తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి

పద్య కవిత

ఆంధ్రసాహిత్య ప్రపంచంలో ఈనాడు ప్రతి సంవత్సరమూ కొన్ని వందల సంఖ్యలో వచన కవితా సంకలనాలూ, పదుల సంఖ్యలో పద్య సంకలనాలూ, పద్యకావ్యాలూ వెలువడుతున్నాయి. నిర్దుష్టమైన పద్య రచనకు కాస్త పాండిత్యమూ, భాషా పటిమ అవసరం. ఇవి కేవలం కాలేజీ, యూనివర్సిటీల వల్ల లభింపదు. కాస్త ప్రత్యేక, విశేష స్వయంకృషి అవసరం. ఇలా స్వయంకృషితో పాండిత్యాన్ని సంపాదించి ఇతర వృత్తుల వారు – ఇంజనీర్లు, లాయర్లు, జడ్జీలు, న్యాయవాదులు, డాక్టర్లూ, కార్యాలయ ఉద్యోగులూ మొదలైన వారు – విద్యాసంస్థలలోని భాషా పండితుల కంటే రసవత్తరమైన పద్య రచనలు చేస్తున్నారు.

అయితే ఎందుకో గానీ కొందరు కథా, నవలా రచయితలూ, తత్సంబంధిత విమర్శకులూ పద్యం పైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. పద్యం చచ్చిపోయిందనీ, పద్యం రాయడం తిరోగమన లక్షణమనీ, పత్రికా ముఖంగానూ, సభల లోనూ నిర్మొగమాటంగా ఘోషిస్తున్నారు. ఇన్ని అవరోధాలనూ, ఇన్ని వ్యతిరేక పరిస్థితులనూ తట్టుకొని పద్య కవిత్వం పరిఢవిల్లుతూనే ఉంది.

ఇదివరకు పద్యకవులు పూర్వ సంస్కృతికి తామే ప్రతినిధులైనట్టు, పూర్వ సంస్కృతి తమ భుజస్కంథాలపైననే ఉన్నట్టూ భావించే వారు. ఫలితంగా చాలామంది పద్య కవులు తమ కవిత్వాన్ని శతకాలకూ, స్తోత్ర గ్రంథాలకూ, భక్తి సాహిత్యానికీ, పురాణ గాథల విశిష్టతా ప్రచారానికీ, అవధానాలకూ పరిమితం చేసుకున్నారు. పత్రికలలో ప్రచురిస్తున్న ‘‘గ్రంథ స్వీకారం’’ శీర్షికను చూస్తే సగటున వారానికొక శతకమో, భక్తి సాహిత్యమో వెలువడుతుండడం గమనింపవచ్చు.

పద్య కవిత్వం ఇది వరకు ఎలా ఉన్నా ప్రస్తుతం పద్య కవిత్వంలో వస్తు వైవిధ్యం పుష్కలంగా కనబడుతూ ఉంది. గత ఇరవై సంవత్సరాలలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. పద్యంలో వాడే భాష కూడా మారుతూ ఉంది. ప్రౌఢ గ్రాంధికం నుంచి సరళగ్రాంధికం, వ్యావహారికం, జానపద భాష – ఇలా పద్య కవితలోని భాష మారుతూ ఉండడం గమనార్హం. దీని వల్ల పద్యం శోభిస్తుందో శోషిస్తుందో వేచి చూడాలి.

భారతం శ్రీమన్నారాయణ గారి ‘‘పాంచాలి’, గాడేపల్లి సీతారామమూర్తి గారి ‘‘అశ్వత్థామ’’ మొదలైన పౌరాణిక కథలలోని కొత్త పోకడలు, యార్లగడ్డ వెంకట సుబ్బారావు గారి ‘‘కాకతీయ తరంగిణి’’. డా॥ మల్లెల గురవయ్య గారి ‘‘సీతారామ రాజీయము’’ మొదలైన చారిత్రక కావ్యాలు, మన్నవ భాస్కర నాయుడు గారి సామాజిక ఇతివృత్తంతో కూడిన ‘‘స్వేద సూర్యోదయ’’ కావ్యమూ, కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె గారి భారత సంబంధమైన ‘‘విషాద మాధవి’’, సామాజిక ఇతివృత్తంతో కూడిన ‘‘ఒక రాఘవరెడ్డి కథ’’, జోస్యం విద్యాసాగర్‌ గారు వ్యావహారిక భాషలో రాసిన ‘‘అమ్మ’’, గొట్టి ముక్కల సుబ్రహ్మణ్య శర్మ గారు జానపద భాషలో రాసిన ‘‘మల్లీ ఓ మల్లీ’’, బేతపోలు రామబ్రహ్మంగారి వర్ణనాత్మక రచన ‘‘క్రొత్త గోదావరి’’, అటువంటిదే అయిన నీలంరాజు నరసింహారావు గారి ‘‘నా పల్లెటూరు’’, వీటి అన్నిటి మధ్య దుగ్గిరాల రామారావు గారు అనువదించిన ప్రౌఢ అలంకార గ్రంథం ‘‘రసమంజరి’’ ఇలా అనేక కవులు రాసిన వస్తు వైవిధ్యం కల అనేక కావ్యాలు ఈ మధ్య కాలంలో వెలువడి పద్య సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. మొత్తం మీద ఒకే మూసలో వెలువడుతూ ఉండిన పద్య కవిత తన శృంఖలాలను తెంచుకొని స్వైర విహారం మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వచన కవితా రచయితలూ, వారి గ్రంథాల సంఖ్య వందలకొలది ఉంది. పద్యకావ్యాల సంఖ్య తక్కువ. కాబట్టి పద్య కవుల పేర్లు పేర్కొన్నాను. వచన కవుల పేర్లు పేర్కొనలేదు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. వచన కవితలు సూక్ష్మాంశానికి సంబంధించిన కవితలు. ఇవి దీర్ఘంగా ఉండలేవు. ఇందులో కావ్యాలు రాయడానికి వీలుందా అని ఎవరూ ప్రయత్నించలేదు. కవితా రూపంలో ఒక పరిపూర్ణమైన ఇతివృత్తాన్ని చెప్పాలంటే ప్రస్తుతానికి పద్యాన్ని ఆశ్రయింపవలసిందే. వచన కవిత పనికి రాదు.
ఈ విషయమై వచన కవితా రచయితలు ఆలోచించాలి.

ఈ మధ్య పద్య కవిత్వం కాస్త తగ్గుముఖం పట్టి మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటూ ఉంది. కాని పాఠశాలలో తెలుగుస్థాయి ఘోరంగా తగ్గింపబడడం, కాలేజీలలో తెలుగు మాయం కావడం, డెబ్బై శాతం విద్యార్థులు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదువుతూ ఉండడం మొదలైన అనేక కారణాల వల్ల ఈనాటి విద్యార్థితరం పెద్ద వారయ్యే సరికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు పద్యం ఏ స్థితికి చేరుకుంటుందో ఊహించలేకుండా ఉన్నారు. తెలుగు పద్యం రాసేవారు బొత్తిగా ఉండక పోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈనాటి యువతరానికి పద్యం చదవడమే చేతకాదు.

ఇక అవధాన పద్యాలూ, రేడియో, టివీ సమస్యా పూరణ పద్యాలూ తీసుకుంటే వాటిలో నూటికి తొంబై తొమ్మిది పద్యాలలో కవిత్వ లక్షణాలు ఏవీకనబడవు. కనపడాలని కోరుకోవడం అత్యాశయే అవుతుంది. పూర్వం తిరుపతి వేంకట కవులు, గాడేపల్లి వీర రాఘవశ్రాస్తి గారూ మొదలైన మహామహులు అవధానాలలో కూడా కవిత్వ విలువలు గల పద్యాలనూ భద్రపరచుకోదగిన పద్యాలనూ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి వారు అరుదు.

హైకూలూ, నానీలు

మినీ కవితల కంటే క్లుప్తమైనవీ శక్తిమంతమైనవీ అయిన హైకూలూ, నానీలు అనే కొత్త ప్రక్రియలు సాహిత్య రంగంలో ప్రవేశించాయి. అతి సూక్ష్మమైన, సున్నితమైన భావాన్ని అతి తక్కువ పదాలతో వెల్లడించడమే వీటి ప్రధాన ప్రయోజనం. ఇవి వెనుకటి వేమన ఆట వెలదుల వలె ఔషధ గుళికలు గానూ, రసగుళికలు గానూ సాహిత్య సమాజానికి ఉపయోగపడతాయి. ఇందులో చెప్పబడిన దానికంటే ఊహింపవలసింది ఎక్కువ. ఈ హైకూలు చూడండి –

‘‘సప్తవర్ణాల – (5)
ఉడుపులు మార్చేస్తూ – (7)
బుడగ బుజ్జి.’’ – (5)

నీటి బుడగపైన సూర్యకిరణం పరావర్తనం చెంది సప్తవర్ణాలుగా మారడం. ఇది నీటిబుడగ అనే బుజ్జి (చిన్నబిడ్డ) దుస్తులు మార్చుకున్నట్టు ఉన్నదనడం విశేషం.

హైకూలులో మూడు పాదాలుండాలి. అవి ఐదు, ఏడు, ఐదు అక్షరాలు కలిగి ఉండాలి. గురువులూ, లఘువులూ, మాత్రలూ అనే బెడదలేదు. ఇది జపాన్‌ నుంచి దిగుమతి అయిన ప్రక్రియ అంటారు. అయితే హైకూలు రచయితలు అప్పుడే ఈ నిబంధనలను ఉల్లంఘించడం ప్రారంభించారు. చూడండి –

‘‘రవి సాన్నిధ్యం – (5)
పురి విప్పన మయూరి – (8)
తోకచుక్క’’ – (4)

‘‘నీటి పలక – (5)
వృత్తాలు దిద్దుతూ – (6)
చినుకు బాలుడు’’ – (6) (ఇవి మూడు డా॥ వి.కె.సభాపతి గారివి)

నానీలు అంటే నావీ, నీవీ, మనందరివీ అని అర్థం. ఈ ప్రక్రియను ఆచార్య గోపీగారు ప్రచారంలోకి తెచ్చారు. ఇందులో నాలుగు పాదాలుంటాయి. ఒక పాదానికి ఇన్ని అక్షరాలు అనే నియమం లేకుండా మొత్తం ఇరవై నుంచి 25 వరకు అక్షరాలుండవచ్చు.’’ హైకూలును కాస్త సాగదీస్తే నానీ’’ అని చెబుతారు. నానీకి ఒక ఉదాహరణ చూడండి –

‘‘వీడ్కోలెప్పుడూ
మౌనమే
నిశ్చబ్దంలోకి
శబ్దం క్రుంగిపోతుంది.’’

ఈ నియమాన్ని కూడా అతిక్రమించడం అప్పుడే ప్రారంభమయింది.

‘‘మట్టి మనసు / చెట్టుకు తెలుసు / అందుకే / చిగురునవ్వు’’ -(19)
ఒక రకంగా చూస్తే ఇవన్నీ వచన కవిత యొక్క విభిన్న రూపాలే.