రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.

రచన: ఏల్చూరి మురళీధరరావు
జులై 2015

వ్యక్తదృష్టార్థచంద్రిక

క్షేమేంద్రుడు కవికంఠాభరణంలో కావ్యవిద్యను ఉపాసించేవారిలో అల్పసాధ్యులు, కృచ్ఛ్రసాధ్యులు సూక్తివికాసం కోసం చేయతగిన ప్రయత్నాలను గురించి అయిదు ప్రధానాధ్యాయాలలో వివరించాడు. వాటికి 1. కవిత్వ ప్రాప్తి, 2. శిక్షా కథనం, 3. చమత్కార కథనం, 4. గుణదోష విచారం, 5. పరిచయ చారుత్వం, అని పేర్లు. వారిలో అల్పప్రయత్నసాధ్యులు (వీరు కొద్దిపాటి శ్రమతో ప్రౌఢులు కాగలుగుతారు. వేంకటకవి ప్రౌఢతతికి సమ్మతి అని వీరి వంటివారిని ఉద్దేశించే అన్నాడు) శబ్దశాస్త్రాన్ని అధ్యయనించి (వేంకటకవి శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును అని వీరినే అనురణింపజేశాడు), ఛందోవిధానంలో పరిశ్రమ చేసి (వేంకటకవి ఉక్తాత్యుక్తాదిగాఁ గలుగు ఇరువదాఱు ఛందంబులకుఁ జందంబును అన్నాడు), మాధుర్యమనోరమములైన సత్కావ్యములందు (వేంకటకవి చిరంతనాంధ్రప్రంబంధజాలంబుల కాలవాలంబు అన్నాడు) శ్రవణాభియుక్తులు కావాలని క్షేమేంద్రుడు ప్రబోధించాడు. కృచ్ఛ్రకవులు ఏదైనా పూర్వకవి శ్లోకాన్ని తీసుకొని, ఉన్న పదాలకు బదులు పర్యాయపదాలను గ్రహించి, వేరు పదాలతో శ్లోకాన్ని పునారచించాలట. (శ్లోకం పరావృత్తిపదైః పురాణం, యథాస్థితార్థం పరిపూరయేచ్చ: 1-20) ఈ వృత్తరచనాభ్యాసానికి పరావృత్తి అని పేరు.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ

అని శ్లోకం. దీనిని –

వాణ్యర్థావివ సంయుక్తౌ వాణ్యర్థప్రతిపత్తయే
జగతో జనకౌ వన్దే శర్వాణీశశిశేఖరౌ

అని క్షేమేంద్రుడు సోదాహరణంగా నిరూపించాడు. ఈ మార్గంలో మనకు ప్రయాణం నేర్పుతున్న వేంకటకవి మతంలోని వ్యక్తదృష్టార్థచంద్రికలు కొన్నింటిని ఇప్పుడు చూద్దాము:

మొదటి విభాగం: అనువాదాలు

ప్రబంధరాజంలో వేంకటకవి కావించిన సంస్కృత శ్లోకానువాదాలను గురించి ఇంకా లోతుగా పరిశోధింపవలసి ఉన్నది. సంస్కృతకావ్యాలతోడి పరిచయం చాలనందువల్ల, వేంకటకవి ఆ పద్యాన్ని ఏదో సంస్కృతశ్లోకానికి అనువాదంగా కాక, తన ముందున్న ఏదో తెలుగు పద్యాన్నే పర్యాయపదాలతో మార్చి చెప్పివుంటాడనే నమ్మకం వల్ల – నేను ఈ విభాగంలో ఎక్కువ కృషి చేయలేకపోయాను. గుర్తుపట్టిన కొన్నింటిలో ముఖ్యమైనవాటిని వివరిస్తాను:

నిర్మాంసం ముఖమణ్డలే పరిణతం మధ్యే లఘుః కర్ణయోః
స్కన్ధే బన్ధుర మప్రమాణ మురసి స్నిగ్ధం చ రోమోద్గమే
పీనం పశ్చిమపార్శ్వయోః పృథుతరం పృష్ఠే ప్రధానం జవే
రాజా వాజిన మారురోహ సకలై ర్యుక్తం ప్రశస్తై ర్గుణైః.

ఇది వినయచంద్ర సూరి రచించిన కావ్యశిక్షా గ్రంథంలోని ఏడవ అధ్యాయమైన లోకకౌశల్యపరిచ్ఛేదంలోని మొదటి శ్లోకం. రాజు ఎక్కదగిన ఉత్తమాశ్వపు లక్షణాలను వివరిస్తున్నాడు. దీనికి వేంకటకవి ఆంధ్రీకరణ:

గొరిజల యుబ్బు, మేని జిగి, గొప్ప యురంబు, వెడంద పంచకం
బెరుపగు వన్నె, చిన్ని చెవు, లెక్కువమై సిరసెత్తు మెట్టువాల్,
కొర సగిలింత గల్గి, మఱి కొంచెపు గండయుఁ, గాళ్ళ వేగమున్,
మెఱుఁగుఁగనుల్, సుదేవమణి, మెత్తని రోమము లొప్పు మెప్పుగన్. ప. 180

మూలశ్లోకం గాని, తెలుగు మూలం గాని – నకులుని అశ్వశాస్త్రంలో, భోజుని అశ్వశాస్త్రంలో, యుక్తికల్పతరువులో, మనుమంచిభట్టు హయలక్షణసారంలో, మరెక్కడా కనబడలేదు. అందువల్ల వేంకటకవిది వినయచంద్ర సూరి శ్లోకానికి అనువాదమే అన్న నిశ్చయానికి వచ్చాను.

ఉదయతి వితతోర్ధ్వరశ్మిరజ్జా
వహిమకరే హిమధామ్ని యాతి చాన్తమ్
వహతి గిరి రయం విలమ్బిఘణ్టా
ద్వయ పరివారిత వారణేన్ద్రలీలామ్.

మాఘుని శిశుపాల వధ కావ్యంలోని (4-21) అద్భుతమైన శ్లోకం ఇది. ఆకాశమనే ఏనుగు నడుముకు కిరణరజ్జువుతో వేలాడదీసిన ఘంట లాగా ఉన్నాడట సూర్యుడు. వేంకటకవి అభిమానించటం సహజమే. తెలుగు చేశాడు:

ఖరకరుఁ డంబర మధ్య
స్థిరుఁడై గనుపట్టె రుచిరదీధితిని వియ
ద్ద్విరదమున కంశు రజ్జువు
గర మొప్పుగఁ గట్టు బొడ్డుఘంటయ పోలెన్. ప. 438

ఈ భావాన్ని తెలిగించిన కవులు చాలామందే ఉన్నారు కాని, వేంకటకవి పద్యం మాఘకవి శ్లోకానికి చేసిన యథాతథానువాదమే అనిపించింది. వేరేదైనా ఇటువంటి తెలుగు పద్యం దొరికితే, దానికి అనుసరణమేమో పరిశీలించాలి. తెలుగుచేయటానికి కేవలం శ్లోకంలోని భావాన్ని మాత్రం స్వీకరించినవాళ్ళ సంఖ్యకూడా తక్కువేమీ కాదు. చూడండి: జవనవ ప్లవనవ ద్రవిశతాంగ తురంగ, గళగళ ద్ధరిదశ్వఘంట యనఁగ అని కిరీటి వేంకటాచార్యుల అచలాత్మజా పరిణయం (2-96).

వేంకటకవికి మాఘకవి అంటే ప్రత్యేకాభిమానం. నాగదత్తోపాఖ్యానంలో ఒకచోట మాఘవచఃశ్రీలాఘవవచోవిభవ (ప. 731) అనిపించాడు. మాఘవచఃశ్రీ = మాఘకవి వాక్సంపదయొక్క, లాఘవ = మనోజ్ఞానము గల, వచోవిభవ = వాక్యసంపద గలవాడా! అని భావం. మాఘుడు భూభారై రభిరేభిరే భేరీ రేభిభిః అని వ్రాస్తే, తానూ, భాభీరు భీభీర భారభేరీ రేభి, భూరిభాభాభిభీ భూభరాభ అని అనుసరించాడు కదా. ఇది ఇంకొక శ్లోకం:

విలోక్య సఙ్గమే రాగం పశ్చిమాయా వివస్వతః
కృతం కృష్ణం ముఖం ప్రాచ్యా న హి నార్యో వినేర్ష్యయా.

ఇది శార్ఙ్గధర పద్ధతిలోని 3586వ శ్లోకం. వేంకటకవి ఎందులో నుంచి తీసికొన్నాడో! అభిమానించి, ఆంధ్రీకరించాడు.

రవి యస్తాద్రికిఁ జేరె నంత శశియున్ రాగాత్ముఁడై తమ్మి లే
నవలా శీతకరంబులం దొడరినన్ నాథుండు గా మీసు దోఁ
చు విధంబుం దగ మోడ్చెఁ దమ్మివిరు లచ్చో నవ్వె నాఁ బూఁచెఁ గై
రవిణుల్ దా నవమానియైన గతి రేరా జొప్పె వెల్వెల్లనై. ప. 70

ఏ మాత్రమూ న్యూనాతిరిక్తతలు లేని విశదానువాదం ఇది. ఇటువంటి శ్లోకానువాదాలు ఇంకా అనేకం ఉన్నాయి.

రెండవ విభాగం: సమాంతర కల్పనలు

ఇదొక చిత్రం. మాట వరుసకు సమాంతర కల్పనలు అందాము. మూలంలోని తత్సమాలను తద్భవాలు గానూ, తద్భవాలను తత్సమాలు గానూ మార్చటం అన్నమాట. నైలింపసతుల కౌఁగిటఁ, దేలుటకై దివికి నేఁగు దృప్తారులకున్ అని మూర్తికవి కావ్యాలంకార సంగ్రహం (5-51). వేలుపు టింతుల కౌఁగిటఁ, బాలుపడం దివికిఁ బోవు పగతుర కెల్లన్ అని వేంకటకవి (ప.141). విజయలక్ష్మి వేణియుఁ బోలెన్ అని మూర్తికవి (5-51). గెలుపులచ్చి వేనలి లీలన్ అని వేంకటకవి (ప.142).

వెలఁదికి మణితాటంకము
లలరున్ దిగ్విజయకాంక్ష నతనుఁడు చూపున్
ములుగులు నిశాతములుగా
నలవడ వడిఁదీడు శాణయంత్రము లనఁగన్. కావ్యా (3-31)

చెలికి రతనాల కమ్మలు
వెలసెన్ దెసగెలుపు టిచ్చ వెడవిల్తుఁడు చూ
పుల ములుకులు పదను గలుగ
నలవడ రతనంపు శాణయంత్రము లనఁగన్. ప.306

తత్సమాలను తద్భవీకరించటం, తద్భవాలను తత్సమీకరించటం విద్యార్థులకొక చిత్రమైన కవితా వ్యాసంగమే. వెలఁదికి = చెలికి, మణితాటంకములు = రతనాల కమ్మలు, అమరున్ = వెలసెన్, దిగ్విజయకాంక్ష = దెసగెలుపు టిచ్చ, అతనుఁడు = వెడవిల్తుఁడు, చూపున్ ములుగులు = చూపుల ములుకులు (చూపులనెడి ములుకులను), నిశాతములుగా = పదను గలుగ – ఇత్యాది. ఇంకొకటి:

నీదు నిరవద్యకీర్తి మ
హా దుగ్ధపయోధిలోన నాదిమరాజ
ప్రాదుర్భూత యశంబులు
ప్రోదిం బుద్బుదములట్లు పొలుచు నృసింహా. కావ్యా (5-133)

దీనికి సమాంతర కల్పనం:

ఉల్లము పొడుపు దొరయ్యా
చల్లని నీ యసము పాలసంద్రములోనన్
దొల్లిఁటి సాముల యసముల
నెల్లను బుద్బుదములట్ల నిలఁ గన్పట్టున్. ప.150

సమాంతర రచనలో అనువాదకల్పాలు ఈ విధంగా ఉంటాయి. ఇవి విద్యార్థులకు ప్రాణకల్పాలు.

1 2 3 4 5 6 7అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • చీకటి నీడలలో బైరాగి జాడ
  • మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – III: కాలము, ఇతర విశేషాలు
  • సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.
  • విశ్వనాథ: వివాహాశీస్సులు
  • మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – IV: త్రిపురాంతకోదాహరణము

ఇటువంటివే…

  1. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.
  2. గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని
  3. ప్రధాన సంఖ్యలలో కవలలు
  4. ఈమాట జులై 2015 సంచికకు స్వాగతం!

జులై 2015 సంచికలో ...

  • ఈమాట జులై 2015 సంచికకు స్వాగతం!
  • ఎడారి అంచున
  • ఒంటరితనం
  • కషాయం
  • గుప్పెట్లో తూనీగ
  • జారిపోయిన కాలం
  • టీచింగ్ మూమెంట్స్
  • తోపులో పిల్లలు
  • దీక్షిత దుహిత
  • నల్ల బెలూన్
  • నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు
  • పుల్లెల శ్రీరామచంద్రుడు
  • పెదిమలు, తలుపులు
  • ప్రధాన సంఖ్యలలో కవలలు
  • బాలల కథల పోటీ – 2015
  • మొట్టమొదటి సారాకాపు
  • రెక్కిటికీ
  • వేడికోలు
  • సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.
  • సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.
  • స్టార్‌బక్స్ కథలు: ఘోస్ట్ సైకిల్
  • స్వరార్చనం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

స్వరార్చనం
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.