నవంబరు 2026

Issue Index Image

మంచి చారిత్రికనవల లక్షణాలు ఏమిటని వితర్కించుకొన్నప్పుడు మనకు వెంటనే చారిత్రికనవల అన్న పదబంధంలోనే ఒక విరోధాభాస (paradox) కనిపిస్తుంది. నవల అంటేనే కల్పిత సాహిత్యం. అది రచయిత సృజనాత్మకతకు, ఊహాశక్తికి ప్రతిరూపం. కానీ, చరిత్ర అందుకు భిన్నంగా వాస్తవాల ఆధారంగా జరిపే సత్యాన్వేషణ. రచయిత సృజనాత్మకతను ఉద్దీపింపజేసే కల్పనలు లేకుండా నవల రక్తి కట్టదు, కానీ, కచ్చితమైన ఆధారాలు లేకుండా చరిత్ర చెప్పకూడదు. వాస్తవాలను, కల్పనలను కలిపి రాయటమే ఈ ప్రక్రియలో ఉన్న ప్రధాన వైరుద్ధ్యం. ఈ వైరుద్ధ్యాన్ని అధిగమించాలంటే ఆ రచయిత కొన్ని నిర్దిష్టమైన లక్షణాలకు కట్టుబడాలి. ముందుగా, చారిత్రికనవలాకారుడు స్వయంగా చరిత్రకారుడైనా కావాలి; లేకపోతే, లోతుగా చరిత్రను, చరిత్రకు సంబంధించిన శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడైనా కావాలి. గతాన్ని వక్రీకరించకుండా, అదే సమయంలో కేవలం వాస్తవాలకే పరిమితం కాకుండా కల్పనను జోడించడం ఒక కళ. చారిత్రికసత్యాలను స్వీకరించడమే కాకుండా, ఆ చారిత్రికసంఘటనల వెనుక ఉన్న మానవీయస్వభావాలను, అధికారికచరిత్రల అట్టడుగున పడి కాన్పించని కథలను, వినిపించని స్వరాలను కూడా చూడగలిగే, వినగలిగే స్పష్టత ఆ రచయితకు ఉండాలి. అలాగే, కథలోని పాత్రలు ఆనాటి సామాజిక, మత, సాంస్కృతిక పరిమితులకు లోబడి ఆలోచించాలి తప్ప, పాతకాలపు దుస్తులు వేసిన ఆధునిక మనుష్యులు కారాదు. రచయిత ఎంత లోతైన చారిత్రికపరిశోధన చేసినప్పటికీ, కథాగమనానికి అడ్డుతగిలేలా పేజీల కొద్దీ చారిత్రికవివరాలను గుమ్మరించకుండా సందర్భోచితంగా వాస్తవాలను కథలో ఇమిడ్చే నేర్పు ఉండాలి. ఒక బలమైన కథ, ఆసక్తికరమైన పాత్రలే నవలను ముందుకు నడిపిస్తాయి కాబట్టి, ఉత్తమ చారిత్రికనవలాకారుడు చారిత్రికసత్యాలతో పాటు, స్థలకాల పరిమితుల్ని దాటే మానవసంబంధాలను, భావోద్వేగాలను తన కథనంలో పలికించగలగాలి.

అయితే, భారతీయభాషలలో చారిత్రికనవలల గురించి విశ్లేషించేటప్పుడు వలసపాలనలో జరిగిన చారిత్రికవక్రీకరణలను గురించి తప్పక ప్రస్తావించుకోవాలి. పాశ్చాత్యచరిత్రకారులు ఎంతోమంది సత్యాన్వేషణకోసం తమ జీవితాలను ధారపోసి భారతీయచరిత్రలో అనేక అద్భుతమైన విషయాలను వెలికితీసినప్పటికీ, వారికి తెలియకుండానే వారి రచనలలో వలసవాదపు ఆధిపత్యాన్ని సమర్థించుకునే క్రమంలో స్థానిక కథనాలను, ఆధారాలను, సాహిత్యాన్ని చిన్నచూపు చూడటం వల్ల ప్రాచీన భారతదేశం సాధించిన ఎన్నో అద్భుతమైన అంశాలు వారు నిర్మించిన చరిత్రలలో వెలుగు చూడలేదు. ఈ రకమైన వక్రీకృతచరిత్ర సృష్టించిన అస్తిత్వసంక్షోభంనుండే తమ గతాన్ని తాము సగర్వంగా పునర్నిర్మించుకోవాలన్న తపన భారతీయ రచయితల్లో మొదలైంది. ఫలితంగా, పలువురు రచయితలు భారతీయ ప్రాచీనచరిత్రను ఒక స్వర్ణయుగంగా ఆరాధిస్తూ, తమ చారిత్రికరచనల ద్వారా భారతీయుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేయబూనారు. అయితే, ఈ ధోరణి మరింత పెచ్చుపెరిగి, ఏమాత్రం శాస్త్రాధారాలు లేని కాల్పనిక ఊహలతో తమ ఇష్టాలకు, విశ్వాసాలకు అనుగుణంగా చరిత్రను తిరగరాసే ధోరణి తెలుగులో పేరెన్నికగన్న పలు చారిత్రికనవలల్లో బహుళంగా కనిపిస్తూ వచ్చింది. వలసపాలనాకాలంలో ఉద్భవించిన వక్రీకృతచరిత్రను తిప్పికొట్టాలంటే, మరింత శాస్త్రసమ్మతమైన వాస్తవాలతో, అత్యాధునికమైన పరిశోధనల ద్వారా పొందిన ఆధారాలతో సంక్లిష్టమైన భారతదేశచరిత్రను పునర్నిర్మించుకోవాలి తప్ప, విశ్వాసాలను, జాతీయవాద భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని కేవలం గతాన్ని కీర్తించే ఊహాత్మక కల్పనలతో కాదు.

నిజానికి, చరిత్ర అన్నదే నిరంతరం వికసించే జ్ఞానం అయినప్పుడు, ఏ చారిత్రికనవల కూడా నూటికి నూరుపాళ్లు నిష్పాక్షికంగా ఉండలేదు. ఒక రచయిత చారిత్రికనవలల ద్వారా తన సొంత దృక్పథాన్ని, అభిప్రాయాలను వ్యక్తపరచడం అత్యంత సహజం. కానీ, ఆ అభిప్రాయాలు, సైద్ధాంతిక భావజాల వ్యక్తీకరణకూడా శాస్త్రసమ్మతమైన చారిత్రికాధారాల పునాదిపై నిలబడాలి. 20వ శతాబ్దంలో విశ్వనాథ సత్యనారాయణ, ముదిగొండ శివప్రసాద్ వంటి వారు చరిత్రను ‘కుడి’ వైపు నుంచి చూస్తూ గతాన్ని స్వర్ణయుగంగా కీర్తిస్తే, రాహుల్ సాంకృత్యాయన్ వంటి రచయితలు దానికి విరుద్ధంగా చరిత్రను ‘ఎడమ’ వైపు నుంచి చూస్తూ, భారతదేశ గతచరిత్రను వర్గపరమైన దోపిడీకి, చార్వాక, లోకాయత, బౌద్ధ మతాల అణచివేతలకు నిదర్శనంగా చిత్రించారు. తెన్నేటి సూరి రచించిన ‘చెంఘిజ్ ఖాన్’ నవలలో సమకాలీన రాజకీయాల ప్రసక్తి, ముఖ్యంగా 1962 నాటి చైనా దండయాత్ర, అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ అనుసరించిన ఆదర్శవాద విధానాల పరోక్ష ప్రస్తావన ఉందన్నది సాహిత్య విమర్శకులు అంగీకరించే వాస్తవం. ఇలా రచయితలు తమ భావజాలాలకు, సైద్ధాంతిక దృక్పథాలకు, సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా చరిత్రను అన్వయించుకున్నప్పటికీ, కథలు కేవలం ఊహాత్మకమైన శుద్ధ కల్పనల మీద కాకుండా, లోతైన చారిత్రికావగాహన, పరిశోధనల పునాదుల మీదే నిర్మించాలన్నది ఏ చారిత్రికనవలాకారునికైనా అత్యంత మౌలికమైన నియమం కావాలి.

చారిత్రికపరిశోధన కత్తిమీద సాము అయితే, చారిత్రికనవల రాయడం రెండు కత్తులమీద సాము. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉత్తమస్థాయి చారిత్రికనవలల సంఖ్య చాలా తక్కువేనని చెప్పక తప్పదు. శాస్త్రసమ్మతమైన వాస్తవాల పునాదులపై అత్యుత్తమ సృజనాత్మకతతో చేసిన కల్పనల కథాకథనసౌధాన్ని నిర్మించే ఉత్తమచారిత్రికనవలు ఆధునిక తెలుగు సాహిత్యానికి ఎంతో అవసరం.