అను.1 – కళావిలాసము లోని పద్యాలు: మానవల్లి వారి ప్రాకరనిరూపణం

నన్నెచోడుని కళావిలాసము లభింపకపోయినప్పటికీ, అందులోని పద్యాలు – 1) కవిసంజీవని, 2) రత్నాకరము, 3) అథర్వణచ్ఛందము, 4) గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణి అన్న నాలుగు లక్షణగ్రంథాలలో లభించాయని రామకృష్ణకవిగారు చేసిన ప్రమాణీకరణాన్ని కొంత పరిశీలించాలి.

1. కవిసంజీవని

నిజానికి కవిసంజీవని అన్న పేరుతో మనకు ఏ లక్షణగ్రంథమూ ఈనాటి వరకు లభింపలేదు. ఆ పేరుతో ఏ గ్రంథాన్నీ పూర్వకవులు, లాక్షణికులు ఉదాహరింపలేదు. మనకు తెలిసినదల్లా ముద్దరాజు రామన (1580-1650) రచించిన కవిజనసంజీవని ఒక్కటే. అందులో నాలుగు తరంగాలు మాత్రమే లభించాయి. ఆ కవిజనసంజీవనికి కవిసంజీవని అన్న పర్యాయనామం లేదు. అది లక్షణగ్రంథమే కాని అందులో చెప్పబడిన లక్షణాలకు ఉదాహరణలుగా పూర్వకవిప్రయోగాలు లేవు. ముద్దరాజు రామన కవిజనసంజీవనిలో తాను చెప్పిన లక్షణాలకు ప్రసంగవశాన తానై ఉదాహృతులను చూపటమే తప్ప ఏ లక్షణానికీ ఏ గ్రంథంలోనుంచీ దేనికీ ఏ సందర్భంలోనూ సిద్ధలక్ష్యాలను చూపలేదు. అందువల్ల నన్నెచోడుని కళావిలాసములో నుంచి లక్ష్యభూతమైన ఏ పద్యాన్నీ ముద్దరాజు రామన కవిజనసంజీవనిలో ప్రదర్శించి ఉండటం సంభవం కాదు. కవిజనసంజీవనికి వావిళ్ళ వారు అచ్చువేసిన మూలప్రతికంటె అదనంగా కొన్ని పద్యాలున్న ప్రతి ఒకటి చాగంటి శేషయ్య గారికి దొరికినట్లు ఆంధ్రకవితరంగిణిలోని వారి నిర్దేశాన్ని బట్టి తెలుస్తున్నది కాని, అందులోనూ పూర్వకవుల లక్ష్యపద్యాలు ఉన్నట్లు లేవు. కవిసంజీవని అంటే రామకృష్ణకవిగారి ఉద్దేశం ముద్దరాజు రామన కవిజనసంజీవనియే కావచ్చునన్న ఊహకు అవకాశం కల్పిస్తూ రామకృష్ణకవిగారే రెండు మూడు చోట్ల ఆ అర్థం వచ్చే మాటలను వ్రాశారు. 1914 నాటి కుమారసంభవము రెండవ భాగము పీఠికలో వారే,

“కుమారసంభవ కలావిలాసముల మొదట నథర్వణుఁ డుదాహరించెను. పెద్దన, రామన, గణపవరపు వేంకటకవియు నీగ్రంథములలోనిపద్యము లుదాహరించిరి.” — (మానవల్లికవి రచనలు: పుట. 35)

అని వ్రాశారు. ఈ లేఖనాన్ని బట్టి ఇందులో ప్రసక్తుడైన రామన — కవిజనసంజీవని కర్త ముద్దరాజు రామన అని, అదే కవిగారు ఉద్దేశించిన కవిసంజీవని అని ఊహించటానికి వికల్పం ఉండకూడదు. అయితే వారే తమ ఇతరవ్యాసాలలో రెండు మూడు చోట్ల అందుకు విరుద్ధంగా –

“కవిసంజీవని యనియు, సర్వలక్షణసారమనియు, బాలబోధ మనియు సందిగ్ధనామములు గల యొకానొక లక్షణగ్రంథమున …”

అని కూడా వ్రాశారు. దానిని బట్టి కవిసంజీవని అంటే మనకు తెలిసిన ముద్దరాజు రామన కవిజనసంజీవని కాదని; అది వేరొక కవిసంజీవని కావచ్చునని; కవిసంజీవని అనాలో, సర్వలక్షణసారము అనాలో, లేక బాలబోధము అనాలో సందిగ్ధత ఉన్న ఆ వేరొక లక్షణగ్రంథాన్ని రామకృష్ణకవిగారు చూశారని; పైని పేర్కొన్న నన్నెచోడుని కళావిలాసము లోని ఉదాహరణపద్యాలు అందులో ఉండి ఉంటాయని మనము ఊహింపవలసి వస్తున్నది. అసలొక పుస్తకానికి ఇన్ని సందిగ్ధనామాలు ఉండటం కూడా ఒక విచిత్రసన్నివేశమే.

కవిగారు చెప్పిన పేర్లు గల పుస్తకాలకోసం గాలించినప్పుడు తెలిసివచ్చిన వివరాలివి:

సర్వలక్షణసారము అన్న పేరుతో తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీమహల్ గ్రంథాలయంలో D. 714 సంఖ్య గల తాళపత్ర ప్రతి ఒకటున్నది. గ్రంథంలో ఎక్కడా కవి పేరు లేదు. గ్రంథనామం లేదు. తాళపత్రాల కట్ట ముఖబంధం మీద మాత్రమే సర్వలక్షణసారము (రంగయ) అని ఉన్నది. గ్రంథారంభానికి మునుపు శుభమస్తు, సర్వలక్షణసారం అని ఉన్నది. ముఖపత్రంలో ఛందస్సు – సకలలక్షణసారం సాహిత్యలక్షణం, అని ఉన్నది. దీనిని బట్టి సర్వలక్షణసారము అన్నది ఒకప్పుడు తాళపత్రాల పట్టికను రూపొందించినవారు పెట్టిన సంకేతనామం అనుకోవటానికి కూడా వీలున్నది. రావూరి దొరసామిశర్మ ఇది కస్తూరి రంగకవి కృతమని భావించారు (చూ. తెలుగు భాషలో ఛందోరీతులు – పు.401). ఈ తాళపత్ర ప్రతి తుదను, నన్నెచోడ కుమారసంభవము అన్న శీర్షిక క్రింద ‘నెఱి గలుగు నాఁడునాఁటికి’ అన్న నన్నెచోడుని కుమారసంభవం అష్టమాశ్వాసంలోని 7-వ పద్యం ఉన్నది. నన్నెచోడుని కళావిలాసములోని పద్యాలు ఇందులో లేవు.

ఇదిగాక రామకృష్ణకవిగారు చెప్పిన సర్వలక్షణసారము అన్న పేరుతో వేరొక గ్రంథం లేదు. నన్నయ పేరిటిదిగా వెలసిన లక్షణసారము ఒకటున్నది. అది ఆదికవి నన్నయ కృతి కాకపోయినా, ఆంధ్రశబ్దచింతామణిని రచించిన మరొక (అభినవ) నన్నయ కృతి కావచ్చునని ఒక విశ్వాసం. కస్తూరి రంగకవి ఆనందరంగరాట్ఛందములో ఇచ్చిన ఉదాహరణలను బట్టి ఆ లక్షణసారము కర్త మహావిద్వాంసుడైన ఆంధ్రశబ్దచింతామణి కర్త కాకపోవచ్చుననిపిస్తుంది. వేరొక నన్నయ కృతి కావచ్చునేమో చెప్పలేము. ఏది ఏమైనా అందులో నన్నెచోడుని కళావిలాసము లోని పద్యాలు లేవు.

పైన ఉదహరించిన వాక్యంలోని పెద్దన లాక్షణికాగ్రేసరుడైన చిత్రకవి పెద్దన అనుకొంటే, ఆ పెద్దన కృతి లక్షణసారసంగ్రహము ఉన్నది. దానికీ సర్వలక్షణసారము అన్న నామాంతరం లేదు. ఆ చిత్రకవి పెద్దన కృతిలోనూ లక్ష్యాలుగా ఏ ఇతరకృతులలోని ఉదాహరణలూ లేవు. నన్నెచోడుని కళావిలాసము లోని పద్యాలు లేవు.

ఇంకా – రత్నాకరం గోపాలకవి సకల లక్షణసారసంగ్రహము, ఉప్పులూరి వేంకటరెడ్డి సకల లక్షణసారసంగ్రహచింతామణి, అడిదము బాలభాస్కరకవి లక్షణసారము, కూచిమంచి తిమ్మన సకల లక్షణసారసంగ్రహము, ఓరుగంటి రామకవి కవితాలక్షణసారము, పాపినేని వేంకటసామి నాయని ఛందశ్శాస్త్రలక్షణసారసంగ్రహము, దంతిని అప్పకవి లక్షణసారసంగ్రహము, అడ్డనూరి రామదాసు సకల లక్షణసారము — మొదలైన లక్షణకృతులలో నన్నెచోడుని కళావిలాసము లోని పద్యాలు లేవు.

కాగా, కవిగారు పేర్కొన్న బాలబోధచ్ఛందస్సు అన్న పేరుతో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనసంస్థలో ప్రతి (R. 1212) ఒకటున్నది. రామకృష్ణకవిగారు తమ వ్యాసాలలో పెక్కు సందర్భాలలో ఉదాహరించిన పూర్వకవుల గ్రంథాలలోని పద్యాలలో కొన్ని కేవలం ఆ ఒక్కదానిలో మాత్రమే ఉన్నాయి. వారిచ్చిన ఆ పద్యాలు అందులో తప్ప వేరెక్కడా లేవు. అందువల్ల వారంటున్న బాలబోధచ్ఛందస్సు తిరుపతిలో మనకిప్పుడు ఉపలభ్యంగా ఉన్న బాలబోధచ్ఛందస్సు ప్రతే అన్నమాట స్పష్టం. అది తెనాలి రామకృష్ణకవి అల్లుడు లింగమగుంట తిమ్మన కృతి అని కౌలూరి ఆంజనేయకవి సుకవికర్ణామృతములో చెప్పాడు. సుకవికర్ణామృతము క్రీస్తుశకం 1600 నాటి సంధానం అయితే, బాలబోధచ్ఛందస్సు దానికి మునుపు, అంటే, 16వ శతాబ్ది ఉత్తరార్ధంలో వెలసి ఉండాలి. అందులోనూ నన్నెచోడుని కళావిలాసము లోని పద్యాలు లేవు.

1923లో మడికి సింగన సకలనీతిసమ్మతమును ప్రకటించినప్పుడు రామకృష్ణకవిగారు పీఠికలో –

“బాలబోధమనియు గవిసంజీవని యనియు సందిగ్ధనామములు గల యొక్క ఛందోగ్రంథమున ముద్రామాత్య నీతిభూషణ పురుషార్థసారముల నుండి పద్యము లుదాహృతము లయ్యె” — (మానవల్లికవి రచనలు: పు.104)

అని అక్కడ మరొకవిధంగా వ్రాశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనసంస్థలో ఉన్న బాలబోధచ్ఛందస్సుకు కవిసంజీవని అన్న నామాంతరం లేదు. ఆ ప్రతిలో వారు పేర్కొన్న ఎన్నో అపూర్వమైన కావ్యాలలోని పద్యాలున్నాయి కాని, ముద్రామాత్య నీతిభూషణ పురుషార్థసారాల లోని పద్యాలు మాత్రం లేవు. ఆ ముద్రామాత్యాది పద్యోదాహరణలు కలిగిన ప్రతి వేరొకటి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి గ్రంథాలయంలో D. 705 (M. 326) సంఖ్యతో ఛందోగ్రంథము అన్న పేరిట ఉన్నది. రామకృష్ణకవిగారు ముద్రామాత్యము లోనిది అని ఉదాహరించిన పద్యమే అందులో ముద్రారాక్షసము లోనిదిగా ఉదాహృతమై ఉన్నది. అందులో తప్ప ఆ పద్యం మరెక్కడా లేదు. ముద్రారాక్షసము, ముద్రామాత్యము అన్న పేర్లలో అంతగా వ్యత్యాసమేమీ లేదు కాబట్టి, పాఠభేదం లేని ఆ పద్యోదాహరణను బట్టి, ఛందోగ్రంథములో ముద్రారాక్షసము అని ఉదాహృతమైన శీర్షికనే రామకృష్ణకవిగారు ముద్రామాత్యము అని పేర్కొన్నారని ఊహింపవచ్చును. అయితే, ఆ ఛందోగ్రంథము అన్న పుస్తకానికి బాలబోధచ్ఛందస్సు అన్న పేరు లేదు. దానికి సర్వలక్షణసారము అన్న నామాంతరం లేదు. పోనీ, దానినే రామకృష్ణకవిగారు బాలబోధచ్ఛందస్సు అని వ్యవహరించారనుకొంటే, అందులోనూ నన్నెచోడుని కళావిలాసము నుంచి పద్యాలు లేవు.

మొత్తానికి కవిసంజీవని, సర్వలక్షణసారము, బాలబోధచ్ఛందస్సు ఒకటైనా కాకపోయినా, నన్నెచోడుని కళావిలాసములోని పద్యాలున్న ప్రతి మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదన్నమాట.

మరొక విచిత్రసన్నివేశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కుమారసంభవము ద్వితీయభాగం తుదను రామకృష్ణకవిగారు తమ లఘుటీకలో ఉదాహరింపబడిన లక్షణగ్రంథాల పట్టికను పేర్కొన్నారు. ఆ పేర్లివి: అథర్వణచ్ఛందము, కవివాగ్బంధనము, కవిలోకసంజీవని, లక్షణసారసంగ్రహము (పెద్దన), లక్షణశిరోమణి (వేంకటకవి), అప్పకవీయము, కవిజనాశ్రయము (గోకర్ణుఁడు) మొదలగునవి. – (మానవల్లికవి రచనలు: పుట. 64)

ఇందులో కవిసంజీవని లేదు. ఆ స్థానంలోకి సరికొత్తగా కవిలోకసంజీవని వచ్చి చేరింది. దీనిని గురించి కవిగారు వ్రాయలేదు. మనకిప్పుడు వివరాలు తెలియవు. వెల్లంకి తాతంభట్టు కవిచింతామణిని రామకృష్ణకవిగారు కొన్నిచోట్ల కవిలోకచింతామణి అని వ్యవహరించారు. అయితే ఆ కవిలోకచింతామణి లోనూ కళావిలాసము లోని పద్యాలు లేవు. కవిలోకసంజీవని అన్నది కవిసంజీవనికి మారుగానో కవిజనసంజీవనికి మారుగానో పొరపాటున ఉదాహరించినదై ఉంటుంది. పై గ్రంథనామాలు కళావిలాస విమర్శ సందర్భంలో ఉదాహరించినవి కాకపోయినా, ఆ కవి వాగ్బంధనము, అప్పకవీయము, కవిజనాశ్రయము గ్రంథాలలో కూడా కళావిలాసము లోని పద్యాలు లేవు.

పైని వాక్యంలో కవిజనాశ్రయము (గోకర్ణుఁడు) అన్నది ముద్రణదోషమై ఉంటుంది. కవిజనాశ్రయము, గోకర్ణచ్ఛందస్సు అన్నవి రెండూ వేర్వేరు లక్షణగ్రంథాలు. కవిజనాశ్రయములో నన్నెచోడుని కళావిలాసములోని పద్యాలు లేవు. గోకర్ణచ్ఛందస్సులోనూ ఇప్పటి వరకు లభించిన పద్యాలలో నన్నెచోడుని కళావిలాసము లోని పద్యాలు లేవు.

2. రత్నాకరము

నన్నెచోడుని పద్యాలకు రామకృష్ణకవి గారు ప్రమాణీకరించిన రెండవ పుస్తకం రత్నాకరము అన్నది. ఆ పేరుతో కావ్యచ్ఛందోవ్యాకరణాది లక్షణగ్రంథమేదీ తెలుగులో లేదు. రత్నాకరము అన్న నామాంశం కలిగినవి గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరము ఒకటి, వెల్లటూరి లింగన సరసాంధ్రవృత్తరత్నాకరము ఒకటి – ప్రసిద్ధమైనవి రెండు ఉన్నాయి. గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరము అంటే – పైని రామకృష్ణకవి గారు చెప్పిన సర్వలక్షణశిరోమణిలోని ఒక భాగమే కాని, అదొక స్వతంత్రకృతి కాదు. ఆ ఆంధ్ర ప్రయోగరత్నాకరములోని పద్యాల విషయాన్ని తర్వాత వివరిస్తాను. వెల్లటూరి లింగన కృతి వృత్తయతిప్రాసల లక్షణసంగ్రహం. అందులో నన్నెచోడుని కళావిలాసము నుంచి ఉదాహరణలు లేవు. గొప్ప పండితుడు, చిత్రబంధకవి అయిన త్యాగరాజ మొదలి రచించిన ఛందోరత్నాకరము ఉన్నది కాని, 19-వ శతాబ్ది తుదికాలంలో వెలసిన ఆ రచన ఇక్కడ చర్చనీయం కాదు. ఆ మాటకు వస్తే అందులోనూ నన్నెచోడుని కళావిలాసము నుంచి ఉదాహరణలు లేవు.

అందువల్ల రామకృష్ణకవి గారి దృష్టిలో రత్నాకరము అంటే, తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీమహల్ గ్రంథాలయంలో ఉన్న పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరము అనే అనుకోవాలి. అది మూడాశ్వాసాల గొప్ప సంధానగ్రంథం. అందులో కళావిలాసము నుంచి పద్యాలున్నాయి. ఆ పద్యాలకు జగన్నాథకవి నన్నెచోడుఁడు – కళావిలాసము అని కవి పేరును ముందుంచి పేర్కొనవలసినదే కాని, ఎందుకనో కళావిలాసము అని ఇచ్చి ఊరుకొన్నాడు. ‘నన్నెచోడుఁడు – కళావిలాసము’ అని కవి పేరును పేర్కొనలేదు. అయినా, ఆయన ఇచ్చిన కళావిలాసములోని పద్యాలను నన్నెచోడుని పద్యాలుగానే రామకృష్ణకవిగారు పరిగ్రహించారు. పెదపాటి జగన్నాథకవి అని సంధాత పేరును గాని, పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధరత్నాకరము అన్న పేరును గాని ఆయన ఎందుకో పేర్కొనలేదు. నిజానికి కుమారసంభవ పీఠికలోనూ, ఇతరానేకవ్యాసాలలోనూ వారు ఉదాహరించిన కనీ వినీ ఎరుగని అపూర్వమైన కావ్యాలలోని ఎన్నెన్నో పద్యాలు పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో ఉన్నప్పటికీ అవి ఆ గ్రంథము లోనివేనని వారెన్నడూ చెప్పలేదు. ఇప్పటికీ రామకృష్ణకవిగారు ఉదాహరించిన ఆ పద్యాలలో అనేకం పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో తప్ప మరెక్కడా కనబడవు. అందువల్ల కవిగారి దృష్టిలో రత్నాకరము అంటే, వారు చెప్పకపోయినా – కళావిలాసము పద్యాలున్నాయి కనుక పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధరత్నాకరము అని నిర్ధారింపవచ్చు. అందులోని ఉదాహరణలను అధికరించి తర్వాతి అధ్యాయాలలో మళ్ళీ విపులంగా వ్రాస్తాను.

3. అథర్వణచ్ఛందము

రామకృష్ణకవిగారు పైని పేర్కొన్న అథర్వణచ్ఛందము మరీ జటిలమైన సమస్య. దానిపై వచ్చిన తర్జనభర్జనలను, వాటి ఔగాములను నేనిక్కడ సమీక్షించటం లేదు. పార్యంతికసారసంగ్రహం మాత్రం ఇది:

అథర్వణుడు నన్నెచోడుని కళావిలాసము నుంచి పద్యాలను అందులో ఉదాహరించినట్లు ఆధారాలు లేవు. మానవల్లి రామకృష్ణకవిగారు తమ సంచయంలో ఉన్నదని పలుమార్లు చెప్పిన ఆ ఆథర్వణీయాన్ని ఎవరూ చూచి యెరుగరు. అథర్వణ భారతము లోనివని వివిధసందర్భాలలో వారిచ్చిన పద్యోదాహరణలలో ఏ పద్యాన్ని ఏ పుస్తకంలోనుంచి తీసుకొన్నదీ వారు చెప్పకపోయినా, అవి చాలా వరకు నలుగురికీ తెలిసిన పుస్తకాలలోనివే. వాటిలో ఒకానొక పద్యాన్ని గురించిన విమర్శను చూడండి. అథర్వణచ్ఛందములో నుంచి కుమారసంభవ కర్త నన్నెచోడుని ప్రసక్తి కలిగినదని వారిచ్చిన పద్యం ఉదాహరణ ఈనాటికీ వివాదాస్పదంగానే ఉన్నది. పుస్తకస్థంగా దానిని చూచినవారు ఒక్కరూ లేరు. ఆ అథర్వణచ్ఛందము మాటెలా ఉన్నా అందులో కళావిలాసములోని పద్యాలలో దేనిని అథర్వణుడు ఎక్కడ ఏయే సందర్భాలలో ప్రస్తావించాడో రామకృష్ణకవిగారు చెప్పలేదు.

4. సర్వలక్షణశిరోమణి

ఇక, గణపవరపు వేంకటకవి సర్వలక్షణశిరోమణి విషయం మిగిలింది. తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీమహల్ గ్రంథాలయంలో దీనిలోని భాగమైన ఆంధ్ర ప్రయోగరత్నాకరము వ్రాతప్రతులు రెండు (D. 695-696 వరుస సంఖ్యలతో) ఉన్నాయి. ఇది సాహిత్యచరిత్రకారులు, పరిశోధకులు ఊహించినట్లు ఒక ప్రత్యేకగ్రంథం కాదు. గణపవరపు వేంకటకవి రచించిన సర్వలక్షణశిరోమణి అన్న పేరు గల ఒక బృహల్లక్షణగ్రంథంలోని ఆరవ ఉల్లాసం. ఆ అభిజ్ఞాతవిశేషాలను నేను ‘గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము: సాహిత్య లక్షణ చిత్రకవిత్వానుశీలనము,’ అన్న నా సిద్ధాంతగ్రంథంలో వివరించాను. ఆంధ్ర ప్రయోగరత్నాకరము ప్రతులు రెండు మునుపు కాకినాడలోని ఆంధ్రసాహిత్యపరిషత్తు వారి గ్రంథాలయ (నేటి ఆంధ్రసాహిత్యపరిషత్తు ప్రభుత్వ పురావస్తుసంగ్రహాలయం, పరిశోధన సంస్థ) సంచయంలో ఉండేవి. 1960 దశకంలో అదృశ్యమైపోయాయట. ఇప్పుడు లేవు. తంజావూరులో ఉన్న వ్రాతప్రతులకు మైక్రోఫిల్ములు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య పరిశోధన సంస్థ వారి లిఖితపుస్తక భాండాగారంలో ఉన్నాయి. వాటి స్థితి అంత సముచితంగా లేదు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి గ్రంథాలయంలో తంజావూరులోని ప్రతులకే కాగితపు ప్రత్యంతరాలు మంచి స్థితిలో ఉన్నాయి. తంజావూరులో ఉన్న ఆంధ్ర ప్రయోగరత్నాకరము మంచి స్థితిలో ఉంది.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనసంస్థలో ఆంధ్ర ప్రయోగరత్నాకరము కాగితం ప్రతి (D. 7284) ఒకటున్నది. ఇది తంజావూరు ప్రతికంటె కొంత భిన్నమైనది కాని, చాలా విలువైన ప్రతి. ఇందులోనూ కళావిలాసము నుంచి -– తంజావూరులోని ఆంధ్ర ప్రయోగరత్నాకరము ప్రతిలో ఉన్నవే –- ఆ రెండు పద్యాలే ఉన్నాయి.

మొత్తంమీద రామకృష్ణకవిగారు చెప్పిన 1) కవిసంజీవని, 2) రత్నాకరము, 3) అథర్వణచ్ఛందము, 4) గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణి అన్న నాలుగు గ్రంథాలలో — పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరము లోనూ, గణపవరపు వేంకటకవి రచించిన సర్వలక్షణశిరోమణిలోని ఉల్లాసమైన ఆంధ్ర ప్రయోగరత్నాకరములోనూ మాత్రమే నన్నెచోడ కళావిలాసములో నుంచి పద్యాలు ఉన్నాయన్నమాట. ఈ పట్టికనుంచి అలభ్యాలైన కవిసంజీవని, అథర్వణచ్ఛందము అన్న రెండు పేర్లను తొలగిస్తే కళావిలాసము కావ్యం క్రీస్తుశకం 10-వ శతాబ్ది నాటిది కావచ్చునన్న పౌర్వికతకు ముప్పు వాటిల్లితుందన్నమాట.


ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...