[గమనిక: ఈ వ్యాసం కథాకథనపద్ధతిలో ఏకాంశగా వ్రాసి రచయిత మాకు ప్రచురణార్థం పంపించారు. పాఠకుల సౌలభ్యార్థం ఈ వ్యాసాన్ని ఉపాంగాలుగా విడగొట్టి, మూలవ్యాసం లోని కొంత సమాచారాన్ని అనుబంధాలుగా ప్రకటించి, పరిష్కరించే ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో, విషయ తాత్పర్యంలో కానీ, వ్యాసవ్యవస్థలో కానీ లోటుపాట్లు కనిపిస్తే, ఆ పొరపాటు పూర్తిగా మాదని సవినయంగా తెలియజేస్తున్నాము. రచయిత మూలప్రతి పిడిఎఫ్ రూపంలో ఆసక్తి గల పాఠకుల కోసం అందిస్తున్నాము. – సం.]
1. ఉపక్రమణిక
నన్నెచోడుని కుమారసంభవ కావ్యాన్ని తొలిసారి ప్రకటించిన మానవల్లి రామకృష్ణకవిగారు 1909 నాటి ప్రథమభాగం పీఠికలో ఈ విధంగా వ్రాశారు:
“ఇతఁడు కలావిలాస మను మఱియొక్క కావ్యమును గూడరచించెను. అది నాకు లభింపకున్నను దానిలోని పద్యములు కవిసంజీవని, రత్నాకరము, అథర్వణచ్ఛందము, గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణిలో నుదాహరింపఁబడినవి. ఆపద్యములలోఁ గొన్నింటి నిందుదాహరించినయెడల సుముఖులెవ్వరైనఁ దద్గ్రంథమును వెదకి దానిననర్హమగు మరణమువలనఁ దప్పింతురను నాస గలుగుచున్నది.
సీ. పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు
కాంచనాచల కార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు
నవిరళ పాశుపతాస్త్రమునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
నతులితామర దానవాదిబలంబుల గెలిపించె నెవ్వఁడయ్యళిబలంబుతే. నట్టి జగజెట్టి మన్మథుం డఖిలలోక
ములకు వెఱగొంగ జీవుల మూలకండ
యతనియిలుఁ జొచ్చి వెడలనియతఁడు గలఁడె
యతనియమ్ములఁ బడకున్నయదియుఁ గలదె.క. తలపోయఁగ రుచులాఱును
గలుగును వాతంబుఁ గ్రిమియుఁ గఫముంజెడు నా
కలివుట్టు దగయుఁ జెడుఁ ద
మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్.చ. తొడవులు వెట్టు సంభ్రమముతోఁ దిలకించు మడుంగుగట్టు పైఁ
బడఁ దడవోప దింపెఱిఁగి పట్టుదు నేర్పులు గట్టిపెట్టుఁ బ
ల్కెడునెడఁ దొట్రుపాటొదవుఁ గింకకు చేగిలుమన్ సమర్పఁగాఁ (?)
జిడుముడిఁ బొందుఁగాంత పతిచేరిన గూరిమిగల్గెనేనియున్.చ. లలనలు కొందఱాత్మపతులం దగఁగూడినచెయ్వులన్నియుం
దలఁచి సఖీజనంబులకుఁ దప్పకచెప్పెడు వారు పుణ్యజీ
వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుటె కాక తాల్మికీ
ల్దొలఁగిన తీరుగీరు నటదోపవు నాకు రతిప్రయోగముల్.క్షేమేంద్రుఁడను నొకానొక కశ్మీరమహాకవి కలావిలాసమని సంస్కృతమున నొకగ్రంథము వ్రాసియున్నాఁడు. తెనుఁగుబద్యముల నన్నియుఁ గూర్చి పోల్చిచూడఁగా నద్దాని కిది తెనుఁగుగాదనియు నిందుఁ గథా భాగముకూడఁ గలదనియు సంస్కృతమున దానిలోఁ గథాంశములు లేకుండుటయుఁ జూడఁగా రెంటికిని నామమాత్రసాదృశ్యము గలదని తేలినది.” — (మానవల్లికవి రచనలు: పుటలు. 1,2)
మానవల్లి వారు సుప్రమాతంగా నిర్ధారించిన ఈ అంశాన్ని పురస్కరించికొని చరిత్రకారులు, విమర్శకులు నన్నెచోడుని రచనమైన కళావిలాసము అన్న ఆంధ్రకృతి — క్రీస్తుశకం 1029-1064ల నడుమ కాశ్మీరదేశాన్ని పరిపాలించిన అనంత నరేంద్రుని ఆస్థానకవి, మహాలాక్షణికుడు అయిన క్షేమేంద్రుని కలావిలాస కావ్యానికి అనువాదం కాదని, నామసాదృశ్యం తప్పించి దానితో ఎటువంటి సంబంధమూ లేని స్వతంత్రకావ్యమని నిశ్చయించారు. నన్నెచోడుని కాలం, కుమారసంభవ కర్తృత్వం తెలుగు సాహిత్యచరిత్రలో వివాదాస్పదం అయిన తర్వాత కూడా మానవల్లి వారి ఈ నిర్ధారణ విషయం క్షోదక్షమంగా మళ్ళీ పరీక్షకు గురికాలేదు.
ఈ వ్యాసంలో తెలుగు కళావిలాసమును గురించిన కొన్ని చర్చనీయాంశాలు చర్చింపబడుతున్నాయి. క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము నిజంగా అనువాదం అవునా? కాదా? అన్నది ప్రధాన సమస్య. పై ఉదాహరణలో మానవల్లి వారు ఏయే గ్రంథాలలో ఈ కళావిలాసములోని పద్యాలు ఉదాహరింపబడి ఉన్నాయని సూచించారో – ఆ గ్రంథాల పూర్వాపరచరిత్ర తెలిస్తే కాని ఈ సమస్య స్వరూపం, అందుకు పరిష్కారం అర్థం కావు. అందువల్ల ఆ వివరణ కొంత అవసరమవుతున్నది. ఆ తర్వాత పెదపాటి జగన్నాథకవి, గణపవరపు వేంకటకవి కళావిలాసము నుంచి ఉదాహరించిన పద్యాలను సమీకరించి, వాటి స్థితగతిచింతన చేయాలి. క్షేమేంద్రుని కలావిలాసంలోని కథాంశాన్ని, కవితాంశాన్ని పరిశీలిస్తే, తెలుగు కవులపై ఆ కృతి ప్రభావం, నన్నెచోడుడు దానిని తెలుగు చేయటంలోని ఔచిత్యం స్పష్టపడతాయి. కళావిలాసము నుంచి లభిస్తున్న ఒక్కొక్క పద్యాన్ని జాగ్రత్తగా అనుశీలిస్తే నన్నెచోడుని ఆంధ్రీకరణవిశేషాలు, కావ్యానువాదం జరిగిన కాలాన్ని నిర్ణయించటానికి మరికొన్ని ఆధారాలు దొరుకుతాయి. కళావిలాసము కర్త నన్నెచోడుడు గాక బద్దె భూపాలుడని, ఆ బద్దె భూపాలుడికి నన్నిచోడుడు అనే బిరుదున్నదని, అసలు కళావిలాసము కావ్యమే కాదని, అదొక కామశాస్త్రమని పరిపరివిధాల విమర్శకులు ఊహించిన విషయాల తథ్యమిథ్యావివేచన అవసరం. గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహరించిన పద్యాలు కూటసృష్టిపద్యాలని ఉన్న విమర్శకూడా ఆలోచింపదగినదే. ఈ చర్చాఫలితంగా – ప్రబంధరత్నాకరములో ఉదాహృతుడైన నన్నెచోడుడు, ప్రయోగరత్నాకరములో ఉదాహృతుడైన నన్నెచోడుడు ఒకరేనా? ఇద్దరు వేర్వేరు వ్యక్తులా? అన్న ప్రశ్న ఏర్పడుతుంది. వస్తుతత్త్వావధారణతో వీటికి సమాధానాలను ప్రతిపాదించటం ఈ వ్యాసరచనోద్దేశం.
ఇంతకీ సంస్కృత కలావిలాసం కథాకావ్యం అవునా? కాదా? అంటే, క్షేమేంద్రుడే స్వయంగా అన్న మాటలివి –
కేలీమయః స్మితవిలాసకలాభిరామః
సర్వాశ్రయాన్తర కలా ప్రకటప్రదీపః
లోకోపదేశవిషయః సుకథావిచిత్రో
భూయాత్ సతాం దయితఏష కలావిలాసః.(10-42)
(నానావిధాల మనోజ్ఞకేళీకలాపాలను ఏకరువుపెట్టేది, విలాసజీవనులు ఏ విధంగా సౌఖ్యానుభవాన్ని పొందుతున్నారో వివరించేది, ఎల్లవారు ఆశ్రయింపదగిన రసిక కళలను వెలుగులోకి తెచ్చేది, లోకానికి విధినిషేధపూర్వకంగా మంచిచెడ్డలను బోధించేది, యోగ్యులు వ్యవహరింపవలసిన తీరుతెన్నులను నేర్పే ఆసక్తికరమైన కథలతో వింతగొలిపేది అయిన ఈ సర్వకళావిలాసకథనం సజ్జనులకు ప్రీతిని కూర్చే మంచి స్నేహితుని వంటిది అగుగాక!)
క్షేమేంద్రుడు ఇంత స్పష్టంగా తన కావ్యంలో కథాంశ గుఱించి అనుఘటించినా, రామకృష్ణకవిగారు తెలుగు కళావిలాసములో మాత్రమే కథాభాగం ఉన్నదని — ‘…సంస్కృతమున దానిలోఁ గథాంశములు లేకుండుటయు…’ అని వ్రాయటానికి కారణం ఏమిటో తెలియదు. కవిగారి ఈ నిర్దేశాన్ని విమర్శకులు, వాఙ్మయచరిత్రాసక్తులు ప్రామాణ్యభావంతో ఔదలదాల్చటమే గాని, తామై స్వయంగా పరిశోధించినట్లు కనబడదు. చాగంటి శేషయ్య, 1946 నాటి ఆంధ్రకవితరంగిణి మొదటి సంపుటం (పు.173)లో — ‘క్షేమేంద్రుఁడు కళావిలాస మను పది సర్గల కావ్యమును సంస్కృతమున రచించియున్నాఁడు. కాని యిది యా గ్రంథమున కాంధ్రీకరణమైనట్లు గన్పట్టదు. క్షేమేంద్రుఁడు క్రీ.శ. 1020 – 60 కాలమువాఁడు.’ అని వ్రాశారు. ఆ తరువాతి చరిత్రకారులు, విమర్శకులు ఇంతకంటె ఈ విషయాన్ని అధికరించి తథ్యమిథ్యావివేచన చేయలేదు. ఆచార్య రవ్వా శ్రీహరిగారు అలబ్ధకావ్యపద్యముక్తావళి (పు.49)లో — ‘క్షేమేంద్రుడు సంస్కృతంలో రచించిన కళావిలాసమనే గ్రంథం ఒకటి ఉన్నది. కాని అందులో కథాంశమేమీ కానరాదు. నన్నెచోడుని కళావిలాసంలో మాత్రం కథాభాగం కనిపిస్తుంది. అందువల్ల నన్నెచోడుని గ్రంథం క్షేమేంద్రుని గ్రంథానికి అనువాదం కాదని చెప్పవచ్చు,’ అని వ్రాశారు. ఈ గతానుగతికోక్తుల నైపథ్యం వల్ల ఈ వ్యాసరచన ఆవశ్యకమైంది.
2. నన్నెచోడుని కాలనిర్ణయం: కళావిలాస కర్తృత్వం
కుమారసంభవము పీఠికలో మానవల్లి వారు నన్నెచోడుని కాలనిర్ణయానికి రూపొందించిన మార్గాలను వారి తర్వాతి పరిశోధకులు నిర్విచికిత్సంగా అనుసరించటం వల్ల ఈ సమస్య విషయమై ఎంతో అవ్యవస్థ, సందిగ్ధత ఏర్పడ్డాయి. చరిత్రకాథికులు నన్నయాథర్వణులిద్దరూ సమసామయికులని భావించిన రోజులవి. 1895లో కవిగారే, ‘ఆంధ్రభాషను గూర్చిన యుపన్యాసము’ అన్న వ్యాసంలో –
“నన్నయభట్టు మహాభారతముఁ దెనిఁగింపఁ బ్రారంభించినప్పుడే యథర్వణాచార్యులును దెనింగింపఁ దొడంగియుండును. వాగనుశాసనుఁ డారణ్యపర్వమున విడువఁగా నథర్వణాచార్యుఁడు కర్ణపర్వమున వదలెను. కాలముసెల్లఁగాఁ దిక్కనసోమయాజి దానును భారతము మొదటినుండి వ్రాయుటకంటె వీరిద్దరి పొత్తములలో నేదానినైన పూర్తిచేయుటయ భావ్యమని యూహించి రేఫఱకారసంకరమును లక్షణదోషములును లేని నన్నయ భట్టారకుని భారతమే పరిసమాప్తి నొందించుటకుఁ దలఁచెనని తోఁచుచున్నది.” -(మానవల్లికవి రచనలు: పు.456)
అని ఆనాటి తమ ఊహను ప్రకటించారు. నన్నయకు సమకాలికుడైన అథర్వణుడు రచించిన ఛందస్సులో కళావిలాసములోని పద్యాలున్నాయన్న ప్రతిపాదన వల్ల నన్నెచోడుడు క్రీస్తుశకం 11వ శతాబ్ది కంటె మునుపటివాడని సాధించటం జరుగుతుంది. కాని, సంస్కృతమహాకవులలో అగ్రేసరభాసమానుడైన క్షేమేంద్రుని కలావిలాసం ఆంధ్ర కళావిలాసానికి మూలమే గనుక అయితే, క్రీ.శ. 1029 – 64ల మధ్య కాశ్మీరాన్ని పరిపాలించిన అనంత నరేంద్రుని ఆస్థానంలో ఉన్న ఆ మహాకవికంటె నన్నెచోడుడు కనీసం ఒక శతాబ్ది తర్వాతివాడు కాకతప్పదు. ఈ వైషమ్యాన్ని గుర్తెరిగినందువల్లనే రామకృష్ణకవిగారు రెండు కావ్యాలను సరిపోల్చి, వాటికి వస్తుసామ్యం లేదని నిర్ధారించుకోవలసి వచ్చింది. నన్నెచోడుడు నిజంగా క్షేమేంద్రానువాదకుడే అయితే, ఆయన నన్నయ్యగారికి పూర్వతరుడన్న నిర్ణయానికి ఆ రోజుల్లోనే మూలచ్ఛేదం కలిగేది.
మహాకవిరచితమైన కావ్యంలో సమాధాయకమైన సౌందర్యాన్ని మనఃస్ఫూర్తిగా ఆస్వాదించి అనుభవింపవలసినదే కాని ఈ కాలనిర్ణయాలు, ఈ కర్తృత్వనిర్ణయాల భౌతికాంశవివేచన నిర్నిమిత్తకాలక్షేపమని కొందరంటారు. అది నిర్నిమిత్తం కాదు. ముముక్షువులు గృహస్థాశ్రమంలో ఉంటూ కేవలానుభవానందనీయమైన బ్రహ్మపదంకోసం అన్వేషించినట్లే, సాహిత్యికులు భౌతికం నుంచి ఆధిభౌతికానికి, అక్కడినుంచి ఆధిదైవికానికి, ఆ తర్వాత ఆధ్యాత్మికానికి ప్రయాణించేందుకు ఆద్యసాధనం ఇది. ఈ చరిత్రావగాహనతోడి పద్యానుశీలనం కవిత్వానుభవాన్ని మరింత పరిపూర్ణం చేస్తుంది. ఎరుక సమగ్రం అవుతుంది.
ప్రస్తావవిషయం పరిధి పెద్దదైనందున పఠనసౌలభ్యం కోసం కొంత సమాచారం ఉపాంగాలుగా ప్రకటించబడింది. ఆ వివరాలివి:
- అనుబంధము – 1: కళావిలాసము లోని పద్యాలు: మానవల్లి వారి ప్రాకరనిరూపణం
- అనుబంధము – 2: కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు: బద్దె భూపాలుడు
- అనుబంధము – 3: సంస్కృతంలో కలావిలాసము అనే కామశాస్త్రగ్రంథం ఉన్నదా?
- అనుబంధము – 4: సంస్కృత కలావిలాసము: ఆంధ్రకవులపై క్షేమేంద్రుని ప్రభావం
తెలుగు కళావిలాసము భౌతికస్వరూపావస్థను నిర్ణయించి, అది క్షేమేంద్రుని ప్రసిద్ధకావ్యానికి అనువాదమే అన్న నిశ్చయానికి వచ్చిన తర్వాత దాని కాలనిర్ణయం చేయబూనటం మేలు. అందుకు ఈ పరిశీలన దోహదం కాగలదన్న ఆకాంక్షతో ఈ విషయజాతం ప్రతిపాదింపబడుతున్నది.