పరిచయం
తెలుగులో కావ్యరచన చేసిన పూర్వమహాకవులందరూ సంస్కృతాంధ్రాలలో అవగాఢమైన కృషిచేసి శిక్షాప్రణీతంగా సంస్కృతంనుంచి శ్లోకాలను తెలుగులోకి, తెలుగునుంచి పద్యాలను సంస్కృతంలోకి, ఉభయ భాషలలోనూ పద్య-శ్లోకాలను స్వతంత్రంగానూ చెప్పనేర్చినట్లు మనకు నన్నయగారి కాలంనుంచి సువిదితమే అయినా, అదంతా అభ్యాసపురస్సరమైన విద్యోపాదాన నిమిత్తమే కాని, ఆ వరివస్యాపర్యవసానంగా రెండు భాషలలోనూ కావ్యకర్తలై “జే” అనిపించుకొన్నవాళ్లు మాత్రం మనకు కొద్దిమందే కనబడతారు. అటువంటి స్వల్పసంఖ్యాకులలో ఒకడై, మచ్చలేని మంచిపేరు నార్జించిన రావిపాటి త్రిపురాంతకుని వాఙ్మయసర్వస్వం అఖండమైన కాలానికి గుర్తులు తెలియని చరిత్రగతిలో ఇంత వరకు మనకు లభించకపోవటం నిజంగా దురదృష్టకరం.
రావిపాటి త్రిపురాంతకుడు మొత్తం ఐదు విశిష్ట గ్రంథాలను ఉదాహరణము, శతకము, తారావళి, శాస్త్రకావ్యము, వీథి అన్న అయిదు విభిన్న ప్రక్రియలలో రచించినట్లు సాహితీవేత్తలు భావిస్తున్నారు.
పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధ రత్నాకరములోనూ, కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్కార్యాలయంలోని ఉదాహరణ పద్యములు అన్న సంకలిత గ్రంథంలోనూ లభించిన ఉదాహృతులను బట్టి ఈ మూడు కృతులను ఈయన వ్రాసినట్టుగా చెప్పవచ్చు:
- కళికోత్కళికలు, సమవృత్తాలతో సలక్షణమైన త్రిపురాంత కోదాహరణము
- “అంబికా!” అన్న మకుటాన్ని కలిగిన చంపకోత్పలమాలలతో అంబికాశతకము
- “చంద్రా! రోహిణీవల్లభా!” అన్న మకుటంతో శార్దూల విక్రీడిత-మత్తేభ విక్రీడితాత్మకమైన చంద్ర తారావళి
ఇక మిగిలిన రెండు:
- మానవల్లి రామకృష్ణ కవిగారు త్రిపురాంతకోదాహరణము పీఠికలో తాము చూసినట్లుగా పేర్కొన్నదానిని బట్టి తెలుగులో మదన విజయము అన్న కామశాస్త్ర గ్రంథం
- వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామములో చెప్పినదానిని బట్టి, సంస్కృతంలో ప్రేమాభిరామము అన్న వీథీరూపకం
ఈ వ్యాసపరంపరలో ముందు ప్రతిపాదింపబోతున్న ఆధారాల ప్రకారం వెంకటగిరి సంస్థాన రాజవంశీయులలో ముఖ్యపురుషుడైన యాచమ నాయని పరాక్రమగాథలను నిర్వర్ణిస్తున్న సంస్కృతకావ్యం యాచ ప్రబంధము కూడా ఈయన రచనమే అయితే, రావిపాటి త్రిపురాంతకుడు మొత్తం ఆరు కృతులను విరచించినట్లు భావింపవచ్చును.
ఇన్ని కృతులలో శైవకృతులు మాత్రం ఎంతో కొంత పాక్షికంగానైనా లభించి లౌకికాలు అంతర్హితం కావటానికి ఆనాటి లేఖక పాఠకుల మతాభిమానం కారణమో! లేక దురత్యయమైన కాలపు ప్రభావం కారణమో! చెప్పలేము.
త్రిపురాంతకుని కృతులను అధికరించిన సమగ్రమైన పరిశీలన కందుకూరి వీరేశలింగంగారి ఆంధ్ర కవుల చరిత్రములో “రావిపాటి తిప్పన్న” అన్న శీర్షిక కింద తొలిసారి జరిగింది. ఆ తర్వాత చాగంటి శేషయ్యగారు ఆంధ్ర కవితరంగిణిలోనూ, వంగూరి సుబ్బారావుగారు శతక కవుల చరిత్రములోనూ, ఆరుద్రగారు సమగ్రాంధ్ర సాహిత్యంలోనూ కొంత కొంతగా కవిచరిత్ర, కావ్యరచన, కవిత్వగుణాలు మొదలైన అంశాలను వివరించారు. ఉపలబ్ధకృతులనుంచి తమకు నచ్చిన ఖండాలను ఉదాహరించటమే తప్ప వీరెవరూ తత్తద్గ్రంథాల కర్తృత్వవిషయమై చర్చించి, మూలాలను గుర్తించి తదనువచనమూల్యాంకనం కావించే ప్రయత్నం చేయలేదు. అందువల్ల మహాకవి రావిపాటి త్రిపురాంతకుని కృతులను అధికరించిన తథ్యమిథ్యావివేచనతో ప్రామాణిక పునఃపరిశీలన ఆవశ్యకం అయింది.
త్రిపురాంతకోదాహరణము
మహాకవి రావిపాటి త్రిపురాంతకుని కృతిరత్నాలలో నిరుపమకాంతిమంతమైన త్రిపురాంతకోదాహరణము యొక్క ఒకే ఒక్క తాళపత్ర ప్రతి తంజావూరు మహారాజా శరభోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని ఆంధ్రగ్రంథసంచయంలో ఉన్నది. 1933లో ప్రకటితమైన A Descriptive catalogue of the Telugu Manuscripts in The Tanjore Maharaja Serfoji’s Sarasvati Mahal Library లో అప్పట్లో 166 వరుస సంఖ్య గల ప్రతి భౌతిక స్వరూప వర్ణన, ఇతర వివరాలు ఉన్నాయి. నిజానికి త్రిపురాంతకుని కావ్యజాతంలో పూర్తిగా దొరికి, సుపరిష్కృతంగా పలు పర్యాయాలు ముద్రితమై, ఉదాహరణ ప్రక్రియకు తెలుగులో పాల్కురికి సోమనాథుని బసవోదాహరణము తర్వాత ద్వితీయోదాహరణమైనప్పటికీ, అద్వితీయమైన ఉదాహరణమని విమర్శక ప్రశంసలకు నోచుకొన్న రచన ఇదొక్కటే.
త్రిపురాంతకోదాహరణమును ముమ్మొదట 1912లో సుగృహీత నామధేయులు శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు వనపర్తిలో బ్రహ్మవిద్యావిలాస ముద్రాక్షరశాలలో “విస్మృత కవులు” శీర్షికాగతంగా పరిష్కరించి ఒక ప్రామాణికమైన పీఠికతో అచ్చువేశారు. ఆ ప్రతులిప్పుడు గ్రంథాలయాలలో లభించటం లేదు. తంజావూరు వ్రాతప్రతిలోని పాఠాలకు, మానవల్లివారి ముద్రిత ప్రతిలోని పాఠాలకు వ్యత్యాసాలున్నాయి. ఆ వ్యత్యాసాలను పురస్కరించుకొని మానవల్లివారి వద్ద వేరొక వ్రాతప్రతి ఏదైనా ఉండినదో, లేక తంజావూరులో ఉన్న ప్రతినే వారు యథోచితంగా సవరించారో నిశ్చయించటానికి వీలులేకుండా ఉన్నది. ఆ తర్వాత 1937లో నిడుదవోలు వెంకటరావుగారు 1. తంజావూరిలోని వ్రాతప్రతితోనూ, 2. మానవల్లివారి ముద్రిత ప్రతితోనూ, 3. బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పరిశీలనార్థం తమకై వ్రాయించిపెట్టుకొన్న కాగితం ప్రతితోనూ, 4. పెదపాటి జగన్నాథకవి ప్రబంధ రత్నాకరములో ఇచ్చిన పద్యోదాహరణంతోనూ, 5. అన్యగ్రంథ సంవాదంతోనూ పునఃపరిష్కరించి, విపుల పీఠికాసమేతంగా సమగ్ర పాఠాన్వయ పూర్వక లఘువివృత్యాదికంతో అచ్చువేశారు. 1940లో ఇది పునర్ముద్రితమైంది. 1954లో వెంకటరావుగారు మళ్లీ దీని పునఃపరిష్కృత పరివర్ధిత ముద్రణను వెలువరించారు. అంతేకాక 1950లోనూ 1968 లోనూ వెంకటరావుగారి ఉదాహరణ వాఙ్మయ చరిత్రలో త్రిపురాంతకోదాహరణము మళ్లీ రెండు పర్యాయాలు అచ్చయి పాఠకుల అందుబాటులోకి వచ్చింది.
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు తమ తెలుగు సాహిత్య చరిత్ర (ప్రథమ భాగము)లో దీనిని అధికరించి పు. 501-4లలో ఒక చక్కటి విమర్శను వ్రాశారు.
ఇదంతా ఈ లఘుకావ్యం ముద్రణ చరిత్ర. ఇన్ని పర్యాయాలు అచ్చయినా, గ్రంథమంతటా అచ్చుతప్పులు, పరిష్కరణ దోషాలు తప్పలేదు. అపపాఠాలు మిక్కుటంగా కనుపిస్తున్నాయి. నిర్దుష్టమైన సుపరిష్కృతపాఠం ఒకటి సమంజసమైన వ్యాఖ్యతో వెలువడవలసిన ఆవశ్యకత ఇంకా వీనుమిగిలే ఉన్నది.
ఈ త్రిపురాంతకోదాహరణము నేటి నంద్యాల జిల్లాలోని (పూర్వపు ప్రకాశం జిల్లా) మార్కాపురం దగ్గర శ్రీశైల పుణ్యక్షేత్రానికి తూర్పు ద్వారమని ప్రసిద్ధికెక్కిన శ్రీ త్రిపురాంతక క్షేత్రంలో కుమారగిరి నివాసాన వెలసిన శ్రీ త్రిపురాంతకేశ్వరుని దివ్యలీలలను అధికరించి చెప్పబడిన ఒక చిన్ని కృతి. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం, పడమట బ్రహ్మేశ్వరం (నేటి ఆలంపురం), ఉత్తరాన మహేశ్వరం, దక్షిణాన సిద్ధవటం నాలుగు వాకిళ్లుగా ఉన్నాయని ప్రసిద్ధి. సౌరాష్ట్రాన సోమనాథుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వరుడు, దేవఘడ్‌లోని చిత్రభూమిలో వైద్యనాథస్వామి, ద్వారక చెంత నాగనాథుడు, కాశిలో విశ్వేశ్వరుడు, మహారాష్ట్రలో భీమశంకరుడు, రామేశ్వరంలో రామలింగేశ్వరుడు, హిమాలయంలో కేదారేశ్వరుడు, నాసికలో త్ర్యంబకేశ్వరుడు, ఎల్లోరాలో ఘృష్టేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపులు. ఈ జ్యోతిర్లింగాలలో శ్రీశైల భ్రమరాంబాసమేత మల్లికార్జున లింగాన్ని దర్శింపగోరినవారు ఈ త్రిపురాంతక ప్రాగ్ద్వారముఖంగా ప్రయాణించి, పాతాళగంగలో స్నానంచేసి, శిఖరదర్శనానంతరం ఆలయప్రవేశం కావించి, పరమేశ్వర సన్నిధిరూపమైన పెన్నిధిని చూరగొని, శివలీలను అవలీలగా అనుభవింపగలరని భక్తుల ఆనుభవిక విశ్వాసం.
త్రిపురాంతకాలయం దగ్గర ఉన్న పర్వతభాగానికి కుమారగిరి, తరుణాచలం అని పేర్లు. ఆలయంలోని గోడలపై వందకు పైగా చెక్కబడిన శాసనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే త్రిపురాంతక కవి కాలాన్ని గురించి, ఈ కృతిని గురించి మరికొన్ని విశేషాలు వెల్లడయే అవకాశం ఉంది. ఈ క్షేత్రంలోని శాసనాల ప్రతులను తీయించటం, కొంతవరకు వాటి ప్రకటన ఒకప్పుడు సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు శ్రీ పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారి పర్యవేక్షణలో జరిగి, ఆ తర్వాత ఆగిపోయింది. వాటి సమీచీనమైన అధ్యయనం కొనసాగలేదు. ఆ శాసన పాఠాల సంకలనాన్ని అచ్చువేస్తే మహాకవి త్రిపురాంతకుని రచనలను అధికరించి మరింత సాధికారమైన విమర్శ వెలువడటానికి దోహదం కాగలుగుతుంది.
ఇందులోని ఇతివృత్తం పాల్కురికి సోమనాథుని బసవ పురాణములోని కథలు కొన్నింటితోనూ, ద్రావిడ – కర్ణాట దేశ కథలు కొన్నింటితోనూ కలితమై ఉన్నది. రచనాశిల్పం సోమనాథుని బసవోదాహరణము, పండితారాధ్యోదాహరణములకు ఈషద్భిన్నంగా, నవీన గుణసనాథంగా ఉన్నది. కళికోత్కళికల కూర్పులో సుసంస్కృతమైన సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించిన మహాకవి త్రిపురాంతకుని ప్రయోగవిజ్ఞానం నిరుపమానం.
(కర్తృత్వవివాదాలు వచ్చే సంచికలో)
[4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (తెలుగు అకాడమీ) వారు 2012లో ప్రచురించిన *మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు* అన్న మోనోగ్రాఫ్‌ను మాకు అందజేసిన రచయిత ఏల్చూరి మురళీధరరావు గారికి, దాని పునర్ముద్రణకు అనుమతించిన తెలుగు అకాడమీ వారికి మా ధన్యవాదాలు — సం ]
