దెయ్యాల బావి

పాపం దానికేమీ తెలీదు.

దాన్నేమీ అనకండి.

మనం ఛేదించలేని మృత్యు రహస్యాన్ని

అది గుప్పిట్లో పెట్టి నిల్చుంది.

వేళ్ళలా చుట్టుకున్న వరల వెనకాల్నించి

ఎవరు దానిని కనుక్కుంటారా అని చూస్తోంది.

జీవితం తరిమికొట్టిన వాళ్ళని,

బ్రతుకు హఠాత్తుగా బరువెక్కిన వాళ్ళని,

చేతులు జాపి మరీ

చేరదీస్తుందది.

బాధ మంటలా మండుతున్నప్పుడు

అది పడుచుదనమైనా, ముసలితనమైనా,

సమానంగా ఆదరిస్తుంది.

తప్పు వాళ్ళది కాదు, వయస్సుదేనని

దానికి తెలుసు.

అదీ ఒకప్పుడు ప్రాణదానం చేసేదే.

కానీ, ప్రాణమిచ్చే ఎన్నింటినో

ప్రాణాంతకాలుగా మార్చుకోవటం మన ప్రత్యేకత !

అయినా, జీవితపు చివరి అంచున నిలబడి,

వెక్కి వెక్కి ఏడుస్తున్న వాణ్ణి సాకి,

సాకీలా మృత్యుమధువుని పెదవులకందీయడం

ఎంత గొప్ప !

అందుకే దాన్నేమీ అనకండి.

మనకర్థంకాని జీవిత రహస్యాన్నేదో

అది గుప్పిట్లో పెట్టి నిల్చుంది.