వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, అన్వయక్లేశం మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పుడా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో —
కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.
— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.
ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు; కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది; కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు, క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి – అని అన్వయించుకోవాలి. సుబ్రహ్మణ్యకవిగారు ప్రవచించిన సంప్రదాయార్థం లభింపనందువల్ల నేను ఉన్నంతలో పద్యాన్ని మేనమామ పోలికగా అన్వయించాను.
తెనాలి రామకృష్ణ అనే చిత్రంలో కృష్ణదేవరాయల ఆస్థానానికి కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు వచ్చి, ‘రాజానందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయ వేమ ధరణిపతికి’పద్యానికి అర్థాన్నడగటమూ, రామకృష్ణకవి చేతిలో భంగపడటమూ రమ్యంగా చిత్రీకరింపబడిన దృశ్యం ఇటువంటి విద్వత్పరీక్షాప్రకరణం లోనిదే. పూర్వకవులు ఏకాక్షరాధారితంగానూ, ఏకసమాసనిష్ఠంగానూ చెప్పిన కఠినపద్యాలకు తరగతి గదిలో వల్లెవేసిన నిఘంటువులను బట్టి భావాన్ని గుర్తుపట్టడం ఒకప్పటి పాఠశాలలలో గురువులు విద్యార్థులకు నేర్పించేవారు.
దదదదదదదదదదదదదద దదదదదద దదద దదదదదదదదద
దదద దదదద దదద దదద దదద దదదద దదదద దదదద దదదద.
(శరణాగతులకు స్వాధీనుడవై, ఉదాసీనులైనవారియందు ఉదాసీనుడవై, పాపస్వభావులకు సంహారకర్తవై, రాక్షసాంతకుడవై, సజ్జనులను ప్రభవింపజేయువాడవై, ధర్మాధర్మానుసారకులకు ఆధారభూతుడవై, సత్స్వభావులను కాపాడి ముక్తినొసగువాడవై, సత్స్వభావులను బాధించువారికి బాధకుడవై, సజ్జనరక్షకులకు రక్షకుడవై, జగత్తుయొక్క బహిరంతరాలలో వసించు వాసుదేవుడవైన పరమపురుషా! శరణు! శరణు!)
12వ శతాబ్దంలో భగవద్రామానుజుల వారి శిష్యుడు శ్రీవత్సాంకులవారు (కూరత్తాళ్వార్) రచించిన యమకరత్నాకరం పన్నెండవ ఆశ్వాసంలోని శ్రీకృష్ణస్తుతిపరకమైన ఒక ఏకాక్షరశ్లోకం ఇది. తనను చేరదీసి, ఆదరాభిమానాలను కురిపించి, అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మను నోరారా సన్నుతిస్తున్న బాల్యమిత్రుడు సుదాముని మనోగతం ఇది. అరవైనాలుగు లఘువుల అచలధృతి శ్లోకమంతా, ద అన్న ఒక్క అక్షరంతోనే సాగింది.
దదదదదదదదదదదదదద – దదత్ + అదదత్ + అద + దదత్ + అదదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = దాతలయందు, అదదత్ = దానస్వభావము లేనివారియందు, అద = భక్షకులైనవారియందు, దదత్ = ఆత్మసమర్పణము చేసికొను భక్తులయందు, అదదత్ = భవబంధముల పట్ల ఉదాసీనులగువారియందు, అద = ఆత్మజ్ఞానకరుడవు (లేదా) అదదత్ = లోకభక్షకులైన పాపులయందు, అద = పీడాకరుడవు అయిన లోకేశ్వరా; దదదదదద – దదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధర్మశీలురైనవారిని, అదత్ = బాధించునట్టి లోకకంటకులను, అద = సంహరించు జగద్రక్షకా; దదద – దద = త్యాగశీలురగు ధర్మమూర్తులను, ద = ప్రభవింపజేయువాడా; దదదదదదదదద – దదత్ + అదదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధార్మికులయందు, అదదత్ = కర్మాకర్మములయందు వైరాగ్యము నూనినవారియందు, అదత్ = కర్మబంధములకు లోగినవారియందు, అద = సమచిత్తము గలిగి యుగాంతవేళ సర్వమును ఉపసంహరించు పరమపురుషా; దదద – దద = ధార్మికులను, ద = చిత్తమున ధరించి యుండువాడా; దదదద – దదదత్ = ధర్మమూర్తులగు ఋషులను హింసించు రాక్షసులను, అద = నశింపజేయు శ్రీ వాసుదేవా; దదద – దదత్ = యజ్ఞములచే దేవతలకు హవ్యరూపములైన ఆహుతులను సమర్పించెడి యాజ్ఞికులకు, అద = రక్షకుడవైన పరమేశ్వరా; దదద – దదత్ = నీ భక్తులగు ఉత్తములను, అద = శోధించెడివాడా; దదద – దదత్ = లోకరక్షార్థమై కారుణికులగువారిని, అద = రక్షించు దయార్ద్రమూర్తీ; దదదద – దద = ధర్మరతులైనవారిని, ద = బాధించు దుష్టులను, ద = మట్టుపెట్టువాడా; దదదద – దదత్ = ధారకులకు, అద = ధారకులు కానివారికి, ద = కర్మఫలములను ప్రసాదించు స్వామీ; దదదద – దదత్ = లోకకంటకులకు, ద = అండగా నిలిచి కాపాడు నీచులను, ద = హరింపజేయు పరమాత్మా; దదదద – దదత్ = సర్వప్రదాతవగు, అదదత్ = కర్మఫలముల అంతమొందింపజేసి సద్భావమునొసగు, అ = శ్రీ వాసుదేవా! అని అర్థబోధం.
తెనాలి రామకృష్ణకవికి అత్యంతప్రీతిపాత్రమైన కావ్యరాజం ఈ యమకరత్నాకరం. తెలుగులోనూ ఇటువంటివనేకం ఉన్నాయి. వ్యాకరణపాండిత్యం, వ్యాఖ్యానసాహాయ్యం లేకపోతే అర్థం చేసుకోవటం సులభం కాదు. ఇదొక తీరు ప్రౌఢి. పద్యం వినగానే, తెలుగా? సంస్కృతమా? అనిపించేది మరొక తీరు. ఇది తెనాలి రామకృష్ణకవి రచించిన దశావతారస్తుతి లోని పద్యమట:
ద్యూత్తంభద్గిరికల్పితావతరణద్యోవాహినీ సంగమో
పాత్తేందూదయ నిష్పితౄణ జలధిప్రారబ్ధ పుత్త్రోత్సవో
దాత్తత్వాత్త గజాశ్వ వన్యశన కన్యా గో మణీ దాన సం
పత్తిప్రీణితదేవ ఢుల్యధిపతిబ్రహ్మన్! స్తుమ స్త్వా మనున్.
(ఓ ప్రభూ! దేవదానవులు అమృతంకోసం మందరపర్వతాన్ని కవ్వంగా చేసికొని సముద్రాన్ని చిలికినప్పుడు నీవు లోకరక్షణార్థమై తాబేలు రూపు ధరించి ఆ పర్వతానికి ఆధారమై నిలిచావు. నీవు మూపుపైని ధరించిన మందరపర్వతం వారి మథనవేగానికి గిరగిర తిరుగుతూ ఆకాశాన్ని తాకినప్పుడు ఆకాశగంగ ఆ పర్వతం ద్వారా సముద్రంలోకి దిగివచ్చింది. ఆ గంగతోడి సంగమం వల్ల సముద్రునికి చంద్రుడనే కొడుకు పుట్టాడు. పుత్త్రోదయం మూలాన తనకు పున్నామనరకం నుంచి విముక్తి లభించి, పితౄణం తీరినదని సముద్రుడు ఆ సంతోషం పట్టలేక గజదానం, అశ్వదానం, వనదానం, అన్నదానం, కన్యాదానం, గోదానం, మణిదానం చేసి దేవతలను తృప్తిపరిచాడు. దేవా! అట్టి కూర్మావతార శ్రీమహావిష్ణువును నిన్ను స్తోత్రం చేస్తున్నాము!)
ఊహ ఎంత అందంగా ఉన్నదో, పద్యం అంత ప్రౌఢంగా ఉన్నది.
వాక్యాంతంలో అనున్ అన్న ఒక్క అనుకరణవాచకంతో పద్యం మొత్తం తెలుగైపోయింది. లేకపోతే ద్యూత్తంభత్ మొదలుకొని స్తుమ స్త్వామ్ వరకు ఉన్నదంతా సంస్కృతమే. ద్యు = ఆకాశమందు, ఉత్తంభత్ = మథనసమయమునందు ఎగురుచున్న, గిరి = మందరపర్వతముచేత, కల్పిత = ఒనగూడిన, అవతరణ = అవరోహణము గలిగిన, ద్యోవాహినీ = ఆకాశగంగయొక్క, సంగమ = సంభోగముచేత, ఉపాత్త = పొందిన, ఇందు = చంద్రుడు అను పుత్త్రునియొక్క, ఉదయ = ఆవిర్భావహేతువుచేత, నిష్పితౄణ = పితృఋణము తీరిన, జలధి = క్షీరసముద్రనామక పితచేత, ప్రారబ్ధ = ఆరంభింపబడిన, పుత్త్రోత్సవ = కుమారోత్పత్తి సంబంధమయిన ఉత్సవమందలి, ఉదాత్తత్వ = సంపదకు, ఆత్త = సమానములయిన (తగిన), గజాశ్వ వన్యశన కన్యా గో మణీ దాన – గజ = ఐరావతము, అశ్వ = ఉచ్చైశ్శ్రవము, వనీ = కల్పవృక్షారామము, అశన = అమృతము, కన్యా = దాసీసమేత లక్ష్మి, గో = కామధేనువు, మణీ = చింతామణి అనెడు, దాన = దానములయొక్క, సంపత్తి = సమృద్ధిచేత, ప్రీణిత = సంతోషపెట్టబడిన, దేవ = ఇంద్రాదిదేవతలు గలిగిన, ఢుల్యధిపతిబ్రహ్మన్ – ఢులీ = కమఠీదేవికి, అధిపతి = భర్తవైన, బ్రహ్మన్ = స్వామీ, త్వాం = నిన్ను, స్తుమః = స్తోత్రము చేయుచున్నాము. సంస్కృతంలో వేంకటాధ్వరి విశ్వగుణాదర్శానికి గొప్ప వ్యాఖ్యను రచించిన కురవి రామకవి ఈ దశావతారస్తుతికి సంస్కృతంలో చక్కటి వ్యాఖ్యను వ్రాశాడు. దానిని, దానికి తమ తెలుగు అనువాదాన్ని శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు చాటుపద్యరత్నాకరములో ప్రకటించారు.
ఇటువంటివి, కేవలం ఆరభటీ వృత్తిలో ఓజోగుణం నిండిన సంస్కృతసమాసభూయిష్ఠపద్యాలే కానక్కరలేదు, అచ్చతెలుగు సమాసాలూ సాధ్యమే కాని, అవి అంతగా అంతర్గతప్రౌఢికి ఉదాహరణీయాలు కావు.
నెలఱాతీనియ సంతనంపు మగఱా నీరాళపుం గొప్పటా
కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ
సల మేల్ బొబ్బమెకంబు చెక్కడపుఁ గీల్ జాగా జగా గద్దియన్
జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁగన్.
అని గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము (1-126). మొదటి మూడు పాదాలూ ఒక్క సమాసం. అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆనందనిలయావాసుడై దివ్యదీధితులతో విరాజిల్లుతున్న స్వర్ణసింహాసనాన్ని అధిరోహించి తనను చూడవచ్చిన భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహించినప్పటి దృశ్యం.
నెలఱా తీనియ= చంద్రకాంతశిలావేదికపైని, సంతనంపు = తాపబడిన, మగఱా = వజ్రములయొక్క, నీరాళపున్ = స్వచ్ఛమైన వన్నెమీరిన, గొప్ప + టాకుల – గొప్ప = పెద్దవియైన, టాకుల = వసారాలలోని, నిద్దంపు = స్నిగ్ధమగు, పసిండి = బంగరు రంగు, నున్ = మనోహరమైన, చవికె = మండపముయొక్క, నిగ్గుల్ = కాంతులను, తొట్టు = ప్రసరించు, కట్టాణి పూసల = మిక్కిలి గుండ్రని ప్రశస్త మౌక్తికవిశేషముల, మేల్ = విలువైన, బొబ్బమెకంబు చెక్కడపు = సింహపీఠికయొక్క, కీల్ = అందముగా కీలుకొలిపిన, జాగా = విశాలమైన, జగా = గొప్ప, గద్దియన్ = ఆసనముపై, చెలువు + ఎచ్చన్ = సౌందర్యము అతిశయింపగా, ఎల్లరును = సర్వజనులును, జే! జే! అంచున్ = జయజయధ్వానములు సల్పుచు, తన్ = తనను, కొల్వఁగన్ = ఆరాధించుచుండగా, కొలువు + ఉండెన్ = సభతీర్చియుండెను అని భావార్థం. ఇందులో సమాసదీర్ఘిమను మించిన దుర్ఘటార్థమేదీ లేదు.
ఇవికాక, ద్వ్యర్థికావ్యాలను, త్ర్యర్థికావ్యాలను చదివేటప్పుడు ఒక అర్థం సుగమం గానూ, ఒక అర్థం దుర్గమం గానూ ఉండటం కూడా పాఠకులకు అనుభవంలో ఉన్నదే. పింగళి సూరన్నగారి రాఘవపాండవీయములో
అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రకాశించు నా
కుక్షిద్వంశవతంసుఁ గన్గొని, ‘మహాగోదావరీతీరస
ద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్, రం!’ డంచు సంరక్షణా
పేక్షం ద ద్వనభూమిదేవతలు సంప్రీతిం గడున్మూఁకలై. (3-66)
అన్న పద్యాన్ని చూడవచ్చును. సుతీక్ష్ణముని ఆశ్రమంలో ఉన్న మునిగణానికి సీతారామలక్ష్మణుల రాకవల్ల రాక్షసుల బారినుండి విముక్తి లభిస్తుందన్న ఆశ మోసులెత్తింది. మహాగోదావరీతీరసద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్, అన్నప్పుడు – మహా గోదావరీ తీర = సువిశాలమైన గోదావరీతీరంలో ఉంటున్న, సత్ = సజ్జనులయొక్క, రక్షా = సంరక్షణకు, ఉపాయపథంబు = ఉపాయమార్గం, నేఁడు = ఇన్నాళ్ళకు, దొరికెన్ = దొరికినది అని, తద్వనభూమిదేవతలు – తత్ = ఆ, వనభూమిన్ = ఆశ్రమోద్యానవనంలోని, భూమిదేవతలు = బ్రాహ్మణులు సంతోషించారని రాఘవార్థంలో అన్వయించుకోవాలి. అందులో అన్వయక్లేశమేమీ లేదు. కఠినపదాలు లేవు. పదాలు ఒకదానితో ఒకటి పొందుపడి ఉత్తరోత్తరాన్వయం సులభంగా ఉన్నది.
అయితే, పద్యాన్ని మహాభారత కథకు అన్వయించటం మాత్రం అంత సులభం కాదు. నిఘంటువుల పరిచయం కలిగి, శబ్దార్థాల అనువృత్తిక్రమం తెలిసి, బహురూపకావ్యానుభవం వలన ఒకపాటి పాండిత్యం ఉన్నవారికి సైతం సాధ్యం కాదు. అర్జునుడు కిరాతార్జునీయ ఘట్టంలో సాక్షాత్తు పరమశివుని ప్రతిఘటించి, ఆ మహాదేవుని మెప్పించి, ఆయన అనుగ్రహం వల్ల దివ్యశరాన్ని (పాశుపతాస్త్రాన్ని) సాధించి తిరిగివచ్చినప్పుడు అతనిని చూచిన ఇంద్రాదిదేవతలు, “మహాగోదావరీతీరసద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్” అనుకొన్నారని ఉన్న “మహత్ + ఆగః + దావ + రీతీ + రసత్ + రక్షః + అపాయపథంబు” అన్న పదచ్ఛేదమూ, ఆ పదచ్ఛేదానికి “మహా = గొప్ప, ఆగః = అపరాధాలతో, దావ = దావాగ్ని, రీతీ = వలె, రసత్ = ఘోషిస్తున్న, రక్షః = రాక్షసుల, అపాయపథంబు = వధోపాయ మార్గం, నేఁడు = ఇన్నాళ్ళకు, దొరికెన్ = దొరికినది, అని తత్ = ఆ, వనభూమిన్ = వనభూమికి విచ్చేసి అక్కడున్న, దేవతలు = ఇంద్రాదిదేవతలు సంతసించారన్న పాండవీయార్థమూ ఎంతటి పండితులకైనా స్ఫురించటం కష్టమే. వ్యాఖ్యానసాపేక్ష మైనందువల్ల కొంత దుర్ఘటార్థమే. ఇది పదాల విరుపు (సభంగశ్లేష) మూలాన ఏర్పడిన అన్వయప్రౌఢి. ఇక మూడర్థాలు, నాలుగర్థాలు, ఏడర్థాలు, ముప్ఫై అర్థాలు, నూరర్థాలు ఉన్న రచనలలోని ప్రౌఢిని ఊహించుకోవాలి.
ఇక నానార్థకృతమైన ప్రౌఢి వేరొక విధంగా ఉంటుంది. ద్వ్యర్థిఘటనానికంటె కొంత క్లిష్టతరమైన కూర్పు ఇది. మహామహోపాధ్యాయులు, కళాప్రపూర్ణులు, కవిరాజ, కవిసార్వభౌమాద్యనేక బిరుదాంచితులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రుల వారు రచించిన ప్రౌఢగంభీరమైన మహాకావ్యం నైషధీయచరితము లోని ఒక పద్యాన్ని చూద్దాము. దమయంతి స్వయంవరానికి విచ్చేసిన రాజసమాజంలోకి ఇంద్రాగ్నియమవరుణులు అచ్చమూ కథానాయకుడు నలుని వేషంలో వచ్చి కూర్చొన్నప్పటి సన్నివేశంలో కథానాయిక దమయంతికి చెలికత్తె ఆ నిషధరాజపంచకాన్ని చూపి వర్ణించిన సందర్భంలో శాస్త్రిగారు అమోఘమైన ఈ పద్యాన్ని వ్రాశారు. సంస్కృతనైషధంలో అతిదీప్తంగా ఉన్న ఈ ఘట్టాన్ని శ్రీనాథుడు ఇటువంటి అనేకార్థరచనల పట్ల అంతగా ఆసక్తి లేనందువల్ల ఈ సందర్భంలో కథాసామాన్యములైన ఉపమలతో సంక్షిప్తంగా లాగించివేశాడు. రామరాజభూషణుడు తన హరిశ్చంద్రనళోపాఖ్యానములో ఇక్కడ నలపంచకంతోపాటు హరిశ్చంద్రుని కథనుకూడా కలుపుకొని ఆరు అర్థాలతో అనిర్వచనీయమైన సత్త్వగరిమతో వ్రాసినా, ఈ మూడింటినీ దగ్గరుంచుకొని చదివినప్పుడు గుణాగుణవిమర్శకుల చేతి త్రాసులో ముల్లు శాస్త్రిగారి పద్యానికే మొగ్గుచూపుతుంది:
బుధులం బ్రోచెడువాఁడు, వాసవుఁడు, సంపూర్ణప్రతాపప్రభా
కథితుం, డధ్వరమార్గజిష్ణుఁ, డతులాఖ్యావాహినీసేవితుం,
డధికైశ్వర్యసమంచితుండు, సమవర్త్యాఖ్యాంచితప్రఖ్యుఁ డై
ప్రథితుం డై ప్రసరిల్లు నీ ఘనుఁడు సుత్రాముండు చూతే? సతీ! (నైషధీయ. 4-50)
దీనికి కృష్ణమూర్తిశాస్త్రిగారే స్వయంగా కూర్చిన లఘువ్యాఖ్య ఇది: “ఇందు నలునకును, ఇంద్రాగ్నియమవరుణులకు చెప్పఁబడినది. బుధులం బ్రోచెడువాఁడు = విద్వాంసులను సాఁకువాఁడు నలుఁడు, దేవతలను సాఁకువాఁడు ఇంద్రుఁడు లోనగువారు; వాసవుఁడు = వసూని సంతీతి వాసవః స్వర్ణరత్నాదిధనము కలవాఁడు నలుఁడు; ‘దేవభేదేఽనలే రశ్మౌ వసూ రత్నే ధనే వసు’ అమరము. వస నివాసే, ఆచ్ఛాదనే, వసు = కిరణములు కలవాఁడు వసునామము గలవాఁ డగ్ని. రత్నములు గలవాఁడు వరుణుఁడు, వస్తీతి వసుః, ఆచ్ఛాదించువాఁడు యముఁడు, వాసవనామము గలవాఁ డింద్రుఁడు; ఇట్లు వాసవశబ్దము పై నేఁగురకు సమన్వయించును; సంపూర్ణప్రతాప ప్రభా కథితుండు, ప్రతాపము = కోశబలమువలనఁ గలిగిన తేజము, శక్తి, లోనగునవి కలవా రింద్రాదులు; ప్రతపం త్యనేన శత్రూనితి ప్రతాపః, ‘తప సంతాపే’ ప్రభవం త్యనేన శాసితుం జగతి ప్రభావః, జగత్తునేలుటకు సమర్థులు ఈ యర్థము లేవురకుం జెప్పవచ్చును; అధ్వరమార్గజిష్ణుఁడు = యజ్ఞమార్గముచేత నింద్రుఁడు, అనఁగా ఇంద్రుఁడువోలె వైదికమార్గమును నడపువాఁడు, జిష్ణుఁడు = జయశీలుఁడు నలుఁడు; అధ్వరములు చేసినవాఁడు, జిష్ణునామము కలవాఁడు ఇంద్రుఁడు; ‘అధ్వానం రాతీ త్యధ్వరః’ మార్గములను గ్రహించినవారు, మృగయం త్యనే నేతి మార్గః, మృగ అన్వేషణే; దీనిచే బ్రహ్మపదార్థము నన్వేషించినవారు, జిష్ణులు = జయశీలు రని యింద్రాదులకునుం జెప్పవచ్చును, అతులాఖ్యావాహినీసేవితుండు = పోలికలేని పేరు గల సేనలచే సేవింపఁబడువాఁడు నలుఁడు; వాహిని = నది, నదులచే సేవింపఁబడువాఁడు వరుణుఁడు, వహతి, వాహయతీతి చ వాహినీ, వహ ప్రాపణే = ప్రవహించునది, ప్రయత్నము సేయునది. వహ ధాతువుం బట్టి నానార్థము నింద్రాదులకుం జెప్పవచ్చును. అధికైశ్వర్యసమంచితుండు = గొప్ప సంపదచే నొప్పువాఁడు నలుఁడు, అణిమాద్యష్టభూతులచే నొప్పువారును, “ఈశ్వరస్య భావ ఐశ్వర్యం” లోకప్రభుత్వముచే నొప్పువారు ఇంద్రాదులు, ఇది నలునకుం జెల్లును. సమవర్త్యాఖ్యాంచితప్రఖ్యుఁడు = సర్వసమత్వము గలవాఁ డను పేరుతోఁ దుల్యుఁడు (అనఁగా సమవర్తితోఁ దుల్యుఁడు, అని నలార్థము) సమవర్తి యను పేరుగలవాఁడు యముఁడు; న్యాయముగాఁ బాలించువా రింద్రాదులు; సుత్రాముండు = సుష్ఠు త్రాయత ఇతి సుత్రామఁ, బాగుగాఁ బాలించువాఁడు నలుఁడు, ఇంద్రాదులును, సుత్రాముఁడు అని యింద్రునకు నన్వర్థనామముం గలదు.”
ఇది బహ్వర్థకృతమైన ప్రౌఢి. ఒక మహాకవి తన పద్యానికి తానే స్వయంగా వ్యాఖ్యను నిర్మిస్తే ఎంత ఆనుభవిక రామణీయకతతో ఉంటుందో చూడగలరని వారి మాటలనే ఉదాహరించాను.
ఇంకొకటి భాషాశ్లేషరూపమైన ప్రౌఢి. ఒక రచనలోని పదాలకు గల నానార్థాల వల్ల, పదాల విరుపులోని మార్పుల వల్ల, సందర్భాన్ని బట్టి వాక్యాన్ని అన్వయించటంలోని వైవిధ్యం వల్ల సరికొత్త అర్థాలను సాధిస్తున్నట్లే, భాషాశ్లేషలో రచనకు రెండు వేర్వేరు భాషలలో అర్థాన్ని కూర్చటం జరుగుతుంది. ఒక సంస్కృతాంధ్రభాషాపద్యానికి సంస్కృతశ్లోకంగా ఒక అర్థం, తెలుగు పద్యంగా ఒక అర్థం ఉంటాయన్నమాట. అటువంటి రచనను చేయగలగటం ఎంత కష్టమో, అందులో నిక్షిప్తం చేసిన భాషలన్నీ వచ్చినవారికి కూడా దానిని సార్థకంగా అన్వయించుకోవటం కూడా అంతే కష్టం. స్వభావతః అదికూడా అసాధారణమైన ప్రౌఢనిర్మాణమే. ఈ క్రిందిది శ్రీపాద వేంకటాచలకవి రచించిన అపురూపమైన ద్వ్యర్థికావ్యం రామకృష్ణోపాఖ్యానము లోని ద్విభాషాకందం:
పరిపూర్ణరుగంచితవా
ఙ్నరహరిగురురూపమాత్మనాతేకువరా
గరమాధవమన్యేహిత
కిరివరమహమురువిహారి కీర్తింతు సదా. (3-143)
దీనికి శ్రీపాద వేంకటాచలకవి మనసెరిగిన ఆయన కూర్మినెచ్చెలి వారణాసి లక్ష్మీపతికవి కూర్చిన ఉభయభాషామనోరంజనీ వ్యాఖ్య: “తెలుగునకు అర్థము – పరిపూర్ణమైన రుక్ కాంతిగలయట్టియును ౹ అంచితమైన వాక్కులుగలయట్టియును నరహరియొక్క ఉత్కృష్టస్వరూపముగలయట్టియును ౹ రమా లక్ష్మికి ౹ ధనము ౹ ప్రియమైన యట్టియును ౹ ఉరువిహారముగలయట్టియును ౹ అన్యులచేత ౹ ఈహిత ౹ కోరబడిన ౹ కిరివరమహము ౹ వరాహతేజమును ౹ నాయొక్క తేకువ వచ్చుటకొరకు ౹ ఆత్మయందున ౹ సదా, కీర్తింతును ౹౹ సంస్కృతమున నన్వయించెడి క్రమము ౹౹ పరిపూర్ణేతి ౹౹ కువర ౹ భూవర ౹ అగర ౹ గోవర్ధనధర ౹ అగం రాతి గృహ్ణాతీత్యగర ౹ మాధవ ౹ తే ౹ తవ ౹ హితకిరివరం ౹ ఉరువిహారో యస్మిం స్తదురు ౹ విహారి పరిపూర్ణరుక్ పరిపూర్ణరుక్ యస్మిన్ తత్ అంచితవాక్ అంచితా వాక్ యస్మిన్ తత్ నరహరిస్వరూప మహ మాత్మనా మన్యే కీర్తిం తు సదా మన్యే తు శబ్దస్య సముచ్చయార్థః ౹౹”
ఇది రెండు భాషలను ఏకత్రించిన భాషార్థాన్వయగతమైన ప్రౌఢి. ఇంకా చాలామంది కవులు ప్రయోగించిన చిత్రరచనమే. కళాపూర్ణోదయములో పింగళి సూరన ఒక కందాన్ని యథాక్రమంలో అనులోమంగా చదివితే తెలుగు, దానిని వెనుకనుంచి విలోమరూపాన చదివితే సలక్షణమైన సంస్కృతశ్లోకం వచ్చేట్లు వ్రాసిన అపురూపమైన రచన సుప్రసిద్ధమే కనుక ఇక్కడ దానిని ఉదాహరించటం లేదు.
ఇవిగాక శబ్దనిష్ఠమైన అర్థబోధకశక్తిఫలంగా వేదాంతాదిశాస్త్రాలలోని నిగూఢార్థబంధురత వల్ల రూపొందే సాంకేతికమైన ప్రౌఢిక్రమం కూడా ఊర్జస్వలమే కాని, అది వక్తృశ్రోతల మధ్య సందర్భవశాన చోటుచేసుకొనే ప్రాసంగికత కావటం వల్ల లాక్షణికులు ఆ రచనలను పరిగణనలోకి తీసికొనే వీలుండదు. భారతం ఉద్యోగపర్వం (2-37)లో తిక్కన్నగారి పద్యం ఇది:
ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి,
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి,
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు
విడిచి వర్తించువాఁడు వివేకఘనుఁడు.
సంజయుడు ధృతరాష్ట్రునికి రాజధర్మాలను బోధించిన ప్రకరణంలోని పద్యం ఇది. ఒకటిన్ కొని = రాచరికాన్ని చేపట్టి, మంత్రశక్తి ఉత్సాహశక్తి అన్న రెండింటిని నమ్ముకొని, మిత్రులు శత్రువులు తటస్థులు అన్న మూడు వర్గాలవారిని సామ దాన భేద దండములనే నాలుగు ఉపాయాలతో వశపరచుకొని, త్వక్ (చర్మము) చక్షువు (కన్ను) శ్రోత్రము (చెవి) జిహ్వ (నాలుక) ఘ్రాణము (ముక్కు) అనే అయిదు ఇంద్రియాల ఆకర్షణలకు లోనుగాక వాటి ప్రభావాన్ని జయించి, సంధి (బలవంతుడైన శత్రువుతో పొందు) విగ్రహము (పోరు) యానము (దండయాత్ర) ఆసనము (దేశ కాల పరిస్థితులను బట్టి ఉపేక్ష వహించి ఉండటం) ద్వైధము (బలవంతులైన ఇద్దరు శత్రువులను ఎదుర్కొనవలసి వచ్చినపుడు ఒకరికి తెలియకుండా ఒకరితో సంధిచేసుకొని వారిలో వారికి వైషమ్యాన్ని కల్పించటం) ఆశ్రయము (శక్తి లేనప్పుడు బలవంతుని తోడుచేసుకోవటం) అన్న ప్రభుషాడ్గుణ్యంలో (రాజులకు ఆవశ్యకమైన విధానాలు ఆరింటిలో) ఎప్పుడు దేనిని ప్రయోగించాలో చక్కగా గుర్తెరిగి, వేట జూదం మద్యపానం స్త్రీ వాక్పారుష్యం దండపారుష్యం అర్థదూషణం అన్న ఏడు వ్యసనాలను విడిచి ప్రవర్తించేవాడు యుక్తాయుక్తాలు తెలిసినవాడని అర్థం. “ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి, మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి” మొదలైనవి సంకేతార్థాలు. “ఒకటి”కి ఇందాక “ప్రభుత్వము” అని అర్థాన్ని చెప్పినట్లే, వేరే అర్థాలనుకూడా చెప్పవచ్చును. బుద్ధితో వాక్కు క్రియ అనే రెండింటిని సమన్వయించి, ధర్మము అర్థము కామము అనే మూడు పురుషార్థాలను బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్న్యాసము అన్న నాలుగు ఆశ్రమధర్మాలను పాటించడం ద్వారా వశపరచుకొని, వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ అనే అయిదు కర్మేంద్రియాలను జయించి, యజనము యాజనము అధ్యయనము అధ్యాపనము దానము ప్రతిగ్రహణము అన్న ఆరు స్మార్తకర్మలను నేర్చి, పృథివ్యప్తేజోవాయ్వాకాశములనే పంచభూతాలు బుద్ధి అహంకారము అన్న ఏడింటికి అతీతంగా ఉండగలవాడే వివేకఘనుడని మరొక అర్థం. ఒకటి సత్త్వము, రజస్తమస్సులు రెండు, ధనేషణ దారేషణ పుత్త్రేషణ అన్న కామనలు మూడింటిని ధ్యాన ధారణ యోగ సమాధులనే నాలుగింటి సాధనవశాన వదిలివేయగలిగి, షట్ స్మార్తకర్మల సదవగాహనతో, బుద్ధ్యహంకారాదిసప్తకాన్ని విడిచి వర్తించేవాడు వివేకఘనుడని మరొక అర్థం. వేమన పద్యాలలో, అన్నమాచార్య సంకీర్తనలలో, క్షేత్రయ్య పదాలలో, సారంగపాణి పదాలలో ఆధ్యాత్మికత వల్ల, శాస్త్రసాంకేతికత వల్ల ఇటువంటి మార్మికతను, నిగూఢతను చూడవచ్చును. ఇది విషయగతమైన ప్రౌఢి.
ఇవన్నీ ఒక ఎత్తయితే, భావార్థప్రౌఢి వేఱొక విధంగా ఉంటుంది.
రంగనాథుండు రంగత్తురంగ మెక్కఁ
గులిశమును దాల్చె గోత్రారి కుతుక మొప్ప;
ఖేదమోదంబు లందె నగేంద్రకన్య,
మౌళిఁ గృష్ణాజినంబున మాఁటె శివుఁడు.
సంస్కృతంలో, రఙ్గత్తురఙ్గ మధిరోహతి రఙ్గనాథే, గోత్రారి రాత్తకుతుకః కులిశం బిభర్తి, ఖేదం చ మోద ముపయాతి నగేన్ద్రకన్యా, కృష్ణాజినేన పరిముహ్యతి మౌళి మీశః అని ఉన్న శ్లోకానికి నా అనువాదం ఇది. ఇది మహావ్యాఖ్యాత మల్లినాథసూరి శ్లోకమట. అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారు తమ చాటుధారాచమత్కారసారః గ్రంథంలో ఉదాహరించి అర్థాన్ని వివరించారు.
శత్రుసంహారానికై రంగనాథుడనే రాజు ఉద్యుక్తుడై గుఱ్ఱం ఎక్కుతున్నాడు. ఆ ఎక్కేటప్పుడు నేలపై గుర్రం కాలిగిట్టల తాకిడి వల్ల ధూళి చెలరేగింది. ఆ చెలరేగిన ధూళి దుమారమై ఏకంగా సప్తసముద్రాలనూ ముంచెత్తివేసేంత ఉద్భటంగా రేగిందట. సముద్రాలు ఇంకిపోతే — పూర్వం ఇంద్రుడు పర్వతాల రెక్కలను నరికివేసినపుడు హిమవంతుని కొడుకు మైనాకుడు తప్పించుకొని పారిపోయి సముద్రంలో దాక్కొన్నాడు కదా, అతనిప్పుడు బయటపడక తప్పదని గోత్రారి (గోత్రాలకు = పర్వతాలకు, అరి = శత్రువైనవాడు) — ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతబూనాడట. ఆ మైనాకుడు హిమవత్పుత్త్రిక అయిన పార్వతీదేవికి (నగేంద్రకన్యకు) తమ్ముడు కదా, ఇప్పుడిక ఇంద్రుని బారినుండి తప్పించుకోలేడని ఆమెకు ఖేదం కలిగింది. అయితే ఒకందుకు మోదమూ కలుగకపోలేదు. సప్తసముద్రాలే ఇంకిపోగా లేనిది తన సవతి గంగాదేవి మాత్రం ఉండగలదా? అని మోదం. గంగకు కష్టం కలిగితే పార్వతికి సంతోషమే కానీ, పాపం జగత్తులకు ఈశ్వరుడు, గంగకు భర్త అయిన శివునికి సంతోషం ఎందుకవుతుంది? ఆ ఎగిరివస్తున్న దుమ్ము గంగకు సోకకుండా జింక చర్మం తీసుకొని శిరోవేష్టనంగా తలకు చుట్టుకొన్నాడట. అశ్వారోహణమే ఇంత ఉద్భటంగా ఉంటే, ఆ రాజెంతటి వాడో! ఆయన పరాక్రమం ఎంతటిదో! అని ఊహించుకోవాలి. ‘ధూళి రేగటం’ అన్న కీలకం బోధపడకపోతే, పద్యార్థం బోధపడదు. ప్రహేళికాప్రాయమైన రచన ఇది. ఇటువంటివి చిత్రకవితారీతులింకా అనేకం ఉన్నాయి.
ఇవన్నీ ప్రౌఢమైన పద్యాలే కాని, తెలుగు సాహిత్యమంతటిలోకీ అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? అన్న ప్రశ్నకు సమాధానం నా అత్యంత పరిమితమైన అనుభవంలో నాకు ఇటీవలే భాసించింది. ఏ వ్యాఖ్యానమూ లేనందువల్ల – పద్యాన్ని ముందుంచుకొని దీని అర్థం ఏమిటని తదేకంగా ఆలోచింపగా, ఆలోచింపగా అన్వయం బోధపడటానికి ఒక గంట సేపటికి గాని అసలు స్ఫురించనే లేదు.
అది నివేదించడానికే ఈ వ్యాసం.
కావ్యనాయిక మనోజ్ఞసౌందర్యవర్ణనానుగతమైన ఈ పద్యాన్ని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ చాటుపద్యమణిమంజరి సంకలనంలో, రామకృష్ణుని ఇతర చాటువులు, అని పేర్కొన్న పద్యావళి నుంచి గ్రహించి శ్రీ చాగంటి శేషయ్యగారు ఆంధ్రకవితరంగిణి 8వ సంపుటంలోని తెనాలి రామకృష్ణకవి చరిత్రలో ఉదాహరించారు:
అల ఘనచంద్రబింబసమమై తనరారెడు వక్త్ర మందులోఁ
గలిగిన నామభేదములకైవడి నొప్పెడిఁ గప్పు కొప్పు చె
క్కులు రదనాంశుకంబు లవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే
తులు సరులయ్యె దానివలె నున్నది పొంకపుటారు బోఁటికిన్.
ఈ పాఠంలో అర్థప్రతీతి లోపించింది. నామవిభక్తులు, విశేష్యవిశేషణాలు తారుమారయ్యాయి. దీనికి ప్రతిపదార్థం చెప్పి, శంకానిరాసకంగా వివరించమంటే వ్యాఖ్యానానికి లొంగే పద్యం కాదు. వక్త్రము = ముఖము ఘనచంద్రబింబసమమై అన్నంత వరకు సమంజసంగానే ఉన్నది. కప్పు, కొప్పు, చెక్కులు, రదనాంశుకంబులు అందులోఁ గలిగిన నామభేదముల కైవడిన్ ఒప్పెడిన్ — అంటే అర్థం ఏమిటి? నామములకు భేదకధర్మం ఎందుకు చెప్పబడుతున్నది? ఆ విధమైన సంజ్ఞావాచకాల, తత్పర్యాయపదాల పృథక్కరణం వలని ప్రయోజనం ఏమిటి? కప్పు, కొప్పు అన్న ఏకవచనాల తర్వాత చెక్కులు (చెక్కిళ్ళు) అన్న బహువచనం సరిగానే ఉన్నది. ఆ తర్వాత రదనాంశుకంబులు అని బహువచనం మళ్ళీ ప్రయుక్తమైంది. రదనాంశుకంబులు (పెదవులు) బహువచనమై ఉండటం కవిసమయవిరుద్ధం. బహువచనసిద్ధిసాధనకోసం దానిని రదనము, అంశుకము అని విడదీయటమూ సాధ్యం కాదు. రదనాంశుకంబులు + అవి అన్న శబ్దసంఘటనకు అన్వయం లేదు. చేతులు సరులు అన్నప్పటి బహువచనం సరికాదు. ఎటుచూసినా పద్యానికి అర్థప్రతీతి లేదు. పైగా, నాలుగవ పాదంలో యతిభంగమైంది.
వేటూరి వారికి మునుపే 1893లో శ్రీ గురజాడ శ్రీరామమూర్తిగారు ‘తెనాలి రామకృష్ణుని చాటువులని వాడుక గల పద్యములు’ అని తమ బృహత్పరిశోధనాగ్రంథం కవిజీవితములులో వేఱొక పాఠాన్ని చూపారు:
అల ఘనచంద్రబింబనిభమై తగు కాంత మొగంబు, దానిలోఁ
గలిగిన యర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పు కొప్పు, చె
క్కులు రదనాంశుకంబు నవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే
తులు సరియయ్యె, దానిగతిఁ దోఁచెను బొంకపుటారు దానికిన్.
ఇందులో నాలుగవ పాదంలోని యతిభంగదోషం తొలగిపోయింది. పద్యపాఠం కొంత భావస్ఫోరకంగా ఉన్నది కాని, స్పష్టార్థప్రతీతి లేదు.ఈ రెండు పద్యాలనూ అర్థావగతిని బట్టి సవరించి, కవ్యుద్దిష్టానికి అనుగుణంగా నేను రూపొందించిన పాఠం ఇది:
అల ఘనచంద్రబింబనిభమై తనరారెడు వక్త్ర; మందులోఁ
గలిగిన యర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పు కొప్పుఁ, జె
క్కులు రదనాంశుకంబు నవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ, జే
తులు సరియయ్యె, దాని గతిఁ దోఁచెను బొంకపుటారు బోఁటికిన్.
లాక్షణికులు దీనిని సతృణాభ్యవహారత్వం అంటారు. చిత్రకవితాప్రీతి ప్రధానమైన ఇటువంటి పద్యాల అర్థప్రవచనం కొంత కష్టమే. శబ్దార్థాలు రెండింటి సంయోజనమూ క్లేశాస్పదం కావటం మూలాన అన్వయం కుదుర్చుకోవటమే దుష్కరం. ఆ పైని కవి హృదయావిష్కరణం. తెలుగులో ఇటువంటి గూఢరచన మరొకటి లేదు. పద్యభావం ఇది:
1. ఉపక్రమణిక
1. బోఁటికిన్, అల, ఘనచంద్రబింబనిభమై తనరారెడు వక్త్రము.
బోఁటికిన్ = కాంతకు, అల = ప్రసిద్ధమైన, ఘనచంద్రబింబనిభమై ౼ ఘన = నిండైన (“ఘనం మధ్యమనృత్యే స్యా త్కాంస్యతాలాదివాద్యకే, పుంసి ముస్తా మేఘ దార్ఢ్య విస్తార ముద్గరేషు చ” – మధురేశుని శబ్దరత్నావళి. “కిం స్విదాపూర్యతే వ్యోమ జలాధారాఘనై ర్ఘనైః” – సంస్కృత మహాభారతం, ఆది. ౧౩౬:౨౮. ‘ఘనము’ అంటే ‘నిండైన’ అని అర్థం), చంద్రబింబ = చంద్రమండలముతో (“బింబోఽస్త్రీ మణ్డల త్రిషు” – అమరకోశం), నిభమై = సమానమై (“నియతం భాతీతి నిభః. నిభాదయ ఉత్తరపదస్థా ఏవ సదృశవచనా వాచ్యలిఙ్గాః స్యుః” – రామాశ్రమి). పూర్ణచంద్రబింబశోభ వంటి శోభతో నిత్యం ప్రకాశించేది కాబట్టి ఘనచంద్రబింబనిభము + ఐ అని.
తనరారెడు = ఒప్పారెడు అని అర్థం. వక్త్రము = ముఖము. దీనిచే భాషించటం జరుగుతుంది కాబట్టి ముఖానికి వక్త్రము అనిపేరు. (“ఉచ్యతేఽనేన. వచ పరిభాషణే, బృవో వచిః. గుధృవీపచివచి (ఉణాది. ౪-౧౬౭) ఇతి త్రః” – రామాశ్రమి) ఇక్కడ అర్థభేదాలు ప్రసంగింపబడుతున్నాయి కనుక ముఖానికి వక్త్రము అన్నది సాకూతమైన ప్రయోగం. వక్త్రానికి వర్తులత్వ – ఆహ్లాదకత్వ – నిర్మలత్వాల వల్ల చంద్రబింబం తోడి పోలిక సుప్రసిద్ధం. “రాజరాజాకృతి రంజిల్లె వదనంబు… అఖిలసుమనస్సమారాధ్య యయ్యె దివ్య, సౌకుమార్యాంగసౌరభ్యసంపదయును, గాన నా చాన సుందరాకారగరిమఁ, దరమె పొగడఁగ నహిలోకధవుని కైన” – అని 18వ శతాబ్ది నాటి గుడారు వేంకటదాసకవి ప్రబంధరాజశిరోభూషణ బలరామచరిత్రము వ్రాతప్రతి. చంద్రబింబోపమానం నాయిక పద్మినీజాతి లక్షణలక్షితకు సూచకమని కవిసంప్రదాయం. “రాజీవగంధి సద్రాకేందుబింబాస్య, నీలోత్పలశ్యామ నిర్మలాంగి” – అని కూచిరాజు ఎఱ్ఱయ కొక్కోకం. గురజాడ శ్రీరామమూర్తి గారి పాఠంలో “ఘనచంద్రబింబనిభమై తగు కాంత మొగంబు” అన్నప్పుడు ఈ సాభిప్రాయపదప్రయుక్తికి అవకాశం లేకపోయింది. వక్త్రము అన్న నిర్దేశం వల్ల ప్రతిపాదితార్థానికి విశదిమ కలిగింది. పద్యంలో ఒక్క అక్షరాన్నైనా మార్చటానికి వీలుండని పరివృత్త్యసహిష్ణుతకు ఉదాహరణీయమైన ప్రయోగం ఇది.
కాంత మోము పూర్ణచంద్రబింబశోభ వంటి శోభతో వెలుగొందుతున్నదని అర్థం.
2. అర్థభేదాలతో ఉపమానఘటనం.
2. అందులోఁ, గలిగిన యర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పు, కొప్పుఁ – జెక్కులు – రదనాంశుకంబు.
అందులోన్ = ఇందాక పూర్ణచంద్రబింబము అని అర్థం చెప్పుకొన్న ఆ ఘనచంద్రబింబ అన్న సమాసాన్ని ఉపమానత్రయీగర్భమైన సమాసంగా తీసుకొని – ఆ సమాసంలోని 1) ఘన 2) చంద్ర 3) బింబ శబ్దాలకు, కలిగిన = ఏర్పడిన, అర్థభేదములన్ = అర్థభేదాలను, కైకొని = పురస్కరించుకొని, ఆ అర్థాలు మూడింటికీ కొప్పు – చెక్కులు – రదనాంశుకంబులతో, చెప్పఁగన్ = పోలికను చెప్పడం, ఒప్పున్ = సమంజసం – అని తాత్పర్యం.
సంస్కృతాంధ్రసాహిత్యాలలో ఇటువంటి ప్రయోగం వేఱొకటి లేదు. ఎందుకంటే –- ఘనము = అంటే ఇందాక నిండైన అని అర్థం అనుకొన్నాము. ఇప్పుడు ఘనము అంటే – ఆ పదానికి మేఘము (“ఘనోఽమ్బుదః” – అని ధరణికోశం) అని ఉన్న అర్థభేదాన్ని చెప్పుకోవాలి. ఆ మేఘంతో కొప్పుకు – వేణీభరానికి నైల్యాధిక్యం వలని పోలిక చెప్పబడింది.
- చంద్రభీతఘనధ్వాంతసంచయమున
కభయ మొసఁగి వేణీభరం బను నెపమునఁ,
దాన వెనుక వేసికొన్నది తరుణి మొగము;
చంద్రుఁ గైకొనమి కిదియ సాక్షి గాదె.అని పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్నం (2-67). వేణీభరాన్ని చీకటితో పోల్చి నైల్యాధిక్యాన్ని చెప్పాడు.
పద్యంలో, చంద్ర = అంటే ఇందాక చంద్రుడు అని చెప్పుకొన్నాము. ఆ ‘చంద్ర’ శబ్దానికి ఇప్పుడు బంగారము, కర్పూరము (“చంద్రః కర్పూర కామ్పిల్ల సుధాంశు స్వర్ణ వారిషు” – మేదినీ కోశం) అని రెండర్థాలు. ఆ సువర్ణ కర్పూరాలతో చెక్కులు = చెక్కిళ్ళకు బంగారపు మేల్మి నిగారింపు వలన, కర్పూరపు సౌరభ స్నిగ్ధత్వాల వలన పోలిక.
- కలికి చెక్కులు చంద్రఖండంబులై పొల్చు — అని రామరాజభూషణుని వసుచరిత్ర (2-33). చెక్కులను చంద్రఖండాలుగా రూపించి పరిమళాన్ని, మసృణత్వాన్ని చెప్పాడు.
బింబము = అంటే ఇందాక చంద్రుని బింబము అని అర్థం చెప్పుకొన్నాము. ఇప్పుడు ఆ ‘బింబ’ శబ్దానికి దొండపండు (“బింబం తు ప్రతిబింబే స్యా న్మణ్డలే బిమ్బికాఫలే” – అని హైమకోశం) అని అర్థం. ఆ దొండపండుతో రదనాంశుకంబు = పెదవికి – ఎఱ్ఱదనం వల్ల పోలిక.
‘ఛదము’ అంటే ఆవరించి ఉండేది అని అర్థం. దంతచ్ఛదమంటే దంతపంక్తికి కప్పు – అంటే, పెదవి అన్నమాట. “హరజటాజూట చంద్రరేఖామృతంబు, నబల! నీ దగు దంతచ్ఛదామృతంబు సమముగా…” అని శ్రీనాథుని శృంగారనైషధం (5-27). దంత – రదనాల, ఛద – అంశుకాల పర్యాయవాచిత్వం వలన రదాంశుకము అన్న పదసృష్టి జరిగింది. పెదవికి రూపసామ్యం వల్ల, వర్ణసామ్యం వల్ల దొండపండుతో ఔపమ్యఘటనం సుప్రసిద్ధమే కదా.
- కమల లక్షణలక్ష్మి గణియించు మొగ; మోష్ఠ మరుణబింబపు రక్తి నవఘళించు — అని తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యుల అచలాత్మజాపరిణయం (2-40). పెదవి ఎర్రని దొండపండుయొక్క రక్తిమను కలిగి ఉండటాన్ని చెప్పాడు.
ఘనమునకు (మేఘానికి) వేణీభరంతోనూ, చంద్రమునకు (బంగారము, కర్పూరము) చెక్కిళ్ళతోనూ, బింబమునకు (దొండపండుకు) నాయిక పెదవితోనూ పోలికలను చెప్పన్ ఒప్పును – అని అన్వయం.
3. ఆ అర్థభేదాలకు మళ్ళీ పర్యాయపదాలతో ఔపమ్యం.
3. అవి గుబ్బలకున్ సరిరాకపోయె; చేతులు సరియయ్యె; దాని గతిఁ దోఁచెను పొంకపుటారు.
అవి = ఆ ఘనచంద్రబింబ అని ఉన్న పదబంధంలోని అర్థభేదాలను (అంటే, ఆ పదాల పర్యాయవాచిత్వం వలన ఏర్పడిన సరికొత్త అర్థభేదాలను) పురస్కరించుకొని, ఆ ఘన – చంద్ర – బింబ పదాల పర్యాయవాచకాలకు – 1) గుబ్బలకున్ సరిరాకపోయె 2) చేతులు సరియయ్యె 3) దాని గతిఁ దోఁచెను పొంకపుటారు అని మూడు అలంకృతవాక్యాలతో క్రమాన్వయం.
ఇది తెలుగులో ఇంతవరకు ఏ కవీ ప్రయోగించని వినూత్నమైన శబ్దచిత్రం. ఇప్పుడు సరికొత్తగా ఏర్పడే అర్థక్రమాన్ని చూద్దాము.
వీటిలో మొదటిది ‘ఘనము.’ ఆ ఘనము = గుబ్బలకున్ సరిరాకపోయె అని అనువర్తనం. మొదట, ఘనము అంటే చంద్రబింబానికి ధర్మవాచకంగా నిండైన అనీ; ఆ తర్వాత, ఘనమంటే మేఘము అనే అర్థంలో ‘కొప్పు’తో = వేణీభరంతో పోలిక అనీ వేర్వేరుగా అర్థాలను చెప్పుకొన్నాము.
ఇప్పుడు ఘనము = మేఘము అనే అర్థాన్ని కలిగిన ఆ ‘ఘన’ శబ్దానికి వేరొక పర్యాయమైన జీమూతము అన్నదానిని తీసుకోవాలి. (“ఘనో మేఘే” – మంఖకోశం; “జీమూతో వారిదో నభ్రాట్ పర్జన్యోఽమ్బుదః” అని హర్షకీర్తి శారదీయ నామమాల). ఆ విధంగా “ఘన” శబ్దానికి పర్యాయపదమైన “మేఘ” శబ్దానికి పర్యాయమైన ఆ “జీమూత” శబ్దానికి గల మరొక అర్థం “పర్వతం” (“జీమూతో మేఘ పర్వతౌ” – ఇరుగప దండేశుని నానార్థ రత్నమాల).
ఆ పర్వతం “గుబ్బలకున్ (= స్తనములకు) సరి రాకపోయె” అని అన్వయం. ఇందులో ఉపమేయమైన గుబ్బల కంటె ఉపమానమైన పర్వతానికి అపకర్ష చెప్పబడుతున్నది.
- … గట్టిగ నుండు కొండలును … ఇంకెట్టుగ నీడనం బొసఁగు? నింతి మిటారపు గుబ్బదోయికిన్ — అని కూచిమంచి తిమ్మకవి నీలాసుందరీ పరిణయము (2-23). “ఇంతి మిటారపు గుబ్బదోయికి గట్టిగ నుండు కొండలు ఇం కెట్టుగ ఈడనన్ పొసఁగు?” అని ఉపమేయమైన గుబ్బల కంటె ఉపమానమైన పర్వతానికి అపకర్షను చెప్పాడు.
రెండవది ‘చంద్ర’ శబ్దం. ఆ చంద్ర శబ్దానికి, చేతులు సరియయ్యె అని అన్వయం. మొదట ముఖానికి ఉపమానంగా చంద్ర శబ్దానికి చంద్రుడు అని అర్థం చెప్పుకొన్నాము. ఆ తర్వాత, సువర్ణము, కర్పూరము, అనే అర్థాలలో చంద్ర శబ్దానికి చెక్కిళ్ళతో పోలికను చెప్పుకొన్నాము. ఇప్పుడు, చంద్రుడు అనే ఆ వెనుకటి అర్థంలో (“చన్ద్రో నిశాకరః శౌరిః కలశాబ్ధిభవో భవః భవావతంసః కమలీ వార్ధిసూనం నపుంసకమ్” – అని భోజుని నామమాల) ఉన్న ఆ ‘చంద్ర’ శబ్దానికి పర్యాయమైన “అబ్జ” శబ్దాన్ని గ్రహించాలి (“అబ్జో జైవాతృకః సోమః” – అని అమరకోశం).
ఇక, చంద్ర శబ్దానికి పర్యాయపదమైన ఆ ‘అబ్జ’ శబ్దానికి గల మరొక అర్థం పద్మము అని. (“లవణామ్బుజయో రబ్జం క్లీబే శంఖే తు పుంసి వా, పుంస్యేవ నిచులే శీతరశ్మౌ ధన్వన్తరావపి” – నానార్థరత్నమాల.) ఆ పద్మము నకు చేతులు సరియయ్యె అని ఔపమ్యఘటనం.
- చేతుల కబ్జములే తుల — అని చేమకూర వేంకటకవి విజయవిలాసం (1-196). చేతులకు అబ్జాలతో తులనీయతను ప్రతిపాదించాడు.
మూడవ ఉపమానం ‘బింబ’ అన్నది. ఆ బింబముతో, దాని గతిఁ దోఁచెను పొంకపుటారు, అని అన్వయం.
మొదట ముఖవర్ణనలో ‘బింబము’నకు చంద్రుని యొక్క బింబము అనీ; ఆ తర్వాత అధరానికి విశేషణంగా బింబికా ఫలము (దొండపండు) అనీ అర్థద్వయాన్ని చెప్పుకొన్నాము. ఇప్పుడు ‘బింబము’నకు ‘బేతి – శోభతే’ అన్న వ్యుత్పత్త్యర్థంలో, చంద్రుని యొక్క సుధాసారము అని ప్రతిపాదింపబడుతున్నది. చంద్రబింబము అని అర్థం చేసుకోవాలన్నమాట.
ఆ విధంగా ‘బింబ’ శబ్దానికి గల మరొక ప్రయుక్తివిశేషం మండలం. చంద్రబింబము – చంద్రమండలము అన్నవి సమానార్థంలో ప్రయోగింపదగినవి. బింబము అంటే చంద్రునిలోని అమృతపు నిగ్గు. మండలము అంటే కళలు నిండి ఉన్నప్పటి ప్రసన్నమైన తేజోమయరూపం. “బిమ్బే తస్య సుధాసారః, కలాపూర్ణం చ మణ్డలం” – అని భోజుని నామమాలిక. “సుధారసమయారం తు తుషారనిచయాకృతిమ్, హారపఞ్జలసారస్య బహిఃస్థం చారు రాజతే” అని పౌష్కరసంహిత (14-1) లో చంద్రబింబలక్షణం.
అర్థసామ్యం వల్ల బింబ – మండల శబ్దాలు పర్యాయఘటితాలు కాగా, ఆ ‘మండల’ శబ్దానికి గల మరొక అర్థం పాము. “మణ్డలం ద్వాదశరాజకే చ దేశే చ బిమ్బే చ కదమ్బకే చ కుష్ఠప్రభేదేఽప్యుపసూర్యకేఽపి భుజఙ్గభేదే శుని మణ్డలః స్యాత్” – అని మహేశ్వరసూరి విశ్వప్రకాశం. ఇప్పుడు ఆ మండలార్థమైన ‘పాము’కు నూగారుతో పోలిక.
- అండజగామిని యూరుపుఁ
బిండు వలపు లాన నాభిబిలము వెల్వడి చ
న్గొండల నడుమను బ్రాఁకెడు
కుండలియో యనఁగ నారు కొమ రొప్పారున్.అని శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద (5-25). నాభిబిలం నుంచి వెలువడిన కుండలి (పాము) వంటిది అని ఆరు (నూగారు)ను వర్ణించాడు.
దాని గతిన్ = ఆ మండలము (పాము) వలె, పొంకపు + ఆరు = నిండు నూగారు, తోఁచెన్ = పొడచూపెను అని ఉపమాఘటితం. ‘పొంకపు ఆరు’ అన్నది వర్ణ్యాంశం. ఉపమేయమన్నమాట. దానితో సరిపోలినందువల్ల ‘మండలము’ ఉపమానం. దాని గతి తోచెన్ – అన్నది నూగారుకు, మండలానికి సాదృశ్యవాచకం. ఆ విధంగా పోలికను కలిగిన నూగారుకు, మండలానికి ఆ పోలికకు కారణమైన సమానధర్మం ఏమిటో చెప్పబడలేదు. అందువల్ల లుప్తోపమ అన్నమాట.
పద్యంలో ప్రతిపాదింపబడుతున్న అర్థాలు మూడు విధాలు:
- మొదటి అర్థం: ముఖము ‘ఘనచంద్రబింబనిభ’మై నిండు చంద్రుని వలె కళాపూర్ణమై శోభాయమానంగా ఉన్నది.
- రెండవ అర్థం: ఆ ‘ఘనచంద్రబింబ’ అన్న దళంలోని ఘన – చంద్ర – బింబ అన్న శబ్దాల అర్థభేదాలను పురస్కరించుకొని, ఘనము అంటే మేఘం కనుక కొప్పు (వేణీభరం) నల్లదనం వల్ల మేఘమును సరిపోలి ఉన్నది. ‘చంద్ర’ అంటే సువర్ణము, కర్పూరము అని అర్థాలున్నాయి కనుక చెక్కిళ్ళు నిగారింపు వలన సువర్ణాన్ని, సౌరభస్నిగ్ధత్వాల వల్ల కర్పూరాన్ని పోలి ఉన్నాయని భావం. ‘బింబము’ అంటే దొండపండు కాబట్టి పెదవి దొండపండును పోలి ఉన్నదని అర్థం.
- మూడవ అర్థం: వెనుకటి ఆ ‘ఘనచంద్రబింబ’ సమాసంలోని అర్థభేదాలే వాటి పర్యాయపదాల అర్థాలతో పునరుపక్రాంతా లైనప్పుడు (1) ఘనము = జీమూతము = పర్వతము అని ఏర్పడిన పరిణామక్రమంలోని ‘పర్వతము’ ఆమె వక్షోజమునకు సాటి రాలేకపోయింది. (2) చంద్ర = అబ్జ = పద్మ అని ఏర్పడిన శబ్దాల పరిణామక్రమంలోని ‘పద్మములు’ ఆమె కరములను పోలి ఉన్నాయి. (3) బింబము = మండలము = పాము అన్న శబ్దాల పరిణామక్రమం వల్ల ఏర్పడిన ‘పాము’ వలె నూగారు ఒప్పారుతున్నది.
మరొక విషయం: దాని గతిఁ దోఁచెను పొంకపుటారు బోఁటికిన్ – అన్నప్పుడు పద్యంలో బోఁటికిన్ = కాంతకు (నాయికకు) అనీ; బోఁటికిన్ = సాదృశ్యమునకు అనీ రెండర్థాలు. సాదృశ్యార్థంలో రెండవసారి చెప్పిన అర్థత్రయానికి – అంటే, గుబ్బలు సరిరాకపోయె, చేతులు సరియయ్యె, తోఁచెను పొంకపుటారు, అన్న మూడు దళాలకూ ఇది వర్తిస్తుంది. ఉపమాంతర్భావిగా ఇన్ని ఆహ్లాదనీయ చమత్కృతవాక్యాలను సాలంకృతంగా అనుప్రాణింపగలగటం కవి కావ్యకళాశిల్పప్రౌఢికి నిరుపమానమైన నిదర్శనం.
శబ్దార్థచిత్రాల సమ్యఙ్నివేశానికి, అత్యంతప్రౌఢికి ఉత్తమోదాహరణ ఈ పద్యం. తెలుగులో ఇటువంటి రచన మరొకటి లేదు.
(ఈ వ్యాసాన్ని దయతో చదివి, ఇందులో దొర్లిన కొన్ని దోషాలను తెలియజేసి సవరించికొనే సదవకాశాన్ని కల్పించిన మాన్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ తిరుమల కృష్ణదేశికాచార్యులవారి సౌజన్యానికి నేను ఋణపడి ఉన్నాను. – రచయిత.)
[11జులై2014 – రెండు పద్యాల ప్రతిపదార్థాల వివరాలు కొన్ని సరిచేయబడినాయి – సం.]