గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని

పరిచయం

చిత్రకవిత్వం ప్రధానంగా శబ్దచిత్రం, అర్థచిత్రం అని రెండు విధాలు. ఈ రెండింటి సమావేశం వల్ల ఉభయచిత్రం ఏర్పడుతుంది. కేవలం శబ్దవిషయకమైన గుణాలంకారచమత్కృతివిశేషాన్ని కలిగి, వ్యంగ్యప్రాధాన్యం లేకపోవటం శబ్దచిత్రమని, అర్థాన్ని పురస్కరించుకొన్న గుణాలంకారచమత్కారవిశేషవత్త్వం అర్థచిత్రమని, శబ్దార్థాలు రెండింటికి తుల్యప్రాధాన్యం ఉన్న వ్యంగ్యవైభవం తోడి గుణాలంకారచమత్కృతి ఉభయచిత్రమని అప్పయ దీక్షితులవారి చిత్రమీమాంసకు సుధా టీకను వ్రాసిన ధరానందుడు నిర్వచించాడు. అనుప్రాసము, లాటానుప్రాసము, ఛేకానుప్రాసము మొదలైన శబ్దాలంకారాలకు శబ్దచిత్రాలని సామాన్యవ్యవహారం. పువ్వులతో దండను కూర్చినప్పుడు, ముత్యాలతో హారాన్ని రూపొందించినప్పుడు రకరకాల పువ్వులలోని వర్ణసమ్మేళనను చూసి, ముత్యాల వరుసలోని ఆకర్షణీయమైన క్రమప్రథను తిలకించి ముగ్ధులయ్యే రసజ్ఞుల లాగానే శబ్దచిత్రాలలో స్వసమానవర్ణసన్నివేశం వల్ల – అంటే ఒకే అక్షరాన్ని, ఒకే అక్షరసంహతిని చిత్రచిత్రప్రకారాలుగా ప్రయోగించటం వల్ల పాఠకుల మనస్సులో ఒక విచ్ఛిత్తివిశేషం ఉదయిస్తుందని, ఆ విచ్ఛిత్తి (శరీరానికి సౌందర్యలేపనం వంటి అంగరాగం) విశేషాన్ని భావించే భావుకులకు రసభావసంపత్తి కంటె ఆ శబ్దచిత్రసామగ్రిపైనే అభిమానం ఏర్పడుతుందని విద్యాధరుని ఏకావళికి తరళ వ్యాఖ్యను వ్రాసిన మల్లినాథ సూరి అన్నాడు.

అర్థాన్ని ఆశ్రయించుకొన్న చమత్కృతులు అర్థచిత్రాలు. యమకాలంకారంలో అర్థమే ప్రధానం కాబట్టి అది అర్థచిత్రమని కొందరు, అర్థం శబ్దచమత్కారంలో అణిగిపోతున్నది కాబట్టి శబ్దచిత్రమని కొందరు లక్షణకారులు ఊహించారు. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం, వ్యాఘాతం, అతద్గుణం మొదలైన అలంకారాలను చిత్రార్థవంతంగా ప్రయోగించటమే అర్థచిత్రం. శబ్దానికి, అర్థానికి తుల్యప్రయోజనం ఉన్న శ్లేష, వక్రోక్తి, విరోధాభాసం, సమాసోక్తి, అపహ్నవం వంటివి ఉభయచిత్రాలు.

చిత్రకవిత్వాన్ని మరొక తీరున విభాగింపవచ్చును. అవి –

  1. స్థాన చిత్రాలు: ఓష్ఠ్యం (పెదవి కదలిక స్పష్టంగా కనిపించే ప – ఫ – బ – భ – మ వంటి అక్షరాలతో మాత్రమే ఏర్పడే పదాలు: పాపము, బాబు వంటివి), నిరోష్ఠ్యం (పెదవి కదలిక అవసరం లేనివి: జలజాక్షి, నయనతార), ఊష్మములు, దంత్యములు, తాలవ్యములు, చలజిహ్విక (నాలుక కదలవలసి వచ్చే నేనున్నాను, దుద్దు, తొత్తు వంటి పదాలతో కూర్పు), అచలజిహ్విక వంటి ఉచ్చారణస్థానాలను ఆశ్రయించుకొన్న చిత్రాలు. గణపవరపు వేంకటకవి ‘దశావతార గర్భిత గుణిత వర్ణాచలజిహ్వాకోష్ఠ్యవర్ణ భుజంగప్రయాత గర్భిత నిరోష్ఠ్యచలజ్జిహ్వా స్రగ్విణీవృత్త గర్భి తౌష్ఠ్యాచలజిహ్వా నిరోష్ఠ్యచలజ్జిహ్వా సంకీర్ణవర్ణ సమగణదండకము’ అనే విచిత్రమైన ప్రయోగాన్ని తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 832-వ పద్యంలో చేశాడు.
  2. వర్ణ చిత్రాలు: ఏకాక్షరి, ద్వ్యక్షరి, సంగీత స్వరాక్షరి (మా పాపని పని మాని దాని పని గానిమ్మా), ద్విప్రాసము, చతుష్ప్రాసము వంటివి సామాన్య వర్ణచిత్రాలు. అక్షరవృద్ధి వంటివి విశేష నియమచిత్రాలు. గణపవరపు వేంకటకవి ‘ఏక ద్వి త్రి చతుః పంచ షట్ సప్తాక్షరవృద్ధి క్రమపాద నియమసీసము’ అనే విచిత్రమైన ప్రయోగాన్ని తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 878-వ పద్యంలో చేశాడు.
  3. స్వరచిత్రాలు: సర్వలఘువు, సర్వగురువు మొదలైనవి. ప్రాకృత పైంగళానికి ప్రదీపమనే వ్యాఖ్యను వ్రాసిన లక్ష్మీనాథ భట్టు చెప్పిన 4 లఘువులు, 30 గురువులు గల నందకము అనే స్కంధక ప్రభేదాన్ని గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 372-వ పద్యంలో ‘ఛన్న కందము’ అన్న పేరుతో ప్రయోగించాడు.
  4. గతి చిత్రాలు: అక్షరగతిని బట్టి ఏర్పడే చిత్రాలు. ఉదాహరణకు 64- అక్షరాల ఒక పద్యంలోని 64 అక్షరాలను 8X8 అక్షరాలతో చతురస్రంగా కాని, 16X4 అక్షరాలతో దీర్ఘచతురస్రంగా కాని గీసిన ఒక బొమ్మల గడిలో వరుసగా వ్రాసి, ఆ బొమ్మ మొదటి అక్షరం నుంచి చదరంగంలో గుర్రం పావు కదలిక వలె నియమానుసారం ముందుకు నడిచి, ఆయా అక్షరాలను వరుసగా వ్రాస్తే అందులో ఇంకొక పద్యం వస్తుంది. అటువంటి పద్యానికి ‘అశ్వగతి చిత్రము’ అనిపేరు. గజపద గతి, శతధేను గుణగతి, స్వస్తిక గతి, గతప్రత్యాగత గతి వంటివి ఇందులోని కొన్ని రకాలు.
  5. గూఢ చిత్రాలు: ఇవి నామగోపనం, పదగోపనం, పాదగోపనం వంటివి. ఒక పద్యంలో ఒక పదాన్ని గాని, పేరును గాని, మూడు పాదాలను వ్రాసి నాలుగవ పాదాన్ని ఆ అక్షరాలలో నుంచి వచ్చేట్లు చేయటం గాని మొదలైన చిత్రరచనలు. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 845-వ పద్యంలో “పాదాద్యంతాక్షర కావ్య తత్కర్తృనామ పూర్వకవి నామగుప్తసీసము” అనే చిత్రమైన ప్రయోగాన్ని చేశాడు.
  6. కూట చిత్రాలు: కూటచిత్రమంటే గూఢార్థమయమైన చిత్రం అని అర్థం. ఇందులో సమాధి (ప్రహేళిక అనబడే పొడుపు ప్రశ్న), బ్రహ్మోద్యము (వేదాంతం, స్వర్ణయోగం మొదలైన రహస్యార్థం కలిగిన రచన), వాణీ కూటము (వాచ్యార్థాని కంటె భిన్నమైన సంకేతం కలిగిన కూర్పు), కుతూహలాధ్యాయి (కమ కల్లా కయ కపా కలెం మొదలైన ‘క’ భాష; దడిగాడువానసిరా, వురాభల్లవ వంటివి) మొదలైన ప్రభేదాలున్నాయి. కావ్యాదర్శంలో దండి, కావ్యాలంకారంలో రుద్రటుడు, సరస్వతీ కంఠాభరణంలో భోజరాజు అనేకభేదాలను కల్పించారు. అగ్ని పురాణం, విష్ణుధర్మోత్తర పురాణం, ధర్మదాసు విదగ్ధముఖమండనం వంటివాటిలో ఇంకా వివరాలున్నాయి. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో అక్షరప్రతీకాత్మకం (ప.315), అప్రతీతార్థం (ప.808), ఏకశబ్ద బహ్వర్థావర్తనం (ప.32), ఏకసమాస శబ్దమాలిక (ప.815), వర్ణయోగము (ప.421), వర్ణలోపము (ప.310) మొదలైన కూటచిత్రాలను ప్రయోగించాడు.
  7. సమస్యా చిత్రాలు: క్లేశయుక్తమైన సమస్యను ఇవ్వటం, దాని చతురపరిష్కారం అన్నవి సరసగోష్ఠీవినోదాలలోని వాగ్విభూతులు. సమస్యా శతకాలు, సమస్యా కావ్యాలు సంస్కృతాంధ్రాలలో అనేకం ఉన్నాయి.
  8. భాషా చిత్రాలు: పదవిధి చేత, అన్వయభేదం మూలాన కల్పించే అనేక భాషాచిత్రాలు ఇవి. ఒకే పద్యం పెక్కు భాషలకు అన్వయించటం. పింగళి సూరన పద్యాన్ని అనులోమంగా (ఎడమనుంచి కుడికి) చదివితే పద్యం, విలోమంగా (కుడినుంచి ఎడమకు) చదివితే సంస్కృతశ్లోకం వచ్చే అపురూపమైన రచన చేయటం నలుగురికి తెలిసినదే. వీటిలో అన్యభాషాభాసం (ఒక పద్యాన్ని లేదా శ్లోకాన్ని చదువుతుంటే మనకు వేరేదో భాషను వింటున్న భ్రమ కలగటం) వంటివి అనేకభేదాలున్నాయి. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ప్రాకృతీ శౌరసేనీ మాగధీ పైశాచీ చూళి కాపభ్రంశ సంస్కృతాంధ్ర భాషాష్టకము అనే చితప్రభేదాన్ని (ప.876) సరికొత్తగా కల్పించి ప్రయోగించాడు.
  9. భ్రమక చిత్రాలు: పద్యంలో పాదాలను గాని, మొత్తం పద్యాన్ని గాని ఎడమ నుంచి కుడివైపుకు (అనులోమం), కుడినుంచి ఎడమకు (విలోమం లేదా ప్రతిలోమం) చదివినప్పుడు ఆ పాదము లేదా పద్యం ఒకే విధంగా ఉండటం (‘వికటకవి’ అన్న పాదంలో వలె), లేదా అర్థవంతమైన మరొక పాదంగానో పద్యంగానో ఉండటం అన్నవి ఈ భ్రమక చిత్రానికి ఉదాహరణలు. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ‘ఆదిపాదైకైకచరణానులోమప్రతిలోమాది బహుచిత్ర రగడ’ (ప.877) అన్న పదభ్రమక చిత్రాన్ని, హరిహరవర్ణనాయుక్తానులోమప్రతిలోమము’ (ప.365) అన్న పద్యభ్రమక చిత్రాన్ని, ‘అనులోమప్రతిలోమోపమానషట్కము’ (ప.32), ‘శబ్దభ్రమకానుప్రాణిత నియమ యమక గీతిగర్భితచరణ దుర్ఘటసీసము’ అన్న అపూర్వమైన చిత్రప్రయోగాన్ని (ప.466) విధవిధాలుగా చేశాడు.
  10. చ్యుతక చిత్రాలు: అక్షరచ్యుతి (పదబంధంలో ఒక అక్షరం లోపించినందువల్ల కొత్త అర్థం ఏర్పడటం), బిందుచ్యుతి, మాత్రాచ్యుతి మొదలైనవి చ్యుతక చిత్రాలు. వసుచరిత్రలో ‘సారసలోచనలు’ రసభంగమైతే ‘సాలోచనలు’ అవుతారన్న చిత్రం చ్యుతక చిత్రమే. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ఏ పుటను తీసినా ఎక్కడికక్కడే ఇటువంటి చ్యుతక చిత్రాలు కోకొల్లలుగా కనుపిస్తాయి.
  11. అనేకార్థ చిత్రాలు: శబ్దాల అనేకార్థత్వం వల్ల, లింగ వచన విభక్తి సంధి నియమాల వలన శ్లేషచిత్రం ఏర్పడుతుంది. రుద్రటుడు కావ్యాలంకారంలో వర్ణ శ్లేష, పద శ్లేష, లింగ శ్లేష, భాషా శ్లేష, ప్రకృతి శ్లేష, ప్రత్యయ శ్లేష, విభక్తి శ్లేష, వచన శ్లేషలను నిర్దేశించాడు. విశ్వనాథ కవిరాజు సాహిత్య దర్పణంలో సభంగ శ్లేష (పదాల విరుపు వల్ల అర్థభేదాలు ఏర్పడటం), అభంగ శ్లేష (పదాలను విడదీయకుండానే అర్థాంతరాలను సాధించటం), సభంగాభంగ శ్లేష (ఒకసారి విడదీసి, ఒకసారి విడదీయకుండాను అనేకార్థాలను కూర్చటం) అని చెప్పాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో ప్రకృత శ్లేష, అప్రకృత శ్లేష, ప్రకృతాప్రకృత శ్లేష అని వివరించాడు. వీటన్నిటిని కలిపితే ఇంకా అవాంతరభేదాలనేకం ఉన్నాయి. ఇవి కాక సోద్భేదము, నిరుద్భేదము అని వీటిలో మళ్ళీ అవాంతరశాఖలు కనబడుతున్నాయి. ఇవన్నీ కలిపి వందలాది భేదాలు. వీటిని భిన్నజాతీయాలు, అభిన్నజాతీయాలు అన్న ప్రభేదాలతో హెచ్చవేస్తే అనేకార్థచిత్రాలు వేలకొద్దీ ఉంటాయి. పింగళి సూరన రాఘవపాండవీయములో ఆంధ్రభాషా సంస్కృతాభిభాషాశ్లేష, శబ్ద శ్లేష, అర్థ శ్లేష, ముఖ్యగౌణవృత్తి శ్లేష, అర్థాన్వయ శ్లేష, శబ్దాన్వయవిభేద శ్లేష, అని తాను స్వయంగా కల్పించిన ప్రభేదాలను నిరూపించాడు. వీటివల్ల ద్వ్యర్థి, త్ర్యర్థి, చతురర్థి, పంచార్థి, సప్తార్థులే గాక శతార్థులను వ్రాసినవారున్నారు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో గణపవరపు వేంకటకవి వీటిలో పెక్కింటిని పెక్కు వినూత్నరీతులలో అసంఖ్యాకంగా ప్రయోగించి ఉండటం విశేషం.
  12. విపర్యాస చిత్రాలు: పద్యపాదంలోని మాత్రాక్రమంలో మార్పుచేసి, ఆ గతిభేదం వల్ల కొత్త వృత్తాలను సాధించటాన్ని విపర్యాసచిత్రము అంటారు. ఇది గురులఘువుల పరివృత్తి మూలాన, గణవిభాగంలోని మార్పు వలన పరిపరివిధాలుగా ఉంటుంది. లాక్షణికులు చెప్పని ఒక్క ఉదాహరణను మాత్రం చూపుతాను:

    ౹౹౹ U౹౹ U౹U U౹ U౹
    ౹౹౹ U౹౹ U౹U U౹ U౹
    U౹ U౹౹ U౹U U౹ U౹
    U౹ U౹౹ U౹U U౹ ౹౹౹
    ౹౹౹ U౹౹ U౹౹ ౹౹౹ U౹
    ౹౹౹ U౹౹ U౹౹ ౹౹౹ ౹౹౹
    U౹ U౹౹ U౹U ౹౹౹ U౹
    U౹ U౹౹ U౹U ౹౹౹ ౹౹౹
    ౹౹౹ UU౹ U౹౹ U౹ U౹
    ౹౹౹ UU౹ U౹౹ U౹ ౹౹౹
    U౹ UU౹ U౹౹ U౹ U౹
    U౹ UU౹ U౹౹ U౹ ౹౹౹

    ఈ పన్నెండు గతిభేదాలను ద్విపద గాను, తేటగీతి గాను రెండు విధాల వాడుకోవచ్చును. ఇది విపర్యాస చిత్రాలలో ఒకటి. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో వీటిలోని మొదటి ప్రభేదాన్ని స్వీకరించి ‘ద్విపద తేటగీతి’ అనే చిత్రప్రయోగాన్ని (ప.385) చేశాడు. నాదెండ్ల పురుషోత్తమకవి గారు తమ అద్భుతోత్తర రామాయణంలోనూ, కృష్ణానదీ మాహాత్మ్యంలోనూ వేల విధాల గతిభేదాలతోడి పద్యాలను కల్పించటానికి వీలయే చిత్రరచనలను చేశారు. ఈ గతిభేదాల విషయమై వేంకటకవి వలె పరిశోధనలు చేసి లెక్కలేనన్ని ప్రభేదాలను సృష్టించినవాళ్ళు సాహిత్యంలో ఎక్కువమంది కనబడరు.

  13. గర్భ చిత్రాలు: ఒక పద్యంలో వేరొక లఘుపద్యాన్ని ఇమిడ్చే ప్రక్రియకు గర్భ చిత్రము అనిపేరు. ఇది చ్యుతకభేదాలలోనూ, విపర్యాసచిత్రాలలోనూ కొద్దిపాటి తేడాతో కనుపిస్తుంది. రావిపాటి లక్ష్మీనారాయణ గారు గర్భచిత్రాన్ని ఒక కావ్యంగా మలిచి ‘నిర్వచన భారత గర్భ రామాయణము’ అని భారతార్థాన్ని ప్రవచించే ఒక కావ్యంలో ప్రతిపద్యంలోనూ కొన్ని అక్షరాలను తొలగిస్తే రామాయణార్థం వచ్చే అపురూపమైన కావ్యాన్ని వ్రాశారు. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ప్రసిద్ధమైన రూపాలనే గాక సీసపద్యంలో ఉత్పలమాల (ప.53), సీసపద్యంలో శార్దూలం (ప.54), శార్దూలవృత్తంలో కందపద్యం (ప.84) వంటి అపూర్వాలైన ఛందశ్చిత్రాలను ప్రయోగించాడు.
  14. బంధ చిత్రాలు: అక్షరాలను నాగము, పద్మము, ఖడ్గము మొదలైన బొమ్మలలో కూర్చి రచించే చిత్రరచనలకు బంధ చిత్రములు అని పేరు.

ఈ విశేషాలను గురించి మరొకసారి విశదంగా వివరిస్తాను. పైని చెప్పిన చిత్రాలలో ఒక్కొక్క చిత్రాన్ని గురించి ఒక్కొక్క పుస్తకం వ్రాయతగినంత సమాచారం లభిస్తుంది. భగవదనుగ్రహం ఉంటే ఒక్కొక్క చిత్రాన్ని గురించి ఒక్కొక్క వ్యాసం వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఆ చిత్రరచనలు అన్నింటికి సంగమస్థానమూ, భారతీయ చిత్రకావ్యపరంపరలో అత్యపూర్వమూ అయిన అయిన ఒక చిత్రాన్ని గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ విజయవిలాసములోని 808-వ పద్యంలో నిలిపాడు. ‘ఈమాట’ వచ్చే సంచికలలో దానిని సవిస్తరంగా వ్యాఖ్యానిస్తాను.

ఈ వ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము కవికాలాదులను గురించి, కావ్యకథను అధికరించి విశేషించి వ్రాయటం లేదు. ఆ కావ్యంలోని కొన్ని శబ్దార్థచిత్రరచనలను మాత్రం ముక్తాముక్తంగా వివరిస్తున్నాను.

1. గూఢ దశమి

ఈ ధర చంద్ర క గురు వి భ
గో ధర భవ మణిగతిన్ నగుఁ గళా తేజో
మేధా జవ నయ శమ ధృతి
బోధ వితర ణాత్మవిహృతి మురరిపుఁ డెపుడున్.

గణపవరపు వేంకటకవి రచించిన సాటిలేని చిత్రకావ్యం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని 328-వ పద్యం ఇది. దీనికి, గూఢ దశమి అని పేరు.

ముందుగా పద్యార్థాన్ని పరిశీలిద్దాము. వేంకటేశ్వరస్వామి వాహ్యాళికి బయలుదేరి కొండమీది తిరునాళ్ళను చూసుకొంటూ పరివారంతో ముందుకు సాగుతుంటాడు. శ్రీవారి చేతిలో ఉన్న కేళిడేగ ఆకాశరాజు కుమార్తె నాంచారుదేవి ఉద్యానవనంలో వాలుతుంది. శ్రీవారు అక్కడికి మంత్రిసహితుడై విచ్చేసి, ఆమె వృత్తాంతాన్ని తెలిసికొనిరమ్మని మంత్రిని పంపిస్తాడు. మంత్రి ఆమెను చెలికత్తెలతో ఉండగా చూసి వేంకటేశ్వరుని మహిమను అభివర్ణించే సందర్భంలోనిది ఈ పద్యం. కలియుగప్రత్యక్షదైవతం శ్రీ వేంకటేశ్వరస్వామి శ్రీమహావిష్ణువుయొక్క అర్చావతారం కనుక తాద్రూప్యభావన వల్ల శ్రీమహావిష్ణుకృతమైన మురాసుర సంహారకర్తృత్వం ఆయనయందు అధ్యారోపింపబడుతున్నది. లోకకంటకుడైన మురాసురునికి ప్రారబ్ధం నిండి, చేసిన పాపం పండి, కర్మశేషం తీరిన తర్వాత భగవంతుని చేతిలో మరణం సిద్ధించింది. భగవన్నామాలన్నీ భగవంతుని గుణకర్మలను బట్టి ఏర్పడినవి కాబట్టి భగవద్గుణవైభవాన్ని వర్ణించేందుకు మురరిపుత్వాన్ని ప్రాతిపదికగా ఎన్నుకొన్నాడు కవి.

మురరిపుఁడు = శ్రీ వేంకటేశ్వర స్వామి, ఈ ధరన్ = ఈ ధరణియందు శేషాద్రిశిఖరాన స్వయంవ్యక్తుడై వెలసిన తరుణాన, చంద్ర = చంద్రునియొక్క, క = సూర్యునియొక్క, గురు = బృహస్పతియొక్క, వి = పక్షిరాజైన గరుత్మంతునియొక్క, భ = శుక్రునియొక్క, గో = భూమియొక్క, ధర = పర్వతముయొక్క, భవ = ఈశ్వరునియొక్క, మణి = చింతామణియొక్క, గతిన్ = స్వరూపస్థితిని, కళా = తన సర్వకళామయత్వం చేత, తేజః = నిండైన వెలుగు చేత, మేధా = బుద్ధివిశేషం చేత, జవ = జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అన్న ధర్మత్రయం చేత, నయ = నేర్పుచేత, శమ = సర్వోపాధులకు అతీతుడైనందువలన విక్షేపాది విక్రియలు లేని ఇంద్రియశాంతి సిద్ధించటం చేత, ధృతి = ఎల్లవేళల ఆనంద స్వరూపానుభవాన్ని పొంది ఉండటం చేత, బోధ = తత్త్వజ్ఞానసంపత్తి చేత, వితరణ = సర్వజీవులకు అభీష్టసిద్ధిదాయకత్వం చేత, ఎపుడున్ = త్రికాలములలో, నగున్ = పరిహసిస్తుంటాడు – అని ప్రతిపదార్థం.

పద్యంలో విశేషణాల క్రమాన్వయం ఉన్నది. మురరిపుడైన స్వామివారి కళావిభూతి, శుద్ధచైతన్యాత్మకమైన ప్రకాశం, నిశ్చయరూపమైన వృత్తి, సగుణశక్తి, త్రైలోక్యనాయకత్వం, నిత్యప్రసన్నత, నిరతిశయ సౌఖ్యానుభవం, ఆత్మజ్ఞానం, దాతృత్వగరిమ అన్న ధర్మాలు ప్రతిపాదింపబడుతున్నాయి.

మురరిపుఁడైన = శ్రీ వేంకటేశ్వర స్వామి, ఈ ధరన్ = ఈ ధరణియందు శేషాద్రిశిఖరాన స్వయంవ్యక్తుడై వెలసిన తరుణాన, చంద్ర = చంద్రుని యొక్క స్వరూపస్థితిని తన సర్వకళామయత్వం చేత, క = సూర్యునియొక్క స్థితిని నిండైన తన వెలుగు చేత, గురు = బృహస్పతిని బుద్ధివిశేషం చేత, వి = గరుత్మంతుని మహాశక్తి చేత, భ = శుక్రుని నీతికోవిదత్వం చేత, గో = భూమిని శాంతావస్థ చేత, ధర = పర్వతమును ధారణ చేత, భవ = ఈశ్వరుని తత్త్వజ్ఞానసంపత్తి చేత, మణి = చింతామణిని తన అభీష్టవరదానం చేత – తిరస్కరిస్తాడని క్రమాన్వయం.

చంద్రుడు షోడశకళాపూర్ణుడు. అయితే ఆ కళలకు వృద్ధిక్షయాలున్నాయి. స్వామి అక్షయకళాప్రపూర్ణుడు. ఆయన కళాత్మికతకు కాలానుసారిత లేదు. అందువల్ల చంద్రుని తన కళచేత పరిహసించాడని కవి భావం. సూర్యుని వెలుగుకూడా అంతే. కాలాధీనం. స్వామి తేజం అటువంటిది కాదు. అది శబ్ద స్పర్శ రూప గుణాలను కలిగిన ఒక తన్మాత్ర మాత్రమే కాదు. అది చిత్స్వరూపం. చైతన్యాత్మకమైన ప్రకాశం. సూర్యుని వెలుగు అందులోని అంశమాత్రం. అందువల్ల సూర్యుని యొక్క స్వరూపస్థితిని తన తేజోమయత్వం చేత అధఃకరించటం జరిగింది.

గురువుయొక్క బుద్ధి తత్త్వాతత్త్వాల వివేకసామర్థ్యం వల్ల ఏర్పడినది. అది బ్రహ్మజ్ఞానరూపం. స్వామి తానే బ్రహ్మమైనవాడు. ఆయన మేధాశక్తియే మహత్తత్త్వం. అదే జగదంతరాత్మ. అతిమానుషమైన ఆయన నిశ్చయాత్మికవృత్తి ముందు బృహస్పతియొక్క బోధస్వరూపం వెలవెలపోతుంది. అందువల్ల అది పరిహసనీయమని చిత్రణ.

గరుత్మంతుడు మహాబలసంపన్నుడు. అయితే స్వామికి వాహనభూతుడే కాని స్వతంత్రుడు కాడు. జవము అంటే వేగము అన్న అర్థం కూడా ఉన్నది. గరుత్మంతుని వేగం వాయుసంచారానికి లోగి ఉంటుంది. స్వామి శక్తి అటువంటిది కాదు. అది కారణనిష్ఠమై కార్యోత్పాదనరూపమైన ఒక ధర్మం. ఆ శక్తిసామర్థ్యం సగుణమైనప్పుడు దానికి గరుత్మంతుని బలం సాటిరాదు. అందువల్ల అది నవ్వులపాలయింది.

శుక్రుడు నీతికోవిదుడు. అది యోగ్యవ్యహారబోధరూపమైన రాజవిద్యానుబంధం. స్వామి నయవిద్య ఒక భగవద్విభూతిభేదం. రెండింటిని సాటిచేసినప్పుడు కవి దృష్టిలో శుక్రుని స్థితి పరిహాసాస్పదం అయింది.

భూమిని శమముయొక్క గతిని బట్టి పరిహసించటం భావ్యంగా అమరింది. ఆమె క్షమాస్వరూపిణి. ఓరిమి ఆమె స్వభావం. స్వామి ఎంతటి క్షమాస్వరూపుడో అంతటి దుష్టసంహారక్రియానిపుణుడు. సృష్టిస్థితిలయాలు మూడూ ఆయన సంకల్పాధీనాలు. ఆ శక్తి సమగ్రిమ ముందు ఏదీ తులనీయం కాదని కవి భావం. అందువల్ల తిరస్కరణం. పైగా భూమియొక్క గతి తానంతకు మునుపే అధఃకరించిన సూర్యుని ఆశ్రయించుకొని ఉంటుంది. అందువల్ల కూడా హసనీయం. ధరను ధృతిచేత పరిహసించటమూ సముచితమైన కల్పనే. ధర అంటే పర్వతం. భూమిభారాన్ని ధరించేది అన్న అర్థంలో పర్వతానికి ధర అన్న సంకేతం ఏర్పడింది. భగవంతుడు ఆ పర్వతానికంటె ధృతిమంతుడు. పర్వతం భూమిభారాన్ని మాత్రమే వహిస్తున్నది. భగవంతుడో? విశ్వవిశ్వంభరా భార సంభరణదీక్షాదక్షుడు. అందువల్ల చిన్నచూపు.

ఈశ్వరుడు సర్వశ్రేయోనువర్తి. భవ శబ్దం చేత పుట్టుక కలవాడని సాభిప్రాయమైన విమర్శయుక్తి ఉన్నది. హరిహరులకు భేదభావం లేకపోయినా, శ్రీ వేంకటేశ్వరునిలో ఈశ్వరత్వం నిబిడమై ఉన్నా, వక్ష్యమాణాన్ని బట్టి కవి భవునియొక్క బోధశక్తికంటె శ్రీ వేంకటేశ్వరుని బోధసంపదను ప్రమాణీకరిస్తున్నాడు.

మణి అంటే కోరిన కోర్కెలను తీర్చే చింతామణి. ఆ చింతామణికంటె గొప్ప చింతామణి స్వామి. చింతనపరులకు శుద్ధము, బుద్ధము, ముక్తము, కేవలము, అఖండము, సచ్చిదానందస్వరూపము అయిన స్వామి స్వరూపానుభవం కలుగుతుంది. కోరినవారికి కొంగుబంగారం ఆయన.

పద్యంలో చంద్ర – క – గురు – వి – భ – గో – ధర – భవ – మణులని మొత్తం తొమ్మిది పదార్థాలున్నాయి. వాటి స్వస్థితిని అధఃకరించేందుకు కళా – తేజో – మేధా – జవ – నయ – శమ – ధృతి – బోధ – వితరణములు అని తొమ్మిది శక్తులు చెప్పబడ్డాయి.

పద్యం చివరి దళంలో ‘ఆత్మవిహృతి’ అన్న పదబంధం ఉన్నది. అందుకు సిద్ధమైన ఉపమానం లేదు. దాని బోధ్యబోధకం ఏమిటో కవి చెప్పలేదు. అన్వయస్థితిని నిరూపించలేదు. యథావస్థితంగా దానికి అన్వయం చెప్పటం సాధ్యం కాదు.

ఇదే ‘గూఢ దశమి’ అన్నమాట. పాఠకుడు ప్రయత్నించి తెలుసుకోవలసిన గూఢార్థం. తొమ్మిదింటిని చెప్పి దశమ వస్తువును గూఢంగా ఉంచినందువల్ల గూఢ దశమి అయింది.

కీలకం ఇది: అర్థక్రమంలో పాఠకుడు మళ్ళీ వెనక్కి రావాలి. చంద్ర – క – గురు – వి – భ – గో – ధర – భవ – మణి గతిన్ అన్న దళంలోని పదాలను, ‘చంద్రక గురువిభ గోధరభవమణి గతిన్’ అని పునర్విభాగం చేసుకోవాలి. స్వామివారి ఆత్మవిహృతి (ఇంద్రియాలను ఉపశమింపజేసి మనోలయాన్ని సాధించి నిత్యమూ ఆత్మయందు విహరింపగలిగి ఉండటం) చంద్రక = బంగారముయొక్క, గురు విభ = అధికమైన కాంతిని కలిగిన, గోధర – గో = గోవును (వేదవాక్కును), ధర = ముఖమండలమందు నిలిపికొన్నవాడైన బ్రహ్మదేవునికి, భవ = జన్మించినవారిలో, మణి = శ్రేష్ఠుడైన వసిష్ఠుని యొక్క (గోధరభవమణి = వసిష్ఠుడు), గతిన్ = సదసద్వస్తువివేకం లోపించిన వర్తనమును, నగున్ = పరిహసించును అని భావాన్ని గుర్తించాలి.

ఈ విధంగా పదవదైన విశేషణం, దానికి అన్వయింపదగిన ఉపమానం అన్నవి రెండూ పద్యంలో గూఢంగా ఉన్నందువల్ల దీనికి గూఢ దశమి అని పేరు. ఇంకా, గూఢతృతీయ, గూఢపంచమి, గూఢాష్టమి, వంటి నిక్షిప్తచిత్రాలను వేంకటకవి వ్రాశాడు. కవులు పరిపరివిధాల వ్రాశారు. గూఢచిత్రాలకు లక్షణగ్రంథాలలో గోపన చిత్రములు, గుప్తి చిత్రములు అని కూడా పేర్లున్నాయి.

పద్యంలో తుల్యయోగితాలంకారం ఉన్నది. అక్కడక్కడ ఏకాక్షర పదాలున్నాయి. అవన్నీ సప్రమాణమయినవే. విస్తరభీతి వల్ల అలంకార లక్షణాన్ని, నిఘంటుప్రమాణాలను, కవిప్రయోగాలను ఉదాహరించటం లేదు. క్లిష్టకల్పనలున్న ఇటువంటి రచనలను పరిష్కర్తలు అర్థతాత్పర్యాలతో ప్రకటింపనందువల్ల పాఠకులకు భావప్రతీతి తెలియక ఇవన్నీ నిరర్థకరచనలనుకొనే ప్రమాదం ఉన్నది.

2. బహుభాషామిశ్రచిత్రం

ప్రాకృతీ శౌరసేనీ మాగధీ పైశాచీ చూళి కాపభ్రంశ సంస్కృతాంధ్రాష్టభాషా సీసము: బహుభాషామిశ్రచిత్రమైన మరొక చిత్రపద్యాన్ని చూద్దాము.

ణాయమాణస్సిణీ ళోయ ధమ్మిళ్ళ ప
        జ్జణ్ణ యవిజ్జుళా సరిసపాయ
పురవదేవ్వ విదాణ గరువమరట్టదుః
        ఖట్ట జాద విజేయ కళనసీహ
చళనశాళస నిళంతళ భత్తచిందిత
        పళశమస్తనకేళి పారియాద
మతనసూతనధేరతిత శవళ్ళహముహ
        గననిజ్జగల్లానగు నదురీన

కందకచళా చలఖ్కణ పంధుళాళి
మహయముఖధి కరీ హేదు మహపడుఝ్ఝ
ఆజవంజవ జలధిమగ్నాత్తతరణి
మబ్బుపూఁబుట్టువు బిడారు మగువఱేఁడ.

ఇది ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని 876వ పద్యం. సీసచ్ఛందస్సు. దేవతలందరూ స్వామిపుష్కరిణిలో తీర్థస్నానం చేసి వేంకటేశ్వరస్వామిని దర్శించికొని ఆయనను తమ భాషావైభవంతో సంస్తుతించిన సందర్భంలోనిది. బహుభాషామిశ్రము అనబడే ఈ చిత్రరచనకు వేంకటకవి పెట్టిన పేరు, ప్రాకృత శౌరసేనీ మాగధ పైశాచీ చూళి కాపభ్రంశ సంస్కృతాంధ్రాష్టభాషా సీసము అని. మొదటి పాదం ప్రాకృత భాషారచనమని అర్థం. రెండవ పాదం శౌరసేనీ ప్రాకృత భాషారచనం. మూడవది మాగధీ ప్రాకృతం. నాలుగవది పైశాచీ ప్రాకృతం. తేటగీతిలోని మొదటి పాదం అయిదవదైన చూళికా ప్రాకృతం. ఆ తర్వాతిది అపభ్రంశ ప్రాకృతం. తర్వాత సంస్కృతం, తదనంతరాన అచ్చ తెలుగు. మొత్తం ఎనిమిది.

ఈ విధంగా బహుభాషామిశ్రమైన చిత్రరచనను ప్రయోగింపగల కవులు ఏ దేశంలోనైనా ఎంతో అరుదుగానే ఉంటారు. ఒక భాషను సలక్షణంగా నేర్చుకొన్నవారికి దేశాటన బహుజనపరిచయాదుల వల్ల అన్యభాషలను అభ్యసించటం సులభమే కాని, అన్ని భాషలలోనూ ఛందోబద్ధమైన కవిత్వాన్ని చెప్పగలిగినంత సాహిత్యం అలవడటం మాత్రం సామాన్యం కాదు.

వేంకటకవి తన బహుభాషాపరిజ్ఞానానికి ఆదర్శంగా నిలిపిన ఈ సీసచక్రవర్తిని శీర్షికను బట్టి కొన్ని విషయాలను ఊహింపవచ్చును. ఇందులోని ప్రాకృతాలు ఆరు. వాటికి ఆయన పెట్టిన పేర్లు ప్రాకృత శౌరసేనీ మాగధీ పైశాచీ చూళి కాపభ్రంశములు అని. అంటే, లక్ష్మీధరుని షడ్భాషాచంద్రిక ఆయన ఎదుట ఉన్నదన్నమాట. లక్ష్మీధరుడు చెప్పిన క్రమం ఇది:

షడ్విధా సా ప్రాకృతీ చ శౌరసేనీ చ మాగధీ
పైశాచీ చూళికా చాప్యపభ్రంశ ఇతి క్రమాత్.
(25వ శ్లోకం)

ఇవన్నీ సుప్రసిద్ధ ప్రాకృత భాషాభేదాలే అయినప్పటికీ లక్ష్మీధరుడు చెప్పిన మొదటి ప్రభేదమైన ప్రాకృతీ – అంటే మహారాష్ట్రీ ప్రాకృతం. మహారాష్ట్రాశ్రయాం భాషాం ప్రకృష్టం ప్రాకృతం విదుః – అని వ్యాఖ్యాతలు. ప్రాకృతాలన్నిటిలో మహారాష్ట్రాశ్రయమైన ప్రాకృతం ప్రకృష్టమైనది కనుక ప్రసిద్ధిని బట్టి ప్రాకృతం అంటే మహారాష్ట్రీ ప్రాకృతం అని అర్థం చేసుకోవాలట. వేంకటకవి కూడా లక్ష్మీధరుని పద్ధతినే అనుసరించి మొదటి పాదాన్ని ప్రాకృతం అన్నాడు. అందువల్ల ముద్రిత ప్రతులలోని పద్యం శీర్షికను, ప్రాకృతీ శౌరసేనీ మాగధీ పైశాచీ చూళి కాపభ్రంశ సంస్కృతాంధ్రాష్టభాషా సీసము – అని సరిదిద్దుకోవాలి.

పాఠకులకు పద్యార్థవిశదిమకోసం వేంకటకవి ఆ షడ్విధ ప్రాకృతాలకు సంస్కృతంలో ఛాయనుకూడా తానే ఇచ్చాడు. మనకు కొంత శ్రమ తప్పింది. చివరి రెండు పాదాలు సంస్కృతాంధ్రాలే కనుక ఛాయ అవసరం లేకపోయింది. ముద్రిత ప్రతులలోని ఆ ఛాయాభాగాలివి:

నాకమనస్వినీలోకధమ్మిల్ల పర్జన్యక విద్యుతి సదృశదేహ
పూర్వదేవ వితాన గర్వమదోద్ధత గజ జాత విజవన కలనసింహ
చరణ సారస నిరంతర భక్త చింతిత ఫలసమర్థనకేళి పారిజాత
మదన సూదన ధాతృత్రిదశ వల్లభముఖ గణనీయ కల్యాణగుణధురీణ

గంధ గజరాజరక్షణ బంధురార
మగువ ముఖాశ్చర్య హేతు సమ సమూహ.

గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము రెండుసార్లు అచ్చయింది. మొదటి ప్రతిని పూండ్ల రామకృష్ణయ్యగారు 1889లో అముద్రిత గ్రంథచింతామణి పక్షాన ప్రకటించారు. ఆ తర్వాత 1977లో వేదం వేంకటరాయశాస్త్రి (మనుమడు) గారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి పక్షాన దానినే పునర్ముద్రించారు. అకాడమి ప్రతి మళ్ళీ ఒకసారి ఏ మార్పు లేకుండా ముద్రితమైంది. పూండ్లవారి ప్రతిలోనూ, అకాడమి ప్రతిలోనూ తప్పులు కోకొల్లలుగా ఉన్నాయి. ఏది లేఖకదోషమో, ఏది ముద్రాపకదోషమో తెలియరాని స్థితిలో దురుద్ధరంగా ఉన్నాయి. వ్రాతప్రతులతో సరిచూసి సరైన పాఠపరిష్కరణ చేసి సవ్యాఖ్యానంగా ప్రకటిస్తేనే కాని కావ్యగౌరవం పాఠకులకు బోధపడని దుఃస్థితి.

సులభమైన సంస్కృతపాదాన్నే చూడండి. ఆజవంజవ జలధిమగ్నాత్తతరణి – అన్నదే సరిగా లేదు. ‘ఆత్త’కు అర్థం లేదు. తరణి శబ్దం సంబోధనార్థంలో తరణే అవుతుంది. అప్పుడు తేటగీతి చివర ఛందోభంగం. ఆజవంజవ జలధిమగ్నార్తతరణ – అని ఉండాలి. తరణః ఉడుపే అని శబ్దార్థకల్పతరువు. ఆజవంజవము (సంసారము) అనే జలధిలో మునిగి ఆర్తులైనవారికి రక్షాకరుడై క్షేమస్థేమాలతో ఒడ్డుకు చేర్చే తరణి (పడవ) వంటివాడు శ్రీ వేంకటేశ్వరస్వామి అని అర్థం.

ప్రాకృతభాగం ఇంకా దురవబోధంగా ఉన్నది. మహారాష్ట్రీ ప్రాకృతాన్ని తీసుకొందాము. నాక ప్రాకృతంలో ణాయ అయింది. మనస్వినీ-శబ్దంలో నకారానికి ణత్వం వచ్చి మణస్విణీ అవుతుంది. ఆ తర్వాత వకారానికి లోపం. మనస్వినీషు నకారయో ర్ణత్వం, వకారస్య చ లోపః అని 1890లో అచ్చయిన కాన్‌కాన్‌పల్లి నృసింహశాస్త్రిగారి ప్రాకృత శబ్దప్రదీపిక (79వ పుట)లోని వివరణ. అందువల్ల మణసిణీ అవుతుంది. ఆ తర్వాత, వక్రాదిషు అన్న వరరుచి ప్రాకృతప్రకాశిక సూత్రం (4-15) వల్ల మణంసిణీ అవుతుంది. వైకల్పికత్వసిద్ధి వల్ల మాణంసిణీ అని రూపం. ధమ్మిల్ల-శబ్దం, వికల్పం వినా ఆదే రికారస్య ఏకారః అన్న వరరుచి సూత్రం అనువర్తించి ధమ్మేళ్ళ అవుతుంది. ధేమ్మిళ్ళ అనే రూపం కూడా ఉన్నదని ప్రాకృతశబ్దప్రదీపిక. విద్యుతి-శబ్దం వర్ణాదేశం మూలాన విజ్జుతి అయి, న విద్యుతిః (4-9), అన్త్యహలః (4-6), విద్యుత్ప్రీతాభ్యాం ళః (4-16) అన్న వరరుచి సూత్రాల వల్ల తకారలోపం, స్వార్థంలో ళ ప్రత్యయం వచ్చి, విజ్జుళా, పక్షాంతరాన విజ్జుళీ, అని రెండు రూపాలు సిద్ధిస్తాయి. సదృశపాద అన్నది సరిసపాయ కావటం వ్యాకరణరీత్యా సముచితమే కాని అర్థవంతం కాదు. శ్రీ వేంకటేశ్వరుని దేహకాంతి నాకవనితల ధమ్మిల్ల(కొప్పు)కాంతి వలె నల్లనిదే కాని స్వామి పాదాలను నల్లనివిగా వర్ణించటం భావ్యమూ కాదు; కవిసమయసిద్ధమూ కాదు. పాదాలను ఎఱ్ఱనివిగానే భావించి అభివర్ణించాలి. నల్లని దేహము అన్నట్లు నల్లని పాదాలు అనటం అనుచితం. కనుక సదృశపాద అన్నదానిని సదృశదేహ అని సరిదిద్దుకొని, ప్రాకృతాన్ని సరిసదేఅ అని చదువుకోవాలి. ఆ ప్రకారం మహారాష్ట్రీ ప్రాకృతపాదం ‘ణాయమాణంసిణీ ళోయ ధమ్మేళ్ళ పజ్జణ్ణయ విజ్జుళా సరిసదేఅ’ అని ఉంటుంది.

తక్కినవీ అంతే. ఒక్క చూళికను మాత్రం చూద్దాము. చూళికాపైశాచ్యాం రోలస్తు (ప్రాకృతశబ్దప్రదీపిక, పుట 65), రేఫస్య లకారో వా స్యాత్, గజడదబఘఝఢఢధభాం కచటతపఖఛఠథఫాః, గాదీనాం క్రమాత్ కాదయః స్యుః — అని పరిణామసూత్రక్రమం. గన్ధ > కంథ. గజరాజ > కచళాచ. లకారం ఉండే చోట్లలో మూర్ధన్య ళకారాన్ని వ్రాయటం దాక్షిణాత్యుల సంప్రదాయం. రక్షణ > లక్ఖన. బన్ధురారి > పంథుళాళి. అపభ్రంశ భాషా పద్యపాదం, దాని ఛాయ -– రెండూ అపభ్రంశంగానే ఉన్నాయి.

పూర్తిగా సూత్రక్రమానుసారం వివరణను వ్రాయటానికి ఇది చోటు కాదు. తాత్పర్యం ప్రకారంగా వేంకటకవి పద్యం ఈ క్రింద సరిచేసిన తీరున ఉండాలి:

ణాయమాణంసిణీ ళోయ ధమ్మేళ్ళ పజ్జణ్ణయ విజ్జుళా సరిసదేఅ
పువ్వదేవ్వవిదాణ గవ్వమరట్టద గయజాయ విజ్ఝాయ కళణసీహ
చళణశారస ణిళంతళ భత్తచిందియ పళసమత్థణ(సమట్ఠణ?)కేళిపారియాయ
మదణసూదణథేర(ధాయి)తిదసవల్లహముహ గణనిజ్జకల్లాణగుణదురీన

కంతకచళాచ లక్ఖణ పంధు(థు?)ళాళ
మహవముహదిక్కరియహేదు మహపడిట్ఠ
ఆజవంజవ జలధిమగ్నార్తతరణ
మబ్బుపూఁబుట్టువు బిడారు మగువఱేఁడ.

పద్యార్థం ఇది: ణాయమాణంసిణీ ళోయ = దేవకాంతా సమూహముయొక్క, ధమ్మేళ్ళ = వేణీభరాల, పజ్జణ్ణయ = మేఘములయొక్క, విజ్జుళా = కాంతికి, సరిస = సాటివచ్చే, దేఅ = (నల్లని) శరీరకాంతిని కలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామీ, పువ్వదేవ్వవిదాణ = రాక్షస మూకల, గవ్వ = గర్వాతిశయం వలని, మరట్టద = మదోద్ధతి అనెడి, గయజాయ = గజసమూహాన్ని, విజ్ఝాయ = నాశనము, కళణ = చేయునటువంటి, సీహ = సింహమువంటి ప్రభూ, చళణశారస = పాదపద్మములను, ణిళంతళ = సర్వకాలము, భత్త = భక్తి గలిగినవారిచే, చిందియ = కోరుకొనబడిన, పళ = అభీష్టఫలాలను, సమత్థణ(సమట్ఠణ?) = ప్రసాదించుట అనే, కేళి = క్రీడయందు, పారియాయ = పారిజాత కల్పవృక్షమువంటి దేవా, మదణసూదణ = మన్మథుని సంహరించిన శివుడు, థేర(ధాయి) = సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, తిదసవల్లహ = దేవతలకు రాజైన ఇంద్రుడు, ముహ = మొదలుగా గలవారికి, గణనిజ్జ = మరిమరి యెన్నదగిన, కల్లాణ = శుభంకరములైన, గుణ = రక్షణ పోషణాది శక్తులయందు, దురీన = సమర్థుడవైన ఏడు కొండలవాడా, కంతకచళాచ = గంధగజేంద్రుని, లక్ఖణ = (మొసలి బారినుండి) కాపాడుటయందు, పందుళాళ = నిరుపమానమైన మహాశక్తిని కలిగిన గోవిందా, మహవ = దేవేంద్రుడు, ముహ = మొదలైన అమరులను, దిక్కరియ = ఎదిరించుటకు, హేదు = కారకులైన దుష్టులను, మహ = నిర్మూలించుటయందు, పడిట్ఠ = సమర్థుడవైన స్వామీ, ఆజవంజవ = సంసారము అనెడి, జలధి = సముద్రమునందు, మగ్న = మునిగి, ఆర్త = స్వస్థతను కోల్పోయినవారికి, తరణ = నావ వంటి స్వామీ, మబ్బుపూబుట్టువు = మేఘపుష్పము (నీరు) జన్మస్థానముగా కలిగిన తామర, బిడారు = నివాసముగా గల, మగువ = లక్ష్మికి, ఱేడ = పతివైన దేవా – అని.

షడ్విధప్రాకృతాలను ఛాయతో కలిపి, సంస్కృతపాఠాన్ని కూడా పరిష్కరించి ముద్రిస్తే సీసపద్యం ఇట్లా ఉంటుంది. విస్తరభీతి వల్ల ఒక్కొక్క సవరణకు వ్యాఖ్యను కూర్చటం లేదు:

ణాయమాణంసిణీ ళోయ ధమ్మేళ్ళ పజ్జణ్ణయ విజ్జుళా సరిసదేఅ
              (నాకమనస్వినీలోకధమ్మిల్ల పర్జన్యక విద్యుతి సదృశదేహ)

పువ్వదేవ్వవిదాణ గవ్వమరట్టద(మరట్ఠద) గయజాయ విజ్ఝాయ కళణసీహ
              (పూర్వదేవవితాన గర్వమదోద్ధత గజజాత విధ్మానకరణసింహ)

చళణశారస ణిళంతళ భత్తచిందియ పళసమత్థణ(సమట్ఠణ)కేళిపారియాయ
              (చరణసారస నిరంతర భక్తచింతిత ఫలసమర్థనకేళిపారిజాత)

మదణసూదణథేర(ధాయి)తిదసవల్లహముహ గణనిజ్జకల్లాణగుణదురీన
              (మదనసూదన ధాతృత్రిదశవల్లభముఖ గణనీయ కల్యాణగుణధురీణ)

కంతకచళాచ లక్ఖణ పందుళాళ

              (గంధ గజరాజరక్షణ బంధురార)

మహవముహదిక్కరియహేదు మహపడిట్ఠ
              (మఘవ మఖ ధిక్కారహేతు మథనపటిష్ఠ)

ఆజవంజవ జలధిమగ్నార్తతరణ
మబ్బుపూఁబుట్టువు బిడారు మగువఱేఁడ.

వేంకటకవి విశాలమైన వైదుష్యానికి, బహుభాషాప్రయోగవిజ్ఞానానికి, మనోహరకవితాత్మకభావనకు నిదర్శకమైన పద్యం ఇది. ఇందాక సవరింపవలసివచ్చిన — ణాయమాణంసిణీ ళోయ ధమ్మేళ్ళ పజ్జణ్ణయ విజ్జుళా సరిసదేఅ అన్న పాదం ఒక్కటే మరికొంత కొంత పరిశీలనీయం. వేంకటకవి ఈ పాదాన్ని, సేన్దూరపేట్ఠారుణపాణిపాఅం, ధమ్మేళ్ళరమ్మం తుహ ణాహ వేణ్హు, అని ప్రాకృతంలో శ్రీకృష్ణలీలాశుకుల వారి శ్రీచిహ్నకావ్యంలో (1-17) ఉన్న భాగాన్ని అన్వయించుకోవటంలో పొరబడినందువల్ల ఈ విధంగా వ్రాశాడేమో అనిపిస్తున్నది. ణాహ వేణ్హు = జగన్నాథుడవైన ఓ కృష్ణా, సేన్దూరపేట్ఠారుణ = చందిరకావి రంగు పొడితో ఎఱ్ఱగా అలంకరించినట్లు, తుహ = నీ యొక్క, పాణిపాఅం = పాణిపాదాలు మెరుస్తున్నాయి. నీ రూపం ధమ్మేళ్ళరమ్మం = నల్లనైన శిరోజభరంతో చూడముచ్చటగా ఉన్నది – అని లీలాశుకుల శ్లోకం. పాణిపాదములు, ధమ్మిల్లము అక్కడ విడివిడిగా వర్ణనకు వచ్చాయి. వేంకటకవి పొరపాటున సరిసపాయ అని చేర్చుకొన్నట్లు కనబడుతుంది. పజ్జణ్ణయ విజ్జుళా అన్నది కూడా లీలాశుకుల వారికి ఆభిమానికమైన చిత్రణమే. రుఆరుఇవిజ్జుళద్దో అని శ్రీచిహ్నకావ్యం (4-5). రుడ్రుచివిద్యుదార్ద్రః అన్నదే అనుకరణలో పర్జన్యకవిద్యుతి అయింది.

సీసపద్యం తృతీయపాదంలో వేంకటకవి, చళణశారస ణిళంతళ భత్తచిందియ పళసమత్థణ (సమట్ఠణ?) కేళిపారియాయ, అని మాగధీ ప్రాకృతాన్ని కూర్చినప్పుడు ఆయన దృష్టిలో భత్తకామియపళదాణపారియాయ అన్న ధరణిదేవుల రామయమంత్రి దశావతార చరిత్రములోని వామనావతారఘట్టంలో త్రివిక్రముడైన శ్రీమహావిష్ణువును దేవమాత అదితి సన్నుతించిన ప్రాకృతసీసం (5-49) ఉన్నది. వావిళ్ళ వారి ముద్రితప్రతిలో అది — భక్తకామి అఫలదాణపారి ఆఆ అని పొరపాటుగా అచ్చయింది. దానిని, భత్తకామియపళదాణపారియాయ అని సరిదిద్దుకోవాలి. వేంకటకవి రామయమంత్రి భావాన్ని కొంత విస్తరించి తన దళాన్ని కూర్చుకొన్నాడు. భత్తకామియ అన్న భాగం చళణశారస ణిళంతళ భత్తచిందియ అన్నంతదాకా తీగసాగింది. పళదాణపారియాయ అన్నదానిని పెంపుచేసి, పళసమత్థణ(సమట్ఠణ?)కేళిపారియాయ అని వ్రాశాడు.

తేటగీతి మొదటి పాదంలోనూ వేంకటకవి ధరణిదేవుల రామయమంత్రి దశావతార చరిత్రములోని ప్రాకృతసీసాన్ని అనుకరించినట్లు సులభంగానే ఊహింపవచ్చును. అయితే, రామయమంత్రి కేవలం మహారాష్ట్రీ ప్రాకృతాన్ని మాత్రమే వ్రాశాడు. వేంకటకవి బహుభాషాకోవిదుడు కనుక కృషి చేసి అష్టభాషాసీసాన్ని వ్రాశాడు. వావిళ్ళ వారి ముద్రితప్రతిలో, గఅరాఅరఖ్ఖ ఆ అని తప్పుపాఠం అచ్చయింది. దానినికూడా పాఠకులు గయరాయరక్ఖణ అని సవరించుకోవాలి. రామయమంత్రి వ్రాసినదే వేంకటకవి రచనలో కంతకచళాచ లక్ఖణ అయింది.

పద్యంలో శ్రీ వేంకటేశ్వరుని దేదీప్యమానమైన శరీరకాంతి, రక్షోగణసంహారకారకత్వం, ఆశ్రితజనాభీష్టవరదానకేళీవిలాసం, నిరతిశయకల్యాణగుణపరంపర, భక్తరక్షణపరాయణత్వం, ఇంద్రాదిదేవతల ఆర్తిహరణం, సంసారార్ణవమగ్నులై ఆర్తిని పొందినవారి రక్షాపరత్వం, శ్రీలక్ష్మిని వలచి వలపించుకొన్న ప్రేమాతిశయం నిరవధికశోభతో అభివర్ణింపబడుతున్నాయి. వేంకటకవి భావుకత్వం, శబ్దాలంకారచమీకరత్వం, కూర్పు నేర్పు ప్రస్ఫుటిస్తున్న అందమైన కల్పనమిది.

‘బహుభాషామిశ్రము’ అరుదైన చిత్రరచన. తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల అష్టభాషాదండకము కంటె ఎన్నో ఎన్నదగిన విశేషాలున్న మేలిరచన.

3. నామగోపనచిత్రం

విశేషాద్యక్షరనామకందము: నామగోపనచిత్రం.

భువనజఠర! జయసన్నుత!
గవాధిపా! ధన్యకలితకారుణ్య! రమా
ధవ! పరమపురుష! తీవ్ర రి
పువిపాలమహోవిశాల! భుజగధరపతీ!

ఇదికూడా శ్రీ వేంకటేశ్వర స్తవమే. భువనజఠర = సకలలోకాలను ఉదరంలో నిలిపికొన్న విశ్వరూపా, జయసన్నుత = జయుడనే పేరుగల అర్జునునిచే శ్రీకృష్ణావతారమందు సన్నుతింపబడిన దేవా (లేదా) జయాఖ్యానమని ప్రసిద్ధిని గన్న శ్రీ మహాభారతంలో పొగడిక గన్న పుండరీకాక్షా, గవాధిపా = భూదేవిని భార్యగా గ్రహించిన ప్రభూ (లేదా) యజ్ఞఫలభోక్తవైన సర్వేశ్వరా, ధన్యకలితకారుణ్య = నిన్ను ఆశ్రయింప నోచిన ధన్యులయందు దయగొన్నవాడా, రమాధవ = శ్రీలక్ష్మికి విభుడవైన శ్రీమన్నారాయణా, పరమపురుష = పురుషోత్తమా, తీవ్ర = తీవరించిన, రిపు = శత్రువులైన, విపాల = రాజులను మట్టుపెట్టే, మహః + విశాల = అధిక పరాక్రమము కలవాడా, భుజగధరపతీ = శేషశైలమునందు వెలసిన లోకరక్షకా – అని భావం.

పద్యంలో ఏడు కొండలకు ప్రతీకలుగా భువనజఠర! జయసన్నుత! గవాధిపా! ధన్యకలితకారుణ్య! రమాధవ! పరమపురుష! తీవ్రరిపువిపాలమహోవిశాల! అని ఏడు సంబోధనలున్నాయి. ఆ ఏడింటిలోని తొలి అక్షరాలను వరుసగా కూర్చుకొంటే — భు – జ – గ – ధ – ర –ప – తీ — అని వస్తుంది. అదే పద్యం చివర ఉన్న దళం. వేంకటకవి దీనిని విశేషాద్యక్షరనామకందము అన్నాడు. భు – జ – గ – ధ – ర –ప – తీ అన్న భగవన్నామం గోపనమై ఉన్నది కనుక ఇది నామగోపన చిత్రం.

4. చ్యుతక బహువిధ శబ్దచిత్రం

వనిత వేనలిఁ జూచి వనధర మవనత
        గతిఁ జెంది ధర మయి కదిసి నిల్వ
గురునితంబం బొత్తుకొనిపోవ దర మయి
        దొరయ గళ మెదిర్చఁ దులకు రాక
తిరిగి రదమ్మయి దినుసైన కోరక
        మరగతి నొందించి యంతఁ గోక
మై యుండఁ గుచమును కో యని యట్టె పైఁ
        గని పైకమై నుడి నెనయ వాణి

కినియ నది రాజదేశము నన వెలుంగ
నానన మెదురన జతమై రాది తా మె
లంగి తారాస్థితిఁ గడుఁ జెలంగ నఖము
గెలిచెఁ గనుక నా కనకాంగిఁ దలమె పొగడ.

ఇది కావ్యనాయిక నాంచారు దేవి సౌందర్యాన్ని వర్ణిస్తున్న చిత్రరచన. తాత్పర్యం ఇది:

వనిత = నాయికయొక్క, వేనలిని = వేణీభరాన్ని, చూసి = వీక్షించి, వనధరము = నల్లని మబ్బు (ఆ వేనలితో సాటి రాలేకపోయినందువల్ల), అవనత గతిన్ చెంది = సిగ్గుతో తలవంచుకొని ఉండవలసిన స్థితిని పొందింది. వనధరము అవనత గతిన్ చెంది అంటే – వనధరము అన్న పదం అవనతను చెంది – అంటే, ‘వనధరము’లోని ‘వన’త తొలగిపోయి, ‘ధరము’ అయింది.

ధర అంటే భూమి అని అర్థం. వనధరము మేఘరూపంలో ఉన్నప్పుడు వేనలికి సాటిరాలేక అవనతను పొంది ‘ధరము’ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ దశలో నాయిక పిఱుదుతో పోటీ పడవలసి వచ్చింది. పృథుత్వం విషయమై ధరము నితంబముతో సాటి కాలేకపోయింది. నితంబము ‘ఒత్తుకొని’ పోయిందట. ఆ ఒరపిడిలో ‘ధరము’ ఒత్తుకొనిపోవటం వల్ల ధ అన్న అక్షరంలోని ఒత్తు తొలగిపోయి, ‘దరము’ అయింది.

వనధరము ధరమై, ధరము దరమైన తర్వాత ఆ దరము నాయిక గళసీమతో స్పర్ధగొన్నది. దరము అంటే శంఖం కదా. ఆ శంఖం ఆమె గళసీమకు సాటి కాలేకపోయింది. అవమానంతో తిరగబడింది. అందువల్ల దరము ఇప్పుడు ‘రదము’ అయింది.

రదము అంటే దంతము. నాయిక పలువరుసతో అప్పుడు ‘కోరకము’ పోటీకి దిగింది. కోరకము అంటే పూవుమొగ్గ. ఆ కోరకము రదముతో సాటి కాలేకపోయింది. ఓటమి మూలాన ‘అరగతి’ని పొందింది. అరగతి అంటే ఛిన్నాభిన్నమైన దన్నమాట. అరగతి అంటే అ’ర’గతి. ర అన్న అక్షరం లేకుండా పోయిందన్నమాట. రేఫలోపం వల్ల ‘కోరకము’ అప్పుడు ‘కోకము’ అయింది.

కోకము అంటే జక్కవ పక్షి. వర్తులత్వ పృథుత్వాల వల్ల వక్షోజాలను జక్కవలతో పోల్చటం పరిపాటి. కోకము వక్షోజాలతో పైకొనవలసి ఓడిపోయింది. వక్షోజాలు కోకమును పైకొన్నాయట. ‘పై’కొనటం మూలాన ‘కోకము’ అప్పుడు ‘పైకము’ అయింది.

పైకము అంటే పికసమూహం. ఆ పికసమూహం ఇప్పుడు నాయిక ‘నుడి’తో – అంటే పలుకులతో తలపడవలసివచ్చింది. అది సాధ్యం కాకపోయింది.

ఎత్తుగీతిలో మరొక విధమైన చిత్రకల్పన ఉన్నది. ‘నుడి’ ఆ నాయిక ముఖమండలం నుంచి వెలువడినప్పుడు పికసమూహం పైని వాణి కినిసిందట. సరస్వతీదేవి ఆగ్రహాన్ని పొందినదని భావం.

ఆ సమయంలో నాయిక ముఖమండలం ఎలా ఉన్నది? రాజదేశము వలె వెలుగొందుతున్నదట. రాజ అంటే – ప్రకృతిం యః రంజయతి – ప్రకృతిని రంజింపజేసేది అని భావం. రాజదేశము అంటే చంద్రబింబమని కూడా అర్థం ఉన్నది. ఆహ్లాదకారిత వల్ల పెంపుగొన్న రాజదేశం నాయిక ముఖాన్ని ఎదిర్చిందట. కాని ఎదురురాలేక, సయోధ్యతో జతగూడటం జరిగింది. ఆ విధంగా జత గొన్నప్పుడు రాజ శబ్దంలోని జ తొలగిపోయింది. జతగొనుట అంటే జత్వమును (జ అన్న వర్ణాన్ని) తొలగించటం అని భావం. ‘జ-త’ అంటే ‘రాజ’ శబ్దంలో జ-వర్ణం ఉన్నచోట త-వర్ణం వచ్చి, రా+ఆదిని తా మెలంగి – అంటే, తా అన్న అక్షరం రా కు ముందు వచ్చి, ‘తారా’ అయింది.

తార అంటే తారక. తారక అయిన తర్వాత కూడా పాట్లు తప్పలేదు. తారకలు అప్పుడు నాయిక నఖములతో (గోళ్ళతో) పోటీపడ్డాయి. నాయిక నఖములే గెలిచాయి. అటువంటి కనకాంగిని పొగడటం శక్యమేనా? అని అడుగుతున్నాడు కవి.

ఇది చ్యుతకచిత్రమనే మేధావిక్రీడా వినోదరచన. అక్షరాల తొలగింపు వల్ల, అక్షరస్థానాల మార్పువల్ల కొత్త పదాలను, కొత్త అర్థాలను సాధించి చేసే చిత్రప్రక్రియ.

5. అనేకార్థఘటనచిత్రం

ప్రకృతాప్రకృతశ్లేష: అనేకార్థఘటనచిత్రం.

కావ్యారంభంలో కథోపక్రమణికను వ్రాసేటప్పుడు పురవర్ణనతో మొదలుపెట్టటం తెలుగు కవుల సంప్రదాయం. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము కావ్యారంభంలో గణపవరపు వేంకటకవి వేంకటాచల పట్టణాన్ని వర్ణించాడు. ప్రకృతిదృశ్యాలను, ఆ పట్టణంలోని ధన కనక వస్తు వాహనాలను, పురజనులను మనకు పరిచయం చేశాడు. ఆ క్రమంలో తన కాలం నాటికి ఆ ఊళ్ళోకి సరిక్రొత్తగా వచ్చిన మరఫిరంగిని వేంకటాచల పట్టణం కోట గోడ ముందు పట్టణవాసుల రక్షణార్థమై నిలిపాడు. ఆ ఫిరంగి వర్ణన ఇది. కథారంభంలోని 6వ పద్యం.

అల నృసింహుని యుద్ది నాగ్రహదశ నొంది
        యుగ్రుని వలెఁ జాల నుక్కుమీఱి
నలినసంభవు మాడ్కి నలుముఖంబుల నాని
        తమ్మి యందమున నాళమ్ముఁ గాంచి
సత్ప్రబంధము పోల్కి సారధ్వని నిగుడ్చి
        శక్తిభృద్గతి శిఖియుక్తి నొంది
సూకరపతి మేర నేకపద్ధతిఁ బూని
        యలరువిల్తుని భంగి నతనుతఁ గని

ద్రుమము వహి నున్నచోటఁ బాదుకొని యుండి
తురక కైవడి నల్లమందుపొడి మెక్కి
రాజు విధమున నరిపురిరాజి వేఁచి
వరలు నోడకయె పరంగి మరపిరంగి.

అది పరంగి దేశపు ఫిరంగి. ఫ్రెంచివారి నుంచి కొనుగోలు చేసినది కాబోలు. దానిని వర్ణించటం ప్రకృతార్థం. ఆ వర్ణనకు ఉపక్రమించి మాటలతో ఆటలాడుకొన్నాడు. శబ్దమాత్రసాధర్మ్యాన్ని పురస్కరించుకొని అప్రకృతంగా శ్లేషలను ఘటించాడు. ప్రకృతార్థం ఒకటి, ప్రకృతార్థంతో సంబంధం లేని అప్రకృతార్థం ఒకటి. రెండర్థాలను కూర్చినందువల్ల ఇది ప్రకృతాప్రకృతశ్లేష అయింది.

శ్లేష ప్రకృతార్థం అప్రకృతార్థం
ఆగ్రహదశ
ఉక్కుమీఱుట
నలుముఖంబుల నాని
నాళము
సారధ్వని
శిఖియుక్తి
ఏక పద్ధతి
అతనుత
పాదుకొను
నల్లమందు
వేచి
ఆక్రామక దశ
ఇనుముతో చేసి ఉండటం
నలుదెసలను అణచి
ఇనుప క్రోవి
మహాధ్వని
అగ్నియొక్క చేరిక
ఒకే త్రోవ
అనల్పమై ఉండటం
నిలుకడ గలిగి ఉండటం
ప్రేలుడుకు ఉపయోగించే పదార్థం
తపింపజేయటం
క్రోధావస్థ
అధికమైన శౌర్యాన్ని కలిగి ఉండటం
నాలుగు ముఖాలను కలిగి ఉండటం
తూడు
వ్యంగ్య ప్రధానత
నెమలి దగ్గరుండటం
అడుసులో ఉండటం
శరీరం లేని స్థితి
నెలకొనటం
అభిని
ప్రతీక్షించటం

ఇవన్నీ శ్లేషకు ఉపకరించిన పదార్థాలు. ఫిరంగి నృసింహమూర్తి లాగా ఆగ్రహదశను పొందింది. శత్రుస్థావరాలను ఆక్రమింపజేసేదిగా ఉన్నదని ప్రకృతార్థం. నృసింహమూర్తికి అన్వయించినపుడు కోపోద్రిక్తుడై ఉన్నాడని అప్రకృతార్థం.

ఉగ్రుడు అంటే పరమశివుడు. ఫిరంగి ఉగ్రావస్థమై ఉక్కుమీఱి (ఉక్కుతో రూపొందింపబడి) ఉండటం ప్రకృతార్థం. ఉక్కు అంటే ప్రబలమైన శక్తిసంపద. శివుడు మహాశక్తిసమేతుడై ఉండటం అప్రకృతార్థం.

ఫిరంగి నలినసంభవుని లాగా నలుముఖంబుల నాని ఉన్నదట. నాలుగు దిక్కులను ఆని = అణగింపజేసేదిగా ఉన్నది. నలినసంభవుడు బ్రహ్మ నాలుగు ముఖాలను కలిగి ఉన్నాడు.

ఫిరంగికి గుండు ప్రయాణించే ముందుగొట్టం ఉన్నది. దానికి నాళము అని పేరు. అది తామరపూవు వలె అందంగా ఉన్నదని ప్రకృతార్థం. ఫిరంగి నాళం మీద తమ్మిపూవులు అందంగా చిత్రింపబడ్డాయని కూడా అర్థం చెప్పుకోవచ్చును. ఫిరంగిని తమ్మితో పోల్చి చెప్పటం అప్రకృతార్థం. తమ్మికి తూడు ఉండటం ఈ పోలికకు ఆధారం. ఫిరంగి గొట్టానికి, తమ్మితూడుకు, నాళము అని పేరుండటం ఈ శ్లేషఘటనకు ప్రాతిపదికం.

ఫిరంగి సత్ ప్రబంధము లాగా ఉన్నదట. సారధ్వనిని కలిగి ఉండటం అందుకు కారణం. మందుగుండు పేలినప్పుడు వచ్చే గొప్ప చప్పుడును చెప్పదలిచాడు. సారధ్వని = నలుదిక్కుల ప్రతిధ్వనించే శబ్దం. ఫిరంగి సత్ ప్రబంధము లాగా ఉన్నది. సత్ = మంచి, ప్రబంధము = అమరికను కలిగి ఉన్నది అని భావం. సత్ ప్రబంధము అంటే, సత్ = ఉత్తమ విద్వాంసునిచే రచింపబడిన, ప్రబంధము = అష్టాదశవర్ణనాదులతో కూడిన మహాకావ్యం. సారధ్వని అన్న పదబంధం ప్రకృతార్థానికి, అప్రకృతార్థానికి రెండింటికి సరిపడింది.

శక్తిభృత్ గతిని ఫిరంగి శిఖియుక్తమై ఉన్నది. శక్త్యాయుధాన్ని ధరించినవాడు కుమారస్వామి. ఆయన వాహనం శిఖి = నెమలి. శిఖి అంటే అగ్ని అనికూడా అర్థం. ఫిరంగి శక్తిభృత్ గతిని = సమస్తశక్తిని తనయందే ఇముడ్చుకొనినట్లుగా, శిఖియుక్తమై = అగ్నితో కూడి ఉన్నది. శిఖియుక్తి అన్న పదబంధం ప్రకృతార్థానికి, అప్రకృతార్థానికి రెండింటికి ఉపకరించింది. నిప్పుతో కూడి ఉండటం ప్రకృతార్థం. ప్రబంధము వలె ఉండటం అప్రకృతార్థం.

ఫిరంగి సూకరపతి చందాన ఏకపద్ధతిని పూనిందట. దారి వైదొలగటం లేక ముక్కుసూటిగా దూసుకొనిపోతుందని ప్రకృతార్థం. వరాహమూర్తి ఒక్క అడుసులోనే ఉండటం అప్రకృతార్థం. ‘సూకరపతి మేర నేకలోద్ధతిఁ బూని’ అనికూడా వ్రాయవచ్చును. ఏకలము అంటే అడవి పంది, అసహాయము అని రెండర్థాలు. ఫిరంగి శ్రీమహావిష్ణువు అవతారమైన ఆదివరాహమూర్తి లాగా అన్యసాధనాల ఆవశ్యకత లేని ఉద్ధతితో ముందుకు సాగుతుందని, ఆటవికసూకరం లాగున వీరవిహారం చేస్తుందని రెండర్థాలు సిద్ధిస్తాయి. ప్రకృతాప్రకృతాల శ్లేష సమంజసంగా ఉంటుంది.

ఫిరంగి అలరువిల్తుడైన మన్మథుని వలె అతనుతను కలిగి ఉన్నది. తను- ధాతువుకు కృశించిన, పెంపెక్కిన అని రెండర్థాలు. అతను అంటే కృశించి లేని, మిక్కిలి పెంపుగలిగి అని అర్థాలు. ‘అతనుత’ అంటే బృహద్రూపం అన్నమాట. చాలా పెద్దదిగా ఉన్నది అని భావం. మన్మథుడు అతనుడు. అంటే తనువు లేనివాడు. అందువల్ల ఫిరంగికి అతనుత ప్రకృతార్థం, మన్మథునికి అతనుత అప్రకృతార్థం.

ఫిరంగి ద్రుమము కైవడిని ఉన్నచోట పాదుకొని ఉంటుందట. ద్రూ అన్న ధాతువుకు కదలిక అని అర్థం. కదలిక లేనిది కాబట్టి ద్రుమము = చెట్టు అన్న వ్యుత్పత్తిని కల్పించుకొన్నాడు. ప్రకృతాప్రకృతాలను ఐకాత్మికతతో అనుఘటించాడు.

ఎవరో మహమ్మదీయులు ఉల్లాసానికి అభిని అన్న నల్లమందు పొడిని వాడటం చూశాడు కవి. దీనిని పొడిగానూ, ముద్దగానూ, ద్రవరూపంలోనూ పరిపరివిధాల ఉపయోగిస్తారు. అభిని, కంటకార్యం, కాకజంఘ, గోలోమి, తంద్రకృత్తు, దురాలంభ, బంగి, బంగు, బహువాదిని, భంగి, భంగు, మాతులాని, మాదిక, మాదిని, మాదు(వు), రంజిక, విజయ, శణము, మహాశణము మొదలైనవన్నీ ఈ నల్లమందు రకాలేనట. ఫిరంగిలో మందుగుండుకు వాడే పొడికూడా నల్లరంగులోనే ఉండటం వల్ల ఆ విధంగా ప్రకృతాప్రకృతశ్లేష సాధ్యమయింది.

విక్రమపరుడైన రాజు లాగా ఫిరంగి శత్రురాజుల పట్టణాలను అగ్నివర్షంతో తపింపజేస్తుంది. రాజు అంటే ఇంద్రుడనికూడా అర్థం ఉన్నది. ఇంద్రుడు శాత్రవరాజుల పట్టణాలను దహించినట్లు – అని అన్వయం.

ఇది అనేకార్థఘటనమనే ప్రకృతాప్రకృతార్థాల శ్లేషచిత్రరచన. తవ్వినకొద్దీ రత్నాలు బయటపడే మహాఖని ఈ కావ్యం. వచ్చే సంచికలలో మరికొన్ని రత్నాలను చూద్దాము.

[03 మే 2014: పాఠక విమర్శానుసారం ఈ వ్యాసానికి ఉపోద్ఘాతం జతచేయబడింది – సం.]


అనువిద్ధ గ్రంథసూచి

  1. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము: గణపవరపు వేంకటకవి ప్రణీతం (సం) పూండ్ల రామకృష్ణయ్య పంతులుగారు, అముద్రిత గ్రంథచింతామణి, నెల్లూరు, 1889.
  2. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము: గణపవరపు వేంకటకవి ప్రణీతం (సం) వేదము వేంకటరాయశాస్త్రి గారు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, 1977.
  3. దశావతార చరిత్రము: ధరణిదేవుల రామయమంత్రి ప్రణీతం వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు, 1928.
  4. ముద్రితప్రతిలో బహుదోషభూయిష్ఠంగా ఉన్న ప్రాకృతసీసం ఇది. అధోజ్ఞాపికలో కొన్ని పాఠాంతరాలు ఉన్నాయి కాని, అర్థబోధకు, పరిష్కరణకు ఉపకరింపవు. ప్రశ్నార్థకాలు పరిష్కర్తలు ఉంచినవే:

    ళచ్ఛిత్థణాహేయ లలి అ పొమ్మలోఅణళో అపూ అణిజ్జ
    ఖఅవర ఆణేఅ గఅరాఅరఖ్ఖ అఖ అరకిందు సిఖి అరఅణి ఆస?
    ఈసరజణఅ మహేసరభ అణిజ్జ దిక్కమజాహ? తెళ్ళొక్కణాహ
    పుణ్నమి అంకలావణ్నస్స మందరఖి ఇధరథారఅ కిసణవణ్న

    భక్తకామి అఫలదాణపారి ఆఅ
    యాయయూయ జణఝ్ఝేఅ యాయరూఅ
    వాసుదేవ సఅణంద వణఅ దేహ
    కిత్తణిజ్జన హ్నీరఖేఅ? దేఅ. (5-49)

  5. షడ్భాషాచంద్రిక: చెరుకూరి లక్ష్మీధర ప్రణీతం (సం) కమలాశంకర్ ప్రాణశంకర్ త్రివేదీ, బొంబాయి సంస్కృత్ అండ్ ప్రాకృత్ సీరీస్, బొంబాయి, 1916.
  6. ప్రాకృతశబ్దప్రదీపిక: కాన్‌కాన్‌పల్లి నృసింహశాస్త్రి ప్రణీతం, మద్రాసు, 1890.
  7. ప్రాకృతప్రకాశిక: వరరుచి ప్రణీతం (సం) ఇ. బి. కోవెల్, లండన్, 1868.
ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...