తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి

విశేషోక్తి

రచయిత తాను చెప్పదలచుకన్న విషయాన్ని యథాతథంగా చెబితే అది కవిత అనిపించుకోదు. స్టేట్‌మెంట్‌ అవుతుంది. ప్రవచనం అవుతుంది. కవితలో ఏదో ఒక విశేషోక్తి ఉండాలి.

ఉదాహరణకు – ఒక అబ్బాయిని అంగడికి వెళ్ళి ఏదో ఒక వస్తువును తెమ్మని పంపుతాం. వాడు మనం ఊహించిన దానికంటే వేగంగా వెళ్ళి వస్తాడు. అప్పుడు అక్కడున్న అయిదుగురూ అయిదు రకాలుగా ఇలా అంటారు –

‘‘భేష్‌, చాలా తొందరగా వచ్చేశాడు’’.
‘‘అబ్బో! చాలా తొందరగా వచ్చేశాడే’’
‘‘ఓహో, జింకలాగా వెళ్ళి వచ్చాడు’’
‘‘ఇక్కడున్నట్టు గానే వచ్చేశాడు’’
‘‘అసలు వెళ్ళాడా? ఇక్కడే ఉన్నాడే’’

పైవాక్యాలలో మొదటిది మామూలు మాట. అది ఒక స్టేట్‌మెంటు. తక్కిన నాలుగు వాక్యాలూ కొంత విశేషరీతిలో చెప్పబడినవి. ఈ నాలుగు మాటలూ వరుసగా ఒక దానికంటే ఒకటి విశిష్టతరమైనవి. వీటికి అలంకార శాస్త్రంలో గుణీభూత వ్యంగ్యము, ఉపమాలంకారము, అతిశయోక్తి, ధ్వని అని పేర్లు. కవితలో ఇలాంటి ఏదో ఒక అలంకారమో, ధ్వనియో, చమత్కారమో ఉంటేనే అది కవిత అవుతుంది. దీనినే ‘‘రమణీయార్థ ప్రతిపాదకశబ్ద: కావ్యం’’ అన్నారు పూర్వులు. ఈ కవిత చూడండి –

‘‘…. నీకసలు బుద్ధుందా?
వాడు నీకేం తక్కువ చేశాడని!
కుండల నిండా అంబలిచ్చాడు
రాతెండి గంజల నిండా గటకిచ్చాడు
అయినా ప్రశ్నిస్తావా ….’’ (ఒక తెలంగాణా రచయిత సంకలనం నుంచి)

ఈ కవితలోని వ్యంగ్యం చక్కగా బోధపడుతూ ఉందా పెత్తందారు యొక్క వంచనా పూరితమైన దాతృత్వాన్ని పొగడుతూ ఉన్నట్టుగానే ఎండగడుతూ ఉంది. దీనికంటే మరికొంత తక్కువ వ్యంగ్యం ఉన్న ఈ కవితను చూడండి.

‘‘మాకే తెలియని సుఖములు మీకెట్టుల చూపగలము
అందుకొఱకె ముందు మేము అనుభవించి చూస్తున్నాం’’

ఈ కవితలోని వ్యంగ్యంతో బాటు లయబద్ధత, పాదబద్ధత ఉండడం విశేషం. పూర్తిగా ధ్వనిశక్తి కలిగిన కవిత మరీ విశిష్టమైనది. ధ్వని అంటే కవితలో వాచ్యంగా కనబడే విషయంకాక మరేదో అర్థం స్ఫురించడం.

‘‘ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ,
తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది’’

అమాయకత్వంతో తన యౌవనారంభంలోనే మోసపోయిన ఒక కన్నె విషయం ఇందులో చెప్పబడిందని ఎవరికైనా అర్థమౌతుంది. కానీ ఈ కవితలో కన్నెపిల్ల మాట ఎక్కడా లేదు. ఉన్నది కోయిల మాటే. ఇలా చెప్పగలగిన వారు (దేవులపల్లి కృష్ణశ్రాస్తి) మహాకవులుగా లెక్కించబడతారు.

‘‘…. సముద్రాన్ని
ఆశాకిరణాలతో అర్థించి అర్థించి
భంగ పడ్డ మార్తాండుడు
ఉక్రోషంతో ప్రచండుడే అయ్యాడు.
మండువేసవిలో
మండిన గుండెలతో
నిండిన సంద్రం కడుపులో
బడబాగ్నులు రేపాడు’’ (ఒక కవితా సంపుటి)

ఉద్యోగపు యాచనలో అన్యాయానికి బలైన ఒక యువకుడు విసిగి వేసారి ఉక్రోషంతో సమాజంలో విప్లవాగ్నిని రగిల్చాడని భావం. ఈ కవితలో ప్రతీకల మూలంగా ధ్వని సాధించబడింది. సూర్యుడు యువకునికీ, నిండిన సంద్రం కడుపునిండిన సమాజానికీ ప్రతీకలు. ఇందులో మార్తాండుడు, బడబాగ్నులు అన్న పదాలు సార్ధకమైనవి.

‘‘ఆడదాని మీసాల్లాగా
అసందర్భంగా మొలిచిన పేటలతో
గూనివాడి వీపులాగా
అసహ్యంగా పెరిగిన పేటలతో
నగరం నిన్ను ఆహ్వానిస్తుంది.’’

ఈ కవితలోని ఉపమాలంకారాలు చాలా చమత్కారంగా ఉన్నాయి.

‘‘సర్కారు దవాఖానాకు పోయినోడు తిరిగిరాడు’’ అనడం కంటే ‘‘వాడు సర్కారు దవాఖానాకు పోయిండే! ఎట్లా తిరిగొచ్చాడబ్బా!’’ అనడమే చమత్కారం. ఇవే విశేషోక్తులు. ఇవే కవిత్వానికి మూల బీజాలు.

ఇలా ఎలాంటి విశేషోక్తులు లేకుండా ‘‘కవితలు’’ అనే పేరుతో నాలుగు వాక్యాలు రాసి అచ్చువేసుకంటున్నారు కొందరు రచయితలు. ఈ కవిత చూడండి. కవులపేర్లు చెప్పడం బాగుండదు – కవితలు మాత్రం చూపుతాను.

‘‘రైతుకు కృషి ఫలం దక్కడం లేదు.
శ్రామికుడికి శ్రమఫలం దక్కడం లేదు
ఉద్యోగికి జీతం డబ్బులు చాలడం లేదు.
విద్యార్థికి భవిష్యత్తు కనబడడం లేదు’’ (ఒక ప్రసిద్ధ రచయిత)

ఇది ఒక ఎలెక్షన్‌ ప్రచార కరపత్రం అవవచ్చు గానీ, ఏకోశాన్నైనా కవిత్వమనగలమా? అలాగే మరో సంకలనంలోని ఈ కవిత చూడండి.

‘‘నేనో వస్తువుని /నా ఇష్టంతో పనిలేదు /నామనస్సుతో పనిలేదు /
నీ ఇష్టం ఉన్నప్పుడు / నా ఇష్టానిక వ్యతిరేకంగా / నన్ననుభవించవచ్చు /
నన్ను మానభంగం చేయవచ్చు / అది మానభంగంగా పరిగణింపరు /
నన్ను రేప్‌ చేసినా / అది రేప్‌కాదు / నేరం కాదు / అది నీ హక్కు

దీన్ని కవిత అని ఎట్లా పరిగణించాలో తెలియడం లేదు. ఇక్కడ కవిత కూడా రేప్‌ చేయబడింది. అది రచయిత హక్కు. నేరంకాదు. దీన్ని పండ్రెండు పంక్తులలో ముక్కలు ముక్కలుగా రాయడం ఇది కవిత అని భ్రమింపజేయడానికే.

కొన్నిచోట్ల ఏ విశేషోక్తి లేకపోయినా సహజోక్తి సైతం అందలి భావ తీవ్రతను బట్టి మనోహరంగానే కనబడుతుంది. ఇది చాలా అరుదుగా కనబడుతుంది. కవి చాలా సమర్థుడై ఉండాలి.

తండ్రి కన్నీరింకి పోవగ
తానుతెచ్చిన కట్నకానుక
లిరుగు పొరుగుకు చూపిమురిసే
ఆడదెన్నడు బాగుపడునోయ్‌.

ఈ కవితలో మాత్రాబద్ధత కూడా ఉండడం విశేషం. ఆడవాళ్ళు తాము పుట్టింటి నుంచి తెచ్చిన కట్న కానుకలను ఇరుగు పొరుగు వారికి చూపి మురిసి పోతుంటారు. గర్వపడిపోతుంటారు. కానీ కట్న కానుకలను సమకూర్చడం కోసం తమ తల్లిదండ్రులు పడిన కష్టాలను గూర్చి చింతించరు అనేమాట సహజంగా చెప్పినా పట్టిష్టంగా, కరుణార్ద్రంగా చెప్పబడింది.