సంగీత సాహిత్య శ్రీనివాసుడు


పి. బి. శ్రీనివాస్ (1930-2013)

శ్రీ పి.బి. శ్రీనివాస్ విద్వత్ సాంగీతిక సుకవిగాయనులు. బహుముఖీన ప్రజ్ఞావిచక్షణులు. విలక్షణమైన వ్యక్తిత్వవికాసంతో శ్రోతలు, పాఠకుల హృదయమందిరాలలో స్థిరనివాసం ఏర్పఱచుకొన్న శాలీనప్రతిభులని వారి పరమపదప్రస్థానానికి అభిమానులు అశ్రుతర్పణతో సమర్పిస్తున్న నివాళి వేయినోళ్ళతో చాటిచెబుతుంది. సృజనరంగంలో చిత్కళామయమైన కృషి చేసి వారికంటే ముందంజ వేసినవారు త్రికాలాలలోనూ ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కాని వారిలా అద్వితీయమైన స్వయంకృషితో సంగీతాన్ని ఆపాతరమణీయంగానూ, సాహిత్యాన్ని ఆలోచనామృతంగానూ ఆస్వాదించి ఆస్వాదింపజేసి, ఆనందించి, ఆనందింపజేసి ఆ పంచామృతాన్ని ప్రపంచమంతటా పంచిపెట్టాలని తహతహలాడిన శ్రీనివాస్ వంటి సహృదయులను మాత్రం ఎంతో అరుదుగా చూస్తాము. ఆన్ధ్రత్వ మాన్ధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్ అని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆంధ్రదేశానికి దూరంగా ఉంటూ ఆ నమ్మకాన్ని నానావిధభాషలలో అభివ్యక్తీకరించిన ధన్యజీవనులుగా వారంటే గౌరవం నాకు. ఆ గౌరవాన్ని వెల్లడించేందుకు ఇటువంటి దుఃఖమయసమయం తటస్థింపవచ్చునని ఎన్నడూ అనుకోలేదు.

శ్రీనివాస్ శ్రీవైష్ణవులు. శ్రీవైష్ణవులలో ప్రతివాదిభయంకరం గృహస్థాశ్రములది ఒక ప్రకృష్టజ్ఞానవంతమైన స్థానం. తమిళదేశంలో జైన హైందవ ధర్మాల సద్దు మణిగిన తర్వాత హైందవంలో శైవ వైష్ణవాల మధ్య పరస్పర విరోధాలు కొంతకాలం సాగాయి. భగవద్రామానుజులు శ్రీవైష్ణవాన్ని చతుర్వర్ణాల సరిహద్దులు దాటించి, జనులందరికీ మోక్షమంత్రాన్ని ఉపదేశించినప్పటినుంచి శ్రీవైష్ణవం ప్రబలంగా వ్యాప్తి చెందింది. తద్వారా ద్రావిడవేదం పఠనపాఠనాలలో మఱింత ప్రచారానికి వచ్చింది. శ్రీవైష్ణవులందరూ ఉభయవేదాంత ప్రవర్తనులయ్యారు. భగవద్రామానుజుల ప్రియశిష్యులు మహాకవి కూరత్తాళ్వారులు. ఆయనకి శ్రీవత్సాంకమిశ్రులని పేరు. చిత్రకవిత్వంలో అగ్రగణ్యమైన యమకరత్నాకరం వారిదే. వారి వంశంలోని వారే సౌమ్య జామాత అని పేరుపొందిన మహాకవి మనవాళముని. యతిరాజవిజయాది మహాకృతులను రచించిన వాత్స్య వరదాచార్యులు కూడా ఆ కుటుంబంలోని వారే.

మనవాళముని ప్రియశిష్యులు అణ్ణంగరాచార్యులవారు. మనవాళముని ఉపదేశసారాన్ని భుజాన వేసుకొని దేశసంచారం చేసి విద్యావివాదాలలో మతత్రయపండితులను మెప్పించిన మహాపండితులు ఆయన. ఆ రోజులలో వాక్యార్థసభలలో వాదించటం అంటే ప్రతిపాద్యవస్తు తత్త్వావగాహనతో ఉపక్రమించటం, ప్రమాణషట్కాన్ని క్రమప్రథతో నిరూపించి తాత్పర్యనిర్ధారణ చేయటం అన్నమాట. అణ్ణంగరాచార్యుల వాదవైభవం మూలాన వారికి ప్రతివాదిభయంకరులని పౌరుషనామం ఏర్పడింది. అదే ఇంటిపేరుగా మాఱింది. ప్రతివాదిభయంకరం అణ్ణంగరాచార్యుల వారయ్యారు. అణ్ణంగరాచార్యులు ఎంతటి పండితులో అంతటి రసికులు. ఎంతటి రసికులో అంతటి మహాకవులు. ఈ రోజు తిరుమలేశుని మందిరంలో అనునిత్యం సుప్రభాతవేళ శ్రూయమాణంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్తోత్రం రచించినది వీరే.


శివాజీ, ఎంజీఆర్ తదితరులతో

శ్రీవత్స సగోత్రులలో ఆ ప్రతివాదిభయంకరం అణ్ణంగరాచార్యుల వారి సంతతి వారొకరు 15వ శతాబ్ది నాటికే ఆంధ్రదేశానికి తరలివచ్చారు. తూర్పు తీరాన ఆ కుటుంబాల వారు ఇప్పటికీ తామరతంపరగా వ్యాపించి ఉన్నారు. సామర్లకోటలో ప్రతివాదిభయంకరం తిరువేంగళాచార్యులని గొప్ప పండితులు 19వ శతాబ్దిలో ఉండేవారు. 1862లో భానుమిశ్రుని రసమంజరికి తాత్పర్యమంజరి అని వ్యాఖ్యను వ్రాశారు. కూరేశ్వరుల సుదర్శన శతకానికి లఘుటిప్పణిని కూర్చారు. ఆయన కూడా చిత్రకవిత్వప్రియులు. వారి సంతతి వారు కృష్ణా జిల్లాలోని పసలపూడికి వచ్చి స్థిరపడ్డారు. హృద్యోగాలు ఉద్యోగాలకు మళ్ళిన తర్వాత అప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి వారంతా తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు వెళ్ళారు. వారిలో ప్రతివాదిభయంకర వేంకట లక్ష్మణ ఫణీంద్రస్వామి, శేషగిరమ్మ దంపతులున్నారు. కాకినాడలో ఉండగానే ఆ దంపతుల పుణ్యవశాన 1930 సెప్టెంబరు 22వ తేదీన శ్రీనివాస్ జన్మించారు.


పి. బి. శ్రీనివాస్

చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ ముచ్చట ఒకటి. మూడేళ్ళు వచ్చినా మాటలు రాలేదు. తండ్రి వాగ్మి, తల్లి వాచక్నవి. కొడుకుకు మాటలు రాకపోవటం దిగులే కదా మఱి. మొక్కని రాయి లేదు, ఎక్కని గుడిమెట్టు లేదు. ఏమైతేనేమి, పధ్నాలుగు భాషల్లో వెయ్యి సినిమా పాటలు పాడి, అష్టభాషల్లో వేలకొద్దీ గీతాలను వ్రాయవలసిన భవితవ్యం ఎన్నాళ్ళు గొంతులో నుంచి పెకలి రాకుండా అవ్యక్తంగా ఉండగలుగుతుంది? ఆ మాటలు రావటం రావటం గిరిశిఖరం నుంచి దూకిపడే స్రవంతీప్రవాహవేగంతో వచ్చాయి. పసినాడే గొంతు వసివాడే స్పష్టవాక్కుతో వ్యక్తమయింది.


పిఠాపురం కాలేజీ ఫోటో

శ్రద్ధగా చదువుకొన్నారనే తప్ప ఆ చదువుసాములలో పెద్ద విశేషాలేవీ లేవు. హైస్కూలు దాటి పి.ఆర్. కాలేజీలో చదివినది బి.కామ్ అయినా దృష్టి ఆ అంకెల సంకెలల మీదికి మళ్ళలేదు. మహమ్మద్ రఫీ, మన్నాడే, తలత్ మెహమూద్, ముఖేష్‌ల పాటలు వినటం, ఇంట్లో తల్లిగారి వద్ద సాధన చేయటం. సంగీతం క్లాసులో చేరి, అంతలోనే విడిచివేశారు. సహజపాండిత్యాన్ని శ్రుతపాండిత్యంతో పరిపూర్ణించుకొన్నారు. సంస్కృతాంధ్రాల అధ్యయనం ఉండనే ఉన్నది. జ్యోతిష్కులెవరో పెదిమె విఱిచి, లాభం లేదన్నారట. ఫణీంద్రస్వామి ఆ మాటలకు వెనకాడలేదు. కొడుకంటే అంత నమ్మకం ఆయనకు. అప్పట్లో కాకినాడలో సబ్ రిజిస్ట్రారుగా ఉన్న గొప్ప వీణావాదనులు బ్రహ్మశ్రీ ఈమని శంకరశాస్త్రి వద్దకు తీసికొనివెళ్ళారట. శంకరశాస్త్రి యువశ్రీనివాసుని గాత్రం ఆలకించి, ఎంతో మెచ్చుకొని, మంచి భవిష్యత్తు ఉంటుందని దీవించారట. డిగ్రీ పట్టభద్రత పూర్తి కాగానే తన వాద్యబృందంలో అవకాశం ఇస్తానని మాటయిచ్చారు. ఆ చల్లని దీవెన తనకు శ్రీరామరక్ష అయిందని ఆ తర్వాత శ్రీనివాస్ ఈమని వారిపైని ఒక నివాళి వ్యాసంలో గుర్తుచేసుకొన్నారు.

ఆ రోజుల్లో కాకినాడలో రాధాస్వామీ సత్సంగుల ప్రభావం మూలాన హిందీ, పంజాబీ భాషలకు కొంత ప్రచారం ఉండేది. శ్రీనివాస్‌కు హిందీ పాటలు ఎట్లాగూ ఇష్టం కనుక ఆకర్షితులై చిన్ననాటినుంచే హిందీ చదువుకున్నారు. చెన్నపురికి వెళ్ళిన తర్వాత కాస్త పట్టుబట్టి దక్షిణభారత హిందీ ప్రచార సభ వారి హిందీవిశారద పరీక్షలో సులభంగానే ఉత్తీర్ణులయ్యారు. ఆ పరీక్ష కోసం సుప్రసిద్ధ చలనచిత్ర నటి హేమమాలిని తల్లి శ్రీమతి జయ ఆయనతో కలిసి చదువుకొనేవారు. ఆవిడ ఇంటి ఎదురుగా విశ్వవిఖ్యాత వయొలిన్ విద్వాంసులు లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కుటుంబం ఉండేది. వారింటి క్రింది భాగంలో ప్రఖ్యాత పాత్రికేయ రచయిత సోవియట్ భూమి పత్రిక సంపాదకులు సెట్టి ఈశ్వర రావు చాలా రోజులున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిల్లు అంతకు నాలుగు నిమిషాల నడక. ఈ పరిచయాల వల్ల శ్రీనివాస్ సంస్కారం పురివిచ్చుకొంది.


ఒక మ్యూజిక్ సెషన్‌లో

సాలూరి రాజేశ్వరరావుతో స్నేహమంటే స్నేహం, శిష్యత్వమంటే శిష్యత్వం, చనువంటే చనువు. ఆయన దగ్గఱ గాత్రధారణ మెళకువలను, సంగీతపు ఒడుపులను, వాద్యబృందం నిర్వహణను, వాక్చాతుర్యాన్ని, హాస్యధోరణిని ఒకటనేమిటి, పుణికి పుచ్చుకోని విద్య లేదు. చిన్నప్పటి నుంచి విన్నదీ చదివినదీ చెవి ఒగ్గి వినటమే గాని, మనసు పెట్టి చదవటమే గాని సంగీతంలోనూ, సాహిత్యంలోనూ శిక్షాప్రణీతంగా చెప్పుకోదగిన పెద్దల దగ్గఱ చెప్పుకోలేదు. ఆ విన్నదనం లేకుండా విన్నదానికి మెఱుగులు దిద్దుకొన్నారు. స్వయంప్రతిభానతతో కృషిచేశారు. ఆ కృషి పరిపరి విధాల పండింది. పంట కాపుకు రాగానే నలుగురికీ దోసిళ్ళ నిండా పంచిపెట్టడం, మంచి విత్తనాలను మళ్ళీ నాటటం, అవి మొలకెత్తి చిగుళ్ళు తొడిగి మొగ్గలు విచ్చుకొని పువ్వులు పూసి కాయలు గాచి పండ్లయ్యే ఋతువు వస్తుందని మఱుసటేటి కోసం మళ్ళీ ఎదురుచూడటం. సంగీతంలోనూ సాహిత్యంలోనూ ఆయన కృషి అంతే. ఆ కృషి ఫలించి ఆయన అచిరకాలంలోనే ఉభయకళాకోవిదులుగా గుర్తింపును పొందారు.

చెన్నపురిలో ఉండగా శ్రీనివాస్‌కి విద్యావకాశాలు బహువచనంలో కలిసివచ్చాయి. బులుసు వెంకటరమణయ్య, తీర్థం శ్రీధరమూర్తి, వి. రాఘవన్ వంటి మహనీయుల సన్నిధిసేవ లభించింది. లబ్ధప్రతిష్ఠులైన దేవులపల్లి కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, చెఱువు ఆంజనేయ శాస్త్రి, కొంగర జగ్గయ్య వంటివారికి సన్నిహితులయ్యారు. ఆ కాలంలోనే మా నాన్నగారితో పరిచయం స్నేహంగా మాఱింది. ఆకాశవాణిలోనూ, పాత్రికేయరంగంలోనూ, కవిత్వాభిమాని సంఘంలోనూ ఉన్న సాహితీమిత్రుల సంఖ్య లెక్కకు మీఱుతుంది. సంగీతం, సాహిత్యం, సినిమాలతో మైత్రి ‘My Three’ అని ఆయనే అన్నారు.

తండ్రిగారి సంస్కృతపండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గఱ చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే ఆయనకు ఆదిగురువు, తుది గురువు. తక్కినదంతా ‘కాన్ ఖోల్ కర్’ వినటమొక్కటే.

మద్రాసుకు వచ్చిన తర్వాత శ్రీనివాస్ ఒక్క తెలుగును మాత్రం పద్ధతిగా మహావిద్వాంసులు రావూరి దొరసామిశర్మ సన్నిధిని శ్రీ ఆరుద్రతో కలిసి ట్యూషన్ చెప్పుకొన్నారు. ఆ ‘ట్యూషన్’ కథ చాలామందికి తెలియదనుకొంటాను. మొత్తానికి ఆ సత్సాంగత్యం ఛందఃశాస్త్రంలో శ్రీనివాస్ భావుకత్వానికి, భావకవిత్వానికి, భావిపరిశోధనలకు ప్రాతిపదికం అయింది. దొరసామిశర్మ తాము రచించిన ఆంధ్రలక్షణసంగ్రహం గ్రంథాన్ని వారిద్దరికీ పాఠం చెప్పారు. ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యం రచించే ఉద్దేశంలో ఉన్నారు. సుప్రసిద్ధ కవినన్న అహంభావమేమీ లేకుండా దొరసామిశర్మ చెప్పిన పాఠాన్ని చెప్పినట్లుగా గుర్తుంచుకొనేవారు. శ్రీనివాస్ చిత్రకవిత్వానికి మెఱుగులు దిద్దుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నం దొరసామిశర్మ బోధనాపటిమ మూలాన అయత్నంగా ఫలించింది. ఆ బొమ్మలను పునర్లేఖనాభ్యాసం కోసం దొరసామిశర్మ కాగితం మీద తేదీ వేసి, PBS అని వ్రాసి భద్రంగా దాచి ఉంచేవారు. అవన్నీ ఇప్పుడింకా వారింట ఉండే ఉండాలి.

శ్రీనివాస్ ఆధునికతాభిమాని. ‘ఆధునికత’ అంటే ‘ప్రాత యనిపించు సరిక్రొత్త పథము నాది’ అన్నమాట. సంప్రదాయపు పరిధిలో ఉంటూనే సరిక్రొత్త దారులు తీయటం అది. ‘చిత్రప్రయోగం’ లేని కేవల సంప్రదాయం ఆయనకు అభిమతం కాదు. గురువుల వద్ద శాస్త్రీయసంగీతాన్ని శాస్త్రీయంగా నేర్చుకోకపోవటం వల్ల ఆయన జీవిక శాస్త్రీయసంగీత కచేరీలకు మొగ్గలేదు. లలిత సంగీత కార్యక్రమాలకు, సినిమా పాటల విభావరులకు లెక్కలేదు. ఆయన సంగీతాభిమానం సంకుచిత పరిధులలో కుంచించుకోక ప్రాచ్య పాశ్చాత్య రీతులన్నింటికి విస్తరిల్లింది. ఆ రీతులన్నింటిలోనూ ప్రయోగాలు చేశారు. భాషావిషయంలో మాత్రం శాస్త్రాన్ని శాసనంగా, శాస్త్రీయంగా నేర్పే శాస్త ఒకరు దొరసామిశర్మ రూపంలో లభించారు. ఆ సంస్కారఫలంగా శ్రీనివాస్ “ఛన్దోహీనో న శబ్దోస్తి, నచ్ఛన్దః శబ్దవర్జితః” అన్న నమ్మకంతో భాషను అభిమానించారు. ఆ భాషాభిమానం బహుభాషాభిమానానికి దారితీసింది. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ, ఉరుదు, ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకొన్నారు. అన్ని భాషలలోనూ రచనాభ్యాసం మొదలుపెట్టారు. పరిణతిని సాధించారు.

రావూరి దొరసామిశర్మ ప్రభావం శ్రీనివాస్ కవిత్వాభిప్రాయాలను చాలా వరకు ప్రభావితం చేసిందని చెప్పవచ్చును. ఛందస్సులో కొత్త కొత్త ప్రయోగాలను చేయాలనే ఊహను ఉత్సవింపజేసింది వారి ప్రభావమే. నిజానికి ఛందస్సులో పూర్వులు చేయని పరిశోధనలంటూ దాదాపు ఏవీ లేవు. దొరసామిశర్మ వద్ద చాలా పెద్ద గ్రంథాలయం ఉండేది. ఛందోగ్రంథాలన్నీ ఉండేవి. స్వయంగా తామే కొన్నింటిని పరిష్కరించారు. ఎక్కడెక్కడి గ్రంథాలయాలలోని అపురూపమైన లిఖిత పుస్తకాలకూ ఆయన సొంతంగా ప్రతులు వ్రాసుకొన్నారు. వ్యాకరణంలో గొప్ప కృషి చేశారు. ఒక ఛందోవ్యాకరణ సంహితాసర్వస్వాన్ని రూపొందించాలని ప్రయోగాలను సేకరించారు. వాటిని చూస్తున్నప్పుడు శ్రీనివాస్‌కి దొరసామిశర్మ గుర్తించినవి కాక మఱేవో కొత్త విషయాలను కనుక్కోవాలని అనిపించటం సహజమే. అందువల్ల వర్ణ మేరువు, వర్ణ పతాక, మాత్రా మేరువు, మాత్రా పతాక, వర్ణ మర్కటి, మాత్రా మర్కటి, ప్రస్తారక్రమాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. కన్నడ భాషాభిమానం వల్ల అక్కడ ఛందస్సులో జరిగిన పరిశోధనలను తెలుసుకొన్నారు.


పి. బి. శ్రీనివాస్

టి. నగరులో పాండీ బజారుకు సమీపంలో ఆరుద్ర ఇంటి దగ్గఱే శ్రీ బి. నాగరాజారావని ఒక సుప్రసిద్ధ కన్నడ పాత్రికేయులు ఉండేవారు. సంస్కృత ప్రాకృత కన్నడాలలో ఏదన్నా పుస్తకం ఆయన వద్ద లేకపోతే అసలు అచ్చు కాలేదనే అనుకోవాలి. అంత పెద్ద గ్రంథాలయం వారిది. అద్దె యింటిలో ఆయన పుస్తకాలకు చోటు చాలకపోతే ఇంటాయన సహృదయంతో తమ ముందు గదిలో బీరువాలతో సహా చోటిచ్చినంత పెద్ద గ్రంథాలయం. శ్రీనివాస్ ఆయన సాంగత్యంలో షట్పదీ ప్రకరణాలలో కృషి చేశారు. నాగరాజారావు నీలకంఠయ్యతో కన్నడ సాహిత్యసమస్యలపై కేశాకేశిగా వివాదపడుతున్న రోజులవి. వారి వ్యాసాలను బట్టి శ్రీనివాస్ కన్నడం ఛందస్సులోనూ పరిశోధనలు చేశారు. మేరుప్రస్తారం ఉక్త నుంచి ఉత్కృతి వఱకు షడ్వింశతిచ్ఛందాలకే ప్రసిద్ధంగా ఉన్నా ఇరవై ఆఱుకు పైగానూ అక్షరచ్ఛందస్సులు అనేకం ఉన్నాయని గుర్తించారు. లాక్షణికులు ఇరవై ఏడు నుంచి నలభై అయిదు దాకా గుర్తించిన వాటిని పరిశీలించారు. త్రిభంగ్యాదులు, ఉద్ధురమాలలు, ఉపరివృత్తాలు, దండకాదులు ఉన్నాయి. ఆ కృషిని ఇంకా కొనసాగిస్తే ఎలాఉంటుంది?

గాయత్రీ వృత్తము

ఆ ఆలోచనే శ్రీనివాస్‌కి తెలుగు ఛందశ్శాస్త్రవిజ్ఞాతృమండలిలో అజరామరమైన స్థానాన్ని కల్పించింది. ‘గాయత్రీ వృత్తము’ అనే అపూర్వమైన ప్రయోగాన్ని చేశారు. షడ్వింశతిచ్ఛందాలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ప్రతీకగా 26 గణాలను తీసుకొన్నారు. ఈ ప్రక్రియను ఇంకా విస్తరించటానికి అవకాశం ఉన్నదని, అందుకు గురుస్థానం తమదేనని సూచించటానికి ఒక ‘గురువు’ను ఆ పైని నిలిపారు. మొత్తం 26 X 3 = 78 + 1 = 79 అక్షరాలతో భారతీయ పద్యసాహిత్యచరిత్రలో అపూర్వమైన గాయత్రీ వృత్తమును 1979లో రచించారు. 1979లో రచించినందువల్ల 79 అక్షరాలు కూర్చారనుకొంటాను. వాటిని ఆయన పరిభాషలో చెప్పాలంటే — ముందుగా నాలుగేసి గణాలతో పదహారు అక్షరాల చొప్పున ఆఱు గణపతాకలను కూర్చుకొన్నారు. అవి ఇరవైనాలుగు గణాలు అయ్యాయి. అక్కడికి డెబ్భైరెండు అక్షరాలు వచ్చాయి. ఆ పైని రెండు లఘువులను, ఒక గురువును, మూడు లఘువులను, ఒక గురువును నిలిపారు. అవి ఏడు అక్షరాలు. మొత్తానికి డెబ్భైతొమ్మిది అక్షరాలు.

ఆయన పేర్కొన్న గణాల క్రమప్రథ ఇది:

తస యమ; యజ యమ; యజ తమ; తస యమ; యజ యమ; తర యమ; II U III U

ఈ గురు లఘువుల అనుక్రమణి ఒక పాదానికి మాత్రం చూస్తే ఈ విధంగా ఉంటుంది:

UUI (త) IIU (స) IUU (య) UUU (మ);

IUU (య) IUI (జ) IUU (య) UUU (మ);

IUU (య) IUI (జ) UUI (త) UUU (మ);

UUI (త) IIU (స) IUU (య) UUU (మ);

IUU (య) IUI (జ) IUU (య) UUU (మ);

UUI (త) UIU (ర) IUU (య) UUU (మ);

II;

U;

III;

U.

ఇది గణక్రమం. తస యమ; యజ యమ అన్న క్రమం రెండు పర్యాయాలు రావటం వల్ల పద్యపాదం శ్రుతిసుభగంగా ఉన్న మాట నిజమే కాని పాదం చివఱను స – న – గ అని గణాలను వ్యపదేశించక, లేదా లల – గ – లలల – గ అని పేర్కొనక II U III U అని గురులఘుసంకేతాలను నిర్దేశించటం వల్ల శ్రీనివాస్ ఏమి వైచిత్రిని సాధింపదలిచారో తెలియదు. ‘నా చిత్ర రచనలు నావి గాన’ అనుకొన్నారేమో! లాక్షణిక పద్ధతి అనుసారం గణక్రమాన్ని ఈ విధాన ఉదాహరించాలి:

తస యమ; యజ యమ; యజ తమ; తస యమ; యజ యమ; తర యమ; సన గ.

నిజానికి వీటిలో త – స – య – మ గణాలది ‘అంభోజాలి’ అన్న సమవృత్తమని దుఃఖభంజనుడు తన వాగ్వల్లభంలో పేర్కొన్నాడు. దీనికి విశాలాంభోజాలి అని కూడా పేరున్నది. ఈ విధంగా ప్రస్తరిస్తే ఈ గాయత్రీ వృత్తము వివిధ లఘుచ్ఛందాల సమాహారవృత్త మవుతుంది. పరిశోధకులకు ఈ వ్యాసంగం ఒక క్రీడాక్షేత్రం. పద్యపాదాలలోని యతి స్థానాన్ని కూడా శ్రీనివాస్ నిర్దేశించారు. 79 అక్షరాల పాదంలో 1 – 13 – 25 – 37 – 49 – 61 యతి స్థానాలు. మొదటి అక్షరం కాక ఐదు యతులన్నమాట. వృత్తం కాబట్టి ప్రాస నియతం. దీనిని తమ తల్లిదండ్రులకు అంకితం చేస్తూ ‘జననీ జనక గాయత్రీ వృత్తము’ అని సంజ్ఞానించారు. తమ శ్రీమత్తకు, నేతృత్వ ధాతృత్వాలకు, క్షేమైశ్వర్యాలకు కారయిత్రి కాబట్టి తల్లిదండ్రుల రూపుగొన్న గాయత్రీ దేవిని సన్నుతించారు. ‘అపూర్వ ప్రాశస్త్యోద్ధృతి’ మూలాన ఈ వృత్తం ప్రసిద్ధికి నోచుకొనగలదని ఆకాంక్షించారు. పరిమాణంలో చిన్నదే అయినా, కరపత్ర గ్రంథరూపంలో శ్రీనివాస్ వెలువరించిన తొలి పుస్తకం ఇదే. 1979లో అచ్చయింది.

గాయత్రీ వృత్తము కరపత్రం లోని పద్యం ఇది:

మొదటి పాదం:

[శ్రీ]మంతుఁడను నేను శ్రీ గాయత్రీ స[త్కృ]పన్, దేవి పేర వినూత్నచ్ఛందంబుల్ [సృ]జింపంగ, నేఁడు నాచేత నౌటన్, నే[తృ]త్వం బొసంగి, దేవి, నాకీ రీతిన్ ధా[తృ]శక్తిన్ వరంబుగ నిచ్చెన్ శ్రీ గాయ[త్రీ] భవ్య భావ్య దివ్య మాహాత్మ్యంబున్, వర్ణన సేయఁదరమే?

రెండవ పాదం:

[క్షే]మార్థ బహుమానితైశ్వర్యంబుల్ పు[ష్టి]మీఱంగఁ బొంది, సదా దాసుల్ సంతు[ష్టిఁ] జేతమ్ము పొంగ, వేనోళ్ళఁ బాడంగా, [శ్రే]యస్కర కృపార్ద్రదృష్టిన్ సంరక్షిం[చి], విశ్వంబు నేలు నహోరాత్రంబుల్, పో[షిం]పంగ, జీవరాసులన్ దానై సన్నద్ధ యగున్ వరదయై,

మూడవ పాదం:

[భూ]మిన్ నిజదయా సుధావృష్టిన్ వేఁ ద[న్పు]చున్; గాన నా జననీ ధ్యానంబున్ స[ల్పు]చున్ బాదపద్మయుగ్మంబు భావాలన్ [బూ]జింపుచును భక్తి నర్పింతున్ గ్రంథం[బు], నా తల్లి శేషగిరమ్మన్ సాధ్విన్ స[త్పు]ణ్యార్థసంయుతున్ ఫణీంద్రస్వామిన్, నా జనకున్ దలఁచుచున్,

నాలుగవ పాదం:

[ధీ]మజ్జనఘన ప్రశంసార్హాలై, సి[ద్ధి]నందంగఁజాలు నపూర్వ ప్రాశస్త్యో[ద్ధృ]తిన్ సర్వభాగ్యముల్ గొన్న శ్రీ గాయ[త్రీ] వృత్తములు నా యశస్సామ్రాజ్యంబున్ [స్థి]రప్రాభవంబునఁ బాలింపంగా, వృ[ద్ధి]న్ జెందుచుండి, వారి యాశీర్వాదంబుల్ గొనుచున్ మెఱయఁగన్.


ఈ విధంగా అక్షరచ్ఛందస్సుల పరిధిని విస్తరించినంత మాత్రాన సరిపోదు. అది కేవలం వైనోదికప్రక్రియామాత్రవిశేషంగా పర్యవసిస్తుంది. పైగా గాయత్రీ వృత్తములో చెప్పుకోదగిన ‘గతి’ అంటూ ఏమీ లేదు. అందువల్ల శ్రీనివాస్ ఈ పరిధిని మఱింతగా విస్తరించి, 1979లోనే “సహనశక్తియును, కల్పనాప్రాభవంబును, భావాధిక్యతయు” కలిగిన అత్యంతాపూర్వమైన “శ్రీనివాస వృత్తము”ను ప్రకల్పించారు. వెనుక కరపత్రంగా ముద్రించిన గాయత్రీ వృత్తముతో కలిపి దీనిని శ్రీనివాస శ్రీ గాయత్రీ వృత్తములు అన్న పేరిట ఒక లఘుపుస్తకంగా ముద్రించారు. తెలుగు ఛందోరీతులలో ఇది ఒక అపూర్వమైన ప్రకరణం. అందుకు నైపథ్యానుసంజనగా కొన్ని నవీనవృత్తాలను కల్పించారు. ఆ కల్పన కొక్కొండ వేంకటరత్నం విరచిత బిల్వేశ్వరీయమును చూడటం వల్ల తీగసాగింది. ఆయన కల్పించిన ఆ నవీన వృత్తాలివి:

  • ర – స – మ – య – స – మ – య
  • జ – ల – జ –న – య – న
  • ర – మా – త – న – య
  • న – త – జ – నా – వ – న
  • న – గ – రా – జ – త – న – యా
  • సా – గ – ర – త – న – యా

ఈ వృత్తాల పేర్లన్నీ అందులోని గణాలే కావటం విశేషం. దీర్ఘం వచ్చిన చోట అది రెండు గణాలని గుర్తుంచుకోవాలి. రమాతనయ అంటే ర – మ – మ – త – న – య గణాలన్నమాట. ఈ క్రమప్రథతో శ్రీనివాస్-

ర – స – మ – య – రా – మ – నా – మ – భ – జ – న – ర – త – జ – న – తా – మా – న – స

అన్న గణాలతో 23 X 3 = 69 అక్షరాల ఒక సమవృత్తాన్ని చిత్రంగా ప్రకల్పించారు. ఆ పద్యానికి ‘రసమయరామనామ భజనరత జనతామానస’ అని పేరు పెట్టారు. ఈ చిత్రం ఇంతకు మునుపు లాక్షణికులు చేసినదే అయినా, ఒక పద్యానికి ఇంత పెద్ద పేరును పెట్టడం కూడా విశేషమే. ఇంత సుదీర్ఘమైన వృత్తం ఎన్నో ఛందస్సులో ఎన్నో వృత్తం అన్న విచికిత్స విద్యార్థులకైనా నిర్నిమిత్తమే అవుతుంది. ఇక పంచతాళ వృత్తాలలోనూ, శ్రీకళా స్తంభ కల్పన విషయంగానూ శ్రీనివాస్ చేసిన పరిశోధన సారాన్ని అన్యలాక్షణికుల నిర్వచనాలతో సరిపోల్చి తులనాత్మకంగా వేఱొక వ్యాసంలో వివరించటం బాగుంటుందనిపించి ఇక్కడ ఆ వివరణను కూర్చటం లేదు. ఈ కృషి సమస్తం శ్రీనివాస్ సరిక్రొత్తగా పింగళుడు, కేదారభట్టు మొదలైన ప్రాచీనుల పంక్తిపావనధోరణిలో ‘శ్రీనివాస వృత్తము’ అనే వృత్తసృష్టిని చేశారు.

శ్రీనివాస వృత్తము

శ్రీనివాస వృత్తములో పాదానికి 116 అక్షరాలుంటాయి. వాటి గణాల క్రమప్రథ ఇది:

UUU (మ) – IIU (స) – IUI (జ) – IIU (స) – UUI (త) – UUI (త) – UUU (మ) – UUI (త) – III (న) – IUU (య) – IUU (య) – IUU (య) – IIU (స) – UII (భ) – UIU (ర) – III (న) – UUU (మ) – IUU (య) – IUU (య) – IIU (స) – IUI (జ) – IIU (స) – IIU (స) – IIU (స) – IUI (జ) – UII (భ) – IIU (స) – IUI (జ) – IIU (స) – IIU (స) – IIU (స) – IUI (జ) – UIU (ర) – UUU (మ) – UII (భ) – III (న) – UUI (త) – UUI (త) – U (గ) – U (గ)

ఇవి 38 గణాలపై రెండు గురువులు అన్నమాట. మొత్తం [ 38 X 3]+2 = 114 + 2 = 116 అక్షరాలు. పద్యోదాహరణం ఇది:

మొదటి పాదం:

[శ్రీ] సప్తాచలవాస! శ్రీశ! వరదా! [శ్రీ] శ్రీనివాసా! స్ఫుర[చ్ఛ్రీ]వక్షా! వేంకటరమణ! సం[సే]వితాంఘ్రీ! మురారీ! [స్మి]తవక్త్రా! జితకోటిమన్మథ! హరీ! [శ్రే]యస్కరా! శ్రీధరా! [జీ]వనభాగ్యదాత! సర[సీ]రుహలోచన! లోకపావనా! [శ్రి]తజనపోష! నిర్గుణ! వ[శీ]కృతభక్తజనౌఘమానసా! [చి]దానందాత్మా! సర్వసుఖశుభదా! [శే]షపర్యంకశాయీ!

తక్కిన నాలుగు పాదాలూ ఈ విధంగానే ఉంటాయి. 1 – 13 – 20 – 30 – 37 – 50 – 57 – 66 – 77 – 87 – 98 స్థానాలలో యతి నిలుపబడింది. వృత్తం కనుక ప్రాస నియతి ఉన్నది.

అంతే కాదు. జాగ్రత్తగా గమనించి చూస్తే, ఈ శ్రీనివాస వృత్తం — 1) శార్దూల విక్రీడితం 2) మందాక్రాంత 3) మత్తేభ విక్రీడితం 4) ఉత్పలమాల 5) చంపకమాల 6) మేఘవిస్ఫూర్జితం, అన్న వృత్తాల సంయోగ సుయోగమని శ్ర్రీనివాస్ పేర్కొన్నారు. నేను ముందే చెప్పినట్లు ఇందులోని సాంకేతిక కళా స్తంభాలను గుఱించి వేఱొక వ్యాసంలో వివరంగా వ్రాస్తాను.

(ఈ శ్రీనివాస శ్రీ గాయత్రీ వృత్తములు 1979లో ఒకే సంపుటిగా వెలువడ్డాయి. ఇదే వారి తొలి పుస్తకం. మద్రాసులో శ్రీ ధనికొండ హనుమంతరావు క్రాంతి ప్రెస్‌లో ఇది అచ్చయినప్పుడు విజయవాడ ఆలిండియా రేడియోలో పనిచేస్తూ సెలవులో ఉన్న నన్ను శ్రీనివాస్ ప్రూఫులు సరిచూసిపెట్టమని అడిగారు. అది నిమిత్తంగా వారి ఛందఃపరిశోధనల గుఱించిన వివరాలు నాకు తెలిసివచ్చాయి.)


దర్శకుడు శ్రీధర్, పిబిఎస్

ఈ సాహిత్యకృషి విజయాస్పదంగా కొనసాగుతున్న తరుణంలోనే శ్రీనివాస్ చలనచిత్ర రంగంలో కూడా ఉత్తమ గాయనులుగా ఉన్నతశిఖరాలను అధిరోహిస్తున్నారు. తమిళ కన్నడ మలయాళ దేశాలలో లభించినంతగా వారికి తెలుగులో అవకాశాలు దక్కక పోవటానికి కారణాలు అందరికీ తెలిసినవే కనుక వాటి ప్రస్తావన ఇక్కడ నిర్నిమిత్తం అవుతుంది. 1951లో మిస్టర్ సంపత్ సినిమాతో ప్రారంభమయిన ప్రస్థానాన్ని గుఱించి ఈ సంచికలో విష్ణుభొట్ల లక్ష్మన్న, జెజ్జాల కృష్ణ మోహనరావు, పరుచూరి శ్రీనివాస్ సవ్యాఖ్యానంగా, సోదాహరణంగా చెప్పినదాని కంటె వివర్తించి నేను చెప్పగలిగినదేమీ ఉండదు. వారి గజల్ గీతరచనలోని ఛందఃప్రయోగ విశేషాలను గుఱించి, గానఫణితిని గుఱించి పరిశోధనలు అవసరం. ఆర్. నాగేంద్రరావు ‘జాతకఫలం’, మలయాళంలో ‘హరిశ్చంద్ర’, కన్నడంలో రాజ్ కుమార్‌కి పాడిన పాటలు, ‘ప్రేమపాశం’లో సుశీలతో, తమిళంలో జెమినీ గణేశన్, ఎం.జి. రామచంద్రన్, శివాజీ గణేశన్లకు పాడిన పాటలు, ‘పావ మన్నిప్పు’, ‘అడుత్త వీట్టు పెణ్’ పాటలు; సుశీల, జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, భానుమతి, జమునారాణిలతో పాడిన మధురగీతాలు, తెలుగువారికి ప్రియమైన పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి ఉన్నాయి. ఇవి గాక శారదా భుజంగ స్తోత్రం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, ముకుంద మాల, శ్రీ మల్లికార్జున స్తోత్రం, శ్రీ పురందరదాస కీర్తనలు, వంటి వాటిని గుఱించి నాకన్నా సమర్థులు వివరించగలరు. మదనకామరాజు కథలో ‘నీలి మేఘమాలవో’, భీష్మలో ‘మనసులోని కోరిక’, కానిస్టేబుల్ కూతురులో ‘చిగురాకుల ఊయలలో’, మంచిమనిషిలో ‘ఓహో గులాబీ బాలా’ వంటి గీతాలు అజరామరమైనవాటిని గుఱించి చెప్పవలసినది ఎంతైనా ఉంటుంది.

సంగీతోత్తుంగశృంగాలను అధిరోహిస్తున్న సంతోషమయ తరుణం లోనే శ్రీనివాస్ రచనాప్రతిభ దేశాంతరాలకు ప్రాకసాగింది. 1968లో అపోలో అంతరిక్ష నౌకాంతరం నుంచి ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రమండలంపై అడుగుపెట్టినప్పుడు శ్రీనివాస్ Man to Moon, Moon to God అనే కవితను మూవీలాండ్ పత్రికలో ప్రకటించారు. తమిళ చిత్రనిర్మాత వి. రాధాకృష్ణన్ దానిని గ్రామఫోను రికార్డుగా ముద్రించి, లూయీ ఆర్మ్‌స్ట్రాంగ్, అమెరికా అధ్యక్షులు నిక్సన్‌కు పంపించారు. వారి నుంచి ప్రశంసాత్మక లేఖలను అందుకొన్నారు.


ముఖ్యమంత్రి జయలలితతో

తమిళంలో జెమినీ గణేశన్, ఎం.జి. రామచంద్రన్, శివాజీ గణేశన్, తెలుగులో తాడేపల్లి లక్ష్మీ (టి.యల్) కాంతారావు, కన్నడంలో రాజ్ కుమార్ తదితరుల నటనాజీవితానికి వారి కంఠమాధురి ప్రాణం పోసింది. తనకాలం నాటి ప్రసిద్ధ గాయనీగాయనులు అందరితోనూ కలిసి పాడారు. వారిలో గీతా దత్, లతా మంగేష్కర్, పి. సుశీల, ఎస్. జానకి వంటి వారున్నారు. తనకాలం నాటి సంగీతదర్శకుల మెప్పు పొందారు. అసంఖ్యాకంగా అభిమానులను పొందగలిగారు. ఆంధ్రేతరప్రాంతాలలో లెక్కలేనన్ని గౌరవాలు వచ్చి వరించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్రప్రభుత్వ ఇయల్ ఇసై నాడగ మన్డ్రమ్ అధ్యక్షులుగా నియమితులై రెండు వందల మందికి పైగా కళాకారులకు సత్కారకార్యక్రమాలను నిర్వహించి అజాతశత్రువుగా మన్నన లందుకొన్నారు.

ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాదమణి బిరుదాలను స్వీకరించారు. స్వార్థం కోసం ఎంతకైనా దిగజారటానికి సిద్ధపడని నిర్మమునికి, స్వలాభం కోసం తలవంచే స్వభావం లేని స్వాభిమానికి, “మీఁదై నా కరంబుంట మేల్గాదే” అని నమ్మిన సర్వతంత్రస్వతంత్రునికి తెలుగుదేశంలో పురస్కారాలు ఎంతో అరుదుగా కాని దక్కలేదంటే ఆశ్చర్యమేమీ ఉండదు. ఈ పురస్కారపరంపరను అందుకొంటున్న తరుణంలో ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు.

తన కీర్తిప్రతిష్ఠలు ఇలా దిశావ్యాప్తం అవుతున్న తరుణంలోనే సంగీతశాస్త్ర ప్రవర్తకుడైన నారద మహర్షిని, ఆ మహర్షి భక్తాగ్రేసరుడైన వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని సన్నుతిస్తూ ఆయన ‘నవనీత సుమసుధ’ అనే అష్టరాగమాలికను నవీనంగా రూపొందించారు. (న)వరస కానడ, (వ)సంత, (నీ)తిమతి, (త)పస్విని, (సు)వర్ణాంగి, (మ)లయమారుతం, (సు)నాదవినోదిని, (ధ)న్యాసి అనే ఎనిమిది ప్రకృతి రాగాల సరస సమేళనం అది. ఆ రాగాల ఆద్యక్షరాల సమావేశమే నవనీతసుమసుధ అయింది.


డైమండ్ కీ

ఇదే కాలంలో శ్రీనివాస్ సంగీత మేళకర్త రాగాల స్వరలక్షణాన్ని, రాగస్వరూపాన్ని గుర్తుంచుకోవటానికి ‘వైర ఇసై’ అనబడే ఒక ‘డైమండ్ కీ’ సూత్రాన్ని రూపొందించారు. ఇది వారి రాగస్వరూపాభిజ్ఞతకు, గణితశాస్త్రకోవిదత్వానికి, స్వరగ్రామసంగ్రహాన్ని విద్యార్థులకు నేర్పి వారి విద్యార్థిత్వానికి ప్రాతిపదికను కూర్చాలని చేసిన ప్రయత్నం. ఇప్పటికే పెద్దదవుతున్న ఈ ప్రస్తావికలో దీని విపుల వివరణను ఇవ్వటంలేదు. శ్రీనివాస్ దీనిని ప్రకటించిన వెంటనే భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, పద్మవిభూషణ్ డి.కె. పట్టమ్మాళ్, మెల్లిసై మణ్ణన్ విశ్వనాథన్, సంగీత విద్వాన్ జి.యస్. మణి వంటి మహావిద్వాంసులు శ్రీనివాస్‌ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఆ సమయంలో ఆయనకి అభిమానుల నుంచి ఉత్తరాల వర్షం కురిసిందంటే అతిశయోక్తి కాదు. ఆనాటి ఒక ‘తలపు మెఱపు’ ఛందోరంగానికి విస్తరించి తన గాయత్రీ వృత్త నిర్మాణానికి, శ్రీనివాస వృత్త కల్పనకు కారకం అయిందని ఆయన అన్నారు.


డైమండ్ కీ

ఒక విధంగా శ్రీనివాస గాయత్రీ వృత్తములు శ్రీనివాస్ అఖండమైన కల్పనాశక్తికి, అపూర్వమైన పద్యనిర్మాణచాతురికి, ఛందోవైభవానికి నిజమైన తార్కాణం. ఆయన సారస్వతసర్వస్వంలో పాఠకులు, పరిశోధకులు చిరకాలం తలచుకొనే గ్రంథం అదేనని నా నిశ్చితాభిప్రాయం. సంస్కృతంలో భోజుడు సరస్వతీ కంఠాభరణంలో చెప్పిన ‘కల్పిత కల్పలతా బంధం’ ఒక్కటే కొంత దీనికి సాటికి, పోటీకి రాగలుగుతుంది. అప్పకవి ఒక్క ఉత్పలమాలలో నుంచి అంతర్లీనంగా ప్రస్తారక్రమాన కల్పింపగల శ్రీ – వాణి – పద్మ – అంబ – రతి – దరధ్వని తాళము మొదలైన పద్యాలతో శ్రీవాణీపద్మాంబా రతిదర ధ్వనితాళము అనే గర్భచిత్రాన్ని రూపొందించి, అప్పకవీయంలో దానిని నివేశింపజేశాడు. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో 808వ పద్యంగా ఒక అపూర్వమైన గర్భబంధచిత్రాన్ని ప్రకల్పించాడు. నాదెండ్ల పురుషోత్తమకవి తమ అద్భుతోత్తర రామాయణములో ఎన్ని వేల విధాలుగా అయినా చదవటానికి వీలుండే ఒక సీసపద్యాన్ని వ్రాసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే అవన్నీ ఒక ప్రసిద్ధమైన పద్యంలో ఎన్నో మఱికొన్ని ప్రసిద్ధమైన పద్యాలను గర్భితంగా కూర్చే చిత్రరచనలు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ అటువంటివి పదులకొద్దీ కావ్యాలున్నాయి. కానీ శ్రీనివాస్ రచన అటువంటిది కాదు. ఒక గాయత్రీ వృత్తంలో నుంచి, ఒక శ్రీనివాస వృత్తంలో నుంచి పాఠకుడు శ్రీ కళా స్తంభ సూత్రాన్ని అనుసరించి (దీనిని మఱొక వ్యాసంలో వివరిస్తానని ఇందాక అన్నాను) తెలుగు వృత్తము, ఉమర్ ఖయామ్ వృత్తము మొదలైన కొత్త వృత్తాలను తన ఇష్టానుసారం సృష్టించుకోవటానికి వీలుంటుంది. ఆ వృత్తాలకు పాఠకుడు పెట్టుకోవలసిన పేర్ల సూత్రం గుర్తుంటే వందలకొద్దీ పద్యాలను గర్భితంగా నిర్మింపవచ్చునన్న మాట. ఆ విధంగా ఇది చిత్రకావ్యవాఙ్మయానికి ఒక అపూర్వమైన అలంకారం.

“గాయత్రీ వృత్తము నవ్యము, భవ్యము, స్తవ్యము. ఇది యరసి చూడగా, బహుశః ఆనాటి వేంకటరత్నము ఈనాటి శ్రీనివాస్‌గా నవతరించెనేమో యని నా యనుమానము” అని పీఠికను వ్రాసిన శ్రీ రావూరి దొరసామిశర్మ అన్నారు.

దశగీత గీతసందేశం

శ్రీనివాస గాయత్రీ వృత్త రచనానంతరం శ్రీనివాస్ రచించిన మఱొక చిత్రకావ్యం ఇది. పేరుకు దశగీతమే కాని, నిజానికి ఇందులో మొత్తం పదకొండు గీతపద్యాలున్నాయి. గ్రంథ ముద్రణ సంవత్సరం లేదు కాని, వెనుక అట్టమీద 1978లో అచ్చయిన ‘లవ్లీ లవ్ సాంగ్స్’ ఆంగ్ల గీతాల సంపుటి ముద్రణ విషయం ఉన్నది. ఇది వీరి తృతీయ ప్రకటన అని ఉన్నది. 1980లో లవ్లీ లవ్ సాంగ్స్ ద్వితీయ ముద్రణ వెలువడింది. కనుక 1979 ఏప్రిల్ నెలలో శ్రీనివాస గాయత్రీ వృత్తములు ప్రకటించిన వెంటనే దీని ప్రకాశన జరిగినదని ఊహించాలి. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి దాశరథి, విద్వాన్ రావూరి దొరసామిశర్మ, ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఎం.ఎస్. రెడ్డి అభిప్రాయాలను వ్రాశారు. శ్రీనివాస్ ధర్మపత్ని “ఆత్మసఖి యైన నాదానికి” శ్రీమతి జానకికి ఇది అంకితం.

దశగీత గీతసందేశం ఒక ‘అంతర్లాపి’ వర్ణచిత్రకావ్యం. ఒక పద్యంలో గర్భితంగా కొన్ని అక్షరాలుంటాయి. ఆ అక్షరాలను కలుపుకొని చదివితే ఒక లఘువాక్యం అవుతుంది. అంటే, ఒక వాక్యాన్ని కవి ముందుగా కూర్చుకొని, దాని చుట్టూ పద్యపాదాలను అల్లుతాడన్నమాట. ఇది చక్రబంధం, నాగబంధం, రథబంధం మొదలైన బంధచిత్రాలలోనూ ఉన్నదే. చ్యుతక చిత్రాలలోనూ ఇటువంటి ఇటువంటి ధోరణి ఉన్నది. సంస్కృతంలో మేఘవిజయ గణి దిగ్విజయ మహాకావ్యంలోనూ, లోలింబరాజు వైద్యక రాజీయం లోనూ; తెలుగులో వావిలికొలను సుబ్బారావు కౌసల్యా పరిణయం లోనూ, అల్లమరాజు రంగశాయి కవి చంపూ భారతము లోనూ ఇటువంటి ‘అంతర్లాపి’ చిత్రరచన లున్నాయి. పద్యాలతో పాటు శ్రీనివాస్ ఇందులో గేయాలను కూడా వ్రాశారు. కావ్యం నుంచి పద్యాన్ని గాక ఒక గేయాన్ని మాత్రం చూపుతాను:

నియ[మా]లన్నీ పాటించాలి!
సమ[తా]గానము సాగించాలి!
భేద[పి]శాచము విజృంభించితే!
కుల[త]త్త్వాలకు శిరసువంచితే!
చన[రు] జను లైకమత్యపు దారిని!
కాకు[లు] నవ్వును చూసి వారిని!
మన[దే]శానికి సంఘటన బలము!
మాన[వ] ప్రగతి మన ఆదర్శము!
బాధ్య[త] అంతా సదా ప్రజలదే!
కొల్ల[లు]గ పండు పంట జనులదే!

ఇది గేయం. ఇందులో కవితాసౌందర్యానికంటే చిత్రకల్పనకే ప్రాధాన్యం ఉన్నా, తక్కిన చిత్రకవుల వలెనే శ్రీనివాస్ భావసౌందర్యానికి, వ్యర్థపదాడంబరం లేని సుందర భావచిత్రనిర్మితికి ప్రాధాన్యం ఇచ్చారు. దశగీత గీతసందేశం లోని పది గీతాలలో ఈ విధంగా శ్రీనివాస్ పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా ఆరాధించాలో పది సందేశవాక్యాలను అందించారు. కావ్యారంభంలో, తిరుమలేశ! శ్రీనివాస! నమో వేంకటేశ్వరా! అన్న గర్భాక్షర భక్తినివేదన ఉన్నది. కావ్యంలోని దశగీతాలలో

1) జననీజనకుల దీవన
2) మనిషికదే ఘనసాధన
3) మాతాపితరులు దేవతలు
4) ధాత రీతిగా జన్మదాతలు
5) వారల ప్రేమ సుధాజలధి
6) వారి సేవ నవరత్ననిధి
7) వారి పలుకులే వేదములు
8) భక్తిపాత్రములు పాదములు
9) వారి దయ కల్పభూరుహము
10) వారి పూజ వరదాయకము

అన్న గీతసందేశాలు ఉన్నాయి. ఇందాకటి ఉదాహరణలో వలెనే ఒక్కొక్క గీతమాలికలోనూ మధ్యాక్షరాలను వరుసగా కూర్చుకొంటే ఈ పై వాక్యాలు వస్తాయన్నమాట. చిత్రకావ్యాన్ని సమంజస భావగర్భితంగా, ఉత్తమ సందేశాత్మకంగా రూపొందించాలన్న ప్రయత్నం నిజంగా మెచ్చదగినది.

గొప్ప కళాకారులకు, విజ్ఞానవేత్తలకు, మహనీయులకు ఒక కళలో శిఖరాగ్రానికి ప్రయాణించి పరమావధిని చేరుకొన్నాక, ఆ కళలో ఆ శాస్త్రంలో పొందగలిగిన విజయాలేవీ లేవన్నంతగా విజయాన్ని సాధించిన తర్వాత తమకు సంబంధం అంతగా లేని వేఱొక రంగంలో గుర్తింపును పొందాలనే తహతహపాటొకటి ఉంటుంది. ఆ రెండవ రంగంలో వారి ప్రయత్నాలను చూసి జనం నవ్వుకోవటం కూడా ఉంటుంది. ఒక గొప్ప చిత్రకారుడు ఒక గొప్ప కవిని కూడా అని అనిపించుకోవాలని ప్రయత్నించటం, ఒక సంగీతవేత్త మఱొక శాస్త్రవేత్తగా రాణింపును కోరటం మనము చూస్తూ ఉన్నదే. అయితే, శ్రీనివాస్ విషయంలో అది అపవాదని చెప్పవచ్చు. ఆయన పెద్దగా కోరికలేమీ కోరుకోలేదు. తనకు అభిమానపాత్రమైన సంగీతాన్ని అభిమానంతో అభ్యసించి, పొందగలిగిన విజయాలన్నీ పొందారు. తెలుగుదేశంలో కవిగానూ, గాయనుని గానూ గౌరవాదరాలను పొందారు. తన అభివ్యక్తిని మెఱుగుపఱచుకొనే ప్రయత్నమే తప్ప ఆయన ఈ కవితాకళ మూలాన భేరీభాంకారాలను ఆశింపలేదు. ఆయన వ్యక్తిత్వంతో పరిచయం ఉన్నవారందరికీ తెలిసిన సంగతే ఇది.

నిరంతరాయితమైన వ్యాసంగంతో రచన సాగించటమే ఆయన చేసిన పని. దాని లాభాలాభాల దృష్టి ఉండేది కాదు. ఐకాంతికమైన అభ్యాసం కావటం వల్ల ఆయన రచనలో సమకాలిక కావ్యవిమర్శ రీతులకు అనురూపంగా సృజనశీలితను తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నం కనుపించదు. తన కృతులను అధికరించి పఠితల అభిప్రాయం ఏ విధంగా ఉంటున్నదీ ఆయన పట్టించుకోలేదు. ఈ లక్షణాలన్నీ ఆయన మలి రచనలైన ‘గాయకుడి గేయాలు’ అన్న నూటపదహారు గేయాల సంపుటిలోనూ, Lovely Love Songs, White Shadows అన్న ఆంగ్లగీతికా సంపుటాలలోనూ మనకు కనుపిస్తాయి. ఇవన్నీ ఆయన వైయక్తిక భావసంపుటులు. ఆత్మీయాభివ్యక్తులు. చిత్రకవిత్వ కోవిదత్వం వల్ల ఆయనకు సిద్ధించిన పంక్తిపావనతకు ఇవి ఛాయారేఖలు మాత్రమే అని నా అభిప్రాయం. సుకవిత్వానుభవికులకు వీటిలో చర్వితచర్వణగా చిత్తవిచ్ఛిత్తిని కల్పింపగల ఉదాహరణీయ స్మరణీయపంక్తులు; భావికతకు, భావుకతకు నిదర్శనలు కనిపించవచ్చును.

‘గాయకుడి గేయాలు’లో తన గురుతుల్యులు శ్రీ సాలూరు రాజేశ్వరరావుని సన్నుతిస్తున్న ఒక గేయం కోహినూరు. చాలా మందికి పుస్తకం అందుబాటులో ఉండకపోవచ్చునని ఉదాహరిస్తున్నాను:

నిగనిగల కోహినూరు
నీ ముందు బలాదూరు!
నీ మేను పైడి తేరు
నీ వయసే పరువాలూరు!
బుగ్గ చిదిమితే పాలూరు!
పూపెదవులలో తేనూరు!
కన్నుల వెన్నెల వెలుగూరు! కను
సన్నల వన్నెల సొగసూరు!
నవ్వు రసాల రసాలూరు!
నడకల హంసల లయలూరు!
కంఠం మధుర రవాలూరు!
కదిలే కేశా లిరులూరు!
ఒడలి విఱుపులో మరులూరు!
ఊహలు మదిలో మెఱుపూరు!
తనువు నిలువునా వలపూరు! – నా
మనసు సదా నీ తలపూరు!

వ్యాసరచనలోనూ శ్రీనివాస్ అందెవేసిన చేయి. ఆ వ్యాసాలు వందలకొద్దీ ఉంటాయి. విలేఖరిగా విజయచిత్ర వంటి పత్రికలకు వ్రాసినవీ అనేకం. శ్రీ పోతుకూచి సాంబశివరావు తోడి బాల్యస్నేహం వల్ల వారి విశ్వరచన పత్రికలో సినిమా గొడవలు అనే హాస్యోక్తిమయమైన చక్కటి కాలమ్ నడిపారు. పెక్కుమంది కవులు, కళాకారుల సన్మాన సంచికలలో వారి వ్యాసాలున్నాయి. ‘భారతి’లో వ్రాసిన వ్యాసాల విలువ నిజంగా అనర్ఘమని చెప్పవచ్చును. వాటిలో మాండలిన్ శ్రీనివాస్ గుఱించిన వ్యాసాన్ని నా చిన్నప్పుడు ఎన్నిసార్లు చదువుకొన్నానో లెక్కలేదు. ‘రచన’లో సాలూరు రాజేశ్వరరావుని గుఱించి వచ్చిన వ్యాసం వెలకట్టలేనిది.


పి. బి. శ్రీనివాస్

వేషభాషలకు, భూషలకు ప్రధానమైన చలనచిత్ర రంగంలో నిలద్రొక్కుకొని రావలసి ఉండటం వల్ల ఆయన రూపరేఖలో ఆధునికత ఉట్టిపడుతుండేది. కొన్నాళ్ళు పూర్తి సూటు, ఆ తర్వాత సఫారీ సూటు, కరణ్ సింగ్‌లా అదే తానుతో కుట్టిన మంచి టోపీతో చూడ ముచ్చటగా ఉండేవారు. చేతిలో పుస్తకం, జేబులో లెక్కలేనన్ని పెన్నులు రంగురంగుల్లో కనబడుతుండేవి. చెఱగని చిఱునవ్వు ఆ రూపానికి నిండుతనాన్ని తేవటం అందరికీ తెలిసిన సంగతే. వయసు మీఱసాగినప్పుడు జరీ తలపాగాను పెట్టుకోవటం మొదలుపెట్టారు. కళ్ళలో వెనుకటి కళ మాఱి అంతర్ముఖులు అవుతున్నారనిపించేది. చివఱి రోజులలో కొంత అంటీ అంటనట్టు కనిపించేవారు. ఆ విశాలమైన నేత్రాలు ఎక్కడికో కాలానికి గుర్తులు తెలియని అతీతసీమలకు వెళ్ళిపోవటానికి సిద్ధమౌతున్నట్లుగా ఉండేవి. ఆంధ్రత్వానికి దూరం కావటం లేదు కదా, మనస్సులో – అని అనుకొనేవాణ్ణి కాని, వారెన్నడూ ఆంధ్రత్వానికి దూరం కాలేదు. ఆప్యాయనానికీ దూరం కాలేదు. ఎటువంటివారినైనా ఆప్యాయనంగా పలకరించి పులకరింపజేసేవారు. మా నాన్నగారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారికి, ఆయన మిత్రమండలికి సన్నిహితులు కావటం వల్ల నన్ను పుత్త్రనిర్విశేషంగా చూచేవారు. తనకన్నా పాతికేళ్ళ చిన్న వయసువాడికి వినిపిస్తున్నానన్న సంకోచం లేకుండా, ప్రేమతో తాను సరిక్రొత్తగా వ్రాసిన రచనను వినిపించేవారు. మద్రాసును విడిచిపెట్టిన తర్వాత ఆ పరిచయపు నిత్యానుషంగం లేకపోయింది.

నేను బి.ఎ. పూర్తయాక 1974 సెలవు రోజులలో ‘సంతాప సభ’ అని నాటకం ఒకటి వ్రాశాను. ఒక కవిగారు బ్రతికి ఉండగానే ఆయన కావ్యం చచ్చిపోతుంది. అన్ని చోట్లా వెతికి ప్రతులు మఱెక్కడా లేవని నిర్ధారించుకొన్నాక ఊళ్ళోని సాంస్కృతిక సంఘం వారు కవిగారిని ముఖ్య అతిథిగా పెట్టి ఆ కావ్యానికి సంతాప సభను నిర్వహిస్తారు. కావ్యాన్ని గుఱించి వక్తలందరూ మంచి మాటలు చెబుతారు. అంతా వ్యంగ్యధోరణిలోనే సాగుతుంది. నేనందులో పి.బి. శ్రీనివాస్ గారిని ఒక వక్తగా ప్రవేశపెట్టాను. అధ్యక్షులవారు “ఇప్పుడు బహుభాషా నేపథ్య గాయకులు, సుప్రసిద్ధకవి శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు ప్రసంగిస్తా”రని ప్రకటిస్తారు. మీరేమీ అనుకోరని నాటకం లోని ఆ భాగాన్ని ఉదాహరిస్తాను:

పి.బి. :- (వేదిక ఎక్కుతూ, చేతిలోని కాగితాలను సరిచూసుకొంటూ, మైకు దగ్గరికి వస్తారు) సభకు నమస్కారం! విషయం చెప్పి సభకు రమ్మంటే, ముందు కవిగారు పోయారనుకొని మాల్ఖోస్ లో రాశా. తీరా ఇక్కడికి వచ్చాక కవిగారు చల్లగా ఉన్నారు, కావ్యమే లేదు – అని తెలిసి సంతోషంగా రాగమాలికలోకి మార్చా. చదువుతాను వినండి:

(రాగమాలిక)

ఇది సీసపద్యం.

[చ]నినావె కావ్యమా! స్వర్గవాసానికి
     వ[చ్చి] నాల్గు సెకండ్లు బ్రదుకలేదు
ఇది[యే]మి ఘోరమో! ఈ రీతి అచ్చైన
     వెంటనే [లో]కాన్ని వీడినావు
నినుఁగోరి [కా]దొకో! నీ తండ్రి కవి యిట్లు
     పుట్టెడు దుఃఖా[న] మునిఁగిపోయె
ఉవిద! నీవెట [నుం]టివో! యెట్లు నీవు
     లభ్యపడఁగలవు నేఁ[టి] పాఠకులకు!

కనఁగ వచ్చునె నిను[వో]లు కావ్యరాజ
మాంధ్ర సాహిత్య చరిత నే [కా]లమందు!
పఠితృలోకమ్ము వీడుట భా[వ్య] మగునె?
లోకఋణమిట్లు తీఱెనా నీకు [మా]కు!

ఇందులోని మొదటి పాదంలో మొదటి అక్షరం, రెండో పాదంలో రెండో అక్షరం, మూడో పాదంలో మూడో అక్షరం – ఇలా అన్ని పాదాలలోని అక్షరాలను కలిపి చదివితే “చచ్చి యే లోకాన నుంటివో కావ్యమా!” అని వాక్యం వస్తుంది. ఇల్లాంటి చిత్రాన్ని ఇంతవఱకు ఏ భాషలోనూ ఎవరూ చెయ్యలేదు. ఆ తరవాతి పద్యం వినండి:

ఇంతింతై, మఱి యింతయై, మఱియు నీ వింతై, మఱీ వింతగా
నంతై, పాఠకనేత్రగోళముల గల్లంతై, సెకండ్ హ్యాండులో
సొంతంబై, సిగరెట్ బజార్లఁ బడి యస్వుల్వీడి చింతింపఁగా
సుంతైనం గనరాక యుంటివి గదా చోద్యంబుగా కావ్యమా!

(సభలో చప్పట్లు)

అయినా, నాలుగు కాలాలపాటు చల్లగా బ్రతికి ఉండాల్సిన కావ్యం అర్ధాయుష్కం ఎందుకయిందో? అని ఆలోచన వచ్చాక ఈ పద్యం రాశా.

తొలుత నచ్చైన దీనినే దుమ్ము దులిపి
మఱల ముద్రింప వలెనేమొ మన మటంచు
దివిజప్రెస్సుల గుండియల్ దిగ్గురనగ
అరుగుచున్నావె కావ్యమా! అమరపురికి.

అని వ్రాసి వినిపించాను. తన రచనను పేరడీ చేశానని నొచ్చుకొనకపోగా శ్రీనివాస్ పకపకపక నవ్వి, “నువ్వు నాటకం వేస్తే చెప్పు, నేను వచ్చి నా వేషం నేనే వేస్తా!” అని మాట యిచ్చారు. నాటక ప్రదర్శన జరగకపోయినా, వారిచ్చిన మాట మాత్రం ఒక మధురస్మృతిగా మిగిలిపోయింది నాకు!


పి.బి. శ్రీనివాస్ గారికి జయాశాస్త్రి కితాబు

శ్రీనివాస్ సతీమణి జానకి కున్నప్పాకం వింజమూరి వారింటి ఆడపడుచు. శ్రీనివాస్ ప్రత్యక్షరానికీ ప్రత్యక్షసాక్ష్యం ఆమె. “నా ఆత్మసఖియైన నాదానికి, నా ఆత్మ ఆరాధించే సప్తస్వరవేదానికి, నా ఆత్మస్వరూపమైన నిజానికి, నా ఆనంద కళారాధనకి” అని శ్రీనివాస్ ఆ మనస్వినికి తన దశగీత గీతసందేశము కావ్యాన్ని అంకితం చేశారు. ఆ దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కుమార్తె. నలుగురికీ తల్లిదండ్రుల సంగీతవారసత్వం అబ్బింది. కుమార్తె డా. నల్లాన్ చక్రవర్తుల లత శాస్త్రీయ సంగీత గాయని. అన్నమాచార్య కృతులలో ఆలయసంప్రదాయాన్ని అధికరించి అత్యుత్తమ పరిశోధన చేసి తెలుగులో పిహెచ్.డి. పట్టాన్ని పుచ్చుకొన్నారు. ఆమె అత్తమామలు ఇందిరా జగదాచారి, నల్లాన్ చక్రవర్తుల జగదాచారి గొప్ప విద్వద్దంపతులు. జగదాచారి సంస్కృతవిద్వన్మణి. ఇందిర చిలకమఱ్ఱి వారి ఇంటి ఆడపడుచు. ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని. డిల్లీ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగం ప్రొఫెసరుగా పనిచేసి రిటైరైనారు. ఢిల్లీలో వీరి శిష్యులు కాని సంగీతాభిమానులుండరు. వీరంతా విఖ్యాతులే. శ్రీనివాస్ చెల్లెలి వియ్యపురాలు చీమలకొండ జయాశాస్త్రి మంచి కవయిత్రి. శ్రీనివాస్ అశేషశేముషీవైభవాన్ని అభివర్ణిస్తున్న వారి రచన ఈ పక్కన చూడగలరు.

శ్రీనివాస్ గారి పార్యంతిక రచన Pranavam. అనేకవిధాల అది ఆయన అంతస్సారానికి, అంతర్ముఖీన కావ్యాలోకానికి అభివ్యంజకం. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఉరుదు, ఇంగ్లీషు భాషలలో వివిధప్రక్రియలలో ఆయన రచించిన రచనలను స్వహస్తలిఖితరూపకంగా అచ్చువేసిన ఉద్యత్నం. బహుభాషాకోవిదులైన తెలుగు కవుల పరిషత్తులో ఇది వారిని ముందు వరుసలో కూర్చొనబెడుతుంది. భాషాకోవిదత్వం అంటే ఎంతో కొంత లిపిపరిజ్ఞానం, పదసంపద తీరుతెన్నులు తెలిసి ఉండటం కాదు. సంస్కృతం రాకుండానే మంచి తెలుగు భాషాపరిజ్ఞానం వల్ల, సంస్కృతవిభక్తుల పరిచయం వల్ల సంస్కృతంలో శ్లోకాలను, స్తోత్రాలను ప్రకటిస్తున్న తెలుగు కవులు ఎందరో ఉన్నారు. ఆ కవితారచన వారి సంస్కృతభాషా పరిజ్ఞానానికి నిదర్శకం కాదు. సంస్కృతాన్ని చక్కగా అన్వయించుకొంటూ, శ్లోకాలకు అర్థం చెప్పగలిగిన శక్తి ఉండీ సంస్కృతం మాట్లాడలేనివాళ్ళు, వ్రాయలేనివాళ్ళు ఉన్నారు. అందువల్ల శ్రీనివాస్ గారు ఎనిమిది భాషలలో కవితారచనను చేయగలగటం విశేషంగానే భావించాలి. నాకు తెలిసి తెలుగువారిలో వేదం వెంకటాచలయ్యర్, మహానుభావులు వేదం వేంకటరాయశాస్త్రి తమ్ములు, పేరొకటి విన్నాను. వారు పద్దెనిమిది భాషలలో మహావిద్వాంసులట. ఆఱేళ్ళ క్రితం నెల్లూరులో వారి మనుమలు వేదం వెంకట్రామన్ ఇంటికి వెళ్ళినపుడు ఇప్పటికీ స్వస్థావస్థలో ఉన్న వారి గ్రంథాలనేకం చూశాను. నాకు తెలియని ఏవేవో లిపులలో ఉన్న ఆ పుస్తకాలను చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అయ్యరుగారి పేరు వినటం, వారి గ్రంథాలను చదవటమే కాని, వారిని చూడగలిగిన కాలంలో నేను లేను. నా సమకాలంలో అటువంటి మహాత్ములొకరు మహావిద్వాంసులు, మహాకవి కోట సుందరరామశర్మని మచిలీపట్నం వెళ్ళినపుడు చూడగలిగాను. వారు ద్వాదశ భాషాకోవిదులు. పన్నెండు భాషలలో రచనలు చేశారు. ఆ రచనలను ముద్రించారు. బహుశః లాటిన్ భాషలోనికి తెలుగు కవుల పద్యాలను అనువదించిన కవి వారు తప్ప వేఱొకరు లేరేమో. తిరుపతి వెంకటకవులు, త్రివిక్రమానంద భారతీస్వామిగా సన్న్యసించిన మహావిద్వాంసులు కానుకొలను త్రివిక్రమరావుల ప్రత్యక్షశిష్యులైన వీరు ఇటీవలే పరమపదించారు. తెలుగు పద్యం ఎంత అందంగా వ్రాస్తారో. తెలుగువాళ్ళ దురదృష్టం కొద్దీ అంతర్హితంగానే ఉండిపోయారు. ఆ మధ్య కొన్నాళ్ళ క్రితం హైదరాబాదులో ప్రసిద్ధ విదుషీమణి డా. యశోదారెడ్డి గారింటికి వెళ్ళినపుడు ఆమె తమ రచనలన్నింటిని నా చేతిలో పెడుతూ, ఒక కథాసంపుటి విషయంలో మాత్రం సందేహిస్తూ అన్నారు: బాబూ! ఇది పూర్తిగా తెలంగాణా మాండలికంలో రాసేను. నీకు అర్థమవుతుందో? లేదో? అని. ఒక్క తెలుగు విషయం అర్థం చేసుకోవటానికే ఒక జీవితకాలం చాలదే, ఇన్నిన్ని భాషలను నేర్చుకోవటానికి ఎన్ని జీవితకాలాలు కావాలో.

‘ప్రణవం’ ప్రత్యేకత కేవలం శ్రీనివాస్ బహుభాషాకౌశలి కానే కాదు. అందులో ఆయన చిత్రకవితలతో పాటు తమ సమకాలీకులను గుఱించి వ్రాసుకొన్న ఎన్నో విలువైన జ్ఞాపకాలున్నాయి. కొంగర జగ్గయ్య, టి.యల్. కాంతారావు, పి. భానుమతి, జెమినీ గణేశన్, పుహళేంది వంటి ఆత్మీయులు స్వహస్తాలతో శ్రీనివాస్‌ని అధికరించి వ్రాసిన సత్కారవాక్యాలున్నాయి. ఆయన అందులో తన సమకాలికులైన లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జిక్కి, ఎ.యం. రాజా, రావు బాలసరస్వతి, నౌషాద్, సి. రామచంద్ర, మెహదీ హసన్, ఘులామ్ అలీ, పర్వీన్ సుల్తానా, శంకర్ జైకిషన్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, టి.ఆర్ జయదేవ్ వంటి వందలాదిమంది సంగీత కళాకారులు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు, కవులు, రచయితల గుఱించి తనకేర్పడిన అభిప్రాయాలను ఎంతో అందంగా పొందు పఱిచారు. ఎనిమిది భాషల పీఠికను వ్రాశారు. ఎనిమిది భాషలలో కవితలను వ్రాశారు.

ఒకచోట పి.బి. శ్రీనివాస్ తన గుఱించి ఇలా వ్రాసికొన్నారు:

P.B. Sreenivos: A devout Singer-Poet believing especially in Melody and expression, with a flair for languages and creative as well as innovative compositor of Poems and Melodies!

అదే ఆయన జీవితానికీ, సంగీతానికీ, సాధనకూ, సిద్ధికీ సమస్తానికీ సమీక్షావాక్యం!

సహస్రచంద్ర దర్శనోత్సవం చేసికొని, పూర్ణపురుషాయుషాన్ని అనుభవించి, సంతతి సుఖసంతోషాలను చూసి, కర్తవ్యకర్మలన్నీ నెఱవేరి కర్మశేషం పూర్తయాక తమ 82వ యేట మొన్న ఏప్రిలు 14వ తేదీన ఇంద్రసభను అలంకరించటానికి ఐహికాన్ని త్యజించారు. లవ్లీ లవ్ సాంగ్స్‌లో ఆయనే వ్రాసుకున్నట్టు,

People say that love is blind

My life says that love is kind!


(పూజ్యులు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు పరమపదాన్ని చేరుకొన్న వార్తను వినగానే దిగ్భ్రాంతిని పొంది మాటలు తోచని నన్ను ఈ నివాళి వ్యాసం వ్రాయమని ఆదేశించిన మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు, రచనకు ప్రోత్సహించిన శ్రీ పరుచూరి శ్రీనివాస్, శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారలకు నా ధన్యవాదాలు. వ్యాసరచనకు తోడునిలిచి ఎనలేని సహాయం చేసిన శ్రీనివాస్ గారి కుమారులు శ్రీ ప్రతివాదిభయంకరం రాజగోపాల్ గారికి, మాన్య విదుషీమణి శ్రీమతి ఇందిరా జగదాచారి గారికి, శ్రీనివాస్ గారి కుమార్తె డా. నల్లాన్ చక్రవర్తుల లత గారికి, అల్లుడు డా. నల్లాన్ చక్రవర్తుల కృష్ణమణి గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి.)

ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...