త్రిపురాంతకుని కాలము: ఇతర విశేషాలు

త్రిపురాంతకుడు రాజాశ్రయాన్ని కోరి దేవరకొండకు వెళ్లి ఎఱ్ఱదాచమ నాయని కొలువుచేరి ఈ కావ్యాన్ని రచించే క్రీ.శ.1320 నాటికి కనీసం ముప్ఫై ఏళ్ల వాడనుకొంటే ఆయన క్రీ.శ.1290 ప్రాంతంలో జన్మించినట్లవుతుంది.

మెకంజీ యాచ ప్రబంధము రాతప్రతిని బట్టి త్రిపురాంతకుని తండ్రిగారి పేరు “భట్టపాదుడు” అని కూడా పేర్కొన్నాడు. ఆరువేల నియోగులు “భట్ట” పదాన్ని లాంఛనంగా ధరించటం శ్రీనాథాది మహాకవిజనక్షుణ్ణమైన పథమే కనుక ‘త్రిపురాంతకుని తండ్రిగారి పేరు “భట్ట” పదోపలక్షితమై ఉండటం అదొక విమర్శనీయ విషయం కాదు.

లండను ఇండియా ఆఫీసు వారి కేటలాగులో మఱొక ఆసక్తికరమైన విషయం కూడా ఉన్నది. ఈ యాచ ప్రబంధము కర్త త్రిపురాంతకుడు కూడా మన రావిపాటి త్రిపురాంతకుని వలెనే పరమశివభక్తుడు.

సకృదానతి రర్చనాయ భూయా
దుభయో రి త్యనుకమ్పయాలసానాం
అవిలమ్బితవిగ్రహైకభావం
శివయోః శ్రీసమవాయ మాశ్రయామః.

అని కావ్యాన్ని పరమోదాత్తంగా ప్రారంభించాడు. ఆ వెంటనే

కౌణ్డిన్యగోత్రకులసాగరపారిజాతః
శ్రీభట్టపాదతనయ స్త్రిపురాన్తకో భూత్
వాగుత్సవేన మతిమా నతిమానశాలీ
చక్రే ప్రతాపవిభుసన్తతిరత్నదీపమ్.

 
అని స్వీయోదంతాన్ని పేర్కొన్నాడు. ఈ శ్లోకంలో పేర్కొనబడుతున్న ప్రతాప విభుడు రెండవ కాకతి ప్రతాపరుద్రదేవుడన్న నిగమనంతో విభేదించేవారుండరు కదా.

గోత్రనామాదిక ప్రశంస

పై శ్లోకంలోని “కౌణ్డిన్యగోత్ర – కులసాగరపారిజాతః” అన్న కీలకమైన దళం కూడా పరిశీలనీయమే. రావిపాటి ఆరువేల నియోగి కుటుంబాలవారిలో కౌండిన్యస గోత్రులు గాక అన్యగోత్రాల వారు లేరు.

సీ.
“భారతీయుండ, బాపండ, నాపస్తంబ
సూత్రుండఁ, గౌండిన్య గోత్రజుండఁ,
బండితాగ్రేసరమండలమునకు న
త్యంతవిధేయుండ, నాఱువేల
వాఁడను…

అని క్రీ.శ. 1954లో ‘కవితాకోవిద’ బిరుదశోభితులు శ్రీ రావిపాటి లక్ష్మీనారాయణగారు తమ నిర్వచన భారత గర్భ రామాయణము అన్న చిత్రకావ్యంలో వ్రాసుకొన్నారు. వీరు త్రిపురాంతకుని వంశంలోని వారేనట. నివాసం కూడా ఆ ప్రాంతమే. ఆనాటి గుంటూరు మండలంలోని మార్కాపురం ప్రాంతాల నుంచి నరసారావుపేటకు వచ్చి స్థిరపడ్డారు. వీరియింట అనేక ముద్రితాముద్రిత సంస్కృతాంధ్ర కావ్యాలుండేవని ప్రతీతి. వాటిని కళ్ళారా చూసిన కుటుంబసభ్యులు, సన్నిహితబంధువులు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు వాటి స్థితిగతులను విచారింపగలిగితే ఆ సంచయంలో త్రిపురాంతకుని కృతులేవైనా బయటపడవచ్చునని ఆశింపవచ్చు. మన కవి రావిపాటి త్రిపురాంతకుని గోత్రనామాదికం కావ్యగతం కాకపోయినా ప్రతికూలసాక్ష్యాలు లభించేంత వఱకు ఆయనదీ కౌండిన్యస గోత్రమే అని విశ్వసించటం సమంజసమే అవుతుంది.

ఈ ప్రకారం కౌండిన్యసగోత్రులైన ఇద్దరు త్రిపురాంతకులు ఒకే ఇతివృత్తాన్ని స్వీకరించి రెండు వేర్వేఱు కావ్యాలను చెప్పారని భావించటం కంటే ఇద్దరూ ఒకరేనని; ఆ ఒకరు సుప్రసిద్ధుడైన మన రావిపాటి త్రిపురాంతకుడేనని; ఆ చెప్పినది మన మనుకొంటున్న యాచ ప్రబంధము మాత్రమేనని భావించటంలో విప్రతిపత్తి ఉండకూడదు. అదే విధంగా కాకతీయాంధ్ర సామ్రాజ్య యశోరక్షణదీక్షితుడైన ఎఱ్ఱదాచమ నాయని విక్రమగాథను చిత్రీకరించిన యాచ ప్రబంధము కావ్యకర్త దేవరకొండ నివాసి త్రిపురాంతకుడు, అక్కడికి సమీపాననే ఉన్న ఓరుగల్లులో కాకతీయ సామ్రాజ్య సామాజిక స్థితిగతులను వర్ణించిన ప్రేమాభిరామము కావ్యకర్త అయిన రావిపాటి త్రిపురాంతకుడు ఒకే కాలంలో, ఒకే ప్రాంతంలో ఉండి సంస్కృతంలో కావ్యరచన చేసిన ఇద్దఱు వేర్వేఱు వ్యక్తులని భావించటం కంటే యాచ ప్రబంధము సుప్రసిద్ధుడైన రావిపాటి త్రిపురాంతకుని రచనమని భావించటమే సమంజసంగా ఉంటుంది.

విమర్శకులు త్రిపురాంతకుని కాలాన్ని పరిపరి విధాల ఊహించారు. అప్పకవీయము (3-60)లో అప్పకవి “రావిపాటి తిప్పరాజు చాటుధార” అని ఈ కింది పద్యాన్ని ఉదాహరించాడు:

మ.
“సరి బే సై రిపు డేల, భాస్కరులు? భాషానాథ!”; “పుత్రా! వసుం-
ధర నం దొక్కఁడు మంత్రియయ్యె వినుకొండన్”; “రామయామాత్య భా-
స్కరుఁడో”; “యౌ!”; “నయితే, సహస్రకరశాఖ ల్లే?” “వదే! యున్నవే —
తిరమై దానము సేయుచో, రిపుల హేతిన్ వ్రేయుచో, వ్రాయుచో.”

ఈ చాటువు బ్రహ్మ-నారద సంవాద రూపకంగా వినుకొండ దుర్గాధిపతి అయిన రామయ భాస్కరుని దాతృత్వ – విక్రమ – అక్షరలేఖన గుణాలను సహస్రముఖాల వర్ణిస్తున్నది.

అయితే, అప్పకవీయము రాత ప్రతులలోని ఈ “రామయ భాస్కరు”డన్న పాఠం సరికాకపోవచ్చునని, అసలు పాఠం “రామన భాస్కరుడు” కావచ్చునని ఆంధ్ర కవుల చరిత్రము (పు. 274-9)లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు సూచించి, త్రిపురాంతకుని కాలనిర్ణయం విషయాన్ని సవిస్తరంగా చర్చించారు. కొండవీటిలోని గోపీనాథస్వామి వారి ఆలయ ముఖద్వారశాఖపై రాయబడి ఉన్న ఒక పద్యంలో ప్రసక్తుడైన “రామయ భాస్కరు”ని గురించిన ఈ పద్యాన్ని ఉదాహరించారు:

సీ.
నిర్మించెనే మంత్రి నిరుపమప్రాకార-
నవకంబుగా గోపినాథపురము
గెలిచినానాఁడే మంత్రి లలితవిక్రమమునఁ
బ్రబలుఁడై యవనుల బలము నెల్ల
నిలిపినాఁడే మంత్రి నియతవైభవమున
గోపికావల్లభుఁ గూర్మి వెలయఁ
బాలించె నే మంత్రి ప్రకటధర్మఖ్యాతి
మహిమ మీఱఁగ నాంధ్రమండలంబు
గీ.
నతఁడు భూపాలమంత్రీంద్రసతత వినుత
ధీవిశారదుఁ డచ్యుతదేవరాయ
మాన్యహితవర్తనుఁడు శౌర్యమహితయశుఁడు
భానుతేజుండు రామయ భాస్కరుండు.

దీనిని బట్టి ఈ రామయ భాస్కరుడు అచ్యుత దేవరాయల కాలంలో – అంటే క్రీ.శ. 1529 నాటికి తరువాత ఉన్నవాడు కనుక, “త్రిపురాంతకుని చాటుధార” అని అప్పకవి ఉదాహరించిన పద్యంలో “రామాయామాత్య భాస్కరుడు” అన్న పాఠానికి మాఱుగా “రామనామాత్య భాస్కరుడు” అని ఉండినదేమో అని ఊహించి, వీరేశలింగం పంతులుగారు ద్వాత్రింశన్మంత్రుల చరిత్రములోని “రాయన భాస్కరాయ” అన్న దళాన్ని ప్రమాణీకరించి, ఆ శ్లోకంలో క్రీ.శ.1516 నాటి ధాతృవత్సర వైశాఖమాసంలో వినుకొండ సీమలోని భర్తపూడి గ్రామాన్ని నాదెళ్ల అప్పయ మంత్రి రాయని భాస్కర పండితునికి దానం చేసినట్లున్న ఉదంతాన్ని బట్టి రావిపాటి త్రిపురాంతకుని కాలాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. ఆ శ్లోకం ఇది:

శా.
శాకాబ్దే వసువహ్నివేదధరణీగణ్యే చ ధాత్రబ్దకే
వైశాఖే వినుకొణ్డసీమని సుధీ ర్నాదేల్ల యప్ప ప్రభుః
వాసిష్ఠాయ చ భర్తపూడి మఖిలం గ్రామం స్వనామాజ్కితం
ప్రాదా ద్రాయన భాస్కరాయ విదుషేఽష్టైశ్వర్యభోగాన్వితామ్.

ఈ విధంగా రామయామాత్య భాస్కరుని కాలం (క్రీ.శ.1529 సం., రమారమిగా), రామనామాత్య భాస్కరుని కాలం (క్రీ.శ.1516) – రెండూ క్రీ.శ.1420 ప్రాంతాల క్రీడాభిరామమును తెలుగు చేసిన వల్లభరాయల కాలానికి తర్వాత అయినందున వీరేశలింగం గారు ఆ ఇద్దరిని కాదని; కాటయ వేమారెడ్డి కాలంలోని ఒక రాయన భాస్కరునిపై వెలిసిన చాటువును విమర్శకుల దృష్టికి తెచ్చారు. ఆ చాటువు ఇది:

చ.
కలయఁ బసిండిగంటమునఁ గాటయవేము సమక్షమందు స-
త్ఫలముగ రాయని ప్రభుని బాచఁడు వ్రాసిన వ్రాల మ్రోఁతలన్
గలుగలు గల్లుగల్లురనఁ గంటకమంత్రుల గుండె లన్నియున్
జలుజలు జల్లుజల్లురనే సత్కవివర్యులు మేలుమేలనన్.

ఈ చాటువుతోపాటు వీరేశలింగం గారు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని సి.పి. బ్రౌన్ దొర సేకరించిన చాటుపద్యాల సంపుటాల నుంచి ఈ రాయన భాస్కరుని దాతృత్వాది సౌగుణ్యాన్ని అభివర్ణిస్తున్న నాలుగు పద్యాలను, ఒక శ్లోకాన్ని కూడా తమ ఆంధ్ర కవుల చరిత్రములో ఉదహరించారు.

కం.
చేకొని రాయన బాచఁడు
కాకాలు గుణించు పిన్న కాలము నాఁడే
లా కేత్వ మియ్యనేరఁడు;
దాకును గొ మియ్యఁ డిట్టి దాతలు గలరే.
కం.
వ్రా లయినను వ్రాయును
నా వ్రాయఁడు; వ్రాసె నేని నవ్వున కయినన్
సీ వ్రాసి తా వ డియ్యఁడు
భావజ్ఞుఁడు రాయనార్య భాస్కరుఁ డెపుడున్.
ఉ.
రాజితకీర్తిశాలి యగు రాయని బాచ! భవద్యశంబు ది
క్పూజిత మౌచు మించె సురభూధర భూధర భూధరేంద్రకాం-
తాజసుగోత్రరుగ్విభురథాంగరథాంగరథాంగశేషభా-
షాజలజాహితాహితతుషారతుషారతుషారధాములన్.
సీ.
ఫణిరాజు తన శిరోమణు లర్థి కిచ్చునో
యనుచు విష్ణుని క్రింద నడఁగి యుండు
కైలాసకుధర మెక్కడ నిచ్చునో యని
యుగ్రుఁ డక్కడఁ గావలుండఁ బూను
తనలోని మణుల నే తఱి నిచ్చునో యని
వనధి సంతతమును వణఁకుచుండు
సురధరాధరము నెవ్వరి కిచ్చునో యని
తరణీ య గ్గిరి చుట్టుఁ దిరుగుచుండు
గీ.
నౌర! నీ దానవిఖ్యాతి యఖిలదిశల
మించి వర్తించె నీ కీర్తి నెంచఁ దరమె
గాఢదారిద్ర్యయామినీకాంతిచంద్ర!
భాగ్యదేవేంద్ర! రాయన భాస్కరేంద్ర!
మ.
జయలక్ష్మీనిధి రాయనప్రభుని బాచామాత్యుఁ డశ్రాంతమున్
నియతిన్ బ్రాహ్మణపూజ చేయు టభివర్ణింపంగ శక్యంబె! త-
త్రియగేహంబున హేమపంజరమునన్ బె “ల్లర్చత, ప్రార్చత
ప్రియ మేధా” యనుచుం బరించు శుకశారీకిన్నరీద్వంద్వముల్.
శ్లో.
కృతే యుగే, బలిర్ధాతా
త్రేతాయాం రఘునన్దనః
ద్వాపరే సూర్యపుత్రశ్చ
కలౌ రాయన భాస్కరః.

ఆ తర్వాత 1954లో చిలుకూరి పాపయ్యశాస్త్రి గారు కాకినాడలోని ఆంధ్ర సారస్వత పరిషత్కార్యాలయంలో చింతగుంట కోదండరామకవి రచించిన సునందా పరిణయము యొక్క వ్రాతప్రతిని, రాయన భాస్కరుని సన్నుతిస్తున్న మఱొక పద్యాన్ని గుర్తించి, దానిని తమ శ్రీనాథ కవితా సమీక్షలో ప్రకటించారు. ఆ పద్యం ఇది:

సీ.
ఘనతరౌదార్యదీక్షాకల్పితానల్ప
కరనిబద్ధసువర్ణకంకణుండు
నా సేతుశీతనగాంతరరాట్సభా
మధ్యవిశ్రుతకీర్తిమండలుండు
కొండపల్లీ విన్నకొండ దుర్గద్వయీ
దేశప్రజావనధీయుతుండు
సకలావనీపకసంతానయాచిత
వస్తుప్రదానప్రవర్తనుండు
గీ.
అన్నవేమ మహీశ దత్తాగ్రహార-
మదకళాందోళికార్యసన్మణివిశేష-
భూషణాద్యష్టభూతివిభూషితుండు
భానుతేజుండు రాయన భాస్కరుండు.

ఈ ప్రయోగాలను బట్టి, తదితరాధారాలను బట్టి – వినుకొండలో ఆ కాలంలో దుర్గాధిపతిగా ఉన్నది రాయన భాస్కరామాత్యుడే కాని – రామయ భాస్కరుడు కాడని నిశ్చయింపబడుతున్నది. ఈ చరిత్రను సాకల్యాన తెలుసుకొనగోరిన వారు 1889లో అచ్చయిన “ద్వాత్రింశన్మంత్రుల చరిత్రము అను ముప్పది ఇద్దఱు మంత్రుల చరిత్రము”ను; 1898లో మహావిద్వాంసులు కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి గారు ప్రకటించిన “భాస్కరోదంతము”ను; 1900లో గురజాడ శ్రీరామమూర్తిగారు ప్రకటించిన “రాయన భాస్కరమంత్రి చరిత్రము”ను; 1900లో సరస్వతీ పత్రిక పక్షాన కొచ్చెర్లకోట జమీందారు వేంకటకృష్ణారావుగారు ప్రచురించిన “రాయన భాస్కరమంత్రి చరిత్రము”ను; 1907లో శ్రీ మద్దులపల్లి గురుబ్రహ్మశర్మగారు గబ్బిట లక్ష్మీనరసింహంగారి పీఠికతో అచ్చువేసిన “శ్రీ కొండవీటి చరిత్రము”ను తప్పక చూడాలి.

ఈ రాయన భాస్కరుడు అనవేమారెడ్డి రాజ్యకాలం (క్రీ.శ. 1364-85)లో — అంటే క్రీ.శ. 1365 ప్రాంతాన వినుకొండ దుర్గానికి అధిపతియై, క్రీ.శ.1384-85ల మధ్య వినుకొండ విజయనగర సామ్రాజ్యంలో విలీనమయేందుకు కొంత మునుపటి దాకా ఉన్నట్లయితే రావిపాటి త్రిపురాంతకుడు ఆయనను సందర్శించి ఈ చాటువును చెప్పినది క్రీ.శ.1365-70 నడిమి కాలంలో అయి ఉంటుంది. ఇందాక మనమనుకొన్నట్లు క్రీ.శ.1290 (+/-)ప్రాంతంలో జన్మించినవాడైతే రాయన భాస్కరామాత్యుని సందర్శించినది 70-75నాడై ఉంటుంది. త్రిపురాంతకంలో ఉండగా క్రీ.శ. 1315-20ల మధ్య కృతినిర్మాణోత్సాహం ఉదయించినప్పుడు ఓంప్రథమంగా చంద్ర తారావళిని, కొంత సువ్యక్తుడైనాక కుమారగిరి శిఖరాన స్వయంవ్యక్తిని పొంది భక్తకోటి కోసం విరాజమానుడై ఉన్న శ్రీ త్రిపురాంతక స్వామిపై త్రిపురాంతకోదాహరణమును, ఆపైని పద్మసరస్సులో శ్రీచక్రమధ్యాన వెలసిన అమ్మవారిపై అంబికా శతకమును చెప్పాడని; అక్కడి నుంచి యశోలాభానికై దేవరకొండ దుర్గానికి వెళ్లి క్రీ.శ.1320 ప్రాంతాల సంస్కృతంలో యాచ ప్రబంధమును; మఱి పదేళ్లకు జీవితంలోని సుఖదుఃఖాలన్నీ చవిచూసిన తర్వాత ఓరుగల్లులోని భోగజీవితపు చీకటివెలుగులను కన్నులకు కడుతూ క్రీ.శ. 1330-40 ప్రాంతాల ప్రేమాభిరామ వీథిని రచించి; చరమసంధ్యావేళ స్వస్థానానికి మళ్లి, మార్గమధ్యాన వినుకొండలో ఆగి రాయన భాస్కరామాత్యునిపై చాటుపద్యాన్ని చెప్పి పూర్ణఫలంతో వేదోక్తంగా ఆశీర్వదించి ఉంటాడని ఊహించటం సమంజసంగానే ఉంటుంది.

[పఠన సౌలభ్యానికై ముద్రిత ప్రతిలోని అధ్యాయవిభాగాలు మార్పు చేయబడ్డాయి. — సం.]


ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి:

ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు ‘నయాగరా’ కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని సాహిత్య లక్షణ చిత్రకవిత్వాలపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి “తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం” అన్న ప్రశంస పొందారు. విజయవాడ ఆకాశవాణిలో నాలుగేళ్ళు, ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో 38 సం॥లు పనిచేశారు. ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ వ్యాస సంపుటి ఇటీవలి రచన.

 ...