తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి

[ఇందులో ఉదహరింపబడిన కవితల యొక్క రచయితల పేర్లు తెలిపితే వివాదాలకు దారితీయవచ్చునన్న సందేహంతో రచయితల పేర్లు తెలుపలేదు. కేవలం కవితలు మాత్రం ఉదాహరించబడ్డాయి.]

కవిత – కావ్యం

నేడు కవిత అని పేర్కొనబడుతున్నదీ, పూర్వం కావ్యం అని పేర్కొనబడినదీ దాదాపు సమానార్థకాలే. పరిమాణంలో మాత్రమే తేడా. ఆధునిక ప్రమాణాలను బట్టి చూస్తే నూట ఇరవై శ్లోకాలతో కూడిన ‘‘మేఘ దూతం’’ ఒక కవిత క్రిందనే లెక్క. కాని దానిని కావ్యం అనే పేర్కొన్నారు. ఇరవై నాలుగు వేల శ్లోకాలతోకూడిన రామాయణాన్ని కావ్యమనే పేర్కొన్నారు.

ఈనాడు మనం పాటిస్తున్న కథ, కవిత అనే భేదం కూడా పూర్వీకులలో లేదు. ‘‘కావ్యాలు పద్యకావ్యాలు, గద్యకావ్యాలు అని రెండు విధాలు’’ అంటూ పద్య గద్యాలను రెండింటినీ కావ్యాలుగానే పరిగణించారు. పద్యానికీ, గద్యానికీ సమాన ప్రతిపత్తినే ఇచ్చారు. సాహిత్య పరంగా వారు వాల్మీకి రామాయణానికి ఎంత పెద్ద పీటవేశారో, గుణాఢ్యుని బృహత్కథకూ అంతే పెద్ద పీటవేశారు. అంతేకాదు. పైన చెప్పినట్టు వారు కావ్యాల పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకోలేదు. మరికొందరైతే నేడు మనం ‘‘మినీ కవితలు’’ అని చెప్పుకుంటున్న వాటికి పూర్వరూప మనదగిన శాలివాహన గాథాసప్తశతిలోని ఒక్కొక్కగాథనూ ఒక్కొక్క కావ్యంగా పరిగణించవచ్చును అన్నారు. వాక్యం రసాత్మకం కావ్యం అన్న ఒక మాటతో.

‘‘చూడ చక్కనైన సుందరి నిజమది
నేను పనికిరాని దాన నిజము
కాని ఒక్కమాట దాని బోలగలేని
వారలెల్ల చావ వలయునేమి?’’ (గాథ)

ఇది శాలివాహన గాథా సప్తశతిలోని ఒక రసాత్మకమైన వాక్యం. దీనిని కూడా ఒక కావ్యంగా పరిగణించవచ్చునన్న మాట.
ఏతావాతా పూర్వకాలంలో వ్రాయబడినవన్నీ కావ్యాలే, వాటిని వ్రాసిన వారందరూ కవులే. శాస్త్రాల విషయం ఇక్కడ అప్రస్తుతం. అది వేరే ప్రక్రియ.

కవిత – పరిణామాలు

ఇరవయ్యవ శతాబ్ది మధ్య భాగంలో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. ఒకవైపు పాండిత్య ప్రదర్శనే కవిత్వమనే అపోహతో సుదీర్థ సంస్కృత సమాసాలతో పొంతనలేని అలంకారాలతో, భయం కొలిపే శబ్ద విన్యాసంతో కొందరు కావ్యాలు వ్రాస్తూ ఉండగా, మరోవైపు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి, రాయప్రోలు వంటి పండిత కవులే క్రత్త పుంతలు త్రొక్కి సామాన్య విద్యావంతులను సైతం ఆకట్టుకొనేలాగా ఖండకావ్యాలూ, లఘుకావ్యాలూ సరళమైన భాషలో వ్రాయసాగారు. మరోవైపు శ్రీశ్రీ లాంటి వారు ఛందస్సును వదిలేసి మాత్రాబద్ధ రచనలు సాగించి వర్ధమాన రచయితలకు క్రొత్తదారులు చూపారు. ఇంకో వైపు ఆరుద్ర, కుందుర్తి, తిలక్‌ మొదలైన వారు ‘‘వచన కవిత’’ అనే క్రొత్త ప్రక్రియను చేపట్టి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నారు. ఈ పరిణామ క్రమంలో ఏది ముందు, ఏది వెనుక అని నిర్ధారించడం కష్టం. అన్నీ దాదాపు ఏకకాలంలో పరిఢవిల్లినవే. ‘‘వచన కవిత’’ అనే ప్రక్రియ తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టి చాలా పుణ్యం కట్టుకుంది. చాలా నష్టమూ తెచ్చిపెట్టింది.

భావుకులైన కొందరు రచయితలు తమ భావాలను వ్యక్తం చేయడానికి ఛందస్సూ, మాత్రాబద్ధతా అవరోధంగా ఏర్పడుతూ ఉండగా వారి భాషా పటిమ అంతంత మాత్రంగా ఉండగా, పద్యాలు వ్రాయలేక, ఏదో ఒకటి వ్రాయకుండా ఉండలేక, సతమతమవుతున్న తరుణంలో వచన కవితా ప్రక్రియ వారికి ఆలంబనగా నిలిచింది. చాలామంది ఉత్తమ భావుకులు చక్కని కవితలు వ్రాయడానికి అవకాశం ఏర్పడింది. ఇది వచన కవితల వల్ల కలిగిన లాభం.

ఈ ఆలంబనతో భావుకులు కానివారు సైతం, కేవలం ఉత్సాహం మాత్రమే ఉన్నవారూ, శబ్దాధికారం లేని వారూ సైతం వచన కవితలు వ్రాయడం ప్రారంభించారు. కవుల సంఖ్య పెరిగిపోయింది. వీరివల్ల కవితా గౌరవం దిగజారిపోసాగింది. ఇది వచన కవితలవల్ల కలిగిన నష్టం. మరో రకం కవి కుమారులు తమకు స్ఫురించిన చిన్న చిన్న భావాలను చిన్న చిన్న కవితలుగా వ్రాసి ‘‘మినీ కవితలు’’ అని వాటికి నామకరణ చేశారు. సుదీర్ఘ కవితలు చదివే ఓపికా, తీరికా లేని పాఠకులకు ఈ మినీ కవితలు బాగా నచ్చాయి. కనుక ఇది బాగా ప్రచారంలోకి వచ్చాయి.

ఈ మినీ కవితల ప్రయోజనాన్ని క్లుప్తతనూ గుర్తించిన మరోరకం భావుకులు హైకూలూ, నానీలు అనే క్రొత్త ప్రక్రియలను ఆశ్రయించారు. ఇవి మన వేమన పద్యాలలాగా ప్రజాదరణ పొందాయి. జ్ఞాపకం పెట్టుకోవడానికీ, సమయం వచ్చినప్పుడు ఉదాహరించుకోవడానికీ ఉపయోగపడుతున్నాయి. నానీలు ఇంకా బాగా ప్రచారంలోనికి రావలసి ఉంది.