కర్తృత్వ వివాదాలు
ఈనాడు త్రిపురాంతకోదాహరణము కర్తృత్వాన్ని గురించిన వాదవివాదాలేవీ లేవు. అయితే, తంజావూరు మహారాజా శరభోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయం వారు 1933లో ప్రకటించిన A Descriptive Catalogue of the Telugu Manuscripts in The Tanjore Mahārāja Serfoji’s Sarasvatī Mahāl Library సంపుటం లోని 37-వ పుటలో:
“తలఁకి సీనమరాజు దాడి కోడినవాని”, “వరలు పరమానందవనధి తీర్థము వలన” అని యీ గ్రంథమున నిద్దఱి పేరులు గన్పట్టుచున్నవి. వీరిలో గ్రంథకర్త యీతఁడని నిశ్చయింప వీలుగాకున్నది”
అని వ్రాశారు. అందులోనే, ఆంగ్లవ్యాఖ్యలో:
“There is a printed work of the same name attributed to Tripurantaka. Whether this Ms. represents the printed work needs examination”
అని కూడా సందేహవ్యక్తిగా వ్రాశారు. ఈ రెండు సందేహాలకు త్రిపురాంతకోదాహరణములోని పీఠికలో నిడుదవోలు వెంకటరావు గారు సమాధానం చెబుతూ – ద్వితీయావిభక్తి కళికలో:
మఱియు వేలుపులేటి – మౌళి నాఁగినవాని
నెఱయఁ గన్నప నోటి – నీటఁ దోఁగినవానిఁ
బొలఁతితో నొక్కొడలఁ – బొత్తుఁ గూడినవానిఁ
దలఁకి సేనమరాజు – దాడి కోడినవాని
అన్న పంక్తిలో ఉన్న సేనమరాజు (?సేరమరాజు) క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దికి మునుపటి వాడైన చేరమరాజు అని, అందువల్ల అతనిని గ్రంథకర్తగా పొరబడరాదని; “వరలు పరమానంద – వనధితీర్థము వలన” అన్న దళం పంచమీవిభక్తి కళికలోని
“మఱియు సకలాశ్రితుల – మనుచు నర్థము వలన
వఱలు పరమానంద – వనధితీర్థము వలన”
అన్న పంక్తిలోని ప్రయోగమే కాని, ఆ ప్రయోగాన్ని పరమానంద యతి లేదా పరమానంద తీర్థులనే గ్రంథకర్త పేరుగా పొరబడరాదని వ్రాశారు. అందువల్ల ఈ అభిప్రాయం పరాస్తమైంది.
త్రిపురాంతకోదాహరణము: గిడుగువారి ప్రతి
గిడుగు రామమూర్తి పంతులు గారు, వావిళ్ళ వారికోసం పరిష్కరించిన అప్పకవీయము (1924) పీఠికలో అప్పకవి భస్మార్థకమైన “నీఱు” శబ్దానికి “త్రిపురాంతకదేవుని యుదాహరణమునందు” అని పేర్కొని (2-214), త్రిపురాంతకోదాహరణములోని చతుర్థీ విభక్తి పద్యాన్ని ఉదాహరించిన చోట అధోజ్ఞాపికలో –
“ఇది యెనిమిది తాటాకుల పుస్తకము. గ్రంథకర్త గుండయ కవి.”
అని పేర్కొన్నారు. తంజావూరులో ఉన్న తాటాకుల ప్రతిలో 11 ఆకులు ఉన్నాయని పైని పేర్కొన్న గ్రంథసూచిని బట్టి తెలుస్తున్నది. కనుక దీనిని బట్టి గిడుగువారి దగ్గరున్న తాళపత్ర ప్రతి వేరొకటని అర్థమవుతుంది. అందులో ఎనిమిదే ఆకులు ఉన్నాయన్న మాట. ఇప్పుడది ఏమయిందో తెలియదు. అప్పకవి “త్రిపురాంతకదేవుని యుదాహరణమునందు” అని పేర్కొనగా, గిడుగు వారు “గ్రంథకర్త గుండయ కవి” అని ఎందుకు వ్రాశారో ఇప్పుడు ఊహింపలేము.
త్రిపురాంతకోదాహరణములోని చతుర్థీవిభక్తి ఉత్కళికలో “వెనుఁద్రిప్పిన గుండము లోపలఁ గై, కొని చని తనయెప్పటి రూపముకై, కొని గుండయ మెచ్చిన వేల్పునకై, వినతపితామహఫణితల్పునకై” అన్న చోట తప్ప వేరెక్కడా గుండయ పేరు లేదు. అది గిడుగు వారి అపార్థానికి కారణమయిందో, లేక వారి వద్ద ఉండిన తాళపత్ర ప్రతి ముఖపత్రం పైని “గుండయ కవి రచన” అని వ్రాసి ఉండినదో చెప్పలేము.
కారణం ఏమైనప్పటికీ అప్పకవీయము తర్వాతి ముద్రణలలో గిడుగు వారి పై వ్యాఖ్యను ప్రచురణకర్తలు తొలగించివేశారు. అందువల్ల త్రిపురాంతకుని కర్తృత్వవిషయం పరిష్కృతమైనప్పటికీ పాఠపరిష్కరణార్థం గిడుగు వారి ఆ ప్రతి ఇప్పుడు లేదన్న శోచనీయసంగతి మాత్రం మిగిలిపోయింది.
ఉదాహరణ ప్రక్రియ
త్రిపురాంతకోదాహరణము రావిపాటి త్రిపురాంతకుని శివభక్తిపారమ్యానికి, హృద్యమైన పద్యవిద్యానవద్యతకు, పూర్వకవికావ్యచర్వితచర్వణకు, ఉదాత్తమైన పదసంపదకు, భవ్యమైన భావుకప్రియంభావుకతకు, సంప్రదాయాభిజ్ఞతకు, రసోద్గారమైన కావ్యశయ్యకు, సహృదయప్రీతిపాత్రమైన రీతిసౌభాగ్యానికి, మార్గకవితాధ్వనీనులైన మహాకవులు దేశీయచ్ఛందఃకందళిని ఎగురవేసిన ప్రగల్భతకు, అంతులేని ప్రాంతీయాభిమానానికి నిదర్శకమైన మహారచన.
ఈ ఉదాహరణ ప్రక్రియకు ఆంధ్రుడైన అమృతానందయోగి “అలంకారసంగ్రహము”లో చెప్పిన లక్షణం ఇది:
అథోదాహరణాయాస్తు లక్షణం కథ్యతేఽధునా
కల్పనీయాని పద్యాని సప్త సప్తవిభక్తిభిః ॥
సమ్బోధనాత్మిక శ్చాన్తే విభక్తి ష్వష్టమో భవేత్
శక్వరీప్రభృతీని స్యుః ఛన్దాన్యస్య యథా రుచి ॥
రీతిః ప్రధానా గౌడీయా గతిః స్యా ద్ద్రుతమధ్యమా
ఓజః ప్రసాదశబ్దాః స్యుః సానుప్రాసాః క్వచిత్క్వచిత్ ॥
తత్రాద్యం మాలినీవృత్తం జయేత్యాదిసమన్వితమ్
గద్యాత్మకదలాన్యష్టౌ ప్రత్యేకం సయతీని చ ॥
తతశ్చోత్కలికా కార్యా సమస్తాబ్ధిపదాత్మికా
అన్తే చోత్కలికా యుక్తా యత్యనుప్రాసశోభినీ ॥
చతుర్థోత్కలికా స్యాద్వా విభక్త్యాభాసలాఞ్ఛితా
కలికోత్కలికాష్టశ్చాష్ట నవ్యతాలలయాన్వితాః ॥
ప్రతిపద్యం భవేన్నేతృనామ తత్తద్విభక్తిమత్ ॥
దీనిని బట్టి ఉదాహరణ కావ్యంలో ఏడు విభక్తులలో ఏడు పద్యాలు, అంతంలో ఏడు విభక్తులతో ఒక సార్వవిభక్తిక పద్యం – మొత్తం ఎనిమిది పద్యాలు ఉండాలి. 14 అక్షరాల శక్వరీచ్ఛందం మొదలుకొని స్వస్థానసమవృత్తాలలో దేనినైనా వాడుకొనవచ్చును. ప్రతి వృత్తపద్యాన్ని వెంబడించి యతితో కూడి, తాళ-లయాన్వితాలైన కళికోత్కళికలు ఉండాలి. కావ్యం చివర కవి పేరు, లేదా కావ్యనాయకుని పేరు నిబంధింపబడాలి.
అమృతానందయోగి చెప్పిన ఈ లక్షణం దాదాపు ఇదే విధంగా కొంతవరకు విద్యానాథుని ప్రతాపరుద్రీయంలోనూ, తక్కినది ప్రతాపరుద్రీయానికి కుమారస్వామి సోమపీథి కూర్చిన రత్నాపణ వ్యాఖ్యలోనూ ఉన్నది. కృష్ణయజ్వ అలంకారముక్తావళిలోనూ ఇదే లక్షణం ఉన్నప్పటికీ, ఆయన,
ఉదాహరణమేతచ్చ శుద్ధం మిశ్రమితి ద్విధా
ఏకభాషాత్మకం శుద్ధం మిశ్రం భాషాన్తరాన్వితమ్.
అని, ఉదాహరణ మొత్తం ఒకే భాషలో ఉన్నట్లయితే అది “శుద్ధము”, వేరొక భాష కలిసినట్లయితే అది “మిశ్రము” అని సరికొత్త ప్రభేదాలను చెప్పాడు. కాగా,
కేచిదుత్కలికాస్థానే కేవలార్యాం ప్రచక్షతే.
అని ఉత్కలిక స్థానంలో “ఆర్య”ను ప్రయోగించటం ఉన్నదని చెప్పాడు.
విభక్తి వృత్తం తర్వాత “కళిక”కు ఒక రగడను, “ఉత్కళిక”కు అందులో సగాన్ని తాళానుగుణంగా ప్రయోగించటం ఆంధ్రకవుల లక్ష్యాలను బట్టి తెలుస్తున్న సంగతే కాని, సంస్కృత లాక్షణికులు ఆ విధంగా స్పష్టీకరించలేదు. భరతుడు నాట్యశాస్త్రం (అధ్యా. 31:317, 318) లలో
గుర్వాది రథ లఘ్వాదిర్యుగ్మ స్సర్వలఘుః స్మృతః
చతుర్మాత్రాగణా జ్ఞేయాః పూర్వచ్ఛన్దోవికల్పనాః ॥
పాతోఽర్ధకలికాన్ పాతాన్ కుర్యాల్లఘ్వక్షరేషు చ
గుర్వక్షరే తాలగీతపాతాస్తు కలికాః స్మృతాః ॥
అని చెప్పిన కళికా లక్షణం రగడలకు అనువర్తించేది కావచ్చునని భావించి, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య గారు తెలుగు ఛందోవికాసము (పు. 235)లో:
“ఈ కలికోత్కలికా (అర్ధకళికయే ఉత్కళిక) లక్షణము రగడలను సూచించుచున్నది. మాత్రాగణములు తాళములు (సశబ్దక్రియలు = పాతములు) రగడలకు చెందిన లక్షణములే. కుమారస్వామి ‘చంచత్పుటాదినా గద్యైః క్రమేణ కలికోత్కలికా పర్యాయైః” అని భరతుని లక్షణమును దృష్టియందుంచుకొనియే వ్రాసియుండును. అందువలన లక్షణములోని ‘గద్య’ శబ్దము కలికోత్కలికా పర్యాయముగా చెప్పబడినట్లు భావించవచ్చును.”
అని ఊహించారు. సంపత్కుమార గారన్న ఈ విషయమై ఇంకా లోతుగా పరిశోధింపవలసి ఉన్నది.
ఈ విషయమై త్రిపురాంతకోదాహరణము తొలి ముద్రణ పీఠికలో శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారి ప్రతిపాదనను విమర్శకులు పరిశీలించినట్లు కనబడదు:
“సోమనాథుని యుదాహరణమునఁ గళికోత్కళికలు మాత్రాప్రధానములై ప్రాసాంత్యప్రాసములతో నొప్పుచున్నవి. ఉదాహరణము భగవత్స్తోత్రరూపములగు గేయప్రబంధముల జాతిలోఁ జేరినట్లు తోఁచుచున్నది. పూర్వయుగంబున దక్షప్రజాపతి సప్తగీతములను పేర్వడసిన స్తుజాలము రచింపఁగా మహర్షులు మహేశ్వరుని తాందవానంతరము వానితో స్తోత్రాక్షములు చేర్చి పెక్కు ఖండములుగాఁ దాళభేదభంగులతో భగవంతుని స్తుతి చేసి నమస్కరించు చుండిరని పురాణముల వలనఁ దెలియుచున్నది. మద్రకము, ఉల్లోప్యకము, రోవిందకము, ప్రకరి, ఉత్తరము, ఓవేణకము, అపరాంతకము అను నీ యేడును దాళాంగప్రధానము లగు సప్తగీతములు ఋక్పాణికాగాథాది సప్త రూపపరిణామములు. ఉదాహరణములో సప్తగీతనిష్ఠములగు తాళాంగవర్ణములే ధ్రువ కళికోత్కళికా రూపమున నడచుచున్నట్లూహింపఁదగు. తాళాంగమున చతురశ్ర త్ర్యశ్ర జాతితాళములు వ్యక్తముగా నున్నవి. కళిక వర్ణాంగమున నేకకలయు (లేక) యర్ధకలయు, నుత్కలిక ద్వికలయు లేక యధ్యర్ధకలయు నగుచున్నవి. ఈ పద్యభేదము లన్నియు భరతుని నాట్యశాస్త్రమునఁ బేర్కొనఁబడినవి.”
— ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ (1972): మానవల్లి కవి రచనలు (పు. 99-100లు)
ఇందుకు సంస్కృత లాక్షణికులు చెప్పిన చండవృత్తప్రభేదాలను, త్రిభంగీ లక్షణాలను, “కలా నామ భవేత్ తాల-నియత పదసన్తతౌ, కలాభిః కలికా ప్రోక్తా తద్భేదాః షట్ సమీరితౌ” వంటి సంగీతశాస్త్రలక్షణాలను సమీకరించి, ఆ తర్వాత కళికోత్కళికల ప్రవేశవిషయమై యుక్తమైన నిర్వచనాన్ని సమకూర్చుకోవలసి ఉంటుంది. అంతవరకు ఉదాహరణ వాఙ్మయ పరిశీలనకు తెలుగు లాక్షణికుల నిర్వచనాలను సమన్వయించుకోవటమే సమంజసం.
‘అప్పకవీయము’ (4-305) లో అప్పకవి చెప్పిన ఉదాహరణ లక్షణం ఇది:
గూడ నెన్మిది విభక్తులు గ్రమమునఁ,
బతిపేరు దొరలంగఁ బద్య మొక్కటిఁ జెప్పి;
రగడభేదములు మార్గములు గాఁగఁ
గళికలు నెనిమిది దళములు గావించి,
దానిలో సగము నుత్కళికఁ జేసి
యది యొక్క సమసనం బయ్యెడు దళము లె
న్మిదిఁ గూర్చి, వానికిఁ దుద విభక్తి
పలుకవలయును సార్వవిభక్తికముగ;
నిర్వదాఱు పద్యములందు నిడిన ధాత్రి
నిది యుదాహరణ మటందు రిద్ధచరిత.
ప్రథమావిభక్తి మొదలుకొని ఏడు విభక్తులలోనూ ఒక్కొక్క పద్యం (లక్ష్యాలను బట్టి చూస్తే, సాధారణంగా వృత్తపద్యం), దానిని అనుసరించి ఎనిమిది రగడ పాదాలతో ఒక కళిక, కళికలో సగమైన అటువంటిదే, ఎనిమిది పాదాల ఉత్కళిక, అంతంలో సార్వవిభక్తికంగా ఒక పద్యం – ఇది స్థూలంగా ఉదాహరణ లక్షణం. కళికకు విధింపబడిన తాళనిర్దేశమే ఉత్కళికకూ అనువర్తిస్తుంది.
తన పేరు, తన ఆరాధ్యదైవతం పేరు కలిసివచ్చేట్లు చమత్కృతిమత్కృతిగా త్రిపురాంతకుడు చెప్పిన త్రిపురాంతకోదాహరణములో అప్పకవి చెప్పినట్లు “కళికలు, ఉత్కళికలు గమకించి” చెప్పబడినందువల్ల అది “ఉత్ఫుల్లకము” అనే పేరుగల సర్వలక్షణసమన్వితమైన ఉదాహరణకు ఉదాహరణం అయింది.
త్రిపురాంతకుని రచనల కర్తృత్వ నిర్ణయానికి ఆధారాలు
త్రిపురాంతకోదాహరణము, అంబికా శతకము, చంద్ర తారావళి అన్న మూడు కావ్యాలలోనూ “ఇది రావిపాటి త్రిపురాంతకుని కృతి” అని చెప్పటానికి నికరమైన ఆధారమేమీ లేదు. సంపూర్ణంగా దొరికిన త్రిపురాంతకోదాహరణము లోనూ కృత్యాద్యంతాలలో ఎక్కడా రావిపాటి త్రిపురాంతకుడని కర్తృనామం చెప్పబడలేదు. పెదపాటి జగన్నాథకవి ప్రబంధ రత్నాకరములో ఇచ్చిన ఉదాహరణల మూలాన మాత్రమే ఈ మూడింటి కర్తృత్వమూ సాధింప బడుతున్నది. జగన్నాథకవి “రావిపాటి త్రిపురాంతకుడు” అన్న కర్తృత్వనిర్దేశక శీర్షికతో త్రిపురాంతకోదాహరణము నుంచి “పామును హారమున్” అన్న పద్యాన్ని, చంద్ర తారావళి నుంచి రెండు పద్యాలను; “రావిపాటి త్రిపురారి” అన్న వ్యపదేశంతో అంబికా శతకము నుంచి “భారతివై సరోజభవు పాల” అన్న ఒక పద్యాన్ని, చంద్ర తారావళి నుంచి మరి రెండు పద్యాలను ఉదాహరించాడు. వల్లభరాయల క్రీడాభిరామములో “రావిపాటి త్రిపురాంతక దేవుండను కవీశ్వరుండు” (ప. 33 ) అని, “రావిపాటి తిప్పన్న (ప.36) అని ప్రేమాభిరామము కర్తగా నామనిర్దేశిక లున్నాయి. అప్పకవి తన అప్పకవీయము (3-60)లో “రావిపాటి తిప్పరాజు చాటుధార” అని ఒక చాటువును ఉదాహరించాడు.
ఈ త్రిపురాంతకదేవుడు, త్రిపురారి, తిప్పన్న, తిప్పరాజు అన్నవి ఒకే వ్యక్తికి పర్యాయ నామాలని సంభావింపబడుతున్నది. ఇంతకు మించి కవి వంశచరిత్రాదికాన్ని గురించిన విశేషాలేవీ బయల్పడలేదు.
పైని పేర్లలో “త్రిపురారి” అన్న పేరున్నది. భవభూతి మాలతీమాధవానికి సప్తమాంకపర్యంతం భావప్రదీపికా వ్యాఖ్యను రచించిన వేరొక త్రిపురారి ఉన్నాడు. ఆయన దాక్షిణాత్యుడే కాని కర్ణాటదేశీయుడు. త్రిపురారి శిష్యుడై మాలతీమాధవం తక్కిన మూడంకాలకు విబుధరత్నావళి పేరిట పరిశిష్ట వ్యాఖ్యను రచించిన నాన్యదేవుని (క్రీ.శ.1097-1147) కాలాన్ని పురస్కరించుకొని ఆ త్రిపురారి క్రీ.శ. 10వ శతాబ్ది ఉత్తరార్ధం నాటి వ్యక్తి. ఆ త్రిపురారి, ఆంధ్రుడైన మన రావిపాటి త్రిపురారి ఒకరేనని మనము పొరబడటానికి అవకాశం లేదు.
[పఠన సౌలభ్యానికై ముద్రిత ప్రతిలోని అధ్యాయవిభాగాలు మార్పు చేయబడ్డాయి. — సం.]
