ఇప్పటికి ఆరున్నర శతాబ్దాల క్రితం క్రీస్తుశకం 1360 ప్రాంతాల ఆంధ్రసరస్వతి పూర్ణకళావతారమైన శ్రీనాథుడు పాకనాటింట జన్మించి, వారిధి ఒడ్డున కాల్పట్టణాధీశ్వరుడు తాతగారు కమలనాభామాత్యుని ముద్దుముచ్చటలకు నోచుకొని, గర్భాష్టమంలో పిల్లలమఱ్ఱి పెద్దన్న గారివద్ద అక్షరశిక్షకు చేరేనాటికి ఆంధ్రదేశపు సాహిత్యవాతావరణంలో ఎన్నడూ లేని కొత్తగాలులు వీస్తున్నాయి. విద్యావిధానం మారసాగింది. పాఠ్యగ్రంథాలు కొత్తవి వచ్చిచేరాయి. లక్షణపద్ధతిలో నూత్నప్రస్థానాలకోసం వెతుకులాట మొదలయింది. సంస్కృత భాషాధ్యయనం గాఢతరమయింది. నన్నయాదుల కాలం నాడు ప్రవర్త్యమానములై ఉండిన అగ్నిపురాణం, భామహాలంకారం, దండి కావ్యాదర్శం, రాజశేఖరుని కావ్యమీమాంసాదుల స్థానంలో వామనుని కావ్యాలంకార సూత్రవృత్తి, ఉద్భటాచార్యుని కావ్యాలంకారసంగ్రహం, రుద్రటుని కావ్యాలంకారం, ఆనందవర్ధనుని ధ్వన్యాలోకం, అభినవగుప్తుని ధ్వన్యాలోక లోచనవ్యాఖ్య, మమ్మటుని కావ్యప్రకాశం, భోజరాజు శృంగారప్రకాశ సరస్వతీకంఠాభరణాలు మొదలైన మహాగ్రంథాల పఠనపాఠనాలు ప్రవేశించి, అవీ ప్రాతవడ్డ మాటలు కాసాగాయి.
ఎందుచేతనో కాని అభినవగుప్తుని అభినవభారతి, కుంతకుని వక్రోక్తిజీవితం, క్షేమేంద్రుని ఔచిత్యవిచారచర్చ, హేమచంద్రుని కావ్యానుశాసనం ఆంధ్రదేశంలో అంతగా ప్రభావాన్ని నెరపినట్లు కనబడదు. తెలంగాణంలో కాకతీయుల రాజకీయవిజయాల ఫలితంగా ఆంధ్రదేశమంతటా ఉత్సవోత్సాహం వెల్లివిరిసి, శ్రవ్యమాధ్యమాల స్థానంలో దృశ్యమాధ్యమాలకు ప్రచారం వచ్చి రంగస్థల ప్రదర్శనలు ప్రజాదరణకు నోచుకొనసాగాయి. సాహిత్యానురక్తుల దృష్టి శారదాతనయుని భావప్రకాశనం, ధనంజయుని దశరూపకం, భరతుని నాట్యశాస్త్రం వంటి రూపక కళాశాస్త్రగ్రంథాలకు మళ్ళింది. సంస్కృత నాటకాల అధ్యయనానికి, ప్రదర్శనకు ప్రాధాన్యం వచ్చింది. రంగశాలలు వెలిశాయి. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని నిర్మించి మళ్ళీ నాటకరంగానికి ప్రాణం పోశాడు. అమృతానందయోగి అలంకార సంగ్రహం, ధనికుని దశరూపక వ్యాఖ్య, శార్ఙ్గదేవుని సంగీతరత్నాకరం ప్రసరించిన కొత్తవెలుగుల ప్రస్థానంలో జాయప సేనాని నృత్తరత్నావళి ఉదయించి ఆంధ్రనాట్యాన్ని తలకెత్తింది. రాచకొండ సంస్థానంలో సర్వజ్ఞ సింగభూపాలుని రసార్ణవ సుధాకరం నాటక రంగంలో తెలుగువారి అన్వయాలను, నూత్నరీతులను ప్రచారంలోకి తెచ్చింది. మారుతున్న తెలుగువారి అభిరుచులకు అనుగుణంగా విశ్వేశ్వర దేశికుని చమత్కార చంద్రిక రసానుభవానికి కొత్తదారులను ఆవిష్కరించింది.
ఈ కృషిముఖాన తెలుగువారికి అనేకశాస్త్రపరిజ్ఞానం వృద్ధి కాసాగింది. విషయవివేచనాశక్తి పెరిగింది. రంగస్థల నాటకాలపై అభిమానం ఫలితంగా ప్రాకృత భాషాధ్యయన మొదలయింది. నాటకాలలో సగానికి సగభాగం విస్తరించి ఉండే బహుశాఖల ప్రాకృతాలను చదువుకోవటానికి ఆ భాషా వ్యాకరణాల పాండిత్యం ఆవశ్యకం అయింది. ఆ సమయంలో ఓరుగల్లు, రాచకొండలలో వెలసిన రీతిప్రస్థానానికి ప్రత్యామ్నాయం కాగల వినూత్నమార్గదీపనకు చందవోలు సామ్రాజ్యాధిపతి, మహాపండితుడు పెదకోమటి వేమారెడ్డి ప్రయత్నిస్తున్నాడు. విద్యాధరుని ఏకావళిలోని ధ్వన్యధ్వానికి, విద్యానాథుని రంగావిష్కరణకు, సర్వజ్ఞ సింగభూపాలుని శబ్దార్థవృత్తికి, విశ్వేశ్వర దేశికుని చమత్కృతికి సమాధానం ఆయనకు సర్వాంగీణమైన రుయ్యకుని అలంకార సర్వస్వంలోని అలంకారప్రస్థానంలో కనిపించింది. రుయ్యక వ్యాఖ్యాతలలో అగ్రేసరుడైన జయరథుని విమర్శినీ వ్యాఖ్యను తెలుగునేలకు తీసికొనివచ్చాడు. శాబ్దబోధంలో అలంకారశోభను మించిన కావ్యగుణం లేదని నిర్ధారించుకొన్నాడు. ప్రాకృత భాషాధ్యయనం మూలాన ఆయనకు అలంకార ప్రస్థానానికి, ధ్వనిప్రస్థానానికి, శబ్దధర్మానికి, రామణీయకానికి, రసవత్తకు, లోకస్వభావచిత్రణకు భవ్యాదర్శమైన హాల సంకలిత గాథాసప్తశతి లభించింది. గంగాధర భట్టు భావాలేశ ప్రకాశిక, భువనపాలుని ఛేకోక్తి విచారలీల, పీతాంబరుని గాథాసప్తశతీ ప్రకాశికా వ్యాఖ్యలను తెచ్చుకొని చదువుకోవటం ప్రారంభించాడు. ఆ వ్యాఖ్యలకు భిన్నంగా ధ్వన్యధ్వాన్ని చిత్రీకరించే అభినవవ్యాఖ్యను నిర్మించాలనే సంకల్పం ఉదయించింది. . వెంటనే రచన ప్రారంభించాడు. క్రీస్తుశకం 1375-వ సంవత్సరానికి ఒక యేడాది మునుపో, తర్వాతనో ఆ వ్యాఖ్య పూర్తయింది. దానికి భావదీపిక అని పేరుపెట్టాడు. దేశం సుభిక్షంగా ఉన్నది. కొండవీటిలో కొమరగిరి రెడ్డి ప్రారంభించిన వసంతోత్సవాలు చందవోలులోనూ మొదలయ్యాయి. ఆ శుభసమయంలో ఉజ్జ్వలంగా ఉన్న తెలుగువారి జీవితం ఆ గాథాసప్తశతిలో నిండుగా ప్రతిబింబిస్తున్న సంగతిని అప్పటికే బ్రాహ్మీదత్త పాండిత్యం వల్ల గడిదేరి, మరుత్తరాట్చరిత్రను నిర్మించి, సాహిత్యరంగంలో నిలదొక్కుకొంటూ నూనూగుమీసాల నూత్నయౌవనంలోకి అడుగుపెడుతున్న శ్రీనాథుడు నేత్రపర్వంగా చూచివుంటాడు. తెలుగువారి ఆచార సంప్రదాయాలు, వేషభాషలు, ఒయ్యారాలు, సరాగాలు, సాహసాలు, విలాసాలు, వినోదాలు, కళలు, కుటుంబజీవితంలో అల్లుకొన్న అనుబంధాలు, ఆటలు, పల్లెప్రజల తీరుతెన్నులు ఉట్టిపడే కావ్యం ఇంతకంటె వేరొకటి లేదని నిశ్చయించుకొన్నాడు. పెదకోమటి వేమారెడ్డి సంస్థానప్రవేశానికి, తన సాహిత్యసంస్కార ప్రతిఫలనానికి, ఆత్మోన్నతికి నిదర్శనగా గాథాసప్తశతిని అనువదించాడు. క్రీస్తుశకం 1433 ప్రాంతాల చెప్పిన కాశీఖండంలో (1-7)
నూనూఁగుమీసాల నూత్నయౌవనమున
శాలివాహన సప్తశతి నుడివితి
అని సగర్వంగా చెప్పుకొన్నాడు. ఇదంతా 1376 నాటి కథ.
నూనూగుమీసాల నూత్నయౌవనం
‘నూనూగుమీసాల నూత్నయౌవనం’ అంటే ఏనాటి వయసు? విమర్శకులు పరిపరివిధాల ఊహించారు. ఇరవై అయిదేళ్ళని కొమర్రాజు లక్ష్మణరావుగారు, ఇరవై రెండేళ్ళని కందుకూరి వీరేశలింగంగారు, రమారమి ఇరవయ్యేళ్ళ వయసని బండారు తమ్మయ్యగారు, పద్దెనిమిదేళ్ళని చిలుకూరి వీరభద్రరావుగారు, పదిహేడు – ఇరవై సంవత్సరాల నడిమి ప్రాయమని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాలన్నింటిని సమీక్షించి, కొర్లపాటి శ్రీరామమూర్తిగారు 1971లో ప్రకటించిన తమ బృహత్పరిశోధనగ్రంథం శ్రీనాథుడులో అది పదహారేళ్ళ ప్రాయమని నిరూపించారు. శివరాత్రి మాహాత్మ్యములో (3-38) సుకుమారుని వర్ణిస్తూ శ్రీనాథుడే స్వయంగా ‘ఉద్భిన్ననవశ్మశ్రు నభినవయౌవనోద్భాసితు షోడశవర్షదేశీయు’ అంటూ, నూనూగుమీసాలు మొలిచే అభినవయౌవనకాలం పదహారేళ్ళ ప్రాయమని చెప్పిన ప్రయోగాన్ని కనుగొన్నారు. దానితో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఇటీవల నాకు పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి <ఎం>జైమిని భారతముఎం>లో (8-51) ‘పదియాఱేఁడుల నూఁగుమీసముల లేఁబ్రాయంబునం’ అని ఇంకొక ప్రయోగం దొరికింది. దీనితో నూనూగుమీసాల నూత్నయౌవనం అంటే పదహారేళ్ళని నిర్ధారణ అయింది. శ్రీనాథుడు క్రీస్తుశకం 1360 ప్రాంతాల జన్మించాడు కనుక అది 1376 ప్రాంతం అన్నమాట.
శాలివాహన సప్తశతి పద్యాలు
శ్రీనాథుని శాలివాహన సప్తశతి ఇంతవరకు లభింపలేదు. శ్రీనాథుడు తాను వ్రాశానని స్వయంగా చెప్పుకొన్న మాట తప్పించి ఇతరులెవరూ ఆ విషయాన్ని చెప్పలేదు. లాక్షణకులు ఉదాహరింపలేదు. అందులోనివని కొన్ని కొన్ని పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణములో ఒకటి, దామరాజు సోమన పేరుమీద ఒకటి పద్యాలు కనబడుతున్నాయి. ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు పేర్కొన్నవి మరికొన్ని ఉన్నాయి. వాటి తథ్యమిథ్యావివేచన కోసం ఈ పరిశీలనమంతా ఉద్దేశింపబడుతున్నది. ఒక్కొక్కటిగా వాటిని వివరిస్తాను.
1. బాలబోధచ్ఛందములోని శాలివాహన సప్తశతి పద్యం
వారణసేయ దావగొనవా నవవారిజమందుఁ దేటి క్రొ
వ్వారుచు నంట నీ వెఱుఁగవా ప్రియ హా తెఱగంటి గంటి కె
వ్వారికిఁ గెంపు రాదె తగవా మగవారల దూఱ నీ విభుం
డారసి నీ నిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.
శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 1908లో ప్రకటించిన కుమారసంభవం ప్రథమ భాగంలోని ఉదాహరణం ఇది. కుమారసంభవం పంచమాశ్వాసంలో మన్మథదహనానంతరం వచ్చిన రతివిలాప సన్నివేశంలోని 89వ వచనంలో ‘అనుచు నతిసంభ్రమంబునం బఱతెంచిన వసంతకుం గనుంగొని రతి మతి నడల నూర్మడించినం దావగొనక’ అని ఉన్న దళంలోని ‘దావగొనక’ ధాతువు అర్థాన్ని వివరించటం కోసం రామకృష్ణకవిగారు ఒక అధోజ్ఞాపికను నిలిపి, దావగొనక = నిలువలేక అని అర్థాన్ని వ్రాసి, ఆ ధాతువుకు తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం నుంచి ‘నావుడు … పార్థివముఖ్యుఁడు తల్లడంబునం దావగొనంగలేక తన తమ్ముల నప్పుడ’ అని ఒక ప్రయోగాన్ని, శ్రీనాథుని సప్తశతి నుంచి పైని ఉదాహరించిన పద్యాన్ని – మొత్తం రెండు ప్రయోగాలను ఉదాహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు 1972లో ప్రకటించిన మానవల్లి కవి రచనలు అనే సంపుటంలో ఈ అర్థవివరణ, ఈ పద్యోదాహరణ ఎందువల్లనో తొలగిపోయాయి. సప్తశతిలో నుంచి వారు ఉదాహరించిన పద్యం ఆ కావ్యంలోని నాలుగవ ఆశ్వాసం లోనిదని వారు వ్రాసిన ‘శ్రీనాథుని సప్తశతి, ఆ. ౪’ అన్న ఆకరాన్ని బట్టి తెలుస్తున్నది. కుమారసంభవం దశమాశ్వాసంలోని 176వ సంఖ్య గల వచనంలో ‘కోపాగ్రహావేశంబునం దావగొనక’ అని ఉన్న ప్రయోగానికి కూడా రామకృష్ణకవిగారు మళ్ళీ ఒకసారి, దావగొనక = నిల్పోపక, అని అర్థాన్ని చెబుతూ ‘వారణసేయఁ దావగొనవా – శ్రీనాథుని సప్తశతి’ అని శ్రీనాథుని సప్తశతిని పేర్కొన్నారు. మానవల్లి కవి రచనలు సంపుటంలోని 45వ పుటలో ఈ రెండవ అర్థవివరణ మాత్రం ముద్రితమై ఉన్నది. తెలుగు సాహిత్యంలో శ్రీనాథుని సప్తశతిని అధికరించిన తొలి ప్రస్తావనలు ఇవే.
నిజానికి మానవల్లివారు ఈ పద్యాన్ని ప్రకటించిన నాటినుంచే తెలుగు సాహిత్యాభిమానుల దృష్టి ఆరు శతాబ్దాల మునుపటి శ్రీనాథుని శాలివాహన సప్తశతి వైపుకు మళ్ళిందనటం అతిశయోక్తి కాదు. అయితే, ఇది వారు స్వయంగా శ్రీనాథుని కృతిని చూసి ఉదాహరించిన ప్రయోగం కాదని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో D. 705, M. 326 సంఖ్య గల ఛందోగ్రంథము అన్న వ్రాతప్రతి 43b పుటలో ఆ పద్యం ఉన్నదని; అది తప్ప శ్రీనాథుని శాలివాహన సప్తశతి అన్న వ్రాతప్రతి ఒకటి ఆ రోజులలో ఉపలభ్యమై లేదని – విమర్శకులు ఆనాడే గుర్తించారు. ఆ వ్రాతప్రతిలోని పాఠం ఇది:
వారణసేయ దావగొనవా? నవవారిజమందుఁ దేటి క్రొ
వ్వారుచు నుంట నీ వెరుగవా? ప్రియ! హా తెరగంటి గంటి కె
వ్వారికి గెంపు రాదె తగవా మగవారల దూర నీ విభుం
డారసి నీ నిజం బెరుగనంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారములో R. 1212 సంఖ్యతో పైని పేర్కొన్న గ్రంథానికే మరొక కాగితపు వ్రాతప్రతి బాలబోధచ్ఛందము అన్న పేరుతో ఉన్నది. అందులోనూ ఈ పద్యం ఇదే రూపంతో ఉన్నది. ఈ రెండూ ఒకటే అనుకొంటే, ఈ బాలబోధచ్ఛందము లేదా ఛందోగ్రంథము అన్న వ్రాతప్రతిలో తప్పించి ఈ పద్యం మరెక్కడా లేదని విశ్వసింపవచ్చును. ఈ బాలబోధచ్ఛందము మరీ ప్రాచీనమైన సంధానం కాదు. ఆ మాటకు వస్తే పద్దెనిమిదవ శతాబ్ది ప్రథమార్ధానికి లేదా పదిహేడవ శతాబ్ది ఉత్తరార్ధానికంటె పాతది కాదు. పోనీ ఆ ప్రతులలో అయినా ‘సప్తశతి నుండి’ అని ఉన్నదే కాని, ‘శ్రీనాథుని సప్తశతి నుండి’ అని లేదు. ‘శ్రీనాథుని సప్తశతి నుండి – ఆశ్వాసము ౪’ అని అసలే లేదు. అందువల్ల దీని కలరూపును గురించి నిశ్చయాత్మకంగా ఇదమిత్థమని ఏమీ చెప్పటానికి వీలులేకుండా ఉన్నది. అందువల్ల తథ్యమిథ్యావివేచన చేయవలసి వచ్చింది.
ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ హాల సంకలితమై, ఇప్పుడు అచ్చులో ఉన్న గాథాసప్తశతి ప్రతులలో లేదు. ఒక్క ఆంధ్రదేశపు గాథాసప్తశతి వ్రాతప్రతులలో మాత్రమే ఉన్నది. నేటికి సుమారొక సార్ధశతాబ్ది మునుపు 1881లో ప్రాకృత గాథాసప్తశతిని సప్రమాణంగా పరిష్కరించి, Ueber das Saptaçatakam des Hâla అన్న పేరిట జర్మన్ భాషానువాదంతో, సంస్కృతంలోని సర్వవ్యాఖ్యానాలలోని మేలైన ఉదాహరణలతో స్వీయవ్యాఖ్యానసమేతంగా లీప్‌జిగ్‌లో అచ్చు వేసిన ఆల్బ్రెష్ట్ వెబర్ తన మహాగ్రంథంలో Die erste Teli̅n̅ga Recension అన్న పేరిటి విభాగంలో 450వ పుటనుంచి 501వ పుట వరకు ఇచ్చిన ఆంధ్రదేశపు వ్రాతప్రతులలోని గాథలలో దీనిని 479వ పుటలో 886వ గాథగా ఉదాహరించాడు. అందువల్ల మూలగాథయొక్క ప్రామాణికతను సంశయించటానికి వీలులేదు. పెదకోమటి వేమారెడ్డి భావదీపికా వ్యాఖ్యతో రూపొందిన గాథాసప్తశతీసారంలో ఇది 7వది. ఆ పాఠమూ, దాని ఛాయ ఇవి:
కస్స వ ణ హోఇ రోసో దట్ఠూణ పిఆఏ సవ్వణం అహరం
స-భమర-పోమ్మగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏణిహం.
కస్య వా న భవతి రోషో దృష్ట్వా ప్రియాయాః సవ్రణ మధరం
సభ్రమరపద్మాఘ్రాయిణి వారితవామే సహస్వేదానీం. (ఛాయ)
దీనిని అధికరించిన పెదకోమటి వేమారెడ్డి వ్యాఖ్య అమోఘంగా ఉన్నది. వ్యాఖ్యానరచనలో ఆయన శైలిని గుర్తింపగలరని దానినిక్కడ ఉదాహరిస్తున్నాను: “పోమ్మం ఇత్యత్ర “పద్మే మి” ఇత్యత్రోక్తం. (త్వం) ఏణ్హిం ఇత్యత్ర “ఏణిం ఏత్తహే ఇదానీమః” ఇతి ఇదానీం శబ్దస్య ఏణ్హిం ఆదేశః. అత్ర కాచిద్దిగ్ధా స ఖ్యుపపతినా దష్టాధరాం సఖీం పతి రాలోక్య కిం వా ప్రతివ క్తీతి తస్మిన్ సమాగచ్ఛతి సతి తదాగమన మజానతీవ తాం ప్రతి, హే వారితవామాస్యే మద్వచనాఙ్గీకారిణి ప్రియాయాః సవ్రణ మధరం దృష్ట్వా కస్య రోషో న భవతి, ఈర్ష్యాభరరహితస్యాపి రోషో భవ తీ త్యర్థః. సభ్రమరపద్మాఘ్రాణం న కర్తవ్య మి త్యుక్తం. కిమర్థం కృతం. ఇదానీం న కేవలం వేదనామేవ, తద్దృష్ట్వా తేన యత్క్రియతే తదపి సహస్వేతి సఖీం భర్త్సయన్తీవ తస్యా అధరక్షతి ర్భ్రమరకృతా అకృతేఽతి తం ప్రతి శ్రావయతీ త్యభిప్రాయః. అత్ర స్వతస్సిద్ధార్థశక్తిమూలో వస్తునాన్యవిషయో వస్తుధ్వనిః.”
పిఆఏ = ప్రియురాలి, సవ్వణం అహరం = పెదవిపై కొరికిన గాటును చూసి, కస్స వ = ఎవరికి మాత్రం, రోసో = కోపం, ణ హోఇ = రాదు చెప్పు, వారిఅ వామే = వద్దు వద్దంటున్నా ఓ నెచ్చెలీ, స-భమర = తుమ్మెద వాలి ఉన్న, పొమ్మగ్ఘాఇణి (ప్రాకృతంలో సతిసప్తమి ప్రయోగం) = పద్మాన్ని వాసన చూశావు, ఇదానీం = దీన్ని (ఈ బాధను), సహస్వ = భరించు (భరింపక తప్పుతుందా) – అని భావం.
నాయిక ఉపపతి దగ్గరికి వెళ్ళి వచ్చింది. రత్యున్ముఖీకరణకాలంలో అతను పంటితో ఆమె క్రింది పెదవిపై గాటుపడేట్లు దంతక్షతాన్ని ముద్రించాడు. ‘మీ ఆయన చూసినప్పుడు దాని సంగతి ఏమని చెబుతావు?’ అని చెలికత్తె ఆమెను అడగబోతున్నది. అంతలో పతి ఇంటిలోనికి అడుగుపెట్టాడు. నాయిక అతనిని చూడలేదు. చెలికత్తె చూసింది. ఆమె గడుసైనది. ‘విదగ్ధ అయిన దూతి’ అని వేమభూపాలుడన్నాడు. అంటే నాయిక కోసం ఆమె ఉపపతితో దూతీకృత్యాన్ని కూడా నిర్వహించినదన్నమాట. ‘చెబితే విన్నావు కావు. వద్దు వద్దంటున్నా తుమ్మెద వాలి ఉన్న పద్మాన్ని వాసన చూశావు. ప్రియురాలి పెదవిపై కొరికినట్లున్న గాటును చూసి ఎవరికి మాత్రం కోపం రాదు?’ అన్నది. ఈర్ష్యాభరం లేనివారికి సైతం ఆ స్థితిలో భార్యను చూసినప్పుడు రోషం పొడుచుకొని వస్తుంది. సభ్రమరపద్మాఘ్రాణం వద్దంటే విన్నావు కాదు – అని చెలికత్తె అన్న మాటకు ఉభయాన్వయం. చెయ్యకూడని పని చేశావు. పెదవిని కొరికినప్పుడు నొప్పి, ఆ తర్వాత గాటువలని బాధ, అని నాయికను ఆట పట్టిస్తున్నది. అధరక్షతం భ్రమరకృతమే కాని, అన్యకృతం కాదని భర్తకు చెప్పినట్లయింది. పొంచివున్న ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రకరణోచితంగా ప్రసంగించింది. అనుకోని ఆ ప్రస్తావనకు కారణాన్ని నాయిక గుర్తింపకమానదు. సంభ్రమం నుంచి సర్దుకొని ఆమె భర్తతో ఏమి మాట్లాడాలో ఆలోచించుకొనేట్లు చేసింది.
ఇందులో అలంకృతోక్తికి ప్రాధాన్యమేమీ లేదు. నాయిక ఉపపతితో భోగించి రావటమూ, ఆ ఉపభోగచిహ్నితమై ఆమె అధరోష్ఠంపైని కలిగిన దంతక్షత శృంగారవిలాసాన్ని చెలికత్తె చూడటమూ, అదే సమయంలో నాయకుని ప్రత్యాగమనమూ మొదలైన ఘట్టితాంశాలతో సన్నివేశంలోని చమత్కారం స్వతస్సంభవిగా అమరింది. ఇందులోని శబ్దాలకు పర్యాయపదాలను కూర్చి కొత్తగా వాక్యాన్ని రచించినా, ఆ శబ్దార్థాలు బోధించే అర్థంలో మార్పు ఉండదు. ఆ ప్రకారం శబ్దపరివృత్తిని చేసినప్పటికీ ప్రతీయమానమైన ధ్వన్యర్థానికి ఎటువంటి భంగమూ కలుగలేదు కాబట్టి ఇది అర్థశక్తిమూలకమైన ధ్వని. ఆ విధంగా స్వతస్సిద్ధంగానే సంభవించిన అర్థశక్తిమూలకంగా భ్రమరకృతాధరక్షతరూపమైన కథావస్తువుచేత ఉపపత్యుపభోగరూపమైన వస్త్వంతరం ధ్వనిస్తున్నది కనుక ఇది స్వతస్సిద్ధ – అర్థశక్తిమూలకృత – వస్తుధ్వని అని పెదకోమటిభూపాలుడు వివరించాడు. గాథాలక్షణమైన వ్యంగ్యాన్ని సహృదయ హృదయాహ్లాదకరంగా ఆవిష్కరించి రసాలంకారాలను కావ్యార్థంలో అంతర్భవింపజేయగల వ్యాఖ్యాతలు ఆయన వంటివారు ఎంతోమంది ఉండరు.
రామకృష్ణకవిగారు ఈ పద్యాన్ని కుమారసంభవంలోని ‘దావగొను’ శబ్దార్థనిర్ణయానికై ప్రమాణీకరించినా, సూర్యారాయాది నిఘంటువులు దానిని పరుషాదియైన ‘తావగొను’ శబ్దంగానే పరిగణించాయి. నిజానికి తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం నుంచి ‘నావుడు … పార్థివముఖ్యుఁడు తల్లడంబునం దావగొనంగలేక తన తమ్ముల నప్పుడ’ అని రామకృష్ణకవిగారు ప్రమాణీకరించిన ప్రయోగం నిర్వచనోత్తరామాయణంలో ఆ విధంగా లేదు. అక్కడున్నది వారన్నట్లు దావగొను ప్రయోగం కాదు. అది తావుకొను ప్రయోగం. దానికి, చిత్తస్థైర్యంతో ఉండటం, కుదిరిక కలిగి ఉండటం, అని సూర్యారాయ నిఘంటువు అర్థం చెప్పింది. ప్రయోగాంతరాలను బట్టి దానికి 1. నెలకొను, వసించు 2. ఉండు, నిలిచియుండు అన్న అర్థాంతరాలు కూడా ఉన్నాయి. తిక్కనగారి ప్రయోగం ఇది:
నావుడు మూర్చవచ్చిన మనంబునకున్ ధృతి యూఁత యిచ్చి సం
భావన వారిఁ బోఁ బనిచి పార్థివముఖ్యుఁడు తల్లడంబునన్
దావుకొనంగలేక తన తమ్ముల నప్పుడ పిల్వఁ బంచి నా
నావిధచింత ముట్టికొనినన్ వెగ డందుచు నార్తమూర్తియై. నిర్వ. (8-109)
పైని ఉదాహరించిన సప్తశతి అనువాదంలో ‘దావగొనవా’ అన్న వ్యతిరేకార్థధాతువుకు కవిగారు ‘నిలుపోపక’ అని ఉద్దేశించిన ప్రకారం కాకుండా, గాథార్థాన్ని అనుసరించి ‘సభ్రమరపద్మాఘ్రాయిణి’ అన్నదానికి ‘తుమ్మెద వ్రాలి ఉన్న పుష్పపరిమళాన్ని ఆఘ్రాణించి’ అన్న సందర్భార్థాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. అప్పుడది ‘వారణసేయ దావగొనవా = ఎంత వారిస్తున్నప్పటికీ నిలుపోపక నీవు వెళ్ళనే వెళ్ళావు’ అని గాక, వారణసేయన్ = ఎంత వారిస్తున్నప్పటికీ, తావిన్ + కొనవా = తుమ్మెద వాలిన పువ్వు పరిమళాన్ని ఆస్వాదింపవు కదా (అంటే, ఆస్వాదించావు కదా! అని వ్యంగ్యం) అని తెలుగు అనువాదాన్ని సవరించుకోవలసి ఉంటుంది. తావిఁగొనవా? అన్న ప్రశ్నే లేకపోతే, మూలంలోని భావం తెలుగులోనికి వచ్చే అవకాశమే ఉండదు.
నాయిక వెళ్ళి పరిమళాన్ని ఆఘ్రాణించిన ‘పోమ్మ’ తెలుగులో ‘నవవారిజము’ అయింది. మూలంలో లేని విశేషార్థాన్ని కవి సరికొత్తగా ప్రవేశపెట్టటం ఎంతో ఔచితీభరితంగా ఉన్నది. అది అభినవంగా విచ్చుకొన్న తామర పువ్వు అన్నమాట. నాయిక పద్మినీ జాతి కాంత అని, పుష్పవతి అయిందని ధ్వని. ఆ నవవారిజమందు, తేఁటి = తుమ్మెద, క్రొవ్వారుచున్ = బలిసి ఉండి, అంటన్ = స్పృశింపగా, నీవు + ఎఱుఁగవా = నీవు తెలిసికొననే లేదా? అని సంప్రశ్నం. ఆ విధంగా తుమ్మెద వచ్చి స్పృశించినా, పెదవిపై కొరికి (కుట్టి) గాటుపెట్టినా నీకు తెలియలేదా? అంత తెలియని మైమరపులో ఉన్నావా? అన్నది కేవలం చెలికత్తెకు, నాయికకు నడుమ జరిగే సరససల్లాపం అయితే అంగీకార్యమే. ఉపపతి దంతక్షతాన్ని ముద్రిస్తున్నప్పుడు ఆ మాత్రం తెలియలేదా? అనటం రతివిదగ్ధలైన వారిద్దరికి నడుమ ప్రసక్తింపదగినదే. భర్త యెదుట మాత్రం అది అస్థానపతితమైన స్వారస్యం. ఆ మాటలను విని ఆయనకు లేని అనుమానం తలయెత్తినా ఆశ్చర్యం ఉండదు. అంతే కాదు. ‘క్రొవ్వారిన తేఁటి అంటన్ నీవెఱుఁగవా’ అన్నప్పుడు తేఁటి (ఉపపతి) యౌవనోన్మాదం వల్ల స్వయంగానే వచ్చి నాయికను తాకినట్లు, ఆ శృంగారవిలాసంలో నాయిక పాత్ర ఏమీ లేనట్లు ధ్వనిస్తున్నది. అది కొన్నాళ్ళుగా నాయికకు, ఉపపతికి నడుమ రాయబారాన్ని నడిపి, దూతీకృత్యాన్ని నెరవేర్చిన విదగ్ధ అనవలసిన మాట కాదు. అందువల్ల పాఠాన్ని ‘క్రొవ్వారుచున్ అంటన్ నీవు ఎఱుఁగవా’ అనిగాక, ‘క్రొవ్వారుచున్ ఉంటన్ నీవు ఎఱుఁగవా’ అని దిద్దుకోవాలి. తామరపువ్వు మీద తుమ్మెద ఉండటాన్ని నువ్వు చూసుకోలేదేమో! అన్నది ఇటు స్నేహితురాళ్ళ మధ్య సరసోక్తికీ, అటు ఇంటిలోకి అడుగుపెట్టిన నాయకునికీ ఉద్దేశింపబడుతుంది. ప్రియ! అని నాయికను సంబోధించిన తరువాత చెలికత్తె ఆమెను మళ్ళీ హా! తెఱగంటి! అని సంబోధించటం నిరర్థకమైన పునరుక్తి. తెఱగంటి అన్న సంబోధన తర్వాత ‘గంటికి’ (పెదవిపై ఏర్పడిన గాటుకు) అన్వయం లేదు. అందువల్ల ‘ప్రియ! వాతెఱ గంటిన్ కంటికెవ్వారికి కెంపు రాదె’ అని దిద్దుకోవాలి. వాతెఱ అంటే క్రిందిపెదవి. అధరోష్ఠం. హా తెఱ కాదు. ‘ఓ ప్రియసఖీ! నీ క్రింది పెదవిపై ఉన్న గంటిని (గాటును, దంతక్షతాన్ని) చూసి ఎటువంటివారికైనా కోపం రాదూ?’ అని చెలికత్తె వచనం. కనుక మగవారలన్ = (ఊరకే కోపం తెచ్చుకొంటారని) పురుషులను, దూఱన్ = నిందించుట, తగవా = న్యాయమేనా? అని మందలింపు. ఈ గంటిని చూసి ఒకవేళ మీ ఆయన కోపం తెచ్చుకొంటే, ఆయనతో గొడవ పడకు – అని హెచ్చరిక. నీ విభుండు = భర్త, ఆరసి = విషయమేమిటో నిన్నడిగి తెలిసికొని, నిజంబున్ = సత్యాన్ని, ఎఱుఁగునంతకున్ = గుర్తించేటంతవరకు, అంతకున్ = అప్పటిదాకా, ఓర్వుము = ఓపికపట్టు – అని అనునయం. పద్యం ఇలా ఉంటుంది:
వారణసేయఁ దావిగొనవా, నవవారిజమందుఁ దేఁటి క్రొ
వ్వారుచు నుంట నీ వెఱుఁగవా, ప్రియ! వాతెఱ గంటిఁ గంటి కె
వ్వారికిఁ గెంపు రాదె; తగవా, మగవారల దూఱ? నీ విభుం
డారసి నీ నిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!
నాయిక పెదవిపైని గాటును చూసి నాయకుని కంటికి కెంపు రాకుండా ఉంటుందా? అనటం అందమైన తెలుగు పలుకుబడి. కన్నులు కెంపెక్కటం ప్రేమాతిశయం వల్ల, క్రోధాతిశయం వల్ల కలుగవచ్చును. తిక్కనగారి ప్రయోగాన్ని చూడండి: ‘వేఁగుఁబోకట నంకురించు ముదంబునఁ గెంపుగదురుట నిద్రలేమి నని శంకింపక యింపునం గదియు విదగ్ధజనంబుల మనంబులం దిగుచు లలనాలోచనంబులు’ అని మహాభారతం విరాట పర్వం (2-240). పునారతిలౌల్యం వల్ల లలనాలోచనాలు కెంపువన్నెలో ఉన్నాయట. వాతెఱమీది ఆ క్షతాన్ని చూసి నాయకునికి రతికాంక్ష కలుగవచ్చునని వ్యంజింపజేస్తున్నది. కోపం వచ్చినపుడు కూడా కన్నులు కెంపెక్కుతాయి. ‘కర్ణుండు గోపించి కెంపారు కన్నుల నా శల్యు నాలోకించి’ అని కర్ణపర్వం (2-43). వాతెఱమీది ఆ క్షతాన్ని చూసి నాయకునికి కోపావేశం కలుగవచ్చును. నాయిక ఆయనపై ఆగ్రహింపవచ్చును. అందువల్ల, ‘తగవా, మగవారల దూఱ?’ అని ఆయనను ప్రసన్నుని చేయబూనింది.
గాథార్థం మనోజ్ఞంగా ఉన్నది. శబ్దార్థాలు ఉపసర్జనీకృతార్థాత్మలై ఉన్నప్పటికీ భావవ్యక్తిలోని వక్రోక్తిప్రౌఢిమ వల్ల వ్యంగ్యానికి ఉపస్కారకాలు కాగలిగాయి. రసనిష్పాదనం శృంగారాభిముఖంగా సాగింది. చెలికత్తె తెలివితేటల మూలాన నాయికానాయకుల పరస్పరదర్శనం కలహబీజం కాకుండా రతిపర్యవసితం కానున్నదన్న సూచన ఉన్నది. శబ్దార్థాల ఎంపికలో కవి ప్రతిభ కారణంగా రసభావం క్రమికవికాసాన్ని పొందింది. వ్యంజకసామగ్రి ధ్వన్యంగత్వానికి పరిపోషకం అయింది.
ఈ గాథ ఆంధ్రదేశంలోని గాథాసప్తశతి ప్రతులలో మాత్రమే ఉపలభ్యమై ఉంటున్నప్పటికీ అంతకు ముందే దేశమంతటా ప్రచారంలో ఉన్నట్లున్నది. ఒకరా? ఇద్దరా? దీనిని అపురూపమైన సౌందర్యద్రవ్యంగా స్వీకరింపని లాక్షణికులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎవరి దాకానో ఎందుకు? ముందుగా లాక్షణికసార్వభౌముడు ధ్వన్యాలోకకారుడే (పు. 76) అందుకొన్నాడు. ఆ తర్వాత భోజరాజు శృంగారప్రకాశంలో (పు. 250, 905లు) ఉదాహరించాడు. ఒకసారి కాదు, రెండుసార్లు వేర్వేరు సందర్భాలలో ఉదాహరించాడు. అంతటితో కాదని మళ్ళీ సరస్వతీ కంఠాభరణంలో (4-85) ఉదాహరించాడు. మూడు చోట్లలోనూ ఆయన దీనిని అపహ్నవాలంకృతికి లక్ష్యీకరించాడు. మహామహోపాధ్యాయుడు జగద్ధరుడు తన సరస్వతీ కంఠాభరణం టీకలో అనౌపమ్యముతోడి అపూర్వత ఇందులో ఉన్నదని ప్రతిపాదించి, వ్యాఖ్యానించాడు. పూర్వార్ధంలో దష్టాధరత్వాశంకకు సమాధానం, ఉత్తరార్ధంలో కార్యఫలోపన్యాసం విహితాలైనాయి. అన్యపురుషసంగమం చేత దాక్షిణ్యవతి అయిన నాయికకు సహిష్ణుతను బోధించే నెపంతో ఆరోపపూర్వకాపహ్నవం, శాబ్దత్వ విధేయత్వం ఈయనకు నచ్చాయి. శోభాకర మిశ్రుడు తన అలంకార రత్నాకరం (పు. 181) లో దీనిని ‘వ్యాజోక్తి’ అన్నాడు. తుమ్మెద వాలిన పువ్వును ఆఘ్రాణించటం అన్న అన్యహేతువును చెప్పి అధరవ్రణానికి కారణాన్ని ప్రచ్ఛన్నం చేయబడింది కాబట్టి ఇది వ్యాజోక్తి అని ఆయన దృష్టి. విశ్వనాథ కవిరాజు సాహిత్య దర్పణం (పు. 58) లో దీనిని మరొక విధంగా చూశాడు. నాయిక పరపురుషునితో సంగమించి వచ్చింది. భర్త ఆమె సందష్టాధరాన్ని చూసి కోపగించుకొన్నాడు. ఆమె సమాధానం చెప్పబోతున్నది. అప్పుడు చెలికత్తె ఆమెతో ప్రసంగించింది. శబ్దాశ్రయత్వం వల్ల ఆమె పలుకు భర్తకు ఒకవిధంగానూ, నాయికకు ఒకవిధంగానూ అన్వయించింది. కనుక శబ్ద తదేకదేశ తదర్థ వర్ణ సంఘటనాశ్రయత్వాల వల్ల ఆశ్రయభేదం ఏర్పడింది – అని ఆయన మతం.
నరేంద్రప్రభాసూరి అలంకార మహోదధిలో కొంత పాఠభేదంతో పరిశీలించాడు. ఈయన కూడా ధ్వనిసిద్ధాంతాన్ని అనుసరించినవాడే. సభ్రమరపద్మాఘ్రాణనిందతో సఖీప్రసంగరూపమైన వాచ్యార్థం భర్తృశంకానిరాసకమైన వ్యంగ్యంగా పరిణమించి రసవదర్థం ప్రకాశితమైనదని ఆయన మనోభావం. క్రీస్తుశకం 1135నాటి అంబాప్రసాద కవి రచించిన కల్పలతా లక్షణగ్రంథానికి వ్యాఖ్యానరూపమైన కల్పలతావివేకములో (పు. 110) ఉన్నదికూడా ధ్వన్యాలోకమతమే. హేమచంద్రుడు కావ్యానుశాసనంలో (పు. 57) వాచ్యముయొక్క విభిన్నత్వము మూలాన వ్యవస్థాపిత మవుతున్న వ్యంగ్యాన్ని వివరించాడు. సహస్వ ఇదానీం అన్నది వాచ్యం. అవినయవతీ విషయకమైనది వ్యంగ్యం. భర్తృవిషయానికి వస్తే ముగ్ధత్వం వల్ల నాయిక నిరపరాధ. ముఖ్యార్థానికి వ్యతిరిక్తంగా ప్రతీయమానమైన ధ్వని వ్యంగ్యార్థమని ఈయన ఆనందవర్ధనుని మతాన్ని విస్తరించాడు.
మమ్మటుని కావ్యప్రకాశానికి సంకేతమనే గొప్ప వ్యాఖ్యను వ్రాసిన మాణిక్యచంద్రుడు ‘వారింపబడినప్పటికీ అనంగీకారిణివై చేసినదానికి ఉపాలంభపరంపరను భరించు’ అని (పు. 244లో) తాత్పర్యాన్ని ప్రతిపాదించాడు. వాచ్యార్థం నాయికయందు ఒకవిధంగా అన్వయింపగా, వ్యంగ్యార్థం నాయకునియందు వేరొక విధంగా అన్వయించింది. ప్రియాయాః అన్న మాట సపత్నియొక్క మాత్సర్యానికి అన్వయిస్తుందని ఆయన కొత్త అర్థం చెప్పాడు. నాయికయందు వ్యంగ్యమూలాన సౌభాగ్యఖ్యాపన జరుగుతున్నదని ఆయన మతం. స్వరూప భేదం, కాల భేదం, ఆశ్రయ భేదం, కారణ భేదం, కార్య భేదం, సంఖ్యా భేదం, విషయ భేదం అన్న భేదకధర్మాల వల్ల వాచ్య-వ్యంగ్యాల మధ్య అభిధావ్యాపారం మారుతున్నదని ఆయన నిరూపించాడు.
మహిమభట్టు వ్యక్తివివేకం తృతీయ విమర్శలో (మూడవ అధ్యాయంలో) దీనిని వేరొక విధంగా వ్యాఖ్యానించాడు (పు. 410). నాయిక కాముకుని ఇంటినుంచి పరిక్షతాధరయై తిరిగివచ్చింది. నేర్పరి అయిన చెలికత్తె నాయిక భర్తయొక్క మనస్సులో పరపురుషభోగశంకాకళంకాన్ని నివర్తించటానికి, అది అన్యథాసిద్ధమైన అధరక్షతమని నిరూపించేందుకు ఉపాలంభనకు పూనుకొన్నది. తుమ్మెద కుట్టినందుకే కాదు; చేసిన పనికి అనుభవింపక తప్పుతుందా? అన్న నిందతో ‘సహస్వ ఇదానీం’ అన్నది. నాథుడు ఆగ్రహిస్తే సహించు – అని మహిమభట్టు వ్యాఖ్య. కోపంలో నాలుగు మాటలంటే పడక తప్పుతుందా? అని. వాచ్యార్థమూ, అనుమేయార్థమూ ఉన్నప్పుడు వాక్యార్థం అనుమేయార్థంలో విశ్రాంతిని పొందుతుంది. అంతేకాని ఇందులో ధ్వన్యర్థం ఏమీ లేదన్నమాట. కావ్యానుమితి సంప్రదాయం ఇది.
జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుగు అనువాదం ఈ అన్ని రీతులకు అభిహితాన్వయంతో పొందుపడుతున్నది. నాయికతో ఇష్టసఖి ‘నీ నిజం బెఱుఁగునంతకు ఓర్వుము’ అనటంలో శ్రీనాథునికి అభిమానపాత్రమైన భావానుసరణం ఉన్నది. ఆ నిజమేదో బయటపడేవరకు – అన్నది స్నేహితురాండ్ర మధ్య సరసం. నీ సత్యవర్తనను గ్రహించేంతవరకు క్షతబాధను, నాథుని ఆగ్రహాన్ని ఓర్చుకో అనటం బహుజనసమక్షంలో అనువర్తనీయతకు అమరి ఉండటం ప్రశంసనీయంగా ఉన్నది. రసోద్గారమైన భావయుక్తికి తోడు – కొనవా, నవవా, క్రొవ్వా, ఎఱుఁగవా, ప్రియవా, ఎవ్వారికి, తగవా, మగవారల; ఎఱుఁగునంతకు అంతకు – ఇత్యాదిస్థలాలలో శబ్దాలంకారశోభ మిన్నుముట్టింది. మహాకవి స్థాయికి తగిన ధారాశుద్ధితో, విశిష్టమైన పలుకుబడితో పద్యం అమోఘంగా ఉన్నది. తప్పక శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదే అని మనము విశ్వసింపవచ్చును. మహాకవి పద్యాన్ని తొలిసారిగా వెలుగులోనికి తెచ్చినందుకు శ్రీ రామకృష్ణకవిగారికి ఆంధ్రపాఠకలోకం శాశ్వతంగా ఋణపడి ఉండవలసినదే.
2. ప్రబంధరత్నాకరము లోని శాలివాహన సప్తశతి పద్యం
అంబరసీమఁ దారలు, జటాటవి మల్లెవిరుల్, భుజాంతరా
ళంబున హారసంతతు లిలాస్థలిఁ బువ్వుల వర్షముల్ ప్రసూ
నంబులు సత్కృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళిగం
గాంబుకణంబు లుట్టిపడ నాడెడు శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్.
తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన శివస్తోత్రం ఇది. పరమశివుని గుణకర్మప్రశంస రూపుదాల్చి ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షకు, గమ్యమానౌపమ్యంతో తుల్యయోగితకు స్వతఃప్రమాణమై హృద్యమైన ఈ పద్యాన్ని అధర్వణ భారతం విరాటపర్వం ప్రథమాశ్వాసం లోనిదిగా నేటికొక శతాబ్ది క్రితం ముమ్మొదటిసారిగా సుగృహీతనామధేయులు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వెలుగులోకి తెచ్చారు. 1909లో వల్లభరాయని క్రీడాభిరామం ప్రకటించినప్పుడు తత్పీఠికలో వారు దీనిని ఉదాహరిస్తూ – ‘మాకు దొరకిన [క్రీడాభిరామ] ప్రతిలో నాంది పద్యములు లేవు గావునఁ జదువువారల కొఱకు మొదటి [పైని పేర్కొన్న ‘అంబరసీమఁ దారలు’] పద్యమును అధర్వణుని భారత విరాట పర్వమున మొదటి యాశ్వాసమునుండి … గ్రహించి యిందుఁ బొందుపఱిచితిమి.’ అని ప్రస్తుతీకరించారు.
రామకృష్ణకవిగారు పేర్కొన్నట్లే వల్లభరాయని క్రీడాభిరామం కృత్యాదిని వీథీరూపకంలో ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశాదినిర్వహణపూర్వకంగా ఉండవలసిన నాందీపద్యం, తదనంతరీయ భగవత్ప్రార్థనారూపక సన్నుతిపద్యాలు లేవు. లేవు కాబట్టి రామకృష్ణకవిగారు ప్రథమపూజాకుసుమంగా ఒక శివస్తుతిపరకమైన రచనను వేరొక కావ్యం నుంచి స్వీకరించటంలోని ఔచిత్యానౌచిత్యాల మాటెలా ఉన్నా, ఆ విషయాన్ని తామే పేర్కొని ఉండటం వల్ల అందులో విమర్శనీయం ఉండకూడదు. అయితే అది అధర్వణుని భారతం, అందులోని విరాట పర్వం, దానిలో మొదటి ఆశ్వాసం లోనిదని నిర్దేశించి ఉండటం వల్ల తత్కర్తృత్వజిజ్ఞాసువులకు కుతూహలం కలగటం సహజమే.
ఇంతకీ అధర్వణుని భారతం ఈనాటికీ దొరకలేదు. రామకృష్ణకవిగారు అధర్వణుని ఆ భారత విరాటపర్వంలోని పద్యం తమకెక్కడ లభించినదీ చెప్పలేదు. అధర్వణ భారతం నుంచి లక్షణగ్రంథాలలోనూ, సంకలనగ్రంథాలలోనూ మనకిప్పటివరకు దొరికిన పద్యాలలో వారు ఉదాహరించిన పై పద్యం లేదు. అందువల్ల తథ్యమిథ్యావివేచన తప్పనిసరి అవుతున్నది.
అయితే, రామకృష్ణకవిగారు అధర్వణ భారతం లోనిదని ఉదాహరించిన పద్యం – వారప్పుడు చెప్పకపోయినా – తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిలో దామరాజు సోమయ రచించిన భరతము లోనిదిగా ఉదాహరింపబడి ఉన్నది. ప్రబంధరత్నాకరం అవతారికలోని ఈశ్వరస్తుతిపరకపద్యావళిలో 41వ పద్యంగా పెదపాటి జగన్నాథకవి దానిని నిమిత్తీకరించాడు. జగన్నాథకవి ప్రబంధరత్నాకరాన్నీ, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తులోని ‘ఉదాహరణ పద్యములు’ అన్న సంధానగ్రంథాన్నీ 1918లో ప్రబంధరత్నావళి అన్నపేరిట సంయుక్తంగా పరిష్కరించిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు జగన్నాథకవి నిర్దేశానుసారం దానిని ‘దామరాజు సోమయ్య భరతము’ లోనిదిగా పేర్కొని, తమ సంధానంలో 488వ పద్యంగా చేర్చుకొన్నారు. దామరాజు సోమయ్య భరతమునుంచి మొత్తం అయిదు పద్యాలు ఒక్క ప్రబంధరత్నాకరంలో మాత్రమే ఉదాహరింపబడి ఉన్నందువల్ల శ్రీ ప్రభాకరశాస్త్రిగారు ఆ అయిదు పద్యాలనే తమ ప్రబంధరత్నావళిలో చేర్చుకొన్నారు. భరతము అంటే భరత మహర్షి నాట్యశాస్త్రానికి అనువాదం అన్నమాట. కాకినాడలోని ఉదాహరణపద్యాల సంకలనంలో దామరాజు సోమయ్య రచించిన భరతములోనుంచి పద్యాలు లేనందువల్ల మనకిప్పటికి భరతములోనుంచి దొరికినవి ఆ అయిదు పద్యాలే అన్నమాట.
శ్రీ ప్రభాకరశాస్త్రిగారు 1909లో రామకృష్ణకవిగారు ఆ పద్యం అధర్వణ భారతం లోనిదని పేర్కొన్న వివాదాస్పద విషయాన్ని తమ ప్రబంధరత్నావళి పీఠికలో ప్రస్తావింపలేదు. గ్రంథాదిని సంకలనించిన అధర్వణాచార్యుల భారత పద్యసంచయంలో దానిని స్వీకరింపలేదు.
పై పద్యం, దామరాజు సోమయ్య భరతము లోనిదని గాక అధర్వణ భారతం లోనిదని పేర్కొన్నందువల్ల తంజావూరి గ్రంథాలయంలో అప్పటికింకా పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిని మానవల్లి రామకృష్ణకవిగారు చూచి ఉండరని అనలేము. 1894కు పూర్వమే వారు ఆ కృతిని సాకల్యంగా పరిశీలించారు. 1895 మే 19వ తేదీనాడు చెన్నపురి పురశవాకం హిందూ యూనియన్ భాషాభివర్ధినీ సమాజంలో వారు చదివిన ‘ఆంధ్రభాషను గూర్చిన యుపన్యాసము’లో అందుకు నిదర్శనాలు కనబడతాయి. 1908లో ప్రకటించిన నన్నెచోడుని కుమార సంభవం ప్రథమభాగం అనుబంధంలో వారు జగన్నాథకవిని పేర్కొనకపోయినా, ప్రబంధరత్నాకరంలో నుంచి లెక్కలేనన్ని పద్యాల ఉదాహరణల నిచ్చారు. అంతకు పూర్వం విమర్శకులెవరూ కనీ వినీ యెరుగని అపూర్వగ్రంథాలలోనుంచి కుమారసంభవం ప్రథమభాగం అనుబంధంలోనూ, 1914లో ప్రకటించిన ద్వితీయభాగం అనుబంధంలోనూ వారిచ్చిన పద్యోదాహరణలు జగన్నాథకవి ప్రబంధరత్నాకరంలో గాక మరెక్కడా లేవు. అందువల్ల పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిని మానవల్లి రామకృష్ణకవిగారు చూడలేదని అనలేము. అయితే, జగన్నాథకవి తన ప్రబంధరత్నాకరంలో భరతము కావ్యాన్ని దామరాజు సోమన కృతిగా పేర్కొన్న సంగతిని రామకృష్ణకవిగారు ప్రమాదవశాన గుర్తింపలేదా? అంటే, అదీ వారికి పరిచితమేనని 1923లో భారతిలో వారు ‘ఉపవేదములు-గ్రంథసూచిక’ అన్న వ్యాసంలో వ్రాసిన – ‘1350 (?) కాలమున దామిరాజు సోమన భారతీయమంతయుఁ దెనిఁగించినట్టు కానవచ్చుఁ గాని యది సంపూర్ణముగా లభింపదయ్యె.’అన్న వాక్యం వలన స్పష్టపడుతున్నది. ఐనా, అంబరసీమఁ దారలు … అన్న పద్యం జగన్నాథకవి పేర్కొన్నట్లు దామరాజు సోమయ్య భరతము లోనిదిగా ఉదాహరింపక, అధర్వణుని భారత విరాట పర్వమున మొదటి యాశ్వాసము లోనిదని వారు ఏ విధంగా నిశ్చయించారో క్రీడాభిరామం పీఠికలో కారణం తెలుపలేదు.
ప్రబంధరత్నాకరంలో పెదపాటి జగన్నాథకవి ఉదాహరించిన ఐదు పద్యాలు గాక, దామరాజు సోమన రచన భరతము అంటూ కావ్యమేదీ మనకింతవరకు లభింపలేదు. అధర్వణ భారతం నుంచి లభిస్తున్న ఉదాహృతులలో పై పద్యం లేదు. అందువల్ల స్థితగతిచింతనగా ప్రాకరనిర్దేశం ఆవశ్యక మవుతున్నది.
పద్యస్థితిస్థాపన విషయం
సోమన కృతి ‘భరతము’ భరత నాట్యశాస్త్రానువాదం కాబట్టి కావ్యారంభంలో నాట్యాధిష్ఠానదైవతమైన శంభుదైవతస్తుతి భావ్యమే కాని, పైని పేర్కొన్న అంబరసీమఁ దారలు … పద్యాంతంలోని ‘శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్’ అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం లోనిదన్న నిర్ణయానికి ప్రతిబంధకంగా ఉన్నది. సోమన కృతి నాట్యశాస్త్రలక్షణకావ్యమే కాని నాట్యప్రబంధం కాదు. ఈ విమర్శ అధర్వణుని భారతానికీ వర్తిస్తుంది. అధర్వణుని భారతం కావ్యసామాన్యమే కాని నాట్యనిబంధం కాదు. ఆశీరర్థకమైన మంగళం ఆశీరర్థంలో లూణ్మధ్యమంలో అక్కడా విధాయకం కాదు. అదీగాక జైనుడని చెప్పబడుతున్న అధర్వణుడు శంభుస్తుతి కావించి ఉంటాడా? అన్న సంశయం కలుగుతుంది. భారత విరాటపర్వం మొదటి ఆశ్వాసంలో శంభుస్తుతికి తావలమైన ఘట్టమేదీ లేదు. వక్తవ్యమైన కథాసూచనం లేనందువల్ల ఇది ఆశ్వాసాదిపద్యమైనట్లు తోపదు. ఆస్వాశాంతపద్యాల లోనిదైతే జైనుడైన అధర్వణుడు తన భారతాన్ని పరమేశ్వరాంకితం చేసినట్లు భావింపవలసివస్తుంది. ఒకవేళ అన్యపర్వాల కథాభాగంలో ఉండిన పద్యాన్ని రామకృష్ణకవిగారు విరాట పర్వం మొదటి ఆశ్వాసంలోనిదిగా పొరబడ్డారని ఊహించటానికీ ఆధారాలు లేవు. రామకృష్ణకవిగారి వద్ద మనకిప్పుడు లభ్యం కాని అధర్వణ భారతం ఒకటుండినదని విశ్వసించటానికీ ఆధారాలు లేవు. అధర్వణ భారతం నుంచి లక్షణగ్రంథాలలోనూ, సంకలనగ్రంథాలలోనూ లభించిన పద్యాలలో పై పద్యం లేదు. ఈ పద్యానికి తర్వాత సోమన కృతిలోనుంచి పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరంలో 83వ పద్యంగా ఉదాహరించిన వినాయక ప్రార్థన యుష్మదర్థకంలో లేదు. కావ్యావతరణికకు తగినట్లు కవిప్రార్థితోపపన్నంగా ఆత్మార్థకంలో సలక్షణంగానే ఉన్నది. ఆ పద్యపాఠం ఇది:
నందిమృదంగరావము ఘనస్తనితం బని మ్రోల నున్న యా
స్కందుని వాహనం బగు శిఖండి యఖండితనృత్య మాడ భీ
తిం దన హస్తరంధ్రముగతిం జొరు నాభరణాహిరాజి వో
వం దలయూచు విఘ్నపతి భాసురఫూత్కృతి మమ్ముఁ బ్రోచుతన్.
అని. ఇందులో … విఘ్నపతి భాసురఫూత్కృతి మమ్ముఁ బ్రోచుతన్, అని ఉన్నట్లే పై పద్యాన్ని కూడా, ఆడెడు శంభుఁడు మమ్ముఁ బ్రోవుతన్, అని సవరించి చదువుకోవచ్చును గాని, ఆ పరిష్కరణం సమంజస మనిపించలేదు. అందువల్ల ప్రాకరాదికనిర్దిదిక్ష కలిగింది.
పద్యార్థవిశదిమ
ఈ విధంగా – వివాదపరిష్కారానికి గ్రంథాంతరసంవాదం లేనందున – అర్థవల్లిని బట్టి పద్యస్థితిస్థాపన సాధ్యమేమో పరీక్షింపవలసి ఉన్నది. ఆడెడు శంభుఁడు అన్న రూపణ వల్ల శివతాండవమూ, సత్కృతాంజలి అన్నందువల్ల రెండు సర్పశీర్షాలనూ అధోముఖంగా చిటికెనవ్రేళ్ళతో జోడించిన పుష్పపుటహస్తమూ చిత్రితాలన్న విషయం స్పష్టమే. ‘సర్పశీర్షో మిళద్బాహ్యపార్శ్వః పుష్పపుటో భవేత్, ధాన్యపుష్పఫలాదీనా మపాం చ గ్రహణేఽర్పణే, కార్యః పుష్పాఞ్జలౌ’ అని శార్ఙ్గదేవుడు సంగీతరత్నాకరంలో నిర్వచించాడు. ఆ ‘సత్కృతాంజలి’ పుష్పాంజలి సమర్పణవేళ అయితే, సర్పశిరోహస్తాల సంశ్లేష వర్ణిత మన్నమాట. ‘వ్యక్తం సంశ్లిష్టకరభావుత్తానౌ సర్పశీర్షకౌ, హస్తః పుష్పపుటో నామ పుష్పాఞ్జలివిసర్జనే, ధాన్యపుష్పాఫలాదీనాం గ్రహణే దేవతార్పణే, అర్ఘ్యదానే గురునృపప్రసాదగ్రహణే తథా, పాణిపాత్రాశనే తోయానయనే చ ప్రకీర్తితాః’ అని విప్రదాసుని సంగీతచంద్రం. సర్పశీర్షంతోపాటు నాట్యశాస్త్రానుసారం పుష్పాంజలి హస్తం కూడా సత్కృతాంజలి వేళ ప్రయోక్తవ్యమే. ‘ప్రణతోన్ముఖకోదండసమానముకులాకృతిః, శ్లిష్టాఙ్గులికరద్వంద్వం పుష్పాఞ్జలి రితి స్మృతమ్’ అని గొప్ప నాట్యశాస్త్ర లక్షణగ్రంథం ఔమాపత్యంలో ఉమాపతి నిర్వచనం. ఆడెడు శంభుఁడు అన్న రూపాన్వితకరణమూ నాట్యార్థంలో కవిప్రయోగరూఢమే. ఆడు = నర్తించు అని ధాత్వర్థం. ‘ఆడెం దాండవ మార్భటీపటహలీలాటోపవిస్ఫూర్జిత, క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు’ అని భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు. ‘స్కందుని వాహనం బగు శిఖండి యఖండితనృత్య మాడ’ అని దామరాజు సోమయ్య భరతము లోనిదే, ఇందాక చూపిన ప్రయోగం.
పద్యప్రతిపాదితార్థం ఏమిటి? అంబరసీమన్ తారలు, జటాటవిన్ మల్లెవిరుల్, భుజాంతరాళంబునన్ హారసంతతులు, ఇలాస్థలిన్ పువ్వుల వర్షముల్, ప్రసూనంబులు సత్కృతాంజలిని అనం దగి, మౌక్తికతుల్యమౌళిగంగాంబుకణంబులు ఉట్టిపడన్ ఆడెడు శంభుఁడు మిమ్మున్ ప్రోవుతన్ – అని.
ఆకాశంలోని తారకలు, జటాజూటంలోని మల్లెపువ్వులు, వక్షఃస్థలాన అలంకరించుకొన్న విరిదండలు, కైలాస రంగభూమిపై దేవతలు కురిపిస్తున్న పూలవానలు పరమశివుని కరాంజలిపుటంలోని అర్ఘ్యతోయంలో ప్రతిబింబించి పూజార్థం సమర్పింపబడుతున్న పుష్పములో అన్నట్లుగా తోచాయి. అంతవరకు ఉత్ప్రేక్ష సలక్షణంగా ఉన్నది. అయితే, ‘మౌక్తిక – తుల్య – గంగా – అంబుకణంబులు ఉట్టిపడ’గా శంభుడు ఆడుటకు సాంగతికమైన స్పష్టార్థప్రతీతి లేదు. జలకణాలకు మౌక్తికోపమానం కవిప్రయోగసిద్ధమే కానీ ప్రాకరణికార్థంలో గంగాంబుకణాలకు మౌక్తికాలతో ‘తుల్య’త్వాన్ని ఎందుకు చెప్పాడో ఆ ప్రయోజనం సువ్యక్తం కాలేదు. ఇందుకు ప్రత్యుదాహరణగా:
సతులు చల్లుఁబోరాడుచో జలకణములు,
నెఱికురులమీఁద నిండి క్రిక్కిఱిసి చెలువ,
మమరెఁ గనుఁగొన నింద్రనీలముల తోడఁ,
గలయఁ గ్రుచ్చిన మౌక్తికంబులును బోలె
అన్న చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనంలోని పద్యం పరిశీలనీయం. జలకణాలు నాయిక కబరీభరంలోని ముత్యాలగమి వలె భాసిల్లటాన్ని అక్కడ కవి శోభావహంగా చిత్రీకరించాడు. ఒత్తైన శిరోజాల నీలిమ వల్ల కేశపాశాన్ని అంటుకొని పైనిండిన నీటితుంపరలు ఇంద్రనీలమణుల లాగానూ, క్రొత్తగా చల్లిన జలకణాలు ఆ నల్లని మణులతో కలిసి మెరుస్తున్న ముత్యాల జల్లు లాగానూ చిత్రవర్ణకిర్మీరితమై ఉండటం నిరూపితమై చిమ్మపూడి అమరేశ్వరుని పూర్ణోపమ కళాపూర్ణోదయంగా అమరింది. పై పద్యంలో పుష్పపుటాంజలి హస్తంలో పరమశివుని శిరోలంకృతమైన గంగాజలకణగణం ఉట్టిపడినందుకు, అది మౌక్తికతుల్యమైనందుకు సార్థకత సువిశదంగా లేదు.
అందుకు కారణం ఏమిటో ఈ పద్యానికి మూలమైన గాథను చూస్తేనే కాని బోధపడదు. అది పెదకోమటి వేమభూపాలుడు సంకలనించిన ప్రాకృత సప్తశతీసారం లో ఉన్నది. ఆ గాథ ఇది:
పసువఇణో రోసారుణపడిమాసంకంతగోరిముహఅందం
గహిఅగ్ఘపంకఅం విఅ సంఝాసలిలాంజలిం ణమహ.
ఇది పెదకోమటి వేమభూపాలుని ప్రాకృత సప్తశతీసారం సంకలనంలోని మొట్టమొదటి గాథ. దీనిపై ఆయన వ్యాఖ్యను ఉదాహరిస్తున్నాను: “అథ శాలివాహననరేన్ద్రో నిర్విఘ్నగ్రన్థసమాప్త్యర్థ మిష్టదేవతానమస్కార మాదౌ నిబధ్నాతి. పసువఇణో – “పశుపతే రోషారుణప్రతిమాసఙ్క్రాన్తగౌరీముఖచంద్రమ్, గృహీతార్ఘ్యపఙ్కజ మివ సంధ్యాసలిలాఞ్జలిం నమత.” గోరిముహఅందం – ఇత్యత్ర “గభీరగ ఇత్” ఇతి ఇత్వమ్. పశుపతేః సంధ్యాసలిలాఞ్జలిం నమత. కథమివ స్థితమ్. రోషారుణప్రతిమాసఙ్క్రాన్తగౌరీముఖచంద్రం సద్గృహీతార్ఘ్యపఙ్కజ మివ స్థితమ్. అత్ర గౌర్యా రోషస్య కారణం సన్ధ్యావనితావన్దనమ్. యతః స్త్రీణామ్ అన్యాసఙ్గమవశా దీర్ష్యమానో భవతి. అర్ఘ్యాఞ్జలౌ పుష్పం వా ఫలం వా నిక్షేప్తవ్యమ్. అత్రోత్ప్రేక్షాలఙ్కారః. “అన్యథావస్థితా వృత్తి శ్చేతనస్యేతరస్య వా, అన్యథోత్ప్రేక్ష్యతే యత్ర తా ముత్ప్రేక్షాం విదు ర్బుధాః.”
శాలివాహనకృతమైన ఈ గాథ తాత్పర్యార్థం ఇది: పరమశివుడు కర్మరతుడై సంధ్యావందనానికి ఉపక్రమించాడు. సంధ్యాదేవి (పితృదేవతలకు తల్లి అయిన) బ్రహ్మపత్ని కదా! భర్తకు పరకాంత యందు సంగమాభిలాష కలిగిందని పార్వతీదేవికి అసూయ పైకొని, రోషావేశం వల్ల చంద్రబింబాన్ని పోలిన ఆమె ముఖం ఎఱ్ఱబారింది. పరమశివుడు అర్ఘ్యప్రదానానికై దోయిలించినపుడు ఆ నీటిలో ఆమె ఎఱ్ఱని ముఖం ప్రతిబింబించి, అది ఆయన కరకమలగృహీతమైన పువ్వువలె భాసించింది. దేవతాపూజకు ఉపక్రమించినవారు అర్ఘ్యతోయంలో పుష్పమో ఫలమో నిక్షేపించటం ఆచారం. ఆ విధంగా మనోజ్ఞపుష్పభరితమై తోచిన పశుపతి యొక్క జలాంజలికి ప్రణమిల్లుతారు గాక! అని.
వేమభూపాలుడు జగద్విఖ్యాత వ్యాఖ్యాత. గాథాలక్షణమైన వస్తుధ్వనిని ఆయన వలె గుండెలకు హత్తుకొనిపోయేట్లు విప్పిచెప్పగలవారు సాహిత్యరసికులలో ఏ కొద్దిమందో ఉంటారు. ఇందులోని ఉత్ప్రేక్షను వేమభూపాలుడు ప్రకాశ్యార్థప్రకాశనగా అద్భుతావహంగా నిర్వచించాడు. పార్వతీదేవి రోషానికి కారణం పరమేశ్వరుని సంధ్యావనితావందనమన్న భావాన్ని చక్కగా వివరించాడు. శీలార్జవం కలిగిన నాయికకు నాయకుని అన్యాసంగమం పట్ల అసహిష్ణుతను ప్రణయినీసహజమైన మనోధర్మంగా నిరూపించాడు. మల్లెమొగ్గ వంటి గాథాహృదయం ఆయన వ్యాఖ్యానం మూలాన ప్రఫుల్లంగా వికసించి అర్థవత్త నెత్తావులను దిగంతాలకు విరజిమ్మింది.
వేమభూపాలుని కంటె మునుపు వ్యాఖ్యాతృశిరోమణి భువనపాలుడు తన గాహాకోస టీకలో రసాద్యర్థాన్ని మరికొంత వ్యాఖ్యానించి, సద్వస్తువునందు అసద్వస్తువు ఆరోపితమైనందున వస్త్వంతరోపపత్తి మూలాన వస్తూపక్షేపరూపంగా ఈర్ష్యా విప్రలంభశృంగారం ప్రతీయమానమని ఇందులోని భావధ్వనిని విశదీకరించాడు. ఇది హాల సాతవాహనకృతమని, సాక్షాత్తు మహేశ్వరునిచే సమర్పితమైన సంధ్యాసలిలాంజలి వర్ణితమైనందున సకలవిఘ్నప్రతిబంధసిద్ధిదాయకమని గాథయొక్క నాందీముఖత్వాన్ని సమర్థించాడు.
హాలుని సప్తశతకం కావ్యాన్ని 1881లో సర్వపాఠాంతర సమాకలనపూర్వకంగా పరిష్కరించి జర్మన్ భాషానువాద విపులవ్యాఖ్యాసమేతంగా అచ్చువేసిన పండితుడు ఆల్బ్రెష్ట్ వెబర్ ఈ గాథలోని భాషావైభవాన్ని ప్రాకృత వ్యాకరణాధారితంగా చర్చించి, దీనిని కాళిదాస కుమారసంభవం ప్రథమసర్గలోని ‘చన్ద్రం గతా పద్మగుణా న్న భుఙ్క్తే’, ‘పుష్పం ప్రవాలోపహితం స్యా, న్ముక్తాఫలం వా స్ఫుటవిద్రుమస్థం (1 – 43, 44) అన్న రెండు శ్లోకాల కల్పనలతో పోల్చిచూడమని సూచించాడు. ఆ తులనీయశ్లోకానుశీలనం గాథాహృదయావిష్కరణకు నిస్తులదోహదకారిగా ఉండటం విశేషం. వెబర్ వ్యాఖ్య ఆ మహావిద్వాంసుడు కావించిన అపూర్వమైన మహాకృషికి, అసామాన్యమైన ఆయన వైదుష్యసంపదకు, శాస్త్రీయమైన పాశ్చాత్యపరిశోధన తీరుతెన్నులకు నిదర్శకమై పరిష్కర్తలకు పథప్రదర్శకంగా విరాజిల్లుతున్నది. ఆ విద్వత్సార్వభౌముడు పైని పేర్కొన్న గాథకు సమాంతరంగా గంగాధర టీక తోడి పాఠంలో 697-వదిగా ఉన్న ‘సంఝాగహిఅజలాంజలిపడిమాసంకంతగోరిముహకమలం, అలిఅం చిఅ ఫురిఓట్ఠం విఅలిఅమంతం హరం ణమహ’ అన్న మరొక గాథను – ‘అథ సమాప్తౌ హరనమస్కారరూపం మఙ్గలం ఆచరతి. హరస్యాపి గౌరీముఖకమలప్రతిబింబం దృష్ట్వా సన్ధ్యారూపనిత్యకర్మాఙ్గమన్త్రలోపో భవతి. కిం పున రస్మదాదే ర్లోకస్య ప్రియాసాంనిధ్యే వ్యాకులచిత్తతేతి సర్వథా స్త్రీసఙ్గ్రహః పరిహరణీయా ఇతి’ అన్న గంగాధర వ్యాఖ్యతోపాటు తులనాత్మకంగా పరికించి నిగ్గుతేల్చమని వెబర్ పండితుడు నిర్దేశించాడు.
ఈ నైపథ్యానుసంజనతో పరిశీలించినప్పుడు ఉపర్యుదాహృతపద్యార్థం మరింత స్ఫుటగోచరం అవుతున్నది. అంబరసీమలోని తారలు, ఈశ్వరుని జటాటవిలోని మల్లెపువ్వులు, ఆయన వక్షఃస్థలాన్ని అలంకరించిన విరిదండలు, కైలాస రంగభూమిపై దేవతలు కురిపిస్తున్న పూలవానలు కరాంజలిపుటంలోని అర్ఘ్యతోయంలో ప్రతిబింబించి పూజాసమర్ప్యమాణపుష్పములో అన్నట్లుగా తోచాయి. వేణీబంధమందు విరాజిల్లుతున్న గంగాంబుకణాలు ముక్తాఫలముల వలె జీవకళ ఉట్టిపడుతుండగా ఆ అంజలిబంధంలో ప్రతిబింబించి, పుష్పములతోపాటుంచిన ఫలములో అన్నట్లుగా ప్రకాశించా యన్నమాట. ఆ విధంగా నర్తిస్తున్న పరమేశ్వరుడు మిమ్ము కాపాడును గాక! అని ఆశీస్సు.
శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదని ఊహనీయం
ఈ విధంగా అర్థవల్లిని బట్టి కల్పన సాగిన తీరుసౌరులను పాఠకులు గాథాసప్తశతి ప్రాకృతమూలాన్ని, వేమభూపాలుని భావదీపికా వ్యాఖ్యను దగ్గరుంచుకొని అనుశీలించితేనే గాని బోధపడదు. అందువల్ల ఈ పద్యం క్రీ.శ. 13-వ శతాబ్ది నాటి అధర్వణునిదీ, క్రీ.శ. 1350(±?) నాటి దామరాజు సోమనదీ గాక వేమభూపాలుని ఆస్థానిలో శ్రీనాథుడు కేవలం తద్వ్యాఖ్యాధారితంగా క్రీ.శ. 1375 – 1380 ప్రాంతాల పదహారేళ్ళ నూనూగు మీసాల నూత్నయౌవనంలో నుడివిన శాలివాహన సప్తశతి లోనిది కావచ్చునని ఈ ప్రస్తావిక మూలకంగా ప్రతిపాదింపబడుతున్నది.
పద్యం పరమేశ్వరుని దక్షిణనాయకత్వానికి నిదర్శకంగా ఉన్నది. మూలంలో పార్వతీదేవి యందు చిత్రితమైన ఈర్ష్యామానం అనువాదంలో పరిహరింపబడింది. సదాశివుడు నాట్యకోవిదుడైన ధీరలలితుడు. స్థావరజంగమాత్మకమైన జగత్తు సర్వం ఆయన నాట్యసంగ్రహానికి అంగోపాంగప్రత్యంగసహితమై ఉన్నది. అంబరసీమలో ఉన్మేషించిన తారాదులు ఆహార్యమై అమరాయి. ఆ మహాదేవుడు పుష్పాంజలిహస్తుడై సంధ్యాదేవికి ప్రణమిల్లుతున్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి భర్తృశిరోలంకృతయై ఉన్న గంగను చూడటం సహజం. ప్రణమిల్లుతున్నది సంధ్యాదేవికి; ఆయన శిరసుపై ఉన్నది గంగాదేవి. ఆమె మనస్సులో అన్యకాంతాసంగమరూపమైన శంకాలేశం ఉదయింపక మునుపే ఆయన పుష్పాంజలిహస్తపుటాన్ని శీర్షదేశాన నిలిపాడు. అది దేవతావందనరూపమైన కరణం. “సత్కృతాంజలి” అని కవి వాక్యం. దానితో పార్వతీదేవి సందేహం తొలగిపోక తప్పదు. అప్పుడు మౌక్తిక-తుల్య-గంగాంబుకణాలు ముక్తాఫలముల వంటివై అర్ఘ్యతోయంలో ఉట్టిపడ్డాయి. అది గంగాదేవికి గర్వకారణం. ఆ ప్రణామం పార్వతికి సపత్నీజయసంకేతం.
మౌక్తికములంటే ముక్తాఫలములని అర్థం చెప్పటం వల్ల పద్యంలో అంజలిపుటంలోని ఫలములన్న నిరూపణ సాధ్యమయింది. ఆ అభిప్రాయం ఉన్నదువల్లనే కవి మౌక్తిక-తుల్య-గంగాంబుకణములు అని తుల్యయోగితను పరికరింపజేశాడు. ఇది కవిసమయనిరూఢమైన అర్థమే. ఇప్పుడంటే ముత్తెపు చిప్పలోనుంచి వెలువడుతున్నాయి కానీ ఒకప్పుడు ముత్యాలు తీగెలకే అంకురించి, ఆపై పండ్లయేవట.
గతః స కాలో యత్రాసీ న్ముక్తానాం జన్మ వల్లీషు వర్తతే సామ్ప్రతం తాసాం హేతవః శుక్తిసంపుటాః – ఇత్యాదిదర్శనాత్ వల్లీజ మ ప్యస్తి మౌక్తికమ్.
అని వోపదేవుని భాగవతసార ముక్తాఫలం పైని కైవల్యదీపికా వ్యాఖ్యను రచించిన మహనీయుడు హేమాద్రి పండితుడు ఆ అతీతకథానకాన్ని స్మరించాడు. కాదంటే, ముత్యపు చిప్ప పగిలినప్పుడు తత్ఫలమై వెలికి వచ్చేది కాబట్టి ముక్తాఫలమని చెప్పవచ్చునని కూడా ఆయనన్నాడు.
ఈశ్వరునికి ఆహార్యమైన తారకల కాంతిసముల్లాసం ఆయన అనుగ్రహానికి సూచకం. వేణీబంధంలోని మల్లెపువ్వులు, వక్షఃస్థలాలంకృత హారసంతతులు, మౌళిని ధరించిన గంగ భక్తుల అభీష్టసిద్ధిసమృద్ధికి సంకేతాలు. శివతాండవం లోకమంగళదాయకం. వేమభూపాలుడు చెప్పినట్లు ఇందులో పూజానిర్వహణకు ఆవశ్యకాలైన ఫలం, పుష్పం, తోయం ఉన్నాయి. మూలంలోని ఉత్ప్రేక్షాలంకారం గంగాంబుకణ ముక్తాఫలాల గమ్యమానౌపమ్యం వల్ల ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షానుప్రాణిత తుల్యయోగితగా తెలుగులో మరింత అందగించింది.
శ్రీనాథుని పద్యంలో చిత్రితమైనది తలపుష్పపుట హస్తం కాదు; సాంప్రదాయిక పుష్పాంజలి హస్తమే. దేవతావందన వేళ ప్రయుక్తం కనుక భుజాంతర వామపార్శ్వాన గాక శివుడు అంజలిబంధాన్ని శీర్షదేశాన నిలిపాడు. అందువల్ల మౌక్తికతుల్య గంగాంబుకణాల బింబసంపాతమూ, పార్వతీ రోషపరిహారమూ ఏకకాలంలో సంభవించినట్లు ప్రతీయమానం. ఈ ప్రయోగం పట్ల ఆసక్తి గలవారు కుంభరాణా నరేంద్రుని సంగీతరాజం లోని చతుర్థఖండమైన నృత్యరత్నకోశం పరీక్షణాధ్యాయంలో 43 నుండి 50 వరకు గల శ్లోకాలను పరిశీలింపవచ్చును. వేమభూపాలుని పాఠంలోని హాలుని ‘పసువఇణో రోసారుణపడిమాసంకంతగోరిముహఅందం’ ఇత్యాది గాథకు; హాలునిదే, తత్సమానమైన గంగాధర టీకతోడి ‘సంఝాగహిఅజలాంజలిపడిమాసంకంతగోరిముహకమలం’ అన్న మరొక గాథకు శాలివాహన గాథాసప్తశతి 1932 ముద్రణ నుంచి శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి అనురణనాలివి:
అలుకమెయిఁ జేవురించిన యాదిశక్తి
మోముఁజందురు నీడలోఁ బొలిచియుండఁ
బూజతామరఁ దాల్చిన పోల్కిఁ బొలుచు
హరుని సంధ్యాజలాంజలి కెరగుఁ డీరు. (పద్యము. ౧)
సంధ్యవార్పఁగ దోసిట జలమువట్టి
నపుడు గౌరీముఖాంబుజ మందుఁ దోఁప,
మంత్ర మంతయు నొకమాఱ మఱచి, వట్టి
మోవిని గదల్చు శివునకు మ్రొక్కు లిడుఁడు! (పద్యము. ౩౯౫)
నమిసాధువు టిప్పణంతో కూడిన రుద్రటుని కావ్యాలంకారసంగ్రహం (1-40)లో ఈ క్రింది గాథ ఉన్నది:
సేల(అ?)సుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధముద్ధససిలేహం
సీసపరిట్ఠిఅగంగం సంఝాపణఅం పమహణాహం.
ఇదే భోజుని శృంగారప్రకాశంలో:
సేలసుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధముద్ధససిలేహం
సీసపడిచ్ఛిఅగంగం సంఝాపణఅం పమహణాహం.
అన్న పాఠభేదంతో ఒకసారి, ఆయనే రచించిన సరస్వతీకంఠాభరణం (1-40)లో
సేలఅసుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధభుగ్గససిలేహం
సీసపరిట్ఠిఅగంగం సంఝాపణఅం పమహణాహం.
అని మఱొకసారి; సంస్కృతాలంకారికగ్రంథం కల్పలతావివేకంలో
సేలసుఆరుద్ధద్ధం ముద్ధాణబద్ధముద్ధససిలేహం
సీసపడిచ్ఛిఅగంగం సంఝాపణఅం పమహణాహం.
అన్న భోజుని శృంగారప్రకాశ పాఠంతోనూ ఉదాహృతమై ఉన్నది. ఇది హాలుని గాథాసప్తశతిలో లేదు. అందువల్ల గాథాసప్తశతికి పూర్వకాలపుదో, ఉత్తరకాలరచితమో చెప్పలేము. పరమశివుని సంధ్యాప్రణామవస్తువు ఆ కాలంలో చాలామంది కవులను ఆకర్షించినదని మాత్రం దీనిని బట్టి ఊహించటానికి వీలవుతున్నది. ఆసక్తి కలవారు భట్టుమూర్తి కావ్యాలంకారసంగ్రహంలోనూ, రామరాజభూషణుని వసుచరిత్రలోనూ పై ఉభయకల్పనలను ఆధారం చేసికొని వెలువడిన ఈ ఛాయలను పోల్చి చూడవచ్చును. శ్రీనాథుని అనువాదంలో వ్యంగ్యమై వెలసిన భావం ఈ పద్యాలలో విశదమై విలసిల్లింది.
గంగం దాల్చితి వుత్తమాంగమున నం గైకోలు గావించి త
ర్ధాంగీకార మనం, బురంధ్రి! నిను వామాంగంబునం దాల్పనే
శృంగారోన్నతిఁ జూడు మంచు గిరిజన్ శీర్షాపగాబింబిత
స్వాంగానందితఁ జేయు శంభుఁడు గృతిస్వామిం గృపం బ్రోచుతన్. (కావ్యా. 1-5)
ఆ మందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి తౌ
నౌ మేల్మేలని యార్య యల్గఁ బ్రణతుండై తత్పదాంభోజయో
గామర్షంబున గంగయు న్మొఱయఁ జూడాభోగసమ్యక్క్రియా
సామర్థ్యంబున వేఁడు శంభుఁడు గృతిస్వామిం గృపం బ్రోచుతన్. (వసు. 1-5)
పద్యశైలిని బట్టి చూసినా ‘అంబరసీమఁ దారలు’ ఇత్యాదికల్పన శ్రీనాథోపజ్ఞంగానే ఉన్నది. కొంత దూరాన్వయమైనప్పటికీ గంగాధర టీకలోని విశేషార్థాన్ని గ్రహించి వచ్యర్థంలో కూడా దీనిని అన్వయించటానికి అవకాశం లేకపోలేదు. ఆ ప్రకారం ఇది బహుముఖీనమైన అనువాదమని నిరూపింపవచ్చును. ప్రబంధరత్నాకరంలో పెదపాటి జగ్గన ప్రాకరనిర్దేశంలో విపర్యాసానికి లోనైన తావులనేకం ఉన్నాయి. శ్రీనాథుని పద్యాన్ని ఆయన సోమన రచనగా భ్రాంతికి లోనై ఉండవచ్చును. లేదా శీర్షికారచనలో ప్రతివిలేఖకుల దోషం కావటానికి ఆస్కారం ఉన్నది. వేమభూపాలుని వ్యాఖ్యతో ఇంతగా అన్వయించి చెప్పవలసిన అవసరం శ్రీనాథునికి తప్పించి మరొక కవికి ఉండదు.
ఏది ఏమైనప్పటికీ, శ్రీనాథ మహాకవి వాఙ్మయకలశరత్నాకరంలో శాలివాహన సప్తశతి నుంచి లభించిన మరొక్క పెన్నిధి ఇది.
3. భీమేశ్వర పురాణములో శాలివాహన సప్తశతిలోని పద్యం
వాలికమోము మత్తవనబర్హకిశోరకలాస్యలీలఁ బై
వాలిచి పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవిందతాం
బూలపు మోవి మోవిపయి మోఁపుచు రాధకు నిచ్చు ధూర్తగో
పాలుఁడు ప్రోచుఁ గావుత మపారకృపామతి మంత్రి యన్ననిన్.
ఇది శ్రీనాథుని భీమేశ్వర పురాణం అవతారికలోని మూడవ పద్యం. తెలుగు సాహిత్యంలో రాధాకృష్ణుల మధురశృంగారాన్ని పాఠకులకు పరిచయంచేసిన తొలిరచనగా గుర్తింపును పొందింది. అయితే ఇది ఆయన బాల్యకృతి అయిన శాలివాహన గాథాసప్తశతి ఆధారితమై, అందులోనిదే కావచ్చునని విమర్శకులు ఇంతవరకు గుర్తింపకపోవటం ఆశ్చర్యం!
ముందుగా క్రీ.శ. 50 – 72 ప్రాంతాల ప్రాకృతంలో హాలుడు సంధానించిన గాథను చూద్దాము:
ముహమారుఏణ తం కణ్హ! గోరఅం రాహిఆఏఁ అవణేన్తో,
ఏతాణం వల్లవీణం అణ్ణాణం వి గోరఅం హరసి.
అని మూలం. 1881లో ప్రాకృత గాథాసప్తశతిని సర్వపాఠాంతరసమాకలనపూర్వకంగా సప్రమాణంగా పరిష్కరించి, Ueber das Saptaçatakam des Hâla అన్న పేరిట జర్మన్ భాషానువాదంతో స్వీయవ్యాఖ్యానసమేతంగా లీప్‌జిగ్‌లో అచ్చువేసిన ఆల్బ్రెష్ట్ వెబర్ దీనిని ప్రథమశతకంలో 89వ గాథగా గ్రహించి, ఇది ‘పోట కవి’ రచనమని పేర్కొన్నాడు. ఆధునికపరిష్కర్త లందరూ ‘పొట్టిస కవి’ కృతమని అంటున్నారు.
గాథార్థం ఇది: గోధూళి వేళ రాధాకృష్ణులు ఇంటికి తిరిగివస్తున్నారు. ధూళికణం (గోరఅం = గోరజం) రాధ కంటిలో పడింది. ఆమె కన్నులు ఎఱ్ఱబారాయి. గోపికలందరూ గొల్లున నవ్వినట్లున్నారు. దుఃఖం పెల్లుబికి రావటం సహజం. సిగ్గుతో తలవంచుకొన్నది. గోపాలకృష్ణుడు ఆ దుఃస్థితిని చూశాడు. రాధను (రాహిఆ = రాధిక) దగ్గరకు తీసికొన్నాడు. నోటితో గాలి ఊదుతూ (ముహమారుఏణ = ముఖమారుతంతో) ఆమె కంటినలుసును తొలగించివేశాడు (తం గోరఅం రాహిఆఏఁ అవణేన్తో).
నలుగురిలో కృష్ణుడలా చేస్తాడని గోపికలు అనుకోలేదు. రాధాకృష్ణుల భావబంధం సంగతి వారికి తెలియనిది కాదు. అయితే సిగ్గువల్లనో, అపవాదభయం వల్లనో ఆమెను చూసీ చూడనట్లు ఊరుకొంటాడని వారి నమ్మకం. కానీ అలా జరగలేదు. కృష్ణుడు వారి తెల్లని ముఖకాంతిని (గోరఆ = గౌరత) హరించివేసినట్లుగా అందరి ముఖాలు ఎఱ్ఱబడ్డాయి, ఎంత పని చేశావయ్యా, కృష్ణయ్యా! అని.
ఇందులోని విశేషం ఏమిటి? హాలుని సప్తశతకానికి టీకను వ్రాసిన మహనీయుడు రసజ్ఞమౌళి గంగాధరుడు చెప్పాడు, ‘చక్షుఃప్రవిష్టరజోఽపనయనచ్ఛలేన చుంబన్’ అంటూ ఈ సన్నివేశంలో ధ్వనిస్తున్న అసలు విషయాన్ని. రాధిక కన్నులలో ముఖమారుతాన్ని ఊదే నెపంతో శ్రీకృష్ణుడు ఆమెను దగ్గరకు తీసుకొని మోము అరవాల్చి ఆమె పెదవులను అందుకొని ముద్దుపెట్టుకొన్నాడు. రాధాకృష్ణుల ప్రేమ లోకానికి వెల్లడయింది. గోపికల ముఖగౌరతనే కాదు, వారి గర్వాన్ని కూడా హరించినట్లయింది. ఎందుకంటే, తక్కినవారందరూ అణ్ణాసం వల్లవీణాం = పరాయి ఆడవాళ్ళు. పరకీయలు. రాధ ఒక్కతే ఆయన ప్రణయసామ్రాజ్యానికి పట్టమహిషి.
రచన క్రీస్తుశకం మొదటి శతాబ్దం నాటిది. కవితాద్రవ్యాలన్నీ ఆ రోజుల్లో కొత్తవి. ముఖగంధం, వదనమారుతం, నిశ్శ్వాసపరిమళం – ఇవన్నీ శృంగారవర్ణనలలో అప్పటి కవులు సాహిత్యంలో సరికొత్తగా ప్రవేశపెట్టినవి.
మనసులకు హత్తుకొనిపోయే ఈ శృంగారభావోద్దీపన పరికరాలను, ఈ గాథను మహాకవి కాళిదాసు అంతటివాడు కూడా తన అభిజ్ఞానశాకుంతలంలో వినియోగించుకొన్నాడు. తృతీయాంకంలో శకుంతలా దుష్యంతుల పరస్పరానురక్తి వెల్లడవుతుంది. దుష్యంతుడు ఆమెను దగ్గరకు తీసికొనబోతాడు. శకుంతల ‘పవణుక్కమ్పిణా కణ్ణుప్పలరేణుణా కలుసీకిదా మే దిట్ఠీ’ అంటుంది. అది ప్రేమికుల మధ్య చోటుచేసికొన్న చనవుకు, రాగాతిశయవ్యక్తికి క్రమపరిణామం. చెవికమ్మగా ఉన్న పువ్వునుంచి ఎగిరి పుప్పొడి కంట్లో పడినందువల్ల దృష్టి కలుషితమైంది, అని. గాథాసప్తశతిలో గోధూళి వేళ రాధ కంటిలో పడిన ధూళికణం కాళిదాసు కథనంలో శకుంతల కన్నులలో చిందిన పుష్పరజం అయింది. అప్పుడు, ‘యద్యనుమన్యసే, తదాహ మేనాం వదనమారుతేన విశదాం కరిష్యే’ అని దుష్యంతు డంటాడు. సరే, నీవు అంగీకరిస్తే నోటితో గాలి ఊది పుప్పొడిని తీసెయ్యనా? అని. ఆయన రతోత్సుకుడైన నాయకుడు. అందుకు, ‘తదో అనుకమ్మిదా భవే’ అని శకుంతల అంటుంది. అయితే, మీ దయ ఉందన్నమాటే! అని. ఇది ఆమె ఆభిముఖ్యానికి మలిసూచన.
ఈ సంభాషణాక్రమంలో ఉట్టిపడుతున్న సుకుమారమైన ప్రణయభావానికి కాళిదాసు తన కుశలకరాంగుళులతో ప్రాణంపోశాడు. నాయికానాయకులకు ప్రథమాంకంలో అంకురించిన హృదయరాగం ప్రవర్ధితమై, ద్వితీయాంకం నాటికి సువ్యక్తమైంది. సాన్నిహిత్యం పెరిగింది. ఈ సన్నివేశంలో దుష్యంతుడు రజోవిశదిమ నేపథ్యం వల్ల ఎన్నడూ లేనంతగా ఆమెకు చేరువై, ఆమె కర్ణోత్పలసాన్నిధ్యం వల్ల మరింత మైమఱచిపోతాడు. కన్నులలో పడిన పుష్పరజాన్ని వదనమారుతంతో తొలగిస్తునప్పుడు అధరచుంబనాభిలాష బలీయం అవుతుంది. ఆమె ముఖాన్ని ‘ఉన్నమయితుం ప్రవృత్తః’ – కొద్దిగా తనవైపుకు తిప్పుకోబోతాడు. ఆమె ‘ప్రతిషేధం రూపయన్తీ విరమతి’ వద్దువద్దన్నట్లు తప్పుకొంటుంది. ముద్దుపెట్టుకోవాలన్న కోరికను అతని కన్నులలో చూసి, ‘భూఓ వి సహీఅణం అణుమాణఇస్సం’ – చెలులు చూస్తే అనుమానిస్తారేమో! అని మృదువుగా అతనిని అపవారిస్తుంది. ప్రియాముఖదర్శనపారవశ్యంలో ఉన్న దుష్యంతుడు తేరుకొని, ‘సురభి ముఖం తే మయా యదాఘ్రాతమ్’ – నీ ముఖపరిమళాన్ని ఆఘ్రాణించటం ఎంత సమ్మోహకంగా ఉన్నదో! అని చిరునవ్వుతో అంటాడు.
ఈ ఘట్టం ప్రముఖమైన శాకుంతల దాక్షిణాత్య ముద్రణలలో లేదు. కాళిదాసు అభిజ్ఞానశాకుంతలాన్ని క్రీస్తుశకం 1600 – 1650 నాటి చంద్రశేఖరుని ప్రామాణికమైన అద్భుతవ్యాఖ్యలోని సంస్కృతచ్ఛాయ ఆధారితంగా 1877లో లండనులో పరిష్కరించి అచ్చువేసిన ప్రాకృతభాషామహాపండితుడు రిఛర్డ్ పిషెల్ మనోజ్ఞమైన ఈ ఘట్టాన్నంతటినీ తన మూలంలో చేర్చుకొన్నాడు. మైథిలీ, వంగదేశాల ప్రతులలోనూ; అక్కడి శంకర చంద్రశేఖర నరహరి పండితాదుల వ్యాఖ్యలలోనూ; ముఖ్యమైన ఔత్తరాహ ప్రతులలోనూ, తదాధారితాలైన ముద్రణలన్నింటిలోనూ ఈ ఘట్టం ఉన్నది.
నాయిక కన్నులలో చిందిన పుష్పరజం నాయకునికి అధరచుంబనాభిలాషను రగుల్కొలిపిన ఈ సన్నివేశం శ్రీనాథునికి ఎంతో మెచ్చుగొలిపి ఉండాలి. అది సప్తశతికి అనుబంధితమే కదా. రెండింటినీ అన్వయించాడు. ఆయన తన చిన్నారి పొన్నారి చిఱుతకూకటివేళ చదువుకొన్న కాటయ వేమారెడ్డి రచించిన కుమారగిరిరాజీయ వ్యాఖ్య పాఠంలో లేకపోయినా, అప్పటికే దేశమంతటా అధికపాఠంతోడి అభిజ్ఞానశాకుంతలం ఔత్తరాహ ప్రతులు ప్రచారంలో ఉన్నాయి. దానికితోడు భువనపాలుడు గాథాసప్తశతికి కూర్చిన గాహాకోస టీకనూ, గంగాధర భట్టు రచించిన గంగాధర టీకనూ చూచిన శ్రీనాథునికి ఈ స్ఫురణ కలిగి మూలాతిరిక్తంగా కవిహృదయాన్ని తన గాథాసప్తశతి అనువాదంలోనూ, భీమేశ్వర పురాణంలోనూ ఆవిష్కరించాడని గ్రహింపవచ్చు.
కాటయ వేముడు పై సన్నివేశానికి పర్యాయంగా తన వ్యాఖ్యలో వేఱొక అందమైన దాక్షిణాత్యపాఠాన్ని గ్రహించాడు. ‘అపరిక్షతకోమలస్య యావత్ కుసుమస్యేవ నవస్య షట్పదేన, అధరస్య పిపాసతా మయా తే సదయం సున్దరి! గృహ్యతే రసోఽస్య’ అని దుష్యంతుడంటాడు. అంటూ, ‘ఇతి సమున్నమయితు మిచ్ఛతి’ – ముఖాన్ని పైకి లేవనెత్తబోతాడు. శకుంతల నాట్యభంగిమతో అపవారిస్తుంది.
ఈ ‘నాట్యభంగిమ’ అన్న పదబంధం కూడా శ్రీనాథుని గుండెలలో నిలిచిపోయింది. దుష్యంతుడు సిగ్గుతో పరాఙ్ముఖియై ఉన్న ఆమె చిబుకాన్ని త్రిపతాకా హస్తంతో మునివ్రేళ్ళతో లీలగా స్పృశించి, మాధ్యమాతర్జన్యంగుళులతో పైకి లేవనెత్తి, అధరచుంబనాభిలాషను వ్యక్తం చేశాడు. ‘పరాఙ్ముఖీకృతం శీర్షం పరావృత్త ముదీరితమ్, తత్కార్యం కోపలజ్జాదికృతే వక్త్రాపసారణే. ముఖాన్తర్నిహితప్రాణశాధ్యేషు వినిగూహితః, రోషేర్ష్యయోశ్చ నారీణాం బలాచ్చుమ్బతి వల్లభే’ అని శాస్త్రవచనం కదా! వాలికమోము మత్తవనబర్హకిశోరకలాస్యలీల, అన్న దళం పై దృశ్యాభినయాన్ని కన్నులకు కట్టింది. అది శ్రీనాథుని కాళిదాస భక్తికీ, నాట్యశాస్త్ర లక్షణపరిజ్ఞానానికీ తిరుగులేని సాక్ష్యం.
‘వాలిక మోము’ లాస్యాంగం. రాధ కన్నులలో చిందిన గోరజాన్ని వదనమారుతంతో ఊదినప్పుడు ఆమె వాలిక మోముతో(వివర్తితాస్యం) ఉన్నది. అది అంగాభినయంలో పార్శ్వకర్మచిత్రణం.
ముహురఙ్గులిసంవృతాధరోష్ఠం
ప్రతిషేధాక్షరవిక్లబాభిరామమ్
ముఖ మంసవివర్తి పక్ష్మలాక్ష్యాః
కథ మ ప్యున్నమితం న చుమ్బితం తు.
అని శాకుంతలంలోనూ (కాటయ వేమారెడ్డి పాఠంలో తృతీయాంకం: 22వ శ్లోకం) ఇదే అనురణించింది.
శ్రీనాథుని చిత్రణలో రాధ నేత్రయుగళి ముఖరాగాన్వితమై కృష్ణునికి మరింత శోభాకరంగా కనుపించిందన్నమాట. పుష్పరజఃపాతాన్ని గౌణీకరించి, అధరకర్మను ప్రధానీకరించాడు. ఈ వివర్తితాధరాన్ని కొమరగిరిరెడ్డి తన వసంతరాజీయంలో వివరించాడట. కాటయ వేమారెడ్డి తన వ్యాఖ్యలో చెప్పాడు. శ్రీనాథుడు దానిని ప్రాతిబోధికం చేశాడు. కాళిదాసు వర్ణించిన అధరస్పందం శ్రీనాథుని రూపణలో స్ఫురితక చుంబితంగా పరిణమించింది. ‘వాలికమోముపై వాలిచి – మోవి మోవిపయి మోఁపుచు’ అని నిమిత్తీకరించాడు.
శ్రీకృష్ణుడు రాధకు ‘మోవి మోవిపయి మోఁపుచు’ తాంబూలాన్ని అందివ్వటం ప్రేయసీప్రియుల చనవుకు, రాగాతిశయానికి సంకేతం. ‘లాభః స ఏవ పరమః పర్యాప్తం తేన తేన తృప్తాస్మి, వినివేశ్య యదుత్సఙ్గే నిక్షిపతి ముఖే ముఖేన తామ్బూలమ్’ అని దామోదరగుప్తుని కుట్టనీమతం (శ్లో.548) లోని వేశ్య చికరాల అంటుంది. ఒడిలో కూర్చుండబెట్టుకొని, మోవి మోవిపయి మోపి తాంబూలభోగాన్ని ప్రేయసికి అనుగ్రహించటం మరింత సంతృప్తికరమట. అది ఏకాంతసమావేశంలోని విషయం. కృష్ణుడు ఆ భోగాన్ని రాధకు అనుగ్రహించిన వేళ వారిద్దరూ ఏకాంతంలో ఉన్నారో, సప్తశతిలో వలె గోపికాజనసమక్షంలో ఉన్నారో శ్రీనాథుడు చెప్పలేదు.
నెమలి పింఛాన్ని సిగలో తురుముకొన్న శ్రీకృష్ణుడు మహాకవి శ్రీనాథుని మనోనేత్రానికి మత్తిల్లిన వనమయూరకిశోరంలా కనుపించటం ఎంతో సహజంగా ఉన్నది. సుకుమారమైన లాస్యమనగానే మయూరకంతో ఏకాశ్రయనిష్ఠ లేదనుకోకూడదు. ఆ మయూరకలాస్యలీల పురుషప్రయోజ్యమైనదే.
‘సురభి ముఖం తే మయా ఆఘ్రాతం’ అన్న దుష్యంతుని వచనమే తెలుగులోకి వచ్చి, ‘పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవింద తాంబూలపు మోవి’ తోడి అధరపానమై, రాధికకు శృంగారోద్దీపన మంత్రమై కళలను కరగించింది. ‘మోవి మోవిపయి మోఁపుచు’ అన్న దృశ్యీకరణ ఆమె ఆభిముఖ్యానికీ, రాగాభివృద్ధికీ సూచకం.
ఇంతకీ రాధాకృష్ణుల సమావేశం గోరజఃపాతవశాన సిద్ధించింది. కృష్ణుడు దానిని అధరచుంబనావకాశంగా మలచుకొన్నాడు. అందుకే శృంగారధూర్తుడన్న (ధూర్తగోపాలుఁడు) బిరుదప్రదానం జరిగింది. శ్రీనాథుని ప్రయోగంలో అది విరసత్వబోధకం కాదు. సరసత్వసాధకమే. ‘మందరాచల కందరా మథ్యమాన, దుగ్ధపాథోధిలహరికా ధూర్త యైన, లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి’ (భీమ. 1 – 4) ఆయనకు ఆరాధ్యదేవత కదా!
గాథాసప్తశతి శ్రీనాథుడు పదహారేళ్ళ నూనూగు మీసాల నూత్నయౌవనం నాడు చెప్పిన రచన.
జగము నుతింపఁగఁ జెప్పితి
ప్రెగడయ్యకు నా యనుంగుఁబెద్దనకుఁ గృతుల్
నిగమార్థసారసంగ్రహ
మగు నా యారాధ్యచరిత మాదిగఁ బెక్కుల్
అని శృంగార నైషధంలో (1–14) మామిడి సింగనామాత్యు డంటాడు. ఆరాధ్యచరితము అంటే పండితారాధ్య చరిత్ర. పాల్కుఱికి సోమనాథుని పండితారాధ్య చరిత్రకు పద్యపరివర్తనం. ‘ఆదిగ’ అని చెప్పిన ఆ మొదలైన పెక్కు కృతులలో శాలివాహన సప్తశతి కూడా ఉన్నది కాబోలు. అనుంగు పెద్దన అంటే సింగనామాత్యుని అన్నగారు మామిడి ప్రెగడయ్య. సప్తశతిని ఆయనకే అంకితం చేశాడేమో. భీమేశ్వర పురాణం రచనాసమయంలో అది జ్ఞాపకం వచ్చింది. అందుకూ కారణం లేకపోలేదు. భీమేశ్వర పురాణం కృత్యాదిలోని ఇష్టదేవతా ప్రార్థనంలో శ్రీనాథుడు భీమేశ్వరస్వామి కృతిపతి బెండపూడి అన్నమంత్రిని కాపాడు గాక! అని మొదటి పద్యంలో చెప్పాడు. ఆ తర్వాతది వినాయక స్తుతి. ఏనికమోముతా, ల్పెలిక నెక్కిన రావుతు రాచవారు, సే నాని యనుంగుఁబెద్దన వినాయకదేవుఁడు అని వ్రాశాడు. ‘అనుంగు పెద్దన’ అనగానే చిన్ననాటి శాలివాహన సప్తశతి స్ఫురించింది. అందులోని పద్యం చివఱ నున్న గోరజఃపాతం ప్రసక్తిని తీసివేసి కృతిపతికి ఆశీర్ముఖంగా ప్రస్తుతీకరించుకొన్నాడు. తెలుగు సాహిత్యానికి అనర్ఘమైన పద్యరత్నాన్ని ప్రసాదించాడు.
ఇది మహాకవి శాలివాహన సప్తశతిలోని మూడవ పద్యమని ప్రతిపాదింపబడుతున్నది.
4. పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో లభించిన పద్యం
ఆరయ జీవనం బమృత మల్లుఁడు విష్ణువు సొమ్ము లన్నియున్
సారపు రత్నముల్ కొడుకు చంద్రుఁడు కూఁతురు లక్ష్మి యాలు భా
గీరథి తా సముద్రుఁ డని కీర్తన సేయుదు రెల్లవారు నా
క్షీరపయోధి నన్యులకుఁ జెల్లునె యిట్లు సమస్తభాగ్యముల్.
ఈ సమస్తలోకంలో భాగ్యశాలి ఎవరు? అని వెతికితే, పాలకడలిని మించిన భాగ్యశాలి ఎవరుంటారు? జీవితమంతా అమృతం. అల్లుడో? సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. ఆయనకు గల సంపదలన్నీనో? ఐశ్వర్యసారములైన రత్నాలు. కొడుకు చంద్రుడు. కూతురు లక్ష్మి. ధర్మపత్ని గంగానది. తానే ఒక మహాసముద్రం – అని పాలకడలిని కొనియాడుతారందరూ. ఇన్ని భాగ్యవిశేషాలు సామాన్యులకు సమకూడుతాయా? అని పద్యార్థం.
ఇది శ్రీ ప్రభాకరశాస్త్రిగారు సంధానించిన ప్రబంధరత్నావళి యొక్క 1976 నాటి పునర్ముద్రణ ప్రతిలో ‘గ్రంథనామము, కర్తనామము తెలియరానివి’ అని పేర్కొనబడిన పద్యాలలో 550వ పద్యం. ప్రభాకరశాస్త్రిగారు దీనిని పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరము నుంచి తీసుకొన్నారు. అయితే, ఇది ఏ కావ్యంలోనిదో, ఆ కావ్యకర్త ఎవరో అప్పటికి లభించిన సాధనసామగ్రి వల్ల తెలియరాదని శ్రీ ప్రభాకరశాస్త్రిగారు నిశ్చయించారన్నమాట. అయితే ఇది శ్రీనాథుని గాథాసప్తశతిలోని పద్యమని, దీనికి మూలం ప్రాకృతంలో జినేశ్వర సూరి కూర్చిన గాహారతణకోస (గాథారత్నకోశం)లో ఉన్నదని ప్రముఖ ప్రాకృతభాషావిద్వాంసులు డా. ఇప్పగుంట సాయిబాబా భారతి పత్రిక 1979 అక్టోబరు సంచికలో (పుటలు 18-19) ‘గాహారతణకోసో’ అన్న వ్యాసంలో తొలిసారిగా ప్రకటించారు. అందులో వారి మాటలివి:
లచ్ఛీ దుహి ఆ, జామాదా
హరీ తధ అఘరిణీ గంగా
అమయ మియంక సుదా
అహో కుటుంబం మహోదహిణో.
తెనుగు దేశము గాహాకోసం (గాథాసప్తశతి) ప్రతులలో పై గాథ ఉన్నట్లు ఆల్బ్రెక్ట్ వీబరు తన గాథాసప్తశతి 1881 ముద్రణలో తెల్పియున్నారు. వారు అనుబంధముగా దీనిని ముద్రించియున్నారు. కవి సార్వభౌమ శ్రీనాథ కవి తెనిగింపు లభ్యమగుటచే, శ్రీ వీబరు తలంపు నిక్కము. కవి సార్వభౌముని కమనీయపు తెనిగింపు ఇది … ప్రబన్ధ రత్నావళి ఐదువందల ఏబదియవ పద్యముగా ఉన్నది’ (పు.18) అని.
దీనిని పురస్కరించికొని శ్రీ సాయిబాబా ఆ తర్వాత భారతీ పత్రిక 1980 జూన్ సంచికలో (పు. 65-66లు) ‘శ్రీనాథకవి – గాథాసప్తశతి’ అని మరొక వ్యాసాన్నికూడా వ్రాశారు. అందులో వారు ‘ఆరయ జీవనం బమృత’ మన్న పై పద్యానికి మూలంగా చూపిన పాఠం ఇది:
లచ్ఛీ దుహిదా, జామాదో
హరి, తస్స గహిణి అ గంగా
అమియ మియంకా సుదా ఆ
హమ్హో కుడుంబం మహదహిణో.
ఈ సరికొత్త పాఠం శ్రీ సాయిబాబా గారికి ఎక్కడ దొరికిందో తెలియటం లేదు. వారు ఈ వ్యాసాలను ప్రకటించిన నాటినుంచి ఈ పద్యం శ్రీనాథుని శాలివాహన సప్తశతిలోని రచనగా సాహిత్యచరిత్రలలోని కెక్కింది. దీనిని అనుమోదిస్తూ ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు 1984లో ‘శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు షష్టిపూర్తి సంచిక’లోని ‘శాలివాహనసప్తశతి – క్రీడాభిరామ పద్యస్థితి’ అన్న వ్యాసంలో – ‘పయి గాథ గాథాసప్తశతియందు లేదు. సప్తశతిసారమునందును లేదు. అయినను శ్రీనాథుని శాలివాహనసప్తశతిలోని పద్యము కావచ్చును,’
అని వ్రాసి, ఈ సరికొత్త పాఠాన్ని ఉదాహరించారు. ఇది శాలివాహన సప్తశతిలోని పద్యం కావచ్చునని అంగీకరించారు. శ్రీ సాయిబాబా గారు అంతకు మునుపు ప్రకటించిన వేరొక పాఠం సంగతిని వారు ప్రస్తావింపలేదు.
తథ్యమిథ్యావివేచన నిమిత్తం పై ప్రతిపాదనలలోని ఒక్కొక్కదానిని సవిమర్శంగా పరిశీలించి చూద్దాము.
మొదటి సంగతి: ‘ఆరయ జీవనం బమృతము’ అన్న పద్యానికి మూలమైన ‘లచ్ఛీ’ ఇత్యాదిగాథ శ్రీ సాయిబాబా గారు గుర్తించినట్లుగానే జినేశ్వర సూరి సంధానించిన ‘గాహారయణకోస’ (గాథారత్నకోశం) లోనే ఉన్నది. గ్రంథం పేరు వ్యాసం శీర్షికలో వారు చూపినట్లు ‘గాహారతణకోసో’ కాదు. ‘గాహారయణకోస’ అని ఉండాలి. స్వరప్రక్షేపం వల్ల రత్న శబ్దానికి అంతఃస్వరవృద్ధి వచ్చి రతన, రయణ అని రెండు రూపాలేర్పడుతాయి. ముద్రితప్రతిలో ‘గాహారయణకోస’ అనే ఉన్నది. 1975లో పండిత అమృతలాల్ ఎం. భోజక్, నాగిన్ జె. షా గారల సంపాదకత్వంలో అహమ్మదాబాదులో అచ్చయింది. అందులోని 40వ గాథ పాఠం ఇది:
లచ్ఛీ ధూఆ, జామాఉఓ హరీ, తహ య పణఇణీ గంగా
అమయ-మియంకా య సుఆ అహో! కుడుంబం మహోఅహిణో.
అని. సాయిబాబా గారు ఇచ్చిన గాథ సరిగా లేదు. అది వారికి ఏ ముద్రణలో లభించినదో నాకు తెలియరాలేదు. భారతి పత్రికలో అచ్చుతప్పులు దొర్లాయేమో. పైని ఉదాహరించిన అమృతలాల్ భోజక్ గారి పాఠమూ సుపరిష్కృతం కాదని తెలుస్తూనే ఉన్నది. అందులోనూ పొరపాట్లు కనబడుతున్నాయి.
జినేశ్వర సూరి ఘూర్జరదేశంలో శ్వేతాంబర జైనమార్గీయులలో విగ్రహారాధనను వ్యాప్తికి తెచ్చిన వృద్ధ గచ్ఛానికి చెందిన మహాపురుషులలో ఒకడు. ఖరతర గచ్ఛంలోని మరొక మహావిద్వాంసుడు జినేశ్వర సూరి, ఆంచలిక గచ్ఛానికి చెందిన జినేశ్వర సూరి మొదలైన మహనీయుల దేశ-కాల-సాహిత్యాదులతో ఆయనకు సంబంధం లేదు. ఆయన ‘ప్రశస్తి గాథ’ను బట్టి క్రీస్తుశకం 1194లో ‘ఆచార్య’ పదం నుంచి ఆరూఢుడై ‘సూరి’ పదాన్ని పొందినట్లు తెలుస్తున్నది. అప్పటికి ముప్ఫైయేళ్ళ వయోవస్థలో ఉన్నాడు. జైన ధాతుప్రతిమా లేఖసంగ్రహాన్ని బట్టి 1231లో గచ్ఛాలయంలో ఒక పార్శ్వనాథ ప్రతిమను ప్రతిష్ఠించాడు. దేశమంతటా విస్తృతంగా సంచరించి ధర్మప్రబోధం చేశాడు. తన ప్రయాణస్థలాలలో సేకరించిన గ్రంథాలలోని స్మరణీయగాథలతో 1240 ప్రాంతాల ‘గాహారయణకోస’ సంకలనం చేసి ఉంటాడని భావిస్తే, ఆయన జీవితకాలం 1175 – 1240 (±) అని స్థూలంగా నిర్ణయింపగలము. ఆ ప్రకారం జినేశ్వర సూరి కంటె ఒక శతాబ్దికి తర్వాత 1360లో (±) జన్మించి, 1376 ప్రాంతాల గాథాసప్తశతిని శాలివాహన సప్తశతిగా తెలుగుచేసిన శ్రీనాథుడు ఈ గాథను మూదలించటం అసంభవం కాదని వాదింపవచ్చును.
అయితే, 1881లో ఆల్బ్రెష్ట్ వెబర్ Das Saptaçatakam des Hâla అన్న పేరుతో లీప్‌జిగ్ నుండి ప్రకటించిన గాథాసప్తశతి ప్రతిలో సాయిబాబా గారన్నట్లు పైని ఉదాహరించిన గాథ లేదు. వెబర్ తన మహాగ్రంథంలో Die erste Teli̅n̅ga Recension అన్న పేరిటి విభాగంలో 450-వ పుటనుంచి 501-వ పుట వరకు; Die zeite Teli̅n̅ga Recension అన్న పేరుతోడి మరొక విభాగంలో 502-వ పుటనుంచి 508-వ పుట వరకు ఇచ్చిన గాథలలో దీని ప్రస్తావన లేదు. ‘ఆంధ్రదేశపు ప్రతులలోని గాథ’ అని అక్కడక్కడ ఆయన సూచించిన గాథలలో ఈ గాథ లేదు. వెబర్ సంధానంలోని ప్రధానభాగంలోనూ, ఇతరస్థలాలలోనూ ఈ గాథ లేదు. వెబర్ ప్రకాశనకు అనంతరం వివిధప్రాంతాలలో ఇప్పటివరకు లభించిన త్రుటితభాగాలలోనూ, వ్యాఖ్యాతలు స్వీకరించిన గాథాసప్తశతి పాఠాలలోనూ ఈ గాథ లేదు. అందువల్ల సాయిబాబా గారు పొరబడ్డారని, గాథాసప్తశతిలో దీని ఉనికి సందేహాస్పదమని అనిపిస్తున్నది. గాథాసప్తశతి మూలంలో లేకుండా శ్రీనాథుడు ఎక్కడిదో ఆకుకు అందని, పోకకు పొందని జినేశ్వర సూరి ‘గాహారయణకోస’ నుంచి సంపాదించి పద్యానువాదం చేసి ఉంటాడనటం భావ్యం కాదు.
నిజానికి, ఈ గాథ సంస్కృతసాహిత్యంలో మున్ముందు క్రీస్తుశకం 9-వ శతాబ్ది నాటి కాశ్మీరకుడు, సర్వాలంకారికసార్వభౌముడు ఆనందవర్ధనుని ధ్వన్యాలోకం తృతీయోద్యోతం 35-వ కారిక వివరణలో ఉన్నది. జినేశ్వర సూరి దీనిని ధ్వన్యాలోకం నుంచే గ్రహించాడేమో చెప్పలేము. ధ్వన్యాలోక కారికా వ్యాఖ్యలోని ఆ గాథ పాఠం, దాని ఛాయ ఇవి:
లచ్ఛీ దుహిదా జామాఉఓ హరీ తస్స ఘరిణిఆ గంగా
అమిఅ-మిఅంకా అ సుఆ అహో కుడుంబం మహోఅహిణో.
లక్ష్మీ ర్దుహితా జామాతృకో (=జామాతా) హరి స్తస్య గృహిణీ గఙ్గా
అమృతమృగాఙ్కౌ చ సుతౌ అహో కుటుమ్బం మహోదధేః. (ఛాయ)
లక్ష్మి కూతురు. శ్రీహరి అల్లుడు. గంగ ఆయనకు ధర్మపత్ని. అమృత చంద్రులు కొడుకులు. ఆ మహాసముద్రుని కుటుంబం ఎంత గొప్పది! అని వాక్యార్థం. ఇది వాచ్యార్థం.
ప్రతీయమానార్థాన్ని చూద్దాము. సర్వైశ్వర్యాలకు పుట్టినిల్లయిన లక్ష్మి ఆయన కన్నకూతురు. ఇంటిలో తెల్లవారుజామున దుహ్ = పాలుపితికే పనికి ఉపక్రమిస్తుంది కాబట్టి కూతురుకు ‘దుహిత’ అనిపేరు. ఐశ్వర్యసార అయిన సాక్షాత్తు పాలకడలి కూతురికి పాలుపితికే పని ఏముంటుంది? అంటే, కామధేనువు ముంగిటిలో ఉన్నా, సాక్షాత్తు పాలకడలి కూతురయినా ఇంటిపని, వంటపని తప్పవేమో. ఆమెకు ‘దుహిత’ అని చమత్కృతార్థం. సర్వాభీష్టాలను నెరవేర్పగల కామదోగ్ధ్రి అని వ్యంజన. లక్ష్మి అంటే ‘లక్ష్యతే సర్వః అనయా ఇతి’ – ఈమె చేతనే సర్వమూ చూడబడుతున్నది అని భావం. లక్ష్మి అంటే సర్వశుభలక్ష్మలక్షిత కూడాను. అటువంటి దేవి ఆయన కూతురు.
శ్రీహరి ఆ మహోదధికి జామాత. ‘జాయాం మిమాతే జామాతా’ అని భావం. కాంతను వివాహార్థమై వలచినవాడు జామాత. ఆ కాంత లక్ష్మి అని ప్రతీయమానం. ‘జాయ’ అని సాకూతంగా అన్నాడు. రఘువంశంలో కాళిదాసు ద్వితీయ సర్గలో ‘జాయాప్రతిగ్రాహితగన్ధమాల్యే’ అని వ్రాస్తే వ్యాఖ్యాతృచక్రవర్తి మల్లినాథ సూరి ‘జాయ’ అన్న పదానికి ‘తజ్జాయా జాయా భవతి యదస్యాం పునర్జాయతే పతిః’ అని వివరించాడు. ఏ కాంతయందు భర్త పునర్జన్మింపబోతున్నాడో ఆ కాంత ‘జాయ’ అన్నమాట. శ్రీదేవి తనకు అనురూప అయిన జాయ అని గ్రహించి, ఆమెను వలచి వలపింపజేసికొన్నవాడు ఆయన. కనుక జామాత అని వ్యవహరణం. ఆయన మాత్రం సామాన్యుడా? జగత్పావనమైన తన పేరును తలచుకొన్నంతనే శరణాగతుల ఆర్తిని హరించివేసే శ్రీహరి.
తీర్థస్నానమాత్రాన ఏడేడు జన్మల పాపాలను కడిగివేసే గంగానది ఆ సముద్రుని కుటుంబిని. గంగా అంటే ‘హరస్య ఉత్తమాఙ్గాత్ భూమిం గతా’ – పరమశివుని శిరస్సునుండి నేలకు దిగివచ్చినది. ఆ పుణ్యాంగన ఆయన గృహిణి అన్నమాట.
అమృత చంద్రులు ఆయన వలని జన్మించినవారు కాబట్టి సుతులు. మృతిలేని శాశ్వతస్థితిని కల్పించేది కనుక కలశరత్నాకరంలోనుంచి పుట్టిన సుధకు ‘అమృతం’ అనిపేరు. అమృతమంటే వారుణి = మద్యమనికూడా వ్యాఖ్యాతలన్నారు. వేల్పులకు ఆహారమైన ఆ అమృతము కాని, సర్వజనులకు ఆకాంక్షితవ్యమైన మద్యము కాని నపుంసక లింగంలో ఉన్నవి కాబట్టి వాటియందు పుత్త్రత్వారోపణం సమంజసం కాదనుకొనేవారు ‘అమృతుడు’ అంటే ధన్వంతరి అని అర్థాన్ని చెప్పుకోవచ్చును. ‘అమృతం వారి సురయో ర్నిర్వాణే చాతిసున్దరే, అయాచితే యజ్ఞశేషే పుంసి ధన్వంతరౌ భవేత్’ అని వ్యాడికోశం. ధన్వంతరి లోకానికి ఆరోగ్యప్రదాత. ఆయన కూడా దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ప్రభవించినవాడే కద. కొడుకే అవుతాడు. అయితే, వ్యాఖ్యాతలెవరూ ఈ అర్థాన్ని చెప్పలేదు. మనము ఊహించుకోవాలి.
ఇక, మృగము (కుందేలు) అంకముగా (చిహ్నముగా) కలవాడు మృగాంకుడు = చంద్రుడు. విశ్వానికి ఆహ్లాదకారకుడు. అమిఅ (అమృత) మిఅంకా (మృగాఙ్కౌ) అని మహాకవి ద్వంద్వాన్ని సుజ్ఞాతంగా ప్రయోగించాడు. ‘మృగాంకామృతములు సుతులు’ అని కాని, ‘మృగాంకామృతులు సుతులు’ అని కాని వ్రాయవలసివస్తే చిక్కే వచ్చేది. ‘అమృతమృగాఙ్కౌ = అమృతచంద్రులు’ అని కాకుండా ‘అమృతమృగాంకః = అమృతస్వరూపుడైన మృగాంకుడు అని ఏకవచనం చేసి చెబితే సముచ్చయార్థకమైన ‘చ’ వర్ణానికి అక్కడ ప్రయోజనం లేకపోయి నిర్హేతుకమైన పాదపూరకంగా మిగిలేది. మృగాంకునికి అమృతశబ్దాన్ని విశేషణం చేయటం వల్ల ‘సుతః’ అని ఏకవచనం చేసుకోవలసి, తత్పరిణామంగా ‘అహో’ అన్న ఆశ్చర్యార్థకం సంధిగతమై ఛందస్సుకూడా భగ్నమయ్యేది. అన్నీ తెలిసినవాడు కనుక ‘అమిఅ-మిఅంకా’ అన్నాడు.
గాథాతాత్పర్యం ఏమిటి? శ్రీదేవి కూతురు, శ్రీహరి జామాత, గంగావధూటి భార్య, అమృత-మృగాంకులు కుమారులు అనటం వల్ల సముద్రుని కుటుంబం ఎంత గొప్పదో చెప్పకనే చెప్పినట్లయింది. ఆయన మాత్రం సామాన్యుడా? మహోదధిస్వరూపుడు. సృష్ట్యాదియందు కలిగిన ఉదకమును ధారణచేసినవాడు కనుక జగదాది అన్నమాట.
ఇంతవరకు ఉన్నది త్రైలోక్యసారభూతుడైన సముద్రుని గూర్చిన వర్ణన. అది కేవలం యాథాతథ్యంతో ఉన్నది. స్వభావసిద్ధమైన వస్తువర్ణనం జరిగింది. అందులో ధ్వనిమత్త ఏమున్నది? స్వభావసిద్ధంగా మాత్రమే ఉన్నది. స్వభావం అన్నది శరీరం లాంటిదనుకొందాము. శరీరం ఎంత అందంగా ఉన్నప్పటికీ, అదే అలంకారం కాదు. శరీరమే అలంకారం అయితే, ఆ అలంకారాన్ని అలంకరించే వస్త్వంతరం ఉండదు. నిరుపమాన సౌందర్యశోభితమైన మైన శరీరం ఎంత శోభాయమానంగా ఉన్నప్పటికీ అలంకారం ఆ శోభను మరింత అందగింపజేస్తుంది. అలంకారకం అయిన పదసంపద ఉన్నప్పుడు నిర్విశేషమైన స్వభావోక్తి సైతం సవిశేషమై స్మరణీయమైన అలంకారం అవుతుంది. అందువల్ల సముద్రుని వైభవాన్ని చూసి మనకు కలిగే విస్మయాన్ని, విస్మయాపరపర్యాయమైన చిత్తవిచ్ఛిత్తిని, ఆ చిత్తవిచ్ఛిత్తికి పరిణామమైన ప్రశంసను సూచించేందుకు ఒక్క మాటలో ‘అహో’ అన్నాడు.
‘శంసు స్తుతౌ’ అని ధాత్వర్థం. శంస అంటే స్తోత్రమే. ఇది మరీ ప్రకృష్టమైన స్తోత్రం. ప్రశస్తమైన వస్తువైభవాన్ని ప్రశంస మూలాన అదెంత ప్రశంసనీయమో చెప్పాడు. ప్రశంస మూలాన ఆ చెప్పటం చమత్కారవంతం అయింది. ఆ చమత్కారాతిశయత్వం మన మనస్సులలోనికెక్కి ఒక ఆహ్లాదం కలుగుతుంది. ఆ ప్రకారం గుణాభావం ఉన్నచోటకూడా గుణవత్త సంభవించి ఈ గాథ వ్యంగ్యానికి ఉదాహరణ కాగలిగిందని ధ్వనికారుని మతం. ఆ ప్రశంసావాచకపదం వల్ల విశేషణాలన్నీ సాభిప్రాయములని పదప్రయోజనం వెల్లడయింది. సాభిప్రాయం అనటం వల్ల ప్రకృతార్థాన్ని ఉపపాదించే చమత్కారముతోడి వ్యంగ్యం ఉన్నదన్నమాట. వ్యంగ్యస్ఫూర్తి లేకపోతే విశేషణాలు హేత్వలంకారంలో అంతర్భవిస్తాయి. వ్యంగ్యస్ఫోటకత్వసిద్ధి ఉంటే సాభిప్రాయవిశేషణత్వం వలన పరికరాలంకారముయొక్క అభిజ్ఞానం కలుగుతుంది. ఆ అలంకారకృతమైన ధ్వనిమత్తను ఆలోచించిన కొద్దీ మహాకవి సంస్కారవిశేషం మనకు అర్థమవుతుంది.
ధ్వన్యాలోక కర్త ఇంత లోకోత్తరంగా శిరోవతంసీకరించిన ఈ గాథ క్రీస్తుశకం 11-వ శతాబ్ది ప్రారంభంలో ఉండిన మరొక కాశ్మీరకుడు మహామహుడు రాజానక మహిమ భట్టు చేతిలో తీవ్రవిమర్శకు గురయింది. ఏమి రోజులవి! శబ్దసాధుత్వాసాధుత్వబోధకమైన వ్యాకరణం, వేదార్థాన్ని సమగ్రంగా స్వాధీనపరచుకొనేందుకు సాధనీభూతమైన ఛందస్సు; ప్రతిజ్ఞ – హేతువు – ఉదాహరణము – ఉపనయము – నిగమనము అనే ఉపాంగభేదంతో వేదాధికారణాత్మకమైన న్యాయము; ఆగమార్థపరీక్షకు వ్యభిచారశంకానివర్తకమైన ఊహతో వ్యాప్యారోపాన్ని బట్టి వ్యాపకవస్తువును సంయోజించే తర్కశాస్త్రం; తత్త్వనిశ్చాయకములైన పూర్వోత్తరమీమాంసలు సాహిత్యశాస్త్రానికి ఉపాంగాలై, ‘గృహసమ్మార్జనమో! జలాహరణమో! శృంగారపల్యంకికాహరణంబో!’ అంటూ ఊడిగంచేసిన రోజులవి. ఆనందవర్ధనుడు చెప్పిన అభిధా లక్షణా వృత్తులను అంగీకరిస్తూనే వ్యంజనకు గల ప్రాధాన్యాన్ని తిరస్కరించి, తన మహనీయలక్షణగ్రంథం వ్యక్తివివేకం ద్వితీయ విమర్శలో (అధ్యాయాలకు విమర్శలని పేరుపెట్టాడాయన) ఆ మహామహుడు మహిమ భట్టు స్వీకరించిన పాఠం ఇది:
లచ్ఛీ దుహిఆ జామాదుఓ హరీ తహ ఘరల్లిఆ గంగా
అమియమిఅంకా అ సుఆ అహో! కుడుంబం మహోఅహిణో.
సంస్కృతంలో అలంకారసర్వస్వాన్ని రచించిన మరొక కాశ్మీరక మహామహుడు క్రీస్తుశకం 12-వ శతాబ్ది ప్రథమార్ధం నాటి రాజానక రుయ్యకుని గొప్ప వ్యాఖ్యతో, ఆచార్య రేవాప్రసాద ద్వివేదీ గారి హిందీ అనువాదంతో 1964లో అచ్చయిన వ్యక్తివివేకం ప్రతిలోని పాఠాన్ని పైని ఉదాహరించాను. వ్యక్తివివేకం ఇతర ముద్రితప్రతులలో కొంత పాఠభేదం ఉన్నది:
లచ్ఛీ దుహిఆ జామాఉఓ హరీ తస్స ఘరిణిఆ గంగా
అమిఅమిఅంకా అ సుఆ అహో! కుడుంబం మహోఅహిణో.
అని. మహిమ భట్టు విమర్శసారం ఏమిటంటే, గాథలో ప్రస్తుతం చెప్పబడుతున్నది లక్ష్మియొక్క దుహితృత్వం, అమృతమృగాంకుల పుత్త్రత్వం. ఆ రెండింటి గౌరవం వల్ల సముద్రుని కుటుంబానికి ముల్లోకాలలోనూ స్పృహణీయత సిద్ధిస్తున్నది. అందువల్ల ఆ పుత్త్రీత్వ పుత్త్రత్వ మాత్రపర్యవసాయిగా కల్పన ఉండవలసింది. తక్కిన అల్లికలను ప్రవేశపెట్టటం అనుచితప్రతిపాదనం అయింది. శ్రీమహావిష్ణువు, గంగా నది అన్న వారిద్దరూ సముద్రునితోడి అన్వయం వలన మాత్రమే గాక స్వతః త్రిలోకపూజ్యులు. హరియందు జామాతృత్వమూ, లక్ష్మియందు దుహితృత్వమూ అధ్యారోపింపబడినందువల్ల శ్లాఘ్యతాలోపం కలిగి వాచ్యవచనదోషం ఏర్పడింది. లక్ష్మి కూతురు, జామాత హరి, తస్స ఘరిణిఆ గంగా అన్న వాక్యంలో తస్స = ఆ హరియొక్క గృహిణి గంగ ఏమో అన్న అపార్థానికి తావున్నది. లక్ష్మి కూతురు; హరి అల్లుడు; తస్స ఘరిణిఆ గంగా = ఆ హరియొక్క భార్య గంగ అని క్రమప్రరిణామప్రాప్తంగా స్ఫురించటం వల్ల అపార్థానికి అవకాశం ఉన్నది. విశేష్య విశేషణాల ప్రక్రమం కూడా సరిగా లేదు. లక్ష్మి కూతురు, హరి అల్లుడు, (సముద్రుని) గృహిణి గంగ అనటానికి మారుగా లక్ష్మి కూతురు, అల్లుడు హరి, గృహిణి గంగ అన్న ప్రక్రమం చాలు – విధ్యనువాదం పరస్పరాపేక్షిగా లేదని చెప్పటానికి. కుటుంబసంబంధాల ఆనుపూర్వితో (క్రమశబ్దప్రయోగంతో) లేకపోవటం వల్ల పౌర్వాపర్యానికి భంగం ఏర్పడి గాథాశిల్పం భగ్నమయింది. గాథలో ‘అహో’ అన్న ప్రశంసలో అద్భుతరసాన్ని ప్రతీయమానం చేసే లక్షణత్వమేదీ లేదని; ప్రతీయమానం అని చెప్పబడుతున్న ఆ అర్థవత్త అభిధాశక్తి వలన అనుమానింపబడటమే తప్పించి ఆ ఆశ్చర్యార్థకమైన శబ్దం కాని, దాని అర్థం కాని దేనికీ వ్యంజకాలు కావని; వాచ్యార్థం నుంచి ప్రశంసారూపమైన ఏ అర్థాంతరం అనుమానింపబడుతున్నదో, ఆ అర్థాంతరం అనుమేయం మాత్రమే అని; అది వస్తువు – అలంకారము – రసము అన్న మూడు రూపాలతో ఉంటుందని; వస్తువు, అలంకారం వాచ్యరూపాలుగా ఉండగా రసం మాత్రం అనుమేయమై ఉంటుందని – అలంకారశాస్త్రంలో కావ్యానుమితి సంప్రదాయాన్ని నెలకొల్పినవాడు కదా.
మహిమ భట్టు వ్యక్తివివేకానికి అపురూపమైన విద్వత్త తొణికిసలాడే గొప్ప సంజీవనీ వ్యాఖ్యను నిర్మించిన రుయ్యకుడు ధ్వని సంప్రదాయాన్ని తలకెత్తినవాడే అయినా, ఈ గాథలోని లోపాల విషయంలో మహిమ భట్టుతో ఇక్కడ ఐకకంఠ్యాన్ని భజించటం గమనింపదగినది.
మహిమ భట్టు విమర్శను మనము ఇంకా మరికొంత సాగిస్తే, గంగకు శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మావిర్భావవశాన విష్ణుపుత్త్రీత్వం సిద్ధించి – సముద్రపత్నీత్వవశాన ఆమె విష్ణువుకు కుమార్తె కావడమూ, విష్ణువుకు అత్తగారు కావడమూ అన్న ఐకకాలికస్థితివిరోధం కలుగుతుందని కూడా చెప్పవచ్చును. ఇటువంటి అపార్థానికి తావీయని కల్పనను కవి ఎన్నుకొని ఉంటే గాథ స్వస్పందసుందరంగా భాసించేదని అనవచ్చును.
దీనికి ఇంకొక కోణాన్ని చూద్దాము. క్రీస్తుశకం 1135 నాటి అంబాప్రసాద కవి రచించిన కల్పలతా లక్షణగ్రంథానికి వ్యాఖ్యానరూపమైన క్రీస్తుశకం 1185 () నాటి కల్పలతావివేకము యొక్క శబ్దాలంకారదర్శనాధ్యాయంలో పేరు తెలియని తద్వ్యాఖ్యాత ధ్వన్యాలోకంలోని గాథనే పునరుద్ధరించి, ధ్వన్యాలోకానుసారమే వ్యాఖ్యానించాడు. అమృత-మృగాంకులు కొడుకులన్న మాటను వివరిస్తూ ఈయన అమృతమంటే ‘వారుణి’ (మద్యము) అన్న అర్థాన్నే అభిమానించి, భావవల్లిని కొనసాగించాడు. అమృతమృగాంక పదప్రయోజనం చంద్రోదయ పానగోష్ఠ్యాదుల ఉపభోగసూచన నిమిత్తమని, లక్ష్మి సకలజనాభిలాషభూమి అని చెప్పటం వల్ల శబ్దార్థాలు గుణీభావాన్ని పొందాయని ఆయన అభిప్రాయం. ఆయన గ్రహించిన పాఠం ఇది:
లచ్ఛీ ధూఆ జాయా(?మా)దుఓ హరీ తహ ఘరల్లియా గంగా
అమయ-మియంకా ఇ సుయా అహో! కుడుంబ మహోఅహిణో.
సాహిత్యచరిత్రకారులు, విమర్శకులు గుర్తింపని విషయం కాబట్టి ఈ గాథకు గల వ్యాఖ్యానభేదాల విషయాన్ని ఇంత వివరంగా వ్రాయవలసివచ్చింది. ఈ నైపథ్యానుసంజనతో ఇప్పుడు తెలుగు అనువాదాన్ని పరిశీలిద్దాము.
గాథను తెలుగులోనికి అనువదించేటప్పుడు కవి ‘అమయ-మియంకా’ అన్న దళంలో ఉన్న చిక్కును గుర్తించాడు. ‘అమృతమృగాంకు లాత్మజులు’, ‘మృగాం, కామృతు లాత్మజుల్’ అనటం సాధ్యం కాదని గ్రహించాడు. అమృతమంటే వారుణి (మద్యము) అని ఉన్న అర్థాన్ని గ్రహిస్తే మరింత చిక్కవుతుంది. అందుకే, ‘ఆరయ జీవనం బమృతము’ అంటూ మొదలుపెట్టి ఆ ఇబ్బందిని వదిలించుకొనే ప్రయత్నం చేశాడు.
ఆరయ జీవనం బమృత, మల్లుఁడు విష్ణువు, సొమ్ము లన్నియున్
సారపు రత్నముల్, కొడుకు చంద్రుఁడు, కూఁతురు లక్ష్మి, యాలు భా
గీరథి – తా సముద్రుఁ డని కీర్తన సేయుదు రెల్లవారు నా
క్షీరపయోధి నన్యులకుఁ జెల్లునె యిట్లు సమస్తభాగ్యముల్
అని ఎట్లాగో పూర్తిచేశాడు. విశేష్య విశేషణాల క్రమాన్ని పాటించాడు. జీవనం అమృతం, అల్లుడు విష్ణువు, సొమ్ములు రత్నాలు, కొడుకు చంద్రుడు, కూతురు లక్ష్మి, భార్య గంగ, అతను సముద్రుడు – అని చెప్పాడు. అయితే, దేని తర్వాత ఏది రావాలో చూసుకోలేదు. పదార్థాలను గుదిగుచ్చటమే కాని, వాటి సందర్భవిదర్భత ఆయన దృష్టిలో లేదు. అమృత-మృగాంకులు అన్న చిక్కుముడిని విడతీయటానికి ‘జీవనం బమృతము’ అన్నాడే కాని, జీవనం అమృతం ఎలా అవుతుంది? అని ఆలోచించలేదు. ‘జీవ = ప్రాణధారణే’ అని ధాత్వర్థం. సముద్రుని ప్రాణధారణ (లేదా, జీవనోపాయం) అమృతం ద్వారా జరుగుతుందని చెప్పటంలో ఔచిత్యధారణ లేదు. పైగా జీవనం, అమృతం పర్యాయపదాలు. ‘పయః కీలాల మమృతం జీవనం భువనం వనమ్’ అని అమరకోశం. ‘న మ్రియన్తే అనేన’ = దీనిచే మృత్యువును పొందరు కాబట్టి అమృతం. ‘జీవన్తి అనేన’ = దీనితో ప్రాణధారణ చేసుకొంటారు కనుక జీవనం. రూపకాతిశయోక్తిగా పరిగణించి, ఈ సముద్రునియందలి జలము అమృతము – అని చెప్పినా అది పద్యశిల్పంలో ఇమడదు. జీవనమంటే నీరు, జీవితము అని ఉన్న అర్థభేదాలను ఆశ్రయించిన వింత శ్లేషను కల్పింపబోయి, అమృతశబ్దాన్ని తెచ్చిపెట్టుకొని, కవి లేనిపోని తత్తరపాటుకు లోనైనట్లు కనబడుతుంది. అమృతశబ్దాన్ని కలుపుకొనకపోతే ఆ ఇబ్బంది ఉండేది కాదు. ‘జీవన మెప్పుడున్ సుకవిసేవ్యము’ అన్న మంచన కేయూరబాహు చరిత్ర పద్యాన్ని (1-1) చూడండి. జీవనము = జీవితము, సుకవులచే = సత్కవిప్రవరులచే, సేవ్యము = సేవింపదగినది; జీవనము = నీరు, సుకవులచే = జలపక్షులచే, సేవ్యము = ఆశ్రయింపదగినది అని ప్రకృతాప్రకృతశ్లేష. దీనినే రామరాజభూషణుడు వసుచరిత్రలో శుక్తిమతీ కోలాహలుల కథలో ‘జీవన మెల్ల సత్కవినిషేవితము’ (2-105) అని యథాతథంగా అనువదించుకొన్నాడు. ఆ ప్రయోగాల నీడలో కవి ఇక్కడ ‘అమృత’శబ్దాన్ని కలుపుకొనటం వల్ల అన్వయదోషం సంభవించింది. పోనీ, ‘పయః క్షీరం పయోఽమ్బు చ’ అని ఉన్నది కాబట్టి పాలకడలిలోని పాలు అమృతము అని అన్వయిద్దామా? అంటే, అదీ సాధ్యం కాదు. ఎట్లా చూసినా ‘జీవనం బమృతము’ అన్న రూపణ అసంతృప్తికరంగానే ఉన్నది. ఆదిలోనే హంసపాదు పెట్టవలసి వచ్చింది.
మూలంలో మొదట కూతురును చెప్పి, తర్వాత ఆమె భర్తను చెప్పటం జరిగింది. అదే సరైన క్రమం. కూతురు సర్వజనాభిలషణీయ అయిన ఐశ్వర్యస్థానీయ కాబట్టి ఆమెకు స్పృహణీయత వల్ల ప్రథమాశ్రయణీయత ప్రతిపాదింపబడింది. అనువాదకర్తకు ఆ విషయం తోచలేదు. మొదట జీవనం, ఆ తర్వాత అల్లుడు విష్ణువు అని చెబుతున్నాడు. ‘జామాత హరి’ అన్నప్పుడు లక్ష్మియందు సుతోదయసూచన, హరియందు శరణాగతార్తిహరణం సార్థకంగా ఉన్నాయి. విష్ణుశబ్దప్రయోగం ఆ విధంగా ప్రకాశ్యార్థప్రకాశనకు ఉపకరింపలేదు. అందువల్ల శబ్దసందర్భం వట్టిపోయింది.
సముద్రవైభవవర్ణనార్థం ఆ తర్వాత ‘సొమ్ము లన్నియున్, సారపు రత్నముల్’ అని ప్రకటింపబడింది. సొమ్ములు + అన్నియున్ = సర్వసంపదలు, సారపు రత్నముల్ = సారవంతములైన (లేదా, శ్రేష్ఠములైన) మణిమాణిక్యాదులు అనటం నిష్ప్రయోజకం. సముద్రం రత్నగర్భ అయినప్పటికీ సముద్రుని సొమ్ములన్నీ రత్నాలే అనటం అసందర్భమైన అత్యుక్తి. సొమ్ములు ‘అన్నియున్’ అనటం వలన వచ్చిన చిక్కు ఇది. పైగా రత్నాలు ‘సారవంతాలు’ కావటం అసలే నిస్సారం. సర్వసంపదలు రత్నాలే అయినప్పుడు లక్ష్మిని ఎందుకు ప్రవేశపెట్టినట్లు? అందువల్ల, మూలంలో లేని ‘సొమ్ము లన్నియున్, సారపు రత్నముల్’ అన్న అధ్యారోపం కేవలం పాదపూరణకే గాని పద్యకల్పనకు ఉపకరింపదని స్పష్టం.
‘కొడుకు చంద్రుఁడు, కూఁతురు లక్ష్మి’ అని వెంటవెంటనే అన్నప్పుడు క్రమం తప్పింది. దేవదానవులు క్షీరసముద్రాన్ని మథించినప్పుడు ముందు చంద్రుడు, ఆ తర్వాత లక్ష్మి ఉదయించారు. మూలంలో వారిని వేర్వేరు చోట్ల నిరూపించినందున ఈ అగ్రణీత్వలోపం కలుగలేదు.
‘గృహిణీ గఙ్గా’ అన్న దళాన్ని ‘ఆలు భాగీరథి’ అని తెనిగించటమూ సరికాదు. భగీరథుడు పరమశివుని జటాజూటం నుంచి గంగను నేలకు తెచ్చిన తర్వాత గంగ భాగీరథి అయింది. ఆ భాగీరథి త్రివేణీసంగమం వద్ద సముద్రంలో కలిసింది. అందువల్ల భార్యాత్వకల్పన. ఆ భాగీరథీ శబ్దాన్ని ‘క్షీరపయోధి’కి అన్వయించటం స్వసమర్థకమైన పదప్రయోగం కాదు. ప్రసిద్ధివిరోధం వల్ల ఔచిత్యభంగం కలిగింది.
‘తా సముద్రుఁ డని కీర్తన సేయుదు రెల్లవారు నా, క్షీరపయోధి’ని అన్న భావం మూలంలో లేదు. అయినా స్థితగతిచింతనగా సరిపెట్టుకోవచ్చును. ‘సమన్తాత్ ముదం రాతీతి సముద్రః’ అని వ్యుత్పత్తి. అన్ని విధాలా సంతోషాన్ని కలిగించేవాడు కాబట్టి సముద్రు డన్నమాట. అంతటితో ఆపితే బాగుండేది. ‘తా సముద్రుఁ డని కీర్తన సేయుదు రెల్లవారు నా, క్షీరపయోధి’ని అని వ్రాశాడు. అసంగతమైన వాచకభేదాన్ని తెచ్చిపెట్టాడు. మూలంలో కవిప్రౌఢోక్తిసిద్ధమైన అర్థశక్తిమూల వస్తుకృతాలంకారధ్వనిని అనువాదంలో కవినిబద్ధ వక్తృప్రౌఢోక్తిసిద్ధమైన అర్థశక్తిమూల వస్తుకృతాలంకారధ్వనిగా మార్చాలనుకొన్నాడు. ‘అన్యులకుఁ జెల్లునె యిట్లు సమస్తభాగ్యముల్’ అని మళ్ళీ అర్ధాంతరన్యాసతో సమర్థింపబోయాడు. వస్తుకృతాలంకారధ్వని ఇందువల్ల భగ్నమవుతున్నదని విస్మరించాడు.
అసలు సంగతి: గాథాసప్తశతిలో ఈ గాథ లేదు. ధ్వన్యాలోకం, వ్యక్తివివేకం, కల్పలతావివేకం అన్న మూడు లక్షణగ్రంథాలలో ఉన్నది. ‘గాహారయణకోస’లో ఉన్నది. కవి వ్యక్తివివేకాన్ని చూచివుంటే ఈ అస్తవ్యస్తకల్పనకు ఉపక్రమించేవాడు కాడు. జైనపండితకృతులు, అంతగా ప్రచారంలో లేనివి అయిన కల్పలతావివేకం, గాహారయణకోస అందుబాటులోకి వచ్చి ఉండవు. ప్రసిద్ధమైన ధ్వన్యాలోకాన్ని చూసి ఎంతో కొంత తెలుగుచేయాలని ఉత్సాహపడ్డాడు. ఒకవేళ ఏదో గాథాసప్తశతి ప్రతిలో దొరికినా అసమర్థానువాదమే అవుతుంది కాని కవిప్రశస్తికి దోహదం కాదు.
ఇది మహాకవి శ్రీనాథుని రచన అంటే నమ్మటం కష్టం. ఈ అరగొర పలుకుబడితో ఒక పద్యాన్ని శాలివాహన సప్తశతిలో కిట్టించి దానితో పెదకోమటి వేమారెడ్డిని, జగదేకవిద్వాంసుడు వామన భట్టబాణుని, కొలువులోని పండితులను, పాఠకులను, కాలాంతరంలోని తన కవిత్వాభిమానులను మెప్పించాలనుకోవటం సాధ్యమేనా? సిద్ధసాధనుడై కావ్యరచనకు పూనుకొన్న ఆ కారణజన్ముని నోట ఇటువంటి అవాచ్యాలు వస్తాయా? ఎన్నటికీ రావు.
ఎవరో సామాన్యకవి ఏ సందర్భవశాననో ఏ చాటువుగానో చెప్పిన పద్యం ఇది. తెలుగులోని లక్షణగ్రంథాలు సైతం ఉదాహరింపలేదు. ప్రబంధరత్నావళిలో ప్రభాకరశాస్త్రిగారన్నట్లు, ‘గ్రంథనామము, కర్తనామము తెలియరానివి’ అన్న శ్రేణిలో ఉండటమే సమంజసం. ఇది శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదై ఉండదు.
5. ప్రబంధమణిభూషణము లోని శాలివాహన సప్తశతి పద్యం
ఇంచిన బాలకేళిఁ బరమేశ్వరు జూటకిరీటకోటిఁ గీ
లించిన చంద్రరేఖఁ గబళింప మదిం దిలకించి గౌరి లీ
లాంచితఫాలవీథి వికటాకృతిగా గదియించి ముద్దులన్
మించి నటించు దంతిముఖునిం బ్రణుతించెద నిష్టసిద్ధికిన్.
ఈ పద్యాన్ని గురించి మాన్యులు శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు 1980 భారతి జూన్ సంచిక (పు. 65-67 లు) లో ఈ విధంగా వ్రాశారు: ‘కవిరాజు ఆన్ధ్రీకరణ నేడు లుప్తమైనను, మనకు ఐదు పద్యములు మాత్రము అన్యత్రా భద్రపరుపబడినవి. లభించిన పద్యములలో ఒకటి అవతారికలోని వినాయకస్తుతి. ఆన్ధ్రదేశములో ప్రచలితమైన ‘గాథాసప్తశతీ పాఠమును అనుసరించియే శ్రీనాథకవి తెనిగింపు జరిగినది. అవతారికలోని పద్యమును శ్రీకవిగారు ‘ప్రబన్ధమణి భూషణం’ కూడ ఉటంకించుట గమనార్హము. దీనిని శ్రీకవిగారే గుర్తించుట చేత, శ్రీవారి వద్ద దీని తాళపత్ర ప్రతి (అసమగ్రముగ) కలదని విశ్వసింపవచ్చును. ఆ విఘ్నేశ్వరప్రార్థన ఇది.’ — అని, పై పద్యపాఠాన్ని ఇచ్చారు. సాయిబాబా గారి ఈ వ్యాఖ్యలకు ఆధారం ప్రబంధమణిభూషణము 1971 నాటి ద్వితీయముద్రణ సంపుటం పీఠికలో శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు పై పద్యాన్ని ‘శ్రీనాథుడు : గాథాసప్తశతి’ అన్న శీర్షిక క్రింద ఉదాహరించి ఉండటమే తప్ప వేరేమీ లేదు.
దీనిని పురస్కరించికొని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ‘శాలివాహన సప్తశతి: క్రీడాభిరామ పద్యస్థితి’ అన్న వ్యాసంలో ఈ విధంగా వ్రాశారు:
‘ఇది ప్రబంధమణిభూషణమునకు ఆధారమైన ప్రబంధసారశిరోమణియందు కలదు. కాని పద్యమునకు మూలభూతమైన గాథ కానరాదు. అంతేకాదు. పద్యమునందు గాథాలక్షణమును కానరాదు. ధ్వని గాథాలక్షణము. పద్యము ధ్వనిప్రధానము కాదు. కల్పనాత్మకము. జయవల్లభసంకలితమైన ‘వజ్జాలగ్గ’ యందు ఒక గాథ కలదు. అది:
రఇకలహకువియగోరీచలణాహయణివడిఏ జడాజూడే
నివడంతచందరుంభణవిలోలహత్థం హరం నమహ.
(రతికలహకుపితగౌరీచరణాహతనిపతితే జటాజూటే
నిపతచ్చన్ద్రరోధనవిలోలహస్తం హరం నమత.)
ఇది నిడుదవోలు వేంకటరావుగారికి భ్రాంతి గొలిపినదో, ఇతరత్ర మఱొక గాథ వారికి లభ్యమైనదో అనవగాహము. వారు పద్యమును నిర్దేశించిరే గాని, మూలగాథను మూదలింపలేదు. అది తెలియువఱకు ఇది సప్తశతి పద్యమనుట ఇదమిత్థము కాదు.’
ఇంతకీ నిడుదవోలు వేంకటరావు గారికి ఆధారమైన వాక్యం శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 1911లో ప్రకటించిన ప్రబంధమణిభూషణము యొక్క పీఠికలో ఉన్నది. అందులో వారు — ‘౩౧ వ పద్యము శ్రీనాథుని శైలి గలది’ అని ఒక్క వాక్యాన్ని మాత్రమే వ్రాశారు. ‘శ్రీనాథుని శైలి గలది’ అన్న ఆ ఒక్క నిర్దేశాన్ని బట్టి నిడుదవోలు వారు ఆ పద్యం శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదని ఊహించారన్నమాట. నిడుదవోలు వారి మాటను పట్టుకొని సాయిబాబా గారు అది వాస్తవమని నమ్మగా, శ్రీరామమూర్తిగారు ‘ఇదమిత్థము కాదు’ అని సరిగానే అభిప్రాయపడ్డారు.
జయవల్లభుని వజ్జాలగ్గ లోని గాథ పరమశివుని సన్నుతి. అది పై పద్యంలోని విఘ్నేశ్వర స్తుతికి మూలమయ్యే అవకాశం లేదు. దానిని గురించిన చర్చ అసంగతం.
పద్యార్థాన్ని పరిశీలిద్దాము. కవి అభీష్టసిద్ధికోసం దంతిముఖుడైన విఘ్నేశ్వరుని సన్నుతిస్తున్నాడు. ఇంచిన = చూచేవారి మనస్సులకు హత్తుకొనిపోయే, బాలకేళిన్ = చిన్ననాటి కేళీవిలాసముగా, పరమేశ్వరు = పరమశివునియొక్క, జూటకిరీటకోటిన్ – జూట = జడముడి అనెడి, కిరీట = శేఖరముయొక్క, కోటిన్ = అగ్రభాగమునందు, కీలించిన = తగిలించికొన్న (అలంకరించికొన్న), చంద్రరేఖన్ = బాలచంద్రుని, కబళింపన్ = ఉండ్రాయి లాగానో వెన్నముద్ద లాగానో అరచేతిలోకి తీసికొని మింగివేయాలని, మదిన్ + తిలకించి = ఇక్కడ ‘తిలకించి’ అని ఉండటం అర్థరహితం. ‘మదిం దమకించి’ అని దిద్దుకోవాలి. మదిన్ = మనస్సులో, తమకించి = మోహమునొంది, గౌరి = తల్లి పార్వతీదేవియొక్క, లీలాంచితఫాలవీథి – లీలా = దివ్యశోభతో, అంచిత = ఒప్పిదమైన, ఫాల = నుదురు అనెడు, వీథి = వశ్యగతి (చూచినంతనే స్పృశింపవలెననిపించే విశాలమైన చోటు), వికటాకృతి కాన్ – వికట = వంకర, ఆకృతి = రూపు, కాన్ = కాగా, కదియించి = దగ్గరకు చేరి, ముద్దులన్ = పరిపరి ముద్దులతో, మించి = ఆనందము అతిశయించి, నటించు = క్రీడించు, దంతిముఖునిన్ = గజముఖుడైన విఘ్నేశ్వరుని, అభీష్టసిద్ధికిన్ = కోరికలు నెరవేరుట కొరకై, ప్రణుతించెదన్ = పరిశుద్ధమైన వాక్కుతో సన్నుతిస్తాను – అని.
విఘ్నేశ్వరునికి బాలకేళీచాపల్యం వల్ల పరమశివుడు తన జటాజూటంలో అలంకరించికొన్న చంద్రరేఖను మింగివేయాలనే చిలిపి కోరిక కలిగింది. ‘కబళించు’ ధాతుప్రయోగం వల్ల అది భక్ష్యవిశేషమన్న భ్రాంతిని గొలిపిందని ప్రతీయమానం. భ్రాంతిజన్యమైన తమకము కలిగినందువల్ల అది భ్రాంతిమదలంకారం అయింది. ఆ ఔత్సుక్యంతో ముఖాన్ని పైకెత్తి చంద్రరేఖను సమీపింపబోయాడు. ఆ ఉత్తుంగభంగిమ వల్ల తల్లి పార్వతి నెన్నుదురు చెంతకు వచ్చాడు. ఆమె అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభిత. అష్టమి నాటి చంద్రుని కళ వంటి కళతో ప్రకాశిస్తున్న లలాటప్రదేశం కలిగినది. ఆ లలాటప్రదేశం వికటాకృతిమంతమై చంద్రరేఖను పోలి ఉండటం కానవచ్చింది. ఆమె నుదురు చంద్రరేఖ వలెనే వంకతేరి ఉండటాన్ని చూశాడన్నమాట. నుదురు వర్ణింపబడుతున్నది కనుక ఉపమేయం. ఆ నుదుటికి పోలిక అయిన చంద్రరేఖ ఉపమానం. వికటాకృతి (వంకర రూపు) ఆ రెండింటి సమానధర్మం. అయితే ఉపమానోపమేయాల సాదృశ్యాన్ని రూఢిపరిచే ఔపమ్యవాచకమైన పదమేదీ చెప్పబడలేదు. చంద్రరేఖను చూచిన తర్వాత కనబడిన నుదుటిని చంద్రరేఖతోడి సామ్యం వల్ల ఆదరించాడు కాబట్టి ఆ భ్రాంతి అన్యోన్యవిషయకం అవుతున్నది. భ్రాంతికి మూలమైన ఔపమ్యం అనుప్రాణితంగా ఉండిపోయింది. ప్రాధాన్యవివక్ష భ్రాంతిమత్తకే గాని ఔపమ్యానికి కాదు. గుణసామ్యం వలన నుదురు చంద్రరేఖను పోలి ఉన్నప్పటికీ అవి రెండూ ఏకాకారములుగా భాసించలేదు. నుదుటిని చూచినంతనే చంద్రరేఖను మర్చిపోయాడు. అందువల్ల ఇది సామాన్యము అనే అలంకారం కాదు. సామాన్యమైతే రెండూ ఒక్కటై, అవి వేర్వేరు కావని అనిపించాలి. నుదురు చంద్రరేఖను పోలి ఉన్నందున నుదుటిని ముద్దాడటం జరిగింది. అంతే కాని – నుదురు ఉత్కృష్టవస్తువని, దానిముందు చంద్రరేఖ అస్వీకారయోగ్యమైన నికృష్టవస్తువని సూచన ఇందులో లేదు. అందువల్ల ఇది తద్గుణము అనే పేరుగల అలంకారం కాదు. ఫాలప్రాబల్యం వల్ల అల్పవస్తువైన చంద్రరేఖ అణగారటమూ జరగలేదు. చంద్రరేఖకు వస్త్వంతరమీలనం సంభావింపబడలేదు కనుక ఇది మీలనాలంకారం కాదు. ఫాలదర్శనవేళ చంద్రరేఖయొక్క స్మరణమే లేదు. అందువల్ల స్మరణాలంకారం సిద్ధింపదు. చంద్రరేఖకు సదృశమైన ఫాలతలమందు తాదాత్మ్యం ఏర్పడి, ఆ తాదాత్మ్యం సాదృశ్యానికి ప్రయోజ్యమైంది. అది భ్రాంత్యుపస్కృతమని పరిణమింపజేయటానికి ‘కబళించు’ అన్న ధాతువును ప్రయోగించాడు. చూచినది తల్లి లోకోత్తరశోభాయమానమైన మాతృఫాలస్థలిని. దానిని ముద్దులలో ముంచెత్తటం మొదలుపెట్టాడు. తత్ఫలంగా ఆయనకు ఇష్టార్థసిద్ధి కలిగింది. ఏ ఇష్టార్థసాధన వలన కేవలానుభవానందరసాన్ని పొందాడో, బాలక్రీడావినోది అయిన ఆ గజముఖుని ఇష్టార్థసిద్ధి కోసం సన్నుతిస్తాను అని తాత్పర్యం.
పరిష్కృతపాఠం ఈ విధంగా ఉంటుంది:
ఇంచిన బాలకేళిఁ బరమేశ్వరు జూటకిరీటకోటిఁ గీ
లించిన చంద్రరేఖఁ గబళింప మదిం దమకించి, గౌరి లీ
లాంచితఫాలవీథి వికటాకృతిగాఁ గదియించి, ముద్దులన్
మించి నటించు దంతిముఖునిం బ్రణుతించెద నిష్టసిద్ధికిన్.
ఇది శ్రీ మానవల్లి రామకృష్ణకవి 1911లో ప్రకటించిన ప్రబంధమణిభూషణములోని 31వ పద్యం. వారి సంధానానికి మూలమైన ప్రబంధసారశిరోమణిలో ఈ పద్యం ఉన్నది. అందులోనూ దీని సంఖ్య ముప్ఫైఒకటే. ఈ ప్రబంధసారశిరోమణి తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీ మహలు గ్రంథాలయంలోనిది. సరస్వతీ మహలు గ్రంథాలయంలో ప్రబంధసారము అనే వేరొక సంకలనం ప్రతి కూడా ఉన్నది. ఆ రెండింటినుంచి తమకు నచ్చిన పద్యాలను స్వీకరించి, ఆ రెండింటిలోనూ లేని మరికొన్ని పద్యాలను చేర్చి రామకృష్ణకవిగారు దానిని ప్రబంధమణిభూషణము అన్న పేరితో ఒక వినూత్నసంకలనాన్ని అచ్చువేశారు. తంజావూరులో ఉన్న వ్రాతప్రతుల సంగతిని వారు తమ ప్రబంధమణిభూషణము పీఠికలో చెప్పలేదు. ప్రబంధసారశిరోమణిని మాత్రం 1985లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు పరిష్కరించి ఆంధ్ర విశ్వవిద్యాలయం పక్షాన అచ్చువేశారు. అందులో వారు ముద్రించిన పాఠం ఇది:
ఇంచిన బాలకేళిఁ బరమేశ్వరు జూటకిరీటకోటిఁ గీ
లించిన చంద్రరేఖఁ గబళించి మదిం దిలకించి వేగ లీ
లాంచితఫాలవీథి వికటాకృతిగా గదియించి ముద్దులన్
మించి నటించు దంతిముఖునిం బ్రణుతించెద నిష్టసిద్ధికిన్.
అని. ఇందులోని ‘కబళించి’ అన్న భూతకాలికార్థానికి పద్యంలో అసలు తావే లేదు. చంద్రరేఖను కబళించిన తర్వాత ఫాలదర్శనాకాంక్ష ఎందుకు కలుగుతుంది? ‘మదిం దిలకించి’ అనటమూ అర్థరహితమే. మదిలో దేనిని తిలకించినట్లు? ‘గౌరి’ అని ఉండవలసిన చోట శ్రీరామమూర్తి గారి పాఠంలో ‘వేగ’ అని ఉన్నందువల్ల దంతిముఖుని ఔత్సుక్యం, తహతహపాటు వెల్లడవుతున్నాయి కాని, ఆ లీలాంచితఫాలవీథి ఎవరిదో? అన్న ఆకాంక్షకు సమాధానంలేదు. ప్రబంధసారశిరోమణి వ్రాతప్రతులలో దీనికి ‘కాళి’ అన్న పాఠాంతరం కూడా ఉన్నది. అది సమంజసమే అయినప్పటికీ, తమకు నచ్చనందువల్ల కాబోలు, రామకృష్ణకవిగారు ‘గౌరి’ అని మార్చినట్లున్నది. ఇష్టం లేనివారు ఆ మార్పును తొలగించి వ్రాతప్రతిలో ఉన్న ‘కాళి’ అన్న పాఠాన్నే గ్రహింపవచ్చును.
ప్రబంధమణిభూషణము పీఠికలో ‘శ్రీనాథ శైలి గలది’ అని మానవల్లి రామకృష్ణకవిగారన్న ఒక్క మాట – ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లు ఈ పద్యం శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదన్నంతదాకా తీగసాగిందే తప్పించి, అంతకంటె ప్రత్యక్షప్రమాణం ఏదీ లేదు. అందువల్ల శ్రీనాథునిది కాదు.
ఇప్పటికే వ్యాసం విస్తరించి ఉన్నందున అది శ్రీనాథుని పద్యం ఎందుకు కాదో పాఠకులు తమ రాసిక్యనికషపాషాణపట్టిక మీద ఎలాగూ గీచి చూడక మానరు కదా అని ఇక్కడితో శిల్పవిమర్శను ఈ మిథ్యాత్వప్రతిపాదనతో విడిచివేస్తున్నాను.
6. ప్రబంధమణిభూషణములోని మరొక సప్తశతి పద్యం
శ్రీ రామకృష్ణకవిగారు ప్రబంధమణిభూషణములోని 671-వ సంఖ్య గల ఇంకొక పద్యాన్ని కూడా ‘సప్తశతి లోనిది’ అని నిర్దేశించారు. ఆ పద్యం ఇది:
భాగ్యవతులు మున్నుఁ బ్రాణేశ్వరునిఁ జూచి
వడఁకువారు నూర్పు విడుచువారుఁ
బులకలెత్తువారుఁ బోలంగ ననుఁ బోటి
తన్ను మఱచునదియుఁ దడవఁ గలదె.
ఇది ప్రబంధమణిభూషణంలో తప్పించి మరెక్కడా లేదు. ప్రబంధమణిభూషణానికి మూలమైన తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని ప్రబంధసారశిరోమణి, ప్రబంధసారము అన్న వ్రాతప్రతులు రెండింటిలోనూ లేదు. ఇప్పటి వరకు లభించిన లక్షణగ్రంథాలలోని ఉదాహరణలలో లేదు. ఐతే గాథాసప్తశతిలో దీనికి మూలం ఉన్నదని గుర్తించి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ‘శాలివాహన సప్తశతి: క్రీడాభిరామ పద్యస్థితి’ అన్న వ్యాసంలో ఈ విధంగా వ్రాశారు:
‘ణిసాసుక్కమ్పిఅపులఇఏహిఁ జాణన్తి ణచ్చిఉం ధణ్ణా
అమ్హారిసీహిఁ దిట్ఠే పిఅమ్మి అప్పా వి వీసరిఓ. 61గా. 1 శ.
నిశ్శ్వాసోత్కమ్పితపులకితై ర్జానన్తి నర్తితుం ధన్యాః
అస్మాదృశీభి ర్దృష్టే ప్రియే ఆత్మాపి విస్మృతః. (సంస్కృతచ్ఛాయ)
ధన్యురాండ్రు ప్రియుని చూడగానే నిట్టూర్పులు విడిచి, కంపము చెంది, పులకోద్గమము నంది నర్తింపగలరు. నా వంటిది ప్రియుని చూచి తన్ను దాను మఱచిపోవునని తాత్పర్యము. వారు ధన్యురాండ్రు. తాను ధన్యురాలు కానని వాచ్యార్థము. వారికంటె తానే ధన్యురాలనని వ్యంగ్యార్థము.’
ముందుగా ఇందులోని అచ్చుతప్పులను సవరించుకోవాలి. గాథ 4వ శతకంలోని 61వది. మొదటి పాదంలో ‘ణిసాసుక్కమ్పిఅ’ అని ఉన్నదానిని ‘ణీసాసుక్కమ్పిఅ’ అని దిద్దుకోవాలి.
గాథను చదవగానే స్ఫురించే మొట్టమొదటి సంగతి: నాయిక నాట్యకళాకోవిదురాలు. నాయకుడు ధీరలలితుడు. ఆయన యెదుట సుఖదుఃఖాదుల అనుభవాన్ని సాత్త్వికాభినయముఖంగా ప్రదర్శింపగల నర్తకీమణులు పెక్కుమంది ఉన్నారు. వారందరూ ఆయనయందు మరులు గొన్నవారు. ఆయన మెప్పునుకోరి అభినయిస్తున్నారు. ‘నిఃశ్వాసము’ ప్రియవియోగావస్థలో ప్రాణవాయుబహిర్గమనపూర్వకంగా ప్రదర్శింపదగినది. ముఖము వైవర్ణ్యాన్ని చెందటం, గొంతు డగ్గుత్తికను చెందటం, పెదవులు తెల్లబారటం దాని పరిణామాలు. నాట్యశాస్త్రపరిభాషలో ‘ప్రళయము’ అనిపేరు. ప్రకృతిభావం లయించినప్పుడు రత్యాదిభావానుగుణంగా నర్తించేందుకు మనస్సుకు అనన్యమైన ఏకాగ్రత, సమాధిభావం కావాలి. ‘ఉత్కంపితము’ అన్నది నాయికకు అనురాగము, అధికద్వేషము, శ్రమము మొదలైన భావాల అతిశాయిత మూలాన నిలువెల్లా వణకు జనించినప్పటి స్థితి. ‘పులకితము’ అంటే హర్షము, అద్భుతము మొదలైన భావాలు ఉదయించినప్పుడు గగుర్పాటు కలిగి మేనిపైని వెంట్రుకలు నారుపోసినట్లు నిక్కబొడుచుకొన్న పారవశ్యపు దశ. ఇవి సాత్త్వికభావాలు. నాట్యప్రవీణలు కాబట్టి వారి దృష్టి ఆయా రసభావాలను సహృదయుడైన నాయకుడు తన్మయుడై భావించి బ్రహ్మానందసదృశమైన మహానందాన్ని పొందేట్లు ప్రదర్శనను కొనసాగించటం పైని నిలిచి మాత్రమే ఉంటుంది. రసభావం సహృదయనిష్ఠమే గాని నర్తకీ హృదయనిష్ఠం కాదు. అంతంలో నాయకుని మెప్పు వారికి ఆకాంక్షితం. వారు ధన్యురాండ్రు.
తానో? నాయకుని సన్నిధిరూపమైన పెన్నిధి సమకూడినంతనే పారవశ్యంతో మైమరచిపోతుంది. ఆమె మనసు తెలిసిన ప్రేమస్వరూపుడు ఆయన. ఆమెను దగ్గరకు తీసికొంటాడు. ఆపై ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు. కళలన్నీ కరిగిపోతాయి. శరీరము, మనస్సు స్వాధీనంలో ఉండవు. సర్వావస్థలలోనూ అనుస్యూతమై నిలిచి ఉండే చైతన్యముయొక్క స్ఫూర్తి ఉండదు.
నాయకుని ప్రేమామృతంలో తడిసి ముద్దవుతున్న తనకు అన్యనర్తకీమణుల వలె లౌకికీ నర్తనదృష్టి ఉండదని ఆమెకు స్వాతిశయం. వారు ధన్యులు, తాను ధన్యురాలను కాను అని ఆత్మనిరాసపూర్వకంగా ప్రసంగించటంలో నాయకుని ప్రణయపీయూషాన్ని ఆసాంతం గ్రోలి, ఆ అభిజ్ఞానం కలిగిన ఆమె వ్యంగ్యవైభవమంతా ఇమిడి ఉన్నది. తాను ఉపమేయం. అన్యకాంతలను పోలికకు తెచ్చింది. నాయకునికి సన్నిధానవర్తినులై ఉండటం వారికి, తనకు సాధర్మ్యం. ప్రణయగాఢతలో వారికి, తనకు భేదం ఉన్నది. ఆ భేదప్రధానమైన సాధర్మ్యం మూలాన వ్యతిరేకాలంకారం ప్రతిపాదింపబడుతున్నది. అర్థాంతరసంక్రమితంగా ఆమె గర్వాతిశయం ధ్వనిస్తున్నది. వ్యతిరేకం వ్యంగ్యమై ధ్వని అర్థాంతరసంక్రమితవాచ్యంగా ఉన్నందువల్ల సంసృష్ట్యలంకారమని వ్యాఖ్యాతలన్నారు. ఇది గాథాహృదయం.
తెలుగు అనువాదంలో ‘ణచ్చిఉం’ అన్న కీలకమైన స్ఫోరకశబ్దం లేదు. ‘వారు నర్తకీమణులు’ అని చెప్పకపోవటం వల్ల ‘మున్ను ప్రాణేశ్వరునిఁ జూచి వడఁకువారు, ఊర్పు విడుచువారు, పులకలెత్తువారు’ నాట్యవేళాగతంగా నర్తింపగలుగుతున్నారన్న స్ఫురణ లోపించింది. ప్రాణేశ్వరుని చూసి వణకటం, నిట్టూర్చటం, పులకించటం ‘నాట్యప్రదర్శనవేళ’ (‘ణచ్చిఉం’) అని ప్రాకరణికం ప్రతిపాదింపబడనందువల్ల వారు భాగ్యవతులు ఎందుకైనారో స్పష్టపడదు. ‘ణచ్చిఉం’ అన్న ధాత్వర్థం లేకపోవటం వల్ల ‘వణకటం’ సాత్త్వికభావమన్న స్ఫురణ కలుగదు. గాథలో నాయిక ‘వారు ధన్యురాండ్రు; నేను కాను’ అని వ్యతిరేకాన్వయముఖంగా స్వాతిశయాన్ని వ్యంజింపజేసింది. తెలుగులో నాయిక అనావశ్యకంగా పోలంగన్ = వారితో పోల్చుకోవటానికి, ననుబోటి = నా వంటిది, తడవగలదె = ఆ ధన్యత్వాన్ని గురించి మాట్లాడగలదా? అని తనకు లేని వెలితిని వెలిపెట్టుకొన్నది. శ్రీనాథుని వంటి మహాకవి ఇటువంటి అనర్థకమైన అనువాదాన్ని చేసి ఉంటాడని ఊహించటం కష్టం.
ఈ పద్యాన్ని గురించి మరికొంత విమర్శను చూడగోరినవారు దయతో 2014 నాటి ఈమాట మార్చ్ సంచికలోని నా వ్యాసపు పిడియఫ్ ప్రతిలో 47 – 50 పుటలలో ఉన్న సమాచారాన్ని పరిశీలింప ప్రార్థిస్తున్నాను.
‘మున్ను ప్రాణేశ్వరునిఁ జూచి వడఁకువారు, ఊర్పు విడుచువారు, పులకలెత్తువారు’ అన్న వాక్యంలో ‘ణచ్చిఉం’ అన్న కీలకమైన ధాత్వర్థం లేనందున అది గాథాసప్తశతికి అనువాదం కాదనుకొన్నాము. అంతే కాక ‘ప్రాణేశ్వరుని చూచి’ అన్న దళాన్ని బట్టి ఇది రుద్రటుని కావ్యాలంకారంలోని ఉదాహృతికి అనువాదమేమో అనిపిస్తున్నది. రుద్రటుని పాఠం ఇది:
నీససి ఉక్కంపపులఇఏహిఁ జాణన్తి పిచ్ఛిఉం ధన్నా
అమ్హారిసీణా దిట్ఠే పియమ్మి అప్పా వి వీసరఇ. (4-11)
నిశ్శ్వాసోత్కమ్పపులకితై ర్జానన్తి ప్రేక్షితుం ధన్యాః
అస్మాదృశీనాం దృష్టే ప్రియే ఆత్మాపి విస్మృతః. (ఛాయ.)
ఇది రుద్రటుడు తప్ప వేరెవ్వరు స్వీకరింపని పాఠం. ఇది ప్రాకృతంలో ‘జయకుమారుని రచన’ మని ఆయన పేర్కొన్నాడు. ఆమె స్వీయా నాయిక. ప్రగల్భురాలు. రతికర్మణి పణ్డితా – అని వ్యాఖ్యాతలు. నాయకుడు దక్షుడు. ఆమె మనసంతా నిండి ఉన్నాడు. అన్యకాంతలు ఆయనను చూసి నిఃశ్వాసోత్కంపితపులకాదులతో ఉండిపోగలరు. వారు ధన్యురాండ్రు. అత్యంతానురాగయోగం వల్ల తనకు ప్రియుని సన్నిధిలో శరీరం కరిగిపోతుంది. ఆత్మ కూడా మరపుకు వస్తుంది. వారెక్కడ? నేనెక్కడ? అని నిర్వ్యూఢవిలాసవిస్తారం – అన్నాడు.
తెలుగు కవి దీనినే అనువదించినట్లు స్పష్టం. ‘నీససి ఉక్కంపపులఇఏహిఁ జాణన్తి పిచ్ఛిఉం ధన్నా’ అన్నదానిని, ‘మున్ను ప్రాణేశ్వరునిఁ జూచి వడఁకువారు, ఊర్పు విడుచువారు, పులకలెత్తువారు’ అని వివరించాడు. గాథాసప్తశతి పాఠంతో ఈయనకు నిమిత్తం లేదు. ఏ సందర్భంలో ఏ కవి రుద్రటుని కావ్యాలంకారాన్ని ఎందుకు తెలుగుచేశాడో ఊహింపలేము. శ్రీనాథునిది మాత్రం కాదు.
ఈ క్రిందిది రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి అనువాదం:
పుణ్యవతులు వడఁకి పులకించి నిట్టూర్పు
లూర్చి నాట్యమాడుచుండఁగలరు;
మగనిఁ జూచినపుడు మావంటివారికి
నొడలఁ దెలివియైన నుండదమ్మ.
7. వర్ణనరత్నాకరము లోని శాలివాహన సప్తశతి పద్యం
ప్రముఖ కవి, విద్వత్పరిశోధకులు శ్రీ దాసరి లక్ష్మణస్వామి గారు 1930లో ప్రకటించిన వర్ణనరత్నాకరములో 4342-వ సంఖ్యతో ఈ క్రింది పద్యం ఉన్నది:
వేణికాభారమందుండు వెదురుటాకు
కలికికోడల యెబ్భంగిఁ గలిగె చెపుమ
పలికి పలికించుకొనుటయే ప్రాభవంబొ
అత్త నీ వీఁపు వెలిమిడి యంటుటేమి.
దీనికి మూలం గాథాసప్తశతి (7-74) లో ఉన్నది:
అఇదీహరాఇ బహుఏ సీసే దీసన్తి వంసవత్తాఇ
భణిఏ భణామి అత్తా తుమ్హాణం వి పాణ్డురా పుట్ఠీ.
అతిదీర్ఘాణి సర్వాః శీర్షే దృశ్యన్తే వంశపత్త్రాణి
భణితే భణామి శ్వశ్రు యుష్మాక మపి పాణ్డురం పృష్ఠమ్.(ఛాయ)
ఇది శ్రీనాథుని పద్యమని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ‘శాలివాహన సప్తశతి: క్రీడాభిరామ పద్యస్థితి’ అన్న వ్యాసంలో ప్రతిపాదించారు. అందువల్ల తథ్యమిథ్యావివేచన ఆవశ్యక మవుతున్నది.
గాథార్థం ఇది: అత్తగారు, కోడలు ఇద్దరూ గడుసువారే. భర్త ఇంటలేనివేళ కోడలు వెదురు పొదలోకి వెళ్ళి రహస్యప్రియుని కలిసి ఇంటికి తిరిగివచ్చింది. ఎంతో పొడవైన వెదురాకులు కొప్పులో ఇరుక్కొన్నాయి. నలుగురూ చూడకుండా ఇల్లు చేరే తొందరలో ఆమె కొప్పులో ఉన్న వెదురాకులను చూసుకోలేదు. అంత పొడవైన వెదురాకులు ఆమెకు వేనలిలో ఇమిడే అలంకారవస్తువులు కావు. అవి చెల్లాచెదురుగా ఉన్నాయి కాబోలు, విలాసార్థం ముచ్చటపడి తురుముకొన్నానని చెప్పటానికీ లేదు. అందువల్ల సంకేతస్థలానికి వెళ్ళి చేసివచ్చిన నిర్వాకం వెల్లడయినట్లే అయింది. ఆమెను చూడగానే సంగతిని పసిగట్టిన అత్తగారు నిలదీసింది. ‘చాలా పొడవైన వెదురాకులే కనబడుతున్నాయే, కొప్పులో’ అని ఎత్తిపొడిచింది. ‘అఇదీహరాఇ (అతిదీర్ఘాణి) వంసవత్తాఇం (వంశపత్త్రాణి) దీసన్తి (దృశ్యన్తే)’ అనటం వల్ల – ఆ వెదురాకులేవో గాలికి కొట్టుకొనివచ్చి పొరపాటున కొప్పులో ఇరుక్కొన్నాయని, పరధ్యానంలో చూసుకోలేదని కోడలు సరిపుచ్చుకోవటానికి అవకాశం ఇవ్వలేదన్నమాట. పుత్త్రవధువు వంశకుంజంలో అపరాధం చేసివచ్చిన ఉదంతానికి సంసూచకంగా ఆమె ప్రసంగం అమరింది.
కోడలికి ముగ్ధాత్వసంకోచమేమీ లేదు. తాను వెళ్ళిన తర్వాతనో, తనకంటె మునుపేనో అత్తగారు ఎక్కడికి వెళ్ళి వచ్చినదీ ఆమెకు స్వయంగానో, నలుగురూ చెప్పుకొంటుండటం వల్లనో తెలుసన్నమాట. ‘అత్తగారూ! తుమ్హాణఁ వి పాణ్డురా పుట్ఠీ – మీ వీపుకూడా తెల్లగా ఉన్నదే’ అన్నది. ‘వి’ = ‘కూడా’ అన్నమాటలో ఎత్తిపొడుపుకు ప్రతివచనం ఉన్నది. మీరు మాత్రం తక్కువేమీ తిన్నారు గనుకనా? అని. ‘భణిఏ భణామి’ అంటే, ‘మీరన్నారు కాబట్టి నేనంటున్నాను కాని, మీరు అనకపోతే నేనూ అనవలసివచ్చేది కాదు కదా’ అని. తెలివైనది కాబట్టి ‘తుమ్హాణం’ = ‘మీకు’ అని గౌరవార్థాన్ని ప్రయోగించింది. పెద్దరికపు మర్యాదను నిలుపుకోమన్న హెచ్చరిక అది. వీపుకు వెలిమిడి (ఈషత్పాండువర్ణపు ధూళి) అంటుకొని ఉన్నందున ఆమె ‘ఎక్కడికి’ వెళ్ళి వచ్చిందో తనకు తెలుసునని సూచించింది. పీతాంబరుని గాథాప్రకాశికా వ్యాఖ్యలో అయితే, ‘ఉపహాసవచనం న సోఢవ్య మితి’ అని కూడా ఉన్నది. ‘మీరిట్లాంటి మాటలంటే ఊరుకొనేది లేదు’ అని తెగవేసి చెప్పిందన్నమాట. ‘మర్యాదగానే అన్నది కాని, నిక్కచ్చిగా అన్నది’ – అని గంగాధర భట్టు టీక.
తెలుగు అనువాదంలో ‘అఇదీహరాఇ వంసవత్తాఇ’ అన్న బహువచనార్థం తొలగిపోయింది. అందువల్ల కవి మూలంలోని పదప్రయోజనం పట్ల దృష్టి సారింపలేదన్నది స్పష్టం. ‘సీసే’ అన్నది ‘వేణికాభారమందుండు’ అని తెనిగింపబడింది. ‘భణిఏ భణామి = మీరన్నారు కాబట్టి నేనంటున్నాను’ అన్న పలుకుబడిని మార్చి, ‘పలికి పలికించుకొనుటయే ప్రాభవంబొ’ అన్నాడు. ‘నాలుగు మాటలు నువ్వు అని, నాలుగు మాటలు నా చేతా అనిపించుకోవటమే నీ పెద్దతనమా?’ అని. ‘పలికి పలికించుకొనుట యే ప్రాభవంబొ’ అని విడదీస్తే, ‘నన్ను మాటలని, మీరూ మాటలనిపించుకోవటం ఏమి పెద్దరికం, చెప్పండి’ అని అర్థం. ‘తిరగబడేంత దాకానే మీ పెత్తనం’ అని కూడా వ్యంజన.
మూలంలో కవి ముందు అత్తగారితో మాట్లాడించాడు. రెండవ పాదంలో కోడలు ‘అత్తా!’ అని సంబోధించటం వల్ల ఆ పూర్వప్రసంగకర్త కలరూపు మనకు బోధ్యమానం అయింది. అనువాదంలో ‘కలికి కోడల!’ అన్న ముమ్మొదటి సంబోధన ‘అత్త!’ అన్న ఉన్ముఖీకరణను పరిహరిస్తున్నది. ‘కలికి’ అన్నది కోడలికి విశేషణం. ‘నేర్పరి’ అని వాచ్యార్థం. కలికి = నేర్పరి. కలికితనము = నేర్పరితనము. కలికి కోడల = ఎంత నంగనాచివే – అన్నది వ్యంగ్యార్థం. ‘అఇదీహరాఇ బహుఏ సీసే దీసన్తి వంసవత్తాఇ’ అన్న వాక్యం సన్నివేశోచితం. పాత్రమనోధర్మానికి అనురూపం. సీసే = శీర్షము మీద. ‘అన్ని వెదురాకులేమిటే, నెత్తిమీద’ అనటం సరైన సంవాదోపక్రాంతి. కోడలు అందులోని వ్యంగ్యాన్ని గుర్తించి తగిన సమాధానం చెప్పింది. తెలుగులో ‘కలికి కోడల!’ అన్న అత్తగారి ఉపక్రమణిక వల్ల కోడలికి తిరగబడి సమాధానం చెప్పటం తప్పించి వేరొక మార్గం లేకపోయింది. ‘అన్ని వెదురాకులేమిటే, నెత్తిమీద’ అన్న మాటలో ఎత్తిపొడుపు లేదని, నిజంగానే ఆ వెదురాకులు ఎందుకున్నాయో ప్రశ్నించానని – అత్తగారు సర్దిచెప్పగలదు. మీ వీపుమీద ఆ వెలిమిడి ఎట్లా అయిందో అడిగితే తుడుచుకొంటారని నేనట్లా అన్నానే కాని, నా మనస్సులో మీ మీద అనుమానం ఏ కోశానా లేదు – అని కోడలు వినయాన్ని ఒలకబోయవచ్చును. ఆ స్వారస్యపు లోచూపు లేనందువల్ల తెలుగు అనువాదం వాచ్యప్రధానమై వ్యంగ్యవైభవానికి ఆస్కారం లేకపోయింది. కేవలం ఎత్తిపొడుపులు మాత్రమే మిగిలాయి. ‘ప్రాభవ శబ్దప్రయోగము, పలుకు నుడికారము శ్రీనాథుని కులుకు సింగారమే’ అన్న కొర్లపాటి శ్రీరామమూర్తి గారి నిర్ధారణ ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు.
పైగా, పద్యంలో ఉండవలసినది ‘వేణికా భరము’. భరమూ, భారమూ పర్యాయపదాలైనంత మాత్రాన ‘వేణికా భరం’ ‘వేణికా భారం’ కాదు. వేణికాభరము అంటే నిండైన కొప్పు అన్నమాట. ‘వేణికాభరమందుండు వెదురుటాకు’ అన్నప్పుడు ‘వేణికాభారమందుండు వెదురుటాకు’ అన్నప్పటి వలె శ్రవణసుభగంగా లేదు. కవిప్రయుక్తి సార్థకంగా లేదని ఊహింపవచ్చును. “వేణికాభారంబు” బహుధా శ్రీనాథ ప్రయుక్తమని, అందువల్ల పద్యం శ్రీనాథునిదేనని భావించేవారు గుర్తుంచుకోవలసిన విషయం: ‘విరులదండలతోడి వేణికాభారంబు పొంకంబు పిఱుఁదులఁ బొరలియాడ’ అని భీమేశ్వర పురాణం (1-105)లో శ్రీనాథుడు వ్రాసినప్పుడు దానికి ‘బరువైన జడ పిరుదులపై ఆడుతుండగా’ అని అర్థం. ఆ ప్రయోగసరణి తెలిసిన కవి యెవరో ‘వేణికాభారమందుండు వెదురుటాకు’ అని వ్రాసినట్లున్నది. అసలే బరువైన జడలో ఆ వెదురుటాకులేమిటి? అని అత్తగారు అన్నమాట వాచ్యానికి సరిపడినట్లు వ్యంగ్యానికి సహకరింపదు. సీసే = తలపైని అని ఉండవలసినచోట ‘వేణికాభారమందుండు వెదురుటాకు’ అన్నప్పటి శబ్దగాంభీర్యం ప్రకరణోచితం కాదు. అసలు వేణికయే భారమనుకొంటూ ఉంటే ఈ వెదురుటాకు భారమేమిటి – అని సరిపెట్టుకోవటమూ సాధ్యం కాదు. ‘తలపైని అంతంత వెదురాకులేమిటి?’ అన్న అత్తగారి మాటకు ‘వేణికాభారమందుండు వెదురుటాకు, కలికికోడల! యెబ్భంగి కలిగె చెపుమ’ అనటం నిలదీసి అడగదలచుకొన్నవారి సంప్రశ్నార్థకం కాదు.
గాథకు ప్రధానలక్షణమైన ధ్వన్యాత్మకతను చేజేతులా ధ్వంసం చేసిన ఈ అనువాదం శ్రీనాథునిదని నమ్మటం కష్టం. ఇంతకీ లక్షణ గ్రంథాలలోని ఉదాహృతులలో ఈ పద్యం లేదు. సంకలన గ్రంథాలలో లేదు. వర్ణనరత్నాకరములో లక్ష్మణస్వామి గారు దీనిని ‘చమత్కార చాటుపద్యములు’ అన్న శీర్షిక క్రింద పేర్కొన్నారు. దాన్ని ఆ ప్రకారంగానే పరిగణించటం మేలు.
8, 9. వల్లభరాయల క్రీడాభిరామములో శాలివాహన సప్తశతి పద్యాలు
వినుకొండ వల్లభరాయల క్రీడాభిరామములో ప్రాకృత గాథాసప్తశతికి అనువాదప్రాయములైన రెండు పద్యాలున్నాయి. మూలానికి, అనువాదానికి వ్యత్యాసాలున్నాయి. వాటిని గురించి అనేకవాదవివాదాలున్నాయి. క్రీడాభిరామము శ్రీనాథుని రచనమా? వల్లభరాయల రచనమా? క్రీడాభిరామములోని పద్యాలకు వేరొక మూలం రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామములో ఉండినదా? తెలుగు కవి ప్రేమాభిరామములోని శ్లోకాలనే అనుసరించాడా? తానై స్వతంత్రించి, సప్తశతిలోని గాథాహృదయాన్ని అన్యథాకరించి, ఆ పద్యాలను వ్యంగ్యస్ఫూర్తితో తెలుగుచేశాడా? తెలుగు కవి అనువాదానికి వాస్తవమైన మూలం ఏమిటి? అన్న విషయాలను ఇదమిత్థంగా నిరూపిస్తే కాని ఈ ప్రసంగసంగతి సార్థకం కాదు. ఇప్పటికే పెద్దదయిన ఈ వ్యాసంలో ఆ పద్యాలను చర్చించే అవకాశం లేక క్రీడాభిరామంలోని పద్యాలను మాత్రం ఉదాహరించి ప్రస్తుతానికి విరమిస్తున్నాను. మరొకసారి ఆ విశేషాలను విన్నవించికొంటానని విద్వత్పాఠకులకు మనవిచేస్తున్నాను.
పటుఝంఝాపవనోత్తృణాలయములో భద్రంబునం బట్టె కం
కటిపై ముచ్చముడింగి, నిర్భరవియోగగ్లాని శోషించి, యె
క్కటి నిద్రించుచునున్న వాడవనితన్ గర్జావచఃప్రౌఢిమన్
దటిదుద్ద్యోతము చూపు నట్టనడురే ధారాధరశ్రేణికిన్. (ప. 60)
మాఘమాసంబు పులివలె మలయుచుండ
పచ్చడం బమ్ముకొన్నాఁడు పణములకును;
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు
చలికి నొఱగోయ కే లుండు సైరికుండు. (ప.262)
చర్చాసారాంశం
ఈ చర్చాసారాంశం ఇది:
- ‘వారణసేయఁ దావిగొనవా?’ – ఇది నిస్సందేహంగా శ్రీనాథుని శాలివాహన సప్తశతిలోని పద్యం.
- ‘అంబరసీమఁ దారలు జటాటవి మల్లెవిరుల్’ – ఇది దామరాజు సోమన ‘భరతము’ లోనిది కాకపోవచ్చును; శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిది కావచ్చునని ప్రతిపాదన. .
- ‘వాలికమోము మత్తవనబర్హకిశోరకలాస్యలీల’ – భీమేశ్వర పురాణము లోని ఈ పద్యం శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోని అనువాదంపై ఆధారపడినది కావచ్చునని ప్రతిపాదన. .
- ‘ఆరయ జీవనం బమృత, మల్లుఁడు విష్ణువు’ – ఇది శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదని ఊహించటానికి ఆధారం లేదు. సప్తశతి లోనిది కాకపోవచ్చును.
- ‘ఇంచిన బాలకేళిఁ బరమేశ్వరు జూటకిరీటకోటి’ – ఇది శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదని ఊహించటానికి ఆధారం లేదు. సప్తశతి లోనిది కాకపోవచ్చును.
- ‘భాగ్యవతులు మున్నుఁ బ్రాణేశ్వరునిఁ జూచి’ – ఇది శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిది కాకపోవచ్చును. రుద్రటుని కావ్యాలంకారము లోని గాథకు అనువాదమై ఉండవచ్చును.
- ‘వేణికాభారమందుండు వెదురుటాకు’ – ఇది శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిది కాకపోవచ్చును. ఆధునికుల రచనమై ఉండవచ్చును.
- ‘పటుఝంఝాపవనోత్తృణాలయములో భద్రంబునం’, ‘మాఘమాసంబు పులివలె మలయుచుండ’ – ఇవి క్రీడాభిరామము లోని పద్యాలు. శ్రీనాథుని శాలివాహన సప్తశతిలో వీటి ఉనికి కలిమిలేముల ఔగాములను గురించి ఇంకా చర్చింపవలసి ఉన్నది.
అనుబంధజ్ఞాపికలు
- శ్రీనాథుని ‘శాలివాహన సప్తశతి’ తాళపత్ర ప్రతి ఇటీవలి కాలందాకా తెలుగుదేశంలో ఉండినదని విమర్శకులు నమ్ముతున్నారు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు 2001లో నేను వారింటికి వెళ్ళినపుడు తమ చిన్నప్పుడు మడికొండలో తమ తాతగారి యింట శ్రీనాథుని గాథాసప్తశతి ప్రతి ఉండేదని, తమ బాల్యంలో ఆ తాళపత్ర ప్రతిని తాము చూచామని, అందులోని ఒక పద్యంలో ఒక చిన్న పంక్తిభాగం మాత్రం తమకు గుర్తుండిపోయినదని చెప్పారు. ఆ పంక్తిని వారు ఎక్కడో అచ్చువేశారు కాని, ఇప్పుడు నాకది జ్ఞాపకం రావటంలేదు. జ్ఞాపకం వచ్చినా, శ్రీనాథుని పద్యభాగం ఉండిన ఆ అచ్చయిన ప్రతి కనబడినా మళ్ళీ మీకు మనవిచేస్తాను.
- శ్రీ బిరుదురాజు రామరాజు గారి ఇంటి ప్రతిని 1931లో హనుమకొండలో కాకతీయ చారిత్రక మహోత్సవాలు జరిగినప్పుడు శేషాద్రి రమణకవులు తీసికొని శ్రీ మారేమండ రామారావు గారికి ఇచ్చినట్లు, ఆ ప్రతి కాకతీయ చారిత్రక మహోత్సవాలలో ప్రదర్శింపబడినట్లు, ఆ తర్వాత అది అంతర్ధానమైపోయినట్లు కొన్ని కొన్నిచోట్ల వ్రాయబడిన విశేషాలను నేను చదివి ఆ వివరాలను గుర్తుంచుకొన్నాను. 1935లో అచ్చయిన కాకతీయ సంచికలో ఆ చారిత్రక మహోత్సవాల వివరాలు, అప్పటి పుస్తక ప్రదర్శన సంగతి, కొన్ని ఫోటోలు ఉన్నాయి. అందువల్ల, ఇప్పటికొక శతాబ్ది క్రితం దాకా శ్రీనాథుని శాలివాహన సప్తశతి ప్రతి బ్రతికుండినట్లు భావింపబడుతున్నది.
- హాల సంకలితమైన ‘గాథాసప్తశతి’కి మంచి తెలుగు ప్రచురణ లేదు. ఆల్బ్రెష్ట్ వెబర్ పండితుని ముద్రణను, అన్యతమ దేశ-విదేశ ముద్రణలను ముందుంచుకొని పీతాంబరుడు, భువనపాలుడు, గంగాధర భట్టు, పెదకోమటి వేమారెడ్డి, కులనాథుడు, ప్రేమరాజు, సాధారణదేవుడు, మాధవరాజ మిశ్రుడు రచించిన వ్యాఖ్యలతోనూ, ఇతర అసంపూర్ణవ్యాఖ్యలతోనూ, వివిధ విమర్శగ్రంథాలలోని ఉదాహృతపాఠాలతోనూ, అనేక భాషానువాదాలలోని విశిష్టపాఠాలతోనూ సరిపోల్చి ప్రామాణికమైన ముద్రణను తెలుగు లిపిలో ఆంధ్రతాత్పర్య-వ్యాఖ్యానసమేతంగా వెలయింపవలసిన ఆవశ్యకత ఉన్నది.
- ఈ వ్యాసాన్ని నేను వ్రాయ సమకట్టినప్పుడు ఎన్నో గ్రంథాలు ఆవశ్యకమైనాయి. వాటిని అంతర్జాలంలో నుంచి డౌన్ లోడ్ చేసి చి.సౌ. సౌమ్య వి.బి. గారు, శ్రీ రమణమూర్తి గారు నాకు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేను. శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు Herman Tieken గారి కృతుల విషయాన్ని, బ్లాగును పరిచయం చేసి, ఆ మహనీయుని అపురూపమైన వ్యాసం స్కాన్డ్ ప్రతిని దయతో నాకోసం పంపించారు. అనేక పాశ్చాత్య వ్యక్తుల నామోచ్చారణ విషయమై నాకు సందేహం కలిగినప్పుడు చి.సౌ. సౌమ్య వి.బి. వాటి ప్రామాణిక తెలుగు రూపాలను వ్రాసి నాకెంతో సహాయం చేశారు. శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావుగారు అనేకసమయాలలో పంపించిన గ్రంథాల పిడియఫ్ ప్రతులు నాకెంత ఉపకరించాయో మాటలలో చెప్పలేను. ఈ మాన్యమిత్రులందరికి సప్రశ్రయంగా నా కృతజ్ఞతాంజలి.
ఈ విషయాన్ని ఇంకా మరికొంత జాగ్రత్తగా పరిశోధింపవలసి ఉన్నది. ఆ రోజులలో తెలుగు లిపిలో ఉండిన గాథా సప్తశతి ప్రతి ఒకటి సుగృహీత నామధేయులైన శ్రీ గిడుగు రామమూర్తి గారి వద్ద ఉండింది. గిడుగు వారి తాళపత్ర సంచయంలో అధికభాగం వారి శిష్యులైన శ్రీ చిలుకూరి నారాయణరావు గారి ఇంటికి వచ్చి చేరింది. అవి నూరు, నూటయిరవైకి పైగానే ఉంటాయి. నారాయణరావు గారు వాటిని ఆంధ్రేతిహాస పరిశోధక మండలి వారికి ఇచ్చివేశారు. 1979లో నేను రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ నిర్వహణలో ఉన్న Andhra Historical Research Society వారి గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రతిని చూశాను. అది శ్రీనాథుని శాలివాహన సప్తశతి కాదు. తెలుగు లిపిలో ఉన్న ప్రాకృత గాథాసప్తశతి. దాని ముఖబంధంలో సన్నని కాన్వాసు ముక్కమీద “శ్రీనాథుని గాథా సప్తశతి” అని వ్రాసి ఉండింది. నేను చూచినప్పుడు స్వస్థావస్థలో విశదస్థితిలో ఉండింది. తాటాకుల పైన శ్రీ గిడుగువారి చేతివ్రాతలో తెలుగు అక్షరాలలో మసిబొగ్గుతోనూ, నల్ల పెన్సిలుతోనూ వ్రాసికొన్న మార్జినల్ నోట్సు అక్కడక్కడ కనుపించాయి. Andhra Historical Research Society వారి రికార్డులలో గిడుగు వారి ప్రతి అక్కడికి విరాళంగా వచ్చిచేరిన వైనమంతా ఉన్నది. ఆ రోజులలో ఆ విషయంపైని ప్రత్యేకదృష్టి లేక నేను ఆ వివరాలను వ్రాసికొనలేదు. ఆ గ్రంథాలయంలోనే నేనప్పుడు Journal of Andhra Historical Research Society ప్రతులలో ఒకదానిలో గిడుగు వారి ప్రతులు నారాయణరావు గారి ద్వారా ఆంధ్రేతిహాస పరిశోధక మండలికి వచ్చిచేరిన వివరాలను చూశాను. ఆ వివరాల పట్టికలో గాథా సప్తశతి పేరుండినట్లు గుర్తున్నది. ఆ సంచిక వివరాలు నాకిప్పుడు జ్ఞాపకం లేవు. ఆ ప్రతే హనుమకొండలో కాకతీయ చారిత్రక మహోత్సవాలు జరిగినప్పుడు ఆంధ్రేతిహాస పరిశోధక మండలి ద్వారా అక్కడికి వెళ్ళి మళ్ళీ రాజమండ్రికి తిరిగివచ్చిందేమో పరిశీలింపవలసి ఉన్నది. తెలుగు లిపిలో ఉండినందువల్ల ప్రదర్శన నిర్వాహకులు అది శ్రీనాథుని రచనమని పొరబడ్డారేమో తెలియదు.