చంద్రికాపరిణయము – 8. షష్ఠాశ్వాసము

ఉ. కైరవకోటికూటములు ◊గావని చక్ర మవక్రకౌతుకో
దారత మీఱ సద్వరవి◊తానము లెల్ల మహామహంబులన్
భూరివికాసవైఖరులఁ ◊బూనఁగఁ జేయుచు లోకచిత్రగం
భీరచరిత్ర వై జగతిఁ ◊బెంపు వహింపఁ గదమ్మ చంద్రికా! 102

టీక: చంద్రికా=సంబుద్ధి, జ్యోత్స్న యని తోఁచుచున్నది; కైరవకోటికూటములు – కైరవ=పిశునులయొక్క,కోటికూటములు =అనేకబృందములు, ‘కైరవం కుముదేపి స్యా త్కుటిలేతు పుమా నయమ్’ అని యుత్పలము, కలువలయొక్క కోటికూటము లని యర్థాంతరము దోఁచుచున్నది; కావని = సరిగావని, అనఁగా నిరసించి యనుట. ప్రసిద్ధచంద్రిక కైరవకోటులఁ గాపాడునట్టి స్వభావము గలదనియు, నీచంద్రిక తద్వ్యతిరేకముగ కైరవకోటులఁ దిరస్కరించునది యనియు భావము; చక్రము=జక్కవ; అవక్రకౌతుకోదారతన్ – అవక్ర=అకుటిలమగు,కౌతుక=కుతుకముయొక్క, ఉదారతన్= ఔదార్యము చేత; మీఱన్=అతిశ యింపఁగ, అనఁగ ప్రసిద్ధచంద్రిక చక్రములకు కౌతుకమును బోఁగొట్టునదనియు, నీచంద్రిక చక్రము సంతసించునట్లు చేయునది యనియు వ్యతిరేకము, చక్ర మనఁగ రాష్ట్రము సంతోషించునటులు వర్తించునదని నిసర్గతాత్పర్యము; సద్వరవితానములు – సత్=రిక్కలయొక్క, వర=శ్రేష్ఠములగు, వితానములు=సమూహములు; ఎల్లన్= అన్నియు; మహామహంబులన్=అధిక కాంతులచేత; భూరివికాసవైఖరులన్ – భూరి=అధికమగు, వికాస=వికసనముయొక్క, ప్రకాశముయొక్క యనుట, వైఖరు లన్=రీతులను; పూనఁగన్=పొందునట్లు; చేయుచున్=ఒనరించుచు; సద్వరవితానములు=సత్పురుషసంఘములు, మహా మహంబులన్=అధికోత్సవములచేత, భూరి=అధికమగు, వికాస=సంతసముయొక్క, వైఖరులన్=రీతులను, పూనఁగన్= పొందునట్లు, చేయుచున్ అని స్వభావార్థము; ప్రసిద్ధచంద్రిక సద్వరవితానమునకు వికాసము నడఁగఁజేయు ననియు, నీచంద్రిక యాసద్వరవితానమునకు వికాసమును జేయు ననియు వ్యతిరేకము; లోకచిత్రగంభీరచరిత్రవై – లోక=భువనములయందు, చిత్ర= ఆశ్చర్యకరమగు, గంభీర=గభీరమగు, చరిత్రవై=చరిత్రగల దానవై; జగతిన్=భూమియందు; పెంపున్=వృద్ధిని; వహింపఁగదమ్మ=వహింపుమా!

అనఁగ నోచంద్రికా! నీవు ప్రసిద్ధచంద్రికవలెఁ గాక కైరవపుంజముల నిరసించునవియు, చక్రమును సంతసింపఁజేయునవి యును, సద్వితానములఁ బ్రకాశింపఁజేయునవియును నగు విచిత్రగుణములు గలదానవై పుడమి వృద్ధిఁ బొందుమని భావము.

క. ఘనవేణి నిన్ను నీశుఁడు
దనమూర్తిగఁ దలఁచి మిగుల ◊దయచేసినచో
వినయంబ పూని విశ్వభు
వనపూజ్యత మెలఁగవమ్మ ◊వసుమతిలోనన్. 103

టీక: ఘనవేణి=మబ్బువంటి జడగల చంద్రికా! నిన్నున్; ఈశుఁడు=నీభర్త; తనమూర్తిగన్=తనశరీరముగ; తలఁచి=ఎంచి; మిగులన్=అధికముగ; దయచేసినచోన్=అనుగ్రహించినయెడ; వినయంబ=భక్తినే; పూని=గ్రహించి; వసుమతిలోనన్= భూమియందు;విశ్వభువనపూజ్యతన్ –విశ్వ= సమస్తమైన, భువన=లోకములయందు, పూజ్యతన్=పూజ్యత్వముచేత; మెలఁగవమ్మ=వర్తింపుమా. ఇచట, ఘనవేణి=జాహ్నవి, నిన్నున్, ఈశుఁడు=శంకరుఁడు; తనమూర్తిగన్=అష్టమూర్తులలో నొకదానినిగ, తలఁచి=ఎంచి, మిగులన్=అధికముగ, దయచేసినచోన్=అనుగ్రహించిన యెడ; వినయంబ=నమ్రతనే, పూని= గ్రహించి, విశ్వభువనపూజ్యతన్ –విశ్వ= సమస్తమైన, భువన=ఉదకములచేత, పూజ్యతన్=మాన్యతచే, మెలఁగ వమ్మ యను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ నీభర్తమిగులఁ బ్రీతితో నిన్నుఁ దనమూర్తిగఁదలంచినను నీవు మిగుల వినయమునే పూని యెల్ల జగములలో పూజ్యతను వహింపు మని భావము.

సీ. కవఁగూడి సత్పతిఁ ◊గువలయంబు చెలంగ, నలరు శ్యామయె శ్యామ ◊యవని నెంచఁ,
బురుషరత్నముఁ జెంది ◊సురభివృత్తి, సుమనోగుణ మూనుకొమ్మయే ◊కొమ్మ తలఁప,
సర్వమంగళ యధీ◊శ్వరునకు సామేన, యనఁ దగు సతి సతి ◊యగు నుతింప,
నినపాదసేవనం◊బున ఘనామోదంబు, నెనయుపద్మినియె ప◊ద్మిని నుతింప,

తే. సుచిరముగ సుమనోవృత్తి ◊సొబగుఁ బూని, కలదినంబులు ప్రియుమదిఁ ◊గలసి మెలసి
నడచుకామిని కామిని ◊నళిననయన, తెలిసి నీవింకఁ బతిచెంత ◊మెలఁగు మమ్మ. 104

టీక: సత్పతిన్—సత్=సత్పురుషుఁడగు, పతిన్=భర్తను; కవఁగూడి=జతఁగూడి;కువలయంబు=భూవలయము; చెలంగన్= ఒప్పునటులు; అలరు శ్యామయె – అలరు= ఒప్పుచున్న, శ్యామయె=కాంతయె; అవనిన్=పుడమియందు; ఎంచన్= విచారిం పఁగా; శ్యామ=ఉత్తమస్త్రీ; ఇచట, సత్=రిక్కలకు, పతిన్=భర్తయగు చంద్రుని; కవఁగూడి= జతఁగూడి; కువలయంబు= కలువ; చెలంగన్=వికసించునటులు; అలరు శ్యామయె – అలరు= ఒప్పుచున్న, శ్యామయె=రాత్రియె; అవనిన్=పుడమి యందు; ఎంచన్= విచారింపఁగా; శ్యామ=ఉత్తమమగు రాత్రి, అను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ నెట్లు చంద్రసహితమై కలువను వికసింపఁజేయు రాత్రి, ఉత్తమమైన రాత్రి యనఁబడునో యట్ల పతిఁగూడి జగము మెచ్చఁ జెలంగు కాంతయే ఉత్తమ కాంత యనఁబడునని భావము. పురుషరత్నమున్=పురుషశ్రేష్ఠుని; చెంది=పొంది; సురభివృత్తిన్=పరిమళించువ్యాపారముచేత, శ్లాఘ్యసౌశీల్యాదివృత్తిచేత ననుట; సుమనోగుణము – సు=శ్రేష్ఠమగు, మనః= హృదయమందు, గుణము=గుణమును; ఊనుకొమ్మయే=పొందునట్టి కాంతయే; తలఁపన్=విచారింపఁగా; కొమ్మ=ఉత్తమకాంత; ఇచట, పురుషరత్నమున్=పున్నాగవృక్షమును; చెంది=కూడి; సురభివృత్తిన్=వసంతవర్తనచేత; సుమనోగుణము=పుష్పములగుణమును; ఊనుకొమ్మయే=పొందునట్టి శాఖయే; తలఁపన్ =విచారింపఁగా; కొమ్మ= ఉత్తమశాఖ, అను నర్థము తోఁచుచున్నది. అనఁగ నామనియందుఁ బుష్పించి పున్నాగమును జేరిన కొమ్మయె కొమ్మ యనునట్లు పురుషశ్రేష్ఠునిగూడి సౌశీల్యాదిగుణములుగల కాంతయె కాంత యనఁబడు నని భావము. సర్వమంగళ=సమస్తశుభములుగలదై; అధీశ్వరునకున్=తనపతికి; సామేనయనన్=అర్ధశరీరమే యనునటులు; తగుసతి = ఒప్పుచున్నకాంతయె; నుతింపన్=వర్ణింపఁగ; సతి = ఉత్తమకాంత; అగున్=అగును; ఇచట, సర్వమంగళ=సర్వమంగళ యను నామాంతరముగలదై; అధీశ్వరునకున్=శంకరునకు; సామేనయనన్=అర్ధశరీరమే యను నటులు; తగుసతి= ఒప్పు చున్నపార్వతియె; నుతింపన్=వర్ణింపఁగ; సతి = పతివ్రత; అగున్=అగును, అను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ నీశ్వరున కర్ధాంగియైనట్టి పార్వతీదేవిపగిది తనపెనిమిటికి నర్ధాంగివలె నొప్పుచున్న వనితయె వనిత యనంబడు నని భావము. ఇనపాదసేవనంబునన్ – ఇన=పెనిమిటియొక్క, పాదసేవనంబునన్=చరణసేవచేత; ఘనామోదంబున్ – ఘన=అధికమగు, ఆమోదంబున్=కుతూహలమును; ఎనయుపద్మినియె =చెందుచున్న పద్మినీజాతికాంతయె; నుతింపన్=వర్ణింపఁగ; పద్మిని =పద్మినీజాతికాంత. ఇచట, ఇనపాదసేవనంబునన్ – ఇన=సూర్యునియొక్క, పాదసేవనంబునన్= కిరణస్పర్శచేత; ఘనా మోదంబున్ – ఘన=అధికమైన, ఆమోదంబున్=పరిమళమును; ఎనయుపద్మినియె=పొందు పద్మలతయె; నుతింపన్= వర్ణింపఁగ; పద్మిని=పద్మలత, అను నర్థాంతరము దోఁచుచున్నది. అనఁగ, సూర్యకిరణస్పర్శముచే తామరతీవ ఘనామో దంబు చెందురీతిఁ దనపతిచరణసేవచే మిక్కిలి సంతసించు కాంతయె కాంత యనఁ బరఁగు నని భావము. సుచిరముగన్=ఎల్లకాలము; సుమనోవృత్తిన్ – సు=సమీచీనమగు, మనోవృత్తిన్=మనోవ్యాపారముచేత; సొబగున్=అంద మును; పూని=గ్రహించి; కలదినంబులు=కలకాలము; ప్రియుమదిన్=పతిమనమును; కలసి మెలసి=కలసి వర్తించి; నడచు కామిని=వర్తించుచున్న కాంతయె; కామిని=కాంత; నళిననయన=చంద్రికా! నీవు; తెలిసి=గుర్తెఱిఁగి; ఇంకన్=ఈమీఁద; పతి చెంతన్=పెనిమిటియొద్ద; మెలఁగు మమ్మ=వర్తింపుమమ్మ.

మ. అని వా రంబుజనేత్ర నంప నటఁ ద◊త్ప్రాణేశ్వరీయుక్తుఁడై
జననాథేంద్రుఁడు కాంచనాంచితమణీ◊జ్వాజ్వల్యమానప్రభా
జనితక్ష్మాచరదైనబింబధిషణా◊సంస్థాన మౌస్యందనం
బున నాత్మీయపురీలలామకము నా◊మోదంబుమైఁ జేరఁగన్. 105

టీక: అని=పూర్వోక్తప్రకారముగఁ జంద్రికకు నీతిఁ గఱపి; వారు=తలిదండ్రులు; అంబుజనేత్రన్=చంద్రికను; అంపన్=పంపఁగా; అటన్=ఆమీఁద; తత్ప్రాణేశ్వరీయుక్తుఁడై = ఆప్రాణేశ్వరి యగుచంద్రికతోఁ గూడినవాఁడై; జననాథేంద్రుఁడు=సుచంద్రుఁడు; కాంచ నాంచిత మణీ జ్వాజ్వల్యమాన ప్రభా జనిత క్ష్మాచర దైనబింబ ధిషణా సంస్థానము – కాంచన=సువర్ణముచేత, అంచిత= ఒప్పుచున్న, మణీ=మణులయొక్క, జ్వాజ్వల్యమాన=మిక్కిలి వెలుంగుచున్న, ప్రభా=కాంతిచేత, జనిత= పుట్టింపఁబడిన, క్ష్మాచరత్=భూమియందు చరించుచున్న, ఐనబింబ=సూర్యబింబముయొక్క, ధిషణా=బుద్ధికి, సంస్థానము=నెలవైనది; ఔ స్యందనంబునన్=అగునట్టిరథముచేత; ఆత్మీయపురీలలామకమున్=తనరాజధానీశ్రేష్ఠమును; ఆమోదంబుమైన్=సంతసము చేత; చేరఁగన్=ప్రవేశింపఁగా, దీనికి పైపద్యముతో నన్వయము.

అనఁగఁ జంద్రికకుఁ దలిదండ్రులు నీతి బోధించి పంపఁగ సుచంద్రుఁడు మణికాంతులచేఁ బుడమిఁ జరించు నినబింబమో యను మతి నొసఁగురథంబునఁ జంద్రికం గూడి నిజపురంబుఁ బ్రవేశింపఁగ నని భావము.

సీ. వరవర్ణసంపత్తి ◊నిరుపమశ్రీఁ బూను, సాంగనానాకళా◊చక్ర మనఁగ,
వసుకలాపవిభూతిఁ ◊బస మీఱుశ్రీవధూ,రమణీయతరతనూ◊రాజి యనఁగ,
స్ఫుటతరతారకా◊పటిమఁ గౌతుక మూన్పు, బహుకీర్తినవవప్ర◊పాళి యనఁగ,
ఘనజఘనోదార◊గరిమ నింపులు నింపు, వివిధభూమ్యవతార◊వితతి యనఁగ,

తే. పౌరవరవర్ణినీకోటి ◊బారు దీరె, భర్మమయహర్మ్యవీథులఁ ◊బార్థివేంద్రుఁ
డసమసుమపేశలాలాభ◊హర్షభార, వారకర్ణేజపానుభా◊వముల రాఁగ. 106

టీక. వరవర్ణసంపత్తిన్—వర=శ్రేష్ఠమగు, వర్ణ=కాంతియొక్క,అక్షరములయొక్క, సంపత్తిన్=సంపదచేత; నిరుపమశ్రీన్ – నిరుపమ=సరిలేని, శ్రీన్= కాంతిని, శ్రీకారమును; పూను సాంగనానాకళాచక్ర మనఁగన్ – పూను=వహించినట్టి, సాంగ= అంగ సహితమగు, నానాకళా=అనేకవిద్యలయొక్క,చక్ర మనఁగన్=సమూహమనునట్లు; అనఁగ శ్లాఘ్యమగువర్ణసంపత్తి గల పురాంగనాబృందము వర్ణసంపత్తితోఁ జేరియున్నకళాబృందమనునట్లు బారు దీరెనని భావము. ఇచట కళాచక్రమునకు, కాంతా బృందమునకును కేవలశబ్దసాధర్మ్య మున్న దని తెలియవలెను. వసుకలాపవిభూతిన్ – వసుకలాప=రత్నభూషణములయొక్క, ధననిచయముయొక్క, విభూతిన్=ఐశ్వర్యముచేత; పసమీఱు శ్రీవధూ రమణీయతర తనూరాజి యనఁగన్ – పసమీఱు=సమృద్ధిచే నతిశయించుచున్న, శ్రీవధూ=లక్ష్మీదేవి యొక్క, రమణీయతర=మిగుల మనోజ్ఞమగు, తనూరాజి యనఁగన్ = శరీరశ్రేణియో యనునట్లు; అనఁగ వసుకలాప విభూతిచేత లక్ష్మీదేవి వహించిన పెక్కుశరీరములా యనునట్లు బారుదీఱి రని భావము. స్ఫుటతరతారకా పటిమన్ – స్ఫుటతరతారకా=స్త్రీలయొక్క, పటిమన్=సామర్థ్యముచేత, స్త్రీలరూపముచేత ననుట; కౌతుకము=సంతసమును; ఊన్పు బహుకీర్తి నవ వప్ర పాళి యనఁగన్ – ఊన్పు=చేయుచున్న, బహుకీర్తి=అధికమగు కీర్తి యొక్క, నవ=నూతనమగు, వప్ర=కోటలయొక్క, పాళి=గుంపు, అనఁగన్ = అనునట్లు; అనఁగా, స్ఫుటతరతారకారూప ముచే నొప్పు కీర్తులయొక్కకోట లనునట్లు పౌరకాంతలు బారు దీరి రని భావము. ఘనజఘ నోదార గరిమన్ – ఘనజఘనా=అధికమగు కటిపురోభాగము గల స్త్రీలయొక్క, ఉదార=ఉత్కృష్టమగు, గరిమన్ =గొప్పతనముచేత, విపులజఘనముగల స్త్రీలరూపముచేత ననుట; ఇంపులు=ఆనందములను; నింపు వివిధ భూమ్యవతార వితతి యనఁగన్ – నింపు=పూరించుచున్న, వివిధ= నానావిధములగు, భూమి=పుడమియొక్క, అవతార =రూపాంతర ములయొక్క, వితతి యనఁగన్=సమూహమనునట్లు,అనఁగా, పుడమి యెత్తిన యనేకస్త్రీరూపములయొక్క సమూహ మను నట్లు పురకాంతలు బారుదీరి రని భావము. పార్థివేంద్రుఁడు=సుచంద్రుఁడు; అసమ సుమపేశలా లాభ హర్ష భార వార కర్ణేజపానుభావములన్ – అసమ=సాటిలేని, సుమ పేశలా=చంద్రికయొక్క, లాభ=ప్రాప్తివలన నైన, హర్ష=సంతసముయొక్క, భార=అతిశయముయొక్క, వార= సమూహము నకు, కర్ణేజప=సూచకములగు, ‘కర్ణేజప స్సూచక స్యాత్పిశునో దుర్జనః ఖలః’ అని యమరుఁడు, అనుభావములన్=కటాక్షా దులచేత; రాఁగన్=వచ్చుచుండఁగా; భర్మమయహర్మ్యవీథులన్ = బంగరుమేడలయొక్క ప్రదేశములందు; పౌరవరవర్ణినీ కోటి=పురకాంతలబృందము; బారు దీరెన్=వరుసదీరెను.

చ. సకలజగన్మనోహరు సు◊చంద్రునిఁ జంద్రికఁ జూడ నిట్లు కౌ
తుకమునఁ జేరి పౌరనవ◊తోయదవేణిక లెల్ల నుల్లస
చ్చకచకతాసమానమణి◊సంకులకంకణరాజి గల్లన
న్వికసితమల్లికావితతి ◊నింపుచు నింపులు పెంపు మీఱఁగన్. 107

టీక: పౌరనవతోయదవేణిక లెల్లన్ = పురకాంతలందఱు; సకలజగన్మనోహరున్ – సకల=సమస్తమగు, జగత్=జగమునకు, మనోహరున్=మనోజ్ఞుఁడగు; సుచంద్రునిన్= సుచంద్రభూపతిని; చంద్రికన్= చంద్రికను; చూడన్=చూచుటకై; ఇట్లు=ఈరీతి; కౌతుకమునన్=సంతసముచేత; చేరి=పొంది; ఉల్లస చ్చకచక తాసమాన మణి సంకుల కంకణ రాజి – ఉల్లసత్=ప్రకాశించు చున్న, చకచకతా=చకచకత్వముచేత, చకచకయని మెఱయుటచేత ననుట, అసమాన=తులలేని, మణి=రత్నములచేత, సంకుల=వ్యాప్తమగు, కంకణ=వలయములయొక్క, రాజి=శ్రేణి; గల్లనన్=గల్లుమని మ్రోయఁగ; వికసితమల్లికావితతిన్ – వికసిత=వికసించిన, మల్లికా=మల్లికాపుష్పములయొక్క, వితతిన్=సమూహమును; నింపుచున్=పూరించుచు; ఇంపులు= ఆనందములు; పెంపు మీఱఁగన్=అతిశయింపఁగ. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము. అనఁగఁ బురకాంతలు సుచంద్ర చంద్రికలను జూచుటకై వచ్చి, వారిపై మణి కంకణములు గల్లుమని మ్రోయుచుండ మల్లికాపుష్పములను నించుచు, నానందము లతిశయించించుచు నుండ, నని భావము.

సీ. చట్టుకూఁతు నొకర్తు ◊సర్వజ్ఞుఁ డగుమహే,శ్వరునితోఁ దార్చిన◊వామరచన,
ఖరపాదు రసవదం◊తర యైనపద్మిని, తోన గూర్చినపవ◊లైన చెయ్వు,
లలకుముద్వతి మనో◊హారి యౌసత్పతి, తో ఘటించిన యాప్ర◊దోషసృష్టి,
చిరపూరుషుని వసు◊స్ఫురితాంగి యగులక్ష్మి,తో నెనయించు న◊తుల్యసర్గ,
తే. మన్నియు జగంబు మఱవ న◊య్యబ్జజన్ముఁ,డతులధీచాకచక్యంబు ◊నసమరూప
మానుకూల్యంబు ననురూప◊యౌవనంబు, నమర నిద్దంపతులఁ జేసె ◊ననఘశక్తి. 108

టీక. చట్టుకూఁతు నొకర్తున్=వివేకశూన్యురాలైన నొకకాంతను; సర్వజ్ఞుఁడు=సర్వమును దెలిసినవాఁడు; అగు మహేశ్వరుని తోన్=అయినట్టిశంకరునితో; తార్చిన=కూర్చిన; వామరచన=వక్రరచన; చట్టుకూఁతు నొకర్తున్= హిమవత్పుత్రి యగు పార్వతీదేవిని; సర్వజ్ఞుఁడు=సర్వమును దెలిసినవాఁడు; అగు మహేశ్వరునితోన్=అయినట్టిశివునితో; తార్చిన=కూర్చిన; వామరచన=వామభాగమందురచన యని స్వభావార్థము.
ఖరపాదున్=గర్దభపాదములుగలవానిని; రసవదంతర – రసవత్=శృంగారరసయుక్తమగు, అంతర=హృదయము గలది; ఐనపద్మినితోన=ఐనట్టి పద్మినీజాతిస్త్రీతోడనే; కూర్చిన పవలైన చెయ్వులు=కూర్చినట్టి విరోధముగల పనులు; ఖరపాదున్= సూర్యుని; రసవదంతర =మకరందము గర్భ మందుఁ గలది; ఐనపద్మినితోన=ఐనట్టి పద్మలతతోడనే; కూర్చిన=జతపఱచిన; పవలు=దినమందు; ఐన చెయ్వులు= అయినట్టిపను లని స్వభావార్థము.
అలకుముద్వతిన్ =అట్టి కుత్సితమగు సంతసముగలదానిని; మనోహారి=మనోహరుఁడు; ఔ సత్పతితోన్=అయినట్టి మంచి నాయకునితో; ఘటించిన =కూర్చిన; ఆప్రదోషసృష్టి =ప్రకృష్టమగు దోషములుగల యా నిర్మాణము; అలకుముద్వతిన్ = ఆకలువతీఁగెను; మనోహారి=మనోహరుఁడు; ఔ సత్పతితోన్=అయినట్టి చంద్రునితో; ఘటించిన =కూర్చిన; ఆప్రదోషసృష్టి =ప్రదోషకాలము నందలి యాసృష్టి, యని స్వభావార్థము.
చిరపూరుషునిన్=ముదుసలివానిని; వసుస్ఫురితాంగి – వసు=సువర్ణమువలె, స్ఫురిత=ప్రకాశించుచున్న, అంగి=శరీరము గలది; అగులక్ష్మితోన్ = అయినట్టి లక్ష్మియనుపేరుగల కాంతతో; ఎనయించు=పొందించు; అతుల్యసర్గము=ఈడు గాని సృష్టి; చిరపూరుషునిన్=పురాణపురుషుఁడగు విష్ణుమూర్తిని; వసుస్ఫురితాంగి – వసు=ధనముతో, స్ఫురిత=ప్రకాశించు చున్న, అంగి=శరీరముగలది, అనఁగా ధనస్వరూపిణి; అగులక్ష్మితోన్ = అయినట్టి లక్ష్మీదేవితో; ఎనయించు=పొందించు; అతుల్యసర్గము=అసమానమైన సృష్టి, యని స్వభావార్థము. జగంబు=లోకము; అన్నియు మఱవన్=పూర్వోక్తవామరచనాదులన్నియు మఱచునట్లు; అయ్యబ్జజన్ముఁడు=ఆనలువ; అతులధీచాకచక్యంబున్ – అతుల=సాటిలేని, ధీచాకచక్యంబున్=బుద్ధిచాతుర్యమును; అసమరూపము=సాటిలేని రూప మును; ఆనుకూల్యంబున్=అనుకూలతయు; అనురూపయౌవనంబున్=అనుగుణమగు యౌవనమును; అమరన్=పొందు నటులు; అనఘశక్తిన్—అనఘ=నిర్దుష్టమగు, శక్తిన్=సామర్థ్యముచేత; ఇద్దంపతులన్=ఈ చంద్రికాసుచంద్రదంపతులను; చేసెన్=సృజించెను. అనఁగ వివేకశూన్యురాలైన దానిని సర్వజ్ఞుఁడగు శంకరునికి ఘటించిన వక్రరచనను, ఖరపాదుని పద్మిని తోఁ గూర్చిన విపరీతసృష్టిని, కుముద్వతిని సత్పతితోఁ దార్చిన ప్రదోషసృష్టిని, వసుస్ఫురితాంగి యగులక్ష్మిని ముదుసలి వానితోఁ గూర్చినట్టి యతుల్యసర్గమును, వీని నన్నింటిని లోకము మఱచునటులు ఈనలువ జాణతనముచేత నసమరూపాది గుణంబులు కలుగునటులు ఈచంద్రికాసుచంద్రుల సృజించె నని భావము.