ద్వితీయాశ్వాసం చివరను –
జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా! (5-2-163)
శ్రీతరుణీహృదయస్థిత!
పాతకహర! సర్వలోకపావన! భువనా
తీత! గుణాశ్రయ! యతివి
ఖ్యాతసురార్చితపదాబ్జ! కంసవిదారీ! (5-2-164)
దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండమండలమధ్యసంస్థిత! తత్త్వరూప! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలోద్ధర! ణార్తపోషణ! మత్తదైత్యనివారణా! (5-2-165)
అన్న పద్యాలున్నాయి. ఇవి శ్రీకృష్ణాంకితాలు. వీటిలో మొదటి పద్యం కొన్ని వ్రాతప్రతులలో –
జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!
అన్న రూపంతోనూ, చివరి పద్యం –
దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండవంశసుధాబ్ధిపూరసుధామయూఖ! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలేశ! నతార్తిపోషణ! మత్తదైత్యనివారణా!
అన్న మార్పుతోనూ శ్రీరామాంకితంగా ఉన్నాయి. రెండవ పద్యం ఏ మార్పూ లేకుండా శ్రీకృష్ణస్తుతిపరకంగానే ఉన్నది. ఎందువల్లనో శ్రీకృష్ణాంకితంగా ఉన్న పద్యాలూ, శ్రీరామాంకితంగా ఉన్న పద్యాలూ రెండూ సంతృప్తికరంగా లేవు. ఉన్నంతలో ఏదో ఒక అర్థం చెప్పుకొని సరిపెట్టుకొనవలసినట్లే ఉన్నాయి కాని, మహాకవిరచితాలుగా కనబడవు. “ఉ,జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ!” అన్నప్పుడు ఉజ్జ్వల = ప్రకాశమానమైన, తులసీ = తులసి మాల యొక్క, కురంగమద = కస్తూరీమృగమదము యొక్క, వాసన = వాసనము (సురభీకరణము, గుబాళింపు) చేత, వాసిత = పరిమళిస్తున్న, దివ్య = మనోహరమైన, దేహ = శరీరము గల స్వామీ అని అర్థం చెప్పుకోవాలి. మొదటి పద్యంలో “జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత!” అన్న తర్వాత, వెంటనే ఆ రెండవ పద్యంలో పునఃకథితంగా “అతివిఖ్యాతసురార్చితపదాబ్జ!” అనటం సముచితంగా లేదు. శ్రీకృష్ణార్థంలో “శ్రీనిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా!” అన్నదాని కంటె శ్రీరామాంకితంగా ఉన్నప్పటి “శ్రీనిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!” అన్న దళమే కొంత భావశుద్ధితో సమంజసంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణాంకితంగా శ్రీ = లక్ష్మీదేవికి, నిలయ = ఆవాసమైన, శరీర = తనువు గలవాడా, కృష్ణ = శ్రీకృష్ణా, ధరణీధర = భూదేవిని వక్షఃస్థలమున ధరించిన స్వామీ అని విడదీయటమూ, ఆ సమస్తభిన్నమైన రూపచిత్రమూ సరిగా లేవు. అంతకంటె, శ్రీనిలయ = శ్రీదేవీస్వరూపిణి అయిన సీతాదేవికి ఆవాసస్థానమవైన ప్రభూ, నిశాచరేంద్ర = రాక్షసరాజు లనెడి, ఘననీరద = దట్టంగా కమ్ముకొన్న మబ్బులకు, మారుత = తూలగొట్టే వాయుదేవుడ వైనవాడా అని శ్రీరామపరంగా అర్థం చెప్పుకోవటం సులభం. రెండింటిలో ఏ పాఠాన్ని తీసుకొందామన్నా ఆ వెంటనే ఉన్న (5-2-164) పద్యంలోని “శ్రీతరుణీహృదయస్థిత” అన్న సంబుద్ధి కొంత చర్చనీయం. ఇందాక శ్రీదేవికి ఆవాసమైన అన్నాడు కాబట్టి, ఇప్పుడు శ్రీదేవి హృదయంలో నెలకొన్నవాడు (ఆమె తన శరీరమందు, తాను ఆమె హృదయమునందు ఉన్న దంపతులు వారు) అని భావించాలి. “పాతకహర! సర్వలోకపావన!” అన్నదీ సరిగా లేదు. ఈ పంచమ స్కంధంలో వివిధపాపాలను చేసినవారికి భోగస్థానములైన వివిధనరకాల విపులవర్ణన ఉన్నది కాబట్టీ, శ్రీమన్నారాయణుని నామసంకీర్తనం సర్వపాపాలను హరింపజేస్తుందన్న ప్రస్తావం ఉన్నది కాబట్టీ “పాతకహర!” అన్న శ్రీకృష్ణసంబోధన సార్థకం గానే ఉన్నది కాని, ఆ వెంటనే సర్వలోకాలను పవిత్రీకరించేవాడా అర్థంలో “సర్వలోకపావన!” అన్న పునరుక్తి ఏ మాత్రం సమంజసంగా లేదు. పైగా మొదటి ఆశ్వాసం మొదటి పద్యంలోని “లోకాతీత! గుణాశ్రయ!” అన్నదే ఇందులో “భువనాతీత! గుణాశ్రయ!” అని పునరావృత్తమయింది. వ్రాతప్రతులను మళ్ళీ ఒకసారి తైపారువేసి పాఠాలన్నింటిని సమీకరించి సరిచూస్తే కాని సరైన పాఠమేదో, గంగనామాత్యుని రచన ఏదో తెలియరాని అస్తవ్యస్తపరిస్థితి నెలకొని ఉన్నది. పోతనగారి వలె ఆశ్వాసాదిని శ్రీకృష్ణాంకితం గానూ, ఆశ్వాసాంతంలో శ్రీరామాంకితం గానూ సరిచేయాలని తొలిరోజులలోనే ఎవరైనా ప్రయత్నించారేమో! అనుకొనవలసి వస్తున్నది. ప్రస్తుతస్థిత్యనుసారం అర్థావగతిని బట్టి బొప్పరాజు గంగనామాత్యుని పంచమ స్కంధం శ్రీకృష్ణాంకితమని అనుకోవటమే మేలు.
4. ఏకాశ్వాసమా? రెండాశ్వాసాలా?
ఈ చిన్ని స్కంధాన్ని ఏకాశ్వాసంగా నిలపటం కంటె రెండాశ్వాసాలుగా విభజించటం వల్ల కథాప్రణాళికకు చేకూరే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు. ఏకాశ్వాసంగా ఉండటమే సమంజసమనిపిస్తుంది. ఐనా, పరిష్కర్తలు దీనిని రెండాశ్వాసాల రచనగానే ముద్రించారు.
కథాభాగాన్ని చూస్తే అగ్నీధ్రుని మొదలుకొని జడభరతుని వరకు గల కథాభాగం మొదటి ఆశ్వాసంగా 184 గద్యపద్యాలలో ఉన్నది. రెండవ ఆశ్వాసంలో భరతుని వంశంలో భక్తాగ్రేసరుడైన గయుడనే రాజు కాలం దాకా జన్మించిన రాజులందరి కథలూ సంక్షిప్తంగా ఉన్నాయి. ఆ తర్వాత భూగోళస్వరూపం, నరకలోక వర్ణనం – మొత్తం 168 గద్యపద్యాలు. 1848లో తొలిసారి పూర్తి భాగవతాన్ని ముద్రించిన పురాణం హయగ్రీవ శాస్త్రిగారు మొదలుకొని పరిష్కర్తలందరూ తాళపత్రప్రతులలో ఈ రెండాశ్వాసాల విభాగం లేదని మొదటి ఆశ్వాసంలోని మొదటి పద్యం అధోజ్ఞాపికలో చెబుతూనే వస్తున్నారు. మొదటి ఆశ్వాసం తుదనున్న పద్యాలు మూడు, రెండవ ఆశ్వాసం మొదట ఉన్న పద్యమూ, దాని తర్వాత “సకలపురాణజ్ఞానవిఖ్యాతుం డగు సూతుం డి ట్లనియె” అన్న వచనమూ తాళపత్రప్రతులలో లేవని మళ్ళీ ఎక్కడికక్కడ అధోజ్ఞాపికలలో చెబుతూనే ఉన్నారు. ఆ పక్షాన హయగ్రీవ శాస్త్రిగారు రెండాశ్వాసాల విభాగాన్ని ఎక్కడినుంచి తీసుకొన్నారో, వ్రాతప్రతులలో లేని పద్యాలు వారికెక్కడ దొరికాయో సమాధానం చెప్పటం కష్టం. 1848లో హయగ్రీవశాస్త్రిగారి కంటె మునుపు భాగవతం కొన్ని కొన్ని విడివిడి భాగాలుగా వేర్వేరు పరిష్కర్తలచేత పరిష్కరింపబడి వేర్వేరు చోట్ల అచ్చయింది కాని, ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఈ పంచమ స్కంధం హయగ్రీవశాస్త్రిగారి కంటె మునుపు ఎవరూ అచ్చువేసినట్లు కనబడదు. ఒకవేళ అటువంటిదొకటి ఉన్నట్లయితే, వారెట్లా అచ్చు వేశారో పరిశీలింపగలుగుతాము. అటువంటిదొకటి లేకపోయినట్లయితే హయగ్రీవ శాస్త్రిగారి ముద్రణకు ఆకరమేదో ఇంకా బయల్పడవలసి ఉన్నదనే అనుకోవాలి. పోనీ ఆ పద్యాలేమన్నా అందంగా ఉన్నాయా? అంటే, అదీ సంశయాస్పదమే. ఆ పద్యాలివి:
నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య! దివ్యాంబరా
భరణాలంకృత! భక్తవత్సల! కృపాపారీణ! వైకుంఠమం
దిర! బృందావనభాసురప్రియధరిత్రీనాథ! గోవింద! శ్రీ
కర! పుణ్యాకర! వాసుదేవ! త్రిజగత్కల్యాణ! గోపాలకా! (5-1-181)
పరమపదనాథ! దుష్కృత
హర! కరుణాకర! మహాత్మ! హతదితిసుత! భా
సురగోపికామనోహర!
సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా! (5-1-182)
సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా! (5-1-183)
మొదటి పద్యాన్ని చూద్దాము. నరులు, దేవతలు, యక్షులు, మునీంద్రులచే సన్నుతింపదగినవాడా! అనటం సరే. ఆ నడుమ “అసురులు”, “రాక్షసులు” అంటూ “నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య!” అని అసుర-రాక్షసుల ప్రసక్తి ఎట్లా ప్రవేశించింది? అసుర-రాక్షస పదాల పునరుక్తిలో భేదకధర్మం ఏమిటి? పోనీ, రాక్షసవంశంలో ప్రహ్లాదాది మహాభక్తులు కూడా ఉన్నారని సమాసకల్పనను బట్టి సరిపెట్టుకోవటం ఎలా సాధ్యమవుతుంది? భక్తులయందు వాత్సల్యము కలవాడా అన్న అర్థంలో “భక్తవత్సల!” అన్న వెంటనే “కృపాపారీణ!” అన్న దళం పునరుక్తమే కదా. “బృందావనభాసురప్రియధరిత్రీనాథ!” అంటే భావం ఏమిటి? బృందావనము వలె భాసించే ప్రాణప్రియ అయిన భూదేవికి నాథుడు అని చెబుదామంటే అమహద్వాచకమైన బృందావనము మహతీవాచకమైన భూదేవికి విశేషణం అవుతుంది. అయినా ధరిత్రి బృందావనం కావటమేమిటి? బృందావనమునందు భాసించే ప్రియధరిత్రి అని చెబుదామంటే ధరిత్రి బృందావనంలో భాసించటం ఏమిటి? బృందావనభాసుర = బృందావనంలో ప్రకాశించేవాడా, ప్రియధరిత్రీనాథ = భూదేవికి ప్రియమైనవాడా అన్న అర్థకల్పనమూ భావ్యం కాదు. పైగా బృందావనభాసుర! ప్రియధరిత్రీనాథ అన్నవి ఏకసమాసం కాదు కనుక గణభంగం అవుతుంది. బృందావనభాసురప్రియ! ధరిత్రీనాథ! అని గణభంగం లేకుండా విడదీయాలంటే బృందావనమునందు బ్రాజిష్ణువు లైనవారికి ప్రీతిపాత్రుడా! అని అర్థకల్పన చేయటం నయం. “పుణ్యాకర” అన్న సంబోధనవిషయమూ ఆలోచింపదగినదే. భగవంతుడు పుణ్యాలకు ఆకరస్థానభూతుడు కావటం అన్వయించేది కాదు. భగవంతుడు పుణ్యకర్ముడే కాని పుణ్యములకు ఆకరుడనటం సరికాదు. పుణ్యులకు = సత్కర్ములైన ధర్మపరులకు, ఆకర = స్థానభూతుడా అనటానికీ వీలుండదు. అంతకంటె పుణ్యా = పావన గంగానదికి, ఆకర = జన్మస్థానీయుడా, జన్మస్థానమైన పాదయుగళం కలవాడా అని చెప్పటం మేలు. మనము స్థితగతిచింతనగా ఇన్ని అర్థాలను ఊహిస్తున్నామే కాని, పద్యరచన తీరును బట్టి కవి ఆ ప్రకారం ఆలోచించినట్లు కనబడదు. “బృందావనభాసురప్రియ!” అన్నవాడు వెంటనే ఆ తర్వాతి పద్యంలో పునరుక్తంగా “భాసురగోపికామనోహర!” అంటున్నాడు. “సరసిజదళనేత్ర!” అన్నదానికి అంత్యానుప్రాసగా “భక్తజననుతగాత్రా!” అంటే భక్తజనులచే సన్నుతింపబడిన (దివ్యమైన) శరీరము (యొక్క శోభ) కలవాడు అని అధ్యాహారం చేసుకోవాలన్నమాట.
ఆ తర్వాతి పద్యమూ అంతే. సరసులయొక్క హృదయములే వాసస్థానములుగా కలవాడు, సౌందర్యరాశి అయిన లక్ష్మీదేవియే తనయొక్క విలాసముగా కలవాడు అన్న వెంటనే “భరితశుభచరిత్రా!” అంటున్నాడు. స్వామి శుభచరిత్ర దేనితో భరితమై ఉన్నట్లు? సమాధానం లేదు. భరితశుభములతోడి చరిత్రను గలవాడా! అనటమూ సాధ్యం కాదు. “నిండైన శుభచరిత్ర కలవాడా“ అని పెద్దలు వ్రాసినది అన్వయింపదు. ముందు పద్యంలో “సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా!” అన్నవాడు వెంటనే ఈ పద్యంలో “భాస్కరాబ్జారినేత్రా! నిరుపమఘనగాత్రా!” అన్నాడు. తామరరేకుల వంటి కన్నులు కలవాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు; భక్తులచే పొగడికను గన్న శరీరము కలవాడు, సాటిలేని మేఘమును పోలిన నల్లని శరీరము కలవాడు అని అర్థభేదం ఉన్నది కదా, అందామంటే అంత వెంటవెంటనే అనుప్రాసను పునరుక్తం చేయటం కల్పనాసౌభాగ్యానికి, ప్రతిభావిలసనకు నిదర్శకం కాగలదా? “నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!” అన్నప్పుడు భగవంతుడు నిర్మలజ్ఞానానికి పాత్రుడు కావటం ఏమిటి? “గురుతరభవదూరా” అన్న సమాసానికి అర్థమూ అంతే. గురుతర = భారమైన, భవ = సంసారబాధలను, దూరా = దూరం చేసేవాడా – అని పెద్దలు చెబుతున్న అర్థం సరికాదు. భవమునకు దూరుడు = సంసారాతీతుడు అని చెప్పుకొందామంటే సంసారమునకు గురుతరము అన్న సుభగవిశేషణం ఎట్లా అన్వయిస్తుంది? పారమార్థికం కాకపోయినప్పటికీ వ్యావహారికసత్యమై బృహత్తమంగా గోచరీభవించే సంసారమునకు అతీతుడు అని చెప్పుకోవాలి. పద్యరచన తీరును బట్టి అది కవి భావమైనట్లు కనిపించదు.
ఏ ప్రకారంగా చూసినా ఈ ప్రథమాశ్వాసాంతపద్యాలు బొప్పరాజు గంగనామాత్యునివి కానే కావని చెప్పవచ్చును. ద్వితీయాశ్వాసం మొదటనున్న
శ్రీకాంతాహృదయప్రియ!
లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లోక! భవభయనివారక!
గోకులమందార! నందగోపకుమారా! (5-2-1)
అన్న పద్యం మళ్ళీ అమోఘంగా ఉన్నది. ప్రథమాశ్వాసం మొదటి పద్యమూ “నందగోపకుమారా!” అనే అంతమవుతున్నందున ఆ మొదటి పద్యాన్ని చూసి కొంత సమర్థుడైన కవి దీనిని కల్పించాడేమో చెప్పలేము. “గోకులవిస్తార! నందగోపకుమారా!”, “గోకులమందార! నందగోపకుమారా!” అని ఒకే కవి రెండు ఆశ్వాసాల మొదటి పద్యాలలోనూ శతకరచనలలో వలె పునరుక్తం చేసి ఉంటాడనటమూ భావ్యంగా లేదు. కనుక ఇదీ గంగనామాత్యునిది కాదనే భావింపవలసి ఉంటుంది.
మొత్తానికి తాళపత్రాలలో ఏకాశ్వాసంగా ఉండగా – అంతగా రచనాకౌశలి చాలని ప్రాథమికుడెవరో ఆధునికకాలంలో ఎందుకో నిష్కారణంగా ఈ ఆశ్వాసవిభాగాన్ని చేసినట్లు ఊహింపవలసి వస్తున్నది. అందువల్ల భాగవత భావిముద్రాపకులు ఈ విభజనను త్యజించి, రెండు ఆశ్వాసాంత గద్యలను కలిపివేసి ఈ పంచమ స్కంధాన్ని ఏకాశ్వాసంగా ముద్రించటమే భావ్యమని చెప్పటానికి ఇంత సుదీర్ఘంగా చర్చింపవలసివచ్చింది.