సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.

వ్యక్తదృష్టార్థచంద్రిక

క్షేమేంద్రుడు కవికంఠాభరణంలో కావ్యవిద్యను ఉపాసించేవారిలో అల్పసాధ్యులు, కృచ్ఛ్రసాధ్యులు సూక్తివికాసం కోసం చేయతగిన ప్రయత్నాలను గురించి అయిదు ప్రధానాధ్యాయాలలో వివరించాడు. వాటికి 1. కవిత్వ ప్రాప్తి, 2. శిక్షా కథనం, 3. చమత్కార కథనం, 4. గుణదోష విచారం, 5. పరిచయ చారుత్వం, అని పేర్లు. వారిలో అల్పప్రయత్నసాధ్యులు (వీరు కొద్దిపాటి శ్రమతో ప్రౌఢులు కాగలుగుతారు. వేంకటకవి ప్రౌఢతతికి సమ్మతి అని వీరి వంటివారిని ఉద్దేశించే అన్నాడు) శబ్దశాస్త్రాన్ని అధ్యయనించి (వేంకటకవి శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును అని వీరినే అనురణింపజేశాడు), ఛందోవిధానంలో పరిశ్రమ చేసి (వేంకటకవి ఉక్తాత్యుక్తాదిగాఁ గలుగు ఇరువదాఱు ఛందంబులకుఁ జందంబును అన్నాడు), మాధుర్యమనోరమములైన సత్కావ్యములందు (వేంకటకవి చిరంతనాంధ్రప్రంబంధజాలంబుల కాలవాలంబు అన్నాడు) శ్రవణాభియుక్తులు కావాలని క్షేమేంద్రుడు ప్రబోధించాడు. కృచ్ఛ్రకవులు ఏదైనా పూర్వకవి శ్లోకాన్ని తీసుకొని, ఉన్న పదాలకు బదులు పర్యాయపదాలను గ్రహించి, వేరు పదాలతో శ్లోకాన్ని పునారచించాలట. (శ్లోకం పరావృత్తిపదైః పురాణం, యథాస్థితార్థం పరిపూరయేచ్చ: 1-20) ఈ వృత్తరచనాభ్యాసానికి పరావృత్తి అని పేరు.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ

అని శ్లోకం. దీనిని –

వాణ్యర్థావివ సంయుక్తౌ వాణ్యర్థప్రతిపత్తయే
జగతో జనకౌ వన్దే శర్వాణీశశిశేఖరౌ

అని క్షేమేంద్రుడు సోదాహరణంగా నిరూపించాడు. ఈ మార్గంలో మనకు ప్రయాణం నేర్పుతున్న వేంకటకవి మతంలోని వ్యక్తదృష్టార్థచంద్రికలు కొన్నింటిని ఇప్పుడు చూద్దాము:

మొదటి విభాగం: అనువాదాలు

ప్రబంధరాజంలో వేంకటకవి కావించిన సంస్కృత శ్లోకానువాదాలను గురించి ఇంకా లోతుగా పరిశోధింపవలసి ఉన్నది. సంస్కృతకావ్యాలతోడి పరిచయం చాలనందువల్ల, వేంకటకవి ఆ పద్యాన్ని ఏదో సంస్కృతశ్లోకానికి అనువాదంగా కాక, తన ముందున్న ఏదో తెలుగు పద్యాన్నే పర్యాయపదాలతో మార్చి చెప్పివుంటాడనే నమ్మకం వల్ల – నేను ఈ విభాగంలో ఎక్కువ కృషి చేయలేకపోయాను. గుర్తుపట్టిన కొన్నింటిలో ముఖ్యమైనవాటిని వివరిస్తాను:

నిర్మాంసం ముఖమణ్డలే పరిణతం మధ్యే లఘుః కర్ణయోః
స్కన్ధే బన్ధుర మప్రమాణ మురసి స్నిగ్ధం చ రోమోద్గమే
పీనం పశ్చిమపార్శ్వయోః పృథుతరం పృష్ఠే ప్రధానం జవే
రాజా వాజిన మారురోహ సకలై ర్యుక్తం ప్రశస్తై ర్గుణైః.

ఇది వినయచంద్ర సూరి రచించిన కావ్యశిక్షా గ్రంథంలోని ఏడవ అధ్యాయమైన లోకకౌశల్యపరిచ్ఛేదంలోని మొదటి శ్లోకం. రాజు ఎక్కదగిన ఉత్తమాశ్వపు లక్షణాలను వివరిస్తున్నాడు. దీనికి వేంకటకవి ఆంధ్రీకరణ:

గొరిజల యుబ్బు, మేని జిగి, గొప్ప యురంబు, వెడంద పంచకం
బెరుపగు వన్నె, చిన్ని చెవు, లెక్కువమై సిరసెత్తు మెట్టువాల్,
కొర సగిలింత గల్గి, మఱి కొంచెపు గండయుఁ, గాళ్ళ వేగమున్,
మెఱుఁగుఁగనుల్, సుదేవమణి, మెత్తని రోమము లొప్పు మెప్పుగన్. ప. 180

మూలశ్లోకం గాని, తెలుగు మూలం గాని – నకులుని అశ్వశాస్త్రంలో, భోజుని అశ్వశాస్త్రంలో, యుక్తికల్పతరువులో, మనుమంచిభట్టు హయలక్షణసారంలో, మరెక్కడా కనబడలేదు. అందువల్ల వేంకటకవిది వినయచంద్ర సూరి శ్లోకానికి అనువాదమే అన్న నిశ్చయానికి వచ్చాను.

ఉదయతి వితతోర్ధ్వరశ్మిరజ్జా
వహిమకరే హిమధామ్ని యాతి చాన్తమ్
వహతి గిరి రయం విలమ్బిఘణ్టా
ద్వయ పరివారిత వారణేన్ద్రలీలామ్.

మాఘుని శిశుపాల వధ కావ్యంలోని (4-21) అద్భుతమైన శ్లోకం ఇది. ఆకాశమనే ఏనుగు నడుముకు కిరణరజ్జువుతో వేలాడదీసిన ఘంట లాగా ఉన్నాడట సూర్యుడు. వేంకటకవి అభిమానించటం సహజమే. తెలుగు చేశాడు:

ఖరకరుఁ డంబర మధ్య
స్థిరుఁడై గనుపట్టె రుచిరదీధితిని వియ
ద్ద్విరదమున కంశు రజ్జువు
గర మొప్పుగఁ గట్టు బొడ్డుఘంటయ పోలెన్. ప. 438

ఈ భావాన్ని తెలిగించిన కవులు చాలామందే ఉన్నారు కాని, వేంకటకవి పద్యం మాఘకవి శ్లోకానికి చేసిన యథాతథానువాదమే అనిపించింది. వేరేదైనా ఇటువంటి తెలుగు పద్యం దొరికితే, దానికి అనుసరణమేమో పరిశీలించాలి. తెలుగుచేయటానికి కేవలం శ్లోకంలోని భావాన్ని మాత్రం స్వీకరించినవాళ్ళ సంఖ్యకూడా తక్కువేమీ కాదు. చూడండి: జవనవ ప్లవనవ ద్రవిశతాంగ తురంగ, గళగళ ద్ధరిదశ్వఘంట యనఁగ అని కిరీటి వేంకటాచార్యుల అచలాత్మజా పరిణయం (2-96).

వేంకటకవికి మాఘకవి అంటే ప్రత్యేకాభిమానం. నాగదత్తోపాఖ్యానంలో ఒకచోట మాఘవచఃశ్రీలాఘవవచోవిభవ (ప. 731) అనిపించాడు. మాఘవచఃశ్రీ = మాఘకవి వాక్సంపదయొక్క, లాఘవ = మనోజ్ఞానము గల, వచోవిభవ = వాక్యసంపద గలవాడా! అని భావం. మాఘుడు భూభారై రభిరేభిరే భేరీ రేభిభిః అని వ్రాస్తే, తానూ, భాభీరు భీభీర భారభేరీ రేభి, భూరిభాభాభిభీ భూభరాభ అని అనుసరించాడు కదా. ఇది ఇంకొక శ్లోకం:

విలోక్య సఙ్గమే రాగం పశ్చిమాయా వివస్వతః
కృతం కృష్ణం ముఖం ప్రాచ్యా న హి నార్యో వినేర్ష్యయా.

ఇది శార్ఙ్గధర పద్ధతిలోని 3586వ శ్లోకం. వేంకటకవి ఎందులో నుంచి తీసికొన్నాడో! అభిమానించి, ఆంధ్రీకరించాడు.

రవి యస్తాద్రికిఁ జేరె నంత శశియున్ రాగాత్ముఁడై తమ్మి లే
నవలా శీతకరంబులం దొడరినన్ నాథుండు గా మీసు దోఁ
చు విధంబుం దగ మోడ్చెఁ దమ్మివిరు లచ్చో నవ్వె నాఁ బూఁచెఁ గై
రవిణుల్ దా నవమానియైన గతి రేరా జొప్పె వెల్వెల్లనై. ప. 70

ఏ మాత్రమూ న్యూనాతిరిక్తతలు లేని విశదానువాదం ఇది. ఇటువంటి శ్లోకానువాదాలు ఇంకా అనేకం ఉన్నాయి.

రెండవ విభాగం: సమాంతర కల్పనలు

ఇదొక చిత్రం. మాట వరుసకు సమాంతర కల్పనలు అందాము. మూలంలోని తత్సమాలను తద్భవాలు గానూ, తద్భవాలను తత్సమాలు గానూ మార్చటం అన్నమాట. నైలింపసతుల కౌఁగిటఁ, దేలుటకై దివికి నేఁగు దృప్తారులకున్ అని మూర్తికవి కావ్యాలంకార సంగ్రహం (5-51). వేలుపు టింతుల కౌఁగిటఁ, బాలుపడం దివికిఁ బోవు పగతుర కెల్లన్ అని వేంకటకవి (ప.141). విజయలక్ష్మి వేణియుఁ బోలెన్ అని మూర్తికవి (5-51). గెలుపులచ్చి వేనలి లీలన్ అని వేంకటకవి (ప.142).

వెలఁదికి మణితాటంకము
లలరున్ దిగ్విజయకాంక్ష నతనుఁడు చూపున్
ములుగులు నిశాతములుగా
నలవడ వడిఁదీడు శాణయంత్రము లనఁగన్. కావ్యా (3-31)

చెలికి రతనాల కమ్మలు
వెలసెన్ దెసగెలుపు టిచ్చ వెడవిల్తుఁడు చూ
పుల ములుకులు పదను గలుగ
నలవడ రతనంపు శాణయంత్రము లనఁగన్. ప.306

తత్సమాలను తద్భవీకరించటం, తద్భవాలను తత్సమీకరించటం విద్యార్థులకొక చిత్రమైన కవితా వ్యాసంగమే. వెలఁదికి = చెలికి, మణితాటంకములు = రతనాల కమ్మలు, అమరున్ = వెలసెన్, దిగ్విజయకాంక్ష = దెసగెలుపు టిచ్చ, అతనుఁడు = వెడవిల్తుఁడు, చూపున్ ములుగులు = చూపుల ములుకులు (చూపులనెడి ములుకులను), నిశాతములుగా = పదను గలుగ – ఇత్యాది. ఇంకొకటి:

నీదు నిరవద్యకీర్తి మ
హా దుగ్ధపయోధిలోన నాదిమరాజ
ప్రాదుర్భూత యశంబులు
ప్రోదిం బుద్బుదములట్లు పొలుచు నృసింహా. కావ్యా (5-133)

దీనికి సమాంతర కల్పనం:

ఉల్లము పొడుపు దొరయ్యా
చల్లని నీ యసము పాలసంద్రములోనన్
దొల్లిఁటి సాముల యసముల
నెల్లను బుద్బుదములట్ల నిలఁ గన్పట్టున్. ప.150

సమాంతర రచనలో అనువాదకల్పాలు ఈ విధంగా ఉంటాయి. ఇవి విద్యార్థులకు ప్రాణకల్పాలు.

మూడవ విభాగం: ఛందఃపరివర్తనం

ఒక వృత్తాన్ని ఇంకొక వృత్తంగా మార్చమనటం ఛందఃప్రకరణాన్ని అభ్యసించే చదువరులకు తెలిసినదే కాని, దానిని లక్షణ లక్ష్యపూర్వకంగా ఉపదేశించేవారెవరు? ఇదానీంతన సత్కవినికాయంబునకు సహాయంబు చేయదలచిన వేంకటకవి తప్ప? ప్రబంధరాజంలోని ఛందఃపరివర్తన భాగాలు విద్యార్థులకు అత్యంతోపయుక్తంగా ఉంటాయి. ఏ పద్యాన్ని ఏ తీరున మరొక పద్యంగా మార్పవచ్చునో తెలుస్తుంది. గురు-లఘువుల విపర్యాసాన్ని యతి-ప్రాసలతో నిబంధించటం అభ్యాసానికి వస్తుంది. ఆ విధంగా ఇది అవశ్యాధ్యయనీయమైన సంవిధానం.

ఇది శార్దూలం మత్తేభం కావటానికి ప్రక్రియ:

ఆశాదైన్యదశానివారక సరాగాలోకయై మించు నా
కాశశ్రీ యిరుచక్కిఁ బూర్వచరమగ్రావాఖ్య దంతావళా
ధీశద్వంద్వము మౌళిఁ బూను భువనాధిష్ఠానకుంభంబులో
నా శోభిల్లె రవీందుబింబము లొగిం దత్తద్దిశాంతంబులన్. హరిశ్చంద్రనళోపాఖ్యానం (4-31)

భావార్థం ఇది: ఆశాదైన్యదశానివారక సరాగాలోకయై – ఆశా = దిక్కులయొక్క, దైన్యదశా = దైన్యదశలను, నివారక = పోగొట్టునదియై, సరాగ = రక్తిమముతో కూడుకొనిన, ఆలోక = తేజస్సనెడు (లేదా) ఆశా = కోరికల వల్ల నైన, దైన్యదశా = దైన్యదశను, నివారక = నివారించునదియై, సరాగ = అనురాగముతో కూడుకొనిన, ఆలోక = చూపు గలది, ఐ = అయి, మించు నాకాశశ్రీ యిరుచక్కిన్ – మించు = మించుచుండెడి, ఆకాశశ్రీ = ఆకాశలక్ష్మియొక్క, ఇరుచక్కిన్ = రెండు పార్శ్వములను, భువనాధిష్ఠానకుంభంబులో – భువన = లోకము లనెడు ఉదకమునకు, అధిష్ఠానంబులు + ఐన, కుంభంబులు + ఓ = కలశములో, నాన్ = అనగా, తత్+తత్ దిశా+అంతంబులన్ – తత్ తత్ = ఆయా, దిశాంతంబులన్ = పూర్వ పశ్చిమ దిగంతాలలో, రవి+ఇందుబింబంబులు – సూర్య చంద్రబింబములు, ఒగిన్ = క్రమముగా, శోభిల్లెన్ = ప్రకాశించెను – అని.

శార్దూలవిక్రీడితంలో మొదటి గురువును రెండు లఘువులుగా మార్చాలి. యతిస్థానం 13వ అక్షరం నుంచి 14వ స్థానానికి మారుతుంది. ప్రాసాక్షరం మారుతుంది కాబట్టి ఏ పద్యానికి ఏది మూలమో గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది. వేంకటకవి పద్యం ఇది:

జగదాశా బహుదైన్యవారణ విరాజద్వీక్షణాన్వీత యౌ
గగనశ్రీ కిరుచక్కి ప్రాగపరదిగ్గ్రావద్విపద్వంద్వ హ
స్తగతాంచ ద్వసురౌప్యకుంభములు నా సంధిల్లె సత్కాంతులన్
మిగులన్ సూర్యసుధాంశుబింబములు నెమ్మిం దద్దిశాంతంబులన్. ప.122

అని. ఆశాదైన్యదశానివారక సరాగాలోకయై = జగదాశా బహుదైన్యవారణ విరాజద్వీక్షణాన్వీత యౌ, ఆకాశశ్రీ యిరుచక్కిన్ = గగనశ్రీకి ఇరుచక్కిన్, పూర్వ చరమ గ్రావ = ఫ్రాగ్ + అపరదిక్ గ్రావ, దంతావళ+అధీశద్వంద్వము = ద్విపద్వంద్వము, మౌళిన్+పూను = హస్తగతాంచత్, భువనాధిష్ఠానకుంభంబులు = వసురౌప్యకుంభములు, నాన్ శోభిల్లె = నాన్ సంధిల్లె, ఒగిన్ = నెమ్మిన్, తత్తద్దిశాంతంబులన్ = తద్దిశాంతంబులన్ అని పర్యాయానుసరణం.

మరికొన్ని ఛందఃపరివర్తనలు: చంపకమాలను గ్రహించి, కందపద్యంగా సంక్షేపించటం:

తిలకము సంహితోర్ధ్వముఖతీక్ష్ణశరాగ్రము గాఁగ, నాసికాం
చల విలసత్ప్రకోష్ఠ సుమసాయక ముష్టిగృహీత మధ్య శా
ర్ఙ్గలత యనన్ బొమల్ దనరఁగా, నిరుగొమ్ముల వ్రేలు వెల్ల జ
ల్లుల గతి నవ్వుడాలు పొదలున్ మదిరాక్షి మెఱుంగుఁజెక్కులన్. కళాపూర్ణోదయము (2-69)

దీనికి వేంకటకవి పరివర్తన:

తిలకంబు ములికి నాసాం
చల కాంచన శరగృహీతశార్ఙ్గంబును బొ
మ్మల కోపుల వ్రే ల్తెలి జ
ల్లు లనఁగఁ జెక్కుల నగవు తళుకమరె రమకున్. ప.491

ఇంకొకటి, ఉత్పలమాలను కందంలోనికి కుదించటం:

పంచశరాహితుండికుఁడు భామిని పొక్కిలిపెట్టెలోనఁ దా
నుంచిన కాలసర్పము సమున్నతి నాడఁగ ఠేవమీఱ బు
స్సంచు ఫణాగ్రమెత్తి యలరారెడు చాడ్పున రోమరాజి య
భ్యంచితలీల మించి మది హర్షముఁ జేయు జనాళి కెప్పుడున్. హంసవింశతి (5-19)

వేంకటకవి రచన:

మారనరేంద్రుఁడు నెఱి నూ
గారను బెనుబాము వెడలఁగా దిగి యెదుటన్
జేరుప నగు నఱపెట్టియ
సౌరునఁ బొక్కిలి దనర్చెఁ జంద్రాననకున్. ప. 494

ఛందఃసామ్యాన్ని పురస్కరించికొని ద్విపదను సీసపద్యంగా మార్చటం:

జల్లిమాటలు నపశబ్దముల్ జజ్జు
టల్లికల్ ప్రావలం దదుకుఁ బల్కులును
పునరుక్తములు వట్టిపూదెలు కాకుఁ
దెనుఁగు లీఁచలును సందిగ్ధముల్ ప్రాలు
మాలికల్ కటువు లేమరపులు కొసరు
లాలంబములు వెఱ్ఱి యతకడంబులును
చాయలెత్తుట లర్థచౌర్యముల్ పెట్టుఁ
జాయలు లేక లక్షణసమ్మతముగ
నందమై సుకవు లౌరా యనఁ జెవుల
విందుగాఁ గపురంబు వెదఁజల్లినట్లు… (కట్టా వరదరాజు ద్విపద రా. బాల. అవ.)

దీనికి వేంకటకవి పరివర్తనం:

జల్లిమాటలు నపశబ్దములును జజ్జు
         టల్లికల్ ప్రావల్లం దతుకుఁ బలుకు
లును పునరుక్తములును వట్టి పూదెలుఁ
         గాకుఁదెనుంగులుఁ గటువు లీఁచ
లును ప్రాలుమాలికలును సందియము లేమ
         ఱపులు మఱుఁగులు వ్యర్థపదములు ర
వణ మీఱు బదునైదు వాక్యదోషములు గ
         నక యవి సరవి గనక … ప. అవ. 16

ఇక్కడ ద్విపద సీసరూపాన్ని పొందింది. యతిప్రాసలకోసం మాత్రమే కొద్దిగా మార్పు ఆవశ్యకమౌతుంది.

నాలుగవ విభాగం: భిన్నపద్యసమావేశం

రెండు వేర్వేరు పద్యాలను ఒకచోట చేర్చే సంవిధానానికి భిన్నపద్యసమావేశం అని పేరు. ఇది రెండు వేర్వేరు చందస్సులలో ఉన్న పద్యాలను ఒకచోటికి తేవటం; ఇద్దరు వేర్వేరు కవులు వ్రాసిన రెండు వేర్వేరు పద్యాలను ఒకచోటికి తేవటం – అని రెండు విధాలు. దీనిని వ్రాయటం ఎంత కష్టమో, వ్రాసిన తర్వాత పూర్వరూపాలను గుర్తుపట్టటం అంతకు వేయింతలు కష్టం. వేంకటకవి ప్రదర్శించిన ఒకటి రెండు భిన్నపద్యసమావేశాలను చూపుతాను:

తొలిమిన్కు చెలులాడు తలిరాకు టుయ్యెలఁ
         జేర్చిన పగడంపుఁ జేరు లనఁగ
రాజుపై నెత్తిన ప్రత్యూషవిభు చంద్రి
         క గుడారు పట్టు పగ్గంబు లనఁగ
మునుగట్టు సులుతాని మ్రోలఁ బుట్టిన యింద్ర
         గోపంపు టెల్లి కెంగుచ్చు లనఁగఁ
బూర్వదిశాలక్ష్మి పూను బంగరు తమ్మిఁ
         దళుకొత్తు నున్నిద్రదళము లనఁగఁ

గుక్కుటవ్యూహ కాహళి ఘోషబిరుద
శాలివాసర యోధాగ్ర సరస రాగ
ఫలక మాంజిష్ఠ చామరప్రతతు లనఁగ
న వ్వరవిరోచు లల్లన నభముఁబ్రాఁకె.

ఇది రామరాజభూషణుని హరిశ్చంద్రనళోపాఖ్యానంలోని (4-33) పద్యం. సూర్యభగవానుని ప్రథమకిరణాలు ఆకాశవీథి నధిరోహిస్తున్న అద్భుతమైన సన్నివేశం. వేంకటకవి సీస చరణాలను యథాతథంగా పరిగ్రహించి, ఎత్తుగీతి పాదాలను మోచెర్ల నన్నయ సాంబోపాఖ్యానం నుంచి స్వీకరించి, విచిత్రమైన పద్యసమావేశాన్ని కూర్చాడు. ఇది సాహిత్యంలో ఒక అపూర్వమైన ప్రక్రియావిశేషం. సాంబోపాఖ్యానంలోని సీస చరణాలను విడిచివేశాడు. మోచెర్ల నన్నయ ఎత్తుగీతి పద్యభాగాలివి:

ప్రాఁకె నభమున నభినవప్రభఁ బ్రభేశ
కిరణడింభంబు లొకకొన్ని సరసఘుసృణ
విసృమరచ్ఛాయ దాయాద విలసనములు
దళితమందేహ దేహ రక్తకణగణన. సాంబో. (5-347)

దళిత మందేహ దేహరక్తములఁ గూడి
భూసురార్ఘ్యాంబుపూరంబు లేసరేఁగ
నిత్యకల్యాణముల నిచ్చు నీదు రాక. సాంబో. (2-22)

ఈ పద్యాలన్నింటిని సమావేశపరచి వేంకటకవి ఒక వినూత్నమైన దృశ్యాన్ని కన్నులకు కట్టాడు:

తొలిబల్కు చెలులాడు తలిరాకు టుయ్యెలఁ
         గూర్చిన పవడంపు గొలుసు లనఁగఁ
బ్రాచీదిశాలక్ష్మి పట్టు మేలిమి తామ
         రను మించు మించు పత్రము లనంగ
రాజుపై నెత్తిన ప్రత్యూషనృపు తోఁపు
         దళుకొత్తుఁ దేరీజత్రాడు లనఁగఁ
దూరుపుగుబ్బలిదొర చెంతఁ జేర్చిన
         సూరెపుటపు టల్లిజొంపము లన

నగ్రజన్మకరాబ్జ దత్తార్ఘ్యతోయ
నిశిత నారాచదళిత మందేహ దేహ
దారుణ స్రవదస్రోరుధార లనఁగ
నవ్యఖద్యోతకాంతులు నభముఁ బ్రాఁకె. ప. 124

ఇందులోని సీస చరణాలు రామరాజభూషణుని ప్రత్యక్షరపరావృత్తికి ఉదాహరణలు. నన్నయ కవి గీతిపద్యాలు రెండింటి నుంచి కొంత కొంత వేంకటకవి గీతిపద్యానికి ఆదర్శం. ఈ అందరికీ శ్రీనాథుని, నెత్తు రనియెడు విచికిత్స నివ్వటిల్ల, భానుకిరణంబు లొకకొన్ని ప్రాఁకె నభము అన్న కాశీఖండ పంక్తులు (1-122) ఆలంబనలు. శ్రీనాథునికి మయూరుని సూర్యశతక శ్లోకం (శ్లో.5) ఆధారభూమిక. సాహిత్యజిజ్ఞాసువులకు ఇది క్రీడాక్షేత్రం.

ఇంకొక క్లిష్టమైన పద్యసమావేశాన్ని చూడండి:

ఎఱుకో ఎఱుక యటంచుం
గొరవంజి నటించె నొక్క గురుకుచ చంకం
బురకడు బంగరు బుట్టియ
సొరిదిం గొల్లాపురమ్మ సుద్దులు వెలయన్.

తరకట బురకట గాదే
తరుణీ నా మాట నీకుఁ దార్కా ణగునే
బురకనికి బువ్వ దేవే
యెఱు కడగవె యంచు నొక్క యింతి నటించెన్.

ఇవి ధరణిదేవుల రామయ మంత్రి దశావతార చరిత్ర (7-287, 288) లోని ఎరుకసాని పద్యాలు. ఈ వృత్తాంతాన్ని చూసి ఆకర్షితుడైన వేంకటకవి దానిని సీసపద్యంలోకి మార్చుకొన్నాడు:

ఇంతిరో! మనవీట వింతగా మును ‘పెఱు,
         కెఱుకో’ యటం చొక యెఱుకసాని
యేతెంచె; నడుగ వేమే, యవ్వ! యొకసుద్ది
         సెప్పెద, బాగెపు సేయి సూపు;
కొల్లాపుర మ్మాన, పొల్లాపు లే దొండుఁ
         దలఁచితి; వదిగాదు దయ విటుండు
గడకేఁగు నినుఁబాసి; కన్నది పెఱవాని
         నిన్నుఁ జేర్చు నెఱుంగ నేరవీవు

గానఁ దరకట బురకట గాదు మేట
జేరు బురకని తోడు తే తారుకాణ
యొండు రెండే దినాల కిం దుండి నాదు
మాట మఱువకు మని పోయె మఱచినావె. ప.626

అని. రెండు కందపద్యాలను సీసంలోనికి మార్చుకొనటం వల్ల మూలాన్ని గుర్తించటం కష్టమే.

అయిదవ విభాగం: కేవల శిల్పానుకరణం

ఒక పద్యంలో చిత్రితమైన శిల్పవిశేషాన్ని అభిమానించి వేంకటకవి దానిని అనుసరించటం అనేకస్థలాలలో గోచరిస్తుంది. ఇది సంస్కృతాంధ్రకవు లందరూ చేసినదే. వేంకటకవి రచన పాఠ్యప్రణాళీ కల్పనకే గాని ప్రతిభాలోపానికి సంకేతం కాదు.

వాక్యనిర్జిత శేషవాల్మీకి వాల్మీకి
         హరిభక్తియుక్తి ధీవ్యాసు వ్యాసు
ఘనభావ కాళిదాసును గాళిదాసును
         జారు మాధుర్య వాచోరుఁ జోరు
దివిజేంద్ర ధనద వైభవభూతి భవభూతి
         ధర్మబుద్ధి నవీన దండి దండిఁ
గవితాభ్రహృష్ట మాధావ మయూరు మయూరు
         భాసురాకృతి పుష్పబాణు బాణు

మానితాచార మథితాస మాఘు మాఘు
ధ్యానబద్ధమురారి మురారి గాత్ర
పటువిభా రవి భారవిఁ బ్రస్తుతింతు … — హంసవింశతి (1-10)

వేంకటకవి పద్యం ఈ శిల్పవిశేషానికే ప్రతిబింబం:

వాగ్వధూ భోగినీ వల్మీకు వాల్మీకు
         వరపురాణాగమ వ్యాసు వ్యాసు
నవవచశ్చాతురీ భవభూతి భవభూతి
         శారదాహృద్ధనచోరుఁ జోరు
సూరిలీలాభ్రమయూరు మయూరు స
         త్ప్రజ్ఞా సతీ పంచబాణు బాణు
సార ధీ లోల మురారి మురారి ను
         ద్దండ విలోకన దండి దండిఁ

గావ్యరచనా మహోల్లాసుఁ గాళిదాసు
బహువిచిత్ర కళాహర్షు భట్ట హర్షు
సత్కవీశ్వర సంతతశ్లాఘు మాఘు
నభినవప్రీతి నెంతయు నభినుతింతు. ప. అవ. 14

ఆరవ విభాగం: యథాతథానుకరణం

ఇంతకు మునుపు వేంకటకవి దామెరలా వెంగళనాయకుని బహుళాశ్వ చరిత్ర నుంచి గ్రహించిన ఒక పద్యాన్ని ఉదాహరించాను. వెంగళనాయకుడు నవగ్రహ రత్న రస నిధాన సీసము అని పేరుపెట్టగా, వేంకటకవి దానికే నవగ్రహ నవరత్న నవరస నవనిధాన సీసము అని పర్యాయకల్పన చేసి, అదే పద్యాన్ని వాడుకొన్నాడు. అటువంటి మరికొన్ని ఉదాహరణలు:

కలఁచి వారిధి బయ ల్సెలసి కొమ్మునఁ గొట్ట
         నంటివచ్చిన నాఁచుటుంట పుడమి
కొప్పరించఁగ మింటఁ గ్రొవ్వాడి రోమముల్
         చొచ్చివచ్చిన తొల్చుక్క గుంపు
చప్పరింపఁగ జాఱి తెప్ప గట్టుక వచ్చు
         విమలఫేనము సుధాసముదయంబు
కకుబంతముల చెవు ల్బెకలించు ఘుటఘుట
         ప్రతినినాదము ఘన ప్రళయగర్జ

పొరలికఁ బయోధిఁ జెందిన బురద యెండి
యొడలు జాడింపఁ గడ రాలిపడిన యొడ్డు
పెల్ల లబ్జాసనాండముల్ పెంపుఁ గాంచు
తావక మహత్త్వమునను మాయావరాహ.

ఇది పైడిమఱ్ఱి వేంకటపతి రచించిన చంద్రాంగద చరిత్రము (1-75) లోని పద్యం. దీనిని వేంకటకవి ఎంతటి యాథాతథ్యంతో పరిగ్రహించాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది:

కలఁచి సంద్రము బయల్ సెలసి కొట్టిన కోర
         తుద చుట్టికొను నాఁచు మొదలి తాచు
చప్పరింపఁగ జాఱి చక్కఁగా సెలవిని
         చిందు నురుగు బుగ్గ చందమామ
కొప్పరింపఁగ రోమకోటి వింటను డుయ్యఁ
         బొడమిన బెజ్జమ్ము లుడుగణములు
రిక్కించి వీనులు దిక్కు లదరఁ జేయు
         ఘుర్ఘురధ్వని ప్రతిఘోష మురుము

పొరలి కలనంటు మున్నీట బురదతోడి
యొడలు జాడింపఁ గడనూడి పడిన పెల్ల
లబ్జజాండంబు నీవు మహావరాహ
రూప మందిన వేళ గారుడగిరీశ. ప. 218

యాథాతథ్యానుకరణ అని పేరుపెట్టినందుకు ఇంతకంటె మేలైన ఉదాహరణ దొరకదు.

ఇంకొక నిదర్శనం:

మెఱుఁగుటద్దపు మించు మించుబాగుల నింపు
         నింపు చక్కని ముద్దు నెమ్మొగంబు
నవచంద్రికల నవ్వు నవ్వుఠీవులఁ జూపు
         చూపుల చొక్కంపు సోయగంబు
నారూఢిఁ బలుమారు మారువిండ్లకు నేర్పు
         నేర్పు కన్బొమదోయి నెఱతనంబు
గటికి చీఁకటిఁ గప్పు కప్పుఁ బూనిన కొప్పు
         కొప్పు తోరంపు జక్కువ బెడంగు

గుబ్బపాలిండ్లు లేఁగౌను గొప్ప పిఱుఁదు
బాహులతికలు మృదుపద పల్లవములు
గలిగి చెలు వొందుచుండు నా చెలువ మిగుల. — కళాపూర్ణో. (1-30)

పింగళి సూరన గారి నేర్పును నేర్చుకోగోరినవారికి నేర్పే తీరు ఈ విధంగా ఉంటుంది:

మించు లందున మించు మించు వైఖరి నింపు
         నింపు నెమ్మేని నిద్దంపు సొగసుఁ
బువ్వుల జిగి నవ్వు నవ్వు చొక్కపు డాలు
         డాలు వెలార్చు కపోలపాళి
సరసభావ మమరు మరు విల్లులకు నేర్పు
         నేర్పు సోయగమున నెగడు బొమలు
గండుతేఁటుల కప్పు కప్పురీతులఁ జూపుఁ
         జూపు సింగారంపు చుఱుకు నిగ్గు

పద్మినీవైరితోఁ బోరు పడఁతి మోము
మోము గోమును శిరము కప్పురము బల్కు
కళుకు గననీని కనుఁగవ తళుకు గలుగు
చెలువ చెలువంబు వర్ణింప నలువ తరమె. ప.411

ఇంకొకటి, తరిగొప్పుల మల్లన చంద్రభాను చరిత్రము నుంచి:

గాజుకుప్పెల వంటి గబ్బిగుబ్బలు గోర
         నంటిన వ్రీలుఁగా యనుచుఁ గొంకి
దిరిసెన పూవంటి తిన్నని మై కేల
         నలమిన వాఁడుగా యనుచుఁ గొంకి
కండచక్కెర వంటి కమ్మని వాతెఱ
         నానినఁ గరఁగుఁ గా యనుచుఁ గొంకి
చికిలి యద్దము వంటి చిన్ని నెమ్మో మూర్పు
         లడరినఁ గందుఁ గా యనుచుఁ గొంకి

తళుకు నెలకూన లునుపక తనివి తీఱఁ
గౌఁగిలింపక కెంపులు గలుగ నిడక
నలరు వలపులు గ్రోల కందంద కనుచు
నూరకే మోసపోయితి నో వయస్య. (5-85)

గాజుకుప్పెల వంటి గబ్బి సిబ్బెపు టుబ్బు
         చిన్ని గుబ్బలు గోరఁ జెనక వెఱచి
చీనిచక్కెర వంటి చెంగావి వాతెఱ
         యింత పల్మొన సోఁకనీయ కళికి
జిగిమల్లె పూవంటి చిన్నారి నెమ్మేను
         బిగువుఁ గౌఁగిట నాని పెనఁగఁ దలఁకి
హొసతమ్మినూల్వంటి యసదు లేఁగౌనుపై
         నోరగాఁగఁ బరుండి యొరఁగఁ గొంకి

మనసు దీరఁగ నొకనాఁటి యునికి లేక
మోసపోయితిఁ గసికాటు ముచ్చటలనె
యింతలోననే నన్ను నీ వింత సేయు
టెఱుఁగనేరని కతనఁ బూర్ణేందువదన. ప. 750

ఇది రఘునాథ నాయకుని వాల్మీకి చరిత్రము నుంచి:

పంకజకరా కుచ విశంకట తటీ రచిత
         కుంకుమ పటీర రుచి సంకలిత వక్షో
లంకరణ కౌస్తుభ శశాంక రవిలోచన ప్రి
         యంకర గుణప్రకర కింకరదమర్త్యా
శంకర నుతాన్నత శివంకర సురాహిత భ
         యంకర శరాగత కళంక భువనక్షే
మంకర మునీంద్రగణ సంకథిత పావన ని
         రంకుశ మహామహిమ వేంకటగిరీశా. (2-56)

దీనికి వేంకటకవి అనుసరణ:

పంకజ తనూజ హరి శంకర ముఖామర వి
         శంకట నవీన నుతి సంకలిత పాదా
లంకరణ జహ్నుతనయాంక మునిమానస వ
         శంకర రణాంగణ నిరంకుశ పలాశా
తంకద ఖగేశ బిరుదాంక కమలాకుచ వి
         టంకయుత సంకుమద కుంకుమరస శ్రీ
పంకిల భుజాంతర మనోంకణము నందుఁ గల
         సంకటముఁ బాఁపఁగదె వేంకటగిరీశా. ప.835

ఇది మోచెర్ల వెంకన్న సాంబోపాఖ్యానం నుంచి:

సవరాల గెల్చి చీఁకటి
సవరాలుచు కురులు గలుగు జవరాలి కొలం
బు విరాళిఁ గొనఁగ వేణువు
ల వరాళి ఖచరవరాళి లలి నింపు గిరిన్. సాంబో. (2-127)

దీనికి వేంకటకవి అనుసరణ:

సవరాలఁ దెగడి నీలపు
సవరాలుచు కురులు దనరు జవరాలి కొలం
బు విరాలిఁ గొలుప వచ్చెను
తొవరా లియ్యంపు మోము దులకింపన్. ప. 450

ఇది హరిభట్టు రచించిన దుర్లభమైన నారసింహ పురాణం నుంచి:

చీఁకటియుఁ జంద్రికారస
మేకస్థానంబు నంద యిరవొందు గతిన్. హరిభట్టు నారసింహ పురాణము (ఉ.2-18)

దీనికి వేంకటకవి అనురణనం:

చీఁకటి వెన్నెల యెండయు
నేకముహూర్తమునఁ గలసి యిల వెలసె ననన్. ప. 803

ఈ ఉదాహృతుల మూలాన వేంకటకవి అవతారిక లోని వక్ష్యమాణలక్ష్యవిశేషోద్దేశవచనంలో చెప్పినట్లు తన మహాకృతి చిరంతనాంధ్రప్రబంధజాలంబుల కాలవాలంబు కావటానికి ఎంత పాటుపడినదీ గ్రహింపగలుగుతున్నాము. ఈ బృహత్ప్రణాళికను ఆచరణలో పెట్టేందుకు వేంకటకవి సేకరింపని లక్షణాలు కాని, శేఖరింపని ప్రయోగాలు కాని లేవనే చెప్పవచ్చును. కావ్యవిద్యను అభ్యసించి నిష్ణాతలు కాగోరినవారు ఈ ప్రబంధరాజాన్ని సుపరిచితం కావించికొని, ఇందులోని పద్యాలను మనోమందిరంలో నిలిపికొని, అర్థతాత్పర్యాలను తెలిసికొని, ముద్రితాముద్రిత కృతులన్నిటినీ ప్రత్యక్షరశోధగా పరీక్షించితే కాని ఇందులోని విశేషాలను గ్రహించటం కష్టం. ఇదంతా ఒక అభినవ సంవిధానంతో పర్యాయపదాలతో కూర్చిన సంకలనగ్రంథం కాబట్టి ఒక్కొక్క కావ్యాన్నీ ఒకమారు చదివినంత మాత్రాన ఇందులోని ఆదర్శాలన్నీ స్ఫుటగోచరాలు కావు. అందులోనూ ప్రబంధరాజంలోని వచనభాగాలకు మూలప్రతీకలను గుర్తించటం ఎంత కఠోరశ్రమసాధ్యమో అందులో కృషిచేసిన వారికి గాని బోధపడదు. ఆ ప్రతీకలను గుర్తుపట్టగలిగితే, తెలుగులో సాహిత్య వ్యాకరణ చిత్రకావ్య లక్షణచరిత్ర నిర్మాణానికి దోహదం కాగలుగుతుంది. వేంకటకవి కావ్యసంకలన కాలనిర్ణయం సప్రమాణం అవుతుంది. అందుకు మరికొన్ని ఉదాహరణలను చూపుతాను:​ ​

మరకతమణిమయ మహిమత
కర మరుదుగ సకలభువనకమనీయతచే
తరిమెచ్చు మణులదరి పరి
పరి రుతి నమరు వరదపతిపదకమలనిధీ.

ఇది తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాలయంలో ఉన్న చిత్రకవిత్వదర్పణమనే వ్రాతప్రతి 12వ పుటలోని పద్యం. ఇందులో కృత్యాదిపద్యాలు లేవు. దీనికి కాకినాడ ఆంధ్ర సారస్వతపరిషత్తు వారి గ్రంథాలయంలో 2063 అన్న గ్రంథసంఖ్యతో ఒక మంచి ప్రతి ఉన్నది. అందులో ఒకపాటి అవతారిక కూడా ఉన్నది. రెండింటిని సమన్వయించికొని చదువుకోవాలి. కాకినాడ వారి ప్రతిని బట్టి చిత్రకవిత్వదర్పణాన్ని రావు కొండలరాయకవి నడిమింటి వేంకటపతి సాయంతో రచించినట్లుగా ఉన్నది. గ్రంథంలో ఉభయకవుల పద్యాలూ కనబడుతున్నాయి. ఈ నడిమింటి వేంకటపతి పేరెన్నిక గన్న మహాకవి. క్రీస్తుశకం 1703లో సిద్ధవటం, పోరుమామిళ్ళ, బద్దెవోలు సీమల మన్నె కావలికాడయిన అప్పయ్యరాజు ప్రేరణను పురస్కరించికొని ఆయన పినతండ్రి అయిన మట్లి వెంకటరామరాజుకు (క్రీ.శ.1683-1700) అంకితంగా భోజచంపువును అభిషిక్తరాఘవము అన్నపేరిట మహాప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. గొప్ప చిత్రకవిత్వాభిమాని. అప్పయ్యరాజు కొలువు ముగిసిన తర్వాత రావు కొండలరాయని ఆశ్రయించి, చిత్రకవిత్వదర్పణము అనే లక్షణగ్రంథాన్ని నిర్మించేందుకు ఆయనకు తోడ్పడ్డాడని భావిస్తే, వీళ్ళిద్దరూ క్రీస్తుశకం 1705-1715ల నడిమి కాలానికి చెందుతారు. ఈ రావు కొండలరాయడు నరసరావుపేట సంస్థానాధిపతి అని తూమాటి దొణప్పగారు తమ బృహత్పరిశోధనగ్రంథం ఆంధ్ర సంస్థానములు – సాహిత్యపోషణములో (పుట.191) వ్రాశారు. కవి కాలం అందుకు సరిపడుతూనే ఉన్నది. పైని ఉదాహరించిన ఇప్పటికీ అముద్రితంగా ఉన్న ఈ చిత్రకవిత్వదర్పణంలోని పద్యానికి వేంకటకవి కల్పించిన రూపాంతరం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో 853వ సంఖ్యతో ఉన్నది:

మరకతమణిమయ మహిమత
కర మలరు తనుకళ కలిమి కలికి సతమ్మౌ
యురమును భుజగవర ధరా
ధరమును నమరు హరి మదనదమననుతపదా.

రెండు పద్యాల పోలిక విశదమే కనుక ఇక్కడ విశేషించి వివరణకు పూనుకొనటంలేదు.

ఘనసారమును సారఘనము నాక్షేపించుఁ
గలికి పల్కుల యింపుఁ, గచము సొంపు

అని కనుపర్తి అబ్బయామాత్యుని అనిరుద్ధ చరిత్ర (2-26).

నాఁతి ముంగురుల కళుకు నగవు కులుకు
సారఘనమును ఘనసార సరణి మించు

అని ప్రబంధరాజం (503). ‘మేలారసికా’ అని కనుపర్తి అబ్బయామాత్యుని కవిరాజమనోరంజనం (4-176) లోని భాషాశ్లేష కందం. ఒకే పద్యంలో సంస్కృతాంధ్రభాషలను శ్లేషించటం జరుగుతున్నది. (మేలా = ఇది నీకు మేలేనా?, రసికా = ఓ రసజ్ఞుడా అని ఒక ఒక అర్థం; మా + ఇలా = లక్ష్మీదేవియందును, భూదేవియందును, రసిక = మరులుగొన్నవాడా అని ఒక అర్థం). ‘మేలానాయక’ అని గణపవరపు వేంకటకవి ప్రబంధరాజంలో (808వ పద్యం) అదే అనురణనం. కనుపర్తి అబ్బయామాత్యునికి అనంతరీయుడన్నమాట.

ప్రబంధరాజంలో వేంకటకవి సొంత పద్యాలు లేనే లేవా?

సంకలనగ్రంథం కాబట్టి, అదీ పర్యాయపదాలతో కూర్పబడిన వినూత్నసంవిధానం కాబట్టి, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని మొత్తం 904 పద్యాలలో (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ముద్రణలో 887 ఉన్నాయి) వేంకటకవి సొంత పద్యాలు కొన్నయినా వ్రాయలేదా? ఉన్నవన్నీ అనుసరణలేనా? అన్న ఉత్థాపనీయ ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం చెప్పటం సాధ్యం కాదు. సంస్కృతాంధ్రప్రబంధాలు అన్నింటిని పరిశోధించి, ప్రాకరాలను గుర్తించి, ప్రాకరాలు దొరకని పద్యాల పట్టికను ప్రకటించితే కాని దీనికొక పరిష్కారం ఉండదు. గ్రంథాంతంలో ఉన్న ఫలశ్రుతి పద్యాలు బహుశః ఈయనవే అనుకోవాలి. అవతారికలో ఉన్నవన్నీ స్వతంత్రాలని గాని, అనుసరణలని గాని నిర్ధారించటానికి వీలులేకుండా ఉన్నది. తన రచనలను పేర్కొన్న భాగం చాల వరకు స్వతంత్రరచనమే అనుకోవాలి. బాలవేంకటశౌరి కవికి కలలో కనబడి, ‘నిలచి జలధరగంభీరనిస్వనమున’ పలికిన భాగాన్ని కట్టా వరదరాజు ద్విపద రామాయణం నుంచి గ్రహించాడు. బాలవేంకటశౌరి తనను గురించి పలికిన ప్రశంసావాక్యాన్ని బహుళాశ్వ చరిత్ర నుంచి తీసుకొన్నాడు. తన కవిత్వం ‘చెఱకు తుదనుండి మొదటికిఁ బరఁగఁగ రుచిగొన్నయట్టి భంగిని’ తీయనై ఉంటుందని చెప్పినవాడు, ఆ పలుకును ‘చెఱకు కొననుండి నమలిన చెలువు దోఁప’ అన్న జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానంలో నుంచి సంకలనించాడు.

పలుకులఁ దేనెలు జిలుకన్
సలలితముగ నధరమునను జక్కెర లొలుకన్
గలికి మొగము సిరి దొలఁకన్
నిలువున శృంగారరసము నిగ్గులు గులుకన్.

అన్న పద్యాన్ని అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యానం (4-53) లో నుంచి స్వీకరించాడు. ఆ పద్యం ఇది:

పలుకుల నమృతము చిలుకన్
జలజల కెమ్మోవి వలనఁ జక్కెర యొలుకన్
తళతళ మెయి జిగి బెళుకన్
నెలకొను శృంగారరసము నిలువునఁ గులుకన్.

అని. ‘ఒక కన్ను రవిపుట్టువుగఁ బాల్పడఁగ నొక్క, కరశస్త్ర మాతపస్ఫురణ నింప’ అని శ్రీరంగమాహాత్మ్యం నవమాశ్వాసంలో కట్టా వరదరాజు వ్రాస్తే, దానిని ‘ఒక దక్షిణాక్షి సూర్యునికిఁ బాలుగ … నొకచేయి చక్ర మెండకు బిడారుగ’ (ప్రబంధ.552) అని ఆ పద్యమంతటినీ తీసికొన్నాడు.

సరమా తను వసితోర
స్సరమా వేనలి సుధావసరమా సుడి మేల్
సరమా పొక్కిలి రత్నవి
సరమా రదనాళి చెలి సుసరమా పొగడన్.

అని రాపాక లక్ష్మీపతి రచించిన భద్రాయురభ్యుదయం (3-231). అపురూపమైన ఈ కావ్యంలో నుంచి 395వ పద్యంగా వేసుకొన్నాడు:

సరమా కే లనఁటికి మీ
సరమా మెఱుఁగుఁదొడ నాభి సరమా జలజా
సరమా సుఖరుచి భసలవి
సరమా కురుల జిగి కొమ సుసరమా పొగడన్.

మరొక్క ఉదాహరణ:

బొంకిన మొగసిరి వొలియు నాయుష్య
మింకుఁ దేఁకువ దప్పు నెడతెగుఁ గీర్తి
నమ్మిక మాలు మానము దూలపోవు
వమ్మగుఁ బుణ్యంబు వచ్చు నాపదలు

ధర నానృతా ద్దుష్కృతం పర మనుచు
నురువడి మ్రోయుచు నుండు వేదములు.

అని గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం ద్వితీయాశ్వాసంలోని భాగం. దీనిని ఉన్నదున్నట్లుగా చంపకమాలగా పరివర్తించుకొన్నాడు:

జగతి నరుండు బొంకిన రసజ్ఞత దప్పు, నకీర్తి జేకుఱున్,
మొగసిరిఁ బాయు, నాపదలు ముంచు, శుభంబు దొలంగు, వీడు న
మ్మిగ, చెడు ధర్మ మె, ల్లణఁగు మేలిమి, నాశము నొందు నాయు (?), వ
మ్మగుఁ గలిదోషమందు భయ మంటదు నేస్తము బాయు సద్గతుల్. (ప. 336)

ఈ విధంగా ఉన్న పద్యప్రకరంలో నుంచి ‘ఇది వేంకటకవి పద్యం’ అని నిర్ధారించటం కష్టం. గ్రంథం రెండుమార్లు అచ్చయినా, పరిష్కర్తలకు ఈ దృష్టి లేనందువల్ల అసంఖ్యాకంగా తప్పులు దొర్లాయి. శీర్షికలలో పొరపాట్లు చోటుచేసుకొన్నాయి. ఎక్కడికక్కడ అనన్వితాలున్నాయి. చిత్రకవిత్వమంతా తప్పుల తడకగా రూపొందింది. సరైన పరిష్కరణ జరిగితే కాని పాఠకులకు దీని స్వరూపావగాహన కలుగదు.

ఉన్న కీలకమల్లా ఒక్కటే: ప్రబంధరాజంలో “అపూర్వప్రయోగము” అన్న శీర్షికతో మొత్తం 66 పద్యాలున్నాయి. “అపూర్వప్రయోగము” అంటే, “పూర్వులు ప్రయోగింపని రచన” అని స్థూలార్థం. అంటే, నిర్మూలకమైన స్వతంత్రరచనమని భావం. అకాడమి వారి ముద్రణలో అవి 48, 66, 67, 76, 111, 124, 129, 137, 145, 153, 154, 159, 174, 177, 241, 262, 285, 286, 288, 295, 303, 307, 334, 336, 384, 439, 441, 444, 452, 481, 492, 500, 510, 515, 543, 547, 551, 554, 555, 579, 587, 601, 618, 630, 636, 642, 647, 653, 667, 673, 686, 706, 717, 726, 727, 737, 746, 774, 777, 781, 786, 789, 802, 819, 831, 839 అన్న పద్యసంఖ్యలు గలవి. వాటిలో 48, 66, 76, 124, 137, 145, 154, 241, 256, 288, 295, 307, 336, 452, 481, 492, 515, 543, 547, 618, 706, 717, 786 అన్న సంఖ్యలు గల పద్యాలు నిజంగా అపూర్వమైనవి కావు. వాటికి మూలాలున్నాయి. అందువల్ల ఆ పద్యాలకు “అపూర్వప్రయోగము” అని ఉన్న శీర్షికలను తొలగిస్తే, మిగిలినవి నికరంగా 43 పద్యాలవుతాయి. వాటికీ మూలములైన పద్యాలు దొరికితే ఆ సంఖ్య మారుతుంది. అవతారికలో తన గ్రంథాలని చెప్పుకొన్న పట్టికలు గల పద్యాలు మాత్రమే స్వతంత్రములని భావింపవలసి ఉంటుంది. తక్కినవాటికి ప్రాకరాలను పరిశోధకులు గుర్తింపవలసి ఉంటుంది. ఇది సంకలనగ్రంథం అని ఊహింపనందువల్ల ప్రథమ – ద్వితీయ ముద్రణల సంపాదకులు ఆ పనిని చేయలేకపోయారు.

ఈ విధంగా, అపూర్వప్రయోగము అని కవి సూచించిన పద్యాలకు మూలమైన పద్యాలేవీ లభింపనట్లయితే అవి వేంకటకవి స్వయంగా రచించినవాని నిర్ధారించటానికి ముఖ్యమైన ఆధారం ఒకటున్నది. దానిని వివరిస్తాను:

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో 444 సంఖ్య గల పద్యం ఒకటి విచిత్రంగా తృతీయ చతుర్థ చరణాపూర్వప్రయోగము అన్న శీర్షికతో ఉన్నది. అంటే, మూడు – నాలుగు పాదాలు మాత్రమే అపూర్వములని అర్థం. మొదటి రెండూ ‘అపూర్వములు’ కావన్నమాట. వాటికి మూలం ఎక్కడున్నదో విద్యార్థులు గుర్తించాలన్నమాట. ఆ పద్యం ఇది:

అని చతురవచన రచనల
ననవిల్తుని నతని బలము నగి సఖియౌ కాం
చనమాలిక నాంచారును
గని భయ మణఁగింపఁ దలఁచి కడఁకఁ దలిర్పన్.

ఆ మాట నిజమే. మొదటి రెండు పాదాలకోసం విధ్యార్థులు ఆంధ్రకావ్యప్రపంచాన్ని వెతికితే, ఆ రెండూ ప్రౌఢకవి మల్లన చంద్రభాను చరిత్రలో (4-92, 93) దొరుకుతాయి. తృతీయ – చతుర్థ పాదాలు ప్రకృతోపయోగులు కాబట్టి వాటిని కథానుసారం మార్చుకొన్నాడన్నమాట. ఈ విధంగా పర్యాయపదాలతో కూర్చిన అపురూపమైన సంధానగ్రంథమే కాని స్వతంత్రపద్యాలు శశవిషాణప్రాయాలే అన్నమాట.

ఛందోబద్ధకవితను వచనంగా పరివర్తించినపుడు ఎంతో కావ్యానుభవం ఉంటేనే కాని ఆ సత్యాన్ని గుర్తుపట్టటం సాధ్యం కాదని పైని నేను వ్రాసినదానికి ఒకటి రెండు ఉదాహరణలను చూపుతాను:

అల పర్జన్యుఁడు కేకిపాత్రముల గుం పాడించుచో మేఘమం
డలపున్ మద్దెళ గ్రుంగ లేవను, మరున్మార్దంగికుం డర్థి నొ
త్త లలిన్ నేలకు వ్రాలుచు న్నెగయుచుం దారాడు న త్తెల్ల జ
ల్లులుఁ గెంగ్రుచ్చులు నయ్యె ధారలును దల్లోలేంద్రగోపంబులున్.

అని శ్రీకేష్ణదేవరాయల ఆముక్తమాల్యద (4-92).

… నిద్దపుఁ బెద్ద మద్దెలల మొఱపపు టుఱుములకు నెఱమెచ్చి పురివిచ్చి యాడు నెమ్మికొమ్మల యొమ్మిక సమ్ముఖంబునం గమ్ముక …

అని ప్రబంధరాజం. పూర్తిగా తాత్పర్యకథనమే కాని, పర్యాయఘటనం వల్ల గుర్తుపట్టడం శ్రమైకసాధ్యం అవుతుంది.

ఈ విధంగా విమర్శించినపుడు అపూర్వమైన కథాసంవిధానాన్ని ఎన్నుకొన్నాడు. ప్రబంధరాజము అన్న శీర్షికాకృతంగా తన రచన అపురూపమైన సంకలనగ్రంథమని చెప్పకనే చెప్పాడు. ఆంధ్రకవులెవరూ తమ కృతులకు ప్రబంధాదిగా పేరుపెట్టినట్లు కనబడదు. ఆ సంప్రదాయం ప్రబంధచింతామణి, ప్రబంధరత్నాకరం, ప్రబంధసారశిరోమణి వంటి సంకలన గ్రంథరచయితల సొంతం. సాహిత్యచరిత్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి నామాంకితమైన ప్రథమాంధ్ర మహాప్రబంధం కూడా ఇదే. అంతకు మునుపెవరూ చెప్పలేదు. శ్రీ వేంకటేశ్వర స్వామి గురించిన ప్రబంధాలు తెలుగులో అనేకం ఉన్నాయి కాని, అవేవీ శ్రీ వేంకటేశ్వర నామాంకితాలు కావు. ఎఱ్ఱాప్రెగడ నృసింహపురాణములో, తాళ్ళపాక అన్నమాచార్యులు వేలకొలది సంకీర్తనలలో, శ్రీ వేంకటేశ్వర శతకములో, తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు శ్రీ వేంకటేశ్వరోదాహరణ వేంకటేశ్వర వచన వేంకటేశ్వర ప్రభాతస్తవాలలో, తాళ్ళపాక చినతిరుమలాచార్యులు శృంగారమంజరిలో, తిరువేంగళనాథుడు పరమయోగి విలాసములో, పింగళి సూరన కళాపూర్ణోదయములో, సిద్ధిరాజు తిమ్మన పద్య పరమయోగివిలాసములో, తరిగొప్పుల మల్లన చంద్రభాను చరిత్రములో, రేవణూరి వేంకటార్యుడు శ్రీపాదరేణుమాహాత్మ్యములో, కాకమాని మూర్తికవి రాజవాహనవిజయములో, తెనాలి రామకృష్ణుడు ఘటికాచలమాహాత్మ్యములో, కృష్ణకవి శకుంతలాపరిణయములో, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో, కూచిరాజు ఎఱ్ఱన సకలనీతికథానిధానములో, రాయసము వెంకటమంత్రి లక్ష్మీవిలాసములో, ఎఱ్ఱగుడిపాటి వెంకటకవి విష్ణుమాయావిలాసములో, టేకుమళ్ళ రంగశాయి కవి వాణీవిలాస వనమాలికలో, చల్లపల్లి వెంకనార్యుడు శ్రీకృష్ణవిలాసములో, శ్రేష్ఠలూరి వేంకటార్యుడు శ్రీనివాస విలాస సేవధిలో, చింతలపల్లి వీరరాఘవకవి మధురవాణీవిలాసములో, ఊడిమూడి సూరపరాజు వేంకటేశ శతకములో, శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నోరారా నుతించినప్పటికీ, వీరిలో కొందరు కవులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికే తమ కృతులను సమర్పించినప్పటికీ, ఒక్కరైనా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణగాథను మహాప్రబంధంగా సంతరింపకపోవటం వింతగానే తోస్తుంది.

అంతే కాదు. సాహిత్యచరిత్రలో ఎన్నడూ కనీ వినీ యెరుగని అపురూపమైన సంవిధానంతో అపూర్వమైన సంకలనగ్రంథాన్ని పర్యాయపదఘటితకావ్యంగా రూపొందించి, తెలుగు భాషకు అనర్ఘమైన దివ్యాభరణాన్ని కూర్చాడు. అందుకు లక్షణగ్రంథాలలో ప్రధానంగా కాకునూరి అప్పకవి అప్పకవీయం, మల్లియ రేచన కవిజనాశ్రయం, విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి, మూర్తికవి కావ్యాలంకార సంగ్రహం, పొత్తపి వేంకటరమణకవి లక్షణదీపిక, చిత్రకవి పెద్దన లక్షణసారసంగ్రహం అన్నవాటిని ముందుంచుకొన్నాడు. నడిమింటి వేంకటపతి, రావు కొండలరాయ కవుల చిత్రకవిత్వదర్పణం ఉండనే ఉన్నది. తాను మునుపు రచించిన సర్వలక్షణశిరోమణి ఉల్లాసాలు పదీ ఉన్నాయి. సంస్కృతకావ్యాలలో వేంకటాధ్వరి విశ్వగుణాదర్శం, శార్ఞ్గధర సంహిత, దండి కావ్యాదర్శం, మాఘుని శిశుపాలవధ మొదలైనవి ముఖ్యమైనవి. తెలుగులో తిరుమలబుక్కపట్టణం వేంకటాచార్యుల అచలాత్మజా పరిణయం, బిజ్జల తిమ్మభూపాలుని అనర్ఘరాఘవం, కనుపర్తి అబ్బయామాత్యుని అనిరుద్ధ చరిత్రం, సముఖం వేంకటకృష్ణప్పనాయకుని అహల్యా సంక్రందనం, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, అంగర బసవయ ఇందుమతీకల్యాణం, కుమార ధూర్జటి ఇందుమతీ పరిణయం, తెనాలి రామభద్రకవి ఇందుమతీ పరిణయం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, నాచన సోమనాథుని ఉత్తర హరివంశం, పసుపులేటి రంగాజమ్మ ఉషాకల్యాణం, అజ్జరపు పేరయలింగకవి ఒడయనంబి విలాసం, మట్లి అనంతభూపాలుని కకుత్స్థవిజయం, పింగళి సూరన కళాపూర్ణోదయం, సంకుసాల నృసిమ్హకవి కవికర్ణరసాయనం, కనుపర్తి అబ్బయామాత్యునిదే కవిరాజమనోరంజనం, ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యం, అహోబలపతి కాళిందీకన్యా పరిణయం, శ్రీనాథుని కాశీఖండం, కుమార ధూర్జటి కృష్ణరాయవిజయం, మంచన కవి కేయూరబాహుచరిత్ర, వల్లభరాయల పేర వెలసిన క్రీడాభిరామం, రామనామాత్యుని గయోపాఖ్యానం, తెనాలి రమకృష్ణకవి ఘటికాచల మాహాత్మ్యం, తరిగొప్పుల మల్లన చంద్రభాను చరిత్రం, పైడిమఱ్ఱి వేంకటపతి చంద్రాంగద చరిత్రం, సురభి మాధవరాయల చంద్రికా పరిణయం, వేములవాడ భీమకవి చెప్పిన ‘గరళపు ముద్ద లోహము’ అన్న చాటువు, శ్రీనథుని చాటువులు, చెన్నమరాజు చెన్నమరాజు చారుచంద్రోదయం, చరిగొండ ధర్మన చిత్రభారతం, పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి జైమిని భారతం, సంధానగ్రంథాలలో ఉదాహరింపబడుతున్న జైమిని రామాయణం, అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యానం, చింతగుంట రాధామాధవకవి తారక బ్రహ్మరాజీయం, శేషము వేంకటపతి తారాశశాంకవిజయం, మూలఘటిక కేతన దశకుమార చరిత్రం, దామెర్ల వేంగళనాయకుని బహుళాశ్వ చరిత్రం, చిత్రకవి సింగనార్యుని బిల్హణీయం, రాపాక లక్ష్మీపతికవి భద్రాయురభ్యుదయం, బమ్మెర పోతనామాత్యుని భాగవతం, కవిత్రయం వారి భారతం, భాస్కరాదుల భాస్కర రామాయణం, శ్రీనాథుని భీమేశ్వర పురాణం, అల్లసాని పెద్దన మనుచరిత్రం, పసుపులేటి రంగాజమ్మ మన్నారుదాస విలాసం, పెదపాటి ఎఱ్ఱన మళణ చరిత్రం, కుందుర్తి వేంకటాచలకవి మిత్రవిందా పరిణయం, కాణాదపెద్ద సోమయాజి ముకుందవిలాసం, పొన్నిగంటి తెలగన యయాతి చరిత్రం, రఘునాథ రాయల రఘునాథ రామాయణం, కూచిమంచి తిమంకవి రసికజనమనోభిరామం, పోలూరి గోవిందకవి రాగతాళచింతామణి, చింతలపల్లి చాయాపతి రాఘవాభ్యుదయం, కాకమాని మూర్తికవి రాజవాహన విజయం, కూచిమంచి తిమ్మకవి రాజశేఖర విలాసం, ముద్దుపళని రాధికా సాంత్వమ్నం, నరపతి వెంకయ్య రామరాజీయం, అయ్యలరాజు రామభద్రకవి రామాభ్యుదయం, మొల్ల రామాయణం, కట్టా వరదరాజు రామాయణ ద్విపద, ప్రౌధకవి మల్లన రుక్మాంగద చరిత్రం, హరిభట్టు వరాహ పురాణం, నంది మల్లయ ఘంట సింగనల వరాహ పురాణం, రామరాజభూషణుని వసు చరిత్రం, రఘునాథరాయల వాల్మీకి చరిత్రం, వక్కలంక వీరభద్రకవి వాసవదత్తా పరిణయం, చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనం, జక్కన విక్రమార్క చరిత్రం, వేల్పూరి వేంకటకవి విచిత్ర రామాయణం, చేమకూర వేంకటకవి విజయవిలాసం, చదలవాడ మల్లయ విప్రనారాయణ చరిత్రం, జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానం, వెన్నెలకంటి సూరన విష్ణుపురాణం, కృష్ణకవి శకుంతలా పరిణయం, మ్రానయకవి శతకంఠ రామాయణం, లింగకవి గంగకవుల శతకంఠ రామాయణం, శేషము వేంకటపతి శశాంక విజయం, శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం, పాలవేకరి కదిరీపతి శుకసప్తతి, శ్రీనాథుని శృంగార నైషధం, పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి శృంగార శాకుంతలం, తామరపల్లి తిమ్మయ శేషధర్మములు, భైరవకవి శ్రీరంగ మహత్త్వము, కట్టా వరదరాజు శ్రీరంగ మాహాత్మ్యము, కామినేని మల్లారెడ్డి షట్చక్రవ్ర్తి చరిత్రం, సాయప వేంకటాద్రి సకలజీవసంజీవనం, మడికి సింగన సకలనీతి సమ్మతం, పుష్పగిరి తిమ్మన సమీరకుమార విజయం, చేమకూర వేంకటకవి సారంగధర చరిత్రం, కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, ఏనుగు లక్ష్మణకవి సుభాషిత త్రిశతి, అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి, రామరాజభూషణుని హరిశ్చంద్రనళోపాఖ్యానం, శంకరకవి హరిశ్చంద్రోపాఖ్యానం మొదలైన కావ్యాలలోని సుమారు నాలుగు వందల ఎనభై ప్రతీకలు ఇప్పటికీ లభించాయి. ఇంకా అన్వేషింపవలసినవి వీటిలోనే అనేకం ఉంటాయి. ఇవిగాక అన్యతమాలు ఇంకా ఉంటాయి.

సారస్వతచరిత్రలో సువర్ణాక్షరాలతో సముల్లేఖింపవలసిన ఈ ప్రబంధరాజంలో సంకలింపబడిన పద్యాల పార్యంతికప్రయోజనం ఏమిటి? ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాస కావ్యార్థప్రతిపాదితం ఏమిటి? ఇందులోని చారిత్రికవిశేషాలేమిటి? దీనిలోని చిత్రకవితా ప్రణయనంలో వచ్చే సమస్యలేమిటి? తెలుగు సాహిత్యచరిత్రలో కనీ వినీ యెరుగని అపురూపమైన ఈ వినూత్న పర్యాయపద సంకలిత ప్రబంధంలో కవి ఉద్దేశించిన ప్రయోగాల స్వరూపసర్వస్వప్రతీతి ఏమిటి? దీనిని ఆయన తొలుత కూర్చిన సర్వలక్షణశిరోమణిలోని లక్ష్యాలతో ఎలా సమన్వయించుకోవాలి? అన్న విశేషాలతోనూ, ఇప్పటి వరకు సంస్కృతాంధ్రాలలోని కావ్యాలలో నుంచి లభించిన మౌలికప్రతీకల సూచికతోనూ ఈ పరిశోధనను ముగింపవలసి ఉంటుంది.ఆ తర్వాత వేంకటకవి కృతుల నిర్ధారణకు ఒకటీ, ఇందులోని చిత్రకవితావిశేషాల నిరూపణకు ఒకటీ వివరణలు మిగిలి ఉంటాయి.

ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...