అనల్పమైన కల్పనా ప్రపంచానికి త్రిపురాంతకోదాహరణము పుట్టినిల్లు. సూచ్యార్థ సూచకత్వానికి, ప్రకాశ్యార్థ ప్రకాశకత్వానికి అపురూపములైన ఉదాహరణలు ఇందులో సర్వే సర్వత్ర నిండి ఉన్నాయి.
ఏల్చూరి మురళీధరరావు
- పూర్తిపేరు
- ఏల్చూరి మురళీధరరావు
- సొంత ఊరు
- ఏల్చూరు, ప్రకాశం జిల్లా
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
జీవిత విశేషాలు
ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు ‘నయాగరా’ కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని సాహిత్య లక్షణ చిత్రకవిత్వాలపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి “తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం” అన్న ప్రశంస పొందారు. విజయవాడ ఆకాశవాణిలో నాలుగేళ్ళు, ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో 38 సం॥లు పనిచేశారు. ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ వ్యాస సంపుటి ఇటీవలి రచన.