నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన

తెలుగు సాహిత్యచరిత్రలో కర్తృత్వసమస్య కారణంగా అత్యంత వివాదాస్పదమైన కుమార సంభవ మహాకావ్యం ప్రథమభాగాన్ని ఇప్పటికి నూటనాలుగేళ్ళ క్రితం 1909లో, కవిరాజశిఖామణి నన్నెచోడుని పేర ప్రకటించిన మానవల్లి రామకృష్ణకవి అందులోని 106వ పుటలో, షష్ఠాశ్వాసంలోని 824 వరుస సంఖ్య గల పద్యం అధోజ్ఞాపికలో ఒక ఆసక్తికరమైన విశేషాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ పద్యమూ, ఆ అధోజ్ఞాపికా ఇవి:

మ.   అలిధమ్మిల్ల మృణాళహస్తఁ గమనీయావర్తనాభిన్ మహో
       త్పలగంధిం గలహంసయాన విలసద్బంధూకరక్తోష్ఠ ను
       త్పలనేత్రిం గమలాస్య నంగజరసాంభఃపూరఁ దత్పార్వతీ
       జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే. (ప. 824)

ఉపమానోపమేయ విపర్యయమును విశేషణవిశేష్యలింగభేదమును దోషములుగా గ్రహించి దానిఁ దొలంగింపనని కాఁబోలును తెన్నాలి రామలింగకవి తన కందర్పకేతువిలాసములో నిట్లమార్చి పద్యమును గూర్చుకొనెను:- లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో। త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ। పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ। జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు 1972లో ప్రకటించిన మానవల్లికవి – రచనలు అన్న బృహత్సంకలనంలో ఈ లఘువ్యాఖ్య లేదు. మానవల్లి రామకృష్ణకవి 1909లో ప్రకటించిన ప్రతిని చూస్తే కాని ఈ లఘువ్యాఖ్య సాహిత్య అకాడమి ప్రతిలో లేని ఈ విషయం పాఠకులకు తెలిసే అవకాశం ఉండదు.

1909లో కుమారసంభవాన్ని ప్రకటించిన ఇరవైఎనిమిదేళ్ళకు భారతి మాసపత్రిక ధాత నామ సంవత్సరం పుష్యమాస సంచికలో, గ్రంథచౌర్యము అనే వ్యాసంలో మానవల్లి రామకృష్ణకవి నన్నెచోడుని కుమారసంభవము లోని పద్యాన్ని తెనాలి రామలింగకవి తన కందర్పకేతు విలాసంలో అర్థచౌర్యం చేసి వాడుకొన్నాడన్న ఉదంతాన్ని మళ్ళీ ఈ విధంగా ప్రస్తావించారు:

మ. అలిధమ్మిల్ల మృణాళహస్తఁ గమనీయావర్తనాభిన్ మహో
        త్పలగంధిం గలహంసయాన విలసద్బంధూకరక్తోష్ఠ ను
        త్పలనేత్రిం గమలాస్య నంగజరసాంభఃపూరఁ దత్పార్వతీ
        జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.

మ. లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
       త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
       పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
       జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.

ఇందు రూపకమున విశేషణవిన్యాసక్రమమున దోషము సంఘటిల్లెననియు దానిని దొలఁగింపఁ గాఁబోలుఁ జోడని పద్యము సంస్కరించి భావనోద్బోధిత సంవిచ్చమత్కారశూన్యుండగు తెనాలికవి యర్థచౌర్యముఁ గావించె. రెండవ పద్యమునఁ జతుర్థ పాదమును మార్పకుండుట సమస్యాపూరణ కౌశలప్రకాశనము కాఁబోలు.

…ఈ యర్థాపహారము కవిత్వశిక్షాభ్యాసకాలమునఁ గాని రాజసభలలో విద్యావినోదకాలములోఁ జమత్కారముగాఁ గాని సంఘటిల్లును. లేక భక్తి పారవశ్యముచేఁ గాళిదాసాది మహాకవు లొసంగు వాక్పుష్పములఁ దమ యశఃశరీరము లగు కావ్యబంధముల శేఖరములుగా నునిచికొని తీర్థప్రసాదము వలె గ్రహించి వారి నర్చింతురు. ఇట్టివి కేవలము చాటువులుగా నిలిచినచో క్షణకాలవిస్మయ మాపాదించుఁ గాని కావ్యనివేశితములైనచోఁ దప్పక తత్కవుల కసత్స్ఫాల్య శల్యభూతములై కీర్తిశరీరముల వేధించుచుండును.

మానవల్లికవి – రచనలు సంపుటంలోని 382 – 410 పుటల మధ్య గ్రంథచౌర్యము అన్న ఆ వ్యాసమూ; 385వ పుటలో పై వ్యాఖ్యా ఉన్నాయి. రామకృష్ణకవి 1909 నాటి తొలి ముద్రణలో 824వది అని చూపిన ‘అలిధమ్మిల్ల’ పద్యం నేటి ముద్రణలలో కుమారసంభవం 6వ ఆశ్వాసంలోని 165వ పద్యం. దానిని తెనాలి రామలింగకవి అర్థచౌర్యం చేశాడని ప్రదర్శింపబడిన ‘లలితాస్యాంబురుహంబు’ అన్న పద్యం తెనాలి రామలింగకవి రచించిన కందర్పకేతు విలాసంలో నుంచి తమకు ఎక్కడ దొరికిందో రామకృష్ణకవి ఆనాడు పేర్కొనలేదు కాని, అది తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో 189వ సంఖ్య గల పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధరత్నాకరము యొక్క వ్రాతప్రతిలో మాత్రమే ఉన్నదని పరిశీలకులు గుర్తించారు. అక్కడ తప్ప ఆ పద్యం మఱెక్కడా లేదు.

పెదపాటి జగన్నాథకవి తన ప్రబంధరత్నాకరంలో తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం నుంచి మొత్తం మూడు పద్యాలను ఉదాహరించాడు.

ఉ. కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు; సరోరుహగంధి మందిరా
       రామముఁ జూచి మ్రానుపడు; రాజనిభానన సారెకున్ శుక
       స్తోమముఁ జూచి యేఁకరును; దొయ్యలి కోకిలఁ జూచి కంటఁ గెం
       పౌ మదలీలఁ దాల్చు మదనానలతాపవిషాదవేదనన్.

ఉ. అ క్కమలాక్షిఁ గన్గొనిన యప్పటి నుండియు నేమి చెప్ప! నా
       కెక్కడఁ జూచినన్ మదనుఁ, డెక్కడఁ జూచిన రోహిణీవిభుం,
       డెక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు, లిం
       కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానలతాపవేదనన్.

సీ. తారామనోరంజనారంభ మే దొడ్డు?
             శిలలు ద్రవింపంగఁ జేయు ననినఁ
       జాకోరహర్షయోజనకేళి యే దొడ్డు?
             పేర్చి యంభోధు లుబ్బించు ననినఁ
       గుముదౌఘతాపోపశమకృత్య మే దొడ్డు?
             సృష్టి యంతయుఁ జల్లసేయు ననిన
       వరనిశాకామినీవాల్లభ్య మే దొడ్డు?
             వర్ణింప సత్కళాపూర్ణుఁ డనినఁ

గీ. దనకు సర్వజ్ఞశేఖరత్వంబు గలుగ
      హితసుధాహారవితరణం బేమి దొడ్డు
      ననఁగ విలసిల్లె హరిదంతహస్తిదంత
      కాంతినిభకాంతిఁ జెలువారి కంజవైరి.

వీటిలో ‘కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు’ అన్న పద్యం ప్రబంధరత్నాకరం ద్వితీయాశ్వాసంలో 79వ సంఖ్య గలది. ‘అక్కమలాక్షిఁ గన్గొనిన యప్పటినుండియు’ అన్న పద్యం ప్రబంధరత్నాకరం ద్వితీయాశ్వాసంలో 95వ సంఖ్యతో ఉన్నది. ‘తారామనోరంజనారంభ’ మన్న సీసపద్యం తృతీయాశ్వాసం లోని 198వది. ఇవి కాక, ద్వితీయాశ్వాసం లోని ‘అక్కమలాక్షిఁ గన్గొనిన యప్పటినుండియు’ అన్న పై 198వ విరహవర్ణన పద్యానికి దిగువ ఈ పద్యాలెవరివో, ఏయే కావ్యాలలోనివో ఎటువంటి నిర్దేశమూ లేకుండా 199, 200 సంఖ్యలతో రెండు పద్యాలున్నాయి:

ఉ. వారిజ! మీన! కోక! యళివర్గ! సితచ్ఛద! సల్లతావనీ!
       మీ రుచిరాస్య, మీ నయన, మీ కుచ, మీ యలకాళి, మీ గతిన్,
       మీ రమణాంగి – మత్ప్రియ నమేయగతిన్, విరహాతురాననన్
       మీరును మీరు మీరు మఱి మీరును మీరు మీరునున్. (ప. 199)

మ. లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
       త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
       పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
       జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే. (ప. 200)

1918లో వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరాన్ని, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్కార్యాలయంలోని ఉదాహరణ పద్యములు అన్న సంకలనాన్ని సంశోధించి ఆ రెండింటి సమాకలనగా తమ ప్రబంధరత్నావళిని ప్రకటించినప్పుడు జగన్నాథకవి పేర్కొన్న మూడు పద్యాలకు దిగువ ఉండటంతో పాటు ప్రకరణసామ్యం, శైలిసామ్యం ఉన్నందువల్ల కాబోలు – కావ్యనిర్దేశం, కర్తృత్వనిర్దేశం లేకపోయినా, ‘వారిజ! మీన! కోక! యళివర్గ!’ అన్న పద్యాన్ని తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోనిదిగా ఊహించి, తమ సంకలనంలో కలుపుకొన్నారు. తమకంటె తొమ్మిదేళ్ళకు మునుపే మానవల్లి రామకృష్ణకవి నన్నెచోడుని కుమారసంభవం పద్యవ్యాఖ్యలో తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలో అర్థచౌర్యం చేసినదని ఉదాహరించిన కర్తృత్వనిర్దేశం లేని ‘లలితాస్యాంబురుహంబు’ అన్న పద్యాన్ని మాత్రం ఉపేక్షించారు. దానిని కందర్పకేతు విలాసం లోనిదిగా స్వీకరింపలేదు. అందుకు కారణాలు తెలియవు. ఈ పద్యం కందర్పకేతు విలాసం లోనిదే అని, ఇవి గాక మరికొన్ని పద్యాలను వేర్వేరు ఆకరాలనుంచి గ్రహించి, సుబంధుని వాసవదత్తా కథ: తెనాలి రామకృష్ణకవి కందర్పకేతు విలాసము అని నేను వ్రాసిన లఘుపుస్తకాన్ని వావిళ్ళ వారు అచ్చువేస్తున్నారు. అందులో దీని ఉనికిని గురించిన తర్కసంగతిని విశదంగా వ్రాశాను.

నన్నెచోడుని పద్యంలోని గుణదోషాల విమర్శ

నన్నెచోడుని పద్యాన్ని చదువుకొన్న తెనాలి రామలింగకవి చేసినది చౌర్యమో! శౌర్యమో! ఆ సంగతిని తర్వాత నిర్ణయిద్దాము. కుమారసంభవ పద్యం నానాదోషాలతో నిండి ఉన్నదని కవిగారు అంగీకరింపక తప్పలేదన్నది ఇక్కడ ప్రధానవిషయం. ‘ఉపమానోపమేయ విపర్యయం, విశేషణ విశేష్య లింగభేదం’ (“విశేషణవిన్యాసక్రమమున దోషము” అని మానవల్లి వారి రెండవ వ్యాఖ్య) నిజంగానే నన్నెచోడుని పద్యశిల్పాన్ని భగ్నం చేశాయి. తప్పున్నది నన్నెచోడుని పద్యంలో అయినప్పుడు కవిగారు రామలింగకవిని ‘భావనోద్బోధితసంవిచ్చమత్కారశూన్యుడు’ అని నిందించటానికి కారణం అగపడదు. అందువల్ల వారన్న ఆ ‘భావనోద్బోధితమైన సంవిత్ చమత్కారశూన్యత’ కేవలం పద్యం అనుకరణ విషయమైన నింద మాత్రమే అనుకోవాలి. స్వతంత్రంగా తానై అర్థవల్లిని కొనసాగించగల భావనాశక్తి లేక ఒకానొక పూర్వమహాకవి రచించిన గొప్ప పద్యాన్ని ఉన్నదున్నట్లు అనుకరించటమే సంవాదశిల్పంలో చిత్తానందకర భావనాశక్తిలోపమని దీని అంతరార్థం.

తులనీయులైన ఇద్దరు కవుల పద్యాలలో అర్థాపత్తి ప్రమాణం వల్ల, అసాధారణమైన కల్పన వల్ల, అత్యపూర్వమైన పదప్రయోగం మూలాన కాదనటానికి వీలులేని పోలిక కనబడినప్పుడు ఒకరొకరిని అనుకరించారని నిర్ణయింపవచ్చును. పై రెండు పద్యాలలో వృత్తస్వీకారంలోనూ, సాంగోపాంగమైన రచనాసంవిధానంలోనూ కనబడుతున్న సర్వాంగీణమైన సదృశత్వాన్ని కాదనలేము. పైగా, రెండు పద్యాలలోనూ ‘జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అన్న నాలుగవ పాదం ఒకటే కావటం వల్ల ఆ పోలికను యాదృచ్ఛికం అనుకోవటం కూడా సాధ్యం కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు మఱొకరిని అనుకరించారన్నది మాత్రం తిరుగులేని నిజం.

నన్నెచోడుని కుమారసంభవం, తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం కావ్యాలలో కథాసందర్భాన్ని బట్టి ఒక్కొక్క పద్యనివేశమూ ఎలా ఉన్నదో చూద్దాము.

కందర్పకేతు విలాసం: పద్య సంనివేశం

కందర్పకేతు విలాసం లోని నాయకుడు కందర్పకేతుడు చింతామణి మహారాజు కొడుకు. ఒకనాటి రాత్రి కలలో ఒక లోకోత్తరసౌందర్యరాశి సాక్షాత్కరించి అతని మనసు దోచుకొంటుంది. తెల్లవారగానే అతను మకరందుడనే తన ప్రియసఖుణ్ణి వెంటబెట్టుకొని ఊరుపేరులు తెలియని ఆమె కోసం గాలిస్తూ, రోజంతా ప్రయాణించి వింధ్యాద్రిని చేరి అక్కడొక చెట్టు క్రింద నడుము వాల్చేసరికి – కొమ్మల మీద వాలిన శుకశారికలు మాట్లాడుకోవటం వినిపిస్తుంది:

కుసుమపురాధిపతి శృంగారశేఖరుని కుమార్తె వాసవదత్త వంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదట. యుక్తవయసు వచ్చిన తర్వాత తండ్రి ఆమెకు వివాహం చేయదలిచి, స్వయంవరణాన్ని ప్రకటించాడట. దేశదేశాల నుంచి వచ్చిన రాకుమారులలో ఏ ఒక్కరూ ఆమెకు నచ్చలేదట. ఆ మునుపటి రోజే ఆమెకు రాత్రి కలలో కందర్పకేతుడనే అందగాడు కనిపించాడట. ఆమె అతనికి తన ప్రేమను వెల్లడిస్తూ ఉత్తరం వ్రాసి, తమాలిక అనే ప్రియశారిక ద్వారా అతనికి పంపించిందట.

అదృష్టవశాన అదే చెట్టుమీద వాలిన తమాలిక – ఆ మాటలను శ్రద్ధగా వింటున్న నవయౌవనుడే కందర్పకేతుడని గుర్తించి, అతనికి లేఖను అందించి, కుసుమపురానికి తీసుకొనివెళ్తుంది. అక్కడొక దివ్యసౌధంలో నాయికా నాయకులు కలుసుకొంటారు. కాని, అదే రోజున శృంగారశేఖరుడు వాసవదత్తను విద్యాధర రాజకుమారుడు పుష్పకేతునికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకొంటాడు. ప్రేమికులిద్దరూ మకరందుని ఎప్పటికప్పుడు వర్తమానాలు కనుక్కొంటుండమని రాజధానిలోనే ఉంచి, మనోజవమనే మాయాశ్వాన్నెక్కి వింధ్యాద్రికి వెళ్తారు. రాత్రంతా వారికి ఏకాంత ప్రణయలీలలతో గడిచిపోతుంది.

తెల్లవారేసరికి వాసవదత్త నిద్రలేచి, ప్రియునికి ఫలాదులను తేవటానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఘోరయుద్ధం చేస్తున్న ఆటవికసైన్యాల మధ్య చిక్కుకొంటుంది. ఆమె అందానికి ముగ్ధులై వారు తమ కలహం మాట మఱిచి ఆమె వెంటపడతారు. వాసవదత్త ఒక యోగసిద్ధుని ఆశ్రమంలో తలదాచుకోబోతుంది. ఆటవికులు ఆశ్రమంలోకి జొరబడి కనబడినదల్లా చిందరవందర చేస్తారు. ఆ దురాగతానికి కారణం ఆమేనని మండిపడి ముని ఆమెను శిలామూర్తివి కమ్మని శపిస్తాడు. ఆ తర్వాత ఆమె దీనోక్తులకు మనస్సు కరిగి, ప్రియుని స్పర్శ సోకితే శాపమోక్షం కలుగుతుందని అనుగ్రహిస్తాడు.

కందర్పకేతుడు మేలుకొన్నాక వాసవదత్త కనబడకపోయేసరికి దరిదాపుల వెతికి వెతికి నిరాశచెంది ఆత్మహత్య చేసుకోబోతాడు. ఆకాశవాణి అతనిని వారించి, ప్రేయసీ పునస్సమాగమం సిద్ధిస్తుందని చెబుతుంది. కందర్పకేతుని మనస్సు కుదుటపడుతుంది. ప్రాణేశ్వరిపై మళ్ళీ కోరిక ఉదయిస్తుంది. ‘లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో, త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ, పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ, జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అని అనుకొంటాడు.

కందర్పకేతు విలాసంలో పద్యనివేశం సందర్భవిదర్భమని ఊహింపవచ్చును. రాత్రంతా జరిగిన ప్రణయలీల వల్ల నాయిక వాసవదత్త జ్ఞాతమన్మథరస. అందువల్ల అనుభూతరతోత్సుక అని ప్రతీయమానం. ప్రియైకలగ్నమానస, ప్రాణేశ్వరి అయిన ఆమె తన పొందుకోసం భావోదయం చెంది చెమర్చిన మేనితో ‘ఉద్గతచిత్తజాతరసవాఃపూర’యై ఎదురు చూస్తుంటుందన్న కందర్పకేతుని ఊహలో ఆమె విరహాతిశయం వ్యంగ్యమై, అనిర్వచనీయమైన వారి దాంపత్యశృంగార భావశబలత చిత్రితమయింది. వక్తృప్రౌఢోక్తిసిద్ధమైన అర్థశక్తి మూలంగా అలంకారకృత వస్తుధ్వనిని నిబంధించటంలో రామలింగకవి నేర్పరితనమంతా కొలువుతీరింది.

కుమారసంభవం: పద్య సంనివేశం

కుమారసంభవం లోని నాయిక పార్వతీదేవి. ఆమె అవివాహిత. అజ్ఞాతరతిలాలస. ఈశ్వరభక్తితాత్పర్యంతో తపోదీక్షితురాలై ఉన్నది. ఒకానొక ‘ఘర్మదివసంబున’, ‘పంచాగ్నిమధ్యంబున’ పద్మాసనంలో కూర్చొని ఉన్నది. మనస్సును పరమేశ్వరుని యందు లీనం చేసింది. యోగనిష్ఠాపరిణతి వల్ల క్రమంగా చిత్తలయాన్ని సాధిస్తున్న దన్నమాట. ‘పరమేశ్వర ధ్యాన లీయమాన మానస’ అని కవి అన్నాడు. నిద్రాహారాలు లేక, తపఃక్లేశం మూలాన తనువు కృశించి ఉన్నది. ‘దేహంబు నిరంతర తపఃక్లేశంబునం జర్మాస్థిమయంబై కాష్ఠావస్థ నెయిదియుం దపోనిష్ఠ విడువ కనుష్ఠించుచు (6-148)’ – కేవలం జీవధారణమాత్ర పరిశుష్కదేహగా ఉన్నదని కవి వర్ణనం. అటువంటి తరుణంలో సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఆమెను ‘అంగజరసాంభఃపూర’గా భావించి, ఆ జలజావాసమును ‘చొచ్చి’–’ఆడక’- మనోజాతానలం ఆరదని తపించినట్లు వర్ణించటం ఔచిత్యవిచారచర్చకే ప్రత్యుదాహరణమై హేయభావాస్పదంగా, అసహ్యంగా ఉన్నది.

రసదోషానికి ఇంతకంటె గర్హ్యమైన ఉదాహరణం వేఱొకటుండబోదు.

అంతే కాదు. ఆయన సాక్షాత్తు జగత్సంహారకారకుడైన పరమేశ్వరుడు. కథలో అంతకు మునుపే తపోభంగమైనదని ఆగ్రహించి తన ఫాలనేత్రాగ్నితో మన్మథుని దహించివేసినవాడు. ఆ దగ్ధమనోభవుని నోట – ఆయన ధీరోదాత్తతకు ఎంత మాత్రమూ తగని ‘మనోజాతానలం బాఱునే’ అన్న ఆ మన్మథావస్థా నైమిత్తవాక్యం వస్తుందా? అది ఆయన మనోయోగాన్ని వ్యంజింపజేస్తుందా? ఆ చిత్రణ ప్రబంధార్థానికి ఉద్దీపకం అవుతుందా?

కేవలం అస్థానపతితమైన భావం ఇది. ఉపమానోపమేయ విపర్యయం, విశేషణ విశేష్య లింగభేదం, అన్నవి కాదు ప్రధానం. శృంగారయోగ్యమైన దీప్తి లేకపోగా అసత్త్వాపాదనం వల్ల రసౌచిత్యానికి భంగం వాటిల్లింది. ఇది రామలింగకవికి అనుకార్యమైన రచనమని ఎవరూ అనుకోరు.

పద్యాలను మరికొంత విమర్శించి చూద్దాము.

రామలింగకవి పద్యంలో విషయి-విషయ భావం లక్షణానుగుణంగా నిబద్ధమై ఉన్నది. విషయి అంటే ఆరోప్యమాణమైన వస్తువు. విషయము అంటే ఆ ఆరోపణకు ఆశ్రయమైన వస్తువు. ప్రాణేశ్వరీ జలజావాసము అన్నప్పుడు ‘ప్రాణేశ్వరి’ విషయి;‘జలజావాసము’ విషయము. ఆరోపాశ్రయమైన పూర్వవర్తివిషయం ‘ప్రాణేశ్వరి’పై అభేదప్రాధాన్యం వల్ల ‘జలజావాసము’ అన్న పరవర్తివిషయ్యారోపణం జరిగి, రూపణల క్రమానుసంధానం మూలాన ఆ ఆరోపవిషయం సుప్రకాశితం అయింది.

వర్ణింపబడుతున్న ఆస్యము (ముఖము) – నీలకచము (నల్లని కురులు) – నేత్రము (కన్ను) – ఉచ్చైఃస్తనము (ఎత్తైన రొమ్ము) – ఓష్ఠము (పెదవి) – ఉద్యత్కటి (విశాలమైన జఘనస్థలి) అన్న అంగాలపై సాదృశ్యమూలాన క్రమంగా అంబురుహము (పద్మము) – రోలంబము (తుమ్మెద) – అసితోత్పలము (నల్లని కలువ) – కోకము (చక్రవాక పక్షి) – బంధూకము (మంకెన పువ్వు) – పులినము (ఇసుకతిన్నె) అన్నవి ఆరోపింపబడ్డాయి. ఈ అభేదం సర్వాంగాలకూ చెప్పినందువల్ల ఇది సమస్తవస్తువిషయ సావయవరూపకం అయింది. ఆస్యాంబురుహము – నీలకచరోలంబము – నేత్రాసితోత్పలము – ఉచ్చైఃస్తనకోకము – ఓష్ఠవిలసద్బంధూకము – ఉద్యత్కటీపులినము అన్న రూపణలు ప్రాణేశ్వరీ జలజావాసముతో పరస్పరాశ్రయంగా ఏకార్థీభావంతో సమన్వయిస్తున్నాయి.

ఏ విధంగా చూసినా అద్భుతమైన పద్యం ఇది.

కుమారసంభవం పద్యంలో కవి ఈ నియమాన్ని పాటింపనందువల్ల చమత్కృతశిల్పానికి ఆఘాతం ఏర్పడింది. అలిధమ్మిల్ల – మృణాళహస్త – కమనీయావర్తనాభి – మహోత్పలగంధి – కలహంసయాన – విలసద్బంధూకరక్తోష్ఠ – ఉత్పలనేత్రి – కమలాస్య – అంగజరసాంభఃపూర్ణ అన్న విశేషణాలన్నీ ‘పార్వతీజలజావాసం’ అన్న రూపణలోని ‘పార్వతి’ అన్న పూర్వపదంతోనే అన్వయిస్తాయి కాని, ఆరోపాశ్రయమైన ‘జలజావాసము’తో అన్వయింపవు. తుమ్మెదలను పోలిన నల్లని వేణీబంధం కలిగిన పార్వతి అలిధమ్మిల్ల అవుతుంది కాని, తామర పువ్వులకు నిలయమైన జలజావాసం తుమ్మెదల వంటి వేణీబంధం కలిగిన అలిధమ్మిల్ల కాదు. ‘అలిధమ్మిల్ల’ను పార్వతికి అనువర్తించితే రూపకంలో జలజావాసానికి అసలు ప్రమేయమే లేదు. అలిధమ్మిల్లాదులు పార్వతికే విశేషణాలైనప్పుడు వాక్యగతంగా జలజావాసము తోడి రూపకసిద్ధికి అవకాశమే లేదు.

ఏ విధంగా చూసినా కుమార సంభవంలో పద్యానికి అన్వయం పొందుపడదు.

అలిధమ్మిల్లాదులు పార్వతికి విశేషణాలు అనుకొంటే, అవి సర్వస్త్రీసామాన్యవిశేషణాలే కాని – వాటిలో పరమేశ్వరుని మదిలో మెదలుతున్న పార్వతిని రూపుకట్టించే భావచిత్రం ఒక్కటీ లేదు. పార్వతీ శబ్దానికి సంజ్ఞావాచకంగానే తప్ప పద్యంలో అంతకంటె విశిష్టమైన ధర్మావబోధకత్వమేమీ లేదు.

అందువల్లనే కుమారసంభవ పద్యంలో 1. ఉపమానోపమేయాల క్రమవిన్యాసంలో లోపం 2. విశేషణ విశేష్య లింగభేదం అని రెండు వ్యతిక్రమాలను కవిగారు తామే అంగీకరింప వలసివచ్చింది. ‘అలిధమ్మిల్ల’ మొదలైనవి పార్వతికి విశేషణాలే కాని, ఉపమానాలు కావు. అవి రూపకంలో ఆశ్రయణీయమైన జలజావాసంతో ఏ విధంగానూ అన్వయింపవని అనుకొన్నాము. పోనీ, ఛందోనిర్వహణార్థం ఏవో పర్యాయాలను నిలిపి, అలిధమ్మిల్ల – మృణాళహస్త – కమనీయావర్తనాభి – మహోత్పలగంధి – కలహంసయాన – విలసద్బంధూకరక్తోష్ఠ – ఉత్పలనేత్రి – కమలాస్య మొదలైన సమాసపదాలను తిరగేసి హస్తమృణాళ – నాభీకమనీయావర్త –యానకలహంస – ఓష్ఠవిలసద్బంధూక – నేత్రోత్పల –ఆస్యకమల అని అందామంటే, అదే క్రమంలో ధమ్మిల్లాలి – గంధమహోత్పల అని కనీసం అనటానికైనా వీలుండదు. పూర్వాపరాలు నియమయుక్తంగా లేనందువల్ల ఉపమానోపమేయక్రమం ఎక్కడిదక్కడ తారుమారయింది.

ఇటువంటి ఉదాహరణను మానవల్లి రామకృష్ణకవి తన ముందుంచుకొని తెనాలి రామలింగకవిని ‘భావనోద్బోధిత సంవిత్ చమత్కారశూన్యుడు’ అని వట్టి అనుకర్తృమాత్రునిగా నిరూపించే ప్రయత్నం చేయటం ఆశ్చర్యకరం.

ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే నన్నెచోడుని పద్యంలో ‘మహోత్పలగంధి,’ ‘ఉత్పలనేత్రి,’ అని ఒకే ఉపమానం పునరుక్తం కావటం కూడా భావ్యంగా లేదు. వాటికి పర్యాయాలను నిలపలేనంత సామాన్యకవి కాడు కదా. ఇక పోతే, సందర్భౌచితి లోపించిన ‘అంగజరసాంభఃపూర,’ ‘మనోజాతానలం,’ వంటి పరికర్షణీయాలను గుఱించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.

పద్య మౌలికతా విచారం

కుమారసంభవ పద్యాన్ని అనుసరింపబోయి తన భావనాశక్తి లోపాన్ని వెలిపెట్టుకొన్న ఛాయోపజీవిగా తెనాలి రామలింగకవిని ఆక్షేపించే తొందరపాటులో రామకృష్ణకవి ఈ పద్యానికి మూలమైన శ్లోకం ఒకటున్నదనే సత్యాన్ని ఊహింపలేకపోయారు. కుమారసంభవం లోని పద్యాలను ఎంతోమంది తెలుగు కవులు అనుకరించారని ఆయన చూపిన పద్యాలన్నీ ఈ విధమైన మౌలికతాపరీక్షకు గుఱి కాగలవని కూడా ఆయన ఊహించి ఉండరు. సుజ్ఞాతమైన ఒకానొక శ్లోకానికి యథాయథంగా చేసిన అనువాదమే కందర్పకేతు విలాసంలో ఉన్నదనీ, భగ్నసమాధికమైన కుమారసంభవ పద్యమే దానికి అసమర్థానుకరణమనీ, అది ఏదో ఒకనాటికి బయటపడగలదనీ గుర్తించి ఉంటే ఆయన ఈ విమర్శప్రణాళికి దూరంగానే ఉండేవారు. తమ వ్యాసాలలో పెక్కుచోట్ల –

“కవితాభ్యాసకాలమునఁ బూర్వకవుల మనోహరపద్యముల మార్చి పుష్టిలేకున్న నట్లెయైన శబ్దవిన్యాసభేదమునఁ ద్రిప్పి రచించుట కవులకు శిక్షాపదము …ఇట్టివి కావ్యనిష్ఠితము లైనచో దూష్యములు.”

“భాషాంతరము నుండి… కొన్ని పద్యముల గ్రహించుట కవులకు న్యూనత.”

“భావనోద్బోధిత సంవిచ్చమత్కారశూన్యుండగు తెనాలికవి యర్థచౌర్యముఁ గావించె.”

“రెండవ పద్యమునఁ జతుర్థ పాదమును మార్పకుండుట సమస్యాపూరణ కౌశలప్రకాశనము కాఁబోలు.”

“ఈ యర్థాపహారము కవిత్వశిక్షాభ్యాసకాలమునఁ గాని రాజసభలలో విద్యావినోదకాలములోఁ జమత్కారముగాఁ గాని సంఘటిల్లును.”

“ఇట్టివి కేవలము చాటువులుగా నిలిచినచో క్షణకాలవిస్మయ మాపాదించుఁ గాని కావ్యనివేశితములైనచోఁ దప్పక తత్కవుల కసత్స్ఫాల్య శల్యభూతములై కీర్తిశరీరముల వేధించుచుండును.”

అని పరిపరి విధాల దుర్విమర్శ కావించే అవకాశమూ వారికి కలిగేది కాదు. నన్నెచోడుని పద్యంలోని భావమంతటినీ యథావస్థితంగా గ్రహించి రామలింగకవి దానిని పర్యాయపదకల్పనతో మఱుగు పుచ్చాడనేంత తీవ్రమైన వారి ఊహకు ఉపాధీ ఉండేది కాదు. రామలింగకవి పద్యం కావ్యకథావశాన నాయికా నాయక మనోవస్థావర్ణనకు సందర్భోచితంగా నివేశితమైన అనువాదకల్పమని; కుమారసంభవం లోని పద్యం కృతకమని; నన్నెచోడుడు అది మౌలికమైన రచన కాదని తెలియనందువల్ల రామలింగకవి పద్యానికి మూలం అనదగిన ఒక ప్రతీకను కల్పింపబోయి, అది సమర్థంగా కుదరనందువల్ల ఈ దురవస్థకు లోనయ్యాడని వారు అనుకొని ఉండరు. ఇంతకీ ఆ శ్లోకం – కాళిదాస కృతమని ప్రచారంలో ఉన్న సుప్రసిద్ధమైన శృంగార తిలకం లోని మొదటి శ్లోకమే.

బాహూ ద్వౌ చ మృణాల మాస్యకమలం లావణ్యలీలాజలం
శ్రోణీతీర్థశిలా చ నేత్రశఫరం ధమ్మిల్లశైవాలకమ్
కాన్తాయాః స్తనచక్రవాకయుగలం కన్దర్పబాణానలై
ర్దగ్ధానా మవగాహనాయ విధినా రమ్యం సరో నిర్మితమ్.

(బాహువులు రెండూ తామర తూండ్లు. ముఖం పద్మం. నీళ్ళు ఆమె శరీరపు లావణ్యప్రవాహం. పిరుదులు స్నానఘట్టాలు. కన్నులు చంచలములైన బేడిసలు. ముక్తావిభూషితమైన కేశబంధం నీటిపై తేలిన నాచు. చన్నుగవ చక్రవాక పక్షుల జంట. మన్మథుని బాణాగ్ని సోకి నిలువెల్లా దహించుకొనిపోతున్న ఆర్తులు తాపశాంతికై ఓలలాడేందుకు బ్రహ్మదేవుడు నిర్మించిన సరోవరం ఆమె.)

ఇందులో ‘విధినా రమ్యం సరో నిర్మితమ్’ అని చాటుసరణిలో స్వతఃపూర్ణంగా ఉన్న శ్లోకభావం తెలుగులో ‘ప్రాణేశ్వరీ జలజావాసము’ అన్న రూపణలో అంతర్భవించి, సన్నివేశాంతర్గతం అయినందువల్ల వ్యంగ్యార్థం మరింత రామణీయకతను సంతరించుకొన్నది. ‘కన్దర్పబాణానలైః దగ్ధానాం అవగాహనాయ’ అన్న నైమిత్తికార్థం ప్రకరణోచితమైనందువల్ల రామలింగకవి ‘…చొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అని దానిని తన కథానాయకుడైన కందర్పకేతుని మనోగతంగా అనువర్తించుకొన్నాడు. సర్వవిధాల సమర్థమైన అనువాదం చేశాడు.

మనోజాతానలం అంటే మనసులో రగులుకొన్న అగ్ని, మనోజాతుడు (మన్మథుడు) అనే అగ్ని అని రెండర్థాలు. నాయకుని సంగేచ్ఛారూపమైన ఆ మనోజాతానలానికి ప్రాణేశ్వరిని అతిశయకారిణిగా చెప్పటం కవి చిత్రకర్మకౌశలం. ప్రాణేశ్వరి అన్న పదాన్ని ఎంతో సార్థకంగా వాడుకొన్నాడు. కందర్పకేతుని ప్రాణాలను – ఇంద్రియాలను అధిష్ఠించి ఉన్న ఈశ్వరి ఆమె. ‘ప్రాణో హృన్మారుతే’ అని మేదిని కోశం. అతనిలో మనోజాతానలం రగుల్కొన్నప్పుడు ఆ అనలానికి ఉద్దీపకమైన అనిలం ఆమె. అందువల్ల మన్మథుడు అనే అగ్నికి ప్రాణేశ్వరి అనే ఆ వాయువు తోడు కాకుండా – అందుకు అసత్త్వాపాదకంగా – మన్మథానల నిర్వాపణస్థానమైన జలజావాసాన్ని రూపించటం హృద్యంగా ఉన్నది. శీలవతి అయిన కులపాలిక నాయిక కాబట్టి, ‘కులపాలికాయాః ప్రేక్షధ్వం యౌవన లావణ్య విభ్రమ విలాసాః, ప్రవసన్తీవ ప్రవసతే ఆగచ్ఛన్తీవ ప్రియే గృహ మాగతే’ అన్న వీరమిత్రోదయంలోని లక్షణానుసారం నాయకుడు ఎదుట లేని విరహోత్కంఠితకు వర్తించని, ‘లావణ్యలీలాజలం’ అన్న దళాన్ని మాత్రం కవి అనువాదంలో నుంచి తొలగించి వేశాడు. వాసవదత్తా విరహాదిరూపమైన ఆలంబన విభావం చేత, తత్సంస్మృతిరూపమైన ఉద్దీపన విభావం చేత ఔత్సుక్యాన్ని వ్యంజింపజేసి సంభోగశృంగారానికి మెరుగులు దిద్దాడు. ఆమె సమాగమం కోసం ఎదురు చూస్తున్న నాయకుని కోరికను నర్మంగా నిలిపి, ‘ఉద్గతచిత్తజాతరసవాఃపూరంబు’ అన్న విశేషణంతో నాయిక కూడా అత్యంతాభిలాషపరతంత్ర అన్న భావాన్ని సూచించి, ఆ వ్యంగ్యాతిశయాన్ని ఇనుమడింపజేశాడు.

శృంగార తిలకము: కాలనిర్ణయం

ఈ విధంగా కందర్పకేతు విలాసంలోని పద్యానికి మూలమైన శృంగార తిలకం సంస్కృతంలో కాళిదాస మహాకవి రచించినదని ప్రసిద్ధి ఉన్నా –- జాగ్రత్తగా పరిశీలిస్తే అది కాళిదాసు రచన కాదని, కాళిదాసు కాలం నాటి రచనమైనా కాదని, కనీసం స్వతంత్రకృతి అయినా కాదని, కాళిదాసు కాలం నాటికంటె ఆధునికులెవరో ప్రాప్తానుసారం కూర్చిన సంకలనం మాత్రమేననీ సులభంగానే తెలుస్తుంది. అట్లా కాక అది నిజంగా కాళిదాస మహాకవి రచించినదే అయితే, అందులోనుంచి క్రీ.శ. 10 – 13 శతాబ్దుల నాటి నన్నెచోడుడు ఒక శ్లోకాన్ని ముందుంచుకొని దానికొక అసమర్థానువాదాన్ని చేయగా, ఆ శ్లోకవిషయం తెలిసిన రామలింగకవి అందులోని దోషాలను సంస్కరించి, తానొక సరస నవీనానువాదం చేసి ఉండవచ్చును కదా? అన్న ఉత్థాపనీయసమస్యకు మనము సమాధానం చెప్పవలసి ఉంటుంది. శృంగార తిలక శ్లోకపు కాలనిర్ణయం స్పష్టమైతే, దానికి అనువాదం అయిన కందర్పకేతు విలాసం రచనాకాలమూ, నిర్ధారణకు వస్తుంది. ఈ వివాదంలో అనుచితోచితనిశ్చయానికి అవకాశం ఏర్పడుతుంది.

ఇంతకీ శృంగార తిలకం అంతగా విషయవిస్తృతి లేని, చాలా చిన్న పుస్తకం. మొత్తం ఉన్నవి ఇరవయ్యో ముప్ఫయ్యో శ్లోకాలు. ఆ కొద్దిపాటికే పాఠభేదాలు, సంగృహీతశ్లోకభేదాలు, అనేకం. వ్రాతప్రతులు, ముద్రిత ప్రతులు ఏవీ ఒక్క తీరున లేవు. ముద్రిత ప్రతులు ప్రధానంగా నాలుగు విధాలు:

  1. 1842లో యోహాన్ గిల్డెమైస్టర్ (Johann Gildemeister) జర్మనీలో అచ్చువేసిన ‘Kālidāsae Meghadūta et Çringāratilaka: ex recensione; additum est glossarium’(23 శ్లోకాలు).
  2. 1847లో హైబెర్లిన్ కలకత్తాలో ముద్రించిన కావ్యసంగ్రహం లోని పాఠం (21 శ్లోకాలు).
  3. 1888లో జీవానంద విద్యాసాగర సంకలిత కావ్యసంగ్రహంలో ఆయనదే, లఘువ్యాఖ్యతో కూడిన పాఠం (20 శ్లోకాలు).
  4. 1939లో నిర్ణయసాగర్ ప్రెస్సు వారి ప్రకాశన పాఠం (31 శ్లోకాలు).

తక్కిన ముద్రణలన్నీ ఈ నాలుగింటికి ఏదో ఒక విధాన అనుకృతులే. అయితే ఒకదాని లోని పాఠం వేరొకదానిలో కనబడదు. మొత్తం మీద 30 నుంచి 36 దాకా శ్లోకాలు వివిధ సంకలనాలలో ఉన్నాయి. కాకినాడ ‘ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక’లో (సం. 46: సంచిక 3) అచ్చయిన కాకరపర్తి కృష్ణశాస్త్రి అనువాదం తోడి శృంగార తిలకంలో 22 శ్లోకాలున్నాయి. దీనికి మూలమైన ప్రతి ఏదో శాస్త్రిగారు పేర్కొనలేదు.

శృంగార తిలకం అన్న పేరుతో సంస్కృతంలో దీనితో ఏ సంబంధం లేని కృతులు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో మన ‘శృంగార తిలకం’ లోని శ్లోకాలు లేవు. 16వ శతాబ్ది ఉత్తరార్ధంలో యాజ్ఞిక మహాకవి సంకలించిన సుభాషిత ముక్తావళి (భండార్కర్ ప్రాచ్యవిద్యా పరిశోధనాలయం లోని వ్రాతప్రతి సంఖ్య 92/1883-84) షష్ఠ శతకం 48వ పుటలో ‘శృఙ్గారతిలకో నామ గ్రన్థోయం గ్రథితో మయా, వ్యుత్పత్తయే నిషేవన్తే కవయః కామనిశ్చయమ్’ అని ఉదాహృతమైన ‘శృంగారతిలకమ్’ ప్రసిద్ధంగా లభిస్తున్న ఇప్పటి మన శృంగార తిలకం కాదు. కామశాస్త్రగ్రంథం కావచ్చును.

కావ్యమాల తృతీయ గుచ్ఛంలో ప్రకాశితమైన 13వ శతాబ్ది నాటి రుద్రభట్టు రచనమైన ‘శృంగార తిలకం’ ఇంకొకటి. 1886లో రిఛర్డ్ పిషెల్ (Richard Pischell) ఆలంకారిక శిరోమణి రుద్రటుని పేరిట అచ్చువేసిన Crngaratilaka and Ruyyaka’s Sahrdayalila రచన అదే. అందులోనూ, ‘శృఙ్గారతిలకో నామ గ్రన్థోయం రచితో మయా, వ్యుత్పత్తయే నిషేవతః కవయః కామినః స్వయమ్’ అని, పై శ్లోకం లాంటిదే శ్లోకం ఒకటున్నది కాని, అది ఆలంకారిక లక్షణగ్రంథం.

ఇవి గాక శ్రీ పరమేశ్వర యోగి రచన ‘శృంగార తిలకం’ ఒకటి పార్వతీ పరమేశ్వర సంవాదాత్మకమైన స్తోత్రకృతి పలుచోట్ల అచ్చయి దొరుకుతున్నదే.

ఇవన్నీ నామమాత్ర శృంగార తిలకాలు.

ఇంతకీ, ఈ శృంగార తిలకం కాళిదాస మహాకవి రచన అన్న అధ్యారోపణం కూడా అంత ప్రాక్తనకాలికం అనుకోనక్కరలేదు. ఆధునిక కాలంలో ఎవరో కల్పించినదే. సంస్కృతంలో ఛందోవ్యాకరణ లక్షణగ్రంథకర్తలు, ఆలంకారికులు, వ్యాఖ్యాతలు, కాళిదాసానంతరీయ కవులు, విమర్శకులు 19వ శతాబ్ది తొలిపాదం దాకా కాళిదాసు సాహిత్యాన్ని ప్రమాణీకరించిన సుమారు రెండున్నర వేల స్థలాలలో కనీసం ఒక్కటైనా దీనిలో నుంచి కాళిదాసు పేరిట ఉదాహరించిన శ్లోకం లేకపోవటం ఈ నిగమనానికి మొదటి కారణం. ఇందులోని శ్లోకాలూ, శ్లోకపాదాలూ వివిధ సంకలన గ్రంథాలలో వేర్వేరు కవుల పేర్ల చాటువులుగా గుర్తింపబడ్డాయే కాని, ప్రత్యేకించి — ఇది శృంగార తిలకం లోని శ్లోకం — అని ఏ ఒక్కరూ ప్రస్తావించి ఉండకపోవటం మరొక్క కారణం. తనకు నచ్చిన శ్లోకాలను తనకు తోచిన క్రమంలో కూర్చటమే తప్ప ఈ శృంగార తిలక సంధాత ఏ శ్లోకం ఎక్కడెక్కడ ఏ కవి పేరుతో ఉదాహరింపబడి ఉన్నదో చూసి యెరగడేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది. కొన్నింటిని మాత్రం వివరిస్తాను. శృంగార తిలకంలో ప్రసిద్ధమైన శ్లోకం ఇది:

ఆయాతా మధుయామినీ యది పునర్నాయాత ఏవ ప్రభుః
ప్రాణా యాన్తు విభావసౌ యది పునర్జన్మగ్రహం ప్రార్థయే
వ్యాధః కోకిలబన్ధనే హిమకరధ్వంసే చ రాహుగ్రహః
కన్దర్పే హరనేత్రదీధితి రహం ప్రాణేశ్వరే మన్మథః.

(వసంత మాసపు రాత్రి వచ్చింది కాని, వస్తానని మాట యిచ్చిన విభుడు మాత్రం రాలేదు. ఈ విరహాగ్నిలో నా ప్రాణాలు దహించికొని పోవటం తథ్యం. అప్పుడిక నాకు పునర్జన్మగ్రహానికై దైవాన్ని వేడుకొంటాను. మానవజన్మ అంటూ కలిగితే బోయవాడినై పుడతాను. మధుమాసవేళ నాకు విరహతాపాన్ని కలిగించిన కోయిలను బంధించివేస్తాను. ఒకవేళ గ్రహజన్మమే కలిగిందా, రాహుగ్రహాన్ని అవుతాను. హిమకరుణ్ణి ధ్వంసం చేస్తాను. కాదు, పరమశివుని కంటిలోని కాంతిశిఖనై జన్మిస్తాను. మన్మథుణ్ణి మసి చేస్తాను. లేక, మన్మథజన్మమే కలిగిందా, నన్ను ఇంత విరహవేదనకు గురిచేసిన నా ప్రాణేశ్వరునికి మన్మథబాధ అంటే ఏమిటో చూపిస్తాను. అందుకని, ఓ బ్రహ్మదేవా! నాకు మళ్ళీ జన్మను ప్రసాదించు.)

ఇది క్రీ.శ. 1205లో శ్రీధరదాసు సంధానించిన సదుక్తి కర్ణామృతంలో (శ్లో. 209) ఇంద్రశివునిదిగా ఉదాహరింపబడింది. అక్కడి పాఠం ఇది:

ఆయాతా మధుయామినీ విజయతే కాన్తప్రయాణోత్సవః
ప్రాణా యాన్తు యియాసవో యది పునర్జన్మగ్రహోభ్యర్థయే
వ్యాధః కోకిలబన్ధనే విధుపరిధ్వంసే చ రాహో ర్గణాః
కన్దర్పే హరనేత్రపావకకణా ప్రాణేశ్వరే మన్మథః.

ఇదే శ్లోకం బలదేవ ఉపాధ్యాయ కూర్చిన సూక్తిమంజరిలోనూ (శ్లో. 209) శ్రీధరదాసు పాఠంతో కనుపిస్తుంది. ఇటువంటిదే, మరొకటి:

ఇన్దీవరేణ నయనం ముఖ మమ్బుజేన
కున్దేన దన్త మధరం నవపల్లవేన
అఙ్గాని చమ్పకదలై స్స విధాయ వేధాః
కాన్తే! కథం ఘటితవా నుపలేన చేతః.

(ఓ కాంతా! ఆ విధాత నీ కన్నులను అందాలొలికే నల్ల కలువల కాంతులతో సృజించాడు. మోమును ఎఱ్ఱని తామర పువ్వు తళుకులతో మలిచాడు. పలువరుసను మల్లె మొగ్గల తెలికాంతులతో రూపొందించాడు. పెదవిని క్రొత్త చిగుళ్ళతో కల్పించాడు. సంపెంగ పువ్వు రేకులతో నీ తనువులోని అణువణువును నిర్మించాడు. ఇంతా చేసి, హృదయాన్ని మాత్రం ఎందుకో మరి, కఠినపాషాణంతో గండరించాడు.)

ఇది క్రీ.శ. 1450 నాటి వల్లభదేవుని సుభాషితావళిలో (శ్లో. 1610) ‘కస్యాపి’ అన్న శీర్షికతో కర్తృత్వనిర్దేశం లేకుండా ఉదాహృతమై ఉన్నది:

ఇన్దీవరేణ ముఖ మమ్బుజలోచనేన
కున్దేన దన్త మధరం నవపల్లవేన
అఙ్గాని చమ్పకదలై స్స విధాయ వేధాః
కాన్తే! కథం ఘటితవా నుపలేన చేతః.

ఇదే, ధనంజయుని దశరూపావలోకం కృతికి ధనికుడు కూర్చిన ‘వివృతి’లో (4-58) కొద్దిపాటి తేడాతో కనబడుతుంది:

ఇన్దీవరేణ ముఖ మమ్బుజలోచనేన
కున్దేన దన్త మధరం నవపల్లవేన
అఙ్గాని చమ్పకదలై స్స విధాయ వేధాః
కాన్తే! కథం రచితవా నుపలేన చేతః.

ఈ శ్లోకం ఇంకా గదాధర భట్టు సంకలించిన రసికజీవనంలోనూ (శ్లో. 915), సుభాషిత రత్నాకరం (శ్లో. 284), అల్లరాజు రసరత్నప్రదీపిక (శ్లో. 5-14) మొదలైన సంధాన గ్రంథాలలోనూ ఉన్నది.

శృంగార తిలకంలోని ‘కోప స్త్వయా హృది కృతో యది పఙ్కజాక్షి’ అన్న 28వ శ్లోకం క్రీ.శ. 11వ శతాబ్ది నాటి విద్యాధరుని సుభాషిత రత్నకోశంలో (శ్లో. 671) శతానందుని రచనగా ఉదాహరింపబడింది. ఔఫ్రెష్ట్ (Theodor Aufrecht) శతానందుడంటే రుద్రటునిగా పేరెన్నిక గన్న ఆలంకారికుడని ఊహించారు. విద్యాధరుని సుభాషిత రత్నకోశం పీఠికలో డి. డి. కోశాంబి, ఈ శతానందుడు క్రీ.శ. 9వ శతాబ్ది ఉత్తరార్ధంలో ఉండిన రామచరిత కర్త అభినందుని తండ్రి కావచ్చునని భావించారు. ఔఫ్రెష్ట్ గాని, కౌశాంబి కాని శృంగార తిలకంలో దీని ఉనికిని గుర్తించలేదు. యోహాన్ గిల్డెమైస్టర్ముద్రణ పాఠం ఇది:

కోప స్త్వయా హృది కృతో యది పఙ్కజాక్షి!
శోచామి య త్తవ కిమత్ర విరోధ మన్యత్
ఆశ్లేష మర్పయ మదర్పితపూర్వ ముచ్చై
రుచ్చైః సమర్పయ మదర్పితచుమ్బనం చ.

(ఎఱ్ఱని కలువ రేకుల కాంతుల వంటి కాంతులను విరజిమ్ముతున్న కన్నులతో వెలుగొందుతున్న కాంతా! నీకు మనస్సులో ఎందుకనో కోపం కలిగినట్లున్నది. నీతో విరోధించి, నిన్నింత బాధపెట్టినవారెవరో? అని నాకెంతో దుఃఖం కలుగుతున్నది. నా మీదే ఈ కోపమంతానూ అయితే ఇక చేసేదేముంటుంది? ఎన్నడూ అనుకోని విరోధమంటూ కలగనే కలిగింది. మునుపు నేను నిన్ను దగ్గరికి తీసికొని ఎంతో ప్రేమతో ఇచ్చిన నా కౌగిలింతను తిరిగి నాకిచ్చెయ్యి. ఎంత గట్టిగా ఎన్ని ముద్దులను పెట్టుకొన్నానో అంత గట్టిగానూ అప్పటి ఆ ముద్దులన్నిటినీ తిరిగి నాకు సమర్పించుకో.)

ఇదే, ఆంధ్రదేశపు ప్రతులలో లభిస్తున్న పాఠం:

కోప స్త్వయా హృది కృతో యది పఙ్కజాక్షి!
సోస్తు ప్రియ స్తవ కిమత్ర విధేయ మన్యత్
ఆశ్లేష మర్పయ మదర్పితపూర్వ ముచ్చై
ర్దన్తక్షతం మమ సమర్పయ చుమ్బనం చ.

పై విమర్శకులెవరూ గుర్తింపని మరొక ముఖ్యవిషయం ఏమిటంటే – అమరుకుని అమరు శతకంలో ఈ శ్లోకం కొద్దిపాటి పాఠభేదంతో ఉన్నది!

కోప స్త్వయా హృది కృతో యది పఙ్కజాక్షి!
సోస్తు ప్రియ స్తవ కిమత్ర విధేయ మన్యత్
ఆశ్లేష మర్పయ మదర్పితపూర్వ ముచ్చై
ర్మహ్యం సమర్పయ మదర్పితచుమ్బనం చ.


మరొక విశేషమేమిటంటే — ఇది అమరుక కావ్యానికి లభిస్తున్న అన్ని ప్రాంతాల ప్రతులలోనూ లేదు. అమరుకానికి పెదకోమటి వేమభూపాలుడు, అర్జునవర్మదేవుడు, కోకసంభవుడు, రామానందనాథుడు మొదలైనవారు రచించిన వ్యాఖ్యలలో కాని, ఇతర ప్రసిద్ధ లఘుటీకలలో గాని లేదు. కేవలం రవిచంద్రుడు, రామరుద్రుడు కూర్చిన వ్యాఖ్యానప్రతులలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ రవిచంద్రుడు క్రీ.శ. 1290-1332ల మధ్య పరిపాలించిన రుద్రమదేవ కుమారునికి తర్వాత, పెదకోమటి వేమభూపాలునికి (క్రీ.శ. 1403-1420 పరిపాలన కాలం) సమీపానంతర కాలంలో ఉండినవాడని భావిస్తే, ఆ కాలానికింకా శృంగార తిలకం సంకలితం కాలేదని కాని, రవిచంద్రునికి ఇది ఇతర సంకలనాలలో ఉన్న విషయం తెలియదని కాని — అంగీకరింపవలసి ఉంటుంది. రామరుద్రుడు రవిచంద్రునికి తర్వాతివాడు కాబట్టి రవిచంద్రుని వ్యాఖ్యనుంచే ఈ శ్లోకాన్ని తన సంకలనంలో చేర్చుకొన్నాడని ఊహింపగలము. రవిచంద్రుడు తన వ్యాఖ్యలో ఈ శ్లోకంలోని నాయికను ‘మధ్యమా చతుర’ అన్నాడు. రామరుద్రుడు ఆ వ్యాఖ్యానపంక్తులనే అనుసరించి, ‘మధ్యమా మానవతీ చతుర’ అని మరికొంత విశ్లేషించాడు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు అచ్చయితే కాలనిర్ణయానికి పనికివచ్చే మరికొన్ని విశేషాలు తెలుస్తాయి. మొత్తానికిది తెలుగుదేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న శ్లోకమన్నమాట.

శృంగార తిలకంలో అన్నీ ఇటువంటి సమాంతరాలే కనబడతాయి. ఇందులోని ‘కస్తూరీవరపత్రభఙ్గనికరో మృష్టో న గణ్డస్థలే’ అన్న శ్లోకం ఆనందధరుడు రచించిన మాధవానలాఖ్యానంలో కనబడుతుంది. రెండింటి పాఠమూ ఒక్కటే.

కస్తూరీవరపత్రభఙ్గనికరో మృష్టో న గణ్డస్థలే
నో లుప్తం సఖి! చన్దనం స్తనతటే ధౌతం న నేత్రాఞ్జనమ్
రాగో న స్ఖలిత స్తవాధరపుటే తామ్బూలసంవర్ధితః
కిం రుష్టాసి? గజేన్ద్రగమనే కిం వా శిశు స్తే పతిః.

(గజేంద్రగమనంతో అడుగులో అడుగు వేసుకొంటూ ఆలోచనలో మునిగి నెమ్మది నెమ్మదిగా నడక సాగిస్తూ వస్తున్నావేమిటి, ఓ చెలీ! కస్తూరితో నీ చెక్కిళ్ళకు దిద్దుకొన్న మకరాంకరేఖలు చెక్కుచెదిరినట్లే లేవు. పాలిండ్ల పైని అద్దుకొన్న చందనం పెట్లినట్లయినా కనబడటం లేదు. కళ్ళకు కాటుక కరిగినట్లు కనబడదు. పెదవులకు రాసుకొన్న లత్తుక చెదరి ఒకరొకరికి తాంబూలరాగం అంటినట్లు లేదే. రాత్రంతా ప్రణయకలహాలతో గడిచిందా ఏమిటి? ఒక్కటడుగుతాను: మీ ఆయన మరీ అంత అర్భకుడా?)

కథానాయకుడు మాధవానలుడు రూపాజీవ కామకందళతో సమయోచిత ప్రాస్తావిక శ్లోకరత్నావళిని ప్రసంగవశాన ఉదాహరించే విద్యాస్పర్ధలో అక్కడ దీనికి ప్రవేశం కలిగింది. మాధవానలాఖ్యానంలో ఈ శ్లోకసంఖ్య 91వది. మాడభూషి కృష్ణమాచార్యులు ఈ ఆనందధరుడు క్రీ.శ. 10వ శతాబ్దికి పూర్వుడని ఊహించారు.

ఆనందధరుడి మాధవానలాఖ్యానమే దొరికిందో, క్రీస్తుశకం 1420 నాటికే శృంగార తిలకం ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్నదో కాని, భావనిర్భరమైన ఈ శ్లోకం శ్రీనాథునికి ఎక్కడో దొరికినట్లున్నది. వ్యంగ్యానికి మరింత పదునుపెట్టి, ప్రసక్తాన్ని కొంత జారిణీ వర్తనగా మార్చి, దానిని ఇద్దరు చెలుల సంభాషణగా మలిచి, చాటువుగా చెప్పాడు. విమర్శకలోకం ఇది అనువాదమని గుర్తింపలేదని శ్రీనాథుని పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను:

చ. సరసుఁడు గాఁడొ, జాణ! రతిసంపద లేదొ? సమృద్ధి! రూపమో?
       మరుని జయించు! మోహ? మసమానమె! యిన్నియుఁ గల్గి జారవై
       తిరిగెద వేల, బాల? యతిధీరవు, ప్రౌఢవు, నీ వెఱుంగవే,
       నెఱి ‘గృహమేధి’ యన్ పలుకు నీచము దోఁచెఁ, గొఱంతదే సుమీ.

శృంగార తిలకం లోని –

ఝటితి ప్రవిశ గేహే మా బహి స్తిష్ఠ కాన్తే
గ్రహణసమయవేలా వర్తతే శీతరశ్మేః
తవ ముఖ మకలఙ్కం వీక్ష్య నూనం స రాహు
ర్గ్రసతి తవ ముఖేన్దుం పూర్ణచన్ద్రం విహాయ.

(ఓ కాంతా! ఉన్న పళాన లోపలికి రా. బయటలా కూర్చోకు. చందమామకు గ్రహణం పట్టే వేళ ముంచుకొని వస్తున్నది. ఆ పాడు రాహువున్నాడే, మచ్చలేని నీ ముఖచంద్రుణ్ణి చూశాడంటే తప్పకుండా వాడు ఆ పున్నమి చంద్రుణ్ణి వదిలి నిన్ను మింగాలని మీదికి వస్తాడు, సుమీ.)

అన్న శ్లోకం ఆనందధరుని మాధవానలాఖ్యానంలో –

ఝటితి విశ గృహం త్వం మా బహి స్తిష్ఠ కాన్తే
గ్రసనసమయవేలా వర్తతే శీతరశ్మేః
తవ ముఖ మకలఙ్కం వీక్ష్య నూనం స రాహు
ర్గ్రసతి తవ ముఖేన్దుం చన్ద్రబిమ్బం విహాయ.

అన్న సమంజసమైన పాఠంతో (శ్లో. 105) సుపరిష్కృతంగా కనబడుతుంది. ఇంకా, శృంగార తిలకం లోని

చన్ద్ర శ్చణ్డకరాయతే మృదుగతి ర్వార్తోపి వజ్రాయతే
మాల్యం సూచికులాయతే మలయజాలేపః స్ఫులిఙ్గాయతే
ఆలోక స్తిమిరాయతే విధివశాత్ ప్రాణోపి భారాయతే
హా, హన్త! ప్రమదావియోగసమయః కల్పాన్తకాలాయతే.

(ఓహోహో, చావు ముంచుక వచ్చినట్లే అనిపిస్తుంది. ఆహ్లాదాన్ని కూర్చే చంద్రుడు చండ్రనిప్పులను కురిపిస్తాడు. మంద మందంగా వీచే గాలి వజ్రపు తాకిడి వేడిగా ఒరిపిడి పెట్టి కోస్తున్నట్లు మంట పెడుతుంది. విచ్చిన పువ్వుల దండ కూడా సూదులతో గుచ్చినట్లుంటుంది. మంచి గంధపు పూత విస్ఫులింగాల లాగున వేడెక్కిస్తుంది. చూపానక చీకట్లు క్రమ్మినట్లవుతుంది. ఊపిరి పీల్చటం కూడా భారమనిపిస్తుంది. ప్రియురాలి వియోగవేళ దాపురించే సరికి ప్రళయం వచ్చి మీద పడ్డట్లే. అంతా విధి వ్రాత కాకపోతే, మరేమిటి.)

అన్నది ఆనందధరుని మాధవానలాఖ్యానంలోని 118వ శ్లోకం:

చన్ద్ర శ్చణ్డకరాయతే మృదుగతి ర్వార్తోపి వజ్రాయతే
మాల్యం సూచికులాయతే ప్రతిదినం భూషాపి శైలాయతే
ఆలోక స్తిమిరాయతే విధివశాత్ ప్రాణోపి భారాయతే
హా, హన్త! ప్రమదావియోగసమయః సంహారకాలాయతే.

విమర్శకులు, సాహిత్యచరిత్రకాథికులు, తత్తత్గ్రంథాల భూమికా రచయితలు గుర్తింపని విశేషాలు కాబట్టి ఇంత విపులంగా ఉదాహరింపవలసి వచ్చింది. నానావిధగ్రంథాలలో బహువిధాలుగా కనబడుతున్న మనోహరమైన శ్లోకనికరాన్ని తనకు నచ్చిన రీతిని శేఖరించి శృంగార తిలక సంధాత ఈ సంకలనాన్ని రూపొందించి ఉంటాడన్న ఊహకు ఇవన్నీ ఆధారాలు. ఆ సంధాకరణం తెనాలి రామలింగకవికి కొంతకాలం మునుపే జరిగినదన్న వినిశ్చయానికి ప్రాగ్వచనికలు. శృంగార తిలకం లోనిదే,

అపూర్వో దృశ్యతే వహ్నిః కామిన్యాః స్తనమణ్డలే
దూరతో దహతే గాత్రం హృది లగ్నస్తు శీతలః.

(ఇంతకు మునుపెన్నడూ ఎరుగని నిప్పేదో ఉన్నది, ఆ కామిని చనుకట్టులో. దూరాన ఉన్నప్పుడు నిలువెల్లా దహించి వేస్తుంది. గుండెలకు హత్తుకొన్నప్పుడు మాత్రం చల్లదనం గిలిగింతలు పెడుతుంది.)

అన్న శ్లోకం సుభాషితార్ణవం (శ్లో. 15), శృంగారాలాపుని సుభాషిత ముక్తావళి (శ్లో. 1326) మొదలైన సంకలనాలలో కనబడుతుంది. ఇది ఒక్క కాకరపర్తి కృష్ణశాస్త్రి సేకరణలో మాత్రమే (శ్లో. 18) ఉన్నది. శృంగార తిలకం తక్కిన ముద్రణలలో లేదు. వీరి సేకరణ లోనిదే,

కుసుమే కుసుమోత్పత్తిః శ్రూయతే న తు దృశ్యతే
బాలే! తవ ముఖామ్భోజే దృష్ట మిన్దీవరద్వయమ్.

(పువ్వులో నుంచి పువ్వులు పుట్టినట్లు వినడమే కానీ కనడం ఎరుగము కదా, అంటే – సమస్యను కవి పూరించాడట – ఓ అమ్మాయీ! నీ ముఖమనే తామర పువ్వులో నల్ల కలువల జంట కనబడుతోంది కదా, అని.) అన్న 20వ శ్లోకం శృంగార తిలకం ఇతర ముద్రణలలో లేకపోయినా, వల్లభదేవుని సుభాషితావళిలో ‘కస్యాపి’ అన్న శీర్షికతో (శ్లో. 1495) కర్తృత్వనిర్దేశవిరహితంగా ఉదాహరింపబడింది.

సాయణాచార్యుల సుభాషిత సుధానిధిలో ఇదే,

కమలే కమలోత్పత్తిః శ్రూయతే న తు దృశ్యతే
బాలే! తవ ముఖామ్భోజే దృష్ట మిన్దీవరద్వయమ్.

అని కొద్దిపాటి మార్పుతో ఉన్నది. భోజ-కాళిదాస కథలు ప్రచారం లోకి వచ్చిన తర్వాత, ఇందులో కాళిదాసు చాటువుగా ప్రసిద్ధికెక్కిన ఈ శ్లోకం ఉన్నందువల్ల ఈ లఘుసంకలనానికి కూడా కాళిదాస కృతిగా పేరు వచ్చి ఉండాలి. కాళిదాసకృతులతో పరిచయం ఉన్నవారికి కలికానికైనా కానరాని అశ్లీలపు నీచశృంగారం, అసభ్యవర్ణనలు దీనిలో అనేకం ఉన్నాయి. సంధాత వంగదేశీయుడని సూచించే ఒకటి రెండు ఆధారాలు కూడా లేకపోలేదు. ఇందులోని ‘ఖంజన’ పక్షిని (‘ఏకో హి ఖఞ్జనవరో నలినీదలస్థో దృష్టః [స్పృష్టః?] కరోతి చతురఙ్గబలాధిపత్యమ్’) కాళిదాసు తన కృతులలో వర్ణింపలేదు. ఈ శ్లోకంలోని ‘చతురంగబలాధిపత్యం’ కూడా దీని ఆధునికతకు ఉపోద్బలకమే. ‘స గుప్తమూలప్రత్యన్తః శుద్ధపార్ష్ణిరయాన్వితః, షడ్విధం బాల మాదాయ ప్రతస్థే దిగ్విజిగీషయా’ అని రఘువంశం (4-26). కాళిదాసు కాలం నాటికి 1. మౌలకులు (తండ్రి తాతల నాటినుంచి దాసులుగా ఉన్నవాళ్ళు); 2. భృత్యులు (జీతం ఇచ్చి పెట్టుకొన్న పనివాళ్ళు); 3. సుహృదులు (మిత్రవర్గపు సైన్యాలు); 4. శ్రేణులు (యుద్ధం నిమిత్తం కొంత మొత్తాన్ని చెల్లించి నియమించిన యోధగణాలు); 5. ద్విడ్గణాలు (శత్రువర్గంలో అస్మదీయులు); 6. ఆటవికులు (అడవులలోని వీరులు) అన్న షడ్విధబలాలే గాని రథ గజ తురగ పదాతులన్న చతురంగబలాల వర్ణనలు కనబడవు. శృంగార తిలకం కాళిదాస కాలికం కాదన్న నిశ్చయానికి ఇది ముఖ్యమైన ఆధారం.

కాళిదాస వాఙ్మయంలో లేని ‘పత్రభంగ’ శబ్దప్రయోగం (‘కస్తూరీవరపత్రభఙ్గనికరో’) ఈ సంకలనం భట్ట బాణుని కాలానికి తర్వాతిదని సూచిస్తున్నది. ‘ధమ్మిల్ల’ శబ్దం అప్పటికి వాడుకలో ఉన్నదే కాని, కాళిదాసు తన రచనలలో ప్రయోగించలేదు (‘ధమ్మిల్లశైవాలకమ్’). ‘దృష్ట్వా యాసాం నయనసుషమాం వఙ్గవారాఙ్గనానామ్’ అన్నచోట వంగదేశపు వారాంగనల ప్రసక్తి; ‘యేయే ఖఞ్జన మేక మేవ కమలే పశ్యన్తి’ మొదలైన చోట్ల వర్ణింపబడిన ఖంజన పక్షి ప్రస్తావన – మొదలైన వాటిని బట్టి, వంగదేశాభిమానం గల సంధాత ఎవరో క్రీ.శ. 14వ శతాబ్ది ప్రాంతంలో దీనిని కూర్పగా, ఆ తర్వాత కొంతకాలానికి ఇది కాళిదాసకృతిగా ప్రచారంలోకి వచ్చి ఉంటుందని ఒక భావన. ఇది కాళిదాసు శ్లోకం, అని గర్వంగా చెప్పదగిన శ్లోకం ఒకటీ లేదిందులో.

ఇంతకీ శృంగార తిలక సంధాత ఎవరు? హైడింబ వైదగ్ధ్యమ్ పేరిట భాస మహాకవి మధ్యమ వ్యాయోగ రూపకాన్ని సంక్షేపించి అద్భుతమైన రంగస్థలనాటికగా పునారచించిన టి. యస్. నారాయణశాస్త్రి, ప్రస్తావవశాన తత్పీఠికలో శృంగార తిలక సంధాత క్రీ.శ. 1397-1430 నాటి కోటిజిత్కవి అని ఊహించారు. ఈ కోటిజిత్కవికి అభినవకాళిదాసనే బిరుదున్నదట. అయితే, కాళిదాసు పేరిట వెలసిన ఋతుసంహారం, శ్యామలా దండకం, నవరత్నమాల, శ్రుతబోధచ్ఛందస్సు ఈ కోటిజిత్కవి రచించినవే అని; కోటిజిత్కవి కామకోటి పీఠానికి చెందిన మూక శంకరాచార్యుల వారి శిష్యుడని నారాయణశాస్త్రి వ్రాయటం వల్ల – ఒకదానికొకటి పొందుపడని ఎన్నో విషయాలను ఆయన కలగాపులగం చేసి ఆలోచించారన్నది స్పష్టం.

శృంగార తిలకం 15వ శతాబ్ది మొదటి పాదంలో కూర్పబడిన సంకలనగ్రంథం అన్నమాట కొంత వరకు సంభావ్యమే. కాదు, 15వ శతాబ్దికి పూర్వం దీని ఉనికిని రుజువు చేయగల నిర్ధారకసాధనం ఒక్కటీ లేదు. 1950లో కలకత్తా నుంచి వెలువడిన ‘మంజూషా’ పత్రిక (సంపుటి 4, సంచిక 9)లో వై. మహాలింగశాస్త్రి ‘శ్రీ కాలిదాస చరితమ్’ అనే తమ నాటికలో పుష్పబాణవిలాసం, శృంగార తిలకం వేరొక కాళిదాసు రచనమనే మాటను హాస్యోక్తిగా ఒక పాత్ర చేత చెప్పించారు. ఆ సంభాషణ ఇది:

శాణ్డిల్యః:- రఘువంశ నవమ సర్గే యమకక్రీడాయాం బాలిశ ఇవ సమాసక్తః కవిః కాలిదాసో న భవితు మర్హతీతి కేచిత్ తదుపక్రమాణాం సర్గాణాం కాలిదాసకృతిత్వే ప్రత్యవతిష్ఠన్తే, తత్ర కా భవతః ప్రతిపత్తిః?

కౌణ్డిన్యః:- యా ప్రతిపత్తిః? కావ్యత్రయం ప్రథమేన, నాటకత్రయం ద్వితీయేన, ఋతుసంహారం తృతీయేన, పుష్పబాణవిలాస శృఙ్గారతిలక నవరత్నమాలికాదికం చతుర్థేన, జ్యోతిర్విదాభరణం పఞ్చమేన, లమ్బోదర ప్రహసనం షష్ఠేన, శ్రుతబోధం సప్తమేన, నలోదయ మష్టమేన, అన్యదన్యచ్చ నవమేన, దశమేన వా కాలిదాసేన రచిత మాచక్షకాణేషు.

(ఉభౌ హసతః)

ఈ కర్తృత్వారోపితాల చమత్కారం సంగతటుంచి, అనేకులు రచించిన రచనలు కాళిదాసు పేరు మీద ప్రచారానికి వచ్చాయన్న విమర్శ ఇక్కడ గమనింపదగ్గది. సెట్టి లక్ష్మీనరసింహకవి పూర్వకవుల చాటువులు అన్న తమ పుస్తకంలో (పు. 74) ఈ పద్యాన్ని ఉదాహరించారు:

“సుదతీ! నీ కుచగిరు లిటుఁ
గదలివడం గూలినట్టి కారణ మేమే?”
“చెదరి గిరులైనఁ గూలవె
కదిసి వడిం గ్రిందఁ ద్రవ్వఁగాఁ జెలువుండా!”

ఇది ఎవరి చాటువో సెట్టి లక్ష్మీనరసింహకవి చెప్పలేదు. దేనికి అనువాదమో వారు ప్రయత్నించి చూచినట్లు లేదు కాని, దీనికి మూలం శృంగార తిలకంలో ఉన్నది:

కథ మేతత్ కుచద్వన్ద్వం పతితం తవ సున్దరి!
పశ్యాధఃఖననా న్మూఢ! పతన్తి గిరయోపి చ.

కవిగారు ఇది అనువాదమని గుర్తింపకపోయినా, యథాతథానువాదమని తెలుస్తూనే ఉన్నది. అంతే కాదు. తెనాలి రామలింగకవి రచించిన పరమ అశ్లీలకావ్యం శష్పవిజయము అవతారికాలోనూ దీనికొక అనుసరణ ఉన్నది. ఈ ఈ శష్పవిజయాన్ని రచించిన తెనాలి రామలింగకవి ‘తెనాలి వంశ పవిత్రార్య మల్లికార్జున తనూభవు’డైన మరొక రామలింగకవి. సుప్రసిద్ధ రామలింగకవి గార్లపాటి రామయ్య కుమారుడు, నియోగి బ్రాహ్మణుడు కాగా, ఈ రెండవ రామలింగకవి మల్లికార్జునుల వారి తనయుడు. విశ్వబ్రాహ్మణుడని ప్రతీతి. కొడాలి లక్ష్మీనారాయణ 1969లో ఈయన చరిత్రను విశ్వబ్రాహ్మణుడైన తెనాలి రామలింగని చరిత్రము అన్న పేరిట ప్రకటించారు. ప్రసిద్ధ రామలింగకవికి సమకాలికుడని, కృష్ణదేవరాయల కాలం నాటి హాస్యచాటువులలో అనేకం ఈయనవి కావచ్చునని కొందరంటారు. ప్రసిద్ధుడైన తెనాలి రామలింగకవి యావజ్జీవం శివకేశవభేదం లేని స్మార్తుడుగానే ఉన్నాడని, శైవాన్ని విడిచి వైష్ణవాన్ని అవలంబించిన మాట నమ్మదగినది కాదని, శైవసంప్రదాయాన్ని అభిమానించిన ఈ రెండవ తెనాలి రామలింగకవి కథలు వచ్చి కలవటం మూలాన వీరి చరిత్రంతా కలగాపులగం అయిందని ఒక నమ్మకం. ఈ కవి మరొక కృతి ధీరజనమనోవిరాజితము కూడా గతశతాబ్దంలో అచ్చయింది. ఇటీవల కపిలవాయి లింగమూర్తి విపులమైన పీఠికతో పరిష్కరించి ప్రకటించారు. ప్రసిద్ధ రామలింగకవికి సమకాలికుడని, కృష్ణదేవరాయల కాలం నాటి హాస్యచాటువులలో అనేకం ఈయనవి కావచ్చునని కొందరంటారు. ‘శష్పవిజయము’ కూడా గత శతాబ్దిలో అచ్చయింది. దాని అవతారికలో (1-4) శృంగార తిలక శ్లోకానికి అనువాదం అయిన పద్యం ఇది:

“బాలా! నీ చనుగొండలు
వాలుటకుం గారణంబు వచియింపు” – మనన్
“మూలమునఁ బట్టి త్రవ్వఁగఁ
గూలవె?” యనునట్టి రాధకున్ నుతిఁ జేతున్.

చిత్రమేమంటే, 15వ శతాబ్ది నాటికి శృంగార తిలకం బాగా ప్రచారంలో ఉండేదని, ఒకే కాలంలో ఒకే పేరు కల్గిన ఈ తెనాలి రామలింగకవులు ఇద్దరూ దీనిపట్ల ఆకర్షితులయ్యారని ఇందుమూలాన వెల్లడవుతున్నది.

ఇందాక పేర్కొన్న శృంగార తిలకంలోని ‘కస్తూరీవరపత్రభఙ్గనికరో’ అన్న శ్లోకాన్ని పోలిన శ్లోకం ఒకటి అమరు శతకంలో ఉన్నది. విమర్శకులెవరూ అధ్యయనింపని ఈ సామ్యాన్ని గురించి రెండు మాటలు:

శృంగార తిలక శ్లోకం:

కస్తూరీవరపత్రభఙ్గనికరో మృష్టో న గణ్డస్థలే
నో లుప్తం సఖి! చన్దనం స్తనతటే ధౌతం న నేత్రాఞ్జనమ్
రాగో న స్ఖలిత స్తవాధరపుటే తామ్బూలసంవర్ధితః
కిం రుష్టాసి? గజేన్ద్రగమనే కిం వా శిశు స్తే పతిః.

అమరు శతకంలోని 61వ శ్లోకం:

నిశ్శేషచ్యుతచన్దనం స్తనతటం నిర్మృష్టరాగోధరో
నేత్రే దూర మనఞ్జనం పులకితా తన్వీ తవేయం తనుః
మిథ్యావాదిని దూతి బాన్ధవజన స్యాజ్ఞాతపీడాగమే
వాపీం స్నాతు మితో గతాసి న పున స్తస్యాధమస్యాన్తికమ్.

స్నానార్థమై బావి దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్పి, నాయకుని తోడి సంగమచిహ్నాలతో తిరిగివచ్చిన దూతికను చూసి ప్రగల్భ అయిన నాయిక (ఈమె ‘స్వీయామధ్య’ అని వేమభూపాలుని వ్యాఖ్య) అంటున్న క్రోధనర్మోక్తిని అమరు శతకకర్త చిత్రింపగా – దానిని చదువుకొన్న కవి ఎవరో – పతిగృహం నుంచి సంభోగచిహ్నాలేవీ కనబడకపోగా, కనీసం అలంకారాలైనా చెక్కుచెదరకుండా వెలికివస్తున్న నాయికను చూసి ఆక్షేపిస్తూ పరిహాసోక్తులాడుతున్న సఖి వాక్యంగా పరివర్తించిన శ్లోకాన్ని శృంగార తిలక సంధాత ఎక్కడినుంచో పరిగ్రహించాడు. రెండింటిలోనూ – నిశ్శేషచ్యుతచన్దనం స్తనతటే, నో లుప్తం, చన్దనం స్తనతటే, నిర్మృష్టరాగోధరో, రాగో న స్ఖలిత స్తవాధరపుటే, నేత్రే దూర మనఞ్జనం, ధౌతం న నేత్రాఞ్జనం, వంటి దళాలు ఆ అనుసృతిని స్పష్టంగా పట్టియిస్తున్నాయి.

అమరు శతక శ్లోకానికి క్రీ.శ. 1550-55 నాటి తాళ్ళపాక తిరువేంగళ దీక్షితుని అనువాదం (ప. 61) ఇది:

చ. స్తనతటి గంధమంతయును జాఱెఁ; గడుం బరిమృష్టరాగ మా
       యె నధర; మక్షికోణముల నెంతయుఁ గాటుకలేదు;డస్సి మే
       నును బులకించె; నిట్లు – చెలి నొప్పి యెఱుంగక బావిఁ గ్రుంకిడం
       జనితివి దూతి! విభుని సన్నిధి కేఁగవ సత్యవాదినీ!

(వక్షఃస్థలాన గంధమంతా జారిపోయింది. లత్తుక కరిగి క్రింది పెదవి తెల్లబడింది. కంటికొసల్లో కాటుక మెఱుపులు లేవు. బాగా అలిసినప్పటికీ మేనంతా గగుర్పొడిచి ఉన్నావు, చూడు. నీ చెలినైన నా బాధ సంగతి తెలియక బావిలో మునిగేందుకు వెళ్ళావు కాని, నాథుని కలుసుకొనేందుకు కాదు, కదూ!)

మూలంలో ‘మిథ్యావాదిని!’ అని ఉన్న నిందాత్మకతను సంస్కరించి తెలుగులో దీక్షితకవి ‘విభుని సన్నిధి కేఁగవ సత్యవాదినీ!’ (విభుని సన్నిధికి ఏగవా, ఓ సత్యవాదినీ) అన్న వ్యాజస్తుతి గానూ; ‘విభుని సన్నిధి కేఁగ వసత్యవాదినీ!’ (విభుని సన్నిధికి ఏగవు = నాథుడి దగ్గరకు వెళ్ళలేదని అంటున్నావు కదూ, ఓ అసత్యవాదినీ) అని మూలానుసారం అనిష్టాన్ని సూచించే సంబుద్ధి గానూ రెండర్థాలను సాధించి నాయికా మనోగతానికి మరింతగా మెరుగుదిద్దాడు.

అమరు శతకాన్ని బట్టి వెలసి, శృంగార తిలకం లోనికి చేరిన ఈ శ్లోకం తనకు నచ్చినందువల్ల తెనాలి రామలింగకవి అందులోని ‘కస్తూరీవరపత్రభఙ్గనికరో మృష్టో న గణ్డస్థలే’ అన్న పాదాన్ని పునఃపర్యావర్తించి, కందర్పకేతు విలాసానికి రెండు దశాబ్దాల మునుపే రచించిన తన ఉద్భటారాధ్య చరిత్రలో (1-199) దీనిని వాడుకొన్నాడు:

చ. చతురాశావధికుంభికుంభవిలుఠచ్ఛాతప్రతాపాంకుశుం
       డతఁ డంభోనిధివేష్టితాఖిలమహీయఃక్షోణిఁ బాలింపఁ ద
       త్ప్రతివీరప్రమదాకపోలతలముల్ ప్రాపించుఁ గస్తూరికా
       యతనానావిధపత్రభంగముల మాఱై స్రస్తకేశచ్ఛటల్.

(నాలుగు దిక్కుల కొసలలో ఉన్న దిగ్గజాల కుంభస్థలాలను చీల్చివేసే బంగారు అంకుశం వలె ఒప్పారుతూ, తేరి చూడరాని మహాపరాక్రమం కలిగిన ఆ రాజు సాగరపర్యంతమైన ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుండగా ఆతని శత్రుకాంతల చెక్కిళ్ళపై కస్తూరితో దిద్దిన రకరకాల పత్రభంగరేఖలకు మారుగా కొప్పునుంచి విడివడిన కేశాలే కమ్ముకొని కానవస్తాయి.)

మూలంలో పతిగృహం నుంచి వెలికివస్తున్న నాయిక చెక్కిళ్ళపై కస్తూరితో చిత్రించిన పత్రభంగాలు చెక్కుచెదరలేదని మాత్రమే ఉండగా, మన కవి విడజారిన కేశపాశాలతో దయనీయంగా కానవస్తున్న పరాజిత రిపుకాంతల దుఃస్థితికి అనువర్తనీయంగా దానిని పరివర్తించాడు. ఇదే క్రమంలో శృంగార తిలకంలోని ‘బాహూ ద్వౌ మృణాల మాస్యకమలం’ అన్న శ్లోకాన్ని కందర్పకేతు విలాసంలో ప్రస్తుతీకరించుకొన్నాడు.

ఇంతకీ, ‘బాహూ ద్వౌ చ మృణాళ మాస్యకమలం’ అన్న శ్లోకం శృంగార తిలకం లోనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా బయల్పడలేదు. ఇప్పటి వరకు క్రీ.శ. 15వ శతాబ్దికి పూర్వం దాని స్థితి వివరాలు తెలియరాలేదు. అదికూడా తెలిస్తే నన్నెచోడుని కాలనిర్ణయానికి ఇంకా బలమైన ఆధారం లభించినట్లవుతుంది.

మొత్తానికి తనకొక అర్ధశతాబ్ది ముందుకాలంలో వెలసి, తన కాలానికి ప్రసిద్ధమై ఉన్న శృంగార తిలకం నుంచి తెనాలి రామలింగకవి ఒక శ్లోకాన్ని ఉద్భటారాధ్య చరిత్రములోనూ, ఒక శ్లోకాన్ని కందర్పకేతు విలాసము లోనూ అనువదించుకోవటం సందర్భోచితంగానే ఉన్నది. తనకు తర్వాత వెలసిన ఒకానొక సంకలన గ్రంథంలోని శ్లోకాన్ని తీసుకొని నన్నెచోడుడు దానికొక అసమంజసమైన అనువాదాన్ని చేయగా, దానిని ‘భావనోద్బోధిత సంవిచ్చమత్కార శూన్యు’డైన రామలింగకవి సంస్కరించాడన్న మిథ్యాపవాదం దీనివల్ల పరాస్తమవుతున్నది. నన్నెచోడునికి శృంగార తిలక, కందర్పకేతు విలాస శ్లోక – పద్యాల కంటె అన్యతమమైన మూలం ఒకటుంటే తప్ప – రామకృష్ణకవి చెప్పిన అర్థాపహారదోషం సూటిగా అతనికే సంక్రమిస్తున్నది.

మరొక ముఖ్యప్రమాణం

అంతే కాదు. తెనాలి రామలింగకవికి కాళిదాసకృతంగా ప్రచారంలో ఉన్న ఈ శృంగార తిలకం ఉపరి నిరూపిత కందర్పకేతు విలాసకావ్యరచనకు పూర్వమే సుపరిచితమని; అది ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమని; ఆయన రచించిన పద్యమే నన్నెచోడునికి మూలమని – నిరాక్షేపణీయంగా నిశ్చయించేందుకు ఆధారం మనకు ఆయన అంతకు ముందే రచించిన ఉద్భటారాధ్య చరిత్రలో ఇంకొకటి కనబడుతుంది.

వల్లకీ నగరం రాజు ప్రమథేశ్వరుడు. రాజ్యానికి వారసులు లేక తన కష్టార్జితం చిద్రుపలైపోతుందన్న దిగులుతో పుత్త్రసంతానం కోసం చింతిల్లుతుండగా ఒకరోజు కౌండిన్య మహర్షి వారింటికి వస్తాడు. వారాణసికి వెళ్ళి విశ్వేశ్వరుని దయను చూరగొనమని ఆదేశిస్తాడు. రాజు భార్యాసమేతంగా విశ్వేశ్వర స్వామి గుడికి వెళ్ళి, సంతతిని ప్రసాదింపమని భక్తిపూర్వకంగా ఈశ్వరుని వేడుకొంటాడు. ఆ సన్నివేశంలో రామలింగకవి ‘కామబాణము’ అనే ఈ దండకాన్ని రాజు నోట పలికించాడు:

కామబాణ దండకం (త – గ గణాలు)

“… విశ్వచక్షుర్భయాపాది యౌ నా శ్మశానంబు ధామంబుగాఁ జేసి యెవ్వారికిం దేరిచూడంగ రానట్టి దట్టంపు రూపంబు బ్రాపించియున్ ముక్తదుస్సంగుఁడై భక్తియుక్తాంగుఁడై కొల్చు ధీశాలికిన్ సౌమ్యవిస్ఫూర్తి వర్తింతు వార్తార్తిహారీ! పురారీ! విరూపాక్ష!

వక్షోజచక్రంబులం జారునేత్రాసితాబ్జంబులన్ వక్త్రపద్మంబునం గుంతలోత్తలశైవాలజాలంబునన్ బాహువల్లీమృణాళంబులన్ బంధురోష్ఠాచ్ఛబంధూకపుష్పచ్ఛటన్ మందహాసామృతస్యంద డిండీరసారంబునన్ నిమ్ననాభీశుభావర్తగర్తంబునన్ గోమలోచ్చైర్వళిచ్ఛేదవీచీసముల్లాససౌభాగ్యయోగంబునన్ నిత్యలక్ష్మీ నివాసోన్నతం బాస్ఫురత్సైకతాభ్యున్నతిం బాదకూర్మస్థితిం బేర్మి మత్తిల్ల నీహారశైలాత్మజాతాసరోజాకరంబున్ మహాకేళిహంసంబవై లో రిరంసాగతుల్ గ్రాలఁ గ్రీడించు ప్రోడం బ్రసూనేషుకోట్యర్బుదామందసందర్భధుర్యున్ నినుం గొల్చు పుణ్యుల్ విపశ్చిద్వరేణ్యుల్ గదా చూడఁ జూడాంచలస్యూతనీహారధామా! సుధాధామ…”

(శరణాగతుల ఆర్తిని తొలగించి అభయాన్ని ప్రసాదించే ఓ పరమేశ్వరా! త్రిపురాసురులను మట్టుపెట్టిన దేవా! విరూపాక్షా! లోకదృష్టికి భయావహమైన శ్మశానంలో కొలువు తీరి, ఎట్టివారికీ తేరిచూడరాని తేజోమయరూపుడవైన నీవు మోహబంధాలను విడచి భక్తితో నీకు సర్వసమర్పణ కావించిన ధీమంతునికి మాత్రం సౌమ్యమూర్తితో కానవస్తావు.

వక్షోజములనే చక్రవాకాలతో, అందమైన కన్నులనే తెల్లని కలువలతో, ముఖమనే పద్మంతో, శిరోజాలనే ఒత్తైన నాచుమొక్కలతో, బాహువులనే తామరతూండ్లతో, నిండైన పెదవులనే అచ్చపు మంకెనపువ్వులతో, చిరునవ్వులనే అమృతం చిందుతున్నట్లున్న తెల్లని తరగల నురగలతో, లోతైన బొడ్డు అనే శుభావహమైన సుడిగుండంతో, మీగాళ్ళు అనే తాబేళ్ళ ఉనికితో మత్తెక్కించే హిమాద్రిరాజతనయ పార్వతి అనే సరోవరాన్ని క్రీడాహంసవై చేరి నానావిధాల రమించే కోరిక ఈరిక లెత్తగా కోటిమంది మన్మథులను తలపుకు తెచ్చే మనోహరమూర్తిని నిన్ను ఆరాధించే పుణ్యాత్ములు కదా, మహాపండితులంటే! సిగలో తెలిమంచు వెలుగు రేకులను వెల్లివిరియింపజేస్తున్న చంద్రుని ఆభరణంగా అలంకరించుకొన్న స్వామీ!…)

ఇందులో రామలింగకవి మూలశ్లోకం లోని పదబంధాలను ఉన్నవున్నట్లు స్వీకరించటమే గాక రూపకాన్ని యథోచితంగా కొనసాగించి, భావచిత్రాన్ని పూర్తి చేయగలిగాడు. కందర్పకేతు విలాసంలో శ్లోకార్థాన్ని యాథాయథ్యంతో అనువదించాడు కాని, ఇందులో పదాలను సైతం అవే వాడుకొన్నాడు. మూడింటిని కలిపి చూస్తే ఈ ప్రణాళిక అర్థమవుతుంది:

శృంగార తిలకం ఉద్భటారాధ్య చరిత్ర కందర్పకేతు విలాసం
బాహూ ద్వౌ చ మృణాళం బాహువల్లీమృణాళంబులన్
శ్రోణీ (తీర్థశిలా) ఆస్ఫురత్సైకతాభ్యున్నతి ఉద్యత్కటీపులినంబు
నేత్ర (శఫరం) చారునేత్రాసితాబ్జంబులన్ నేత్రాసితోత్పలము
ధమ్మిల్లశైవాలకం కుంతలోత్తాలశైవాలజాలంబు నీలకచరోలంబంబు
స్తనచక్రవాకయుగలం వక్షోజచక్రంబులన్ ఉచ్చైఃస్తనకోకము

ఇక, శృంగార తిలకంలో ‘కన్దర్పబాణానలై ర్దగ్ధానా మవగాహనాయ రమ్యం సరో నిర్మితం’ అని ఉన్న వాక్యాన్ని రామలింగకవి ఉద్భటారాధ్య చరిత్రలో “… నీహారశైలాత్మజాతా సరోజాకరంబున్ మహాకేళిహంసంబవై లో రిరంసాగతుల్ గ్రాలఁ గ్రీడించు ప్రోడ…’ అని పార్వతీ పరమేశ్వరుల కేళీవిలాసానుగతం గానూ, కందర్పకేతు విలాసంలో, ‘ప్రాణేశ్వరీ, జలజావాసము చొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అని వాసవదత్తా కందర్పకేతుల రాగాతిశయవిద్యోతం గానూ శబ్దానువాదగుంఫనతో అనువదించి తన కల్పనాశిల్పాన్ని ప్రస్ఫుటింపజేశాడు.

నన్నెచోడుని రచన నిజానికి కందర్పకేతు విలాసానికంటె ఉద్భటారాధ్య చరిత్రకే సన్నిహితంగా ఉన్నా, మానవల్లి రామకృష్ణకవి ప్రబంధ రత్నాకరంలో పెదపాటి జగన్నాథకవి ఇచ్చిన ఉదాహరణాన్ని చూసి, ‘ప్రాణేశ్వరీ, జలజావాసము చొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అన్న నాల్గవ పాదం మూలాన రామలింగకవిపై కందర్పకేతు విలాస పద్యరచనలో అర్థచౌర్యాన్ని ఆరోపించినట్లు కనబడుతుంది.

కుమార సంభవంలో శృంగార తిలకంలో లేక, ఉద్భటారాధ్య చరిత్రలో మాత్రమే ఉన్న అతిరిక్తభావాలు కూడా వచ్చి చేరాయి. ఇవి యథామూలకమైన కందర్పకేతు విలాసంలో లేవు.

ఉద్భటారాధ్య చరిత్ర కందర్పకేతు విలాసం కుమారసంభవం
నిమ్ననాభీశుభావర్తగర్తంబు
కమనీయావర్తనాభి
బంధురోష్ఠాచ్ఛబంధూకపుష్పచ్ఛట
విలసద్బంధూకరక్తోష్ఠ

రామలింగకవి సాంప్రదాయిక స్త్రీ సాముద్రిక ప్రకరణ గ్రంథాలలోని ‘గమ్భీరా దక్షిణావర్తా నాభిః స్యా త్సుఖసమ్పదే’ (సంస్కృత కాశీఖండం), ‘గమ్భీరనాభీ యా నారీ సా భవే త్పురుషప్రియా’ (జగన్మోహనం లోనిదిగా వీరమిత్రోదయం) మొదలైన లక్షణజ్ఞానం కలవాడు కాబట్టి, ‘నిమ్ననాభీ శుభావర్త (శుభావర్త = కుడివైపుకు వంపు తిరిగి ఉన్న సుడిని కలిగిన) గర్తంబు (లోతైన పొక్కిలి)’ అని ప్రయోగింపగా, నన్నెచోడుడు దానిని ఉపేక్షించి, ‘కమనీయావర్తనాభి’ (కమనీయ = అందమైన అని ఒక అర్థం; కమనునికి = మన్మథునికి ఆవాసయోగ్యమైన – అని మరొక అర్థం) అని భావగర్భితంగా తన కవితాశక్తిని ప్రదర్శించాడు.

రామలింగకవి కావ్యాలు రెండింటిలోనూ విశేష్య విశేషణాల ప్రస్థితి సలక్షణంగా అన్వితార్థాభిధానంతో ఉండగా, నన్నెచోడుని రచనలో అది భగ్నప్రణాళికతో ఉన్న సంగతి ఇంతకు మునుపే స్పష్టీకరింపబడింది.

‘అలిధమ్మిల్ల’ పద్యంలో చోటుచేసుకొన్న అన్వయదోషానికి పరిహారార్థం కాబోలు, నన్నెచోడుడు కుమార సంభవం దశమాశ్వాసంలో అగ్నిదేవుడు సప్తర్షుల ధర్మపత్నుల వద్దకు హరవీర్యధూర్ధరుడై వచ్చినప్పటి సన్నివేశంలో (10-29) శరవణ సరసిని వర్ణిస్తూ ఈ పద్యాన్ని వ్రాశాడు:

సీ. లోలాంబుజాలముల్ నీలాలకములుగా
             బాలమృణాళముల్ కేలు గాఁగ
       దళితాంబుజాతంబు దెలిమోముగా
             నుత్పలములు విశాలనేత్రములు గాఁగ
       జక్కవ కవ నిండు చనుఁ గవగాఁ బులి
             నస్థల మురుజఘనంబు గాఁగ
       మొలచు లేఁదరఁగలు ముత్తరంగలు గాఁగ శో
             భిల్లు సుడి నిమ్ననాభి గాఁగ

గీ. నబ్జవనలక్ష్మి శంభువీర్యమునఁ గొడుకుఁ
      బడసి దివిజుల కీఁబూని పావకునకు
      నొలసి తన రూపు చూపున ట్లొప్పఁ దోఁచె
      శ్రీకరం బగు నా కమలాకరంబు.

ఇందులో మృణాళహస్త (బాల మృణాళముల్ కేలు గాఁగ), కమనీయావర్తనాభి (శోభిల్లు సుడి నిమ్ననాభి గాఁగ), కమలాస్య (దళితాంబుజాతంబు దెలిమోముగా) మొదలైన ద్విధాకృతులు కమలాకరానికీ, అబ్జవనలక్ష్మికీ విడివిడిగా అన్వయిస్తున్నందువల్ల కల్పన సర్వాంగశోభతో అలరారుతున్నది. రామలింగకవి పద్యాన్ని అనుకరించి దానికొక మూలాన్ని సృష్టింపబోయినందువల్ల అలిధమ్మిల్లేత్యాది పద్యరచనలో కవి తత్తరపాటుకు లోనయ్యాడు.

కూచిమంచి తిమ్మకవి రసికజన మనోభిరామము లోనూ ఈ పద్యకృతిని పోలిన దొకటున్నది. సన్నివేశం అమరకాంతల జలక్రీడావినోదం.

సీ. సమదరథాంగభాస్వరపయోధరయు
             సమీచీనపాఠీనలోచనయును
       శైవాలవల్లరీజాలధమ్మిల్లయు
             వికచనవీనారవిందముఖయు
       నతులగంభీరతరావర్తనాభియు
             రంగదుత్తుంగతరంగవళియు
       విలసన్మహోదగ్ర(?) పులిననితంబయు
             డిండీరదరహాసమండితయును

గీ. గంబుకంఠియుఁ గలహంసగామినియును
      రామకమిళిందమాలికారోమలతయు
      నగు సరోవరలక్ష్మి య య్యబ్జముఖుల
      కతులితామోద మొసఁగె న య్యవసరమున.

దీనికే భంగ్యంతరం ఆ కావ్యంలోనే ఋతధ్వజుని విరహవర్ణన సన్నివేశంలో ఉన్నది:

సీ. శైవాలధమ్మిల్ల చక్రవాకస్తని
             కలహంసగామిని పులినజఘన
       సారసవదన డిండీరాభదరహాస
             యావర్తనాభి కల్హారపాణి
       మధుకరరోమాళి మకరజంఘాలత
             కచ్ఛపచరణాగ్ర కంబుకంఠి
       వీచికావళి మీనలోచన కింజల్క
             జాలకరదన మృణాళబాహ

గీ. యగుచు సొగసూను దివిజకన్యావిలాస
      సరసి నోలాడ కింక దుస్తరతరాబ్జ
      శరశరాఘాత శిఖిశిఖాజాత జాత
      యాతనాభీతి యల్లఁ జల్లారఁ గలదె.

ఇది తెనాలి రామలింగకవి పద్యానికి యథాతథానుకరణమన్న సంగతి తెలుస్తూనే ఉన్నది. తిమ్మకవికి కందర్పకేతు విలాసం మూలమే లభ్యమయిందో లేక శ్రుతగోచరమైన పద్యాన్ని అభిమానించాడో చెప్పలేదు. ‘ప్రాణేశ్వరీ, జలజావాసము చొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అన్న చమత్కారకల్పనను ఉన్నదున్నట్లుగా –

…దివిజకన్యావిలాస
సరసి నోలాడ కింక దుస్తరతరాబ్జ
శరశరాఘాత శిఖిశిఖాజాత జాత
యాతనాభీతి యల్లఁ జల్లారఁ గలదె.

అని పర్యాయానువాదం చేశాడు. సుబంధుని వాసవదత్తా కథను మహాప్రభావశీలికావ్యంగా కన్నడీకరించిన శృంగార కవిసార్వభౌముడు నేమిచంద్రుడు కూడా తెనాలి రామలింగకవి లాగా శృంగార తిలక శ్లోకాన్ని అనుసరించక పోయినా, తన లీలావతీ ప్రబంధంలో కథానాయికను స్నాతవ్య పద్మసరోవరంగా నిరూపిస్తూ ఇటువంటి కల్పననే నిపుణంగా ప్రవేశపెట్టిన సంగతి గమనార్హం:

ఎళమీనంతిర్ప కణ్మెయ్గరెయద తెరెయం తప్ప తోళ్తుంబియంతి
ర్పళకం నీర్వక్కియంతి ర్పలఘుకుచభరం పద్మదంతిర్ప వక్త్రం
తిళినీరంతిర్ప తెళ్మెయ్వెళగు పొళెయె లావణ్యం మీలెయిం పూ
గొళనం పోల్తందు లీలావతిగె తరుణియ ర్మజ్జనం మాడుతిర్దర్. – లీలావతీ (12-54)

లసత్కాంతాస్వరూపం సొగసిన కొళనం పోలె. – లీలావతీ (13-28)

ఆత్మతనుతాపప్లోషశోషిత సతతావగాహమహాసరసిగళం. – లీలావతీ (13-70)

ప్లవదాస్యాబ్జంగళిం జంగమకమలచితం దోర్లతాజాలదిందం
ద్రవవీచీచ్ఛన్నమా కాంతెయర చికురభారంగళిందం భ్రమద్భృం
గవికీర్ణం కణ్గళిం శిక్షితకుముదవృతం వృత్తవక్షోజదిం దు
త్సవమానానేక కోకద్వయమయ మెనిసిత్తాంగళంభోజషండం. – లీలావతీ (13-121)

నేమిచంద్రుని రచనను చక్కగా చదువుకొన్న రామలింగకవి తన కాలానికి అప్పుడప్పుడే ప్రచారానికి వస్తున్న శృంగార తిలకంతో తనకు గల పరిచయాన్ని పురస్కరించుకొని సందర్భానుషక్తంగా ఈ పద్యాన్ని కందర్పకేతు విలాసంలో అనుఘటించాడు. కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధమూ, తెలుగులో తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసమూ రెండూ సంస్కృతంలో సుబంధు మహాకవి రచించిన వాసవదత్తా కథకు అనువాదాలే కనుక, పై కన్నడాంధ్రకావ్యాలలోని కల్పన పోలికను బట్టి కూడా ‘లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు’ అన్న పద్యం కందర్పకేతు విలాసం లోనిదే అని, మరేదో కావ్యం లోనిది కాదని నిశ్చయించటం భావ్యంగానే ఉంటుంది.

ఈ ప్రకారం తన్వంగి తనువును స్నాతవ్యసరోవరంగా నిరూపించటం లీలావతీ ప్రబంధ, శృంగార తిలక కావ్యాల సుపరిచయం మూలాన ఆభిమానికమై రామలింగకవి తన ఉద్భటారాధ్య చరిత్ర, కందర్పకేతు విలాసాలలోనే కాక, తదనంతరకాలంలో రచించిన పాండురంగ మాహాత్మ్యం లోనూ (5-270) దీని పౌనఃపున్యోక్తిని అయుత-నియుతుల కథాసన్నివేశంలో ప్రవేశపెట్టాడు. ఆ పద్యం ఇది:

సీ. లలితకుంతలశైవలము ముఖైందవబింబ
             మధరాధరప్రవాళాంకురంబు
       చపలస్వభావలోచనమహామీనంబు
             కమనీయకందరాకంబుకంబు
       గర్వితస్తనకనత్పర్వతాభోగంబు
             విశదత్రివళిభంగవిలసనంబు
       మధ్యవృత్తావర్తమహితంబు కటితటీ
             ద్వీపంబు పృథులోరుదివిజకరటి

గీ. కరము పదకూర్మపృథుకంబు కమ్రనఖర
      మణికలాపంబు నగుచు నే మగువ రూపు
      భూరిసౌభాగ్యసంపదఁ బోలుఁ దండ్రి
      నా సుధాంభోధిపుత్రి బాహాంతరమున.


వాధూల ముని వల్ల కలిగిన శాపానికి నిష్కృతి కోసం అయుతుడు పాండురంగక్షేత్రానికి వెళ్ళి అక్కడ వెలసిన విట్ఠల స్వామికి వాఙ్మయార్చనలిచ్చిన సన్నివేశం లోనిది ఈ పద్యం. అందమైన శిరోజములనే నాచుతీగెలు, ముఖమనే చంద్రబింబము, క్రింది పెదవి అనే పగడపు మొగ్గ, చాంచల్యశోభతో వెలుగొందే కన్నులనే చేపలు, శ్రుతిమనోహరమైన కంఠము అనే శంఖము, నిక్కించి ఉన్న స్తనములు అనే సమున్నతపర్వతాలు, ఉదరాన మూడు వళులు (ముడతలు) అనే తరగలు, పొక్కిలి అనే సుడిగుండము, కటిస్థలమనే ద్వీపమూ, ఊరువులనే ఏనుగు తొండాలు, మీగాళ్ళు అనే తాబేళ్ళు, నఖములు అనే మణివితానం కలిగి తండ్రి సౌభాగ్యమంతటిని పుణికి పుచ్చుకొన్నట్లున్న శ్రీదేవి పుండరీకాక్షుని చల్లని కౌగిలిలో పరవశించి ఉన్నదట. ఆ తల్లి క్షీరసముద్రరాజతనయ కాబట్టి స్వామి కౌగిట కొలువుతీరిన కలిమిచెలువకు సరఃస్థితాలైన ప్రకృతిద్రవ్యాలే భూరిసౌభాగ్యసంపదలుగా నిరూపింపబడటం మనోహరంగా ఉన్నది. శృంగార తిలకంలోని ‘నేత్రశఫరం’ అన్న రూపణమే ‘చపలస్వభావలోచనమహామీనంబు’ గా అనూదితమయింది. మూలంలోని ‘ధమ్మిల్లశైవాలకమ్’ – ‘లలితకుంతలశైవలము’; అలాగే, ‘శ్రోణీతీర్థశిలా’ – ‘కటితటీద్వీపంబు’ అన్నవి సమానార్థకాలు. ‘ఆస్యకమలం’ – ‘ముఖైందవబింబంబు’ అని; ‘స్తనచక్రవాకయుగలం’ – ‘గర్వితస్తన కనత్పర్వతాభోగంబు’ అని ప్రకృతోపయోగులుగా పరివర్తితమయ్యాయి. రూపకంలో విశేష్య విశేషణాల ప్రస్థితి ఉద్భటారాధ్య చరిత్ర, కందర్పకేతు విలాస కావ్యాలలో లాగానే సలక్షణంగా ఉన్నది.

రామలింగకవికి ఇంత ఆభిమానికమైన విశేషకల్పనను నన్నెచోడుడే అనుకరించి ఉండవచ్చునని; ‘భావనోద్బోధిత సంవిత్ చమత్కారశూన్యత’ ఆయనకే వర్తిస్తుందని నిశ్చయించటానికి ఇంతకంటె మరింత వివరణ అనవసరం.

అంతే కాదు. ‘బాహూ ద్వౌ చ మృణాళ మాస్యకమలం’ అని ఉన్న ఎత్తుగడను మార్చి, ‘లలితాస్యాంబురుహంబు’ అని చేసిన పద్యోపక్రమమే ధారణానుగతమైనందున రామలింగకవి ఆ తర్వాత చెప్పిన ఘటికాచల మాహాత్మ్యం (2-87) లోనూ దానిని ‘మగువ నెమ్మో మబ్జ మహిమచేఁ దనరారు’ అన్న రంభా సౌందర్యవర్ణనకు ఉపనయించుకొన్నాడు. అబ్జోపమానం వలన శరీరాంగాలన్నీ పద్మినీ పర్యాయాలతో ఉపమితాలు కాగా – ‘శతపత్రగంధి నిల్వంతయును సువర్ణ కమలా కలాభిరూప్యంబుఁ గాంచు’ అని ఆ కల్పనను సమర్థించుకొన్నాడు. ఉద్భటారాధ్య చరిత్రలోని పార్వతీ సౌభాగ్యవర్ణనమైన ‘పాదకూర్మస్థితిన్’ అన్నదే, పాండురంగ మాహాత్మ్యంలో ‘పదకూర్మపృథుకంబు’గా లక్ష్మీనిర్వర్ణనకు పునరావృత్తమయింది. ‘కోమలోచ్చైర్వళిచ్ఛేదవీచీ (=కెరటం) సముల్లాస సౌభాగ్యయోగంబునన్’ అన్నదే, ఇందులో ‘విశద త్రివళిభంగ (=ఊర్మి) విలసనంబు’గా రూపుదిద్దుకొంది. పాండురంగ మాహాత్మ్యం లోని లక్ష్మీసౌభాగ్యవర్ణన వేళ ఉద్భటారాధ్య చరిత్రలోని పార్వతీ సౌందర్యవర్ణన మనోగతమయిందని తెలుస్తూనే ఉన్నది. ఉద్భటారాధ్య చరిత్రలోని పార్వతీ సౌందర్యవర్ణనకూ శృంగార తిలకంలోని శ్లోకమే ఆధారమని వేరే విశదిమ అవసరం లేదు.

శృంగార తిలకంలోని శ్లోకానికి ఆశ్రయాశ్రయీభావం కలిగిన శ్లోకాలనేకం సంస్కృత వాఙ్మయంలో ఉన్నాయి కాని, అవేవీ రామలింగకవి అనువాదానికి పౌర్వపదికాలు కావు. నిదర్శనాభిలాషులకోసం – భర్తృహరి సుభాషిత శతకం లోని శ్లోకం ఒకటి:

ఉన్మీలత్త్రివళీతరఙ్గవలయా ప్రోత్తుఙ్గపీనస్తన
ద్వన్ద్వే నోద్యతచక్రవాకయుగలా వక్త్రామ్బుజోద్భాసినీ
కాన్తాకారధరా నదీయ మభితః క్రూరాశయా నేష్యతే
సంసారార్ణవమజ్జనం యది, తదా దూరేణ సన్త్యజ్యతామ్.(శ్లో. 49)

ఇందులో కవి అనర్థహేతుభూతమైన నదీత్వనిరూపణముఖంగా స్త్రీని పరిత్యజింపవలసిన కర్తవ్యకర్మను, ముముక్షువులు సంసారసముద్రంలో మునకవేయకుండా ఉండవలసిన ఆవశ్యకతను బోధిస్తున్నాడు. శృంగార తిలకంలోని శ్లోకకర్తకు కామినీగర్హణం అప్రసక్తం కనుక మన్మథబాణాగ్నిదగ్ధులకు మజ్జనార్థం నిర్మితమైన కాంతారూపసరస్సును ప్రశంసించాడు. ఉభయశ్లోకాలలోనూ స్తనచక్రవాకయుగలా – స్తనచక్రవాకయుగలం; వక్త్రామ్బుజ – ఆస్యకమలం, మొదలైన చోట్ల ఔపమ్యఘటనమూ, తుల్యశబ్దసంవేశమూ దర్శనీయాలు. ఇటువంటివి ఇంకా అనేకం ఉన్నాయి. అవి ప్రకృతోపయోగులు కావు.

ఇన్నిన్ని ప్రమాణాల మూలాన, రామలింగకవి పద్యం పద పదానువాద హేతూద్ధారం వల్ల — నన్నెచోడుని కుమార సంభవం కంటె సంస్కృత శృంగార తిలక శ్లోకానికే సన్నిహితంగా ఉన్నదని స్పష్టపడింది.

నిజానికి కుమార సంభవంలోని పద్యాన్ని సరిపోలిన పద్యం ఒకటి పోతన్న శ్రీ మహాభాగవతం దశమ స్కంధం పూర్వభాగంలో (10- 1745) రుక్మిణీ సౌందర్యవర్ణన సందర్భంలో వచ్చింది. రామకృష్ణకవి ప్రసక్తింపలేదు.

మ. అలినీలాలకఁ బూర్ణచంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధరం
       గలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభకుంభస్తనిం
       బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాతహస్తన్ మహో
       త్పలగంధిన్ మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ము లైరందఱున్.

ఇది కుమార సంభవంలోని పద్యం:

మ. అలిధమ్మిల్ల మృణాళహస్తఁ గమనీయావర్తనాభిన్ మహో
       త్పలగంధిం గలహంసయాన విలసద్బంధూకరక్తోష్ఠ ను
       త్పలనేత్రిం గమలాస్య నంగజరసాంభఃపూరఁ దత్పార్వతీ
       జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.

రెండింటి పోలిక స్పష్టమే కనుక విశేషించి వ్రాయటం లేదు.

ఈ విధంగా కుమార సంభవంలోని పద్యాన్ని అనుకరించి గ్రంథచౌర్యానికి పాల్పడ్డాడని తెనాలి రామలింగకవిపై మిథ్యాపహారదోషాన్ని ఆరోపించే తొందరపాటులో మానవల్లి రామకృష్ణకవి తమ ప్రణాళిక ఏకంగా కర్తృ-కాలనిర్ణయాలకే మూలచ్ఛేదనం కాగలదని ఊహింపలేకపోయారు. ఈ రెండు పద్యాల తారతమ్య పరిశీలన కావించేవారికి – ఇందులో నన్నెచోడుని రచనను తెనాలి రామలింగకవి సంస్కరించే ప్రయత్నం ఏ మాత్రం జరగలేదని; సర్వాంగసుందరమైన రామలింగకవి పద్యానికి మూలాన్ని కల్పింపబోయిన కుమారసంభవ కర్తకే ఆ యత్నంలో తడబాటు కలిగిందని, అర్థాపహారదోషం అతనికే సంక్రమిస్తుందని – నమ్మకం కలిగితీరుతుంది.

ఠిఅ మట్టిఅం వ దీసఇ అఠిఅం
పి పరిట్ఠిఅం వ పడిహాఇ
జహసంఠిఅం చ దీసఇ
సుకఈణ ఇమా ఓ పయఈఓ.

అని ఆనందవర్ధనుని ధ్వన్యాలోకం.

ఉన్నది లేనట్లుగానూ (ఠిఅ మట్టిఅం వ దీసఇ = స్థిత మస్థితమివ దృశ్యతే), లేనివి ఉన్నట్లుగానూ (అఠిఅంపి పరిట్ఠిఅం వ పడిహాఇ = అస్థిత మపి పరిష్ఠితమివ ప్రతిభాతి), ఒక్కొక్కప్పుడు ఉన్నదున్నట్లుగానూ (జహసంఠిఅం చ దీసఇ = యథాసంస్థితం చ దృశ్యతే) సత్కవుల ప్రకృతులను బట్టి (సుకఈణ ఇమా ఓ పయఈఓ = సుకవీనా మేతా పదవ్యః) వారివారి సరస్వతీతత్త్వం లోకానికి వెల్లడవుతూనే ఉంటుంది.

అంతే కదా, మరి!


ఉపయుజ్య గ్రంథావళి: కొన్ని ఆలోచనలు

  1. మానవల్లి రామకృష్ణకవి (పరిష్కర్త), కుమార సంభవము (నన్నెచోడ మహాకవి విరచితము), చెన్నపురి, ప్రథమ భాగము 1909, రెండవ భాగము 1914.

    ఇది రెండు భాగాలుగా అచ్చయింది కాని, మానవల్లి వారు ఒక్కొక్కభాగంలోని ప్రతినీ ఒకే కాలంలో మళ్ళీ విడివిడిగా రెండు విధాలైన వేర్వేరు పాఠాలతో ముద్రించినట్లు కనబడుతుంది. 1909 లోని ప్రతికి రెండు రకాల రూపాంతరాలు, 1914 లోని ప్రచురణ ప్రతికి రెండు రకాల రూపాంతరాలు ఉన్నాయన్నమాట. మానవల్లి వారు ఆ విధమైన ప్రతుల సందిగ్ధతను స్వయంగా ఎందుకు కల్పించారో మనకిప్పుడు తెలియదు. ఏ ఒక్క ప్రతిలోనూ దాని రెండవ ప్రతిలోని పాఠాలను గురించిన ప్రసక్తి కనబడదు. నా దగ్గరున్న మానవల్లి వారి 1909 నాటి ప్రతిలోని పాఠాలు ఆ తర్వాత వావిళ్ళ వారు 1949, 1953, 1961, 1969లలో ముద్రించిన తీరున లేవు. వావిళ్ళ వారి ప్రతిలో బండారు తమ్మయ్య గారు కూర్చిన కొన్ని పాఠభేదాలను ఇచ్చారు. తమ్మయ్య గారు ఆ పాఠాలను ఎక్కడి నుంచి గ్రహించారో ఇప్పుడు తెలియటం లేదు. బండారు వారు చూపిన కొన్ని పాఠాలు తంజావూరులోని వ్రాతప్రతిలో ఆ ప్రకారంగా లేవు. నా దగ్గరున్నది మానవల్లి వారు ముద్రించిన మూడవ ప్రతి కావచ్చునేమో? అని సందేహం కలిగి, కొంత పరిశీలించాక – ఏ సంగతీ ఇదమిత్థంగా నిశ్చయించటం నాకు సాధ్యం కాలేదు. దేశంలో దొరుకుతున్న మానవల్లి వారి కుమారసంభవం వీలయినన్ని అచ్చు ప్రతులను సంపాదించి, వాటన్నిటిని తైపారువేసి చూస్తేనే కాని పరిశీలకులకు ఈ ముద్రణవిషయరహస్యం వెల్లడి కాదు.

  2. శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, కోరాడ రామకృష్ణయ్య, కుమార సంభవము (పరిష్కర్తలు), మద్రాసు విశ్వవిద్యాలయము, మద్రాసు, 1949.

    ఇది వేటూరి ప్రభాకరశాస్త్రి గారి సంపూర్ణసహకారంతో పరిష్కరింపబడి, వారికి సమ్మతి లేని తీరున, వారి పేరు లేకుండా 1948లో అచ్చు పూర్తయి, 1949లో వెలువడిన సంపుటం. ఆ తర్వాత దీనిపై వెలువడిన వివిధ వాదవివాదాల కారణాన పునర్ముద్రణ కాలేదు. గ్రంథాలయాలలో ప్రతులు దొరకటం కష్టం.

  3. నిడుదవోలు వేంకటరావు (పరిష్కర్త), కుమార సంభవము (వావిళ్ళ ప్రతి), మద్రాసు, 1961.

    నన్నెచోడుని కవితా సంప్రదాయాల మేలి వివరణతో వెలువడిన మంచి ప్రతి. 2013లో దీని పరివర్ధిత ముద్రణ అచ్చయింది.

  4. కోరాడ మహాదేవశాస్త్రి (సంపాదకులు), కుమార సంభవము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1968, 1978, 1987 ముద్రణలు నేను చూచినవి.
  5. ఇందులో ఆచార్య మహాదేవశాస్త్రి గారి విలువైన పీఠికతోపాటు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు తమ సొంత ప్రతిలో తమ అధ్యయనకోసం సరైన పాఠాలను ఊహించి వ్రాసిపెట్టుకొన్న మేలైన పాఠాల పట్టిక ఉన్నది. అందువల్ల, మరీ అనర్ఘమైన ప్రతి.

  6. అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వెంకటావధాని (సంపాదకులు), నన్నెచోడ పదప్రయోగసూచిక, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1962.

    ప్రామాణికమైన పదకోశం. అయితే సంపాదకులు తాము ఎన్నుకొన్న ముద్రిత ప్రతిలో లేని పాఠభేదాలను, వ్రాతప్రతిలోని పాఠాలను పరిగణనలోకి తీసుకోకపోవటం వల్ల తులనాత్మక పరిశీలన చేసేవాళ్ళకు దీని ఉపయోగం పరిమితం అనిపిస్తుంది.

  7. శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, నన్నిచోడదేవ కుమార సంభవ విమర్శనము, మద్రాసు విశ్వవిద్యాలయ గ్రంథమాల నెం. 6, మద్రాసు, 1937.

    సర్వసమగ్రమైన విమర్శగ్రంథం. ఇందులో లక్ష్మీపతిశాస్త్రి గారు కర్తృత్వాన్ని గురించి చర్చించిన అనేకవిషయాల తథ్యమిథ్యావివేచన ఇంత వరకు జరగనే లేదు.

  8. వేటూరి ప్రభాకరశాస్త్రి, నన్నెచోడుని కుమార సంభవము: వ్యాఖ్య, విమర్శ, పాఠపరామర్శ, వేటూరి ప్రభాకరశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్, హైదరాబాదు, 1985.

    కుమార సంభవం అభిమానులు తప్పక చదివి తీరవలసిన అద్భుతావహమైన గ్రంథం ఇది. కావ్యముద్రణ పూర్వాపరాలు మాత్రమే గాక కవితావిమర్శ అపురూపంగా సాగింది. మద్రాసు యూనివర్సిటీ పరిష్కర్తలు వేటూరి వారిని మోసం చేసిన కథానకం హృదయవిదారకంగా ఉంటుంది. ఇందులో తిరుమల రామచంద్ర గారు తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని వ్రాతప్రతినుంచి సేకరించిన పాఠాంతరాలు ఉన్నాయి. వాటి విలువను వెలకట్టలేము.

  9. దేవరపల్లి కృష్ణారెడ్డి, టెంకణాదిత్య కవి, విజయ ప్రెస్, నెల్లూరు, 1951.
  10. దేవరపల్లి కృష్ణారెడ్డి, నన్నిచోడకవి చరిత్ర, బి.యన్.కె. ప్రెస్, మదరాసు, 1951.

    చక్కని కవితావిమర్శ ఉన్నది. నన్నెచోడుని అత్యంత ప్రాచీనకవిగా స్థాపించటానికి చేసిన అతివాదం ఒక్కటే ఈ రెండు కృతులలోని ప్రధానలోపం.

  11. వేదము వేంకటరాయశాస్త్రి, నన్నెచోడుని కవిత్వము, వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1959.

    అపురూపమైన శాస్త్రీయదృష్టితో సాగిన జీవితకాల పరిశోధనకు ఫలం. నిస్తులమైన విమర్శగ్రంథం.
  12. అమరేశం రాజేశ్వరశర్మ, నన్నెచోడుని కవిత్వము, అజంతా ప్రింటర్స్, సికిందరాబాదు, 1958.

    కుమార సంభవ కావ్యాన్ని గురించిన అన్ని విశేషాలకు పరిచాయికగా అమరిన చక్కటి విమర్శవ్యాసం. కర్తృత్వాదిచర్చలను కొంత గౌణీకరించి, కావ్యవిమర్శను విపులీకరించారు.

  13. నేలటూరి వేంకట రమణయ్య (వ్యాఖ్యాత), నన్నెచోడుని కుమార సంభవము (ప్రథమ భాగము), వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1974.

    కుమార సంభవం అధ్యేతలకు నియతపాఠ్యమైన ఉత్తమవ్యాఖ్య. సరికొత్త పాఠాలను సూచించారు. ప్రామాణికమైన అర్థనిర్ణయసరణి. మన దురదృష్టం కొద్దీ అసంపూర్ణ రచన.
  14. తిమ్మావజ్ఝల కోదండరామయ్య, కుమార సంభవము (వ్యాఖ్యానం), అముద్రితం.

    దీని ప్రామాణికతకు సంబంధించిన సూచనలు కొన్ని వారి ‘భారతి’ పత్రికా వ్యాసాలలోనూ, ఇతరత్ర రచనలలోనూ అగుపిస్తాయి. ఎంత త్వరగా అచ్చయితే సాహిత్యానికి అంత మేలు.
  15. జొన్నలగడ్డ మృత్యుంజయరావు (వ్యాఖ్యాత), కుమారసంభవము, ప్రథమ భాగము, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994.
  16. జొన్నలగడ్డ మృత్యుంజయరావు, కుమారసంభవము, ద్వితీయ భాగము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1998.
  17. మానవల్లి రామకృష్ణకవి, మానవల్లికవి – రచనలు, (సం.) నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1972.

    అసంఖ్యాక సంస్కృతప్రాకృతాంధ్రకావ్యాలను శిథిల తాళపత్రాలనుంచి వెలికి తీసి, సుపరిష్కృతంగా ప్రకటించి, ఎందరో విస్మృతకవుల దీప్తవాఙ్మయానికి ప్రాణంపోసిన మహానుభావుని అవిస్మరణీయమైన వ్యాస సంకలనం. ఇందులో చేర్పలేకపోయిన వారి వ్యాసాలతో సమగ్రమైన పునర్ముద్రణను ప్రకటిస్తే కృతజ్ఞతాపూర్వకంగా వారి యశోవల్లరిని కాలాంతరాలకు ప్రాకించటం సుసాధ్యమవుతుంది.

  18. నిడుదవోలు వేంకటరావు, నన్నెచోడుని కవితావైభవము, యువభారతి, సికిందరాబాదు, 1976.
  19. ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, నన్నెచోడదేవ కుమారసంభవ పరిశీలనము, విజయవాడ, 1989.

    నన్నెచోడుని కావ్యాన్ని సహృదయంతో అవలోకించిన సర్వసమగ్రమైన సిద్ధాంతగ్రంథం. సప్రమాణమైన వాదధోరణి, ప్రశంసనీయమైన పాండిత్యం.

  20. వేదాల తిరువేంగళాచార్యులు, కుమారసంభవ తత్త్వము.

    నన్నెచోడుని కవితలోని లోపాలను గురించి చర్చించిన ఆలంకారిక విమర్శగ్రంథం. పరిమాణంలో చిన్నదైనా ప్రామాణికతలో చాలా గొప్పది. చదివి విశేషాలను గుర్తుంచుకొన్నాను కాని, ప్రచురణ వివరాలను ఆ రోజులలో వ్రాసుకోలేదు.

  21. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి, నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1983.

    ఎన్నో సంవత్సరాలు కృషిచేసి కొర్లపాటి వారు ప్రచురించిన సాధికారికమైన పరిశోధన గ్రంథం. దురదృష్టవశాన దీనికి సమాధానంగా వెలువడిన వ్యాసాలలో అధిక్షేపం, నిందాధోరణి ఎక్కువ; సమగ్రమైన విషయవిమర్శతో వెలువడినవి తక్కువ. కొర్లపాటి వారి వాదస్రవంతిలో కొంత అతివాదమూ, అక్కడక్కడ లోపాలూ ఉన్నప్పటికీ చెప్పుకోదగిన దీటైన ప్రతివిమర్శ ఇంతవరకు వెలువడలేదు. సరైన సమాధానం చెప్పి వాదాన్ని నిరుత్తరం చేయకపోగా విశ్వవిద్యాలయాలలో వీరి మహాకృషిని పూర్తిగా ఉపేక్షించటం జరిగింది. అది క్షంతవ్యం కాదు.

  22. వేటూరి ప్రభాకరశాస్త్రి (పీఠికా కర్త), తెనాలి రామలింగకవి ఉద్భటారాధ్య చరిత్రము, (ప్రకాశకులు) ముదిగొండ బసవయ్యశాస్త్రి గారు, సరస్వతీ గ్రంథమాల కార్యాలయము, బెజవాడ, 1926(?), 1935.
  23. నిడుదవోలు వేంకటరావు (పీఠికా కర్త), తెనాలి రామలింగకవి ఉద్భటారాధ్య చరిత్రము, ది ఓరియంట్ పవర్ ప్రెస్, తెనాలి, 1974.
  24. వేటూరి ప్రభాకరశాస్త్రి (సం.), ప్రబంధ రత్నావళి, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు, 1918 (ద్వితీయ ముద్రణ).
  25. వేటూరి ప్రభాకరశాస్త్రి (సం.), ప్రబంధ రత్నావళి, (పీఠికా కర్త) నిడుదవోలు వేంకటరావు, శ్రీ ప్రభాకర వాఙ్మయ పరిశోధక మండలి, హైదరాబాదు, 1976.
  26. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి (పరిష్కర్త), పెదపాటి జగ్గన ప్రబంధ రత్నాకరము, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, 1992.
  27. ఎస్.పి. నారంగ్, Authorship of the êŗngāratilaka: A Stylistic Appraisal, pp. 504-523., Dharma Nirajana, Parimal Publications, Delhi, 1989.

    కాళిదాసు శైలి తత్త్వాన్ని అధికరించి శృంగార తిలకం కర్తృత్వాన్ని పరిశీలించిన మౌలికమైన వ్యాసం. నాకు చాలా ఉపకరించింది.

(కావ్యాలు, విమర్శ గ్రంథాలు, ప్రాకరాలు, వ్యాఖ్యలు, వ్యాసాలు గ్రంథాలయాలలో చదివి, పైని వ్యాసంలో పేర్కొన్నవి ఇంకా చాలానే ఉన్నాయి. అప్పట్లో ఈ దృష్టి లేనందువల్ల చదివినప్పుడు నోట్సు వ్రాసుకొన్నాను కాని, వాటి ప్రచురణ వివరాలను గుర్తుంచుకోలేదు – రచయిత.)

ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...