అను.3 – సంస్కృతంలో కలావిలాసము అనే కామశాస్త్రగ్రంథం ఉన్నదా?

‘నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?’ అన్న విమర్శగ్రంథాన్ని 1983లో ప్రకటించిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ఈ కళావిలాస కావ్యకర్తృత్వం విషయాన్ని కూడా చర్చించి, ప్రబంధరత్నాకరములోని కళావిలాసము, ప్రయోగరత్నాకరములోని కళావిలాసము ఒకటి కావని, ఆ రెండింటి కర్తలు వేర్వేరని రెండు ముఖ్యమైన సాధ్యనిర్దేశాలను ప్రతిపాదించారు. వారి దృష్టిలో

  1. పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో ఉదాహృతమైన కళావిలాసము కథాకావ్యం కాదు. అదొక కామశాస్త్రగ్రంథం.
  2. గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహృతమైన కళావిలాసము కామశాస్త్రగ్రంథం కాదు. అదొక ‘నానాపురాణకథావిలాసము’ అయిన ఒక స్వతంత్రకావ్యం.

అందువల్ల పెదపాటి జగన్నాథకవి, గణపవరపు వేంకటకవి పేర్కొన్నవి రెండూ భిన్నవస్తుకాలైన భిన్నకావ్యప్రభేదాలు (పు. 244-5లు) అని వారి ప్రతిపాదన.

కామశాస్త్రమైన కళావిలాసము ఎవరిదో పెదపాటి జగన్నాథకవి చెప్పలేదు. కావ్యమాత్రమైన కళావిలాసము నన్నెచోడునిదని గణపవరపు వేంకటకవి చెప్పాడు. అందువల్ల ఈ కావ్య కళావిలాసం ‘నన్నెచోడ నరేంద్రుడు’ అన్న పర్యాయబిరుదాన్ని కలిగిన బద్దె నృపాలుని రచన కావచ్చునని శ్రీరామమూర్తి గారు ఊహించారు. మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉన్న బద్దె నృపాలుని ‘బద్దె నీతి’లోని మూడు పద్యాలను, నీతిశాస్త్రముక్తావళిలోని రెండు పద్యాలను తమ నిర్ణయానికి ఆధారం చేసుకొన్నారు. సకలనీతిసమ్మతములోని అపపాఠాలవల్ల ఏర్పడిన ఆ బద్దెన భూపాలునితోడి అన్వయం చారిత్రికంగా సాధ్యం కాదని అనుబంధం – 2లో వివరించటం జరిగింది.

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో ఉదాహరించిన కళావిలాసము కామశాస్త్రగ్రంథమని చేసిన ఊహాత్మకప్రతిపాదనం ఈ అధికరణలో విచారింపబడుతున్నది. అది అనువాదం కావచ్చునా? అని పరిశీలించి చూడగా – సంస్కృతంలోని కామశాస్త్రగ్రంథాల నికురుంబంలో కలావిలాసము అన్న పేరిటి గ్రంథం లేదు. పుణ్యానందనాథుని కామకలావిలాసం కాశ్మీర కులార్ణవ తంత్రమార్గంలో హాదివిద్యకు చెందిన శైవసమయగ్రంథమే కాని ప్రకృతపరిశీలితాల పరిధి లోనిది కాదు. సంస్కృతంలో కామశాస్త్రగ్రంథాలపై వెలసిన వ్యాఖ్యానకదంబంలోనైనా కలావిలాసమనే వ్యాఖ్య లేదు. అందువల్ల తెలుగు కళావిలాసము ఆ పేరుగల సంస్కృతకృతికి అనువాదం కాకపోవచ్చును. తెలుగులో నారాయణదేవుని మదన కళాభిరామమునకు కళావిలాసముతో పోలిక లేదు. అందులో కళావిలాసమును పోలిన పద్యాలు లేవు. కళావిలాసము లోని పద్యాలు లేవు. ముద్రితమై ఉన్న కళాశాస్త్రము అన్న కామశాస్త్ర ప్రకరణగ్రంథంలోనూ, నా వద్ద ఉన్న కళాశాస్త్రము అన్న కామశాస్త్రనిర్వర్ణనమైన (అముద్రిత) తాళపత్రగ్రంథంలోనూ కళావిలాసము ప్రసక్తి గాని, దానిలో నుంచి ఉదాహరింపబడిన పద్యాలు గాని లేవు.

జక్కన విక్రమార్క చరిత్రము సప్తమాశ్వాసంలో విక్రమార్కుడు తన మంత్రవిద్యతో ఒక సువర్ణకలశానికి సచేతనత్వాన్ని కలిగించే కథ ఒకటున్నది. మాటలు వచ్చాక రాజు ఆ కలశాన్ని, అపూర్వ కళామహాదర, శ్రీ రుచిమీఱ నొక్క కథఁ జెప్పఁగదే (8-3) అని ఆజ్ఞాపిస్తాడు. సువర్ణకలశం పద్మావతి అనే జాణ కథను వినిపిస్తుంది. పుష్పకరండకుడు ఇష్టలీలావినోదాలకోసం తచ్చట్లాడుతూ మహాఘోషపురంలో పద్మావతి ఉంటున్న మందిరానికి వస్తాడు. ఆ మందిరాన్ని కాముకీకళామందిరంగా వర్ణిస్తూ మహాకవి జక్కన –

ఉ. ప్రాకటహేమరత్నమయపంజరపీఠికలన్ శుకంబు ల
      వ్యాకులలీలతో రతిరహస్యవికాస కళావిలాస కొ
      క్కోకము లర్థితోఁ జదువఁ గూరిమితో వినుచున్ సురూపరే
      ఖాకమనీయతామహిమఁ గాముని దీమముఁ బోలె ముందటన్. (8-21)

అని వ్రాశాడు. రత్నాలు పొదిగిన బంగారు పంజరాలలోని పీటలమీద కూర్చొన్న చిలుకలు తన్మయతతో ‘రతిరహస్యవికాస కళావిలాస కొ, క్కోకము’ లను చదువుతుంటే పద్మావతి వింటున్నదట. రతిరహస్యము అంటే 13-వ శతాబ్ది నాటి కొక్కోకుడు రచించిన కామశాస్త్రప్రకరణగ్రంథం. ‘ఇతి శ్రీ సిద్ధపణ్డితసింహళీయ కొక్కోకవిరచితే రతిరహస్యే’ అని పుస్తకం చివర ఉన్నది. కొక్కోకుడు అన్నది కవి పేరన్నమాట. రతిరహస్యానికే కొక్కోకము అని వ్యవహారనామం. నిజానికి కొక్కోకము అనటమే గాని, రతిరహస్యము అన్న పేరుతో వ్యవహరించేవారు తక్కువ. అష్టమాశ్వాసంలోనే గుణవతి కథను చెబుతూ సువర్ణకలశం ఆమె ఉపపతితో ప్రసంగించే సందర్భంలోనూ జక్కన –

సీ. సేమంతికెలఁ జెలరేఁగి చిలుకలు మదనశాస్త్రంబులు చదువుచుండఁ
      గడిమికూటములఁ బికమ్ము లనంగ నేపాళప్రబంధంబు లాలపింప …

అని వ్రాశాడు. ఇక్కడ ‘నేపాళ ప్రబంధంబులు’ అంటే నేపాల్ దేశంలోని ప్రబంధాలు కావు. నేపాళము అంటే సింహళదేశంలోని జాఫ్నా దీవి అన్నమాట. సింహళీయుల ‘యార్పాణమ్’, ‘యార్పాళమ్’ ధ్వనిసామ్యం వల్ల తెలుగులో ‘నేపాళం’ అయింది. ‘అనంగ నేపాళ ప్రబంధంబులు’ అంటే సింహళీయ కొక్కోక ప్రబంధమే. చేమకూర వేంకటకవి రఘునాథనాయకుని గురించి –

క. సుస్థిరలక్ష్మీ మహిత మ
      ణిస్థగితగృహాంగణునకు నేపాళనృపా
      లస్థాపనచణునకు …

అని విజయవిలాసము (1-62) లో వర్ణించిన నేపాళ రాజ్యం జాఫ్నా మండలమే. ‘నేపాళనృపా,లస్థాపన’మంటే క్రీస్తుశకం 1615లో రఘునాథరాయలు జాఫ్నా ప్రభువు మణ్ణన్ సింగర్ భార్యల ప్రార్థనను మన్నించి అక్కడికి వెళ్ళి శాంతిస్థాపన చేసిన కథన్నమాట. కనుక జక్కన దృష్టిలో ‘కడిమికూటములఁ బికమ్ము లనంగ నేపాళప్రబంధంబు లాలపింప’ అన్నప్పుడు పికాలు ఆలపిస్తున్నది సింహళీయ కొక్కోకుని రతిరహస్యమే అన్నమాట స్పష్టం.

అయితే జక్కన తన పద్యంలో కొక్కోకములు, నేపాళ ప్రబంధంబులు అనటం వల్ల బహువచనాన్ని బట్టి ఆ చిలుకలు 1) రతిరహస్యము, 2) కళావిలాసము, 3) కొక్కోకము అన్న మూడు పుస్తకాలను చదువుతున్నట్లు పొరపాటున అన్వయించుకొనే అవకాశం ఉన్నది. అప్పుడు రతిరహస్యము అంటే కొక్కోకము అని గాక వేఱొక గ్రంథనామం అవుతుంది. ఆ పేరుతో తెలుగులో వరాహపురాణము, ఉత్తర నారసింహపురాణము భాగవత ఏకాదశ షష్ఠ స్కంధములు మొదలైన పెక్కు కావ్యాలను రచించిన 15-16 శతాబ్దుల నాటి మహాకవి హరిభట్టు రచించిన సంస్కృత కృతి రతిరహస్యము లేకపోలేదు. అది కామశాస్త్రగ్రంథమే. గతశతాబ్దంలో అచ్చయింది. మాడభూషి కృష్ణమాచార్యులవారు History of Classical Sanskrit Literatureలో (పు. 892) ఈ రతిరహస్యము విద్యాధరుని ఏకావళిలో బిన్ద్వలఙ్కారము కర్తగా ఉదాహృతుడైన క్రీస్తుశకం 13-వ శతాబ్ది నాటి హరిహరుడని అనుమానించారు కాని, ఆ అనుమానం సరికాదు. ఈ సంస్కృత రతిరహస్యము కర్త హరిభట్టు చంద్ర సంజ్ఞ కలిగిన రామపండితుని కొడుకు. అంటే, ఆంధ్రుడైన మన హరిభట్టే కాని అన్యకవి కాడు. తదనుసారం ఆ దళానికి — హరిభట్టు రచించిన రతిరహస్యం, ఎవరి రచనో మనకిప్పుడు తెలియని కళావిలాసం, కొక్కోకమనే మారుపేరు గల రతిరహస్యం అన్న మూడు గ్రంథాలను పఠిస్తున్న పంజరశుకాలు, అని అర్థం చెప్పుకోవాలి.

ఇందుకు ప్రతిబంధకమల్లా ఒక్కటే – హరిభట్టు జక్కనకు తర్వాతి కాలంలోనివాడే కాని, పూర్వుడు కాడు కదా! అందువల్ల జక్కన చెప్పిన కథానాయిక పద్మావతి ఇంటి గ్రంథాలయంలో హరిభట్టు రతిరహస్యము ఉండే వీలుండదు. ఒకవేళ జక్కన కాలం కూడా వివాదగ్రస్తమే కాబట్టి, వాదనిమిత్తం జక్కన హరిభట్టుకంటె ఆధునికుడనుకొన్నా – 1) రతిరహస్యము, 2) కళావిలాసము, 3) కొక్కోకము అన్న మూడు పుస్తకాల మధ్య ఎటువంటి అన్వయమూ లేని ‘వికాసము’ అన్న నిరర్థకపదం వచ్చి చేరింది. ఆ పేరును నామాంశమాత్రంగానైనా కలిగిన గ్రంథమేదీ లేదు.

ఆ పక్షాన ‘రతిరహస్యవికాస కళావిలాస కొ, క్కోకములు’ ఎట్లా అన్వయిస్తుంది? అంటే, భగవద్గీతలు, ఉత్తరగీతలు అంటున్నట్లు కొక్కోకములు అనటం తెలుగువారి సంప్రదాయం అన్నమాట.

క. ధర తాళపాక అన్నయ
      వరసుతుడగు తిరుమలయ్య వాచాప్రౌఢిన్
      వెరవుగ భగవద్గీతల
      పరమార్థము లంధ్రభాష పరగ రచించెన్.

అని శ్రీ భగవద్గీతకు తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల తొలి తెలుగు వచనానువాదం వ్రాతప్రతి ఒకదానిలో ఉన్న పద్యాన్ని ఆచార్య సచ్చిదానందమూర్తి గారు తమ ప్రస్తావన (పు. xv) లో ఉదాహరించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్యపరిశోధనాలయం వారు 1978లో అచ్చువేసిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల శ్రీ భగవద్గీతలో ఈ పద్యం ప్రస్తావన ఉన్నది. అందులో ఉన్నట్లు ‘భగవద్గీతలు’ అనే తెలుగువారి సంప్రదాయం. సంస్కృతంలో అయినా ‘భగవద్గీతాసు’ అనే బహువచనం వాడుక. జక్కన పద్యంలో రతిరహస్యవికాస కళావిలాస కొ, క్కోకము లర్థితోఁ జదువ’ అన్నదానికి మారుగా ‘రతిరహస్యవికాస కళావిలాస కొ, క్కోకము నర్థితోఁ జదువ’ అని ఉంటే ఏ వివాదమూ ఉండేది కాదు కాని -– అది తెలుగువారి వ్యవహారపద్ధతి కాదు.

కొక్కోకములు అంటే కొక్కోక శ్లోకాలో (విక్రమార్కుడి కాలం మాటెలా ఉన్నా కొక్కోకుడు జక్కనకు పూర్వుడే కనుక), కొక్కోక పద్యాలో అనుకోవచ్చును కాని తెలుగులో అప్పటికి ఇంకా కూచిరాజు ఎఱ్ఱన తెలుగు అనువాదం వెలువడలేదు కాబట్టి శ్లోకాలనే అన్వయించాలి.

దీనిని బట్టి జక్కన పద్యోదాహరణం కళావిలాసము అనే కామశాస్త్ర గ్రంథస్థితికి ఉపస్కారకం కాదని తాత్పర్యం. ఇదంతా మనకై మనము పరిశీలిస్తున్న విషయమే కాని ఆచార్య శ్రీరామమూర్తి గారి ప్రతిపాదనకు ఇది ప్రాతిపదికం కాదు. ప్రబంధరత్నాకరములో ఉదాహృతమైన కళావిలాసము పద్యాలు కామశాస్త్రవిషయాలు కాబట్టి అది కామశాస్త్రకృతి అని మాత్రమే వారి భావన.

నిజానికి శ్రీరామమూర్తిగారి ప్రత్యంతరంలో విటలక్షణము – కళావిలాసము; విటశృంగారము; కుటిలవేశ్య లక్షణము; వేశ్యమాత; భద్ర దత్త కూచిమార పాంచాలురు; చిత్తిని; హస్తిని; శంఖిని; పద్మిని; బాలకు; యౌవనకు; ప్రౌఢకు; లోలకు; కూర్మి; అన్న శీర్షికలను చూస్తే ఈ కళావిలాసము పరిపరి శృంగారవిషయాల సంధానమే గాని కామశాస్త్రపాఠ్యం కాదని సులభంగానే ఊహింపవచ్చును. శ్రీరామమూర్తిగారు పద్యాల పరిష్కృతపాఠాలను గాక విమర్శకుల పరిశీలనార్థం వ్రాతప్రతిలో ఉన్నవాటిని ఉన్నట్లుగా ఇవ్వటం వల్ల చదువుకొనేవారికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. వాటిని సవరించి చదుకోవలసి వస్తుంది. ఒకటి రెండు ఉదాహరణలివి:

ఉ. బాలల రూపు చూపుకొని భద్రుఁడు మాటల (?) బెండువెట్టి పాం
      చాలుఁడు వశ్యమంత్రజపసాధ్యచయంబులఁ గూచిమారుఁ డా
      భీల(?)ధనాంబరావళులఁ బ్రీతులుఁ (?) జేయుచు దత్తకుండు లీ
      లాలలితానురాగగతులన్ సుఖియింతు రనంగసౌఖ్యముల్. (పద్యం. 8)

తన రూపరేఖలతో భద్రజాతి పురుషులు, కళాస్థానాలను కరగించి పాంచాలులు, మందుమంత్రాలతో కూచిమారుడు, అధికధనాదులతో దత్తకుడు కాంతలను లోబరచుకొంటారని కామశాస్త్రం. మొదటి పాదంలో దత్తకుడు ‘బాలల రూపు చూపుకొని’ అన్నప్పుడు రూపానికి ధాత్వర్థఫలాశ్రయత్వం వల్ల ద్వితీయా విభక్తిసిద్ధి, తత్ఫలంగా ‘రూపున్’ అన్నప్పుడు ద్రుతసంధి విహితమవుతాయి. ‘బాలల రూపుఁ జూపుకొని భద్రుఁడు’ అని ఉండాలి. ‘బాలల’ అన్నచోట బహువచనప్రయుక్తి సరసార్థసాధకం కాదు. పైగా విరసార్థబోధకం. ‘బాలను రూపుఁ జూపుకొని భద్రుఁడు’ అని ఉండటం సమంజసం. ‘మాటల బెండువెట్టి’ అన్నది అపపాఠం. పాంచాలుడు మాటలతో వశపరచుకోవటం అన్న నిర్వచనం శాస్త్రవిరుద్ధం. మాటులను = అంటే ఏకాంతసమావేశంలో కాంత కళాస్థానాలను; బెండువెట్టి = కరగించి వశపరచుకొనేవాడు పాంచాలుడు అని అర్థం. అందువల్ల ‘మాటుల బెండువెట్టి పాం, చాలుఁడు’ అని ఉండాలి.

అలాగే, కరగించు, వశపరచికొను అన్న అర్థాలలో ‘బెండువెట్టు’ పదబంధాన్ని నిఘంటువులు గ్రహింపలేదు. అందుకు ఈ ప్రయోగమొకటి ఆకరమై ఉండటం విశేషం. ‘వశ్యమంత్రజపసాధ్యచయంబుల’ అంటే వశీకరణతంత్రాలలో చెప్పబడిన ఔషధాలు, సిద్ధిదాయకమంత్రజపాలు, సాధ్యములైన క్రియాభేదాలు అన్నమాట. ఇవన్నీ ఈనాడు అలభ్యంగా ఉన్న కూచిమార తంత్రంలోని ప్రయోగవిశేషాలు. తక్కిన గ్రంథాలలోనూ ఉన్నాయి. ‘ఆ,భీలధనాంబరావళులఁ బ్రీతులుఁ జేయుచు’ అన్నదానికి అన్వయం లేదు. దత్తకుడు, ఆభీల=భయం గొలిపే; ధన+అంబర+ఆవళులను ఇచ్చి వశపరచుకొంటాడన్నది అపార్థాన్నిస్తుంది. ‘ఉద్వేల=మేరలేని; ధన+అంబర+ఆవళులను ఇచ్చి వశపరచుకొంటాడని సవరించుకోవాలి. ‘ప్రీతులున్’ అన్నది వాచకదోషం. ‘ప్రీతలన్+చేయుచు’ అని మహతీవాచకాన్ని దిద్దుకోవాలి. ‘లీ,లాలలితానురాగగతులన్’ అన్నప్పుడు లలిత శబ్దానికి 1. ఈప్సితార్థంలో ‘ఇష్టమైన’ అని, 2. లాక్షణికార్థంలో ‘శృంగారానురూపములైన చేష్టావిశేషాలతో’ అని భావార్థాలను చెప్పుకోవాలి. అంతే కాని, అనురాగలాలిత్యం నాయకుని ధీరలలితత్వానికి బోధకం కాదు. ‘సుఖియింతు రనంగసౌఖ్యముల్’ అన్న దళానికి ‘సౌఖ్యాలను సుఖిస్తారు’ అని గాక, ‘మన్మథసౌఖ్యాల భోగయుక్తి వల్ల సుఖైకసాధ్యమైన సంతృప్తిని అనుభవిస్తారు’ అని అర్థాన్వయం.

అక్షరస్థితిని బట్టి పద్యం ఇట్లా ఉండాలి:

ఉ. బాలను రూపుఁ జూపుకొని భద్రుఁడు; మాటుల బెండువెట్టి పాం
      చాలుఁడు; వశ్యమంత్రజపసాధ్యచయంబులఁ గూచిమారుఁ; డు
      ద్వేలధనాంబరావళులఁ బ్రీతలఁ జేయుచు దత్తకుండు లీ
      లాలలితానురాగగతులన్ సుఖియింతు రనంగసౌఖ్యముల్.

ఇదంతా కథాగతమైన ఏదో నిరుక్తమే గాని చతుర్విధ విటుల లక్షణనిర్వచనం వలె తోచదు. చతుర్విధ విటుల లక్షణనిర్వచనం అయితే అసలు సరిపోదు. లోల అయిన చిత్తినిని రాత్ర్యంతాన మూడవ యామంలో భద్రుడు, బాల అయిన పద్మినిని నాలుగవ జామున పాంచాలుడు, ప్రౌఢ అయిన హస్తినిని రాత్రి రెండవ జామున దత్తకుడు, ధీర అయిన శంఖినిని పూర్వయామవేళలో కూచిమారుడు వశపరచుకొంటారని కొక్కోకశాస్త్రం. ఇందులో ఆ అన్వయం సాధ్యపడదు.

కవి గొప్ప పండితుడు. ఇతరేతరపద్యచయాన్ని బట్టి ఆయనకు మల్లనాగుని వాత్స్యాయన కామసూత్రం, బాభ్రవ్యుని స్మరదర్శనం, కల్యాణమల్లుని అనంగరంగం, ప్రౌఢదేవరాయల రతిరత్నప్రదీపిక మొదలైన కోవిదుల రచనలతో, వాటిలోని అంతర్భేదాల నిర్వచనాలతో పరిచయం ఉండినదని తెలుస్తూనే ఉన్నది. పద్యం ప్రౌఢంగా ఉన్నది.

ఒక్కటే సందేహం: ‘బాలల రూపుఁ జూపుకొని భద్రుఁడు’ అన్న ఎత్తుగడను చూడగానే పాఠకులకు ‘కన్నులు ద్రిప్పుచు వన్నెలు పచరించు రూపుఁ జూపుచును భద్రుండు దిరుగు’ అన్న క్రీ.శ. 1525 నాటి ఎడపాటి ఎఱ్ఱన శృంగార మల్హణ చరిత్రము ద్వితీయాశ్వాసంలోని 128-వ పద్యం గుర్తుకు వస్తుంది. ఉభయపద్యాలను సూక్ష్మంగా చదివినప్పుడు కళావిలాసము కర్త నన్నెచోడుడు ఎడపాటి ఎఱ్ఱన పద్యాన్ని అనుకరించినట్లు కనబడుతుంది.

మరొకటి, బాలతో మన్మథాగమవేత్త అయిన పాంచాల జాతి విటుని ప్రథమసురతాన్ని వర్ణించే పద్యం:

మ. అమితస్వచ్ఛ మచుంబితాధర మపూర్వానంగవిద్యాసురం
      గ మదంతక్షతకంఠ మగ్రహణకక్షాస్థానయుగ్మం బనిం
      ద్య మహేయం బవలంబనాంకురితరోమాంచంబు బాలాంగనా
      గమసంభోగము నింపు సొంపు విటలోకప్రీతి గాకుండునే. కళా. (ప. 14)

(మిక్కిలి నిర్మలమైనది, ఇంకా ముద్దుగొనని కెమ్మోవిని కలిగినది, అంతకు మునుపు మన్మథసుఖానుభవపరిచయం లేని రతిరాజద్వారం కలది, గ్రీవాపురోభాగాన దంతక్షతం సోకనిది, బాహుమూలయుగళాన్ని దగ్గరికి తీసికొనటం ఎరుగనిది, ఎటువంటి అపవాదుకు దారితీయనిది, ఎన్నటికి వదులుకోరానిది, తాకినంత మాత్రాన నిలువెల్లా గగుర్పొడిచేది అయిన యుక్తవయస్కురాలైన కన్యతోడి తొలిపొందు యొక్క ఆ అనురక్తి, ఆ సౌందర్యయుక్తి విటలోకానికి ప్రీతిపాత్రం కాకుండా ఉండగలదా?)

పద్యమైతే అమోఘంగా ఉన్నది. ‘అమితస్వచ్ఛము’ అన్న పై ఉపక్రమణం యతిప్రాసలకోసం కాదు. ఆమెతోడి పొందు ‘రోగరహితమైనది’ అని ధ్వని. ‘బాలా+అంగనా+ఆగమ’ అనటం వల్ల ఆమె పద్మిని, అందగత్తె, యౌవనోచితమైన వపుర్విజృంభణ కలిగినది, మన్మథాగమకోవిదురాలు, అనురక్త అని భావం. ‘విటలోకప్రీతి’ అంటే పాంచాలుడు ఆ ఇంపుసొంపులను తన సహచరులకు ప్రీతికరంగా వినిపించాడని ధ్వనితార్థం.

‘విటలోకానికి ప్రీతిపాత్రం కాకుండా ఉంటుందా?’ అన్న సంవాదధోరణి మూలాన ఈ పద్యంకూడా కామశాస్త్రపాఠ్యాంశంలోనిది కాదనిపిస్తుంది. కామశాస్త్రమైతే ప్రాకరణికం లేదు. అది శాస్త్రబోధసరణి కాదు. కావ్యగతమే కాగలదు.

దీనితో కొంత పోలిక కలిగిన రచన క్రీస్తుశకం 1760 నాటి అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతిలో గోపవనిత మంజుల జారశేఖరునితో రహస్యంగా కూడినప్పటి సన్నివేశంలో ఉన్నది:

మ. అసమాలాప మచుంబితాధర మశయ్యాన్యోన్యవిక్రీడితం
      బసమాలింగన మస్థిరోత్సవ మధైర్యస్తంబతాంబూలితం
      బసుదంతాంక మనిర్భయం బమణికం బస్రస్తనీవ్యాదికం
      బసిధారావ్రతమైన చోరరతికార్యం బప్డు సంధించినన్. (2-108)

రెండింటిలోనూ ప్రథమపాదంలో ఒకేచోట ‘అచుంబితాధరము’ అన్న పదబంధం సమానంగా ఉండటమూ, ప్రకరణసామ్యమూ గమనార్హాలు. అయితే, కృతకమైన నారాయణామాత్యుని చిత్రణకంటె ఆపాతరమణీయమైన కళావిలాసములోని పద్యమే రసవంతంగా ఉన్నది.

సంస్కృతంలో కలావిలాసమనే కామశాస్త్రగ్రంథం లేనందువల్ల తెలుగు కళావిలాసము అనువాదగ్రంథమై ఉండదు. ఉపర్యుదాహరణలను బట్టి కళావిలాసము కావ్యమే గాని కామకళాగ్రంథం కాకపోవచ్చును.


ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...