[ఇందులో ఉదహరింపబడిన కవితల యొక్క రచయితల పేర్లు తెలిపితే వివాదాలకు దారితీయవచ్చునన్న సందేహంతో రచయితల పేర్లు తెలుపలేదు. కేవలం కవితలు మాత్రం ఉదాహరించబడ్డాయి.]
కవిత – కావ్యం
నేడు కవిత అని పేర్కొనబడుతున్నదీ, పూర్వం కావ్యం అని పేర్కొనబడినదీ దాదాపు సమానార్థకాలే. పరిమాణంలో మాత్రమే తేడా. ఆధునిక ప్రమాణాలను బట్టి చూస్తే నూట ఇరవై శ్లోకాలతో కూడిన ‘‘మేఘ దూతం’’ ఒక కవిత క్రిందనే లెక్క. కాని దానిని కావ్యం అనే పేర్కొన్నారు. ఇరవై నాలుగు వేల శ్లోకాలతోకూడిన రామాయణాన్ని కావ్యమనే పేర్కొన్నారు.
ఈనాడు మనం పాటిస్తున్న కథ, కవిత అనే భేదం కూడా పూర్వీకులలో లేదు. ‘‘కావ్యాలు పద్యకావ్యాలు, గద్యకావ్యాలు అని రెండు విధాలు’’ అంటూ పద్య గద్యాలను రెండింటినీ కావ్యాలుగానే పరిగణించారు. పద్యానికీ, గద్యానికీ సమాన ప్రతిపత్తినే ఇచ్చారు. సాహిత్య పరంగా వారు వాల్మీకి రామాయణానికి ఎంత పెద్ద పీటవేశారో, గుణాఢ్యుని బృహత్కథకూ అంతే పెద్ద పీటవేశారు. అంతేకాదు. పైన చెప్పినట్టు వారు కావ్యాల పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకోలేదు. మరికొందరైతే నేడు మనం ‘‘మినీ కవితలు’’ అని చెప్పుకుంటున్న వాటికి పూర్వరూప మనదగిన శాలివాహన గాథాసప్తశతిలోని ఒక్కొక్కగాథనూ ఒక్కొక్క కావ్యంగా పరిగణించవచ్చును అన్నారు. వాక్యం రసాత్మకం కావ్యం అన్న ఒక మాటతో.
‘‘చూడ చక్కనైన సుందరి నిజమది
నేను పనికిరాని దాన నిజము
కాని ఒక్కమాట దాని బోలగలేని
వారలెల్ల చావ వలయునేమి?’’ (గాథ)
ఇది శాలివాహన గాథా సప్తశతిలోని ఒక రసాత్మకమైన వాక్యం. దీనిని కూడా ఒక కావ్యంగా పరిగణించవచ్చునన్న మాట.
ఏతావాతా పూర్వకాలంలో వ్రాయబడినవన్నీ కావ్యాలే, వాటిని వ్రాసిన వారందరూ కవులే. శాస్త్రాల విషయం ఇక్కడ అప్రస్తుతం. అది వేరే ప్రక్రియ.
కవిత – పరిణామాలు
ఇరవయ్యవ శతాబ్ది మధ్య భాగంలో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. ఒకవైపు పాండిత్య ప్రదర్శనే కవిత్వమనే అపోహతో సుదీర్థ సంస్కృత సమాసాలతో పొంతనలేని అలంకారాలతో, భయం కొలిపే శబ్ద విన్యాసంతో కొందరు కావ్యాలు వ్రాస్తూ ఉండగా, మరోవైపు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి, రాయప్రోలు వంటి పండిత కవులే క్రత్త పుంతలు త్రొక్కి సామాన్య విద్యావంతులను సైతం ఆకట్టుకొనేలాగా ఖండకావ్యాలూ, లఘుకావ్యాలూ సరళమైన భాషలో వ్రాయసాగారు. మరోవైపు శ్రీశ్రీ లాంటి వారు ఛందస్సును వదిలేసి మాత్రాబద్ధ రచనలు సాగించి వర్ధమాన రచయితలకు క్రొత్తదారులు చూపారు. ఇంకో వైపు ఆరుద్ర, కుందుర్తి, తిలక్ మొదలైన వారు ‘‘వచన కవిత’’ అనే క్రొత్త ప్రక్రియను చేపట్టి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నారు. ఈ పరిణామ క్రమంలో ఏది ముందు, ఏది వెనుక అని నిర్ధారించడం కష్టం. అన్నీ దాదాపు ఏకకాలంలో పరిఢవిల్లినవే. ‘‘వచన కవిత’’ అనే ప్రక్రియ తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టి చాలా పుణ్యం కట్టుకుంది. చాలా నష్టమూ తెచ్చిపెట్టింది.
భావుకులైన కొందరు రచయితలు తమ భావాలను వ్యక్తం చేయడానికి ఛందస్సూ, మాత్రాబద్ధతా అవరోధంగా ఏర్పడుతూ ఉండగా వారి భాషా పటిమ అంతంత మాత్రంగా ఉండగా, పద్యాలు వ్రాయలేక, ఏదో ఒకటి వ్రాయకుండా ఉండలేక, సతమతమవుతున్న తరుణంలో వచన కవితా ప్రక్రియ వారికి ఆలంబనగా నిలిచింది. చాలామంది ఉత్తమ భావుకులు చక్కని కవితలు వ్రాయడానికి అవకాశం ఏర్పడింది. ఇది వచన కవితల వల్ల కలిగిన లాభం.
ఈ ఆలంబనతో భావుకులు కానివారు సైతం, కేవలం ఉత్సాహం మాత్రమే ఉన్నవారూ, శబ్దాధికారం లేని వారూ సైతం వచన కవితలు వ్రాయడం ప్రారంభించారు. కవుల సంఖ్య పెరిగిపోయింది. వీరివల్ల కవితా గౌరవం దిగజారిపోసాగింది. ఇది వచన కవితలవల్ల కలిగిన నష్టం. మరో రకం కవి కుమారులు తమకు స్ఫురించిన చిన్న చిన్న భావాలను చిన్న చిన్న కవితలుగా వ్రాసి ‘‘మినీ కవితలు’’ అని వాటికి నామకరణ చేశారు. సుదీర్ఘ కవితలు చదివే ఓపికా, తీరికా లేని పాఠకులకు ఈ మినీ కవితలు బాగా నచ్చాయి. కనుక ఇది బాగా ప్రచారంలోకి వచ్చాయి.
ఈ మినీ కవితల ప్రయోజనాన్ని క్లుప్తతనూ గుర్తించిన మరోరకం భావుకులు హైకూలూ, నానీలు అనే క్రొత్త ప్రక్రియలను ఆశ్రయించారు. ఇవి మన వేమన పద్యాలలాగా ప్రజాదరణ పొందాయి. జ్ఞాపకం పెట్టుకోవడానికీ, సమయం వచ్చినప్పుడు ఉదాహరించుకోవడానికీ ఉపయోగపడుతున్నాయి. నానీలు ఇంకా బాగా ప్రచారంలోనికి రావలసి ఉంది.
కవితా లక్షణాలు
పద్యకావ్యమైనా, గద్యకావ్యమైనా అందలి ప్రాథమిక లక్షణాలు సమానమే. విషయమూ, విషయ వ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత, వర్ణన, పదబంధ పటుత్వం, శబ్దసౌందర్యం (శబ్దాలంకారం) అర్థస్ఫూర్తి (అర్థాలంకారం), వ్యంగ్యం, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యం మొదలైన లక్షణాలు పద్యకావ్యంలో ఎంత విరివిగా పాటింపబడుతాయో గద్యకావ్యంలో కూడా అంత విరివిగానూ పాటింపబడాలని ఆనాటి లాక్షణికులు నిర్దేశించారు. కాగా క్రమంగా గద్య కావ్యాలలో పైచెప్పిన లక్షణాలలో కొన్ని లోపించి పోతూ ఉండగా, పద్యకావ్యాలలో మరికొన్ని క్రత్త లక్షణాలు వచ్చి చేరసాగాయి. ఈ మార్పుల ఫలితంగా గద్యకావ్యాలు ఆధునిక కాలంలో కథలుగా, నవలలుగా రూపొందడం జరిగింది. పద్యకావ్యాలు పద్యం, గేయం, వచన కవిత మొదలైనవిగా రూపొందడం జరిగింది. క్రమంగా నవల, నవలిక, కథ, కథానిక, గల్పిక, స్కెచ్ మొదలైన ప్రక్రియలు ‘‘కథా నవలా సాహిత్యం’’ అనే పేరుతో ఒక తెగగానూ, పద్యం, గేయం, వచన కవిత, మినీకవిత హైకూ, నానీ మొదలైనవి ‘‘కవితా సాహిత్యం’’ అనే పేరుతో మరో తెగగానూ ఖచ్చితంగా విభజించడం జరిగిపోయింది. రచయితలు కూడా ఏయే తెగల ప్రక్రియలకు చెందిన వారు ఆయా తెగల వారుగా విడిపోవడమూ జరిగింది. వాటికీ, వీటికీ దిశా నిర్దేశాలూ, లక్ష్యాలూ వేరైపోయాయి.
కవిత యొక్క ఉద్దేశం
కవిత పాఠకునికి ఏదో ఒక విషయాన్ని ‘‘ఇదిగో, ఈ విషయాన్ని గుర్తించి చూడు’’ అని చెప్పే విధంగా ఉండాలి. పాఠకుడు కవి చెప్పిన విషయాన్ని చూచి ‘‘అవును సుమా, నేను ఇంతవరకూ గుర్తించనే లేదే’’ అనుకోవాలి. కవి చెప్పిన విషయం పాఠకునిలో ఒక సంతోషాన్ని గానీ, ఒక ఉద్రేకాన్ని గానీ, ఒక ఆశ్చర్యాన్ని గానీ, ఒక ఆవేదనను గానీ, ఒక నవ్వును గానీ ఒక జుగుప్సను గానీ, ఒక భయాన్ని గానీ, రేకెత్తించేదిగా ఉండాలి. అలా రేకెత్తించబడిన భావం పాఠకునిలో ఒక ఆలోచనాత్మకమైన స్పందనను, సంచలనాన్ని కలిగించేదిగా ఉండాలి. కవిత పాఠకుడిలో రేకెత్తించే భావాన్ని ‘రసము’’ అనీ, పాఠకుడిలో స్పందనను, సంచలనాన్ని కలిగించడాన్ని ‘‘కాంతాసమ్మితత యోపదేశయుజే’’ అనీ అన్నారు. ‘‘కాంతా సమ్మితత యోపదేశం’’ అంటే – పాఠకునికి ఒక విషయాన్ని సున్నితంగా ఉపదేశించడం. ఆ ఉపదేశం ఎలా ఉండాలి? ‘‘ఇదిగో నాకు రచయిత ఏదో ఉపదేశిస్తున్నాడు’’ అని పాఠకునికి తెలియకూడదు. ఉపదేశం మాత్రం పాఠకుని తలకెక్కిపోవాలి.
భావపుష్టి
భావం ఉంటేనే కవిత్వం, భావం లేనిది కవిత్వం లేదు. ఒక భావం కవి మనస్సులో ఉద్భవించి, రూపుదిద్దుకని, సర్వావయవాలూ సంతరించుకని, ఇక లోపల నిలువలేక త్రోసుకొని బయటపడాలి. అప్పుడే అది మంచి కవిత్వమవుతుంది. దీనినే భావపుష్టి అనవచ్చు. అలా హృదయం నుంచి బయటికి త్రోసుకొచ్చిన భావం చాలా తీవ్రంగా, సర్వాంగ సంపన్నంగా పరిపూర్ణంగా ఉంటుంది. దీనినే ‘‘భారవేదార్థ గౌరవం’’ అన్నారు పూర్వులు ‘‘భవ్య కవితావేశం’’ అన్నాడు తిక్కన సొమయాజి. కవి ఏదో ఒకటి వ్రాయాలని కూర్చొని వ్రాసే కవిత్వంలో భావపుష్టి ఉండదు. భావం తేలికగా – నెలతక్కువ కాన్పు బిడ్డలాగా – బలహీనంగా ఉంటుంది. భావం సువ్యక్తం కాని కవితకు ఒక ఉదాహరణ –
‘‘బాధా పీడితుడు బాధను వర్ణింప గలిగినా,
బాధాద్రష్టీ చైతన్యం, స్పందన, సామాజిక స్పృహతో
బాధా తప్తుని మించి
బాధను శక్తిమంతంగా చెప్పగలడు’’ (ఒక కవితా సంపుటి)
ఒకానొక బాధాపీడితుడు తన బాధను స్వయంగా వర్ణించడం కంటే, ఆ బాధను కళ్ళారా చూసిన వాడు తన సామర్థ్యం చేత మరింత బాగా వర్ణించగలడు అని రచయిత భావం. ఈ భావం బాగానే ఉంది కానీ అది ఈ కవితలో సమగ్రంగా రూపుదిద్దుకోలేదు. ఉపపత్తులు లేవు. ఇది కవితా లక్షణాలను తెలిపే సిద్ధాంతంలా ఉంది. దీన్ని కవితగా చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు –
‘‘తగిలిన ప్రతిలాఠీ దెబ్బకు
గొంతు పెకల్చుకొని అరవడమే
బాధితుడి స్మృతి
వాతలతో చిట్లిన వీపూ
రక్తంతో తడిసిన జుట్టూ
గోళ్ళల్లో చిప్పిలు నెత్తురూ
పండ్లూడిన పెదవుల వాపూ
తలవాల్చిన నిస్సహాయతా
లాఠీ కళ్ళల్లో క్రౌర్యం
బాధితుడికి కనబడుతుందా
చూచే హృదయానికీ కానీ …’’
పైరచయిత యొక్క స్టేట్‌మెంటు లాంటి భావానికి ఉపపత్తులనూ, లయబద్ధతనూ కూర్చి ఒక కవితా స్వరూపం ఇవ్వబడింది ఈ కవితలో.
బరువైన భావపుష్టీ, ఆలోచనకు విస్తృతమైన అవకాశమూ ఉన్న కవితకు ఉదాహరణ చూడండి –
‘‘దేవుడా, కృతజ్ఞతలు. మనుష్యుల్ని శాశ్వతం చేయనందుకు’’ (ఒక సంపుటి). మనిషి గట్టిగా బ్రతికితే నూరేండ్లే అని తెలిసినా మనిషి స్వార్థంతో చేసే దురంతాలకూ, దురాగతాలకు అంతులేదు. అలాంటి మనిషి శాశ్వితుడైపోతే – వాడేమేమి చేస్తాడో ఊహించడానికే భయంవేస్తూ ఉంది. దేవుడు మనిషికి పరిమితమైన ఆయువును విధించి ప్రపంచానికి మేలు చేశాడు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు అర్పించాలి. భావపుష్టి అంటే ఇలాంటిది. ఇలాంటిదే మరో కవిత –
‘‘సిమెంటు చెద తిన్న చేతులు సలిపాయా,
సిగ్గు లేకుండా తడిమిన చూపులు సలిపాయా అంటే
ఎండు చేపల్లాంటి ఎముకలు కండపడితే
వయస్సు సెలేస్తుందేమో అన్న శంక సలిపింది అంది’’ (ఒక కవితా సంపుటి)
స్త్రీలు ఎంతసేపూ బాహ్యమైన దుష్టశక్తులకు భయపడుతూ గోల చేస్తున్నారు. దుష్టశక్తులను అణచివేసినంత మాత్రాన సమస్య తీరిపోదు. స్త్రీ తనలోని అంతర్గత బలహీనతలకూ అంతే భయపడి జాగ్రత్త వహించాలి – అనే భావం ఈ కవితలో చాలా తీవ్రంగా చెప్పబడింది.
అందమైన భావపుష్టికి మరో చక్కని ఉదాహరణ –
‘‘నేను ప్రవేశించడానికి ముందు ఈ జగత్తును ఆయత్తపరచిందెవరు?’’ భూలోకంలో మనిషి ఉద్భవించడానికి పూర్వమే భగవంతుడు భూమిని మనిషి సుఖజీవనానికై సర్వసంపన్నం చేసిపెట్టాడు. అని ఈ కవితలోని భావం.
అలాంటిదే మరో అతి సున్నితమైన భావానికి ఉదాహరణ –
‘‘ఊరి బయట పాడుబడ్డ సత్రంలో ఓ పిచ్చిది.
చిరుగుల రవికె, మొలకొక తుండు గుడ్డతో –
అరగంట టి.వి ముందు కూర్చుంటే ఆశ్చర్యం కలిగింది.
ప్రపంచంలో ఇంత మంది పిచ్చివాళ్ళా అని’’ (ఒక కవితా సంపుటి)
ఒక పిచ్చిది శరీర స్పృహ లేకుండా అర్ధనగ్నంగా కనబడుతుంటే ‘‘పోనీలే పాపం పిచ్చిది’’ అనుకోవచ్చు. కానీ టీవి చూస్తున్నప్పుడు అందులో నాగరికతకూ, సంస్కృతికీ ప్రతీకలైన స్త్రీలు కూడా అర్ధనగ్నంగా దర్శనమిస్తుంటే వాళ్ళను గురించి ఏమనుకోవాలి? ఫ్యాషన్ అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా?
ఈ మధ్య వెలువడుతున్న అనేకానేక కవితా సంపుటుల్లో ఈ భావపుష్టి లోపం కొట్టవచ్చినట్టు కనబడుతుంది. కారణం? రచయితలు తొందరగా కవితలు రాసేసి, తొందరగా అచ్చువేసి, తొందరగా ‘‘కవి’’ అన్న పేరు పొందాలనే కండూతి. రచయితలు తమ భావాలను సరిగా పండనివ్వడం లేదు. అవయవాలు సరిగా రూపుదిద్దుకోక ముందే సిజేరియన్ కాన్పులు చేసేసుకుంటున్నారు.
లోకవృత్త పరిజ్ఞానం
ఒక కవిత విమర్శలకు గురికాకుండా నిలబడాలంటే కవితలో భావపుష్టితో పాటు లోకవృత్త పరిజ్ఞానం కూడా ఉండాలి. అంటే రచయిత తను చుట్టూ ఉన్న సమాజాన్ని బాగా పరిశీలించిన వాడై ఉండాలి. సమాజంలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలూ, వివిధ ప్రజల జీవన విధానాలూ బాగా పరిశీలించి ఉండాలి. ఒక రచయిత్రి ఒక కవితలో ఇలా రాసింది. (కవిత యథాతథంగా జ్ఞాపకం పెట్టుకొనే లాగా లేదు. కనుక భావం చెబుతాను.)
‘‘ఒక ఉన్నత వర్గ యువతి ఒక మురికి వాడలోని యువతిని కలుసుకోవడానికి వెళ్ళింది. ఆ మురికివాడ యువతి ఈమెకు కూర్చోవడానికి పంది చర్మం పరిచింది’’.
పందికి చర్మం ఊడిరాదు. మరే జంతు చర్మమైనా ఒక ఈత చాపకంటే అనేక రెట్లు విలువైనది. అమ్ముకుంటారు కానీ కూర్చోవడానికి పరుచుకోరు. ఇదిలోక వృత్త పరిజ్ఞాన హీనతకు ఉదాహరణ. అలాగే మరో ఉదాహరణ – ఒక రచయిత కవితా సంపుటి నుండి –
‘‘ఒక పూజారి కోనేటి నుండి పూజకోసం నీళ్ళు తెస్తున్నాడు. ఒక హరిజనుడు ఎదురొచ్చాడు. పూజారి ఆ హరిజనుడిపై తన కాలి చెప్పును విసిరాడు’’.
పూజకోసం నీళ్ళు తెచ్చేటప్పుడు పూజారులు చెప్పులు వేసుకోరు. మరి ఇలాంటి విషయాలన్నీ గమనించకుండా కవితలు రాస్తే అపహాస్యం పాలుకాక తప్పదు.
కవితల్లో క్లుప్తత
కథకైనా, కవితకైనా సామాజిక ప్రయోజనం ఒక్కలాగే ఉంటుంది. కాని కథలో విస్తృతి ఉంటుంది, కవితలో క్లుప్తత ఉంటుంది. కథ ఒక మేఘంలాగా ముందు ప్రత్యక్షమౌతుంది. అందులో రచయిత చెప్పదలచుకొన్న వ్యక్తవ్యాంశం ఒక మెరుపులాగా మెరుస్తుంది.
అదే గనుక ఒక కవితలో అయితే రచయిత చెప్పదలచుకన్న వక్తవ్యాంశం మొదట మెరుపులా మెరుస్తుంది. తరువాత పాఠకుడు ఆలోచింపగా ఆలోచింపగా దానివెనుక ఉన్న విషయ విస్తారం, నేపథ్యం ఒక మేఘంలాగా దర్శనమిస్తాయి.
మొదట మేఘం – తరువాత మెరుపు – ఇది కథ.
మొదట మెరుపు – తరువాత మేఘం – ఇది కవిత.
ఒక రచయిత ఒక కథ రాస్తాడు. అందులో ఒక అట్టడుగు వర్గానికి చెందిన వాడు స్వయం కృషితో శాస్త్రాలూ, ధర్మాలూ అభ్యసించి అగ్రవర్గాల వారికి ధర్మబోధా, ధర్మనిర్దేశమూ చేయగల స్థితికి చేరుకుంటాడు. అగ్రవర్గాల వారికి అనేకులకు అతడు మార్గదర్శకుడవుతాడు. ఈ కథ కొన్ని పేజీలు విస్తరించి ఉంటుంది. ఇది మేఘం. చివరికి రచయిత చెప్పదలచుకొన్న విషయం – అట్టడుగు వర్గాల వారు అగ్రవర్గాల స్థాయికి వచ్చారనీ, అగ్రవర్గాల వారు తమ స్థాయి నుంచి దిగజారి పోతున్నారనీ. ఈ విషయం మెరుపులా స్ఫురిస్తుంది. ఇదే విషయాన్ని ఒక రచయిత తన కవితలో ఇలా అంటున్నాడు –
‘‘బ్రహ్మ ముఖం నుంచి కాళ్ళు పుట్టుకొస్తున్నాయి’’.
బ్రహ్మ ముఖం అంటే అగ్రవర్ణాల జన్మ స్థానమనీ, పాదాలు అంటే అట్టడుగు వర్ణాల జన్మస్థానమనీ అందరికీ తెలిసిందే. ముఖం నుంచి కాళ్ళు పుట్టుకొస్తున్నాయంటే అడుగు వర్ణాల వారు ప్రస్తుతం అగ్రవర్ణాల సరసకు ఎక్కి వచ్చేస్తున్నారనీ. ఇక అగ్రవర్ణాల వారు తమ అభిజాత్యం కారణంగా మురిసిపోవలసిన పనిలేదనీ అర్థం. ఇది మెరుపు. దీనిపై పాఠకుడు ఆలోచింపగా, ఆలోచింపగా ఇందుకు నిదర్శనంగా సమాజంలో నెలకొని ఉన్న అనేక విషయాలు గోచరిస్తాయి. ఇది మేఘం. ఇది కవితల్లోని క్లుప్తతకు ఉదాహరణ. క్లుప్తత కవితకు ప్రాణం. దీనినే ప్రాచీనులు ‘‘అల్పాక్షరములననల్పార్థ రచన’’ అన్నారు.
ధారణా యోగ్యత
కవిత యొక్క ముఖ్య లక్షణాలలో జ్ఞాపకం ఉండిపోవడం ఒకటి. కవితను ఒకటి రెండుసార్లు చదువగానే అది పాఠకుని మనస్సులో యథాతథంగా జ్ఞాపకం ఉండిపోవాలి. సందర్భం వచ్చినప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొని ఉదహరించగలగాలి. దీనినే ధారణాయోగ్యత అనవచ్చు. ఈ సౌలభ్యం కోసమే పూర్వం శాస్త్రాలను కూడా శ్లోకాలలో రాసుకున్నారు. రాత అలవాటులో లేని కాలంలో రచింపబడినవి అన్నీ ఈ ధారణా యొగ్యత వల్లనే మౌఖిక పరంపరగా మన వరకు పయనించాయి. ధారణా యోగ్యతకు ముఖ్య సాధనం కవితను ఒక లయబద్ధంగా రాయడం. ఛందోబద్ధంగా రాసినా, గేయరూపంలో రాసినా ఇతరత్రా ఏ విధంగా రాసినా అందులో అంతో ఇంతో లయబద్ధత ఉండాలి. ఒక ఊపు ఉండాలి. పాద బద్ధత ఉండాలి. దీనికోసం పండిత కవులు ఛందస్సును సృష్టించుకున్నారు. జానపదులు రగడ, ద్విపద మొదలైన దీర్ఘ ప్రక్రియలను ఆశ్రయించారు. లయబద్ధత, పాదబద్ధత లేని కవిత ఎంత గంభీరంగా, భావబంధురంగా ఉన్నా సులభంగా మనస్సులో నిలువదు. అవసరమైనప్పుడు యథాతథంగా జ్ఞాపకం రాదు. భారత భాగవత పద్యాలు మొదలుకని మొన్నటి గురుజాడ ముత్యాల సరాలూ, విశ్వనాథవారి కిన్నెరసాని పాటలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలైన వాటి నుంచి అప్పుడప్పుడూ కొన్ని మాటలను ఉదహరించు కొంటున్నామంటే అందుకు కారణం అవి లయబద్ధతనూ, పాదబద్ధతనూ కలిగి ఉండడమే –
‘‘తిండి కలిగితె కండగలదోయ్
కండ గలిగిన వాడె మనిషోయ్’’
– – –
‘‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తలపెట్ట పోయ్’’
– – –
‘‘పొలాలనన్నీ హలాలదున్నీ
ఇలాతలంలో హేమం పండగ’’
– – –
‘‘ఘర్మజలానికి ధర్మజలానికి
ఖరీదు గట్టే షరాబు లేడోయ్.’’
ఇంతగా కాకపోయినా ఒకింత ఊపూ, పాదబద్ధత ఉండినా చాలు. ధారణా యోగ్యత సిద్ధిస్తుంది:
‘‘నాది కాని దేదీ నే ముట్టాలనుకోను
నాదైనా సరే దాచిపెట్టాలనుకోను -’’ సి.నా.రె.
ఇలాంటి ఊపూ, పాదబద్ధతా కలిగిన కవితలు ప్రజల మనస్సులలో కలకాలం నిలిచిపోతాయి. కాబట్టి రచయిత తన కవిత కలకాలం పాఠకుల హృదయాలలో నిలిచిపోవాలనుకుంటే, తన కవిత ప్రజల నాలుకల పైన నాట్యమాడాలనుకుంటే తప్పక తన కవితకు ఛందోబద్ధతనో, లయబద్ధతనో, పాదబద్ధతనో, ఒక విధమైన ఊపునో కల్పించాలి. ఇవేవీ లేని రచన గాలికి కొట్టుకు పోతుంది. నేటి వచన కవితా రచయితలలో నూటికి తొంభై తొమ్మిది మంది రచనలు ఒకసారి చదివించి తరువాత గాలికి కొట్టుకుపోతున్నాయి. దాదాపు ఇరవై పదాలున్న ఒక వచన వాక్యాన్ని నాలుగైదు ముక్కలుచేసి వరసగా పేర్చేస్తున్నారు. ముక్కలు చేయడం వల్ల వాక్యంలోని సమగ్రమైన అర్థం చెడిపోయి అపార్థాలూ, దుష్టార్థాలూ ఏర్పడుతున్నాయి.
విశేషోక్తి
రచయిత తాను చెప్పదలచుకన్న విషయాన్ని యథాతథంగా చెబితే అది కవిత అనిపించుకోదు. స్టేట్‌మెంట్ అవుతుంది. ప్రవచనం అవుతుంది. కవితలో ఏదో ఒక విశేషోక్తి ఉండాలి.
ఉదాహరణకు – ఒక అబ్బాయిని అంగడికి వెళ్ళి ఏదో ఒక వస్తువును తెమ్మని పంపుతాం. వాడు మనం ఊహించిన దానికంటే వేగంగా వెళ్ళి వస్తాడు. అప్పుడు అక్కడున్న అయిదుగురూ అయిదు రకాలుగా ఇలా అంటారు –
‘‘భేష్, చాలా తొందరగా వచ్చేశాడు’’.
‘‘అబ్బో! చాలా తొందరగా వచ్చేశాడే’’
‘‘ఓహో, జింకలాగా వెళ్ళి వచ్చాడు’’
‘‘ఇక్కడున్నట్టు గానే వచ్చేశాడు’’
‘‘అసలు వెళ్ళాడా? ఇక్కడే ఉన్నాడే’’
పైవాక్యాలలో మొదటిది మామూలు మాట. అది ఒక స్టేట్‌మెంటు. తక్కిన నాలుగు వాక్యాలూ కొంత విశేషరీతిలో చెప్పబడినవి. ఈ నాలుగు మాటలూ వరుసగా ఒక దానికంటే ఒకటి విశిష్టతరమైనవి. వీటికి అలంకార శాస్త్రంలో గుణీభూత వ్యంగ్యము, ఉపమాలంకారము, అతిశయోక్తి, ధ్వని అని పేర్లు. కవితలో ఇలాంటి ఏదో ఒక అలంకారమో, ధ్వనియో, చమత్కారమో ఉంటేనే అది కవిత అవుతుంది. దీనినే ‘‘రమణీయార్థ ప్రతిపాదకశబ్ద: కావ్యం’’ అన్నారు పూర్వులు. ఈ కవిత చూడండి –
‘‘…. నీకసలు బుద్ధుందా?
వాడు నీకేం తక్కువ చేశాడని!
కుండల నిండా అంబలిచ్చాడు
రాతెండి గంజల నిండా గటకిచ్చాడు
అయినా ప్రశ్నిస్తావా ….’’ (ఒక తెలంగాణా రచయిత సంకలనం నుంచి)
ఈ కవితలోని వ్యంగ్యం చక్కగా బోధపడుతూ ఉందా పెత్తందారు యొక్క వంచనా పూరితమైన దాతృత్వాన్ని పొగడుతూ ఉన్నట్టుగానే ఎండగడుతూ ఉంది. దీనికంటే మరికొంత తక్కువ వ్యంగ్యం ఉన్న ఈ కవితను చూడండి.
‘‘మాకే తెలియని సుఖములు మీకెట్టుల చూపగలము
అందుకొఱకె ముందు మేము అనుభవించి చూస్తున్నాం’’
ఈ కవితలోని వ్యంగ్యంతో బాటు లయబద్ధత, పాదబద్ధత ఉండడం విశేషం. పూర్తిగా ధ్వనిశక్తి కలిగిన కవిత మరీ విశిష్టమైనది. ధ్వని అంటే కవితలో వాచ్యంగా కనబడే విషయంకాక మరేదో అర్థం స్ఫురించడం.
‘‘ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ,
తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది’’
అమాయకత్వంతో తన యౌవనారంభంలోనే మోసపోయిన ఒక కన్నె విషయం ఇందులో చెప్పబడిందని ఎవరికైనా అర్థమౌతుంది. కానీ ఈ కవితలో కన్నెపిల్ల మాట ఎక్కడా లేదు. ఉన్నది కోయిల మాటే. ఇలా చెప్పగలగిన వారు (దేవులపల్లి కృష్ణశ్రాస్తి) మహాకవులుగా లెక్కించబడతారు.
‘‘…. సముద్రాన్ని
ఆశాకిరణాలతో అర్థించి అర్థించి
భంగ పడ్డ మార్తాండుడు
ఉక్రోషంతో ప్రచండుడే అయ్యాడు.
మండువేసవిలో
మండిన గుండెలతో
నిండిన సంద్రం కడుపులో
బడబాగ్నులు రేపాడు’’ (ఒక కవితా సంపుటి)
ఉద్యోగపు యాచనలో అన్యాయానికి బలైన ఒక యువకుడు విసిగి వేసారి ఉక్రోషంతో సమాజంలో విప్లవాగ్నిని రగిల్చాడని భావం. ఈ కవితలో ప్రతీకల మూలంగా ధ్వని సాధించబడింది. సూర్యుడు యువకునికీ, నిండిన సంద్రం కడుపునిండిన సమాజానికీ ప్రతీకలు. ఇందులో మార్తాండుడు, బడబాగ్నులు అన్న పదాలు సార్ధకమైనవి.
‘‘ఆడదాని మీసాల్లాగా
అసందర్భంగా మొలిచిన పేటలతో
గూనివాడి వీపులాగా
అసహ్యంగా పెరిగిన పేటలతో
నగరం నిన్ను ఆహ్వానిస్తుంది.’’
ఈ కవితలోని ఉపమాలంకారాలు చాలా చమత్కారంగా ఉన్నాయి.
‘‘సర్కారు దవాఖానాకు పోయినోడు తిరిగిరాడు’’ అనడం కంటే ‘‘వాడు సర్కారు దవాఖానాకు పోయిండే! ఎట్లా తిరిగొచ్చాడబ్బా!’’ అనడమే చమత్కారం. ఇవే విశేషోక్తులు. ఇవే కవిత్వానికి మూల బీజాలు.
ఇలా ఎలాంటి విశేషోక్తులు లేకుండా ‘‘కవితలు’’ అనే పేరుతో నాలుగు వాక్యాలు రాసి అచ్చువేసుకంటున్నారు కొందరు రచయితలు. ఈ కవిత చూడండి. కవులపేర్లు చెప్పడం బాగుండదు – కవితలు మాత్రం చూపుతాను.
‘‘రైతుకు కృషి ఫలం దక్కడం లేదు.
శ్రామికుడికి శ్రమఫలం దక్కడం లేదు
ఉద్యోగికి జీతం డబ్బులు చాలడం లేదు.
విద్యార్థికి భవిష్యత్తు కనబడడం లేదు’’ (ఒక ప్రసిద్ధ రచయిత)
ఇది ఒక ఎలెక్షన్ ప్రచార కరపత్రం అవవచ్చు గానీ, ఏకోశాన్నైనా కవిత్వమనగలమా? అలాగే మరో సంకలనంలోని ఈ కవిత చూడండి.
‘‘నేనో వస్తువుని /నా ఇష్టంతో పనిలేదు /నామనస్సుతో పనిలేదు /
నీ ఇష్టం ఉన్నప్పుడు / నా ఇష్టానిక వ్యతిరేకంగా / నన్ననుభవించవచ్చు /
నన్ను మానభంగం చేయవచ్చు / అది మానభంగంగా పరిగణింపరు /
నన్ను రేప్ చేసినా / అది రేప్‌కాదు / నేరం కాదు / అది నీ హక్కు
దీన్ని కవిత అని ఎట్లా పరిగణించాలో తెలియడం లేదు. ఇక్కడ కవిత కూడా రేప్ చేయబడింది. అది రచయిత హక్కు. నేరంకాదు. దీన్ని పండ్రెండు పంక్తులలో ముక్కలు ముక్కలుగా రాయడం ఇది కవిత అని భ్రమింపజేయడానికే.
కొన్నిచోట్ల ఏ విశేషోక్తి లేకపోయినా సహజోక్తి సైతం అందలి భావ తీవ్రతను బట్టి మనోహరంగానే కనబడుతుంది. ఇది చాలా అరుదుగా కనబడుతుంది. కవి చాలా సమర్థుడై ఉండాలి.
తండ్రి కన్నీరింకి పోవగ
తానుతెచ్చిన కట్నకానుక
లిరుగు పొరుగుకు చూపిమురిసే
ఆడదెన్నడు బాగుపడునోయ్.
ఈ కవితలో మాత్రాబద్ధత కూడా ఉండడం విశేషం. ఆడవాళ్ళు తాము పుట్టింటి నుంచి తెచ్చిన కట్న కానుకలను ఇరుగు పొరుగు వారికి చూపి మురిసి పోతుంటారు. గర్వపడిపోతుంటారు. కానీ కట్న కానుకలను సమకూర్చడం కోసం తమ తల్లిదండ్రులు పడిన కష్టాలను గూర్చి చింతించరు అనేమాట సహజంగా చెప్పినా పట్టిష్టంగా, కరుణార్ద్రంగా చెప్పబడింది.
శబ్దసౌష్టవం
ఒక కవితకు భావం ఎంత ముఖ్యమో శబ్దసౌష్టవం (హక్కు) కూడా అంతే ముఖ్యం. దానినే కాళిదాసు ‘‘వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే’’ అన్నాడు.
భావాన్ని బట్టి శబ్దం – అంటే పదజాలం – మారుతూ ఉండాలి. గంభీరమైన భావానికి గంభీరమైన పదజాలం, లలితమైన భావానికి లలితమైన పదజాలం ఉంటేనే ఆ కవిత ఆకట్టుకుంటుంది. భావానికి తగిన పదజాలం లేకపోతే గుడిలోని పూజారికి సూటూ, బూటూ వేసినట్టూ, పోలీసుకు పంచెకట్టూ జుబ్బా, కండువా వేసినట్టూ ఉంటుంది. భావానికి తగిన భాష వాడాలంటే రచయిత భాషపైన పట్టు సాధించాలి. అందుకు విస్తృతంగా చదవడమే ఏకైక మార్గం. అట్లా అని రచయితలందరూ బాల వ్యాకరణమూ, పాణీనీయం, సంస్కృతాంధ్ర పంచకావ్యాలూ చదవమని నేను చెప్పడం లేదు. చదివితే మాత్రం తప్పేమిటి? మరీ మంచిదే కదా. ప్రస్తుతం తెలుగుభాష అన్యభాషా సంపర్కంవల్ల చాలా విస్తృతమైపోయింది. సర్వవిధ వ్యవహారాలకూ పర్యాప్తమై నిలిచింది. భాషా సౌష్టవం లేకుంటే కవిత పేలవమై పోతుంది. ఈ సందర్భంలో తెన్నేటి హేమలత గారి మాటలను గుర్తుచేసుకోవాలి –
‘‘నాకు మాటలొచ్చు. మాటల అర్థం తెలుసు. సమయోచితంగా వాడకపోతే మాటలు చచ్చిపోతాయని నాకు తెలుసు. మనం మాటల్ని నమ్ముకున్న వాళ్ళం. అంచేత మాటల్ని వాడుకొని బతకాలి తప్ప మాటల్ని చంపుకొని బతకకూడదు’’ అంటారామె. శ్రీశ్రీ గారి ఈ కవిత చూడండి –
‘‘నిప్పులు చిమ్ముకుంటూ, నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు.
నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే’’
శబ్ద సౌష్టవానికి ఇంతకంటే మించిన చక్కని ఉదాహరణ మరొకటి కనబడదంటే అతిశయోక్తి కాదు. శ్రీశ్రీగారి శబ్దాధికారం అనన్య సామాన్యం.
సరళమైన భావానికి సరళమైన భాష ఎలా ఉండాలో ఈ కవితలోచూడండి.
‘‘వదలనీ నాజూకు తనమును
విడువనీ మది పిరికితనమును
చూడనీ కను విచ్చి లోకం
ఆడ దప్పుడు బాగుపడునోయ్.’’
అలాగే ఆరుద్ర గారి కవిత –
‘‘ప్రొద్దున్నే యెదురొచ్చే ప్రశస్తమైన విశ్వస్త
బలవంతపు పెళ్ళిలోని ముదనష్టపు పెళ్ళికూతురు
మూగవాని భావప్రకటన పేదవాని మూడో పెళ్ళాం.’’
ఈ కవితలో సందర్భోచిత, భాపోచిత భాష ఉండడమే కాక, వింత వింత ఉపమానాలూ, లయబద్ధతా పాదబద్ధతా ఉండడం విశేషం.
ఇలాంటి భాషా సంపద ఆరుద్ర, శ్రీశ్రీలాంటి తొలితరం వచన కవితా రచయితలకు అబ్బడానికి కారణం వారు ప్రాచీన సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివిన వారు కావడమే. ఈ తరం వచన కవితా రచయితలకు పూర్వసాహిత్యం పైన ప్రీతీ, ఆసక్తే కొరవడ్డాయి. రచయితలు పూర్వ సాహిత్యాన్ని బాగా చదవాలని వచన కవితా వైతాళికులలో ప్రసిద్ధులైన శ్రీ కుందుర్తి గారే ఒక ఇంటర్వ్యూలో ఇలా సెలవిచ్చారు –
‘‘మొదటి దశలో ఆధునికులైన వారు పూర్వకవిత్వాన్ని గురించి ఏమీ తెలియకపోయినా వచన కవిత్వం రాయవచ్చు. అది ప్రవేశార్హత. ఆపైన పూర్వ సంప్రదాయం పైన అధికారం సాధిస్తేనే గానీ గొప్ప వచన కవిత్వం రాయలేరు.’’ కుందుర్తి గారి అమూల్యాభిప్రాయాన్ని వర్ధమాన రచయితలు అందరూ తప్పక శిరసావహించాలి.
కొన్ని కవితలలో శబ్దసౌష్టవం ఎంత దరిద్రంగా ఉంటూ ఉందో ఈ కవితలో చూడండి –
‘‘పెళ్ళాం చచ్చి నేను అఘోరిస్తూ ఉంటే
నన్నే కట్టాలని చూస్తారా
నేను ఈ హత్య చేయలేదు
దు:ఖించే వాడిని, బాధపడే వాడిని
నన్ను దోషి అనీ, హంతకుడనీ
బాధిస్తారా – బాదాలని చూస్తారా’’
దీన్ని కవిత అని ఎలా అనాలో, ఎందుకనాలో తెలియడం లేదు. ఇది కవితా సంపుటిలో ముద్రితమైపోయింది మరి. ఈ కవిత చదువుతూ ఉంటే సానుభూతి కలుగదు సరికదా, వీడే పెళ్ళాన్ని చంపి దొంగ ఏడుపులు ఏడుస్తూ బుకాయిస్తున్నాడనిపిస్తుంది. ఈ కవితలో ఉత్కృష్టమైన భావమూ లేదు ఏ విధమైన విశేషోక్తీ లేదు. లయబద్ధతా లేదు. పాద బద్ధతా లేదు శబ్దపౌష్టవం అంతకన్నా లేదు. ఇది కవితకు పట్టిన గ్రహణం అనవచ్చు.
ఈ భావాన్నే ఇలా రాయవచ్చు. ‘‘భార్య చచ్చిందని ఏడ్వనా, నీవు కొడుతున్నావని ఏడ్వనా. బిడ్డలు దిక్కులేని వారయ్యారని ఏడ్వనా. అత్తమామలు నిందమోపుతున్నారని ఏడ్వనా, భార్యచితికి కట్టెలు తెచ్చుకోనా, ఉరివేసుకోవడానికి బారెడు తాడు తెచ్చుకోనా. ఏం చెయ్యమంటావు పోలీసూ ఎలా చావమంటావు’’
ప్రసన్నత
కవిత యొక్క లక్షణాలలో ప్రసన్నత అతిముఖ్యమైనది. రచయిత చెప్పదలచుకన్న భావాన్ని ఎప్పుడైతే పాఠకుడు సంపూర్ణంగా – కొంచెం కూడా వదలకుండా గ్రహింపగలడో, సందిగ్ధం లేకుండా, అటూ ఇటూ పొర్లకుండా గ్రహించగలడో అప్పుడే ఆ రచన సార్థక మౌతుంది. ఆ రచన యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ లక్షణాన్నే ప్రసన్నత అనవచ్చు. దీనినే నన్నయ ‘‘ప్రసన్న కథా కలితార్థయుక్తి’’ అన్నాడు.
సుదీర్ఘ సంస్కృత సమాసాలతో రాసిన కవితను నిఘంటువుల సహాయంతో అర్థం చేసుకోవచ్చు, కాని అన్వయ సారళ్యం, ప్రసన్నతా లేని కవితలను – అవి ఎంతటి సులభ వ్యావహారిక భాషలో ఉన్నా – అర్థం చేసుకోవడం కష్టం. రచయిత స్వయంగా వచ్చి వివరింపవలసిందే.
ఈ మధ్య వెలువడిన కొన్ని కవితలలో ఈ ప్రసన్నతా లక్షణం పూర్తిగా లోపించింది. భావం తల పగలగొట్టుకున్నా అంతు చిక్కడం లేదు. కారణం ఏమిటి? ఆ రచయితలు తమ కవితలలో ఎక్కువగా వాదన ప్రతీకలూ, రూపకాలంకారాలూ ఉత్ప్రేక్షలు ఒక దానికొకటి పొంతన లేకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒక కవితా సంపుటిలోని ఈ కవిత చూడండి.
‘‘విశ్వమంత్రనగరి సరిహద్దుల కవాటాల ఆంతర్యాలపై
విఫల ప్రహారాల విజయానుభూతినిస్తుంది.’’
దీనికి సంబంధించిన భావం రచయిత హృదయంలో ఏదో ఉండే ఉంటుంది. కాని అది పాఠకునికి అందాలి కదా. ప్రతీకలనూ, రూపకోత్ప్రేక్షలను రచయిత ఊహించుకుంటే చాలదు. పాఠకునికి అందివ్వాలి.
ఈ రచయితే మరోచోట రాసిన కవిత –
‘‘ప్రతి ఓటమీ తొలిగెలుపు
ప్రతి నిరాశా ఆశకు ఊపిరి
ప్రతి దు:ఖమూ ఆనందానికి పునాది.’’
దీనిని ప్రసన్నతకు చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. అలంకారాలనూ విశేషోక్తులనూ ప్రసన్నతకు దోహదకారులుగా ఉపయోగించుకోవడం కష్టమైనప్పుడు రచయిత ఆ ప్రయత్నం మానుకొని ఉన్నది ఉన్నట్టు వర్ణించి హృద్యంగా చెప్పవచ్చు. దీన్నే స్వభాపోక్తి అంటారు.
‘‘పసి పాపలన్నా, నక్సలైట్లన్నా
నాకెంతో ఇష్టం
పాపలకా నిష్కాపట్యం
ప్రపంచం తెలియక వచ్చింది.
అన్నలకా స్వార్థ రాహిత్యం
ప్రపంచం తెలిసి వచ్చింది’’ (ఒక కవితా సంపుటి)
అన్నలనూ నక్సలైట్లనూ ఒకచోట కూర్చోబెట్టడం రచయిత చమత్కారం. ఈ కవితలో ఏ విశేషోక్తీ లేదు. ఉన్నదంతా స్వభాపోక్తియే.ఈ కవితలోని ప్రసన్నతా, శబ్దాలంకారమూ చూడండి –
‘‘నవభాష్ప ధారలో నవ్వు కాగలవు
ముళ్ళ తీగలలోన పువ్వు కాగలవు
యత్నించి చూడమని అంటాను నేను
రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు’’ (ఒక సంకలనం)
ప్రయత్నించి కృషిచేస్తే ప్రతికూలత నుంచి అనుకూలతనూ, లేమినుంచి కలిమినీ, దు:ఖం నుంచి సంతోషాన్నీ సాధించగలవు అన్నభావం చక్కగా ఆలంకారికంగా చెప్పబడింది. ప్రసన్నత దెబ్బతినలేదు. ధారణా యోగ్యత ఉన్న కవిత ఇది. ఇలా అలంకారాలూ, ప్రతీకలూ, ధ్వనులూ ప్రసన్నతకు దోహదం కలిగించేవిగా ఉండాలి. భంగం కలిగించేవిగా ఉండరాదు.
ఇజాలూ. వాదాలూ
తెలుగు సాహిత్యంలో సామ్యవాదం, దళితవాదం, స్త్రీ వాదం, మైనారిటీ వాదం, సర్రియలిజం, పోస్టు మాడరనిజం మొదలైన అనేక సిద్ధాంతపరమైన శాఖలు చోటుచేసుకున్నాయి. వీటిలో సామ్యవాదం, సామ్రాజ్య వ్యతిరేకవాదం శ్రీశ్రీకాలం నుంచి ప్రచారంలో ఉన్నవే. రాజకీయాలలో మితవాదులూ, అతివాదులూ, తీవ్రవాదులు లాగానే ఈ సామ్యవాద రచయితలలో కూడా అభ్యుదయ రచయితలు, విప్లవ రచయితలు, దిగంబర కవులు బయలుదేరారు. వీరు కేవలం సాహిత్య సృష్టితో సరిపుచ్చుకోక సంఘాలుగా చేరి తమ సిద్ధాంతాలనూ, సాహిత్యాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. వీరి సాహిత్యంలో సాహిత్య విలువల కంటే సిద్ధాంతాల విలువలే ఎక్కువ. కాబట్టి ఈ సామ్యవాద సాహిత్యానికి అనుకూలురు, ప్రతికూలురు అనే ఖచ్చితమైన విభజన జరిగిపోయింది.
పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం బుడగలు బుడగలుగా లేచిన స్త్రీ వాదం క్రమంగా బలం పుంజుకుంది. మొదట స్త్రీలలోని బానిస భావాలను పారదోలడం, వారిలో చైతన్యం కలిగించడం – లక్ష్యాలుగా ప్రారంభమైన స్త్రీవాద కవిత్వం క్రమంగా పురుషాధికారాన్ని, లింగ వివక్షనూ, అత్యాచారాలనూ, గృహ హింసనూ నిలదీసి ఖండించడం వరకు పురోగమించింది. స్త్రీవాద రచయిత్రులు రచయిత్రులుగా కంటే స్త్రీవాద నాయకురాండ్రుగా ఎక్కువ ప్రచారమూ, పేరు ప్రతిష్ఠలూ పొందుతున్నారు.
ఇటీవల పదహైదు సంవత్సరాలుగా దళితవాదమూ, ఐదారు సంవత్సరాలుగా మైనారిటీ వాదమూ బయలుదేరాయి. మైనారిటీ వాదానికి అప్పుడే అంతర్గత ప్రతికూలత బయలుదేరింది. దళితవాదం బాగా పుంజుకుంది. దళితేతరులు దళితవాద కవితలు రాస్తుండగా దళితులు వారిని కటువుగా విమర్శించి ‘‘మా వాదాన్ని మేమే వినిపించుకుంటాం’’ అన్నారు. దళితవాదం కూడా స్త్రీ వాదం లాగానే మొదట దళితులలో న్యూనతా భావాన్ని తొలగించడం, చైతన్యం కలిగించడంతో ప్రారంభమై క్రమంగా పెత్తందార్లనూ, అగ్రవర్ణాలనూ పనిగట్టుకని విమర్శించడం వరకూ వెళ్ళిపోయింది. అంతటితో ఆగక సంప్రదాయ కవితా రీతుల్ని కూడా విమర్శించడం మొదలుపెట్టారు దళిత సాహిత్యకారులు. తిరుపతిలోని ‘‘కోనేటిగట్టు మిత్రులు’’ అనే సంఘం వారు తమ రచనలలో ఇలా అంటారు. ‘‘మేము చెబితే బూతు, మీరూ చెబితే శృంగారమా? బూతు మీ ‘‘గోపీ పీన పయోధర మర్దన’’లో ఉందా మా ‘‘ఎత్తు పిర్రల ఎంకీ’’లో ఉందా’’ సామాజిక అసమానతలను ఎంత తీవ్రంగానైనా విమర్శించవచ్చుగానీ సాహిత్యరీతుల్ని విమర్శించడం ఆరోగ్యకరం కాదు. ఇవి అవాంఛనీయం.
ఇక సర్రియలిజం, పోస్టు మాడరనిజం మొదలైన ఇజాలు ఆయా సిద్ధాంతాలు తెలిసిన వారికే – పాశ్చాత్య సాహిత్యంతో పరిచయమున్న వారికే – పరిమితమై పోయాయి. సామాన్య పాఠకునికి అవి కొరకరాని కొయ్యలు. సాహిత్యంలో సిద్ధాంతాలూ, ఇజాలూ ప్రవేశించడం వల్ల సాహిత్యం ఏకముఖమై స్తబ్ధమైపోతుందని కొందరి అభిప్రాయం.
పద్య కవిత
ఆంధ్రసాహిత్య ప్రపంచంలో ఈనాడు ప్రతి సంవత్సరమూ కొన్ని వందల సంఖ్యలో వచన కవితా సంకలనాలూ, పదుల సంఖ్యలో పద్య సంకలనాలూ, పద్యకావ్యాలూ వెలువడుతున్నాయి. నిర్దుష్టమైన పద్య రచనకు కాస్త పాండిత్యమూ, భాషా పటిమ అవసరం. ఇవి కేవలం కాలేజీ, యూనివర్సిటీల వల్ల లభింపదు. కాస్త ప్రత్యేక, విశేష స్వయంకృషి అవసరం. ఇలా స్వయంకృషితో పాండిత్యాన్ని సంపాదించి ఇతర వృత్తుల వారు – ఇంజనీర్లు, లాయర్లు, జడ్జీలు, న్యాయవాదులు, డాక్టర్లూ, కార్యాలయ ఉద్యోగులూ మొదలైన వారు – విద్యాసంస్థలలోని భాషా పండితుల కంటే రసవత్తరమైన పద్య రచనలు చేస్తున్నారు.
అయితే ఎందుకో గానీ కొందరు కథా, నవలా రచయితలూ, తత్సంబంధిత విమర్శకులూ పద్యం పైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. పద్యం చచ్చిపోయిందనీ, పద్యం రాయడం తిరోగమన లక్షణమనీ, పత్రికా ముఖంగానూ, సభల లోనూ నిర్మొగమాటంగా ఘోషిస్తున్నారు. ఇన్ని అవరోధాలనూ, ఇన్ని వ్యతిరేక పరిస్థితులనూ తట్టుకొని పద్య కవిత్వం పరిఢవిల్లుతూనే ఉంది.
ఇదివరకు పద్యకవులు పూర్వ సంస్కృతికి తామే ప్రతినిధులైనట్టు, పూర్వ సంస్కృతి తమ భుజస్కంథాలపైననే ఉన్నట్టూ భావించే వారు. ఫలితంగా చాలామంది పద్య కవులు తమ కవిత్వాన్ని శతకాలకూ, స్తోత్ర గ్రంథాలకూ, భక్తి సాహిత్యానికీ, పురాణ గాథల విశిష్టతా ప్రచారానికీ, అవధానాలకూ పరిమితం చేసుకున్నారు. పత్రికలలో ప్రచురిస్తున్న ‘‘గ్రంథ స్వీకారం’’ శీర్షికను చూస్తే సగటున వారానికొక శతకమో, భక్తి సాహిత్యమో వెలువడుతుండడం గమనింపవచ్చు.
పద్య కవిత్వం ఇది వరకు ఎలా ఉన్నా ప్రస్తుతం పద్య కవిత్వంలో వస్తు వైవిధ్యం పుష్కలంగా కనబడుతూ ఉంది. గత ఇరవై సంవత్సరాలలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. పద్యంలో వాడే భాష కూడా మారుతూ ఉంది. ప్రౌఢ గ్రాంధికం నుంచి సరళగ్రాంధికం, వ్యావహారికం, జానపద భాష – ఇలా పద్య కవితలోని భాష మారుతూ ఉండడం గమనార్హం. దీని వల్ల పద్యం శోభిస్తుందో శోషిస్తుందో వేచి చూడాలి.
భారతం శ్రీమన్నారాయణ గారి ‘‘పాంచాలి’, గాడేపల్లి సీతారామమూర్తి గారి ‘‘అశ్వత్థామ’’ మొదలైన పౌరాణిక కథలలోని కొత్త పోకడలు, యార్లగడ్డ వెంకట సుబ్బారావు గారి ‘‘కాకతీయ తరంగిణి’’. డా॥ మల్లెల గురవయ్య గారి ‘‘సీతారామ రాజీయము’’ మొదలైన చారిత్రక కావ్యాలు, మన్నవ భాస్కర నాయుడు గారి సామాజిక ఇతివృత్తంతో కూడిన ‘‘స్వేద సూర్యోదయ’’ కావ్యమూ, కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె గారి భారత సంబంధమైన ‘‘విషాద మాధవి’’, సామాజిక ఇతివృత్తంతో కూడిన ‘‘ఒక రాఘవరెడ్డి కథ’’, జోస్యం విద్యాసాగర్ గారు వ్యావహారిక భాషలో రాసిన ‘‘అమ్మ’’, గొట్టి ముక్కల సుబ్రహ్మణ్య శర్మ గారు జానపద భాషలో రాసిన ‘‘మల్లీ ఓ మల్లీ’’, బేతపోలు రామబ్రహ్మంగారి వర్ణనాత్మక రచన ‘‘క్రొత్త గోదావరి’’, అటువంటిదే అయిన నీలంరాజు నరసింహారావు గారి ‘‘నా పల్లెటూరు’’, వీటి అన్నిటి మధ్య దుగ్గిరాల రామారావు గారు అనువదించిన ప్రౌఢ అలంకార గ్రంథం ‘‘రసమంజరి’’ ఇలా అనేక కవులు రాసిన వస్తు వైవిధ్యం కల అనేక కావ్యాలు ఈ మధ్య కాలంలో వెలువడి పద్య సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. మొత్తం మీద ఒకే మూసలో వెలువడుతూ ఉండిన పద్య కవిత తన శృంఖలాలను తెంచుకొని స్వైర విహారం మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వచన కవితా రచయితలూ, వారి గ్రంథాల సంఖ్య వందలకొలది ఉంది. పద్యకావ్యాల సంఖ్య తక్కువ. కాబట్టి పద్య కవుల పేర్లు పేర్కొన్నాను. వచన కవుల పేర్లు పేర్కొనలేదు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. వచన కవితలు సూక్ష్మాంశానికి సంబంధించిన కవితలు. ఇవి దీర్ఘంగా ఉండలేవు. ఇందులో కావ్యాలు రాయడానికి వీలుందా అని ఎవరూ ప్రయత్నించలేదు. కవితా రూపంలో ఒక పరిపూర్ణమైన ఇతివృత్తాన్ని చెప్పాలంటే ప్రస్తుతానికి పద్యాన్ని ఆశ్రయింపవలసిందే. వచన కవిత పనికి రాదు.
ఈ విషయమై వచన కవితా రచయితలు ఆలోచించాలి.
ఈ మధ్య పద్య కవిత్వం కాస్త తగ్గుముఖం పట్టి మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటూ ఉంది. కాని పాఠశాలలో తెలుగుస్థాయి ఘోరంగా తగ్గింపబడడం, కాలేజీలలో తెలుగు మాయం కావడం, డెబ్బై శాతం విద్యార్థులు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదువుతూ ఉండడం మొదలైన అనేక కారణాల వల్ల ఈనాటి విద్యార్థితరం పెద్ద వారయ్యే సరికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు పద్యం ఏ స్థితికి చేరుకుంటుందో ఊహించలేకుండా ఉన్నారు. తెలుగు పద్యం రాసేవారు బొత్తిగా ఉండక పోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈనాటి యువతరానికి పద్యం చదవడమే చేతకాదు.
ఇక అవధాన పద్యాలూ, రేడియో, టివీ సమస్యా పూరణ పద్యాలూ తీసుకుంటే వాటిలో నూటికి తొంబై తొమ్మిది పద్యాలలో కవిత్వ లక్షణాలు ఏవీకనబడవు. కనపడాలని కోరుకోవడం అత్యాశయే అవుతుంది. పూర్వం తిరుపతి వేంకట కవులు, గాడేపల్లి వీర రాఘవశ్రాస్తి గారూ మొదలైన మహామహులు అవధానాలలో కూడా కవిత్వ విలువలు గల పద్యాలనూ భద్రపరచుకోదగిన పద్యాలనూ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి వారు అరుదు.
హైకూలూ, నానీలు
మినీ కవితల కంటే క్లుప్తమైనవీ శక్తిమంతమైనవీ అయిన హైకూలూ, నానీలు అనే కొత్త ప్రక్రియలు సాహిత్య రంగంలో ప్రవేశించాయి. అతి సూక్ష్మమైన, సున్నితమైన భావాన్ని అతి తక్కువ పదాలతో వెల్లడించడమే వీటి ప్రధాన ప్రయోజనం. ఇవి వెనుకటి వేమన ఆట వెలదుల వలె ఔషధ గుళికలు గానూ, రసగుళికలు గానూ సాహిత్య సమాజానికి ఉపయోగపడతాయి. ఇందులో చెప్పబడిన దానికంటే ఊహింపవలసింది ఎక్కువ. ఈ హైకూలు చూడండి –
‘‘సప్తవర్ణాల – (5)
ఉడుపులు మార్చేస్తూ – (7)
బుడగ బుజ్జి.’’ – (5)
నీటి బుడగపైన సూర్యకిరణం పరావర్తనం చెంది సప్తవర్ణాలుగా మారడం. ఇది నీటిబుడగ అనే బుజ్జి (చిన్నబిడ్డ) దుస్తులు మార్చుకున్నట్టు ఉన్నదనడం విశేషం.
హైకూలులో మూడు పాదాలుండాలి. అవి ఐదు, ఏడు, ఐదు అక్షరాలు కలిగి ఉండాలి. గురువులూ, లఘువులూ, మాత్రలూ అనే బెడదలేదు. ఇది జపాన్ నుంచి దిగుమతి అయిన ప్రక్రియ అంటారు. అయితే హైకూలు రచయితలు అప్పుడే ఈ నిబంధనలను ఉల్లంఘించడం ప్రారంభించారు. చూడండి –
‘‘రవి సాన్నిధ్యం – (5)
పురి విప్పన మయూరి – (8)
తోకచుక్క’’ – (4)
‘‘నీటి పలక – (5)
వృత్తాలు దిద్దుతూ – (6)
చినుకు బాలుడు’’ – (6) (ఇవి మూడు డా॥ వి.కె.సభాపతి గారివి)
నానీలు అంటే నావీ, నీవీ, మనందరివీ అని అర్థం. ఈ ప్రక్రియను ఆచార్య గోపీగారు ప్రచారంలోకి తెచ్చారు. ఇందులో నాలుగు పాదాలుంటాయి. ఒక పాదానికి ఇన్ని అక్షరాలు అనే నియమం లేకుండా మొత్తం ఇరవై నుంచి 25 వరకు అక్షరాలుండవచ్చు.’’ హైకూలును కాస్త సాగదీస్తే నానీ’’ అని చెబుతారు. నానీకి ఒక ఉదాహరణ చూడండి –
‘‘వీడ్కోలెప్పుడూ
మౌనమే
నిశ్చబ్దంలోకి
శబ్దం క్రుంగిపోతుంది.’’
ఈ నియమాన్ని కూడా అతిక్రమించడం అప్పుడే ప్రారంభమయింది.
‘‘మట్టి మనసు / చెట్టుకు తెలుసు / అందుకే / చిగురునవ్వు’’ -(19)
ఒక రకంగా చూస్తే ఇవన్నీ వచన కవిత యొక్క విభిన్న రూపాలే.
నైమిత్తిక కవితలు
కార్గిల్ యుద్ధం, సునామీ, భూకంపం, రైతు ఆత్మహత్య, విద్యార్థిని దారుణహత్య, మహానాయకుని దుర్మణం, పండుగలు, ఇటువంటి సంఘటనలనూ, సందర్భాలను నిమిత్తం చేసుకొని రాసే కవితల్ని నైమిత్తిక కవితలు అనవచ్చు. ఇవి తాత్కాలిక ప్రయోజనం కలవి. వీటికి కావ్య గౌరవం లేదు. కారణం? ఈ సంఘటనలు జరిగిన వెంటనే – ఆ సంఘటనల వేడి చల్లారక ముందే – గబగబా కవితలు రాసేస్తున్నారు. ఆ సంఘటనను ఏ దృష్టి కోణంలో చూడాలి. తనలోని స్పందనను ఎలాప్రోదిచేసుకోవాలి. ఎలా పోషించుకోవాలి. ఎలాంటి పదజాలం వాడాలి అని రచయితలు లోతుగా ఆలోచించడం లేదు.
కుంభకోణం పట్టణంలో ఒక పాఠశాల దగ్ధమైపోయి దాదాపు వందమంది చిన్నారి పిల్లలు నిలువునా కాలిపోయారు. దాన్ని ఏ దృష్టితో చూడాలి. నా దృష్టి ఇది – ఒక తల్లి ఉదయం తన చిన్నారిని బడికి పంపి, ఒక గంట లోపల బడి కాలిపోయిందని తెలిసి అక్కడికి వెళ్ళి కాలిపోయిన తన బిడ్డను చూస్తుంది. ఆమె ఆవేదనను ఆమె మాటలలోనే వర్ణిస్తూ నేను కొన్ని తరువోజ పద్యాలు రాసి పంపగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు తమ ‘‘థరువోజ’’ పద్యసంకలనంలో ప్రచురించారు. దానిని చదివిన కొందరు ‘‘కంట తడిపెట్టించింది’’ అని ఉత్తరాలు రాశారు. ఆ కవితలో కన్ని పాదాలు –
‘‘ఈ లేత తనువల్లి ఇట్లుకాలంగ, నెంత రోదించితో ఎటులరచితివొ
తలచిన హృదయమ్ము దగ్ధమైపోవు, దైవమా ఈ హింస తగదేరికైన
శిలయైన కరుగునే చెనటిదైవంబ, శిశువులజంప నీ చేతులెట్లాడె.
కాలిన బిడ్డల కనులారజూచి కన్నులు ప్రేలవే కాలదే గుండె
కాలదే దైవంబు కాలదే భూమి, కాలిపోరే బడికట్టిన వారు’’
ఒక సునామీ కవితలో మెరుపుల్లాంటి రెండు పాదాలు –
‘‘ముప్పావు నీకనీ, పావు మాకని చెప్పి
మేర మీరావెందుకు ఓ నీరరాజమా.’’
భూగోళంలో ముప్పావు భాగం జలం, పావుభాగం భూమి. కాని జలం ఈ కట్టడిని అతిక్రమించి భూమిని ఆక్రమించాలనుకున్నది. అలా ఎందుకు చేస్తున్నావని నీటిని ప్రశ్నిస్తున్నాడు రచయిత. నైమిత్తిక కవితనైనా సరే రచయిత చక్కగా మలుచుకని తదనుగుణమైన శబ్దజాలంతో రాయాలి. అప్పుడే దానికి కావ్యగౌరవం కాకపోయినా కనీసం ప్రత్యేక గౌరవమైనా లభిస్తుంది.
నియంత్రణ
తెలుగు సాహిత్య సౌభాగ్యం ఏమిటో గానీ, కవులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. వేల సంఖ్యలో కవితలు రాసి పత్రికలకు పంపుతున్నారు. సంకలనాలుగా ముద్రిస్తున్నారు. పత్రికలు తమ సాహిత్యానుబంధాలలో ప్రచురించి రచయితలను ప్రోత్సహిస్తున్నాయి. కన్ని పత్రికలు పారితోషికాలు కూడా ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉత్తమ కవితలకు, కవితా సంకలనాలకూ అవార్డులు ప్రకటిస్తున్నాయి. కవితా కేదారాల్లో దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉంది.
కానీ ఈ కవితలలో ‘‘పొట్టు’’ ఎంత? ‘‘గట్టి’’ ఎంత?
ఈ కవితలను గురించో, కవులను గురించో ఒక అపహాస్యపు ‘జోక్’ వినవస్తూ ఉంది. ‘‘ఊళ్ళో కర్ఫ్యూ ఉందా’’. ‘‘లేదు చౌరస్తాలో కవి సమ్మేళనం జరుగుతూ ఉంది’’. ‘‘అదిగో కవి వస్తున్నాడు. ఆ సందుగుండా వెళ్ళిపోదాం పద’’.
కవితలైనా, కవులైనా ఈ విధమైన అపహాస్యానికి గురికావడానికి కారణం ఏమిటి? కవితలలో ప్రజలను అలరింపజేసేవి తక్కువై పోతున్నాయి. చెదరగొట్టేవి ఎక్కువై పోతున్నాయి. మరి కవితల స్థాయిని చక్కబెట్టాలంటే ఏమిచేయాలి.
కవులకు, కవితలకు ఒక నియంత్రణ ఉండాలి. కవితలకు దిశానిర్దేశం, మార్గనిర్దేశం చేసేందుకు, కవితల నిగ్గు తేలేందుకూ ఒక వ్యవస్థ ఉండాలి. పూర్వం కావ్యాలన్నీ పండిత సభలలో చర్చింపబడి నిగ్గు తేల్చబడేవని చెబుతారు.
పద్య కవితకు ప్రాచీన లక్షణ గ్రంథాలూ, అలంకార గ్రంథాలు ఎప్పటి నుంచో మార్గనిర్దేశం చేస్తున్నాయి. వాటిని ప్రస్తుత కాలానికి తగినట్టు సవరించుకుంటే చాలు.
కథా, నవలా సాహిత్యాలకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సెమినార్లూ, వర్క్‌షాపులూ నిర్వహింపబడుతున్నాయి. ప్రత్యేకంగా కథానవలా విమర్శకులంటూ కొందరు సాహితీ మేధావివర్గం బయలుదేరి కథా నవలా సాహిత్యానికి మార్గనిర్దేశం చేస్తున్నారు.
హైకూలకు ఇండియన్ హైకూ క్లబ్ అనే సంస్థ ఏర్పడి హైకూ రచనలను పర్యవేక్షిస్తూ ఉంది.
ఎటొచ్చీ వచన కవితలకు ఏ దిక్కూలేకుండా పోయింది. ఈ రంగంలో ప్రామాణికులైన విమర్శకులు లేరు, ప్రామాణిక గ్రంథాలు లేవు, కవి సమ్మేళనాలు తప్ప సెమినార్లూ, సదస్సులూ వర్క్‌షాపులూ నిర్వహింపబడడం లేదు.
సంవత్సరానికొకసారి రాష్ట్రస్థాయి సెమినార్లు రెండు మూడు రోజుల పాటైనా జరగాలి. ఆ సంవత్సరం వెలువడిన కవితా సంకలనాలపై నిర్మొగమాటంగా చర్చ జరగాలి. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి చర్చలు జరగాలి. రచయితలు తెచ్చిన కవితలపై పరస్పరం చర్చించుకోవాలి. ఈ చర్చలు యువ రచయితలను ప్రోత్సాహించాలిగాని నిరుత్సాహపరచి మొగ్గలోనే తుంచివేయరాదు. వచన కవితలకు ఒక దిశా నిర్దేశం లేకపోతే కవితలు అడవి చెట్లలాగా చీకిరి బాకిరిగా వంకర టింకరగా, భయంకరంగా తయారౌతాయి. కవితా ప్రపంచం నందనవనంలా ఉండాలి కానీ దండకారణ్యంలాగా ఉండరాదు.
స్వాతంత్య్రంలో క్రమశిక్షణా, సంయమనం ఎంత ముఖ్యమో సాహిత్యంలో కూడా నియంత్రతా, సంయమనం అంతే ముఖ్యం.
చివరగా – రచయితలు
గమనింపవలసిన ముఖ్యాంశాలను మరోసారి పరామర్శిద్దాం. రచయితలు విశ్వశ్రేయస్సు కోసం రాసినా, రసాత్మకంగా రాసినా, ఆత్మానందం కోసం రాసినా అవి చివరకు చేరవలసింది పాఠకుల వద్దకే అన్న విషయం మరువరాదు. కాబట్టి రచనలు పాఠకులను ఆకట్టుకొనేలా, ప్రసన్నంగా, ఉత్తేజకరంగా ఉండాలి. చదివించేలా ఉండాలి. జ్ఞాపకం పెట్టుకుందామా అనిపించాలి. జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. తమ కవితలు అలా ఉన్నాయో లేపో అని రచయిత తన రచనలను రసజ్ఞులైన సహృదయుల సమక్షంలో చర్చించుకోవాలి.
రచనలో వస్తువైవిధ్యం ఉండాలి. శ్రీరాముని చరిత్ర నుంచి అగ్గిపుల్లా కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా వరకూ అన్నీ కవితా వస్తువులే. కవి వాటిని చూచే దృష్టికోణాన్ని బట్టి కవిత యొక్క విశిష్టత ఏర్పడుతుంది. కవి తన భావుకత చేత, ప్రతిభా వ్యుత్పత్తుల చేత ఎలాంటి ఇతివృత్తాన్నైనా మనోహరంగా తీర్చిదిద్దగలగాలి.
ప్రతిభావ్యుత్పత్తుల కోసం రచయితలు విస్తృతంగా చదవాలి.
చిట్ట చివరగా చెప్పినా మొట్టమొదటగా తెలుసుకోవలసిన విషయం. కవిలో చైతన్యజ్వాల ఉండాలి. సమాజం కోసం ఏదో రాయాలన్న తపన ఉండాలి. వాల్మీకి లోకానికి ఆదర్శంగా ఒక మహాపురుషుడి చరిత్ర రాయాలని తపించే సమయంలో నారదుడు అతడికి రామ కథను క్లుప్తంగా చెప్పి ‘‘ఇక రాయి’’ అన్నాడు. వ్యాసుడు లోకానికి ఏదో అందించాలనే తపనతో ‘‘ఆత్మ సంతసమందదాత్మలో నీశుండు సంతసింపక యున్న జాడదోచె’’ అని చింతిస్తూ ఉండగా మళ్ళీ నారదుడే వచ్చి భాగవతం రాయమన్నాడు. అలా రాసేదే కవిత. కవిత కవి హృదయంలో బాగా రూపుదిద్దుకని పూర్తిగా ఎదిగిన తరువాతనే అక్షర రూపందాల్చాలి. తొందరపడి రాసేది కవితకాదు. యథాలాపంగా రాసేది కవిత కాదు.
కేవలం కుతూహలంకొద్దీ, కండూతికొద్దీ రాసేదీ కవిత కాదు.
అందుకే ‘‘కావ్యాలా పాంశ్చవర్జయేత్’’ అన్నారు.
అంటే ప్రయత్న పూర్వకంగా కావ్యనిర్మాణం చేయాలిగానీ యథాలాపంగా, ఉబుసుపోకకు, వదరుబోతుతనంగా కవితలు రాయకూడదు అని భావం.
‘‘గగనమంత భావం పదమవ్వాలి
గాలి పోగుచేసి కవిత కటాల్టనుకోను’’ – సి.నా.రె.
అంటాడు జ్ఞాన పీఠాన్ని అధిష్ఠించిన – మహాకవి సి.నారాయణరెడ్డి.
‘‘ఏదీలేని పాట నరకానికి బాట’’ అంటాడు నూతలపాటి గంగాధరం.
వీరిలాగానే ప్రతి రచయితా తన కవితకు ముందుగానే దిశానిర్దేశం చేసుకోవాలి.
‘‘నా కవిత్వ మధర్మాయ, మృతయే, దండనాయచ
కు కవిత్వం పునస్సాక్షాత్, మృతి మాహుర్మనీషిణ:’’
కవిత్వం చెప్పకపోతే కొంపలంటుకు పోవు, యుగధర్మాలు చెడిపోవు, ప్రాణాలుపోవు, ఎవరూ వచ్చి దండించదు. కాని చెడ్డ కవిత్వం చెబితే మట్టుకు చచ్చినట్టే అన్నారు పూర్వులు.
కాబట్టి శ్రమపడి, బాగా చదువుకొని, బాగా ఆలోచించి, శ్రద్దాభక్తులతో మంచి కవిత్వం రాయాలి. అలా చేతకానప్పుడు – మరి – మరి – ఊరుకోవడం మేలు – అంటే ఔత్సాహిక రచయితలను నిరుత్సాహ పరచినట్టవుతుందేమో – కనుక – అలా అనను. ఎలాగైనా ప్రయత్నించమంటాను. *