జీవించడానికి కూడా తాత్త్వికత అవసరం లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే తాత్త్వికత అవసరం. మరణాన్ని అర్థం చేసుకోవడానికికూడా తాత్త్వికత అవసరమే.
అక్టోబర్ 2026
రచయిత హమారా ప్రసాద్‌ను ఇటీవల అరెస్టు చేయడం, ఆయన రాసిన వివాదాస్పద పుస్తకం ‘కల్పిత నాయకుడు’ విడుదలకు ఒక్క రోజు ముందే దానిపై తెలంగాణ హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేయడం — ఇవన్నీ భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ ఎంతటి పెళుసైన స్థితిలో ఉందో మనకు స్పష్టంగా గుర్తుచేస్తున్నాయి. అంబేద్కర్ గురించి హమారా ప్రసాద్ రాసిన రాతలు ఎంత అభ్యంతరకరంగా ఉన్నా, చారిత్రకంగా ఎంత వివాదాస్పదమైనా, అటువంటి పుస్తకాలను ప్రభుత్వాలు, న్యాయస్థానాలు నిషేధించడం ఎంతవరకు సమంజసం? రెచ్చగొట్టే భావాలను, అభ్యంతరకరమైన రచనలను నాగరిక సమాజాలు ఎలా ఎదుర్కోవాలి అన్న పాతచర్చను ఈ పరిణామం మళ్ళీ తెర పైకి తెచ్చింది.
మానవ పరిణామక్రమంలో నాగరికత అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది భవనాలు, సాంకేతిక ప్రగతి కాదు; మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలగడం, తన భావాలను వ్యక్తపరచి, భద్రపరిచి ముందు తరాలకు అందించగలగడం. అక్షరాలు నిస్సందేహంగా మానసిక వేదనను కలిగించగలవు; ఆగ్రహాన్ని రగిలించగలవు; మనలో లోతుగా నాటుకుపోయిన నమ్మకాలను సవాలు చేయగలవు; ప్రజల మనోభావాలను దెబ్బతీయగలవు. అందుకే అభ్యంతరకరమైన సాహిత్యాన్ని తరచుగా హింసతో ముడిపెడుతుంటారు. అయితే, భౌతిక హింసకు, అభ్యంతరకరమైన భావాల వ్యక్తీకరణకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం కీలకమైనది. హింస అనేది ఒకరి అనుమతి లేకుండా వారి భౌతిక సరిహద్దులను అతిక్రమించడం; అది మనిషి విచక్షణను పక్కనపెట్టి ప్రత్యక్షంగా భౌతికంగా హానిని కలిగిస్తుంది. దానికి భిన్నంగా, పుస్తకం అనేది ఒక జడ పదార్థం. దానిలోని అక్షరాలను, భావాలను అర్థం చేసుకుని, భావాన్ని గ్రహించాలంటే పాఠకుడు క్రియాశీలకంగా, స్వచ్ఛందంగా ఆ రచనను చదవటం అవసరం. ఒక పుస్తకం చదవడం ఇష్టం లేకపోతే దాన్ని మూసేయవచ్చు, తిరిగి అరలో పెట్టేయవచ్చు, లేదా దాని అసంబద్ధతను చూసి నవ్వుకోవచ్చు. కానీ భౌతిక హింసనుంచి అంత సులభంగా ఎవరూ తప్పుకోలేరు. ఈ స్పష్టమైన గీతను చెరిపేసి, ఒక అభ్యంతరకరమైన రాతలను నిజమైన హింసతో సమానంగా చూసినప్పుడు, మనకు నచ్చని భావాలను ఎదుర్కోవడానికి భౌతిక బలాన్ని ప్రయోగించడం సబబేనని పరోక్షంగా సమర్థించినట్లు అవుతుంది.
ఒక రచన వెనుక ఎంత అసంబద్ధమైన తర్కం ఉన్నా, అది ఎంత అభ్యంతరకరంగా, విద్వేషపూరితంగా ఉన్నా, దాన్ని నిషేధించడం ఆధునిక నాగరిక సమాజాలలో మేధాపరమైన నేరంగానే పరిగణించాలి. పుస్తకనిషేధం అనేది అసలు రోగాన్ని వదిలేసి, పైకి కనిపించే రోగ లక్షణానికి మాత్రమే చికిత్స చేయడం. వికృతభావాలుగల ఒక రచన మానవనైజంలోని వికారాన్ని కొత్తగా సృష్టించదు; అది సమాజంలో ఇప్పటికే ఉన్నదాన్ని కేవలం నమోదు చేస్తుంది. అలాంటి రాతను నిషేధించడం అంటే, జ్వరానికి భయపడి థర్మామీటర్‌ను పగలగొట్టడమే. చెడు పుస్తకాలను బహిరంగంగా అందుబాట్లో ఉండనివ్వడం ద్వారా, తప్పుల తడకగా ఉన్న భావజాలాలను బహిరంగంగా విశ్లేషించే సామర్థ్యాన్ని సమాజం నిలుపుకుంటుంది. ప్రభుత్వం చేతిలోనో, మెజారిటీ వర్గం చేతిలోనో అణచివేతకు గురైనప్పుడు, అవే భావాలు కనుమరుగైపోయి రహస్యంగా విస్తరిస్తాయి. ఎవరూ ప్రశ్నించలేని ఆ చీకటి కోణాల్లో అవి మరింతగా ప్రబలుతాయి. అంతేకాక, అవే తప్పుడు భావాలు ‘నిషేధించబడిన నిజం’ అనే వింత ఆకర్షణను సంతరించుకొని మరింత ప్రమాదకరమవుతాయి.
పుస్తక నిషేధాల విషయంలో ‘ఈమాట’ పత్రిక ఎల్లప్పుడూ స్పష్టమైన వైఖరితోనే నిలబడింది. గతంలో అమెరికన్ రచయిత్రి వెండీ డానిగర్ హిందూ దేవతల గురించి ప్రత్యామ్నాయ చరిత్రను ప్రతిపాదిస్తూ రాసిన పుస్తకంపై ఆంక్షలు విధించినప్పుడు కానీ, స్థానిక ఆచారాల నేపథ్యంతో తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘మాధోరుబాగన్’ నవలను, రచయితను నిషేధించినప్పుడు గానీ, రచయితల భావప్రకటనస్వేచ్ఛపై ఆంక్షలను ఈమాట తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే సల్మాన్ రుష్దీ పుస్తకాలపై నిషేధాన్ని, ఆయనపై దాడులను తీవ్రంగా ఖండించింది. ఏ పుస్తకమైనా సరే — అందులోని భావాలతో మనం ఏకీభవించినా, తీవ్రంగా విభేదించినా — వాటిని నిషేధించడం, ఆయా రచయితలపై దాడులు జరపటం, ఏమాత్రం పరిష్కారం కాదని ఎలుగెత్తి చాటింది. విషపూరితమైన భావాలకు అసలైన విరుగుడు అంతకంటే మెరుగైన, పదునైన ఆలోచనలను విస్తరింపజేయడమే — సెన్సార్షిప్ ఎన్నటికీ కాదు!
చక్కని దారి. చిక్కని అడవి. పైదాకా కాలిబాట. చుట్టూ చెట్ల పసరి వాసన. సువాసన. గాలిలో తేమ. ఆ మధ్యనే వర్షం పడ్డ సూచనలు. చిన్న చిన్న నీటి చెలమలు… కాస్తంత దూరాన సముద్రపు బ్యాక్ వాటర్స్ తో ఏర్పడిన తటాకం… అక్కడక్కడ విసిగించని బురద.
ఒడిస్సీని చదవాల్సింది అది పాశ్చాత్య సాహిత్యానికి మూలస్తంభం కాబట్టి మాత్రమే కాదు. వీరత్వం, నాయకత్వం, ఇల్లు, వివాహం, స్త్రీల అధికారం, బానిసత్వం — మనకు తెలిసినవే అనుకున్న విషయాలను కూడా అది మళ్ళీ ప్రశ్నించేలా చేస్తుంది. పాత కావ్యాలు చదవాల్సింది వాటి విలువలన్నిటినీ అంగీకరించడానికి కాదు; వాటితో వాదించడానికి కూడా.
ఆమె భర్త ఆమెని మోరోభట్టుకి దానంగా ఇస్తాడు; ఐతే ఇక్కడే ఓ మెలిక పడుతుంది — హఠాత్తుగా జ్ఞానోదయమై మోరోభట్టు ఆ దానం తీసుకోవటానికి ఒప్పుకోడు. దానాన్ని తీసుకోనని ఒకడు, ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకోనని మరొకడు — ఈ చిక్కుముడిని విప్పటం ఈ యక్షగాన నాటకంలో ప్రధానాంశం.
రక్తమనే యుద్ధచందనపు మైపూత తడితో మెరుస్తూ ఉన్నాడు. భూమిపై పాకుతూ దుమ్ము అంటి ఎరుపు చాయకు తిరిగిన తెల్లని భుజాలతో బాల్యదశను పొందినవాడు, అమృతమథనం పూర్తయ్యాక, సురాసురులు మందరపర్వతంనుంచి విడిపించాక, అలసటతో తన శరీరాన్ని సముద్రజలాలలోనికి ఈడ్చుకుపోతున్న వాసుకిలా ఉన్నాడు.
లోకం మనకోసం రాసిపెట్టిన పాత్రల్లో ఇమిడిపోవడానికి మనుషులు జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ లోపల మనసు, శరీరం రెండూ నిరంతరం ఒక నిజాన్ని చెప్తున్నప్పుడు… ఆ అబద్ధపు పాత్రలో ఎలా ఊపిరి పీల్చుకోవాలి?
వెంకటప్పయ్య ఆ బట్టను చేతిలోకి తీసుకున్నాడు. అతని వేళ్లకు అది చాలా కర్కశంగా తగిలింది. మగ్గం మీద ఒక మనిషి చెమట చిందిస్తూ, పడుగు పేకలను కలుపుతూ నేసిన బట్టలా అనిపించలేదు అది.
మనుషులతో మమేకమయ్యే, స్పర్శలను అనుభూతించే వ్యవధానం ఎవరికి ఉన్నదని? వర్తమానమంతా మనిషి పొలకువకు జడుసుకునే వేగయుగ జీవులే. ఎల్లెడలా స్వకపోల మర్దనలే. ఎవరి ప్రపంచంలోకి వారు ముడుచుకుపోతూ, ఎవరి కురచతనంలో వారు శిఖరాలను చూసుకుంటూ!
ఏ మూలకవి భావనతోనైనా శ్రుతి కలిపే శతతంత్రీవీణ శ్రీనాథుని కవిత. వాళ్ళ భాషానిగుంభనములు ఆయన తీసుకోవడం ఎలా ఉంటుందంటే, మూలకవులకు ఒక యోగ్యతాపత్రం — certificate — ఇచ్చినట్లుగా, వారిని అనుగ్రహించినట్లుగా ఉంటుందే తప్ప, ఎరువు తీసుకొన్నట్లుగా ఉండదు.
రెండు నక్షత్రాలు రాలి
నా అన్నం గిన్నెలో పడ్దాయి
నీతో నువు ఉన్నపుడైనా
నీకు స్వేచ్ఛ ఇస్తున్నావా
లేక, బానిసలా చూస్తున్నావా
బ్రతుకే శేషప్రశ్నయై
ఉత్తర మాశించలేని
నిస్తబ్ధ నీరవమై మిగిలిపోతుంది!
ఎవరన్నారు నదులన్నిటికీ
సాగర సంగమమని?
అతడు ప్రతి మలుపునూ గుర్తుంచుకున్నాడు
ఏ మలుపూ అతని జాడను దాచలేదు
కాలం వాటినన్నింటినీ తుడిచివేసింది
అడుగులు లేవు—జ్ఞాపకం మాత్రం మిగిలింది
“మిగతా వాళ్ళ సంగతి
నాకు తెలీదు గానీ
మీ లెక్కలవాళ్ళకు మాత్రం —
చాలా సందర్భాల్లో–
కాదంటే ఔననే!
ఉండనే ఉన్నది గదా!
రిడక్టిఓ ఎడ్ అబ్సర్డియం [reductio ad absurdum]”
పోటెత్తిన సముద్రాల్లా ఉన్న సేనావాహినులు రెండూ పరస్పరం ఢీకొన్నాయి. ఈటెలతో ఈటెల టకటకలు. ఖంగు ఖంగుమని ఖడ్గాల మోతలు. క్షతగాత్రులైన సైనికుల హాహాకారాలు. విజయోత్సాహంతో హర్షధ్వానాలు. శిరశ్ఛేదాలతో, చిమ్మనగ్రోవిలోంచి ఎగజిమ్మినట్లు ధారాపాత రుధిరప్రవాహాలు. రణరంగమంతటా బీభత్సం తాండవించింది.
[నిర్మాణంలో ఉంది. ఆలస్యానికి క్షంతవ్యులం. సం.]
ఈ లోకంలో పిచ్చిమనిషి
కావడం కంటె
అందమైన సంగతి
మరొకటి ఉందంటారా?
శ్రౌతార్థమే హృదనుభూతార్థ మైనపుడు
స్వాంతమున సత్యదర్శన మగును నీకు
జ్యోతి నీలోనె హృదయాంతరాళమునుండు
ఆతుమకు తేజమదె – మంకుతిమ్మ
కావ్యంలో పెల్లుబికే సామాజిక స్పృహ, సౌందర్యానుభూతి, శిల్పం వగైరా లక్షణాలు విశ్వసాహిత్య ప్రపంచంలోని పోకడల పరిణామంగా ఆధునిక నేపాలీ కవిత్వంలో చోటు చేసుకొన్నాయని విమర్శకులు అన్నా, నేపాల్ దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులనే కారణంగా ఈ పరివర్తనలు, లక్షణాలు రూపుతాల్చాయన్న సంగతి మటుకు యథార్థం. నేపాలీ అస్మిత, ప్రాంతీయతలు ఆధునిక కవిత్వ వికాసానికి దోహదం చేస్తున్నాయని మాత్రం ఖాయమనవచ్చు.
‘‘భారతదేశ పతనానికి పదకొండు కారణాలు’’ పుస్తకం గురించి తక్కువ మంది విని ఉంటారు. బళ్లారి రాఘవ రాసిన వ్యాసమిది. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి చొరవతో బళ్లారి రాఘవ ఇంట్లోనే లభించిన ఈ వ్యాసాన్ని ఆవంత్స సోమసుందర్ తెలుగులోకి అనువదించారు. దీని వెనక కన్యాశుల్కం దాగి ఉందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
అనల్పమైన కల్పనా ప్రపంచానికి త్రిపురాంతకోదాహరణము పుట్టినిల్లు. సూచ్యార్థ సూచకత్వానికి, ప్రకాశ్యార్థ ప్రకాశకత్వానికి అపురూపములైన ఉదాహరణలు ఇందులో సర్వే సర్వత్ర నిండి ఉన్నాయి.
విద్యార్థినీ విద్యార్థుల్లోని సృజనాత్మక భావనలను వెలికితీసి, వారి రచనాప్రతిభను ప్రోత్సహించేందుకు, నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక జాతీయస్థాయి “కథల పోటీ–2026’ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన బాలరచయితలను ప్రోత్సహించి, వారి కథలను పాఠకులకు పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.
రాముడు పంపగా రయమున వచ్చిన
రామ దూతను నేను రమణి వినుమ.
భద్రవిమలమూర్తి భవ్యగాత్రుడు రామ
భద్రుండచట కడు భద్రమమ్మ.