పొలిమేరల్లో ఉన్న ఊళ్ళోకొచ్చిన
పులిలా చప్పుడుకాకుండా
కాలేజీ కేంపస్ లోకి
కాలుపెడుతుంది జ్వరం.
ఇక్కడి మనుషులు నిరాయుధులని,
వీళ్ళ మధ్య యే బలమైన బంధాలూ లేవని,
వీళ్ళ శరీరాలే వీళ్ళ పెంపుడు జంతువులని
దానికి తెలుసు.
గుంపులుగా తిరిగే వీళ్ళలో
గూఢంగా ఉన్న ఒంటరితనాన్ని
అది గుర్తించగలదు.
చటుక్కున పంజా విసిరి,
గుహలాంటి ఆసుపత్రిలోకి
బర బరా ఈడ్చుకుపోతుంది.
అయినా, అది నరభక్షకి కాదు.
అలా వచ్చి జడిపించి, ఒకసారి
వికృతంగా గర్జించి,
విడిచిపెట్టేస్తుంది.
మానుంచి మేమే తప్పించుకుతిరిగే మాకు
ఆ రెండు రోజుల ఏకాంతంలో
ఊహల్లో, ఆలోచనల్లో,
మా రూపాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చి,
మమ్మల్ని మాకు
రుచి చూపిస్తుంది.