శ్రీ త్రిపురాంతక క్షేత్రానికి దిగువన పద్మసరోవరంలో శ్రీచక్రరాజనిలయ అయిన శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఉన్నది. అయ్యవారిమీద ఉదాహరణకావ్యాన్ని చెప్పిన కొంతకాలానికి త్రిపురాంతకుడు ఈ అమ్మవారిపై “అంబికా!” అన్న మకుటంతో సర్వసమర్పణపూర్వకంగా అంబికా శతకము అన్నపేరిట శతకరచన చేసి ఉంటాడని ఊహించటం సమంజసమే అవుతుంది. పరమేశ్వరుడు త్రిపురాసురసంహారం జరిగిన తర్వాత ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి కొలువుతీరాడని, అందుచేత దీనికి త్రిపురాంతకమని పేరు వచ్చిందని ఐతిహ్యం ఉన్నది. అప్పుడు అమ్మవారు బాలా త్రిపురసుందరీదేవిగా భక్తుల కోరికలను నెఱవేర్చటానికి ఈ శక్తిపీఠస్థలికి వచ్చి వెలసిందట. క్రీస్తుశకం ఐదవ శతాబ్ది నాటికే ఇక్కడ ఆగమోక్తానుసారం ఆరాధనలు కొనసాగుతుండినవని, క్రీస్తుశకం 11-వ శతాబ్దిలో చాళుక్యరాజులు ఈ త్రిపురాంతక స్వామిని, అమ్మవారిని అర్చించుకొన్నారని, అర్చామూర్తుల తుదితీర్పు అప్పటికి పూర్తయిందని ఊహింపబడుతున్నది. తల్లి ఇక్కడ దరహాసోజ్జ్వలన్ముఖియై విరాజిల్లుతున్నది. భాసుర కరారవిందాలు నాలుగింటిలో ప్రఫుల్ల పుండరీకయుగళ, డమరు త్రిశూలాలను ధరించి, శిరోభూషణం మొదలు మెట్టెల వఱకు కల్పసూత్రములలో చెప్పబడిన సర్వాభరణములను తాల్చి దివ్యసుందరవిగ్రహంతో వెలుగొందుతూ త్రైలోక్యరక్షాదీక్షితురాలైన ఆమెను కొలిచి కోరికలు నెఱవేరిన శరణార్థులు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు.
అంబికా శతకము పరమ పావనమైన ఈ దక్షిణతల్పగతాలయంలో చిదగ్నికుండసంభూత, శ్రీచక్రమధ్యస్థిత అయి వెలసిన బాలా త్రిపురసుందరీ దేవిని ఆవాహన చేసిన స్తోత్రరచన కాబట్టి, శ్రీ లలితా సహస్రనామ మంత్రప్రభావం అడుగడుగున గోచరిస్తుండటం వల్ల, ఐహికాముష్మికనిస్తారకమైన శబ్దానుషంగం నిభృతమై ఉన్న సంవిధానం మూలాన – మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతాంధ్రమహాపాండిత్య విశాలక్షితిజరేఖలకు ఆవలి అంచున కవిత్వయోగాన్ని అనుష్ఠించిన వైఖరీయుక్తుడని, ఔపాసనాది విధివిధానంలో శైవసంప్రదాయాభిజ్ఞుడై శివపారమ్యభావంతో స్మార్తధర్మాన్ని అవలంబించిన భక్తాగ్రేసరుడని, దర్శనాంతసాహిత్యపరుడని, మంత్రదీక్షోపాసకుడని విశదీభవిస్తున్నది.
త్రిపురాంతకుని అంబికా శతకము పూర్తిగా లభింపలేదు. వివిధాకరాల నుంచి మొత్తం ఇప్పటికి ఏడు పద్యాలు మాత్రమే లభించాయి. “అంబికా!” అన్న మకుటవిశేషం వృత్తాంతసామాన్యమైనప్పటికీ భగవతికి అఖండాకారవృత్తిగా పరమానురక్తితో సమర్పిస్తున్న వాఙ్మయపూజాపుష్పాలు కాబట్టి అవి చంపకోత్పలమాలాచ్ఛందస్సులలో మాత్రమే ఉండటం విశేషం. జీవకళ ఉట్టిపడే వైచిత్రీశక్తితో విలసిల్లుతున్న ఆ ఏడింటిలోనూ ఏ పద్యాని కా పద్యం అక్షరాక్షరం వన్నె తరుగులేని అపరంజికి కోటిరెట్ల వెలకు తులతూగుతుందని రసజ్ఞులనటం అతిశయోక్తి కాదు.
ఆ పద్యాలివి:
పై ఏడు పద్యాలలో “ఆదిమశక్తి యీ తరుణి”, “కూడెడు వెండ్రుకల్” అన్న రెండు పద్యాలు కాకినాడ ఆంధ్ర సారస్వతపరిషత్తులోని ఉదాహరణ పద్యములు అన్న సంకలితగ్రంథంలోనూ (అందులోని పద్యసంఖ్యలు: 168,9); “భారతివై సరోజభవు పాల వసించి” అన్న పద్యం ఒకటి పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధ రత్నాకరంలోనూ (అందులోని పద్యసంఖ్య: 68) ఉన్నాయి. “కూడెడు వెండ్రుకల్” అన్న పద్యం తంజావూరు మహారాజా శరభోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని 190 నుండి 193 వఱకు గల ప్రబంధసారశిరోమణి ప్రతులలోనూ (అందులోని పద్యసంఖ్య: 16), మానవల్లి రామకృష్ణకవిగారు 1910లో సంకలనించిన ప్రబంధమణిభూషణములోనూ (పద్యసంఖ్య: 16) ఉన్నది.
పై పద్యాలలో “ఆదిమశక్తి యీ తరుణి” అన్న ఒక్క పద్యాన్ని తప్ప “భారతివై సరోజభవు పాల వసించి”, “ఱెప్పల బోరుఁదల్పు లిసిఱింతలు వాఱెడు చూపుఁగుంచియం ద్రిప్పి”, “బెడఁగగు రత్నదర్పణముఁ బేరిన వెన్నెలవోసి”, “లాఁచి పరాంగనల్ వరవిలాసమనోహరవిభ్రమంబులన్”, “వాలిన కన్ను, ముంగురులు, వాతెఱ కెంపు”, “కూడెడు వెండ్రుకల్ నిడుదకూఁకటఁ బ్రోవుగ” అన్న ఆఱు పద్యాలను మానవల్లి రామకృష్ణకవిగారు 1912లో తమ త్రిపురాంతకోదాహరణము పీఠికలో తొలిసారిగా ప్రకటించారు. ఆ పద్యాలను తామెక్కడినుంచి స్వీకరించినదీ కవిగారు ఆకరాలను చూపలేదు. కాకినాడ ఆంధ్రసారస్వతపరిషత్తులోని ఉదాహరణపద్యములు లో సంకలితమైన “ఆదిమశక్తి యీ తరుణి” అన్న ఒక్క పద్యాన్ని మాత్రం వారు అంబికా శతకము లోనిదిగా ఎందువల్ల స్వీకరింపలేదో, ఇతర ప్రాకరాలలోని ఆఱింటిని మాత్రమే ఎందుకు స్వీకరించారో మనకిప్పుడు తెలియదు. కాగా, “ఆదిమశక్తి యీ తరుణి”, “కూడెడు వెండ్రుకల్ నిడుదకూఁకటఁ బ్రోవుగ”, “భారతివై సరోజభవు పాల వసించి” అన్న మూడు పద్యాలను మాత్రం 1918లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు త్రిపురాంతకుని రచనలుగా పరిగ్రహించి, తమ ప్రబంధ రత్నావళి సంకలనంలో ప్రకటించారు. వారే, ప్రబంధ రత్నావళి పీఠికలో త్రిపురాంతకుని గూర్చి వ్రాస్తూ, “బెడఁగగు రత్నదర్పణముఁ బేరిన వెన్నెలవోసి”, “ఱెప్పల బోరుఁదల్పు లిసిఱింతలు వాఱెడు చూపుఁగుంచియం ద్రిప్పి” అన్న రెండు పద్యాలను ఉదాహరించి, అవి “ప్రయోగరత్నాకరమునం దున్నవి” అని వాటి ఆకరాన్ని పేర్కొన్నారు. వారు చూచిన ఆ ప్రయోగరత్నాకరము ప్రతిలో త్రిపురాంతకుని నామోక్తి లేనందువల్ల వాటి ప్రామాణ్యవిషయమై సందేహం కలిగి వారు ఆ రెండు పద్యాలను అంబికా శతకము లోనివిగా పరిగ్రహింపలేదేమో అని ఊహింపవలసి వస్తున్నది. మానవల్లి రామకృష్ణకవిగారు తమకంటె మునుపే త్రిపురాంతకుని అంబికా శతకము లోనివని ఉదాహరించిన “లాఁచి పరాంగనల్ వరవిలాసమనోహరవిభ్రమంబులన్”, “వాలిన కన్ను, ముంగురులు, వాతెఱ కెంపు” అన్న పద్యాల ఔగాములను గుఱించి ప్రభాకరశాస్త్రి గారేమీ వ్రాయలేదు. ప్రభాకరశాస్త్రి గారి మాటను అనుసరించి “బెడఁగగు రత్నదర్పణము”, “ఱెప్పలబోరుఁదల్పు లిసిఱింతలు” అన్న ఆ పద్యాలు రెండూ గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహరింపబడ్డాయని నిడుదవోలు వేంకటరావు గారు 1937లో తాము పరిష్కరించిన త్రిపురాంతకోదాహరణము పీఠికలో వ్రాశారు కాని, తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య లిఖిత పుస్తకభాండాగారంలో ఉన్న ఆంధ్ర ప్రయోగరత్నాకరము ప్రతిలోనూ, తంజావూరులోని మహారాజా శరభోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని 695, 696 సంఖ్యలు గల ఆంధ్ర ప్రయోగరత్నాకరము వ్రాతప్రతులలోనూ ఈ పద్యోదాహరణలు లేవు. వేటూరి వారు, నిడుదవోలు వారు గణపవరపు వేంకటకవి ప్రయోగరత్నాకరము ప్రతిని ఇప్పుడున్న చోట్లలో గాక వేఱెక్కడైనా చూశారేమో చెప్పలేము. కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి గ్రంథాలయంలో ఒకప్పుడు గణపవరపు వేంకటకవి రచించిన ఆంధ్ర ప్రయోగరత్నాకరము ప్రతి ఉండేది. ఆ రోజులలో వారు ముద్రించిన లిఖిత పుస్తకముల పట్టికలో దాని వివరాలున్నాయి. ఆ ప్రతి ఇప్పుడక్కడ లేదని నేటి వారి గ్రంథాలయసూచికను బట్టి తెలుస్తున్నది. అందులో ఈ పద్యోదాహరణలు ఉండినవేమో తెలియదు. అందులో ఈ పద్యోదాహరణలు ఉండినట్లయితే వీటి ప్రామాణికత కూడా నిరూఢమై ఉండేది.
ఇక పద్యాల విశేషాలను పరికిద్దాము:
1. అపురూపమైన వాక్యాలంకారం
అంబికా శతకము లోనిదని మానవల్లి రామకృష్ణకవిగారు ఉదాహరించిన “లాఁచి పరాంగనల్ వరవిలాసమనోహరవిభ్రమంబులన్” అన్న ఈ ముఖ్యమైన పద్యాన్ని వారు ఎక్కడినుంచి స్వీకరించినదీ ప్రాకరస్థానం మనకిప్పుడు తెలియకపోయినా, ఇందులోని
- అత్యపూర్వమైన వాక్యనిర్మితి చేత,
- కవిప్రౌఢోక్తిసిద్ధమైన అర్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని వశాన,
- వివిధలకారాలలో సందర్భించిన క్రియారూపభేదప్రయోగమూలాన
ఇది తెలుగు భాషలో సాటిలేని ఒక పరమాద్భుతమైన పద్యం. భక్తుని భక్తిసాంద్రత కంటె అతని చమత్కారచంద్రికావిలాసానికి ముచ్చటపడి భగవతి వరమీయక తప్పని వింత సన్నివేశం:
అని.
“ఓ అంబికా! శీలవంతు డైన ఉత్తమపురుషుడు పరకాంతలు తనపై మఱులుగొని ఎంతటి విలాసవిభ్రమాలను వెలయించే చూపులతో తనను చూచినా, తాను మాత్రం వారిని చూడడు. మధ్యముడు తానై చూడకపోయినా, వారు తనను చూచినపుడు మాత్రం ఆ చూపులలో చూపు కలిపి తాను కూడా వారిని చూడకుండా ఉండలేడు. అధముడు వారు తనను చూచినా, చూడకపోయినా; తాను వారిని చూస్తున్న సంగతిని వారు చూచినా, చూడకపోయినా వారిని చూడకుండా ఉండడు.
ఇటువంటి చూపులు గలిగిన చూపఱ యందు – తనను చూచినా చూడకుండా ఉండే దృఢచిత్తుని నీవు ఏ చూపుతో చూస్తావో – ఆ చూపుతో నన్ను దయచూడు!”
అని భావం.
ఏమి అందమైన వాక్యాలంకారం!
2. కల్పనలో గడుసుతనం
ప్రాకరస్థానం ఎక్కడిదో తెలియకపోయినా, ఇదికూడా పై దానికి సాటివచ్చే మఱొక అద్భుతమైన చమత్కృతపద్యం:
పార్వతీసౌందర్యాన్ని పరికిస్తూ పారవశ్యాన్ని పొందిన పరమేశ్వరుడు ఆమెను అర్ధాంగిగా తనలో లీనం చేసుకొన్నాడు. అందువల్ల “వాలిన కన్ను” పదబంధప్రయుక్తిలోని వచనైకత్వం సాభిప్రాయం. ఆమె విశాలాక్షి. ఆ సోగతీరిన విశాలనేత్రము యొక్క తెల్లని వెలుగులో ఆయన రూపమే నిండి ఆయన తన్మయతను భజించాడు.
- “ముంగురులు” – ఇంద్రనీలదీప్తుల వంటి దీప్తులను పోలిన ఆమె నల్లని ఉంగరపు వెండ్రుకలు నొసటిపై నర్తిస్తున్న దృశ్యం ఆయనకు మైమఱపును కూర్చింది.
- “వాతెఱ కెంపు మెఱుంగు” – క్రింది పెదవి ఎఱ్ఱని పద్మరాగమణిప్రభ లీనుతున్నది.
- “చంటిపైఁ గ్రాలెడు తారహారములు” – స్తనమండలం మిఱుమిట్లు గొలిపే తెల్లని ముత్తెపు వరుసల తారహారసంపుటితో తేజరిల్లుతున్నది.
- “కంకణ చారుకరంబు”- దేవి ముంజేతి కంకణం బంగారు వన్నెలను విరజిమ్ముతున్నది.
ఇది పరమేశ్వరుడు తిలకించిన తిలకాయమైన దృశ్యశోభ. ఈ జ్యోతిర్లీలాదృశ్యీకరణలోని విచిత్రవర్ణసమ్మిశ్రణాన్ని మెచ్చకుండా ఉండలేము. పరమశివునికి మేను గగుర్పొడిచినదని వర్ణించి త్రిపురాంతకుడు పార్వతీదేవి మేని గగుర్పాటును ప్రతీయమానం చేశాడు. ఎడమవైపుకు తూలిపోతున్న పయ్యెద ఆమె గుండె జలదరించినదని చెప్పకనే చెబుతున్నది.
ఆ దశాస్థితిలో “కన్నులు మోడ్చి” అనటం పరమేశ్వరుని రాగాధిక్యానికి, మైమఱపుకు, చిత్తపారవశ్యానికి సూచకం.
కన్నులు “మోడ్చి, మోడ్చి” అనటం పునరుక్తప్రాయం కాదు. అమోఘమైన చిత్రకల్పనం. కన్నులు మోడ్చి = అర్ధనిమీలితనేత్రుడై మైమఱపు ననుభవించి; మోడ్చి = ఆమె యందు అర్ధాంగీభావము చెంది; నీ పాలు + అగు = నీకు వశుడైన; ఈశు = ఈశ్వరుని యొక్క; మేను సగపాలు = దేహార్ధరూపమును; మనంబునన్ చేర్తును = మనస్సులో అనుసంధించుకొంటాను” అని అన్వయించుకోవాలి.
పద్యంలో చెప్పినదానిని బట్టి ఆమె అందం ఆయన మనసును దోచుకొన్నదని భావార్థం. కాని, నిజానికి ఆయన అందమే ఆమె మనసును దోచినదని వాచ్యకృతవస్తుధ్వని.
తల్లి రూపశోభను నిరుపమానమైన రూపణశోభతో పద్యం కన్నులకు కడుతున్నది.
- వాలిన కన్ను = ఆమె అసలే పక్ష్మలాక్షి కదా! నాథుని యందలి మోహాతిరేకం వలన నిరంతరం విప్పారి ఉండే కన్ను అరమోడ్పును చెందినదని మఱొక భావచిత్రం. “వాలిన” అన్నది “వాల్చిన”కు రూపాంతరితం.
- ముంగురులు = నుదుటిపైకి వ్రాలిన చూర్ణకుంతలాలు. ఆమె “అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభిత” కదా. నల్లని భ్రమరకాలు ఆ భ్రమరాంబాదేవి నొసటికి వన్నెలద్దాయి. దేవికి “బంధురాలకా” అని, “బర్బరాలకా” అని శ్రీ లలితా సహస్రంలోని నామాలు. ఆ ముందు వెండ్రుకలు నెన్నొసలిపై వ్రేలాడుతూ ఉంగరాల వలె సురిగిపోయిన కొసలతో సొంపుమీఱి ఉంటాయట.
- వాతెఱ కెంపు మెఱుంగు = “నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా”. కొంగ్రొత్తదైన పగడముయొక్క (లేదా) పండిన దొండపండుయొక్క కాంతిని అధఃకరించి, అంతకంటె మెఱుములీనుతున్న క్రింది పెదవిని కలిగిన దేవి. “వాతెఱ కెంపు” = “నవవిద్రుమబింబాధర” అన్న సాంస్కృతికానికి అచ్చమైన తెలుగుసేత.
- చంటిపైఁ గ్రాలెడు తారహారములు = వక్షోజయుగళిపై శుద్ధమైన ముత్యాల వరుసలతో సౌవర్ణహారాలు వెలుగొందుతున్నాయి. ఆమె “రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్విత”.
- కంకణ చారుకరంబు = బంగారు మురుగు ఆమె చేతియందు దివ్యశోభ లీనుతున్నది.
- డాపలం దూలుచు నున్న పయ్యెద = వక్షోజముల ఉన్నతి వల్ల, ఆయనను చూచినప్పటి గగుర్పాటు వల్ల పయ్యెద జాఱిపోతుండగా – అంబిక ఆ ప్రకారం కానవచ్చేసరికి – పరమశివుడు అనురక్తిని పొందాడు. మఱి దేవి “హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధి” కదా.
ఈ విధంగా త్రిపురాంతకుని మనోహరమైన కవిత్వం ప్రతిపద్యంలోనూ, ప్రతిఅక్షరంలోనూ ఉట్టిపడే చమత్కృతికి ప్రథమోదాహరణమని ఇది మఱొక్కసారి నిరూపిస్తున్నది. “మీ ఇద్దరినీ నేను గుండెగుడిలో శాశ్వతంగా ప్రతిష్ఠించుకొన్నాను” అనకుండా “నీ పాలైన ఈశ్వరుని మేనిలోని సగపాలును మనస్సులో నిలుపుకొంటాను” అనటం అచ్చమైన గడుసుతనం.
3. దేవీ మాహాత్మ్యవర్ణనం
ఇంకొక అపురూపమైన పద్యసన్నివేశం:
తల్లీ! ప్రేమపారవశ్యం వల్ల కనుఱెప్ప తలుపులను చంచలములైన చూపుకుంచెలతో తిప్పుతూ, విరికన్నులు క్రొత్త మెఱుములను క్రుమ్మఱింపగా – అందాలు చిందే ముఖంలో మూడింతల వేడుకతో వెన్నెలలు విరియగా (లేదా – అందమైన మోము చందమామ తఱపి వెన్నెలలు కాయగా, మనస్సు ఆనందాతిశయంతో పరవశింపగా), సిగ్గుతో మేనంతా జలదరింపగా – నీ కనులయెదుట నిలిచిన పరమేశ్వరుని చూపులలో చూపుకలిపి, అర్ధాంగివై ఆయన తనువులో సగము భాగాన్ని అంగీకరించావు – అని సన్నుతి.
“చూపుఁగుంచియ” మహాకవి రావిపాటి త్రిపురాంతకుని చిత్రకళాభిజ్ఞతకు నిదర్శకమైన అపూర్వమైన రూపచిత్రం. కుంచెలోని వెండ్రుకలకు కనుఱెప్పల వెండ్రుకలను పరికరించుకోవటం సమంజసంగా ఉన్నది. “తళుక్కునం దెఱచి” అన్న రూపణలోని నాటకీయత, దృశ్యకల్పనకౌశలి వర్ణనాతీతసౌభాగ్యంతో అలరారుతున్నాయి. పార్వతి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగాన్ని గైకొనటంలోని మాహాత్మ్యనిరూపణ కూడా మనసులకు హత్తుకొనేదిగా ఉన్నది.
త్రిపురాంతకుని ప్రభావశీలి రచన అచిరకాలంలోనే సాహిత్యికుల భావవీథులలో క్రొత్త వెలుగులను విరజిమ్మసాగినట్లుంది. వల్లభరాయల క్రీడాభిరామము అవిరళప్రాచుర్యానికి నోచుకొన్నందువల్లనో, త్రిపురాంతకుని కృతినిచయం పాఠకులకు అందుబాటులో ఉండి అశేషాభిమానపాత్రమైనందువల్లనో కవులు ఆయన కల్పనలను, పదబంధాలను నిస్సంకోచంగా తమ కృతులలో వాడుకొన్నారు. “ఱెప్పల బోరుఁదల్పు లిసిఱింతలు వాఱెడు చూపుఁగుంచియం ద్రిప్పి” అన్న ప్రయోగానికి ఆకర్షితుడై మహితమైన ఆ పద్యప్రభావానికి లోగి జక్కన అంతటి మహాకవి తన విక్రమార్కచరిత్రములో “మంతనములు పెదవుల నిసి,ఱింతలు వాఱంగ, నగవు ఱెప్పలు గోరన్ (8-87)” అని దీనికొక ప్రతికృతిని కల్పించినట్లు కానవస్తుంది.
4. అపూర్వమైన సంవిధానశిల్పం
త్రిపురాంతకుని ఈ పద్యాలు ఎక్కడివో తెలియదని అనుకొన్నాము. అయితే, ప్రాకరాలు లేనంత మాత్రాన అంబికా శతకము యొక్క కర్తృత్వాన్ని, ఈ పద్యాల ప్రాచీనతను సంశయించటానికి వీలులేదు. అందుకొక ఉదాహరణను పరిశీలిద్దాము.
త్రిపురాంతకునిదని రామకృష్ణకవిగారు పేర్కొన్న మఱొక పద్యం ఇది:
అని.
భావనలోని వైచిత్రి మూలాన ఇందులోని ఉపమాద్రవ్యాలకు అపూర్వమైన ప్రాణశక్తి కలిగింది. కేవలం ఉపలవిశేషమైన రత్నానికి దర్పణతుల్యత్వం కవిసమయసిద్ధమే కాని, దానిపై నిశ్శరీరమైన తెల్లని వెన్నెలను పోసి తుడవటం అన్న వాక్యాలంకారం కొత్తది. వెలుగులీనుతున్న రత్నదర్పణాన్ని చంద్రజ్యోత్స్నతో తుడిస్తేనే కాని; తెల్లని పాలసముద్రంలో ఉదయించి అంతకంటె తెల్లని చంద్రునిలో మిగిలిన ఆ కొద్దిపాటి కళంకాన్ని కడిగివేస్తేనే కాని; జంబూద్వీపంలోని స్వర్ణదీప్రవాహంలో సితపుండరీకాన్ని ముంచితీస్తేనే కాని సహజకాంతితో అలరారుతున్న తల్లి ముఖకాంతితో సాటిచేయరాదన్న ఉపమానుకూల వినోక్తి వ్యతిరేకానుప్రాణితమై అతిరమణీయంగా ఉన్నది. తుడువక – కడుఁగక – ముంపక అన్న వ్యతిరేకక్రియలు అన్వయముఖాన తల్లి సౌందర్యాతిశాయితను వెల్లడిస్తున్నాయి. పద్యశైలి కల్పనకు సరిజోదుగా అమరింది. ఒక్కటైనా వ్యర్థపదం లేదు. దేవి ముఖకాంతి ముందు వెలవెలపోయిన రత్నదర్పణం అనుపమేయం కాదనీ, మునుపు అందగించే ఉన్నదనీ చెప్పటానికి కాంతిఫలాశ్రయమైన “బెడఁగగు” అన్న ఉపక్రమణిక సార్థకంగా ఉన్నది. ఆ రత్నదర్పణోపరితలాన్ని శుభ్రం చేయటానికి “వెన్నెలను పోసి తుడవటం” కవితాత్మకమైన అభివ్యక్తి. “పేరుకొన్న తర్వాత పోయటం ఉంటుందా?” అని ప్రశ్నించేవారు కూడా ఉంటారేమో?
రెండవ దళమైన “పాలసంద్రమునఁ దోఁచి సుధాకరు మేని కందు వోఁ గడుగక” అన్నది మాత్రం కొంచెం క్లిష్టాన్వయం. సందర్భాన్ని బట్టి “కలశరత్నాకరంలో ఉదయించిన చంద్రుని యొక్క మేని కళంకము పోవునట్లుగా, కడుగక = ప్రక్షాళింపక” అని చెప్పటం భావ్యం కాదు. క్త్వాంతమైన “తోఁచు” ధాతువుకు ఆ విధంగా “తోఁచినయట్టి” అన్న భావార్థప్రతీతి సాధ్యం కాదు. కనుక, “పాలసంద్రమునఁ దోఁచి = తానుసైతం క్షీరార్ణవంలో ఉద్భవించి, సుధాకరు మేని కందు వోఁ గడుగక = ఆ అమృతాంశునిలోని కళంకాన్ని క్షాళన చేయకుండా” — అని అన్వయించుకోవాలి. దీనివల్ల ఉపమేయాపకర్ష మఱింత తీవ్రమయింది.
“నేరెటేట సితకంజము ముంపక” అన్న మూడవ దళం అన్నిటికంటె మనోహరం. ఎందుకంటే నేరెటేఱు పసిడి వన్నెది. అందులో శ్వేతపుండరీకాన్ని ముంచి తీయటం వల్ల కలిగే వర్ణసౌభాగ్యం వర్ణనాతీతం. అదికూడా – నైజకాంతితోఁ దొడరినన్ = పైని చెప్పిన మూడు విధాలుగానూ కాక, స్వభావసిద్ధమైన దివ్యకాంతితో అలరినట్లయితేనే “తల్లి ముఖకాంతి”కి పోలిక కాగలుగుతుందని తాత్పర్యం.
హృదయావర్జకమైన త్రిపురాంతకుని ఈ కల్పనాశిల్పం అనతికాలంలోనే మహాకవులను సైతం ఆకర్షించిన దనటానికి జక్కన విక్రమార్క చరిత్రలోని ఈ పద్యమే నిదర్శకం:
— విక్రమార్క. (5-172)
అని.
పద్యంలోని భావానుకరణం, శబ్దానుసరణం స్పష్టమే కాని సీసపద్యదీర్ఘిమ మూలాన పాపం జక్కన అంతటి మహాకవి సైతం బంగారు తీగను సాగలాగక తప్పలేదు. “పాలసంద్రమునఁ దోఁచి సుధాకరు మేని కందు వోఁ గడుఁగక” అని ఉన్న చమత్కృతవాక్యాన్ని “చంద్రబింబము బాలసంద్రంబులోఁ దోఁచి కందెల్లఁ బోఁ బులు గడుగకున్న” అని తాత్పర్యమాత్రంగా వ్రాశాడు. “బెడఁగగు రత్నదర్పణముఁ బేరిన వెన్నెలవోసి నిచ్చలుం, దుడువక” అన్న అందమైన భావాన్ని ఎలాగో తంటాలుపడి, “పసిఁడిసలాకకుఁ బరిమళం బొనగూర్చి గరువంపువెన్నెల గరఁగకున్న” అని సరిపెట్టాడు. “నీ మొగముతో సరిపోల్పఁగఁ జాలు నంబికా!” అన్న నిగమనానికి “కాంత నెమ్మోమునకు … నీడుజోడైన ప్రతి యని యెన్నఁ గడిది” అని దండాన్వయం గుచ్చినది చాలక “హస్తిమశకాంతరము సహజైకకాంతి” అని పునరుపక్రాంతంగా జోడించాడు. త్రిపురాంతకుని పద్యంలోని బంగారు సన్నపోగారుతనం జక్కన పద్యంలో లోపించి అందదుకుల రాగి పాళ్ళు పెఱిగి మొత్తం కల్పన పెళుసుబాఱింది. సౌందర్యలహరి అయిన పరమేశ్వరిని వర్ణించటానికి నిమిత్తీకరించిన దివ్యోపమానాలను సామాన్య మానవకాంతకు అనువర్తించటం వల్ల ఎటువంటి కవికైనా ఇటువంటి తొట్రుపాటు కలగటం సహజమే. అయితే పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరానికి మునుపే అంబికా శతకం అప్పటి మహాకవులకు అందుబాటులో ఉండేదన్న సత్యం మాత్రం దీనిమూలాన నిరూఢమయింది.
4. శ్రీ లలితా పరాభట్టారిక
అంతే కాదు. అంబికా శతకం లోని మఱొక పద్యం ఇది:
అని. తన పుత్త్రిక అంబికను అందఱి పుత్త్రికలవంటి పుత్త్రికగా భావిస్తున్న తండ్రి హిమవంతునికి బ్రహ్మాదులైన దేవతలు వచ్చి ఆమె మహిమాతిశయాన్ని (“నిచ్చలు” = నిత్యపారాయణగా) వర్ణించి చెప్పటం ఇక్కడి వర్ణనాంశం. భక్తకవి త్రిపురాంతకుడు త్రైలోక్యాధీశ్వరి త్రిపురాంబికను సన్నుతిస్తూ “అంబికా!” “అంబికా!” అని నోరారా నూఱుమార్లు సంబోధించటమే గాక ఈ శతకస్తోత్రంలో అడుగడుగున శ్రీవిద్యాదర్పణమైన పావన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని అంతర్భవింపజేసినట్లు పద్యశిల్పాన్ని బట్టి గోచరిస్తున్నది.
ఈ ఉపర్యుదాహృత పద్యాన్నే చూద్దాము. “అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా” అని లలితా సహస్రనామం. పద్యం ఈ నామత్రయికే వ్యాఖ్యానాత్మకంగా అమరింది. “అంబికా!” అన్న శ్రీమాతృనామధేయమే శతకానికి మకుటస్థానంలో ఉన్నది.
భావగర్భితమైన మకుటం.
అంబికా శతకము యొక్క మకుట సార్థకత ఇది:
“అంబికా = అంబైవ జగన్మాతా భారతీ పృథ్వీ; రుద్రాణ్యాత్మకేచ్ఛాజ్ఞానక్రియాశక్తీనాం సమష్టి రంబి కే త్యుచ్యతే; తద్రూపా వా రాత్రిరూపా నిద్రారూపా వా; “అంబికా కైతవే సిద్ధే నిద్రాయాం నిశి కీర్త్యత” ఇతి విశ్వః. ఉక్తం చ నవరాత్రిప్రదీపే స్కాందే “రాత్రిరూపా మహాదేవీ దివారూపో మహేశ్వర” ఇతి. హరివంశేఽపి, యా హ్యేషా గహ్వరీ మాయా నిద్రేతి జగతి స్థితా, తస్యా స్తను స్తమోద్గారి నిశా దివసనాశినీ, జీవితార్ధహరీ ఘోరా సర్వప్రాణిభృతాం భువి నైతయా కశ్చిదావిష్టో జృంభమాణో ముహుర్ముహుః, శక్తః ప్రవహితుం వేగం మజ్జన్నివ మహార్ణవే, దేవేష్వపి దధారైనాం నాన్యో నారాయణాదృత” ఇతి. మార్కండేయపురాణేఽపి, “విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీం, నిద్రాం భగవతీం విష్ణో రతులాం తేజసః ప్రభుః” ఇత్యాది” – అని భాస్కరరాయ భారతి సౌభాగ్యభాస్కర భాష్యం.
“అంబిక” అంటే చరాచరజగత్తులకు తల్లి. ఓంకారము నందలి మహత్త్వము, ఐంకారము నందలి, హ్రీంకారము నందలి, శ్రీంకారము నందలి సుభగ బీజాక్షర కవిత్వపటుత్వ సంపదలు ఆమె మహిమను వ్యక్తీకరిస్తున్నాయి. వాక్కు ఆమె స్వరూపం. భారతీ తత్త్వం ఆమె. ఆమెయే పృథ్వీతత్త్వం. రుద్రాణియై ఉన్నప్పుడూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమష్టిరూపం కలిగినందున ఆమెను “అంబిక” అన్నారు. స్కాందపురాణములోని నవరాత్రిప్రదీపములో “మహాదేవి రాత్రిస్వరూపిణి; మహాదేవుడు పగలు” అని చెప్పబడింది. హరివంశము ఈ తత్త్వాన్ని ఆవిష్కరిస్తూ “నిద్రేతి జగతి స్థితా” – మాయ అంటే నిద్ర అని లోకంలో చెప్పుకోవటం ఉన్నది కదా; తస్యా స్తను స్తమోద్గారి – అంబికాదేవి దేహమే ఆ చీకటిని వెలికి గ్రక్కుతున్నది; దివసనాశినీ – పగటిని నాశనం చేస్తున్నది” అంటున్నది. ఆమెను సన్నుతించటం అజ్ఞానాన్ని నిరసించి, విజ్ఞానాన్ని ప్రసాదించమని అర్థించటానికే – అని భాస్కరరాయ భారతి.
ఆ తల్లి అనాదినిధనా = “ఆదిః జననం నిధనం మరణం చ న విద్యతే యస్యా స్సా అనాదినిధనా ఆద్యా శక్తిః.” అఖండమైన కాలస్రవంతి ప్రవాహగతిని బట్టి భూత వర్తమాన భవితవ్యాలను గుర్తుపట్టగలిగే మనకు – కాలస్వరూపిణి అయిన ఆమె కాలికతయొక్క పూర్వాపరదశలు బోధ్యమానములు కావు. ఇంద్రియాతీతమైన ఆ శక్తిబోధకతకు “ఆదిమశక్తి” అని పద్యాదినే ప్రతిపాదింపబడుతున్నది.
ఆమె హరిబ్రహ్మేంద్రసేవితా = “హరిబ్రహ్మేంద్రైః విష్ణువిధిశక్రైః శ్రీనగరే సేవితా ఉపాసితా”. పద్యంలో “బ్రహ్మాదులు వచ్చి” ఆమెకు నైవేద్యరూప సేవావిధిని నిర్వర్తించుకొంటున్నారు.
అంబికకు ఉపలక్షణాలుగా బ్రహ్మాదులు స్వీకరించిన స్త్రీ పర్యాయవాచకాలైన “తరుణి”, “కుమారి”, “తలోదరి”, “సతి”, “పైదలి” పదాల ఎంపికలోని క్రమపరిగతిని, సార్థకతను కూడా గుర్తుంచుకోవాలి.
ఆమె “తరుణి”. “తరుణీ” అని శ్రీ లలితాసహస్రనామం. “నిత్యతారుణ్యత్వాత్ తరుణీ” అని వ్యాఖ్యాతలు. ఆమె తారుణ్యము వయోనురూపం కాదు. ఆ స్థితిలో “ఆదిమశక్తి యీ తరుణి” అనటంలోని అందమైన విరోధాభాస సహృదయుల గుండెలకు హత్తుకొంటుంది.
ఆమె “కుమారి”. “కుమారయతి క్రీడయతీతి ఇతి కుమారీ”, “కుత్సితో మారోఽస్యా ఇతి కుమారీ”. బాలకేళీరత అయితేనేమి? ఆద్యకుటుంబిని.
ఆమె “తలోదరి”. “తలోదరీ” అని శ్రీ లలితా సహస్రనామం. “తలం కరతలాది తద్వత్కృశం సమం చోదరమ్.”
కన్యకావస్థను దాటి తారుణ్యం ఉట్టిపడుతున్న ఆ కుమారికి వివాహోచితవయోవస్థ సమీపించింది. ఆమె యందు ప్రభవింపనున్న షణ్ముఖునిచే దేవగణం తారకాసుర వధను నిర్వర్తింపవలసి ఉన్నది కదా. అందువల్ల వారందరూ వచ్చి,
- ఆమె సామాన్యకాంత కాదని;
- ఆమె “సతి” – [పూర్వజన్మలో సదాశివకుటుంబిని అయిన దక్షపుత్త్రిక] “సతీదేవి” అని; [పతివ్రత అయిన సుచరిత్ర (“సుచరిత్రా తు సతీ సాధ్వీ పతివ్రతా” – అమరకోశము)] “సాధ్వి” అని;
- ఇప్పుడు “పైదలి” = “బాలా” (“బాలలీలావిశిష్టత్వాత్ బాలేతి కథితా” – త్రిపురా సిద్ధాంతము) అని —
విన్నవించుకోవటానికి బ్రహ్మాదిదేవతలు హిమవంతుని చెంతకేగారు.
ఆ వెళ్ళిన బ్రహ్మాదులు మఱెవరో కాదు. ఆ తల్లి సంతానమే. ఆమె “స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతి” కదా.
ఆ జగజ్జనని, ఆ పర్వతరాజపుత్త్రిక “ఆదిమశక్తి” అని బ్రహ్మాదిదేవతల ప్రసంగానికి ఉపక్రమణిక. “ఆదిశక్తిః” అని లలితా సహస్రం. “ఆదిశక్తిః = సర్వజగతా ముత్పాదకత్వా దాదికారణభూతా చ సా శక్తిశ్చ” అని వ్యాఖ్యానం. “ఆదిమశక్తి యీ తరుణి” ఈమె నా కుమార్తె, తరుణి అనుకొంటున్నావేమో? సాక్షాత్తు ఆదిశక్తి సుమా.
ఆమె “ఆద్యకుటుంబిని”. పార్వతీపరమేశ్వరులు జగత్తులకు ఆదిదంపతులు కనుక ఆమె తొలిగృహిణి. “సదాశివకుటుంబినీ” అని లలితా సహస్రం. “ఆద్యకుటుంబినీ” = ఆద్యస్య సదాశివస్య కుటుంబినీ భార్యా, శ్యామలా శుద్ధవిద్యా, అశ్వారూఢాదిరూపేత్యర్థః.”
ఆమె “ముత్తైదువ”. “సువాసినీ” అని లలితా సహస్రం. “సువాసినీ = సర్వకాలం జీవత్పతికా.”
ఆమె “చిదాత్మక”. “చిదేకరసరూపిణీ” అని లలితా సహస్రం. “చిదేకరసరూపిణీ = చితా సహైకో రసః స్వరూపమ్ ఏషాం చిదేవ ముఖ్యో రసో యేషాం తాని చిదేకరసాని రూపాణ్యానందచైతన్యాదిధర్మా అస్యాస్సంతీతి.” జ్ఞానానందస్వరూపిణి అన్నమాట.
ఆమె “విశ్వమాత”. “విశ్వమాతా” అని లలితా సహస్రం. “విశ్వమాతా = విశ్వస్య జగతో మాతా.”
ఆమె “సర్వలోకగురుభామిని”. “సర్వలోకేశీ” అని లలితా సహస్రం. “సర్వలోకేశీ = సర్వేషాం లోకానాం ఈశీ ఈశ్వరీ (స్వామినీ).”
ఈ విధంగా ఈ పద్యరాజం బ్రహ్మాదిదేవతల ప్రసంగముఖంగా ఋషిప్రోక్తమైన శ్రీ లలితా సహస్రనామస్తోత్రము లోని పవిత్రనామాలను ఆత్మసాత్కరించుకొన్నది. ఇంతటి మంత్రమయవాణి త్రిపురాంతకుని వంటి ఎంతో భావితాత్ములకు గాని వశం కాదు.
ప్రత్యక్షరం భక్తిరసోదయంగా పరిస్ఫుటిస్తున్న ఈ హృద్యమైన పద్యాన్ని అభిమానించి ప్రౌఢకవి మల్లన తన రుక్మాంగద చరిత్రము (1-4)లోని భగవతీస్తుతిలో అనురణింపజేశాడు:
అని. త్రిపురాంతకుని పద్యంలోని పదభావాలకు ఇందులో మల్లన కావించిన యాథాతథ్యానుసరణం సువిశదంగానే ఉన్నది.
| త్రిపురాంతకుడు | ప్రౌఢకవి మల్లన |
|---|---|
| ఆదిమశక్తి | ఆదిమశక్తి |
| ఆద్యకుటుంబిని, ముత్తైదువ | శంకరుని యర్ధశరీరమునన్ వసియించు ముత్తైదువ |
| కుమారి…హిమాద్రికి | మంచుగుబ్బలికి నాత్మజ |
| విశ్వమాత…సర్వలోకగురుభామిని … | (షణ్ముఖుఁ)గన్నతల్లి |
| బ్రహ్మాదులు వచ్చి .. యంచు ని న్నెఱిఁగింతురు | బ్రహ్మాదిసమస్తదైవతసమర్చితపాదసరోజయుగ్మ |
పై పద్యంలోని ప్రౌఢకవి మల్లన కల్పనలన్నీ త్రిపురాంతకుని మూలానికి అనుకరణలే.
6. అలంకారశోభ
అంబికా శతకములోని ఇంకొక అందమైన పద్యం:
అని. వేణీబంధం “కూడెడు వెండ్రుకలతో నిడుదకూఁకటఁ బ్రోవుగ” ఉండటం సరిక్రొత్త కల్పన. ఆమె పరమశివునికి “బొడ్డుపై వళుల్ జాడగ”, “క్రొమ్మొలకచన్నులు మించు దొలంక”, “సిగ్గునన్ జూడఁగ నేరముల్ మెఱుఁగుఁ జూపుల నీన” కానరావటం ఆమె యౌవనోచితవపుర్విజృంభణకు సూచకం. సౌందర్యరాశి జగన్నాయిక లోకేశ్వరేశ్వరి త్రపాముగ్ధయై హిమశైలేశ్వరుని ఇంట కదలాడుతుంటే, “నీ వాడుట శూలికిన్ మనము వాడుట గాదె!” అనటంలోని సొగసు మెచ్చదగినది. దేవి గమనవిలాసం ఈశ్వరమనస్సంకోచకారకం అన్న హేత్వర్థనిరూపణ రమణీయంగా విలసిల్లింది.
త్రిపురాంతకుని ఈ అద్భుతమైన పద్యం పింగళి సూరన అంతటి స్వతంత్రాశయాలు కలిగిన మహాకవిని సైతం ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది, చూడండి:
ఇందరు మహాకవులను ప్రభావితం చేసిన అంబికా శతకం మొత్తం లభించివుంటే తెలుగు సాహిత్యంలోని ఉత్తమోత్తమకవితగా వార్తాపత్త్రికల పతాకశీర్షికలలో నిలిచేది.
సమర్థ్య సమర్థకమైన భావనివేశం
త్రిపురాంతకుని అనర్ఘమైన ఉక్తివైచిత్రికి నిదర్శకమైన ఇంకొక పద్యం ఇది:
అంబిక యొక్క మూర్తిత్రయాత్మికతను సమర్థ్య సమర్థక భావనివేశంతో మనోరమంగా ఆవిష్కరిస్తున్న పద్యం ఇది. “ఏషా శ్వేతా పరా శక్తిః సాత్త్వికీ బ్రహ్మసంస్థితిః, ఏషైవా రక్తా రజసి వైష్ణవీ పరికీర్తితా, ఏషైవ కృష్ణా తమసి రౌద్రీ దేవీ ప్రకీర్తితా పరమాత్మా యథా దేవ ఏక ఏవ త్రిధా స్థితః” అని సౌభాగ్యభాస్కరము.
“భారతియై దేవి సరోజభవుని ఇల్లాలయింది. రమావధూటియై నీరజనాభుని చెందింది. హిమవత్పుత్త్రికయై మహేశ్వరుని గృహిణి అయింది. తల్లీ! నిన్ను ఆరాధింపక లోకులకు సంసారసుఖాలు నిర్నిమిత్తంగా ఎందుకు కలుగుతాయి?” అని సామాన్యంచేత విశేషార్థం సమర్థింపబడుతున్నది.
ఇది అంబికా శతకములో లభించిన పద్యాల సౌందర్యస్వరూపం.
త్రిపురాంతకోదాహరణము పీఠికలో శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు అంబికా శతకములోని ప్రతిపాదితాన్ని ఈ విధంగా మనసులకు హత్తుకొనేట్లు ఆవిష్కరించారు:
“అంబికాశతకమునఁ బార్వతీ నాయికా గుణవర్ణనాదులు రసజ్ఞుల కింపుగా మృదుభాషతోఁ గూర్పఁబడినవి. నేఁటి కాలమున శృంగారసముద్రసారవిధురులు గొందఱును, భక్తి రసనియమ ప్రణాళికా పారీణులు గొందఱును ఉత్తమ దేవతా వర్ణనముల శృంగారరసభావముల రసాభాసములుగాఁ దలఁచుచున్నారు. దీనిలో నుత్తమదేవత లైన నంబికాశివుల పరస్పర శృంగార రసోద్దీప్తి వర్ణింపఁబడినది గాని ధ్వనికారుల మతమున రసాభాస మనునది మాత్రము దీనిలో నెచ్చటఁ గానరాదు.”
“రసజ్ఞులకు ఇంపైన మృదుభాషలో పార్వతీ నాయికా గుణవర్ణనాదులు”, “అంబికాశివుల పరస్పర శృంగార రసోద్దీప్తి” అన్న రెండు కీలకమైన దళాలు అంబికా శతకము తాత్పర్యాన్ని కన్నుల ముందు నిలిపి తెలుగు సాహిత్యంలో దానికి గల నిర్వివాదమైన సుస్థితికి నిదర్శకంగా అలరారుతున్నాయి.