ఆంధ్ర జాతీయమహాకవి బమ్మెర పోతనామాత్యుడు విరచించిన పరమపవిత్రమైన శ్రీ మహాభాగవతంలో భక్తకవి బొప్పన గంగనామాత్యుడు పరిపూర్ణించిన పంచమ స్కంధం గంభీరమైన తత్త్వార్థబోధకత వల్ల, తిరుగులేని కవితారామణీయకం మూలాన రసోదంచితమని పేరెన్నిక గన్నది. ఈ పంచమ స్కంధాన్ని ‘సకలసుకవిజనానందకరం’గా సుజనమనోహరంగా ఆంధ్రీకరించి, చరిత్రలో పోతన్న గారి సహపంక్తికి నోచుకొన్న మహాకవి బొప్పరాజు గంగనామాత్యుడు నిజంగా ధన్యజీవి. శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి, ఆ స్వామి వైభవప్రకాశనకు తన కవితను పరికరింపజేసి, పోతనగారి వలెనే తాను తరింపగోరి తెలుగు జాతిని తరింపజేసిన పుణ్యధను డాయన. ఈ కథాకథనముఖాన శృంగార వైరాగ్యాలకు ఆలవాలమైన మనువంశ రాజపురుషుల యొక్క జీవితసందేశబోధకు, విరాట్పురుషుడు కల్పించిన ఈ భువనకోశవర్ణనకు, పాపులకు గమ్యస్థానాలయిన నరకలోకాల వర్ణనకు అవకాశం లభించి భగవన్మహిమను, భగవల్లీలలను నోరారా వర్ణించి తన శిక్షణను, కారయిత్రీశక్తిని సార్థకం చేసుకొన్నాడు.
గంగనార్యుని పద్యశైలి మనోహరంగా ఉంటుంది. అనువాదం మూలానికి అత్యంతవిధేయం. ఎక్కడైనా వ్యాఖ్యానసాపేక్షములైన దళాలు కనిపిస్తే వాటిని శ్రీధరస్వామి భావార్థదీపికా వ్యాఖ్యను అనుసరించి తెలుగు చేశాడు. శ్రీధరస్వామి భావార్థదీపికలో లేకుండా – ఆ తర్వాత వెలసిన వీరరాఘవుని భాగవతచంద్రచంద్రికా వ్యాఖ్యలో మాత్రమే ఉన్న పంక్తులు కొన్ని గంగనార్యుని అనువాదంలో యథాతథంగా కానవస్తాయి. అవి తాళపత్రాలలో పూర్వకాలంలోనే చేరినవో లేక ఎవరో ఇటీవలి కాలంలో చేర్చినవో వ్రాతప్రతులన్నింటినీ పరిశీలించితే కాని నిర్ధారించటం సాధ్యం కాదు.
అనువాదపద్ధతిని చూస్తే గంగనార్యునికి తన కథాకథననైపుణిని, పద్యనిర్మాణకౌశలాన్ని ప్రదర్శించటం కంటె సన్నివేశాన్ని సుభగంగా నడుపుకొని పోవడమే సమ్మతమని అనిపిస్తుంది. పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా, వ్యాఖ్యలను మించిన వ్యాఖ్యగా పద్యాన్ని కదను తొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. అందువల్ల సాత్త్వికమైన మార్గాన్ని ఆశ్రయించి ధారాళమైన ధారాకౌశలంతో కథను సరసంగా సంక్షేపించాడు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువు తీరింది. అప్రతీతపదాలతో ప్రౌఢమైన ప్రయోగాలను చేయటం కంటె మూలాన్ని సరళంగా తెలుగు చేయటమే ఆయన అభిమతం. అనువాదకళలో మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.
1. గంగనామాత్యుని జీవిత విశేషాలు
తెలుగు కవులలో పెక్కుమంది వలెనే గంగనామాత్యుని జీవితవిశేషాలేవీ చరిత్ర కెక్కలేదు. స్కంధాంతగద్యలలో — “ఇది శ్రీసకలసుకవిజనానందకర బొప్పనామాత్యపుత్త్ర గంగనార్యప్రణీతం బైన శ్రీమద్భాగవతమహాపురాణంబు నందు,” అని చెప్పుకొన్నదానిని బట్టి నియోగి బ్రాహ్మణుడని, బొప్పనామాత్యుల వారి తనయుడని మాత్రమే తెలుస్తున్నది. సకలసుకవిజనానందకరుడు కావటానికి ఏమేమి వ్రాశాడో మనకిప్పుడు తెలియదు. ఈయన నిజాము రాష్ట్రవాసి అని ఆంధ్రకవితరంగిణిలో చాగంటి శేషయ్యగారు ఊహించారు.
గంగన అన్నపేరు తెలంగాణంలోని నేటి ధర్మపురి చెంత పోతన్నగారికి శ్రీరామచంద్రప్రభువు సాక్షాత్కారం సిద్ధించి, శ్రీమహాభాగవతావరణకు కారణతీర్థమైన పుణ్యగంగనే సూచిస్తున్నదనీ, గంగనామాత్యుడు ఆ సమీపప్రాంతవాసి అనీ అక్కడి పెద్దలంటారు. బమ్మెర పోతనామాత్యులవారు దత్తమండలంలోని ఒంటిమిట్టకు చెందినవారని విశ్వసించిన విమర్శకులెవరూ ఈయన ప్రాంతీయతను గురించి చర్చింపలేదు. అంతమాత్రాన ఈ వివాదం పరిష్కృతమైనట్లు భావించటం సరికాదు. ఉభయవాదాలను ఇంకా సమీకరించి, నిజాన్ని నిగ్గు తేల్చవలసి ఉన్నది. భాగవతకవులు తెలంగాణానికే చెందినవారయినా, రెండు ప్రాంతాలలో సంచరించి ఉండరని, ప్రాంతీయాభిమానాలు వట్టి నిరాధార కల్పనలని నిర్ణయించటం కష్టం.
ఇంతవఱకు సాహిత్య చరిత్రకారులు గంగనార్యుని కాలాదికం నిర్ణయించేందుకు సాధనాలేవీ చూపలేదు. ఏకాదశ స్కంధాన్ని రచించిన వెలిగందల నారయకు తర్వాతి వాడని కొందఱు, షష్ఠస్కంధాన్ని రచించిన ఏర్చూరి సింగనకు సమకాలికుడని కొందఱు భావిస్తున్నారు. అయితే, వారెవరూ గుర్తింపని సాహిత్యికవిశేషం ఒకటున్నది. ఆ విశేషాన్ని వివరిస్తాను:
1.1. గంగనార్యుడు – హరిభట్టు
గంగనార్యునికి అత్యంత సమీపకాలికుడైన మహాకవి హరిభట్టు రచించిన మత్స్యపురాణంలో, గంగనార్యుని పంచమ స్కంధ పద్యాన్ని పోలిన రచన ఒకటి కనుపిస్తుంది. మత్స్యపురాణం 1912లోనే అచ్చయినప్పటికీ అంత ప్రసిద్ధికి రానందువల్ల ఈ విషయం చరిత్రకారుల దృష్టికి రాలేదు. మత్స్యపురాణ – పంచమ స్కంధాలలోని ఆ పద్యాలు రెండింటినీ సరిపోల్చి, ఎవరు ఎవరికి అనుకర్తలో నిశ్చయింపగలిగితే ఈ చిక్కుముడి వీడుతుందని నా భావం.
ఆ రెండు పద్యాలనూ చూడండి –
గ్రైవేయకంకణాంగదహారకుండలప్రభ లలితస్ఫూర్తిఁ బరిఢవిల్ల
నవరత్నకీలితోన్నతకిరీటద్యుతు లాశావకాశంబు లలమికొనఁగఁ
గటివిలంబితహేమకాంచీవిలగ్నమై రాజితపీతాంబరంబు మెఱయ
శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్త మై తులసికాదామంబు తొంగలింప
నతిరయంబున గరుడవాహనసమేతుఁ
డగుచు విష్ణుండు శంఖచక్రాది విశ్రు
తాయుధంబుల ధరియించి యవనిపతికి
దక్షణంబున నచట బ్రత్యక్ష మయ్యె. — (హరిభట్టు మత్స్యపురాణము, 4-140)
ఇది హరిభట్టు మత్స్యపురాణంలోని పద్యం. కంఠసీమను దివ్యహారాలు, ముంజేతుల కంకణాలు, కాలి అందెలు, వక్షఃస్థలాన వెలలేని ముత్యాల దండలు, చెవులకు మకరకుండలాల వెలుగు శృంగారవిస్ఫురణతో అతిశయిస్తుండగా; నవరత్నాలు పొదిగిన సమున్నతమైన కిరీటము యొక్క దీధితులు ఎల్లదిక్కులను ఆవరింపగా; నెన్నడుమును ఆశ్రయించిన బంగరు మొలత్రాడుకు దీటుగా పసిమి వన్నె పట్టుపంచె మిరుమిట్లు గొలుపుతుండగా; భృగుమహర్షి కన్నుమిన్ను గానక తన్నినపుడు రొమ్మున తత్పదాఘాతరూపమై ఏర్పడిన శ్రీవత్సమనే మచ్చ, మునుపు దేవదానవులు క్షీరసముద్రాన్ని చిలికినపుడు ఆవిర్భవించిన కౌస్తుభరత్నం, ఆ కలశరత్నాకరం నుంచే వెలువడిన శ్రీదేవితో కూడి ఆయన వక్షోలంకృతమైన తులసీదళ మాలిక నూత్నవికాసమును పొందగా; శరణాగతరక్షణత్వరతో గరుత్మద్రథాన్ని అధిరోహించి శంఖచక్రాదులైన విఖ్యాతాయుధాలను చేతబట్టి ఆ క్షణమందే శ్రీమహావిష్ణువు భూమిపతి కన్నుల ముందు ప్రత్యక్షమైనాడు – అని భావం. ఇక పంచమ స్కంధంలో గంగనార్యుని పద్యాన్ని చూడండి:
అంత నావిష్కృతకాంతచతుర్భుజంబులును, బీతాంబరంబును వెలుంగ
శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై యిరవుపడఁగ
శంఖచక్రగదాంబుజాతఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ
నతులితనవరత్నహాటకాంకితనూత్నఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁ
గర్ణకుండలకటిసూత్రకనకరత్న
హారకేయూరవరనూపురాదిభూష
ణముల భూషితుం డైన శ్రీనాయకుండు
దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె. — (గంగనార్యుని పంచమ స్కంధము, 1-43)
రెండు పద్యాలలోని వర్ణనాంశమూ ఒక్కటే. ఆర్తుల మ్రోల శరణాగతత్రాత అయిన శ్రీహరి సాక్షాత్కారం. హరిభట్టు పద్యంలోని “నవరత్నకిరీటోన్నతద్యుతు లాశావకాశంబు లలమికొనఁగ” అన్న పాదం గంగనార్యుని పంచమ స్కంధం లోని “అతులితనవరత్నహాటకాంకితనూత్నఘనకిరీటద్యుతుల్ కడలుకొనఁగ” అన్నదానికే పర్యాయం. హరిభట్టు పద్యంలోని “శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్తమై తులసికాదామంబు తొంగలింప” అన్న పాదం పంచమ స్కంధం లోని “శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై ఇరవు పడఁగ” అన్నదానికి పూర్తిగా సమానం. హరిభట్టు పద్యంలోని “విష్ణుండు శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి యవనిపతికి దక్షణంబున నచటఁ బ్రత్యక్ష మయ్యె” అన్న పాదం పంచమ స్కంధం లోని “కర్ణకుండల కటిసూత్ర కనకరత్నహారకేయూర వరనూపురాదిభూషణముల భూషితుండైన శ్రీనాయకుండు దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె” అన్న పరిసమాపక వాక్యానికి ప్రతిబింబన్యాయంగా సరిపోలి ఉన్నది. హరిభట్టు పద్యంలోని “శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి” అన్న దళం కూడా “శంఖచక్రగదాంబుజాతఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ” అన్న పంచమ స్కంధ పద్యపాదం లోనిదే.
గంగనార్యుడు, హరిభట్టు రచించిన ఈ రెండు పద్యాలూ ఒకదానికొకటి ప్రతిబింబాలన్న విషయం వేరే చెప్పనక్కరలేదు.
గంగనార్యుని పద్యానికి మూలమైన సంస్కృత భాగవతంలో నాభి మహారాజు చేసిన యజ్ఞంలో వేదికపై శ్రీమహావిష్ణువు అవతరించినప్పటి వర్ణన ఆ సందర్భంలో ఈ విధంగా ఉన్నది:
వ. అథ హ త మావిష్కృతభుజయుగలద్వయం హిరణ్మయం పురుషవిశేషం కటికౌశేయాంబరధర మురసి విలసచ్ఛ్రీవత్సలలామం దరవరవనరుహవనమాలాచ్ఛూర్యమృతమణిగదాదిభి రుపలక్షితం స్ఫుటకిరణప్రవరమణిమయమకుటకుండలకటకకటిసూత్రహారకేయూరనూపురా ద్యంగభూషణవిభూషితం…” (అధ్యాయం 3; వచనం 3)
(అంతట నాభిరాజుకు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన సాలంకృత చతుర్భుజాలను కలిగి ఉన్నాడు. హిరణ్మయతేజస్సు ఉట్టిపడుతున్న పురుషోత్తమరూపంలో ఉన్నాడు. కటిదేశాన పసిమివన్నె పట్టుపంచెను ధరించాడు. రొమ్మున శ్రీవత్సచిహ్నం మెరుములీనుతున్నది. పాంచజన్య శంఖము, వైజయంతీ వనమాల, సుదర్శన చక్రము, కౌస్తుభ మణి, కౌమోదకీ గద అమృతాయమానంగా విరాజిల్లుతున్నాయి. కాంతులను విరజిమ్ముతున్న మణిమయకిరీటం, చెవులకు మకరకుండలాలు, దండకడియాలు, బాహుపురులు, బంగరు మొలత్రాడు, కాలి అందెలు మొదలైన అంగభూషణాలతో భూషితుడై ఉన్నాడు)
ఈ మూలంలోని “ఆవిష్కృతభుజయుగలద్వయం” అన్నదే గంగనార్యుని అనువాదనంలో “ఆవిష్కృతకాంతచతుర్భుజంబులు” అయింది. తక్కిన దళాలన్నీ సంస్కృతమూలాన్ని యథాతథంగా ఆవిష్కరిస్తున్నాయి. సంస్కృతాంధ్రాలు రెండింటిని సరిపోల్చితే గంగనార్యుని పద్యం భాగవత మూలానికి యథాతథానువాదమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మత్స్యపురాణంలో ఈ ఘట్టంలోని వర్ణన హరిభట్టు పద్యానికి మూలమని ఊహించేందుకు ఏ మాత్రం వీలులేకుండా ఉన్నది. అందువల్ల హరిభట్టు పద్యమే గంగనార్యుని పద్యానికి అనుసరణమని, మత్స్యపురాణ రచనాసమయంలో హరిభట్టు ముందు భాగవత పంచమ స్కంధ పద్యమే నిలిచి ఉన్నదని, గంగనార్యుని పద్యం హరిభట్టు పద్యానికి అనుకరణం కాదని, మనము నిశ్చయింపవచ్చును. హరిభట్టు గంగనార్యుని పై పద్యాన్ని అనుకరింప లేదని; భాగవతమూలాన్ని తానుకూడా పలుమార్లు చదివినందువల్ల అందులో తనకు నచ్చిన ఒక భాగాన్ని మెచ్చి స్వతంత్రంగా అనుసరించాడని వాదించేందుకు వీలులేకుండా ఉభయపద్యాల సంవాదశిల్పమే సాక్ష్యం ఇస్తున్నది. ఈ సాక్ష్యాన్ని బట్టి గంగనార్యుని కాలనిర్ణయం సాధ్యమవుతున్నది.
హరిభట్టు చేసిన మత్స్యపురాణం అనువాదం క్రీ.శ. 1525 నాటిదని, అంతకు మునుపు క్రీ.శ. 1500 నాటికే ఆయన ముందుగా భాగవతంలోని ఏకాదశ – ద్వాదశ స్కంధాలను; ఆ తర్వాత క్రీ.శ. 1520 ప్రాంతాల భాగవత షష్ఠ స్కంధాన్ని పూర్తిచేశాడని విమర్శకులు భావిస్తున్నారు. గంగనార్యుని పంచమ స్కంధం క్రీ.శ. 1500 నాటికి పూర్వమే వెలసి ఉన్నందువల్ల – దానిని చదువుకొన్న హరిభట్టు తన అనువాదానికి పంచమ స్కంధాన్ని చేపట్టక విడిచివేశాడని భావించటం సమంజసంగా ఉంటుంది. కనుక గంగనార్యుని కాలం హరిభట్టు ఏకాదశ స్కంధానువాదానికి కనీసం అయిదు లేదా పదేండ్ల మునుపు – అంటే, క్రీ.శ. 1490 నాటికి పూర్వం అవుతుంది. ఆ ప్రకారం బొప్పరాజు గంగనార్యుడే బమ్మెర పోతన గారికి అత్యంత సమీపకాలికుడు, సన్నిహితుడు అని స్పష్టపడుతున్నది.
పోతన గారి శ్రీమహాభాగవతం క్రీ.శ. 1480 నాటికి పాక్షికంగానైనా ఉత్సన్నమైపోయింది. 5, 6, 11, 12 స్కంధాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తక్కినవి అక్కడక్కడ పాడయ్యాయి. గంగనార్యునికి ఆ విషయం తెలిసి, పోతన గారి పంచమ స్కంధం ప్రతులు లోకంలో లేవని నిశ్చయించుకొన్నాకనే తన అనువాదయజ్ఞానికి ఉపక్రమించి ఉంటాడు. అందువల్ల పుణ్యగంగకు సమీపప్రాంతవాసి అని పెద్దలు భావించినది తర్కసహమే అవుతుంది. పోతన గారి అనువాదం కొంత పంచమ స్కంధంలో ఉన్నదని, గంగనార్యుడు కేవలం లుప్తపూరణం మాత్రమే చేశాడని, పంచమ స్కంధం పూర్తిగా గంగనార్యుని రచన కాకపోవచ్చునని చాగంటి శేషయ్యగారి వంటి కొందరు విమర్శకు లన్నారు. అది కేవలం ఊహ మాత్రమే. అందుకు ఎటువంటి ఆధారమూ లేదు. పోతన గారే తన శిష్యుడైన గంగనార్యునికి ఈ భాగాన్ని అప్పజెప్పి వ్రాయించి ఉండవచ్చుననటమూ భావ్యం కాదు. పోతన గారు అప్పజెప్పి ఉంటే, రచన స్వరూపం ఆయన పర్యవేక్షణలో సాగినట్లుగా లేదు. అంతేకాక పోతన్న గారి ఇతరస్కంధాలలోని పద్యాల అనుకరణలు – మరీ ముఖ్యంగా సప్తమ, అష్టమ స్కంధ పద్యాలకు అనుకరణలు ఇందులో కనుపిస్తాయి. అందువల్ల పోతన్న గారి భాగవతం పరిసమాప్తమై, వారు పరమపదించిన కొంతకాలానికి తర్వాతనే ఈ ఉత్సన్నపూరణం మొదలైనదని ఊహింపవచ్చును. ఈ పంచమ స్కంధం అనువాదానికి శ్రీకారం చుట్టేముందు గంగనార్యుడు తనకు లభించిన పోతన గారి భాగవత భాగాన్ని పూర్ణంగా భావగతం చేసుకొన్నాడు. గురుశిష్యులు ఏకకాలంలో రచనను కొనసాగించివుంటే అది సాధ్యం కాదు.
అందువల్ల క్రీస్తుశకం 1485 – 90ల నడిమి కాలంలో తన అనువాదాన్ని పూర్తిచేసే నాటికి సుమారు 50 – 55 సంవత్సరాల వాడనుకొంటే గంగనార్యుని జీవితకాలం స్థూలంగా క్రీ.శ. 1430(±) – 1490(±) అని నిర్ణయించటం సమంజసంగా ఉంటుంది.
2. పంచమ స్కంధం – అధ్యాత్మయాత్రికులకు దారిదీపం
ఉపనిషత్తులలో వ్యష్టి సమష్టి స్థూల సూక్ష్మ కారణరూపాలైన ఎటువంటి ఉపాధులు లేని శుద్ధచైతన్యము యొక్క స్థితివర్ణన ఉన్నట్లు ఇందులో ప్రత్యస్తమితభేదము (భేదభావాలు నశించినది), సత్తామాత్రము (త్రైకాలికాభేద్యమైన బ్రహ్మసత్త, తత్త్వజ్ఞానం చేత నశించే వస్తుభేదసత్త, అధిష్ఠాన సాక్షాత్కారం చేత తొలగిపోయే ప్రాతిభాసికీ సత్త), వాచామగోచరము (వాక్కులకు అందనిది), స్వసంవేద్యము (అనుభవము చేత తెలిసికొనదగినది) అయిన బ్రహ్మముయొక్క వివరణ విద్యార్థి అరచేతిలో ఉసిరికను పెట్టి దాని రంగును, రుచిని, పరిమాణాన్ని, వస్తుగుణాన్ని సప్రమాణంగా నిరూపించినంత విశదంగా విలసిల్లింది. ఇందులో మహాపురాణ దశలక్షణాలలో ఒకటయిన స్థితి లేదా స్థానము అనే అంశం వర్ణితమయిందని పెద్దలంటారు. స్థితి ర్వైకుణ్ఠవిజయః అని సంస్కృతభాగవతం అంటున్నది. అంటే, లోకంలోని దుష్టశక్తులపై భగవంతుని యొక్క విజయమని అర్థం. భగవంతుని సృష్టిలో మహదాదితత్త్వాల విలసనకు, ఆ తత్త్వగతుడైన జీవుని ఉనికికి స్థితి అని పేరు. జీవునియొక్క ఆ ‘స్థితి’ లేదా ‘స్థానము’నకు నిమిత్తమైన భగవంతుని దుష్టసంహారలీల ఈ స్కంధంలో నోరారా వివరింపబడింది.
లోకద్రోహినరేంద్రా
నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం
బాకల్ప ‘స్థాన’ మయ్యె నవనీనాథా! (2-261)
అని ద్వితీయ స్కంధంలో శుకయోగి పరీక్షిత్తుకు ఈ స్థితిలక్షణాన్ని నిరూపిస్తాడు.
2.1. షట్చక్రోపాసన: విరాట్పురుషతత్త్వం
అద్వితీయమైన బ్రహ్మపదార్థంపైని చిత్తాన్ని నిలిపేందుకు ఉద్దేశించిన ఈ పంచమ స్కంధానికి ఉపాసకుల మతంలో ధారణా స్కంధము అనికూడా పేరున్నది. ధారణ అంటే చిత్తవృత్తిని అదుపులోకి తెచ్చుకొని, ధ్యేయవస్తువుపై ఒకేచోట నిలిపి ఉంచటమని అర్థం. మూలాధారంలో దాగివున్న కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్ళే ప్రక్రియలో శరీరంలోని వివిధచక్రాలకు ఆధారనిలయాలైన మూలము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్రము – ఇత్యాదులలో కాని, బాహ్యములైన విష్ణురూపాలపైని కాని మనస్సును ఏకాగ్రంగా తదాకారవృత్తితో నిలకడగా ఉంచే యోగవిశేషం ఇందులో ఉపదేశింపబడింది. అందువల్ల భగవానుడైన విరాట్పురుషుని స్థూలదేహము యొక్క భౌతికవర్ణన, భూగోళ వర్ణన, ఖగోళ వర్ణన, పాతాళలోక వర్ణన ఈ స్కంధంలో ఎంతో విపులంగా ఉన్నాయి. జీవన్ముక్తివివేకాన్ని కోరి షట్చక్రోపాసన కావించే యోగసాధకులు ఈ లోకాలను ధ్యానధారణలో నిలుపుకొని, విరాట్పురుషతత్త్వావధారణ మూలాన కేవలానుభవానందస్వరూపమైన బ్రహ్మవస్తువును దర్శించాలని దీని తాత్పర్యం.
2.2. జీవుల కర్మఫలవిచారం
పంచమ స్కంధంలో భువనకోశవర్ణన అతివిపులంగా ఉన్నది. ఈ భువనకోశంలో వెలసిన వివిధలోకాలలో సమస్త చరాచరజీవకోటీ నెలకొని ఉన్నది. ఆ జీవకోటి తమతమ ఏయే కర్మఫలంగా ఎటువంటి జీవితం అనుభవింపవలసి ఉంటుందో మనము ఈ స్కంధాన్ని చదివి తెలుసుకోవచ్చు. పూర్వకర్మమనేదొకటి ఉన్నదని, జీవులు పూర్వపు జన్మలలో చేసుకొన్న పుణ్యపాపకర్మలను బట్టి వారివారికి ఆయా సుఖదుఃఖాలు యథాయథంగా నిర్దిష్టసమయాలలో కలుగుతుంటాయని శుకయోగి భాగవతాన్ని బోధిస్తున్న పలుసందర్భాలలో పరీక్షిత్తుకు చెప్తాడు. ఫలానుభవాన్ని గోచరింపజేసేది ఆ మునుపు చేసిన కర్మమేనని, ప్రకృతిబద్ధులు రాగద్వేషాలను అదుపులో ఉంచుకొనకపోతే ముప్పు తప్పదని వివరించాడు. అందువల్ల ఈ స్కంధంలో జీవులాచరించే దుష్కర్మలకు ఫలితమైన నరకలోకాల వర్ణన అతివిపులంగా చేయబడింది. అది చదివినవారు తామంతకు మునుపు చేసిన చెడుపనులకు పశ్చాత్తాపాన్ని పొంది, పాపవర్తనను మాని, భక్తిభావాన్ని అలవరచుకొని సాధుస్వభావులు కావడానికి ఈ వర్ణనమంతా ఉపకరిస్తుంది.
సంస్కృతంలో ఈ పంచమ స్కంధం ఇరవై ఆరు అధ్యాయాల సంక్షేపరచన. అందులో ఉన్న 666 శ్లోకాలు, గద్యాలలో నిడివిని బట్టి శ్లోకాలకంటె గద్యభాగమే ఎక్కువ. శ్లోకాలు వృత్తవైవిధ్యానికి, క్షణక్షణం మారే చిత్రగతులకు పుట్టినిళ్ళు. తెలుగులో ఈ మొత్తం రెండు ఆశ్వాసాలుగా 352 గద్యపద్యాలలో ఇమిడిపోయింది. గంగనామాత్యునికి ఛందోవైవిధ్యం పట్ల ప్రత్యేకాభిమానమేమీ లేనందున తెలుగు కావ్యాలలో సుప్రసిద్ధాలైన చంపకోత్పల శార్దూలమత్తేభ వృత్తాలను; జాత్యుపజాతులలో ఆటవెలది, తేటగీతి, సీసము, కందాలను; ఆశ్వాసాంతాలలో మాత్రం ఒక మాలినిని, ఒక మత్తకోకిలను ఎన్నుకొన్నాడు. భాషలో విశేషప్రయోగాలను చేయలేదు. ప్రాసస్థానంలో రేఫ-శకటరేఫల సాంకర్యం చేయరాదన్న లక్షణకవుల కోవలోనివాడు కాడు. ఆయన దృష్టంతా దురవగాహమైన వేదాంతార్థాన్ని సర్వసుబోధంగా తెలుగుచేయటం పైనే నిలిచింది. జీవవిచారం, కర్మవిచారం, తత్త్వవిచారం, బ్రహ్మవిచారం ఆయనకు అభిమానవిషయాలు.
2.3. జీవులకు వృత్తికల్పన
దుష్టశక్తులపై శ్రీ భగవానుని విజయమైన ‘స్థితి’ని వర్ణించిన తర్వాత శుకయోగి పరీక్షిత్తుకు ‘వృత్తి’ని వివరించి చెప్తాడు. ఈ ‘వృత్తి’ యొక్క నిర్వచనం సంస్కృత భాగవతం పన్నెండవ స్కంధంలో
వృత్తి ర్భూతాని భూతానాం చరాణా మచరాణి చ
కృతా స్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాపి చ. (12. 7. 13)
అని కనిపిస్తుంది. సర్గ విసర్గాలతో ఈ సృష్టిలో వెలసిన చరాచరజీవులూ సంతోషంగా జీవించేందుకు గాను వాటివాటికి అనువైన వృత్తులను కల్పించటం – అని ఈ మాట అర్థం. ఆ వృత్తులలో ఉన్నవారు స్వభావప్రేరణ వల్ల ఆచరించే వివిధశుభాశుభకర్మముల యొక్క ఫలితవిచారం – ముఖ్యంగా అశుభకర్మముల యొక్క విపరీతపరిణామాల విపులమైన చర్చ ఈ స్కంధంలో చేయబడింది.
2.4. పురాణరచనాశిల్పం
కథాప్రసక్తనీయాలైన అంశాలను సాంగోపాంగంగా నిర్వర్ణించటమే గాక, ప్రధానమైన ఇతివృత్తానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధం లేని అనేక గౌణవిషయాలను వర్ణించటం కూడా మహర్షిప్రోక్తములైన పురాణముల రచనాశిల్పంలో ఒక భాగం. అయితే ఆ విషయాలన్నీ పౌరాణికంగా ఎటువంటి పూర్వోత్తరాన్వయమూ లేని నిరాధార రచనలు కావు. భగవదవతారం ఏయే కాలాలలో జరిగిందో, ఆయా కాలాలలోని భగవదంశసంభూతులైన రాజుల వంశాలను సగౌరవంగా వర్ణించటం కూడా వేదవ్యాసమహర్షి రచనాశిల్పంలో భాగమే. అందువల్ల ఈ స్కంధంలో ముమ్మొదట స్వాయంభువ మనువు కాలం నుంచి ఆ యుగసంధికాలం వరకు భూమండలాన్ని పరిపాలించిన అనేకమంది రాజుల పుణ్యచరిత్రలను పేర్కొనటం జరిగింది. నాలుగవ స్కంధంలో స్వాయంభువుని పెద్దకొడుకైన ఉత్తానపాదుని మొదలుకొని, ప్రాచీనబర్హి కాలం దాకా వెలసిన రాజుల కథలను గురించి వివరించిన తర్వాత ఈ ఐదవ స్కంధంలో మనువు రెండవ కొడుకైన ప్రియవ్రతుని వంశక్రమం చెప్పబడింది.
ప్రియవ్రతుడు అన్నగారు ఉత్తానపాదుని వలెనే ధర్మమార్గరతుడై మనువంశరాజులకు ఆదర్శంగా రాజ్యపాలన కావిస్తాడు. పుట్టుకతోనే ఆయనకు మహాపురుషలక్షణమైన శమదమాదిసద్గుణసంపత్తి చేకూరుతుంది. జన్మాంతరసంస్కారం వల్ల వైరాగ్యోదయం కలిగి, నారదమహర్షి వంటి మహాత్ముని ఉపదేశభాగ్యం లభిస్తుంది. నివృత్తిమార్గం లోకి ప్రవేశించినా, రాజధర్మగతుడై ఉంటూనే సంసారబంధాలకు అతీతంగా వర్తించటం నేర్చుకొంటాడు. భువనకోశానికి కేంద్రబిందువుగా ఉన్న జంబూద్వీపాన్ని, దాని చుట్టూ ఇతరద్వీపాలను, సముద్రాలను ఉపకల్పించి, భూతలంలో అనేకానేక నదీపర్వతాలను నెలకొల్పిన పుణ్యాత్మునిగా అతనికి ప్రసిద్ధి కలుగుతుంది. ఒకప్పుడు సూర్యుడు ఆకాశమార్గాన సంచరిస్తున్నపుడు ప్రియవ్రతుడు సూర్యరథాన్ని అనుసరించి తన రథాన్ని నడిపించాడట. అతని రథచక్రాల ఒరపిడి వల్ల నేల చీలి, సముద్రాలు ఏర్పడినట్లు ఈ కథ మనకు చెబుతున్నది. ఆ విధంగా ఏర్పడిన ద్వీపాలు, సముద్రాలను గురించిన విపులమైన వర్ణనం ఈ భాగంలో వస్తుంది.
ప్రియవ్రతుని కొడుకు అగ్నీధ్రుడు – ధర్మసమ్మతంగా, సకల ప్రజానురంజకంగా రాజ్యపాలన చేసినవాడు – చివరికి ఒక అప్సరస సౌందర్యానికి ముగ్ధుడై, ఆమె యందు నాభి అనే మహనీయుణ్ణి సుతునిగా పొందుతాడు. నాభి కాలంలో వైదికకర్మలు నిర్నిరోధంగా కొనసాగుతాయి. భగవదవతారం ఎటువంటి పుణ్యధనుల ఇండ్లలో సంభవిస్తుందో చెప్పటానికి ఈ ఉపక్రమణిక అంతా ఉపకరిస్తుంది.
2.5. శ్రీ ఋషభావతారం, నవయోగుల కథ
నాభిరాజు ఒకప్పుడు వేదోక్తప్రకారం ఒక మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞవేదికపై శ్రీ మహావిష్ణువే సాక్షాత్కరించి, స్వయంగా తాను నాభి యింట జన్మింపగలనని వరాన్ని ప్రసాదించి, తన వాగ్దానం ప్రకారం వారింట ఋషభుడనే పేరిట ఉదయించి, రాజర్షితల్లజు డవుతాడు. ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటూనే మానవులు పరమహంసపదాన్ని చేపట్టవచ్చునని శ్రీ ఋషభావతారం లోకానికి వెల్లడిచేస్తుంది.
ఋషభునికి నూరుమంది కొడుకులు పుడతారు. వారిలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అని తొమ్మిదిమంది పేర్లమీద దేశాలను ఏర్పరించి ఋషభుడు వారివారికి ఆయా దేశాల రాచరికం అప్పగిస్తాడు. ఎనభైఒక్కమంది కొడుకులు బ్రహ్మావర్తంలోని వివిధప్రాంతాలకు వెళ్ళి బ్రహ్మనిష్ఠులై బ్రాహ్మణ్యంలో స్థిరపడతారు. తొమ్మిదిమంది మాత్రం విషయవాసనలకు దూరంగా ఉంటూ అధ్యాత్మవిద్యాసంపన్నులై నవయోగులని ప్రఖ్యాతిని గడిస్తారు. వారిలో పెద్దవాడి పేరు ‘కవి’ కావటం వల్ల వారికి నవకవులని కూడా ప్రసిద్ధి ఏర్పడింది. కంటికి కనుపిస్తున్న ఈ సమస్తభూతసృష్టి ఏ విధంగా ఏర్పడింది? భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహించేవారికోసం వారు లోకసంచారం చేసి, స్థూల సూక్ష్మాత్మకమైన చరాచరవిశ్వమంతా భగవద్రూపమే అని, భగవదన్యమైన వస్తువు వేరొకటి లేదని – ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన ప్రమాణాన్ని చూపిస్తూ ప్రచారం చేస్తారు. భరతవర్షంలో ఆరూఢభక్తుడైన విదేహదేశాధిపతి నిమి సత్త్రయాగం చేస్తున్నప్పుడు వారక్కడికి వెళ్ళి ఆయనకు అధ్యాత్మతత్త్వాన్ని బోధిస్తారు. ఆ కథంతా భాగవతం ఏకాదశ స్కంధంలో సాకల్యంగా వివరణకు వస్తుంది.
నవయోగులలో పెద్దవాడైన కవి రాజుకు ఆత్యంతికక్షేమానికి భాగవతధర్మమొక్కటే సిద్ధిసాధకమని విశదీకరిస్తాడు. కర్మమునందు కర్తృత్వము (ఈ పని చేసినది నేను కాబట్టి కర్త అయినవాని ఫలము నాది), భోక్తృత్వము (జాగ్రత్ స్వప్న సుషుప్తులనే అవస్థలలో భోగకర్తను నేను) అన్న జీవవిచార భావాలు లేనప్పుడు భగవత్ప్రేరణ సిద్ధించి భక్తిమార్గం అలవడుతుందని ఆయన ఉపదేశసారం. ఆ తర్వాత కవి తమ్ముడు రవి నిమిరాజుకు భాగవతుల లక్షణాలను చెబుతాడు. మనస్సు భగవంతునికి సమర్పితమైనప్పుడు జీవునియొక్క వాసనాప్రేరితాలైన కర్మలన్నీ వేయించిన విత్తనాలలాగా అంకురించే శక్తిని కోల్పోతాయని, అందువల్ల కర్మఫలాన్ని అనుభవించేందుకు మళ్ళీ జన్మమంటూ ఉండదని, ప్రారబ్ధం నశించిన తర్వాత భోగ్యావసరం లేక జీవన్ముక్తి కలుగుతుందని వివరిస్తాడు. మూడవవాడు అంతరిక్షుడు విష్ణుమాయ వలన సంసారబంధం కలుగుతున్నదని, ఆ మాయాశక్తి వలన పుట్టిన మహదాదితత్త్వాలు ఆ శక్తి ఉపసంహృతమైనప్పుడు తొలగిపోతాయని అంటాడు. నాల్గవవాడు ప్రబుద్ధుడు రజోగుణపరిణామంగా ప్రవర్తిల్లే అధర్మకార్యమైన దుఃఖనివృత్తికి భక్తి ఒక్కటే కర్తవ్యమని ప్రబోధిస్తాడు. బాహ్యాభ్యంతరాలలో శుచిగా ఉండటం, సాధుజనుల సహవాసం, సాత్త్వికాహారం, స్వధర్మనిష్ఠ, మనోవాక్కాయముల పవిత్రత, సర్వకాల సర్వావస్థలలో కష్టాలను సహింపగల ఓరిమి, బ్రహ్మయజ్ఞనిర్వహణార్థం వేదాధ్యయనం, ఆత్మవంచన పరవంచనలు లేని ఆర్జవం, శీతోష్ణసుఖదుఃఖాదిద్వంద్వాలకు సహిష్ణుత, ఋతుకాల భార్యాసంగమరూపమైన బ్రహ్మచర్యం, త్రికరణశుద్ధిగా ఇతరులను హింసింపకుండటం, తనను బ్రహ్మముగా అనుభవానికి తెచ్చుకొనేందుకు ప్రయత్నించటం, నిత్యసంతుష్టి, భాగవతశాస్త్రమునందు ఆస్తిక్యబుద్ధి, సంచారశీలమైన మనస్సుయొక్క గతిని ప్రాణాయామంతోనూ, ఇహపరాలు రెండింటికీ పనికిరాని వాక్ప్రచారాన్ని మౌనంతోనూ, కర్మచాంచల్యాన్ని కోరికలను నిగ్రహించుకోవటం ద్వారాను నియమింపగలగటం, పాపసంకల్పాలను దరిచేయనీయని అంతఃకరణశుద్ధి, సత్యసంధత మొదలుగా గల భక్తిపరమాదర్శాలను ఉపదేశిస్తాడు. ఆ తర్వాత పిప్పలాయనుడు ముందుకు వచ్చి రాజుకు భగవత్స్వరూపాన్ని ధ్యానించటం ఎలాగో నేర్పి, శరీరగతులు ఆత్మజ్ఞానాన్ని పొంది అహంకారలయాన్ని సాధించటమే పరమార్థసాధకమని ప్రబోధించిన విషయం అచ్చమూ భాగవత విషయతాత్పర్యమే. మాలిన్యం లేని మనస్సులో తప్ప ఆత్మబింబదర్శనం సాధ్యం కాదని ఆయన అంటాడు. పిప్పలాయనుని తమ్ముడు ఆవిర్హోత్రుడు నిమిరాజుకు కర్మయోగాన్ని కరతలామలకం చేస్తాడు. ఇంద్రియజయాన్ని సాధించినవారే కర్మత్యాగానికి అర్హులని బోధిస్తాడు. అహంకారమనే హృదయగ్రంథిని త్రెంచివేసి, సర్వకర్మములను భగవంతునికి సమర్పిస్తే క్రమక్రమంగా నైష్కర్మ్యసిద్ధి కలుగుతుందని, భగవన్మహిమానుభవాన్ని చెందిన ఆత్మనిష్ఠే సన్మార్గమని ఆయన ప్రవచనం. ఆ తర్వాత ద్రమీళుడు ధర్మోద్ధరణార్థం భగవంతుడు వివిధకాలాలలో అవతరించినప్పటి గుణకర్మవిశేషాలను వివరించి, ఆ లీలలను సన్నుతించటం నేర్పుతాడు. తదనంతరం చమసుడు వేదోక్తకర్మలను సాధనాలుగా గ్రహించి వాటి పరిణామస్వరూపమైన ఆనందాన్ని పొందగోరినవారి వివేకస్థితిని, భగవత్ప్రాప్తిమార్గాన్ని విశదీకరిస్తాడు. నవకవులలో చివరివాడు కరభాజనుడు తన అన్నలు పరిపరి విధాలుగా చెప్పిన విషయమంతటినీ ఒక్క ‘భక్తి’ అన్న సద్ధర్మంలో ఇమిడ్చి, భగవంతుని ఆరాధనాపద్ధతులను, యుగయుగాలలో ఆయన మూర్తద్రవ్యాన్ని ఆశ్రయించి క్రియాచరణానికి పూనుకొన్నప్పటికి రూపనామాలను, గుణకర్మలను నిరూపించి, భగవన్నామసంకీర్తన వల్ల మనోమాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో రాజుకు చెబుతాడు. ఏకాదశ స్కంధంలో మనకు వారి అమోఘమైన ఆ దర్శనసారం పరిచయ మవుతుంది.
చిత్రమేమంటే, పంచమ స్కంధం ఆరంభంలో పరీక్షిత్తు శుకయోగిని కర్మబంధాలలో తగుల్కొనక ఆత్మారాములైన ఉత్తానపాద ప్రియవ్రతుల వంటి పుణ్యధర్ములకు సంసారాసక్తి ఏ కారణం వల్ల ఏ విధంగా కలిగిందని అడుగుతాడు. శుకయోగి అందుకు సమాధానంగా మహాపురుషుల జీవితాలలో ఎటువంటి ఎటువంటి ఊహింపరాని ఘటనలు జరుగుతాయో వివరించటం మొదలుపెడతాడు. ఋషభపుత్త్రులను గురించి, ఋషభపుత్త్రులలో నవయోగులను గురించి ప్రస్తావన వచ్చేసరికి అధ్యాత్మశాస్త్రగంభీరిమ వల్ల విషయం విషయాంతరంలోకి దూకుతుందని తెలిసిన శుకయోగి వారి పేర్లను మాత్రం చెప్పి,
“వ. (తొమ్మండ్రును) భాగవతధర్మప్రకాశకు లైరి; భగవన్మహిమోపబృంహితంబు లగు వారల చరిత్రంబులు ముందఱ నెఱింగించెద” (5-1-64)
అని ఈ పంచమ స్కంధంలో వారి గురించి విస్తరింపక తర్వాత చెబుతానని విషయాన్ని అప్పటికి దాటవేస్తాడు. మహాపురుషులకు భవబంధాలు ఎట్లా కలుగుతాయి? అని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెబుతాడు. అంతటితో శుకయోగి ఆ విషయాన్ని మర్చిపోతాడని మనమనుకోకూడదు. ఆ తర్వాత ఎప్పుడో ఏకాదశ స్కంధంలో వాసుదేవ నారద సంవాదం వచ్చినపుడు ఆకస్మికంగా ఈ నవయోగుల ప్రస్తావనను తెస్తాడు. నారదుడు విదేహదేశపు రాజు నిమికి ఋషభపుత్త్రులు చేసిన పరమార్థోపదేశాన్ని వివరించినట్లుగా చెబుతూ శుకయోగి ‘తర్వాత చెబుతా’నని ఈ పంచమ స్కంధంలో అన్నమాటను గుర్తుంచుకొని నవయోగుల కథనప్పుడు సవిస్తరంగా చెబుతాడు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే – ఎక్కడి పంచమ స్కంధం! ఎప్పటి ఏకాదశ స్కంధం! భాగవత కర్త కథాకథనంలోని చిన్న చిన్న విషయాలను కూడా ఏ మాత్రం మర్చిపోకుండా ఎంత శ్రద్ధగా గుర్తుంచుకొని పూర్వోత్తరాలను ఎంత సమయోచితంగా అనుసంధిస్తాడో ఈ సన్నివేశాన్ని బట్టి పాఠకులు సులభంగానే గ్రహిస్తారు. పోతనగారి భాగవతం ఎంత దురుద్ధరమైన స్థితిలో మన చేతికందినా, పంచమ స్కంధాన్ని తెలుగుచేసిన బొప్పరాజు గంగన కాని, ఏకాదశ స్కంధాన్ని పరిపూర్ణించిన వెలిగందల నారయ కాని ఈ విషయంలో తొట్రుపడక జాగరూకులై ఉండటం విశేషం.
మళ్ళీ ప్రకృతకథకు వద్దాము. ఋషభుడు సలక్షణంగా రాజధర్మాన్ని నిర్వహించి, పరమార్థవిదుడై అంత్యకాలంలో పరమహంస జీవితం గడుపుతాడు. ధర్మతత్పరు లైనవారు ఆయన జీవితోదంతాన్ని, బోధనల సారాన్ని ఈ స్కంధంలో తప్పక తెలుసుకోవాలి. జైన మతస్థులు కూడా తమ అధ్యాత్మగురువులైన తీర్థంకరులలో ఒకరిగా శ్రీ ఋషభాచార్యులను పరిగణించటం విశేషం. భారతీయధర్మంలో వెలసిన వివిధ మతాల తులనాత్మకపరిశీలన కావించేవారు వీరిరువురి బోధనలను తప్పక అధ్యయనం చెయ్యాలి.
2.6. జడభరతుని కథ: భక్తితత్త్వం
ఋషభదేవుని సుతులందరిలో పెద్దవాడు అతని తర్వాత రాజ్యానికి వచ్చిన సుప్రసిద్ధుడు భరతుడు. ప్రజానురంజకుడైన ఆ రాజు పేరుమీదుగా అప్పటి వరకు అజనాభవర్షమని పిలువబడుతున్న భూమిభాగానికి భారతవర్షమని సరికొత్తగా వ్యవహారం ఏర్పడింది. సార్వభౌముడై దేశాన్ని ఒక్క గొడుగు క్రింద పరిపాలించి, ముసలితనం వచ్చాక అతను రాజధర్మానుసారం వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. మనోలయానికి అడ్డు నిలిచే బంధహేతువులైన సర్వసంగాలను త్యజించి, తపోదీక్షను గైకొన్న ఆ మహానుభావుడు అంత్యకాలం సమీపించిన చివరి రోజులలో కర్మవశాన మళ్ళీ బంధాలలో చిక్కుకొని, ఒక జింకపిల్ల పైని మమకారం పెట్టుకుని, అదే ప్రాణంగా జీవిస్తూ, ఆ బంధం వల్ల ఉత్తరజన్మలో హరిణమై పుడతాడు. ఆ విధంగా జననమరణాల చక్రభ్రమణంలో కొట్టుమిట్టుకులాడి, కొంతకాలానికి మళ్ళీ మనుష్యజన్మను పొందిన తర్వాత – కర్మలన్నీ ఫలకారణాలేనని గ్రహించి, కర్మారంభాన్ని కూడా విడిచిపెట్టి, నిష్కామజడత్వాన్ని అవలంబించి, జడభరతుడని పేరుపొందుతాడు.
ఒకనాడు తన ప్రాంతానికి వచ్చిన రహూగణుడనే రాజుకు భరతుడు పరమార్థసారాన్ని, జీవేశ్వరుల తత్త్వాన్ని వివరించటం ఈ స్కంధంలో పరమగంభీరంగా అమరింది. విష్ణుపురాణంలోని రెండవ అంశంలోనూ ఈ జడభరతోపాఖ్యానం ఒక గంభీరమైన భాగం. డా. వేదుల సూర్యనారాయణ శర్మగారు తమ గొప్ప రచన అంతరార్థభాగవతములో ఈ సన్నివేశం అంతరార్థాన్ని అద్వైతపరకంగా వివరించారు:
“ఈ కథ కర్మవాసనలు ఎట్లు పరిణమిస్తాయో విప్పిచెప్పింది. పుణ్యకర్మలతో ముక్తిసాధనలు నడిపినవారు కూడా చివరకు ఏదో ప్రబలమైన కర్మవాసనచే తిరిగి జన్మం పొందుతారనీ, మృగంగా పుట్టిన జన్మలో కూడ పూర్వజన్మజ్ఞానంతో తరించడం జరుగుతుంటుందని, అసంగయోగం ఒక్కటే కర్మవాసనలు నశింపు చేయగలదనీ, అసంగయోగం జీవితాంతం వరకూ నడిపినపుడు మరణకాలంలో జన్మవాసనలేవీ స్ఫురింపవనీ, అదే మోక్షహేతువానీ, ముక్తిమార్గానికి అసంగయోగ ప్రాధాన్యాన్ని వివరించడమే ఈ కథాకల్పనకు కారణంగా గమనించాలి. అసంగయోగం వల్ల జ్ఞానావిర్భావమూ, జ్ఞానావిర్భావం వల్ల అసంగయోగమూ లభించడానికి పరస్పరకారణాలుగా తెలిసికొని అసంగంతో జ్ఞానాన్ని, జ్ఞానంతో అసంగతత్త్వాన్ని అలవరచుకోవాలి.
భరతుడంటే జీవుడు. భరత అంటే బరువు యొక్క భావం అని అర్థం. భారం వహించడం అన్నమాట. భరత కలవాడు భరతుడు అవుతాడు. వాసనాభారం వహించిన జీవుడు ఇచ్చట భరతుడుగా చెప్పబడ్డాడు. భరతుడు రెండు జన్మలలోను భరతుడుగానే పేరు పెట్టబడ్డాడు. దానినిబట్టి భరత శబ్దానికి అంతరార్థంవుందనీ, వాసనాభారం వహించే జీవుడని దానికి అంతరార్థమనీ తెలిసికోవాలి. రెండవజన్మలో అంగిరసుడు అనేవాడు భరతుని తండ్రి. అంగము అనేదే స్వార్థంలో అణ్ ప్రత్యయం చేస్తే దేహము అనే అర్థంలో అంగము అవుతుంది. అంగము అంటే దేహం అన్నమాట. అంగము కలది అంగీ అని అవుతుంది. రసం అంటే జన్మనిచ్చే వాసన అని అర్థం వుంది. కాన దేహధారణకు కారణరూపమైన వాసనయే అంగీరసుడంటే. ఆ వాసనారూపం వల్లనే జీవుడు పుట్టేడు. అతడే భరతుడనే అంతరార్థం ఇందులో వస్తుంది. ఇదే అంగీరసుని పుత్రుడు భరతుడన్న కథావాక్యానికి అంతరార్థంగా భావించాలి.
అంగీరసునకు ఇద్దరు భార్యలు. అనగా అపరాశక్తి, పరాశక్తి. వాసనలు రెండు రకాలు. తిరిగి తిరిగి జన్మనిచ్చేవి ఒక రకం వాసనలు. అవి అపరాశక్తివి. ముక్తినిచ్చే సత్కర్మవాసనలు మఱొక రకం. అవి పరాశక్తివి. మొదటిది ప్రవృత్తిమార్గం కలది. రెండవది నివృత్తిమార్గం కలది. అంగిరసునికి మొదటి భార్యవల్ల తొమ్మండుగురు బిడ్డలు కల్గేరు. అంటే అపరాశక్తి వల్ల నవవిధములైన రసములు పుట్టేయన్నమాట. అవే కర్మవాసనాప్రాబల్యం కల్గి ‘పునరపి జననం పునరపి మరణం’ కల జన్మపరిభ్రమణం ఇచ్చే నవరసాల కర్మలు. అవి అపరాశక్తి యొక్క ప్రవృత్తిమార్గం వల్లనే కల్గుతాయనేదే అంగీరసునికి ప్రథమభార్య యందు తొమ్మండుగురు కొడుకులు పుట్టేరన్నదాని అంతరార్థంగా భావింపవచ్చు. అంగీరసుని రెండవ భార్య అనగా పరాశక్తి యొక్క మార్గం. వెంటనే ఆ జన్మలోనే ముక్తినివ్వగల సత్కర్మవాసనలు దానివల్ల ఫలిస్తాయి. ఆమెవల్ల పురుషుడు, స్త్రీ పుట్టేరు. పురుషుడు అంటే జీవుడు తనలోనికి చేర్చుకొనే పరమాత్మ. స్త్రీ అంటే ఆ పరమాత్మ వుండటానికి కారణమైన జీవునియొక్క సాత్త్వికగుణ ప్రకృతి అని అంతరార్థం. ప్రకృతిపురుషవివేకంతో ఆ జన్మలో సత్కర్మవాసనా నాశం కల్గి ముక్తి లభిస్తుందని చెప్పడానికే ముక్తి నొందవలసిన భరతుడు అంగీరసుని రెండవ భార్యకు అనగా పరాశక్తికి పుత్రుడుగా పుట్టేడని చెప్పడం జరిగింది. అంగీరసుని మొదటిభార్య బిడ్డలు భరతుని ఆదరించలేదని చెప్పడం, అపరాశక్తికి సంభవించిన ఐహికములైన వాసనలేవీ భరతుణ్ణి అంటియుండలేదని చెప్పడమే అని భావించాలి.” — (1999 నాటి ముద్రణ: పుటలు. 94 – 95)
ఈ జడభరతోపాఖ్యానం భాగవత పంచమ స్కంధంలోని ముఖ్యఘట్టాలలో ఒకటి. ఇందులోని ప్రతీకలను శంకర – మధ్వ – రామానుజుల అద్వైత – ద్వైత – విశిష్టాద్వైత దర్శనాల సారాన్ని అనుసరించి వ్యాఖ్యాతలు వివిధరీతుల విపులంగా వివరించారు. ఆ వివరణకు వారు ప్రమాణీకరించిన ఉపనిషద్వాక్యావళిని పాఠకులు శ్రద్ధాసక్తులతో సమన్వయించుకొని, నిత్యానుసంధానంలో మననం చేయవలసి ఉంటుంది. అదీగాక ఆ వ్యాఖ్యలను బట్టి పాఠకులకు శ్రీమద్భాగవతాన్ని సాధకులు ఎన్ని విధాలుగా దర్శింపవచ్చునో తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అతిగహనమైన వేదాంతసారాన్ని బోధిస్తూ అద్భుతమైన సంవిధానశిల్పంతో ఎంతో ఆకర్షణీయంగా రచింపబడిన ఖండం ఇది.
2.7. భువనకోశ వర్ణనం
మనువంశ రాజుల కథాకథనం తర్వాత ప్రధానంగా ఇందులో భువనకోశపు స్వరూపవర్ణన ఉన్నది. ఆధునికవిజ్ఞానశాస్త్రంతో పరిచయం ఉన్న పాఠకులకు ఇందులోని భూగోళ ఖగోళ విజ్ఞానాల స్వరూపమంతా శాస్త్రదృష్టి లోపించిన కట్టుకథే కాని కంటికి కనిపించే భౌతికసత్యం కాదన్న అపార్థం కలిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రసక్తమైనది కేవలం ఐహికదృష్టితో కావించిన వర్ణన కాదని మనము గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించినవాడు కనుకనే పరీక్షిత్తు ఈ సన్నివేశంలో –
“గుణమయంబును, స్థూలరూపంబును నైన శ్రీహరి శరీరం బగు నీ లోకంబునందు నిలిపిన చిత్తం బగుణం బగు; సూక్ష్మంబును, నాత్మజ్యోతియు, బ్రహ్మంబు నైన వాసుదేవుని యందు నిల్చు.” (5-2-14)
అని శుకయోగితో అంటాడు. సత్త్వరజస్తమస్సులతో కూడిన ఈ సమస్తవిశ్వం ఆ విశ్వాత్ముని యొక్క స్థూలరూపమని భావించి, ఆ స్థూలరూపంలో గోచరిస్తున్న అద్భుతావహమైన సౌందర్యాన్ని, మహిమను ధ్యానంలో ధారణ చేసినట్లయితే, శ్రీ వాసుదేవుని సర్వాంతర్యామితను స్వానుభవంలో అర్థం చేసికొని, ఆ పరమేశ్వరుని సూక్ష్మతత్త్వాన్ని దర్శించటం సాధ్యమవుతుంది. సకలలోకోత్తరుడని మనము భావిస్తున్న ఆ భగవానుని ఉనికి కల్పితమాత్రం కాదని; కేవలసత్యమని తెలియజెప్పడమే ఈ సన్నివేశ వర్ణనలోని అంతరార్థం. నిర్గుణమైన ఆత్మతత్త్వాన్ని తంత్రమార్గంలో తెలుసుకొనగోరినవారు ప్రాథమికదశలో యంత్రాలకిచ్చే ప్రాధాన్యం ఎటువంటిదో, భువనకోశవర్ణనలో భూగోళస్వరూపానికి ఉన్న ప్రాధాన్యం కూడా అంతే. ఇదంతా ధ్యానానికి కూర్చున్న సాధకుల కోసం.
2.8. సాధనరహస్యం
భగవత్తత్త్వరహస్యాన్ని తెలుసుకోవటం అంత సులభం కాదు. ఎక్కడో ఏదో చదివినంత మాత్రాననో, ఎవరో ఏదో చెబితేనో అది బోధపడదు. అందుకే దానిని కేవలానుభవానందస్వరూపం అన్నారు. ఈశ్వరుని శక్తివిలాసం ఎంత ఇంద్రియాతీతమో అంత ఇంద్రియానుభవయోగ్యం. గురువు యొక్క సదుపదేశాన్ని పొంది, సాధన మొదలుపెట్టి, ఈ భువనాల స్వరూపాన్ని ధ్యానిస్తుంటే క్రమంగా ఈశ్వరుని దివ్యశక్తి మానవమనోమందిరంలోకి ప్రవేశిస్తుందని శ్రీమద్భాగవతం బోధిస్తున్నది. విశ్వరూపాన్ని గ్రహించి అటువంటి దివ్యానుభవాన్ని సాధించిన సాధకులే సిద్ధులు. ఆ సిద్ధి సాధనకోసమే భాగవతాన్ని శుకయోగి పరీక్షిత్తుకు వినిపిస్తాడు. లేకపోతే, నిర్విక్రియుడైన శుకమహర్షి స్వయంగా తానై వచ్చి వినుపింపగోరటం ఏమిటి? శాపగ్రస్తజీవితాన్ని గడుపుతూ, ప్రాయోపవేశం చేసి, కర్మావధికోసం ఎదురుచూస్తున్న పరీక్షిత్తు ఆ విశ్వరూపుని కథను మనసారా వినటం ఏమిటి? స్వరబ్రహ్మభూషితమైన వాగ్వీణపై వేదవ్యాసమహర్షి ఆ ఆత్మసంగీతాన్ని మనకోసం శ్రవణపర్వంగా మ్రోగించటంలోని అంతరార్థం ఏమిటి? శ్రవణ మననాదుల యందు శ్రద్ధావంతులైన సాధకులకు, భాగవతధర్ములకు రమ్యమైన కథాతత్త్వముఖంగా బ్రహ్మోపపదేశమే.
ఈ పంచమ స్కంధమంతా భగవంతుని స్థూలరూపాన్ని ధ్యానమార్గంలో దర్శించి, స్వప్రకాశానందమయమైన ఆయన సూక్ష్మరూపాన్ని స్వానుభవంలో తెలుసుకొనగోరిన సాధకుల మననధారణ కోసమే తప్ప కేవలం భూగోళ ఖగోళ విజ్ఞానాలను సమీకరించాలనే ఐహికదృష్టి శుకయోగికి లేదు. ఆ విధమైన ధ్యానధారణ వల్ల శుద్ధము (ఎన్నడూ ఎటువంటి దోషాలూ లేని ఆత్మము యొక్క స్వస్వరూపం), బుద్ధము (బోధరూపమైనది), ముక్తము (బంధాలకు అతీతమైనది), కేవలము (అద్వితీయమైనది), అఖండము (అనంతము, అఖిలాత్మకము అయినది), సచ్చిదానందస్వరూపము (నిత్య జ్ఞాన సుఖైక స్వరూపమైన బ్రహ్మము) అయిన భగవత్తత్త్వాన్ని గ్రహించినవారికి – స్థూలరూపం నుంచి సూక్ష్మరూపంలోకి ప్రవేశింపజేసే సాధనరహస్యం అర్థమవుతుందని ఆయన ఉద్దేశం.
2.9. నరకలోకాల వర్ణన
పంచమ స్కంధం చివర వివిధ నరకలోకాల వర్ణనం ఉన్నది. నరకము అంటే నృ = మానవులయొక్క, అక = పాపముల ఫలితాన్ని అనుభవించటానికి విధింపబడిన భోగస్థానమన్నమాట. ఆ నరకములు అనేకప్రకారాలుగా ఉంటాయి. వాటిలో ఇరవైఎనిమిదింటి వివరణ ఈ స్కంధంలో చేయబడింది. అవన్నీ వివరణమాత్రానికే గాని చేసికొన్నవారికి చేసికొన్నంత ఫలితం. ఆ లోకాలన్నీ యాతనాభూములు. అక్కడ కేవలం జీవుల యొక్క పాపాలకు శిక్ష విధించటం ఒక్కటే ఉద్దేశం కాదు. లోకంలో ప్రతిషిద్ధలక్షణమైన అధర్మాన్ని కావించేవారి శ్రద్ధావైసాదృశ్యం బహురీతులుగా ఉన్నట్లే, వారికి కలిగే కర్మఫలాలు కూడా బహురీతులుగా ఉంటాయి. అనాదిసిద్ధమైన అవిద్య వలన కామనలు చెలరేగి పాపకర్మలను చేయించినప్పుడు, అందుకు పరిణామంగా సిద్ధించే ఫలాలను అనుభవించటం వల్ల జీవునికి మళ్ళీ చిత్తపరిశుద్ధి, నైర్మల్యం కలుగుతాయి. అందుచేతనే ఆనాటి పౌరాణికులు యాతనానుభవంలో మనస్సును పశ్చాత్తాపతప్తం కావించి, ఆ పాపసంకల్పాలు మళ్ళీ తలయెత్తకుండా ప్రక్షాళింపగల మహాశక్తి ఉన్నదని నిశ్చయించారు. ఆ విధంగా దుష్కర్మఫలాన్ని అనుభవించిన జీవునికి మళ్ళీ సన్మార్గంలోకి ప్రవేశించి, ఆత్మౌన్నత్యాన్ని సాధించేందుకు మరొక అవకాశం లభిస్తుంది. అందుచేత దోషకర్మకు ప్రాయశ్చిత్తంగా కష్టాలను విధించటం జరిగింది.
3. శ్రీరామాంకితమా? శ్రీకృష్ణాంకితమా?
పోతనగారు తెనుగుచేసిన భాగవతం శ్రీరామచంద్రునికి అంకితమైంది. “పలికించెడువాఁడు రామభద్రుం” డని పోతనగారు తానే ప్రథమ స్కంధం అవతారికలో (1-16) చెప్పుకొన్నారు. భాగవతం ప్రథమ స్కంధాంతంలోనూ, ద్వితీయ స్కంధం మొదలుకొని ద్వాదశ స్కంధం వరకు గల స్కంధాది స్కంధాంతాలలో ఉన్న పద్యాలన్నీ – ఒక్క ఈ పంచమ స్కంధంలోనూ, ఏర్చూరి సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప – అన్నీ శ్రీరామాంకితం గానే ఉన్నాయి. ప్రథమ స్కంధం మొదట గల ఇష్టదేవతాప్రార్థనలో శ్రీరామస్తుతిని గల పద్యాలు లేవు. ప్రథమ స్కంధంలోని తొలిపద్యం శ్రీకృష్ణాంకితంగా ఉన్నది. అవతారికాలోని అంకితం పద్యాలు శ్రీకృష్ణాంకితంగా ఉన్నాయి. పోతనగారికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించి –
“మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబు దెనుంగు సేయుము; నీకు భవబంధంబులు దెగు” (1-15)
అని ఆనతిచ్చేంతవరకు ఆయనకు శ్రీరామచంద్రార్పణం చేయాలన్న ఉద్దేశం రాలేదేమో అనుకోవాలి. ఆ మహాకవి చిత్రించిన నాటకీయమైన అవతారికలోని సన్నివేశకథనానికి లోగిన విమర్శకులు కృతిరచన పూర్తయిన తర్వాత కృత్యాదిరచన జరిగినందువల్ల పెక్కు మార్పులు చోటుచేసుకొన్నాయేమో అన్న అంశాన్ని పరిశీలించినట్లు కనబడదు. అవతారికను బట్టి భగవత్సాక్షాత్కారం జరిగిన తర్వాతనే ఆయన కృతిరచనకు శ్రీకారం చుట్టాడని నిశ్చయించాలి. కృతిరచనకు, కృత్యాదిరచనకు నడిమికాలంలో తనకు అంకితం చేయమని అడిగిన రాజును ధిక్కరింపవలసివచ్చిందేమో. మనుజేశ్వరాధములను తిరస్కరింపవలసివచ్చిందేమో. అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఓరుగల్లుపై మహమ్మదీయుల దండయాత్ర మరికొంత కాలానికి జరిగి స్కంధాల విధ్వంసానికి మరింత దోహదమయిందేమో చెప్పలేము. అందదుకులుగా ఉన్న అవతారికను వ్రాతప్రతులతో మళ్ళీ ఒకసారి సరిపోల్చి పునఃపరిష్కరిస్తేనే గాని భాగవతకావ్యస్వరూపాన్ని గురించి నిర్ధారణగా ఏ సంగతీ చెప్పటానికి వీలులేకుండా ఉంది.
భాగవతం ఆద్యపద్యం శ్రీకృష్ణస్తుతి. స్కంధాద్యంతపద్యాలలో శ్రీరామాంకితం కాని పద్యాలు గంగనార్యుని ఈ పంచమ స్కంధంలోనూ, సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప మరెక్కడా లేవు. సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోని తొలిపద్యంలోని విశేషణాలు లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువును ప్రతిపాదిస్తున్నాయి. వాటిని శ్రీరామాంకితంగా అన్వయించటం సమంజసంగా ఉండదు. పోతనగారి వలెనే ఏర్చూరి సింగన తొలిపద్యాన్ని శ్రీకృష్ణాంకితం గానూ, స్కంధాంతంలో శ్రీరామాంకితం గానూ పద్యాలను కూర్చాడనుకోవాలి. షష్ఠస్కంధం చివర “రాజీవరాజపూజా, శ్రీజిత గోపీకటాక్షసేవాంతరవి, భ్రాజితమూర్తి! మదోద్ధత, రాజకులోత్సాద! రామరాజాఖ్యనిధీ!” అని ఉన్న (6-527) పద్యంలోని రామరాజాఖ్యనిధీ! అని ఉన్న దళాన్ని బట్టి ఆ స్కంధాంతపద్యాలను శ్రీరామాంకితంగా అన్వయించుకొంటే పోతనగారి మార్గం అప్రతిహత మైనట్లవుతుంది. కొన్ని వ్రాతప్రతులలో షష్ఠ స్కంధం మొదట “శ్రీ విశ్వభారభరణ, ప్రావీణ్యవిభాసమాన ఫణిరాణ్ణిభబా, హావిపులవిజయదోహల, రావణమదకరిమృగేంద్ర! రామనరేంద్రా!” అన్న అద్భుతావహమైన పద్యమొకటి ఉన్నది కాని, అది పోతనగారి మార్గానుసారి కాదని కాబోలు, పరిష్కర్తలు దానిని స్వీకరింపలేదు. మునుపే చెప్పినట్లు పోతనగారి ప్రథమ స్కంధంలోని తొలిపద్యం, అవతారికలోని షష్ఠ్యంతాలూ శ్రీకృష్ణాంకితంగా ఉన్నాయి. ప్రథమ స్కంధం చివరి నుంచి పద్యాలు శ్రీరామాంకితంగా ఉన్నాయి. ఈ పంచమ స్కంధం వ్రాతప్రతులు పెక్కింటిలో ఆశ్వాసాదిపద్యం శ్రీకృష్ణపరం గానూ, కొన్నింటిలో మాత్రం శ్రీరామపరం గానూ ఉన్నది. శ్రీరామపరంగా ఉన్న ఆ పద్యంలోని విశేషణాలు కొంత ప్రాథమికంగానూ, ఆ రచన కొంత కృతకంగానూ కనుపించటంవల్ల గంగనార్యుడు తన వంతు భాగవతభాగాన్ని శ్రీకృష్ణాంకితం చేశాడనే పూర్వముద్రణల పరిష్కర్తలు నిర్ణయించారు.
శ్రీకర! కరుణాసాగర!
ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా! (5-1-1)
ఇది పంచమ స్కంధంలోని మొదటి ఆశ్వాసంలోని తొలిపద్యం. సలక్షణంగా ఉన్నది. దీని స్థానంలో –
శ్రీసీతానయనోత్పల!
శ్రీసతిసహజన్మ! త్రిదశసేవిత! యాశా
వాసప్రకాశ! జయ భా
షాసురపతిహరణ! రామచంద్రనృపాలా!
అని కొన్ని కొన్ని వ్రాతప్రతులలోని పద్యం. ఎవరో పద్యరచనలో అకృతకృత్యులైన సామాన్యుల కూటరచనమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. దీనిని ప్రమాణంగా స్వీకరించటం కంటె గంగనామాత్యుడు తన పంచమ స్కంధాన్ని శ్రీకృష్ణాంకితం చేశాడనే భావించటం మేలు.
ద్వితీయాశ్వాసం చివరను –
జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా! (5-2-163)
శ్రీతరుణీహృదయస్థిత!
పాతకహర! సర్వలోకపావన! భువనా
తీత! గుణాశ్రయ! యతివి
ఖ్యాతసురార్చితపదాబ్జ! కంసవిదారీ! (5-2-164)
దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండమండలమధ్యసంస్థిత! తత్త్వరూప! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలోద్ధర! ణార్తపోషణ! మత్తదైత్యనివారణా! (5-2-165)
అన్న పద్యాలున్నాయి. ఇవి శ్రీకృష్ణాంకితాలు. వీటిలో మొదటి పద్యం కొన్ని వ్రాతప్రతులలో –
జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!
అన్న రూపంతోనూ, చివరి పద్యం –
దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండవంశసుధాబ్ధిపూరసుధామయూఖ! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలేశ! నతార్తిపోషణ! మత్తదైత్యనివారణా!
అన్న మార్పుతోనూ శ్రీరామాంకితంగా ఉన్నాయి. రెండవ పద్యం ఏ మార్పూ లేకుండా శ్రీకృష్ణస్తుతిపరకంగానే ఉన్నది. ఎందువల్లనో శ్రీకృష్ణాంకితంగా ఉన్న పద్యాలూ, శ్రీరామాంకితంగా ఉన్న పద్యాలూ రెండూ సంతృప్తికరంగా లేవు. ఉన్నంతలో ఏదో ఒక అర్థం చెప్పుకొని సరిపెట్టుకొనవలసినట్లే ఉన్నాయి కాని, మహాకవిరచితాలుగా కనబడవు. “ఉ,జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ!” అన్నప్పుడు ఉజ్జ్వల = ప్రకాశమానమైన, తులసీ = తులసి మాల యొక్క, కురంగమద = కస్తూరీమృగమదము యొక్క, వాసన = వాసనము (సురభీకరణము, గుబాళింపు) చేత, వాసిత = పరిమళిస్తున్న, దివ్య = మనోహరమైన, దేహ = శరీరము గల స్వామీ అని అర్థం చెప్పుకోవాలి. మొదటి పద్యంలో “జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత!” అన్న తర్వాత, వెంటనే ఆ రెండవ పద్యంలో పునఃకథితంగా “అతివిఖ్యాతసురార్చితపదాబ్జ!” అనటం సముచితంగా లేదు. శ్రీకృష్ణార్థంలో “శ్రీనిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా!” అన్నదాని కంటె శ్రీరామాంకితంగా ఉన్నప్పటి “శ్రీనిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!” అన్న దళమే కొంత భావశుద్ధితో సమంజసంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణాంకితంగా శ్రీ = లక్ష్మీదేవికి, నిలయ = ఆవాసమైన, శరీర = తనువు గలవాడా, కృష్ణ = శ్రీకృష్ణా, ధరణీధర = భూదేవిని వక్షఃస్థలమున ధరించిన స్వామీ అని విడదీయటమూ, ఆ సమస్తభిన్నమైన రూపచిత్రమూ సరిగా లేవు. అంతకంటె, శ్రీనిలయ = శ్రీదేవీస్వరూపిణి అయిన సీతాదేవికి ఆవాసస్థానమవైన ప్రభూ, నిశాచరేంద్ర = రాక్షసరాజు లనెడి, ఘననీరద = దట్టంగా కమ్ముకొన్న మబ్బులకు, మారుత = తూలగొట్టే వాయుదేవుడ వైనవాడా అని శ్రీరామపరంగా అర్థం చెప్పుకోవటం సులభం. రెండింటిలో ఏ పాఠాన్ని తీసుకొందామన్నా ఆ వెంటనే ఉన్న (5-2-164) పద్యంలోని “శ్రీతరుణీహృదయస్థిత” అన్న సంబుద్ధి కొంత చర్చనీయం. ఇందాక శ్రీదేవికి ఆవాసమైన అన్నాడు కాబట్టి, ఇప్పుడు శ్రీదేవి హృదయంలో నెలకొన్నవాడు (ఆమె తన శరీరమందు, తాను ఆమె హృదయమునందు ఉన్న దంపతులు వారు) అని భావించాలి. “పాతకహర! సర్వలోకపావన!” అన్నదీ సరిగా లేదు. ఈ పంచమ స్కంధంలో వివిధపాపాలను చేసినవారికి భోగస్థానములైన వివిధనరకాల విపులవర్ణన ఉన్నది కాబట్టీ, శ్రీమన్నారాయణుని నామసంకీర్తనం సర్వపాపాలను హరింపజేస్తుందన్న ప్రస్తావం ఉన్నది కాబట్టీ “పాతకహర!” అన్న శ్రీకృష్ణసంబోధన సార్థకం గానే ఉన్నది కాని, ఆ వెంటనే సర్వలోకాలను పవిత్రీకరించేవాడా అర్థంలో “సర్వలోకపావన!” అన్న పునరుక్తి ఏ మాత్రం సమంజసంగా లేదు. పైగా మొదటి ఆశ్వాసం మొదటి పద్యంలోని “లోకాతీత! గుణాశ్రయ!” అన్నదే ఇందులో “భువనాతీత! గుణాశ్రయ!” అని పునరావృత్తమయింది. వ్రాతప్రతులను మళ్ళీ ఒకసారి తైపారువేసి పాఠాలన్నింటిని సమీకరించి సరిచూస్తే కాని సరైన పాఠమేదో, గంగనామాత్యుని రచన ఏదో తెలియరాని అస్తవ్యస్తపరిస్థితి నెలకొని ఉన్నది. పోతనగారి వలె ఆశ్వాసాదిని శ్రీకృష్ణాంకితం గానూ, ఆశ్వాసాంతంలో శ్రీరామాంకితం గానూ సరిచేయాలని తొలిరోజులలోనే ఎవరైనా ప్రయత్నించారేమో! అనుకొనవలసి వస్తున్నది. ప్రస్తుతస్థిత్యనుసారం అర్థావగతిని బట్టి బొప్పరాజు గంగనామాత్యుని పంచమ స్కంధం శ్రీకృష్ణాంకితమని అనుకోవటమే మేలు.
4. ఏకాశ్వాసమా? రెండాశ్వాసాలా?
ఈ చిన్ని స్కంధాన్ని ఏకాశ్వాసంగా నిలపటం కంటె రెండాశ్వాసాలుగా విభజించటం వల్ల కథాప్రణాళికకు చేకూరే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు. ఏకాశ్వాసంగా ఉండటమే సమంజసమనిపిస్తుంది. ఐనా, పరిష్కర్తలు దీనిని రెండాశ్వాసాల రచనగానే ముద్రించారు.
కథాభాగాన్ని చూస్తే అగ్నీధ్రుని మొదలుకొని జడభరతుని వరకు గల కథాభాగం మొదటి ఆశ్వాసంగా 184 గద్యపద్యాలలో ఉన్నది. రెండవ ఆశ్వాసంలో భరతుని వంశంలో భక్తాగ్రేసరుడైన గయుడనే రాజు కాలం దాకా జన్మించిన రాజులందరి కథలూ సంక్షిప్తంగా ఉన్నాయి. ఆ తర్వాత భూగోళస్వరూపం, నరకలోక వర్ణనం – మొత్తం 168 గద్యపద్యాలు. 1848లో తొలిసారి పూర్తి భాగవతాన్ని ముద్రించిన పురాణం హయగ్రీవ శాస్త్రిగారు మొదలుకొని పరిష్కర్తలందరూ తాళపత్రప్రతులలో ఈ రెండాశ్వాసాల విభాగం లేదని మొదటి ఆశ్వాసంలోని మొదటి పద్యం అధోజ్ఞాపికలో చెబుతూనే వస్తున్నారు. మొదటి ఆశ్వాసం తుదనున్న పద్యాలు మూడు, రెండవ ఆశ్వాసం మొదట ఉన్న పద్యమూ, దాని తర్వాత “సకలపురాణజ్ఞానవిఖ్యాతుం డగు సూతుం డి ట్లనియె” అన్న వచనమూ తాళపత్రప్రతులలో లేవని మళ్ళీ ఎక్కడికక్కడ అధోజ్ఞాపికలలో చెబుతూనే ఉన్నారు. ఆ పక్షాన హయగ్రీవ శాస్త్రిగారు రెండాశ్వాసాల విభాగాన్ని ఎక్కడినుంచి తీసుకొన్నారో, వ్రాతప్రతులలో లేని పద్యాలు వారికెక్కడ దొరికాయో సమాధానం చెప్పటం కష్టం. 1848లో హయగ్రీవశాస్త్రిగారి కంటె మునుపు భాగవతం కొన్ని కొన్ని విడివిడి భాగాలుగా వేర్వేరు పరిష్కర్తలచేత పరిష్కరింపబడి వేర్వేరు చోట్ల అచ్చయింది కాని, ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఈ పంచమ స్కంధం హయగ్రీవశాస్త్రిగారి కంటె మునుపు ఎవరూ అచ్చువేసినట్లు కనబడదు. ఒకవేళ అటువంటిదొకటి ఉన్నట్లయితే, వారెట్లా అచ్చు వేశారో పరిశీలింపగలుగుతాము. అటువంటిదొకటి లేకపోయినట్లయితే హయగ్రీవ శాస్త్రిగారి ముద్రణకు ఆకరమేదో ఇంకా బయల్పడవలసి ఉన్నదనే అనుకోవాలి. పోనీ ఆ పద్యాలేమన్నా అందంగా ఉన్నాయా? అంటే, అదీ సంశయాస్పదమే. ఆ పద్యాలివి:
నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య! దివ్యాంబరా
భరణాలంకృత! భక్తవత్సల! కృపాపారీణ! వైకుంఠమం
దిర! బృందావనభాసురప్రియధరిత్రీనాథ! గోవింద! శ్రీ
కర! పుణ్యాకర! వాసుదేవ! త్రిజగత్కల్యాణ! గోపాలకా! (5-1-181)
పరమపదనాథ! దుష్కృత
హర! కరుణాకర! మహాత్మ! హతదితిసుత! భా
సురగోపికామనోహర!
సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా! (5-1-182)
సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా! (5-1-183)
మొదటి పద్యాన్ని చూద్దాము. నరులు, దేవతలు, యక్షులు, మునీంద్రులచే సన్నుతింపదగినవాడా! అనటం సరే. ఆ నడుమ “అసురులు”, “రాక్షసులు” అంటూ “నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య!” అని అసుర-రాక్షసుల ప్రసక్తి ఎట్లా ప్రవేశించింది? అసుర-రాక్షస పదాల పునరుక్తిలో భేదకధర్మం ఏమిటి? పోనీ, రాక్షసవంశంలో ప్రహ్లాదాది మహాభక్తులు కూడా ఉన్నారని సమాసకల్పనను బట్టి సరిపెట్టుకోవటం ఎలా సాధ్యమవుతుంది? భక్తులయందు వాత్సల్యము కలవాడా అన్న అర్థంలో “భక్తవత్సల!” అన్న వెంటనే “కృపాపారీణ!” అన్న దళం పునరుక్తమే కదా. “బృందావనభాసురప్రియధరిత్రీనాథ!” అంటే భావం ఏమిటి? బృందావనము వలె భాసించే ప్రాణప్రియ అయిన భూదేవికి నాథుడు అని చెబుదామంటే అమహద్వాచకమైన బృందావనము మహతీవాచకమైన భూదేవికి విశేషణం అవుతుంది. అయినా ధరిత్రి బృందావనం కావటమేమిటి? బృందావనమునందు భాసించే ప్రియధరిత్రి అని చెబుదామంటే ధరిత్రి బృందావనంలో భాసించటం ఏమిటి? బృందావనభాసుర = బృందావనంలో ప్రకాశించేవాడా, ప్రియధరిత్రీనాథ = భూదేవికి ప్రియమైనవాడా అన్న అర్థకల్పనమూ భావ్యం కాదు. పైగా బృందావనభాసుర! ప్రియధరిత్రీనాథ అన్నవి ఏకసమాసం కాదు కనుక గణభంగం అవుతుంది. బృందావనభాసురప్రియ! ధరిత్రీనాథ! అని గణభంగం లేకుండా విడదీయాలంటే బృందావనమునందు బ్రాజిష్ణువు లైనవారికి ప్రీతిపాత్రుడా! అని అర్థకల్పన చేయటం నయం. “పుణ్యాకర” అన్న సంబోధనవిషయమూ ఆలోచింపదగినదే. భగవంతుడు పుణ్యాలకు ఆకరస్థానభూతుడు కావటం అన్వయించేది కాదు. భగవంతుడు పుణ్యకర్ముడే కాని పుణ్యములకు ఆకరుడనటం సరికాదు. పుణ్యులకు = సత్కర్ములైన ధర్మపరులకు, ఆకర = స్థానభూతుడా అనటానికీ వీలుండదు. అంతకంటె పుణ్యా = పావన గంగానదికి, ఆకర = జన్మస్థానీయుడా, జన్మస్థానమైన పాదయుగళం కలవాడా అని చెప్పటం మేలు. మనము స్థితగతిచింతనగా ఇన్ని అర్థాలను ఊహిస్తున్నామే కాని, పద్యరచన తీరును బట్టి కవి ఆ ప్రకారం ఆలోచించినట్లు కనబడదు. “బృందావనభాసురప్రియ!” అన్నవాడు వెంటనే ఆ తర్వాతి పద్యంలో పునరుక్తంగా “భాసురగోపికామనోహర!” అంటున్నాడు. “సరసిజదళనేత్ర!” అన్నదానికి అంత్యానుప్రాసగా “భక్తజననుతగాత్రా!” అంటే భక్తజనులచే సన్నుతింపబడిన (దివ్యమైన) శరీరము (యొక్క శోభ) కలవాడు అని అధ్యాహారం చేసుకోవాలన్నమాట.
ఆ తర్వాతి పద్యమూ అంతే. సరసులయొక్క హృదయములే వాసస్థానములుగా కలవాడు, సౌందర్యరాశి అయిన లక్ష్మీదేవియే తనయొక్క విలాసముగా కలవాడు అన్న వెంటనే “భరితశుభచరిత్రా!” అంటున్నాడు. స్వామి శుభచరిత్ర దేనితో భరితమై ఉన్నట్లు? సమాధానం లేదు. భరితశుభములతోడి చరిత్రను గలవాడా! అనటమూ సాధ్యం కాదు. “నిండైన శుభచరిత్ర కలవాడా“ అని పెద్దలు వ్రాసినది అన్వయింపదు. ముందు పద్యంలో “సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా!” అన్నవాడు వెంటనే ఈ పద్యంలో “భాస్కరాబ్జారినేత్రా! నిరుపమఘనగాత్రా!” అన్నాడు. తామరరేకుల వంటి కన్నులు కలవాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు; భక్తులచే పొగడికను గన్న శరీరము కలవాడు, సాటిలేని మేఘమును పోలిన నల్లని శరీరము కలవాడు అని అర్థభేదం ఉన్నది కదా, అందామంటే అంత వెంటవెంటనే అనుప్రాసను పునరుక్తం చేయటం కల్పనాసౌభాగ్యానికి, ప్రతిభావిలసనకు నిదర్శకం కాగలదా? “నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!” అన్నప్పుడు భగవంతుడు నిర్మలజ్ఞానానికి పాత్రుడు కావటం ఏమిటి? “గురుతరభవదూరా” అన్న సమాసానికి అర్థమూ అంతే. గురుతర = భారమైన, భవ = సంసారబాధలను, దూరా = దూరం చేసేవాడా – అని పెద్దలు చెబుతున్న అర్థం సరికాదు. భవమునకు దూరుడు = సంసారాతీతుడు అని చెప్పుకొందామంటే సంసారమునకు గురుతరము అన్న సుభగవిశేషణం ఎట్లా అన్వయిస్తుంది? పారమార్థికం కాకపోయినప్పటికీ వ్యావహారికసత్యమై బృహత్తమంగా గోచరీభవించే సంసారమునకు అతీతుడు అని చెప్పుకోవాలి. పద్యరచన తీరును బట్టి అది కవి భావమైనట్లు కనిపించదు.
ఏ ప్రకారంగా చూసినా ఈ ప్రథమాశ్వాసాంతపద్యాలు బొప్పరాజు గంగనామాత్యునివి కానే కావని చెప్పవచ్చును. ద్వితీయాశ్వాసం మొదటనున్న
శ్రీకాంతాహృదయప్రియ!
లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లోక! భవభయనివారక!
గోకులమందార! నందగోపకుమారా! (5-2-1)
అన్న పద్యం మళ్ళీ అమోఘంగా ఉన్నది. ప్రథమాశ్వాసం మొదటి పద్యమూ “నందగోపకుమారా!” అనే అంతమవుతున్నందున ఆ మొదటి పద్యాన్ని చూసి కొంత సమర్థుడైన కవి దీనిని కల్పించాడేమో చెప్పలేము. “గోకులవిస్తార! నందగోపకుమారా!”, “గోకులమందార! నందగోపకుమారా!” అని ఒకే కవి రెండు ఆశ్వాసాల మొదటి పద్యాలలోనూ శతకరచనలలో వలె పునరుక్తం చేసి ఉంటాడనటమూ భావ్యంగా లేదు. కనుక ఇదీ గంగనామాత్యునిది కాదనే భావింపవలసి ఉంటుంది.
మొత్తానికి తాళపత్రాలలో ఏకాశ్వాసంగా ఉండగా – అంతగా రచనాకౌశలి చాలని ప్రాథమికుడెవరో ఆధునికకాలంలో ఎందుకో నిష్కారణంగా ఈ ఆశ్వాసవిభాగాన్ని చేసినట్లు ఊహింపవలసి వస్తున్నది. అందువల్ల భాగవత భావిముద్రాపకులు ఈ విభజనను త్యజించి, రెండు ఆశ్వాసాంత గద్యలను కలిపివేసి ఈ పంచమ స్కంధాన్ని ఏకాశ్వాసంగా ముద్రించటమే భావ్యమని చెప్పటానికి ఇంత సుదీర్ఘంగా చర్చింపవలసివచ్చింది.
5. పునఃపరిష్కరణావశ్యకత
ఇప్పుడు పఠనపాఠనాలలో రూఢమై ఉన్న శ్రీమహాభాగవతాన్ని పునఃపరిష్కరింపవలసిన ఆవశ్యకతను గురించి సరిక్రొత్తగా చెప్పవలసినదేమీ లేదు. పూర్వముద్రణల పరిష్కర్తలకు దొరికిన వ్రాతప్రతులు సరిగా లేకపోవటం వల్ల; వాటినైనా ఎవరికి తోచినట్లు వారు పరిష్కరించటం మూలాన; పూర్వాపరాలను, అర్థసంగతిని సరిగా గుర్తింపకపోవటం మూలాన; మూలాన్ని, వ్యాఖ్యానాలను సరిచూడకపోవటం మూలాన – సామాన్యపాఠకులకు ఏది కవిదోషమో, ఏది లేఖనదోషమో, ఏది కల్పితపాఠమో, ఏది అన్వయిస్తుందో, ఏది అన్వయింపదో, ఏది ప్రామాణికమో, ఏది ప్రామాదికమో నిశ్చయించేందుకు వీలులేనంత దురుద్ధరంగా ముద్రితప్రతుల స్థితి ఉన్నది. ఈ భాగవత పాఠపరిష్కరణ విషయాన్ని ఒక వంద ముఖ్యమైన ప్రసిద్ధపాఠాల పరిశీలనతో వేరొక వ్యాసాన్ని రానున్న ఈమాట సంచికలలో ప్రకటిస్తాను. ప్రకృతానికి ఈ పంచమ స్కంధంలోని కొన్ని ముఖ్యమైన పాఠాల విషయాన్ని వివరించి, భాగవతం పునఃపరిష్కరణావశ్యకతను మళ్ళీ ఒక పర్యాయం మీకు విన్నవిస్తాను. పూర్వం ఈ భాగానికి వ్యాఖ్యానాలను, టీకా తాత్పర్యాలను, వచనాన్వయాన్ని వ్రాసిన పెద్దలెవరినీ విమర్శించటం ఇక్కడి ఉద్దేశం కాదని, కేవలం పాఠస్థితిని మాత్రమే అనుశీలించటం జరుగుతున్నదని సహృదయులు సులభంగానే గుర్తింపగలరు.
5.1.
శ్రీకర! కరుణాసాగర!
ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా! — (5-1-1)
పంచమ స్కంధంలోని మొదటి పద్యమే ఇది. లోకాతీతగుణాశ్రయ = లోకాతీతములైన గుణములకు ఆశ్రయమైనవాడా అని వ్యాఖ్యానించటం సరికాదు. గుణములు లోకాతీతాలైనప్పుడు వాటికి ఆశ్రయాశ్రయీభావకల్పనం ఎట్లా జరుగుతుంది? అసలు లోకాతీతములైన గుణాలు ఏముంటాయి? అందువల్ల లోకాతీత! గుణాశ్రయ! అని విశేషణాలను సమస్తభిన్నంగా పఠించాలి. గోకులవిస్తార = గోకులమును విస్తరింపజేసినవాడా అని శ్రీకృష్ణుని యందు గోకులవిస్తారకత్వధర్మాన్ని నిరూపించటం సరికాదు. పైగా, ఏకాదశ స్కంధంలో ఆయన యాదవ వంశం భూమికి భారంగా మారిందని గ్రహించి యదుక్షయాన్ని సంకల్పించిన సన్నివేశం కూడా ఉన్నది. గోకులంలో బాల్యాన్ని గడిపి నందాదులకు ముక్తిని ప్రసాదించినవాడని కవి ఉద్దేశం. గోకులనిస్తార = గోగోపగోపీకులాన్ని కోరికలీడేర్చి తరింపజేసినవాడా – అని అన్వయించుకోవాలి.
పద్యస్వరూపం ఇలా ఉండాలి:
శ్రీకర! కరుణాసాగర!
ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీత! గుణాశ్రయ!
గోకులనిస్తార! నందగోపకుమారా!
శ్రీకర = సిరులను కలిగించేవాడా అన్నది సామాన్యార్థం.
“పరమపదమందు తాను వాసుదేవరూపమున ఉన్నప్పుడు ఆ లక్ష్మిని తనకు అనురూపమైన స్వరూప వేషాదులతో పొందియున్న విధముననే, సంకర్షణాది వ్యూహములలోను రామకృష్ణాద్యవతారముల లోను తాను ఆవిర్భవించి ఆ శ్రీదేవినిగూడ అనురూపవేషములతో యథోచితముగా తనవెంట ఆవిర్భవింప చేసుకొనువాడు గనుక, “శ్రీకరః” అనబడుచున్నాడు.”
అని శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రానికి పరాశర భట్టర్ వారి భాష్యానుసారం శ్రీమాన్ ఉ.వే.నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వారు చేసిన అనువాదం. కరుణాసాగర = దయచేత అనంతమైన సముద్రము వంటి స్వామీ; ప్రాకట = పాలకడలియందు స్వయంవ్యక్తురాలైన, లక్ష్మీ = శ్రీదేవిని, కళత్ర = భార్యగా వలచి వలపించికొన్న దేవా; భవ్యచరిత్రా = లోకశుభంకరమైన లీలావిలాసము కలిగిన ప్రభూ అని ఒక అర్థం, భవ్య = ఇంకా సంభవింపనున్న, చరిత్రా = అనేక అవతారముల లీలావ్యక్తిని కలవాడా – అని మరొక అర్థం; లోకాతీత = సర్వలోకాల ఆవిర్భావానికి మునుపే ఉన్నవాడా; గుణాశ్రయ = నీవు నిర్గుణుడవైనప్పటికీ (సత్త్వరజస్తమోగుణాలు, రూపనామాదిగుణాలు, ధర్మాదివ్యవహారాలు లేని పరమాత్మస్వరూపుడ వైనప్పటికీ) వాసుదేవుడవై జగత్తులను నీలో వసింపజేసికొంటూనే ఆ జగత్తులలో నీవూ వసించేవాడవై గుణాలకు ఆశ్రయమైన తండ్రీ; గోకులనిస్తార = నందగోకులాన్ని తరింపజేసినవాడా; నందగోపకుమారా = నందగోపకునికి పుత్త్రుడవైన దేవా! దశమ స్కంధం 352-వ పద్యంలో నిరూపించిన ఉదంతానుసారం వసువులలో ముఖ్యుడైన ద్రోణునికి భార్య ధరాదేవి. ధరాద్రోణులు విష్ణుసేవార్థం గోకులంలో యశోదానందులుగా జన్మించారు. ఆ విధంగా నందగోపునికి శ్రీమహావిష్ణువు సుతుడయ్యాడు – అని.
5.2.
పటుతాటంకరథాంగయుగ్మమునకుం బల్మాఱు భీతిల్లుచున్
నటనం బందెడు గండుమీనములతో నాసన్ననీలాలకో
త్కటభృంగావళితో ద్విజావళి లసత్కాంతిన్ విడంబించు మా
ఱటకాసారముఁ బోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్. — (5-1-26)
అగ్నీధ్రుడు అప్సరస పూర్వచిత్తిని చూచి అంటున్న మాటలివి. బటువైన చెవికమ్మల జంట అనే చక్రవాకపక్షులకు గండుచేపలు పదే పదే ఎందుకు భయపడ్డాయి? అసలు చక్రవాకాలను చూసి గండుచేపలు ఎందుకు భయపడతాయి? చెవికమ్మలు చక్రవాకపక్షుల వలె ఉండటం ఏమిటి? ఆసన్నములై (చేరువనే) ఉన్న నల్లని ముంగురులు తుమ్మెదల గుంపులయితే, ద్విజపంక్తులతో తేజరిల్లుతున్న నీ ముద్దు ముఖం సరోవరంలా ఉండి అందముచేత శోభిస్తున్నది అనటం ఏమిటి? నీలాలకములనెడు భృంగములు, ద్విజావళి అన్నట్లు గండుమీనములు వేటికి విశేషణాలు? పాఠమూ, తాత్పర్యార్థమూ రెండూ సరిగా లేవు. మూలశ్లోకం ఇది:
కా వాత్మవృత్తిరదనా ద్ధవిరఙ్గ వాతి విష్ణోః కలాస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ
ఉద్విగ్నమీనయుగలం ద్విజపఙ్క్తిశోచి రాసన్నభృఙ్గనికరం సరఇన్ముఖం తే. — (5-2-13)
ఓ కాంతా! ఎటువంటి ఆహారాన్ని స్వీకరించి ప్రాణాలను నిలుపుకొంటున్నావు? తాంబూలాదిసేవనం చేత నీ ముఖంనుంచి వెలువడుతున్న సుగంధం వల్ల యజ్ఞసంబంధమైన ఏ పవిత్రమైన నైవేద్యాన్నో భుజిస్తుంటావని అర్థమవుతున్నది. ఎందుకంటే, సాక్షాత్తు విష్ణుకళవు నువ్వు. నీ ముఖం సరోవరం లాగా శోభాయమానంగా ఉన్నది. నీ చెవులకు అలంకరించికొన్న మకరకుండలాలు రెప్పలార్పనీ మొసళ్ళ జంటలాగా ఉన్నాయి. కన్నులు చేపల వలె చాంచల్యాన్ని పొంది ఉన్నాయి. నీ పలువరుస రాజహంసల పంక్తి వలె వెలుగొందుతున్నది. కేశసంపద నీ ముఖపరిమళమునందు ఆసక్తిగొన్న తుమ్మెదల వలె ఉన్నది – అని తాత్పర్యార్థం.
దీన్నిబట్టి పద్యపాఠమూ, తాత్పర్యమూ ఈ ప్రకారంగా ఉండాలి:
పటుతాటంకపలాంగయుగ్మమునకుం బల్మాఱు భీతిల్లుచున్
నటనం బందెడు నేత్రమీనములతో నాసన్ననీలాలకో
త్కటభృంగావళితో ద్విజావళి లసత్కాంతిన్ విడంబించు మా
ఱటకాసారముఁ బోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్.
పలాంగము అంటే మొసలి అని అర్థం. అది రథాంగం కాదు. పలాంగం. పూర్వచిత్తి యొక్క ముఖానికి సరోవరంతో అభేదతాద్రూప్యకల్పన జరిగింది. బటువైన చెవికమ్మలు మకరాకృతిని కలిగి ఉన్నాయి. అవి మకరకుండలాలు కనుక కవి ఆ మొసళ్ళ జంటను చూసి కన్నులనే చేపలు పల్మాఱు భీతిచెందినట్లుగా వర్ణిస్తున్నాడు. చేపల వంటి ఆ కన్నులు చెవుల దాకా వ్యాపించి ఉన్నాయి. అంటే, అంత సువిశాలములై ఉన్నందువల్ల అవి చెవుల దగ్గరకు వెళ్ళి, అక్కడ కర్ణాభరణాలుగా ఉన్న మొసళ్ళను చూసి ఉలికిపడి భీతిచెందాయి. ఎన్నిమార్లు పరికించి చూసినా ఆ మకరాకృతులు మకరాలుగానే కనుపించటం వల్ల పల్మాఱు భీతిల్లాయన్నమాట. ఆ విధంగా పడుతూ లేస్తూ (నటనం బందెడు) తమ భయాన్ని ప్రదర్శింపసాగాయని మీనపరమైన అర్థం. కన్నులు చాంచల్యాన్ని కలిగి ఉన్నాయని నేత్రపరమైన అర్థం. “నేత్రమీనములు” అన్న నిరూపణ లేకపోతే, సరోగతమీనములు అన్న ఉభయాన్వయానికి అసలు చోటే ఉండదు. కన్నులు భయభ్రాంతములు కావటాన్ని చూసి చేరువనే ఉన్న నల్లని ముంగురులనే తుమ్మెదలు సైతం భయభ్రాంతములైనాయని ప్రతీయమానం. వాటికీ ఆపత్కాలం దాపురించిందన్నమాట. గాలికి అల్లలాడుతున్న ముంగురులకు ఆ విధంగా ఆపత్ప్రాప్తి కలిగినట్లుగా చిత్రించటం భావ్యంగానే ఉన్నది. “ఆసన్నభృంగావళి” అనేందుకంటె “ఆపన్నభృంగావళి” అంటే భృంగార్థంలో సముచితమే కాని, మూలంలో ఆ ప్రకారం లేదు. పైగా ఆపన్నత భృంగాలకే గాని ముంగురులకు శ్లేషార్థంలో సమర్థకం కాదు. ద్విజములు అంటే దంతములని, పక్షులని రెండర్థాలు. ద్విజముల ఆవళి అంటే పలువరుస. పలువరుస దేదీప్యమానంగా ప్రకాశిస్తుండటం వల్ల లసత్కాంతిని విడంబిస్తున్నది (గొప్ప కాంతిమండలాన్ని అనుకరిస్తున్నది, లేదా మరుగుపుచ్చుతున్నది). ఆ విధంగా ఆమె నిండైన ముఖం సరోవరానికి మాఱటగా (ప్రతిరూపంగా) రంజిల్లుతున్నది. అత్యున్నతి అన్నది భాగవతకవులు తరచు పాదపూరణార్థం ప్రయోగించే ఒక విశేషప్రయోగం. గొప్పగా – అని మాత్రమే అక్కడ అర్థం చెప్పుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు ప్రకటించిన శ్రీమహాభాగవతం పీఠికలో ఈ పద్యాన్ని వివరిస్తూ — “తాటంక రథాంగయుగ్మమునకు భయపడి (నేత్రములనెడి) గండుమీనములు నటనంబందుచు నున్న వను కల్పన యమూలకమై రమ్యముగా నున్నది” అని — తత్సంపాదకులు వ్రాసిన మాట పొరపాటే.
5.3.
అచ్చట విప్రసూనుఁడు భయం బొకయించుక లేక చంపఁగా
వచ్చినవారియందుఁ గరవాలమునందును గాళియందుఁ దా
నచ్యుతభావముంచి హృదయంబునఁ బద్మదళాక్షు నెంతయున్
మచ్చికతోడ నిల్పి యనుమానము నొందకయుండె నత్తఱిన్. (5-1-137)
శ్రీమహాభాగవతంలోని వివాదాస్పదాలైన పద్యాలలో ఇదొకటి. బ్రాహ్మణపుత్త్రుడై జన్మించిన జడభరతుడు కాళికాదేవి మందిరంలో తనను బలిచేయవచ్చిన ఆటవికుల యందు, వారి చేతిలోని కత్తియందు, చివరికి కాళికాదేవి యందు, తాను శ్రీమహావిష్ణుభావన కావించి ఆ పద్మదళవిశాలనేత్రుని ఎంతో ఆత్మీయభక్తిభావనతో మనస్సులో నెలకొల్పికొని సర్వసమభావుడై ఉండిన సన్నివేశం. “అచ్చట” – “వచ్చిన” – “అచ్యుత” – “మచ్చిక” అన్న పదాలను ప్రాసస్థానంలో నిలిపిన ప్రయోగం ఇది. బొప్పరాజు గంగనకు ఇటువంటి ప్రయోగవిశేషాలపై ప్రత్యేకాభిమానమేదీ లేదని ముందే అనుకొన్నాము. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన శ్రీమహాభాగవతంలో ఈ పద్యం మూడవ పాదంలోని పాఠాన్ని “అచ్చుతభావముంచి” అని సవరించివేశారు. అందుకు కారణాన్ని అధోజ్ఞాపికలో –
“అచ్యుతభావ” మని అన్ని యచ్చుప్రతులలోఁ గల పాఠము. ఈ పాఠమునఁ బ్రాస సరిపడదు. “అచ్చుతభావము” వ్యాకరణసమ్మతము కాకపోయినను, పోతన రచనలో ఇట్టి సమాసములు తరచు కనఁబడుచుండుటను బట్టియు, ప్రాసము ననుసరించియు, “అచ్చుతుఁడు” అని వాడుకలో నుండుట వలనను, ఇదే కవిపాఠముగా గ్రహింపబడినది.”
అని ప్రకటించారు. ‘అచ్చుతభావము’ అన్నది వ్యాకరణసమ్మతమైన ప్రయోగం కాకపోయినా, పోతనగారి రచనలో ఇటువంటి సమాసాలు తరచు కనబడుతున్నాయట. ‘అచ్యుతుడు’ అనటానికి మారుగా ‘అచ్చుతుడు’ అని లోకంలో వాడుతున్నారట. అందువల్ల “అచ్యుతభావముంచి” అన్న ప్రాసవైరాన్ని పరిహరించేందుకు మేము దానిని “అచ్చుతభావముంచి” అని దిద్దుతున్నాము – అని వీరి ప్రతిపాదన. ‘అచ్చుతుడు’ అని లోకంలో వాడుక ఉన్నది కాబట్టి దానిని ఆ విధంగా సవరించటం మంచిదే కాని, దానితో ‘అచ్చుతభావము’ అన్న సాంస్కృతికసమాసాన్ని చేయకూడదని, అందువల్ల “అచ్చుతభావముంచి” అన్నప్పటి సమాసదోషాన్ని సవరించి దానిని “అచ్చుతు భావముంచి” అని విడదీసి ముద్రించాలని – ప్రముఖ వ్యాకరణవిద్వాంసులు శ్రీ వంతరాం రామకృష్ణారావు గారు ఆ రోజుల్లో ఒక విమర్శవ్యాసంలో అభిప్రాయపడ్డారట. అకాడమీ భాగవతపరిష్కర్తలలో ఒకరైన మహావిద్వాంసులు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు 1968లో ప్రకటించిన తమ ‘భాగవతపాఠపరిశోధనము’ గ్రంథం 198-వ పుటలో ఈ విషయాన్ని చర్చించి, దానిని తిరస్కరించి, మళ్ళీ తమ “అచ్చుతభావముంచి” అన్న పాఠాన్నే సమర్థించారు. అందుకు సమాధానంగా ఆధునికకాలంలోని ప్రముఖ భాగవతానువాదకులలో ఒకరు, అకాడమీ వారి భాగవతపాఠవిమర్శకులలో అగ్రేసరులు అయిన కవితామహేశ్వర శ్రీ మిన్నికంటి గురునాథశర్మగారు ఆ రోజుల్లో ‘పోతనామాత్యుని అభేదదృష్టి – పాఠపరిశీలనము’ అని ఒక వ్యాసాన్ని ప్రకటించారు. సుప్రసిద్ధమైన ఆ వ్యాసం మహాకవి శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి సమర్థ సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పక్షాన 1983-లో వెలువడిన ‘భాగవత వైజయంతిక’ అన్న సంపుటంలో పునఃప్రచురితమైంది. అందులో గురునాథశర్మగారు,
ఈ వ్రాతతో నాకు పనిలేదు. ఈ పద్యమును పోతన గాడు, బొప్పరాజు గంగన వ్రాసెను. ‘అచ్చుతభావము’ గాదు. ‘అచ్యుతభావము’ గాదు. ‘అచ్చితిభావము’ అని గంగన కవి వ్రాసియుండును. ‘చితి’ అన పరబ్రహ్మము. ఆ + చితి = అచ్చితి. భరతుడు మహాజ్ఞాని. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అను శ్రుతి నెరిగిన భరతుడు నామరూపాత్మకమైన యీ సర్వ జగమును బ్రహ్మముగా చూచుచున్నాడు. కావుననే ఆయన చంపబడి అవమాన మొందలేదు. పద్యములో ‘అనుమానము’ అని యున్నది. అది తప్పు. ‘అవమానము’ అని యుండవలె.
అని వ్రాశారు. అకాడమీ వారి నిర్ణయానుసారం “అచ్యుతభావము” అన్న పాఠంలోని ప్రాసవైచిత్రి భాగవతకవుల సంప్రదాయానికి విరుద్ధమూ, వారు సూచించిన “అచ్చుతభావము” అన్న పాఠం భాగవతకవుల సంప్రదాయానికి అనురూపమూ ఎందుకయ్యాయి? “అచ్చుతభావము” సరైన పాఠం అన్న భావం కలిగాక వారి దృష్టిలో “అచ్చుతు భావము” అన్న పాఠం మాత్రం తప్పెందుకయింది? సంతృప్తికరమైన సమాధానం లేదు. జాగ్రత్తగా చూస్తే, “అచ్యుతభావము”, “అచ్చుతభావము”, “అచ్చుతు భావము” అన్న మూడూ తప్పేననిపిస్తాయి. విప్రసూనుడు తనను చంపవచ్చినవారిలోనూ, కత్తిలోనూ, కాళికలోనూ అది అచ్యుతుడే అన్న భావాన్ని కలిగి ఉండటం ఏమిటి? ఎంత భేదభావం లేదనుకొన్నా కత్తినీ, కాళికనూ ‘అచ్యుతుడు’ అనుకోవటం ఏమిటి? కత్తియందు అచ్యుతభావన చేయటం ఏమిటి? నన్ను చంపటానికి సాధనమైన ఈ కత్తికూడా శ్రీమహావిష్ణువే అని భావన చేశాడన్నమాట. ఏ భావన చేసినా, అచ్యుతభావం ఉంచాడు కాబట్టి, ఆ కత్తికి చ్యుతి లేక మెడమీద వేటు పడదనే అనుకొందాము. కాళిక యందు అచ్యుతభావం ఎలాగున? కాళికకూడా శ్రీమహావిష్ణువే అనుకొన్నా డన్నమాట. ఏ భావన చేసినా, అచ్యుతభావం ఉంచాడు కాబట్టి, ఆమెకూడా శరణాగతుల రక్షణ యందు చ్యుతి లేనిది = ఒకసారి భక్తుణ్ణి రక్షించాలీ అనుకొన్నాక ఆపై ఆమె రక్షాసంకల్పానికి చ్యుతి ఉండదని అనుకొందాము. అందువల్ల ఆమె ఆగ్రహించి, చంపవచ్చినవారిని తానే చంపి అతనిని రక్షించిందన్నమాట. పోతే, చంపవచ్చినవారి యందు అచ్యుతభావం చేశాడు కదా, ఆ అచ్యుతభావానికి ఏమని అర్థం చెప్పాలి? వీరుకూడా సాక్షాత్తు అచ్యుతస్వరూపులే అని భావన చేశాడన్నమాట. అందువల్ల వారి అచ్యుతస్వరూపానికి ఏమయింది? కాళిక చేతిలో హతమారారు. అందువల్ల “అచ్యుతభావము”, “అచ్చుతు భావము”, “అచ్చుతభావము” అన్న మూడు పాఠాలూ సరికావనే ఒప్పుకోవాలి. “అచ్యుతభావము” అన్న పాఠంలోని ప్రాసవైరం మాట ఎట్లాగూ ఉండనే ఉన్నది. అందుకనే మహాపండితులైన గురునాథశర్మగారు “ఈ వ్రాతతో నాకు పనిలేదు” అని వ్రాయవలసి వచ్చింది.
గురునాథశర్మగారన్నట్లు ‘చితి’ అంటే చైతన్యం. స్వతఃస్ఫూర్తిని కలిగిన బ్రహ్మపదార్థం. విప్రసూనుని జన్మలో ఉండినా, పూర్వజన్మస్ఫురణ మూలాన సర్వమునందు బ్రహ్మభావన చేయగల భరతుడు కత్తిలోనూ, కాళికలోనూ ఆ చితి భావాన్ని ఉంచటం భావ్యమే. చంపవచ్చినవారిని, కత్తిని, కాళికను ఆ పరబ్రహ్మము యొక్క వ్యక్తరూపాలుగా భావన చేయగలగటం సవ్యమే.
అయితే, గురునాథశర్మగారి సూచనకు ఒక్కటే అభ్యంతరం కనబడుతున్నది. బొప్పరాజు గంగనకు అటువంటి పాండిత్యమూలకప్రయోగాలను చేసే అలవాటు లేదు. ణిసి = చుంబనే అన్న అర్థంలో సంస్కృతంలో ఉన్న ధాతువును తీసికొని, “ణిసి ధాత్వర్థ మనుగ్రహింపఁ గదవే నీరేజపత్త్రేక్షణా!” అని శ్రీనాథుడు శృంగారనైషధం (8-52) లోనూ, “కెంజిగురాకు మోవి ణిసి ధాత్వర్థం బనుగ్రహింతువో” అని వల్లభరాయలు క్రీడాభిరామం (90-వ పద్యం) లోనూ అన్నట్లు ఆ విధమైన ధాత్వర్థఫలాశ్రయత్వం లేకపోయినా, చితి శబ్దం చిత్ అన్న ప్రాతిపదికంతో ఏర్పడిన సుబంతమే అయినా, “చితి-భావముంచి” అని భాగవతమూలంలో లేని నూత్నసంవిధానంతో అపురూపమైన తీరున అంత ప్రౌఢంగా అనటం గంగనామాత్యుని స్వభావం కాదు. అది ఆయన ప్రయోగాల సరళి కాదు. అందుచేత వీరి ఈ సూచన చింత్యమే అనక తప్పదు.
అయితే మరేమని ఉండాలి? అంటే, భరతుడు వచ్చినవారి యందు, కత్తియందు, కాళికయందు ఎటువంటి మనోమాలిన్యాలు లేని నిర్మలమైన స్వచ్ఛభావంతో ఉన్నాడని అర్థం. ఈ మనోమాలిన్యాలు ఆణవము = పరబ్రహ్మమును గురించి కలిగే జ్ఞానాన్ని మఱుగుచ్చేది, కార్మికము = గురువు బోధించిన పరమార్థంలోకి బుద్ధిని చొరనీయనిది, మాయికము = పరతత్త్వజ్ఞానవాసనను కలుగనీయనిది, మాయేయము = పాపకార్యాలలో మాత్రమే బుద్ధిని ప్రవేశపెట్టేది, తిరోధానము = పరబ్రహ్మము అనిత్యమన్న బుద్ధిని కలిగించి జనన మరణాది దుఃఖాలను కలుగజేసేది – అని అయిదు విధాలు. ఆ మాలిన్యాలు, రాగద్వేషాలు లేని అచ్చపు = స్వచ్ఛమైన భావముంచి అని కవి ప్రయోగం అయివుంటుంది. సుబోధకతను కలిగి ధారాశుద్ధి లోపం లేని “అచ్చపు భావముంచి” అన్న ప్రయోగమే ఇక్కడ సమంజసంగా ఉంటుందని నా భావన.
“అనుమానము నొందక యుండె నత్తఱిన్” అన్నచోట శర్మగారు సూచించిన “అవమానము నొందక యుండె” అన్న ప్రయోగం అద్భుతావహంగా ఉన్నది. భయము లేదని చెప్పిన తర్వాత భరతునికి ఇంకా అనాగత ప్రతికూలతను గురించి భయపరిణామరూపమైన చిత్తవృత్తిని, సందేహాకులతను రూపించే అనుమానము అన్న పదం భావనీయం కాదు. జరిగిన ఘటన మూలాన ఆయన మనస్సులో తనకు హానిని తలపెట్టిన ఆ ఆటవికుల యందు, వారి చేతిలోని కత్తియందు, ఆలయాధిష్ఠానదేవత అయిన కాళిక యందు ఎటువంటి అనాదరం, తెగడిక కలుగలేదని చిత్రించటమే పాత్రోచితమైన కల్పన అవుతుంది. ఆ ప్రకారం పద్యం ఈ విధంగా ఉండాలి:
అచ్చట విప్రసూనుఁడు భయం బొకయించుక లేక చంపఁగా
వచ్చినవారియందుఁ, గరవాలమునందును, గాళియందుఁ దా
నచ్చపు భావముంచి హృదయంబునఁ బద్మదళాక్షు నెంతయున్
మచ్చికతోడ నిల్పి యవమానము నొందకయుండె నత్తఱిన్.
5.4.
సీ. చతురత వృష్టి విష్కంభకగ్రహశాంతి నొనరించువారల కొసఁగు శుభము (5-2-87)
అని తెలుగు భాగవతం అన్ని ప్రతులలోను ఉన్నది. విష్కంభకము = అడ్డంకియైన – రాయలు అండ్ కో వారి ప్రతిలో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి టీక. విష్కంభము అంటే అడ్డంకి అని అర్థం ఉన్నమాట నిజమే. ఇంతకీ, అక్కడ ఉండవలసిన పాఠం విష్కంభకము కాదు, విష్టంభకము. “వృష్టివిష్టమ్భగ్రహోపశమనః” అని భాగవత మూలం (5-22-12). “వృష్టే ర్విష్టమ్భః – స్తమ్భనం యస్మా ద్గ్రహా త్త ముపశమయతీతి” – అని శ్రీధరస్వామి ‘భావార్థబోధనీ వ్యాఖ్య’. “వృష్టే ర్విష్టమ్భనం ప్రతిబన్ధో యస్మా ద్గ్రహా త్త ముపశామయతీతి వృష్టివిష్టమ్భగ్రహోపశమనః” – అని శ్రీ యాదవార్యుల ‘భాగవతప్రకాశికా వ్యాఖ్య’. వర్షాలకు ప్రతిబంధకమైన గ్రహాన్ని శుక్రగ్రహం నాశనం చేస్తుందని తాత్పర్యం. అందువల్ల శుక్రుని ఆరాధన కర్తవ్యమని బోధ. మతత్రయ వ్యాఖ్యలలోనూ పాఠం ఇట్లాగే ఉన్నది కనుక, పాఠం –
సీ. చతురత వృష్టి విష్టంభకగ్రహశాంతి నొనరించువారల కొసఁగు శుభము (5-2-87)
అని ఉండాలి.
5.5.
ఇక, పంచమ స్కంధంలో శింశుమార చక్రం వర్ణన ఉన్నది. ఆ సందర్భంలోని వచనం (5-2-96) ఇది:
వ. మఱియు నా శింశుమారచక్రపుచ్ఛంబునఁ బ్రజాపతియును, నగ్నీంద్రధర్ములును, పుచ్ఛమూలమున ధాతృవిధాతృలును, గటిప్రదేశంబున ఋషిసప్తకంబును, దక్షిణావర్తకుండలీ (భూత భూత) శరీరంబునకు నుదగయననక్షత్త్రంబులును, దక్షిణపార్శ్వంబున దక్షిణాయననక్షత్త్రంబులును, బృష్టంబున దేవమార్గంబును, నాకాశగంగయు, నుత్తరభాగంబునఁ బునర్వసు పుష్యంబులును, దక్షినాయనంబున నార్ద్రాశ్లేషలును, దక్షిణ వామపాదంబుల నభిజిదుత్తరాషాఢలును, దక్షిణ వామ నాసారంధ్రంబుల శ్రవణ పూర్వాషాఢలును, దక్షిణ వామలోచనంబుల ధనిష్ఠా మూలలును, దక్షిణ వామకర్ణంబుల మఖాద్యష్టనక్షత్త్రంబులును, వామపార్శ్వంబున దక్షిణాయనంబును, దక్షిణపార్శ్వంబునఁ గృత్తికాది నక్షత్త్రత్రయంబును, నుత్తరాయణంబును, వామ దక్షిణస్కంధంబుల శతభిషగ్జ్యేష్ఠలును, నుత్తరహనువున నగస్త్యుండును, నపరహనువున యముండును, ముఖంబున నంగారకుండును, గుహ్యంబున శనైశ్చరుండును, మేఢ్రంబున బృహస్పతియును, వక్షంబున నాదిత్యుండును, నాభిని శుక్రుండును, జిత్తంబునఁ జంద్రుండును, స్తనంబున నశ్వినులును, బ్రాణాపానంబుల బుధుండును, సర్వాంగంబులను గేతుగ్రహంబును, రోమంబునఁ దారలును నుండు నది సర్వదేవతామయం బైన పుండరీకాక్షుని దివ్యదేహంబు ధ్రువునింగా నెఱుంగుము.
విశేషవ్యాఖ్యను చేయక, మూలానుసారం దీనిని ఈ విధంగా సవరించి చదువుకోవాలని మాత్రం మీకు మనవి చేస్తున్నాను:
వ. మఱియు నా శింశుమారచక్రపుచ్ఛంబునఁ బ్రజాపతియు, నగ్నీంద్రధర్ములును, పుచ్ఛమూలంబున ధాతృవిధాతలును, గటిప్రదేశంబున ఋషిసప్తకంబును; దక్షిణావర్తకుండలీభూతశరీరంబునకు నుదగయననక్షత్త్రంబులు దక్షిణపార్శ్వంబున, దక్షిణాయననక్షత్త్రంబులు వామపార్శ్వంబునఁ; బృష్ఠంబున దేవమార్గంబును, నజవీథియు, నాకాశగంగయు; శ్రోణిదక్షిణవామభాగంబులఁ బునర్వసు పుష్యంబులును; నార్ద్రాశ్లేషలు దక్షిణ వామపాదంబుల; నభిజిదుత్తరాషాఢలు దక్షిణవామనాసారంధ్రంబుల; శ్రవణపూర్వాషాఢలు దక్షిణవామలోచనంబుల; ధనిష్ఠామూలలు దక్షిణవామకర్ణంబుల; మఖాద్యష్టనక్షత్త్రంబులు వామపార్శ్వంబున నస్థులయందు దక్షిణాయనంబున; దక్షిణపార్శ్వంబున మృగశీషాద్యుదగయన నక్షత్త్రంబులును; వామదక్షిణస్కంధంబుల శతభిషగ్జ్యేష్ఠలును; నుత్తరహనువున నగస్త్యుండును; నపరహనువున యముండును; ముఖంబున నంగారకుండును; గుహ్యంబున శనైశ్చరుండును; గకుదంబున బృహస్పతియు; వక్షంబున నాదిత్యుండును; నాభిని శుక్రుండును; మనంబునఁ జంద్రుండును; స్తనంబుల నశ్వినులును; బ్రాణాపానంబుల బుధుండును, గళంబున రాహువును, సర్వాంగంబులఁ గేతుగ్రహంబును, రోమంబులఁ దారలును నుండు; నది సర్వదేవతామయం బైన పుండరీకాక్షుని దివ్యదేహంబు ధ్రువునింగా నెఱుంగుము.
5.6.
సీ. …అట్టి యనంతనామాభిధానుని మస్తకమున సిద్ధార్థంబు కరణి ధరణి…” (5-2-122)
అని భాగవతం అన్ని ప్రతులలోనూ ఉన్న పాఠమే. “అనంతుడనే నామము, అభిధానము కలవాని శిరసుపైని సర్వసిద్ధులతోడి పెన్నిధానము వలె భూమి విరాజిల్లుతుంటుంది” అని అర్థం చెప్పుకోవాలన్నమాట. నామము, అభిధానము పర్యాయపదాలని పరిష్కర్తలు గుర్తింపకపోవటం ఇందులోని విచిత్రం.
సీ. …అట్టి యనంతగుణాభిధానుని మస్తకమున సిద్ధార్థంబు కరణి ధరణి…”
అని దీనిని దిద్దుకోవాలి. “అంతులేనన్ని సద్గుణాలు, శుభనామాలు కలిగినవాని శిరసుపైని సర్వసిద్ధులతోడి పెన్నిధానము వలె భూమి విరాజిల్లుతుంటుంది” అని భావం.
5.7.
ఇది మరొక వచనంలోని తుదిభాగం:
వ. …ముముక్షువులు ధ్యానంబులు సేయ, నధ్యాత్మవిద్యాయుక్తం బైన యానంద హృదయగ్రంథిని భేదించునట్టి శేషుని స్వాయంభువుం డగు నారదుండు తుంబురుప్రభృతు లగు ఋషిశ్రేష్ఠులతోఁ జేరుకొని కమలాసనుని సభాస్థానంబునందు నిట్లు స్తుతియించుచుండు. (5-2-125)
దీనికి తెలుగులో వివిధ వ్యాఖ్యాతలు వ్రాసిన తాత్పర్యరచనలన్నీ తప్పుగానే ఉన్నాయి. మోక్షార్థులు ఆయన కొరకు ధ్యానాలు చేస్తుండగా ఆదిశేషుడు వారి “అధ్యాత్మవిద్యాయుక్తమైన ఆనంద హృదయగ్రంథి”ని భేదించటం ఏమిటని ఒక్కరికీ తోపకపోవటం విచిత్రమే. హృదయంలోని ముడి సర్వజనులు కాంక్షించే ఆనందమై ఉండగా, అదీ అధ్యాత్మవిద్యతో కూడినదై ఉండగా – అది ముడి ఎందుకవుతుంది? దానిని మళ్ళీ ఆదిశేషుడు భేదింపవలసిరావటం ఏ విధంగా భావ్యం? అని ఒకరికీ సందేహం రాలేదన్నమాట. “అధ్యాత్మవిద్య నుపదేశించి ఆనందముగా కడ్డుగా హృదయము నందున్న ముడిని అతడు (ఆదిశేషుడు) త్రెంపును” – అని పెద్దలు వ్రాసిన భావం సరికాదు. ఆ వాక్యానికి ఆ విధమైన యోగ్యత, అందులోని పదాలకు ఆ తీరు ఉత్తరోత్తరాకాంక్ష సార్థకం కాదు. “అధ్యాత్మవిద్యాయుక్తమైన ఆనంద హృదయగ్రంథి” అన్నప్పుడు ఆనందహృదయగ్రంథి అంటే “ఆనందమున కడ్డుగా హృధయమున ఉన్న ముడి” అన్న అన్వయం అసలు సాధ్యమే కాదు. ఆ అర్థకల్పనమూ పొరపాటే. (ఆదిశేషుడు) “అధ్యాత్మవిద్య కధిపతియై హృధయమున గ్రంథిభేదము చేసి ఆనందము కలిగించును” అన్న ప్రతీతి, “అధ్యాత్మవిద్యాయుక్తమైన ఆనంద హృదయగ్రంథి” అన్న దళంతో ఏర్పడదు. అందువల్ల –
వ. …ముముక్షువులు ధ్యానంబులు సేయ, నవిద్యాయుక్తం బైన యనాదికాల కర్మవాసనాహృదయగ్రంథిని భేదించునట్టి శేషుని స్వాయంభువుం డగు నారదుండు తుంబురుప్రభృతు లగు ఋషిశ్రేష్ఠులతోఁ జేరుకొని కమలాసనుని సభాస్థానంబునందు నిట్లు స్తుతియించుచుండు.
వాసన అంటే జీవుల మనస్సులలోని ధర్మాధర్మరూపమైన సంస్కారవిశేషం. అది కర్మగతమై ఉండటం కర్మవాసన. జీవుల కర్మవాసన ఎప్పుడు మొదలయింది? జీవుల సృష్టి ఎప్పుడు జరిగిందో, అప్పటి నుంచి. సృష్టి ఎప్పుడు జరిగింది? సంవత్సరాల లెక్కలో చెబితే ఒకపట్టాన అర్థమయే వ్యవహారం కాదు కనుక, దానిని అనాదికాల కర్మవాసన అని శుకయోగి వివరిస్తున్నాడు. అది అవిద్య వల్ల కలిగిన కర్మవాసన. తాను కాని వస్తువుల యందు తాను అన్న బుద్ధిని కలిగి ఉండటం అవిద్య. అది వ్యతిరేకజ్ఞానరూపమైనది. మిథ్యాజ్ఞానం అన్నమాట. మలినసత్త్వం ప్రధానంగా కలిగిన ఒక తత్త్వం. ఆత్మస్వరూపాన్ని గుర్తెరుగలేకపోవటం వల్ల అనిత్యాలైన దేహేంద్రియాది విషయముల యందు అవి నిత్యాలని, మలినములైనవాని యందు అవి పరిశుద్ధాలని, దుఃఖకరాలైన వస్తుకర్మల యందు అవి సుఖకరాలని, అనాత్మ యందు అది తానని ఏర్పడిన అజ్ఞానమూలకమైన బుద్ధి అవిద్య. అనాదికాలంగా కర్మవాసనల రూపంలో నెలకొని ఉన్న ఆ అవిద్య అనే హృదయంలోని పీటముడిని త్రెంచివేయగలవాడు ఆదిశేషుడని భావం. భాగవత హృదయావిష్కరణకు పూర్తిగా విరుద్ధమైన ఈ అపపాఠం వ్రాతప్రతులలో ఎప్పుడు ప్రవేశించిందో చెప్పలేము కాని, ముద్రితప్రతులలోనూ అలాగే నిలిచిపోయింది.
5.8.
పంచమ స్కంధంలో ఉన్న నరకముల పేర్లన్నీ తెలుగులో అనుచితంగానూ, అస్తవ్యస్తంగానూ ఉన్నాయి. వాటిని సంస్కృతంలో సమంజసంగా ఉన్న తీరున దానిని సరిదిద్దుకోవాలి. ఆ దోషప్రయోగాలను, వాటి సవ్యరూపాలను మాత్రం వ్యాఖ్యానమేమీ లేకుండానే వరుసగా ఇక్కడ చూపుతున్నాను. (1). తప్తోర్మి – 5-2-136; తప్తశూర్మి, (2). అవీచిరయంబును- 5-2-136; అవీచియు, (3). రేతఃపానంబు – 5-2-136; అయఃపానంబు (?), (4). అపర్యావర్తనంబు, (5). (6). కాలసూత్ర – 5-2-142; సూకరాస్య (7). అగ్నితప్తంబులగు శూలంబుల న్నతని – 5-2-147; అగ్నితప్తంబులగు శూలంబుల సందంశంబుల న్నతని – 5-2-136; (8), విషంబు పెట్టువారలను – 5-2-153 విషంబు పెట్టువారలను సారమేయాదనంబున; (9), … నిరయంబునందు – 5-2-136; రక్షోగణభోజనం బను నిరయంబునందు. ఇవి కాక ఇంకా అనేకం ఉన్నాయి.
చివరిగా, మహాకవి గంగనామాత్యుని అనువాదంలో ముద్దులొలికే కొన్ని అందమైన పద్యాలను చూడండి:
నరులకు నే తపంబున ననంతసుఖంబులు గల్గుచుండు, శ్రీ
కరమతి నా తపంబుc దగఁ గైకొని చేసిన బ్రహ్మసౌఖ్యముం
దిరముగఁ గల్గు; వృద్ధులను, దీనులఁ బ్రోవుఁడు; దుష్టవర్తనన్
జరుగుచునుండు కాముకుల సంగతిఁ బోకుఁడు; మీఁద మేలగున్. (5-1-68)
అవును మఱి! సంగపరిత్యాగం చేసి ఆత్మనిష్ఠు లైనవారికి ఇంద్రియజయాన్ని, మనోలయాన్ని, దీనజనోద్ధరణను, మించిన తపస్సు ఏముంటుంది గనుక!
ఈ క్రింది పద్యంలో పోతన గారి ప్రసన్నకవితాశుద్ధిని పుణికిపుచ్చుకొన్నట్లు శబ్దాలంకారం ఎంత భావస్ఫోరకంగా ఉందో చూడండి:
రాజులు ప్రస్తుతింప వసురాజసమానుఁడనై, తనూజులన్
రాజులఁ జేసి, తాపసులు రాజఋషీంద్రుఁ డటంచుఁ బల్కఁగాఁ
దేజము నొంది, యా హరిణదేహము నందుల బ్రీతిఁ జేసి నా
యోజ చెడంగ నేఁ జెడితి యోగిజనంబులలోన బేల నై. (5-1-117)
మరికొన్ని వెలలేని మాణిక్యాలు:
కరువలిఁ బాయు వస్త్రమును గట్ట నెఱుంగవు; చూడ్కి దిక్కులం
బరపుచు జంచరీకములభాతిఁ జెలంగెదు; గంధరంబునం
బొరలెడు ముక్తకేశభరముం దుఱుమంగc దలంప; విప్పు డి
ట్లరుదుగ రత్నకందుకవిహారము సల్పెడు సంభ్రమంబునన్. (5-1-39)
గురువులు వాఱి, బిట్టుఱికి, కొమ్ములఁ జిమ్ముచు, నంతనంత డ
గ్గఱుచును, గాలు ద్రవ్వుచు, నఖంబుల గీఱుచు, గాసి సేయుచు
న్నొఱుగుచు, ధారుణీశ్వరుని యూరువులన్ శయనించి, యంతలో
నఱకడ మెక్కుచుం, బొదలి యాడుచు నా హరిణంబు లీలతోన్. (5-1-106)
కారణవిగ్రహంబు, నురుకాయము, నీ యవధూతవేషమున్,
భూరిధరామరత్వమును, బూర్వసమాగమ, మాత్మభావముం,
జారువిహార మత్యతులశాంతిగుణంబును, గూఢవర్తనం
బారయఁ గల్గు నీకు ననయంబును మ్రొక్కెదఁ బెక్కుభంగులన్. (5-2-56)
భారతవర్షజంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు ! నీ
భారతవర్షమందు హరి పల్మఱుఁ బుట్టుచు, జీవకోటికిం
ధీరతతోడ దత్త్వ ముపదేశము సేయుచుఁ జెల్మిసేయుచు
న్నారయ బాంధవాకృతిఁ గృతార్థులc జేయుచునుండు నెంతయున్.
ఇవన్నీ విద్యార్థులు, విద్యాధికులు కంఠస్థం చేయదగినవే. అధ్యాత్మయాత్రికులకు అఖండమైన దారిదీపం ఇది. దీనిని సుపరిష్కృతంగా రూపొందించి పఠితృలోకానికి సుముద్రాభద్రంగా అందజేయవలసిన బాధ్యత విద్వత్సాంయాత్రికులందరి భుజాల పైన ఉన్నది. ఆంధ్రుల జాతీయ మహాగ్రంథం ఇది!