జీవితప్రతిబింబమే కావ్యమని విశ్వసించి, తాదాత్మ్యభావంతో తనచుట్టూ ఉన్నవారి అనుభవపరంపరను పరిశీలించి, సారవిచారం చేసి, కవిత్వాన్ని ఉపదేశాత్మకంగా దిద్దితీర్చిన మహాకవి క్షేమేంద్రుడు. కాశ్మీరదేశంలో ధర్మవృక్షానికి చీడ పొడమి ఆగమోక్తాలైన కర్మముల అనుష్ఠానం వల్ల, అననుష్ఠానం వల్ల కలిగే సుపరీత విపరీతఫలితాలను ప్రత్యక్షంగా చూసి, పతనావస్థలో ఉన్న జాతికి జ్ఞానమూలకమైన ఔచిత్యప్రస్థానాన్ని నిర్మించిన మహానుభావుడు. మహర్షితుల్యుడైన శ్రీమదభినవగుప్తపాదుల వద్ద ఇహపరవిద్యలను అభ్యసించి మోక్షపదం వెతుకులాటలో నిర్లిప్తతను వహింపలేక లోకజ్ఞుడై, లౌకికవ్యవహారాలలో పాల్గొన్న గొప్ప ఉపదేష్ట. సమకాలిక సాంఘిక రాజకీయపరిస్థితుల సద్విమర్శతో ప్రజోపయోగం నిమిత్తం ధర్మసూక్ష్మాలను కథాముఖంగా ఆవిష్కరించాలని తహతహలాడిన సంస్కర్తృశిఖామణి. సమస్తమానవగుణాదర్శకమైన దర్శనప్రతిభ, సర్వాంగసార్థకమైన వస్తునిర్మాణకౌశలం, ధర్మధ్వనిమనోజ్ఞమైన అభివ్యక్తిసౌందర్యం ఏకోన్ముఖంగా ప్రవహించిన త్రివేణీసంగమమే క్షేమేంద్రుని కావ్యప్రమితి.
కలావిలాసం క్షేమేంద్రుని లఘుకావ్యసంచయంలో సుప్రసిద్ధమైనది. వజ్రకఠోరమైన ఆయన విమర్శవాక్కు ఇందులో కోమలహాస్యపూర్ణంగా వెల్లివిరిసింది. కావ్యసౌందర్యసమాధాయకమైన వస్తుసామగ్రి ఎక్కడ కనుపించినా దానిని వేయిభంగుల వర్ణించాలనే కుతూహలం ఉన్నవాడు. అందుకు తగిన ఇతివృత్తాన్ని కూర్చుకొన్నాడు. సంఘానికి దూరవర్తిగా ఎక్కడో విద్యారణ్యంలో తలదాచుకొన్న ఏ జితేంద్రియుణ్ణో, తపోధనుణ్ణో, గురువునో, వేదాంతప్రవక్తనో నిలిపి నీతులను బోధింపకుండా చౌర్యకళలో ఆరితేరిన ధూర్తాగ్రణిని పట్టుకొచ్చి ధర్మోపదేశానికి పరికరించుకొన్నాడు. ఆ రోజులలో అటువంటి సాహసాన్ని చేయగల ధైర్యం ఎంతమంది కవులకుంటుంది?
మూలదేవుని ప్రసక్తి ఎలాగూ వచ్చింది కాబట్టి, నాలుగు మాటలు చెప్పాలి. ఇతను చౌర్యకళను అభ్యసింపగోరే విద్యార్థులకోసం ఒక పాఠ్యగ్రంథాన్ని నిర్మించాడట. కౌటల్యుడు అర్థశాస్త్రంలో దానిపేరు ‘ఖరపటము’ అని చెప్పాడు. అందులో దొంగలకోసం ఆ కళాప్రయోగతంత్రమంతా ఉపకరణము, ప్రమాణము, ప్రహరణము, ప్రఘారణము, అవధారణము అని అయిదు ప్రకరణాలలో ఉన్నదట. మహేంద్ర విక్రమవర్మ మత్తవిలాస ప్రహనంలోనూ, భాసుని పేరిట ప్రచారంలో ఉన్న దరిద్ర చారుదత్తంలోనూ ఇతని ప్రశంసలున్నాయి. తమిళ మలయాళ దేశవాఙ్మయాలలో ఇది ‘కరవడమ్’ అన్న పేరిట ప్రచారంలో ఉండేదనటానికి ఆధారాలున్నాయి.
తరగతి గదిలో నేర్చుకొనేటప్పుడు మంత్రము, దైవము, ఔషధము, స్థితి, ప్రయుక్తి, దేశము, కాలము, ఉపకరణము అన్న ఎనిమిది ప్రయోగాలు బోధకు వస్తాయట. శూద్రకుని మృచ్ఛకటికంలో శర్విలకుడు చారుదత్తుని ఇంటిలో గోడకు కన్నం పెట్టినప్పటి వర్ణనమంతా ఖరపటానుసారమే అని వ్యాఖ్యాతలన్నారు. తండ్రి విడిచివేసినందున తల్లి దగ్గర పెరిగినట్లుంది. కర్ణీసుతుడని ప్రసిద్ధి. శూద్రకుని పద్మప్రాభృతకంలోనూ, బాణభట్టు కాదంబరిలోనూ, దండి దశకుమారచరిత్రలోనూ, అవంతీసుందరీ కథలోనూ ఉన్న వర్ణనలను బట్టి ఇతని కీర్తిప్రతిష్ఠలు దేశవిదేశాల వ్యాపించినట్లు గుర్తింపగలము. కలాంకురుడు అనికూడా పేరున్నదట. భగవత్పతంజలి మహాభాష్యంలోనూ, సుబంధుని వాసవదత్తా కథలోనూ, బుధస్వామి బృహత్కథాశ్లోకసంగ్రహంలోనూ ఉన్న పర్యాయ ప్రస్తావనలను బట్టి ఇతని పుస్తకం ఆ రోజుల్లో చాలా ప్రచారంలో ఉండేదని ఊహించాలి. బోజుడు శృంగారప్రకాశంలో పేర్కొన్నాడు. మాహుకుని హరమేఖలను బట్టి ఇతను గొప్ప శృంగారపురుషుడని తెలుస్తున్నది. మాహుకుడు చతుర్విధవిటులలో ఇతను ‘భద్రుడు’ అనికూడా చెప్పాడు. రాజపుత్త్రుడని కొందరంటారు. నందయంతి అనే బ్రాహ్మణస్త్రీని అపహరించి, పెండ్లాడిన ఉదంతాన్ని అవంతీసుందరీ కథలో దండి చెప్పాడు. ఇంతటి మహానుభావుడిని పట్టుకొచ్చి కథానేతగా నీత్యుపదేశానికి నిలపటం క్షేమేంద్రుని గడుసుదనం కాకపోతే మరేమిటి?
సంస్కృత కలావిలాస కథ
సంస్కృత కలావిలాసంలో పది సర్గలున్నాయి. మొట్టమొదటిది దంభాఖ్యానసర్గం. ఇందులో 96 శ్లోకాలున్నాయి. శ్రీపతి వక్షఃస్థలం వలె మంగళాయతనమైన విశాలపురంలో సకలకళాకోవిదుడైన మూలదేవుడనే ధూర్తశిఖామణి ఉండేవాడు. ఒకరోజు మాధ్యాహ్నిక భోజనానంతరం అతని ఆస్థానికి హిరణ్యగుప్తుడనే వ్యాపారి తన కొడుకును వెంటబెట్టుకొని దర్శనార్థమై వస్తాడు. “అయ్యా! లేకలేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెరిగాడు. యుక్తవయస్సు వచ్చింది. డబ్బున్నవాళ్ళ చుట్టూ ఎటువంటి అవ్యక్తులు చేరతారో మీకు తెలియనిది కాదు కదా. ఆ దుష్టులతో, వాళ్ళ వెంబడిని వచ్చే వారకాంతలతో నెగ్గుకొనిరావటం ఎలాగో నేర్పించటం నా వల్ల కాలేదు. ఆశ్రయాన్ని కోరి వచ్చినవారికి అభయాన్ని ప్రసాదించే మీరు తండ్రి వలెనే ఈ కుమారునికి లోకజ్ఞానాన్ని కలుగజేయాలి” అని వేడుకొంటాడు. మూలదేవుడు అందుకు అంగీకరిస్తాడు.
హిరణ్యగుప్తుడు వెళ్ళిన తర్వాత సాయంకాలం గడిచి రాత్రి కాగానే కాగానే మూలదేవుడు శిష్యులందరిని కూర్చుండబెట్టుకొని, చంద్రగుప్తుని చేరబిలిచి, “నాయనా! లోకమంతా కపటోపాయపరులతో నిండి ఉన్నది. సంపన్నుల వద్దకు శ్రీవశీకరణార్థం చేరే దాంభికుల వాస్తవస్వరూపం ఏమిటో నీకు తెలియజెబుతాను” అని, అతనికి దంభస్వభావాన్ని వివరిస్తాడు. శౌచపరులమని, వేదమూర్తులమని, సాధుపుంగవులమని ప్రచారాలు చేసుకొనే మోసగాళ్ళ కలరూపును విప్పిచెబుతాడు. ఎముకలు కొరికే చలిలో కూడా లోలోపల చీదరించుకొంటూనే, స్నానసంధ్యలు కానిచ్చి, నిలువుబొట్లు పెట్టుకొని మహాపూజలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ భక్తులమని జనాలను చేర్చే దొంగవేషగాళ్ళను దూరంగా ఉంచాలంటాడు. బ్రాహ్మణ్యంలో కుత్సితుల మోసాలను విప్పిచెబుతాడు.
పూర్వం బ్రహ్మదేవుడు చరాచరభూతసృష్టిని కావించిన పిమ్మట ఒకరోజు దివ్యదృష్టితో భూలోకవాసుల స్థితిగతులేమిటో ఆలోచించి, మానవులు ఋజువర్తనులై ధనార్జనాసక్తులుగా లేరని, భోగపరాఙ్ముఖత వల్ల ప్రజాతంతువృద్ధి నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని గుర్తించి – ఈ దాంభికతను సృజించాడట. పూర్వం దేవతలకు కంటకంగా మారిన జంభాసురుడే దంభుడై మానవలోకంలో జన్మించి జీవకోటిని తన శక్తిమూలాన వశపరచుకొన్నాడు. అచిరకాలంలో ఆ శక్తి అందరినీ ఆవహించింది. ఒక్కొక్కళ్ళు ఆ వృత్తి, ఈ వృత్తి అనిలేక ఎట్లా మోసగాళ్ళయ్యారో, ఆ మోసాలెటువంటివో, వాళ్ళచేతి పనిముట్లేమిటో చెబుతాడు. ఒకప్పుడు ఋషివేషాన్ని ధరించి బ్రహ్మసభలోకి అడుగుపెట్టిన దంభుణ్ణి చూసి దేవర్షులే చకితులయ్యారట. చివరకు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కూడా అందుకు అతీతుడు కాదట.
దమ్భవికారః పురతో వఞ్చకచక్రస్య కల్పవృక్షోఽయమ్
వామనదమ్భేన పురా హరిణా త్రైలోక్య మాక్రాన్తమ్. (1-96)
(కపటోపాయమనే చిత్తవికారం కలిగిన మోసగాళ్ళందరికి ముంగిటి కల్పవృక్షం అయిన శ్రీహరి మునుపు వామనరూపాన్ని ధరించి మూడడుగుల నెపంతో మూడు లోకాలను ఆక్రమించాడు.)
అని బలిచక్రవర్తిని వంచించిన వామనుని మాట తెస్తాడు.
రెండవది లోభవర్ణనసర్గం. ఇందులో 89 శ్లోకాలున్నాయి. కిరాటుల (వర్తకుల) లోభగుణం పాపానికి ఎలా దారితీస్తుందో వర్ణింపబడింది. వంచన లన్నిటికి మూలం లోభగుణమే. ఒక అమాయకుడు తనవద్ద దాచుకొన్న పెద్దమొత్తాన్ని సొంతం చేసికొని అతను వచ్చి అడిగినప్పుడు లేదని మొండిచెయ్యి చూపిన పురపతి అనే సెట్టి కథను మూలదేవుడు చెబుతాడు. ఒకప్పుడు శుక్రాచార్యుడు బాలసఖుడైన కుబేరుణ్ణి కొంత ధనం అడిగాడట. కుబేరుడు ఉన్నా ఇవ్వనంటాడు. శుక్రునికి కోపం వచ్చి కపటోపాయంతో అతని సర్వస్వాన్నీ హరిస్తాడు. కుబేరుడు హరుని ప్రార్థిస్తాడు. హరుడు శుక్రాచార్యునికి నచ్చజెబుతాడు. ఎంతకీ తన మాట వినటం లేదని ఆగ్రహించి అతనిని పొట్టన బెట్టుకొంటాడు. శుక్రుడు గౌరిని సన్నుతింపగా ఆమె కరుణించి శుక్రుని బ్రతికిస్తుంది.
మూడవది కామవర్ణనాసర్గం. ఇందులో 76 శ్లోకాలున్నాయి. స్త్రీలు చేసే వంచనకృత్యాలు, ముగ్ధా ప్రౌఢాదుల స్వభావాలు, సముద్రదత్తుడనే వ్యాపారి పరపురుషాసక్త అయిన భార్యవల్ల ఎలా మోసపోయినదీ వివరింపబడింది.
నాలుగవది వేశ్యావృత్తం. ఇందులో 40 శ్లోకాలున్నాయి. మూలదేవుడు వేశ్యకాంతల కుటిలానురాగాన్ని వివరిస్తాడు. విక్రమసింహుడనే రాజుకు వేశ్యలంటే అమితాభిమానం. మంత్రికి వేశ్యలంటే సద్భావం లేదు. రాజు తన మంత్రికి ప్రత్యుదాహరణను చూపగోరి, విలాసవతి అనే అందగత్తెను రాణివాసానికి తెచ్చి, ఆమెను భోగభాగ్యాలలో ముంచెత్తుతాడు. కొంతకాలానికి ఆమె, “రాజా! విదర్భదేశంలో ఉన్న నా ప్రియునిపై చౌర్యాపనింద పడింది. అతనిని విడిపింపగలవని నీకు వశవర్తినిగా ఉన్నాను” అంటుంది. రాజు నివ్వెరపోయి, విదర్భపై దండెత్తి, ఆమె కోరికను నెరవేర్చి, వేశ్యావిముఖుడై వారి వర్తనలను గర్హించటం ఇక్కడి ఘట్టితాంశం. ఆ కాలంలో వేశ్యకాంతలు అభ్యసించే చతుష్షష్టి కుటిలకళల వివరాలు ఈ సర్గంలో ఉన్నాయి.
అయిదవది కాయస్థచరితసర్గం. ఇందులో 46 శ్లోకాలున్నాయి. మోహగుణపు స్వభావం, కాయస్థుల (గణకవృత్తిలో ఉన్నవారు) దుర్మోహం నిరసింపబడ్డాయి. కూటస్థులు (కొలువులో కాయస్థులకు తోడుగా మధ్యవర్తిత్వానికి కూర్చొన్న తీర్పరులు), కాయస్థులు సదా నకారమనే సిద్ధమంత్రాన్ని (ఏదడిగినా, “అందుకు వీలులేదు, ఇందుకు నియమాలు ఒప్పుకోవు, ఇది సాధ్యం కాదు, అది రాజాజ్ఞకు వ్యతిరేకం” అని లాకేత్వమిచ్చి చెబుతుండటం) జపిస్తుంటారట. వారు చేసే మోసాల పట్టిక ఒకటున్నది.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర మందిరం వద్ద ధూర్తుడొకడు స్నానం చేసి, ఏమీ తోచక, నిర్మానుష్యంగా ఉన్న ఆ గుడిలో కూర్చొని శివునికి ఫలపుష్పాదులతో పూజచేస్తాడు. ఈశ్వరుడు దయతలిచి అతనికి వరమివ్వబోతాడు. ఆయన మెడలోని కపాలమాలికలోని ఒక పుర్రె అందుకు అడ్డుపడుతుంది. ఇంతలో ధూర్తుడు పూజవల్ల అలిసిపోయి మళ్ళీ స్నానానికి వెళ్తాడు. అడ్డుపడిన పుర్రె శివునికి ఆ ధూర్తుని దుర్వర్తనను వివరిస్తుంది. శివుడు ఇవన్నీ నీకెలా తెలుసునని అడుగుతాడు. పూర్వం నేను మగధలో కాయస్థునిగా జన్మించి, మీ యందలి భక్తిఫలంగా మీ గళసీమ సన్నిధిసేవలో ఉన్నానని పుర్రె చెబుతుంది. ఏమి కులమో ఏమిటో! చచ్చి కైలాసానికి వచ్చినా పుట్టుకతో వచ్చిన బుద్ధి మాత్రం మారలేదని శివుడు నవ్వుకొంటాడు.
ఆరవది మదవర్ణనసర్గం. ఇందులో 33 శ్లోకాలున్నాయి. కృతయుగంలో ఇంద్రియజయాన్ని సాధించిన మహాత్ముల దమము అనే శక్తి అక్షరాలు తిరగబడి మదముగా మారి కలియుగంలో జనులను ఆవేశించిందట. మదవశుల దుర్వర్తనలు, మద్యలోలుర దుశ్చేష్టలు అన్నీ ఇన్నీ కావు. చ్యవన మహర్షి ఆశ్వినులకు సోమపానార్హతను కల్పించాడని తెలిసి, ఇంద్రుడందుకు నిరాకరిస్తాడు. ఋషికి కోపంవచ్చి ఇంద్రుని భుజాన్ని స్తంభింపజేసి కృత్యాజ్వరాన్ని ప్రయోగిస్తాడు. ఇంద్రుడు భయంతో కాళ్ళబేరానికి దిగాక చ్యవనుడు అతనికి పూర్వస్థితినిచ్చి, కృత్యను మదరూపంలో లోకులను ఆవేశించేందుకు వదిలివేస్తాడు. ఆ మదమత్తుల మదాశ్రయస్థానాలు వివరింపబడ్డాయి.
ఏడవది గాయనవర్ణనసర్గం. ఇందులో 26 శ్లోకాలున్నాయి. గాయనీగాయనులంటే – ఆ రోజులలో నటవిటాదుల కోవలోనివాళ్ళు కదా – వట్టి దొంగలట. దొంగలు రాత్రిపూట రహస్యంగా దోస్తే ఈ కళాకారులు పట్టపగలే దోచుకొంటారట. కళ పేరిటి వారి నానా చిత్తవికారాలూ వర్ణింపబడ్డాయి. ఇంద్రుడు నారద మహర్షిని భూలోకంలోని విశేషాలేమిటని అడుగుతాడు. రాజులు ఇంద్రపదవి కోసం శతక్రతువులు చేసే ప్రయత్నాలలో ఉన్నారని నారదుడు చెబుతాడు. ఇంద్రుడు మండిపడి, యజ్ఞానికి కావలసిన సాధనాలు లేకుండా వాళ్ళ మైమరపించి సంపదలను కొల్లగొట్టమని గాయన పిశాచాలను సృష్టించాడట.
రసజ్ఞుల హృత్తాపహారులనుకొనే కళాకారులను వట్టి విత్తాపహారులు గాను, సంగీత గాత్ర వాద్యకళలను కార్యాచరణపరుల ‘దృష్టి మరల్చే తంత్రాలు’ గాను నిరూపించటం ఈ చిత్రణలోని గడుసుతనం.
ఎనిమిదవది సువర్ణకారోత్పత్తి సర్గం. ఇందులో 29 శ్లోకాలున్నాయి. కంసాలులు చేసే మోసాలన్నీ ఏకరువుకు వస్తాయి. పూర్వం మేరుపర్వతం ఎలుకల బాధ ఎక్కువై దేవతలకు మొరపెట్టుకొన్నదట. దేవతలు మేరుపర్వత బిలాలను మంత్రధూమంతో మూసి, ఎలుకలన్నింటినీ కాల్చివేశారు. ఆనాటి మూషిక జీవాత్మలే స్వర్ణకారులుగా జన్మించాయట.
తొమ్మిదవది నానా ధూర్తవర్ణన సర్గం. ఇందులో 73 శ్లోకాలున్నాయి. ధూర్తులు కనుకట్టు చేసి లోకులను వంచించే తీరుతెన్నులన్నీ ప్రస్తావనకు వచ్చాయి. జ్యోతిష్కులమని, రసవాదులమని, వశీకరణ విద్యలు తెలిసినవాళ్ళమని నమ్మినవాళ్ళను లోబరచుకొనే నీచుల నయవంచక మాయాకృత్యాలు ఎన్నెన్నో. వేలకొద్దీ ఉండే ఆ మాయలలోనూ అరవైనాలుగు ముఖ్యకళ లున్నాయట. వాటి వివరాలు చెప్పబడ్డాయి.
పదవది సకలకళానిరూపణ సర్గం. ఇందులో 43 శ్లోకాలున్నాయి. ధర్మపరులు అర్థకామాలను మోక్షాభిముఖంగా అనుష్ఠించి, జీవితాన్ని అందమైన కళగా ఎలా మలుచుకోవచ్చునో ప్రబోధించే ఉత్తమాధ్యాయమిది.
ఈ విధంగా లోకంలోని శుభాశుభావర్తనుల వాస్తవస్వరూపాన్ని శిష్యునికి విశదీకరించి, మూలదేవుడు ఇంటిలోనికి వెళ్ళిపోతాడు.
కలావిలాసం క్షేమేంద్రునికి అభిమానపాత్రమైన కావ్యం.
కలావిలాసః క్షేమేన్ద్రప్రతిభామ్భోధినిర్గతః
శశీవ మనసానన్దం కరోతు సతతం సతామ్. (10-43)
(క్షేమేంద్ర మహాకవి ప్రతిభ అనే పాలకడలి నుంచి వెలువడిన కలావిలాసం షోడశకళాపూర్ణుడైన చంద్రుని వలె సతతం సత్పురుషులకు హృదయానందాన్ని కలిగిస్తుంది గాక!)
అని సగర్వంగా చెప్పుకొన్నాడు. ఆయన లోకవృత్తపరిశీలనం, వ్యవహారజ్ఞత, మానవవ్యక్తిత్వం లోని బాహ్యాభ్యంతరాల వైరుద్ధ్యదర్శనం, సర్వాంతర్వర్తనీయమైన దృష్టినైశిత్యం, సందర్భోచిత పదగుంఫన చామీకరత్వం ప్రశంసనీయమైనవి. అందువల్లనే కలావిలాసం రుచిరహాస్యప్రియులు, పదకొండవ శతాబ్ది నాటి సంస్కారప్రియుల సంఘవిమర్శ భంగీభణితి ఏ ప్రకారం వెలసి విలసిల్లిందో తెలుసుకొనగోరేవారు తప్పక చదివి తీరవలసిన గ్రంథమని విమర్శకులు నిర్ణయించారు.
ఆంధ్రకవులపై క్షేమేంద్రుని కలావిలాస ప్రభావం
ఎందుకో గాని, కలావిలాసం క్షేమేంద్రుని లఘుకృతులలో సమయమాతృక, దేశోపదేశ, చతుర్వర్గసంగ్రహ, దర్పదలన, నర్మమాలాదుల వలె అంతగా ప్రసిద్ధికి రాలేదు. చారుచర్య తెలుగులో భాస్కర శతకాదుల లాగా మనస్సులకు హత్తుకొనిపోయే కేవలానుభవనీయమైన ఆకర్షణీయ దృష్టాంతాలతో కూర్పబడిన అద్భుత రచనం. నిత్యకృత్యప్రబోధకంగా వెలువడిన భోజరాజేంద్రుని చారుచర్యా గ్రంథానికంటె ఇది కవితాపరిణతి మూలాన, లోకరీతీప్రకాశన మూలాన వేయిరెట్లు మెరుగు. పల్లెపట్టుల నుంచి ప్రజలు పట్నవాసాలకు తరలివచ్చి నాగరికతాలౌల్యానికి క్రేళ్ళురికిన రోజులలో అప్పనకవి తెలుగు పద్యానువాదం భోజరాజు కృతిని పాఠకలోకానికి మరింత సన్నిహితం చేసింది. అటువంటి అనువాదమొకటి అవతరింపనందువల్ల ఆ వెలుగులో క్షేమేంద్రుని కవిత సాయంకాలపు నీడవలె అంతర్హితమైపోయింది.
క్షేమేంద్రుని దశావతార చరిత్ర, భారతమంజరీ రామాయణాలపై ఉత్తరదేశపు సాహిత్యంతో పరిచయం కలిగిన శ్రీనాథాదులు దృష్టి సారించారు. లక్షణగ్రంథాలలో ఆయన ఔచిత్యవిచారచర్చ, సువృత్తతిలక, కవికంఠాభరణ కావ్యాలు మాత్రం దేశమంతటా పఠనపాఠనరూఢి కెక్కినట్లు తోస్తుంది. సనాతనమైన వేదధర్మానికి, అనూచానమైన శైవాచారానికి కాణాచి అయిన కాశ్మీరదేశంలో నిరుపమానకీర్తిని గడించిన క్షేమేంద్రుడు మతాభిప్రాయాల సంకుచితోపదేశాలకు లోగక విశాలహృదయంతో బౌద్ధవాఙ్మయం వైపుకు దృష్టిసారించి బౌద్ధావదానకల్పలత, ఇత్యాదివి రచించి ఉండటం వల్ల నిన్నమొన్నటి వరకు అన్యప్రాంతాలలో వలె మన ఆంధ్రదేశంలోనూ సనాతన ధర్మపరులమనుకొనేవారు క్షేమేంద్ర కావ్యాధ్యయనాన్ని కొంత చిన్నచూపుతో చూడటం జరిగింది. ఆ సంకోచం తెలుగుసీమలో నిన్నమొన్నటిదాకా ఉండేదనుకొంటాను. ప్రత్యక్షంగా అనువాదకృత్యానికి పూనుకొనకపోయినా పూర్వకవుల బహుళ విద్యాధ్యయనానికి మాత్రం ఈ ప్రతిబంధకాలు అడ్డురాలేదేమో. క్షేమేంద్ర పారాయణికులలో అర్హణీయుడైన మహాకవి శ్రీనాథుడు ఈ కవితాధర్మాన్ని పుణికిపుచ్చుకొనటమే గాక యథోచితంగా దానిని ఆంధ్రావళికి పరిచయం చేశాడు.
పూర్ణాః కదర్యవణిజాః నిస్సమ్భోగా నిధానధనకుమ్భా
సీదన్తి కుచతటా ఇవ దుఃఖఫలా బాలవిధవానామ్.
(లోభులైన దుష్టవర్తకులు భావిప్రయోజనంకోసం వంచనచేసి కూడబెట్టిన సంపదలు బాలవితంతువుల చన్నులవలె ఎందుకూ పనికిరాక కాలాంతరంలో అణగారిపోతాయి.)
అన్న కలావిలాస (2-18) శ్లోకార్థమే కాశీఖండం(3-8)లో,
తే. అప్రయోజన మభివృద్ధి నతిశయిల్లు,
నప్రయోజన మడఁగు గాలాంతరమున,
నకట! యీర్ష్యాగ్రహగ్రస్తుఁ డైనయట్టి,
ఖలుని సంపద విధవ చన్నులునుబోలె.
అని రూపాంతరితమయింది. ‘భగవన్! భవత శ్శాసన మమరేన్ద్రకిరీటకోటివిశ్రాన్తమ్’ అన్న కలావిలాస (2-73) శ్లోకార్థమే శృంగారనైషధంలోని ‘దేవతాకోటికిరీటసంఘటితకోమలపాదసరోజ’ (1-3) యుగార్చనకు ప్రత్యక్షమూలం కాకపోయినా, శబ్దసామ్యం అనుభవనీయమే. కలావిలాసం ద్వితీయసర్గంలోని ‘జానామి బాలమిత్రం త్వా మత్యన్తసంభృతస్నేహమ్’ అన్న 44-వ శ్లోకస్థ శుక్రోదితాన్ని వింటున్నప్పుడు శ్రోతలకు శ్రీనాథుని హరవిలాసంలోని
సీ. కమలనాభుని పౌత్రుఁ గవితామహారాజ్యభద్రాసనారూఢుఁ బరమపుణ్యుఁ
బాత్రు నాపస్తంబసూత్రు భారద్వాజగోత్రు సజ్జనమిత్రుఁ గులపవిత్రు
భీమాంబికా మారనామాత్య నందను నఖిలపురాణవిద్యాప్రవీణు
నధ్వర్యు వేదశాఖాధీతినిష్ణాతు నంధ్రభాషానైషధాబ్జభవుని
తే. నుభయభాషాకవిత్వప్రయోగకుశలు
బాలసఖు గారవించి, తాత్పర్య మొప్ప
నవచిదేవయ త్రిపురారి యక్షరాజు
హితమితోక్తులు వెలయఁగ నిట్టు లనియె. హర. (1-8)
తే. ఆగమజ్ఞాననిధివి తత్త్వార్థఖనివి
బహుపురాణజ్ఞుఁడవు శుభభవ్యమతివి
బాలసఖుఁడవు శైవప్రబంధ మొకటి
యవధరింపుము నా పేర నంకితముగ. హర. (1-12)
వంటి పంక్తులు స్మృతిలో తటిల్లతల వలె మెరుస్తాయి. ‘బాలమిత్రుడు’ అంటే బాల్యమిత్రుడు అని కాదు అర్థం. శుక్రాచార్యుడు వయస్సులో పెద్దవాడైనప్పటికీ, తనకంటె ఎంతో చిన్నవాడైన కుబేరుడితో స్నేహం చేశాడన్నమాట. ‘జానామి బాలమిత్రం త్వామ్’ అంటే ‘నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పటినుంచి స్నేహితుడివిగా ఎరుగుదును కదా, నిన్ను’ అని భావం. ‘బాలసఖుఁడవు’ అంటే హరవిలాస కృతిపతి అవచి తిప్పయ్య సెట్టి, కవిసార్వభౌముడు శ్రీనాథుడు చిన్నప్పటి నుంచి ఒక కంచంలో తిని ఒక మంచంమీద పడుకొన్న దోస్తులని అర్థం కాదు. అవచి తిప్పయ్య సెట్టి వయస్సులో పదిహేను – ఇరవై యేళ్ళు పెద్దవాడైనప్పటికీ, తనకంటె ఎంతో చిన్నవాడైన శ్రీనాథునితో సమస్కంధునిగా స్నేహం చేశాడన్నమాట. క్షేమేంద్రప్రయోగమే శ్రీనాథునికి మార్గదీపకమని సులభంగానే ఊహింపగలము.
క్షేమేంద్రుని కథానాయకుడు మూలదేవుడు ధూర్తశిఖామణి. మోసగాడు, జూదరి, విటుడు అన్నమాట. అయితేనేమి, మనసున్న మంచివాడు. క్షేమేంద్రునికి ఆభిమానికమైన ఈ ‘ధూర్త’ శబ్దప్రయోగం శ్రీనాథుని గుండెలకు హత్తుకొన్నది. ఎన్నిమార్లు వాడుకొన్నాడో!
ఉ. వాలికమోము మత్తవనబర్హకిశోరకలాస్యలీలఁ బై
వాలిచి పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవిందతాం
బూలపు మోవి మోవిపయి మోఁపుచు రాధకు నిచ్చు ధూర్తగో
పాలుఁడు ప్రోచుఁ గావుత మపారకృపామతి మంత్రి యన్ననిన్. – (భీమేశ్వర పురాణము, 1-3)
ఒక్క గోపాలుడేనా? పాపం, శ్రీదేవికి సైతం ఆ విశేషణం తప్పలేదు.
గీ. మందరాచల కందరా మథ్యమాన
దుగ్ధపాథోధిలహరికా ధూర్త యైన
లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి నొసఁగు
వరదయై మాకు వినతగీర్వాణి వాణి.
అని కూడా భీమేశ్వర పురాణము (1-3)లో అన్నాడు. పరీక్షగా చూసినవారికి ఇటువంటివి ఆంతరతమ్యాలు సంఖ్యాతీతంగా అగపడతాయి. ‘అర్థిభి రుపజీవ్యమానవిభవానామ్’ అని కలావిలాసం (2-41). ‘అర్థిజనంబులకు నర్థంబులు గుప్పించియ’ అని శ్రీనాథుని హరవిలాస (1-5) విలసితం.
కలావిలాసం ద్వితీయసర్గంలో కిరాటనిబర్హణం ఉన్నది. కిరాటుల లోభగుణం చెడునడతకు, పాపవర్తనకు ఎట్లా దారితీస్తుందో మూలదేవుడు చంద్రగుప్తుడికి వివరిస్తాడు. ‘సత్త్వప్రశమతపోభిః సత్త్వధనైః శాస్త్రవేదిభి ర్వర్జితః, లోభోఽవటం ప్రవిష్టః కుటిలం హృదయం కిరాటానామ్ – త్రికరణశుద్ధిగా చిత్తవృత్తుల సంచారాన్ని నిగ్రహించిన తపస్వుల చేత, సత్త్వసంపన్నుల చేత, విధినిషేధరూపాలయిన శాస్త్రవిధులను గుర్తెరిగిన అనుష్ఠానపరుల చేత విడిచివేయబడిన లోభగుణం వెళ్ళి దుష్టులైన ఈ పాపవర్తకుల బుర్రల్లోకి దూరి కూర్చుంది. ఎంత కుటిలమనస్కులో వీళ్ళు – (2-3) అంటాడు. అత్యంత ప్రభావశీలమైన ఈ కిరాట నిందాప్రకరణాన్ని చదువుతుంటే పాఠకులకు బమ్మెర పోతన్నగారి కళంకిత కిరాటప్రభు నిందావాచనం గుర్తుకు వస్తుంది.
అసలు కథలో ఏమి జరిగిందో కాని, తన కృతిని రాజుకు సమర్పింపమని అడిగినప్పుడు పోతన్నగారి గుండెకు ఆ పలుకులు ములుకులై సోకాయట. ఒకరోజు పోతన్నగారి ఇంటికి వచ్చి శ్రీనాథుడు ఎక్కడ చూసినా దరిద్రదేవత ఇనుపగజ్జెలతో తాండవిస్తుంటే దిగులుపడి, “ఏమయ్యా, నీకు రాజదర్శనం చేయించి కృతిసమర్పణకు ఏర్పాట్లు చేయిస్తాను. సమస్త భోగభాగ్యాలు చేకూరుతాయి” అన్నాడని జనశ్రుతి. కాదు, రాజే స్వయంగా భాగవతకావ్యాన్ని తనకు ఇమ్మన్నాడని ఒక కథ. ఏమైతేనేమి, ఆ మాటను వినగానే పోతన్నగారికి తన ఉపాస్యదేవత కళ్ళముందు మూర్తికట్టినట్లయిందట. ఆమె కన్నులలో చిప్పిల్లుతున్న అశ్రువులను చూసి దుఃఖం పట్టలేకపోయాడట.
ఉ. కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భు రాణి! నిను నాఁకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మఁ, ద్రిశుద్ధికి నమ్ము భారతీ!
అని ఆ తల్లికి మాటయిచ్చాడు. ‘నిను నాఁకటికిం గొనిపోయి యల్ల క, ర్ణాట కిరాట కీచకుల కమ్మఁ; ద్రిశుద్ధికి నమ్ము’ అన్న పాఠానికి మారుగా ‘నిను నాఁకటికిం గొనిపోయి హీన ద్ర, వ్యాట కిరాట కీచకుల కమ్మఁ; ద్రిశుద్ధికి నమ్ము భారతీ’ అన్న పాఠాంతరం కూడా ఉన్నది. అది కలావిలాసానికి సన్నిహితంగా, భావయుక్తంగానే ఉన్నది కాని, ‘హీన+ద్రవ్యాట’ అని కవికి అభిమతం కాని గురులఘువుల లేనిపోని కిట్టింపుతో సరిపెట్టుకోవాలి. ‘అల్ల క, ర్ణాట కిరాట కీచకులకు నిన్ను అమ్మను తల్లీ’ అనటం ఆశుగతిలోని ధారాశుద్ధికి అనురూపంగా ఉన్నది.
కాటుక దిద్దిన సోగకన్నులనుంచి కన్నీరు చిప్పిల్లి ఆమె చనుగొండల మీదికి ఉరుకుతుంటే కవికి పర్వతసీమపై జలధారను వర్షిస్తున్న నీలమేఘం స్ఫురణకు వచ్చింది. ‘చనుకట్టు’ అనక ‘చనుగట్టు’ అని ఉన్నట్లయితే ‘పాలిండ్లనెడి ఎత్తైన పర్వతము’ అని స్పష్టంగా ఉండేది కాని, రూపణలోని వ్యంగ్యవైభవం భగ్నమైపోయేది. పాలిండ్లనెడి ఎత్తైన పర్వతము అన్న రూపణం వాచ్యమైనాక ‘నయనాంబుదం’ అనికూడా మేఘయుక్తిని స్పష్టీకరింపక తప్పేది కాదు. అప్పుడు ‘కాటుక కంటినీరు’ అన్న ప్రకాశ్యార్థానికి తావుండేది కాదు. మహాకవి కదా. రెండింటినీ వ్యంజింపజేశాడు. ‘మధుకైటభాసురులను మట్టుపెట్టిన మహావిష్ణువు కోడలివి’ అనటమూ సాభిప్రాయమైన విశేషణమే. రూపకానుప్రాణితమైన పరికరాలంకారం. కిరాట కీచకుల సంహారశక్తి ఆమెయందు ఆరోపితమై, కవి శరణాగతికి స్ఫోరకత్వం సిద్ధించింది. ఆ కైటభదైత్యమర్దనుని నాభికమలమనే బంగారు కడుపున పుట్టినవానికి హృదయరాజ్ఞి ఆమె. తనకు మాతృమూర్తి. ఆమె దయకు నోచుకొన్న తనకిక సొమ్ములకేమి కొదవ! ఉదరపోషణ నిమిత్తం ఆ తల్లి స్వరూపమైన భారతీ వాక్కును కిరాటులకు కట్టబెట్టవలసిన అగత్యం తనకేమిటి? ‘నిను ఆఁకటికిన్ కొనిపోయి అల్ల క, ర్ణాట కిరాట కీచకులకు అమ్మను’ అని సాకూతంగా అన్నాడు.
‘అల్ల’ అంటే, ఎక్కడో దూరాన ఉన్నవాళ్ళు. పద్యం చెప్పినది భాగవత రచన కొనసాగుతున్నప్పుడో, కొసదాకా వచ్చినప్పుడో. క్రీస్తుశకం 1478-1480 ప్రాంతాల నాటి కథ. అప్పుడు విజయనగర రాజు విరూపాక్షరాయలు. ఓరుగల్లుకు విజయనగరం దూరదేశమే. విరూపాక్షరాయలు 1478 దాకా ఉన్నాడు. పరమనీచుడు. ఆ తర్వాత అతని కొడుకు నాలుగవ ప్రౌఢదేవరాయలు 1485 దాకా ఉన్నాడు. ఆ తండ్రీ ఈ కొడుకూ ఇద్దరూ కర్ణాటకీచకులు.
కిరాటులు అంటే మ్లేచ్ఛులు అని నైఘంటికార్థం. బహుమనీ సుల్తానులన్నమాట. కిరాతులు అన్నా మ్లేచ్ఛులనే భావం ఉన్నది కాని, ‘కర్ణాట కిరాట కీచకులు’ అన్నప్పటి అనుప్రాసకు లోపం. ‘కిరాతో మ్లేచ్ఛభేదే స్యా ద్భూనిమ్బేఽల్పతనావపి’ అని మేదినీ కోశం. కిరాతుడు అంటే మ్లేచ్ఛుడు, అల్పశరీరుడు, నేలవేము – అని. కిరాట శబ్దాన్ని నిఘంటువులు కొంత ఆలస్యంగా గుర్తించాయి. ‘ద్వే తు కిరాటః స్యా న్మ్లేచ్ఛే వణిజి చాపి’ అని నానార్థార్ణవసంక్షేపం. కిరాటుడు అంటే మ్లేచ్ఛుడు అని, వ్యాపారి అని అర్థాలు. కిరాటకీచకులు అంటే బహుమనీ సుల్తానులు.
దుష్టత్వం కర్ణాటకీచకులకు, కిరాటకీచకులకు సమానధర్మం. నీవిచ్చిన ప్రసాదాన్ని ఆ దుష్టులకు తీసికొనివెళ్ళి అమ్మను – అని కవి వాగ్దానం. భాగవతంలో ‘ఇమ్మనుజేశ్వరాధములు’ అన్నది కూడా ఈ కర్ణాట కిరాట కీచకులనే. పోతనగారి మనస్సులో నిలిచిన కిరాటకీచకులు క్షేమేంద్రుడు సాహిత్యంలో ప్రవేశపెట్టిన కుటిలకిరాటులే అన్నమాట మాత్రం స్పష్టం. ‘కీచక’ శబ్దాన్ని బహుళ నిందావాచకంగా ప్రచారంలోకి తెచ్చినవాడు కూడా క్షేమేంద్రుడే. ఆ చందాన స్మృతినిక్షిప్తమైన శబ్దశిల్పాన్ని పోతన్న తన పద్యంలో సందర్భవిదర్భంగా సంయోజించాడు. క్షేమేంద్ర పారాయణికుడని చెప్పటానికి ఇంకేమి విశదిమ కావాలి!
క్షేమేంద్రుని కలావిలాసం ప్రథమసర్గంలో సుదీర్ఘమైన చంద్రోదయవర్ణనం ఉన్నది. క్షేమేంద్రుని ప్రకృతిదృశ్యదర్శనానికి, వర్ణననైపుణికి ఆస్కారం లభించిన సన్నివేశం అది. ఆహ్లాదకరమైన ఆ సమయంలోని కొన్ని రూపణలివి:
గగనాఙ్గణకమలవనే సన్ధ్యారాగే గతే శనైః క్వాపి
అప్రాప్తస్థితివికలం బభ్రామ భ్రమరవిభ్రమం తిమిరమ్. (1-27)
(సాయంకాలం గడిచి సంధ్యారుణకాంతులు సన్నగిల్లుతుంటే ఆకాశమండలంలోని కలువకొలనిలో నల్లతుమ్మెదలు దిక్కుతోచక నలుదెసలకు పరుగులుతీసినట్లు చిమ్మచీకటులు వ్యాపింపసాగాయి.)
రజనీ రరాజ సితతరతారకముక్తాకలాపకృతశోభా. (1-29)
(కాముకులకు రాగాతిశయాన్ని కలిగించే ఆ రజనీసమయం తెల్లని ముత్యాలదండల వంటి తారకాసముదాయంతో రంజకంగా రాజిల్లసాగింది.)
మన్మథసితాతపత్రం దిగ్వనితాస్ఫటికదర్పణో విమలః. (1-31)
(మదనుని తెల్లగొడుగువలె, అపరదిక్కు అనే వనిత చేతనున్న స్ఫటికపు అద్దం లాగానూ …)
గగనతటినీతటాన్తే రజనికరో రాజహంస ఇవ. (1-32)
(ఆకాశగంగానదిలో నడయాడుతున్న రాజహంస వలె కానవచ్చాడు చంద్రుడు.)
ఈ చిత్రకల్పనలను యథాతథంగా స్వీకరించిన మహాకవి ధూర్జటి కాళహస్తి మాహాత్మ్యము ద్వితీయాశ్వాసంలో గజరాజు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొండమీది శివలింగం వద్ద తాను సమర్పించిన పూజాద్రవ్యాలను ప్రతినిత్యం నాశనం చేస్తున్న గూఢశత్రువును ఎదుర్కొనటంకోసం – ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేనక్కడికి చేరుకొంటానా – అని నిద్రాహారాలు లేక వేచి ఉన్న తరుణంలో కావించిన వర్ణనమిది:
శా. తారాలోకమునం బ్రకాశమొక చందంబై ప్రసాదింప సం
ధ్యారాగావృతమై తమఃపటలసంతానంబు గప్పంగ … (2-129)
మ. గగనాహార్యమృగేంద్రశాబకము నక్షత్త్రాంబుజారణ్యమ
ధ్యగహంసంబు నిశావధూకరతలోద్యన్మల్లికాగుచ్ఛ మ
ధ్వగబాధావహచిత్తభూకటకయాత్రామౌక్తికచ్ఛత్త్ర మొ
ప్పు గతిం జంద్రుఁడు తోఁచె …(2-134)
‘సన్ధ్యారాగే గతే శనైః క్వాపి, అప్రాప్తస్థితివికలం బభ్రామ భ్రమరవిభ్రమం తిమిరమ్’ అన్నదే, ఉన్నదున్నట్లుగా ‘తారాలోకమునం బ్రకాశమొక చందంబై ప్రసాదింప సం, ధ్యారాగావృతమై తమఃపటలసంతానంబు గప్పంగ… అని తెలుగులోకి వచ్చింది. ‘గగనాఙ్గణకమలవనే… రజనికరో రాజహంస ఇవ’ అన్నదే ‘నక్షత్త్రాంబుజారణ్యమ, ధ్యగహంసంబు’ అయింది. ‘దిగ్వనితా … మన్మథసితాతపత్రం’ అన్న ప్రసిద్ధకల్పనను కార్యకారణానువర్తితంగా ధూర్జటి కవి ‘నిశావధూకరతలోద్యన్మల్లికాగుచ్ఛ మ, ధ్వగబాధావహచిత్తభూకటకయాత్రామౌక్తికచ్ఛత్త్ర మొ, ప్పు గతిన్’ అని వ్రాశాడు. ధూర్జటి కరకమలాలలో క్షేమేంద్రకృతిప్రసూనం ఉన్నమాటను కాదనగలమా.
కలావిలాసమే గాక దేశోపదేశ నర్మమాలా సమయమాతృకాదుల నిత్యానుశీలనఫలితం ఆంధ్ర క్రీడాభిరామానికి వన్నెతెచ్చింది. మరి రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామమే తత్ప్రభావితమేమో! అనటం గతజలసేతుబంధనమే అవుతుంది. ‘విటానాం కేలిపటహం తప్తతామ్రఘటోపమమ్, దధానం రోమమాలాన్తం స్థూలఖల్వాటకర్పరమ్’ (సమయ. 1-10), ‘మృజ్యమానస్య వైమల్యం తామ్రసంజ్ఞస్య నాన్యథా’ (సమయ. 5-23), అన్నవి క్షేమేంద్రుని చిత్రకల్పిత సంకేతాలు. ఇవి ఇతరకవులు నిరూపించినవి కావు. రోమాలను తొలగించిన తర్వాత మదవతి మదనమందిరానికి తప్తతామ్రఘటం తోడి పోలిక క్షేమేంద్రునిది. అది చదువుకొన్న వల్లభరాయలు దానికి మెరుగులు దిద్ది, ‘కసటువోవఁగఁ దోమి కడిగి బోరగిలంగఁ బెట్టిన తామ్రంపు బిందెవోలె’ (క్రీడాభి. ప.80), అని క్రీడాభిరామంలో సుసరభేత్ అన్న రోమసంహారిణి మందు ప్రభావనిరూపణకు ఉపస్కరించుకొన్నాడు.
క్షేమేంద్రుని నర్మమాలా సమయమాతృకలనే చదువుకొన్న మరొక కవి కళావతీ శతక కావ్యకర్త తేళ్ళపూడి కసవరాజు. ‘పరస్పరప్రార్థనయా సుముణ్డితభగధ్వజౌ, భూకమ్పకారిణౌ, రాత్రౌ తౌ రణ్డాబ్రహ్మచారిణౌ’ (నర్మమాల. 3-39) అని మొదలయ్యే శ్లోకాలలోని అశ్లీలవాచ్యతాదోషాన్ని తన కాలానుసారం సంస్కరించి, ఆ ప్రాకృతకాముకుల వర్ణనకు అప్రకృతవర్ణనతో ప్రకృతార్థాన్ని కవిప్రౌఢోక్తిసిద్ధంగా చమత్కరించి కసవరాజు, ‘ఆ కంజానన యుపరతి, కాకాశము వడఁకెఁ దార లటునిటు వడియెన్, జోకైన గిరులు గదలెను, భీకరమగు తమము చంద్రబింబముఁ గప్పెన్’ అని రూపకాతిశయోక్తిని అభినందనీయంగా నిర్వహించాడు. కసవరాజు పద్యానికి ఇతరశ్లోకమూలాలు కూడా లేకపోలేదు కాని, ఆయన రూపించిన కళావతీ వృత్తాంతం సమయమాతృకాంతర్గతమని గుర్తింపనందువల్ల పరిష్కర్తలు, వాఙ్మయచరిత్రకాథికులు ఆ రచనలోని ‘గురుకుచకుంభముల్ గదలఁ గ్రొమ్ముడి వీడఁగ రాలఁ గ్రొవ్విరుల్, కరమణికంకణక్వణన కాచనగ (?) ధ్వను లుల్లసిల్లఁగా’ మొదలైన పంక్తులలో ప్రశ్నార్థకాలను నిలుపవలసివచ్చింది.
కాచము అంటే గాజు. ‘ధాతువిశేషో వలయాది ర్యేన రచ్యతే’ అని అమరకోశంలోని ‘కాచాః శిక్యమృద్భేదదృగ్రుజః’ అన్న (3-3-28) శ్లోకానికి కృష్ణమిశ్రుని టీక. ఉపపతితో సంయోగవేళ నాయిక కళావతి చేతి గాజులు మహానగాలు ఊటాడుతున్నట్లు చప్పుడు చేశాయని భావం. ఇది సామాన్యార్థం. సమయమాతృకకు ప్రామాణికాలైన వ్యాఖ్యలేవీ ఆ రోజులలో వెలువడనందువల్ల అందులోని పెక్కు పదాలు నిఘంటువులలోని కెక్కకపోవడమూ, సుప్రమాతాలు కాకపోవడమూ సంభవించింది.
‘స్వభావభిదురః కాచసంజ్ఞ శ్ఛలనిరీక్షకః, శైలోఽపి గౌరవస్థాయీ హృదయాభావనీరసః’ అని సమయమాతృక (5-26). అక్కడ క్షేమేంద్రుడు చెప్పిన ఎనభై రాగభేదాల స్వరూపం, ఈ కాచరాగస్వరూపం నాకు సరిగా బోధపడలేదు. సంగీత లక్షణగ్రంథాలలో కనబడలేదు. దానిని అన్వయించికొని కళావతీ శతకపద్యం అంతరార్థాన్ని పునఃపరిశీలించాలి. ఆ విధంగా కలావిలాసం ప్రతీతి, ప్రథిమ మనకు బోధపడతాయి. సమాజంలోని లోపజాతాన్ని తీవ్రమైన కంఠస్వరంతో విమర్శించిన ఆ దేశోపదేశ నర్మమాలాది కృతులతో పోలిస్తే కలావిలాసం కొంత వెలవెలపోయేమాట నిజమే. ఏమైతేనేమి, ఒకప్పుడు మధ్యయుగీనాంధ్రకవులకు అధీతిబోధల వల్ల సువిదితమైనప్పటికీ, ఆధునికకాలంలో మాత్రం ఉపేక్షా రాహుగ్రస్తమైన చంద్రబింబం వలె మరుగునపడిపోయింది.
1937లో క్రొత్తపల్లి సూర్యారావుగారు కలావిలాసానికి గుజరాతీ హిందీ భాషలలో వెలువడిన అనువాదాలను పరికించాక, సంస్కృతవిధేయంగా చక్కటి శైలిలో తెలుగులోకి వచనీకరించారు. 1968లో శ్రీ నరేంద్రనాథ సాహిత్యమండలి వారు తణుకు నుంచి ప్రచురించిన ముళ్ళపూడి తిమ్మరాజు అభినందన సంపుటి సాహితీవాల్లభ్యములో సుగృహీతనామధేయులు ఈయూణ్ణి వేంకట వీరరాఘవాచార్యులవారు మహాకవి క్షేమేంద్రకర్ణపూరము అన్న పేరుతో సర్వార్థసమాకలనపూర్వకంగా ఒక మంచి వ్యాసాన్ని వ్రాశారు.
ఇంతమందిని ప్రభావితం చేసి, ఇన్ని విధాల మహనీయమైన క్షేమేంద్రకృతిని నన్నెచోడుడో మరొకరో తెలుగు చేయాలనుకోవటం సహజమే.