చంద్రికాపరిణయము – 8. షష్ఠాశ్వాసము

క. చిత్తప్రభూతకలహా, యత్తతఁ గడుఁ దత్తఱించు◊నాత్మన్ వ్రీడో
ద్వృత్తి నడంచుచుఁ దగున, బ్బిత్తరిఁ గని వల్కి రపుడు◊ప్రియసఖు లెల్లన్. 115

టీక: చిత్తప్రభూతకలహాయత్తతన్=సురతాయత్తతచేత; కడున్=మిక్కిలి; తత్తఱించు నాత్మన్ =త్వరపడు హృదయమును; వ్రీడోద్వృత్తిన్ = లజ్జాతిశయముచేత; అడంచుచున్=అడఁచుచు; తగునబ్బిత్తరిన్=ఒప్పుచున్న యాచంద్రికను; కని=చూచి; అపుడు=ఆసమయమందు; ప్రియసఖు లెల్లన్=సకియలందఱు; పల్కిరి=వక్ష్యమాణప్రకారము వచించిరి.

తే. పురుషమణిఁ గూడి యామోద◊గరిమఁ బూను,నట్టి లతకూన సౌమన◊స్యంబుఁ బొగడ
నౌనె యాకల్పకం బైనఁ ◊ గానఁ దరుణి, తాల్పు మాకల్పకస్ఫూర్తి ◊ధవునిఁ గదియ. 116

టీక: పురుషమణిన్=శ్రేష్ఠమగు పున్నాగవృక్షమును, పురుషశ్రేష్ఠుని; కూడి=కలసికొని; ఆమోదగరిమన్=పరిమళముయొక్క అతిశయమును, సంతోషాతిశయమును; పూనునట్టి లతకూన సౌమనస్యంబున్=పొందునట్టి బాలలతయొక్క కుసుమవాస నను, పొందునట్టి కాంతయొక్క మంచిమనసు గల్గుటను; పొగడన్=నుతించుటకు; ఆకల్పకం బైనన్=కల్పపర్యంతమైనను,
ఔనె=అగునా యని కాకువు; కానన్=అందువలన; తరుణీ=చంద్రికా! ధవునిఁ గదియన్=భర్తను చేరుటకు; ఆకల్పకస్ఫూర్తిన్ = అలంకారస్ఫూర్తిని; తాల్పుము=ధరింపుము. అనఁగాఁ బున్నాగవృక్షమును జేరి పరిమళాతిశయమును బూనియున్న బాల లతయొక్క పరిమళమును కల్పపర్యంతమైనను బొగడనలవి గాదు కనుక నీవును పున్నాగవృక్షమును గలసికొనిన బాలలత పగిది ప్రియునిఁ గదియ నలంకారమును ధరియింపు మని భావము.

తే. అని చెలులు ఘనమణికలా◊పాళి భాస్వ
దంశుకంబున నలరించి ◊యద్భుతముగఁ
జంద్రిక నృపాంబుకాబ్జముల్◊సంతసిల్ల
నతనిఁ జేర్పంగఁ దలఁచి దీ◊వ్యన్నవోక్తి. 117

టీక: చెలులు=చెలికత్తెలు; అని=పూర్వోక్తప్రకారముగఁ బలికి; చంద్రికన్=చంద్రికను, జ్యోత్స్నను; నృపాంబుకాబ్జముల్ =సుచంద్రుని నేత్రకమలములు; సంతసిల్లన్=సంతోషించునట్లు; అద్భుతముగన్=చిత్రంబుగ;ఘనమణికలాపాళిన్– ఘన= శ్రేష్ఠమగు,మణికలాప=మణిభూషణములయొక్క, ఆళిన్=పంక్తిచేత; భాస్వదంశుకంబునన్=ప్రకాశించు వస్త్రముచేత; భాస్వత్=సూర్యునియొక్క, అంశుకంబునన్=కిరణముచేత; అలరించి=అలంకరించి; అతనిన్=సుచంద్రుని; చేర్పంగన్ =చేర్చుటకు; తలఁచి=యత్నించి; దీవ్యన్నవోక్తిన్ – దీవ్యత్=ప్రకాశించుచున్న,నవోక్తిన్=నూతనవచనముచేత. దీని కుత్తర పద్యస్థక్రియతో నన్వయము. అనఁగా చెలికత్తెలు చంద్రికను మేఘపంక్తిచేతను సూర్యకిరణములచేతను సుచంద్రుని నేత్రములు సంతసించునట్లు అలంకరించి రని భావము. చంద్రికకు విరోధులగు మేఘపంక్తి, సూర్యకిరణములచే నలంకరించుటయు, నా చంద్రికను నృపాంబకాబ్జములు సంతసించునటు లలంకరించుటయు చిత్రమని భావము. మణిభూషణములచేఁ బ్రకాశించు వస్త్రములచే చంద్రిక నలంకరించి రని స్వభావతాత్పర్యము.

చ. చనుదము లెమ్ము శ్యామ యిఁక ◊క్ష్మాధరచంద్రుని డాయఁగా వలెన్
మన మలరంగఁ దత్కరవి◊మర్దము దక్కినఁ దెల్వి దక్కునే
యని నయ మొప్పఁ దచ్ఛయము ◊నంటి తెమల్చిన లజ్జపెంపునన్
వనజదళాక్షి నమ్రముఖ◊వారిజయై నిలఁ బూన వెండియున్. 118

టీక: శ్యామ=చంద్రికా!మన మలరంగన్=హృదయము సంతసించునట్లు; ఇఁకన్=ఈమీఁద; క్ష్మాధరచంద్రునిన్=రాజచంద్రుఁ డగు సుచంద్రుని; డాయన్ కావలెన్=సమీపింపవలయును, అనఁగ సుచంద్రునిఁ జేరవలయు ననుట; చనుదము లెమ్ము = పోదము లెమ్ము; తత్కరవిమర్దము – తత్=ఆసుచంద్రునియొక్క,కర=హస్తముయొక్క, విమర్దము=సమ్మర్దము; తక్కినన్ =విడువఁగా; తెల్వి దక్కునే=తెల్వి కల్గునా? కల్గ దనుట. అనఁగ పురుషకరసమ్మర్దము కాంతలకు మిగుల శోభావహమని భావము. ‘సురతమృదితా బాలవనితా, తనిమ్నాశోభన్తే గళితవిభవా శ్చార్థిషు నృపాః’ అని ప్రాచీనవచనము; అని=ఈప్రకా రము పల్కి; నయమొప్పన్=నీతి యొప్పునటులు; తచ్ఛయము నంటి =ఆచంద్రిక కరమును బట్టుకొని; తెమల్చినన్= లాగఁగా; లజ్జపెంపునన్=వ్రీడాతిశయముచేత; వనజదళాక్షి=చంద్రిక; నమ్రముఖవారిజయై –నమ్ర=వంగిన,ముఖవారిజయై =ముఖకమలముగలదై; నిలన్=నిల్చుటకు; పూనన్=ప్రయత్నింపఁగ; వెండియున్=మరల. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వ యము. శ్యామ=రాత్రి; క్ష్మాధరచంద్రునిన్=పొడుపుకొండమీఁదిచంద్రుని; డాయఁగావలెన్=సమీపింపవలెను; తత్కరవిమర్దము తక్కినన్=ఆచంద్రకిరణసంపర్కము లేనియెడ; తెల్వి దక్కునె=ప్రకాశము కల్గునా యను నర్థము ధ్వనించుచున్నది.

అనఁగ శ్యామా! నీవు సుచంద్రుని గలసికొనుము, తత్సంపర్కము నీకు మిగుల శోభావహము అని చెలులు పలికి చంద్రికకరముఁ బట్టి లాగఁగా లజ్జాతిశయముచే చంద్రిక ముఖము వంచుకొని నిలువఁగ మఱియు వక్ష్యమాణప్రకారముగఁ బలికి రని భావము.

సీ. తొయ్యలి నీచన్ను◊దోయి చక్రము గెల్చు,నదియె రాజపరిగ్ర◊హంబు లేక,
వెలఁది నీకటిసీమ ◊విషమగోత్రము నొంచు,నదియె దేవేశలీ◊లాప్తి లేక,
కాంత నీకనుఁగవ ◊కైరవావళి మీఱు,నదియె యినాలోక ◊మొదవ కున్నఁ,
గలికి నీమయికాంతి ◊కైతకంబులమించు,నదియె యీశ్వరయుతిఁ ◊బొదల కున్నఁ,

తే. గాన నీవింత హిత మాత్మఁ ◊గాంచ లేక, గోలవయి యేల యీవేళఁ ◊గోమలాంగి
మొక్కలము చేసె దని పల్కి◊ముదిత లెల్ల, తోడితేఁ గాంత పడకిల్లు ◊దొరయ వచ్చె. 119

టీక: తొయ్యలి=చంద్రికా! నీచన్నుదోయి=నీచన్గవ; రాజపరిగ్రహంబు లేక=సుచంద్రుఁడను చంద్రుని యనుగ్రహము లేక; చక్రమున్=చక్రవాకమును; గెల్చునదియె? గెలువ దనుట. ఇచట, రాజపరిగ్రహంబు లేక=రాజుయొక్క గ్రహణము లేక; చక్రమున్=రాష్ట్రమును; గెల్చునా యను నర్థము దోఁచుచున్నది. లోకములో రాజును బట్టుకొనినఁగాని తద్రాష్ట్రము వశపడ దని భావము. చంద్రసాహాయ్య మున్నం గాని చక్రవాకములు వశపడవని తాత్పర్యము. వెలఁది=చంద్రికా! నీకటిసీమ=నీకటిప్రదేశము; విషమగోత్రమును=దుష్టకులమును; దేవేశలీలాప్తి లేక –దేవేశ=సుచంద్రుని యొక్క, లీలాప్తి లేక=విలాసప్రాప్తి లేక; నొంచు నదియె=నొప్పించునా? నొప్పింపఁజాల దనుట. అనఁగ సుచంద్రలీలాప్తి గలిగె నేని దుష్టకులముల నడంపవచ్చునని భావము. విషమగోత్రమును=విషమపర్వతమును; దేవేశలీలాప్తి లేక=ఇంద్రలీలాప్రాప్తి లేక; నొంచు నదియె యను నర్థము దోఁచుచున్నది. కాంత=చంద్రికా! నీకనుఁగవ=నీకనుదోయి; ఇనాలోకము=సుచంద్రదర్శనము; ఒదవకున్నన్=కలుగకున్న; కైరవావళిన్= పిశునసమూహమును; మీఱునదియె=అతిక్రమించునదియా? కాదనుట. అనఁగ నీకనుదోయి సుచంద్రదర్శనముఁ జేయ కున్నఁ బిశునుల జయింపఁజాలదని భావము. నీకనుదోయి, ఇనాలోకము=సూర్యదర్శనము, కలుగకున్న, కైరవావళిన్= తొవబంతిని, మీఱునదియె యను నర్థము దోఁచుచున్నది. కలికి=చంద్రికా! నీమయికాంతి=నీదేహకాంతి; ఈశ్వరయుతిన్=సుచంద్రసంబంధముచేత; పొదలకున్నన్=అతిశయింప కున్నచో; కైతకంబులన్=క్షుద్రశత్రువులను, ‘క్షుద్ర ద్విషిచ కైతక’మ్మని హలాయుధుఁడు;మించునదియె =అతిశయించునా? అతిశయింప దనుట. అనఁగ నీదేహకాంతి సుచంద్రయుతిచేఁ బొదలకున్న క్షుద్రులఁ దిరస్కరింపఁజాల దని భావము; నీదేహ కాంతి, ఈశ్వరయుతిన్= శంకరునిసంబంధముచేత; పొదలకున్నన్=అతిశయింపకున్నచో; కైతకంబులన్=కేతకీపుష్పము లను, మించునా యను నర్థము దోఁచుచున్నది. కానన్=అందువలన; నీవు; ఇంత హితము=ఇంతమాత్రము హితమును; ఆత్మన్=మనమునందు; కాంచ లేక=చూడక; గోల వయి=మూఢురాలవై; ఏల=ఎందుకు? ఈవేళన్=ఈసమయమందు; కోమలాంగి=చంద్రికా! మొక్కలము=ముష్కరత్వ మును; చేసెదు=చేయుచున్నావు? అని పల్కి=ఇట్లు వచించి; ముదిత లెల్లన్=కాంత లందఱు; తోడితేన్=తోడ్కొని రాఁగ; కాంత=చంద్రిక; పడకిల్లు దొరయన్=పాన్పుటిల్లు ప్రవేశించుటకు; వచ్చెన్=వచ్చెను.

మ. అమరేశాశ్మవిజేతృకుంతల వయ◊స్యాయత్నయుక్తి న్విహా
రమహాగేహము సొచ్చి, యచ్చట మసా◊రస్తంభపార్శ్వంబునం
దు మొగి న్నిల్వఁగ రాగయుక్తి నది దో◊డ్తోఁ దెల్పె భూభర్తకు
న్రమణి న్నిత్యమహాశుచిప్రకృతికి ◊న్నైజంబు పోఁబోవునే? 120

టీక: అమరేశాశ్మవిజేతృకుంతల = ఇంద్రనీలమణుల జయించిన కుంతలములు గల చంద్రిక; వయస్యాయత్నయుక్తిన్– వయస్యా=సకియలయొక్క, యత్న=ప్రయత్నముయొక్క, యుక్తిన్=సంబంధముచేతను; విహారమహాగేహము = క్రీడా గృహమును; చొచ్చి=ప్రవేశించి; అచ్చటన్=ఆగృహమందు; మసారస్తంభపార్శ్వంబునందున్ – మసారస్తంభ=ఇంద్రనీల మణిస్తంభముయొక్క, పార్శ్వంబునందున్=ప్రక్కయందు; మొగిన్=పూనికచేత; నిల్వఁగన్=నిలుచుండఁగా; అది=ఆ కంబము; రాగయుక్తిన్– రాగ=చంద్రికాంగసంగతారుణ్యముయొక్క, యుక్తిన్=సంబంధముచేత, క్రోధసంబంధముచేత నని యర్థాంతరము; రమణిన్=చంద్రికను; భూభర్తకున్=సుచంద్రునకు;తోడ్తోన్=వెంటనె; తెల్పెన్=తెలియఁజేసెను;నిత్య మహా శుచి ప్రకృతికిన్ –నిత్య=నిరంతరము, మహాశుచి=అత్యంతాపరిశుద్ధమగు, ప్రకృతికిన్=స్వభావము గలవారికి; నిత్య=నిరం తరము,మహత్ అశుచి=అత్యంతము నల్లనిదగు, ప్రకృతికిన్=స్వభావము గలదానికని స్వభావార్థము; నైజంబు = స్వభా వము; పోఁబోవునే=పోఁగలదా? పోవ దనుట.

చంద్రిక సకియలప్రయత్నముచేఁ గ్రీడాగృహము సొచ్చి, యచట నుండు నింద్రనీలస్తంభముయొక్క పార్శ్వమందు నిలుచుండఁగా, నాస్తంభము రాగముచే నిచటఁ జంద్రిక వచ్చి నిలుచున్నదని సుచంద్రునకుఁ దెలిపెను. లోకమందు నిత్యమహా శుచిప్రకృతి గలవారు వారి స్వభావమును విడువ రని భావము. చంద్రిక యింద్రనీలమణుల జయించిన కుంతలములు గలది గాన ద్వేషముచే నామెను (రమణిని) రాజునకుఁ దెలిపినదని ముఖ్యాశయము. అర్థాంతరన్యాసాలంకారము.

ఉ. అత్తఱిఁ దత్సఖీజన మ◊నావిలధీయుతి హత్తి మీర లి
ప్పుత్తడిబొమ్మ రాజమణి◊పుత్రికలార భజించుచుండుఁడీ
చిత్తము వొంగ నం చొకవి◊శేషవిధానము నెంచి వంచనా
యత్తత నేగె దాని జల◊జాక్షి యథార్థమ కా గణింపఁగన్. 121

టీక: అత్తఱిన్=ఆసమయమందు; తత్సఖీజనము – తత్=ఆచంద్రికయొక్క,సఖీజనము=సకురాండ్రు; అనావిలధీయుతిన్ – అనావిల=అకలుషమగు, ధీయుతిన్=బుద్ధియోగమును; హత్తి=కూడి; రాజమణిపుత్రికలార =రాజశ్రేష్ఠతనూజలార, చంద్ర కాంతపుబొమ్మలార యని యర్థాంతరము; మీరలు=మీరు; ఇప్పుత్తడిబొమ్మన్=ఈబంగరుబొమ్మను, చంద్రిక ననుట; చిత్తము=మనస్సు; పొంగన్=ఉబుకునటులు; భజించుచుండుఁడీ=సేవించుచుండుఁడీ; అంచున్=ఈప్రకారము పలుకుచు; ఒకవిశేషవిధానమున్=ఒకవిశేషకార్యమును; ఎంచి=గణించి; వంచనాయత్తతన్=మోసముచేత; దానిన్=ఆమాటను; జలజాక్షి = చంద్రిక; యథార్థమ=సత్యమే; కాన్=అగునటులు; గణింపఁగన్=ఎంచఁగా; ఏగెన్=పోయెను. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము. అనఁగాఁ జంద్రికను బడకింటిలో విడిచి యచట నున్న రాజమణిపుత్రికలకు మీరు చంద్రికను సేవించు చుండిఁడీ యని వచించి వంచనచేఁ దత్సఖీజనము సనియె నని భావము.

సీ. సుమశరప్రావృడా◊గమశక్తి నంబుద,శ్రేణిఁ గన్పడు తటి◊ద్రేఖ యనఁగఁ,
బతిపూన్కి గ్రహియింప ◊భావజుండు పునర్గ్ర,హణ మూన్చు సుమచాప◊యష్టి యనఁగ,
సాహిణి రా నిగ్గ ◊సాధించు నావల,రాజుక్రొత్తచిలుక◊తేజి యనఁగ,
వనపాలుదోటినే◊ర్పున వచ్చు శృంగార,ధరణిజభూరిమం◊జరిక యనఁగ,

తే. నపుడు నృపుకన్నుఁగవ నాంగి ◊కాభ నలమి, యతఁడు దివియంగ వెనుదీసి ◊యంత రాక
గబ్బి యయి నిల్చి తత్కరా◊కర్షణమునఁ, గదిసె నక్కాంత తల్ప మ◊క్కంబ మెడసి. 122

టీక: సుమశరప్రావృడాగమశక్తిన్ – సుమశర=మన్మథుఁడనెడు, ప్రావృడాగమ=వర్షాకాలప్రాప్తియొక్క, శక్తిన్=సామర్థ్యము చేత; అంబుదశ్రేణిన్=మేఘపంక్తియందు; కన్పడు తటిద్రేఖ యనఁగన్=కాన్పించు మెఱపుతీవయో యనునట్లు; పతి=భర్తయగు సుచంద్రుఁడు; పూన్కిన్=ప్రయత్నమును; గ్రహియింపన్=పొందుటకై; భావజుండు=మరుఁడు; పునర్గ్రహ ణము=పునస్స్వీకారమును; ఊన్చు సుమచాపయష్టి యనఁగన్ = చేయుచున్న పూవింటియొక్క దండమో యనునట్లు; సాహిణి =గుఱ్ఱపువాఁడు; రాన్=వచ్చుటకై; ఇగ్గన్=ఆకర్షింపఁగ; సాధించు నావలరాజుక్రొత్తచిలుకతేజి యనఁగన్ – సాధించు=ఎదిరించు, ఆవలరాజు=ఆమరునియొక్క, క్రొత్తచిలుకతేజి యనఁగన్=నూతనమగు శుకాశ్వమో యనునట్లు; వనపాలుదోటినేర్పునన్ – వనపాలు=వనపాలకునియొక్క, దోటినేర్పునన్=దోటియొక్క జాణతనముచేత, దోటి యనఁగాఁ జేతి కందని తరులతాదిఫలపుష్పంబుల నాకర్షించు దండవిశేషము; వచ్చు=వచ్చునట్టి; శృంగారధరణిజభూరిమంజరిక యనఁగన్ – శృంగారధరణిజ=శృంగారవృక్షముయొక్క, భూరి=అధికమగు, మంజరిక యనఁగన్=గుచ్ఛమో యనునట్లు;
అపుడు=ఆసమయమందు; ఇచట పైచరణములయందు క్రమముగ నన్వయింపవలెను; నృపుకన్నుఁగవన్=సుచంద్రుని కనుదోయిని; ఆంగికాభన్=దేహసంబంధి యగు కాంతిచేత; అలమి=ఆక్రమించి, అనఁగా మరుఁడను వర్షాకాలప్రాప్తిచేత మేఘములందుఁ జూపట్టుచున్న మెఱపుతీవయో యనునట్లు సుచంద్రునికనుదోయిం దన దేహకాంతిచే నలమి యని భావము; అతఁడు=సుచంద్రుఁడు; తివియంగన్=ఆకర్షింపఁగా; వెనుదీసి=వెనుకకు మరలి, అనఁగా మరుఁడు మరల సుచంద్రునిపై నాకర్షించిన పూవింటిదండమో యనునట్లు వెనుకకు వంగినదని భావము; అంతన్=ఆమీఁద; రాక=రానిదై; గబ్బి యయి=గర్వముగలదై; నిల్చి=నిలుచుండి, గుఱ్ఱపువాఁడిగ్గఁగ సాధించుచున్న మరునిక్రొత్తచిలుకగుఱ్ఱమో యను నట్లు రాక, గబ్బి యయి నల్చిన దని భావము; తత్కరాకర్షణమునన్ – తత్=ఆసుచంద్రునియొక్క, కర=హస్తముయొక్క, ఆకర్షణమునన్=ఆకర్షణముచేత;అక్కాంత= ఆచంద్రిక; అక్కంబ మెడసి=ఆస్తంభమును విడిచి; తల్పము=శయ్యను; కదిసెన్=పొందెను. అనఁగ వనపాలుఁడు దోటితోఁ దీసిన వచ్చినట్టి శృంగారభూజ పుష్పగుచ్ఛమో యనునట్లు సుచంద్రుని కరాకర్షణముచేత నాచంద్రిక స్తంభమును వదలి తల్పమును జేరె నని భావము.

మ. సదనాధారసమగ్రవాసననొ త◊త్స్వాధ్వీవతంసంబు తా
నుదితస్తంభతఁ గాంచెఁ దత్కలన న◊య్యుర్వీశరత్నంబు తా
నదియే తాల్చెఁ దదాత్వమం దగుఁ గదా ◊శ్యామాతిభూమప్రభా
స్పదమూర్తిన్ భజియించి తద్గుణతతిన్ ◊సంధింప రెవ్వా రిలన్. 123

టీక: సదనాధారసమగ్రవాసననొ – సదనాధార=స్తంభముయొక్క, సమగ్ర=పరిపూర్ణమగు,వాసననొ=అనుభూతార్థస్మృతి చేతనో; తత్స్వాధ్వీవతంసంబు=ఆచంద్రిక; తాన్=తాను; ఉదితస్తంభతన్ – ఉదిత=ఉదయించిన, స్తంభతన్=స్తంభము గల్గు టను, నిశ్చేష్టత ననుట; కాంచెన్=పొందెను; తత్కలనన్ – తత్=ఆచంద్రికయొక్క, కలనన్=సంబంధముచేత; అయ్యుర్వీశ రత్నంబు=ఆసుచంద్రుఁడు; తాన్=తానును; తదాత్వమందున్=ఆసమయమందు; అదియే=ఆనిశ్చేష్టతనె; తాల్చెన్=ధరిం చెను; అగుఁ గదా=అవును కదా! సత్యము కదా యనుట; శ్యామాతిభూమప్రభాస్పదమూర్తిన్ – శ్యామ=మలినమైన, అతి భూమ=అధికమగు, ప్రభా=కాంతికి, ఆస్పద=స్థానభూతమగు, మూర్తిన్=శరీరముగలవారిని, నల్లనికాంతి గల యింద్రనీల మణిస్తంభము నని భావము; శ్యామా=స్త్రీలయొక్క, అతిభూమ=అధికమగు, ప్రభా=కాంతికి, ఆస్పద=స్థానభూతగుణ మగు, మూర్తి నని యర్థాంతరము; భజియించి=సేవించి; తద్గుణతతిన్—తత్=ఆమలినవస్తువుయొక్క, ఆస్త్రీలయొక్క, గుణతతిన్= గుణకదంబమును; ఇలన్=భూమియందు; ఎవ్వారు; సంధింపరు=పొందరు? సమస్తజనులు పొందుదు రనుట.

అనఁగా చంద్రిక యింద్రనీలమణిస్తంభముయొక్క వాసనచేతనో యనునట్లు తాను ఉదితస్తంభతను దాల్చె ననియు, నా సుచంద్రుఁడును అపుడు చంద్రిక సంబంధముచేత తానును ఉదితస్తంభతను దాల్చె ననియు భావము. ఈయర్థమునె దృష్టాం తముతో దృఢపఱచుచున్నాడు. లోకమందు శ్యామాతిభూమప్రభాస్పదమూర్తిని సేవించి తద్గుణములను ఎవరు పొందరు? అందఱును పొందుదు రని భావము. ఇచట నర్థాంతరన్యాసాలంకారము.