చంద్రికాపరిణయము – 8. షష్ఠాశ్వాసము

చ. జలరుహనేత్రగాత్రమహి ◊సాంద్రమహాంకురపాళి యంటఁ ద
త్కలితమనస్తటాకమును ◊గాఢశరాళి నగల్చి చిత్తజుం
డలరు మహారసోత్కరము ◊నచ్చటఁ దారిచె నాఁగ నత్తఱిం
బులకిత మైనమైఁ బొరలి ◊పొంగె నవోదితఘర్మవాశ్ఛటల్. 124

టీక: జలరుహనేత్ర గాత్రమహిన్ – జలరుహనేత్ర=చంద్రికయొక్క, గాత్రమహిన్=శరీరమను భూమియందు; సాంద్ర మహాం కుర పాళి – సాంద్ర=దట్టమగు, మహత్=అధికమగు, అంకుర=మొలకలయొక్క, పులకలయొక్క యని యర్థాంతరము, పాళి=శ్రేణి; అంటన్=సంబంధింపఁగా; తత్కలితమనస్తటాకమును – తత్=ఆచంద్రికయొక్క, కలిత=ఒప్పుచున్న, మనస్తటా కమును=హృదయ మను చెఱువును; గాఢశరాళిన్ – గాఢ=దృఢమగు, శర=బాణములయొక్క, వాయువులయొక్క, ఆళిన్ =శ్రేణిచేత; చిత్తజుండు=మరుఁడు; అగల్చి=భేదించి; అలరు మహారసోత్కరమున్ – అలరు=ఒప్పుచున్న, మహారస =గొప్ప యనురాగమను నుదకముయొక్క, ఉత్కరమున్=సమూహమును; అచ్చటన్=ఆగాత్రమను భూమియందు; తారిచె నాఁగన్ =ఉంచెనో యనునట్లు; అత్తఱిన్=ఆసమయమందు; పులకితము=సంజాతపులకములు గలది; ఐనమైన్ = అయినట్టి శరీర మందు; నవోదితఘర్మవాశ్ఛటల్ – నవ=నూతనమగునట్లు, ఉదిత=పుట్టిన, ఘర్మవాః=స్వేదోదకముల యొక్క, ఛటల్ = సమూహములు; పొరలి=పొర్లి; పొంగెన్=ఉబికెను. అనఁగా చంద్రికశరీరమనుభూమియందు సాంద్రమగుమొలక లుద యింపఁగానె యాచంద్రికయొక్క హృదయ మను తటాకమును శరాళిచే భేదించి మరుఁడు మహారసోత్కరమును జార్చెనో యనునట్లు పులకలతోఁ గూడి యున్న శరీరము నందు స్వేదోదకము పొరలిపొంగె నని భావము.

చ. చెలి చెలు లందఱుం జనిన ◊సిగ్గది పోవక యున్న దేమి తాఁ
జలమున నంచు నెంచి యతి◊సాంద్రరుషాయుతిఁబోలె ఘర్మవాః
కలికలఁ దోఁగి శోణరుచి ◊గన్పడ నొయ్యన జాఱి తద్వధూ
కులమణిసమ్ముఖం బెడసెఁ ◊గుంకుమబొట్టురసంబు చయ్యనన్. 125

టీక: చెలి=చంద్రికయొక్క; చెలు లందఱున్=చెలికత్తె లందఱును; చనినన్=పోయినను; సిగ్గు అది=ఆవ్రీడ; తాన్=తాను; చలమునన్=మాత్సర్యముచేత; పోవక యున్నది=చనక ఉన్నది; ఏమి=ఏమి కారణము? అంచున్=అనుచు; ఎంచి=గణించి; అతిసాంద్రరుషాయుతిఁబోలెన్—అతిసాంద్ర=మిక్కిలి గాఢమగు, రుషాయుతిఁబోలెన్=క్రోధముతోఁగూడికచేతవలెనె; ఘర్మ వాఃకలికలన్=ఘర్మోదబిందువులయందు; తోఁగి=మునిఁగి; శోణరుచి కన్పడన్=ఎఱ్ఱనికాంతి చూపట్టుచుండఁగా; ఒయ్యనన్ =తిన్నఁగా; జాఱి=స్రవించి; తద్వధూకులమణిసమ్ముఖంబు – తద్వధూకులమణి=ఆచంద్రికయొక్క, సమ్ముఖంబు=ముఖము సన్నిధిని అని తోఁచుచున్నది; కుంకుమబొట్టురసంబు=కుంకుమతిలకముయొక్క జలము; చయ్యనన్=శీఘ్రముగ; ఎడసెన్= ఎడబాసెను. అనఁగా చంద్రిక సకురాండ్రు చనినను ఈసిగ్గు ఏల పోవక యున్నది యని రోషముతోఁ గూడి యున్నదానివలెనె స్వేదోదబిందువులయందు మునిఁగి ఎఱ్ఱనికాంతితో కుంకుమబొట్టురసంబు చంద్రికసమ్ముఖంబు నెడఁబాసె నని భావము.

చ. జలజశరాశుగప్రచుర◊చంక్రమణంబు లమందతం గనన్
గలికి తమిన్ ద్రపాంబుదము ◊గప్పిన నాననచంద్రదర్శనం
బలవడ కున్కి నత్తఱి ని◊జాక్షిచకోరకయుగ్మ మాఁకటం
దలఁకుచు నుండ నద్ధరణి◊నాథుఁడు పల్కు రసోత్తరంబుగన్. 126

టీక: జలజశరాశుగప్రచురచంక్రమణంబు – జలజశర=మరునియొక్క, ఆశుగ=బాణములను వాయువులయొక్క, ప్రచుర =అధికమగు, చంక్రమణంబులు=సంచారములు; అమందతన్=అతిశయమును; కనన్=పొందఁగా; కలికితమిన్ – కలికి= చంద్రికయొక్క, తమిన్=ఆసక్తి యనెడు రాత్రిని; త్రపాంబుదము=సిగ్గనుమబ్బు; కప్పినన్=ఆచ్ఛాదింపఁగ; ఆననచంద్ర దర్శనంబు=ముఖచంద్రునియొక్కదర్శనము; అలవడ కున్కి=పొసఁగకుండుటచేత; అత్తఱిన్=ఆసమయమందు; నిజాక్షి చకోరకయుగ్మము – నిజ=తనసంబంధియగు, అక్షిచకోరక=నేత్రములను చకోరములయొక్క, యుగ్మము= జంట; ఆఁకటన్=క్షుత్తుచేత; తలఁకుచు నుండన్=చలించుచుండఁగా; అద్ధరణినాథుఁడు=ఆసుచంద్రుఁడు; రసోత్తరంబుగన్= అనురాగాతిశయముచేత; పల్కున్=పలికెను. అనఁగ సుచంద్రుఁడు, మన్మథాశుగసంచారము లతిశయింపఁగానె చంద్రిక యొక్క యాసక్తి యనెడు రాత్రిని లజ్జయను మేఘము కప్పగా, ముఖచంద్రుఁడు గనిపింపని యాసమయమునందుఁ దన యక్షిచకోరములు ఆఁకలితో చలించుచుండఁగా ననురాగమునఁ జంద్రికతోఁ బలికె నని భావము.

సీ. వరశంఖపూగసం◊పద గళస్థము నీకు, సతి! పోఁకముడి సుంత◊సడల రాదె,
కువలయశ్రీ నేలు◊కొను నేత్రరుచి నీకుఁ, దొయ్యలి! రెం డూరు ◊లియ్య రాదె,
ఘనకుందవిభవంబు ◊గను దంతములు నీకు, బిసబాహ యొకరేఖ ◊యొసఁగ రాదె,
బహుదివ్యఫలలక్ష్మిఁ ◊బరఁగువాతెఱ నీకు, నింతి! మంజులకుచం ◊బిడఁగ రాదె,
తే. రాజవిజయంబు చేసె నీ◊రమ్యముఖము, లేమ! యవనతవృత్తి చా◊లింప రాదె
నిరుపమరుచిమణికి నీ◊కరయఁ దగునె, వరపటలరీతి చే విడు◊వఁగను రాదె. 127

టీక: వరశంఖపూగసంపద – వర=శ్రేష్ఠమగు, శంఖపూగసంపద=శంఖములయొక్క పూగములయొక్క సంపదయనెడు శంఖసంఖ్యగల పోఁకలసమృద్ధి; నీకున్; గళస్థము=గలమందున్నది, కలస్థ మనియు విభాగము, రేఫలకారంబుల కభేద మునుబట్టి కరస్థ మనుకొనవలయు; పోఁకముడి=నీవియనెడు పోఁకలమూటను; సుంత=ఇంచుకంత; సతీ=చంద్రికా! సడల రాదె=వదలరాదా? అనఁగ శంఖసంఖ్యాకమగు పూగసమృద్ధిగలవా రించుకపోఁకముడి సడలుట తగు నని భావము. నీవీ గ్రంథిని సడలింపుమని ప్రకృతాభిప్రాయము. ‘ద్వ్యర్థైః పదైః పిశునయేచ్చ రహస్యవస్తు’ అను కామశాస్త్రమర్యాద ననుసరించి కవి ప్రార్థనీయరహస్యవస్తువును శ్లిష్టపదములతో సూచించి యున్నాఁడు. ఇ ట్లితరచరణములయందును గ్రహింపవలయు. తొయ్యలి=చంద్రికా! నీకున్; కువలయశ్రీన్=కుముదసంపద యనెడు భూవలయసంపదను; ఏలుకొను నేత్రరుచి =పాలించెడు నయనకాంతి; కలదు. రెం డూరులు=రెండు తొడలనెడు రెండుగ్రామములను; ఇయ్య రాదె=ఒసంగరాదా? భూవలయము నేలువారు రెండుగ్రామముల నిచ్చుట తగునని భావము. ఊరువుల నొసంగుమని ప్రకృతాభిప్రాయము. బిసబాహ=తారతూఁడువంటి బాహువులుగలదానా! నీకున్; ఘనకుందవిభవంబున్ – ఘన=అధికమగు,కుందవిభవంబున్ = మొల్లమొగ్గలవిభవ మనెడు నిధివిశేషముయొక్క విభవమును, ‘మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్ఛపౌ, ముకున్ద కున్ద నీలాశ్చ వరశ్చ నిధయో నవ’ అని యమరుఁడు; కను దంతములు =పొందునట్టి దశనములు; కలవు. ఒకరేఖ=ఒకక్షత మనెడు స్వల్పద్రవ్యమును;ఒసఁగ రాదె=ఈయరాదా? కుందవిభవముగలవారు స్వల్పద్రవ్యము నొసంగుట యుక్త మని భావము. దంతక్షతి నీయుమని ప్రకృతాభిప్రాయము. ఇంతి=చంద్రికా! నీకున్; బహుదివ్యఫలలక్ష్మిన్ – బహు=అనేకములై, దివ్య=మనోజ్ఞములగు, ఫల=లాభము లనెడు పండ్ల యొక్క, లక్ష్మిన్=లక్ష్మిచేత; పరఁగువాతెఱ=ఒప్పునట్టి మోవి; కలదు; మంజులకుచంబు= అందమైన కుచము (మంజుల కుచము) అనెడు నందమైన లకుచమును (మంజు లకుచమును), అనఁగా గజనిమ్మపండును, ‘మనోజ్ఞం మంజు మంజులమ్’ అని యమరుఁడు; ఇడఁగ రాదె =ఈయరాదా? అనేకఫలంబులు గలవారు ఒక్కఫలము నిచ్చుటయుక్త మని భావము. కుచము నిమ్మని ప్రకృతాభిప్రాయము. లేమ=చంద్రికా! నీరమ్యముఖము=నీసుందరవదనము; రాజవిజయంబున్=చంద్రుఁడనెడు భూపాలునియొక్క గెలుపును; చేసెన్=ఒనర్చెను; అవనతవృత్తిన్=నమ్రభావమును; చాలింప రాదె=మానరాదా? లోకమందు రాజును జయించినవారు తల యెత్తి యుండుట యుక్తమని భావము. లజ్జ విడిచి తలయెత్తు మని ప్రకృతాభిప్రాయము. నిరుపమరుచిమణికిన్ = అసమానమై, రుచిరమైన మణివంటిదానవగు; నీకున్; వరపటలరీతి – వర=శ్రేష్ఠమగు, పటలరీతి =వస్త్రాకర్షణముచేయుదానిరీతి యనెడు పటలాఖ్యమణిదోషరీతి; అరయన్=విచారింపఁగా; తగునె=యుక్తమా? శ్రేష్ఠమగు మణులకు పటలదోషము యుక్తము గాదని భావము. వస్త్రమును గ్రహింపకు మని ప్రకృతాభిప్రాయము. చే విడువఁగనురాదె = కరము వస్త్రమునుండి విడువు మనుట.

క. అనునయపూర్వకముగ న,వ్వనజానన నిటులు పలికి◊వసుధాపతి త
ద్ఘనరమ్యాంగకసంస్ప,ర్శనలాలసవృత్తి యగుట ◊సంభ్రమ మెసఁగన్. 128

టీక: వసుధాపతి=సుచంద్రుఁడు; అవ్వనజాననన్=ఆచంద్రికనుగూర్చి; ఇటులు=ఇట్లు; అనునయపూర్వకముగన్=ఉప లాలనపురస్సరముగ; పలికి=వచించి; తద్ఘన రమ్యాంగక సంస్పర్శన లాలస వృత్తి – తత్=ఆచంద్రికయొక్క, ఘన = బిగు వైన, రమ్య=మనోజ్ఞములగు, అంగక=అవయవములయొక్క, సంస్పర్శన=తాఁకుటయందు, లాలస=అధికతృష్ణగల, వృత్తి =వ్యాపారముగలవాఁడు; అగుటన్=ఐన హేతువుచేత; సంభ్రమము=తొట్రుపాటు; ఎసఁగన్=అతిశయించునటులు. దీని కుత్తర పద్యస్థక్రియతో నన్వయము.

చ. నృపతిమహాబలోత్కరము ◊నేర్పున వళ్యధిరోహిణిన్ సమ
గ్రపటిమ లగ్గ కెక్కుతఱిఁ ◊గంపమునొందు సతీకుచాద్రి దు
ర్గపదవి నాక్రమించి యట ◊రంజిలు నాయకరత్నముం గ్రహిం
చి పరమకౌతుకం బతని ◊చిత్తమునన్ ఘటియించె నత్తఱిన్. 129

టీక: నృపతిమహాబలోత్కరము – నృపతి=సుచంద్రునియొక్క, మహత్=అధికమగు, బల=బలముచేత, ఉత్=ఎత్తఁబడిన, కరము=హస్తము; నృపతియొక్క, మహాబల=అధికసేనలయొక్క, ఉత్కరము=సమూహము; నేర్పునన్=జాణతనముచేత; వళ్యధిరోహిణిన్ –వళి=త్రివళి యనెడు, అధిరోహిణిన్=నిచ్చనచేత; సమగ్రపటిమన్ –సమగ్ర=పరిపూర్ణమగు, పటిమన్= సామర్థ్యముచేత; లగ్గ కెక్కుతఱిన్=ముట్టడించుటకై, కోటనెక్కుసమయమందు; కంపమున్=కళవళమును, భయమును; ఒందు సతీకుచాద్రి దుర్గపదవిన్ – ఒందు=పొందుచున్న, సతీ=చంద్రికయొక్క, కుచాద్రి=పర్వతములవంటి స్తనము లనెడు, దుర్గ=కోటయొక్క, పదవిన్=స్థానమును;ఆక్రమించి=ఆవరించి; అటన్=అచ్చట; రంజిలు నాయకరత్నమున్=ప్రకాశించు ప్రభుశ్రేష్ఠుని, ప్రకాశించు హారమధ్యమణిని; గ్రహించి=పట్టుకొని; పరమకౌతుకంబు—పరమ=ఉత్కృష్టమగు,కౌతుకంబు= సంతసమును; అతని చిత్తమునన్=ఆసుచంద్రునిహృదయమందు; అత్తఱిన్=ఆసమయమందు; ఘటియించెన్=ఘటిల్లఁ జేసెను. అనఁగా సుచంద్రునియొక్క మహాబలముగలకర మనెడు బలోత్కరము, అనఁగ సేనాబృందము, జాణతనముతో త్రివళి యను నిచ్చెనచేత నెక్కి ముట్టడించుతఱి కళవళ మందు చంద్రికాకుచములను దుర్గమును ఆవరించి, యందున్న నాయక మణిని పట్టుకొని సుచంద్రునిచిత్తమునకు అత్యానందము కలిగించె నని భావము. సుచంద్రునికరము దొలుతఁ ద్రివళిని దాఁకి, పిదపఁ గుచముల నాక్రమించి, యచ్చట నున్న నాయకరత్నమును స్పృశించి యత్యానందముఁ జెందె నని ప్రకృతభావము.

తే. అటులు నేత్రాహరణయుక్తి ◊నతిశయిల్లు
రాజమౌళికి నీవి క ◊రస్థమయ్యె,
నైన పిమ్మట దానె త◊దంగసీమ
యతనిఁ బొదివి సుఖించె సాం◊ద్రానురక్తి. 130

టీక: అటులు=పూర్వోక్తప్రకారముగాను; నేత్రాహరణయుక్తి న్ – నేత్ర=వస్త్రముయొక్క, ఆహరణ=ఆకర్షణముయొక్క, యుక్తిన్=యోగముచేత; నేత్రాహరణ=నాయకాకర్షణముయొక్క, యుక్తిన్=సంబంధముచేత అని రాజపరమైన అర్థము; అతిశయిల్లు రాజమౌళికిన్ =అతిశయించుచున్న సుచంద్రునకు, రాజశ్రేష్ఠునకు; నీవి=పోఁకముడి, మూలధనము, ‘నీవీ పరి పణం మూలధన’మ్మని యమరుఁడు; కరస్థమయ్యెన్=హస్తగతమయ్యెను; ఐన పిమ్మటన్ =ఐన వెనుక; తానె =తనంతటనె; తదంగసీమ – తత్=ఆచంద్రికయొక్క, అంగసీమ=శరీరప్రదేశము, ఆరాజుయొక్క అంగ దేశమని యర్థాంతరము; అతనిన్= ఆసుచంద్రుని, ఆరాజును; పొదివి=పొంది, కలసి యనుట; సాంద్రానురక్తిన్ – సాంద్ర= దట్టమగు, అనురక్తిన్=అనురాగముచేత; సుఖించెన్=సుఖపడెను.

అనఁగ రాజును బట్టుకొని అతిశయించుచున్న రాజశ్రేష్ఠునకు మూలధనము కరస్థమైన పిదపఁ, దనంతటన ఆరాజు నంగ దేశము అతనిఁ బొంది సుఖించె నని భావము. వస్త్రాకర్షణముచేత నతిశయిల్లు సుచంద్రునకు పోఁకముడి కరగతమైన పిదపఁ జంద్రిక యంగప్రదేశము సుచంద్రునిఁ జెంది సుఖించె నని ప్రకృతాభిప్రాయము.

తే. అపు డతర్కితసంప్రాప్త ◊మగు పరస్ప
రాంగ సాంగత్యసౌఖ్యంబు ◊ననుభవించు
జంపతుల కెన్నఁ దత్త్రప◊సదృశ యైన
యాళి యగుఁ గాదె మఱి జగ◊త్పాళియందు. 131

తే. అపుడు=ఆసమయమందు; అతర్కితసంప్రాప్తము=ఊహింపకయె వచ్చినది; అగు పరస్పరాంగసాంగత్యసౌఖ్యంబున్ –అగు=అగునట్టి, పరస్పరాంగసాంగత్య=ఒండొరుల శరీరములసంబంధమువలననైన, సౌఖ్యంబున్=సుఖమును; అనుభ వించు జంపతులకున్=ఉపభోగించు జాయాపతులకు; ఎన్నన్=పరికింపఁగా; తత్త్రప=ఆచంద్రికయొక్కలజ్జ; మఱి=మఱియు; జగత్పాళియందున్=జగత్సమూహమునందు; సదృశ యైన ఆళి =అనుకూలయైన చెలికత్తె; అగుఁ గాదె=అగును గదా!

అనఁగ లజ్జవలన నతర్కితసంప్రాప్తమగు నంగసాంగత్యసుఖంబు ననుభవించు నీదంపతులకు నాలజ్జ అనుకూల యగు చెలికత్తె యగునుగదా యని భావము.

మ. జలజాతాప్తకులావతంస మటఁ ద◊త్సారంగనేత్రాధర
చ్ఛలబింబీఫలచుంబనంబువలనన్ ◊సద్యస్సముద్భూతపి
చ్ఛిలమోహుం డయి చన్ను లంటి తగ నా◊శ్లేషంబు నూన్పం గన
త్పులకంబై యది చేసెఁ గంచుకభిద ◊న్భూయస్త్రపాయుక్తిగన్. 132

టీక: జలజాతాప్తకులావతంసము=సూర్యవంశావతంసమగు సుచంద్రుఁడు; అటన్=అటు పిమ్మట; తత్సారంగనే త్రాధర చ్ఛల బింబీఫల చుంబనంబువలనన్—తత్సారంగనేత్రా=ఆచంద్రికయొక్క, అధర=ఓష్ఠ మనెడు, ఛల=వ్యాజము గల, బింబీఫల= దొండపండుయొక్క, చుంబనంబువలనన్=చుంబనమువలన; సద్య స్సముద్భూత పిచ్ఛిల మోహుండయి – సద్యః=తత్కాల మందు, సముద్భూత=ఉదయించిన, పిచ్ఛిల=దట్టమైన, మోహుండయి=మోహము గలవాఁడై; చన్నులు=కుచములను; అంటి=స్పృశించి; తగన్=అనుకూలముగ; ఆశ్లేషంబు=కౌఁగిలింతను;ఊన్పన్=చేయఁగ; కనత్పులకంబై – కనత్=ప్రకాశించు చున్న, పులకంబై=పులకలు గలదై; అది=ఆకౌఁగిలింత; గంచుకభిదన్ – కంచుక=ఱవికయొక్క, భిదన్= భేదమును; భూయ స్త్రపాయుక్తిగన్ = మరల లజ్జ గలుగునటులు; చేసెన్=చేసెను.

అనఁగ సుచంద్రుఁడు చంద్రికాధరచుంబనంబున గాఢ మగుమోహము గలవాఁడై పాలిండ్లఁ బట్టి కౌఁగిలింపఁగ నాకౌఁగి లింత పులకలు గలిగించి మరల లజ్జ వచ్చునటులు కంచుకమును భేదించె నని భావము.

చ. క్రమమున రాజమౌళి యెడ◊గానని ధౌతపటంబు దీయఁ ద
త్కమలదళాక్షి బెగ్గడిలి ◊క్రమ్మఱ రాఁ గొను సారెసారెకున్
విమలపయస్తరంగతతి ◊వేమరు నేగుచు నాఁగుచుండఁగా
నమరెడు గాంగసైకతము◊నందమునన్ జఘనంబు మీఱఁగన్. 133

టీక: క్రమమున్=క్రమముగా; రాజమౌళి=సుచంద్రుఁడు; ఎడగానని ధౌతపటంబున్=ఎడఁబాయని ధౌతవస్త్రమును; తీయన్= ఆకర్షింపఁగా; తత్కమలదళాక్షి=ఆచంద్రిక; బెగ్గడిలి=భయపడి; క్రమ్మఱన్=మరల; సారెసారెకున్=మాటిమాటికి; విమల పయస్తరంగతతి –విమల=స్వచ్ఛమగు, పయః=ఉదకముయొక్క, తరంగ=తరఁగలయొక్క, తతి=సమూహము; వేమరున్ =మాటిమాటికిని; ఏగుచున్=పోవుచు; ఆఁగుచుండఁగాన్=అణఁగుచుండఁగా; అమరెడు గాంగసైకతము నందమునన్=ఒప్పు చున్న జాహ్నవీపులినముయొక్క సౌందర్యముచేత; జఘనంబు=కటిపురోభాగము; మీఱఁగన్=అతిశయింపఁగా; రాఁగొనున్ =ఆకర్షించును. అనఁగ సుచంద్రుఁడు చంద్రికయొక్క యెడఁబాయని వస్త్రమును దీయఁగా చంద్రిక భయపడి మాటిమాటికి వస్త్రము నాకర్షించుకొనఁగా, తజ్జఘనము, నిర్మలజలతరంగములు కప్పుచు నణఁగుచుండఁగా ప్రకాశించు గంగాపులినమువలెఁ బ్రకాశించె నని భావము.