5. పునఃపరిష్కరణావశ్యకత
ఇప్పుడు పఠనపాఠనాలలో రూఢమై ఉన్న శ్రీమహాభాగవతాన్ని పునఃపరిష్కరింపవలసిన ఆవశ్యకతను గురించి సరిక్రొత్తగా చెప్పవలసినదేమీ లేదు. పూర్వముద్రణల పరిష్కర్తలకు దొరికిన వ్రాతప్రతులు సరిగా లేకపోవటం వల్ల; వాటినైనా ఎవరికి తోచినట్లు వారు పరిష్కరించటం మూలాన; పూర్వాపరాలను, అర్థసంగతిని సరిగా గుర్తింపకపోవటం మూలాన; మూలాన్ని, వ్యాఖ్యానాలను సరిచూడకపోవటం మూలాన – సామాన్యపాఠకులకు ఏది కవిదోషమో, ఏది లేఖనదోషమో, ఏది కల్పితపాఠమో, ఏది అన్వయిస్తుందో, ఏది అన్వయింపదో, ఏది ప్రామాణికమో, ఏది ప్రామాదికమో నిశ్చయించేందుకు వీలులేనంత దురుద్ధరంగా ముద్రితప్రతుల స్థితి ఉన్నది. ఈ భాగవత పాఠపరిష్కరణ విషయాన్ని ఒక వంద ముఖ్యమైన ప్రసిద్ధపాఠాల పరిశీలనతో వేరొక వ్యాసాన్ని రానున్న ఈమాట సంచికలలో ప్రకటిస్తాను. ప్రకృతానికి ఈ పంచమ స్కంధంలోని కొన్ని ముఖ్యమైన పాఠాల విషయాన్ని వివరించి, భాగవతం పునఃపరిష్కరణావశ్యకతను మళ్ళీ ఒక పర్యాయం మీకు విన్నవిస్తాను. పూర్వం ఈ భాగానికి వ్యాఖ్యానాలను, టీకా తాత్పర్యాలను, వచనాన్వయాన్ని వ్రాసిన పెద్దలెవరినీ విమర్శించటం ఇక్కడి ఉద్దేశం కాదని, కేవలం పాఠస్థితిని మాత్రమే అనుశీలించటం జరుగుతున్నదని సహృదయులు సులభంగానే గుర్తింపగలరు.
5.1.
శ్రీకర! కరుణాసాగర!
ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా! — (5-1-1)
పంచమ స్కంధంలోని మొదటి పద్యమే ఇది. లోకాతీతగుణాశ్రయ = లోకాతీతములైన గుణములకు ఆశ్రయమైనవాడా అని వ్యాఖ్యానించటం సరికాదు. గుణములు లోకాతీతాలైనప్పుడు వాటికి ఆశ్రయాశ్రయీభావకల్పనం ఎట్లా జరుగుతుంది? అసలు లోకాతీతములైన గుణాలు ఏముంటాయి? అందువల్ల లోకాతీత! గుణాశ్రయ! అని విశేషణాలను సమస్తభిన్నంగా పఠించాలి. గోకులవిస్తార = గోకులమును విస్తరింపజేసినవాడా అని శ్రీకృష్ణుని యందు గోకులవిస్తారకత్వధర్మాన్ని నిరూపించటం సరికాదు. పైగా, ఏకాదశ స్కంధంలో ఆయన యాదవ వంశం భూమికి భారంగా మారిందని గ్రహించి యదుక్షయాన్ని సంకల్పించిన సన్నివేశం కూడా ఉన్నది. గోకులంలో బాల్యాన్ని గడిపి నందాదులకు ముక్తిని ప్రసాదించినవాడని కవి ఉద్దేశం. గోకులనిస్తార = గోగోపగోపీకులాన్ని కోరికలీడేర్చి తరింపజేసినవాడా – అని అన్వయించుకోవాలి.
పద్యస్వరూపం ఇలా ఉండాలి:
శ్రీకర! కరుణాసాగర!
ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీత! గుణాశ్రయ!
గోకులనిస్తార! నందగోపకుమారా!
శ్రీకర = సిరులను కలిగించేవాడా అన్నది సామాన్యార్థం.
“పరమపదమందు తాను వాసుదేవరూపమున ఉన్నప్పుడు ఆ లక్ష్మిని తనకు అనురూపమైన స్వరూప వేషాదులతో పొందియున్న విధముననే, సంకర్షణాది వ్యూహములలోను రామకృష్ణాద్యవతారముల లోను తాను ఆవిర్భవించి ఆ శ్రీదేవినిగూడ అనురూపవేషములతో యథోచితముగా తనవెంట ఆవిర్భవింప చేసుకొనువాడు గనుక, “శ్రీకరః” అనబడుచున్నాడు.”
అని శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రానికి పరాశర భట్టర్ వారి భాష్యానుసారం శ్రీమాన్ ఉ.వే.నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వారు చేసిన అనువాదం. కరుణాసాగర = దయచేత అనంతమైన సముద్రము వంటి స్వామీ; ప్రాకట = పాలకడలియందు స్వయంవ్యక్తురాలైన, లక్ష్మీ = శ్రీదేవిని, కళత్ర = భార్యగా వలచి వలపించికొన్న దేవా; భవ్యచరిత్రా = లోకశుభంకరమైన లీలావిలాసము కలిగిన ప్రభూ అని ఒక అర్థం, భవ్య = ఇంకా సంభవింపనున్న, చరిత్రా = అనేక అవతారముల లీలావ్యక్తిని కలవాడా – అని మరొక అర్థం; లోకాతీత = సర్వలోకాల ఆవిర్భావానికి మునుపే ఉన్నవాడా; గుణాశ్రయ = నీవు నిర్గుణుడవైనప్పటికీ (సత్త్వరజస్తమోగుణాలు, రూపనామాదిగుణాలు, ధర్మాదివ్యవహారాలు లేని పరమాత్మస్వరూపుడ వైనప్పటికీ) వాసుదేవుడవై జగత్తులను నీలో వసింపజేసికొంటూనే ఆ జగత్తులలో నీవూ వసించేవాడవై గుణాలకు ఆశ్రయమైన తండ్రీ; గోకులనిస్తార = నందగోకులాన్ని తరింపజేసినవాడా; నందగోపకుమారా = నందగోపకునికి పుత్త్రుడవైన దేవా! దశమ స్కంధం 352-వ పద్యంలో నిరూపించిన ఉదంతానుసారం వసువులలో ముఖ్యుడైన ద్రోణునికి భార్య ధరాదేవి. ధరాద్రోణులు విష్ణుసేవార్థం గోకులంలో యశోదానందులుగా జన్మించారు. ఆ విధంగా నందగోపునికి శ్రీమహావిష్ణువు సుతుడయ్యాడు – అని.
5.2.
పటుతాటంకరథాంగయుగ్మమునకుం బల్మాఱు భీతిల్లుచున్
నటనం బందెడు గండుమీనములతో నాసన్ననీలాలకో
త్కటభృంగావళితో ద్విజావళి లసత్కాంతిన్ విడంబించు మా
ఱటకాసారముఁ బోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్. — (5-1-26)
అగ్నీధ్రుడు అప్సరస పూర్వచిత్తిని చూచి అంటున్న మాటలివి. బటువైన చెవికమ్మల జంట అనే చక్రవాకపక్షులకు గండుచేపలు పదే పదే ఎందుకు భయపడ్డాయి? అసలు చక్రవాకాలను చూసి గండుచేపలు ఎందుకు భయపడతాయి? చెవికమ్మలు చక్రవాకపక్షుల వలె ఉండటం ఏమిటి? ఆసన్నములై (చేరువనే) ఉన్న నల్లని ముంగురులు తుమ్మెదల గుంపులయితే, ద్విజపంక్తులతో తేజరిల్లుతున్న నీ ముద్దు ముఖం సరోవరంలా ఉండి అందముచేత శోభిస్తున్నది అనటం ఏమిటి? నీలాలకములనెడు భృంగములు, ద్విజావళి అన్నట్లు గండుమీనములు వేటికి విశేషణాలు? పాఠమూ, తాత్పర్యార్థమూ రెండూ సరిగా లేవు. మూలశ్లోకం ఇది:
కా వాత్మవృత్తిరదనా ద్ధవిరఙ్గ వాతి విష్ణోః కలాస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ
ఉద్విగ్నమీనయుగలం ద్విజపఙ్క్తిశోచి రాసన్నభృఙ్గనికరం సరఇన్ముఖం తే. — (5-2-13)
ఓ కాంతా! ఎటువంటి ఆహారాన్ని స్వీకరించి ప్రాణాలను నిలుపుకొంటున్నావు? తాంబూలాదిసేవనం చేత నీ ముఖంనుంచి వెలువడుతున్న సుగంధం వల్ల యజ్ఞసంబంధమైన ఏ పవిత్రమైన నైవేద్యాన్నో భుజిస్తుంటావని అర్థమవుతున్నది. ఎందుకంటే, సాక్షాత్తు విష్ణుకళవు నువ్వు. నీ ముఖం సరోవరం లాగా శోభాయమానంగా ఉన్నది. నీ చెవులకు అలంకరించికొన్న మకరకుండలాలు రెప్పలార్పనీ మొసళ్ళ జంటలాగా ఉన్నాయి. కన్నులు చేపల వలె చాంచల్యాన్ని పొంది ఉన్నాయి. నీ పలువరుస రాజహంసల పంక్తి వలె వెలుగొందుతున్నది. కేశసంపద నీ ముఖపరిమళమునందు ఆసక్తిగొన్న తుమ్మెదల వలె ఉన్నది – అని తాత్పర్యార్థం.
దీన్నిబట్టి పద్యపాఠమూ, తాత్పర్యమూ ఈ ప్రకారంగా ఉండాలి:
పటుతాటంకపలాంగయుగ్మమునకుం బల్మాఱు భీతిల్లుచున్
నటనం బందెడు నేత్రమీనములతో నాసన్ననీలాలకో
త్కటభృంగావళితో ద్విజావళి లసత్కాంతిన్ విడంబించు మా
ఱటకాసారముఁ బోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్.
పలాంగము అంటే మొసలి అని అర్థం. అది రథాంగం కాదు. పలాంగం. పూర్వచిత్తి యొక్క ముఖానికి సరోవరంతో అభేదతాద్రూప్యకల్పన జరిగింది. బటువైన చెవికమ్మలు మకరాకృతిని కలిగి ఉన్నాయి. అవి మకరకుండలాలు కనుక కవి ఆ మొసళ్ళ జంటను చూసి కన్నులనే చేపలు పల్మాఱు భీతిచెందినట్లుగా వర్ణిస్తున్నాడు. చేపల వంటి ఆ కన్నులు చెవుల దాకా వ్యాపించి ఉన్నాయి. అంటే, అంత సువిశాలములై ఉన్నందువల్ల అవి చెవుల దగ్గరకు వెళ్ళి, అక్కడ కర్ణాభరణాలుగా ఉన్న మొసళ్ళను చూసి ఉలికిపడి భీతిచెందాయి. ఎన్నిమార్లు పరికించి చూసినా ఆ మకరాకృతులు మకరాలుగానే కనుపించటం వల్ల పల్మాఱు భీతిల్లాయన్నమాట. ఆ విధంగా పడుతూ లేస్తూ (నటనం బందెడు) తమ భయాన్ని ప్రదర్శింపసాగాయని మీనపరమైన అర్థం. కన్నులు చాంచల్యాన్ని కలిగి ఉన్నాయని నేత్రపరమైన అర్థం. “నేత్రమీనములు” అన్న నిరూపణ లేకపోతే, సరోగతమీనములు అన్న ఉభయాన్వయానికి అసలు చోటే ఉండదు. కన్నులు భయభ్రాంతములు కావటాన్ని చూసి చేరువనే ఉన్న నల్లని ముంగురులనే తుమ్మెదలు సైతం భయభ్రాంతములైనాయని ప్రతీయమానం. వాటికీ ఆపత్కాలం దాపురించిందన్నమాట. గాలికి అల్లలాడుతున్న ముంగురులకు ఆ విధంగా ఆపత్ప్రాప్తి కలిగినట్లుగా చిత్రించటం భావ్యంగానే ఉన్నది. “ఆసన్నభృంగావళి” అనేందుకంటె “ఆపన్నభృంగావళి” అంటే భృంగార్థంలో సముచితమే కాని, మూలంలో ఆ ప్రకారం లేదు. పైగా ఆపన్నత భృంగాలకే గాని ముంగురులకు శ్లేషార్థంలో సమర్థకం కాదు. ద్విజములు అంటే దంతములని, పక్షులని రెండర్థాలు. ద్విజముల ఆవళి అంటే పలువరుస. పలువరుస దేదీప్యమానంగా ప్రకాశిస్తుండటం వల్ల లసత్కాంతిని విడంబిస్తున్నది (గొప్ప కాంతిమండలాన్ని అనుకరిస్తున్నది, లేదా మరుగుపుచ్చుతున్నది). ఆ విధంగా ఆమె నిండైన ముఖం సరోవరానికి మాఱటగా (ప్రతిరూపంగా) రంజిల్లుతున్నది. అత్యున్నతి అన్నది భాగవతకవులు తరచు పాదపూరణార్థం ప్రయోగించే ఒక విశేషప్రయోగం. గొప్పగా – అని మాత్రమే అక్కడ అర్థం చెప్పుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు ప్రకటించిన శ్రీమహాభాగవతం పీఠికలో ఈ పద్యాన్ని వివరిస్తూ — “తాటంక రథాంగయుగ్మమునకు భయపడి (నేత్రములనెడి) గండుమీనములు నటనంబందుచు నున్న వను కల్పన యమూలకమై రమ్యముగా నున్నది” అని — తత్సంపాదకులు వ్రాసిన మాట పొరపాటే.
5.3.
అచ్చట విప్రసూనుఁడు భయం బొకయించుక లేక చంపఁగా
వచ్చినవారియందుఁ గరవాలమునందును గాళియందుఁ దా
నచ్యుతభావముంచి హృదయంబునఁ బద్మదళాక్షు నెంతయున్
మచ్చికతోడ నిల్పి యనుమానము నొందకయుండె నత్తఱిన్. (5-1-137)
శ్రీమహాభాగవతంలోని వివాదాస్పదాలైన పద్యాలలో ఇదొకటి. బ్రాహ్మణపుత్త్రుడై జన్మించిన జడభరతుడు కాళికాదేవి మందిరంలో తనను బలిచేయవచ్చిన ఆటవికుల యందు, వారి చేతిలోని కత్తియందు, చివరికి కాళికాదేవి యందు, తాను శ్రీమహావిష్ణుభావన కావించి ఆ పద్మదళవిశాలనేత్రుని ఎంతో ఆత్మీయభక్తిభావనతో మనస్సులో నెలకొల్పికొని సర్వసమభావుడై ఉండిన సన్నివేశం. “అచ్చట” – “వచ్చిన” – “అచ్యుత” – “మచ్చిక” అన్న పదాలను ప్రాసస్థానంలో నిలిపిన ప్రయోగం ఇది. బొప్పరాజు గంగనకు ఇటువంటి ప్రయోగవిశేషాలపై ప్రత్యేకాభిమానమేదీ లేదని ముందే అనుకొన్నాము. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన శ్రీమహాభాగవతంలో ఈ పద్యం మూడవ పాదంలోని పాఠాన్ని “అచ్చుతభావముంచి” అని సవరించివేశారు. అందుకు కారణాన్ని అధోజ్ఞాపికలో –
“అచ్యుతభావ” మని అన్ని యచ్చుప్రతులలోఁ గల పాఠము. ఈ పాఠమునఁ బ్రాస సరిపడదు. “అచ్చుతభావము” వ్యాకరణసమ్మతము కాకపోయినను, పోతన రచనలో ఇట్టి సమాసములు తరచు కనఁబడుచుండుటను బట్టియు, ప్రాసము ననుసరించియు, “అచ్చుతుఁడు” అని వాడుకలో నుండుట వలనను, ఇదే కవిపాఠముగా గ్రహింపబడినది.”
అని ప్రకటించారు. ‘అచ్చుతభావము’ అన్నది వ్యాకరణసమ్మతమైన ప్రయోగం కాకపోయినా, పోతనగారి రచనలో ఇటువంటి సమాసాలు తరచు కనబడుతున్నాయట. ‘అచ్యుతుడు’ అనటానికి మారుగా ‘అచ్చుతుడు’ అని లోకంలో వాడుతున్నారట. అందువల్ల “అచ్యుతభావముంచి” అన్న ప్రాసవైరాన్ని పరిహరించేందుకు మేము దానిని “అచ్చుతభావముంచి” అని దిద్దుతున్నాము – అని వీరి ప్రతిపాదన. ‘అచ్చుతుడు’ అని లోకంలో వాడుక ఉన్నది కాబట్టి దానిని ఆ విధంగా సవరించటం మంచిదే కాని, దానితో ‘అచ్చుతభావము’ అన్న సాంస్కృతికసమాసాన్ని చేయకూడదని, అందువల్ల “అచ్చుతభావముంచి” అన్నప్పటి సమాసదోషాన్ని సవరించి దానిని “అచ్చుతు భావముంచి” అని విడదీసి ముద్రించాలని – ప్రముఖ వ్యాకరణవిద్వాంసులు శ్రీ వంతరాం రామకృష్ణారావు గారు ఆ రోజుల్లో ఒక విమర్శవ్యాసంలో అభిప్రాయపడ్డారట. అకాడమీ భాగవతపరిష్కర్తలలో ఒకరైన మహావిద్వాంసులు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు 1968లో ప్రకటించిన తమ ‘భాగవతపాఠపరిశోధనము’ గ్రంథం 198-వ పుటలో ఈ విషయాన్ని చర్చించి, దానిని తిరస్కరించి, మళ్ళీ తమ “అచ్చుతభావముంచి” అన్న పాఠాన్నే సమర్థించారు. అందుకు సమాధానంగా ఆధునికకాలంలోని ప్రముఖ భాగవతానువాదకులలో ఒకరు, అకాడమీ వారి భాగవతపాఠవిమర్శకులలో అగ్రేసరులు అయిన కవితామహేశ్వర శ్రీ మిన్నికంటి గురునాథశర్మగారు ఆ రోజుల్లో ‘పోతనామాత్యుని అభేదదృష్టి – పాఠపరిశీలనము’ అని ఒక వ్యాసాన్ని ప్రకటించారు. సుప్రసిద్ధమైన ఆ వ్యాసం మహాకవి శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి సమర్థ సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పక్షాన 1983-లో వెలువడిన ‘భాగవత వైజయంతిక’ అన్న సంపుటంలో పునఃప్రచురితమైంది. అందులో గురునాథశర్మగారు,
ఈ వ్రాతతో నాకు పనిలేదు. ఈ పద్యమును పోతన గాడు, బొప్పరాజు గంగన వ్రాసెను. ‘అచ్చుతభావము’ గాదు. ‘అచ్యుతభావము’ గాదు. ‘అచ్చితిభావము’ అని గంగన కవి వ్రాసియుండును. ‘చితి’ అన పరబ్రహ్మము. ఆ + చితి = అచ్చితి. భరతుడు మహాజ్ఞాని. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అను శ్రుతి నెరిగిన భరతుడు నామరూపాత్మకమైన యీ సర్వ జగమును బ్రహ్మముగా చూచుచున్నాడు. కావుననే ఆయన చంపబడి అవమాన మొందలేదు. పద్యములో ‘అనుమానము’ అని యున్నది. అది తప్పు. ‘అవమానము’ అని యుండవలె.
అని వ్రాశారు. అకాడమీ వారి నిర్ణయానుసారం “అచ్యుతభావము” అన్న పాఠంలోని ప్రాసవైచిత్రి భాగవతకవుల సంప్రదాయానికి విరుద్ధమూ, వారు సూచించిన “అచ్చుతభావము” అన్న పాఠం భాగవతకవుల సంప్రదాయానికి అనురూపమూ ఎందుకయ్యాయి? “అచ్చుతభావము” సరైన పాఠం అన్న భావం కలిగాక వారి దృష్టిలో “అచ్చుతు భావము” అన్న పాఠం మాత్రం తప్పెందుకయింది? సంతృప్తికరమైన సమాధానం లేదు. జాగ్రత్తగా చూస్తే, “అచ్యుతభావము”, “అచ్చుతభావము”, “అచ్చుతు భావము” అన్న మూడూ తప్పేననిపిస్తాయి. విప్రసూనుడు తనను చంపవచ్చినవారిలోనూ, కత్తిలోనూ, కాళికలోనూ అది అచ్యుతుడే అన్న భావాన్ని కలిగి ఉండటం ఏమిటి? ఎంత భేదభావం లేదనుకొన్నా కత్తినీ, కాళికనూ ‘అచ్యుతుడు’ అనుకోవటం ఏమిటి? కత్తియందు అచ్యుతభావన చేయటం ఏమిటి? నన్ను చంపటానికి సాధనమైన ఈ కత్తికూడా శ్రీమహావిష్ణువే అని భావన చేశాడన్నమాట. ఏ భావన చేసినా, అచ్యుతభావం ఉంచాడు కాబట్టి, ఆ కత్తికి చ్యుతి లేక మెడమీద వేటు పడదనే అనుకొందాము. కాళిక యందు అచ్యుతభావం ఎలాగున? కాళికకూడా శ్రీమహావిష్ణువే అనుకొన్నా డన్నమాట. ఏ భావన చేసినా, అచ్యుతభావం ఉంచాడు కాబట్టి, ఆమెకూడా శరణాగతుల రక్షణ యందు చ్యుతి లేనిది = ఒకసారి భక్తుణ్ణి రక్షించాలీ అనుకొన్నాక ఆపై ఆమె రక్షాసంకల్పానికి చ్యుతి ఉండదని అనుకొందాము. అందువల్ల ఆమె ఆగ్రహించి, చంపవచ్చినవారిని తానే చంపి అతనిని రక్షించిందన్నమాట. పోతే, చంపవచ్చినవారి యందు అచ్యుతభావం చేశాడు కదా, ఆ అచ్యుతభావానికి ఏమని అర్థం చెప్పాలి? వీరుకూడా సాక్షాత్తు అచ్యుతస్వరూపులే అని భావన చేశాడన్నమాట. అందువల్ల వారి అచ్యుతస్వరూపానికి ఏమయింది? కాళిక చేతిలో హతమారారు. అందువల్ల “అచ్యుతభావము”, “అచ్చుతు భావము”, “అచ్చుతభావము” అన్న మూడు పాఠాలూ సరికావనే ఒప్పుకోవాలి. “అచ్యుతభావము” అన్న పాఠంలోని ప్రాసవైరం మాట ఎట్లాగూ ఉండనే ఉన్నది. అందుకనే మహాపండితులైన గురునాథశర్మగారు “ఈ వ్రాతతో నాకు పనిలేదు” అని వ్రాయవలసి వచ్చింది.