ఆయన ఒక కాలాతీతకవితాకాసారం. ఆ అంతులేని కన్నీటికొలనుపై కృష్ణరశ్మి సోకినప్పుడల్లా నవ్యకవిత్వదివ్యకమలాలు విచ్చుకొనేవి. జడజీవితాలను పలికించి, అఘపంకంలో అంభోజాలను మొలిపించిన బ్రహ్మర్షిగురుదేవుల ఆశీస్సులే ఆ పచ్చకప్పురపు పలుకుల్లో అనునిత్యం పరిమళించేవి. ఆ మౌనవీణను సందర్శించినపుడల్లా ఏ అలౌకికనిష్ఠురాత్ముడో తన క్రూరకరాంగుళులతో త్రెంచివేసిన మధురతంత్రీస్వనాల విధురవిలాపం హృదయవిదారకంగా వినిపించేది. ప్రభుస్థానాల నుంచి ప్రజాహృదయాస్థానాలకు కవులు చేసిన పాదయాత్రల పదచిత్రాలన్నీ ఆయన సన్నిధిరూపమైన పెన్నిధిలో సాక్షాత్కరించేవి. కరుణరసానికీ, కరుణారసానికీ పర్యాయమైన ఆ సారస్వత సరస్వతీ తీర్థం ఇంకిపోయి మూడున్నర దశాబ్దులు కావస్తున్నా ఆ శుక్లాంబరధరుడు, ఆ ఆంధ్రహృదయమనోవిష్ణువు, ఆ శశివర్ణుడు, ఆ ప్రసన్నవదనుడు, ఆ మహాకవి కవితావిహాయసంలో అంతర్హితులై లోనారసి చూడగలిగేవారికి వెలుగులీనుతూనే ఉన్నారు.
ఈ జడజీవితమ్ము పలికించితి, వీ యఘపంకముందు నం
భోజము మొల్వఁజేసితి, వపూర్వము నీ దయ; యీ నిశీథి నీ
రాజన మెత్తినావు విపులమ్మగు నీ యెద నిండెనే శర
ద్రాజితచంద్రకాంతు, లమృతమ్ములు స్వర్గలతాంతవాసనల్
నా యెదలో ద్వదీయచరణమ్ముల చిహ్నము లెన్న డేనియున్
మాయవ, యే నిశీథపుఁ దమస్సులు మాసినఁ గాని జీవయా
త్రాయతవీథి నొక్కఁడఁ బ్రయాణము సేయుదు నక్షయంపుఁ బా
ధేయముగా గ్రహించి గురుదేవముఖస్రుతగీతికాసుధల్.
అని ఆయన పట్టిన బ్రహ్మర్షి మంగళస్తవాంజలిలోని పరిమళకర్పూరకాంతిలో ఆయననే దర్శించుకొని అభిమానులు తన్మయులవుతుంటారు.
ఆయన మనిషిని ప్రేమించారు. ప్రేమను ప్రేమించారు. ప్రేమకోసం, ప్రేమను పంచి పెట్టటంకోసం ప్రేమించారు.
ఆ దివ్యప్రేమకోసం ఎక్కడెక్కడినుంచో పుణ్యతీర్థాన్ని ఆశ్రయించినట్లు సాహిత్యానురక్తులు వచ్చి భక్తితో ఆయన పాదాలను కళ్ళకద్దుకొనేవారు. ఆ వచ్చినవారు గాయనీగాయనులైతే ఆయన ఇల్లు ఇంద్రసభగా మారేది. తన గేయనాటికలలోని మునుపటి పాటలను, ఆండాళ్ పాశురాలను పాడించుకొని ఏవేవో జ్ఞాపకాలతో కంటతడి పెట్టుకొనేవారు. పసిపిల్లల చిరునవ్వుల పసిమికాంతులతో ఆ ఆర్ద్రనయనాలు చెమ్మగిల్లేవి.
ప్రభాతవేళల్లో ఆయన వాలుకుర్చీలో క్రింద తన అంబాసిడర్ కారుముందు కూర్చొని ఉన్నప్పుడు ఏ బి.ఎన్.రెడ్డిగారో, సాలూరు రాజేశ్వరరావుగారో, పిలకా గణపతిశాస్త్రిగారో, మద్దిపట్ల సూరిగారో, ఎవరో కవులో, సంగీతనిధులో, నటీనటులో ఎక్కడినుంచో ఎక్కడికో వెళుతూ ఆయనను కన్నులతో పలకరించి, ఆ కరచాలనతో పులకరించి వెళ్ళిపోయేవారు.
ఆయన కవిత్వపు కాటుకకళ్ళల్లో ఒక వెతుకులాట ఉండేది. తంజావూరు బొమ్మలాంటి అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ విశాలనేత్రాలలో ఒక ఉబుకుతున్న ఎర్రని జీర నాగేటిచాలులా తళుకుమనేది. అతీతకాలపు ఏ స్మృతికల్లోలమో పైకుబికి కన్నీటిజాలు పొర్లివస్తుండేది.
ఆ నాగేటిచాలు పేరు సీత. పూపవయసులో అస్తమించిన ఆయన కుమార్తె.
అతిథులకోసం ఎదురుచూసేవారాయన. కవితాసభ వారింటిలోనే జరుగుతుంటే కాలింగ్ బెల్ మ్రోగినపుడు — ఆ సభకు తామే అధ్యక్షులైనప్పటికీ — భగవంతుడే మందిరద్వారాలు తెరిచినట్లు, ఆయనే వెళ్ళి ఎప్పటిలాగే ప్రతిఒక్కరినీ లోపలికి ఆహ్వానించేవారు. ఒకవైపు హార్మోనీవాదకులు, ఆ తాళమానాలు, ఆ గంధర్వగానాలు, విదితసాహిత్యికుల చిత్రోక్తులు, బంధుమిత్రుల రాకపోకలతో కవినిలయాలు కళకళలాడే ఆ రోజులు మళ్ళీ వస్తాయా?
హాలుబైట మెట్లదాకా జనం కూర్చున్న ఆ సందోహంలోనే ఆయన మెట్లవరసలకు తగినట్లు తగిన పదాలను పోహళించుకొనేవారు.
మా నాన్నగారు ప్రాణప్రదమైన ఆయన సన్నిహితమైత్రికి నోచుకొన్నారు. నాకు తెలిసేనాటికే ఆయన కవిత్వంలో సువర్ణమేరుశిఖరాన్ని అధిరోహించి, యుగనేతగా గౌరవపదాన్ని అలంకరించినవారు. అప్పటికే గొంతు మూగపోయింది. రవీంద్రుని 1927లో కలుసుకొన్ననాటి అనుభూతులను పదేపదే నెమరువేసుకొనేవారు. కాళిదాసు, భవభూతి, షెల్లీ, కీట్సు, బైరన్, తమ తండ్రి పినతండ్రులు, రాయప్రోలు, అబ్బూరి అంటే ఉపాసనతో కూడిన ఆరాధనాభావం ఉండేది. గృహాంతర్వాటికలో అంతరంగిక మిత్రులతో వయోవస్థాదికభేదాలు లేకుండా ఎంత సన్నిహితంగా ఉండేవారో, బహిరంగసభలంటేనూ సన్మానాలంటేనూ అంత దూరదవీయసంగా ఉండేవారు.
ఒకసారి హైదరాబాదులో సన్మానసభ చేస్తామంటే ఎంతో బలవంతం మీద ఒప్పుకొన్నాక వారు చెప్పిన నియమాలివి:
“నేను సభలోకి ప్రవేశించేసరికి వేదికమీద రాయప్రోలు, అబ్బూరి ఆసీనులై ఉండాలి.
వారిద్దరి పాదాలకు నమస్కరించి, వారిని పూలమాలలతో అలంకరించిన తర్వాత నేను కూర్చోవాలి.
ఎక్కడా చుట్టుపక్కల మంత్రులూ పందులూ ఉండరాదు.”
అంతటి చమత్కారభాషణులు. బ్రహ్మసమాజం పట్ల ఆకర్షితులై ఏకేశ్వరోపాసనను, సంఘసంస్కరణను, మానవతావాదాన్ని ఎంత దీక్షతో ప్రచారం చేశారో, ఎన్ని గంభీరోసన్యాసాలు చేశారో, అంతే సరస ప్రసంగసల్లాప నిపుణులు.
ఒక కవిగారు ఏళ్ల తరబడి ఎంతో ప్రయాసపడి, గజారోహణాది సత్కారాన్ని ఏర్పాటు చేసుకొని, కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తే, “వినరాని ఏదో దుర్వార్తను వినవలసి వచ్చినందువల్ల మీ కోరికను మన్నింపలేకపోతున్నాను: మన్నించండి” అని వ్రాశారు!
తానై పనికట్టుకొని చేయించుకొనే సన్మానం కబురు దుర్వార్త కాకపోతే మరేమిటి? అన్నమాట.
భావకవిత్వాన్ని ఒక ఉద్యమంగా వ్యాపింపజేసిన కార్యకర్త ఆయన. ఆ పరంపరలో కాకినాడలో ఆయన చేసిన ఉద్విగ్నప్రసంగం ఒకటీ. అతిలావణ్యంగా గొంతెత్తి గానంచేసిన కృష్ణపక్షంలోని పద్యాల కేసెట్టు ఒకటీ బుజ్జాయిగారి దగ్గరుండేవి.
కంఠస్వనం విలుప్తమైన తర్వాత పరిచయమైనందువల్ల వారొకప్పుడు తన సహకవుల రచనలను అధీతిబోధాచరణలతో ప్రచారం చేసిన ఉద్గాత అంటే ఆశ్చర్యంగా ఉండేది మాకు. సెట్టి ఈశ్వరరావు, మహీధర రామమోహనరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి, ఆరుద్రల ఆహ్వానాన్ని పురస్కరించుకొని మద్రాసులో అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడై ఆధునికతను ఆదరించిన భవ్యదర్శనుడాయన.
ఆయన ఇల్లంతా దివాణం ఫక్కీ సోఫాలతో, టేకు బీరువాలలో పుస్తకాలతో, ఫ్రేముకట్టిన ఫొటోలతో అందంగా ఉండేది. ఆ అందానికే తీర్చిదిద్దిన అందం ఆయన.
ఆస్థానగంధం వల్ల ఆయనలో ఒక రాజసం ఉండేది. సినిమా పాట వ్రాయాలంటే నిర్మాతే ఇంటికి వచ్చి ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు — పదిరూపాయల విడినోట్ల కట్టను తెచ్చియివ్వాలి. ‘శ్రీరామ పట్టాభిషేకం’లో పాట కోసం ఎన్.టి.రామారావుగారు వారింటికే రావటం చూసి ఎంతో వింతగా చెప్పుకొనేవాళ్ళం. పాట తమ మనస్సుకు నచ్చితేనే కాని సంగీతానికి ఇచ్చేవారు కారు. ‘సన్నాయి అప్పన్న’లో పాటకోసం ఒక అసిస్టెంటు తిరిగి తిరిగి విసిగిపోయి, “మీ పాట వల్ల రికార్డింగు ఆగిపోయింది. ఏంచేస్తానో చూడండి” అని తీవ్రంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ రోజు చూశాను – ఆయన కన్నుల్లో ఆవేశ క్రోధవీరాన్ని. ఉద్వేగంతో వణికిపోతూ గదిలోకి వెళ్ళి, వెయ్యిరూపాయల నోట్లకట్టను విడదీసి, మొదటి అంతస్తు గది కిటికీలోనుంచి బైటికి విసిరిపారేశారు. గాలిలో తేలివస్తున్న రంగు నోట్ల కాయితాలను చూసి రోడ్డుమీద ఆబాలగోపాలం పరుగులు పెడ్తున్నారు. ఆగ్రహామర్షాలతో ఆయన ఊగిపోతున్నారు. ఆ అసిస్టెంటు వెళ్ళి ఫిర్యాదు చేసినట్లున్నాడు — ఆఘమేఘాల మీద నటుడు చలంగారు, జి.కె. వెంకటేష్, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి గార్లు, ఆ అసిస్టెంటు — అంతమందీ ఒక్కుమ్మడిని గదిలోకి వచ్చి, ఆయన పాదాల ముందు మోకరిల్లారు. “అతని మాటలకు మమ్మల్నందర్నీ క్షమించండి. మీ మాటే, మీ పాటే మాకు ప్రసాదం. మీరెప్పుడిస్తే అప్పుడే పాడుతాము” అని బాలసుబ్రహ్మణ్యంగారనటం నాకిప్పటికీ గుర్తే.
భావకవిత్వానికి ప్రజామోదాన్ని సంతరించి పెట్టిన ప్రవక్తృశేఖరుడాయన. వియోగంలో మాధురీదర్శనాన్ని, విషాదంలో రమ్యాలోకాన్ని ఆరాధించి లోనారసి చూడగల చూపరులకు చూపును ప్రసాదించిన దార్శనికుడు.
ఆయన పంక్తిపావనుడైన యుగకవి. ఆ తిలకిత-తిలకాయమాన కవిమూర్తిని, ఆ గిరజాల పొంగును, ఆ కవితారచనను. ఆ పఠనాన్ని ఆరాధకులు అనుకరించే శకం వాఙ్మయచరిత్రలో ఆయనతోనే ముగిసిపోయింది.
[2010 ఫిబ్రవరి 22న సాక్షి దినపత్రికలో అచ్చయిన నివాళి వ్యాసం, ఈమాట పాఠకులకోసం పునర్ముద్రణం — సం. ]
