న, విహారగేహ=క్రీడామందిరము యొక్క, ప్రఘాణమందున్=అళిందమునందు. పైపద్యముతో నన్వయము.

అనఁగా నింద్రనీలమణులతోఁ జేసి యున్న స్తంభములమీఁద నున్న రవలబోదెలయందుఁ గదియించిన కెంపుతామర మొగ్గల కుక్షియం దమర్చిన పన్నీటియంత్రములనుండి జాఱుచున్న పన్నీటితుంపురులు మీఁదఁ బడుచుండ నచట నిల్పి యున్న బంగరుబొమ్మలకరములందున్న వట్టివేరుల సురటీలు విసరుట దిక్కులఁ బరిమళింపఁ జేయ ధూపవితతిచే నొప్పి నదై మరకతమణిమయగవాక్షులు గల బరిణయో యనునటు లుండు క్రీడాగృహప్రఘాణమునం దని భావము. ఇచట క్రీడా గృహాళిందమును కరండముగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.

సీ. రతిరహస్యాధిదే ◊వత తదాశ్రయ మంది,శృంగారకళ బయల్ ◊చేసె ననఁగ,
మరురాజ్యరమ నిన్న ◊మరగి డాసితి నంచు, మచ్చికమైఁ గరం◊బిచ్చె ననఁగ,
మధులక్ష్మి ప్రాచీన◊మంతువు మఱపింప, వెసఁ బరిచర్య గా◊వించె ననఁగ,
రతి భర్త కభయంబు ◊మతిఁ గోరి తద్ధేమ, నిశితశస్త్రి నెదుట◊నిలిపె ననఁగ,

తే. లీల నలువంక వేర్వేఱఁ ◊గీలుబొమ్మ, లగరుధూపంబు లిడ తెల◊నాకుమడుపు
నొసఁగఁ బువ్వుల సురటిచే◊విసర రత్న, దీపిక గ్రహింప నెమ్మది ◊ధృతి రహింప. 113

టీక: రతిరహస్యాధిదేవత – రతిరహస్య=సురతరహస్యముయొక్క, అధిదేవత=అధిష్ఠానదేవత; తదాశ్రయము – తత్= ఆసుచంద్రునియొక్క, ఆశ్రయము=గృహమును; అంది=పొంది;శృంగారకళన్– శృంగార=శృంగారరసముయొక్క, కళన్=కాంతిని; బయల్ చేసె ననఁగన్=ప్రకటింపఁజేసెనో యనునటులు; మరురాజ్యరమ=మన్మథరాజ్యలక్ష్మి; నిన్న=నిన్నె; మరగి=ఆశపడి; డాసితిన్=సమీపించితిని; అంచున్=అనుచు; మచ్చికమైన్=మోహముచేత; కరంబు=హస్తమును; ఇచ్చె ననఁగన్=ఒసంగెనో యనునట్లు; మధులక్ష్మి=వసంతలక్ష్మి; ప్రాచీనమంతువు=పూర్వము చేసిన యపరాధమును; మఱపింపన్=మఱచునట్లు చేయుటకై; వెసన్=వేగముగ; పరిచర్యన్=సేవను; కావించె ననఁగన్=చేసె ననునట్లు; రతి=రతీదేవి; భర్తకున్=పెనిమిటి యగుమరునకు; అభయంబు=భయములేమిని; మతిన్=మనమునందు; కోరి=కాంక్షించి; తద్ధేమనిశితశస్త్రిన్–తత్=ఆమరునియొక్క, హేమ=బంగరుమయమగు, లేదా, సంపెఁగపువ్వనెడు, నిశిత=వాఁడిగల, శస్త్రిన్ =శస్త్రమును; ఎదుటన్=ముందర; నిలిపె ననఁగన్=నిలువఁబెట్టెనో యనునట్లు; లోకములో యుద్ధమం దభయము గోరినవాఁడు తనకత్తిని ప్రతివీరుని యెదుట నుంచుట ప్రసిద్ధము; లీలన్=విలాసముచేత; నలువంకన్=నల్దిక్కులయందు; వేర్వేఱన్=ప్రత్యేకముగ; కీలుబొమ్మలు=కీళ్ళతోఁ జేసిన బొమ్మలు; అగరుధూపంబులు=అగరుపొగలను; ఇడన్=ఇచ్చుచుండఁగా; తెలనాకుమడుపున్=సన్నని తమలపాకులమడుపును; ఒసఁగన్=ఇయ్యఁగ; పువ్వుల సురటిచేన్=పూలవిసనకఱ్ఱచేత; విసరన్=వీచుచుండఁగ; రత్నదీపికన్=రత్నప్రదీపమును; గ్రహింపన్=తీసికొనఁగ; అగరుధూపము మొదలగునవి నాలుగింటికి పైచరణములందు క్రమముగ నన్వయం బెఱుంగునది; నెమ్మదిన్=మనమునందు; ధృతి=ధైర్యము; రహింపన్=ఒప్పఁగా. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

అనఁగా రతిరహస్యాధిదేవత సుచంద్రునిగృహము నొంది శృంగారకళను బ్రకటింపఁ జేసెనో యనునటు లొకబొమ్మ యగరుధూపంబు నిడె ననియు, మదనలక్ష్మి నిన్నే మరగితి నని మోహముచేత తనకరంబు సుచంద్రుని కొసంగెనా యను నటు లొకబొమ్మ యాకుమడుపు లిచ్చె ననియు, వసంతలక్ష్మి తాను పూర్వమందు సుచంద్రునికిఁ జేసిన యపకారమును మఱపింపఁ బరిచర్య చేసెనో యన నొకబొమ్మ సురటిచే విసరె ననియు, రతి తనపతి యగు మరునకు సుచంద్రునివలన నభయంబు గోరి యామదనుని కాంచనబాణమును నెదుట నుంచెనా యనునటు లొకబొమ్మ రత్నదీపమును గ్రహించె ననియు భావము.

చ. ప్రకటితచిత్తభూబిరుద◊పద్యములంబలె వింతఱంతులన్
సకినము లుగ్గడించు నెర◊చాయలఁ బాయని కెంపుకోళ్ళతోఁ
జికిలి చొకాటపున్మెఱుఁగు◊చిక్కని పెందెరతో విధూతవృం
తకుసుమతల్పమై సిరులఁ◊దార్కొనుశయ్య వసించినంతటన్. 114

టీక: ప్రకటిత చిత్తభూ బిరుదపద్యములం బలెన్ – ప్రకటిత=వెల్లడిచేయఁబడిన, చిత్తభూ=మరునియొక్క, బిరుద=జయ చిహ్నములగు, పద్యములంబలెన్=శ్లోకములవలెనె; వింతఱంతులన్=ఆశ్చర్యకరమగు కలకలధ్వనులచేత;సకినములు =శుభసూచకమగు వాక్కులను; ఉగ్గడించు=వచించునట్టి; నెరచాయలన్=శ్రేష్ఠమగు కాంతులను; పాయని కెంపుకోళ్ళతోన్ =వీడని కెంపుకోళ్ళచేత; చికిలిచొకాటపు న్మెఱుఁగుచిక్కనిపెందెరతోన్–చికిలి=తుడిచివైచిన, చొకాటపు=శ్రేష్ఠమగు,మెఱుఁగు = తళతళయను కాంతిగల, చిక్కని పెందెరతోన్=దట్టమగు గొప్పతెరతోడను; విధూతవృంతకుసుమతల్పమై – విధూత= పోఁ గొట్టఁబడిన, వృంత=తొడిమగల, కుసుమ=పుష్పములయొక్క, తల్పమై=తల్పముగలదై; సిరులన్=కాంతులను; తార్కొను శయ్యన్=కదియునట్టి శయ్యను; వసించినంతటన్=నివసించినంతట. పైపద్యముతో నన్వయము.

అనఁగా శ్రేష్ఠములగు కాంతులు గల కెంపుకోళ్ళు మరునిబిరుదపద్యంబులపగిది వినంబడు ధ్వనులచే శుభశకునములఁ దెలుపుచుండఁగా, చికిలిచేసినమంచితెరతో, తొడిమలు దీసిన పుష్పములు పఱచియున్న తల్పముతో నమరి యున్న పఱపు పైఁ గూర్చుండినంతలో నని భావము.

క. చిత్తప్రభూతకలహా, యత్తతఁ గడుఁ దత్తఱించు◊నాత్మన్ వ్రీడో
ద్వృత్తి నడంచుచుఁ దగున, బ్బిత్తరిఁ గని వల్కి రపుడు◊ప్రియసఖు లెల్లన్. 115

టీక: చిత్తప్రభూతకలహాయత్తతన్=సురతాయత్తతచేత; కడున్=మిక్కిలి; తత్తఱించు నాత్మన్ =త్వరపడు హృదయమును; వ్రీడోద్వృత్తిన్ = లజ్జాతిశయముచేత; అడంచుచున్=అడఁచుచు; తగునబ్బిత్తరిన్=ఒప్పుచున్న యాచంద్రికను; కని=చూచి; అపుడు=ఆసమయమందు; ప్రియసఖు లెల్లన్=సకియలందఱు; పల్కిరి=వక్ష్యమాణప్రకారము వచించిరి.

తే. పురుషమణిఁ గూడి యామోద◊గరిమఁ బూను,నట్టి లతకూన సౌమన◊స్యంబుఁ బొగడ
నౌనె యాకల్పకం బైనఁ ◊ గానఁ దరుణి, తాల్పు మాకల్పకస్ఫూర్తి ◊ధవునిఁ గదియ. 116

టీక: పురుషమణిన్=శ్రేష్ఠమగు పున్నాగవృక్షమును, పురుషశ్రేష్ఠుని; కూడి=కలసికొని; ఆమోదగరిమన్=పరిమళముయొక్క అతిశయమును, సంతోషాతిశయమును; పూనునట్టి లతకూన సౌమనస్యంబున్=పొందునట్టి బాలలతయొక్క కుసుమవాస నను, పొందునట్టి కాంతయొక్క మంచిమనసు గల్గుటను; పొగడన్=నుతించుటకు; ఆకల్పకం బైనన్=కల్పపర్యంతమైనను,
ఔనె=అగునా యని కాకువు; కానన్=అందువలన; తరుణీ=చంద్రికా! ధవునిఁ గదియన్=భర్తను చేరుటకు; ఆకల్పకస్ఫూర్తిన్ = అలంకారస్ఫూర్తిని; తాల్పుము=ధరింపుము. అనఁగాఁ బున్నాగవృక్షమును జేరి పరిమళాతిశయమును బూనియున్న బాల లతయొక్క పరిమళమును కల్పపర్యంతమైనను బొగడనలవి గాదు కనుక నీవును పున్నాగవృక్షమును గలసికొనిన బాలలత పగిది ప్రియునిఁ గదియ నలంకారమును ధరియింపు మని భావము.

తే. అని చెలులు ఘనమణికలా◊పాళి భాస్వ
దంశుకంబున నలరించి ◊యద్భుతముగఁ
జంద్రిక నృపాంబుకాబ్జముల్◊సంతసిల్ల
నతనిఁ జేర్పంగఁ దలఁచి దీ◊వ్యన్నవోక్తి. 117

టీక: చెలులు=చెలికత్తెలు; అని=పూర్వోక్తప్రకారముగఁ బలికి; చంద్రికన్=చంద్రికను, జ్యోత్స్నను; నృపాంబుకాబ్జముల్ =సుచంద్రుని నేత్రకమలములు; సంతసిల్లన్=సంతోషించునట్లు; అద్భుతముగన్=చిత్రంబుగ;ఘనమణికలాపాళిన్– ఘన= శ్రేష్ఠమగు,మణికలాప=మణిభూషణములయొక్క, ఆళిన్=పంక్తిచేత; భాస్వదంశుకంబునన్=ప్రకాశించు వస్త్రముచేత; భాస్వత్=సూర్యునియొక్క, అంశుకంబునన్=కిరణముచేత; అలరించి=అలంకరించి; అతనిన్=సుచంద్రుని; చేర్పంగన్ =చేర్చుటకు; తలఁచి=యత్నించి; దీవ్యన్నవోక్తిన్ – దీవ్యత్=ప్రకాశించుచున్న,నవోక్తిన్=నూతనవచనముచేత. దీని కుత్తర పద్యస్థక్రియతో నన్వయము. అనఁగా చెలికత్తెలు చంద్రికను మేఘపంక్తిచేతను సూర్యకిరణములచేతను సుచంద్రుని నేత్రములు సంతసించునట్లు అలంకరించి రని భావము. చంద్రికకు విరోధులగు మేఘపంక్తి, సూర్యకిరణములచే నలంకరించుటయు, నా చంద్రికను నృపాంబకాబ్జములు సంతసించునటు లలంకరించుటయు చిత్రమని భావము. మణిభూషణములచేఁ బ్రకాశించు వస్త్రములచే చంద్రిక నలంకరించి రని స్వభావతాత్పర్యము.

చ. చనుదము లెమ్ము శ్యామ యిఁక ◊క్ష్మాధరచంద్రుని డాయఁగా వలెన్
మన మలరంగఁ దత్కరవి◊మర్దము దక్కినఁ దెల్వి దక్కునే
యని నయ మొప్పఁ దచ్ఛయము ◊నంటి తెమల్చిన లజ్జపెంపునన్
వనజదళాక్షి నమ్రముఖ◊వారిజయై నిలఁ బూన వెండియున్. 118

టీక: శ్యామ=చంద్రికా!మన మలరంగన్=హృదయము సంతసించునట్లు; ఇఁకన్=ఈమీఁద; క్ష్మాధరచంద్రునిన్=రాజచంద్రుఁ డగు సుచంద్రుని; డాయన్ కావలెన్=సమీపింపవలయును, అనఁగ సుచంద్రునిఁ జేరవలయు ననుట; చనుదము లెమ్ము = పోదము లెమ్ము; తత్కరవిమర్దము – తత్=ఆసుచంద్రునియొక్క,కర=హస్తముయొక్క, విమర్దము=సమ్మర్దము; తక్కినన్ =విడువఁగా; తెల్వి దక్కునే=తెల్వి కల్గునా? కల్గ దనుట. అనఁగ పురుషకరసమ్మర్దము కాంతలకు మిగుల శోభావహమని భావము. ‘సురతమృదితా బాలవనితా, తనిమ్నాశోభన్తే గళితవిభవా శ్చార్థిషు నృపాః’ అని ప్రాచీనవచనము; అని=ఈప్రకా రము పల్కి; నయమొప్పన్=నీతి యొప్పునటులు; తచ్ఛయము నంటి =ఆచంద్రిక కరమును బట్టుకొని; తెమల్చినన్= లాగఁగా; లజ్జపెంపునన్=వ్రీడాతిశయముచేత; వనజదళాక్షి=చంద్రిక; నమ్రముఖవారిజయై –నమ్ర=వంగిన,ముఖవారిజయై =ముఖకమలముగలదై; నిలన్=నిల్చుటకు; పూనన్=ప్రయత్నింపఁగ; వెండియున్=మరల. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వ యము. శ్యామ=రాత్రి; క్ష్మాధరచంద్రునిన్=పొడుపుకొండమీఁదిచంద్రుని; డాయఁగావలెన్=సమీపింపవలెను; తత్కరవిమర్దము తక్కినన్=ఆచంద్రకిరణసంపర్కము లేనియెడ; తెల్వి దక్కునె=ప్రకాశము కల్గునా యను నర్థము ధ్వనించుచున్నది.

అనఁగ శ్యామా! నీవు సుచంద్రుని గలసికొనుము, తత్సంపర్కము నీకు మిగుల శోభావహము అని చెలులు పలికి చంద్రికకరముఁ బట్టి లాగఁగా లజ్జాతిశయముచే చంద్రిక ముఖము వంచుకొని నిలువఁగ మఱియు వక్ష్యమాణప్రకారముగఁ బలికి రని భావము.

సీ. తొయ్యలి నీచన్ను◊దోయి చక్రము గెల్చు,నదియె రాజపరిగ్ర◊హంబు లేక,
వెలఁది నీకటిసీమ ◊విషమగోత్రము నొంచు,నదియె దేవేశలీ◊లాప్తి లేక,
కాంత నీకనుఁగవ ◊కైరవావళి మీఱు,నదియె యినాలోక ◊మొదవ కున్నఁ,
గలికి నీమయికాంతి ◊కైతకంబులమించు,నదియె యీశ్వరయుతిఁ ◊బొదల కున్నఁ,

తే. గాన నీవింత హిత మాత్మఁ ◊గాంచ లేక, గోలవయి యేల యీవేళఁ ◊గోమలాంగి
మొక్కలము చేసె దని పల్కి◊ముదిత లెల్ల, తోడితేఁ గాంత పడకిల్లు ◊దొరయ వచ్చె. 119

టీక: తొయ్యలి=చంద్రికా! నీచన్నుదోయి=నీచన్గవ; రాజపరిగ్రహంబు లేక=సుచంద్రుఁడను చంద్రుని యనుగ్రహము లేక; చక్రమున్=చక్రవాకమును; గెల్చునదియె? గెలువ దనుట. ఇచట, రాజపరిగ్రహంబు లేక=రాజుయొక్క గ్రహణము లేక; చక్రమున్=రాష్ట్రమును; గెల్చునా యను నర్థము దోఁచుచున్నది. లోకములో రాజును బట్టుకొనినఁగాని తద్రాష్ట్రము వశపడ దని భావము. చంద్రసాహాయ్య మున్నం గాని చక్రవాకములు వశపడవని తాత్పర్యము. వెలఁది=చంద్రికా! నీకటిసీమ=నీకటిప్రదేశము; విషమగోత్రమును=దుష్టకులమును; దేవేశలీలాప్తి లేక –దేవేశ=సుచంద్రుని యొక్క, లీలాప్తి లేక=విలాసప్రాప్తి లేక; నొంచు నదియె=నొప్పించునా? నొప్పింపఁజాల దనుట. అనఁగ సుచంద్రలీలాప్తి గలిగె నేని దుష్టకులముల నడంపవచ్చునని భావము. విషమగోత్రమును=విషమపర్వతమును; దేవేశలీలాప్తి లేక=ఇంద్రలీలాప్రాప్తి లేక; నొంచు నదియె యను నర్థము దోఁచుచున్నది. కాంత=చంద్రికా! నీకనుఁగవ=నీకనుదోయి; ఇనాలోకము=సుచంద్రదర్శనము; ఒదవకున్నన్=కలుగకున్న; కైరవావళిన్= పిశునసమూహమును; మీఱునదియె=అతిక్రమించునదియా? కాదనుట. అనఁగ నీకనుదోయి సుచంద్రదర్శనముఁ జేయ కున్నఁ బిశునుల జయింపఁజాలదని భావము. నీకనుదోయి, ఇనాలోకము=సూర్యదర్శనము, కలుగకున్న, కైరవావళిన్= తొవబంతిని, మీఱునదియె యను నర్థము దోఁచుచున్నది. కలికి=చంద్రికా! నీమయికాంతి=నీదేహకాంతి; ఈశ్వరయుతిన్=సుచంద్రసంబంధముచేత; పొదలకున్నన్=అతిశయింప కున్నచో; కైతకంబులన్=క్షుద్రశత్రువులను, ‘క్షుద్ర ద్విషిచ కైతక’మ్మని హలాయుధుఁడు;మించునదియె =అతిశయించునా? అతిశయింప దనుట. అనఁగ నీదేహకాంతి సుచంద్రయుతిచేఁ బొదలకున్న క్షుద్రులఁ దిరస్కరింపఁజాల దని భావము; నీదేహ కాంతి, ఈశ్వరయుతిన్= శంకరునిసంబంధముచేత; పొదలకున్నన్=అతిశయింపకున్నచో; కైతకంబులన్=కేతకీపుష్పము లను, మించునా యను నర్థము దోఁచుచున్నది. కానన్=అందువలన; నీవు; ఇంత హితము=ఇంతమాత్రము హితమును; ఆత్మన్=మనమునందు; కాంచ లేక=చూడక; గోల వయి=మూఢురాలవై; ఏల=ఎందుకు? ఈవేళన్=ఈసమయమందు; కోమలాంగి=చంద్రికా! మొక్కలము=ముష్కరత్వ మును; చేసెదు=చేయుచున్నావు? అని పల్కి=ఇట్లు వచించి; ముదిత లెల్లన్=కాంత లందఱు; తోడితేన్=తోడ్కొని రాఁగ; కాంత=చంద్రిక; పడకిల్లు దొరయన్=పాన్పుటిల్లు ప్రవేశించుటకు; వచ్చెన్=వచ్చెను.

మ. అమరేశాశ్మవిజేతృకుంతల వయ◊స్యాయత్నయుక్తి న్విహా
రమహాగేహము సొచ్చి, యచ్చట మసా◊రస్తంభపార్శ్వంబునం
దు మొగి న్నిల్వఁగ రాగయుక్తి నది దో◊డ్తోఁ దెల్పె భూభర్తకు
న్రమణి న్నిత్యమహాశుచిప్రకృతికి ◊న్నైజంబు పోఁబోవునే? 120

టీక: అమరేశాశ్మవిజేతృకుంతల = ఇంద్రనీలమణుల జయించిన కుంతలములు గల చంద్రిక; వయస్యాయత్నయుక్తిన్– వయస్యా=సకియలయొక్క, యత్న=ప్రయత్నముయొక్క, యుక్తిన్=సంబంధముచేతను; విహారమహాగేహము = క్రీడా గృహమును; చొచ్చి=ప్రవేశించి; అచ్చటన్=ఆగృహమందు; మసారస్తంభపార్శ్వంబునందున్ – మసారస్తంభ=ఇంద్రనీల మణిస్తంభముయొక్క, పార్శ్వంబునందున్=ప్రక్కయందు; మొగిన్=పూనికచేత; నిల్వఁగన్=నిలుచుండఁగా; అది=ఆ కంబము; రాగయుక్తిన్– రాగ=చంద్రికాంగసంగతారుణ్యముయొక్క, యుక్తిన్=సంబంధముచేత, క్రోధసంబంధముచేత నని యర్థాంతరము; రమణిన్=చంద్రికను; భూభర్తకున్=సుచంద్రునకు;తోడ్తోన్=వెంటనె; తెల్పెన్=తెలియఁజేసెను;నిత్య మహా శుచి ప్రకృతికిన్ –నిత్య=నిరంతరము, మహాశుచి=అత్యంతాపరిశుద్ధమగు, ప్రకృతికిన్=స్వభావము గలవారికి; నిత్య=నిరం తరము,మహత్ అశుచి=అత్యంతము నల్లనిదగు, ప్రకృతికిన్=స్వభావము గలదానికని స్వభావార్థము; నైజంబు = స్వభా వము; పోఁబోవునే=పోఁగలదా? పోవ దనుట.

చంద్రిక సకియలప్రయత్నముచేఁ గ్రీడాగృహము సొచ్చి, యచట నుండు నింద్రనీలస్తంభముయొక్క పార్శ్వమందు నిలుచుండఁగా, నాస్తంభము రాగముచే నిచటఁ జంద్రిక వచ్చి నిలుచున్నదని సుచంద్రునకుఁ దెలిపెను. లోకమందు నిత్యమహా శుచిప్రకృతి గలవారు వారి స్వభావమును విడువ రని భావము. చంద్రిక యింద్రనీలమణుల జయించిన కుంతలములు గలది గాన ద్వేషముచే నామెను (రమణిని) రాజునకుఁ దెలిపినదని ముఖ్యాశయము. అర్థాంతరన్యాసాలంకారము.

ఉ. అత్తఱిఁ దత్సఖీజన మ◊నావిలధీయుతి హత్తి మీర లి
ప్పుత్తడిబొమ్మ రాజమణి◊పుత్రికలార భజించుచుండుఁడీ
చిత్తము వొంగ నం చొకవి◊శేషవిధానము నెంచి వంచనా
యత్తత నేగె దాని జల◊జాక్షి యథార్థమ కా గణింపఁగన్. 121

టీక: అత్తఱిన్=ఆసమయమందు; తత్సఖీజనము – తత్=ఆచంద్రికయొక్క,సఖీజనము=సకురాండ్రు; అనావిలధీయుతిన్ – అనావిల=అకలుషమగు, ధీయుతిన్=బుద్ధియోగమును; హత్తి=కూడి; రాజమణిపుత్రికలార =రాజశ్రేష్ఠతనూజలార, చంద్ర కాంతపుబొమ్మలార యని యర్థాంతరము; మీరలు=మీరు; ఇప్పుత్తడిబొమ్మన్=ఈబంగరుబొమ్మను, చంద్రిక ననుట; చిత్తము=మనస్సు; పొంగన్=ఉబుకునటులు; భజించుచుండుఁడీ=సేవించుచుండుఁడీ; అంచున్=ఈప్రకారము పలుకుచు; ఒకవిశేషవిధానమున్=ఒకవిశేషకార్యమును; ఎంచి=గణించి; వంచనాయత్తతన్=మోసముచేత; దానిన్=ఆమాటను; జలజాక్షి = చంద్రిక; యథార్థమ=సత్యమే; కాన్=అగునటులు; గణింపఁగన్=ఎంచఁగా; ఏగెన్=పోయెను. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము. అనఁగాఁ జంద్రికను బడకింటిలో విడిచి యచట నున్న రాజమణిపుత్రికలకు మీరు చంద్రికను సేవించు చుండిఁడీ యని వచించి వంచనచేఁ దత్సఖీజనము సనియె నని భావము.

సీ. సుమశరప్రావృడా◊గమశక్తి నంబుద,శ్రేణిఁ గన్పడు తటి◊ద్రేఖ యనఁగఁ,
బతిపూన్కి గ్రహియింప ◊భావజుండు పునర్గ్ర,హణ మూన్చు సుమచాప◊యష్టి యనఁగ,
సాహిణి రా నిగ్గ ◊సాధించు నావల,రాజుక్రొత్తచిలుక◊తేజి యనఁగ,
వనపాలుదోటినే◊ర్పున వచ్చు శృంగార,ధరణిజభూరిమం◊జరిక యనఁగ,

తే. నపుడు నృపుకన్నుఁగవ నాంగి ◊కాభ నలమి, యతఁడు దివియంగ వెనుదీసి ◊యంత రాక
గబ్బి యయి నిల్చి తత్కరా◊కర్షణమునఁ, గదిసె నక్కాంత తల్ప మ◊క్కంబ మెడసి. 122

టీక: సుమశరప్రావృడాగమశక్తిన్ – సుమశర=మన్మథుఁడనెడు, ప్రావృడాగమ=వర్షాకాలప్రాప్తియొక్క, శక్తిన్=సామర్థ్యము చేత; అంబుదశ్రేణిన్=మేఘపంక్తియందు; కన్పడు తటిద్రేఖ యనఁగన్=కాన్పించు మెఱపుతీవయో యనునట్లు; పతి=భర్తయగు సుచంద్రుఁడు; పూన్కిన్=ప్రయత్నమును; గ్రహియింపన్=పొందుటకై; భావజుండు=మరుఁడు; పునర్గ్రహ ణము=పునస్స్వీకారమును; ఊన్చు సుమచాపయష్టి యనఁగన్ = చేయుచున్న పూవింటియొక్క దండమో యనునట్లు; సాహిణి =గుఱ్ఱపువాఁడు; రాన్=వచ్చుటకై; ఇగ్గన్=ఆకర్షింపఁగ; సాధించు నావలరాజుక్రొత్తచిలుకతేజి యనఁగన్ – సాధించు=ఎదిరించు, ఆవలరాజు=ఆమరునియొక్క, క్రొత్తచిలుకతేజి యనఁగన్=నూతనమగు శుకాశ్వమో యనునట్లు; వనపాలుదోటినేర్పునన్ – వనపాలు=వనపాలకునియొక్క, దోటినేర్పునన్=దోటియొక్క జాణతనముచేత, దోటి యనఁగాఁ జేతి కందని తరులతాదిఫలపుష్పంబుల నాకర్షించు దండవిశేషము; వచ్చు=వచ్చునట్టి; శృంగారధరణిజభూరిమంజరిక యనఁగన్ – శృంగారధరణిజ=శృంగారవృక్షముయొక్క, భూరి=అధికమగు, మంజరిక యనఁగన్=గుచ్ఛమో యనునట్లు;
అపుడు=ఆసమయమందు; ఇచట పైచరణములయందు క్రమముగ నన్వయింపవలెను; నృపుకన్నుఁగవన్=సుచంద్రుని కనుదోయిని; ఆంగికాభన్=దేహసంబంధి యగు కాంతిచేత; అలమి=ఆక్రమించి, అనఁగా మరుఁడను వర్షాకాలప్రాప్తిచేత మేఘములందుఁ జూపట్టుచున్న మెఱపుతీవయో యనునట్లు సుచంద్రునికనుదోయిం దన దేహకాంతిచే నలమి యని భావము; అతఁడు=సుచంద్రుఁడు; తివియంగన్=ఆకర్షింపఁగా; వెనుదీసి=వెనుకకు మరలి, అనఁగా మరుఁడు మరల సుచంద్రునిపై నాకర్షించిన పూవింటిదండమో యనునట్లు వెనుకకు వంగినదని భావము; అంతన్=ఆమీఁద; రాక=రానిదై; గబ్బి యయి=గర్వముగలదై; నిల్చి=నిలుచుండి, గుఱ్ఱపువాఁడిగ్గఁగ సాధించుచున్న మరునిక్రొత్తచిలుకగుఱ్ఱమో యను నట్లు రాక, గబ్బి యయి నల్చిన దని భావము; తత్కరాకర్షణమునన్ – తత్=ఆసుచంద్రునియొక్క, కర=హస్తముయొక్క, ఆకర్షణమునన్=ఆకర్షణముచేత;అక్కాంత= ఆచంద్రిక; అక్కంబ మెడసి=ఆస్తంభమును విడిచి; తల్పము=శయ్యను; కదిసెన్=పొందెను. అనఁగ వనపాలుఁడు దోటితోఁ దీసిన వచ్చినట్టి శృంగారభూజ పుష్పగుచ్ఛమో యనునట్లు సుచంద్రుని కరాకర్షణముచేత నాచంద్రిక స్తంభమును వదలి తల్పమును జేరె నని భావము.

మ. సదనాధారసమగ్రవాసననొ త◊త్స్వాధ్వీవతంసంబు తా
నుదితస్తంభతఁ గాంచెఁ దత్కలన న◊య్యుర్వీశరత్నంబు తా
నదియే తాల్చెఁ దదాత్వమం దగుఁ గదా ◊శ్యామాతిభూమప్రభా
స్పదమూర్తిన్ భజియించి తద్గుణతతిన్ ◊సంధింప రెవ్వా రిలన్. 123

టీక: సదనాధారసమగ్రవాసననొ – సదనాధార=స్తంభముయొక్క, సమగ్ర=పరిపూర్ణమగు,వాసననొ=అనుభూతార్థస్మృతి చేతనో; తత్స్వాధ్వీవతంసంబు=ఆచంద్రిక; తాన్=తాను; ఉదితస్తంభతన్ – ఉదిత=ఉదయించిన, స్తంభతన్=స్తంభము గల్గు టను, నిశ్చేష్టత ననుట; కాంచెన్=పొందెను; తత్కలనన్ – తత్=ఆచంద్రికయొక్క, కలనన్=సంబంధముచేత; అయ్యుర్వీశ రత్నంబు=ఆసుచంద్రుఁడు; తాన్=తానును; తదాత్వమందున్=ఆసమయమందు; అదియే=ఆనిశ్చేష్టతనె; తాల్చెన్=ధరిం చెను; అగుఁ గదా=అవును కదా! సత్యము కదా యనుట; శ్యామాతిభూమప్రభాస్పదమూర్తిన్ – శ్యామ=మలినమైన, అతి భూమ=అధికమగు, ప్రభా=కాంతికి, ఆస్పద=స్థానభూతమగు, మూర్తిన్=శరీరముగలవారిని, నల్లనికాంతి గల యింద్రనీల మణిస్తంభము నని భావము; శ్యామా=స్త్రీలయొక్క, అతిభూమ=అధికమగు, ప్రభా=కాంతికి, ఆస్పద=స్థానభూతగుణ మగు, మూర్తి నని యర్థాంతరము; భజియించి=సేవించి; తద్గుణతతిన్—తత్=ఆమలినవస్తువుయొక్క, ఆస్త్రీలయొక్క, గుణతతిన్= గుణకదంబమును; ఇలన్=భూమియందు; ఎవ్వారు; సంధింపరు=పొందరు? సమస్తజనులు పొందుదు రనుట.

అనఁగా చంద్రిక యింద్రనీలమణిస్తంభముయొక్క వాసనచేతనో యనునట్లు తాను ఉదితస్తంభతను దాల్చె ననియు, నా సుచంద్రుఁడును అపుడు చంద్రిక సంబంధముచేత తానును ఉదితస్తంభతను దాల్చె ననియు భావము. ఈయర్థమునె దృష్టాం తముతో దృఢపఱచుచున్నాడు. లోకమందు శ్యామాతిభూమప్రభాస్పదమూర్తిని సేవించి తద్గుణములను ఎవరు పొందరు? అందఱును పొందుదు రని భావము. ఇచట నర్థాంతరన్యాసాలంకారము.

చ. జలరుహనేత్రగాత్రమహి ◊సాంద్రమహాంకురపాళి యంటఁ ద
త్కలితమనస్తటాకమును ◊గాఢశరాళి నగల్చి చిత్తజుం
డలరు మహారసోత్కరము ◊నచ్చటఁ దారిచె నాఁగ నత్తఱిం
బులకిత మైనమైఁ బొరలి ◊పొంగె నవోదితఘర్మవాశ్ఛటల్. 124

టీక: జలరుహనేత్ర గాత్రమహిన్ – జలరుహనేత్ర=చంద్రికయొక్క, గాత్రమహిన్=శరీరమను భూమియందు; సాంద్ర మహాం కుర పాళి – సాంద్ర=దట్టమగు, మహత్=అధికమగు, అంకుర=మొలకలయొక్క, పులకలయొక్క యని యర్థాంతరము, పాళి=శ్రేణి; అంటన్=సంబంధింపఁగా; తత్కలితమనస్తటాకమును – తత్=ఆచంద్రికయొక్క, కలిత=ఒప్పుచున్న, మనస్తటా కమును=హృదయ మను చెఱువును; గాఢశరాళిన్ – గాఢ=దృఢమగు, శర=బాణములయొక్క, వాయువులయొక్క, ఆళిన్ =శ్రేణిచేత; చిత్తజుండు=మరుఁడు; అగల్చి=భేదించి; అలరు మహారసోత్కరమున్ – అలరు=ఒప్పుచున్న, మహారస =గొప్ప యనురాగమను నుదకముయొక్క, ఉత్కరమున్=సమూహమును; అచ్చటన్=ఆగాత్రమను భూమియందు; తారిచె నాఁగన్ =ఉంచెనో యనునట్లు; అత్తఱిన్=ఆసమయమందు; పులకితము=సంజాతపులకములు గలది; ఐనమైన్ = అయినట్టి శరీర మందు; నవోదితఘర్మవాశ్ఛటల్ – నవ=నూతనమగునట్లు, ఉదిత=పుట్టిన, ఘర్మవాః=స్వేదోదకముల యొక్క, ఛటల్ = సమూహములు; పొరలి=పొర్లి; పొంగెన్=ఉబికెను. అనఁగా చంద్రికశరీరమనుభూమియందు సాంద్రమగుమొలక లుద యింపఁగానె యాచంద్రికయొక్క హృదయ మను తటాకమును శరాళిచే భేదించి మరుఁడు మహారసోత్కరమును జార్చెనో యనునట్లు పులకలతోఁ గూడి యున్న శరీరము నందు స్వేదోదకము పొరలిపొంగె నని భావము.

చ. చెలి చెలు లందఱుం జనిన ◊సిగ్గది పోవక యున్న దేమి తాఁ
జలమున నంచు నెంచి యతి◊సాంద్రరుషాయుతిఁబోలె ఘర్మవాః
కలికలఁ దోఁగి శోణరుచి ◊గన్పడ నొయ్యన జాఱి తద్వధూ
కులమణిసమ్ముఖం బెడసెఁ ◊గుంకుమబొట్టురసంబు చయ్యనన్. 125

టీక: చెలి=చంద్రికయొక్క; చెలు లందఱున్=చెలికత్తె లందఱును; చనినన్=పోయినను; సిగ్గు అది=ఆవ్రీడ; తాన్=తాను; చలమునన్=మాత్సర్యముచేత; పోవక యున్నది=చనక ఉన్నది; ఏమి=ఏమి కారణము? అంచున్=అనుచు; ఎంచి=గణించి; అతిసాంద్రరుషాయుతిఁబోలెన్—అతిసాంద్ర=మిక్కిలి గాఢమగు, రుషాయుతిఁబోలెన్=క్రోధముతోఁగూడికచేతవలెనె; ఘర్మ వాఃకలికలన్=ఘర్మోదబిందువులయందు; తోఁగి=మునిఁగి; శోణరుచి కన్పడన్=ఎఱ్ఱనికాంతి చూపట్టుచుండఁగా; ఒయ్యనన్ =తిన్నఁగా; జాఱి=స్రవించి; తద్వధూకులమణిసమ్ముఖంబు – తద్వధూకులమణి=ఆచంద్రికయొక్క, సమ్ముఖంబు=ముఖము సన్నిధిని అని తోఁచుచున్నది; కుంకుమబొట్టురసంబు=కుంకుమతిలకముయొక్క జలము; చయ్యనన్=శీఘ్రముగ; ఎడసెన్= ఎడబాసెను. అనఁగా చంద్రిక సకురాండ్రు చనినను ఈసిగ్గు ఏల పోవక యున్నది యని రోషముతోఁ గూడి యున్నదానివలెనె స్వేదోదబిందువులయందు మునిఁగి ఎఱ్ఱనికాంతితో కుంకుమబొట్టురసంబు చంద్రికసమ్ముఖంబు నెడఁబాసె నని భావము.

చ. జలజశరాశుగప్రచుర◊చంక్రమణంబు లమందతం గనన్
గలికి తమిన్ ద్రపాంబుదము ◊గప్పిన నాననచంద్రదర్శనం
బలవడ కున్కి నత్తఱి ని◊జాక్షిచకోరకయుగ్మ మాఁకటం
దలఁకుచు నుండ నద్ధరణి◊నాథుఁడు పల్కు రసోత్తరంబుగన్. 126

టీక: జలజశరాశుగప్రచురచంక్రమణంబు – జలజశర=మరునియొక్క, ఆశుగ=బాణములను వాయువులయొక్క, ప్రచుర =అధికమగు, చంక్రమణంబులు=సంచారములు; అమందతన్=అతిశయమును; కనన్=పొందఁగా; కలికితమిన్ – కలికి= చంద్రికయొక్క, తమిన్=ఆసక్తి యనెడు రాత్రిని; త్రపాంబుదము=సిగ్గనుమబ్బు; కప్పినన్=ఆచ్ఛాదింపఁగ; ఆననచంద్ర దర్శనంబు=ముఖచంద్రునియొక్కదర్శనము; అలవడ కున్కి=పొసఁగకుండుటచేత; అత్తఱిన్=ఆసమయమందు; నిజాక్షి చకోరకయుగ్మము – నిజ=తనసంబంధియగు, అక్షిచకోరక=నేత్రములను చకోరములయొక్క, యుగ్మము= జంట; ఆఁకటన్=క్షుత్తుచేత; తలఁకుచు నుండన్=చలించుచుండఁగా; అద్ధరణినాథుఁడు=ఆసుచంద్రుఁడు; రసోత్తరంబుగన్= అనురాగాతిశయముచేత; పల్కున్=పలికెను. అనఁగ సుచంద్రుఁడు, మన్మథాశుగసంచారము లతిశయింపఁగానె చంద్రిక యొక్క యాసక్తి యనెడు రాత్రిని లజ్జయను మేఘము కప్పగా, ముఖచంద్రుఁడు గనిపింపని యాసమయమునందుఁ దన యక్షిచకోరములు ఆఁకలితో చలించుచుండఁగా ననురాగమునఁ జంద్రికతోఁ బలికె నని భావము.

సీ. వరశంఖపూగసం◊పద గళస్థము నీకు, సతి! పోఁకముడి సుంత◊సడల రాదె,
కువలయశ్రీ నేలు◊కొను నేత్రరుచి నీకుఁ, దొయ్యలి! రెం డూరు ◊లియ్య రాదె,
ఘనకుందవిభవంబు ◊గను దంతములు నీకు, బిసబాహ యొకరేఖ ◊యొసఁగ రాదె,
బహుదివ్యఫలలక్ష్మిఁ ◊బరఁగువాతెఱ నీకు, నింతి! మంజులకుచం ◊బిడఁగ రాదె,
తే. రాజవిజయంబు చేసె నీ◊రమ్యముఖము, లేమ! యవనతవృత్తి చా◊లింప రాదె
నిరుపమరుచిమణికి నీ◊కరయఁ దగునె, వరపటలరీతి చే విడు◊వఁగను రాదె. 127

టీక: వరశంఖపూగసంపద – వర=శ్రేష్ఠమగు, శంఖపూగసంపద=శంఖములయొక్క పూగములయొక్క సంపదయనెడు శంఖసంఖ్యగల పోఁకలసమృద్ధి; నీకున్; గళస్థము=గలమందున్నది, కలస్థ మనియు విభాగము, రేఫలకారంబుల కభేద మునుబట్టి కరస్థ మనుకొనవలయు; పోఁకముడి=నీవియనెడు పోఁకలమూటను; సుంత=ఇంచుకంత; సతీ=చంద్రికా! సడల రాదె=వదలరాదా? అనఁగ శంఖసంఖ్యాకమగు పూగసమృద్ధిగలవా రించుకపోఁకముడి సడలుట తగు నని భావము. నీవీ గ్రంథిని సడలింపుమని ప్రకృతాభిప్రాయము. ‘ద్వ్యర్థైః పదైః పిశునయేచ్చ రహస్యవస్తు’ అను కామశాస్త్రమర్యాద ననుసరించి కవి ప్రార్థనీయరహస్యవస్తువును శ్లిష్టపదములతో సూచించి యున్నాఁడు. ఇ ట్లితరచరణములయందును గ్రహింపవలయు. తొయ్యలి=చంద్రికా! నీకున్; కువలయశ్రీన్=కుముదసంపద యనెడు భూవలయసంపదను; ఏలుకొను నేత్రరుచి =పాలించెడు నయనకాంతి; కలదు. రెం డూరులు=రెండు తొడలనెడు రెండుగ్రామములను; ఇయ్య రాదె=ఒసంగరాదా? భూవలయము నేలువారు రెండుగ్రామముల నిచ్చుట తగునని భావము. ఊరువుల నొసంగుమని ప్రకృతాభిప్రాయము. బిసబాహ=తారతూఁడువంటి బాహువులుగలదానా! నీకున్; ఘనకుందవిభవంబున్ – ఘన=అధికమగు,కుందవిభవంబున్ = మొల్లమొగ్గలవిభవ మనెడు నిధివిశేషముయొక్క విభవమును, ‘మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్ఛపౌ, ముకున్ద కున్ద నీలాశ్చ వరశ్చ నిధయో నవ’ అని యమరుఁడు; కను దంతములు =పొందునట్టి దశనములు; కలవు. ఒకరేఖ=ఒకక్షత మనెడు స్వల్పద్రవ్యమును;ఒసఁగ రాదె=ఈయరాదా? కుందవిభవముగలవారు స్వల్పద్రవ్యము నొసంగుట యుక్త మని భావము. దంతక్షతి నీయుమని ప్రకృతాభిప్రాయము. ఇంతి=చంద్రికా! నీకున్; బహుదివ్యఫలలక్ష్మిన్ – బహు=అనేకములై, దివ్య=మనోజ్ఞములగు, ఫల=లాభము లనెడు పండ్ల యొక్క, లక్ష్మిన్=లక్ష్మిచేత; పరఁగువాతెఱ=ఒప్పునట్టి మోవి; కలదు; మంజులకుచంబు= అందమైన కుచము (మంజుల కుచము) అనెడు నందమైన లకుచమును (మంజు లకుచమును), అనఁగా గజనిమ్మపండును, ‘మనోజ్ఞం మంజు మంజులమ్’ అని యమరుఁడు; ఇడఁగ రాదె =ఈయరాదా? అనేకఫలంబులు గలవారు ఒక్కఫలము నిచ్చుటయుక్త మని భావము. కుచము నిమ్మని ప్రకృతాభిప్రాయము. లేమ=చంద్రికా! నీరమ్యముఖము=నీసుందరవదనము; రాజవిజయంబున్=చంద్రుఁడనెడు భూపాలునియొక్క గెలుపును; చేసెన్=ఒనర్చెను; అవనతవృత్తిన్=నమ్రభావమును; చాలింప రాదె=మానరాదా? లోకమందు రాజును జయించినవారు తల యెత్తి యుండుట యుక్తమని భావము. లజ్జ విడిచి తలయెత్తు మని ప్రకృతాభిప్రాయము. నిరుపమరుచిమణికిన్ = అసమానమై, రుచిరమైన మణివంటిదానవగు; నీకున్; వరపటలరీతి – వర=శ్రేష్ఠమగు, పటలరీతి =వస్త్రాకర్షణముచేయుదానిరీతి యనెడు పటలాఖ్యమణిదోషరీతి; అరయన్=విచారింపఁగా; తగునె=యుక్తమా? శ్రేష్ఠమగు మణులకు పటలదోషము యుక్తము గాదని భావము. వస్త్రమును గ్రహింపకు మని ప్రకృతాభిప్రాయము. చే విడువఁగనురాదె = కరము వస్త్రమునుండి విడువు మనుట.

క. అనునయపూర్వకముగ న,వ్వనజానన నిటులు పలికి◊వసుధాపతి త
ద్ఘనరమ్యాంగకసంస్ప,ర్శనలాలసవృత్తి యగుట ◊సంభ్రమ మెసఁగన్. 128

టీక: వసుధాపతి=సుచంద్రుఁడు; అవ్వనజాననన్=ఆచంద్రికనుగూర్చి; ఇటులు=ఇట్లు; అనునయపూర్వకముగన్=ఉప లాలనపురస్సరముగ; పలికి=వచించి; తద్ఘన రమ్యాంగక సంస్పర్శన లాలస వృత్తి – తత్=ఆచంద్రికయొక్క, ఘన = బిగు వైన, రమ్య=మనోజ్ఞములగు, అంగక=అవయవములయొక్క, సంస్పర్శన=తాఁకుటయందు, లాలస=అధికతృష్ణగల, వృత్తి =వ్యాపారముగలవాఁడు; అగుటన్=ఐన హేతువుచేత; సంభ్రమము=తొట్రుపాటు; ఎసఁగన్=అతిశయించునటులు. దీని కుత్తర పద్యస్థక్రియతో నన్వయము.

చ. నృపతిమహాబలోత్కరము ◊నేర్పున వళ్యధిరోహిణిన్ సమ
గ్రపటిమ లగ్గ కెక్కుతఱిఁ ◊గంపమునొందు సతీకుచాద్రి దు
ర్గపదవి నాక్రమించి యట ◊రంజిలు నాయకరత్నముం గ్రహిం
చి పరమకౌతుకం బతని ◊చిత్తమునన్ ఘటియించె నత్తఱిన్. 129

టీక: నృపతిమహాబలోత్కరము – నృపతి=సుచంద్రునియొక్క, మహత్=అధికమగు, బల=బలముచేత, ఉత్=ఎత్తఁబడిన, కరము=హస్తము; నృపతియొక్క, మహాబల=అధికసేనలయొక్క, ఉత్కరము=సమూహము; నేర్పునన్=జాణతనముచేత; వళ్యధిరోహిణిన్ –వళి=త్రివళి యనెడు, అధిరోహిణిన్=నిచ్చనచేత; సమగ్రపటిమన్ –సమగ్ర=పరిపూర్ణమగు, పటిమన్= సామర్థ్యముచేత; లగ్గ కెక్కుతఱిన్=ముట్టడించుటకై, కోటనెక్కుసమయమందు; కంపమున్=కళవళమును, భయమును; ఒందు సతీకుచాద్రి దుర్గపదవిన్ – ఒందు=పొందుచున్న, సతీ=చంద్రికయొక్క, కుచాద్రి=పర్వతములవంటి స్తనము లనెడు, దుర్గ=కోటయొక్క, పదవిన్=స్థానమును;ఆక్రమించి=ఆవరించి; అటన్=అచ్చట; రంజిలు నాయకరత్నమున్=ప్రకాశించు ప్రభుశ్రేష్ఠుని, ప్రకాశించు హారమధ్యమణిని; గ్రహించి=పట్టుకొని; పరమకౌతుకంబు—పరమ=ఉత్కృష్టమగు,కౌతుకంబు= సంతసమును; అతని చిత్తమునన్=ఆసుచంద్రునిహృదయమందు; అత్తఱిన్=ఆసమయమందు; ఘటియించెన్=ఘటిల్లఁ జేసెను. అనఁగా సుచంద్రునియొక్క మహాబలముగలకర మనెడు బలోత్కరము, అనఁగ సేనాబృందము, జాణతనముతో త్రివళి యను నిచ్చెనచేత నెక్కి ముట్టడించుతఱి కళవళ మందు చంద్రికాకుచములను దుర్గమును ఆవరించి, యందున్న నాయక మణిని పట్టుకొని సుచంద్రునిచిత్తమునకు అత్యానందము కలిగించె నని భావము. సుచంద్రునికరము దొలుతఁ ద్రివళిని దాఁకి, పిదపఁ గుచముల నాక్రమించి, యచ్చట నున్న నాయకరత్నమును స్పృశించి యత్యానందముఁ జెందె నని ప్రకృతభావము.

తే. అటులు నేత్రాహరణయుక్తి ◊నతిశయిల్లు
రాజమౌళికి నీవి క ◊రస్థమయ్యె,
నైన పిమ్మట దానె త◊దంగసీమ
యతనిఁ బొదివి సుఖించె సాం◊ద్రానురక్తి. 130

టీక: అటులు=పూర్వోక్తప్రకారముగాను; నేత్రాహరణయుక్తి న్ – నేత్ర=వస్త్రముయొక్క, ఆహరణ=ఆకర్షణముయొక్క, యుక్తిన్=యోగముచేత; నేత్రాహరణ=నాయకాకర్షణముయొక్క, యుక్తిన్=సంబంధముచేత అని రాజపరమైన అర్థము; అతిశయిల్లు రాజమౌళికిన్ =అతిశయించుచున్న సుచంద్రునకు, రాజశ్రేష్ఠునకు; నీవి=పోఁకముడి, మూలధనము, ‘నీవీ పరి పణం మూలధన’మ్మని యమరుఁడు; కరస్థమయ్యెన్=హస్తగతమయ్యెను; ఐన పిమ్మటన్ =ఐన వెనుక; తానె =తనంతటనె; తదంగసీమ – తత్=ఆచంద్రికయొక్క, అంగసీమ=శరీరప్రదేశము, ఆరాజుయొక్క అంగ దేశమని యర్థాంతరము; అతనిన్= ఆసుచంద్రుని, ఆరాజును; పొదివి=పొంది, కలసి యనుట; సాంద్రానురక్తిన్ – సాంద్ర= దట్టమగు, అనురక్తిన్=అనురాగముచేత; సుఖించెన్=సుఖపడెను.

అనఁగ రాజును బట్టుకొని అతిశయించుచున్న రాజశ్రేష్ఠునకు మూలధనము కరస్థమైన పిదపఁ, దనంతటన ఆరాజు నంగ దేశము అతనిఁ బొంది సుఖించె నని భావము. వస్త్రాకర్షణముచేత నతిశయిల్లు సుచంద్రునకు పోఁకముడి కరగతమైన పిదపఁ జంద్రిక యంగప్రదేశము సుచంద్రునిఁ జెంది సుఖించె నని ప్రకృతాభిప్రాయము.

తే. అపు డతర్కితసంప్రాప్త ◊మగు పరస్ప
రాంగ సాంగత్యసౌఖ్యంబు ◊ననుభవించు
జంపతుల కెన్నఁ దత్త్రప◊సదృశ యైన
యాళి యగుఁ గాదె మఱి జగ◊త్పాళియందు. 131

తే. అపుడు=ఆసమయమందు; అతర్కితసంప్రాప్తము=ఊహింపకయె వచ్చినది; అగు పరస్పరాంగసాంగత్యసౌఖ్యంబున్ –అగు=అగునట్టి, పరస్పరాంగసాంగత్య=ఒండొరుల శరీరములసంబంధమువలననైన, సౌఖ్యంబున్=సుఖమును; అనుభ వించు జంపతులకున్=ఉపభోగించు జాయాపతులకు; ఎన్నన్=పరికింపఁగా; తత్త్రప=ఆచంద్రికయొక్కలజ్జ; మఱి=మఱియు; జగత్పాళియందున్=జగత్సమూహమునందు; సదృశ యైన ఆళి =అనుకూలయైన చెలికత్తె; అగుఁ గాదె=అగును గదా!

అనఁగ లజ్జవలన నతర్కితసంప్రాప్తమగు నంగసాంగత్యసుఖంబు ననుభవించు నీదంపతులకు నాలజ్జ అనుకూల యగు చెలికత్తె యగునుగదా యని భావము.

మ. జలజాతాప్తకులావతంస మటఁ ద◊త్సారంగనేత్రాధర
చ్ఛలబింబీఫలచుంబనంబువలనన్ ◊సద్యస్సముద్భూతపి
చ్ఛిలమోహుం డయి చన్ను లంటి తగ నా◊శ్లేషంబు నూన్పం గన
త్పులకంబై యది చేసెఁ గంచుకభిద ◊న్భూయస్త్రపాయుక్తిగన్. 132

టీక: జలజాతాప్తకులావతంసము=సూర్యవంశావతంసమగు సుచంద్రుఁడు; అటన్=అటు పిమ్మట; తత్సారంగనే త్రాధర చ్ఛల బింబీఫల చుంబనంబువలనన్—తత్సారంగనేత్రా=ఆచంద్రికయొక్క, అధర=ఓష్ఠ మనెడు, ఛల=వ్యాజము గల, బింబీఫల= దొండపండుయొక్క, చుంబనంబువలనన్=చుంబనమువలన; సద్య స్సముద్భూత పిచ్ఛిల మోహుండయి – సద్యః=తత్కాల మందు, సముద్భూత=ఉదయించిన, పిచ్ఛిల=దట్టమైన, మోహుండయి=మోహము గలవాఁడై; చన్నులు=కుచములను; అంటి=స్పృశించి; తగన్=అనుకూలముగ; ఆశ్లేషంబు=కౌఁగిలింతను;ఊన్పన్=చేయఁగ; కనత్పులకంబై – కనత్=ప్రకాశించు చున్న, పులకంబై=పులకలు గలదై; అది=ఆకౌఁగిలింత; గంచుకభిదన్ – కంచుక=ఱవికయొక్క, భిదన్= భేదమును; భూయ స్త్రపాయుక్తిగన్ = మరల లజ్జ గలుగునటులు; చేసెన్=చేసెను.

అనఁగ సుచంద్రుఁడు చంద్రికాధరచుంబనంబున గాఢ మగుమోహము గలవాఁడై పాలిండ్లఁ బట్టి కౌఁగిలింపఁగ నాకౌఁగి లింత పులకలు గలిగించి మరల లజ్జ వచ్చునటులు కంచుకమును భేదించె నని భావము.

చ. క్రమమున రాజమౌళి యెడ◊గానని ధౌతపటంబు దీయఁ ద
త్కమలదళాక్షి బెగ్గడిలి ◊క్రమ్మఱ రాఁ గొను సారెసారెకున్
విమలపయస్తరంగతతి ◊వేమరు నేగుచు నాఁగుచుండఁగా
నమరెడు గాంగసైకతము◊నందమునన్ జఘనంబు మీఱఁగన్. 133

టీక: క్రమమున్=క్రమముగా; రాజమౌళి=సుచంద్రుఁడు; ఎడగానని ధౌతపటంబున్=ఎడఁబాయని ధౌతవస్త్రమును; తీయన్= ఆకర్షింపఁగా; తత్కమలదళాక్షి=ఆచంద్రిక; బెగ్గడిలి=భయపడి; క్రమ్మఱన్=మరల; సారెసారెకున్=మాటిమాటికి; విమల పయస్తరంగతతి –విమల=స్వచ్ఛమగు, పయః=ఉదకముయొక్క, తరంగ=తరఁగలయొక్క, తతి=సమూహము; వేమరున్ =మాటిమాటికిని; ఏగుచున్=పోవుచు; ఆఁగుచుండఁగాన్=అణఁగుచుండఁగా; అమరెడు గాంగసైకతము నందమునన్=ఒప్పు చున్న జాహ్నవీపులినముయొక్క సౌందర్యముచేత; జఘనంబు=కటిపురోభాగము; మీఱఁగన్=అతిశయింపఁగా; రాఁగొనున్ =ఆకర్షించును. అనఁగ సుచంద్రుఁడు చంద్రికయొక్క యెడఁబాయని వస్త్రమును దీయఁగా చంద్రిక భయపడి మాటిమాటికి వస్త్రము నాకర్షించుకొనఁగా, తజ్జఘనము, నిర్మలజలతరంగములు కప్పుచు నణఁగుచుండఁగా ప్రకాశించు గంగాపులినమువలెఁ బ్రకాశించె నని భావము.

సీ. చానచెక్కిలిపేరి ◊చంద్రఖండమున భా,స్వత్కరజక్షతి ◊వఱల నీక,
జలజాక్షిగుబ్బగు◊బ్బలుల సద్వజ్రశ,యోన్నతసమ్మర్ద ◊మొంద నీక,
సతిరదనాంశుక◊చ్ఛలసుమాసవమున, నలరుద్విజావళి ◊నాన నీక,
నెలఁతతనూపద్మి◊ని విగాఢదోషాను,బంధనిర్బంధంబుఁ ◊బడయ నీక,

తే. తార్చెఁ బర్వంబు, పక్షపా◊తంబుఁ గూర్చె, నుంచె నామోద, మొసఁగెఁ బ◊ద్మోదయంబు
నంత సుమశస్త్రశాస్త్రర◊హస్యతత్త్వ,మదనభుండు సుచంద్రక్ష◊మావిభుండు. 134

టీక: అంతన్=అటుపిమ్మట; సుమశస్త్రశాస్త్రరహస్యతత్త్వమదనభుండు – సుమశస్త్రశాస్త్ర=కామశాస్త్రముయొక్క, రహస్య= రహస్యముయొక్క, తత్త్వ=యథార్థమునందు, మదనభుండు=మన్మథుని సామర్థ్యమువంటి సామర్థ్యము గల; సుచంద్ర క్షమావిభుండు=సుచంద్రభూపతి; చానచెక్కిలిపేరి చంద్రఖండమునన్=చంద్రికయొక్క గండస్థలమను పేరుగల చంద్రఖండ మందు; భాస్వత్కరజక్షతిన్ – భాస్వత్=సూర్యునియొక్క, కరజ=కిరణములవలనఁ గలుగు, క్షతిన్=ఉపద్రవమును; భాస్వత్ =ప్రకాశించునట్టి, కరజ=నఖములయొక్క, క్షతిన్=ప్రహారముల నని స్వభావార్థము; వఱల నీక=ప్రకాశింప నీయక; సూర్యకిరణప్రసారము గల్గినయెడఁ జంద్రఖండమునకు క్షయము గల్గునని చెక్కిలి యను చంద్రఖండమునకు భాస్వత్కరజక్షతి కలుగనీయఁ డయ్యె నని భావము. జలజాక్షిగుబ్బగుబ్బలులన్=చంద్రిక స్తనము లనెడు పర్వతములయందు; సద్వజ్రశయోన్నతసమ్మర్దము – సత్=శ్రేష్ఠమైన, వజ్రశయ=ఇంద్రునియొక్క, ఉన్నత=ఎచ్చైన,సమ్మర్దము=రాయిడిని; సత్=శ్రేష్ఠమైన, వజ్ర=వజ్రరేఖగల, శయ= హస్తము యొక్క, ఉన్నత=ఎచ్చైన, సమ్మర్దము=రాయిడిని అని స్వభావార్థము; ఒంద నీక=పొందనీయక; పర్వతములకు ఇంద్రుని రాయిడి తగిలినచో నాశము గలుగును గావున గుబ్బగుబ్బలులకు వజ్రశయసమ్మర్దము గలుగనీయఁడయ్యె నని భావము. సతిరదనాంశుక చ్ఛలసుమాసవమునన్ – సతి=చంద్రికయొక్క, రదనాంశుక=అధరమను, ఛల=వ్యాజముగల, సుమాసవ మునన్=పూఁదేనియయందు; అలరుద్విజావళిన్=ఒప్పుచున్న భృంగపంక్తిని, ఒప్పుచున్న దంతపంక్తి నని స్వభావార్థము; ఆన నీక=త్రాగ నీయక, తగుల నీయక యని స్వభావాభిప్రాయము; పూఁదేనియ భృంగము లానినచోఁ దఱిఁగిపోవు నని రదనాంశుక సుమాసవమున ద్విజావళి నాననీయఁడయ్యె నని భావము. నెలఁతతనూపద్మినిన్ =చంద్రికయొక్క దేహ మను పద్మలతను; విగాఢదోషానుబంధనిర్బంధంబున్ – విగాఢ=అధికమగు, దోషా=రాత్రియొక్క, అనుబంధ=సంబంధముచేతఁ గల్గు, నిర్బంధంబున్=కష్టమును; విగాఢ=అధికమగు,దోషా=బాహు వులయొక్క, అనుబంధ=సంబంధముచేఁ గల్గు, నిర్బంధంబున్=కష్టము నని స్వభావార్థము; పడయనీక=పొందనీయక; రాత్రిసంబంధము కల్గినయెడలఁ దామరతీఁగ కాంతిహీన మగునని చంద్రికాశరీరపద్మలతకు దోషానుబంధనిర్బంధము గలి గింపఁడయ్యె నని భావము. ఈసీసము నాల్గుచరణములకును పైగీతమునందలి వాక్యములకును యథాసంఖ్యముగ నన్వయము. పర్వంబు=పున్నమను, ఉత్సవమును; తార్చెన్=కలిగించెను; చెక్కిలిచంద్రఖండము పూర్ణముగాఁ బ్రకాశించునట్లు పున్నమ కల్గించె నని భావము. పక్షపాతంబున్=ఱెక్కలు పడుటను, ప్రీతిని; కూర్చెన్=కలిగించెను. గుబ్బగుబ్బలులకు సుఖముగాఁ బక్షపాతమును కలిగించె నని భావము. చంద్రిక కుత్సవమును గలిగించె నని స్వభావాభిప్రాయము. ఆమోదము=పరిమళమును, సంతోషమును; ఉంచెన్=కలిగించెను; అధరసుమాసవమున కామోదము కలిగించె నని భావము; చంద్రికకు సంతోషమును కలిగించె నని స్వభావాభిప్రాయము.పద్మోదయంబు=కమలములయొక్క యావిర్భావమును, కాంతియొక్క యతిశయమును; ఒసఁగెన్=ఇచ్చెను. చంద్రికా శరీరమునందుఁ బద్మోదయము నిచ్చె ననఁగా, చంద్రికమేని కధికకాంతి కలుగునట్లు గావించె నని స్వభావాభిప్రాయము. సుచంద్రుఁడు సుకుమారాంగియగుచంద్రికకు శ్రమయని తోఁపనీయక, చతురుండు కావునఁ రతులఁ జొక్కించె నని భావము.

తే. అతనుశాస్త్రవిభేదంబు ◊నాదిఁ గాంచి
యంత నద్వయభావనా◊యత్తవృత్తి
నలరి తత్ప్రియసాయుజ్య ◊మంది పొందె
నసదృశానందమయత న◊బ్జాక్షి యపుడు. 135

టీక:అతనుశాస్త్రవిభేదంబు – అతను=మరునియొక్క, శాస్త్ర=శస్త్రసంఘమువలన, విభేదంబు=భేదమును; ఆదిన్=మొదట; కాంచి=చూచి; అతను=అధికమగు, శాస్త్రవిభేదంబు=శాస్త్రములయొక్క సర్వభేదప్రకారము నని యర్థాంతరము దోఁచుచు న్నది; అంతన్=ఆపిమ్మట; అద్వయభావనాయత్తవృత్తిన్ – అద్వయభావనా=అభేదభావనయందు, ఆయత్త=స్వాధీన మగు, వృత్తిన్ = వ్యాపారముచేత; అలరి = సంతసించి; తత్ప్రియసాయుజ్యము – తత్ప్రియ = ఆప్రియుఁడగు సుచంద్రునియొక్క, సాయుజ్యము=సాంగత్యమును; అంది=పొంది; తత్ప్రియ= ఆయద్వితీయబ్రహ్మయొక్క, సాయుజ్యము= ఐక్యమును, అంది=పొంది, యని యర్థాంతరము; ఇచట ‘అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశపఞ్చకమ్, ఆద్యత్రయం బ్రహ్మరూపం మాయారూప మతోద్వయమ్’ అనెడి వార్తికముచేత ప్రియశబ్దవాచ్యము పరబ్రహ్మము; అపుడు=ఆసమయమందు; అబ్జాక్షి= చంద్రిక; అసదృశానందమయతన్ – అసదృశ=సరిలేని, ఆనందమయతన్=సంతోషప్రాచుర్యమును; పొందెన్=పొందెను.

అనఁగ నాచంద్రిక మొదట మదనబాణప్రహారములను పొంది, పిదప నభేదభావనాయత్తవృత్తిచే నాశ్రయించి, పిమ్మట ప్రియసాయుజ్యము నొంది బ్రహ్మానందతుల్యమగు నానందమును పొందె నని భావము. అర్థాంతరమునకు భావము స్పష్టము.

చ. తొలుత దృశావిలాసములు, ◊తోరపుటాననవిభ్రమంబు ల
వ్వల, నటుమీఁద నావయవ◊వైఖరులుం గనుపట్ట నాన యన్
బలుతెర నారతిస్మరులు ◊పట్టి సడల్పఁ, గ్రమంబున న్వధూ
తిలకము రాజమౌళికి మ◊ది న్ముద మూనిచె నర్తకీగతిన్. 136

టీక: తొలుతన్=మొదట; దృశావిలాసములు=దృగ్విలాసములు; అవ్వలన్=ఆమీఁద; తోరపుటాననవిభ్రమంబులు=అధిక మగు ముఖవిలాసములును; అటుమీఁదన్=అటుపైని; ఆవయవవైఖరులున్= అవయవసంబంధిరీతులును, అంగాభినయము లని యర్థాంతరము; కనుపట్టన్=చూపట్టుచుండఁగ; నాన అన్=సిగ్గనెడు; బలుతెరన్=అధికమగు కాండపటమును; ఆ రతి స్మరులు = ఆరతిమన్మథులు; పట్టి సడల్పన్=పట్టి విడువఁగ; క్రమంబునన్=క్రమముగ; వధూతిలకము=చంద్రిక; రాజమౌళి కిన్=సుచంద్రునకు; నర్తకీగతిన్=నటివలె; మదిన్=మనమందు; ముదము=సంతసమును; ఊనిచెన్=ఒనరించెను.

క. కంతుకలాపారగ మగు, స్వాంతమునం దిటులు రాగ◊వల్లిక మెఱయన్
గాంతుఁడు కాంతామౌళికి, నెంతయు సంతసము నూన్చె ◊హితనవరతులన్. 137

టీక: కంతుకలాపారగము – కంతుకలా=మన్మథవిద్యయొక్క, పారగము=అంతము నొందినది; అగు స్వాంతమునందున్ =అగునట్టి మనమునందు; ఇటులు=ఈప్రకారముగ; రాగవల్లిక=అనురాగ మను తీవ; మెఱయన్=ప్రకాశింపఁగ; కాంతుఁడు =సుచంద్రుఁడు; కాంతామౌళికి=స్త్రీరత్న మగు చంద్రికకు; ఎంతయున్=మిక్కిలి; హితనవరతులన్=హితమగు నూతన సుర తములచే; సంతసమున్=కుతూహలమును; ఊన్చెన్=చేసెను.

సీ. మంజులాహీనహ◊ర్మ్యప్రదేశంబున, శుచిగరుత్మల్లీలఁ ◊జూచికొనుచుఁ,
గలధౌతమయశైల◊కందరాస్థలుల మ,హానందిహరిలీల ◊లరసికొనుచు,
సుమనోనివాసభా◊సురనగాగ్రములందు, దివ్యసారంగాభ ◊దెలిసికొనుచుఁ,
బుష్కరవీథులఁ ◊బొలుపొందు నేకచ,క్రరథవిస్ఫూర్తిని ◊గాంచికొనుచుఁ,

తే. గమల దైత్యారి శర్వాణి ◊కమలవైరి,ధారి పౌలోమి యుర్వరా◊ధరవిదారి
ఛాయ హరి యన నలరిరి ◊సకలకాల,సముచితాఖేలనంబుల ◊సతియుఁ బతియు. 138

టీక: మంజులాహీనహర్మ్యప్రదేశంబునన్ – మంజుల=మనోజ్ఞమగు, అహీన=శేషుఁడనెడి, హర్మ్యప్రదేశంబునన్=మేడ యొక్క ప్రదేశమునందు; శుచిగరుత్మల్లీలన్ – శుచి=పరిశుద్ధమగు, గరుత్మత్=గరుడునియొక్క, లీలన్=విలాసమును; మంజుల=మనోజ్ఞమగు, అహీన=అధికమగు, హర్మ్యప్రదేశంబునన్=మేడయొక్క ప్రదేశమునందు,శుచి=శుభ్రమగు, గరు త్మత్=కపోతాదిపక్షులయొక్క, లీల నని ప్రకృతార్థము; చూచికొనుచున్=అవలోకించుచు; కలధౌతమయశైలకందరాస్థలులన్ – కలధౌతమయశైల=కైలాసముయొక్క, ‘కలధౌతం రూప్య హేమ్నోః’ అని యమరుఁడు, కందరాస్థలులన్=గుహలయందు; మహానందిహరిలీలలు –మహానంది=అధికమగు వృషభమనెడి, హరి= ఆశ్వముయొక్క, లీలలు=చేష్టలను; అరసికొనుచున్=విచారించుకొనుచు; కలధౌతమయశైల=బంగరుకొండయొక్క, కందరాస్థలులన్= గుహలయందు, మహానందిహరిలీలలు=మిగులనానందము గల చిలుకలయొక్క విలాసము లని ప్రకృతార్థము; సుమనోనివాసభాసురనగాగ్రములందున్ = దేవతాస్థానమగు ప్రకాశమానమగు మేరువుయొక్క అగ్రములందు; దివ్యసారం గాభ – దివ్యసారంగ=ఐరావతముయొక్క, ఆభ=కాంతిని; తెలిసికొనుచున్=తెలియుచు; పుష్పములకు నివాసమై, భాసుర మైన, పర్వతాగ్రములందు, మనోహరమగు, సారంగాభన్=తుమ్మెదకాంతిని, తెలిసికొనుచు నని ప్రకృతార్థము. పుష్కరవీథులన్=ఆకాశమార్గములయందు; పొలుపొందు ఏకచక్రరథవిస్ఫూర్తిని – పొలుపొందు=ఒప్పుచున్న, ఏకచక్రరథ =ఒంటికంటి రథముయొక్క, విస్ఫూర్తిని=ప్రకాశమును; కాంచికొనుచున్=చూచుచు; పుష్కరవీథులన్= జలమార్గముల యందు; పొలుపొందు ఏకచక్రరథవిస్ఫూర్తిని – పొలుపొందు=ఒప్పుచున్న, ఏక=ముఖ్యమగు, చక్ర=జక్కవలయొక్క,రథ =శరీరములయొక్క, విస్ఫూర్తిని=ప్రకాశమును; కాంచికొనుచున్=చూచుచు, అని ప్రకృతార్థము; కమలదైత్యారి =లక్ష్మీనారాయణుఁడు; శర్వాణికమలవైరిధారి=రుద్రాణీరుద్రుఁడు; పౌలోమి ఉర్వరాధరవిదారి=ఇంద్రాణీ ఇంద్రుఁడు; ఛాయ హరి=ఛాయాదేవి సూర్యుఁడు; అనన్=అనునటులు; సతియున్ పతియున్=చంద్రికయు సుచంద్రుఁడును; సకలకాలసముచితాఖేలనంబులన్ – సకలకాల=సమస్తకాలములకు, సముచిత=అనుకూలమగు, ఆఖేలనంబులన్=విహార ములచేత; అలరిరి=సంతసించిరి.

అనఁగ నీచంద్రికాసుచంద్రులు లక్ష్మీనారాయణులో యనునట్లు అహీనహర్మ్యప్రదేశములయందు గరుత్మల్లీల నవలోకించుచు, రుద్రాణీరుద్రులో యనునట్లు కలధౌతశైలకందరములయందు మహానందిహరిలీలలు చూచుచు, ఇంద్రాణీంద్రులో యనునట్లు సుమనోనివాసభాసురనగాగ్రములయందు సారంగాభలఁ దెలిసికొనుచు, ఛాయాదేవీసూర్యులో యనునట్లు పుష్కరవీథుల యందు ఏకచక్రరథవిస్ఫూర్తిని గాంచికొనుచు, సర్వకాలముల కనుకూలములగు విహారములచే సంతసించి రని భావము.

సీ. ఆధరాధిపు యశో◊హరి జగత్తటి వ్రాల, నుడిగె ఘనఘనా◊భ్యుదయలీల,
లామహీభృతుధామ◊ధామనిధిస్ఫూర్తి, ధరఁ దూలె శార్వర◊పరవిభూతి,
యారాజువితరణ◊భూరిభూరిజలాళిఁ, జనె దుర్గదుర్గతి◊శాదపటిమ,
మారసాపతితర◊వారివారిదరేఖ, నడఁగె శాత్రవహంస◊హంసపాళి,

తే. యాసుచంద్రుఁడు ధర్మంబు ◊నాశ్రయించి, నీతి దయివాఱఁ గాంచి య◊నీతి నొంచి
యరిది జగ మెల్లఁ బాలించు ◊నపుడు సకల, జనులు శుభసమ్మదస్ఫూర్తి ◊మనిరి వేడ్క. 139

టీక: ఆధరాధిపు యశోహరి = ఆసుచంద్రునియొక్క యశస్సనెడు సింగము; జగత్తటిన్=జగమను కొండచఱియందు; వ్రాలన్=పడఁగ; ఘనఘనాభ్యుదయలీల – ఘనాఘన=ఘాతుకులను మత్తగజములయొక్క, ‘ఘనాఘనౌ ఘాతుక మత్త దన్తినౌ’ అని విశ్వము, అభ్యుదయ=అభివృద్ధియొక్క, లీలలు=విలాసములు; ఉడిగెన్=ఉపశమించెను; సుచంద్రునియొక్క యశము జగత్తును గప్పుకొనఁగ దుర్మార్గులు నశించి రని భావము.
ఆమహీభృతుధామధామనిధిస్ఫూర్తిన్ – ఆమహీభృతు=ఆసుచంద్రునియొక్క, ధామ=ప్రతాపమనెడు, ధామనిధి=సూర్యుని యొక్క, స్ఫూర్తిన్=ప్రకాశముచేత;ధరన్=పుడమియందు; శార్వరపరవిభూతి – శార్వర=అంధతమస మనెడు ఘాతుకుల యొక్క, పర=ఉత్కృష్టమగు, విభూతి=సంపద; తూలెన్=పడెను. ‘శార్వరం త్వంధతమసి ఘాతుకేతు పుమానయం’ అని హలాయుధుఁడు. సుచంద్రుని ప్రతాపమనెడు రవిప్రకాశముచేత దుష్టులను చీఁకటులు దూలె నని భావము. ఆరాజు వితరణ భూరి భూరి జలాళిన్ – ఆరాజు=ఆసుచంద్రునియొక్క, వితరణ=త్యాగముయొక్క, భూరి=అధికమగు, భూరి=సువర్ణమనెడు, జల =ఉదకముయొక్క, ఆళిన్= శ్రేణిచేత; దుర్గ దుర్గతి శాద పటిమ ము– దుర్గ=పోనలవిగాని, దుర్గతి = దారిద్ర్య మనెడు, శాద=బురదయొక్క, ‘పంకో స్త్రీ శాద కర్దమౌ’ అని యమరుఁడు, పటిమము=సామర్థ్యము;చనెన్=పోయెను. ఆసుచంద్రుని త్యాగసంబంధియగు సువర్ణమనెడు జలముచేత దారిద్ర్య మనెడు బురద నివర్తిల్లె నని భావము. ఆరసాపతి తరవారి వారిద రేఖన్ – ఆరసాపతి=ఆసుచంద్రునియొక్క, తరవారి=కత్తియనెడు, వారిదరేఖన్=మేఘపంక్తిచేత; శాత్రవహంస హంసపాళి –శాత్రవహంస=శత్రుశ్రేష్ఠులనెడు, హంసపాళి=అంచలగుంపు; అడఁగెన్=ఉపశమించెను. సుచంద్రుని యొక్క కత్తి యనెడు మేఘపంక్తిచే శత్రులను హంస లడంగె నని భావము. ఆసుచంద్రుఁడు; ధర్మంబున్=ధర్మమును; ఆశ్రయించి=పొంది; నీతి=రాజనీతిమొదలగు నీతి; దయివాఱన్=అతిశయించు నటులు; కాంచి=పొంది; అనీతిన్=దుర్నీతిని; నొంచి=పోఁగొట్టి; అరిది=చిత్రముగ; జగ మెల్లన్=లోకమంతయు; పాలించు నపుడు=రక్షించునపుడు; సకలజనులు=సమస్తనరులు; శుభసమ్మదస్ఫూర్తిన్=మంగళప్రయుక్తమగు సంతోషాతిశయము చేత; వేడ్కన్=వేడుకచేత; మనిరి=వర్తించిరి.
సుచంద్రుఁడు ధర్మనిష్ఠుఁడై నీతితో జగంబును పాలించుచుండఁగ శుభసంతోషములతో నెల్లపుడు జనులు వర్తించిరని భావము.

క. అని రోమహర్షణాత్మజుఁ, డనఘ మఖండైకచరిత ◊మంతయుఁ దెలుపన్
విని శౌనకాదిమునిచం ,ద్రనికాయము గాంచె నధిక◊తరహర్షంబున్. 140

టీక: అని=పూర్వోక్తప్రకారముగాను; రోమహర్షణాత్మజుఁడు=సూతుఁడు; అనఘము=పాపరహితమై, అఖండైకచరితము –అఖండ=విచ్ఛిత్తిలేనట్టి, ఏక=ముఖ్యమగు, చరితము=సుచంద్రచరితమును; అంతయున్=పూర్ణముగ; తెలుపన్=తెలియఁ జేయఁగ; శౌనకాదిమునిచంద్రనికాయము=శౌనకాదిమునిశ్రేష్ఠులయొక్క సమూహము; విని=విన్నదై; అధికతరహర్షంబున్ =అధికమగు సంతోషమును; కాంచెన్=పొందెను. అనఁగ సూతుండు శౌనకాదిమునుల కెల్ల సుచంద్రచరితంబు వివరింపఁగ నామునులు విని మిక్కిలి సంతసించి రని భావము.

ఆశ్వాసాంతపద్యములు

మ. పరవిద్రావణ! రావణప్రబలహృ◊త్పత్త్రీశ! పత్త్రీశభా
స్వరయానక్రమ! నక్రమర్దనవిధా◊సచ్చక్ర! సచ్చక్రసం
భరణశ్రీధర! శ్రీధరప్రభుమహా◊పర్యంక! పర్యంకదు
స్తరసాళ్వాదన! వాదనప్రమదవ◊త్సత్యాత్మ! సత్యాత్మకా! 141

టీక: పరవిద్రావణ=శత్రువులను పాఱఁదోలెడివాఁడా! రావణప్రబలహృత్పత్త్రీశ – రావణ=రావణాసురునియొక్క, ప్రబల= సామర్థ్యమును, హృత్=హరించిన, పత్త్రీశ=బాణశ్రేష్ఠములుగలవాఁడా! పత్త్రీశభాస్వరయానక్రమ – పత్త్రీశ=గరుత్మంతుఁడను, భాస్వర=ప్రకాశించుచున్న, యాన=వాహనముచేత, క్రమ=సంచారముగలవాఁడా! నక్రమర్దనవిధాసచ్చక్ర – నక్ర=మొసలి యొక్క, మర్దనవిధా=ఖండనవిధియందు, సత్=శ్రేష్ఠమగు, చక్ర=సుదర్శనమను చక్రము గలవాఁడా! సచ్చక్రసంభరణ శ్రీధర – సచ్చక్ర=సత్పురుషసంఘముయొక్క, సంభరణ=పోషించుటయొక్క, శ్రీ=సిరిని, ధర=ధరించినవాఁడా! శ్రీధరప్రభుమహా పర్యంక – శ్రీధరప్రభు=శేషుఁడె, మహాపర్యంక=గొప్పశయ్యగాఁ గలవాఁడా! పర్యంకదుస్తరసాళ్వాదన – పర్యంక=యుద్ధ మందు, దుస్తర=దుస్తరుఁడగు, సాళ్వ=సాళ్వరాజునకు, అదన=అంతకుఁడగువాఁడా! వాదనప్రమదవత్సత్యాత్మ – వాదన= వచనముచేతఁ గలిగిన, ప్రమదవత్=సంతసముగల, సత్యాత్మ=సత్యభామయొక్కహృదయముగల వాఁడా! సత్యాత్మకా= సత్యస్వరూపుఁడా!

క. గణనాతిగాప్తరక్షణ!
క్షణదాంబుజినీకళత్ర◊సారసవైరీ
క్షణ! వృజినకూటతక్షణ!
క్షణఖండితనిర్జరారి◊ఘనసైన్యగణా! 142

టీక: గణనాతిగాప్తరక్షణ – గణనాతిగ=లెక్కకుమీఱిన, ఆప్త=ఇష్టులను, భక్తుల ననుట, రక్షణ=రక్షించువాఁడా! క్షణదాం బుజినీకళత్రసారసవైరీక్షణ – క్షణద=ఉత్సవము నిచ్చెడి, అంబుజినీకళత్ర=సూర్యుఁడు, సారసవైరి=చంద్రుఁడు, ఈక్షణ= నేత్రములుగాఁ గలవాఁడా! వృజినకూటతక్షణ – వృజినకూట=పాపసమూహములను, తక్షణ=ఖండించువాఁడా! క్షణఖండిత నిర్జరారిఘనసైన్యగణా – క్షణ=క్షణమాత్రమందు, ఖండిత=నఱకఁబడిన, నిర్జరారి=రాక్షసులయొక్క, ఘన=అధికమగు, సైన్యగణా=సైన్యవ్యూహముగలవాఁడా!

మాలిని: శకటదనుజభీమా! ◊క్షాళితాఘౌఘనామా!
వికటబకవిరామా! ◊విశ్వసంపూర్ణధామా!
స్వకపరినుతసోమా! ◊శక్రకోటీరధామా!
వికలచరణసీమా! ◊విద్విషద్ధ్వాంతభామా! 143

టీక: శకటదనుజభీమా=శకటాసురునకు భయంకరుఁడగువాఁడా! క్షాళితాఘౌఘనామా – క్షాళిత=పోఁగొట్టఁబడిన, అఘౌఘ= పాపసంఘములుగల, నామా=పేరుగలవాఁడా! వికటబకవిరామా – వికట=దుష్టుఁడగు, బక=బకాసురుని, విరామా=అంతమునొందించినవాఁడా! విశ్వసంపూర్ణధామా – విశ్వ=ప్రపంచమునందు, సంపూర్ణ=నిండిన, ధామా= తేజస్సుగలవాఁడా! స్వకపరినుతసోమా – స్వక=తనచేత, పరినుత=స్తుతింపఁబడిన, సోమా=శంకరుఁడు గలవాడా, లేదా తన్ను స్తుతించిన శంకరుఁడు గలవాఁడా! శక్ర కోటీర ధామావికల చరణసీమా – శక్ర=ఇంద్రునియొక్క, కోటీర=కిరీటము యొక్క, ధామా=కాంతిచేత, అవికల=ఎడఁబాయని, చరణసీమా=పాదప్రదేశము గలవాఁడా! విద్విష ద్ధ్వాంత భామా – విద్విషత్=శత్రువు లనెడు, ధ్వాంత=చీఁకటులకు, భామా=సూర్యునివంటివాఁడా!

గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందు సర్వంబును షష్ఠాశ్వాసము.

గద్యము. ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలుసంస్థాన ప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయసత్పుత్ర
సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్యవ్యాఖ్యయందు సర్వంబును షష్ఠాశ్వాసము.