తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి

నైమిత్తిక కవితలు

కార్గిల్‌ యుద్ధం, సునామీ, భూకంపం, రైతు ఆత్మహత్య, విద్యార్థిని దారుణహత్య, మహానాయకుని దుర్మణం, పండుగలు, ఇటువంటి సంఘటనలనూ, సందర్భాలను నిమిత్తం చేసుకొని రాసే కవితల్ని నైమిత్తిక కవితలు అనవచ్చు. ఇవి తాత్కాలిక ప్రయోజనం కలవి. వీటికి కావ్య గౌరవం లేదు. కారణం? ఈ సంఘటనలు జరిగిన వెంటనే – ఆ సంఘటనల వేడి చల్లారక ముందే – గబగబా కవితలు రాసేస్తున్నారు. ఆ సంఘటనను ఏ దృష్టి కోణంలో చూడాలి. తనలోని స్పందనను ఎలాప్రోదిచేసుకోవాలి. ఎలా పోషించుకోవాలి. ఎలాంటి పదజాలం వాడాలి అని రచయితలు లోతుగా ఆలోచించడం లేదు.

కుంభకోణం పట్టణంలో ఒక పాఠశాల దగ్ధమైపోయి దాదాపు వందమంది చిన్నారి పిల్లలు నిలువునా కాలిపోయారు. దాన్ని ఏ దృష్టితో చూడాలి. నా దృష్టి ఇది – ఒక తల్లి ఉదయం తన చిన్నారిని బడికి పంపి, ఒక గంట లోపల బడి కాలిపోయిందని తెలిసి అక్కడికి వెళ్ళి కాలిపోయిన తన బిడ్డను చూస్తుంది. ఆమె ఆవేదనను ఆమె మాటలలోనే వర్ణిస్తూ నేను కొన్ని తరువోజ పద్యాలు రాసి పంపగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు తమ ‘‘థరువోజ’’ పద్యసంకలనంలో ప్రచురించారు. దానిని చదివిన కొందరు ‘‘కంట తడిపెట్టించింది’’ అని ఉత్తరాలు రాశారు. ఆ కవితలో కన్ని పాదాలు –

‘‘ఈ లేత తనువల్లి ఇట్లుకాలంగ, నెంత రోదించితో ఎటులరచితివొ
తలచిన హృదయమ్ము దగ్ధమైపోవు, దైవమా ఈ హింస తగదేరికైన
శిలయైన కరుగునే చెనటిదైవంబ, శిశువులజంప నీ చేతులెట్లాడె.
కాలిన బిడ్డల కనులారజూచి కన్నులు ప్రేలవే కాలదే గుండె
కాలదే దైవంబు కాలదే భూమి, కాలిపోరే బడికట్టిన వారు’’

ఒక సునామీ కవితలో మెరుపుల్లాంటి రెండు పాదాలు –

‘‘ముప్పావు నీకనీ, పావు మాకని చెప్పి
మేర మీరావెందుకు ఓ నీరరాజమా.’’

భూగోళంలో ముప్పావు భాగం జలం, పావుభాగం భూమి. కాని జలం ఈ కట్టడిని అతిక్రమించి భూమిని ఆక్రమించాలనుకున్నది. అలా ఎందుకు చేస్తున్నావని నీటిని ప్రశ్నిస్తున్నాడు రచయిత. నైమిత్తిక కవితనైనా సరే రచయిత చక్కగా మలుచుకని తదనుగుణమైన శబ్దజాలంతో రాయాలి. అప్పుడే దానికి కావ్యగౌరవం కాకపోయినా కనీసం ప్రత్యేక గౌరవమైనా లభిస్తుంది.

నియంత్రణ

తెలుగు సాహిత్య సౌభాగ్యం ఏమిటో గానీ, కవులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. వేల సంఖ్యలో కవితలు రాసి పత్రికలకు పంపుతున్నారు. సంకలనాలుగా ముద్రిస్తున్నారు. పత్రికలు తమ సాహిత్యానుబంధాలలో ప్రచురించి రచయితలను ప్రోత్సహిస్తున్నాయి. కన్ని పత్రికలు పారితోషికాలు కూడా ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉత్తమ కవితలకు, కవితా సంకలనాలకూ అవార్డులు ప్రకటిస్తున్నాయి. కవితా కేదారాల్లో దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉంది.

కానీ ఈ కవితలలో ‘‘పొట్టు’’ ఎంత? ‘‘గట్టి’’ ఎంత?

ఈ కవితలను గురించో, కవులను గురించో ఒక అపహాస్యపు ‘జోక్‌’ వినవస్తూ ఉంది. ‘‘ఊళ్ళో కర్ఫ్యూ ఉందా’’. ‘‘లేదు చౌరస్తాలో కవి సమ్మేళనం జరుగుతూ ఉంది’’. ‘‘అదిగో కవి వస్తున్నాడు. ఆ సందుగుండా వెళ్ళిపోదాం పద’’.

కవితలైనా, కవులైనా ఈ విధమైన అపహాస్యానికి గురికావడానికి కారణం ఏమిటి? కవితలలో ప్రజలను అలరింపజేసేవి తక్కువై పోతున్నాయి. చెదరగొట్టేవి ఎక్కువై పోతున్నాయి. మరి కవితల స్థాయిని చక్కబెట్టాలంటే ఏమిచేయాలి.

కవులకు, కవితలకు ఒక నియంత్రణ ఉండాలి. కవితలకు దిశానిర్దేశం, మార్గనిర్దేశం చేసేందుకు, కవితల నిగ్గు తేలేందుకూ ఒక వ్యవస్థ ఉండాలి. పూర్వం కావ్యాలన్నీ పండిత సభలలో చర్చింపబడి నిగ్గు తేల్చబడేవని చెబుతారు.

పద్య కవితకు ప్రాచీన లక్షణ గ్రంథాలూ, అలంకార గ్రంథాలు ఎప్పటి నుంచో మార్గనిర్దేశం చేస్తున్నాయి. వాటిని ప్రస్తుత కాలానికి తగినట్టు సవరించుకుంటే చాలు.

కథా, నవలా సాహిత్యాలకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సెమినార్లూ, వర్క్‌షాపులూ నిర్వహింపబడుతున్నాయి. ప్రత్యేకంగా కథానవలా విమర్శకులంటూ కొందరు సాహితీ మేధావివర్గం బయలుదేరి కథా నవలా సాహిత్యానికి మార్గనిర్దేశం చేస్తున్నారు.

హైకూలకు ఇండియన్‌ హైకూ క్లబ్‌ అనే సంస్థ ఏర్పడి హైకూ రచనలను పర్యవేక్షిస్తూ ఉంది.

ఎటొచ్చీ వచన కవితలకు ఏ దిక్కూలేకుండా పోయింది. ఈ రంగంలో ప్రామాణికులైన విమర్శకులు లేరు, ప్రామాణిక గ్రంథాలు లేవు, కవి సమ్మేళనాలు తప్ప సెమినార్లూ, సదస్సులూ వర్క్‌షాపులూ నిర్వహింపబడడం లేదు.

సంవత్సరానికొకసారి రాష్ట్రస్థాయి సెమినార్లు రెండు మూడు రోజుల పాటైనా జరగాలి. ఆ సంవత్సరం వెలువడిన కవితా సంకలనాలపై నిర్మొగమాటంగా చర్చ జరగాలి. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి చర్చలు జరగాలి. రచయితలు తెచ్చిన కవితలపై పరస్పరం చర్చించుకోవాలి. ఈ చర్చలు యువ రచయితలను ప్రోత్సాహించాలిగాని నిరుత్సాహపరచి మొగ్గలోనే తుంచివేయరాదు. వచన కవితలకు ఒక దిశా నిర్దేశం లేకపోతే కవితలు అడవి చెట్లలాగా చీకిరి బాకిరిగా వంకర టింకరగా, భయంకరంగా తయారౌతాయి. కవితా ప్రపంచం నందనవనంలా ఉండాలి కానీ దండకారణ్యంలాగా ఉండరాదు.

స్వాతంత్య్రంలో క్రమశిక్షణా, సంయమనం ఎంత ముఖ్యమో సాహిత్యంలో కూడా నియంత్రతా, సంయమనం అంతే ముఖ్యం.

చివరగా – రచయితలు

గమనింపవలసిన ముఖ్యాంశాలను మరోసారి పరామర్శిద్దాం. రచయితలు విశ్వశ్రేయస్సు కోసం రాసినా, రసాత్మకంగా రాసినా, ఆత్మానందం కోసం రాసినా అవి చివరకు చేరవలసింది పాఠకుల వద్దకే అన్న విషయం మరువరాదు. కాబట్టి రచనలు పాఠకులను ఆకట్టుకొనేలా, ప్రసన్నంగా, ఉత్తేజకరంగా ఉండాలి. చదివించేలా ఉండాలి. జ్ఞాపకం పెట్టుకుందామా అనిపించాలి. జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. తమ కవితలు అలా ఉన్నాయో లేపో అని రచయిత తన రచనలను రసజ్ఞులైన సహృదయుల సమక్షంలో చర్చించుకోవాలి.

రచనలో వస్తువైవిధ్యం ఉండాలి. శ్రీరాముని చరిత్ర నుంచి అగ్గిపుల్లా కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా వరకూ అన్నీ కవితా వస్తువులే. కవి వాటిని చూచే దృష్టికోణాన్ని బట్టి కవిత యొక్క విశిష్టత ఏర్పడుతుంది. కవి తన భావుకత చేత, ప్రతిభా వ్యుత్పత్తుల చేత ఎలాంటి ఇతివృత్తాన్నైనా మనోహరంగా తీర్చిదిద్దగలగాలి.

ప్రతిభావ్యుత్పత్తుల కోసం రచయితలు విస్తృతంగా చదవాలి.

చిట్ట చివరగా చెప్పినా మొట్టమొదటగా తెలుసుకోవలసిన విషయం. కవిలో చైతన్యజ్వాల ఉండాలి. సమాజం కోసం ఏదో రాయాలన్న తపన ఉండాలి. వాల్మీకి లోకానికి ఆదర్శంగా ఒక మహాపురుషుడి చరిత్ర రాయాలని తపించే సమయంలో నారదుడు అతడికి రామ కథను క్లుప్తంగా చెప్పి ‘‘ఇక రాయి’’ అన్నాడు. వ్యాసుడు లోకానికి ఏదో అందించాలనే తపనతో ‘‘ఆత్మ సంతసమందదాత్మలో నీశుండు సంతసింపక యున్న జాడదోచె’’ అని చింతిస్తూ ఉండగా మళ్ళీ నారదుడే వచ్చి భాగవతం రాయమన్నాడు. అలా రాసేదే కవిత. కవిత కవి హృదయంలో బాగా రూపుదిద్దుకని పూర్తిగా ఎదిగిన తరువాతనే అక్షర రూపందాల్చాలి. తొందరపడి రాసేది కవితకాదు. యథాలాపంగా రాసేది కవిత కాదు.

కేవలం కుతూహలంకొద్దీ, కండూతికొద్దీ రాసేదీ కవిత కాదు.

అందుకే ‘‘కావ్యాలా పాంశ్చవర్జయేత్‌’’ అన్నారు.

అంటే ప్రయత్న పూర్వకంగా కావ్యనిర్మాణం చేయాలిగానీ యథాలాపంగా, ఉబుసుపోకకు, వదరుబోతుతనంగా కవితలు రాయకూడదు అని భావం.

‘‘గగనమంత భావం పదమవ్వాలి
గాలి పోగుచేసి కవిత కటాల్టనుకోను’’ – సి.నా.రె.

అంటాడు జ్ఞాన పీఠాన్ని అధిష్ఠించిన – మహాకవి సి.నారాయణరెడ్డి.

‘‘ఏదీలేని పాట నరకానికి బాట’’ అంటాడు నూతలపాటి గంగాధరం.

వీరిలాగానే ప్రతి రచయితా తన కవితకు ముందుగానే దిశానిర్దేశం చేసుకోవాలి.

‘‘నా కవిత్వ మధర్మాయ, మృతయే, దండనాయచ
కు కవిత్వం పునస్సాక్షాత్‌, మృతి మాహుర్మనీషిణ:’’

కవిత్వం చెప్పకపోతే కొంపలంటుకు పోవు, యుగధర్మాలు చెడిపోవు, ప్రాణాలుపోవు, ఎవరూ వచ్చి దండించదు. కాని చెడ్డ కవిత్వం చెబితే మట్టుకు చచ్చినట్టే అన్నారు పూర్వులు.

కాబట్టి శ్రమపడి, బాగా చదువుకొని, బాగా ఆలోచించి, శ్రద్దాభక్తులతో మంచి కవిత్వం రాయాలి. అలా చేతకానప్పుడు – మరి – మరి – ఊరుకోవడం మేలు – అంటే ఔత్సాహిక రచయితలను నిరుత్సాహ పరచినట్టవుతుందేమో – కనుక – అలా అనను. ఎలాగైనా ప్రయత్నించమంటాను. *