అను.2 – కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు: బద్దె భూపాలుడు

కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు గాక బద్దె భూపాలుడు కావచ్చునా? ఇదొక సరికొత్త సమస్య. కళావిలాసము నన్నెచోడుని రచనమే గాని, ఆ నన్నెచోడుడు సుప్రసిద్ధమైన కుమారసంభవ కావ్యకర్త గాక సుమతి శతకము రచయిత అయిన బద్దెన కావచ్చునని ఒక అభిప్రాయం. సుమతి శతకము బద్దెన కృతి కాదన్న వాదం ఉండనే ఉన్నది.

1910లో బద్దె భూపాలుని నీతిశాస్త్రముక్తావళిని, 1923లో మడికి సింగన సకలనీతిసమ్మతమును ప్రకటించిన రామకృష్ణకవిగారు బద్దెన సుమతి శతకాన్ని వ్రాసి ఉండకపోవచ్చునని, అది భీమకవి కృతి కావచ్చునని, ఆ భీమన వేములవాడ భీమనా? చెదలువాడ భీమనా? అని పరిశీలింపగా దక్షవాటి భీమన అని అనిపిస్తున్నదని, అయితే తెలంగాణంలో ఉన్న వే(లే)ములవాడతో భీమకవికి సంబంధం లేదని చెప్పటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. నన్నెచోడుడే బద్దెన కావచ్చునా? అని పరిశీలించి, బద్దెన రెండవ నన్నెచోడుడని, నన్నెచోడుని వంశంలో కొన్ని తరాల తర్వాత పుట్టి ఉండవచ్చునని, బెజవాడలో దొరికిన క్రీస్తుశకం 1050 నాటి ఒక శాసనంలోని బొద్దన నారాయణదేవుడు బద్దెన కావచ్చునని వ్రాశారు. అంతకు మునుపే కుమారసంభవము పీఠికలో క్రీస్తుశకం 902 నాటి బీచుపల్లి శాసనం నన్నెచోడుని కాలనిర్ణయానికి, బీచుపల్లికి 50 మైళ్ళ దూరంలో తుంగాతీరంలో ఉన్న అలంపురంలోని ఆధారాలు నన్నెచోడుని గురువైన మల్లికార్జునయోగి కాలనిర్ణయానికి ఉపకరిస్తాయని వివరించారు.

పరిశోధకులు పెదచెరుకూరి శాసనంపైని దృష్టిని కేంద్రీకరించి, వివాదాస్పదాలైన ఈ శాసనాల వివరాలను జాగ్రత్తగా పరిశీలింపనందువల్ల సాహిత్యంలో నన్నెచోడుని గురించి, మల్లికార్జునయోగిని గురించి ఎన్నో పొరపాటు నిర్ణయాలకు పునాది ఏర్పడింది. ఆ శాసనవివాదవిశేషాలను, మల్లికార్జునయోగి చరిత్రను మరొక వ్యాసంలో వివరిస్తాను. బీచుపల్లి క్షేత్రచరిత్రను రచించిన శాసనపరిశోధకులు గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ శతపత్రములో దీని ప్రస్తావన ఉన్నది.

“(బీచుపల్లి) గొప్ప క్షేత్రము… స్థలమహిమ తప్ప ఇక్కడ చారిత్రక విశేషాలుగాని, వాస్తుశిల్పవిశేషాలు గాని లేవు. అయితే ఆలయావరణలో ఒక శిలాశాసనమున్నది. అది ఎక్కడో ఉన్న రాతీర్థానికి సంబంధించినది. ఎవరో ఇక్కడ ఆ శాసనాన్ని పెట్టినారు. అందులో కళ్యాణి చాళుక్యరాజు త్రైలోక్యమల్లుని దండనాయకుడు చిద్దన చోళుడు 11-వ శతాబ్దిలో చేసిన దానవిషయమున్నది. 20-వ శతాబ్దిలో వనపర్తి సంస్థానంలో ఉన్న గొప్ప పండితులు మానవల్లి రామకృష్ణకవిగారు మొదట రాజకీయవ్యవహారాలు చూస్తుండేవారు. ఆయన గొప్ప పరిశోధకులుగా సుప్రసిద్ధులు. వనపర్తి నుండి విస్మృతకవులు అనే గ్రంథమాలను ప్రారంభించి శ్రీరంగమాహాత్మ్యం, తిమ్మ భూపాలుని అనర్ఘరాఘవం మొదలైన గ్రంథాలను వెలికితీసి పరిష్కరించి ప్రకటించినారు. ఆ మాలికలోనే “నన్నెచోడుని కుమారసంభవం” అనే కావ్యాన్ని ప్రకటిస్తూ ఈ కావ్యం నన్నయకు ప్రాచీనమైనది అని వ్రాసినారు. తెలుగు పండితలోకంలో వాదోపవాదాలు చెలరేగినాయి. ఆయన తన వాదనను సమర్థించుకోవటానికి చూపిన ఉపపత్తులలో ఈ బీచుపల్లి శాసనం ముఖ్యమైనది. శాసనం 11-వ శతాబ్ది నాటిది. కాని తొమ్మిదవ శతాబ్దికి తీసుకొనిపోబడింది. శాసనకర్త చిద్దన చోడుడైతే బద్దెన చోడునిగా చెప్పబడింది. అంటే నన్నెచోడుని తండ్రి బద్దెన అని ముడిపెట్టినారు. ఆ చిద్దన చోడుని శాసనాలు చాలా ప్రకటించబడినాయి. మానవల్లి వారివంటి మహాపండితులు అట్లా చేయరాదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ కొర్లపాటి శ్రీరామమూర్తి గారు కుమారసంభవాన్ని మానవల్లివారే రాసి నన్నెచోడుని పేరు పెట్టినారని ఒక గ్రంథాన్నే రాసినారు. ఇది చిత్రం కాదా!” — (శతపత్రము: పుటలు 221-2.)

బహుశః జ్ఞాపకాధారితంగా వ్రాసినందువల్ల, ముద్రణదోషాల మూలాన శర్మగారి ఉద్ఘాటనలోనూ కొంత సందిగ్ధత ఉన్నది కాని, బీచుపల్లి శాసనం అన్వయవిషయంలో ఏర్పడిన వైరుద్ధ్యాలను వారు గుర్తించారన్నది స్పష్టం. బీచుపల్లి శాసనంలోని నన్నెచోడునితో బద్దె భూపాలుని చరిత్రకు సంబంధం లేదన్నది స్పష్టం.

బద్దె భూపాలునికి నన్నెచోడుడని బిరుదం ఉన్నదన్న విశ్వాసం మూలాన అటు కుమారసంభవ కర్తతోనూ, ఇటు సుమతి శతకం విషయంగానూ అన్వయం ఏర్పడి అది కళావిలాసము కర్తృత్వవివాదానికి దారితీసింది. శాసనాధారాలతో పొందుపడని ఆ అన్వయం ఇతరేతరాధారాలతో సరిపడుతుందేమో చూడాలి.

నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా? అన్న విమర్శగ్రంథాన్ని 1983లో ప్రకటించిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి ఈ కళావిలాస కావ్యకర్తృత్వం విషయాన్ని కూడా చర్చించి, ప్రబంధరత్నాకరములోని కళావిలాసము, ప్రయోగరత్నాకరములోని కళావిలాసము ఒకటి కావని, ఆ రెండింటి కర్తలు వేర్వేరని రెండు ముఖ్యమైన సాధ్యనిర్దేశాలను ప్రతిపాదించారు. వారి దృష్టిలో:

  1. పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో ఉదాహృతమైన కళావిలాసము కథాకావ్యం కాదు. అదొక కామశాస్త్రగ్రంథం.
  2. గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహృతమైన కళావిలాసము కామశాస్త్రగ్రంథం కాదు. అదొక ‘నానాపురాణకథావిలాసము’ అయిన ఒక స్వతంత్రకావ్యం.

అందువల్ల పెదపాటి జగన్నాథకవి, గణపవరపు వేంకటకవి పేర్కొన్నవి రెండూ భిన్నవస్తుకాలైన భిన్నకావ్యప్రభేదాలు (పు. 244-5లు) అని వారి ప్రతిపాదన.

కామశాస్త్రమైన కళావిలాసము ఎవరిదో పెదపాటి జగన్నాథకవి చెప్పలేదు. కావ్యమాత్రమైన కళావిలాసము నన్నెచోడునిదని గణపవరపు వేంకటకవి చెప్పాడు. అందువల్ల ఈ కావ్య కళావిలాసం నన్నెచోడ నరేంద్రుడు అన్న పర్యాయబిరుదాన్ని కలిగిన బద్దె నృపాలుని రచన కావచ్చునని శ్రీరామమూర్తి గారు ఊహించారు. మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉన్న బద్దె నృపాలుని మూడు పద్యాలను, నీతిశాస్త్రముక్తావళిలోని రెండు పద్యాలను తమ నిర్ణయానికి ఆధారం చేసుకొన్నారు. ఆ పద్యాలివి:

బద్దెన నీతి లోనివిగా మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉదాహరించినవి:

క. సాధింపఁ గడిఁది శత్రుల
      సాధించిన బలిమి వృథ నిజక్షితిజనులన్
      బాధించు కంటకులఁ బతి
      శోధింపనినాఁడు నన్నిచోడనరేంద్రా! (1-113)

క. తనకెన్నఁ డుండియును ద
      క్కని భృత్యులఁ బెరుగ మనుపఁగాఁ జనదు ప్రయో
      జనమునకుఁ దగిన వెల యి
      చ్చునది నరేశ్వరుండు నన్నిచోడనరేంద్రా! (2-420)

క. మనుపఁ గొఱయేని జీతము
      దనియఁగ నిచ్చునది యెంత దయగల్గిన నే
      రనివాని నెఱతనమునకుఁ
      జొనుపుట దుర్నయము నన్నిచోడనరేంద్రా! (2-421)

బద్దె భూపాలుని నీతిశాస్త్రముక్తావళి లోనివిగా మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉదాహరించినవి:

క. భూపగుణ మలిగి చెఱుపఁగ
      నోపుట కరుణించి మనుప నోపుట జడుఁడై
      కోపప్రసాదగుణములు
      సూపని పతి పతియె నన్నిచోడనరేంద్రా! (1-10)

క. సతి కంటె నబల వసుమతి
      సతి పతిలేకున్నఁ జెడదు సత్యము ధాత్రీ
      పతి లేనినాఁడు సద్య
      శ్చ్యుతి వసుమతి కండ్రు నన్నిచోడనరేంద్రా! (1-48)

ఆ రోజుల్లో, ‘కుమారసంభవ కావ్యం మానవల్లి వారి రచన’ అన్న వాదధోరణిలో కొట్టుకొనిపోయిన విమర్శకలోకం వారు చేసిన ఈ ముఖ్యమైన ప్రతిపాదనను పట్టించుకోలేదు. తథ్యమిథ్యావివేచనను చేయలేదు.

బద్దె భూపాలునికి నన్నిచోడుడు అన్న బిరుదం ఉన్నదా?

నన్ని, నన్నెలను పర్యాయాలుగా స్వీకరించటం భావ్యమే కనుక నీతిశాస్త్రముక్తావళి లోని నన్నిచోడుడే గణపవరపు వేంకటకవి చెప్పిన కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు కావచ్చునని శ్రీరామమూర్తి గారి ఊహ. చిత్రమేమంటే, ఈ విషయంలోని ఒక సందిగ్ధాంశాన్ని వారూ గమనించకపోవటం. ఆ విషయాన్ని వివరిస్తాను.

1923లో రామకృష్ణకవి గారు మడికి సింగన సకలనీతిసమ్మతమును ప్రకటించారు. పీఠికలో దానికి మూలమైన కాగితపు సంపుటం’ ప్రతిని అమరచింత సంస్థానం అధిపతి శ్రీమంతు రాజా ముక్కర సీతారామ భూపాల బహద్దరువారు తమకు దయచేసినట్లు చెప్పారు. అది ‘లేఖకదోషసహస్రపరిపూరితమై’ ఉండటం వల్ల కవిగారు దానిని ‘సవరించి’ ముద్రింపవలసివచ్చింది. ఆ సవరణలో మూలంలో లేని ఎన్నో పూరణలు వారి ముద్రణలో చోటుచేసుకొన్నాయి. తాము చేసిన పూరణలను కవిగారు తమ ముద్రణలో కుండలీకరించి చూపలేదు. వ్రాతప్రతిని చూడనివారికి ఆ పూరణలను గురించి తెలిసే అవకాశం ఉండదు. 1979లో ఆంధ్ర సాహిత్య అకాడమీ పక్షాన నిడుదవోలు వేంకటరావుగారు సకలనీతిసమ్మతమును పునర్ముద్రించినపుడు ఆ పూరణలలో వాఙ్మయచరిత్రకు ముఖ్యమైన కొన్నింటిని వివరించి చూపారు. ఒక సీసపద్యంలో ముప్పాతిక మువ్వీసం కవిగారి పూరణే. అక్కడ కుండలీకరణం జరగలేదు. అటువంటివి ఎన్నో ఉన్నాయి. కొన్నిచోట్ల పదాలు, కొన్నిచోట్ల పూర్తి పాదాలు, కొన్నిచోట్ల పద్యాలకు పద్యాలు ఉన్నాయి. “కవిగారే ఈ పూరణములను గావించిరి. …కవిగారు తాము చేసిన పూరణలను కుండలీకరించి చూపకపోవటం సరైన పరిష్కరణవిధానం కాదు.” అని విమర్శించారు.

అమరచింత సంస్థానం నుంచి కవిగారికి లభించిన మునుపటి ఆ కాగితపు ప్రతి ఇప్పుడేమయిందో మనకు తెలియదు. ఒకనాటి పురాతనమైన ఏదో ప్రతికి నకలుగా రూపొందినట్లున్న అమరచింత సంస్థానం వారి ఆ కాగితపు ప్రతికి రామకృష్ణకవిగారు తమ వాడుకకోసం 1901లో ఒక ప్రతిని వ్రాయించినట్లున్నది. అందుకు మూలమైన సంస్థానం వారి ప్రతి ఆ తర్వాత ఏమయిందో మనకు తెలియదు. మూలమైన ప్రతిలోనుంచి కవిగారు ఎన్ని మార్పులను చేసి తమ ప్రతిని తయారుచేసుకొన్నారో మనకిప్పుడు తెలియదు. కవిగారికి అత్యంత సన్నిహితులైన ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు 1950లో ఆ లిఖితప్రతిని రామకృష్ణకవిగారిని అడిగి తీసుకొన్నారు. కవిగారి ముద్రితప్రతికి, ఆ కాగితపు ప్రత్యంతరానికి కూడా ఎన్నో తేడాలున్నాయి. అక్షరాల పోలికలేని సొంత మార్పులున్నాయి. ఆ కాగితపు ప్రతిని, కవిగారి ముద్రితప్రతిని సరిపోల్చి శ్రీరామ అప్పారావుగారు కొన్ని ముఖ్యమైన పాఠభేదాల పట్టిక ఒకదానిని రూపొందించారు. బహుశః దానిని మరింత పరిశోధించి ఏమైనా సాధికారమైన విమర్శను ప్రకటించాలని అనుకొన్నారేమో. శ్రీరామ అప్పారావుగారి పట్టిక, ఆ కథ నిడుదవోలు వేంకటరావుగారు ప్రకటించిన సాహిత్య అకాడమీ వారి ప్రతిలో 158 నుంచి 169 వరకు ఉన్న పన్నెండు పుటలలో ఉన్నాయి. కవిగారు చేసిన ముఖ్యమైన మార్పులను, చేర్పులను కూడా శ్రీరామ అప్పారావుగారు అందులో గుర్తించారు. తమ వద్దకు చేరిన మానవల్లి వారి 1901 నాటి ఆ ప్రతిని శ్రీరామ అప్పారావుగారు ఆంధ్రప్రదేశ్ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారానికి ఇచ్చివేశారు. ఆసక్తి కలవారు దానినిప్పుడు అక్కడికి వెళ్ళి పునఃపరిశీలింపవచ్చును.

ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావుగారు ఎంతో శ్రమకోర్చి సమకూర్చిన ఆ పాఠభేదాల పట్టికను నిడుదవోలు వేంకటరావుగారు కాని, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు కాని, ఇతర విమర్శకులు కాని శ్రద్ధగా పరిశీలించినట్లు కనబడదు. ఆ పాఠభేదాలను, ఆంధ్రప్రదేశ్ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని కాగితపు ప్రతిని ముందుంచుకొని మడికి సింగన కృతిని పునఃపరిష్కరించి, దాని వాస్తవరూపాన్ని నిర్ధారించటం సాహిత్యచరిత్రకు ఎంతో దోహదం కాగలుగుతుంది.

సకలనీతిసమ్మతము నుంచి పైని ఉదాహరించిన బద్దె భూపాలుని పద్యాలలో ప్రథమాశ్వాసంలోని 113-వ పద్యం, ద్వితీయాశ్వాసంలోని 420, 421 పద్యాలు అన్నింటి చివర శ్రీరామ అప్పారావు గారు తమవద్ద ఉండిన కాగితపు ప్రతితో సరిపోల్చి వ్రాసికొన్న పాఠాంతరాలు అన్నింటిలోనూ “నన్నిచోడనరేంద్రా!” అని గాక “నెన్ని చూడ నరేంద్రా!” అని ఉన్నది!

శ్రీరామ అప్పారావుగారి పట్టికను బట్టి పద్యాల యథార్థస్వరూపం ఇట్లా ఉంటుంది:

క. సాధింపఁ గడిఁది శత్రుల
      సాధించిన బలిమి వృథ నిజక్షితిజనులన్
      బాధించు కంటకులఁ బతి
      శోధింపనినాఁడు నెన్ని చూడ నరేంద్రా! (1-113)

క. తనకెన్నఁ డుండియును ద
      క్కని భృత్యులఁ బెరుగ మనుపఁగాఁ జనదు ప్రయో
      జనమునకుఁ దగిన వెల యి
      చ్చునది నరేశ్వరుండు నెన్ని చూడ నరేంద్రా!(2-420)

క. మనుపఁ గొఱయేని జీతము
      దనియఁగ నిచ్చునది యెంత దయగల్గిన నే
      రనివాని నెఱతనమునకుఁ
      జొనుపుట దుర్నయము నెన్ని చూడ నరేంద్రా! (2-421)

బాహ్యదృష్టికి ‘నన్నెచోడనరేంద్రా! అన్నప్పుడు ధారాశుద్ధి ఉన్నదని, ‘నెన్ని చూడ నరేంద్రా!’ అన్నప్పుడు కొంత కుంటి నడక ఉన్నదని అనిపింపవచ్చును. జాగ్రత్తగా పరిశీలిస్తే అది సరికాదని తెలుస్తుంది. పై పద్యాల ముందువెనుకలేవో మనకు తెలియదు. ఆ పూర్వోత్తరసంహితలో వాటి అన్వయం సమర్థకంగానే ఉండి ఉంటుంది. నిజానికి ‘మనుపఁ గొఱయేని జీతము, దనియఁగ నిచ్చునది యెంత దయగల్గిన నే, రనివాని నెఱతనమునకుఁ, జొనుపుట దుర్నయము నెన్ని చూడ నరేంద్రా!’ అన్న పద్యమే సమంజసంగా ఉన్నది. కర్తృనామమే వివాదాస్పదం కాగల ఇంత ముఖ్యమైన మార్పును చేసినందుకు తమకు తోచిన కారణాలేమిటో రామకృష్ణకవిగారు చెప్పలేదు. ఒకచోట గాక అన్నిచోట్ల అదే విధంగా ఉన్నందువల్ల ‘నెన్ని చూడ నరేంద్రా’ అన్నదానికి ‘నన్నిచోడనరేంద్రా’ అన్న మార్పు యాదృచ్ఛికంగా జరిగిన మార్పు అనుకోవటానికి వీలుండదు.

సకలనీతిసమ్మతము వ్రాతప్రతిని బట్టి మడికి సింగన కృతిలో బద్దె భూపాలునికి అసలు ‘నన్నిచోడనరేంద్రా!’ అన్న బిరుదసంబోధనమే లేదని, ఆ ప్రస్తావమంతా కాలాంతర కారణాంతర సంక్రాంతమైన విషయమని అర్థమవుతుంది.

పైగా, బద్దెన నీతి నుంచి మడికి సింగన ఉదాహరించిన ‘సాధింపఁ గడిఁది’ అన్న ప్రథమాశ్వాసంలోని 123-వ పద్యానికి తర్వాత అదే విషయానికి కొనసాగింపుగా

క. జనపతి తన ప్రజ భారము
      తన ముఖమున నడపికొనక తక్కినఁ బొలియున్
      దిని చెఱుతు రతని సొమ్మున్
      జనువారును బ్రజ నరేంద్రచతురాననుఁడా! (1-124)

అన్న పద్యం ఉన్నది. ‘సాధింపఁ గడిఁది శత్రుల, సాధించిన బలిమి వృథ నిజక్షితిజనులన్, బాధించు కంటకులఁ బతి, శోధింపనినాఁడు నెన్ని చూడ నరేంద్రా!’ అని చెప్పిన పిమ్మట, ‘జనపతి తన ప్రజ భారము, తన ముఖమున నడపికొనక తక్కినఁ బొలియున్, దిని చెఱుతు రతని సొమ్మున్, జనువారును బ్రజ నరేంద్రచతురాననుఁడా!’ అని ఈ పద్యం ఉండటం సంగతంగా ఉన్నది. ‘ఎన్ని చూడ నరేంద్రా!’, ‘నరేంద్రచతురాననుఁడా!’ అన్న సంబోధనలలో ప్రాసంగికమైన ఒక పరిగతి, పరిణామక్రమం ఉన్నాయి. వ్రాతప్రతిలో లేని ‘నన్నిచోడనరేంద్రా!’ అన్న వివాదానికి తావిచ్చే నామపాఠం సుపరిష్కృతమైన ముద్రణలో ఉండటం భావ్యం కాదు.

సకలనీతిసమ్మతములో మడికి సింగన ఉదాహరించిన బద్దె నీతిలోనూ, బద్దె భూపాలుని కృతిగా అచ్చయిన నీతిశాస్త్రముక్తావళిలోనూ ఉన్న కొన్ని పద్యాల చివర బద్దె భూపతికి జ్ఞాపనాదిముఖంగానూ, అభిముఖీకరణార్థం గానూ ప్రయుక్తాలైన వివిధసంబోధనలున్నాయి. అవి – ఉదారవైరోచనుఁడా!, కావ్యచతుర్ముఖ!, కీర్తినారాయణుఁడా!, కొమరుర భీమా!, దశదిశాభరణాంకా!, నన్ననగంధవారణా!, నయతత్త్వనిధీ!, నరేంద్రచతురాననుఁడా!, పరపక్షభైరవా!, భూపదిలీపా!, యశోనిధీ!, రాజభూషణా!, రాజమనోజభూజా!, రాజరాజమనోజా!, వివేకచతురాననుఁడా!, వివేకభూషణా!, సర్వజ్ఞనిధీ! మొదలైనవి. అవన్నీ ప్రభువాచకాలైన బిరుదసంజ్ఞాంకనాలని, వాటిలో నన్నిచోడ నరేంద్రా! అన్న తీరున వ్యక్తి పేరును గాని, వంశీయతను గాని ప్రత్యక్షంగా సూచిస్తున్న వాచ్యార్థనిరూపణ ఒక్కటీ లేదని గుర్తిస్తే, ఎన్ని చూడ నరేంద్రా! అన్న పాఠం స్థానంలో అస్థానపతితమైన నన్నిచోడ నరేంద్రా! అన్న పాఠం ప్రవేశించిందని స్పష్టం కాకమానదు.

పైని ఉదాహరించిన నీతిశాస్త్రముక్తావళిలోని పద్యాంతాలలో నన్నిచోడ నరేంద్రా! అని ఉన్న పాఠాన్ని ఎన్ని చూడ నరేంద్రా! అని సరిదిద్ది చదువుకోవటం సాధ్యం కాదు. అక్కడ అన్వయం సరిపడదు. అయితే, వ్రాతప్రతిలో ఆ పద్యాల స్వస్థితి ఎట్లా ఉండిందో, అవి ఎన్ని మార్పులను పొందాయో వ్రాతప్రతిలోని పాఠవ్యవస్థను చూడకుండా మనమిప్పుడు చెప్పలేము.

అందువల్ల, ఆచార్య శ్రీరామమూర్తి గారు సూచించినట్లు గణపవరపు వేంకటకవి చెప్పిన నన్నెచోడుడు బద్దె భూపాలునికి పర్యాయనాముడైన నన్నెచోడుడని, ఆతడే కళావిలాసము కావ్యకర్త అని నిశ్చయించటం ప్రకృతపరిస్థితిలో ఉపలభ్య పాఠప్రమాణాలను బట్టి సాధ్యం కాదని తాత్పర్యం.

ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. ...