విశ్వనాథ: వివాహాశీస్సులు

1976 ఆగస్టు నెలలో ఎం.ఎ పూర్తయిన తర్వాత భీమవరానికి ఉపకంఠాన ఉండి గ్రామంలో ఏదో కార్యక్రమానికి వెళ్ళి మద్రాసుకు తిరిగి వెళ్తూ విజయవాడలో రెండు రోజులున్నాను. అప్పుడు మా పూజ్య గురుదేవులు శ్రీ పొట్లపల్లి సీతారామారావు గారింటికి వెళ్ళాను.

మా గురువుగారు విశ్వనాథ వారి అగ్రశ్రేణి శిష్యులలో ఒకరు. యస్.ఆర్.ఆర్. కాలేజీలో ఉద్యోగం. అచ్చపు జమీందారీ వంశం. నిలువెత్తు ఆజానుబాహు విగ్రహం. చుట్టుపక్కల నాలుగంచులకు మారుమోగే కంచు కంఠం. విలువైన పసిమి పట్టు వస్త్రాలు ధరించి మంగళకరమైన రూపశోభతో చెలువొందుతూ అంబాసడర్ కారు దిగి మందగమనంతో తరగతి గదికి నడిచి వస్తుంటే ఆ రాజసానికి ఎక్కడెక్కడివాళ్ళూ విస్తుపోయి చూసేవారు, ఆ మహావిద్వాంసుని. కళాశాల ప్రిన్సిపాలు రాజమన్నారు గారు విశ్వనాథ శిష్యవర్గంలో ప్రముఖులు. మంచి కవి కూడాను. అందువల్ల గురువు గారంటే ప్రాణం ఆయనకు.

నవయువకుడుగా ఉన్న రోజుల్లో సంస్కృతంలో మురారి అనర్ఘరాఘవం, కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద పాఠం చెప్పించుకోవాలని నూజివీడు నుంచి వచ్చి విశ్వనాథ వారిని అడిగారట మా గురువు గారు. ఆయన మొదలుపెట్టారట. రెండూ ఇద్దరికీ కంఠస్థాలే. ఐనా, ఆయన చెప్పటం, ఈయన వినటం. కొన్నాళ్ళయ్యాక విశ్వనాథ వారు ఊరికే సమయం వృధా పోతున్నది కాదూ, ఏ తెలుగు ఎం.ఏ పరీక్షకో కడితే బాగుంటుంది అన్నారట. గురువు గారు తెలుగు ఎం.ఏ ఉత్తీర్ణులయ్యారు. ఊరికే చదువు వృధా పోవటం ఎందుకూ, మన కాలేజీలో చేరవచ్చునుగా అన్నారట, విశ్వనాథ. గురువుగారు యస్.ఆర్.ఆర్. కాలేజీలో ఆంధ్రోపన్యాసకునిగా చేరారు. నా అదృష్టం కొద్దీ కళాశాలలో వారి సన్నిధి సేవ లభించింది. 1971 నుంచి 73 దాకా చదువుకొన్నాను. ఆ తర్వాత మళ్ళీ అదే వెళ్ళటం.

నేను వెళ్ళిన రోజుల్లో మా గురువుగారు ‘ఊర్వశి’ అని పద్యకావ్యం వ్రాస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఊర్వశి’ ఒక అలంకారకౌస్తుభం. దాని సొగసులను వర్ణించేందుకు ఒక వేదం వెంకటరాయశాస్త్రి గారో, ఒక వెల్లాల సదాశివశాస్త్రి గారో, పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి గారో దిగి రావాలి. ఆ రోజు కూర్చిన పద్యాలను ముక్తాముక్తంగా వినిపించాక గురుదేవులు నన్ను, మాష్టారింటికి వెళదామా, చిన్న పని కూడా ఉంది, అన్నారు. భక్తుణ్ణి పిలిచి, భగవంతుణ్ణి చూస్తావా! అని అడిగినట్లు. ఇద్దరమూ కలిసి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారింటికి వెళ్ళాము.

మేము వెళ్ళే సరికి విశ్వనాథ వారు పడక కుర్చీలో ఠేమిణీ తీరి ఉన్నారు. ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకులు శ్రీ పులుపుల శివయ్య గారి బంధువు దత్తాత్రేయరావు గారని వారి యెదురుగా కుడివైపు మంచం మీద సతీసమేతంగా సవినయంగా కూర్చొని ఉన్నారు. వారి మేనకోడలిదో, మేనకోడలి బంధువులదో – పెళ్ళట. ఇంకెవరో ఒకరిద్దరున్నారు. విశ్వనాథ వారి భార్యవైపు బంధువొకరు ఉన్నారు. అప్పట్లో ‘వేయి పడగలు’ నవలను ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. నేను డి.యన్.ఆర్ కాలేజీలో విద్యార్థిగా ఉండటం వల్ల వారు నాకు సుపరిచితులే.

పులుపుల శివయ్యగారు కమ్యూనిస్టు పార్టీ తొలి తరం నాయకులలో ఒకరు. మంచి పండితులు, హృదయం ఉన్న కవి. పలనాటి సీమలో వారిని యెరుగని వారెవరు? అభ్యుదయోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో ఆయన పాటలు పాడని వారెవరు? మా నాన్నగారికి రాజకీయాలలో ప్రవేశం ఇప్పించిన బాల్యగురువు. ఉన్నదంతా దేశానికి త్యాగం చేసి చివరి రోజులలో లేమి మూలాన చాలా బాధలు పడ్డారు. ఆ సంగతులన్నీ మాట్లాడుకొన్నాము.

పరిచయాలయ్యాక, వారు సత్యనారాయణ గారింటికి వచ్చిన పని తెలిసింది.

ఆ దంపతులు పెళ్ళి యేర్పాట్ల సన్నాహంలో తలమునకలుగా ఉన్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత పెళ్ళికి ఆశీర్వాద పద్యాలను చెప్పించుకొంటే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుందని, మౌక్తికోపమానంగా వంశవర్ధకమైన సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇంటికి వచ్చి అడిగారట. ఆ రోజులలో మూడు వందల రూపాయలను, విలువైన మంచి శాలువను, తాంబూలంలో మామిడి పళ్ళ విందుతోపాటు గురువు గారికి సమర్పించుకొన్నారట. విశ్వనాథ వారు చెబుతుంటే మా గురువుగారు వ్రాసిపెట్టారట. పద్యాలను అచ్చుకిచ్చి, ప్రూఫులను చూపించేందుకు ఆ దంపతులు వచ్చారట.


వివాహాశీస్సులు

ప్రూఫు కాగితాలు రెండు ప్రతులను తెచ్చారు. విశ్వనాథ వారు పైపైని చూచి, ఒకటి నాకు, ఒకటి మా గురువు గారికి ఇచ్చారు. గురువుగారు తల పంకించి, పద్యాలను సరి చూసి, శ్రీకృష్ణభక్తి పరిమళాలు చిమ్ముతున్న ఆ పద్యప్రసూనాల ప్రతిని అప్పుడే విచ్చిన విరజాజి పూలను గుడిలో పూజారిగారి చేతిలో పెడుతున్నట్లుగా అంజలిబంధంలో అందంగా అందజేశారు, వారికి.

చల్లగా, బంధుమిత్రుల కడుపు చల్లగా, పిల్లాపాపలతో హాయిగా ఉండి ఉంటారు ఆ ఆశీర్వచస్సులకు నోచుకొన్న వధూవరులిప్పుడు పుణ్యదంపతులై.

నా వద్దనున్న ప్రతిని నా కోసం దాచుకొన్నాను నేను. ఏమి పద్యాలవి!

భాగవతం భావగతమైన భక్తిపరులకు గోపికా గీతలు దర్శనమిస్తాయి అందులో. ముద్దకట్టిన ఉపనిషత్సారనవనీతం అది. గోగోపగోపీగణావృతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమరసధార అది. దుగ్ధార్ణవశాయి తానే దోగ్ధగా నిలిచి మనకోసం పిండిపెట్టిన పసిడి పలుకుల పంచామృతం.

మహాకవి శ్రీ విశ్వనాథ స్వయంగా కూర్చిన తాత్పర్యార్థంతో వెలుగులీనుతున్న అక్షరాలవి.

ఇంత కాలం శ్రీ విశ్వనాథ సాహిత్యంలో అప్రకాశితంగా నిలిచిపోయిన ఈ అనర్ఘ పద్యముక్తావళిని తొలిసారి ప్రచురణగా ‘ఈమాట’ పఠితృలోకానికి సమర్పిస్తున్నాను — ఇది మీ అందరికి కంఠస్థగితమై, దీని దీధితి దెసల కొసల దాకా దేదీప్యమానం కావాలన్న శుభాకాంక్షితంతో.


గీ.   రతనపిలు, తన చిన్న కుఱ్ఱి, తొలియీఁత
      నుఱ్ఱుకట్టఱి తీసిన ముఱ్ఱుపాలు
      తానె పిదికి తాఁగాచిన తనదు జున్ను
      తానె తినుసామి మీకు సాబానపాడు!

గీ.   కఱ్ఱియావొండు పాల్దీయగాను తాన
      మెడమలచి తాననుకొను సామిఁ గనుగొంచు
      జుఱ్ఱుచును దానిపెరుగును, గఱ్ఱుమంచు
      త్రేచు చిన్నికన్నడు మిమ్ముఁ బ్రోచుఁగాక!

ఆ.   అతడు రక్షసేయు నాస్వామి మిమ్మును
       పొట్టియావు, దూడపొడుగు, పొదుగు
       నందకున్న దూడ కందిచ్చి దూడయుఁ
       దాను చెఱుసగంబు త్రావునెవడు!


ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...