తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి

కవితా లక్షణాలు

పద్యకావ్యమైనా, గద్యకావ్యమైనా అందలి ప్రాథమిక లక్షణాలు సమానమే. విషయమూ, విషయ వ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత, వర్ణన, పదబంధ పటుత్వం, శబ్దసౌందర్యం (శబ్దాలంకారం) అర్థస్ఫూర్తి (అర్థాలంకారం), వ్యంగ్యం, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యం మొదలైన లక్షణాలు పద్యకావ్యంలో ఎంత విరివిగా పాటింపబడుతాయో గద్యకావ్యంలో కూడా అంత విరివిగానూ పాటింపబడాలని ఆనాటి లాక్షణికులు నిర్దేశించారు. కాగా క్రమంగా గద్య కావ్యాలలో పైచెప్పిన లక్షణాలలో కొన్ని లోపించి పోతూ ఉండగా, పద్యకావ్యాలలో మరికొన్ని క్రత్త లక్షణాలు వచ్చి చేరసాగాయి. ఈ మార్పుల ఫలితంగా గద్యకావ్యాలు ఆధునిక కాలంలో కథలుగా, నవలలుగా రూపొందడం జరిగింది. పద్యకావ్యాలు పద్యం, గేయం, వచన కవిత మొదలైనవిగా రూపొందడం జరిగింది. క్రమంగా నవల, నవలిక, కథ, కథానిక, గల్పిక, స్కెచ్‌ మొదలైన ప్రక్రియలు ‘‘కథా నవలా సాహిత్యం’’ అనే పేరుతో ఒక తెగగానూ, పద్యం, గేయం, వచన కవిత, మినీకవిత హైకూ, నానీ మొదలైనవి ‘‘కవితా సాహిత్యం’’ అనే పేరుతో మరో తెగగానూ ఖచ్చితంగా విభజించడం జరిగిపోయింది. రచయితలు కూడా ఏయే తెగల ప్రక్రియలకు చెందిన వారు ఆయా తెగల వారుగా విడిపోవడమూ జరిగింది. వాటికీ, వీటికీ దిశా నిర్దేశాలూ, లక్ష్యాలూ వేరైపోయాయి.

కవిత యొక్క ఉద్దేశం

కవిత పాఠకునికి ఏదో ఒక విషయాన్ని ‘‘ఇదిగో, ఈ విషయాన్ని గుర్తించి చూడు’’ అని చెప్పే విధంగా ఉండాలి. పాఠకుడు కవి చెప్పిన విషయాన్ని చూచి ‘‘అవును సుమా, నేను ఇంతవరకూ గుర్తించనే లేదే’’ అనుకోవాలి. కవి చెప్పిన విషయం పాఠకునిలో ఒక సంతోషాన్ని గానీ, ఒక ఉద్రేకాన్ని గానీ, ఒక ఆశ్చర్యాన్ని గానీ, ఒక ఆవేదనను గానీ, ఒక నవ్వును గానీ ఒక జుగుప్సను గానీ, ఒక భయాన్ని గానీ, రేకెత్తించేదిగా ఉండాలి. అలా రేకెత్తించబడిన భావం పాఠకునిలో ఒక ఆలోచనాత్మకమైన స్పందనను, సంచలనాన్ని కలిగించేదిగా ఉండాలి. కవిత పాఠకుడిలో రేకెత్తించే భావాన్ని ‘రసము’’ అనీ, పాఠకుడిలో స్పందనను, సంచలనాన్ని కలిగించడాన్ని ‘‘కాంతాసమ్మితత యోపదేశయుజే’’ అనీ అన్నారు. ‘‘కాంతా సమ్మితత యోపదేశం’’ అంటే – పాఠకునికి ఒక విషయాన్ని సున్నితంగా ఉపదేశించడం. ఆ ఉపదేశం ఎలా ఉండాలి? ‘‘ఇదిగో నాకు రచయిత ఏదో ఉపదేశిస్తున్నాడు’’ అని పాఠకునికి తెలియకూడదు. ఉపదేశం మాత్రం పాఠకుని తలకెక్కిపోవాలి.

భావపుష్టి

భావం ఉంటేనే కవిత్వం, భావం లేనిది కవిత్వం లేదు. ఒక భావం కవి మనస్సులో ఉద్భవించి, రూపుదిద్దుకని, సర్వావయవాలూ సంతరించుకని, ఇక లోపల నిలువలేక త్రోసుకొని బయటపడాలి. అప్పుడే అది మంచి కవిత్వమవుతుంది. దీనినే భావపుష్టి అనవచ్చు. అలా హృదయం నుంచి బయటికి త్రోసుకొచ్చిన భావం చాలా తీవ్రంగా, సర్వాంగ సంపన్నంగా పరిపూర్ణంగా ఉంటుంది. దీనినే ‘‘భారవేదార్థ గౌరవం’’ అన్నారు పూర్వులు ‘‘భవ్య కవితావేశం’’ అన్నాడు తిక్కన సొమయాజి. కవి ఏదో ఒకటి వ్రాయాలని కూర్చొని వ్రాసే కవిత్వంలో భావపుష్టి ఉండదు. భావం తేలికగా – నెలతక్కువ కాన్పు బిడ్డలాగా – బలహీనంగా ఉంటుంది. భావం సువ్యక్తం కాని కవితకు ఒక ఉదాహరణ –

‘‘బాధా పీడితుడు బాధను వర్ణింప గలిగినా,
బాధాద్రష్టీ చైతన్యం, స్పందన, సామాజిక స్పృహతో
బాధా తప్తుని మించి
బాధను శక్తిమంతంగా చెప్పగలడు’’ (ఒక కవితా సంపుటి)

ఒకానొక బాధాపీడితుడు తన బాధను స్వయంగా వర్ణించడం కంటే, ఆ బాధను కళ్ళారా చూసిన వాడు తన సామర్థ్యం చేత మరింత బాగా వర్ణించగలడు అని రచయిత భావం. ఈ భావం బాగానే ఉంది కానీ అది ఈ కవితలో సమగ్రంగా రూపుదిద్దుకోలేదు. ఉపపత్తులు లేవు. ఇది కవితా లక్షణాలను తెలిపే సిద్ధాంతంలా ఉంది. దీన్ని కవితగా చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు –

‘‘తగిలిన ప్రతిలాఠీ దెబ్బకు
గొంతు పెకల్చుకొని అరవడమే
బాధితుడి స్మృతి
వాతలతో చిట్లిన వీపూ
రక్తంతో తడిసిన జుట్టూ
గోళ్ళల్లో చిప్పిలు నెత్తురూ
పండ్లూడిన పెదవుల వాపూ
తలవాల్చిన నిస్సహాయతా
లాఠీ కళ్ళల్లో క్రౌర్యం
బాధితుడికి కనబడుతుందా
చూచే హృదయానికీ కానీ …’’

పైరచయిత యొక్క స్టేట్‌మెంటు లాంటి భావానికి ఉపపత్తులనూ, లయబద్ధతనూ కూర్చి ఒక కవితా స్వరూపం ఇవ్వబడింది ఈ కవితలో.

బరువైన భావపుష్టీ, ఆలోచనకు విస్తృతమైన అవకాశమూ ఉన్న కవితకు ఉదాహరణ చూడండి –

‘‘దేవుడా, కృతజ్ఞతలు. మనుష్యుల్ని శాశ్వతం చేయనందుకు’’ (ఒక సంపుటి). మనిషి గట్టిగా బ్రతికితే నూరేండ్లే అని తెలిసినా మనిషి స్వార్థంతో చేసే దురంతాలకూ, దురాగతాలకు అంతులేదు. అలాంటి మనిషి శాశ్వితుడైపోతే – వాడేమేమి చేస్తాడో ఊహించడానికే భయంవేస్తూ ఉంది. దేవుడు మనిషికి పరిమితమైన ఆయువును విధించి ప్రపంచానికి మేలు చేశాడు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు అర్పించాలి. భావపుష్టి అంటే ఇలాంటిది. ఇలాంటిదే మరో కవిత –

‘‘సిమెంటు చెద తిన్న చేతులు సలిపాయా,
సిగ్గు లేకుండా తడిమిన చూపులు సలిపాయా అంటే
ఎండు చేపల్లాంటి ఎముకలు కండపడితే
వయస్సు సెలేస్తుందేమో అన్న శంక సలిపింది అంది’’ (ఒక కవితా సంపుటి)

స్త్రీలు ఎంతసేపూ బాహ్యమైన దుష్టశక్తులకు భయపడుతూ గోల చేస్తున్నారు. దుష్టశక్తులను అణచివేసినంత మాత్రాన సమస్య తీరిపోదు. స్త్రీ తనలోని అంతర్గత బలహీనతలకూ అంతే భయపడి జాగ్రత్త వహించాలి – అనే భావం ఈ కవితలో చాలా తీవ్రంగా చెప్పబడింది.

అందమైన భావపుష్టికి మరో చక్కని ఉదాహరణ –

‘‘నేను ప్రవేశించడానికి ముందు ఈ జగత్తును ఆయత్తపరచిందెవరు?’’ భూలోకంలో మనిషి ఉద్భవించడానికి పూర్వమే భగవంతుడు భూమిని మనిషి సుఖజీవనానికై సర్వసంపన్నం చేసిపెట్టాడు. అని ఈ కవితలోని భావం.

అలాంటిదే మరో అతి సున్నితమైన భావానికి ఉదాహరణ –

‘‘ఊరి బయట పాడుబడ్డ సత్రంలో ఓ పిచ్చిది.
చిరుగుల రవికె, మొలకొక తుండు గుడ్డతో –
అరగంట టి.వి ముందు కూర్చుంటే ఆశ్చర్యం కలిగింది.
ప్రపంచంలో ఇంత మంది పిచ్చివాళ్ళా అని’’ (ఒక కవితా సంపుటి)

ఒక పిచ్చిది శరీర స్పృహ లేకుండా అర్ధనగ్నంగా కనబడుతుంటే ‘‘పోనీలే పాపం పిచ్చిది’’ అనుకోవచ్చు. కానీ టీవి చూస్తున్నప్పుడు అందులో నాగరికతకూ, సంస్కృతికీ ప్రతీకలైన స్త్రీలు కూడా అర్ధనగ్నంగా దర్శనమిస్తుంటే వాళ్ళను గురించి ఏమనుకోవాలి? ఫ్యాషన్‌ అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా?

ఈ మధ్య వెలువడుతున్న అనేకానేక కవితా సంపుటుల్లో ఈ భావపుష్టి లోపం కొట్టవచ్చినట్టు కనబడుతుంది. కారణం? రచయితలు తొందరగా కవితలు రాసేసి, తొందరగా అచ్చువేసి, తొందరగా ‘‘కవి’’ అన్న పేరు పొందాలనే కండూతి. రచయితలు తమ భావాలను సరిగా పండనివ్వడం లేదు. అవయవాలు సరిగా రూపుదిద్దుకోక ముందే సిజేరియన్‌ కాన్పులు చేసేసుకుంటున్నారు.

లోకవృత్త పరిజ్ఞానం

ఒక కవిత విమర్శలకు గురికాకుండా నిలబడాలంటే కవితలో భావపుష్టితో పాటు లోకవృత్త పరిజ్ఞానం కూడా ఉండాలి. అంటే రచయిత తను చుట్టూ ఉన్న సమాజాన్ని బాగా పరిశీలించిన వాడై ఉండాలి. సమాజంలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలూ, వివిధ ప్రజల జీవన విధానాలూ బాగా పరిశీలించి ఉండాలి. ఒక రచయిత్రి ఒక కవితలో ఇలా రాసింది. (కవిత యథాతథంగా జ్ఞాపకం పెట్టుకొనే లాగా లేదు. కనుక భావం చెబుతాను.)

‘‘ఒక ఉన్నత వర్గ యువతి ఒక మురికి వాడలోని యువతిని కలుసుకోవడానికి వెళ్ళింది. ఆ మురికివాడ యువతి ఈమెకు కూర్చోవడానికి పంది చర్మం పరిచింది’’.

పందికి చర్మం ఊడిరాదు. మరే జంతు చర్మమైనా ఒక ఈత చాపకంటే అనేక రెట్లు విలువైనది. అమ్ముకుంటారు కానీ కూర్చోవడానికి పరుచుకోరు. ఇదిలోక వృత్త పరిజ్ఞాన హీనతకు ఉదాహరణ. అలాగే మరో ఉదాహరణ – ఒక రచయిత కవితా సంపుటి నుండి –

‘‘ఒక పూజారి కోనేటి నుండి పూజకోసం నీళ్ళు తెస్తున్నాడు. ఒక హరిజనుడు ఎదురొచ్చాడు. పూజారి ఆ హరిజనుడిపై తన కాలి చెప్పును విసిరాడు’’.

పూజకోసం నీళ్ళు తెచ్చేటప్పుడు పూజారులు చెప్పులు వేసుకోరు. మరి ఇలాంటి విషయాలన్నీ గమనించకుండా కవితలు రాస్తే అపహాస్యం పాలుకాక తప్పదు.

కవితల్లో క్లుప్తత

కథకైనా, కవితకైనా సామాజిక ప్రయోజనం ఒక్కలాగే ఉంటుంది. కాని కథలో విస్తృతి ఉంటుంది, కవితలో క్లుప్తత ఉంటుంది. కథ ఒక మేఘంలాగా ముందు ప్రత్యక్షమౌతుంది. అందులో రచయిత చెప్పదలచుకొన్న వ్యక్తవ్యాంశం ఒక మెరుపులాగా మెరుస్తుంది.

అదే గనుక ఒక కవితలో అయితే రచయిత చెప్పదలచుకన్న వక్తవ్యాంశం మొదట మెరుపులా మెరుస్తుంది. తరువాత పాఠకుడు ఆలోచింపగా ఆలోచింపగా దానివెనుక ఉన్న విషయ విస్తారం, నేపథ్యం ఒక మేఘంలాగా దర్శనమిస్తాయి.

మొదట మేఘం – తరువాత మెరుపు – ఇది కథ.
మొదట మెరుపు – తరువాత మేఘం – ఇది కవిత.

ఒక రచయిత ఒక కథ రాస్తాడు. అందులో ఒక అట్టడుగు వర్గానికి చెందిన వాడు స్వయం కృషితో శాస్త్రాలూ, ధర్మాలూ అభ్యసించి అగ్రవర్గాల వారికి ధర్మబోధా, ధర్మనిర్దేశమూ చేయగల స్థితికి చేరుకుంటాడు. అగ్రవర్గాల వారికి అనేకులకు అతడు మార్గదర్శకుడవుతాడు. ఈ కథ కొన్ని పేజీలు విస్తరించి ఉంటుంది. ఇది మేఘం. చివరికి రచయిత చెప్పదలచుకొన్న విషయం – అట్టడుగు వర్గాల వారు అగ్రవర్గాల స్థాయికి వచ్చారనీ, అగ్రవర్గాల వారు తమ స్థాయి నుంచి దిగజారి పోతున్నారనీ. ఈ విషయం మెరుపులా స్ఫురిస్తుంది. ఇదే విషయాన్ని ఒక రచయిత తన కవితలో ఇలా అంటున్నాడు –

‘‘బ్రహ్మ ముఖం నుంచి కాళ్ళు పుట్టుకొస్తున్నాయి’’.

బ్రహ్మ ముఖం అంటే అగ్రవర్ణాల జన్మ స్థానమనీ, పాదాలు అంటే అట్టడుగు వర్ణాల జన్మస్థానమనీ అందరికీ తెలిసిందే. ముఖం నుంచి కాళ్ళు పుట్టుకొస్తున్నాయంటే అడుగు వర్ణాల వారు ప్రస్తుతం అగ్రవర్ణాల సరసకు ఎక్కి వచ్చేస్తున్నారనీ. ఇక అగ్రవర్ణాల వారు తమ అభిజాత్యం కారణంగా మురిసిపోవలసిన పనిలేదనీ అర్థం. ఇది మెరుపు. దీనిపై పాఠకుడు ఆలోచింపగా, ఆలోచింపగా ఇందుకు నిదర్శనంగా సమాజంలో నెలకొని ఉన్న అనేక విషయాలు గోచరిస్తాయి. ఇది మేఘం. ఇది కవితల్లోని క్లుప్తతకు ఉదాహరణ. క్లుప్తత కవితకు ప్రాణం. దీనినే ప్రాచీనులు ‘‘అల్పాక్షరములననల్పార్థ రచన’’ అన్నారు.

ధారణా యోగ్యత

కవిత యొక్క ముఖ్య లక్షణాలలో జ్ఞాపకం ఉండిపోవడం ఒకటి. కవితను ఒకటి రెండుసార్లు చదువగానే అది పాఠకుని మనస్సులో యథాతథంగా జ్ఞాపకం ఉండిపోవాలి. సందర్భం వచ్చినప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొని ఉదహరించగలగాలి. దీనినే ధారణాయోగ్యత అనవచ్చు. ఈ సౌలభ్యం కోసమే పూర్వం శాస్త్రాలను కూడా శ్లోకాలలో రాసుకున్నారు. రాత అలవాటులో లేని కాలంలో రచింపబడినవి అన్నీ ఈ ధారణా యొగ్యత వల్లనే మౌఖిక పరంపరగా మన వరకు పయనించాయి. ధారణా యోగ్యతకు ముఖ్య సాధనం కవితను ఒక లయబద్ధంగా రాయడం. ఛందోబద్ధంగా రాసినా, గేయరూపంలో రాసినా ఇతరత్రా ఏ విధంగా రాసినా అందులో అంతో ఇంతో లయబద్ధత ఉండాలి. ఒక ఊపు ఉండాలి. పాద బద్ధత ఉండాలి. దీనికోసం పండిత కవులు ఛందస్సును సృష్టించుకున్నారు. జానపదులు రగడ, ద్విపద మొదలైన దీర్ఘ ప్రక్రియలను ఆశ్రయించారు. లయబద్ధత, పాదబద్ధత లేని కవిత ఎంత గంభీరంగా, భావబంధురంగా ఉన్నా సులభంగా మనస్సులో నిలువదు. అవసరమైనప్పుడు యథాతథంగా జ్ఞాపకం రాదు. భారత భాగవత పద్యాలు మొదలుకని మొన్నటి గురుజాడ ముత్యాల సరాలూ, విశ్వనాథవారి కిన్నెరసాని పాటలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలైన వాటి నుంచి అప్పుడప్పుడూ కొన్ని మాటలను ఉదహరించు కొంటున్నామంటే అందుకు కారణం అవి లయబద్ధతనూ, పాదబద్ధతనూ కలిగి ఉండడమే –

‘‘తిండి కలిగితె కండగలదోయ్‌
కండ గలిగిన వాడె మనిషోయ్‌’’
– – –
‘‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్ట పోయ్‌’’
– – –

‘‘పొలాలనన్నీ హలాలదున్నీ
ఇలాతలంలో హేమం పండగ’’
– – –

‘‘ఘర్మజలానికి ధర్మజలానికి
ఖరీదు గట్టే షరాబు లేడోయ్‌.’’

ఇంతగా కాకపోయినా ఒకింత ఊపూ, పాదబద్ధత ఉండినా చాలు. ధారణా యోగ్యత సిద్ధిస్తుంది:

‘‘నాది కాని దేదీ నే ముట్టాలనుకోను
నాదైనా సరే దాచిపెట్టాలనుకోను -’’ సి.నా.రె.

ఇలాంటి ఊపూ, పాదబద్ధతా కలిగిన కవితలు ప్రజల మనస్సులలో కలకాలం నిలిచిపోతాయి. కాబట్టి రచయిత తన కవిత కలకాలం పాఠకుల హృదయాలలో నిలిచిపోవాలనుకుంటే, తన కవిత ప్రజల నాలుకల పైన నాట్యమాడాలనుకుంటే తప్పక తన కవితకు ఛందోబద్ధతనో, లయబద్ధతనో, పాదబద్ధతనో, ఒక విధమైన ఊపునో కల్పించాలి. ఇవేవీ లేని రచన గాలికి కొట్టుకు పోతుంది. నేటి వచన కవితా రచయితలలో నూటికి తొంభై తొమ్మిది మంది రచనలు ఒకసారి చదివించి తరువాత గాలికి కొట్టుకుపోతున్నాయి. దాదాపు ఇరవై పదాలున్న ఒక వచన వాక్యాన్ని నాలుగైదు ముక్కలుచేసి వరసగా పేర్చేస్తున్నారు. ముక్కలు చేయడం వల్ల వాక్యంలోని సమగ్రమైన అర్థం చెడిపోయి అపార్థాలూ, దుష్టార్థాలూ ఏర్పడుతున్నాయి.