[త్రిపురాంతకోదాహరణము పాఠాన్ని విడిగా ఈమాట గ్రంథాలయంలో చేర్చాము. – సం.]
మనోహరమైన ఈ త్రిపురాంతకోదాహరణ కావ్యాన్ని తొలుత పరిష్కరించిన మానవల్లి రామకృష్ణ కవిగారు ఇందులోని తాత్వికతను, రసాత్మికతను ఆవిష్కరిస్తూ పీఠికలో అద్భుతంగా వ్యాఖ్యానించారు. ఈనాటికీ సుపరిశీలితం కాని ఆ పలుకులను యథాతథంగా ఇక్కడ ఉదాహరిస్తాను:
“ఈ యుదాహరణము మహాకావ్యములలోఁ జేరక క్షుద్ర ప్రబంధముల లోనిది. ఇది ప్రథమాది సప్త విభక్తులును సంబుద్ధితోఁ గలసి యెనిమిది విభక్తులును బనుపడఁ గ్రమముగాఁ గూర్చి యొక్కొక్కదాని పిదపఁ గళికోత్కళికలను గానయోగ్యములగు మార్గజాతిపద్యములఁ జొప్పించి పరిపూర్ణమగు స్థాయి రస పరిపాకము గలుగునట్టులు రచింపఁబడును. భాషలోఁ గొన్ని యుదాహరణములే గలవు. వానిలో నెల్ల నిది మేలయినది. దీనిలోని పద్యము లన్నియు సంస్కృతచ్ఛందస్సంజాతములగు వృత్తములు. కళికోత్కళికలలో రగడలును గొన్ని నూతనజాతులును గలవు. దాని క్రింద సూర్య చంద్రగణములే ప్రధానములు. పూర్వకాలమున ద్విపదలు, రగడలు, సీస, గీ త్యాటవెలఁది, తరువోజ, పాళి, సద్దళి, లయగ్రాహ్యక్కరాదులు చాల వాడుకలో నుండెననియు నన్నయాది మహాకవుల ప్రౌఢకావ్యములు జనించిన తోడనే యవి క్షీణించెననియు నేను దలఁచుచున్నాను”.
శ్రీ రామకృష్ణకవి గారన్నట్లు మార్గకవిత్వం ప్రబలి దేశికవిత్వానికి ఆదరణ ఇంకా క్షీణించని రోజులలో ఉభయ ప్రక్రియలను కలుపుకొంటూ గానయోగ్యమైన భంగీభణితిలో సాగిన నవ్యప్రయోగం ఈ ఉదాహరణ. సంస్కృతంలో కాళిదాసు విక్రమోర్వశీయములో “పత్రే నివేశిత ముదాహరణం ప్రియాయాః” అని, రఘువంశంలో “జయోదాహరణం బాహ్వోర్గాపయామాస కిన్నరాన్” అని వ్రాసిన చోట్ల ప్రయుక్తమైన ‘ఉదాహరణం’, ‘ఉదాహరణము’ అన్న ప్రక్రియకు సూచకమని ఆంధ్రదేశంలోని వ్యాఖ్యాతలు వ్రాయటమే కాని అన్యస్థలాలలోని వ్యాఖ్యాతలు దానికి నిదర్శనము, మచ్చు అనే సామాన్యార్థాన్నే చెబుతున్నారు. సంస్కృతంలో ఉదాహరణమును ఒక ప్రక్రియావిశేషంగా ఆంధ్రేతరదేశాలలోని లాక్షణికులు పూర్వకాలంలో పేర్కొన్నట్లు తెలియటం లేదు. కన్నడంలో లభిస్తున్న “ఉదాహరణ గద్య” నిజానికి బిరుదు గద్యకు సమీపమే కాని తెలుగులోని గతివైవిధ్యపూర్ణమైన ఉదాహరణప్రక్రియకు సన్నిహితం కాదు. అందువల్ల పెద్దలంటున్నట్లుగా కాక పాల్కురికి సోమనాథుడే ఈ ప్రక్రియకు నిజమైన నిర్మాత అని భావింపవలసి ఉంటుంది. సోమనాథుని సంస్కృత బసవోదాహరణము, తెలుగు బసవోదాహరణము ఈ ప్రక్రియకు ఆద్యరూపాలు. ఆద్యుడు కనుకనే సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రము పురాతన ప్రకరణంలోని కళియంబ కథలో దీనికొక ప్రాగ్రూపాన్ని ఆలోచించినట్లు కనబడుతుంది. ఆయన రచనా సంవిధానాన్ని, కూర్పు నేర్పును సాకల్యంగా పరిశీలించిన త్రిపురాంతకుడు విభక్త్యంతాల విషయంలో కొత్త మార్పులు చేసి, ఉదాహరణమును మరింత గానయోగ్యమైన సాంగీతిక ప్రక్రియగా తీర్చిదిద్దాడు.
త్రిపురాంతకుడు బసవ పురాణమును ఆసాంతం చదివి కవితారచనలో మరుగు మెరుగులు నేర్చుకొన్నందున అందులోని భక్తుల కథాప్రస్తావన లనేకం త్రిపురాంతకోదాహరణములోనికి వచ్చి చేరాయి. ఆయన స్మార్తధర్మాన్ని అనుసరించి శైవసంప్రదాయాభిజ్ఞుడైన భక్తిపరుడే కాని వీరశైవ మతానుయాయి కానందువల్ల శైవసమయాల ప్రయుక్తి ఇందులో కనబడదు. శివపురాణాదుల కల్పనానుసరణం ఉన్నది. తొలి పద్యంలోనే త్రిపురాంతకదేవుని పతాకికను ముక్తికాంత పయ్యెద కొంగుతో సరిపోల్చి వర్ణించాడు. “మఱియు మఱ్ఱి మ్రాను మొదలు – మరిగియున్న గురునిచేత” అని ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో మట్టి చెట్టు మొదలు చెంత నిలిచి వేదాలను కాపాడిన పండితారాధ్య చరిత్రములోని కథను జ్ఞప్తిపథంలో నెలకొలిపాడు. ఎంతో ప్రాణశక్తి కలిగిన ఉక్తివైచిత్రితో పరమేశ్వరుని “ఆఱు రేకుల మంత్రకుసుమము – నందు వెలిఁగెడి చంచరీకము” అని తన సంప్రదాయాభిజ్ఞతకు సమంజసమైన ఉదాహరణను నిలిపాడు. “ఓఙ్కారపూర్వో మన్త్రోఽయం పఞ్చాక్షరమయం పరః, శైవాగమేషు వేదేషు షడక్షరీ ఇతి స్మృతః” అని సిద్ధాంత శిరోమణిలో నిర్వచితం. ఆరు రేకుల మంత్రం షడక్షరి. ప్రణవబీజంతో కూడిన పంచాక్షరీ మంత్రం. ఆ మంత్ర కుసుమంలోని బీజాక్షరాలను రేకులుగా, మంత్రాధిదైవతాన్ని తుమ్మెదగా అభేద తాద్రూప్యాన్ని నిరూపించాడు. షడక్షరి పువ్వు అన్న మాట. త్రిపురాంతకదేవుడు ఆ పువ్వు మీదికి వచ్చి వ్రాలిన చంచరీకం.
ఇంత చిన్ని రచనలోనే త్రిపురాంతకుడు అమాయక భక్తులైన కన్నప్ప (“నెఱయఁ గన్నప నోటి – నీటఁ దోఁగినవాని“), సేనమరాజు (“తలఁకి సేనమరాజు దాడి కోడినవాని”), సాఖ్య తొండడు (“శాఖ్యతొండని రాల జడికి నోర్చినవాని“), సుందరమూర్తి నాయనారు నంబి (“నంబి వనుప కుంటెనలకు – నడచిన యెడకానిచేత“), భల్లహుడు (భల్లాణ రాజు) (“బల్లహుని వధూటి కాస – పడిన దుండగీనిచేత“), గుండయ్య (“గుండయ మెచ్చిన వేల్పునకై”) మొదలైనవారి కథాప్రశంసలను ఎంతో ఇమిడికతో పొందుపరిచాడు. పరమశివుని భక్తరక్షణ లీలల గానపారవశ్యం అడుగడుగున గోచరిస్తుంది. “పొలఁతితో నొక్కొడలఁ – బొత్తుఁ గూడినవాని” అని ఈశ్వరుని అర్ధనారీశ్వరత్వం, “మఱియు వేలుపులేటి మౌళి నాఁగినవాని” అని శైవజటాజూటంలో గంగాధారణం, “మరు జయించిన వానిఁ, గరుణ మించిన వాని” అని మన్మథ గర్వభంగం, “తన కినుకలోఁ బుట్టి, కనలి దక్షునిఁ గొట్టి, యడరి వేల్పులఁ బఱచి, తొడరి జన్నము చెఱచి, వీరభద్రుఁడు వచ్చి, చేరి మ్రొక్కిన మెచ్చి” అని దక్షయజ్ఞ విధ్వంసం, ఇంకా కపాల భిక్షాటనం, “పురము లేసియున్న జోదుచేత” అని మొదలుగా త్రిపురాసుర సంహారం మనోభిరామంగా వర్ణింపబడ్డాయి. శివుని “లక్ష్మీపతి బావ” అనటం ఎంత హృద్యంగా ఉన్నది!
అనల్పమైన కల్పనా ప్రపంచానికి త్రిపురాంతకోదాహరణము పుట్టినిల్లు. సూచ్యార్థ సూచకత్వానికి, ప్రకాశ్యార్థ ప్రకాశకత్వానికి అపురూపములైన ఉదాహరణలు ఇందులో సర్వే సర్వత్ర నిండి ఉన్నాయి.
ఇప్పటికే విస్తరిల్లిన ఈ విమర్శను ముగించే ముందు విమర్శకులు గుర్తింపని ఒక అపూర్వమైన విశేషాన్ని ప్రస్తావిస్తాను. సప్తమీ విభక్తి చివరనున్న ఉత్కళికలో త్రిపురాంతకుడు —
ఘనజఘన పులినమును
వరవళితరంగములు
గురుకుచరథాంగములు
గలిగిన యుమాసరసి
లలితముఖముల బెరసి
క్రాలు నొక కలహంస!
బాలచంద్రోత్తంస!
అని, ఆదిదంపతుల మధురశృంగారాన్ని మధురాతిమధురంగా అభివర్ణించాడు. కల్పనలో విషయి-విషయ భావం సలక్షణంగా నిబద్ధమై సుందరంగా ఉన్నది. ‘ఉమాసరసి’ అన్నప్పుడు ఆరోపాశ్రయమైన పూర్వవర్తివిషయం ‘ఉమ’పై అభేదప్రాధాన్యం వల్ల ‘సరసి’ అన్న పరవర్తి విషయారోపణం జరిగి ఆరోపవిషయం సుప్రకాశితం అయింది. కల్పనలో వర్ణ్యాలైన ముఖము — జఘనము — వళులు — కుచములు అన్న అంగాలపై సాదృశ్యమూలాన క్రమంగా నలినము — పులినము (ఇసుకతిన్నె) తరంగములు — రథాంగములు (చక్రములు) అన్నవి ఆరోపింపబడి, ముఖనలినము — జఘనపులినము — వళితరంగములు — కుచరథాంగములు అన్నవి సిద్ధమైనాయి. ఆ అభేదం సర్వాంగాలకూ చెప్పినందువల్ల ఇది సమస్త వస్తు విషయ సావయవరూపకం అయింది. అంతేకాదు. ఇందులోని ముఖనలినము — వళితరంగములు — జఘనపులినము — కుచరథాంగములు అన్న రూపణలు “ఉమాసరసి”తో పరస్పరాశ్రయంగా ఏకార్ధభావంతో సమన్వయిస్తున్నాయి. ఆ ఉమాసరసిలో విహరించే రాగాతిశయాన్ని పొందిన కలహంస శ్రీ పరమశివుడట.
“క్రాలు నొక కలహంస!
బాలచంద్రోత్తంస!”
అని సంబుద్ధ్యంతంలో సరసమైన అంత్యానుప్రాస నిబద్ధమై ఉన్నది. దీనికి మూలమైన కాళిదాస కృతమని ప్రచారంలో ఉన్న “శృంగార తిలకము”లోని తొలి శ్లోకం ఇది:
శ్రోణీతీర్ధశిలా చ నేత్రశఫరం ధమ్మిల్లశైవాలకమ్
కాన్తాయాః స్తనచక్రవాకయుగలం కన్దర్పబాణానలై
ర్దగ్ధానా మవగాహనాయ విధినా రమ్యం సరో నిర్మితమ్.
దీని గురించి ఎంతైనా వ్యాఖ్యానింపవచ్చును. నిజానికి త్రిపురాంతకుని రచనలో రత్నగర్భను తూచినా తూకానికి తూగని ఒక్కొక్క పద్యాన్ని, పదాన్ని, అక్షరాన్ని ఏ భంగిమలో చూస్తే రసజ్ఞులకు ఆ భంగీభణితి సాక్షాత్కరిస్తుంది.
నిడుదవోలు వారు త్రిపురాంతకుని శివాద్వైతి అని భావించారు.
