పి. బి. శ్రీనివాస్ (1930-2013)
శ్రీ పి.బి. శ్రీనివాస్ విద్వత్ సాంగీతిక సుకవిగాయనులు. బహుముఖీన ప్రజ్ఞావిచక్షణులు. విలక్షణమైన వ్యక్తిత్వవికాసంతో శ్రోతలు, పాఠకుల హృదయమందిరాలలో స్థిరనివాసం ఏర్పఱచుకొన్న శాలీనప్రతిభులని వారి పరమపదప్రస్థానానికి అభిమానులు అశ్రుతర్పణతో సమర్పిస్తున్న నివాళి వేయినోళ్ళతో చాటిచెబుతుంది. సృజనరంగంలో చిత్కళామయమైన కృషి చేసి వారికంటే ముందంజ వేసినవారు త్రికాలాలలోనూ ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కాని వారిలా అద్వితీయమైన స్వయంకృషితో సంగీతాన్ని ఆపాతరమణీయంగానూ, సాహిత్యాన్ని ఆలోచనామృతంగానూ ఆస్వాదించి ఆస్వాదింపజేసి, ఆనందించి, ఆనందింపజేసి ఆ పంచామృతాన్ని ప్రపంచమంతటా పంచిపెట్టాలని తహతహలాడిన శ్రీనివాస్ వంటి సహృదయులను మాత్రం ఎంతో అరుదుగా చూస్తాము. ఆన్ధ్రత్వ మాన్ధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్ అని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆంధ్రదేశానికి దూరంగా ఉంటూ ఆ నమ్మకాన్ని నానావిధభాషలలో అభివ్యక్తీకరించిన ధన్యజీవనులుగా వారంటే గౌరవం నాకు. ఆ గౌరవాన్ని వెల్లడించేందుకు ఇటువంటి దుఃఖమయసమయం తటస్థింపవచ్చునని ఎన్నడూ అనుకోలేదు.
శ్రీనివాస్ శ్రీవైష్ణవులు. శ్రీవైష్ణవులలో ప్రతివాదిభయంకరం గృహస్థాశ్రములది ఒక ప్రకృష్టజ్ఞానవంతమైన స్థానం. తమిళదేశంలో జైన హైందవ ధర్మాల సద్దు మణిగిన తర్వాత హైందవంలో శైవ వైష్ణవాల మధ్య పరస్పర విరోధాలు కొంతకాలం సాగాయి. భగవద్రామానుజులు శ్రీవైష్ణవాన్ని చతుర్వర్ణాల సరిహద్దులు దాటించి, జనులందరికీ మోక్షమంత్రాన్ని ఉపదేశించినప్పటినుంచి శ్రీవైష్ణవం ప్రబలంగా వ్యాప్తి చెందింది. తద్వారా ద్రావిడవేదం పఠనపాఠనాలలో మఱింత ప్రచారానికి వచ్చింది. శ్రీవైష్ణవులందరూ ఉభయవేదాంత ప్రవర్తనులయ్యారు. భగవద్రామానుజుల ప్రియశిష్యులు మహాకవి కూరత్తాళ్వారులు. ఆయనకి శ్రీవత్సాంకమిశ్రులని పేరు. చిత్రకవిత్వంలో అగ్రగణ్యమైన యమకరత్నాకరం వారిదే. వారి వంశంలోని వారే సౌమ్య జామాత అని పేరుపొందిన మహాకవి మనవాళముని. యతిరాజవిజయాది మహాకృతులను రచించిన వాత్స్య వరదాచార్యులు కూడా ఆ కుటుంబంలోని వారే.
మనవాళముని ప్రియశిష్యులు అణ్ణంగరాచార్యులవారు. మనవాళముని ఉపదేశసారాన్ని భుజాన వేసుకొని దేశసంచారం చేసి విద్యావివాదాలలో మతత్రయపండితులను మెప్పించిన మహాపండితులు ఆయన. ఆ రోజులలో వాక్యార్థసభలలో వాదించటం అంటే ప్రతిపాద్యవస్తు తత్త్వావగాహనతో ఉపక్రమించటం, ప్రమాణషట్కాన్ని క్రమప్రథతో నిరూపించి తాత్పర్యనిర్ధారణ చేయటం అన్నమాట. అణ్ణంగరాచార్యుల వాదవైభవం మూలాన వారికి ప్రతివాదిభయంకరులని పౌరుషనామం ఏర్పడింది. అదే ఇంటిపేరుగా మాఱింది. ప్రతివాదిభయంకరం అణ్ణంగరాచార్యుల వారయ్యారు. అణ్ణంగరాచార్యులు ఎంతటి పండితులో అంతటి రసికులు. ఎంతటి రసికులో అంతటి మహాకవులు. ఈ రోజు తిరుమలేశుని మందిరంలో అనునిత్యం సుప్రభాతవేళ శ్రూయమాణంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్తోత్రం రచించినది వీరే.
శ్రీవత్స సగోత్రులలో ఆ ప్రతివాదిభయంకరం అణ్ణంగరాచార్యుల వారి సంతతి వారొకరు 15వ శతాబ్ది నాటికే ఆంధ్రదేశానికి తరలివచ్చారు. తూర్పు తీరాన ఆ కుటుంబాల వారు ఇప్పటికీ తామరతంపరగా వ్యాపించి ఉన్నారు. సామర్లకోటలో ప్రతివాదిభయంకరం తిరువేంగళాచార్యులని గొప్ప పండితులు 19వ శతాబ్దిలో ఉండేవారు. 1862లో భానుమిశ్రుని రసమంజరికి తాత్పర్యమంజరి అని వ్యాఖ్యను వ్రాశారు. కూరేశ్వరుల సుదర్శన శతకానికి లఘుటిప్పణిని కూర్చారు. ఆయన కూడా చిత్రకవిత్వప్రియులు. వారి సంతతి వారు కృష్ణా జిల్లాలోని పసలపూడికి వచ్చి స్థిరపడ్డారు. హృద్యోగాలు ఉద్యోగాలకు మళ్ళిన తర్వాత అప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి వారంతా తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు వెళ్ళారు. వారిలో ప్రతివాదిభయంకర వేంకట లక్ష్మణ ఫణీంద్రస్వామి, శేషగిరమ్మ దంపతులున్నారు. కాకినాడలో ఉండగానే ఆ దంపతుల పుణ్యవశాన 1930 సెప్టెంబరు 22వ తేదీన శ్రీనివాస్ జన్మించారు.
పి. బి. శ్రీనివాస్
చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ ముచ్చట ఒకటి. మూడేళ్ళు వచ్చినా మాటలు రాలేదు. తండ్రి వాగ్మి, తల్లి వాచక్నవి. కొడుకుకు మాటలు రాకపోవటం దిగులే కదా మఱి. మొక్కని రాయి లేదు, ఎక్కని గుడిమెట్టు లేదు. ఏమైతేనేమి, పధ్నాలుగు భాషల్లో వెయ్యి సినిమా పాటలు పాడి, అష్టభాషల్లో వేలకొద్దీ గీతాలను వ్రాయవలసిన భవితవ్యం ఎన్నాళ్ళు గొంతులో నుంచి పెకలి రాకుండా అవ్యక్తంగా ఉండగలుగుతుంది? ఆ మాటలు రావటం రావటం గిరిశిఖరం నుంచి దూకిపడే స్రవంతీప్రవాహవేగంతో వచ్చాయి. పసినాడే గొంతు వసివాడే స్పష్టవాక్కుతో వ్యక్తమయింది.
శ్రద్ధగా చదువుకొన్నారనే తప్ప ఆ చదువుసాములలో పెద్ద విశేషాలేవీ లేవు. హైస్కూలు దాటి పి.ఆర్. కాలేజీలో చదివినది బి.కామ్ అయినా దృష్టి ఆ అంకెల సంకెలల మీదికి మళ్ళలేదు. మహమ్మద్ రఫీ, మన్నాడే, తలత్ మెహమూద్, ముఖేష్‌ల పాటలు వినటం, ఇంట్లో తల్లిగారి వద్ద సాధన చేయటం. సంగీతం క్లాసులో చేరి, అంతలోనే విడిచివేశారు. సహజపాండిత్యాన్ని శ్రుతపాండిత్యంతో పరిపూర్ణించుకొన్నారు. సంస్కృతాంధ్రాల అధ్యయనం ఉండనే ఉన్నది. జ్యోతిష్కులెవరో పెదిమె విఱిచి, లాభం లేదన్నారట. ఫణీంద్రస్వామి ఆ మాటలకు వెనకాడలేదు. కొడుకంటే అంత నమ్మకం ఆయనకు. అప్పట్లో కాకినాడలో సబ్ రిజిస్ట్రారుగా ఉన్న గొప్ప వీణావాదనులు బ్రహ్మశ్రీ ఈమని శంకరశాస్త్రి వద్దకు తీసికొనివెళ్ళారట. శంకరశాస్త్రి యువశ్రీనివాసుని గాత్రం ఆలకించి, ఎంతో మెచ్చుకొని, మంచి భవిష్యత్తు ఉంటుందని దీవించారట. డిగ్రీ పట్టభద్రత పూర్తి కాగానే తన వాద్యబృందంలో అవకాశం ఇస్తానని మాటయిచ్చారు. ఆ చల్లని దీవెన తనకు శ్రీరామరక్ష అయిందని ఆ తర్వాత శ్రీనివాస్ ఈమని వారిపైని ఒక నివాళి వ్యాసంలో గుర్తుచేసుకొన్నారు.
ఆ రోజుల్లో కాకినాడలో రాధాస్వామీ సత్సంగుల ప్రభావం మూలాన హిందీ, పంజాబీ భాషలకు కొంత ప్రచారం ఉండేది. శ్రీనివాస్‌కు హిందీ పాటలు ఎట్లాగూ ఇష్టం కనుక ఆకర్షితులై చిన్ననాటినుంచే హిందీ చదువుకున్నారు. చెన్నపురికి వెళ్ళిన తర్వాత కాస్త పట్టుబట్టి దక్షిణభారత హిందీ ప్రచార సభ వారి హిందీవిశారద పరీక్షలో సులభంగానే ఉత్తీర్ణులయ్యారు. ఆ పరీక్ష కోసం సుప్రసిద్ధ చలనచిత్ర నటి హేమమాలిని తల్లి శ్రీమతి జయ ఆయనతో కలిసి చదువుకొనేవారు. ఆవిడ ఇంటి ఎదురుగా విశ్వవిఖ్యాత వయొలిన్ విద్వాంసులు లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కుటుంబం ఉండేది. వారింటి క్రింది భాగంలో ప్రఖ్యాత పాత్రికేయ రచయిత సోవియట్ భూమి పత్రిక సంపాదకులు సెట్టి ఈశ్వర రావు చాలా రోజులున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిల్లు అంతకు నాలుగు నిమిషాల నడక. ఈ పరిచయాల వల్ల శ్రీనివాస్ సంస్కారం పురివిచ్చుకొంది.
సాలూరి రాజేశ్వరరావుతో స్నేహమంటే స్నేహం, శిష్యత్వమంటే శిష్యత్వం, చనువంటే చనువు. ఆయన దగ్గఱ గాత్రధారణ మెళకువలను, సంగీతపు ఒడుపులను, వాద్యబృందం నిర్వహణను, వాక్చాతుర్యాన్ని, హాస్యధోరణిని ఒకటనేమిటి, పుణికి పుచ్చుకోని విద్య లేదు. చిన్నప్పటి నుంచి విన్నదీ చదివినదీ చెవి ఒగ్గి వినటమే గాని, మనసు పెట్టి చదవటమే గాని సంగీతంలోనూ, సాహిత్యంలోనూ శిక్షాప్రణీతంగా చెప్పుకోదగిన పెద్దల దగ్గఱ చెప్పుకోలేదు. ఆ విన్నదనం లేకుండా విన్నదానికి మెఱుగులు దిద్దుకొన్నారు. స్వయంప్రతిభానతతో కృషిచేశారు. ఆ కృషి పరిపరి విధాల పండింది. పంట కాపుకు రాగానే నలుగురికీ దోసిళ్ళ నిండా పంచిపెట్టడం, మంచి విత్తనాలను మళ్ళీ నాటటం, అవి మొలకెత్తి చిగుళ్ళు తొడిగి మొగ్గలు విచ్చుకొని పువ్వులు పూసి కాయలు గాచి పండ్లయ్యే ఋతువు వస్తుందని మఱుసటేటి కోసం మళ్ళీ ఎదురుచూడటం. సంగీతంలోనూ సాహిత్యంలోనూ ఆయన కృషి అంతే. ఆ కృషి ఫలించి ఆయన అచిరకాలంలోనే ఉభయకళాకోవిదులుగా గుర్తింపును పొందారు.
చెన్నపురిలో ఉండగా శ్రీనివాస్‌కి విద్యావకాశాలు బహువచనంలో కలిసివచ్చాయి. బులుసు వెంకటరమణయ్య, తీర్థం శ్రీధరమూర్తి, వి. రాఘవన్ వంటి మహనీయుల సన్నిధిసేవ లభించింది. లబ్ధప్రతిష్ఠులైన దేవులపల్లి కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, చెఱువు ఆంజనేయ శాస్త్రి, కొంగర జగ్గయ్య వంటివారికి సన్నిహితులయ్యారు. ఆ కాలంలోనే మా నాన్నగారితో పరిచయం స్నేహంగా మాఱింది. ఆకాశవాణిలోనూ, పాత్రికేయరంగంలోనూ, కవిత్వాభిమాని సంఘంలోనూ ఉన్న సాహితీమిత్రుల సంఖ్య లెక్కకు మీఱుతుంది. సంగీతం, సాహిత్యం, సినిమాలతో మైత్రి ‘My Three’ అని ఆయనే అన్నారు.
తండ్రిగారి సంస్కృతపండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గఱ చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే ఆయనకు ఆదిగురువు, తుది గురువు. తక్కినదంతా ‘కాన్ ఖోల్ కర్’ వినటమొక్కటే.
మద్రాసుకు వచ్చిన తర్వాత శ్రీనివాస్ ఒక్క తెలుగును మాత్రం పద్ధతిగా మహావిద్వాంసులు రావూరి దొరసామిశర్మ సన్నిధిని శ్రీ ఆరుద్రతో కలిసి ట్యూషన్ చెప్పుకొన్నారు. ఆ ‘ట్యూషన్’ కథ చాలామందికి తెలియదనుకొంటాను. మొత్తానికి ఆ సత్సాంగత్యం ఛందఃశాస్త్రంలో శ్రీనివాస్ భావుకత్వానికి, భావకవిత్వానికి, భావిపరిశోధనలకు ప్రాతిపదికం అయింది. దొరసామిశర్మ తాము రచించిన ఆంధ్రలక్షణసంగ్రహం గ్రంథాన్ని వారిద్దరికీ పాఠం చెప్పారు. ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యం రచించే ఉద్దేశంలో ఉన్నారు. సుప్రసిద్ధ కవినన్న అహంభావమేమీ లేకుండా దొరసామిశర్మ చెప్పిన పాఠాన్ని చెప్పినట్లుగా గుర్తుంచుకొనేవారు. శ్రీనివాస్ చిత్రకవిత్వానికి మెఱుగులు దిద్దుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నం దొరసామిశర్మ బోధనాపటిమ మూలాన అయత్నంగా ఫలించింది. ఆ బొమ్మలను పునర్లేఖనాభ్యాసం కోసం దొరసామిశర్మ కాగితం మీద తేదీ వేసి, PBS అని వ్రాసి భద్రంగా దాచి ఉంచేవారు. అవన్నీ ఇప్పుడింకా వారింట ఉండే ఉండాలి.
శ్రీనివాస్ ఆధునికతాభిమాని. ‘ఆధునికత’ అంటే ‘ప్రాత యనిపించు సరిక్రొత్త పథము నాది’ అన్నమాట. సంప్రదాయపు పరిధిలో ఉంటూనే సరిక్రొత్త దారులు తీయటం అది. ‘చిత్రప్రయోగం’ లేని కేవల సంప్రదాయం ఆయనకు అభిమతం కాదు. గురువుల వద్ద శాస్త్రీయసంగీతాన్ని శాస్త్రీయంగా నేర్చుకోకపోవటం వల్ల ఆయన జీవిక శాస్త్రీయసంగీత కచేరీలకు మొగ్గలేదు. లలిత సంగీత కార్యక్రమాలకు, సినిమా పాటల విభావరులకు లెక్కలేదు. ఆయన సంగీతాభిమానం సంకుచిత పరిధులలో కుంచించుకోక ప్రాచ్య పాశ్చాత్య రీతులన్నింటికి విస్తరిల్లింది. ఆ రీతులన్నింటిలోనూ ప్రయోగాలు చేశారు. భాషావిషయంలో మాత్రం శాస్త్రాన్ని శాసనంగా, శాస్త్రీయంగా నేర్పే శాస్త ఒకరు దొరసామిశర్మ రూపంలో లభించారు. ఆ సంస్కారఫలంగా శ్రీనివాస్ “ఛన్దోహీనో న శబ్దోస్తి, నచ్ఛన్దః శబ్దవర్జితః” అన్న నమ్మకంతో భాషను అభిమానించారు. ఆ భాషాభిమానం బహుభాషాభిమానానికి దారితీసింది. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ, ఉరుదు, ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకొన్నారు. అన్ని భాషలలోనూ రచనాభ్యాసం మొదలుపెట్టారు. పరిణతిని సాధించారు.