మా నూనెపల్లె — నంద్యాలలో ముసల్మానుల జనాభా ఎక్కువే. వారు ఎక్కువగా ఉండే ఏ వీధిలోనైనా ఏ ఇంటి తలుపునైనా తట్టండి. తెరుచుకున్న తలుపు వెనుక మనిషితో “మాబ్బాషా ఉండాడామ్మా?” అని అడగండి, ఉన్నాడనో, లేడనో, బయటికి పోయినాడనో, నిద్రపోతుండాడనో జవాబు వస్తుంది. అంటే మా ప్రాంతాలలో మహబూబ్ బాషాలు అంత ఎక్కువన్నమాట.
పందొమ్మిది వందల ఎనభై ప్రాంతాలలో మిట్టల్ మీద ఖలీల్ సిద్దిఖీ హైస్కూల్‌ని మహమ్మద్ హనీఫ్గారు హెడ్మాస్టారుగా పరిపాలిస్తున్న రోజుల్లో మా క్లాసుమేట్లలో ఒకడి పేరు ఆస్పత్రి మాబ్బాషా (వాడి ఇల్లు హాస్పిటల్ దగ్గర అన్నమాట), మరొకడి పేరు చిన్న సైకిల్ మాబ్బాషా (వాడికి చిన్న సైకిల్ ఉండేదన్నమాట), వాడు బక్క మాబ్బాషా, వీడు ఎర్ర మాబ్బాషా, ఇంకోడు తమ్ముడు మాబ్బాషా, మరొకడు బొగ్గులైన్ మాబ్బాషా… ఇప్పుడు నేను చెప్పబోయే కథలోని వాడు కొలింపేట మాబ్బాషా. వీడు మా మిత్రప్రపంచంలో ఒన్లీ పీస్, వీడు వెరీ వెరీ స్పెషల్. వీడు భలే ఎచ్చులోడు, వీడి మాటలూ చేష్టలూ అన్నీ హెచ్చులే. మా నంద్యాల జావేద్ హోటెల్లో టీ రుచి ఎంత ప్రత్యేకమో వీడు అంత ప్రత్యేక మాబ్బాషా. వీడిని ‘మాబూ’ అని కూడా అంటారు. మాబూచాన్ కూడా (జాకీ చాన్లా) వీడికి ఉన్న పేరే. ఆ రోజుల్లోని మా గ్రూప్ ఫ్రెండ్స్ మేము అనగా శేఖర్, మధు, సేనా, పార్థూ, అజీమ్, సిద్దిఖీ, నాలుగు మధు… ఇత్యాదులం ఎప్పుడు ఎక్కడ కలిసినా, మాట్లాడుకున్నా మాబుగాడ్ని తలుచుకోకుండా అసలు ఉండలేం. వాడు కబుర్లు మొదలెడితే చాలు “బుస్సులు రోయ్, బుస్సులు” అని చేత్తో పడగ విప్పుకునే వాళ్ళం. అంటే వట్టి గ్యాస్ అన్నమాట. పూర్తి స్థాయి కోతలని కూడా అన్నమాటే.
మాబుగాడికి, నాకు మా ఇద్దరికి అసలు మేము చదువుకున్న ఖలీల్ సిద్దిఖీ హైస్కూల్లో స్నేహం కలవలా, అసలు మాబూ అనే వాడొకడు మా క్లాస్‌లో ఉన్నాడనే స్పృహ, చైతన్యమే ఆ సమయాన నాకు లేదు. నేనూ, మాబుగాడు, కడ్డీ మస్తాన్, జిలాని, వాళ్ళ అన్న నబీరసూల్, పుల్లయ్య గాడు, ఎర్రబాషా, రఫిక్యూ గాడు… మేమంతా, మాకంతా స్నేహం కుదిరింది రెవెన్యూ క్వార్టర్స్‌లోని ‘సక్సెస్ ట్యూషన్ సెంటర్’లో, ఆ తరువాత నేనూ మాబూ ఇంకా దగ్గరయ్యాం రెవెన్యూ క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ‘సూర్యం సార్ ట్యూషన్’లో లెక్కలు నేర్చుకోడానికి వెళ్తున్నప్పుడే. పదవ తరగతి తప్పిన నేను ఎలాగోలా ఖర్మ గట్టెక్కించి లెక్కలు పాసయ్యి మా నాయన చేత దెబ్బలు తప్పించుకోడానికి ట్యూషన్ చేరితే, మాబుగాడు మహా పుట్టుముదురు. వాడు గణితం లెక్కలతోపాటు మా లెక్కల సారు వైఫ్‌ని కూడా లెక్క వేసుకుని ట్యూషన్ చేరాడు, వాడికి ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా తనని చూసి మోహించకుండా ఉండదని ఒక ప్రగాఢ అనుమానం. వాడి గోల వాడిది, నాదంతా బొమ్మలు, కథల పుస్తకాలు, క్రికెట్, నా పాడు దేహాన్ని మా నాయన కంటపడకుండా జాగ్రత్త చేసుకుంటూ తిరగడం ఎలా అనేది అటీవలి నా గోల. మాబుగాడికి మాకు ఏదో దూరపు బంధుత్వం ఉందిట. వాడు నాకు వరసకు చిన్నాయన అవుతాట్టా. ఆ విషయం మాకు పెద్దయ్యక తెలిసింది సరే! అదేం పెద్ద లెక్కలోకి రాదు. వాడిని అసలు ఆ వరుసలో పట్టించుకున్నది కూడా లేదు నేను ఎన్నడూ.
మాబుగాడు ప్రతి తెల్లవారుఝామున నాలుగున్నరకు వచ్చేవాడు మా ఇంటికి, కటాంజనం బయటినుండి “రే అన్వర్” అనేవాడు. నేను అప్పటికే తయారై పోయి కదిలేవాణ్ణి. ఇద్దరం కలిసి పెద్దాసుపత్రి దగ్గర తాత బంకులో టీ తాగేవాళ్ళం. ఒక్కోసారి తాగిన ఆ టీకి ఇవ్వడానికి అర్ధరూపాయ కూడా ఉండేది కాదు, అందుకనే ముందు టీ తాగేసి ఆ తరువాత డబ్బులు అరువు అని చెప్పేవాణ్ణి. ఆ తాత తెగ విసుక్కునే వాడు. “చీ! బోణీ గిరాకి అరువు” అని. నాకు తెగ అవమానంగా అనిపించేది, వాడు అటువంటివి అన్నీ సీరియస్‌గా పట్టించుకోకూడదురా ‘తిక్క నాయాల’ అనేవాడు. అప్పుడు మా వయసు పదహారు. అలా తెల్లవారుఝామున చలి నడకలు నడిచి నాకు జలుబు చేసింది. చెప్పాగా మాబుగాడు ముదురు. వాడు ఏ సమస్యకయినా వాడికి అనుకూలమయిన దిక్కుమాలిన పరిష్కారాన్ని సూచించేవాడు.
“రే, జలుబు తగ్గాలంటే ఏం చెయ్యాలంటే…”
“ఆ! ఏం చెయ్యాలి?”
“రేపు చెబుతాలే, పొద్దున ఇంట్లోంచి వస్తూ వస్తూ ఝండూబామ్ పట్రా.”
మరుసటి రోజు మామూలుగా తాత దగ్గర టీ తాగి, కాస్త ముందుకు నడిచి చామకాలువ బ్రిడ్జ్ దాటాకా కరెంట్ ఆఫీస్ ఎదురు చిన్న డొంకలో దిగి నా దగ్గిరి ఝండూబామ్ తీసుకుని, తన జేబులోంచి ఒక సిగరెట్ తీసి దానికి నిలువెల్లా ఝండూబామ్ రాసి “ఇప్పుడు దీనిని తాగితే జలుబు దెబ్బకు ఆగి పోతుందిరా.” “అవునా, నిజమారా మాబూ!!” “నిజమేరా బాబూ!”
నిజం అవునో కాదో ఎవడికి తెలుసు? సిగరెట్ తాగాలనేది ఒక కోరిక. ఇలా దానికి ఒక ఆరోగ్యకారణం తగిలిస్తే కుతికి కుతి తీరుతుంది. వల్ల తప్పి జలుబు తగ్గినా తగ్గుతుంది.
“అరే మాబూ, నేను మరీ సన్నగా ఉన్నారా, కొద్దిగా లావు కావాలి. ఎట్లారా?”
“ఏం లేదురా, వారానికి ఒక బీరు తాగితే లావు అవ్వడమే కాదు, ఒంటికి నాలా మంచి కలర్ వస్తుంది, హైట్ కూడా పెరుగుతావు”
“అవునా! నిజమారా మాబూ?”
“అవును. నిజమేరా బాబూ!”
మేమిద్దరం కలిసి రెండు ట్యూషన్లు చదివాం. మొదటిది సక్సెస్ ట్యూషన్ సెంటర్, దీనిని మాకు మా ఇంకో ఫ్రెండ్ రఫిక్యూ గాడు పరిచయం చేశాడు. ఇందులో రషీద్ సర్, సలీం సర్, హఫీజుద్దీన్ సార్లు ఉండేవాళ్ళు. మొదటి ఇద్దరు పరమ శాంతమూర్తులు. హఫీజుద్దీన్ సారే అప్పుడప్పుడు మా ఒంటిపై బెత్తం చేసుకునేవాడు. ఈ ట్యూషన్ వెళ్ళే దారిలో ఒక పెద్ద బంగళా ఉండేది. అది ఎంత పెద్దదో చెప్పలేను. గొప్ప ఎలిగెంట్‌గా, యాంటిక్ పీస్‌లా ఉండేది. ఆ ఇంటి యజమానికి ఒక కూతురు ఒక కొడుకు. అమ్మాయి పెద్దది, కాస్త బొద్దయిన మనిషి. ముద్దయిన మొహం. ఎర్రని ఎరుపు. అప్పుడప్పుడు బంగళా బయట బడికి వెడుతున్నప్పుడు కనిపించేది. మాబూ నిట్టూరుస్తూ అనేవాడు “ఈ పిల్లని గనక పెళ్ళి చేసుకుంటే పరుపు అవసరమే ఉండదురా అన్వర్!” వీడెవుడ్రా మరీ నిద్ర ముష్టి వెధవలా పరుపులు దిళ్ళు కలవరిస్తాడు అనుకునే వాణ్ణి. వాక్యం అర్థం అయ్యే పని చేయడానికి నా బుర్ర అప్పటికి ఇంకా బెడ్రూం కాలేదు. మాబూ వాళ్ళ అన్నకి టెక్కె ఏరియాలో చాలా పెద్ద మోటర్ మెకానిక్ షెడ్ ఉండేది. అందులో పనిచేసే చిన్నకారు, పెద్ద కారు, సన్న కారు మెకానిక్కులు- రకరకాల వయసు వాళ్ళతో వీడిది చాలా పెద్ద స్నేహం, లోక జ్ఞానం, స్త్రీ సంబంధిత విజ్ఞానం గట్రా తెలిసీ తెలీక చాలా ఎక్కువ. ఆసక్తి వయసుకు మించి అమిత మెండు.
ఆ రోజుల్లో మా ట్యూషన్లో ఒక కొత్తమ్మాయ్ చేరింది. చాలా బావుంది, మొహం మీద రెండు మూడు గులాబీ మొటిమలు. పేరు గుర్తు లేదు. ఒక రోజు సాయంత్రం కరెంట్ పోయింది, క్లాస్ చీకటిగా ఉంది. కరెంట్ వచ్చాకా మాబూ నా చెవి దగ్గరికి వచ్చాడు, ముసిముసిగా నవ్వుతూ రహస్యంగా అన్నాడు “కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి చీకట్లో నా తొడ పట్టుకుని నొక్కిందిరా, నేనంటే చచ్చిపోతుందిరా.” అటు చూసా, ఆ అమ్మాయి అక్కడ అర కిలోమీటర్ దూరంలో ఉంది. వీడి తొడ కేసి చూసా, దానిపై అరకిలో కూడా మాంసం ఉండి ఉండదు. ప్చ్! తనని చూసిన ప్రతి అమ్మాయి తనంటే తీవ్రంగా అంగలారుస్తుందని గొప్ప నమ్మకం మాబూది. నమ్మకం ప్రేమకన్నా గుడ్డిది.
మాబుగాడు రెండు పాదాలతో నడిచే మూడు కాళ్ళ రతి రహస్యాల ఖజానా. “ఉరేయ్ మనవంక ఎవరయినా అమ్మాయి చూసి సన్నగా అరనవ్వు నవ్వగానే ఇక్కడ నిక్కరు బిగుసుకు పోతుంది కదా, అక్కడ సినిమాల్లో మగ హీరోలు ఆడ హీరోయిన్లతో అంత క్లోజ్‌గా, దగ్గరగా ఉంటారు కదా, మరి వారెట్లా తట్టుకుంటారు మామా?” అని ఎవరో ఒకడు ప్రశ్న వేశాడు, అన్ని తలలు మాబూ తలదిక్కున తిరిగాయ్, మాబూ అన్నాడు కదా, “దానికి ఒక టెక్నిక్ ఉందమ్మా! ఒకసారి నేను హీరో అర్జున్‌ది ఒక సినిమా షూటింగ్ చూడ్డానికి వెళ్ళాను, షూటింగ్లో ఒక సీన్‌కు ముందు ఒకాయన వచ్చి అర్జున్‌ని ఒక చెట్టు వెనకకు తీసుకెళ్ళాడు, ఎందుకా అని నేనూ వాళ్ళకు కనపడకుండా మెల్లగా వాళ్ళ వెనకే వెళ్ళా. అతను క్రికెట్ ఆటలో ప్యాంట్ లోపల పెట్టుకుంటారే గార్డ్, అలాంటిదే ఒకటి తీసి అర్జున్ ప్యాంట్లో పెట్టాడు అయితే దీనికి ఒక స్విచ్ లాంటిది ఉంటుంది. దాన్ని అక్కడ పెట్టి పటక్ అని స్విచ్ వేశాడు, అంతే! లోపల మూవ్మెంట్ ఆగిపోతుంది. దానివలన వాళ్ళు సినిమాల్లో ఏ సీన్ చెయ్యాలన్నా ఇబ్బంది కాదు, షూటింగ్ అయి పోయాకా గార్డ్ని మళ్ళోసారి అక్కడ పెట్టి స్విచ్ వేస్తారు, అప్పుడు హీరో మిషిన్ చాలూ అన్న మాట.” మాబూగా తుస్సి గ్రేట్ హో!!! తరువాత మేము అర్జున్ సినిమాలే కాదు ఆడమ్మాయిల దగ్గరగా వచ్చే ఏ హీరో సినిమా సీన్లయినా చాలా జాగ్రత్తగా పట్టి పట్టి ఆ హీరో ప్యాంట్ వంకే చూసే వాళ్ళం, “ఊ! మూవ్మెంట్ లేదు, వీడికి మిషిన్ పెట్నార్రోయ్.”
మేము చేరిన రెండో ట్యూషన్ సూర్యం సార్ ట్యూషన్, ఆ సార్‌కి కళ్ళు సరిగా కనపడవో, లేక అసలు చూపే లేదు అని ఒక వినికిడి, ఆయన కళ్ళ కేసి ఎంత చూసినా నాకు ఏం తెలిసేది కాదు, కానీ లెక్కలు మాత్రం బాగా చెప్పేవారు, ఆయన దయ లేకపోతే నేను ఆ మాత్రం లెక్కల పరీక్ష ఎప్పటికీ పాస్ అయ్యేవాణ్ణి కాదు. ఇటువంటి ట్యూషన్ ఒకటి ఉందని కనిపెట్టిన వాడు మాబుగాడే. ఇక్కడే మాకు శేఖర్ పరిచయం అయ్యాడు. తొలి చూపులోనే నేను శేఖర్ని చూసి దడుసుకున్నా, భుజాలమీదికి జుత్తు, వేసుకున్న ఆకుపచ్చ చొక్కాకి కనీసం ఆ వేపు ఈ వేపు మీదా కిందా అంతా కలిపి ఒక మూడు వందల గుండీలు కుట్టి ఉంటాయ్. పరిచయం అయ్యామో లేదో వెను వెంటనే శేఖర్ నా దగ్గరకు వచ్చి “అబ్బా, నీకు తెలుసా నాకు ఒక లవర్ ఉంది. రాధ ఆ అమ్మాయి పేరు, తెల్లగా చాలా అందంగా ఉంది.” నాకు ఎందుకో ఈ మనిషి మానసిక స్థితి మీద అనుమానం వేసింది. ఎందుకయినా మంచిదని నేను అటు జరిగి ఇటు మధ్యన మాబూని కూర్చోపెట్టినా. అప్పటినుండి మాబూ, శేఖర్ ఇద్దరూ జాన్ జిగ్రీ దోస్తులు అయిపోయారు. అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి ఒకే తానులోనుండి బట్టని కొలిపించుకుని అంగీలు కుట్టించుకుని తిరిగేవారు, చూసే వాళ్ళు వీళ్ళేమయిన “అమడపిల్లలా!” అని అనుకునేట్టు. అక్కడే మాకు రకరకాల చిత్ర విచిత్ర మిత్రులు కలిసారు, ఆ ట్యూషన్ స్థలపురాణ మహిమ ఏమో నాకున్న ఇద్దరు మిత్రులు అక్కడే తమ పురుషత్వానికి మంగళహారతి పాడేసుకుని “పదహారేళ్ళకు నీలో నాలో…” అనే పాటని నీరసంగా గొంతెత్తి పాడుకున్నారని కూడా తెలుసు.
అప్పుడప్పుడు చదవడాలు, ఎప్పుడూ చదవకపోవడాలు, దొంగచూపులు, తొడ పాశాలు, పోలీసు క్వార్టర్స్‌లో తొలి అనుభవాలు, పాలిటెక్నిక్ కాలేజీలో కొట్టుకోడాలు, గొడవలు, బీరు సీసాలు పగలడాలు… ఇలా చాలా… తరువాత మేము ముగ్గురమూ కష్టపడి టెంత్ పాస్ అయిపోయాం కదా, ఎంపీసీ లేదా బైపీసీ తీసుకుని ఈ బొందెని ఇంకా శ్రమ పెట్టడం ఎందుకు దండగ అనిపించి ‘సీఈసీ’ తీసుకుని ఆడుతూ పాడుతూ చార్టర్డ్ అకౌంటెంట్లం అవుదామనుకుని బాలాజీ కాలేజీలో సీఈసీ గ్రూప్‌లో జాయినవ్వడానికి అప్లికేషన్లు అవీ నింపి ఇచ్చేసి గలగలా కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ మెట్లు దిగుతున్నాం కదా, ఎదురుగా కొంతమంది అమ్మాయిలు కిలకిలమని నవ్వుతూ మెట్లెక్కుతూ మాకు ఎదురయ్యారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఎరుపు రంగు డ్రస్ ధరించి పరమ అచ్చం ఆ మధ్యే రిలీజయిన ఒక సినిమా హీరోయిన్ మమతా కులకర్ణిలా ఉంది. అరే ఈ అమ్మాయి ఆ నడ్డిముక్కు, బొద్దు ఒళ్ళు అదీ వేసుకుని అచ్చూ అదే హీరోయిన్లా ఉందేనని ఆశ్చర్యపడిపోయి ఆ విషయం మాబూకు చెబుదామని పక్కకి తిరిగి చూస్తే మా మధ్య ఉండాల్సిన మాబుగాడు మాయం. మాకు మరింత ఆశ్చర్యం!
మరుసటి రోజు లబలబలాడే గుండెలతో తొలి రోజు అనే కాలేజీ మెట్ల మీద అడుగుపెట్టి సీఈసీకి దారి అటు అనే క్లాస్ వైపు నడవాలి కదా మేము! మాబూ మాత్రం హెచ్ఈసీకి దారి అటు వైపు నడుస్తున్నాడు, అదేమిరా అని క్వశ్చన్ మార్కు అనగానే “నిన్న ఆఫీస్రూమ్లో కనుక్కున్నారా; ఆ అమ్మాయి మమతా కులకర్ణి; ‘మీ కామర్స్ గ్రూప్’ కాదు ‘మా హిస్టరీ గ్రూప్’ అనీ, అందుకనీ, సారీరా మీ ఇద్దరికీ చెప్పకుండానే నేనూ హిస్టరీ గ్రూప్‌లో చేరిపోయా”నంటూ జేబులోంచి ఎర్రరంగు కర్చీప్ తీసి మొహం తుడుచుకున్నాడు. అప్పుడు గమనించా వాడు ఎర్రప్యాంట్ మీదికి రెడ్ కలర్ అంగి టక్ చేసుకుని ఉన్నాడు. దానికి ఎల్లో కలర్ నైలాన్ బెల్ట్. జేబులో అప్పుడప్పుడే మార్కెట్లోకి వచ్చిన లక్సర్ ట్రెండీ బాల్‌పెన్ ఎర్రది. అప్పుడు వెలిగింది మమతా కులకర్ణి పోలికల్లో ఉన్న ఆ అమ్మాయిని తొలి చూపుల్లో చూసింది ఎర్రనిబట్టల్లో కదాని! నానుడి చెప్పినట్లు ప్రేమ మరీ గుడ్డిది కాదు అది ఎర్రగా కనపడుతుందనీను.
ఇక నేనూ శేఖర్ మౌనంగా పుస్తకాలు భుజాన వేసుకుని మా కామర్స్ వైపు నడిచాం. మాబూ హిస్టరీలో చేరడం వలననే మాకు సేనాగాడు, మధుగాడు, సత్యం, చెన్నయ్యవంటి ఇంకా బోలెడుమంది మామూలు మిత్రులు, క్లోజు స్నేహితులుగా భుజాల మీద చేతులుగా తయారయ్యారు. కొంతకాలానికి కాలం గడిచి మా ఊరిలో “ముగ్గురు మొనగాళ్ళు” సినిమా రిలీజ్ అయ్యింది, అప్పుడు మాబుగాడు తన పేరు పృథ్వి అని, మధుగాడు విక్రమ్‌గా, సేనాగాడు దత్తాత్రేయ శర్మగా మా మధ్య జీవించారు. ఆ సమయంలో వారి అసలు పేర్లు వారు మరియూ మేము కూడా మరిచిపోయి హాయిగా బ్రతికేశాం. ఇంకా పైగా మా రఘుగాడు కూడా మా కాలేజీలో ఎంపీసీలో చేరాడు. వాడివల్ల మరికొందరి పరిచయాలు కలిసాయి. పైగా జీవితంలో మొదటిసారిగా ఐడెంటిటీ కార్డ్ అనేది ఈ కాలేజీనే ఇచ్చింది మాకు. నాకు కార్డ్ అందగానే నా నలుపు తెలుపు బస్ట్ సైజ్ ఫొటో మీద సిల్వెస్టర్ స్టాలోన్ ఫోటో అంటించుకుని “అయాం రాంబో” అని గింగిరాలు పోయేవాణ్ణి. ఇది వ్రాస్తూ వ్రాస్తూ నా ప్రాణం అంతా ఇప్పటికిప్పుడు ఈ కీబోర్డ్ వలె టకటకమని కొట్టుకుంటూ ఉంది. ఏముంది ఈ రోజు జీవితంలో? బొమ్మలు బోర్, సాహిత్యం పరమ బోర్, ఉద్యోగపు గానుగెద్దు బ్రతుకు యమా బోర్. ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా ఒక కుదుపు వచ్చి నా బ్రతుకు బాలాజీ కాలేజీ మెట్ల ఒకే రోజు లూప్ లైన్లో పడరాదా? ఉదయం ఇంటి దగ్గర ఇంటి ఫ్రెండ్స్, మధ్యాహ్నం కాలేజీ ఫ్రెండ్స్. మల్లికార్జున్ టీ కొట్లో చాయ్ ఫ్రెండ్స్. సాయంత్రం సింగ్ సార్ దగ్గర టైప్ మిషన్ పాఠాల టకటకటక మీదినుండి దూకి బీఎస్ఏ ఎస్ఎల్ఆర్ సైకిల్ హ్యాండిల్ మధ్యకు పట్టుకుని కిలోమీటర్లకు కిలోమీటర్లు అందరూ ఫ్రెండ్స్‌తో మాటాడుకుంటూ నడుస్తూ ఆగుతూ టూ బై ఫోర్, లేదా త్రీ బై సిక్స్ టీలు తాగి… భుజాల మీద డెడ్‌లైన్ అనే దిక్కుమాలిన బరువు మాటల స్పెల్లింగ్ కూడా తెలియని బంగారు రోజులనుండి కనీసం పూరెక్క బరువు చిన్న పరిమళాన్నయినా దాచుకోలేకపోతిమే! నరులతో కానీ, సురులతో కానీ, మృగాలతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంట గానీ, బయట గానీ, ప్రాణమున్న వాటితో కానీ, ప్రాణం లేని వాటితో కానీ, ఆకాశంలో కానీ, నేల మీద కానీ, నీటిలో కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని బుర్ర తక్కువ తపస్సు ఎవరు కోరుకుంటున్నారు ఇక్కడ? ఒకే ఒక రోజు జీవితపు లూప్ లైను మీద ఆ పద్దెనిమిది ఏళ్ళ వయసు, ఆ బాలాజీ కాలేజీ మేడ మెట్లు, ఆ నంద్యాల దుమ్ము రోడ్లు, ఆ ఎస్పీజీ ప్లే గ్రౌండ్ క్రికెట్ పిచ్ దగ్గరికి ఒక్క ఈడ్పు ఈడ్చి పడెయ్యమనే కదా ఈ ప్రార్థన! పరివేదన ప్రభూ!
అలా మాబూ ఆ రెండేళ్ళు మమతా కులకర్ణి వెనుక చరిత్ర బెంచిలో సెటిల్ అయిపోయాడు. (ఆ తరువాత ఆ అమ్మాయి వెనుకే గ్రాడ్యుయేషన్ ముగించాడనుకో) క్లాసులో మిగతా ఎవరూ వాడికి, ఆ అమ్మాయి దారికి అడ్డు రాకుండా ముందుగానే “మీ అక్క వచ్చిందా బామ్మర్ది? మీ చెల్లి కనపడిందా బావా?” అంటూ కాలేజీలో ఉండే పరపురుషులందరికీ ఆ అమ్మాయిని సిస్టర్ సమానురాలిని చేయనైతే చేశాడు. కానీ వీడు ఇంకా ఆ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యలేదు. అలా కాలం గడుస్తూ ఒక రావల్సిన రోజు వచ్చింది. ఆ రోజు వస్తూ వస్తూ ఆ అమ్మాయి పుట్టిన రోజుని తెచ్చింది. ఏం కొన్నాడో నాకైతే తెలీదు కానీ ఆ రోజు ఏదో ఒక ఎర్ర పుష్పం కొనే ఉంటాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలకు ముహూర్తం. ఒక తీవ్రతీక్ష్ణమైన ఉపాయం పన్నారు మాబూ అండ్ కో. మిషన్ ఇంపాజిబుల్ సినిమా కూడా ఊహించలేని ఎత్తుగడ. ప్లానులోని ఇతర పాత్రధారులు శేఖర్, సేనా, మధు. ఆ అమ్మాయి పుట్టిన రోజుకు ముందే ఎలా సంపాదించారో కానీ మూడు రోజుల క్రిందే ఆట ఎత్తేసిన సినిమా పోస్టర్ ఒకటి సంపాదించారు. జుమ్మా మసీదులో సున్నం కొట్టడానికి అద్దెకు ఇచ్చే పెద్ద నిచ్చెనని బాడిగకు తీసుకున్నారు. ఆ సాయంకాలం ఒక బకెటెడు మైదా వండబడింది. ఆ రాత్రి ఆకాశం పైన చందురుడు ఒకడే, కింద మన్మథుడు ఒకడే. వాడే మాబుగాడు. మిగతా ముగ్గురు వీలయినంత దర్వేసి మొహాలు వేసుకుని, నెత్తికి రుమళ్ళు చుట్టుకుని, కుదిరితే ఖాకీ చొక్కా లేదా చినుగుల బనియన్లు ధరించి, మురికి నిక్కర్లు తొడుక్కుని ఒకడు నిచ్చెన పట్టుకోవాలి, మరోడు మైదా బకెట్ పట్టుకోవాలి, మూడోవాడు పోస్టర్ అంటిస్తూస్తూస్తూ ఉండాలి. ఈ లోపు మాబూ ఆ నిచ్చెన ఎక్కి తన ప్రేమ ప్రకటించి వీలయితే ఒక డ్యూయెట్ వేసుకుని ఆవిధంగా సుఖాంతమై దివినుండి కిందికి దిగి వస్తాడు అని పథకము.
ఊర్లోని అనేకానేక వీధుల్లో ఒక వీధిలో ఉన్న ఆ అమ్మాయి ఇంటి గోడ మీదగా విజయానికి లెక్కలేనన్ని నిచ్చెన మెట్లు అనే కర్రముక్కల ఆధారంగా మాబుగాడు మమతా కులకర్ణి ఇంటి పైకి చేరుకున్నాడు. కింద సేనాగాడు మైదా కలుపుతూనే ఉన్నాడు, మధుగాడు నిచ్చెన పట్టుకునే ఉన్నాడు, శేఖర్ పోస్టర్ మీద చేయి పాముతూనే ఉన్నాడు. గోడపక్కన కిటికీ తెరుచుకుంది. కిటికీలోంచి మమతా కులకర్ణి వాళ్ళ అమ్మగారి తల పలకరించింది.
“ఎవరయ్యా ఆడా?”
“బ్బె బ్బె బ్బె… మేము సినిమా పోస్టర్లు కరిపించనీకి వచ్చినామమ్మ”
“ఇంత రాత్రి పూట ఏం పోస్టర్లు కరిపిస్తారు, ఆ?”
“కరిపించనీకి మాకు రాత్రి పూట్నే టైం దొరుకుతుందిమ్మా”
“ఏం సినిమా పోస్టరది?”
“క్షణ క్షణమమ్మా”
“ఆ సినిమా మొన్ననే కదా పోయింది, మళ్ళీ అప్పుడే వచ్చిందా? ఆడ్నే తాలండి, పోలీసులకు ఫోన్ చేస్తా.”
వార్నీ! వీళ్ళింట్లో ఫోన్ కూడా ఉందా? దెబ్బకు క్షణక్షణం సినిమా పోస్టర్, దాని హీరో, ముగ్గురు దిక్కుమాలినవాళ్ళు గాయబ్. ఒక పుట్టినరోజు వేడుక అలా రిలీజ్ కాకుండానే అట్టర్ ఫ్లాప్ అయింది. మా ఊళ్ళో ఒకసారి సరిగమలు అనే సినిమా రిలీజయ్యి మొదటి ఆట కూడా గిట్టుబాటు కాలేదని మధ్యాహ్నం ఆటకే సినిమా ఎత్తేశారన్న ఒక రికార్డ్ ఉంది. దాన్ని మావాళ్ళు బద్దలు కొట్టారు.
మొత్తానికి ఎక్కువ కాలం గడవకుండానే అదే వీధిలో శేఖర్ ఒక ఫ్రెండ్‌ని సంపాదించుకున్నాడు. ఆ ఫ్రెండు ఇల్లు మరియూ మమతా కులకర్ణి ఇల్లు పక్కపక్కనే. ఒక దీపాలు పెట్టే వేళ మాబూ, శేఖర్ ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటి మీదుగా ఈ అమ్మాయి ఇల్లు చేరుకున్నారు. ఆ సాయంకాలం ఆ డాబా పైన ఆకాశంలో చందురుడు ఒకడు, కింద చందమామవంటి మొహం వేసుకున్న ఈ అమ్మాయి ఒకతి, ఆ చంద్రబింబంవంటి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతున్న మన్మథుడొకడు. దురదృష్టం కొద్దీ అక్కడ మన్మథుడు మన మాబుగాడు కాదు. ఎవరో సమ్‌బడీ ఎల్స్. మమతా కులకర్ణి చాలా కాలం క్రితంనుండే సమ్‌బడీ అనే ఈ కంతుడితో కూడి ఉందిట.”
సీన్ కట్ చేస్తే పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో వన్-బై-టూ ఖజురహో బీరు తోడుగా మాబూ ఇంకా శేఖర్.
మాబూ: నా కళ్ళు నన్ను మోసం చేసాయి బామ్మర్దీ! దీన్ని నేను నమ్మలేను గాక నమ్మలేను.
శేఖర్: నా కళ్ళు మాత్రం నన్ను మోసం చేయలేదు బావా! ఈ బీరు సాక్షిగా ఆ అమ్మాయిని వాడు టిఫిన్ చేస్తున్నాడు, మనం ఇంకొంచెంసేపు అక్కడే వుండి ఉంటే ఫుల్ మీల్స్ కూడా చూసేవాళ్ళం.
నో! నో! మాబూ కసిగా చేతిలోని బీరు బాటిల్‌ని బలంగా నేలకు విసిరి కొట్టాడు. విసిరి కొట్టే ముందు అందులో ఉన్న మిగతా మందు తాగడం మాత్రం మరవలేదు.
ఆ పగిలిన బీరు ప్రేమనుండి మాబూ త్వరగానే కోలుకున్నాడు. చెప్పాగా వాడి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ, అందులో అది నానా జాతి, వాడు అందులో జీవితంలో ఎంగేజ్ కావడానికి చాలా సందడి ఉండేది. అందులోనూ వాడికి వాడిపై అమిత విశ్వాసం అనే కాదు, ఎవరి ముందూ మనం ఏ విషయంలోనయినా లూజ్ అయి కనపడరాదు అనే లక్షణం ఒకటి ఉండేది. అది ఉండవలసిన దానికన్నా వాడికి ఎక్కువ పుష్కలంగా ఉండేది.
మాబుగాడికి సౌందర్యస్పృహ, శరీర స్పృహ చాలా ఎక్కువే. వాడికన్నా వాడి తమ్ముడి సౌందర్యస్పృహ అనంతం. వాడు ఫెయిర్-అండ్-లవ్లీ అనే ట్యూబుని ఎంతగా వాడుకుంటాడో ప్రత్యక్షంగా చూస్తే ఆ కంపెనీ ఓనర్‌కి కూడా తన తయారీ పట్ల విరక్తి కలుగుతుంది. మాబుగాడికి ముందు పుట్టినవాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు మోదిన్. వీడి శరీరస్పృహ గురించి మీరు ఎప్పుడయినా వాడి ఇంటికి వెళ్ళి చూడవలసిన పీస్. మోదిన్ కనపడినప్పుడల్లా అయితే గొడ్డలి పుచ్చుకుని కట్టెలు కొడుతుంటాడు, లేదా బిందెలు పట్టుకుని బోరింగ్ దగ్గర నుండి నీళ్ళు తెస్తూనే ఉంటాడు. ఏ పని చేసినా కామన్ ఏమిటంటే ఒంటి మీద చొక్కా లేకుండా జాగ్రత్త పడ్డం. సల్మాన్ ఖాన్ కూడా సిగ్గుచెందేంత బాడీ ప్రదర్శన మోదిన్ది. మనం ఎప్పుడయినా వాళ్ళ ఇంటికి వెళతాం కదా, మొదట ఇంటి బయటే మోదిన్ ఉంటాడు చేతిలో గొడ్డలి, కాలి కింద మొద్దు, కట్టెని మాత్రం కొట్టడు. మనం కనపడగానే “క్యారే అన్వర్” లేదా “ఏం రా మధు” “ఏం వోయ్ సేనా” అని పలకరిస్తాడు. మనకేసి మాత్రం అసలు చూడనే చూడడు. చేతిలోని గొడ్డలిని ఆ చేతిలోంచి ఈ చేతిలోకి మార్చుకుంటూ తన కండలని పరిశీలించుకుంటూ ఉంటాడు. “ఆ! ఏమిటి విశేషాలు” అంటూ తల వంచి తన ఛాతీ కేసి చూసుకుంటూ ఉంటాడు, మనం ఆ రోజు విశేషాలు ఏమేమి ఉన్నాయో చెప్పేంతలో ఇంట్లో ఉన్న నిండు బిందెలో నీళ్ళు మొత్తం కాలువలో పారబోసి మళ్ళీ బోరింగ్ వైపు నడుస్తాడు. బోరింగ్ కొట్టి ఇంకాస్త ఛాతీ, బైసెప్స్ పొంగించడానికి. అమ్మాయిలకి ఉచితంగా ఒక ప్రదర్శన ఇవ్వడానికి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే చేతిలో గొడ్డలి, బిందె లేకుండా ఉండి, ఒంటి మీద చొక్కా కనుక ఉంటే మీరసలు మోదిన్ని ఎక్కడయినా గుర్తు పట్టలేరు.
తరంతరం నిరంతరం ఈ వారసత్వ భలేకుటుంబంలోని తమ్ముడు మా మాబుగాడిని ఎప్పుడైనా “నీ జీవితాశయం ఏంట్రా?” అంటే, ఒంటి మీద చొక్కా లేకుండా, తొడల వరకు మాత్రం చిన్న నిక్కర్ వేసుకుని, మెడలో ఒక వెండి గొలుసు ధరించి మాంచి డబ్బున్న ఆంటీల ఇళ్ళ పక్కన ఇళ్ళు అద్దెకు తీసుకుని వాళ్ళు తనని చూస్తూ ఉన్నప్పుడు చెమట కారేంత ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం అంటాడు. ఒక రోజు సెకండ్ షోలో జిగర్ అనే అజయ్ దేవ్‌గణ్ సినిమా చూసి వస్తున్నాము. అందులో హీరో కాస్త కసరత్తులు అవీ చేస్తూ ఉంటాడు. సినిమా ముగిసేసరికి ఒంటి గంటో రెండో అవుతుందప్పుడు. వీడు అప్పటికే ఆ సినిమా వల్ల కానివ్వండి అజయ్ దేవ్‌గణ్ కసరత్తుల వల్ల కానివ్వండి ప్రభావితమై ఉన్నాడు. మా నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గరికి రాగానే, “ఒక అరగంట ఆగండి రా” అని వాటర్ ట్యాంక్ కాంపౌండ్‌లోకి నడిచాడు, ఆ కాంపౌండ్ లోపల శరీరం వేలాడ్డానికి, ఛాతీ, భుజాలు బలంగా మలుచుకోడానికి కొన్ని ఇనుప బార్లు నాటి ఉంటారు. వీడు చొక్కా విప్పి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ అసలు అజయ్ దేవ్‌గణ్ అనేవాడు వీడి ముందు ఎందుకు పనికిరాని వాడు అని నిరూపించడానికి ఒక అరగంట సర్కస్ చేసాడు. వీడూ వీడి ఎచ్చులు అని మా పళ్ళు పటపటా కొరుక్కోడం తప్ప మేము మాత్రం ఏమంటాం? మాకు అదంతా కొంచెం విసుగు వేసినా వాడి వేషాలు అన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.
మాబూకి థిక్ ఫ్రెండ్ అయిన శేఖర్‌ది కూడా అదో రకం సౌందర్యస్పృహ. ఈ మానవుడు హెయిర్ కట్ చేయించుకోడానికి నంద్యాలనుండి హైదరాబాద్ వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో తరచూ హైదరాబాద్ అంటే మామూలు మాటలు కాదు! అయినా అదో పిచ్చి. అదంతా సంజయ్ దత్ ఖల్నాయక్ రోజులు, శేఖర్‌కి జుత్తు భుజాల వరకు ఉండేది, హైదరాబాద్ వచ్చి జాగ్రత్తగా మహా అంటే తులం లేదా తులంన్నర మాత్రమే హెయిర్ కట్ చేయించుకుని వెనక్కి వచ్చేవాడు. అట్లాంటి హెయిర్ స్టయిల్ ఉన్నవాడు అప్పట్లో ఎవడూ లేడు మా నంద్యాల మొత్తానికి. వాడికి కూడా జుత్తు ఎక్కువే, దాని పోషణ పిచ్చీ ఎక్కువే, ఒకసారి శేఖర్ మాబూ ఇద్దరూ హైదరాబాద్ వచ్చి చెరో తులం జుత్తు మంగలాయనకి మొక్కు చెల్లించుకుని కోఠీ ఫుట్‌పాత్ మీద ఎర్రనివో జత, ఆకుపచ్చవి ఓ జత బూట్లు, ఇంకా బెల్టులు తదితర సౌందర్యోద్దీప కిరాణపచారి కొనుక్కుని ఒక బస్సు టికెట్‌కు డబ్బులు లేక లారీ ఎక్కి నంద్యాలకు వచ్చారు. దారిలో మాబుగాడు కసురుకుంటాడు కదా,
“ఒరే శేఖర్, ఏందిరా నువ్వు చేస్తున్న పని?”
“నేనేమీ చేసినా బావా?”
“నువ్వు తొడుక్కున్న బూట్లు నా బూట్లకు తగులుతున్నాయ్ రా, నా బూట్లకు మన్ను అవుతుందిరా, కొత్త బూట్లు రా ఇవి, కాళ్ళు దూరం పెట్టుకోరా,” ఏం శేఖర్వి మాత్రం కొత్త బూట్లు కాదా? అట్లా ఉంటాది వీడితో వ్యవహారం.
మనం ఇంట్లోకి వస్తూ వస్తూ ఎలా వస్తాం? ద్వారం వద్ద రెండు తలుపులు ఉంటాయి కదా, ఒకటి తెరిచి ఉంటే చాలు చక్కగా పట్టిపోతాం కదా, మాబుగాడు అలా కాదు, రెండో తలుపు తెరిపించుకుని కానీ మరీ లోపలికి రాడు, ఏంరా అంటే నేను వెడల్పు మనిషిని కదరా అంటాడు. అందుకని మనం టేపు పట్టి వాడి నలభై అయిదు కేజీల వెడల్పుతనాన్ని కొలవనక్కరలేదు. వాడు మాబుగాడు. వాడంతే! ఎవడు కొడితే చర్మం చీలుతుందో, ఎవడు కొడితే ఎముకలు కుళ్ళుతాయో వాడే మాబుగాడు, వాడి మాటే వేరు, వాడి రూటే వేరు, వాడి హైటే వేరు.
నూనెపల్లెలో మాబుగాడి ఇంటి పక్కనే మహేష్ అని వాడి ఫ్రెండ్ ఒకడు. ఆ రోజుల్లో మా నూనెపల్లె జనాభాలో అరవై శాతంమంది నందమూరి రామారావు అభిమానులు అయితే వాళ్ళ సంతాన జనాభా అంతా బాలకృష్ణ ఫ్యాన్స్. ఈ మహేష్ కూడా బాలకృష్ణ ఫ్యాన్ పార్టీ వాడే. అప్పట్లో ఒకసారి హైదరాబాద్ వచ్చి ఏదో ఒక షూటింగ్లో బాలకృష్ణతో కలిసి ఒక ఫోటో దిగాడు. ఆ ఫోటోని మాబూ చూశాడు. చూసి నన్నడిగాడు.
“రే అన్వర్, విజయశాంతి ఎంత హైట్ ఉంటాదిరా?”
“బానే ఉంటాదేమోరా”
“అలా కాదురా, ఇప్పుడు మహేష్ గాడు బాలకృష్ణతో ఫోటో దిగినాడు కదా, వాడు బాలకృష్ణ చెవుల కిందికి వస్తున్నాడు. సినిమాల్లో విజయశాంతి బాలకృష్ణ చెవులపైదాక వస్తుంది. ఇప్పుడు మహేష్ గాడు నా పక్కన నిలబడితే నా చెవుల కింది కన్నా కొంచెం పైకి వస్తాడు, అంటే బాలకృష్ణ నా కన్నా ఒక వెంట్రుక మందం ఎత్తు ఉంటాడు. విజయశాంతి నా పక్కన వచ్చి నిలబడితే విజయశాంతి నా చెవులపైకి రవ్వంత పైకి ఉంటుంది, అంటే విజయశాంతి మనకన్నా హైట్ తక్కువమ్మా”… ఇక్కడ ఏం పెద్ద విషయం ఏమీ ఉండదు, ఎప్పుడయినా వీడు విజయశాంతి ఎదురెదురు పడ్డం జరిగితే ఇద్దరికీ లైన్ క్లియర్ కావడానికి ఇద్దరి ఎత్తు అనేది అడ్డం కాదు, కారాదు అనేదే నీతి. నీ సంగతి మాకు తెలుసుగా మాబూ మళ్ళీ మాక్కూడా అంతగా చెప్పాలా చెప్పూ?
మాబుగాడు, మధుగాడు ఇద్దరూ డ్రయివింగ్ పిచ్చోళ్ళు, డ్రయివింగ్ బాగా తెలిసినవాళ్ళు కూడా, అయినా మాబూ, మధు డ్రయివింగ్ కౌశలాన్ని ఒప్పుకోడు. “వాడు మనకన్నా కొంచెం ఎత్తు ఎక్కువ కానీ డ్రయివింగ్ మాత్రం తక్కువేనమ్మా” అంటాడు. మళ్ళీ ఇద్దరూ కలిసి ఒకళ్ళ చొక్కాలు ఒకరు వేసుకోవడాలు, కాళ్ళకు చెప్పులు మార్చుకోవడాలు, ఒకే సిగరెట్ ఊదడాలు, ఒకే బీరు కొట్టడాలు మామూలే, తమ్ముడు తమ్ముడే, బండి బండే. ఒకసారి మా అజీమ్ చెల్లెలు పెళ్ళికి అని వాళ్ళ బంధువులు లారీలో వచ్చారు, లారీ ఇంటి ముందు పెట్టి మధ్యాహ్న భోజనానికని డ్రైవర్ ఆ సైడు ఎక్కడికో వెడితే ఈ ఇద్దరూ కలిసి బీగాల అవసరం లేకుండా ఒక పావలా బిళ్ళ పెట్టి కొట్టి లారీని స్టార్ట్ చేసి ఎటో వెళ్ళిపోయారు. ఇక్కడ రెండు చేతులు తలమీద పెట్టుకుని ఆ రోడ్డు తట్టునే చూసే అజీం అవస్థ చూడాలి. సమయం చూసుకుని ఒక ఆర్టీసీ బస్సుని లేదా హీనపక్షం ఒక మిలటరీ ట్యాంక్‌ని హైజాక్ చేసి డ్రయివింగ్ చేద్దామనే కోరిక ఇద్దరికీ బలంగా ఉండేది కానీ, ఎందుకో అది కుదిరినట్లు లేదు.
మాబూ డిగ్రీ వరకు చదివాడు, మంచి మార్కులతోనే పాసయ్యాడు, వాళ్ళది పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా ఇంటి వసారాలో పడకకుర్చీలో వాళ్ళ నాయన కాస్త సైజు తక్కువ ఎస్.వి. రంగారావుగారిలా కూచుని నెత్తికో, మీసాలకో నల్ల రంగు వేసుకుంటూనే ఉంటాడు. ముచ్చటగా ఉండేది ఆ ఇల్లు, ఎప్పుడూ బిలబిలమని మనుషులు, చిన్న చిన్న పిల్లలు, చక్కని అక్కాచెల్లెళ్ళు, నవ్వుతూ పలకరించే వదినలు, అంతటి సంసారం అంతటిని వాళ్ళ పెద్ద అన్న ఒకడే లాగేవాడు. ఏవయిందో ఏమో తెలియదు ఒక్కసారిగా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. నేను అప్పటికే హైదరాబాదు వచ్చేసి దినానికి మూడు పూటలు, ఆ మూడు పూటలకు కావలసిన మూడు కంచాల అన్నం కోసం, అబద్ధం, మోసం, అప్పు, ముష్టి అనేవి చేయకుండానే ఎలా సంపాదించాలా అనే సమస్యాపూరణంలో ఉన్నాను. ఆ రోజుల్లో మిత్ర పంచకం ఏం చేస్తున్నారు అనే సమస్యే లేదు.
మాబు ఏం అవ్వాలనుకున్నాడో ఏం కలలు కన్నాడో కూడా మాకు తెలీదు. వాళ్ళ సంసారం చక్రం నడపడానికి లారీ చక్రం పట్టాడు. లోడు వేసుకుని వెళ్తున్న దారిలో ఎవరో ప్యాసెంజర్ ఆపుతారు, నాలుగు డబ్బులు వస్తాయని ఆయన్ని ఎక్కించుకుంటాడు, మాటా మాటా కలుస్తుంది. “ఏం తీసుకుపోతుండావ్ లోడ్” అని ఆయన అడుగుతాడు, వీడు ఇసక అంటాడు, “ఇప్పుడు ఎంతుందో ఇసక రేటు” అనడుగుతాడు ఆయన. “చూడన్నా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అయితే బండి ఇసక ఇంత ఉండేది, ఇప్పుడు రోజులు మారిపోయినాయి”… బాణం తగులుతుంది. ప్యాసెంజర్ డంగై పోతాడు. మర్యాదగా “అన్నా మీరు డిగ్రీ చదివి, ఈ పని చేస్తున్నారా?” అంటాడు, అప్పుడు మాబుగాడు నుదుటి మీద వేలితో ఒక గీతలా లాగి ఏం చేస్తామన్నా… అని మొదలెడతాడు. మళ్ళీ ఎక్కడో మరో ప్యాసెంజర్ లారీ ఎక్కుతాడు, బండి సాగుతూ ఉంటుంది “అబ్బా ఈ రోడ్డు ఎప్పుడు పూర్తి అవుతుందో, ఇన్నాళ్ళబట్టీ వేస్తున్నారు” అని ఆయన విసుక్కుంటాడు. “అవును పెద్దమనిషి దీనిని, నేను డిగ్రీలో ఉన్నప్పుడే మొదలుపెట్టినారు, అప్పటినుండి ఇంకా”… బాణం తగులుతుంది. ప్యాసెంజర్ డంగై పోతాడు. మర్యాదగా “అన్నా మీరు డిగ్రీ చదివి, ఈ పని చేస్తున్నారా?” అంటాడు, అప్పుడు మాబుగాడు నుదుటి మీద మళ్ళీ ఒక గీతలా లాగి ఏం చేస్తామన్నా… అని మొదలెడతాడు. ఈ ఆవు మీది వ్యాసం అనేది అంతులేని కథ.
సుమారు పది, పదిహేను సంవత్సరాల క్రితం మాబుగాడిని శేఖర్ తమ్ముడి పెళ్ళిలో అందరం మిత్రులం కలిసినాం. లారీ డ్రయివర్ జీవితం వాడి మీదికి ఎక్కేసింది. మనిషి నలిగి నాశనం పట్టి ఉన్నాడు. మా కామన్ ఫ్రెండ్ పార్థూ వచ్చి “ఏందన్నా మాబూ అప్పట్లో నీకు సిక్స్ ప్యాక్ బాడీ ఉండిన్యాది, ఇప్పుడు పొట్ట ఫ్యామిలీ ప్యాక్ అయిపోయిందే,” అని జోక్ వేశాడు, మాబూ సన్నగా నవ్వాడు, కానీ సైలెంట్‌గా ఉన్నాడు, జవాబు లేదు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ లేదు. వీడు పాత మాబు కాదు. వీడెవడో మనకు తెలీదు.
మా శేఖర్ కొత్త ఇల్లు కట్టాడు ఆగష్ట్ 20, 2021న గృహ ప్రవేశం జరిగింది. వన్-బై-టు టీకి డబ్బులు ఎట్లారా దేవుడా అని అనుకునే పిల్లలం కదా. ఈ రోజు శేఖర్ కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అంటే మహా గర్వంగా అనిపించింది. పాత మిత్రులం అందరం కలిశాం. ప్రతి ఒక్కరు కలవగానే తొలిగా మాబుగాడిని అడగడమే, వాడిని తలుచుకోడమే, ఎవరి దగ్గరా వాడి కాంటాక్ట్ లేదు. కోతి నా కొడుకు ఏం చేస్తున్నాడో, ఏమో! ఫ్యామిలీతో రావాల్సిన విశేషం కదా, ఈసారి తప్పింది కానీ మళ్ళీ ఒకసారి వాడితో సహా కలవాలబ్బా.
ఒక నెల తరువాత శేఖర్ నంద్యాల రోడ్డు మీద సాగి పోతున్నాడు, “శేఖరన్నా, శేఖరన్నా” అని ఎవరో పిలుస్తున్నారు. శేఖర్ ఆగాడు. ఆ మనిషిని గుర్తు పట్టలేదు. “ఏమన్నా గుర్తు పట్టలేదా? నేను మీ మాబు ఫ్రెండ్‌ని నాగరాజుని.” “ఓ నాగరాజు నువ్వా, బావుండావా?” “బావుండా అన్నా, నీకు తెలుసో తెలీదో మీ మాబు లాస్ట్ మంత్ చచ్చిపోయిండు.”
సరిగ్గా నెల కిందటి ఉదయం నేనూ, సేనాగాడు, మధు గాడు, సిద్దిఖీ, అజీమ్… శేఖర్ కొత్త ఇంట్లో గారెలు పచ్చడి తింటున్నాము, బహుశా అప్పుడు అక్కడ మా మాబుగాడిని స్నానానికి సిద్ధం చేస్తూ ఉండి ఉండవచ్చు. మధ్యాహ్నం అన్నాలప్పుడు సిద్దిఖీ నా కంచంలో ఒక మిరపకాయ బజ్జీ ఎగస్ట్రా వేస్తున్న సమయంలో మా మాబుగాడిని దిక్కు తెలియని ఒక ఊరి రోడ్డు మీద ఊరేగింపుగా తీసుకు వెళ్ళి, మా ఊరిది కాని ఏదో ఒక ఊళ్ళోని శ్మశానం మధ్యన ఖననం చేస్తూ ఉండవచ్చు. “రే మాబుగా అన్యాయంరా! కాలేజీలో గ్రూపు మారితే మారితివి కాని నువ్వు ఈడనే మన నూనెపల్లెలోనే చావాల్సిందిరా, రేపో ఎల్లుండో నీ పక్కనే వచ్చి అందరం కుదురుకునే వాళ్ళం కదరా నాయనా! ఆ కొత్త ఊళ్ళో. ఆ కొత్త మనుషుల మధ్య నీకు పొద్దు ఎట్టా పోతాదిరా బాబు? నువ్వు లేకుండానే మా అందరి మరణానంతరం నూనెపల్లె శ్మశానం కింది ఆకాశంలో మాకెట్టా పొద్దుపోతాదిరా నాకొడకా?”
ప్లేటో అంటారు -– “నేనే ఆకాశాన్నైతే నీపైన పరుచుకుని లక్ష నక్షత్ర నేత్రాలతో నిన్ను వీక్షిద్దును కదా!” నేను ప్లేటోనీ కాను, ఆకాశాన్నీ కాను. నేల కింద పడి ఉన్న సన్న కంకర రాయిని. తలెత్తి మా ఊరి నెలవంక చూస్తూ రాసుకున్న ముప్ఫై రెండు జ్ఞాపకాల ఉచ్ఛ్వాస నిశ్వాసలివి. మూడు వందల పేజీల కాగితాల్లో చుట్టిపెట్టిన జ్ఞాపకాల పరిమళాల పుస్తకపు పొట్లం ఇది. ‘పాత నెలవంక’ అనే ఈ పుస్తకం పొందడం పట్ల ఆసక్తి ఉన్నవారు వివరాలకు +919347234086 అనే నంబర్లో వాట్సాప్ మెసేజ్ ద్వారా సంప్రదించగలరు.